Jump to content

శ్రీనివాసవిలాససేవధి/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీనివాసవిలాససేవధి

చతుర్థాశ్వాసము

—♦♦♦♦§§♦♦♦♦—


శ్రీ రంజనవిహార శ్రితజనాధార
ధారాధరశ్యామ ధనుధూతభీమ
భీమాసురవిరామ ప్రియతరసామ
సామజావనదక్ష సాధుస్వపక్ష
పక్షలక్షితతార్క్ష్య ప్రకృతిదుర్లక్ష్య
లక్షణోజ్వలరూప లసితాగ్నిగోప
కోపనారిదురాప కుహనాదిగోప
గోపాయితాజ శ్రీ గోవిందరాజు
అవధరింపుము మౌను లంజనాద్రీశు
వివిధవైభవములు విని విస్మయంబు10
నిగుడ నానందించి నెమ్మి సూతునకు
మగుడఁ గేల్మోడ్చి సన్మతి నిట్టు లనిరి
పావనచరిత యో పౌరాణికేంద్ర
నీవు వెంకటధరణీధరమహిమ
వినుపించితివిగాన విశదంబుగాఁగ
విని కృతార్థుల మైతి విమలబోధంబుఁ
జెందితి మమములున్ జెదిరి తొలంగె
పొందుగా లభియించె భుక్తియు ముక్తి
వెన్నుని చరితముల్ వినవిన మదిని
నెన్నఁడు తృప్తిగా దింతైన మాకుఁ20


గావున వెస విన గాంక్ష యయ్యెడిని

శివుఁడు వేంకటాద్రికిఁ బోవుటనుగూర్చి మునులు ప్రశ్నించుట


శ్రీ వేంకటాద్రికి శివుఁడు వి శ్వేశుఁ
డేమికారణమున నేగె కుమారుఁ
డేమిటి కటు తపం బెలమిఁ గావించె
వారుణి యెటుల విష్వక్సేనుఁడయ్యె
నారాయణాద్రికి నామధేయములు
బహువులు గల్గు టెబ్భంగి యింతయును
మహితోక్తులను దెల్పుమా యని యడుగ
నమితపురాణజ్ఞుఁ డైన సూతుండు
క్రమమున వివరింపఁ గడఁగి యవ్యాసు30.
మదిని భావించి వామనపురాణంబు
వెదకి తత్క్రమ మెల్ల వినిపింపఁ దొడఁగె
మునులార ! మీ ప్రశ్నములు తేఁటగాఁగ
వినుఁడు చొప్పరి యట్టి వృత్తాంత మెల్ల
నొకనాఁడు శంకరుఁ డుల్లాస మొదవ

రజితగిరిమీద శివుని యాస్థాన వర్ణనము.



నకళంకరజితశైలాగ్రభాగమున
మకరతస్తంభసంభావ్యవైడూర్య
నికరనిర్మితకుడ్యనీలవిటంక
భూరివాతాయన ప్రోజ్జ్వలహార
చారుతరద్వారచయ పుష్యరాగ40.
పటల గోమేధికభరితకవాట
ఘటిత స్ఫటికవేదికాపద్మరాగ


విహిత పాంచాలికావృతభద్రపీఠ
మహితమౌ నాస్థానమంటపంబునను
నాగచర్మము కటి నలువొప్పఁ గట్టి
నాగభోగాభరణంబులు వెట్టి
యస్థిమాలిక దాల్చి యమృతాంశురేఖ
సుస్థిరోత్తంసమై శోభిల్లఁ బూని
భసితంబు కర్పూరపటలిగా నలఁది
అసితకంఠద్యుతి యమరఁ గస్తూరి50
పూతగా నిటలదృక్పుటము కాశ్మీర
జాతవిశేషకచ్చాయ నిం పొంద
చిరుతవన్నియచేలఁ జెలువుగాఁ గట్టి
కరముల శూలంబు ఘనడమరుకము
సరినంది వినువాక జాజులదండ
యొరపున భరియించి యుదిరి బంగారు
సరిగె పాగయనఁ బెంజడలు బిగించి
సిరులు మీఱిన కొల్వు సింగార మెసఁగఁ
జెలిమిని తన చెంతఁ జేరి యింపారి
చలిగుబ్బలికుమారి శయధృతకీరి60
తొలకరి క్రొమ్మించుతో సరి పోరి
చెలువున మీఱిన చిన్నారి గౌరి
తన పదశ్రీల నొందఁగలేక చివురు
పనిమాలి యుం డుండి పనులౌచు నలయ
తనదు పిక్కల పెక్కు దాల్పమి మరుని
ఘనకాహళులు భంగకలన వాపోవ
తనయూరువుల తీరుఁ దగఁ గొనలేక


ననటులు పొరలిచ్చి యటు తలవంచ
తనపిరుం దంద మందక గిరుల్ నార
గని గుండుపడి యింత కదలకుండంగ70
తనకౌనుబెడఁగు ఇంతయు నళ్కి వెల్లఁ
దనముతో సింగంబు దరులలో డాఁగఁ
దనదు పొక్కిలిచక్కదన మూనఁజాల
కనె సుడి జడతచేఁ గడు భ్రమించంగఁ
దనకుచంబుల డంబు తడవి దాడిమము
లును గుండె వగిలి ముల్బొదలు సేరంగఁ
దనకంఠముబెడంగు ధరియింపలేమి
వనధిలోఁ బడి సంకు వడి మొరలిడఁగఁ
దన మోముగోముఁ జెందమి చందమామ
దినము కృశించి యందె యెదఁ గందఁ80
దన మోవిరంగు బొందఁగలేకయే బిగి
సిన విద్రుమము తెగి చేకట్లుపడగఁ
దనదంతముల కాంతి దగమి కుందములు
వనవాసము భజించి వాడుచుండంగఁ
దనకన్నుఁగవ మిన్నదన మందఁ దమ్మి
దనరు నాగళవారిఁ దపము సేయంగఁ
దననాస సొగసంటఁదగు నువ్వుపువ్వు
మునుమున్నుగను స్నేహమును పెనుపంగఁ
దన కన్బొమలసొంపు తరమ శింగాణి
తునియలు సుగుణంబు దొలఁగి దూర్పడఁగ90
తనపెన్నెరుల తిన్నదనము చేకొనమి
ఘనము చుల్కదనమ్ము గని తెల్విదొలఁగ


తనకల్కి మెయికుల్కుతళ్కుల కుల్కి
కనక నిల్కడ మించు క్షణమాత్ర నడఁగ
సోయగంబునకుఁ దా సోయగం బగుచు
ప్రాయంబునకుఁ దానె స్రాయంబునగుచు
సొమ్ములకును మేలుసొమ్ము దా నగుచు
నెమ్మి మీఱఁగ నుండ నెమ్మదినందు
గండస్థలీగంధగంధలుబ్ధాళి
మండలఘనడిండిమధ్వను లెసఁగ100
ఘలఘల మని రత్నకంకణమ్ములును
మొలనూలిఘంటలు మ్రోయుచుండంగ
తనబొజ్జకడుపుపైఁ ద్రాచుజన్నిదము
పెనఁగుచు నటు నాభిబిలము దూరంగ
పిండివంటల చవిఁ బెనుచీమ లంటి
తొండంబున్ జొరఁ దొట్రువాటునను
కసరుచు బుసకొట్టు కరిరాజు ముఖము
విసరుచు నొకదండ విఘ్నేశు డుండ
నందికేశ్వరుఁడు నానంద ముప్పొంగఁ
బొందుగా బెత్తు చేఁబూని భూతముల110
దివిజూసురల బారు దీర్చి యందంద
రవళి యడంచి బరాబరుల్ సేయ
సిద్ధులు యోగులున్ చిరజీవముఖ్య
శుద్దజటాధరుల్ సురమునీశ్వరులు
యక్షాధిప[1]మహేంద్రు లమర ప్రముఖులు
యక్షరాక్షసకిన్న రాప్సరోజనులు


కొలువంగ మువ్వన్నె కొల్వు వికృత్తి
జెలగు రత్నోన్నతసింహాసనమున
పేరోలగంబుగాఁ బెద్దయుఁబ్రొద్దు
మీరీనగోష్ఠి నర్మిలి నుండు తరిని120
ముక్కంటియిల్లాలి ముద్దులపట్టి
చక్కుమోములదొర చక్కనిజాణ
నెమ్మి తత్తడి నెక్కు నెరమేటి రౌతు

శివపార్వతులయొద్దకుఁ కుమారుండు వచ్చుట.


