Jump to content

శ్రీమదుత్తరరామాయణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

శ్రీమదుత్తరరామాయణము

ప్రథమాశ్వాసము .

వ. సమర్పితంబుగా నాయొనర్పం బూనిన శ్రీమదుత్తరరామాయణకావ్యంబు మొదట సంక్షేపరూపంబుగా రచియింపం దలంచిన పూర్వరామాయణకథాప్రపంచంబునకు నాదికారణం బయినసాకేతపట్టణం బెట్టిదనిన.1

                           §§§ సాకేతపురవర్ణనము §§§
ఉ. శ్రీతరుణీవిహారసరసీజవిరాజితరాజసౌధసం
    ఘాతము గోపురస్ఫురితకాంచనకుంభవిభాభిభూతఖ
    ద్యోతము ద్యోతమానమణితోరణవారసమేత మొప్పు సా
    కేతము వాతసంచలితకేతుపటప్రహతాభ్రజాత మై. 2
                            §§§ వప్రవర్ణనము §§§
సీ. కృష్ణపక్షావిభావరీవేళలఁ జకోరసమితి చంద్రిక లంచు సంతసింప
    వలిపక్రొందళుకుమేల్ వెలిపట్టుఁబుట్టముల్ గట్టినయట్లు దిక్కాంత లలర
    గంగాతరంగసంఘము వీటిపైఁ బొర్లి యేలవచ్చె నటంచు నింద్రుఁ డరయ
    దారకాకైరవోద్యన్నభఃకాసార ముదుటురాయంచలయునికిఁ దెలుపఁ

తే. బరఁగు శరదంబుధరదిగంబరగురప్ర, కాశపేశలవజ్రసంఘటితవప్ర
    దీప్రరోచిఃపరంపరల్ దివముఁ బ్రాకిఁ, పరతమోలీల దూల నప్పట్టణమున.3

                       §§§ పరిఖావర్ణనము §§§
మ. హరిదశ్వస్ఫురదశ్వఘోరఖురభిన్నా రామభూనారికే
     రరసారుట్ఫలనిర్గళద్విమలనీరస్ఫారధారాధరాం
     తరవర్తిష్ణుతఁ దోయపూర్తిఁ గని దానన్ మబ్బు ధారాధరా
     ఖ్య రహింపన్ జలరాశి వర్థమయి ఖేయస్ఫూర్తిఁ గొల్చెంబురిన్.4

మ. పురిఖేయంబుఁ బయోధియుం గని జనంబుల్ రెంటికిన్ భేదమే
    ర్పఱుపం జాలక యున్న బ్రహ్మ వివరింపం బూని వారాశిపైఁ
    గర మొప్పన్ మణిముద్ర వైచె నది యౌఁ గాకున్న నీలచ్ఛవిన్
    ధరియింపం గత మేమి యేటికి సముద్రఖ్యాతి మున్నీటికిన్.5

మ. పరిఖాంభోనిధి నప్పురంబు ప్రతిబింబం బొప్పు నేవేళ దు
     ర్ధరభూలోకధురంధరాహిరవఫూత్కారోత్థకీలావళిం
     బరితాపంబు వహించి భోగినులతోఁ బాతాళముం బాసి భా
     సురవాఃకేళికి వచ్చుభోగవతి యంచుం బోల్పఁగా నర్హమై.6

                 §§§ సౌధవర్ణనము §§§
ఉ. నీలపుఱాలమేడలకు నిచ్చలపుంబటికంపుమెట్టులం
    బోలు మెఱుంగుగోపురపుమొత్తపువాకిటికీలుజాళువా
    మేలిపసిండిబొమ్మచనుమిట్టలకుం దెలిచల్వపైఠిణీ
    చేలచెఱంగులై యచటఁ జెల్వగు వేలుపుటేటిపెందెరల్.7

సీ. కేళిసరఃపద్మపాళీవిహారియై కాంచు సుగంధంబు గంధవహుఁడు
    లీలాద్రివన్యామహైరావళుల్ డాసి గ్రహియించు విరులచాల్ గగనలక్ష్మి
    నూతనాంశుకరత్నకేతనాంశుకయుక్తిఁ బ్రాపించుఁ జిత్రాంబరములు హేళి
    గణనీయవివిధతోరణనికాయము లాని మొనయు ముత్తెపుఁబేరు లనిమిషనది
తే. నర్మహర్మ్యాంతరస్త్రైణనవ్యగాన, కౌశలీద్రవమాణాబ్జకాంతవారి
    పుషితచాతక మైనయప్పురవరమునఁ, జతురలంకారవితతు లాశ్రితుల కరుదె.8

మ. జను లెల్లప్పుడుఁ దోయదానమునఁ జంచత్తాళవృంతానిలం
    బునఁ బాంథవ్రజ మొందుదప్పియు శ్రమంబున్ మాన్పఁ బ్రోల్లచ్చియున్
    వనితాగానరసద్రవచ్ఛశిమణీవార్ధారచేఁ జాతకా
    వనముం జేసి ధ్వజాశుగాప్తి నడఁచున్ వైమానికశ్రాంతియున్.9

చ. ఘనజఘనస్తనద్వతయగౌరవముల్ ధరియించి యాకసం
    బునఁ జరియింపలేక తమముందట నందముఁ జెందుజాళువా
    మినుకుఁబసిండిమేలిపనిమెచ్చులమేడలు సూచి పోలి వ్రా
    లినయమరీశిరోమణులలీలఁజెలంగుదు రింతు లప్పురిన్.10

మ. త్రిదివోద్యానము డాయుమాడువులపైఁ గ్రీడించు పూఁబోండ్లకున్
     ద్రిదశస్త్రీలు వయస్యలై సవినయోక్తిం జూడుఁ డారంభయి
     ల్లదె యాచెంగటిదే తిలోత్తమనికాయ్యం బూర్వశీమందిరం
     బిదె యంచున్ వివరించి చూపుదురు వా రింపొంది వీక్షింపఁగన్.11
 
మ. విధుకాంతోజ్జ్వలసౌధవీథికల ఠీవిన్ దంపతుల్ గూడి యి
     క్షుధనుఃకేళికిఁ జొక్కి కూర్చుటయు నచ్చో వేకువన్ వందిమా
     గధసంఘాతముపోల్కి మేల్కొలుపు నుత్కంఠార్భటిన్ నాకలో
     కధునీహాటకపద్మఝాటచరచక్రక్రౌంచచక్రాంగముల్.12

చ. ఘనతరరత్నసంఘటితకాంచనసౌధము లప్పురంబునం
     దనరఁగఁ జూచి భాస్కరుఁడు దైవతశైలము వీనితోడ జో
    డనఁగఁ దగుం బరాశుగహతాంచితశృంగము గాక యున్నచో

ననుచు ననూరుతో ననుఁ దదంతికజాలకమార్గవర్తియై.13

తే. అహికులము లావరింప నయ్యడుగువట్టి, తెలియఁబడకున్నభోగవతియు దివంబు
    పేరుగనియాసురలకుఁ బ్రాపింపఁదగిన, స్వర్గపురము నప్పురముతో సాటియగునె.14

                                 §§§ బ్రా హ్మ ణా ది వ ర్ణ న ము §§§
సీ. బ్రహ్మాహ మనఁబోయి భంగ మొందినశుచిద్విజవాహనునిసద్వివేక మెంత
    యనిశంబు దోషాకరుని మౌళి ధరియించు ధర్మాభియాతిప్రతాప మెంత
    ఘనతరస్వర్ణముల్ గలిగియు మకరసంగతినున్న యక్షేశుకలిమి యెంత
    యేఱు వ్రయ్య లొనర్చి యూరు డయ్యఁగఁ జేసి మలయులాహిరికాని మహిమ యెంత
తే. యని చతుర్ముఖ చండీశ ధనద సీర, ధరుల సుజ్ఞాన ధర్మ సత్పణ్యకృషివి
    శేషముల మెచ్చ రప్పురిఁ జెలఁగు ద్విజశి, ఖామణులు రాజు లూరుజుల్ గాఁపుఁబ్రజలు.15


                                   §§§ గ జ వ ర్ణ న ము §§§
చ. ప్రతిగజశంక నభ్రనికరమ్ము రదమ్ములఁ గ్రుమ్ము దిక్కరి
    ప్రతతుల మార్కొనం బిలుచుభంగిని బృంహితముల్ ఘటించు న
    భ్రతటినిఁ బద్మముల్ వెనఁచి పట్టి పెకల్చుటకుం బలెన్ సము
    న్నతకరముల్ నిగుడ్చు గగనమ్మున కప్పురిమత్తుటేనుఁగుల్.16
 

                                   §§§ అ శ్వ వ ర్ణ న ము §§§
సీ. రవగాలునకు సాటి రాక గాడ్పుపటాణి పొదలుసిగ్గునఁ బోయి పొదలఁ జొచ్చె
    జోడనల కొకింత జోడు గా నేరక వేల్పురాయనితేజ వెల్లనయ్యె
    బలునిబ్బరమునకుఁ బ్రతి గాక గరుడి యనామధేయునివాహనం బనఁ దగెఁ
    జుట్టుఁబర్వులకు నించుకయు నీ డొందలే కినుహరుల్ పిచ్చుకుంటున కగపడె
తే. నింక నీవాహముల కెద్ది యెన యటంచు, జనులు వొగడ మనోవేగ మెనసిధార
    లొలసి లోగప్రసిద్ధుల నూనిమేటి, సాహిణులశిక్ష నరుల నచ్చటిహయములు.17

                                    §§§ ర థ వ ర్ణ న ము §§§
మ. వరనీలోన్నతి మించుటం దనరె దీవ్యద్రాజరాజాప్తి భూ
     ధరరూఢిం గన నౌట శృంగకలనల్ దళ్కొందెఁ గేతుస్థితిం
     గర మొప్పారుట నభ్రమున్ దొరసెఁ జక్రస్ఫూర్తి వర్తిల్లుటన్
     హరిలీలన్ వహియించెఁ గాంచనశతాంగానీక మాప్రోలునన్.18

                                    §§§ భ ట వ ర్ణ న ము §§§
చ. గిరినికరమ్ము లైనఁ బిడికిళ్ళనె వ్రయ్య లొనర్తు రుగ్రకే
    సరిసటలైనఁ జేకొని వెసం బెకలింపుదు రత్యయాభ్రవి
    స్ఫురదశనివ్రజం బయినచో నఱచేతన తట్టి వైతు రో
    డరు హరుఁడైనఁ బోరులకుఁ డాసినయప్పుడు వీరులప్పురిన్.19

                                       §§§ వేశ్యావర్ణనము §§§
సీ. ఓడి డస్సినది గాకున్న నెందులకుఁ గా మబ్బు తద్ధూపధూమమున బలియుఁ
    దనకంటె ఘనకాంతి గన కున్న నెల వీని కాశ్రితగతి నేల యావహించుఁ

    దమ్ములకంటె నందమ్ములు గాకున్న నంచ లేమిటికిఁ గా ననుసరించుఁ
    దమసొంపు గుదియించి తఱుమకున్నను దారలేటికిఁ గా బట్టబైట వ్రేలు.
తే. నని ప్రకీర్తింపఁ దగుకొప్పు లాననములు, చరణయుగములు నఖములు సాటిలేని
    పెంపు వహియింప నెపుడు నిలింపసతుల, సవతునఁ జెలంగుదురు వారయువతు లచట.

                           §§§ పు ష్ప లా వి కా వ ర్ణ న ము §§§
సీ. పొగడవిరుల్ లేవె మృగరాజమధ్యమ విటరాజ చెంగల్వవిరులు గావె
    జాతు లేమైనను సంతరించితె కొమ్మ నేర్చుకోవలసిన నీటుకాఁడ
    వగలాఁడి యిచట సువర్ణముల్ గలుగునే కలయిండ్లఁ గలుగును జెలువరాయ
    తమ్ములఁ జూపవే తరుణీశిరోమణి యాడఁగాఁ జనిర రే పాడి రమ్ము
తే. వలయుపున్నాగతతు లేవె వన్నెలాఁడి, యేల యడిగెద వీయూర నేమికొదవ
    యని విటుల జాణతనమున నపహసించి, పువ్వు లమ్ముదు రవ్వీటఁ బువ్వుబోండ్లు.

                           §§§ మం ద మా రు త వ ర్ణ న ము §§§
ఉ. సారవకైరవాంబురుహసారమరందభరంబు సెంది శృం
    గారవనావలీవివిధకౌసుమరేణువు లూఁది సౌధసం
    చారివధోకుచోరుఘనసారమృగీమదగంధసారకా
    శ్మీరసువాసనల్ దొరసి మీఱు సమీరకుమారుఁ డప్పురిన్. 22
  
                           §§§ స స్య వ ర్ణ న ము §§§
మ. నగరాధీశుని సద్గుణంబులకు నానందించి దేవేంద్రుఁ డ
     న్నగరీరత్నముచుట్టునుం గురియు స్వర్ణగ్రావచూర్ణంబు నాఁ
     దగు నంచత్సరయూనదీనికటకేదారంబులం బండి సో
     యగమై యెన్నులవ్రేఁగునన్ ధరణి మ్రోయన్ వ్రాలి సస్యావళుల్. 23

                          §§§ పూ ర్వ రా మా య ణ క థా సం గ్ర హ ము §§§
క. ఆప్రో లమరావతి యమ, రప్రభుఁ డేలుగతిఁ బంక్తిరథుఁ డేలు దినేం
     ద్రప్రతిభానుప్రతిభా, దీప్రశుభాన్వితగుణప్రతిష్ఠానిధియై. 24

సీ. తనయాజిభావంబు గనిపించె సకలసన్నుతసత్కళాప్రవీణత వహించి
    దనగభీరత సూపెఁ దటినీమనోహరప్రఖ్యాతసఖ్యసంపదలఁ జెలఁగి
    దనప్రభావము దెల్పెఁ దపననందనగర్వనిర్గ్రంథనక్రియానిరతిఁ దనరి
    తనతేజ మెఱిఁగించె ననిమిషేశ్వరవజ్రదుస్సాధదైత్యపంక్తుల వధించి
తే. రాజమాత్రుండె యష్టదిగ్రాజవినుత, రాజితయశఃప్రతాపనిర్దళితరాజ
    హేళి రిపురాజభయదాజికేళి రాజ, రాజధనశాలి దశరథరాజమౌళి. 25

 తే. ఆనరేంద్రుండు బంధుసంతాన మలరి, పొగడ సంతానభూజంబుపగిదిఁ బెద్ద
     కాల మిల యేలి సంతానకాంక్ష మించి, శిష్టసమ్మతి నొకయిష్టి సేయునపుడు. 26

మ. అమరుల్ విష్ణునిఁ జేరి పంక్తివదనుం డత్రాసియై గాసి సే
     య మరుల్లోకము సంచలించె నిఁక మ మ్మాపన్నులం బ్రోవ నా

    యమరుల్ నీ కెదురే జయింపఁగదవయ్యా యన్న లేనవ్వుడా
    య మరుల్కొల్పుచు వారి వీడ్కొలిపి దైత్యచ్ఛేదనోద్యోగియై. 27

సీ. శ్రీసూర్యకులసుధాసింధువాకాంక్షించి పాలమున్నీటిపై బాళి మాని
    సహసముద్భూతవాత్సల్య ముంపఁ దలంచి చిలువరాపాన్పుపై నెలమి మాని
    యవనీసుతాంగసౌఖ్యము గాంచఁ గామించి కలిమితొయ్యలితోడి చెలిమి విడిచి
    యలఘుమానుషలీల లవధరింపఁ దలంచి తనయమానుషచర్యయును దొఱంగి
తే. వనచరత్వంబుఁ బూని ప్రోవఁగఁ దలంచి
    బ్రహ్మరుద్రాదిదేవతాప్రభులమీఁది
    హాళియును మాని నందకాద్యాయుధాభి
    రాముఁ డయ్యెడ దశరథరాముఁ డయ్యె. 28

సీ. చలిగట్టుదొరపట్టి జపియించుమంత్రంబు వేయిఱేకులతమ్మి వెలయునంచ
    పలుకుఁగొమ్మకు ఱేనిఁ గలిగించుతొలిపెద్ద యీరేడుజగముల నేలుఱేఁడు
    ప్రాఁబల్కుజవరాండ్రబలఁగంపుముచ్చట పెననీటఁ దేలాడుపిన్నపాప
    మరుగొంగతలఁపుదామరమీఁదియెలదేఁటి కలిమియొయ్యారినోములఫలంబు
తే. కటికచీఁకటి వెలుఁగునొక్కటివెలుంగు, మేటిరేద్రిమ్మరుల గెంటుపోటుబంటు
    తొగలఁదమ్ములఁ బ్రోచుకందోయిఁజూచు వేల్పు కౌసల్యకొమరుఁడై వృద్ధినొందె.

క. దారకుఁ డయి రఘువీరుఁ డు, దారకుతూహలముతోడఁ దండ్రి వనుప బృం
   దారకు లెంచఁగ మునిబృం, దారకుక్రతురక్ష కరిగెఁ దమ్ముఁడు గొలువన్. 30

వ. ఈవిధంబునం గౌశికతపోవనంబునకు సవనావనంబుసేయం జనినతదనంతరంబ.

