శ్రీనివాసవిలాససేవధి/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీనివాసవిలాస సేవధి

ద్వితీయాశ్వాసము


శ్రీ రమణీకాంత త్రిజగన్నిశాంత
వారిదశుభగాత్ర వసుధాకళత్ర
నందగోపకుమార నరకసంహార
కందర్పతశుభరూప [1] కమనీయరూప
ఫణికులేశ్వరతల్ప భవ్యసంకల్ప
గుణగణైకనివాస కుహనావిలాస
కూటసంగరబాణ కుంఠనబాణ
కోటిభాస్కరతేజ గోవిందరాజ
అవధరింపుము సూతుఁ డమ్మునీంద్రులకు
వివరించి తత్కథ వెస నిట్టు లనియె 10

ఆత్మారాముఁడను బ్రాహ్మణునికథ.

కలఁ డొకవిప్రుండు కనకాద్రివింధ్య
ములకు మధ్యమదేశమున ధనాఢ్యుండు
కులశీలవంతుఁడు కోవిదోత్తముఁడు
విలసచ్చతుర్వేదవేదాంతవేది
యతని కుమారుఁ డాత్మారాముఁ డనఁగ
వితరణశాలి వివేకవంతుండు
సతతంబు నతిథిపూజనకర్మశీలుఁ
డతులకీర్తి వహించి యవనిఁ బెంపొందు


నాతఁడు గృహమేధియై గృహకృత్య
మాతతవైభవం బలరవహించి 20
తనతండ్రికన్న నుదాత్తవృత్తులను
దనరుచు గురుభక్తిఁ దాల్చి సజ్జనుల
బంధుమిత్రాశ్రితపరిజనంబులను
బంధురబుద్ధి సంభావించుకొనుచు
కులకాంతయందె మేల్ కూరిమిభోగ
ములఁ బొందు పరదారలను గోరఁ డెందు
నియతకాలములయం దీత్రివర్గంబు
ప్రియమునఁ జేకొను పేదలనరయు
నసమవెచ్చముసేయఁ డతిలోభమొందఁ
డెసగు నాదాకన్న హెచ్చుకుఁ బోఁడు 30
తల్లిదండ్రుల దేవతలకా భజించు
నెల్లధర్మంబులు హితమతి సలుపు
నప్పులన్నను తంటలన్న వడంకు
తప్పఁ డాడినమాట తగవు మీరండు
హీనవృత్తికిఁ జొరఁ డేపట్లనైన
మానంబు వదలఁడు మదము గైకొనఁడు
దయయు దాక్షిణ్యంబు దనరంగ నడుచు
నయము సౌజన్య మెంతయు మానఁ డాతఁ
డీరీతుల గృహస్థుఁ డెనయు నీతులను
మీరక వర్తించు మిగుల నవ్విప్రుఁ 40
డతని యిల్లాలు ప్రాయము చక్కదనము
మతియు శీలంబును మాన మార్జవము
నత్తకు మామకు నైనట్ల నడత


చిత్తప్రసన్నత చెలిమి మృదూక్తి
పతియె దేవతగాఁగ భావించు తలఁపు
వ్రతనిష్ఠ దయయును [2] నమ్రతయోర్పు
నవరసజ్ఞతయు ధర్మానుకూల్యంబు
లివి యెల్ల కులసతి కెనయు లక్షణము
లగుట నీగుణము లింపగు నలంకార
ముగఁ బూని తను నెల్లపొలతులు వొగడఁ 50
దనరుచుఁ గొందఱి దనయులవరుసఁ
గని మన్చి కంచంతకాపురంబుగను
దంపతు లన్యోన్యదత్తభావముల
నింపొంది కొన్ని యేం డ్లిట్టు లుండంగ
జనకుఁడు జననియున్ జనినంత వారి
కనుపమంబుగ బిత్రుయజ్ఞంబు దీర్చి
విహితకర్మములెల్ల వెలయఁజేయుచును
బహువత్సరంబులు ప్రబలి వర్తించె
నంతటఁ గొన్నాళ్ల కావిప్రవరుస
కెంతయు భాగ్యంబు వెడలు దుర్దశను 60
పొలములోఁ బశువులం బులులు రోగములు
పొలియించె చోరు లప్పుడె యింటనుండు
ధనముల్ హరించిరి ధాన్యం బకాల
ఘనవర్షముల వెల్లిగలిసెను దాత
యీవికి లోభించె నిచ్చినరుణము
లేవగలనురాక [3] యిజుకులఁబడియె


చేలు పంటదొలంగె క్షేత్రము లెండె
మేలుభూషణము లెమ్మెయి మాయమయ్యె
నీరీతి శ్రీవీగి యేగంగ నంత
దారిద్య్రత మెంతయు నిల్లు సొచ్చె 70
నది చూచి తమరుండ ననువుగా కతని
ముదము ధైర్యము రూపమును నేర్పు దరిగె
నెన్నెన్ని పోయిన నెలమికీ ర్తియును
బన్నిన సుకృతముల్ పగులక నిలిచె
నెండమావులవంటి యీధనంబునకు
మెండుదైన్యమునొంది మేనమ్మి కొలిచి
వంచించి కడ తేరువాటులు గొట్టి
కొంచించక నకృత్యకోటికి నొగ్గి
గడియింతు రవి పోవఁగన్ నిల్వలేరు
విడువను లే రెంత వెడమాయ యాన 80
తరళమౌ నల పారదముచేత సుదృఢ
తరకాంచనము జెందు తగు వాదికరణి
ధన్యులు స్థిరమైన ధనముచే భువన
మాన్యమౌ సత్కీర్తి మహిమఁజేకొండ్రు
అపు డాసరోజాక్షి యతిదీన యగుచు
ద్విపము మ్రింగినయట్టి వెలగవంటిక్రియ
రిత్తబోయిన తన గృహగర్భసీమ
తత్తరంబునఁ జొచ్చు తడవు వే వెడలు
పొద్దు పల్మరుఁ జూచు పొగులుచు నూర్చు
నెద్దియు లేమిచే నెంతో చింతించు 90


బడలిక వసివాడు బాలురఁ గాంచు
కడుఁ జేయునదిలేక కన్నీరు డించు
విభునిచెంతకుఁ జేరు వెసఁ బల్క-వెఱచు
నభిమానవతి గాన నాత్మలోఁ గుందు
నిటుల దారిద్య్రాగ్ని నెంతయుఁ గుములు
కుటిలాలకను జూచి కొడుకులఁ జూచి
మన మెరియుచు ధరామరవర్యుఁ డెంత
ఘనదుఃఖములఁ జూడఁగాఁ జాల నిట్టి
తనువుతో హీనవర్తనలకు నొగ్గి
....... ....... ........ ....... ....... ..... 100
యొరుల వేడఁగఁజాల నుద్ధతులైన
దొరలఁ గొల్వఁగఁజాల దుర్విధి యిట్లు
లేమిఁ జూపిన సిగ్గులేమి మే లేమి
లేమికన్నను మనలేమియే మేలు
అని రోసీ యెద శోక మడరంగ ఘోర
వనిఁ జొచ్చి తిరుగుచు వచ్చి యచ్చోట
కపిలతీర్థముగాంచి కపిలేశుఁ గొల్చి
విపులసౌఖ్యకరంబు వేంకటధరముఁ
గని యధిరోహించి క్రమమున నందు
మును వజ్రతీర్థాది ముఖ్యతీర్థములు 110
పదియునై దును రెండు పరికించి మునిగి
తుద కేగి యొక్క యద్భుతమైన మునిని
నిడుద కెంజడలఁ బూనిన యోగమట్టె
యొడల తెల్లనిభూతి యుదరబంధంబు
నిటలోర్థ్వపుండ్రంబు నెరయు గడ్డమును


స్ఫటికాక్షమయమైన జపమాలికయును
కట్టినపులితోలు ఘనకమండలము
పట్టినదండంబు పటుయజ్ఞ సూత్ర
మరమోడ్పుకనుదోయి యచలసంస్థితియు
మెరయ మంత్రావృత్తి యెదల నోష్ఠములు 120
హరిపదధ్యానయోగానందసింధు
పరివాహమగ్నహృత్పద్మతనుండు
వై రాగ్యజితమారు వారిజోద్భవకు
మారునట్టి సనత్కుమారుఁ గన్గొనియె
కని నిర్జనాధిత్య కావనంబునను
వినుతతేజఃపుంజవిగ్రహుం డగుచు
కనుపట్టెడి నితండు కమలసంభవుఁడొ
వనజారి మౌళియొ వనజలోచనుఁడొ
గాకున్న మునుల కీకాంతిరూపములు
చేకురు టెబ్బంగి చిరతపఃక్లేశ 130
మనుభవింపుచు డస్సి యస్థులై యెండి
కనువేదు రయ్యుండఁ గనమె యమ్మునుల
సుకుమారవంతుఁ డాసురుచిరాకారుఁ
డకళంకమోదంబు నలరించె మదికి
నీమహామహుఁడు నాయెడఁ దీర్పఁజాలు
వేమారు కారుణ్య విభవంబుచేత
ననుచు నూహదలంచి యాయోగి యెదుట
జని భక్తి సాగిలి సాష్టాంగమెఱగి
దీనవత్సల ! కృపాదృష్టిచే నన్ను
పూని రక్షింపు నాపూర్వదుష్కృతము 140


వలన మహాదుఃఖవార్థిలో మునిఁగి
నెలవు గానక నేను నిను దెప్పఁగాఁగఁ
గనుగొంటి న న్నిక కడతేర్చఁ గదవె
యనఘాత్మ శరణు నీ వని నమ్మినాడ
నని విన్నవించంగ నాయోగిమౌళి
కనువిచ్చి చూచి యోగంబున నరసి
వినుము భూసురవర్య వెతఁబడనేల
మునుజన్మమున నీవు మూర్ఖతచేత
మానవేంద్రులచెంత మంత్రివై యుండి
దానవిఘ్నముఁజేసి దత్తవిత్తములు 150
మరలహరించి సన్మతులబాధించి
యొరులకలిమికి నీర్ష్య నుడుకుచుఁ జాడి
పలుకుచు శ్రీహరిభక్తియు లేక
పలుగాకివై యున్న పాపంబు లిపుడు
మొనసి యీగతి దుఃఖముల నించెఁగాన
తననేర్పునను దీర్చ తరమె యెవ్వరికి
భువిజనంబులె కాదు పురుహూతముఖ్యు
లెవరైన ప్రారబ్ధ మెడలించఁగలరె
ఐన నీ కొకయుపాయము దెల్పె దనుచు
మానంగ దురితముల్ మరి సిరుల్ గలుగు 160
వనరుహాక్షప్రాణవల్లభ లోక
జనని మహాలక్ష్మి సంవత్స్వరూప
మయిమించు నద్దేవి వైనవ్యూహములు
జయకీర్తి లక్ష్మినా జగతి మువ్వగలఁ
జెలఁగు నావ్యూహలక్ష్మియె వాసుదేవ