క్రమ్మిన వేల్పుమూకల పడవాలు
హరుని పిన్నకుమారుఁ డగు కుమారుండు
పరతెంచి తండ్రికిఁ బ్రణమిల్లి జనని
కెరఁగి దీవన లంది యెలమితో నిలువఁ
బరికించి సేమంబు పార్వతీదేవి
కొడుకు నక్కునఁ జేర్చి కుతుకం బెలర్ప
నొడి నిడుకొని చెక్కు లొయ్యన బుణికి130
చన్గవచేప బాష్పకణంబు లింక
కన్గొన బొదలంగఁ గడు నిట్టు లనియె
నాతండ్రి యేమొ యిన్నాళ్లు రావై తి
వేతీరు నినుఁ జూడ కే నుందుదాన
నసురమాయలు తరచంటివారలను
మసలక రణమున మలసి పోరంగ
తరమె యెవ్వరికైన తనయ బాలుఁడవు
దురముఁ జేయుతెరంగు తొలుత యెన్నడును
చేకన్నవాడవే చెదరక నిలువ
నీకొఱ కే నెంతొ నేమంబుఁ బూని140


యుంటిని నీతండ్రి నుగ్రుని వేడు
కొంటిని దనుజూరిఁ గొలిచితి మరియు
జలజాయుధునిగన్న జవరాలిఁ గూర్మి
యలరి భజించితి యందరికరుణ
నిను జూడఁగలిగెను నేటికి నాదు
మనసులో నెడ దీరె మరియుఁ గన్గొనఁగ
వడదాకి నీ మోము వాడ నేమిటికి
నొడలు గందఁగ నేలనో తెల్పవయ్య
అనవు డా తల్లికి హరునకున్ మ్రొక్కి
వినయంబు మీరంగ వినతుఁడై నిల్చి150.
వినుఁడు మీ కారుణ్య విభవంబుచేత

కుమారుఁడు తారకవధవలనఁ దనకుఁ గలిగిన బాధను దెల్ఫికొనుట


సనిఁ గ్రూరుఁ డగుతాగకాసురుఁ ద్రుంచి
జయము గొంటిని సురసంఘంబు బొగడ
నయిన నప్పుడు బ్రహ్మహత్య యత్యుగ్ర
ముగ వచ్చెఁ గావున మున్నెందు లేని
దగ దప్పి యాకలి తరచయ్యె నట్టి
పాతకం బెడల నుపాయంబు దెల్పు
మేతీర్థమునఁ గ్రుంకి యిపుడు భుజింపఁ
బరిశుద్ధి నొందుదు బడలి కయ్యెడిని
పరమేశ! తడయక పల్కవే యనిన160.
దక్షాధ్వరధ్వంసి తనయునిఁ గరుణ
వీక్షించి తాను నివ్విధమున దక్షు
తలద్రుంచి బ్రహ్మహత్యయును జెందుటయుఁ
గలుషనిష్కృతి యైనకథయును దెల్చి


యతనికిఁ బరిశుద్ధి యగునట్ల నొక్క-
హిత ముపదేశింప నెంచి యిట్లనియె
విను కుమారక నీవు వెతఁబడనేల
మనమున బ్రాహ్మణు మగ్గించుకడక
చేకొన్నఁదలఁచినఁ జెందు నఘంబు
పాకారి నొందఁడె బ్రహ్మహత్య యును170.
నీవు దేవహితంబు నెమ్మి సేయంగ
భావించి కాదె యీ పనిఁ జేసినావు
తారకాసురుఁడు మద్భక్తుఁడు వేద
పారజ్ఞుఁ డటు వానిఁజంపుట తగునె
యైన నిందునకుఁ బ్రాయశ్చిత్తమొకటి

అందుకుఁ బ్రాయశ్చిత్తముగ నాతనికి నారాయణమంత్ర ముపదేశించుట.


నే నెఱుంగుదు నది నెఱి రహస్యంబు
ర మ్మొకసారి నారాయణ యనిన
సమ్మతి గంగాదిసకలతీర్థముల
స్నానంబుసేయ నౌ సత్ఫలం బబ్బుఁ
బూనిన పాతకంబులును దొలంగు.180.
పూతుండపై మరి భుజియింపు మనిన
నాతండు తన తండ్రి యడుగుల కెఱగి
యా మంత్రము జపించి యతిశుద్ధిఁ గాంచి
ప్రేమ నుమాదేవి పిలిచి వడ్డింప
భుజియించి తృప్తి యింపును జెంది యందు
భుజగభూషణుదండఁ బొసఁగఁ గూర్చుండి
ఖండపరశుచంద్రఖండమండనుని
వెండియు సేవించి వెస నిట్టులనియె


భూతేశ్వర సమస్తభూత భావజ్ఞ
పాతకంబు దొలంగ పరమమంత్రంబు190.
తగనుపదేశించి దయ నన్ను ధన్యు
నిగఁ జేసితివి యింక నే నొండు వినఁగఁ
గోరెద నా యెడఁ గూర్మిచే నీవు
ధారుణి గలవి యెంతయుఁ బరికించి
తెలుపు మెం దావాసుదేవు ముకుందు
జలజాక్షుఁ గనుఁగొందు సరగ నెం దాత్మ
శుద్ధియు నగు నట్టి శుభతరక్షేత్ర
మిద్ధర నొక టానతియ్యవే యనిన
నిందుకళామౌళి యింపు దీపింప
స్కందుని వీక్షించి కరుణనిట్లనియె200.
విను తారకాంతక వెన్నునిఁ జూడ
మన సుంచితివయేని మన కాశిపురికి
దక్షిణదిశ శతద్వయయోజనముల
దక్షిణపాథోధితటవసుంధరకు

వేంకటగిరియందు వెన్నుని జూడనగునవి చెప్పుట.


నరయ త్రింశద్యోజనాంతంబునందు
మెరయ వేంకటగిరి మేదినీరమణి
కెనయు చూడామణి యిదె యంచు నెంచ
కనకరత్నచ్ఛటాకలితమై యొప్పు
సందు ముకుందు డత్యానంద మొంది
పొందుగా విహరించు భూరిలీలలను210.
సురమౌనివరులు నచ్చోటనే తపము
నిరతంబు సలుపుచు నెరసియున్నారు


నీవు నచ్చటి కేగి నియమంబుఁ బూని
భావింఫు మా హరిం బరమకారుణికుఁ
గనుఁగొనియెద వందె కమలాసహాయుఁ
దనయ సంశయ మేల తరలు ముర్వడిని
అనుఁడు నంబకు నంబికాప్తున కెఱఁగి
తనరఁ బ్రదక్షిణత్రయము గావించి
యనుమతుండై భుజంగారితురంగ
మనుపమంబుగ నెక్కి యమర సైన్యంబు220
సందడింపఁగ నతిజవమునం జనుచు
నందందు నగములు నగమసంఘములు
నాశ్రమంబులు వను లమర గంధర్వ:
విశ్రమస్థలములు విమలవాహినులు
పక్కణజనపద పట్టణంబులును
చక్కగాఁ జూచుచు సమ్మదం, బొదవ
నావహమారుతాయత్తమార్గమున
ఠీవి వాహ్యాళి వాటించు చందమున
దివి రయంబున నేగి దివసాంత మగుట
భువిమీద డిగ్గి యద్భుతమా సపాద230
లక్షపర్వతసీమ లక్షించి యచట
న క్షపాముఖమున నాహ్నికక్రియలు
సలిపి యొక్కెడ సందు.చంద్రకాంతంపు
శిలమీదఁ గూర్చుండి చింతించి జనని
నెద విన్నదన'మొంద నెఱిఁగి గురుండు
సదయుఁడై యతనికి సరగ నిట్లనియె.
'దేవ ! నేనానాథ దివిజుల కెల్ల


భావంబు లలరంగ పలుకవు చెల్మి
సౌదరించవు విన్ననై నీ విటున్న
మోదం బుడిగి మిత్రముఖ్యులందరును240.
మూగులమాడి, మోములఁ జూచుకొనుచు
నీగి పోకాడున ట్లింతైన బలుక
వెఱచి చిత్తరువులవితమున మెదల
కెఱబరికంబున నిది యేమొ యనెడు
శంకనెంతయు సొంపు సడలి యున్నారు
శంకరసుత యింత జాలిజాలించు
మెంతపనికి నైన నిట్టుల దొరలు
చింతింపఁ దగ దెంత చింత గల్గినను
మది నడంచుటె కాక మాట పల్కులను
వదనవికారంబు వలన నెవ్వరికిఁ250.
గనుపించనీరాదు గాంభీర్యమునను
ఘనముగా నెప్పటిగతి నుండవలయు
నదియునుఁగాక నీయతిశయం బీవు
మొదలెఱుంగవు నీకు ముగ్ధత తగునె

కుమారుఁడే విష్ణుమూర్తియని గురుఁడాతని కెటింగించుట.


విష్ణుమూర్తివి నీవు వెస నుద్భవించి
జిష్ణునకు హితంబు సేయఁ బూనితివి
నిను నే నెఱుంగుదు నీవును దెలిసి
కొను మన నాతడా గురున కిట్లనియె
అనఘ యావెన్నుఁ డే నైన దెబ్బంగి
వినఁగ నీ పలుకులు వింత యయ్యెడిని260.


ఏమిటికి ముకుందుఁ డిటు బుట్టె సత్య
కాముఁ డౌ నతనికిఁ గార్య మేమంత
తానెఱుంగఁడె తను ధర నెవ్వఁడైన
నేను న న్నెఱుఁగకున్కి కి హేతు వేమి
వినుతియో నిజమైన వినఁగ నా క్రమము
వినుపించు మంతయు వివరంబుగాఁగ
నావు డాగురుఁడు లేనగ విగురోత్త
భావించి వినుమని పరిపాటి దొడఁగి
మును దక్షుడన్ బ్రహ్మ ముక్కంటి కొసఁగెఁ
దనకూతు నదె సతి దా నయ్యె నాఖ్య 270.
యాదేవి పుట్నింటి కరిగి జన్నమున
నాదరించక తండ్రి యవమతి సేయ
నలుక యోగాగ్నియం దమ్మేను విడిచి
చలిగట్టు కన్యయైఁ జనియించి శివుఁడె
పతిగాఁగ వేఁడి తపంబు సల్పుచును
ప్రతిన మీరంగ నా ఫాలలోచనుఁడు
తనదేవిఁగా కొకతరుణిఁ బెం డ్లాడ
నని వ్రతంబూని హిమాచలంబునను
నిలిచి స్థాణువుమాడ్కి నిర్నిద్రుఁడగుచు
నలరి దిగంబరుఁడై కొన్ని యేండ్లు280.
తపసియై యుండఁగాఁ దారకాసురుఁడు
విపరీతబుద్ధిచే వెన విజృంభించి
మానంబునన్ సురమండలి నెంచె
వాని నోర్వఁగలేక వనజసంభవుని
కడ కేగి సురలు నాకలఁకఁ దెల్పంగ


తడయ కా నలువ యందఱికి ని ట్లనియె
సురలార ! జడు పేల సుజనరక్షకము
హరికళయొకటి ఫాలాక్షునియందుఁ
బెనుపొందుచున్న దా భీము నాగిరిజ
నొనగూర్పు మనుచు నియోగించి మదను290.
బనుచుఁ డాదేవిగర్భంబున హరియె
జనియించి తారకసంహారియగును
అని వీడ్కొలుప మళ్లి యమరేంద్రముఖులు
సనవిల్తు బిల్చి తిన్నగ వినుతించి
శ్రీ కంఠునకు మర్లు రేపు మం చనుపఁ
జేకొని మరుఁ డట్టిశివునిపై విరుల,
నేసిన నతఁ డల్గి యిందీవరాస్త్రు
నేసి మంటలకంటి హెచ్చుచిచ్చులను
బొలియించె న య్యద్రిపుత్రి య మ్మరుని
చెలిమిఁ గ్రమ్మరఁ జూపుచేఁ బ్రతికించి.
నెలదాల్పు వలపించ నెమ్మి నమ్మగువ
గలసి యట్టిశివుండు కామవశ్యుడయి
తమకించి మోహనతంత్రలీలలను
రమియింపుచుండె వరశతంబునందు300.