సీ. హోమధూమంబుతో వ్యోమంబు వ్యాపించె భీమదైత్యస్తోమధూమరుచులు
    సవనాగ్నిశిఖలతో దివిఁ బ్రాఁకె రేగాము కఱకుజుంజుఱువెండ్రుకలబెడంగు
    లనలకుండస్ఫులింగాళితోఁ జద లానె నసురదంతోద్ఘట్టనాగ్నికణము
    లలఘుమంత్రారవంబులతోడ నిండె నాకసము రాక్షసచమూకలకలములు
తే. జటిలసంకల్పములతోడఁ జటులదనుజ
    కుటిలసంకల్పములు మీఱెఁ గుశికతనయు
    డసదృశప్రజ్ఞ రాఘవునాజ్ఞచేత
    యజ్ఞదీక్ష వహించినయాక్షణమున. 32

ఉ. దానవినీతినీతిగుణధాముఁడు రాముఁడు దొల్తఁ దాటకా
    దానవిప్రాణముల్ గొనినదారుణశాతశిలీముఖంబునం
    దానవిరాజమున్ నముచిదానవసూదనుఁ డుర్విఁ గూల్చుచం
    దాన విరాజమానభుజదర్పముతోఁ గెడపెన్ సుబాహునిన్. 33

క. పారమ్ము లేనివడి గల, పాఱమ్మున రఘువరుండు వడ నేసె నకూ
    పారమ్మునఁ గుటిలవ్యా, పారమ్మున మెలఁగునలఘబలు మారీచున్.34

వ. అప్పుడు. 35

ఉ. జన్నము నిర్వహించి తని సన్మును లెంచఁగ నింతచిన్నరా
    జన్నము గల్గఁజేసె మన కందఱ కంచు సురల్ ప్రకీర్తనం
    బన్న మునీంద్రుతో జనకుపాలికిఁ బోవుచుఁ ద్రోవశాపవుం
    బన్నముఁ బాపె గౌతమికి భానుకులుండు నిజాంఘ్రిసంగతిన్. 36

సీ. నిటలాక్షుధనువుఁ ద్రుంచుటకుఁగౌశికుఁడెట్టు లనుమతించె నటంచు నమరు లనఁగఁ
    జెలికానిధర్మంబుఁ జెఱుపఁ గాకుత్స్థుడేగతిఁబూనెనని శైవగణము నుడువఁ
    గడిఁదవిల్ దునియుచప్పుడు వీనులకు విందు సేయు నెప్పు డటంచు సీతఁ దలఁప
    నితం డల్లుఁడైన శ్రీపతిమామ యగురమాజనకుఁబోలనె యంచు జనకుఁ డెంచ
తే. హరధనుర్భంగకార్య మెవ్వరికిఁ దెలిపి, సూడు పుట్టింతునని నిల్చుచో నిలువక
    కలహభోజనమౌని నల్గడలఁ దిరుగ, శివునివిలు ద్రుంచె రఘువీరశేఖరుండు. 37

మ. హరకోదండవిఖండనప్రవణబాహాదండపాండిత్యవి
     స్ఫురణం జెందినకీర్తిలక్ష్మివలె భూపుత్త్రీలలామంబు సే
     కుఱ నక్కోమలికొప్పుఁదేఁటితెగకున్ గుందంబు లర్పించుపో
     ల్కి రఘుగ్రామణి క్రొత్తముత్తియపుఁబ్రాల్నించెన్ వివాహంబునన్. 38

ఉ. బాడబశూరునిం జెనకుపార్థివు లెవ్వ రటంచుఁ గేరడం
     బాడి బలా యి దేటిమద మంచు భృగూద్వహుగర్వవార్థికిన్
     బాడబ మౌప్రతాపము గనంబడఁ జేసి దివిన్ సురీజనం
     బాడ బలంబుతో రఘుకులాగ్రణి సేరె నయోధ్య వేడుకన్. 39

మ. తనుహేమం బధరాబ్జరాగమణియున్ ధమ్మిల్లనీలంబు నా
     ననపద్మంబు నఖాంశుమౌక్తికవితానంబునన్ గటీచక్రమున్
     స్తనదుర్గంబులుఁ గల్గి రాజ్యరమచందం బొందుభూపుత్త్రితో
     జనకాజ్ఞన్ వనిఁ జేరె రాముఁ డెలమిన్ సౌమిత్రి సేవింపఁగన్. 40

సీ. చిత్రకూటమణీవిచిత్రకూటసుఖేటచిత్రకూటస్థలాసీనుఁ డగుచు
    దండకాశరభవేదండకాసరముఖోద్దండకాననమృగధ్వంసి యగుచు
    మానవారితపూజ్యమానవాసవిరాధమానవాదహిమోగ్రభానుఁ డగుచు
     దానవాగ్నిభిదానిదానవార్యభయప్రదానవాక్పరితుష్టమౌని యగుచు
తే. దూషణాలాపఖరఖరదూషణామ, రేషణద్వషణానీకశోషణాతి
     భీషణాశనిఘోషణాశ్లేష్మాణాస్త్ర, పోషణుఁడు మించె రఘువంశభూషణుండు. 41

వ. తత్కాలంబున. 42

ఉ. శూర్పణఖోక్తిమారుతము సోఁక దశాస్యుఁడు కోపవహ్నియున్
    దర్పకరోషవహ్నియు నెదం దగులం దగునీతి డెందముం
    జేర్పక మాయలేడివలెఁ జేసి సుబాహునియన్న నంపినన్
    దర్ప మెలర్ప వాఁడు రఘునందనుముందర చేష్ట లొందఁగన్.43

పంచచామరము. నరాదుఁ డీమృగంబుడంబునన్ వనంబులోనఁ గా

   
    నరా దురాశ సీత దెల్పినన్ నరేంద్ర వేఁటఁ బూ
    నరాదు మాయ యంచుఁ దో డనంగ నవ్వుకొంచుఁ గి
    న్నరాదు లెంచ రామభూమినాథుఁ డేఁగె వెంబడిన్. 44

శా. సారంగంబు దయాంతరంగమున మున్ సంరక్ష గావించి యా
     సారంగంబు హరించు టె ట్లనక కాంక్షన్ సీత వర్షాబ్దమున్
     సారంగంబువలెన్ నిజాగతిఁ దలంచం దన్మనఃపద్మినీ
     సారంగంబు విభుండ పట్టువడ కేఁచన్ లేడిఁ జంపెన్ దుదిన్. 45

వ. ఇవ్విధంబున గుహనాహరిణంబున్ మరణంబు నొందించి యత్తరణికులాభరణంబు మరల నరుదెంచి పంచవటిం
     బ్రవేశించి. 45

చ. అవనిజఁ బర్ణశాలకడ నారసి కానక రాముఁ డింపు వా
    య వనిఁ జరింపుచుం జని జటాయువు దెల్పఁగ భార్యకార్య మొ
    ప్ప విని ఘనాకబంధునిఁ గబంధునిఁ ద్రుంచి కిరాతిపూజ ల
    ప్పవినిభనాయకుండు గొని పంపకడన్ వసియించి యున్నెడన్. 47

సీ. హిమధామకరకుందసుమధామశరబృందసమధామమై జన్నిదము పొసంగ
    వినుఁగెంపునగఁజాలునునుఁగెంపుతెగడాలు మొనయింపు కుండలంబులు వెలుంగ
    శుచిరత్నవరనీలరుచినూత్నహరినీలసుచిరత్నహారరోచులు సెలంగఁ
    దులకించు తొలుకారు బలుమించుఁ బలుమాఱు నలయించుమేనికాంతులు రహింపఁ
తే. బసిఁడిముంజియు హొంబట్టుబంచ హేమ, కంకణంబులు నరుణముఖంబు దీర్ఘ
    వాలమును గల్గునొకమహావానరుఁడు, వచ్చి పొడగన్న రఘువంశవర్యుఁ డలరి. 48

ఉ. ఆయన భక్తియుక్తిఁ దన కంబుజమిత్త్రునిపుత్త్రు మిత్త్రునిం
    జేయ బహూకరింపుచు నజేయభుజాయతశక్తితో శతా
    రాయుతశాతబాణహతి నైంద్రి సురేంద్రునిఁ జూడ నంపి తా
    రాయుత మైనప్రాజ్యకపిరాజ్య మొసంగెఁ బతంగసూతికిన్. 49

క. ఈలాగున రఘువీరనృ, పాలుఁడు సుగ్రీవునెడఁ గృపాళుం డగుచున్
    మేలు ఘటియించి కపిపద, మేలు మనుచు వాన నొక్కయెడ వసియించెన్. 50

వ. తత్కాలంబున. 51

సీ. కాదంబినులు మానసోదంబులనె యుండెఁ గాదంబినులు నభోంగణము నిండెఁ
    జాతకంబులు జాలిఁ జాలించె దవశిఖాజాతకంబులు సముజ్జ్వలత డించెఁ
    బుండరీకముల భూపుఁడు డాఁప సెలవిచ్చెఁ బుండరీకములగుంపులును హెచ్చెఁ
    జంచలాలోకాప్తిసంసారి వర్తించెఁ జంచలాలోకాప్తిఁ జదలు మించె.
తే. స్తనితములు మీఱెఁ గరకలు ధాత్రి జాఱె
    నదులు వడిఁ బాఱె మృగములు పొదలు దూఱెఁ
    గర్షకుఁడు మెచ్చె వలిమిరిగాడ్పు హెచ్చె
    వనధి బహుఘోషమున నార్చె వాన పేర్చె. 52

ఉ. వాన కరంబు దీఱుటయు వానరనాథుఁ డనేకసేనతో
    మానవనాథుఁ గాంచి బహుమానవచోగతి కుబ్బి జానకీ
    మానవతిం గనంగ నసమానవనాటులఁ బంప వారలున్
    మానితమానితన్ జడిమ మాని తదాజ్ఞఁ జనంగ వారిలోన్. 53

క. పావని తారకమంత్రజ, పావని రఘువీరుఁ డనుప నరిగెఁ ద్రిలోకీ
     పావని వెదకుటకుఁ దలం, పావనితాలోకనార్థ మై త్వరపడఁగన్. 54

వ. ఈచందంబునం బవననందనుండు జనకనందినీసందర్శనంబు సేయం జని. 55

సీ. దనధైర్యరమ కోర్వ దనినట్టు లొకగట్టువడి మెట్టి యొకగట్టు జడియదాఁకిఁ
    దనగభీరతఁ జాల దనులీల జలరాశి మేజవంబుఁ గ్రిందుమీఁదు చేసెఁ
    దనయణుత్వము మహత్త్వముఁ దెల్పుచందాన సురసలోఁ దనులీలఁజొచ్చి వెడలెఁ
    దనలోకబాంధవత్వము గోచరము సేయుకరణి ఛాయాగ్రాహకత్వ మొందెఁ
తే. దనతపఃఫలదేవతఁ గనినసరణి, ధరణిసుత లంకలోఁ గాంచెఁ దనహరిత్వ
    మెఱుక గావించుజోక ననేకదైత్య, నరమదేభంబుల ద్రుంచె వాయుసుతుఁడు. 56

వ. మఱియును. 57

మ. పురదాహం బొనరించుశూలివలె నంభోజాప్తభూమంత్రిభీ
     కరవాలానలకీలికావళుల లంకాదాహముం జేసి ముం
     దరరామాస్త్రపరంపరాగ్నిశిఖ లీదారిం బ్రవేశించు నం
     చరులెల్లన్ వినఁ బల్కి వచ్చి సతిమే లాత్మేశుతోఁ దెల్పినన్. 58

మ. పరమానందమునన్ విభుం డనిలభూబాహాప్రతీపప్రతా
     పరమావైఖరి కాత్మ మెచ్చి శుభ మాపాదింప నాపత్పరం
     పర మాన్సన్ నినుబోఁటిబాంధవుని సంపాదింపఁ గల్గెన్ దయా
     పర మా కేమికొఱంత యనం చతని సంభావించి దీవింపుచున్. 59

సీ. పటువనాటకవీరభటమహార్భటులచే వనమార్గమార్గముల్ వనటఁ జెంద
    నగచరవ్యాయామనాదంబుచేఁ బ్రతిధ్వనిమిషంబున ధరాధరము లడలఁ
    బ్లవగవేగాటోపబాహుళ్యమున నదీగణము లుత్తుంగభంగముల నొలయ
    హరియూధవుల యట్టహాసంపురవళిచేఁ బూర్వాదిదిగ్గజంబులు చలింప
తే. బలసి బహువాహినీప్రభల్ గొలువ రామ, విభుఁడు దక్షిణవాహినీవిభునిఁ జేరి
    విరహవారాశిదరిఁ జేరువిధము దోఁపఁ, దత్తటంబున దిటముతో దండు విడిసె. 60

వ. తదనంతరంబున. 61

తే. దశముఖుఁడు యుద్దచలితత్రిదశముఖుండు
    తన్ను నయమార్గ మెంచక తన్నుటయు వి
    భీషణుఁడు ధర్మదూరవిభీషణుండు
    శరణు శరణనె ఖరవినాశరణుఁ జేరి. 62క. పగతునియనుజు సమాపో,పగతుని దయఁ బ్రోచి విభుఁడు పౌలస్త్యు వధిం
    పఁగ దేవ త్రోవ యిటఁ జూ, పఁగదే యని మూఁడునా ళ్ల పాంపతి వేఁడెన్ .63

వ. ఇవ్విధంబున.64

మ. పలుమాఱుం దను వేఁడురామవిభునిం బాటింప కుత్తుంగభం
     గలసత్తోయభుజంగ సంఘఫణభంగ ప్రౌఢరంగ త్తిమిం
     గిలవాలప్రహతప్రవాళశకలాకీర్ణారుణార్ణః ప్రభా
     కలనం దేజము నూపె వార్థి జడధుల్ గైకొందురే ధీరులన్ 65

క. తనవారిసత్త్వగతిచే,త నలారితనాద మగునుదధిఁ జూచి విలో
    కనలుఠదనలశిఖుం డై , కసలుచు రఘువీరుఁ డుగ్ర కార్ముక మూనెన్. 66

వ. ఇవ్విధంబున నుద్దండకోదండమండితకరుం డై యచ్చండకరకులుండు ప్రచండ రోషరసా వేశంబున వారి రాశిం గనుంగొని 67

సీ. మొగు లానినపరాగములు పరాగములు శతకోటిశితకోటిశరము లేసె
    గగనంబునొరయుభంగములుభంగములుగాఁ జటుల బాడబశిఖాస్త్రములువఱపె
    సవరైనజలకరేణువులు రేణువులుగా హరిదంష్ట్రికోగ్ర సాయకము లనిచెఁ
    గమఠమీనాదికాంగవిభూతి భూతిగాఁ గాలాగ్ని తులితాంబకములు నించె

తే. మహితవిద్రుమములు విద్రుమములు గాఁగ
    లలితమణిజాలములు జాలములును గాఁగఁ
    గ్రకచముఖనిష్టుర శిలీముఖములు గురిసె
    వారినిథిమీఁద రఘువంశవర్యుఁ డడరి. 68

క. భువనములు డలఁకఁగా దన, భువనము లింకించు రామభూపతి జితవా
    సవి నయవిధిఁ గని జలనిధి, సవినయముగఁ గదిసి మ్రొక్కి సంస్తుతిఁ జేసెన్. 69

సీ. శ్రీకరరఘుకులక్షీరాంబునిధిసోమ సోమముఖ్యామరస్తోమధామ ,
    ధామనిధి ప్రశస్తప్రతాపోదార దారకత్వవిదారితారివీర
    వీరభద్రోన్నిద్ర వీరరసాధార ధారణాభ్యాసచేతః ప్రచార
    చారణశ్రీవిలాసనిరస్తరాజీవ జీవభావైక్యవృష్టిప్రదాన
తే. దానవప్రాణహృతిబాణతతిభుజంగ, జంగమస్థావర రచనాంచత్ప్రభావ
    భావనాదూర బహు పావనావతార, తారక బ్రహ్మనామ కోదండ రామ. 70

మ. శరముల్ దావకృశానుకీలల వినాశం బొందుచందాన నా
     శరముల్ డిందె భవత్కరస్థలమిళచ్చాపప్రయుక్తంబు లౌ
     శరముల్ డాసినయంత నీ కెదురె యీసప్తాంబురాసుల్ జితా
     శర ముల్లోకములుం జలించె నిఁక రోషం బూనకే నావుడున్. 71

క. జలధిన్ రఘుపతికరుణం, జలధిం గా నీక కాచి సరగఁ దదాజ్ఞన్
    నలుచే రిపుసైన్యదవా, నలుచే సేతువు ప్రియంబునం గట్టించెన్. 72

చ. కవులు హితోచిత క్రియలు గైకొని చేయుటయుం బయోధి పై
    విపులశిలాపరంపరలు వేసినఁ దేలుటయున్ నరుల్ నరా
    దపుల జయింపఁ బూనుటయుఁ దా విపరీత మటంచు రావణుం
    డపుడుఁ దలంచెఁ గాని కనఁ డయ్యెను రాము ప్రభావ మెంతయున్. 73

మ. పదవిధ్వస్తగిరుల్ గపీంద్రులు భజింపన్ దేవభూదేవతా
     పదవిచ్ఛేదనవజ్రి రామధరణీపాలుండు సేతుస్థలీ
     పదవిం బోయి సువేల మెక్కి యెదుటం బౌలస్త్యు ప్రోల్ గన్నసం
     పద విన్నట్టుల చూచి సైనికులఁ బంప వార లత్యుగ్రులై. 74

స్రగ్ధర. కారాకూరంబు లై రాక్షసులహృదయముల్ గాడ్పడన్ రామునాజ్ఞం
     గారాకుల్ డుల్చువాత్యాగణముపగిది వేగంబు మీరం బ్రదీప్రా,
     కారాఢ్యుల్ వీరవర్యుల్ కపులు గదిసి లంకాపురీగోపురప్రా
     కారాదుల్ గూల్చి కారాగతసురవనితాక్లాంతి మాయించి రంతన్ . 75