విలసితకారుణ్యవిగ్రహ యగుచు
ప్రారబ్ధము లడంచి భక్తకోటులకుఁ
గోరినయిష్టముల్ గొబ్బున నొసఁగఁ
జాలు న య్యిందిరన్ శరణుగాఁ జెంది
మే లొందు మనుడు భూమీసురుం డలరి 170
మౌనీంద్రునకుఁ జాల మఱిమఱి మ్రొక్కి
పూనికఁ గేల్మోడ్చి పొగడి వెండియును
మునివర్య యాదేవిఁ బొడగాంచు టెట్లు
దనరు నెచ్చట నెట్లు ధ్యాన మెబ్భంగి
యెందు ప్రసన్నయౌ నిలలోకజనని
పొందుగాఁ దెలుపు మిప్పుడె యట్లసేతు
నని యడిగిన వాని నాయోగి కరుణఁ
గని విను స్వామిపుష్కరిణిచెంగటను
వరదుఁ డయిన శ్రీనివాసు పేరురమె
యిరవుగా నెలకొని యీవ్యూహలక్ష్మి 180
పొందమ్మిగద్దె ద్విభుజయై వసించు
కుందనపుంబొమ్మ కొమరు మీఱంగ
నాయిందిరం దిరమైన సద్భక్తి
పాయక మదినిల్పి స్వామిపుష్కరిణి
పావనోదకములన్ బరిశుద్ధి గాంచి
భావంబునన్ రమాపతిని భావింపు
మపుడె ప్రసన్నుఁడై యల శ్రీనివాసుఁ
డపరిమితప్రేమ నందుఁ గన్పట్టి
నీనుఁ గృతార్థునిఁ జేయు నిక్కమం చొక్క
మనువుపదేశింప మదిఁదాల్చి యతఁడు 190


తనకు సాగిలిమ్రొక్కి, తగ లేచుమున్నె
తన యోగమహిమ నంతర్హితుండయ్యె
అంత నాత్మారాముఁ డాకస్మికముగఁ
జెంత నుండిన యోగి శేఖరుఁ డెందుఁ
గనుపడకుండినఁ గడు చోద్యమంది
తనువు గగుర్ప మందత నిల్చి కొంత
తడవుకుఁ దెలివొంది తడవాటు విడిచి
జడదారి దెల్పిన జాడ దలంచి
యరుగుచుఁ గోనలు నడవులు గడచి
దరులు బల్ చరులును తడవుచు నడచి 200
యుడివోని విరిదోట లొప్పు నొక్కెడను
కడువడి స్వామి పుష్కరిణిని గాంచి
సదయుఁ డమ్ముని దెల్పు స్వామిపుష్కరిణి
యిది యంచు మదినెంచి యెంతయు నలరి
శంకింప కాతీర్థసలిలంబు నందు
సంకల్పపూర్వమై స్నానం బొనర్చి
సకలకల్మషములు సడలించి భాగ్య
నికరంబు చేకొని నిత్యకర్మములు
జపములు గావించి సరస నుల్లసిలు
నుపవనాంతరసీమ నొనర దీపింప 210
నందు కుందనపు తళ్కందుగోపురము
లిందుకాంతంబుల నెసఁగు ప్రాకార
మింపుసొంపులు నింపుమీరు సౌధములు
కెంపులగుంపు చెక్కిన మంటపములు
పచ్చరాల నొనర్చు బహువిమానములు


మెచ్చుగా నీలనిర్మితవేదికలును
వైడూర్యఖచిత మౌద్వారమండలము
చూడనౌ పగడంపు సోరణగండ్ల
నాణిముత్తెంబుల నలరు తల్పులును
మాణిక్యముల మించి మలచు కంబములు 220
గోమేధికోజ్వలకుట్టిమంబులును
హైమోరుపుష్యరాగాస్థానములును
బహురత్నహర్యూఢ భద్రాసనములు
రహిమించు నాపుల్గురా సీడంబులును
సిడములతుదల మోసెడు ఘంటికలును
తొడరి యాఘంటలతోఁ బల్కు, చిల్క
లలచిల్కపల్కుల కలరు నచ్చరలు
...... ...... ........ ...... ....... .......
అచ్చరల్ నర్తించు హరువురచ్చలును
రచ్చల ఘోషించు రమ్యవాద్యములు 230
నావాద్యముల్ విని యరుదెంచు వేల్పు
లావేల్పులను గూడి హర్షించు మునులు
మునుల హరిస్తోత్రములు దనరంగఁ
దసరంగు భూనభోంతరములు మెఱయ
మెఱపులు వేవేలు మెదలక నిలిచి
మెఱసినచాడ్పున మింటిపై నంటి
నటియించు గంధర్వనగరంబు పగిది
పొటమరించిన మాయపూన్కి చఁదమున
నొక దివ్యమందిరం బొప్పంగఁ గాంచి
వికలచిత్తుండయి విస్మయం బొంది240


యిది యేమిచోద్య మీయెడ నేన ముందు
పదునై దువరుసల బరికించి యందు
నిర్జనంబగుట నీనిలయంబు గాన
నిర్జరమాయఁ గన్పించెనో యిపుడు
కలయొ నిద్దురలేక కల యెట్లు గలుగు
కలవళంబున భ్రాంతిగాఁ దోఁచినదియొ
శ్రీనివాసుఁడు నన్ను జెలిమి రక్షింపఁ
దానె యీరూపంబు దాల్చి వచ్చుటయు
జనుల కదృశ్యుఁడై జగదీశ్వరుండు
దనరు నీగిరి నంచుఁ దపసి మున్ దెలిపె 250
నాదు భాగ్యవశంబునన్ దృశ్యుఁ డగుచు
నీ దివ్యగృహమున నెసఁగునో శౌరి
చొచ్చి చూచెదఁగాక సొలయ కే ననుచు
వచ్చి యాభవనంబు వడిఁ బ్రవేశించి
వరగోపురము దాటి ద్వారముల్ గడచి
పరికించి మణిమంటపములు వేదికలు
మరియుఁ గన్గొనుచు హేమమయసౌధములు
నరసి మహావిమానాంతరమ్మునను
చింతామణిమయ సింహాసనమునఁ
గాంతామణి యురంబు గదిసి రంజిల్లఁ 260
గౌస్తుభమణియందుఁ గడుదీప్తు లొసఁగ
నిస్తులవనమాల నెరి దావి నింప
విమలహారంబులు వెడనిగ్గు నెరప
కమనీయశంఖచక్రము లిరుగడల
నయనేందురవుల విన్నాణంబుఁ జూప


నయముగా వీనుల న్మకరకుండలము
లలరువిల్కాని సోయగములఁ గెల్చి
బలిమిఁ దెచ్చిన డాలు పగిది నిం పెసఁగ
ఘనకిరీటంబు కంకణము లుంగరము
లనుపమభుజకీర్తు లంగదంబులును 270
మిసిమియొడ్డాణంబు మేలురకంపు
పసిడిరెంటెము మీఁదఁ బరగుమేఖలయు
గండపెండేరముల్ కటిఁ గట్టినట్టి
మండలాగ్రము జీరు మంజీరములును
మించులున్ రతనంపుమెఱుఁగునిగ్గులును
మించులమించులన్ మించి రాణించ
జగమెల్ల నాక్రమించఁగ గమకంబు
దగు పాదముల చక్కదనము పిక్కటిలు
పిక్క లొయ్యారంపుబిగు వందు తొడలు
మిక్కిలి సింగమున్ మెచ్చని కౌను 280
మురువుహుమ్మును జూపు మూపులసొబగు
కరికరంబులడంబు గలభుజంబులును
పూవుఁబోడుల చంటిపోటుల నీటు
శ్రీవత్స మనుమత్సచే డాచు నురము
గొల్లగుబ్బెతల సంకులగాజు లొ త్తి
మల్లాడు దద్దురుల్ మాయని గళము
పాలకడలిపట్టి పట్టైన బాళిఁ
గ్రోలఁ గ్రోలఁగఁ దృప్తిఁగొలుపని మోవిఁ
కరుణారసముగుల్కు కన్నుదమ్ములును
చిఱునవ్వువెన్నెల చిలుకు నెమ్మొగము 290


నంగకాంతివిధంబు నంటి సొమ్ములకు
సింగారమొనరించు చెలువు మీఱంగఁ
బొంగారు కార్మొగుల్ భువి నిల్చినటుల
శృంగార మొకమూర్తి చేకొన్న పగిది
కన్నులభాగ్యంబు గనుపట్టి యెదుట
నున్న తాకృతి దాల్చి యెప్పుచున్న టుల
నుడివోని జవ్వనం బొరఫుమే నూని
పుడమిపై నాడుచుఁ బొడచూపినటుల
నెల్లసోయగములు నేకీభవించి
యల్లన చైతన్య మందినయటుల 300
నానందమంతయు నావిర్భవించి
జ్ఞానసంపదలీల సల్పుచున్నటుల
సతతంబు సిరు లిచ్చి జనులఁ బ్రోవంగ
వితరణదేవత విలసిల్లునటుల
ధారుణి గావించు తపములవలన
భూరిపుణ్యము లొక్క ప్రోవై న యటుల
చెలఁగుచు నిలుచున్న శ్రీ వేంకటేశుఁ
దిలకించి యతఁ డెదన్ దెలివి కలఁగ
భయవిస్మయానందభ క్తిదైన్యములు
రయకంపపులకసంభ్రమము లక్షణమె 310
యడ కనురెప్పవేయక వెసఁ జూచి
పుడమి జాగిలిమ్రొక్కి పొదలు బాష్పములు
గురియ క్రమ్మఱలేచి కోరికలెల్ల
మరచి చూచుచు నిల్చె మందభావమున
అపుడు నిర్వ్యాజదీనావనోత్సుకతఁ