కుమారస్వామి జననకథ.


అప్పుడు దివిజు లయ్యసురుని గెల్వ
నెప్పుగానక శూలినిన్ వినుతించి .
కడువడిఁ బడవాలు గలిగించు మనుచు
నడుగుటయు హరుండు నర్మిలి క్రీడఁ


జాలించి తనదైన స్ఖలిత తేజంబు
తాలిమి ధరియింప ధరఁ బూన్చుఁ డనిన310
నమరులు భూదేవిఁ బ్రార్ధించి రుగ్రుఁ
డమితతేజఃపూర మవనిపై విడిచె
అది జ్వలింపుచుఁ బ్రళయాగ్ని చందమునఁ
బొదలుచు నత్యుగ్రముగ వెల్లివిరిసి
గప్పిన మహి తాళఁగాఁజాల కలసి
దెప్పరం బగుభీతి దివిజుల కట్టి
తెరఁ గెఱిఁగింపఁగ దేవేంద్రుఁ డగ్ని
గరువలి నల దాని గ్రాంచి యింకించు
మని నియోగించె నయ్యగ్ని యుగ్రముగఁ
బెనఁగొన దహియించి బెట్టైనకాఁకఁ320
దా నోర్వఁజాల కెంతయు దాని గంగఁ
బూనింప నా గంగ భుగభుగ నుడికి
తీరజశరవణోద్దేశంబునందుఁ
జేరుప నది దానిఁ జెంది కుందనము
వెండియు నై నిండి వెలుగుచు దీప్తి
వెండియు శిఖఁ గూడి వెలయంగ నందు
దేదీప్యమాన మౌ దివ్యమూ ర్తిఁ గొని
ప్రాదుర్భవించితి బాలత నీవు
మున్నుగా నింద్రుఁడు ముదమున నీకుఁ
ౙన్నియ్య కృత్తికాషట్కమున్ బనిచె.330
నల వారి స్తన్యంబు లానంగ నీకుఁ
గలిగె షణ్ముఖము లక్కజముగా నపుడె
గిరిజ నిన్ గనుఁగొని కేవలానంద


భరితయై యగ్ని సంభావించి వరము
లిచ్చె నింద్రాదుల కీసున శాప
మిచ్చె నపుత్రు లయ్యెదరు మీ రనుచు
నంత శంకరుఁడు నయ్యంబుజభవుఁడు
సంతసంబున వచ్చి సంజ్ఞాది విధులు
గావించి యసుర నిగ్రహకార్యమునకు
దేవసేనాధిపతిత్వంబు మెఱయ340
నభిషేక మొనరించి రటుగాన నీవె
ప్రభు వైన హరివి నిన్ బ్రణుతించి కొలుచు
వారికిఁ బుత్రులున్ వైభవంబులును
సారసౌఖ్యము రాజ్యసంపదల్ గల్గు
ననుచు చాల నుతించు నాగురువరున
కనుపమవై భవుం డా కుమారుండు
కోరినవర మిచ్చి కుతుకం బెలర్ప
ధీరుఁడై మోహముఁన్ దెగటార్చి యలరె
ఆముచ్చటలచేత నటు వేగుటయును
నేమంబునన్ గరణీయంబు దీర్చి350
యమరులం గ్రమ్మర నర్మిలి ననిచి
నెమిలి నాారోహించి నిముషమాత్రమున
విబుధవాహిని దాటి వింధ్యాద్రి గడచి
ప్రబలమప్రబలమౌ దండకారణ్యమున్ మించి
గౌతమి శ్రీగిరిన్ గడిమి లంఘించి
శాతకుంభాచల సౌందర్యహారి
నంజనగిరిఁ జేరి హరుషంబుమీఱి
రంజిల్లునటుశౌరి రహిఁ జూడఁగోరి


పరమపావనవారిభరిత మౌ నొక్క-
సరసి చెంత దపంబు సలుపుచు నుండె360.
అయ్యమ యొక్క నాఁ డాత్మజుఁ దలఁచి
నెయ్యంబునన్ చింత నిగుడంగ వగచి
ఫాలాక్షుఁ జూచి యో పన్నగాభరణ
బాలు నా షణ్ముఖుఁ బరదేశమునకు
బనిచితి వటుల నా బాలుఁ డేలాగు
ఘనతపం బొనరించఁ గలుగునో యెదను
మాయావి యవ్వెన్నుమది నైనఁ గనఁగ
నే యోగిచంద్రులు నే మునీంద్రులును
నేరరు గన నేర్తు వీ వొక్కరుఁడవె
సారతరజ్ఞానశాలి వౌ కతన370.
నట్టి పద్మాక్షుఁ బ్రత్యక్షమై గాంచు
నెట్టుల బాలకుం డిది దుర్ఘటంబు
సుకుమారమూర్తి నీసుతుఁ డుగ్రమైన
ప్రకటతపం బెట్లు బహువత్సరములు
నొంటి నెట్టుల సల్పు నుల్కునో నాదు
కంటికి నొక యింత కలుగదు నిద్ర
దిగులయ్యెడి ని దేమొ తీరనిచింత
జగదీశ తీర్పవే సదయత నీవు
అనుచు [2] వెడందలై యలరు కన్నులను
మొనయు నశ్రులు గోటిమొనను జిమ్ముచును380.
పదనఖంబున నేలపై లిఖింపుచును
వదనం బటు నొకింత వాల్చి బల్ చింతఁ


దన చెంత నిల్చు బిత్తరి గౌరిఁ జూచి
నెనరున లాలించి నీలకంఠుండు
తగ నూరడించి కుంతలములు దువ్వి
నగుచు [3]నేలనె వంత నగరాజపుత్రి!

వేంకటాద్రియందు తపముసల్పు కుమారునియొద్దకు శివపార్వతులు వచ్చుట.


నీ పుత్రుఁ డిప్పుడా నీరజనేత్రు
శ్రీపతిని గురించి శ్రీ వేంకటాద్రి
నొక సరస్తటమున నొగి వాయుదేవుఁ
డకలంకపతము సేయంగ నావంక390
నిలిచి నేమంబుతో నిష్ఠురవ్రతము.
సలుపుచున్నాఁ డట్టి శైలంబునందు
నొంటియే సనకాదియోగీంద్రు లబ్ధి
గుంటబెట్టుక గుటగుట గ్రోలు తపసి,
పదమునఁ జూపు చొప్పడు జడదారి,
మొదలుగా నెందరే మునులు వేవేలు
వేలుపులసురలున్ వేడ్కనుండుదురు
వాలాయముగ శౌరి వారికిఁ గరుణఁ
బ్రత్యక్ష మగు రమాప్రభుఁ జూడ మనము
నత్యంతరయమున నటకుఁ బోద మని400
యెలనాగయును దాను వృషభేంద్రు నెక్కి
బలువిడి నరుదెంచె ప్రమథులు గొలువ. .
అరిగి వేగమె వేంకటాచలాగ్రమునఁ
దరుషండములు ఝరుల్ దరులు గన్గొనుచుఁ

శివునితేజంబున అంజన హనుమంతుంగాంచుట,


జనుచు నందొక వనచరమిథునంబు
మొనసి క్రీడింప నమ్ముక్కంటి గాంచి
నగుచు గౌరికి జూపి నవబోణి మనము
దగు నిట్టి రూపంబు దాల్చి క్రీడింప
మససయ్యెడి నటంచు మగువయుఁ దాను
వినువీథి నటులఁ బూవిలుకానికేళి410
సలుప నత్తేజంబు శ్వసనుఁ డందుకొని
దళపుటంబున నుంచి తపము గావించు
నంజన కొసఁగ నయ్యంజనాదేవి
రంజిల్లఁ బవనుండు ప్రతిదినం బొసఁగు
ఫలము భుజించు నప్పగిది భుజించి
యలరి గర్భముఁ దాల్చి హనుమంతుఁ గనియె.
ఉరగభూషణుఁడు న య్యువిదయు స్వామి
సరసిఁ గ్రుంకిడి భక్తి శార్ఙి భావించి
తమ కుమారుఁ గుమారుఁ దడవుచుఁ బుణ్య
తమమై తగు కుమారధారికచెంతఁ420
గాంచి యాతఁ డొనర్చఁగల వందనములు
గాంచి క్రమ్మరి యట్టి కపిలతీర్థమున
కరుగుచు నటఁ బదియారుతీర్థములు
వరుస నుండఁగ జూపి వనిత కిట్లనియె.
నిచ్చట సప్తర్షు లెలమిఁ దపంబు
లెచ్చుగాఁ గావించి యిష్టముల్ గనుట,
నీ సప్తసరసు లా ఋషుల పేరిటను
భాసిల్లు లోకైకపావనంబు, లివి


మదిరాక్షి యిదియె బ్రహ్మసరంబు చూడు
మిది యగ్నికుండాఖ్య మిది పంచసరము430
చక్ర మిందుఁ దపంబు సలిపి నా డెంద
మాక్రమించుచును నా దగు మైత్రిఁ జెందె

విష్వక్సేనతీర్ధ మాహాత్మ్యము. కుంతల యను నప్సరస కథ.