మ. రవిపుత్రాంగదజాంబవత్పవనభూరంభ ప్రజంఘాంజనా
     ధవనీలర్ష భతాలధూమ్రనలమైందశ్వేతముఖ్యుల్ ప్రహ
     స్తవిరూపాక్షున రాంతక ప్రముఖ దైత్యగ్రామణుల్ మార్కొనన్
     బవరం బయ్యె సురాసురాదిసమరస్పర్ధాళుతాత్యుగ్ర మై. 76

సీ. అత్రాసహస్తప్రహస్తాద్యదైత్యవిధ్వంసినీలాదియూథపమహోగ్ర
    మనలధూమ్రాక్షదేవాంతకప్రముఖేభపంక్తి హరీభవత్పవనభవము
    ఘటకర్ణపటునాసికాకరనిగ్రహాగ్ర హరవిగ్రహకుమార ప్రచార
    మతికాయమేఘనాదతమోవినిర్భేదమిత్త్రాయమాణసౌమిత్త్రిశరము
తే. భూరిబలమూలబలవనప్లోషరోష, భీమరఘురామసాయకస్తోమభూమ
    దావపావకశలభీకృతత్రిలోక , కంటకదశాస్య మగుచు నక్కదన మమరె. 77

చ. సమరనిదాఘవేళ శరశాతకరంబుల రామభాస్కరుం
    డమరవిరోధిరాజకుముదావలి నొంచి తపస్విమానసా
    బ్జము లలరించి వేల్పుఁగవజక్కవలన్ వెలిఁగించి లోకశు
    క్తమము లడంచి తోరపుఁ బ్రతాపమునన్ వెలుఁగొందె నయ్యెడన్. 78

మ. నటదాదిత్య వధూటికాతమవితానశ్రీలు సౌదామనీ
     పటలచ్చాయలుగా నభస్తటరట త్పాకాభియాతిస్ఫుం
     త్పటహధ్వానము గర్జగాఁ గురిసెఁ గల్పక్ష్మాజసూనచ్ఛటా
     పటువర్షంబు దశాస్యకోపపరితప్తక్షోణిపైఁ జల్లఁగన్. 79

సీ. అని దీర్ఘ నిద్రఁ జెందినవనేచరకోటి బ్రతికించి యాశ్చర్యరసముఁ జూపె
    శుచిముఖంబున నిత్యశుచి యైనసీతతో రహిఁ గూడి శృంగారరసముఁ జూపెఁ
    బగతుసోదరునికిఁ బ్రాజ్య రాజ్య మొసంగి రక్షించి కారుణ్యరసముఁ జూఫె
    నర్కజాదులుగొల్వ హైమపుష్పక మెక్కి ప్రభుతఁ గైకొని శాంతరసముఁ జూపెఁ

తే. నల భరద్వాజమునివిందు లారగించి
    సంతస మెసంగ స్నేహాతిశయముఁ జూపె
    భరతు సేమంబుఁ గన వాయుభవునిఁ బంపి
    దశరథసుతుండు భ్రాతృవత్సలతఁ జూపె. 80

క. ఆనందించుచు రఘుపతి, యానందిగ్రామమునకు నటుల యరిగి సీ
    తానుజపరిజనయుతుఁ డై , తాను జతురలంకృతులు నుదారతఁ బూనెన్. 81

వ. ఇవ్విధంబునం జతుర్విధాలంకార చారుశరీరం డై తదవసరంబున. 82

సీ. తనదివ్యమకుటంబు దనడంబున ననంతమణిసంతతిద్యోతమహిమఁ గాంచఁ
    దరకాంచనపథంబు దనవిధంబున సమాశ్రిత దేవతానగశ్రీ రహించ
    దపసితచ్ఛత్ర కేతనరాజి దనలీల ఘనమార్గవర్తిష్ణుగతి వహించఁ
    దనపార్శ్వచామరద్వంద్వంబు దనయట్ల సరి లేనిశరకళాస్పురణ మించఁ

తే. దనపురోవీధిమ్రోయువాద్యములు దనమ
    హోద్యమంబులవలెఁ ద్రిలోకోత్సవ
    ప్రదాన హేతువు లై దిగంతముల నొలయ
    రామచంద్రుం డయోధ్యాపురంబుఁ జేరె. 83

                              §§§ శ్రీరామచంద్రపట్టాభిషేకమహోత్సవము §§§
సీ. కనఁ గల్గె నేఁటికై నను రాము ననుచుఁ గౌసల్యాదిజనము లుత్సాహ మొంద
    రామ నీకీర్తి యారవిచంద్ర మవుఁగాత మని వసిష్ఠుండు దీవన లొసంగఁ
    దమరు సేసినసుధర్మములు నేఁడు ఫలించె నని పౌరు లుత్సవమ్మున మెలంగ
    సకల దేశాధినాయకులు గానుక లిచ్చి యలికకీలితహస్తులై భజింప

తే. భరత లక్ష్మణ శత్రుఘ్న పవనతనయ
    భాను జాంగద జాంబవత్ప్రముఖధన్యు
    లుచిత మగునూడిగములు సేయుచును గొలువ
    రాముఁ డప్పుడు పట్టాభిరాముఁ డయ్యె. 84

సీ. కమనీయరత్నోర్మికలఁ బూని సితఫేనచందనాంగకుఁ డయ్యె సాగరుండు
    పైరపచ్చలతాళి మీఱ మొల్కలగగుర్పాటుఁగంచుక మూనె రత్నగర్భ
    వినుఁగెంపుఁబతకంబు గనిపింప సురదీర్ఘికాచేల యై మించె గగనలక్ష్మి
    విమలకోరకమౌక్తికములతోఁ జిగురుఁగెంబట్టుబుట్టముఁ గట్టె బహువనాళి
తే. కుంభికుంభాగ్రశోణమృత్కుంకుమంబు, దంతరుచివజ్రహారముల్ దాల్చె దిశలు
    సీతతోఁ గూడి సరిలేని చెలువు పూని, శ్రీరఘుస్వామి పట్టాభిషిక్తుడైన, 85

శా. దిగ్దంతుల్ నిదురించె నిర్భరతఁ జెందెన్ భూధరంబుల్ మరు
    ద్భుగ్దేవేంద్రుఁడు భోగినీరతిసుఖంబుల్ గాంచె యజ్ఞాంగతి
    ర్యగ్దాహంబు శమించె నాటవిడు పైన ట్లుండెఁ గూర్మంబు స
    మ్యగ్దోర్దండమునన్ ధరాభరము రామక్ష్మావరుం డూనినన్. 86

వ. ఇత్తెఱంగున నత్తరణికులగ్రామణి సకలదిగ్రామణీయకయశశ్చంద్రచంద్రికా విశేషంబున నశేషబుధలోక చకోరకంబులతో నతజనమహోత్పలంబుల నలరింపుచుం దామస గుణాంధతమసంబుల విరియించుచు సింధురాట్చతుష్టయపరివేష్టితబంధుర వసుంధరాభారధురంధరుం డై యొక్కనాఁడు పూర్వపర్వతోర్వీ రమణశిరోభాగభాగరుణమణీప్రభాగణితమకుట ప్రకటాతిశయంబునకు నికటంబయి యంబుజప్రియబింబంబు డంబు సెందకయ ముందర నమందమకరందరసాస్వాదనానందరంగద్భృంగసంఘాతసంగీతప్రసంగంబులతో వికసించుసిత కమలంబులవిమలప్రకాశంబునఁ జెలువొంద వందిమాగధజనబృందాభినందనంబునం దననేత్రారవిందంబులు విచ్చి మచ్చికతో నెదుట వచ్చి నిలుచున్నపుడమి కన్నె చిన్నారినగుముద్దుమొగంపుటద్దంబుం గనుంగొనుచుం బాన్పు డిగ్గి సమయోచితాచారంబులు సంఘటించి కొలువు సింగారంబై యభంగతరాష్టాంగవజ్రమయకుడ్యమహాష్టాంగ సంగంబునం గనుపట్టు గట్టురాయనిపట్టి నెమ్మేనిచాయలం దొట్టినగట్టినీలంపుదూలంబులదండితనంబు లెచ్చరించి హెచ్చునంబయిపయింగ్రచ్చుకొనుపచ్చఱాయరుంగులపచ్చలచ్చజిగిపచ్చికలనిమచ్చికలతోవచ్చి మూర్కొనులీలాబాలకురంగంబులకు బెదరు పుట్టించుపులిచర్మంబులుగలచిత్తరుఁదపసుల పెన్ జడలకెంజాయవలెఁ బుంజి గనుమంజులప్రవాళమహాస్తంభంబుల రంగారు బంగారుబొమ్మల ప్రతిబింబంబులకు నెలవైన నిర్మలచంద్ర కాంతజగతీస్థలంబులను గంగాజలంబులం దోఁగుచందువాచెందామరకెందొగలపువ్వుతెగలం గ్రందుకొనుతుమ్మెదలయెమ్మెల కిమ్ముఁ జూపుసాంబ్రాణిధూపధూమంబులతో వాసించుప్రాలం బకుసుమమాలికాపరంపరలకాంతిసంపదలకిరుగుపొరుగులగు సోరణగండిగొప్పసుప్పాణిముత్తెంపుఱాలతండంబులు భుజగాండకాండంబు లని నిండుకొనుగృహమయూరికల విప్పు గలపించెంబులయొప్పులనుప్పతిల్లు

కొలుపువెలయొప్పులాడుల కప్పుఁగీలుకొప్పులకుక్రొమ్మొగిగలులకు మెఱుంగు లగుతదుపరిపరివేష్టితకాంచనదామంబులతోఁ బురుడించుకాంచన తోరణ స్తంభంబులు నిజమణినభోమణికాంతిపరీక్షార్థం బరుణబింబంబు నంబర కలితకరాగ్రంబులం బిలుచుచున్నవా యనఁ

జెన్నగునున్నతధ్వజపటలంబులపటాత్కా రంబుల కళుకుపద్మరాగవిటంకభాగరటత్పారావతవారంబుల యారావంబు మించినరఘువీరునగరివాకిట నుండియు జలధిఘోషం బేల బేలతనంబున నేర్చితి రని సుధాగౌరవర్ణచ్ఛలంబున వాని నగుసౌధలక్ష్మినవ్వులవెన్నెలల ముకుళించిన కెందమ్మి మొగ్గ లన నగ్గలం . బగుపసిండిచూరు మొగ్గలనిగ్గుల జగ్గుమను పుష్యరాగవలభీప్రతానంబులతో నుప్పరం బొరసి యుబ్బుచప్పరంబులలోపల నేపొందు స్ఫటికోపలసోపానమార్గంబుల చెంగటికురంగనాభికాపంకసంకుమదపంకిలాంగణంబులు రంగయిన మణిమయరంగవల్లికలప్రభావల్లిక లల్లుకొనఁ గొల్ల లగు ఫలపుష్పభరానమ్రకమ్రతరకనకకదళికాక్రముకతరు సం

భంబుల మీఱుప్రతిద్వారంబులఁ దీరయిన నవరత్నఘటిత కవాటదేహళీవిశేషంబులవాటం బగుకొలువుకూటంబుఁ బ్రవేశించి భద్రాసనాసీనుం డయి నలువంకలభరతలక్ష్మణశత్రుఘ్నహనుమత్సుగ్రీవాంగదనలనీలజాంబవద్విభీషణాదులు సేవింప నిండుకొలువున్నసమయంబున 87

                                 §§§ కణ్వాదిమహర్షులు రాముం జూడ వచ్చుట §§§
సీ. కణ్వగాలవగార్గ్యకౌశికవరతంతురోమశాదికులు తూరుపుననుండి
    విముఖశంఖదళాదసుముఖాత్రికుంభజప్రముఖమౌనులు దక్షిణముననుండి
    జాబాలికుత్సత్రిశంకులోధ్రకధూమమంకణాదులు పశ్చిమముననుండి
    వత్సకశ్యపభరద్వాజగౌతమపౌండ్రజమదగ్నిముఖులు త్తరముననుండి
తే. ప్రాప్తసామ్రాజ్యవిభవుఁ డై బాగుమీఱు
    దనుజసంహారు రఘువీరుఁ గని ప్రశంస
    సేయుతలఁపుల శిష్యప్రశిష్యకోటి
    గొలువ నరుదెంచి మొగసాల నిలిచి రపుడు. 88

మ. మును లేతెంచినవార్త దెల్పు రఘురాముం జేరి నీ వం చగ
      స్తి నియోగించిన ద్వార పాలుఁడు సముద్రేకత్వరం బోయి రా
      ముని సేవించి పరాకు స్వామి ఘటభూముఖ్యవ్రతుల్ వచ్చినా
      రని విజ్ఞాపన మాచరించుటయుఁ దా నత్యంతహర్షంబునన్. 89

                      §§§ శ్రీరామచంద్రుడు మునుల నెదుర్కొని సత్కరించుట §§§
ఉ. బంగరుకొండనుండి దిగుబాలదివాకరులీల రాముఁ డు
    త్తుంగమణీమయాసనముఁ దోరపువేడుక డిగ్గి యంగ ము
    ప్పొంగ మహర్షులం గదియఁ బోయి నమస్కృతు లాచరించి భ
    క్తిం గరముల్ మొగిడ్చి తొడితెచ్చి సభాంతరరత్నవేదికన్ 90

చ. కుశమృగచర్మ సంకలితకోమల కాంచనరత్న పీఠులం
    గుశికసుతాత్రికణ్వభృగుకుంభజముఖ్యుల నుంచి పూజనా
    తిశయవిశేషగౌరవవిధేయగుణంబుల నింపొనర్చుచున్
    దశరథనందనుం డను నదభ్రనవాభ్రనదభ్రమార్భటిన్ 91

మ. కుశలంబే, మునులార శిష్యులకు మీకున్ శిష్యసంఘం బహ
     ర్నిశము సేవలు సేయునే తపములున్ నిర్విఘ్నతన్ సాగునే
     కుశపర్ణాంబుఫలాదు లబ్బునె వనక్షోణిన్ మిముం జేరి దు
     ర్దశ లెవ్వారును జేయకుందురుగదా తథ్యంబుగాఁ దెల్పరే. 92

మ. భవదాశీర్మధువైభవంబునఁ గదా ప్రాప్తించు మాదృగ్భుజా
     భవదావంబు యశఃప్రతాపసుమశుంభత్పల్లవంబుల్ మహా
     భవదాహంబు శమించు మీపదజలప్రాశంబునం బద్మభూ
     భవదామోదరు లైనమీ రలిగినన్ భాషింపఁగా శక్తులే. 93

సీ. ఊరుభాగమున భూభార మిముని దాల్చె బ్రహయష్టినె యత్తపస్వి పూనె
    నలత్రిమూర్తులఁ బుత్త్రకులఁ గ నియ్యతి గాంచె నలిగి వారల నమ్మహర్షి తన్నె
    భువనసృష్టికి మాఱు పుట్టించె నిమ్మౌని పూని యాయన మ్రింగె భువనరాశిఁ
    దనయోగమహిమ నిత్తపసి క్రోధు జయించె నడఁగ కుగ్రతనుగ్రునతఁడు గెలిచె
తే. యోగమహిమంబులను మెచ్చ రొకరి నొకరు
    యోగ మన్నను నవ్వుచు నుందు రెపుఁడు
    వింటి మీచర్య లెడ మెచ్చుకొంటి నిత్య
    హర్షులను మిమ్ముఁ గంటి మహర్షులార. 94

వ. అని యదంభగంభీరవచోనిగుంభనం బొగడు నక్కుంభినీసుతాధీశ్వరునితో గుభసంభ వాదు లి ట్లనిరి. 95

                              §§§ అగస్త్యాదిమహర్షులు శ్రీరాముని కీర్తించుట §§§
ఉ. లోకము నీదృగంచలవిలోకమునన్ రహిఁ జెందె భాస్కరా
    లోకమునం బయోజిని వెలుంగురహిన్ సుజనావనైకలీ
    లాకుశల ప్రభావము సెలంగ జగం బిటు లీవు ప్రోవఁగా
    మాకుశలంబు వేఱె యొకమా టడుగన్ వలెనా రఘూత్తమా. 96

శా. శీలక్ష్మాధరవజ్రి తాపసజన శ్రేణీతపస్యానిల
     వ్యాళస్వామి పరాంగనాంతిలతావాలంబు ధరాంబురు
     ట్కాలాంభోదము రావణుం డరిగె నీకాండాగ్నిచే మాతపం
     బేలా గొందెడు విఘ్నమేఁచుఖలుఁ డిం కెవ్వాడు సీతాధిపా. 97

తే. అనిమిషులగుండెలో గాల మఖిలలోక, నేత్రమున నాటి వేధించునెరసు గాలి
    కాలిముల్లు కుభృత్పాళిపాలిపిడుగు, రావణుఁడు డిందె భువనముల్ రక్తిఁజెందె. 98

సీ. ముసుఁ గేసికొని మూలమూలదాఁగినదిశాధిపుల కిప్పుడు బయల్ దేఱఁగలిగె
    గులుకులొందక కొండగుహలద్రిమ్మరు వేల్పుఁ జెలులకిప్పుడు చెల్వు సేయఁగలిగె
    జపతపంబులు మాని జడవృత్తిఁ దిరుగుమౌనులకు నిప్పుడు నిష్ఠ సలుపఁగలిగె
    ననద లై గతి మాలి చనిన ఖేచరుల కిప్పుడు విమానము లెక్కిపోవఁగలిగె
తే. బడగ లెత్తక పడుకులఁ బట్టి యడఁగి
    యున్న ఫణిజాతి కిప్పుడు వన్నె గలిగె
    దశరథకుమారతిలక నీధర్మమునను
    దనుజవిభుఁ ద్రుంచి భయము మాన్పినకతమున. 99