గృప వెల్లివిరియ వీక్షించి యవ్విప్రు
జడియ కోడకు మని చల్లనిదృష్టి
కడునాదరింపుచు కమలేక్షణుండు
వినుతభూసుర నీకు వెత లేల యింక
కనికరంబునలక్ష్మి కరుణించె నిన్ను 320
చిరతరైశ్వర్యంబు చిత్తసమ్మదము
వరపుత్రసంపద వై భవంబులును
జనపూజ్యతయు నీ కొసంగుదు నెపుడు
జననిగర్భమునందు జనియించుక్లేశ
మొందవు [4] మోక్షంబు నొసఁగుదు తుదను
ముందుగా విజ్ఞానమును నీకుఁ గల్గు
నని యానతిచ్చి మాయలు గప్పి యపుడె
ఘనమందిరము దాను గనుపించఁడయ్యె
అంతట నావిప్రు డం దేమి గాన
కెంతయు వెఱఁగంది యెద శ్రీనివాసు 330
చెలువు నమ్మందిర శ్రీకరాకృతియుఁ
దలఁచి దలంచి సంతతచింతతోడ
నానందభాష్పంబు లడర కన్గవను
మేను వడంకఁగా మెల్ల నేమరలి
స్వామిపుష్కరిణిప్రవాహంబునందు
నేమంబులను దీర్చి నెలకొన్నభక్తి
శ్రీ వేంకటేశ్వరుఁ జింతించుకొనుచు
భావంబలర నాత్మభవనంబుఁ జేరు


తలఁపుతోఁ దరలెనంతను వాని యింట
నెలనాఁగ కూరపా దిలఁ ద్రవ్వుటయును 340
పెన్నిధానముగాంచె పృథివీశ్వరుండు
మన్నన నవ్విప్రమణి గౌరవంబు
పరికించి నిజహితప్రకరంబుచేత
వరధనభూషణవ్రాతముల్ పనిచె
చేలు మళ్లును దుక్కి సేయ కెంతయును
మేలుపంట ఫలించె మిక్కిలి సిరులు
పూటపూటకు హెచ్చె పుత్రులు నేర్పు
పాటిల్ల విద్యల ప్రౌఢిఁ జేకొనిరి
ఇటులసంపదమించు నింటికి నతఁడు
పటుతేజ ముప్పొంగ పరతెంచునపుడు 350
వారలబంధువుల్ పండితో త్తములు
దూరం బెదుర్కొని స్తుతులు సేయంగ
వచ్చి యచ్చెలువ నావరకుమారులను
గ్రుచ్చి కౌగిటఁ జేర్చుకొని యూరడించి
శ్రీకాంతపదభక్తి చెలగంగ సిరులు
గైకొని కొన్నాళ్లు కడుసుఖంబుగను
సకలధర్మంబులు సలుపుచునుండె
సకుటుంబమున వృషాచలసమీపమున
కరిగి నిత్యనివాస మందుఁజేయుచును
హరిచరణాంబుజధ్యానయోగంబు 360
సాగించి యోగియై సంసారసంభ
వార్తి దొలఁగ ముక్తి హరికృపఁ గాంచె


నీపుణ్యచరితంబు నెవ్వరు వినిన
నేపుమీఱఁగ నిష్ట మెల్లను గలుగు
తొలఁగు నాపదలెల్ల దురితంబు లణఁగు
చెలఁగును హరిభక్తి సిద్ధమెంతయును
నావుడు నల సూతునకు మ్రొక్కి మునులు
కోవిదోత్తమ మాకుఁ గుతుకం బెసంగ
తెలివిగా వేంకటాద్రిప్రభావంబు
తెలిపితి రందు పదియునై దురెండు 370

పదునేడుతీర్థముల మహిమావర్ణనము — కపిలతీర్థము.

పరమతీర్థము లెట్లు పరగు నిమ్మహిమ
యెరిగింపు మని వేఁడు ఋషుల కాసూతుఁ
డనుమోద మలర ము న్నది దెల్పఁదొణఁగి
వినుఁ డట్టివేంకటోర్వీధరంబునకు
దిగువ నాగ్నేయైకదిగ్భాగమునను
నగరాజకన్యకానాయకుఁ డైన
హరులింగమూర్తినా యతలాంతరమున
నరుదార కపిలసంయమి పూజసేయు
చుండంగ నాలింగ మొకకారణమున
మెండువేగమున భూమీమండలంబు 380
గండిగా భేదించి కడునన్నగంబు
దండ పై కెగయ నత్తఱి నాబిలంబు
గపిలేశ్వరుండు రాఁగలిగినకతన
కపిలతీర్థంబయ్యె కడుఁ బావనముగ
నందు పురందరాద్యమరు లయ్యీశుఁ


గందువ భజియించి కాంచిరి సిరులు
కావున నిల నట్టి కపిలతీర్థప్ర
భావంబు వర్ణింప బ్రహ్మకుఁదరమె

ఇంద్రతీర్థమహిమ.

నాపయి నింద్రుం డహల్యను గలయు
పాపంబు దొలఁగఁ దపం బొనరించ 390
నతని బావనుజేయు నాసరోవరము
క్షితి నింద్రతీర్థమన్ కీర్తి వహించె

విష్వక్సేనతీర్థము.

వానికి నెగువ విష్వక్సేనతీర్థ
మూనుపుణ్యోదకం బొప్పు ముం దచట
వరుణకుమారుండు వదలవిభక్తి
హరిపూజ యొనరించి యనఘాత్ముఁ డగుచు
వనజూక్షునకు పడవాలు దా నయ్యె
వినఁగ నాతీర్థంబు విభవంబు కొలఁది

శంఖచక్రాదితీర్థములు.

పయి నైదు సరముల పంచాయుధములు
ప్రియమున హరిఁ గొల్చి పెనుపొందుకతన 400
నవి శంఖచక్రశార్జాదిసంజ్ఞలను
భువికీ ర్తిఁ గని లోకపూజ్యంబు లయ్యె

అగ్నికుండాఖ్యతీర్థము.

నటమీఁద త్రేతాగ్ను లాత్మశుద్ధికిని
పటుతపంబులు సల్పి పావను లగుట


నాతీర్థ మగ్నికుండాఖ్యమై సకల
పాతకంబు లడంచి ప్రబలె నిమ్మహిని
అందుకు నుపరిభాగావనియందు

బ్రహ్మతీర్థము.

ముందర నాచతుర్ముఖుఁడు ముకుందుఁ
గనుఁగొందు నని యెంచి ఘనయోగనిష్ఠ
ననుపమంబుగఁ బూనె నబ్జసహస్ర 410
మంత శ్రీకాంతు నేకాంత భక్తి గని
సంతసమొందుటన్ జగతి నాకొలను
బ్రహ్మతీర్థం బనఁ బరగ నం దజుఁడు
బ్రహ్మోత్సవమువేళ బరతెంచు నెపుడు

సప్తు తీర్థములు.

నవల సప్తర్షు లత్యద్భుతతపము
సవరించి రటుగాన సప్తతీర్థములు
కలుషహరంబుగా ఘనులపేరిటివి
...... ....... ....... ....... ....... .......
యట్టితీర్థముల మాహాత్మ్యము దెలిసి
నెట్టుగ వర్ణింప నేరఁ డా శేషుఁ 420
డితిహాసమొక్కటి యిట్టి యర్థమున
శ్రుతమయ్యె మునులిది చెప్పిరి వినుఁడు

శోణపుర బ్రాహ్మణునికథ.

మును శోణపురమున భూసురుఁ డొకఁడు
వినయసంపన్నుండు విష్ణుభక్తుండు
కలఁ డాతఁ డొకనాఁడు ఘనశాస్త్ర మరసి


తొలుజన్మమునఁ దన దురితకర్మములు
తెలిసి పశ్చాత్తాపదీనభావమున
నల వాని కై నప్రాయశ్చిత్త మిలను
తీర్థయాత్రయె యంచు దివ్యంబు లైన
తీర్థంబు లన్నియు తిలకించు కొనుచు 430
భూమిప్రదక్షిణంబును జేయఁ గడిగి
కోమలి సుతులఁ గైకొనని విరక్తి
నారేయి నిదురించునపుడు స్వప్నమున
వారిజాక్షుఁడు కృప వాని కిట్లనియె
వినుము భూసురవర్య వేంకటశైల
మున సప్తదశతీర్థములు గల వందు
నొకదినంబును స్నానమొనరించువార
లకుఁ దీర్థయాత్రాఫలంబు సిద్ధించు
ధరవేంకటాద్రిప్రదక్షిణంబునను
బురుషులకు లభించు భూప్రదక్షిణము 440
వలన గల్గు ఫలంబు వనితలకై న
కలుగు నన్నట్లుగాఁ గలఁగని లేచి
యతఁడు మనంబున నాశ్చర్యమొంది
వెతకుచు జనుదెంచి వేంకటాచలము
కనుఁగొని సేవించి కపిలతీర్థంబు
మునుకొని యన్నీట మునిఁగి యాగిరికి
పొసఁగ ప్రదక్షిణంబును సల్సె నపుడె
యెసఁగె నాతని కెల్లనిష్టసంపదలు
కావున నట్టి వేంకటగిరి మహిమ
భావించి యెంతని పలుకశక్యంబొ 450


మరియు నిమ్మహియందు మహితతీర్థంబు
లరయంగ మూఁడుకో ట్లర్థకోటియును
గలవు వానికి నాదికారణంబగుచు
సలిలసంపదఁ బొల్చు స్వామిపుష్కరిణి
యేలికె యిది యౌట నిలఁగల్గుతీర్థ
జాల మాశైలనిర్ఘరజలంబులను
నెలకొనియుండు నిన్నిటి క్షేత్రపాలుఁ
డెలమి పాలించు నయ్యెడ శౌరియాజ్ఞ

పాండవతీర్థము.

మును పాండవు లరణ్యముల సంచరించ
గను కృష్ణుఁడు జయంబుగలుగు వారలకు 460
శ్రీనివాసాచలశిఖరంబునందు
పూని వత్సరము తత్పుణ్యోదకముల
స్నాతులై నియమంబు సల్చితిరేని
ఖ్యాతిగా వైరుల ఖండించి జయము
గైకొని యెద రంచుఁ గరుణ బోధింపఁ
జేకొని యల యుధిష్ఠిరముఖ్యు లేవు
రట్టిపాంచాలియు నాగిరి యొక్క
పట్టున రమ్య మైపరగుతీర్థంబు
చెంత వాసముచేసి శ్రీపతిఁ గొల్చి
యెంతయు జయమొంది యిల నేలి రదియ 470
పాండవతీర్థంబు పావనం బట్టి
కొండ నుండెడిగనుల్ కొలధియే! మణులు
పసిడియు వెండి తామ్రములోహములును


వెసబారు హ్రదములు వివిధౌషధములు
నమితంబు లై కల వవియు నొక్కొక్క-
సమయమునందు దృశ్యములై చెలంగు
నాగిరి శ్రీనివాసాకృతిఁ బూని
యోగీంద్రులకుఁ దోచు నొక్కొక్క వేళ
నొకవేళ కనకాద్రియొరపున నుండు
నొకవేళ రత్న శృంగోన్నతిఁ జూపు 480
నొకవేళ శేషునియొడికంబు దాల్చు
నొకవేళ వింతరూ పొనరంగఁ దనరు
హరి మాయగావించునట్టి చందమున
హరిరాజగిరియు మాయలు సేయుచుండు
న మ్మహాగిరి భక్తి నర్థించువారి
కెమ్మెయి తానిచ్చు నెల్లకోరికలు
భువి మూఁగ కనులాపములు నేర్పు గురుఁడు
చెవిటి కేకాంతంబు చెవిఁజొన్పు సఖుఁడు
పిచ్చుకుంటును నడిపించు బల్ వెజ్జు
హెచ్చుదయ్యము నిగ్రహించు మాంత్రికుఁడు 490
గుడ్డివానికి చూడ్కు లొసఁగెడుదాత
గొడ్డురాలికి చూలు గొలిపెడుజాణ
యా వేంకటనగంబు నంతరంగముస
భావించి సేవింతు ప్రతిసంధ్య మేను
వినుఁ డింక నద్భుతవృత్తాంత మొకటి
ఘనుఁడు జైమిని దెల్పఁగా వింటి మున్ను
స్వామిపుష్కరిణి కీశాన్యదిక్సీమ
గోముండు వైకుంఠగుహ యన నొకటి


వైకుంఠగుహమహిమావర్ణనము.