వనితరో యిదియె విష్వక్సేన తీర్థ
మనఘంబునున్ వరుణాత్మజుం డిందు
హరిసైన్యపతి యయ్యె నతులయోగమున
నరయఁబావన మైన యా కథ వినుము
మును పాది కృతయుగంబునను దూర్వాసు
డనుపమతపము సేయంగ నింద్రుండు
కోపనుం డితఁ డేమి కోరునో యేమి
శాపమిచ్చునొ యని జడిసి తపంబు440
పొల్లుబో సేయంగ బుద్ధి నూహించి
యల్ల కుంతల యను నచ్చరం బిలిచి
కలికిరో యొక్క యక్కర పనిసేయఁ
గలవటే నీదు చక్కదనంబు నేర్పు
కళలమేలిమియు నిక్కడఁ గనుపింప
వలెఁగాక యూరకే వాడకోడెలను
మచ్చుగప్పుచు వెడమాయలు వన్ని
తచ్చనల్ పచరించి తాటోటుసేసి
మచ్చికటెక్కులు మైదుతక్కులును
తెచ్చుకోల్వలపును తియ్యనిసొలపు450
గద్దరికుల్కులు కనుల బెళ్కులును


ముద్దులపల్కులు మోడియల్కలును
మెరయించి విటులచే మేలైన నగలు
దొర [4] కినవస్తువుల్ దువ్వటంబులును
వేగిరంబుగ దోఁచు వితముల కేమి
నాగవాసమువారి నయ మది గాదె
అందరిలో జాణ వందురు నిన్నె
యిందుఁ జూచెదము నీ యెల్లనేరుపులు
ధరణి దూర్వాసుఁడన్ తపసిని నీవు
మరులు పుట్టఁగ సేసి మదిఁ గరగించి460.
వలపించి తప మెల్ల వమ్ము గావించి
కులుకులన్ లోఁజేసు కొందువైతేని
నెఱజాణ వని మెచ్చి నెలతల లోన
బిఱుదు లిత్తును నీకు బిత్తరియిదిగొ
యవసరం బని చాల యాస బుట్టించి
దివిజేశుఁ డంప నా తెఱవ యిట్లనియె
నగవైరి దేవర నాటకశాల
మగువలలో నెంతమాత్రపుదాన
రసిక మేనక యుండ రంభ యుండంగ
నొసపరి యైన తిలోత్తమ యుండ470.
పుంజికస్థలి యుండ భోగిని యుండ
మంజుఘోషయు నుండ మరియు నూర్వశియు
నుండ వరూధిని యుండ నా హేమ
యుండ నిందఱిలోన యూరకే నన్ను
మన్నన సెలవిచ్చు మాత్రమే కాక


చిన్నదానను మున్ను చేకని యున్న
దానఁగా నా వెఱ్ఱతపసి కోపించి
పూని శపించు నే పోఁజాల ననిన
నింద్రుండు భయమేల యింతి నీ కింత
చంద్రుండు మరుఁడు వసంతుండు నీదు480
చెంత సహాయంబు చేతు రేగు మనఁ
జింతతో నాకాంత చేకొని వెడలి
తనరఁ గైసేసి వింతగ నీటు మెఱయఁ
దన మేళజత వెంటఁ దగిలి మద్దిలలు
తాళముల్ ముఖవీణె తంబుర సరిగ
మేళవించుక ముందెమేళంబు లేక
నెమ్మితో నడువంగ నెలఁత యొకర్తు
ఘమ్మున కపురంబు గలయ మేదించు
బాగాలు మడుపులుం బనిబూని యొసఁగ
బాగుగా వేరోర్తు పావడ దాల్ప490
బెళుకుచూపులు గుల్కు బిత్తరి యొకతె
కళుకు బంగరుగిండి గైకొని రాఁగఁ
బసిఁడినకాసెమేల్ పనిజీని సురటి
నొసపరి యౌనొక్క యువిద చేఁబూన
నిద్దంపుజిగిమించు నిల్వుటద్దంబుతో
ముద్దరా లొకతె సొంపున నంటి నడువ
సరిగంచు కాసె గజ్జలు చనుకట్టు
మెరుగుఁబో ణొకతె యర్మిలిఁ గొంచు సరుగ
చుక్కలగుంపులో సొగసు రాణించు
చక్కని శశి రేఖ చందంబు మీఱి 500


వలరేని వలపించ వలసి యా రతియె
సలుపు మోహనవిద్యచాడ్పునం దనరి
యటు బింబరుచి గేరు నధరరాగంబు
విటులకు మది రాగవిభనంబు గొల్ప
పెలుచుసింగిణివిండ్ల బెదరించు బొమలు
నలకూబరునికైన నమ్రతనేర్ప
కలువలనీను క్రీఁ గన్నులచూపు
అలరువిల్తునకు శౌర్యంబు బుట్టించ
చిలుపవెన్నెలనవ్వు చిరునవ్వు కూర్మి
నల జయంతముఖేందు నలరసేయంగ510.
సురల కిం పెసఁగు మెచ్చుల మోముసొలపు
దురుసుమీఱిన విరక్తులను సొక్కింప
కనకాచలము డంబు గల కుచద్వయము
మునులకుఁ జేరంగ ముదము గల్పించ
మదనేభకరము లై మలయు పెన్ దొడల
పొదలిక విటపాళి బొరి నలయించ
అంచల నణకించు నలసయానంబు
మించి యా నలువ నెమ్మెయిచలింపించ
మించులు గిలకొట్ట మెఱయు లత్తుకల
మించు కెంపులగుంపు మేదిని నింప520.
సరిగకుచ్చులహొయల్ సవరింప జిలుగు
నెరిక లొయారంపు నీటునం బొదల
వలరాజునగరికి వలగొనుప్రహరి
పొలుపున గంటలమొలనూలు మొరయ
చిరుజెమటఁ గరంగి చెలఁగు కస్తూరి


పరిమళం బెంతె గుబాళించి విసర
మగరాలమొగపు లమరు కంకణముల
నిగనిగల్ పండువెన్నెలలు గాయంగఁ
బసిడియొడ్డెణము గుబ్బలభార మాని
యసియాడు లేఁగౌను నలమి యాడుకొన530.
మొనసి ముక్తాహారములు నల్లిబెల్లి
చనుదోయిఁ బెనఁగంగ సరసులకరణి
రతనపుంగమ్మల రంగు లుప్పొంగి
కితవులమాడ్కి చెక్కిలి ముద్దుగొనఁగ
శింజానమంజుమంజీరముల్ శఠులు
రంజించునటులఁ జరణములన్ మలయ
కంగులరవికె కగ్గలమైన గుబ్బ
చంగవ నొకకేలఁ జక్క నొత్తుచును
నుదుటిపైఁ , బొదలుచు నునుగురుల్ జారఁ
గుదురుగా మొనవ్రేలఁ గూడదువ్వుచును540.
మెదలగా వదలు నెమ్మేఖలసీల
గదియఁ గోటను బిగిగాఁగ నొక్కుచును
రంగారుపైఁటచెఱంగు తొలంగ
నం గెసంగఁగ వెస హవణించుకొనుచు
వీనులపైఁ దాల్చు విరులఁ బల్మారు
పూనిక నీ టంద బొసఁగించుకొనుచు
కవచట్టము లనురాగము లింతు లనఁగ
రవలునొక్కులు రంగు రక్తిఁజూపుచును
వగలుమించిన నట్టువల కొనుగోలు
సొగసుకు మేళంబు నుతి గూర్చుకొనుచు550.


చనఁగ నాతారాప్రసంగంబు మఱచి
కనకాంగి మోము సింగారముంగనంగ
మునుకొని చంద్రుండు ముఖమౌచుఁ దనర
వనవిల్తుఁ డీ కల్కి నవనవం బైన
కన్నులసొలపు నేఁ గాంచెద ననుచు
నెన్ని బంటుగఁ జెంత నెలమి మెలంగ
నలరుఁబోఁణిబెడంగు నామోద మొందఁ
దలఁచి యామరునిపైఁ దలమూని చెలఁగ
మానిని మేళసుమాళ ముప్పొంగ
మౌనిచంద్రుని యాశ్రమం బటు చేరి560.
దూరదూరంబునఁ దొంగి చూచుచును
గ్రూరు న మ్మౌనిఁ గన్గొని యుగ్రతపము
సరమోడ్పుకన్గవ యచలగాత్రంబు
కరమున జపమాలికయు మై విభూతి
కెంజడల్ మేనఁ బ్రాఁకెడు నురగములు
రంజిల్ల ముక్కంటి రహిమంట మీరి
తపసి నిల్కడ కుల్కి దవ్వున నాడు
నెపమున పాటల నీటుమాటలను
మెల్లన యంతింత మెలకువఁ జేరి
ఘల్లుఘల్లున హంసకములు మ్రోయంగ570.
తిరుపుల కోపులన్ దిరిగెడు జతుల
మెరపుల యొరపుల మెయి సిరి కుల్కు
మురువుల నభినయంబుల పొంకములను
దురుపదబాళి ముద్దుగఁ ద్రొక్కి చొక్కి
మురియుచు వినిపించు మోహనలీలఁ