సీ. మునుల పాలిటివాఁడ వనుట కాదిని నీవు సవరించుయజ్ఞ రక్షణమె సాక్షి
    యతి పావనుఁడ వౌట కలయహల్యాదోషరాశిఁ ద్రోచిన పాదరజమే సాక్షి
    భువనాధికుఁడ వౌట కవిరతోద్దతి శూలివిలు దళించిన బాహుబలమె సాక్షి
    యఘటనప్రఘటనోద్యముఁడ వౌటకు ఱాలు నీటిపైఁ దేలించు నేర్పే సాక్షి

తే. యఖిలజీవేశ్వరుఁడవైనయందులకును, వనచరులచేతఁ దగుపనుల్ గొనుటె సాక్షి .
    యిట్టినీ కేము దీవింప నీప్రతాప, మీయశముఁ గల్లె ననుమాటకేమి సాక్షి. 100

క. ఐన నిజాశ్రితపక్షము, చే నానతి యిచ్చితివి విశిష్టుల మనుచున్
    మీనామము జపియింపం, గానె కద ప్రతిష్ఠ మాకుఁ గలిగె జగములన్ . 101

సీ. ఖలశిక్ష సాధురక్షయు నొనర్పనె కదా గురునాజ్ఞ వని నీవు దిరుగు టెల్లఁ
    బగతు ఖండింప నెపంబు గల్గనె కదా సతి నొంటి యిడి వేఁట సనుటయెల్లఁ
    గాందిశీకులఁ బ్రోచుకరుణఁ జూపనె కదా భానునందనునిఁ జేపట్టు టెల్ల
    నేకాంతభక్తుఁడౌ టెఱిఁగి యేలనే కదా హనుమచే నుంగరం బనుపు టెల్ల
తే. గణన సేయక దశకంఠుఁ దృణముగాఁ ద, లంచియె కదా విభీషణు లంక కబ్ధి
    కట్టకయ మున్నె పట్టంబు గట్టు బెల్ల, రవిసహస్రమహస్సాంద్ర రామచంద్ర. 102

సీ, కులకర్త నింతి మీగురు నంపి మాన్పునాయకుభంగమని గంగ యమున కనియెఁ
    దనతోడఁబుట్టు విందుని కగ్గమాయెఁ గా యని గౌరి పతిమొగం బట్టె చూచె
    మామ నీగతిఁ గలంపఁగ నాడు మే యంచుఁ బరవాసుదేవుతోఁ బద్మ వలికెఁ
    దిరుగ నబ్ధులతోడఁ ద్రిభువనంబు లొనర్పవలయునో యని వాణి వరుని నడిగెఁ
తే. దనహయంబుల కెల్ల జీవనములిచ్చు, నన్ప్రభుఁడు నొచ్చెనోయంచు నడలె వజ్రి
    బాడబజ్వాలలట్లు నీపటుశరములు, వార్ధి నింకించునప్పు డిక్ష్వావాకుతిలక. 103

చ. కరమున నీవు విల్లుగొని కాండముఁ బూనిన మూఁడులోకముల్
    కరము భయంబు నొందుఁ గడఁకన్ నిను మార్కొన నెవ్వఁ డోవు భీ
    కరముఖనిర్గతాననశిఖాపరిదగ్ధసుపర్వు రావణున్
    దురమున బంధుయుక్తముగఁ ద్రుంపఁగ నీకె తగున్ రఘూద్వహా. 104

సీ. అమితాస్త్రశస్త్రప్రహస్తుఁడైన ప్రహస్తుఁ డురమహోదరుఁ డమ్మ హోదరుండు
    చండయుద్ధాకంపనుం డకంపనుఁడు దేవాంతకుం డైన దేవాంతకుండు
    కువచోనిగుంభుండు కుంభుండుదితశత్రు దానికుంభుండు నాఁ దగునికుంభుఁ
    డహితవిరూపాక్షు డగువిరూపాక్షుండు యతియజ్ఞకోవుఁడౌ యజ్ఞకోవుఁ
తే. డాదిగాఁ గలదై తేయు లడఁగి రుగ్ర, సంగరంబున నీ యోధసమితిఁ దొడరి
    కడఁక నతికాయుఁ డగునతికాయుఁ డీల్గె, నీసహోదరు చేత సీతాసమేత. 105.

మ. ప్రళయాబ్దప్రతిమాప్రమాణతనుశుంభత్కుంభకర్ణాద్రి నీ
     కులిశాత్యుగ్రనిశాతబాణహతులం గూలెన్ దశగ్రీవదో
     ర్బల మైనన్ సహియింప వచ్చు సహియింపం గూడునే యింద్రజి
     ద్బల మవ్వీరుఁడు సచ్చె నీకు హిత మాపాదించుసౌమిత్రిచేన్ 106

మ. సురకన్యాకబరీపరిగ్రహణజా శుభ్రాపకీర్తిచ్ఛటా
     భరసం సూచకవర్ణు రావణసుతున్ భంజించు టింద్రాదిభీ

    కరపౌలస్త్యముఖాసుర ప్రవరుల ఖండించు కార్యంబుతో
    సరియౌనందునఁ గాదె నిర్బయత మించం గల్గె జేజేలకున్ . 107

క. జేజే యని జగ మెంచఁగ, జేజేలకు నభయ మొసఁగి చెలఁగితివి బళీ
    యాజేయ వీరదై తే, యాజేయజయాప్తి నలరు మని యగ్గింపన్. 108

క. ఆరాముఁడు, బుధవిహగచ, యారాముఁడు నెఱుఁగు సెంది యంజలియుతుఁడై
   వారలఁ గని గగనధునీ, వారలఘుంఘుమఘుమారవంబునఁ బలికెన్, 109

సీ. ఘటకర్ణకంపనాకంపనాదుల మాని యింద్రజిత్తు ప్రతాప మెంచ నేల
    ధూమ్రాక్షయూపాక్షదుర్ముఖాదుల మాని యింద్రజిత్తుప్రతాప మెంచ నేల
    యతికాయవికటప్రహస్తాదులను మాని యింద్రజిత్తుప్రతాప మెంచ నేల
    త్రిశిరోనరాంతకత్రిదశాంతకుల మాని యింద్రజిత్తుప్రతాప మెంచ నేల
తే. వారికంటెను వీఁడంత వీరుఁ డైన, కారణం బేమి జన్మప్రకార మెట్టు
    లెవ్వరివరంబుచే నిర్జరేంద్రు గెలిచె, నెటులుఁ దనతండ్రికంటెఁ దానెక్కుడయ్యె. 110

              §§§ శ్రీరాముఁడు మునులను రావణజననాది వృత్తాంతముల నడుగుట §§§
ఉ. తాదృశవిశ్రమాన్వితసుతప్రభవంబున కాదికారణం
    బౌదశకంఠుజన్మము తదన్వయపద్దతి తత్తపోమహ
    త్త్వాదులు తత్త్రిలోకవిజయంబును మున్నగుచర్య లెల్లఁ బు
    ణ్యోదయులార గోప్యదశనొందిన డాఁపక యానతీయరే. 111

చ. పరులకు డాఁచుపోలికఁ బ్రపన్నులకున్ మిమువంటి తెల్విచూ
    పఱు లగు పెద్ద లంచితకృపారతి నెంతరహస్య మైన డాఁ
    పరు లలితాత్ములార యని వల్కెడురామునిఁ జూచి తత్తపః
    పరులయనుజ్ఞఁ గుంభజుఁడు వల్కె సదంభవచోనిగుంభనన్. 112

                  §§§ అగస్త్యుఁడు రావణుని వృత్తాంతముం జెప్ప నారంభించుట §§§
ఉ. వారిజబంధువంశవరవారిధిచంద్ర, దశాననాదిదే
    వారిజనుస్తపోబలజయస్ఫురణంబులు విస్తరించెదన్
    సారవభృంగఝంకరణసంగతరంగరవంబులీల నా
    సారవచోవిజృంభణలు సారె వినం దగు నంచు ని ట్లనున్. 113
 
                                    §§§ పులస్త్యబ్రహ్మవృత్తాంతము §§§
చ. పదములు నాల్గు కల్గి కవిపద్యముకై వడిఁ జెందు ధర్మ మెం
    దది కృత మయ్యుగంబునఁ దదంచితధర్మగుఁ డై పులస్త్యుఁ డన్
    మొదలిటి వేల్పుఁబట్టి మునిముఖ్యులకున్ గమకాఁడు జ్ఞానసం
    పదలబిడారు శాంతుఁడు కృపానిధి యొప్పు నహఃపతి ప్రభన్ . 114

క. శ్రీమించుసత్య మెనసి పి, తామహునకు సాటి యై యుదంచితకరుణా
    నామగ్రిసత్త్వయుక్తిఁ బి, తామహునకు సాటి యన నతఁడు విలసిల్లున్. 115

సీ. అకలంక సుగుణమౌక్తికజన్మదేశమై యేమౌనిహృదయాబ్జ మింపు గులుకుఁ
    ద్రిభువనవిమలవారిజవనీహంసి యై యేతపోధనుకీర్తి యెమ్మె గాంచు
    నజమనఃకమలహర్షాపాది యై యేమహర్షి మహాతపం బతిశయిల్లు
    సకలమౌనివతంసులకు మేలుబంతియై యేపుణ్యు దినచర్య యేపుఁ జెందు

తే. వినతదేవకిరీటభావితసరోజ
    రాగరుచిచక్రచక్రచంక్రమణగతుల
    నేమునిపదాంబుజము లొప్పు నామహాత్ము
    డతఁడు సాధారణుఁడె పులస్త్యాహ్వయుఁడు. 116

ఉ. ఆమునిచక్రవర్తి దనయంచిత ధైర్యముపోల్కి మించు నా
    హైమనగంబు చెంతఁ జెలువౌతృణబిందునియాశ్రమంబునం
    దామస ముజ్జగించి వనితావిముఖత్వముఁ గాంచి క్రోధుతోఁ
    గాము జయించి నూత్నశివుకైవడి నుగ్రతపంబు సేయఁగన్ . 117

సీ. వల రాజుకోసమై యలవసంతుఁడు గుంపుసేసినచిలుకతేజీ లనంగ
    వనరాశి నావరించినకరంజకమేఘతలి మించుచంచలాలత లనంగ
    భువనముల్ భ్రమియించి పూవిల్తు నెలయింప రతి దాల్చు రూపాంతరంబు లనఁగ
    మునిచి త్తముల నొంప మనసిజుం డపు డంపవచ్చుమంత్రాది దేవత లనంగ

తే. బెళుకుఁజూపులు నొయ్యార మొలుకునడలుఁ
    దళుకుదొడలును సిబ్బెంపుఁగులుకుగుబ్బ
    లమరునమరాహిఖచంకన్యలు సఖీస
    మాజములతోఁ బులస్త్యాశ్రమంబుఁ జేరి. 118

సీ. పాటఁ బాడుదు రొక్కచోటఁ మ్రోడులు పల్లవించి కోయిలలకు విందు సేయ
    నాటలాడుదు రొక్కచోటఁ గాంచిఘంటికలు మోయ మరమదావళము లనఁగ
    మాటలాడుదు రొక్కచోటఁ జక్కెరవింటిజాణతేజికిఁ దియ్యఖాణ మొసఁగ
    నీటు సేయుదు రొక్కచోటఁ గేళిని మనోహరుఁ డేడ వలచునో యని చలింప

తే. నగుదు రొకచోటఁ గుముదసంతతులు విరియ
    నిలుతు రొకచోట మెట్టతమ్ములు జనింప
    ఖచరగంధర్వకిన్న రాంగనలు మీఱి
    బ్రహ్మకొడుకు తపోవనాభ్యంతరమున. 119

సీ. గణిక సోఁకఁ గురంటకము కంటకమిషంబునను గగుర్పాటొందె వనిత చూడు
    సరస మాధవి సేర విరితేనె నెపముతోఁ జెమరించె సురపొన్న చెలియ చూడు
    లతకూన గదియఁ బల్లవదంభమున రసాలము ర క్తిఁ గనిపించె రమణి చూడు
    తనజాతికొమ్మ సెందిన మరుద్గతి బంధుజీవంబు వడఁకె నెచ్చెలువ చూడు

తే. మల్లికాయోగ మంది సంపఁగి సువర్ల
    పుష్పములు పెక్కు మొనయించెఁ బొలఁతి చూడు
    మనుచు సకలర్తుశోభితం బైనమునిత
    పోవనంబున మెలఁగి రప్పువ్వుఁబోండ్లు 120

చ. ఇటువలె జవ్వనంపుమద మెచ్చఁగ నెచ్చెలు లిచ్చ మెచ్చఁగా
    నటు నిటుఁ జెంత వారు చెరలాడఁగఁ గందువమాట లాడఁగాఁ
    జిటిపోటిగుబ్బచేల లిలఁ జీఱఁగఁ బల్మఱుఁ జేరఁ జీరఁగా
    జటి జపవిఘ్న మోరువఁగఁ జాలక చాలఁ గలంగి యిట్లనున్. 121

శా. ఓ లీలావతులార నేడు మొద లేయొయ్యారి వీక్షించు న .
     న్నాలోలేక్షణ యాక్షణంబునన కన్యాత్వంబు దూష్యంబు గా
     జూలా లౌ ననుచు శపింప మునిరాజుం జూడ శంకించి యిం
     దేలా యాటలు సాలుఁ జూలు నిఁక రారే యంచు వా రేఁగుచున్ . 122

సీ. మగడాలచికిలికమ్మలు డాయఁ దెలుపెక్కెఁ జెక్కి లేమనియోర్తు చెలియ నడిగె
    నీలకాంచీచ్ఛాయ నెరయ నీనూఁగారు మెఱసె నేమనియోర్తు మెలఁత నడిగెఁ
    గస్తూరి గరఁగి పైఁ గ్రమ్మ నేటిదె చూచుకములనల్పని యోర్తు కొంత నడిగె
    నళుకుచేఁ బరుగెత్తి యలసిరానేమొ యీయలసత్వమనియోర్తు గలికి నడిగె
తే. దారి నడచుచు నలజడదారికినుక
    దారితోత్సాహ లై తప్పి తారి యతని
    జూచితిమె యంచుఁ జూలాండ్ర,సొబగు లెంచి
    బ్రమసి యొండొరు నడుగుచుఁ బడఁతు లరగ. 123

వ. అంత. 124

ఉ. బిందునిరోధమందుఁ దృణబిందునినందిని తత్తపోవనం
    బిందునిభాననంబు గలయిష్టసఖీమణితోడఁ జేరి యం
    దంద చరించుచుండె భయ మన్న దొకింతయు లేక మౌనిసం
    క్రందనుఁ డప్పు డాడిన తెఱం గది విన్నది గాదు గావునన్ . 125

వ. ఇవ్విధంబున. 126

సీ. తనతనూసురభిళత్వము ఘమ్ముమనఁ గ్రమ్ముకొన గంధవహభావమనిలుఁడొండం
    దన కాంతిలతి లల్లుకొన వనీతరు లెల్లఁ గనకసాలశ్రీలఁ గని వెలుంగఁ
    దనమందహాసకుందములకై విరియునారిని గూర్ప మరుఁడు సారెకును దిరుగఁ
    దనకరారుణరుచుల్ ఘనలతాదులఁ దారసిలి నవ్యకిసలయావళుల నింప
తే. దనపలుకు చిల్కపలుకుతోఁ ద్రస్తరింపఁ, డననడలు నెమ్మికొమ్మలఁ దప్పుపట్టఁ
    దననఖాంశువు లిలకు గందంబు పూయ, రాజఋషి పుత్త్రి వనవిహారంబుసలిపె. 127

వ. ఇవ్విధంబున నవ్వనంబులోన నజ్జవ్వని విహరించుచుఁ దనతోడి ముద్దులాడిం
    బొడగానక యవ్వాలుఁగంటి యెటువోయెనో యని యొంటిగా నవ్వలం జనిచని.