యందు వై కుంఠగుహాకారముగను
కుందనంబుల జెక్కు గోపురంబులును 500
మణిమయప్రాకార మంటపంబులును
ఘృణిమీరు కాంచన కేతువారములు
పగడపు కొణిగలఁ బరగు మాళిగెలు
మగరాల బిగియించు మందిరావళులు
నాణిముత్తియముల నలరు తోరణము
మాణిక్యఖచితహర్మ్యప్రకాండములు
బాగైన యుబ్బుచప్పరముల గుములు
లాగుల మేడ లుల్లసితవేదికలు
చకచకద్రుచిమించు చంద్రశాలలును
ప్రకటచతుశ్శాలపానశాలలును 510
పటుగీత శాలలు బలుకురుంజులును
నటన శాలలు వాహన స్థానములును
బంగరువన్నెల బరగు నేనుఁగులు
రంగుపచ్చలనిగ్గు రాణించు హరులు
ఖేచరగతి మించు కెంపులతేరు
లేచక్కి నడచు మహీరుహంబులును
లయ తప్పక నటించు లతికాగణంబు
నయముగాఁ బల్కు నానామృగంబులును
వేదాంతములు జదివెడు పక్షితతులు
సాధులై మెలఁగు భుజంగపుంగవులు 520
తగుకోర్కె లొసఁగు చింతామణిగిరులు
మగువలతో నాడు మణిపుత్రికలును


వాయించకయె మ్రోయు వాద్యబృందములు
పాయక విహరించు పద్మాకరములు
బహుళకాంచనమణిప్రభల నిన్నియును
రహి మించి కోటిసూర్యప్రకాశమున
గంథర్వనగరధిక్కారియై మీఱి
బంధురశ్రీలచే భాసిల్లు పురము
శ్రీభూమినీళలు సేవింప శౌరి
ప్రాభవంబున నందు బరగుచు నిత్య 530
సూరులు ముక్తులున్ శుద్ధసత్వంబు
మరి కొల్వఁగ లీల మెఱయుచునుండు
నజశంకరేంద్రులు నమరగంధర్వ
భుజగకిన్నరనరపుంగవుల్ మొదలు
నెవరును గననేర రీశ్వరు మాయ
దవిలియుండుటఁజేసి తత్ప్రభావంబు
పొగడంగ వశమె మాబోంట్లకు నెల్ల
భగవంతుఁడే దాని భావింపనోపు
మును రాముఁ డాదశముఖుని ఖండింప
వనచరసేనతో వచ్చుచుండంగ 540
నంజనాదేవి యాహనుమంతుఁ జూడ

అంజనాదేవి రామునికి హితవుచెప్పుట.

రంజిల్లు చటు చేరి రఘువీరుఁ గాంచి
ప్రణమిల్లి దేవ ! యారావణాసురుని
రణమునఁ గెల్వ దుర్ఘట మెవ్వరికిని
దేవర నల వై రిఁ దెగటార్చి గెలువ


గా వేంకటేశ్వరుఁ గాంచి ప్రార్థించి
స్వామిపుష్కరిణిని స్నానంబుచేసి
స్వామిచే వరమంది చను మని పలికె.
అపుడు శ్రీరాముఁ డాయంజనాదేవిఁ
గృపను వీక్షించి యాకెలను నిల్చున్న550.
హనుమంతుఁగనుఁగొన్న నతఁడు కేల్మొడిచి
వినయంబుతో నట్ల విన్నవించుటయు
మోమున చిఱునవ్వు మొలకలెత్తంగ
రాముఁ డ ట్లగునంచు రయమునఁ దరలి
వనచరసైన్య ముర్వడి నడువంగ
వనములు గిరులు గహ్వరములు నదర
ధరణి వడంక దిక్తటములు బెదర
నెరసి భానుని గప్పి నెగడ రజంబు
దండిగా సింహనాదము సేయువారు
కొండలపై నెక్కి కుప్పించువారు560
పెంపొందువృక్షముల్ పెకలించువారు
సొంపున తేనియల్ జుత్తెడువారు
బిగువుతో నొండొరుల్ పెనఁగెడువారు
మిగుల రాఘవుకూర్మి మెచ్చువారలును
విడివడి విహరించ వెంకటాచలము
వడి నెక్కి మక్కువ వనజకల్హార
వారహారిణియైన స్వామిపుష్కరిణి
తీరంబున వరాహదేవు సన్నిధికి
వచ్చుచో నుగ్రుఁడై వారిజమిత్రుఁ
డుచ్చస్థితిభజించి యుర్వి కత్యంత570.


సంతాపమొనరింప సాగెఁ బ్రతాప
మెంతగల్గిన నంత నిల నెల్లవారిఁ
బొగిలించు నతిదుష్టభూపాలుపగిది
దగ మించు సైన్యమంతయు వాడినటుల
వగమించు బలుకాక వనమెల్ల వాడె
బుగబుగ నుడికె నంబుభరంబు లపుడు
సౌమిత్రియును రామచంద్రుఁ డాసరసి
నేమంబులను దీర్చి నీలశైలేశు
భావించి యశ్వత్థపాదపచ్ఛాయఁ
గ్రేవ నంగదుఁడు సుగ్రీవుఁడు గొలువ580
సమ్మదంబున నుండు సమయంబునందు
నమ్మహీధరమున నమృతోపమాన
ఫలములు కందముల్ భక్షించి యింపు
చెలఁగఁ దేనెలు గ్రోలి చెలరేగి సేన
ఝరుల బల్దరుల మేల్చరుల గోనలను
తరుగణంబుల శృంగతటముల నిండి
జవలీలచేఁ జాలఁ జరియింపుచుండె
గవయ గజ గవాక్ష గంధమాదనులు
మరి శరభసుషేణమైందద్వివిదులు
తరలి యీశాన్యదిక్తటిని గ్రుమ్మరుచు590

వైకుంఠగుహ వైభవము

నం దొక్క గుహఁ గాంచి యంచితానంద
కందళితాంతరంగంబులతోడ
నచటఁ బ్రవేశించి యంధకారంబు


ప్రచుర మౌనటుగానరాక యొండొరులు
కేలుకే ల్చెనకుచు కేరి నవ్వుచును
చాల కక్కసముగా చనచన నందు
వెన్నునికృపఁ గొంత వివరంబు దెలిసి
తిన్నగా ముందట కీర్తి రంజిల్ల
కాంచనమణిమయాకార మౌపురము
గాంచి యచ్చెరువొంది కడుచేర నరుగ600.
బహురత్నతోరణస్రాసౌదసౌధ
గృహపాళికాట్టాలకేతుజాతముల
మండపంబులు మణిమయవిమానములు
మెండుగాఁ గనుఁగొంచు మెచ్చుచు నౌర
అందరు నిందు పీతాంబరధరులు
సుందరకౌస్తుభశోభితవక్షు
లంబుజాక్షులు సమాయతచతుర్బాహు
లంబుధరశ్యామళాంగాభిరాము
లంచితశంఖచక్రాదిసాధనులు
చంచత్కిరీటాదిసకలభూషణులు610.
వీర లెవ్వరొ శౌరివీక నున్నారు
తా రిటు మేషముల్ ధరియించినారొ
యనుచు నివ్వెర గంది యరుగంగ నెదుట
ఘనవిమానం బొండు గనుపించె నందు
వైకుంఠవాసుండు వాసుదేవుండు
శ్రీకాంతధరణియుఁ జెంగట నుండ
నీలావధూమణి నెమ్మి భజింప
చాల కొందరుచెలుల్ చామరల్ వీవ


ఫణసహస్రమణిప్రభాభాసమాన
ఫణిరాజమృదుభోగభద్రాసనమున620
నాసీనుఁ డై సవ్యహస్తాంబుజంబు
వాసిగా నూనిన వామజానువున
చెలువొందఁ జాచి దక్షిణపాణిఁ బూను
జలజం బడర శంఖచక్రముల్ మెఱయ
చిరునవ్వు వెన్నెల జిలుగుచెక్కిళ
నిరుదండకుండలహారముల్ తోర
ముగ నిగ్గు నెరవంగ మకుటదీధితులు
మొగమున కొక జగ్గు మొలిపించి మించి
కౌస్తుభహారముల్ గ్రైవేయకములు
నిస్తులభూషణోన్నిద్రరత్నములు630
మహనీయకాంచనమయపటద్యుతులు
బహుకోటిభాస్కరప్రభ విసాళించఁ
గొలువుండగాఁ గనుఁగొని వనేచరులు
తలకుచుండఁగ నొక్క దండహస్తుండు
హుంకార మొనరింప నుల్లంబు గలగి
శంకింపుచును వారు చయ్యన మరలి
వడి వచ్చినట్టి త్రోవనె గుహ బైలు
వెడలి యందరి కది వివరింప వారు
కడుచోద్య మంది రాక్షసమాయ యేమొ
గడుసురావణుఁడె యిక్కడ డాఁగినాడొ640
చూత మం చరిగి యచ్చోట నరణ్య
జాతంబు కోనలు చరులును వెతకి
హరిమాయ గప్పుట నాగిరి త్రోవ