దరు లెల్లఁ జిగురు లొత్తగఁ బులకించె
శిల లెల్లను గరంగి స్వేదంబుజెందె
నిల చేతనంబు లయ్యె నచేతనములు
చేతనాళి దగె నచేతనొకృతిని
యా తపసియు శాంతి యరి కిన్కఁబూని580.
యిటుల లాస్యము సల్పు యింతినిఁ జూచి
కుటిలవీక్షణము లెక్కువ జేవురింప
నెంచక దుర్బుద్ధి నిటు చేరుకతన
చెంచెత వగు మంచుఁ జీరి శపించె.
అంతఁ గంతునిగంతు లడగెఁ చంద్రుండు
నంతరిక్షముబట్టి యరిగె వసంతుఁ
డడవులన్ బడి జారె నచ్చరల్ విచ్చి
తొడవడ నురికి ర త్తోయజగంధి
గడగడ మెయి వడకంగ నెఱంగి
జడదారి యగుడులఁ జాగిలి వ్రాలి590.
పరమమునీంద్ర నే పరతంత్రగాన
దొరలమాటలచెప్పు త్రోయంగరామి
నరుదెంచితిని చాల నపరాధ మౌను
కరుణించి నా తప్పు గావవే యనిన
నరసి యింద్రునిచేష్ట యగుట న మ్మౌని.
తరుణి నా శాపంబు తప్పదు నీకు
నలశాపమునకుఁ బర్యాప్తిఁ దెల్పెదను
తలఁక కింక కిరాతతనయ వై పుట్టి
సురలకుమేటి యౌ సుతుఁ గాంచి వేగ
మరి నిజాకృతిఁ జెంది మనఁజాలు దగిన600.


విని యమ్మునికి మ్రొక్కి, వెలఁది యాక్షణమ
చని యదృశ్యత వింధ్యశైలపాదమున
వీరబాహుఁడనంగ వెలయు నా చెంచు
కూరిమి యిల్లాలు గుణవతి యనఁగఁ
బూనినసంపదన్ బొగడొందు చుండ
దాని గర్భంబునఁ దగ జనియించె
తనయులు లేమి నా తరుణి యా కూతుఁ
గని సంతసముఁజెంది గారాబు మీఱఁ
జెలిమిఁ బోషింప నా శిశువును విదియ
నెలరేఖపొలుపునన్ నీటు వాటిల్లి610.
పెరుగుచుండఁగఁ గాంతిపెంపున పెద్ద
లరసి సువర్చల యను నామధేయ
మొనరించి రప్సరోయువతి యౌ కతన
కనకసలాక పొంకంబున బాల
చిరుతతనంబునన్ జెలువుఁ గుల్కుచును
సరిబుడుతలఁ గూడి చాల నాడుచును
నుండనుండఁగఁ బ్రాయ మొకయింత మొనయ
నిండుసిగ్గును జగ్గు నిగ్గు బల్ నీటు
చన్నుల గమకంబు సన్నంపుఁగౌను
కన్నుల బెళుకులు గలిగి రాణించు620.
తన కూతుఁ గనుఁగొని తండ్రి చింతించి
మను వియ్యఁదలంచి సమ్మదమున భద్రుఁ
డను చెంచు కొసఁగె న య్యతివ నంతటను
వనజాక్షి ప్రథమార్తవముఁ జెందుటయును
ప్రమదవనసరోవరంబున మునిఁగి


యమరిక కటిఁ గట్టినట్టి లేమావి
చివురులజొంపంబు చెంగావి విడిచి
సవరణ లవలి కిసలపాళి యనెడు
తెలిదువ్వటం బూరుదీప్తితో మలయ
చెలువుగా [5]వెందీగె చేల్గట్టికురులు630.
తుదలం బొదలి నిల్చు తోయబిందువులఁ
గదిసిన మల్లెమొగ్గలతో విదిర్చి
కీలుగం టొనరించి కినిసి చీఁకటులు
చాల నిందుని కల్గి శశిఁ గెల్చు మోము
వెనుకఁ జేరిన వాటి వెస నాదరించు
ననువున కొనగోర నమర దువ్వుచును
రవికర మటు చేరరాక యుండంగ
నవపల్లవము మౌళి నయముగాఁ బూన్చి
నెలరాల నపు డొత్త నెరయు జవ్వాది
మెలకువఁ గని తీసి మేటి జక్కవలు640.
సరిపోర రానీక చన్గవ నలఁది
హరిణముల్ కన్నుల యందంబు గొనుటఁ
బొగిలి తద్రక్తంబు బొట్టిడు పగిది
మృగనాభితిలకంబు మెప్పుగా దిద్ది
పిరుదుకు సాటిగాఁ బెనఁగుట నల్క
కరికుంభముల నేయగా నందుఁ జిందు
నల ముత్తియంబుల హారముల్ దాల్చి
మొలకచన్గవమీఁద ముద్దు గుల్కంగఁ


గురువిందములకన్న కొమరు రంజిల్లు
గురుగింజపేరు లెక్కువగా ధరించి650
జీవదంతము చక్కఁ జెక్కిన కమ్మ
లా వీనులం బెట్టి హరువు మీఱంగ
జిలువమానికములు చిలులు వుచ్చి
చెలఁగ గ్రుచ్చినయట్టి చేకట్టు గట్టి
చెంగ నారను బిగించిన పులిగోరు
బాగుగాఁ బూని యాపైన వాకట్టు
మందులదండ లేమరక ఘటించి
కుందనపుంబొమ్మకుం దన యంద
మించుక లేదంచు నెంచంగ మించి
మించుదీగె నటించు మించు రాణించ660
సెలవిల్లు చిలుకమ్ము చెలువుగాఁ బూని
వలరాజు చెలువ చెల్వము గుల్కి నిలువ
వరుణరా జా యింతి వైఖరిఁ జూచి
మరులొంది వలరాజు మాయలఁ దగిలి
ఔరౌర! యీకొమ్మ యపరంజిబొమ్మ
మారుని పూముల్కి మాయలకల్కి
దీని విలాసంబు దీని హాసంబు
దీని సింగారంబు దీ నొయారంబు
గనుఁగొన నీది దేవకాంత గాఁ బోలు
మనుజుకాంతల కింత మైనిగ్గు గలదె
దీని కౌఁగిటఁ బూని తేనెమో వాని
మానుగ రతిజెంది మలశి యింపొంది
యమర సుఖింపలే నట్టి మే నేల?


నమరభోగం బేల? యైశ్వర్య మేల?
నని తలపోసి య య్యతివను డాసి
ననవిల్తుచే గాసి నలఁగి కన్వేసి
నయములు సేసి యంతరధృతి వాసి
ప్రియ మొప్పగాఁ గల్కిఁ బేర్కొని పల్కె
అలివేణి యెవతె నీ వప్పరోమణివొ
చిలువరాచెలువవో చెలువొందు నీదు680.
బేడిస జిగి మించు బెళుకుల చూపు
నాడెందము గలంచె నవమోహనాంగి
ననవిల్తుకేళిని నన్నేలుకోవె
మనమున నిఁక ననుమానంబు మాను
వరుణదేవుండ నే వలచితి నీకు
వర మొసంగెద తేనెవాతెర యీవె
అని వేగఁ గౌఁగిట నాగిన నులికి
కనకాంగి వాని చక్కదనంబు నయము
సరసలీలలు గాంచి సంభ్రమంబునను
పరవశయై చాల బాళి రెట్టింప690.
మిక్కిలిపులకింప మేయి చమరింప
మక్కువ రతికేళి మలయుచుఁ గలశి
యానందమును జెంది యలరి సొంపొంది
పూనిన సిగ్గుతోఁ బొలుపొంది నిలువ
అప్పుడా వరుణుండు హర్షించి మెచ్చి
యొప్పులకుప్ప నయ్యువిద నీక్షించి
సారసాక్షిరొ చాల సంతోషమయ్యె
వారక నీ కోరు వర మిత్తు ననిన


మోద ముప్పొంగ న మ్ముదిత కేల్మోడ్చి
యో దేవ నిను మించు నొక కొమారుండు700
హరిభక్తుఁడయి నిత్యుఁడై యందఱికిని
పరమపూజ్యుం డగు ప్రాభవశాలి
కలుగునట్ల వరంబు కరుణించు మనుడు
నులికి దుర్లభ మౌట యూహించితనదు
వరదుఁ డై నట్టి విష్వక్సేనుఁ దలఁచి
వర రహస్యస్తుతి వావిరి సల్పి
తన పల్కు నిజముగాఁ దనరనర్థించి
ననబోఁణి యింద్రుని నలువను గెలువ
గల వైభవంబులు గల కుమారుండు
జలజలోచనభక్తజనవరిష్టుండు710
జనియించును ముహూర్తసమయమాత్రమున
నని పల్కి వీడ్కొని యలరుచు నరిగె
హరి సైన్యపతి రహస్యస్తుతిఁ బ్రీతి
మెరయంగ నపుడె యమ్మీనలోచనకు
దనయుఁడై యుదయింపఁ దరళాక్షి కూర్మిఁ
గనుఁగొని యా బాలుఁ గమలపత్రమున
నిడి యా సరసి గ్రుంకి యెడల శాపంబు
కడు నిజరూపంబు గైకొని దివికిఁ
జనుటయును సనత్సుజాతుఁ డా తెఱఁగు
మనమునఁ దెలిసి సమ్మతి నందు వచ్చి720
పరమతేజఃపుంజపాదపాంకురతఁ
బరగుచు నవ్వనప్రాంతంబు వెలయ
వనలక్ష్మి యుంచిన వరదీప మనఁగఁ


దనరు న య్యర్భకుం దడవి భావించి
సద్యోవచోబోధశ క్తిసంపదలు
విద్యలు గలిగించ వెస నాతఁ డపుడు
దరలి వేంకటశైలతటమున నిచట
జలజనాభు భజించి సారూప్య మంది
నలువున హరి సైన్యనాయకుం డయ్యెఁ
గిరిరాజపుత్రి ! యీ గిరి వైభవంబు730
లరసి వర్ణింపంగ నలవియే చెపుమ
చంద్రబింబాస్య ! యీ సరముఁ జూచితివె

శివుడు పార్వతికి వజ్రతీర్థమాహాత్మ్యముచెప్పుట.