                         §§§ పులస్త్యదర్శనముచేఁ దృణబిందునిపుత్త్రి గర్భిణి యగుట §§§
మ. కనకాంగీమణి కంచుగీచినగతిం గంఠంబు మీఱన్ జటాం
     తనిరూఢశ్రుతి పాఠ మొందినపులస్త్యబ్రహ్మవేదధ్వనిన్
     విని యారక్తజటాధరుం గుశతృణాన్వీతాసనస్థున్ మృగా
     జనవాసఃపిహితాంగు నజ్జటిలుఁ గాంచెం దత్సమీపంబునన్ . 129

మ. కనుగొన్నంతనె కన్యకామణికి లేఁ గౌ నింత గాన్పించెఁ జ
     న్మొనలన్ నీలిమ యావరించె ముఖపాండుశ్రీ మిటారించెఁ గు
     ల్కునడల్ గొంచెఁ గృశించె మే నరుచి యాలో మించె నా రుల్ల సిం
     చె నురుశ్రాంతి జనించె గర్భము రహించెన్ మించె నిట్టూరువుల్. 130

శ. ఈలాగున బాలామణి, చూలాలితనంబు దనకుఁ జొప్పబడిన మదిం
    జాలన్ జాలిం బడి యిది, యేలీల ఘటిల్లె హేతు వెయ్యదియొ కదా. 131

తే. పేరు ఋషి గాని మాతండ్రి పేరు పెంపు, గలమహారాజమణియట్టిఘనుకడుపునఁ
    బుట్టి యే నిట్టిఱ ట్టొడిఁ గట్టుకొన్నఁ, జెట్ట యని తిట్ట రే తోడిచేడెలెల్ల. 132

క. వచ్చిన వేళా గుణమో, యచ్చటి యోషధులమహీమ మిటు సేసినదో
     మచ్చరమునఁ గన్నెఱిక, మ్మొచ్చేము గన నెవ్వ రిటుల యొనరించిరొకో. 133

మ. కడు లేఁబ్రాయవుఁబూపచన్నుఁగవసింగారంబుఁ బోనాడి యీ
     కడుపున్ నేనును బోయి మ్రోల నిలువం గన్నయ్య కాపట్య మెం
     చఁడె విన్నయ్యలు విశ్వసింపుదురె యేసంబంధమున్ లేనియీ
     సడి నావంటిలతాంగికిన్ విధి ఘటించం జెల్లునే యక్కటా! 134

వ. అని చింతింపుచు. 135

మ. స్తనభారానత యై మదావృతసముద్యధర్భదౌర్బల్యసం
     జనితోచ్చ్వాసపరంపరాగతాకవోష్ణమ్లానితాస్యాబ్జయై
     కనదాలోకనిరోధిబాష్పకణ యై గాఢత్రపాక్రాంత యై
     జనకుం జేరి కుమారి యేమియు గణించన్ నేరకున్నంతటన్. 136

క. వంచినతల యెత్తక తన, యంచల నిలుచున్న కన్నె నట్టే యవలో
    కించి యొకించుక సంశయ, మెంచి వెఱ వహించి తండ్రి యిట్లని పలికెన్ .137

ఉ. ఎక్కడఁ బోయి తింత తడ వెవ్వరి కప్రియ మాచరించి తీ
    వెక్కఠినుండు నిన్ను శపియించె నిమేషములోన నీకుఁ జూ
    లెక్కరణిన్ ఘటిల్లెఁ దగ వెంచక యింతయకృత్య మెవ్వఁ డే
    దిక్కున నుండి చేసె నిది తెల్లముగా వివరింపు మమ్మరో. 138

చ. కుల మపకీర్తిఁ జెంద జనకుండును వెల్వెలఁ బోవ భాంధవా ,
    వలి దల వంపఁ దల్లి వగవం జెలికత్తెలు సిగ్గు సేటులం

      గళవళ మొంద నెవ్వఁడును గైకొన కేగఁగ జన్మనష్టిగా
      నళుకుఁ దొఱుంగి కన్నెఱిక మాఱడి వెట్టుదు రేమె కూతురా 139

మ. తలవంపుల్ ఘటియించి తందఱకుఁ గాంతా యింక నీ కేల యౌ
     దల వంపన్ వివరింపు మెట్లొదవె నేతద్దౌహృదశ్రీ యనన్
     జెలి బద్ధాంజలియై వడంకుచు భయ స్వేదంబుతో మోము వె
     ల్వెలఁ బాఱం దనుఁ గన్న తండ్రిఁగని పల్కెం బల్కు దొట్రిల్లఁగన్. 140

శా. ఏ నేపాప మెఱుంగ నాటలకుఁ దండ్రీ యీపులస్త్యాశ్రమ
     స్థానాభ్యంతర భూమికిం జని వయస్యాసంఘముం గానక
     చ్చో నే నొంటి చరింప నద్భుతముగాఁ జూ లేర్పడెన్ హేతువుం
     గానన్ నీచరణంబు లాన మదిఁ జక్కం జూడవే నావుడున్. 141

శా. ఆ రాజర్షి వరుండు పుత్త్రి వచనం బాలించి ధ్యానావధా
     నారూఢాంచితదృష్టిదర్పణముచే నాద్యంతముం జూచి యెం
     తే రోమాంచముతోఁ గుమారిఁ గని తల్లీ నిన్ను శోధింప కే
     నేరం బెంచితి వంతఁ జెందకుము సందేహంబు దీఱెన్ మదిన్. 142

మ. తనుఁ గన్గొన్నది గర్భ మౌ నని పులస్త్య బ్రహ్మమున్ పల్కె నా
     తనిశాపం బిది నీ వెఱుంగ కెదుటన్ దర్శింప నిట్లైతి విం
     దున నీ కేమికొఱంత యంచుఁ దృణబిందుం డప్పుడే పుత్త్రిఁ
     దోడ్కొని బ్రహ్మాత్మజుఁ జేరఁ బోయి భయభక్తుల్ మీఱఁగా నిట్లనున్ . 143

               §§§ తృణబిందుఁడు పులస్త్య సందర్శనముచే గర్భిణియైన §§§
                        §§§తనపుత్రిని బులస్త్య బ్రహ్మ కొసంగుట §§§
సీ. మునిచంద్ర సద్గుణంబున మించునీకన్యహస్తాభియు క్తి నీకగు వహింపు
     ప్రతిమహేశ్వర సతీత్వము గన్న దీశ్యామ మహిభృత్కుమారిఁ బ్రేమమున నేలు
     జటిల భాస్కర చారుసంజ్ఞ యీపద్మిని ఛాయానుసారిణి సమ్మతింపు
     మపరాత్మభవ నిర్మలాంగి యీమృదువాణి విద్యావతి దయార్ద్రవీక్ష జూడు

తే. యోగిచక్రేశ విను మిప్ప యోజపాణి, శ్రీవిలాసినిఁ బోలుఁ బరి గ్రహింపు
     శమధవర్షభకామితార్థము లొసంగు, సురుచిశుభరాశియీబంధుసురభిఁ బ్రోవు.

క. ఆతపమునందే నిలిచి మ, హాతపము లొనర్చి బడలి యరుదెంచిన మీ
      కీతరుణి కల్పలతవలె, శీతలసత్క్రియల నింపు సేయక యున్నే. 145

శా. అశ్రాంతశ్రుతిపాఠయత్న జనితాయాసంబు పంచాగ్ని మ
     థ్యశ్రద్ధాసహితప్రకల్పితతపస్యా కార్శ్య మత్యుగ్రయో
     గశ్రాంతిస్ఫురణంబు మాన్పఁ గల దీకన్యాలలామంబు మీ
     శుశ్రూషార్థము దీనిఁ గైకొనుఁ డటంచుం బుత్రి నర్పించినన్. 146

ఆ. ఆమహర్షి మిగుల హర్షించి రాజఋ, షీంద్రునుతఁబరి గ్రహించి మామ    సత్కరించి పనుప శౌరికి మామయా, నబ్ధికరణిఁ బొంగు చతఁడు సనియె, 147

సీ. స్నానంబుగావించి చనుదెంచునంతలో జపవేదిఁ దగురీతిఁ జక్కఁ జేయు
    జపనిష్ఠ యొనరించి చాలించునంతలోఁ జక్కఁగా దేవపూజకు నమర్చు
    దేవపూజ యొనర్చి తిలకించునంతలో షడ్ర సాపూర్ణ భోజనము పెట్టు
    భోజనం బై కరంబులు గడ్డునంతలోఁ బర్ణాజినములచేఁ బాన్పొనర్చుఁ
తే. బాన్పుపైఁ జేరునంతలో బడలి రని మ
    నంబునఁ దలఁచి తాలవృంతమున విసరి
    తొడలపై నంఘ్రు లుంచి యొత్తుచు ననేక
     సేవ లొనరించుఁ దపసి కచ్చిగురుబోఁడి. 148

ఉ. తోయములాడుచో నొడలు దోమెడుకూర్మి కొకింత యాఁకటన్
     గాయము డయ్యనీక యొడికంబుగ నన్నము పెట్టు ప్రేమకున్
     రేయిఁబగల్ సపర్య లొనరించుటకుం గరఁగెం దపస్వి లేఁ
     బ్రాయపుటాలి సేవలఁ గరంగరె యెంతటివారు రాఘవా. 149

చ. పలికినచో సదుత్తరము వల్కుటె కాని బహూక్తు లాడఁగాఁ
    దలకుట కెప్పు డేది యుచితం బది సేయుటకున్ మనోగతుల్
    దెలిసి మెలంగ నేర్చుటకు దీమసమున్ వినయంబుఁ దాల్మియున్
    గలుగుట కుబ్బి తాపసుఁ డొకానొకనాఁ డలకన్యలో ననున్ . 150

                               §§§ విశ్రవో బ్రహ్మజనన ప్ర కారము §§§
శా. ఓలీలావతి నీగుణంబులకు నాయుల్లంబు రంజిల్లె న .
    న్నాలోకింపఁగ నైనగర్భమున నీక స్మాదృశుం డాత్మజుం
    డీలోఁ బుట్టెడు నేఁ బఠించుశ్రుతి నీ వే వేళ నాలించి తా
    వేళ గర్భగుఁ డౌట విశ్రవుఁ డనన్ వీఁ డొప్పు లోకంబునన్ . 151

శా. సుధ్య గ్రేసరుఁ డప్రతర్క్యనియమాస్తోకక్షమాయుక్తప
    స్స్వాధ్యాయ వ్రతశీలుఁ డాగమరహస్యజ్ఞానవైజ్ఞానికుం
    డధ్యాత్మార్థవిశారదుం డుభయవంశాధారుఁ డబ్జాక్షురూ
    పధ్యానార్క విభానిరస్తతముఁ డీపౌలస్త్యుఁ డబ్జాననా. 152
క. మాతామహుఁడు బితామహుఁ, డీతనయునినడకఁ జూచి యింపొందుదురం
    చాతపసి యానతీయ స, తీతిలకము హర్ష జలధిఁ దేలుచు నుండెన్. 153
వ. తత్కాలంబున. 154
మ. శుభనక్షత్రమునన్ శుభేక్షగ్రహముల్ సూడన్ శుభోచ్చస్థితిన్
     శుభవేళం దృణబిందుఫుత్త్రి గనియెన్ శుద్ధాత్ము దేజస్వి నా
     త్మభవు విశ్రవు నాతఁడున్ సకలవిద్యావైదుషిం దండ్రి నా
     త్మభవుం బోలి తపంబునన్ నిలిపె స్వాంతం బంత బాల్యంబునన్ , 156

సీ. పూరుషాకారంబుఁ బొందుత్రయీవిద్య బాలత్వ మొందిన బ్రహ్మచర్య
    మూలోకగోచర యోధర్మ దేవత ప్రాణంబు లూనినభవ్యనియమ
    మవయవంబులు దాల్చినట్టివై రాగ్యంబు జంగమస్థితిఁ గన్న శాంతరసము
    వైయాత్య మొందినవైదికాచారంబు బ్రాహ్మణ్య మెనయుకృపాగుణంబు
తే. దానె యన విశ్రవో బ్రహ్మ తల్లిదండ్రు
    లనుమతి యొసంగ నొకతపోవనముఁ జేరి
    యాశలు జయించి వెలయుభూమీశులిల
    నాశలు జయించి తపము సేయంగఁ దొడఁగె 156

శ. రుచిరజటారుచికీల, ప్రచయమువోలం గుశా స్తరణపరివృత్తుఁడై
     దపము సే, యుచు నచ్చిఱుతజడదారి యున్నట్టియెడన్. 157

క. ఆమునితనయుఁ గృతేంద్రియ, యాముని యోగముఖభావితాంచత్ప్రాణా
    యాముని జపఫలితప్రతి, యామునిఁ గని రోమహర్షులైరి మహర్షుల్. 158

మ. శమసౌఖ్యామృతవార్ధిమగ్ను నతనిన్ జామాతఁగాఁ జేయుచి
     త్తముతో నుత్తమ తాపసుం డగుభరద్వాజుండు లేఁబ్రాయమున్
     గొమరం గల్గినపుత్త్రి దోడ్కొని రమాకోక స్తనిన్ దెచ్చి తొ
     ల్లి మధుద్వేషి కొసంగ వచ్చు భృగుపోల్కిన్ వచ్చి పల్కెన్ రహిన్, 159

క. వర్ణినిధానమ యీవర, వర్ణిని మత్పుత్త్రి దేవవర్ణిని యనఁగా
     వర్ణింపఁ దగిన దిది యా, కర్ణాంతవిశాలనయనఁ గైకొమ్మనియెన్ . 160

సీ. అలమందగమనంబు హంసబోధ మొసంగఁ గౌను నభోలక్ష్యగతిఁ బొసంగ
    మోవికెంజిగురు జపావృత్తి వహియింపఁ బలుచాయ లష్టాంగపటిమ నింప
    ఘననఖప్రభ తారకాయోగము గణింప నాననం బమృతకరాభ మించఁ
    గొమరుఁజెందు పిఱుందుగురుమహత్త్వముఁ దెల్పఁ జిఱునవ్వుముక్తానుసరణదాల్ప
తే. దనతపోరీతి కుచితమై తగిన దేవ, వర్ణినీనామకన్య నవ్వర్ణి దల్లి
    దండ్రులయనుజ్ఞ వరియించి తత్సమాగ, మమున సకలగృహస్థధర్మములునడపె.

                             §§§ విశ్రవో బ్రహ్మకుఁ గుబేరుఁడు పుట్టుట §§§
శా. ఈలీలన్ స్వగుణానుగుణ్యమతి యౌనిల్లాలితోఁ గూడి యా
     పౌలస్త్యుండు గృహస్థధర కలనాపారీణుఁ డై పార్వతీ
     రోలంబాలకయందు శంభుఁడు కుమారున్ గన్నయ ట్లాధరా
     స్ధూలాంచత్కటియందుఁ గాంచె నొక పుత్త్రున్ పుణ్య చారిత్రునిన్ . 162

చ. అవిరళ పుణ్యలీల యగునాశిశుసంభవ వేళ భారతీ
    ధవుఁ డరుదెంచి పౌత్రజునిఁ దప్పక కాంచి ధనేశ్వకుంకురుండు వీఁ
    డవు నిఁక విశ్రవోమునికులాగ్రణి గన్నయపత్య మౌట వై
    శ్రవణుఁ డనన్ జగంబునఁ బ్రశస్తి వహించు నటంచు నేఁగినన్. 163

చ. ఉపనయనంబు సేసి శ్రుతియుక్తునిఁ గా నొనరించి శాస్త్రముల్
    కృపఁ జదివించి ధర్మ మెఱిఁగించి హితం బుపదేశ మిచ్చి పు
    ణ్యపురుషుఁ డైనతండ్రి దను నన్నిట నేర్పరిఁ జేయ నాతఁడుం
    దపమున కేఁగె వంశ గతధర్మము మానరు సాధు లెయ్యెడన్ 164

వ. ఇవ్విధంబున వైశ్రవణుఁడు తపంబు సేయం జని. 165

క. ఆహుతులఁ బ్రజ్వరిల్లెడు, స్వాహావిభులీల బ్రహవర్చసము క్షమన్
     బాహుళ్య మొంద నియమో, త్సాహంబున నుగ్రతప మతం డొనరించెన్. 166

మ. మననిష్ఠన్ జలపాయి, యై పటుతటిత్కాంతిచ్ఛటన్ బెంజడల్
     దనరన్ మించె సహస్రవర్షము లనంతక్షాంతి వాతాశనం
     బున వేయేండ్లు క్రమించె మే నచలమున్ బోలన్ నిరాహారుఁ డై
     తను వాశింపక యేండ్లు వేయుఁ గడపెన్ ద్రైలోక్య మౌరా యనన్ 167.