గురు తేమి గనలేక గ్రుమ్మరి యలసి
మగుడి యందఱు విభ్రమంబుగా నెంచి
తగుఠావుల వసించుతఱి సంజ యయ్యె
అవ్యవసరమునం దారామచంద్రుఁ
డొయ్యన నర్ఘ్యంబు లొనరంగ వార్చి
జపములు దీర్చి కుశవ్యాప్తశయ్య
నుపవిష్టుఁడై సుఖంబుండి వేగుటయు650
వనచరసేనతో వగమీఱ వెడలి
వనధి సేతువుగట్టి వడి లంకకోట
లగ్గలు పట్టించి లావు రక్కసుల
మ్రగ్గించి రావణు మర్దించి సమర
జయరమాజానియై జానకీజాని
నయముగా సాకేతనగరంబుఁ జేరి
పట్టాభిషిక్తుడై ప్రజలఁ బ్రోచుచును
పట్టైనసామ్రాజ్యపద మంది వెల సె.
కావున నట్టి వేంకటభూధరప్ర
భావంబు భావించి భవపద్మభవులు660
మునులు నిలింపకింపురుషగంధర్వ
జనములు నుతియింపఁజాల రింతైన
నని తెల్ప విని విస్మయంబున నతని
వినుతించి యమ్మునుల్ వినయంబుతోడ
వైకుంఠగుహవైభవంబు మీవలన
మాకు వినంగల్గె మరి శ్రీనివాసుఁ
డెవరికి ప్రత్యక్ష మెసగంగ నిచ్చి
భువిని యర్చ్యాకృతిపూజలు గాంచె


నెవ్వరిని యనుగ్రహించె నెవ్వారి
క్రొ వ్వడంచెను వినఁ గుతుక మయ్యెడిని670
వినిపించవే యని వేఁడ సూతుండు
తనగురునిఁ దలంచి తగుపురాణములు
దడసి యూహించి యెంతయు సంతసంబు
అడర నమ్మౌనుల కపు డిట్టు లనియె
వినుఁడు దెల్పెద నట్టివృత్తాంత మెల్ల
మును హిరణ్యునివంశమున నుద్భవించి
కొందఱు దైత్యులు ఘోరవిక్రములు

రావణునిచే బాధితులగు మునులు బ్రహ్మతో మొరలిడుట

పొందికతో జగంబులను బాధింప
రావణుండును సురరాజును గొట్టి
పూవుఁబోణులఁ బట్టి పురి చరల్ బెట్టి680
వరగర్వమునఁ దపోవనుల జన్నములు
చెఱుచుచు వర్తించ సిడిముడి పడుచు
గౌత మాగస్త్య గర్గ మృకండు కణ్వ
మాతంగ విఘ నోత్రి మాండవ్య కుత్స
వరతంతు నడభరద్వాజ వసిష్ఠ
శరభంగ జాబాలి జైమినిప్రముఖ
మునివర్యు లందఱు మూకగాఁ గూడి
కినుకతో దర్భలు కృత్తులు జంక
నిడీకొని సమిధలు హితపుస్తకములు
జడలు పైబిగియించి జలకమండలులు690
పడి కేలఁ గీలించి వల్కలంబులను
నిడుదదండములఁ బూనిక వ్రేలఁగట్టి


జపసరంబులువ్రేల సంధించి చెవుల
నుపవీతములు జుట్టి యొనర రుద్రాక్ష
మాలికల్ మెడవైచి మై భూతిఁ బూసి
దాలిచి గోపిచందనములు నుదుట
పర్ణశాలలయందు బడుగు లై నట్టి
పర్ణుల కాపుంచి వలసగా వెడలి
యమరుల నెగ్గించి యష్టదిక్పతులఁ
గ్రమమున దూరి వారలనెల్ల గూర్చు700
కొని బ్రహ్మసభ కేగి కొలువున నలువఁ
గనుఁగొని ప్రణమిల్లి కణక నిట్లనిరి
సకలవిధాత! యో సకలనిర్మాత!
యకళంకగుణజాత! యజ్ఞసంజాత!
శరణుగా నిను జేరఁ జనుదెంచినార
మరుదుగాఁ గరుణించి యభయ మీగదవె
అల హిరణ్యుఁడు వోవ హాయి నుందుమని
తలఁచుచుండఁగ వాని తలద్రొక్కుపాటి
దనుజులు కొంద ఱిద్ధర మునీంద్రులను
జనకుచు యజ్ఞముల్ జెరుపుచుండఁగను710
పాటిల్లు గోర్చుటుపైని రోకంటి
పోటును గల్గుచాట్పున రావణుండు
అమరాధిపతిమొద లష్టదిక్పతుల
సమరంబులన్ దిరస్కారంబు జేసి
మమ్ము సడ్డించక మా తపోవనము
లెమ్మెను జొచ్చి మహీసురాదులను
బాధించి యిల్లాండ్రఁ బట్టుచు నెల్ల


వేధలు జేయనెవ్విధము తాళుదుము
దేవర యేమియున్ దెలియనియటుల
రావణాదులకు వరంబు లొసంగి720.
యీరీతి వేడుక లివి చూచుకొనుచు
వారి దుర్మార్గముల్ వారింపవేమి
శాప మీఁజాలము సమయుఁ దపంబు
మీపల్కు వర మట్టుమృష యౌను గాన
అనుచు బహుప్రకారాలాపములను
మునిముఖ్యులందఱు మొదలుపెట్టంగ
వనజాసనుఁడు విని వారి నందటిని

మునులు బ్రహ్మతోఁ గూడి వెన్నుని వెదుకఁ బోవుట

అనురాగమునఁ జూచి యాదరింపుచును
తీవరపడనేల తెలియరే మీరు
నావేళ వీ రుగ్రమైనతపంబు730.
సలుపుట నటుల దుర్జయులుగా వరము
చెలిమి నిచ్చితి నింకఁ జింతింపనేల
ఖలదైత్యులను ద్రుంపఁ గలఁడు వెన్నుండు
కలశాబ్ధిచెంతకుఁ గడువడి నరిగి
శరణంచు నాహరి చరణముల్ గనినఁ
గరుణించి దనుజరాక్షసతతిఁ గూల్చి
జలజాక్షుఁడే ప్రోచు సకలలోకములఁ
దలఁకనేటికి పోవుదము సామికడకు
అని యూరడించి య య్యంబుజాసనుఁడు
తనకొల్వు చాలించి తరలి యందఱిని740,


వెంటఁదోడ్కొని యేగువేళ నారదుఁడు
మింటిపైఁ జనుదెంచి మెల్లన డిగ్గి
తమ్మిచూలికి మ్రొక్కి తాపసోత్తముల
నెమ్మిఁ గౌగిటఁ జేర్చి నిలువ న న్నలువ
యాతఱిఁ గల కార్యమంతయుఁ దెల్పి
నాతండ్రి శ్రీజాని నారాయణుండు
వైకుంఠమున నున్నవాఁడొ క్షీరాబ్ధి
నేకాంతకేళిని నెనసియున్నాఁడొ
యెందు ప్రత్యక్షమై యీశ్వరుఁ గనుదుఁ
బొందుగాఁ దెలుపవే పుణ్యచరిత్ర750.
నీ వెఱుంగుదు వబ్జనేత్రునియునికి
నావుడు తండ్రి కానారదుండనియె

మునులకు నారద దర్శనము

వినుఁ డేను జలజాక్షు వేదైకచక్షు
వనరుహమందిరావాసోరువక్షు
బొడగని సేవింప బుద్ధి గాంక్షించి
కడువడి క్షీరాబ్ధికడ కేగి యందు
శ్రీకాంతుఁ గానక శీఘ్రంబు మరలి
వైకుంఠపురికిఁ బోవఁగ నందు కొంద
రా దివ్యభవనరత్నాంకణద్వార
వేదికల వసించు వేత్రధారకులు760,
ననుఁ జూచి యందుఁ బన్నగశాయి లేఁడు
చను ముర్వి వేంకటశైలంబునందు
నెలకొని శ్రీభూమినీళలు దాను
చెలగి విలాసముల్ జెందుచున్నాఁడు


నావుడు మగుడి, యెంతయుఁజింతతోడ
దేవర నడిగి యా దివ్యపర్వతము
జాడ నే తెలియ నిచ్చట వచ్చినాఁడఁ
గూడి పోవుదమయ్య గొబ్బున ననిన

బ్రహ్మాదులు నారదుఁగూడి శేషశైలమునకుఁ జనుట.

చతురాననుఁడు చాల సంతసిల్లుచును
సుతుని నమ్మునులఁ గూర్చుక యేగి వేగ770.
శేషాచలం బున్నచెలు వెల్లఁ జూచి
శేషశాయివసించు శ్రీగిరి యదియె
యిదియె కోమలము తా నిందిరారమణి
పదములకుఁ జిగుళ్లు పాన్పుగానెసఁగు
నిది రత్నగర్భ తా నింపు దీపింప
ముదమున ధరియించు ముకుటరత్నంబు
ఇదె జగంబుల కెల్ల నిరవుగా మెలఁగు
మదనగురున కైన మణిమందిరంబు
ఇదియె భక్తులపాలి కెడలేని సిరులు
పిదపగాక యొసంగు పెన్నిధానంబు780.
ఇదియె చేరినవాని కెట్టియాపదలు
చెదరిపోఁ గరము రంజిలు చెలికాఁడు
కన్నవిన్నవిగాని కడువింత లెల్ల
చెన్ను మీఱ ఫలించు క్షేత్రమ్ము నిదియ
యెల్లతీర్థంబులు నెలమి గర్భమున
చల్లగా ధరియించు జననియు నిదియె
యనుచు స్వర్ణమయంబు లైన వన్యలను
తనరు మాణిక్యలతావితానములు


చిత్రవర్ణంబు లై చెలగుమృగములు
చిత్రరూపముల మించిన విహంగములు790,
బహుభావములఁ దోచు భవ్యశృంగములు
బహువిభ్రమముల జొప్పడిన పాదములు
పొడవుగాఁ బ్రవహింపఁబోలు నిర్ఝరులు
నడచి ఫలములిచ్చు నవకల్పతరులు
కనుగొంచుఁ జనిచని కడుచోద్య మంది
తనసృష్టిగామి యెంతయు సిగ్గుపూని
భూరిప్రదక్షిణమ్ములు నాచరించి
శ్రీరమణుని యందు చేరి కన్గొనక
యలసి మేను చెమర్ప నసురుసురనుచు
నిలిచి మౌనులఁజూచి నెమ్మి నిట్లనియె800.
నేను మీరును గూడి యిట్టెల్ల వెదకి
కానలేమైతిమి కమలాసహాయు
నెటు లిట్టియిల నుండు నెమ్మెయి నిజము
చటులమాయలఁ బన్నసాగెఁ గాఁబోలు
ప్రతిదరి ప్రతిఝరి ప్రతిగహ్వరంబు
ప్రతితటి ప్రతిశిఖరంబు నంతయును
వెదకుఁడు మీరు వేర్వేర నందందు
ప్రతివనాంతర మేను బరికించువాఁడ
జతనమంచును బంచి సంయమీవరుల
వితతమాయల నేర్పు విలసిల్లుచున్న810

బ్రహ్మాదులు వెన్నుని గానలేక తిరుగుట,

తనతండ్రిమహిమలు తలఁచి తలంచి
వనజాతములు సొచ్చె వనజాతభవుఁడు


అంతట నామౌనులందఱు నందు
వింతకోనలు చరుల్ వెస కందరములు
నరయుచు వింత లౌనట్టి మృగముల
హరియంచు భావింతు రం దొకచెంచు
తిలకించినన్ వాసుదేవుఁడే యంచు
దలఁచి కేల్మోడ్తు రత్తఱి దివ్యమైన
ఫులుగును గనుగొన్న పురుషోత్తముఁ డని
కొలుతు రే పందిగన్గొన్న వెన్నుఁ డని820.
మ్రొక్కుదు రీరీతి మొనసి దిగ్భ్రాంతి
జిక్కినటుల బుద్ధి చెదరఁ ద్రిమ్మరుచు
సాయంతనంబున స్వామిపుష్కరిణి
చాయకు దైవవశమున వచ్చుటయు
నాతమ్మిచూలియు నపుడె యచ్చటికి
నే తేరఁగా వార లీతెరం గెల్ల
విన్నవించ ముకుందు వెదకంగఁ దరమె

స్వామిదర్శనమునకై బ్రహ్మాదులచ్చటి పుణ్యతీర్థంబులం దపంబుసల్పుట.