ఇంద్రుని శాపంబు నెడలించు కతన
నిది వజ్రతీర్థ మం చెన్నిక కెక్కె
మొదటి యా వృత్తాంతమును వినఁగదవె
నలినసంభవుఁడు మున్దర నొకనాఁడు

బ్రహ్మ మునులనిగ్రహమును బరీక్షింప నొక స్త్రీరత్నమును సృష్టించుట.



తెలివిడి మునుల యింద్రియనిగ్రహంబు
తెమలనిధైర్యంబు స్థిరవిరాగంబు
క్రమమునన్ గనుఁగొనఁగా నెంచి తనదు
నేరుపు మెరయించి నిఖిలసౌందర్య740
సారముల్ హవణించి జగనిగ్గు లెల్ల
గూరిచి ఠవణించి గులికెడి సొగసు
లేరిచి సవరించి యెనలేని సొలపు
లారసి పచరించి హావభావములు
తేరిచి రచియించి తిన్నని చిన్నె


లూరిచి యెనయించి యుల్లాస మెల్ల
తీరిచి యొనరించి తెరవ యంగములు
వన్నెకన్యాసృష్టి వన్నె మీఱంగ
నెన్నెన్ని యూహల నెన్ని భావించి
భావజశరధార పదనుగాఁ దివిచి750.

పూవుఁబోణిగఁ జేయఁ బూని యస్థిరత
దొరలక కడఁద్రోచి తోయదద్యుతులు
కురులుగాఁగ కళంకుగొనక చందురుని
కైపునె మోముగాఁ గౌచుఁ బాయించి
చాపలరమణీయ చాపలశ్రీలు
కనుఁగవగా నల్లె కడకొత్తి విండ్ల
నునుసోయగములు కన్బొమలునుగాఁగ
మైల దొలంగించి మంచి యందముల
డాలుచెక్కులుగాఁ దుటారంపుపరుస
దనము బాపి ప్రవాళతతి రంగు మోవి 760.

గను త్రాసమూడ్చి చక్కని ముత్తియముల
తెలి నిగ్గు దంతపంక్తిగఁ జమ్ముదీర్చి
వలనొందు శ్రీకారవైఖరుల్ వీను
లును గాఁగ వాఁడి నల్గుట మాన్చి నవ్య
కనకపురుచి నాసగాఁ బాఁచిదుడిచి
చిందమందము కంఠసీమగా గుహల
నొందనియ్యక గిరియుగలక్ష్మి గుబ్బ
చనుఁగవగా [6]గౌరుజవరకరీక


ఘనరేఖ భుజములుగా పస రొలిచి
కమలంబుల బెడంగు కరములు గాఁగఁ770.
దమ మాచి చుక్క లందము సఖంబులుగ
జరజరఁ బో నూకి శైవాలవల్లి
సిరులు నూగారుగాఁ జెందినకలక
యెడలించి బంగరుటేటి తరగల
యొడికముల్ వళులుగా నుడుగని భ్రాంతి
పోనిడి సుడిపొంపు పొక్కిలి గాఁగ
పూను చొ ప్పడచి నభోవైభవంబు
లేఁగౌను గాఁగ ధూళి విదర్చి సైక
తాగమసంపద యల పిరుందుగను
ముడుత దెఱిచి గజంబుల కరాకృతులు780.
తొడలుగా వీలుటఁ దొరగించి పొట్ట
కరలమేల్ చిరుదొడల్గా కప్పు గడిగి
మెరయు తామేటినిగల్ మీగాళ్లుగాఁగ
తొడిమల బిరు సెల్ల దునిమి చిగుళ్ల
బెడ గడుగులు గాఁగఁ బేర్చి నెమ్మేన
నుదిరి బంగరురంగు పొరపొందు మెఱపు
పొదలికె తళ్కునుం బూవుల తావి
కలియ మేదించి శృంగారంపుతేట
వలరాజు చెలువ చెల్వము జిగినీటు
బదునిచ్చి మెరుగిడ భావించి తనదు790.
మదిని యూహించి సమ్మదయత్నమునను
చేత నంటిన కందుఁ జెందెడి ననుచు
చాతురి మననుచే సరగ నిర్మించి


కని యొచ్చె మింతయు [7]గనమిదహల్య
యని సంజ్ఞ గావించె న య్యించుబోణి
చెలువు నుతింప వేజిహ్వలకైన
నలవియే యా మోహనాంగి మైరంగు
ననుపమశృంగారహావభావములు
కనుఁగొన పదివేలు కండ్లు గావలయు
అంతట నాధాత యాస్థానమునను800.
శాంతు లౌ సనకాదిసకలయోగులును
గౌతమ కణ్వాత్రి కశ్యప కుత్స
శాతాతప వసిష్ఠ శరభంగ పులహ
ఘటజ భరద్వాజ గర్గ భృగ్వాది
జటిసంఘములు నింద్ర చంద్ర యజేంద్ర
వరుణ యమాది గీర్వాణముఖ్యులును
గరుడకిన్నరపన్నగప్రవరులును
మనువులు రాజర్షి మండల మేను
మునుగాఁగ నందఱుఁ న్ముచ్చటాడుచును
పరతత్వవిభవ తత్ప్రాప్త్యుపాయములు810.
పరమధర్మస్థితుల్ పరికించు తఱిని
నలినసంభవుని యన్తఃపురసీమ
వెలువడి మోహనవిద్యయో యనఁగ
వనజాస్త్రు నిష్టదేవత యిది యనఁగ
జనలోచనోత్సలశశిరేఖ యనఁగ
మౌనేంద్రధ్రుతివంశమంజరియనఁగ
జ్ఞానకాసారవంశావళియనఁగ


తపములన్ పయిరులఁ దగుపంట యనఁగఁ
జపలత మునుల పై ఁ జల్లు మిం చనఁగ
నలువను గొలువగా నలువొంది యచట820
నలరుచు నిలుచున్న యా కన్నెఁ గాంచి
చదువులు మఱచి ప్రసంగముల్ విడిచి
మది విభ్రమముఁ జెంది మరుకాకఁ గంది
పారవశ్యముఁ బూని బలు నాన మాని
వైరాగ్యముదొలంగి వగలఁ గలంగి
యేనాఁడుఁ గాన మీ యింతి యెవ్వతయొ
దీని రూపవిలాసదీప్తు లయ్యారె
దీనిఁ గూడినఁ జాలదే తపఃఫలము
దీనిఁ గౌగిటఁ జేర్చితే భాగ్యఫలము
కాదె యంచుఁ దలంచి కడు బాళిమించి830
మోద మొప్పఁగఁ గాంచి మొక మున్నమించి
శిరములు గదలించి చెలఁగి నుతించి
మరుని మాయలఁ జిక్కి, మమతచే సొక్కి,
యాసఁ గన్గొనుచుండ నందఱి కనుల
నా సభ వికచపద్మాకరం బయ్యె
కమలజు నన్ను నా గౌతముఁదక్క
యమిచంద్రులను సురేంద్రాదుల నెల్ల
మోహింపఁజేసె నమ్ముదిత చూపులనె
హా! హ ! యే మనవచ్చు నంగజు గచ్చు
నావుడు గౌరి వేనగవు విస్మయము840
భావంబునఁ దలిర్పఁ బ్రాణేశుఁ జూచి
యటమీఁద నే మయ్యె నని యడుగుటయు


నిటలాక్షుఁ డది వినే నీలాహివేణి!
అపుడు విధాత యం దందఱి మనసు
చపలతయు నెఱింగి శమదమంబులను
ఖ్యాతమునీంద్రుఁడై కరము రంజిల్లు
గౌతమునకు నిచ్చెఁ గరుణ నత్తరుణి
నం దుండు మునులు నిద్రాకులు చింతఁ
జెందుచుఁ గుందుచు సిగ్గగ్గళింప
నలఁవెత నిట్టూర్పు లడర నొండొరులు850
పులియిక మొగమొగంబులు చూచుకొనుచు
నాస లుడిగి డెంద మృతయుఁ గంద
వేసట నుండంగ విధి కొల్వు దీరి
యరిగె గౌతమువెంట న య్యహల్యయును
జరిగే వేగమె నిజాశ్రమముఁ జేరంగ
నెల్ల వారలు తమ యిండ్లకుఁ జనిరి
అల్ల యింద్రుడు మోహ మాపలే కపుడె
యింతంత సన్నల నింతిఁ గన్గొనఁగఁ
జెంత నేగుచు కొన్ని చిన్నె లొనర్ప
న న్నెలంతుక మొకం బటు వంచికొనుచుఁ860
దన్నుఁ జూడక యేగఁ దపసికి వెఱచి
మరలె నింద్రుండును మదనాస్త్రధార

ఇంద్రుని విరహవర్ణనము.