సీ. పద్మాప్తగతి వహింపఁగలాఁడు గావున మొనసిపద్మాప్తాధిముఖ్య మూని
    మకర సంగతి మీద మనుఁ గాన మకర భీకరజలాకరతరంగముల నాని
    ఘనవిభావసుసమగ్రత ముందరికిఁ గాంచ ఘనవిభావసుమధ్యగత్వ మొంది
    యతనువర్ధనమైత్రి, నలరఁ బోయెడుఁ గాన నతనువర్ధనవృత్తి యవధరించి
తే. ఘోరతపములు నేసి మిక్కుటపుమహిమ, లవధరించినమునులు ప్రయాస మనుచు
    వర్ణన లొనర్పఁ ద్రిసహస్రవత్సరములు, తపము గావించె విశ్రవస్తనుభవుండు. 168

వ. అంత. 169

సీ. ద్వాదశ ద్వాదశాత్మాక కిరీటమణిప్రకాండదీధితులు లేయెండఁ గాయ
    భాషాబ్జపత్త్రదృక్పత్త్రాతపత్రముల్ స్థిరశరచ్చంద్రచంద్రికల నీన
    సురనదీతటిదురుస్పురణతోఁ దనతసూవరరుచుల్ బంగారువానఁ గురియఁ
    బ్రగుణాగమశ్రీలఁడగుఋషుల్ కిసలయోజ్జ్వలజటాగ్రముల నంజలులు దాల్ప
తే. గగురుపాటును వడఁకును గానిపింప, నెల్ల సుమనోవితానంబు నెనసి కొల్వ
    మంచుజిగిపట్టి పొగడ విరించనుండు, గరుణఁ బౌలస్త్యజునకు సాక్షాత్కరించె. 170

                       §§§ కుబేరునకు బ్రహ్మప్రత్యక్షం బై వరంబు లిచ్చుట §§§

క. పెన్నిధివలెఁ దన కిటువలె, సన్నిధిసేసినకడానిచాయల జేజే
   మన్నెదొర పెద్దఁ జూచి ప్ర, పన్నమతిన్ లేచి మ్రొక్కికి భయభక్తులతోన్. 171

పంచచామరము. హరామరాగ్త్రణిస్తుతావ్యయప్రభావభాస్వరా
    స్వరాదినైకలోకసృష్టిశాసనక్రియాదరా
    దరాబ్జహీరహారభాస్యుదారదార ధీపరా
    పరాఖ్యమంత్రభృన్మనోబ్జపద్మినీమనోహరా. 172

క. అని తనుఁ బొగడినమనుమని, వినయమునకు మెచ్చి నలువ వేఁడుము వత్సా
   నిను మెచ్చితి వరమిచ్చెద, నని వచ్చితి ననఁ బులస్త్యజాతజుఁ డనియెన్ . 173

తే. లోకపతి వైననిన్ను నేలోకపాల, కత్వమును హైమగర్భతఁ గన్ననిన్ను
    బహుధనాధీశ్వరత్వంబుఁ బ్రార్థనంబు, సేయుచున్నాఁడఁ గట్టడ సేయుమయ్య. 174

ఉ. కామితదాయి వైననినుఁ గన్గొనినంత ననంతలోకలో
    కామితి చింతితార్థము లయారె లభింపవె యంచు వేఁడినన్
    దామరచూలి వల్కె ధననాథపదంబు దిగీశ్వరత్వమున్
    నే ముదమంది నీకె కరుణించితి దేవత లెల్ల మేలనన్ 175

క. ప్రాగపరదక్షిణములకు, నీగిరిరిపువరుణయముల సృజియించి యుద
    గ్భాగమున కొకనిఁ దలఁపం గాఁ గలిగితి నీవు మేము కౌతుక మొందన్ 176

ఉ. పాలితసత్యధర్మ మగు బ్రహ్మకులంబునఁ బుట్టినట్టినన్
    నాలవవానిఁ జేయఁ దగునా యనఁ బోకు దిగీశ్వరాళిలో
    నాలవవాఁడ వై బహుధనస్థుఁడ వై మను మంచు మన్మనిన్
    లాలనసేసి ధాత యొకనవ్యవిమాన మొసంగి వెండియున్. 177

ఆ. పుష్పకాఖ్య మిది యపూర్వయానము దివ్య, పుష్ప కాయమానపూజ్యమాన
    మీవిమాన మెక్కి యెల్ల వేల్పులలోన, నీవి మాన కలరు మింక ననుచు. 178

                     §§§ కుబేరుండు దండ్రి యనుజ్ఞ వలన లంకం జేరుట §§§
     
మ. సవిశేషాదర భాష. లాడి యజుఁడున్ జన్నన్ ధనేశుండు వి
     శ్రవుఁ జేరన్ జని మ్రొక్కి తండ్రి, భవదాజ్ఞన్ బ్రహ్మ మెప్పించి యి
     ష్టవరంబుల్ గొని వచ్చితిన్ తగునివాసం బాయజున్ వేఁడ నై
     తి వినూత్న స్థల మెయ్య దెందు నిలుతున్ దెల్లంబుగాఁ దెల్పవే. 179

ఆ. ఈతి బాధ లేక యింతైనఁ బగవారి, చేతి బాధ లేక చెలువు గలుగు
    నట్టిగీము నలయు నానతి యిమ్మన్నఁ, బట్టిమోముఁ జూచి పలికె గురుఁడు. 180

మ. కల దీదక్షిణవార్థి మధ్యమున లంకానామదీవ్యత్పురం
     బలఘుప్రాక్తటినీవిటోత్క్రమణధుర్యావార్యహర్యశ్వర
     థ్యలసత్క్రూరఖురాగ్రసౌధగతపంకాలేపసంక్షాళనా
     కలితాకాశ తరంగిణీతరళరంగత్తుంగభంగాఢ్య మై. 181

 సీ. కనకకుంభప్రభాకలన బాలార్క విభ్రమముఁ జూపెడుగోవురములు గలుగ
     భర్త భూమిధరంబు పలురూపులాయెనో యనిమించునర్మహర్మ్యములుగలుగ
     హీరకాంతులచేతఁ దార కావళిఁ గేరులసమానలీలాచలములు గలుగ
     నగరీందిరాదేవి నడుమఁ బూనినకాంచి కొమరు గాంచిన పైఁడికోట గలుగ
తే. భూరి వైడూర్యతోరణస్ఫురితవిపణి, మార్గములు గల్గ స్వర్గసామ్యముగ విశ్వ
     కర్మ నిర్మించె నిర్మాణకౌశలమున, రాక్షసార్థంబు మున్నప్పురము కుమార, 182

శ. ముందు ముకుందునిభయమున, నందు నిలువ వెఱచి దైత్యులందఱు సుతలం
     బొందిరి నిర్బయపద మది, సెంది సుఖింపుమని తండ్రి సెలవిచ్చుటయున్ . 183

సీ. ఉపవనీరమ మారుతోత్పతత్కుసుమరాజీకైతవంబున సేస లిడఁగఁ
    బ్రాకార లక్ష్మివజ్రపు రాలతళుకుచేఁ దనమేన మంచిగందంబుఁ బూయ
    భర్మగోపురచరత్పారావతద్విజశ్రేణి పల్కులనె యాశీర్వదింప
    జరామార్గచిరత్నరత్నసౌధశ్రీలు గడురక్తి కుంకుమ గాన్క సేయఁ

తే, గేళిభూభృత్పరంపరల్ కేతనాంశు, కాప్తిఁ బావడ లూన ముక్తాశ్మధామ
    లలితరుచిధూతచంద్రకలంకఁ లంక, రాజసమునఁ బ్రవేశించె రాజ రాజు. 184

మ. ధనదుం డీగతి లంకఁ జేరి సురగంధర్వాప్సర స్సేవ్యుఁ డై
     తనయాజ్ఞోన్నతి నైరృతుల్ భయము జెందన్ దత్పురం బేలుచున్
     జనయిత్రిన్ జనకున్ గనుంగొనఁగ నిచ్చల్ పుష్పకారూడుఁ డై
     చనుచున్ గ్రమ్మఱుచున్ సుఖించె నతు లైశ్వర్యం బవార్యంబుగన్. 185,

తే. అని యదంభవచోనిగుంభనలఁ గుంభ, సంభవుండు పులస్త్యవంశక్రమంబు
    గొంత గెలిపిన విని శ్రీ రఘుప్రవీర,వర్యఁ డిట్లను నాశ్చర్యధుర్యు డగుచు.186

శా. ఓవింధ్యాచలగర్వనిర్హరణయాతోద్యోగ పూర్వంబు లం
    కావాసంబు సురారినాథులనికాయ్యం బంచు మీ రానతీఁ
    గా విన్నప్పటినుండి చిత్ర రసశంకాసంకులం బయ్యె మ
    ద్భావం బంతకు మున్న తాదృశబలుల్ దైతేయు లెవ్వారోకో. 187

ఉ. ఆదిఁ బులస్త్యవంశభవు లాసురముఖ్యు లనంగ వింటినే
    తాదృశరాక్షసాధికులు దానవు లంతకు మున్నె లంకలోఁ
    బాదుక యుందు రం చిపుడు వల్కితి రీదశకంధరప్రహ
    స్తాదులకంటె వీరవరు లైనసురారులు వార లెవ్వరో. 188

ఉ. వారికి వంశకర్త యగువారి తెఱంగులు వారి పేరులున్
    వారిబలోన్నతుల్ పిదప వారు ముకుందున కోడి లంకకున్
    జేరక పోవుటల్ జటిల శేఖర తెల్పుము విస్తరించి నీ
    చారుసుధారసోపమవచఃకలనన్ జెవు లింపు సెందెడిన్ . 189

ఉ. భానునిచే మహాతమముఁ బాయుతెఱంగున మాను మాదృశా
    జ్ఞానము మిమ్ముబోఁటిబుధచంద్రులచే నని జానకీబహిః
    ప్రాణము రామభూవిభుఁడు ప్రశ్న మొనర్ప దరస్మితంబుతోఁ
    దా ననియెన్ దథావిధకథావిదుఁ డమ్ముని సమ్మదంబునన్ 190

మ. రవివంశోత్తమ సంశయం బయినచోఁ బ్రశ్నంబు గావింప నే
     ర్తు వినన్ నేర్తువు సావధానముగ నిన్ స్తోత్రంబు సేయంగ మా
     కు వశంబే పరమేష్ఠినుండియును రక్షోవంశ మాద్యంతమున్
     వివరింతున్ వినుమం చగస్త్యుఁ డను బ్రావృట్కాలమేఘార్భటిన్. 191
.

                                      §§§ రాక్షసవంశోత్పత్తి క్రమము §§§
మ. హరినాభీకుహరారవిందమకరందానందనేందిందిరం
     బు రహిన్ మించి విరించి యంచితతపస్స్ఫూర్తిన్ జగత్సృష్టి వై
     ఖరిఁ బ్రాపించి మహాజలంబు దొలుతన్ గల్పించి తద్రక్షణా
     గరకాంక్షన్ సృజియించె సత్త్వముల సంకల్పం బనల్పంబుగన్ . 192

శా. ఆసత్త్వంబులు క్షుత్తృడాతురత బ్రహ్మన్ జేరఁగా వచ్చి వి
    శ్వాసంబుల్ గనుపింప నేమి యొనరింపన్ మముఁ బుట్టించి తీ
    వోసామీ యిపు డేమి సేయుదుము నా ను క్తీశుఁడున్ నవ్వుతో
    మీసామర్థ్యముఁ జూత మిజ్జలము నెమ్మిన్ బ్రోవుఁడీ నావుడున్ . 193

మ. జలసంరక్ష యొనర్తు మంచుఁ జని యాసత్త్యావళుల్ క్షుత్తృడా
     విలభావంబు వహింప కంబుహృతి గావింపంగ నుంకించి యం
     చల బ్రహన్ గని కొంచి కొన్ని యనె "జక్షామే” తిథాత్వర్థవా
     క్కలనన్ నీళ్ల వసించుకొన్ని యనె "రక్షామే” తివాగ్వైఖరిన్. 194

తే. అపుడు పరమేష్ఠి జక్షింతు మని పలికిన, జంతువులయక్షులగుచుఁ బ్రశస్తిఁ జెందుఁ
     డనియె రక్షింతు మనిపల్కినట్టివారి, రాక్షసులుగండనుచుఁ బల్కెరఘువరేణ్య. 195

                        §§§ హేతి ప్రహేతుల వృత్తాంతము §§§
ఆ. రామ యట్టి యక్షరాక్షకోటిలో, నెంచఁ దగినవీరు లిద్ద ఱైరి
    యెవ్వ రన లాయగ్ని హేతి బోలిన హేతి, హస్తదీప్రహేతి యగుప్ర హేతి 196

క. ఖేటప్రతివీరులు మధు, కైటభనిభవిక్రమప్రకారులు పటుబా ,
    హాటోపపేటు లాదిని, శాటులు హేతిప్రహేతు లద్భుత హేతుల్. 197

క. వారలయందుఁ బ్రహేతి యు, దారుఁడు కామాదిరిపువిదారుఁడు శ్రితమం
    దారుఁడు గుణనందితబృం, దారుం డనపేక్షితార్థదారుం డయ్యెన్ . 198

మ. భయదూరుం డలహేతి తాత పనుపన్ భార్యాకుమారస్పృహో
     భయసంగాత్మకుఁ డౌటఁ గాలభగినిన్ భద్రేభకుంభ స్తనిన్
     భయ యన్దానిఁ బరిగ్రహించె దశదిగ్బాగస్ఫురన్మల్లికా
     భయశఃపాండురమౌక్తికప్రతతి పై పై సేస గావింపఁగన్ 199

క. ఆశాతోదరి విద్యు, త్కేశుని సంధ్యాబ్దనికటదీపితవిద్యు
    త్కేశునిఁ దేజశ్ళోచి, ష్కేశునిఁ గనె హేతి ప్రీతి చెన్ను వహింపన్ . 200

శా. విద్యుత్కేశుఁడు తోయగాంబుజముఠీవిన్ దాతృకీర్త్యున్నతిన్
      విద్యాభ్యాసివివేకమున్ వలె మహాజ్ఞాని వైరాగ్యమ
      ట్లు ద్యోగస్థునికల్మిలీల హఠయోగోద్భాసియాయుర్గతిన్
      ఖద్యోతద్యుతి వృద్ధిఁ బొందెఁ బితృరక్షంజేసి నానాఁటికిన్ 201మ. నవవర్షాగమజృంభితాంబుదముచందానన్ మధుస్ఫూర్జితా
     టవిలీలన్ బటుయౌవనస్పురదవష్టంభంబునన్ బుత్త్రకుం
     డు విజృంభించినరీతి హేతి గని సుష్ఠు ప్రీతిఁ బ్రాపించి వా
     నివయోరూపనిగూఢికి దగినకన్నెం గాంక్ష గావింపఁగన్. 202

సీ. కమనీయకమలకోశములతో సమము లై కులుకుగుబ్బ మెఱుంగుగుబ్బ లమర
    నసమాననీలోత్పలసమానరుచు లొంది కలికిసోయగపువాల్గన్ను లలర
    శ్రీచందనస్యందనానందనరథాంగ పటిమ విస్తృతనితంబము రహింపఁ
    గంజరాగము మీఱుసంజకెంజిగితీరు వహియించి కెమ్మోవి వన్నెమిగుల

తే. నీరులసరులను బెన్నెఱు లిరవుకొనఁగఁ, దారకస్ఫూర్తి గన నఖోదార కాంతి
    సంధ్యవలె మించుసంధ్యాత్మజాలలామఁ, బ్రియకుమారునకాహేతి పెండ్లి సేసె. 203

శా. తత్కాలంబునఁ జారుగాత్రి, యగుసంధ్యాపుత్త్రి బ్రాపించి వి
    ద్యుత్కేశుండు శచీసమేతుఁ డగునింద్రున్ రోహిణీయుక్తుఁ డౌ
    సత్కాంతున్ గిరిజావిలోలుఁ డగుపశ్యత్ఫాలునిన్ బోలి య
    త్యుత్కంఠోత్థరతిక్రియన్ మదనదేవోపాస్తి గావింపఁగన్ . 204

ఉ. నీలపయోదయుక్చపల నీటున నాథునిఁ గూడి యొప్పునా
    సాలకటంకటాయువతి స్వాతిగతాంబుదవృష్టి శుక్తియున్
    బోలె నిజేశుతేజమున భూరితరంబుగ నంత గర్భమున్
    దాలిచి మందరాచలనితంబమునం దురుసాహసంబునన్ . 205

మ. పర లెవ్వారును గానకుండ నిజగర్భస్థార్భకున్ దద్ధరా
     ధరమధ్యంబున డించి వహ్నిజనితోద్యద్గర్భభారంబు మున్
     శరమున్ జేర్చినగంగఁ బోలి సుర తేచ్ఛాలోల యై జీవితే
     శ్వరుఁ జేరణ జనఁ బాప మెంచరుగదా చానల్ రఘుగ్రామణీ, 206

శా. ఆసంధ్యాతనయావిసృష్టశిశు వాస్యాంతస్స్ఫురన్ముష్టియై
    యాసన్నక్షితిభృద్గుహల్ బదులుమ్రోయన్ గాలజీమూతగ
    ర్జాసామ్యధ్వని రోదనంబు ఘటియించన్ నాగె సింహాదినా
    నాసత్త్వంబులు తద్ధ్వనిన్ బెదరి చెంతన్ జేర లే కేఁగఁగన్ . 207

వ. అప్పుడు. 208

సీ. బలుకెంజడలతోడఁ దెలిగన్నెరులవన్నె గలక్రొన్నెలవతంసంబుతోడ
    వలుఁదశూలముతోడ నలినుబ్బునలమబ్బు వెలిద్రొబ్బగరళభృద్గళముతోడ
    గిబ్బత త్తడితోడ గిరిరాజు హరిరాజుఁ గరిరాజు నగు మేని కాంతితోడఁ
    బునుకకంచముతోడ ననతూపులనయేపు గన నోపుదొరబూదిమినుకుతోడఁ
తే. బ్రమథతతితోడఁ బార్వతీప్రమదతోడఁ, గరిముఖాదికుమారవర్గంబుతోడ
    శివుఁడు మంథానగిరితుంగశృంగవీథిఁ, జెలువుమీఱంగ స్వారివేంచేయునపుడు.