యన్నగదారి ప్రత్యక్ష మై తానె
కరుణించుదనుక దుష్కరమైన తపము
చిరతరంబుగ నిందుఁ జేయుద మనుచు830
పరమేష్ఠి నిర్ణయింపఁగ వార లటుల
కరమొప్ప స్వామిపుష్కరిణి స్నానంబు
సలిపి తపించి యచ్చటి కల్పసరణి
వెలయ సంకల్పముల్ వేర్వేరఁ జేసి
కొందఱు శేషవైకుంఠతీర్థముల
కొందఱు తుంబురుకోన తీర్థముల


మణికొందఱు సనత్కుమారుతీర్థమున
మఱికొంద రందు కుమారధారికను
నయ్యెడఁ గొందరయ్యాకాశగంగ
జయ్యన కొందఱు చక్రతీర్థమున840.
కృతమతుల్ గొందఱు కృష్ణతీర్థమున
చతురులు కొందఱు సనకతీర్థమున
ఘను లందు కొందఱు కపిలతీర్థమున
అనఘులు కొంద ఱింద్రాదితీర్థముల
నీరహిన్ దమతమ కెనయు ఠావులను
జేరి నిష్ఠలఁబూని చెలఁగుచుండంగ
నారదాగస్త్యకణ్వ ప్రముఖులును
సారసాసనుఁడు నాస్వామిపుష్కరిణి
తటమున నశ్వత్థతరువుల క్రింద
చటులతనియమముల్ సల్పంగఁదొణఁగి850
యాసనాసీనులై యచలగాత్రులయి
నాసాగ్రములనిల్పి నయనముల్ కుదుర
నక్షమాలికలు చేయంది మంత్రోద్య
దక్షురాంగన్యాస మమరఁ గావించి
యేకాగ్రచిత్తులై యీశ్వరు నెదలఁ
జేకొని ధ్యానముల్ సేయుచు దిశలు
తిరిగిచూడ కొకింతఁ దెమలక మేన
నురగముల్ వ్రాకెనా నులకక నూర్పు
లడచుచు గాడ్పులే యాహారముగను
గుడుచుచు రేబగల్ గూర్క కింతైన860


నింద్రియంబుల నిగ్రహించి సత్యైక
సాంద్రమానసముల శాంతిఁ బెంపొంది
పసదీర్చు బచ్చన ప్రతిమలపగిది
వెస పరకాయప్రవిష్టు లౌ వారి
తనువు లుండెడిరీతి తముఁదామె మఱచి
తనరెడుచాడ్పునన్ తన్మయానంద
భరితులై బ్రహ్మానుభవవైభవముల
స్థిరతరోగ్రతపంబు సేయుచునుండ

దశరథుఁడు పుత్రులు లేక దుఃఖించుట.

నపు డయోధ్యానాథుఁ డాదశరథుఁడు
విపులవిక్రమముల విలసిల్లి రాజ్య870
పాలనఁజేయుచు భావంబునందు
బాలురు లేమి నిర్భరశోక మంది
కులముద్ధరింపంగఁ గొడుకులులేమి
కలిమి యేమిటికి భోగంబు లేమిటికి
కొడుకులు లేని తేకువ వెతగాదె
కొడుకులు లేనిల్లు గోరియగాదె
కొడుకులు లేని మేల్ కొఱతయగాదె
కొడుకులు లేనిమేన్ కురుమోడుగాదె
యనుచు శోకింపుచు నడర నూర్పుచును
తనగురుని వసిష్ఠుఁ దలఁచిన నతఁడు880.
క్షణమాత్రమున వచ్చి కనుపట్ట నృపతి
ప్రణతుఁడై యతని కార్తితో నిట్టు లనియె
ఇనవంశదైవతం బీవకా నాదు
ఘనశోకములు దీర్పఁగాఁజాలు దనఘ


నేను నీకరుణచే నిఖిలభూములను
మానితంబుగ నీతిమర్యాద నేల
నెంతవైభవ మది యేమితపంబు
సంతతికి సుతుండు జనియించకునికి
నాదుఃఖ మెటు లారు సరక మె ట్లుడుగు
నాదైన్యమును బాపి నన్ను రక్షింపు890.
మేమిచేసిన పుత్రు లిపుడె కల్గెదరు
ప్రేమ నుపాయం బెఱింగింపఁగదవె
అనవు డట్టివసిష్ఠుఁ డాదరంబునను
మనమునఁ దెలిసి సంభావ్యకార్యములు

వసిష్ఠుఁడు దశరథుని స్వామిపుష్కరిణియందు హరిపూజ గావింపుమని చెప్పుట.

వసుధేశ నీ కింతవంత యేమిటికి
అసమాన మౌ వెంకటాచలంబునను
వ్రతముఁజేకొని యందు స్వామిపుష్కరిణి
నతిభక్తి మజ్జనంబై హరిపూజ
సలిపిన శ్రీజాని సాక్షాద్భవించు
తలఁచినకోరికల్ తక్షణం బొసఁగు900.
నలువయు నిపు డందు నారాయణాంఘ్రి
జలజముల్ గనుఁగొను సంకల్పమునను
బృందారకమునీంద్రబృందంబుతోడఁ
బొందుగా నియమంబుఁ బూని యున్నాఁడు
పరమాత్ముఁ డతనికిఁ బ్రత్యక్ష మగుచు
నరుదెంచు నంతలో నచటికి మనము
జనవలె నని వేగ జననాథుఁ దోడు
కొనివచ్చెఁ దనమదిఁ గుతుకం బెసంగ


గ్రీష్మర్తువర్ణనము.
నప్పుడు వేసవి యధికమై ముదుర
దప్పిగొని యినుండు తనకరమ్ములను910
ధరగల్గు నీరముల్ ద్రావెడినాఁగఁ
జెరువులు దొనలేర్లు సెగ నింకసాగె
కొలనుల వాలుగల్ కుతకుత నుడికి
సొలసి యడుగసళ్ల చొరఁబారి యడఁగె.
భైరవుండు ధరించు పైఠిణీ లుతుకు
నేరుల గతిఁ బొల్చె నెండమావులును
మల్లియలతకూన మమతమీఱంగ
నుల్లసిల్లుచు నినుం డొగిపెండ్లియాడ
మొత్తమై తలఁబ్రాలు వోసిన యాణి
ముత్తియమ్ముల లీల మొగ్గలింపొందె 920
గాట మౌ నెండచేఁ గాఁగి తెమ్మెరలు
పాటలవాసనన్ బడలిక దేరె
పడమటిగాడ్చుచే భానుయానంబు
వడి తగ్గె నసఁగ దివావేళ హెచ్చె
ధర దప్పి నీ ళ్ళంబుదము వేడి చాచు
కరములోయన సుడిగాడుపు లెసఁగె
మృగముల్ మరీచికాస్మృతిఁ బూని నిక్క
మగు ప్రవాహముఁజేర నళుకుచు సొలసె
రవిదీప్తిపటికముల్ రవిలి పెంపొంది
దవవహ్నిశతము లత్తఱి సృజియించె930.
నెలనాగరవికపై నీర్ష్య పాటింప
మలయజరస మట్ల మలసె చన్గవను


చలివెందలి మిటార్ల చనుదోయి దుర్గ
ము లయి డాగెడు శైత్యములకు ఠావయ్యె
కవలపానుపు లెడగాఁగ మరుండు
ఫువువిల్లు జబ్బుగాబోఁ జింత నణగె
నపు డమ్మునులు పంచాగ్నిమధ్యమున
విపులతపంబు గావింవుచుండంగ
నన్నగ మమితదావాగ్నిమధ్యమున
నున్నతతప మంది యొప్పారె నంత 940,
తరుణులస్నేహంబు దగుల దీపించు
విరహదీపము కోడి వినువీథి నంటె

వర్షాగమము.

నన క్రొమ్మెఱుగు లయ్యంబువాహముల
తునుకలం గనుపట్టె తొలకరివేళ
నంబుజాప్తుఁడు గొను నప్పు తా మోచు
నంబుదంబును బట్టి యమరవిభుండు
దండించ నది యశ్రుతతి నించెగాఁగ
మెండుధారలు కొన్ని మేదినిఁ దొఱఁగెఁ
దవవహ్నిదీపికాతతి కజ్జలంబు
దవిలెనో యన దివిఁ దనరె కార్మొగిలు 950
ఘనమత్తగజముల కరసీకరములొ
యన జల్లువానలు నలరె నందంబు
మెల్లమెల్లన కీలు మేలును దిగగ
మల్లడి నయ్యభ్రమదకరిఘటలు
మెఱుఁగులన్ నిగళముల్‌ మెదలక పూని
నెఱసినట్టుల జడుల్‌ నిలుకడ దనరె


కడలిలో మొుగు లుదకంబులు ద్రావు
నెడ మున్ను ముత్తెంబు లింపొందుకెంపు
లెఱుగక మ్రింగి తానిపుడు గ్రక్కె నన
కఱకేంద్రగోపముల్‌ కడువడి రాలె 960
ఘనమర్దళంబుల గర్జనధ్వనుల
కెనయుమయూరిక లెలమి నర్తించె
నెమ్మి కొమ్ములు సల్పు నృత్యముల్‌ చూడ
నెమ్మిఁజెందక హంసనివహంబు దొలగె
అప్పు లిచ్చి ఘనుండ వటు లార్భుటించు
టొప్పునే యని మబ్బు నుబ్బు నిందించి
మొగిలిపిండు గడంగి మొగమె త్తి కేరి
నగె నన నవ్విరుల్‌ నవములై యలరె
సరిదంబుజాక్షులు సంపూర్ణరసము
మెరయ నిజేశు నెమ్మెయిఁ జేర నురికె 970
జగతీరమణికి పర్జన్యుం డొసంగు
మగరానగలుగా నమరె తటాకములు
నలజడి నంబుమధ్యావాసనియతి
నలజడి లేకుండు న మ్ముునీశ్వరుల
ఘోరతపంబు గన్గొనుచు నచ్చెరువు