చురుకుసేయఁగఁ జేరె సురరాజధాని
తనచూపు తలఁపు నాత్మయు నై యహల్య
వెనుకొని మరలి రా విధములే కరుగ
తనువుమాత్రంబుతోఁ దనయిల్లు చొచ్చి


మనసిజునకు లోఁగి మరులున కాఁగి
ఉసురను కలకుబెట్టూర్పు నింతులను
గసరు విరులశయ్యఁ గాఁకచేఁ బొగలు
వలపు మించఁగ బైలువడి గౌఁగిలించు870
పలవరించు హసించుఁ బారవశ్యమున
జడునికైవడి నుండు సంకల్పమునను
పడతుక రతి జెందు భ్రమమంచుఁ దెలిసి
తను దానె నిందించుఁ దడయక లేచు
మనసు దిప్పుక కొంత మఱచియుండంగ
నందనవని కేఁగు నవత యం దెచ్చి
కొందళించ సుధర్మఁ గొలువుగా నుండు
నుండుచో నెప్పటి యుల్లాస మొంద
కుండినఁ దా మరు లొందుటఁ దెలిసి
రచ్చల న్నగుదురు రసికు లటంచు880
తెచ్చుకోలుముదంబు దిట్టతనంబు
కపటపుహాసంబు ఘనవిలాసంబు
నెపమున సరసంబు నెరరాజసంబు
పెట్టుచాయల సొంపు బిగువొందు పెంపు
గుట్టైన మాటలు కూర్మియాటలును
పైపూఁత నీతులున్ బ్రబలహేతువులు
కైపునన్ బ్రకటించి ఘనత వాటించి
తన చిన్నెలను మాటఁదలఁచి యచ్చోట
పునుఁగున మఱుపెట్టు బూన లేఁజెమట
నలరుబంతులఁ దాఁచు నలతనిట్టూర్పు890
నెలమి వస్త్రంబుల నిముడు గార్శ్యమును


కపురంబులనె కప్పుఁ గడువెల్లదనము
నెపమున నందఱి నెమ్మి వీడ్కొలిపి
కొలువు చాలించి గ్రక్కున నంతిపురము
వలగొని చని యెక్కు వైజయంతంబు
భావ మొక్కెడ నైనఁ బట్టక నిటులఁ
బూవుఁబోణివిరాళిఁ బొగులుచు నుండె

గౌతమాశ్రమమం దహల్య.


అయ్యహల్యయు గౌతమాశ్రమంబునను
నెయ్యంబు మించ మౌనికి నెల్లవేళఁ
జెలిమిని శుశ్రూషఁ జేయుచు మిగుల900
బలునిష్ఠ నా ఋషిపత్నుల కరణి
చాలవ్రతంబులు సాధించు నుదయ
వేళ స్నానంబు గావించి జపించి
తసగంగ నార్ద్రవస్త్రములతో వెడలి
మొన చెఱుంగుల నీరములు త్రోవ వెంట
ఘనరేఖ యేర్చడఁగా మేనువడక
తనువెల్లఁ బులకింప తడికురుల్ జార
కరములదర్భయుంగరములు మెఱయ
గరిమెను పూర్ణాంబు కలశంబు పూని
శమము మించఁగ బర్ణశాల వేఁజేరి910
క్రమమున దేవతార్చనకుఁ గైసేసి
జిగిమంచుతెర మించు జిలుగుదువ్వలువ
తగురంగుల చెలంగు తన యంగకముల
నొరయుచు బిరుసుగా నొత్తంగఁ జురుకు
కరుకును మీరు వల్కలము ధరించి


బిగువుగా నారచే బిగియించి కట్టి
వగవక వేఱొక్క వల్కలం బూని
యుదుటగుబ్బల హత్త నుత్తరీయముగఁ
గదియించి రత్నమేఖలఁ దాల్పనైన
తనకౌను [8]కౌనుకోదర్భతా డనక920
నెనయించి వేదంబు నిల మునుల్ బట్టి
గాదె పూజ్యతఁ జెందఁగలిగి రభృంగి
వేదంబు చేపట్టి వేల్మికుండములు
వెలయించి యగ్నికి వింతసంతసము
చెలఁగఁ దృప్తియొనర్పఁ జెంగట నిలిచి
పాకయజ్ఞము సేయు ప్రౌఢియుఁ దానె
గైకొని యతిథిసత్కారంబు నేర్చి
ఈలాగు గరితల కెనయు శీలమున
మేలిమి రంజిల్ల మెఁలగుచునుండెఁ
అంతట నింద్రుఁ డ య్యలివేణిమీఁది930

ఇంద్రుఁడు గౌతమాశ్రమమునకు వచ్చుట


చింత యాపగలేక చిత్తజుకేళి
నెటులైన నయ్యింతి నెనసి కూడంగఁ
గుటిలత నూహించుకొని పనిలేని
పనికి నా గౌతమభవనంబునకును
నరుగు నాతిథ్య మాయన సేయఁదలఁప
నరమాటనే యొప్పి యానాఁడు నిలుచు
నిలిచి ముచ్చటలాడు నెపమున నట్టి
నెలతఁ గన్గొనఁ గొన్ని నీటులుసేయు


వనిత వడ్డింపగా వచ్చుచో నొరులు
గనకుండ చిన్నెలు గావించుకొన్ని940
వెస నగ్నిహోత్రపువేళఁ దా వచ్చి
కసిదీర నాచానఁ గనుఁగొని పొగడు
మునిని వీడ్కొని యేగ మొనసి యందొక్క
మునిశిష్యుఁ బుత్తెంచు ముదితకుఁ దెలుప
మరియు నొక్కొకవేళ మౌని లేనపుడు
పరికించి యొంటి నప్పడతుకఁ గాంచి
వినయంబు లొనరించు వీరువా రెందుఁ
గనుగొందురో యంచుఁ గ్రక్కున నరుగు
నాపెయు నొకకొంత హర్షించినటులఁ
జూపుజూపులె సేయు సంకోచమునను950
వాసవుఁ డొకనాఁడు వనజాక్షిఁ గలయ
నాసచేఁ జనుదెంచి యపరరాత్రమున
నయ్యాశ్రమంబున నణకువ నుండి
చయ్యన నమ్మౌని స్నానార్థముగను
చీకటితోఁ దాను శిష్యులు నేఁగ
వీఁక నా గౌతమువేషంబుఁ బూని
పర్ణశాల నహల్యపాలికిం జనిన
నిర్ణయంబుగ వాని నెలఁత యెఱింగి
అమరేంద్రుఁ డని యాస నలమి రమించె
తమిదీర నింద్రుఁ డాతరుణినిఁ గూడి960
మొనబంటిగెఱలేక మోవిఁ గ్రోలుటయు
కొనగోరు సోఁకక గుబ్బ లంటుటయు
పలటీలఁ బల్కు లొప్పక పెనంగుటయు


లలిని గాజులు గదల్పక నలముటయు
బంధవైఖరులు జూపక కలియుటయు
బంధురదీప ముంపక సొలయుటయుఁ
గాఁగ ముచ్చుల గచ్చు కరణి రతంబు
వేగఁ జాలించి యావెలఁది లాలించి
యతికృతార్థతఁ గాంచి యాత్మ హర్షించి
మతి శంక మీఱంగ మగుడ నేగంగ970
నటు గౌతముఁడు మళ్ల నరుదెంచి యట్టి
యుటజంబు జొచ్చి య య్యువిదతో నింద్రుఁ
గనుగొని యా పాపకర్మంబు దెలిసి

అహల్యాజారుఁడైన యింద్రుఁడు గౌతమ శాపము నొందుట.


కనలి యోరి! దురాత్మకా! గుహ్యమొకటి
కామించి యీపని గావించుకతన
నీ మేన నవి వెయ్యి నిండారఁ బొడమి
యుండుఁగా కని శాప మొసఁగిన నపుడె
దండిగా నవి బుట్టి తనువెల్ల నిండె
నది చూచి సిగ్గున నమరనాథుండు
కదలి వేగమె బ్రహ్మకాసారమునను980
గమలనాళంబులోఁ గడు డాఁగియుండ
నమరు లెప్పటివలె నయ్యింద్రసభకు
గొలువుసేయఁగ వచ్చి కూడి యందఱును
బలభేదిఁగానక భ్రమసి యం దరసి
గుసగుసలాడుచు గురుని దగ్గఱకు
వెసఁ జని యింద్రునివృత్తాంత మడుగ
గురుఁడు ధ్యానమునఁ గన్గొని యెల్లపనులు


సురల కాతనియున్కి చొప్పడఁ దెలిపె
అంతఁ జింతించి యయ్యమరులు దుఃఖ
సంతప్తులై పాకశాసనుఁ డెంత990.
పనిసేసె సురరాజ్యపతి యెవ్వఁ డింక
నని మంతనముసేయ న య్యింద్రమంత్రి
పిసఁ దప్పుపని దలపెట్టి రం చరసి
వెస దేవతలఁ బిల్చి వెతఁబడనేల
దొరల కొక్కెడ తప్పు దొరలదో మళ్ల
పరిజను లది చక్కబఱచరో జగతి
మనము నయ్యింద్రుఁ గ్రమ్మఱఁ దోడితెచ్చి
ఘనతసేయగఁ బాడిగాదె పోద మని
యందఱిఁ దోడ్కొని యరిగి యచ్చెంత
బొందుగా నింద్రునిఁ బొగడి గానంబు1000.
సేయించఁగ నతండు శీఘ్రంబ వెడలి
పాయ కా గురునకుఁ బ్రణతు లొనర్చి
తలవంచుకొని సిగ్గు దనర నిల్చుటయు
నల బృహస్పతి యింద్రు నలమి యిట్లనియె
సురరాజ! లజ్జచే సృక్క నేమిటికి
నురుతరమచ్ఛక్తి యోన్యనీకంబు
మోహనాకృతిఁ జెందు మేటి యచ్చరల
మోహనకలఁ దేల్చి మోద మొందుచును
నందనం బన మేరునగకందరములఁ
బొందుమీద విహారములు చేసికొనుచు1010.
మెరుగుదువ్వటముల మేను కైసేసి
సురరాజ్యపాలన చొప్పడ సల్పు