                               §§§ సుకేశుం డను రాక్షసుని వృత్తాంతము §§§
శ. వాపోయెడుసంధ్యాతన,యాపత్యముదిక్కుఁజూచె నభవుఁడు కారు
    ణ్యాపారసుధాపూర, వ్యాపార కటాక్ష వీక్షణాతిశయమునన్ . 210

క. అంగజహరుఁ గని ప్రియ మెన,యంగ జగజ్జనని గిరిజ యవధా రహిరా
    డంగద యీపసిపాపని, యంగదఁ బాయంగఁ జేయ నర్హం బనినన్. 211

మ. ప్రియురా లాడినమాట దాఁటక పురస్త్రీచిత్ర కక్షాళనా
     క్షయదుర్ధర్ష శరుండు శంభుఁడు దయాంచద్బుద్ధిఁ దద్బాలుఁ జూ
     చి యమర్త్యత్వము మాతృసన్నిభవయశ్శ్రీస్ఫూర్తియున్ విశ్వది
     గ్జయ తేజంబు నభశ్చరత్పురముఁ గల్గంగా వరం బిచ్చినన్. 212

శా. శ్రీ గౌరీజలజయతాక్షి పలలాశిశ్రేణికిం గూర్మి స
    ద్యోగర్భాతిశయప్రసూతులును సద్యోయౌవనప్రాప్తి స
    ద్యోగాఢ ప్రతిభాపరాక్రమాజయోద్యోగంబు లిచ్చెన్ లస
    ద్యోగారూఢమనః ప్రసన్నుఁ డగు కాంతుం డట్టు లౌఁ గాకనన్. 213

క. దేవికి వేడుక యవు నని, దేవరయును వరము లొసఁగ దేవరఁ గనుచున్
    దేవియు సాటికి బేటికి, దీవింపఁగ దైత్యశిశువు తేజము నొందెన్ , 214

చ. జనని సుఖంబె కోరి కని శైలతటంబునఁ బాఱ వైచి పో
    యినశిశు వేడ వానికి యతీంద్రులకున్ గనరానివేలుపుల్
    గనఁబడి కోర నేరఁ డని గాఢవరంబు లొసంగు టేడ య
    ద్దనుజుని పూర్వజన సుకృతం బెటువంటిదొ గాక రాఘవా. 215

ఉ. ధారుణిలో నరక్షితుఁడె దైవసురక్షితుఁ డందు రార్యు లౌ
   వా రది యట్టులుండె రఘువంశసుధాంబుధిచంద్ర, వింటివే
   యారజనీచరార్భకుఁడు నంత సుకేశుఁ డనన్ బ్రసిద్ధుఁ డై
   గౌరియు శంభుఁడున్ బనుపఁగా శివదత్తపురానువర్తి యై. 216

సీ. జలజాత రాగమండలపిచండిలమండలావిష్టుఁ డగుభాను ననుకరించి
    తపనీయదివ్యరత్నవిమానసంచరిష్ణుత నిర్వహించుజిష్ణుని హసించి
    బహుయోజనాయత ప్రథమానరథమెక్కి చరియించుపూర్ణిమాచంద్రు దెగడి
    కనకాచలాంగసంగతపతంగపతంగవాహానుం డగువిష్ణువైఖరి నగి

తే. గగనబహుపాద్ధరారుహాగ్రము స్వకీయ పురమణీదీ ప్రవప్రగోపురవిభామ
    తల్లి కావల్లికా శ్రేణు లల్లి కొన సు, కేశుఁ 'డలరారె నంబర కేశుకరణ. 217

క. ఆమనుజాశిస్తోమల, లామునికీర్తిప్రతాపలావణ్యంబుల్
    గ్రామణి, యనుగంధర్వ, గ్రామణి తిలకించి కౌతుకం బలరారన్. 218

సీ. వేణికారుచిఁ గృష్ణ విభవంబు వహియించి ముఖదీప్తిఁ బూర్ణసోముని గ్రహించి
    తనుకాంతిఁ గనకగర్భనిరూఢిఁ బ్రాపించి స్తనలీల గిరిజాతఘనతఁ గాంచి

     వరనాభిగతి దేవవల్లభోన్నతి నొంది మధ్యరీతి ననంగమహిమఁ జెంది
     కటితటస్ఫురణఁ జక్రహితాభ్యుదయ మాని నడలచే శిఖివాహనటన మూని

తే. సౌరభంబున సుమనఃప్రసక్తి మీఱి, యఖిలమనోగుణంబుల నతిశయించు
     దేవవతి యనుతనకన్యఁ దెచ్చి యిచ్చె, నలసుకేశాఖ్యునకు భానుకులవరేణ్య, 219

                          §§§ సుకేశుండు దేవవతిని వరించి మాల్యవదాదులం గనుట §§§
శా. రక్షో రాజ్యరమావధూటి యనఁగా రంజిల్లునప్పద్మ, ప
     త్త్రాక్షిన్ బెండిలి యై సుకేశుఁ డధనుం డర్థంబుఁ బ్రాపించిన
     ట్లీక్షీణస్పృహ మించె నద్దివిజకన్యారత్నమున్ నిర్జరా
     ధ్యక్ష్యున్ జెందుపులోమజన్ దెగడె దీవ్యద్భోగభాగ్యోన్నతిన్ . 220 .

చ. కరియుఁ గ రేణువున్ బెనఁగుకైవడి నిచ్చలు హెచ్చుమచ్చికల్
    దొరసి సుఖంచువారలకుఁ దోడనె పుట్టిరి పావక త్రయ
    స్ఫురణఁ ద్రిలోకసంగతిఁ ద్రిపూరుషమంత్రగతిన్ ద్రినేత్రవై
    ఖరి ద్రిగుణంబులున్ బలెఁ ద్రికాలములట్టుల మువ్వురాత్మజుల్. 221

                                  §§§ మాల్యవదాది రాక్షసుల చరిత్రము §§§
మ. వియదంభోమరుదున్నతిన్ వెలయునవ్వీరత్రయిన్ సద్విరా
     జియశోనిర్మ లమాల్యవంతుఁ డన మించెన్ మాల్యవంతుండు ద్వి
     ట్చయ సంపత్కుసుమాలి నాఁ దదనుజాంచత్ఖ్యాతి గాంచెన్ సుమా
     లియుఁ దేజోవిజితాంశుమాలి యయి పొల్చెన్ మాలి తద్భ్రాతృతన్. 222

శా. ఆరక్షస్త్రితయం బుపేక్షితమహావ్యాధి త్రయంబున్బలెన్
    దారుణ్యంబు వహించి తండ్రికరణిన్ దా నెంతయున్ దేవతా
    కారుణ్యంబులఁ గామితంబులు గనంగా నెంచి యంచత్తపః
    ప్రారంభంబు వహించి కాంచనగిరి ప్రత్యంతశైలస్థ మై. 223

శా. కీలాలం బని నీరు గ్రోలురహి సుక్కించెన్ బలాశంబు లం
     చాలోకించుట మానెఁ బర్ణముల మధ్యాఖ్యన్ బ్రవ ర్తింపఁగాఁ
     జాలించెన్ విరిదేనె చాయ దొరయన్ జన్నన్ రవిద్రోహదు
    శ్శీలంబౌ నని రాక్షసత్రయి విసర్జించెన్ దరుచ్ఛాయయున్ . 224

మ. అతిలోకం బగుతాల్మి తోఁ దపము లిట్లారాక్షసుల్ సల్పఁగా
     యతిలోకం బరుదందె నంతటఁ దదీయప్రాంచితాచారసూ
     నృతసంభావ్యమహాతపోజనితవహ్నిజ్వాలికామాలికా
     హతి ముల్లోకములున్ దపింపఁ గని భాషాధీశుఁడుద్భ్రాంతుఁ డై . 225

               §§§ మాల్యవదాదులకుఁ బ్రత్యక్షమై బ్రహ్మ వరంబు లొసఁగుట §§§
సీ. పలలభోజనతపోనలమువేఁడిమి నంచతేజి బంగరుఱెక్క తేజరిల్ల
    దోషాచరతపోగ్నిధూమాళి భారతీధవలాక్షి కొప్పుపూదండ లాన


    దనుజ త్రయీతపోదమునస్స్ఫులింగముల్ మహనీయముకుటాగ్రమణులనొరయ
    దైత్య మూర్ధన్య మూర్ధజతపశ్ళిఖశిఖాచయముచే సావిత్రి మెయి సెమర్చ

తే. నుగ్రనిష్ఠాగరిష్ఠు లై యుగ్ర మహిమ, నుగ్ర తపమును గావించుచున్న రాక్ష
    సాగ్రణుల చెంత కరుదెంచి యట్టెకాంచి, వెఱఁగుమించి విరించి దీవించి యనియె. 226

ఉ. ఇంకఁ బ్రయాస మొంద వలదే మిము మెచ్చితిఁ గోర్కు లిచ్చెదన్
    శంకఁ దొఱంగి లెం డసురశంకరులార యటంచు భారతీ
    పంకజలోచనాకచవిభాసురకేసరవాసనాగతా
    హంకరణాళిఝంకరణహారిమృదూక్తుల నానతిచ్చినన్ . 227

మ. అమృతాంభోధితరంగ ఘుంఘుమరవోద్యత్తన్మృదూక్తిన్ గత
     శ్రము లై కన్నులు విచ్చి రాక్షసులు సాక్షాత్కార మైయున్న బ్ర
     హ్మాముఖాంభోజముఁ జూచి లేచి భయకంపావా ప్తి సాష్టాంగదం
     డము లర్పించి నుతించి రిట్లని లలాటన్యస్తహస్తాబ్జులై . 228

మ. పురుషుం డంచుఁ బరేశ్వరుం డనుచు వేల్పుంబెద్ద యంచు మహే
     శ్వరఁ డంచుం బరమాత్ముఁ డంచు శ్రుతిశాస్త్రజ్ఞాన పారీణు లే
     ర్పఱుపం జాలక పెక్కు భేదముల నేభవ్యాత్ము నూహింతు రా
     పరమేశున్ నినుఁ గొల్తు మేము శుభముల్ ప్రాపింప నశ్రాంతమున్. 229

శా. ఆశాస్యంబులు నీవలెన్ నతుల కీయన్ జాలు జేజే గలాఁ
     డే శశ్వత్కృప మాయెడన్ నిలిపి తండ్రీ ప్రోచెదేనిన్ సమ
     స్తాశాధీశ జయప్రతాపములు దీర్ఘాయుస్సదారోగ్యవి
     ద్యాశాలిప్రతిభల్ పరస్పరహితత్వంబున్ బ్రసాదింపవే. 230

క. ప్రభవిష్ణుల మై యెందును, నభివృద్ధి వహింతు మనుచుఁ బ్రార్థించినఁ బ
    ద్మభవుం డాదరమున న,య్యభిమతము లొసంగి చనియె నాత్మీయులతోన్ .231

వ. అంత. 232

                                    §§§ మాల్యవదాదులు లోకంబుల బాధించుట §§§
శా. భాషానాథవరప్రదానవిలసద్భాహాబలాటోపు లై
    దోషాటాధిపతుల్ మదాంధత సుధాంధోముఖ్యులన్ గెల్చి త
    ద్యోషారత్నములన్ గ్రహించి మునులన్ దూలించి సాధ్యాదులన్
    రోషాగ్నిన్ దపియింపఁ జేసి సురవైరుల్ మెచ్చ వర్తించినన్ . 233

 సీ. పట్టు గానక బయల్ వట్టి రాదిత్యులు ఖచరుల త్రోవలు గట్టువడియె
     దీను లై గరుడులు దెస సెడి పాఱిరి తుషితులు బడలికతోఁ దిరిగిరి
     వసువులు పేదలవలె గాసిఁ జెందిరి గమిఁ బాసి రుద్రులు గాడుపడిరి
     యడ్డగింపులకు లోనైరి మరుత్తులు చేరిరి గిరిగుహల్ సిద్ధవర్యు

తే. లోడి గంధర్వు లూడనిఁ బాడి రచ్చ,రలకుఁ జెఱ లుప్పతిలె మహారాజికులకుఁ
    గలిగె దలగంప దింపనివలసపాటు, రాక్షసులు సేయురాయిడి రఘువరేణ్య.

క. నిరయగతు లైన ప్రాణుల, కరణిన్ రక్షకుని నొకనిఁ గనక సుకేశా
    సురసుత బాధిత భువనాం, తరగతు లాపదలఁ బడిరి తత్కాలమునన్. 235

శా. ఆరాత్రించర శేఖరుల్ ముగురు నిట్లాదిత్యహృద్భీకర
    స్వైరస్ఫారవిహారులై తమకు భూస్వర్గంబులీలన్ మనో
    హారం బౌనగరం బొనర్చుటకుఁ గా నర్థించి శిల్పప్రభా
    ధౌరేయుం డగువిశ్వకర్మఁ దలఁపన్ దద్ధన్యుఁ డే తెంచినన్ . 236.

ఉ, మాల్యవదాదు లి ట్లని రమర్త్యులకల్మియు బల్మి కీర్తిబా
    హుళ్య మెఱింగి వారికి యథోచితగేహము లీ వొనర్పఁ బ్రా
    బల్యముఁ జెందె నీచతురభావము దిక్కుల నోయి శిల్ప కౌ
    శల్యనిధాన మాకు నిఁక సద్గృహముల్ రచియింపఁగాఁ దగున్. 237

మ. హిమవత్పర్వతమౌళిమీఁద నయినన్ హేమాద్రిపై నైన మం
     థమహీధ్రాగ్రణిమీఁద నైనఁ గలధౌతక్షోణిభృచ్చృంగతుం
     గమణీగోపురసౌధయూథములు గల్గన్ మాకు నిర్తింపు గే
     హము లంచున్ వచియింప నయ్యమరశిల్పాచార్యవర్యం డనున్ , 238

                    §§§ విశ్వకర్మవలన నెఱింగి మాల్యవదాదులు లంకఁ జేరుట §§§
ఉ. దక్షిణవారిరాశితటధారుణి భాసుర మౌఁ ద్రికూటనా
    మక్షితిభృద్వరేణ్య మసమానమణీమయసానుసంపదన్
    దక్షిణదిక్త్రికూట మనఁ దద్గిరిశృంగమునం దొనర్చితిన్
    రాక్షసులార ము న్నొకపురం బసురేంద్రునియాజ్ఞ పెంపునన్. 239

వ. అదియును షష్టియోజనవిస్తీర్ణంబును శతయోజనాయతంబును వినిర్త లముక్తా
ఫలనిర్మితనర్మహర్మ్యచ్ఛవిచ్ఛటాధవళితహరిదశ్వహరిత్తురంగంబును నుత్తుంగ గోపురోపరిద్వారాంతరస్థాపితకాంచన పాంచాలికాబాలికా స్తనాంతరక్షౌమ పటోత్తరీయాయితవియత్తటినీతరంగంబును వాసవకృతత్రాసనీరాసార్థవనరాశి సమానీత కలధౌత గిరిపోతతులితలలితమణిమయ క్రీడాచలవిరాజమానంబును నిజవైభవాధఃకృతసమగ్రసౌభాగ్య లక్ష్మీప్రార్థనానిమిత్తసమాగత భోగవతీపురవ్యంజకపరిఖాయితాంభోధిగతాత్మప్రతిబింబంబును
శతకోటి శివాలయనీల ప్రాకారజాలప్రభాభిధముధాభ్రమర సముదయారణ కమలాయిత కమలహిత మండలంబును నాయికోచిత మరకత మణిమయ ఘననివసనకనకవసనగగనలక్ష్మి ప్రకల్పితపుష్పోపహారాయితతారాప్రతానంబును వనపవనచలితలతాప్ర తానపతత్ప్రసూనపరిమళమిళితపరాగవాసితాజాండకరండంబును సమస్తవస్తువిశేషంబులకు జన్మనివాసంబును నఖిల విభవలక్ష్మీవిలాసంబులకు వీడుపట్టును నై కనుపట్టునట్టుగా గంగాదిశకునదుష్ప్రవేశంబును టంకాగ్రవిచ్ఛిన్న చతుర్దిశా

వకాశంబును నగుత్రికూటశిఖరిశిఖరప్రదేశంబున స్వర్గలోకవస్వౌకసారాది దిక్పాలపురంబులు నిర్మించి యాఱితేఱినశిల్పనైపుణ్యము మెఱసి నిర్మించిన యాలంకాపురంబు మీకాఁపురంబునకుఁ దగు నందు నిలువుం డని వెండియు విశ్వకర్మ వారలం గనుంగొని. 240

శా. లంకాదుర్గముఁ జేరి శాత్రవులకున్ లక్ష్మింపఁగా రాకని
     శ్శంకఖ్యాతిఁ గనం గలా రని గణించన్ శిల్పసమ్రాట్సుధా
     సంకాశోక్తుల నుత్సహించి బహురక్ష శ్శ్రేణితో దోర్బలా
     హంకారంబునఁ జేరి రప్పురి నిశాటాధ్యక్షు లొక్కుమ్మడిన్ 241

                     §§§ మాల్యవ దాదులు వివాహ మై పుత్రులం గాంచుట §§§
శా. ఆలేఖద్విషదగ్రగణ్యులభుజాహంకారతేజోవయ
     శ్శ్రీ లెల్లం దిలకించి నర్మద యనం జెల్వొందుగంధర్వి సు
     శ్రీలావణ్యగుణాభిజాత్యములహ్రీశ్రీకీర్తులన్ బోల్ప నౌ
     స్త్రీలన్ మువ్వుర నిచ్చె నాత్మసుతలన్ జ్యేష్టానుపూర్వంబుగన్ . 242

తే. నర్మద వళిప్రహసితమహోర్మికలిత, నర్మద సుపర్వసతి యయ్యు దుర్మదులకు
     నసురులకు నెట్లోసంగెఁ గన్యకల ననకు, కలిమిగుణ మట్టి దిక్ష్వాకుకులవరేణ్య.