దశరథుఁ డాస్వామిపుష్కరిణియొద్ద తపముసల్పు తాపసులంజూచుట

మీర నాదశరథమేదినీశ్వరుఁడు
గురునివెంబడి నంటి కొండ యెంతయును
వరుసఁ జూచుచుఁ జేరె స్వామిపుష్కరిణి
చేరి యందు నృపాలశేఖరుఁ డపుడు
భూరిప్రదక్షిణంబులు సేయుచుండఁ 980


గొందఱు మునివ్రేలు కుంభిని నూని
పొందించి చూపు లంబుజమిత్రునందు
ప్రసృతోర్ద్వబాహులై పంచాగ్నిమధ్య
వసతి చలించక వరలువారలును
కొందఱు నీటిలోఁ గుత్తుకబంటి
నొందు గోముఖవృత్తి నుదకభక్షులయి
అనిశంబు నక్షి నాహరిఁ బ్రతిష్ఠించి
కనుంగొంచు నెంతె నిల్కడ నుండువారు
కొంద ఱాసననిష్టఁ గూర్చుండి చూడ్కి
పొందుగా నాసాగ్రమున గీలుకొల్పి 990
హృదయాంబుజంబున నీశ్వరు నిల్పి
పదరక నానందభరితులౌవారు
నందు కొందఱు కపాలాసనస్థితులు
జెంది నందకుమారు శ్రీ శ్రీనివాసు
భావించి దృఢముగాఁ బ్రణవజపంబు
గావింపు చున్నతిఁ గనుపట్టువారు
వెస కొంద ఱయ్యరవిందలోచనుని
బిసతంతునిభ నాడిపేర్మి భ్రూమధ్య
మున నిల్పి ఘనయోగమునఁ బ్రాణములను
తనవశంబుగం జేసి తనరెడువారు 1000
నగుచు నమ్మునివర్యు లలర సోద్యముగ
జగదాదికర్త యాజలజసంభవుఁడు
సమశిరోగ్రీవనిశ్చలగాత్రుఁ డగుచు
సముదగ్ర మగు వ్యాఘ్రచర్మంబునందు
నాసనాసీనుఁడై యనితరాసక్తి


నాసాగ్రలగ్నమై నలువొందఁ దనదు
దృష్టిఁ బూన్చి ముకున్దు దిలకించి మదిని
యష్టాక్షరీమంత్ర మభ్యసింపుచును
శుద్ధసత్యంబున శోభిల్లుచుండ
నద్దాతఁ గనుఁగొని యతివిస్మయమున 1010.
మ్రొక్కినిల్చిన రాజముఖ్యునిఁ జూచి
మక్కువను వసిష్టమౌని యిట్లనియె
తడయ నేమిటి కింక దశరథభూప
కడువడి స్వామిపుష్కరిణి స్నానంబు
సలుపు మే దెలుపుదు సంకల్ప మనుచుఁ
బిలువ నవ్విభుఁడు సంప్రీతి నం దరిగి
తీర్థంబులం గ్రుంకి తీర్చి కర్మములు
ప్రార్థించి గురుని యష్టాక్ష్తరిఁ జెంది
న్యాసపూర్వముగ మంత్రము జపించుచును
వాసుదేవుని శ్రీనివాసు భావించు1020.
కొనుచు వ్రతంబుఁ జేకొని సతతంబు
ఘనభక్తి దత్పూజఁ గావింపుచుండె

శ్రీనివాసుఁడు విమానమునఁ బ్రత్యక్షమగుట.

అంతట నాచెంత నత్యంతకాంతి
సంతతి యెంతయు సంతతం బగుచు
శతలక్షకోటి భాస్కరకరోత్కరము
వితతామితౌర్వాగ్నివితతికీలములు
ధ్రువతరాసంఖ్యవిద్యుత్ప్రభాభరము
నవిరళానందచంద్రాతపోచ్చయము


ప్రణుతకాంతిసముద్రప్రధితసుమేరు
మణిశృంగమును మించు మకుటంబువాని1080.
కరుణారసాంబుజాకరమున నలరి
కరమొప్పు తమ్ములౌ కనుఁగవవాని
పురుషార్థములు నా ల్గెపుడు నిచ్చుకల్ప
తరువు లౌ భుజముల దనరెడువాని
నొనరఁ గోరికలెల్ల నొసఁగనౌ వ్రతము
కనుపట్టఁ బూను కంకణములవాని
జగదంబ గూర్చుండు చదురుపీఠంబు
పగిది మించిన కాౌస్తుభముఁ దాల్చువాని
కరధృత శంఖచక్రంబులవాని
వరదహస్తప్రభ వరలినవాని1090.
చేకొని చాణూరుఁ జిదిమిన తొడల
డాకమించఁగ నుంచు డాకేలువాని
కళుకు బంగరుశాలు గప్పినవాని
బలిఁగ్రుంగఁ ద్రొక్కిన పాదంబువాని
చాల భక్తులకు నిష్టములు వర్షించు
నీలమేఘంబుగా నెలకొన్నవాని
పారిజాతద్రుమ ప్రాంతవేదికను
భూరి వైభవములఁ బొలిచినవాని
ఆనందనిలయ విమానాంతరమున
నానందమూర్తియై యలరెడువాని1100
శ్రీనివాసునిఁగాంచి చెలువు భావించి
యానంద బాష్పంబులడర నర్తించి
దెేహముల్‌ పులకింప ధృతులు చలింప


మొహంబు రెట్టింప ముదముద్భవింప
పారవశ్యము మించ భయముదీపించ
కోరికల్‌ మఱచి యాగుబ్బుగానరచి
రెప్పవేయక చూచి రిత్తకేల్‌ సూచి
యొప్పుగాఁ దెలివొంది యూహించిమదిని
వెన్నుని వెసఁగాంచి వేదసూక్తముల
సన్నుతుల్‌ సేయంగ సాగిరందరును. 1110.
అపుడు చతుర్ముఖుం డాశౌరిఁ బొగడ
నపరిమితముఖంబు లందమి వగచి
చతురత్వమునఁ దన చతురాగమములఁ
జతురాననంబుల సన్నుతిసేయ
మఱి యగస్త్య వసిష్ఠమాండవ్యకుత్స
శరభంగ జైమిని జాబాలి వత్సు
లయ్యెడ వేర్వేర నలర సన్నుతులు
సెయ్యంగ నందు మించెను మహాధ్వనులు
అంతట నారదుం డా నినాదంబు
లెంతయుఁ దడవు కొక్కింత నిల్చుటయుఁ1120.
దనచేతి మహతి తత్తరమున హత్తి
మునిజనంబుల కెల్ల ముందరహత్తి
జరగిన బిరుడలు చక్కగానొత్తి
సరిమేళవించి బజాహిణిచేసి
యాహారిఁ గీర్తించి యాలపించంగ
నా హరి యటు శంకరాభరణేశు
దిరువేలువీనుల నింపును సొంపు
మెరయ నాలించి యెమ్మెయి భోగవితతి


యున్నతిమించంగ నుల్లాస మొంది
కన్నుల బ్రహ్మనున్ గనుఁగొనఁడయ్యె 1130

శ్రీకాంతుఁడు బ్రహ్మను విడిచి దశరథుని గాంచ నాతఁడు నాల్గుశ్లోకముల నుతించుట

అప్పుడు దశరథుం డబ్జలోచనుని
విప్పులౌ కన్నుల వెసవెసఁ జూచి
యానందభరితుఁడై యలరి నటించి
పూని యంజలి శిరంబున భక్తిమించ
శ్రీశాంతుగుణములు చింతించి నాల్గు
శ్లోక౦బుల నుతించె శోకంబు దొలఁగ
నపుడు ప్రసన్నుఁడై యా శ్రీనివాసుఁ
డుపగూఢసార్వజ్ఞ మూని తాఁ దెలియ
నటుల బ్రహ్మాదుల నాదరింపుచును
చటులగంభీరఘోషణభాషణముల 1140

శ్రీనివాసుఃడు బ్రహ్మాదుల నాదరించి వచ్చిన కారణమడుగుట

మీర లిచ్చట వచ్చి మిక్కిలితపము
లీరీతి సల్పుట కేమి కారణము
దితిసుతుఁ డెవఁడైన దేవరాజ్యంబు
మితిఁదప్పికొనెనొకో మీయధికార
నిర్నయం బెవ్వరేనియు సాగనీరొ
వర్ణాశ్రమంబుల వరుస దప్పినదొ
వేధకు నేమైన వేధదాకినదొ
బాధకు లెవరైన బాధించినారొ
వేదరాసులను నిర్వెదమొందినదొ
వేఁదుఱాప్తిఁ దొలంగి వివరింపుం డనియె.1150


అనుటయు నబ్జజుం డబ్జనాభునకు
వినతుఁడై కేల్మోడ్చి వినయంబుతోడ
సర్వలోకేశ్వర! సర్వాంతరాత్మ!
సర్వశక్తిక! సర్వజగదాదికర్త!
సర్వజగన్మయ! సర్వఙ్ఞ! నీవు
సర్వగీర్వాణాదిసాధారణుక్రియ
నన్నడిగెద విటె నావల్ల వినగఁ
విన్నవించెద మున్ను వేదాదు లీవు
నిర్నయించినరీతి నిర్బాధముగను
బూనిననేమంబుఁ బూని యున్నవియ1160
అల్ల హిరణ్యకశ్యపుగాని నీవు
పెల్లున నరసింహభీకరమూర్తి
వగుచు ఖండించి యింద్రాదుల పగయు
వగయుఁ దీర్చితి వట్టివాని వంశమున
జనియించి కొందఱీ జగతిధర్మంబు:
జెనకుచు జనుల శాసింపుచున్నారు
సురగరుడాదికస్తోమంబుచేత
వరబలంబున వారు వధ్యులుగారు
మరియు రావణుఁ డను మత్తరాక్షసుఁడు
చురుకు చూపుచు సురాసురముఖ్యజనుల1170.
ఘోరాజి బంధించి కోమలాంగులను
మీరి చరల్‌ బట్టి మృత్యువు గొట్టి
దేవేంద్రు ననిఁ బట్టి తెమలక కట్టి
దేవలోకము జొచ్చి ధృతిఁ గొల్లబెట్టి
చాల రాయిడిచేయ సాగె నింకేమి


కైలాసగిరిని పెకల్చెను కేల
దెేవర లింద్రాదిదివిజుల మునుల
బ్రోవగ నల వారిఁ బొలియించవలయు
శ్రీశైలపరిసరసీమను దైత్యు
లాశీతనగదక్షిణాంబుధిమధ్య 1180.
మంతయు విహరింపు చచటి సజ్జనుల
నెంతయు బాధించు నెడల నెవ్వారు
వారిని వారించువారలే కాక
నారయ రక్షకు లన్యు లున్నారె
శరణంబు దెవర చరణంబె మాకు
కరుణించి మము బ్రోవగదవె ముకుంద
అని విన్నవించిన యా శ్రీనివాసుఁ
డనుపమకరుణారసాబ్ధిఁ దెేలించి
చిజునవ్వు మోమున జిందులుద్రొక్క
[5]నొరపుజూపులఁ జూచి యూరడింపుచును1190
సురలార మీరింత సొలయంగనేల
కఱకురక్కసుల నే ఖండించువాడ
దనుజుల క్షణమాత్ర తలలుద్రవ్వించి
పనుపుదు నా జమునట్టణంబునకు
జడియక సుఖముగాఁ జరియింఫు డింక

శ్రీనివాసుఁడు బ్రహ్మాదులకుఁ గోరిన వరములిచ్చుట.