చ. మరుఁడు త్రిలోక మోహకరమాత్రనిగుంభితమార్గణ త్రయిన్
    దరుణులు గా నొనర్చి భువనత్రయభీకరరాక్షసత్రయిన్
    మరలున ముంప నంపెనొ యనన్ దగునజ్జవరాండ్ర మువ్వురన్
    బరిణయ మై యమర్త్యులక్రమంబున వారు సుఖించి రంతయున్ . 244

వ. అంత. 245

క. సుందరి యనునిజసుందరి,యందుఁ గనియె మాల్యవంతుఁ డాత్మజ నొకతెన్
   నందనుల నేడుగుర విను, మందఱనామములు దశరథాత్మజతిలకా. 246

                     §§§ మాల్యవదాదులకు వజ్రముష్ట్యాదిరాక్షసులు పుట్టుట §§§
మ. అనిశక్రోధుఁడు వజ్రముష్టియు విరూపాక్షాఖ్యుఁడున్ దుర్ముఖుం
     డును సుప్తఘ్నుఁడు యజ్ఞోకోపుఁ డనువాఁడున్ మత్తుఁ డున్మత్తకుం
     డనలానామకుమారియు బొడమినః హర్షించె నమాల్యవ
     న్మనుజాశీంద్రుఁడు పుత్త్రవంతుఁడును సంపన్నుండు నై రాఘవా 247

క. కేతుమతి దృఙ్మిషాంగజ, కేతుమతి సుమాలిసతి శుకీవాణి తనూ
      జాతలఁ దనుజూతులఁ గనె, సీతాధిప వారిపేళ్లు సెప్పెద వినుమా. 248

వ. సుప్రహస్తుం డనన్ దగుప్రహస్తుండును రణస్థలాకంపనుం డగు నకంపనుండును సురవికటుండగు వికటుండును విధ్వస్తశత్రురథన్యస్తశకటీముఖుండగు శకటీ ముఖుండునున్ బరషరుషానలధూమ్రాక్షుం డగుధూమ్రాక్షుండును నుద్దండ భుజాదండుండగు దండుండునున్ జతురంగ బలాకాంతసుపార్శ్వుండనన్ దగు

సుపార్శ్వుండును నశనిసంహ్రాది యగుసంహ్రాదియున్ దనుప్రభాప్రహసితోద్దీప్రఘనుం డగుప్రఘనుండును మాగధీభూతసుస్తవనశ్రవణసముదాసకర్ణుం డగుభాసకర్లుండునుఁ బుట్టి దిట్టతనంబున్ జేపట్టి రట్టిరట్టడివీరులకుఁ దోఁబుట్టువు లై బాలయున్ బుప్పోత్కటయున్ గైకసియున్ గుంభీనసయు ననన్ దగు కన్నెలు చెన్నువహించి రంత.
249
మ. వసుదావోపశమాంబుద ప్రతిమదీవ్యద్గాత్రుఁ డమ్మాలియున్
      వసుదారిద్ర్యయుతుండు పెన్నిధులఁ జెందన్ గోరుచందంబునన్
      వసుదాభామినిఁ గూడి శౌర్యనిధులన్ వాంఛించి విద్విడ్విభా
      వసుదాయాదులఁ గాం చెఁ బుత్రులఁ జతుర్వారాశిసంకాశులన్ . 250

క. సరసుం డనలుఁడు ననిలుఁడు, హరుఁడున్ సంపాతి యనఁగ నల్లనలువురున్
     బురుషార్థంబులవలె నొ,ప్పిరి రాఘవ వారెకద విభీషణమంత్రుల్. 251

మ. ఇటు లమ్మాల్యవదాదు లాత్మజులతోఁ నింద్రాదిదిక్పాలకో
     త్కటసంపద్గరిమంబుతోఁ ద్రిభువనత్రాసప్రదోద్యద్భటో
     ద్భటధాటీఘటితార్భటీపటిమతోఁ దా రందఱున గూడి ము
     న్పటిలీల గరడోరగామరమునీంద్ర శ్రేణి బాధింపఁగన్ . 252

                  §§§ సురలు మునులు శివునిపాలి కరిగి యసురులం బరిమార్ప వేఁడుట §§§
ఉ. వారియుపద్రవంబున నివారిత వైభవు లై సమస్తబృం
     దారకులు వసింపఁ దగుతా విఁక నెయ్యది యేది త్రోవ యె
     వ్వారికి విన్నవింపుదము వైరులరా పని చింతఁ జేసి యి
     బ్బారి పురాపహారి యెడఁబాపఁ గలాఁ డని నిశ్చితాత్ములై. 253

తే. శ్వేతరుచిభూతిఁ దగి భవ్యశృంగకలనఁ, దనరి గజముఖసంయుక్తిఁ గని యనంత
     పాదకటకాప్తి నెంతయు బాగు మీఱి, శివునివలె నున్న కైలాసశిఖరిఁ జేరి,254

సీ. అహిరాజ భూషణుం డైనయా వేల్పు మాయహిభయం బేరీతి నడఁచు ననక
    యెపుడుఁ గుత్తుక విషం బిడుకొని మాటాడు నితనిమాటలు నమ్ము టెట్టు లనక
    తనవారితనముతోఁ గనుఁ బుణ్యజనుల నీయన పుణ్యజనవైరి యౌనె యనక .
    త్ర్యంబకుం డితఁ డనేకాంబకుల్ దేవతారివు లెట్టువారి నిర్జించు ననక
తే. యల సుకేశకుమారసంహారమునకు
    నెట్టు లొడఁబడు నితఁ డన కింద్రముఖ్యు
    లటుల యాపన్నులై భద్రవటమునీడ
    నిండుకొలు వున్న పార్వతీనేతఁ గనిరి. 255

క. కనివినయముభయమును బెనఁ,గొనఁగరములు మొగిచి శివునకును బహుసాష్టాం
   గనమస్కృతు లొనరిచి యి,ట్లని పొగడిరి మునులఁగూడి యమరేంద్రముఖుల్

   మత్తేభగర్భితసీసము
   అభవ కందర్పమదాప హానలదృశా పద్మారికోటి ప్రభా జోహారు

     సుకవిసంస్తుత్య రజోగుణేతరమతీగౌరీవధూనాయకా జొహారు
     ప్రభవకుంభీంద్ర విభంజనక్రమహరిబ్రహ్మాదిదేవాధిపా జొహారు
     త్రిభువనాధీశ్వర దేవసంయమిమనఃపూజావిధేయత్మకా జొహారు

తే. చంద్రశకలశిరోవతంసక జొహారు, సురధరాధరణోదండధర జొహారు
    శరధిక న్యామనోహరశర జొహారు, ప్రణతరక్షావిచక్షణేక్షణ జొహారు, 257

చ. రతిపతి వైరి శంకర పరాకు సుకేశ సురారినందన
     త్రితయము చేతి బాధ నతిదీనుల మై గతిమాలి లోకసం
     తతులకు దిక్కు నీ వగుటఁ దావక పాదము లాశ్రయింప వ
     చ్చితిమి దయా ప్రసక్తి మముఁ జేకొని విన్నప మాదరింపవే. 258

ఉ. కాలిచి రాశ్రమావళులఁ గార్ముకముక్తశరాగ్ని కీలలం
    బ్రేలిచి రెల్లదేవతల భీరులఁ జేసిరి సిద్ధముఖ్యులం
    దాలిచి రుగ్రరూపములు దైవగృహాంతరగోపురాదులన్
    గూలిచి రేమి దెల్పెదము క్రూరసురారుల చెయ్వులీశ్వరా. 259

సీ. పద్మాసనస్థు లై ప్రణవంబు నొడువుచు ముక్కుఁ బట్టఁగఁ బాసె మునివరులకు
    నేపట్లనైన స్వాహాపూర్వముగ హవ్య మగ్ని వేల్వఁగఁ బాసె యజ్వలకును
    హావిరన్న కాంక్ష నేసవనకర్త గృహంబు దేఱి చూడఁగఁ బాసె దేవతలకు
    గుహలలో నొంటిగాఁ గూర్చుండి నీ పాదచింత సేయఁగఁ బాసె సిద్ధులకును

తే. జేరి గురుకులవాసంబుఁ జేసి శ్రుతులఁ, జదువుకొనఁ బాసె నీ బ్రహ్మచారులకును
    బార్వతీనాథ మాల్యవత్ప్రముఖదైత్య, శేఖరులు సేయునాజ్ఞావిశేషమునను.

ఉ. ఏమె యజాచ్యుతేశ్వరుల మేమె దినేశహుతాశనక్షపా
    కాముల మేమె యింద్రయమకంధివరేణ్యుల మంచు భీమసం
    గ్రామకుతూహలంబున జగత్త్రయమున్ బడలించురాక్షస
    గ్రామణులన్ హరించి మముఁ గావఁగదే శివ యంచు మొక్కినన్. 261

శా. ఆముక్కంటి దరస్మితంబున సుపర్వాధీశులన్ జూచి మీ
    తో మోమోటము లేక తెల్పెద నవధ్యుల్ రాక్షసుల్ వారలన్
    నే మర్దింపఁగ నోప వారి గెడపన్ నేర్చున్ ముకుందుండు మీ
    రీమంత్రం బెద నమ్మి శౌరిఁ గనఁ బొం డిష్టార్థముల్ సేకుఱున్. 262

క. దితిజాహితుచేఁ దక్కఁగ, నితరులచేఁ జెడరు వార లిది నిజమని య
    య్యతనుహరం డాడిన నా, శ్రితహిత మొనరింప మీకే చెల్లు నటంచున్ . 263

                                  §§§ ఇంద్రాదులు విష్ణునియొద్దకుఁ బోవుట §§§
శా, ఆకైలాసనివాసు వీడుకొని కార్యైకాతురత్వంబునన్
     బాకార్యాదులు వోయి బాడబశిఖిప్రజ్వలికా సంగతిన్

     బైకిన్ బొంగుచు ఫేనమాలికలతో బల్ మ్రోతయున్ గన్నక్షీ
     రాకూపారముఁ జేరి తజ్జలధిమధ్యద్వీపదేశంబునన్. 264

సీ. కడలిరాయఁడు మిన్న గలమిన్న గమిడాఁప ఘటియించుబంగారుకణఁజ మనఁగ
     జలధిమధ్యమునందు జనియించినసహస్రపత్త్రశోభిత హైమపద్మ మనఁగఁ
     దెలిదీవిపుడమిముద్దులగుమ్మ నిజవలగ్నమునఁ బూనుసువర్ణఘంట యనఁగఁ
     బాధోధిసుతవీడుపట్టుచొక్కపుగుడారంపుహొంబట్టు సరాతి యనఁగ
తే. నలువు మీఱినవైకుంఠనగరిపసిడి
     గోటఁ బొడగాంచి మ్రొక్కుచు గోపురంబు
     దఱియుఁ జొచ్చి మహోన్నతగరుడకేతు
     రాజి నలరారుహరిహజారంబుఁ జేరి. 265

చ. తెలిమగఱాతికంబములఁ దీఱినబంగరుకీలుబొమ్మగుం
    పులకు మెఱుంగుఁగొప్పుసొలపుల్ మొలపించెడుకప్పురాలలో
    పలఁ గలకల్వచప్పరఫువన్నెలఁ జెన్నగునొక్కమేడలో
    నలరుచు నేకతంబ కొలు వైనహరిన్ విని రాదిశాధిపుల్ . 266

క. విని సమయ మౌనో కాదో, యని యించుక నిలిచి యచట నవసరపుఁ జెలిన్
   గని స్వామికి మాయాగతి, వినిపింపం దగు నటంచు వేఁడిన నదియున్. 267

సీ. తిలకంబు దిద్ది దిద్దితిఁ జూడు మనురమాసుదతిచెక్కుల నీడఁ జూచువాని
    మొనపంటమడుపువేఁడిననీళ యొసఁగనందుచుఁ జుఱుక్కని మోవినొక్కువానిఁ
    దనచిన్నెలకును జక్కని మొగం బటు వెట్టుకొనినభూసతి వేఁడుకొనెడువాని
    వారియింతులకు మున్ వాదు తానే ఘటించి నలిరేఁగి పోరాడ నవ్వువాని
తే. నిచ్చఁ బరిపూర్ణ కాముఁ డై హెచ్చువాని
    నచ్యుతునిఁ గాంచి మ్రొక్కి యింద్రాదిసురలు
    దేవ యరు దెంచినా రంచుఁ దెలిపినంత
    శీఘ్రమునఁ దోడి తెమని సెల వొసంగె. 268

క. ఆవిశ్వంభరు ననుమతి, దౌవారికు లెఱిఁగి పనుపఁ దత్పరమతు లై
    దేవతలు సన్నిధికిఁ జని, సేవించిరి శుక్ర శిష్య జిష్ణున్ విష్ణున్ 269

వ. ఈ చందంబున శంఖచక్రగదాశార్ఙ్గనందకధరుండును భక్తజనానందకరుండును
    నగు నద్దయాకరునకు నభివందనంబు లొనర్చి బృందారకు లిట్లని యభినందించిరి.

               §§§ దేవతలు మాల్యవదాదిరాక్షసోపద్రవమును విష్ణుదేవునకు విన్నవించుట §§§
సీ. దండంబుశార్ఙ్గకోదండో గ్రకాండప్రకాండఖండితదైత్యకాండ నీకు
    జోహారు మదగజద్రోహాగ్రహావహగ్రాహచ్ఛిదాహవోత్సాహ నీకు.
    వందనం బరవిందమందిరామందిరత్సుందరోరస్థలాళింద నీకు
    జేజే హరాజాదిరాజీవపూజాసమాజోచితాంఘ్రిపంకేజ నీకు

తే. బహునమస్కారములు చక్రపాణి నీకు, నైకసాష్టాంగములు జగన్నాథ నీకు
    బ్రణతిశతములు సుర సార్వభౌమ నీ క, నంత సేవాంజలులు సదానంద నీకు, 271

ఉ. దానవవీర వైరి యవధారు సుకేశతనూభవుల్ మహో
    గ్రానలదీప్తవిగ్రహు లుదగ్రులు మువ్వురుఁ గూడి లోకసం
    తానము గాసిచేసెదరు తద్వ్యథ లోరువ లేక మిక్కిలిన్
    దీనతఁ జెంది యిం దరుగుదెంచితి మాపదఁ బాపవే కృపన్ . 272

సీ. ఖవురభేదియు నంతకచ్ఛేది యన మించుహరుభుజావైభవం బనఁగ నెంత
    దరముతో జడవృత్తిఁ దాల్చి యరూపుఁ డౌ శార్ఙ్గకోదండునిసత్త్వ మెంత
    చోరుచే నపహృతశ్రుతి యై యజాఖ్య కాస్పద మైనవేల్పురాజస మ దెంత
    పాకావహృతియు జంభవిఘాత మొనరించి యలరువృద్ధశ్రవుబలిమి యెంత
తే. యితరసుమనోగణములయహీనసమర, కర్కశత్వ మ దెంతని గణుతి సేయ
    రసురముఖ్యులు తామె బ్రహ్మాదిదేవ, వరుల నందఱు మించినవార మనుచు.

సీ. తన ధనుర్గుణ మీవు తెగ నిండఁ దీసిన దివిజారీవరుల కాయువులు నిండు
    బలురయంబున నీవు బాణముల్ వఱపిన విమతసైనికుల ప్రాణములు వఱచుఁ
    గడిమిమై నీవు చక్రముఁ గేల నంటిన రాక్షసగుప్తచక్రము గలంగు
    నలిరేఁగి పాంచజన్యము నీవు పూరింప సహితజన్యములు జన్యములు మాను

తే. గరుడవాహన మెక్కి లోకములు వొగడ, నందకము బూని కలనికి నడచితేనిఁ
    గొంచ కెవ్వాఁడు నిన్నెదిరించువాఁడు, తామసము సేయ నేల రావే ముకుంద.

                                   §§§ విష్ణువు సురల కభయం బొసంగుట §§§
వ. అని యాపన్ను లయి విన్నవించినవేల్పుమన్నె దొరలయెడం బ్రసన్నుం డయి
వెన్నుండిట్లని యానతిచ్చె. 275

చ. ఎఱుఁగుదు మున్ సుకేశుఁడు మహేశుకృపన్ విభవాభిరాముఁ డౌ
    టెఱుఁగుదు వానిపుత్త్రకు లహీనవరంబులు బ్రహ్మ యీయఁగా
    మెఱసి జగత్త్రయంబునకు మీకును బాధకు లౌట సర్వ మే
    నెఱుఁగుదు వేల్పులార వెత నింకకుఁ డింక జయింతు వారలన్. 276

శా. పూర్వాదిత్యమహావిలాసము లయంబున్ జెంద నస్మద్ధను
     ర్మౌర్వీటంకృతిగర్జ హెచ్చ సుమనోమ్లానిత్వముల్ మాన మ
     ద్దుర్వారాశుగవృష్టి ముంచి యిఁకఁ దద్దుష్టోద్యమగ్రీష్మత
     ప్తోర్వీతాపముఁ బాపు నేఁగుఁ డన వా రుత్సాహముం బొందుచున్ 277

తే. ఇందిరానాథవదనారవిందగళద,మందమధురవచోమకరందబిందు
    బృందతుందిలసుమనోమిళిందు లై పు,రందరాదులు సెందిరి మందిరముల. 278

క. అని కుంభజుఁ డెఱిఁగించిన, విని రాఘవుఁ డవల నెట్టివృత్తి మెలఁగి ర
   ద్దనుజులు హరి వారలతో, నని యెటువలెఁజేసెఁ దెల్పుఁ డని యడుగుటయున్ ,

                                      §§§ ఆశ్వాసాంతము §§§
 
శా. హేలాగోపితగోపికాంశుక శుక ప్రేక్షాపయోధిస్ఫుర
    త్ప్రాలేయాంశుయశోధురంధర ధరప్రత్యర్థిముక్తాంబుదా
    భీలప్రస్తరవర్ష వారణ రణస్ఫీతామృతాంధోద్విష
    జ్జాలవ్యాళభిదాఖగోత్తమ తమస్సంఛేదితేజోనిధీ. 280

క. యతికువలయహిమకర కర, భృతనందకచక్రచక్ర హితఘృణిమణిభా
    సితవత్స వత్సదనుజా, యతమారుతభుజగ జగదుదంచితనియతీ. 281

భుజంగప్రయాతము -
     నిశాంతస్ఫురత్పాండునీరేజనేత్రా, నిశాంతజ్జగద్వందనీయాబ్జమిత్త్రా
     యశోదానదాక్షిణ్యహారిత్వధుర్యా, యశోదామనోరంజశాశ్చర్యచర్యా. 282

గద్యము. ఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షణసమాసాదితచతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్ద్వజ్జనాభివర్ణితోదీరవితీర్ణివైభవాధఃకృతరాజరాజ రాజయోగసామాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిప సభాంతం స్తవనీయ నయకళాయుగంధరబంధురమనిషావిశేషమంధానవసుంధరాధర శోభితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదికగుణరత్నాకరకంకంటివంశపయఃపారావార పరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందననందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణ ప్రవీణతానిధాన పాపరాజప్రధాన ప్రణీతం బైన శ్రీమదుత్తరరామాయణం బనుమహాకావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.