నడుగుడు కాక్షించు నట్టివరంబు
లిచ్చెద నిచ్చోట నెడపక యిపుడె


యిచ్చ సందియ మిఁక నేమిటి కనియె
నావుడు హర్షించి నారాయణునకు
గావించి ప్రణితు లాకమలసంభవుఁడు 1200,
కరుణాంబునిధి నిన్ను కనుఁగొన్న వెనుక
నరసి కోరఁగ మాకు నన్యముల్‌ గలవె
నినుజూచిన లభించు నిత్యసంపదలు
నిను గొల్చిన ఫలించు నిఖిలపుణ్యములు
నిను నుతించినఁ గల్గు నిరతభాగ్యములు
నిను దలంచినఁ బాయు నిష్ఠురాఘములు
కలశాబ్ధి జేరియుఁ గలదె దాహంబు
కలితామృతము గ్రోలఁ గలుగునే తృష్ణ
ఆనందమయుఁడ వౌనట్టి నిన్ గాంచి
యానందరస మోలలాడెద మిపుడు 1210,
మరియుఁ గోరినవెల్ల మము వేడుఁ డంటి
మరువరా దామాట మధుకైటభారి

శేషశైలమున స్వామి స్థిరముగానుండునట్లు బ్రహ్మకు వరంబొసంగుట.

పరమాత్మ నీ విందు ఫణిరాజ గిరిని
స్థిరముగా నీమూర్తి చెలువంద నిలిచి
దృశ్యత నిట్టి మందిరమున భక్త
వశ్యుఁడవై యుండవలయు మాతల్లి
శ్రీదేవియును నిట్టి శ్రీ విలసిల్ల
నాదరంబున నుండి యతిచితరత్న
శృంగాంతరంబుల చెలిమి నిన్ గూడి
శృంగారలీలచేఁ జెలఁగి వర్తింపఁ 1220


గోరుచున్నది మౌనికుంజరుల్‌ నిత్య
సూరులు ఖచరులు సురలు కిన్నరులు
మేమును ప్రార్థింతు మెపుడు నీవరము
పూనిక దయచేయు భువననిధాన!
ఇలఁగల్గు జనముల కిప్టార్థతతులు
చెలిమి నొసంగుచుఁ జెలువొందవలయు
ముందర కలియుగంబున జనించునపు
డందఱు నల్పపుణ్యక్రమంబుననె
అల్పబలోపాయు లగుదురు వారిఁ
గల్పకతరులీల ఘనఫలం బొసఁగి 1230
రక్షింపవలయు వరంబిదె యనిన
పక్షివాహనుఁ డట్టి బ్రహ్మ కిట్లనియె
కమలసంభవ! మీరు కాక్షించినటుల
విమలరూపంబున వేంకటాచలము
శృంగాంతరమ్మునఁ జెలగు నిమ్మూర్తి
రంగొందఁబూని సర్వసుపర్వభక్త
సులభతఁ గనుపట్టుచును నెల్లవేళ
లలరుచు విహరింతు నాకల్పముగను
అని యబ్జభవునకు నానతి యిచ్చి
తనరఁ గటాక్షించి దశరథవిభుని 1240,
సాకేతపురనాథ! స్వామిపుష్కరిణిఁ

నాల్గుశ్లోకములనుతించిన దశరథునకు స్వామి నల్గురు పుత్రులను బ్రసాదించుట.

జేకొని స్నానంబుఁ జేసితిగాన
నీ పురాకృతపాపనివహంబు తొలఁగి


శ్రీ పరంపర నీకుఁ జేకూరు నిఁకను
నాలుగు శ్లోకముల్‌ నన్ను గురించి
చాల సందర్భించి సన్నుతించుటను
శ్లోకసంఖ్యను సర్వలోకవిశ్రుతులు
ప్రాకటోజ్వలమహారాజ్యలక్షణులు
బలపరాక్రమములఁ బ్రతిలేనివారు
నలువురు నీకు నందనులు గల్గెదరు 1250.
చను మయోధ్యకు ని వ్వసంతంబునందె
దనరంగ నశ్వమేధంబుఁ గావింపు
మిావసిష్టమునీంద్రు డిందు నాచార్యుఁ
డై వెలయఁగఁజాలు నని నియోగింప
విని యట్టు దశరథవిభుఁడు కృతార్థ
తను ముకుందునకుఁ బ్రదక్షిణనతులు
గావించి యానందగళితాశ్రుఁడగుచు
సేవించి వీడ్కొని శిష్ఠు వసిష్టుఁ
గలిసి యయోధ్యకుఁ గదిసి యేగుటయుఁ
దిలకించి చక్రమును దేవుఁ డిట్లనియె 1260.

దేవుఁడు లోకకంటకసంహారంబొనర్ప చ్రకంబున కాజ్ఞయిచ్చుట

విను మస్త్రరాజ యి వ్వేల్పులు చూడఁ
గను రాజవేషంబు గైకొని నీవు
జ్య్వాలారపంక్తులు సైన్యపాలురుగ
చాల శస్త్రంబులు సైనికుల్‌ గాఁగ
నిజకింకరానీకనిష్టురోద్ధతులు
త్రిజగద్భయంకరస్థితి విజ్బంభింపఁ
గదలి వేగమె లోకకంటకు లెందు


మెదలినఁ బరికించి మించి పోనీక
భండనంబునఁ జండపాండితిఁజెంది
ఖండతుండంబులు గాఁగ ఖండించి1270
యొక రెండుప్రొద్దుల నుర్వి నందఱికి
బ్రకటసౌఖ్య మొనర్చి ర మ్మని పనిచె

సుదర్శనాగ్రణి శత్రుసంహారంబొనర్చుట

అటు లంపిన సుదర్శనాగ్రణి హరికిఁ
బటుభక్తి మ్రొక్కి నిబ్బరమొప్ప వెడలి
భీకరతరజైత్రభేరిభాంకృతులు
లోకలోకాలోకలోచనప్రౌఢి
మెఱయ నార్భటులచే మిన్ను భేదిల్ల
కఱకుమించిన పెక్కుకైదువుల్‌ బూని
కింకరసంఘంబు కెరలి బెట్టడరి
హుంకారసింహనాదోద్ధతుల్‌ నెరప1280
చతురంగబలములు సమకట్టి నడవ
చతురత మించంగ జైత్రసన్నాహ
పటిమ ఘటించి యాప్రాగ్దిశాభాగ
కుటిలాటవులఁ జొచ్చి కోలాహలముగఁ
గార్చిచ్చు బేర్చినకైవడి నంటి
యార్చుచు రిపుల సంహరింపందొణఁగె
అపు డామురారిబహ్మాదులెల్లరును
విపులభక్తుల వేళవేళ నర్చించి
పరిణతబ్రహ్మానుభవమునఁ జాల
నిరుపమానంద మంది నిరంతరంబు1290


నిత్యసూరులమాడ్కి నిరతకైంకర్య
కృత్యసత్యాత్ములై కిల్చిషం బెడలి
సంసారవాగుర సడలించుకొానుచు
కంసారిసాన్నిధ్యకలితభావమున
నన్యాఖిలాషంబు లంట కెంతయును
ధన్యులై యా గిరిఁ దనరుచుండి రని
శ్రీ సభాభివ్యక్తిఁ జెలఁగువృత్తాంత
మాసూతుఁ డందు సంయములకుఁ దెలిపె
అనివిచిత్రార్ధసమర్థనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యుపేర1300
విపులానుభావభావితసంవిధాన
కపటనాటకజగత్కారణుపేర
భాసురాంగశ్రుతిభారతిభవ్య
లాసికాగీతవిలాసునిపేర
తారకాంతకపితృద్వంద్వా ద్యతీత
తారకమంత్రాభిధానునిపేర
ప్రత్యాహృతోత్తరాపత్యచైతన్య
సత్యనిత్య్యబహ్మచర్యునిపేర
క్షీరపారావారసీకరాసార
పూరితనిజముఖాంభోజునిపేర1310
పావనభక్తాప్తబంధునిపేర
గోవిందరాజముకుందునిపేర
శ్రేష్టలూర్యన్వయశ్రేష్ఠశీలుండు
ప్రేష్టమహాయశ శ్రీధురీణుండు
గోత్రభారద్వాజగోత్రవర్థనుఁడు


సూత్రుఁడాపస్తంబసూతానువర్తి
అష్ఠభాషాకవిత్వార్జితప్రోద్య
దష్టావధానవిఖ్యాతభైరవుఁడు
శ్రీ కృష్టయార్యలక్ష్మీగర్భవార్ధి
రాకాసుధానిధి రాజపూజితుఁడు1820
వివిధవిద్యాశాలి వేంకటార్యుండు
సవరించు (శ్రీనివాసనిలాసమునను
హరువొంద నిది ద్వితీయాశ్వాసమగుచు
ధరఁ బొల్చు నాచంద్రతారకంబుగను.

ద్వితీయాశ్వాసము సమాప్తము◀☆★☆★☆▶

  1. వ్రా. ప్ర. కమనదురూప
  2. వ్రా. ప్ర. సంచవయోర్పు.
  3. వ్రా. ప్ర. హిజుగుల.
  4. వ్రా. ప్ర. మొందదు.
  5. వ్రా. ప్ర. వెరపు జూపు