మనవుఁ డట్లగుటయు న య్యింద్రుఁ డలరి
చనుదెంచి యపుడు నచ్చరలతోఁ గేళి
సలుపుచుం దనివి వేసటయును లేక
మలయుచు మన్మథోన్మాదంబు మీఱి
చాల స్త్రీలోలుఁ డై సతతంబు బైలు
దేలక కొలువుండు తెఱకువమాలి
పరిపాటియును రాజ్యపాలన మఱచి
సురముఖ్యులకుఁ గండ్లఁ జూడఁగన్ రాక1020
యుండుటయును గురుం డొకవేళ యరసి
వెండియు నిది యొక్క విపరీత మయ్యె
నొకటిచే రతికామ ముడుగంగ రాదు
ప్రకటింప నవి సహస్రములైన వశమె
వీనికి హితమైన విధము దెల్పుదును
నానేరుపున నంచు నయముగా నింద్రు
నంతఃపురంబున కరిగి యం దతని
చెంతనుండి నుతించి చెలిమి నిట్లనియె
విను మమరేశ్వర విమలశీలుఁడవు
నినువంటివానికి నిస్సారమైన1030
కామభోగముఁ గోరఁగా నుచితంబె
నీమేన నివి యున్కి నిష్ఠురదైత్యు
లరసిన నిందింతు రటమున్నె నీవు
వెరవున నొచ్చెంబు వీడునట్లుగను

ఇంద్రుఁడు వెంకటాద్రిని తపంబుసలిపి స్వామియనుగ్రహంబు వడయుట.


శ్రీ వేంకటాద్రి నా శ్రీనివాసులను
భావించి వ్రతములపటిమ మెప్పించి


కర మిష్టములు చెందఁగలుగుదు వనుడు
పురుహూతుఁ డలరి సొంపున బృహస్పతికి
నెఱఁగి దివ్యవిమాన మెక్కి యక్షణమ
యరిగి యా గిరిఁ గాంచి యటఁ బ్రదక్షిణము1040
గావించి యచ్చోటు కడు రమ్య మగుట
భావించి శిల వజ్రపటిమ భేదించి
పాతాళగంగను పైకి రావించి
స్నాతుఁడై యొక్కవత్సరము తపంబు
సలిపినం గరుణ నా జలజలోచనుఁడు
చెలిమిఁ బ్రత్యక్షమై చేరి యిట్లనియె
బలభేది నీ కేమి వలసి తపంబు
సలిపెదవు వరంబు సరగ నిచ్చెదను
కోరికొ మ్మ నవుడా కులిశాయుధుండు
శౌరి గన్గొని వేగ సాష్టాంగ మెఱఁగి1050
నిలిచి కేలుమొగిడ్చి నీరజనాభ
బలిని బంధించి నన్ బ్రతికించి కాచి
నా పాలి పెన్నిధానంబుగా నలరు
నీ పాదపద్మంబు నేఁ బొడగంటిఁ
బరమధన్యుఁడ నైతి భాగ్యంబు వేరె.
మరియును గలదె యోమందరోద్ధారి!
యైన నా వైరూప్య మంతయు మార్చి
దీనతఁ బాపవే దితిజసంహారి
నావు డింద్రునిఁ జూచి నారాయణుండు
భావంబున న్నగి పాకారి నీకు 1060
నన్ని యొచ్చెంబులు నడగి యయ్యన్ని


కన్నులు మేనెల్లఁ గలిగెడి నిపుడె
యని వరం బొసఁగి యత్యాశ్చర్యముగను
తన మాయ నపుడె యంతర్హితుండయ్యె
అపుడు సహస్రాక్షుఁడై సురేంద్రుండు
విపులసౌఖ్యముఁ జెంది విలసిల్లెగాన
నీ తీర్థవిభవంబు నీ గిరి మహిమ
ధాతకైనఁ దరంబె తడవి వర్ణింప
నని తేల్చి శంకరుం డవ్వల కరిగి

శివుఁడు పార్వతికిఁ గపిలతీర్థమహిమను జెప్పుట.


కనుగొని యచ్చోట కపిలతీర్థంబు1070
విను గౌరి యీతీర్థ విమలవైభవము
మును శౌరి కృతయుగంబునఁ గపిలాఖ్య
మౌనియై యతలసీమను వసింపుచును
బూనికె ప్రతిదినంబును నీ సరంబు
వివరంబు బ్రోవగా వెడలి యిం దుండు
శివలింగమును పూజనేయుచుండంగఁ
గపిలతీర్థం బనంగా నయ్యె నిదియె
విపులపుణ్యకరంబు విశ్రుతం బవని
ప్రతివర్షకార్తికపౌర్ణమాసులను
క్షితిఁ గల్గు తీర్థవిశేషంబు లెల్ల1080
మధ్యాహ్నమున యామమాత్ర మిం దుండి
ఋద్ధ్యాద్యభీష్టంబు లెల్లవారికిని
దానె కల్గగఁ జేయు దర్శనంబుననె
స్నానదానార్చనల్ సలుపు ధన్యులకు
నే కామితార్థంబు లిహమునం గల్గి


వైకుంఠకైలాసవాసమున్ దొరకు
నిచ్చోట నీ కపిలేశ్వరుం డిపుడు
హెచ్చుగా భక్తుల కీప్సితం బొసఁగు
కపిలయోగి కృతయుగమున ని య్యీశు
నపచితి మెప్పించి యలరుచు నుండె 1090
తరువాత నగ్ని త్రేతాయుగంబునను
ధర పూజ యొనరించి ధన్యతఁ గాంచె
నల ద్వాపరంబున హరిచక్ర మితనిఁ
బొలుపొంద భజియించి పొగడొందె నింకఁ
గలియుగంబున నిందుఁ గపిలార్చనాది
కలనచే నిట్టి లింగమె ప్రకాశించు
నీ లింగమాహాత్మ్య మెంచి నుతించఁ.
జాలండు శేషుఁడున్ జతురాననుండు
అనుచుఁ బేర్కొని గౌరి కటు వివరించి
తనరుచు నా సరస్తటమున నుండి 1100
భావించి యోగప్రభావంబుచేత
భావికార్య మెఱింగి పవనుండు గుహుఁడు

శివపార్వతులకుఁ గుమారునకు హరిప్రత్యక్షంబగుట.


ననుపమంబుగఁ దపం బాచరించుటయు
వనజేక్షణుఁడు గృప వారలయెదుట
సాక్షాద్భవించి ప్రసన్నుఁ డౌటయును
దక్షాధ్వరధ్వంసి తా మున్నె యరసి
హరిని గన్గొనఁగ న య్యతివతోఁ గూడ
నరిమురి నరుదెంచు నవసరంబునను


కటిఁగట్టి హేమాంశుకంబు నామీఁద
ఘటియించి నందకఖడ్గరత్నంబు1110.
మెఱయ మధ్యంబున మేఘలఁ బూన్చి
యురమునఁ గౌస్తుభం బొనర హారములు
ధరియించి యిడి కంఠతటి గంటిసరులు
కరముల రత్నకంకణములు వెట్టి
పొలుపొంద భుజముల భుజకీర్తు లంది
మలయించి వీనుల మకరకుండలము
లురుకిరీటము మౌళి నొనరంగఁ దాల్చి
విరులదండలు తావి విసరఁ గైసేసి
చరణనూపురము లెచ్చరికలు దెలుప
మెరుగారు పావలు మెట్టి కట్టాణి1120.
ముత్తియంబుల గేరు మొనగోరు లచట
గుత్తపువెన్నెల గుంపు నింపంగ
సిరులీనుచెలి పంటచెలువయుం జెలిమి
నిరుదండ కైదండ లియ్యంగ నొయ్య
నయ్యెడ వలరాయనయ్య నెయ్యమున
న య్యాదికిటిమూర్తి యై యరుదెంచి
హరకుమారసమీరణాదుల మ్రోల
వరకరుణాస్ఫూర్తి వరదుఁడై నిలిచె
నిలిచిన పవనుండు నీలకంఠాశ్వుఁ
డల నీలకంఠుండు నగరాజసుతయు1130.
వనజాక్షుఁగనుఁగొని వందించి పొగడి
ఘనమనోరథసిద్ధి గాంచి వీడుకొని
తమయున్కిపట్లకుఁ దరలి యేగుటయు


నెమిలితత్తడిరౌతు నిష్ఠురహత్య
గ్రక్కునఁ దొలగంగఁ గని పర్వములను
మక్కువ మీఱం గుమారధారికను
చనిచని స్నానంబు సలుపుచునుండ

అగస్త్యాదిమునులచ్చట హరికై వెదకుట.


ననఘు లగస్త్యాదియమిచంద్రు లందు
వలగొని యరుగుచు వాయవ్యదిశను
తెలియ నా గిరి యొక్క దేవరూపమున1140.
గనిపించి తమకుఁ బల్కక డాగురింపఁ
గని విస్మయమున నాకడ నంతరమున
నవలతాగుల్మవనములరంజిల్లు
వివిధతీర్థంబులు వెసఁ జూచుకొనుచు
నల తూరుపున సనకాదియోగితతిఁ
దిలకించి హరి మాకు దృశ్యుఁడౌ నెందు
నని యడుగఁగ వార లటు పశ్చిమమునఁ
జనుఁ డింద్రు డందు నిశ్చయము దెల్పునన
నరిగి యచ్చట నింద్రు నడుగ నతండు
హరు డుండు కపిలతీర్థాంతికంబునను1150.
తెలుపు నాతం డన తిరిగి యచ్చోటఁ
బులితోలు భూతియుఁ బునుకకంచంబు
నెలవంకపూవును నిడుదకెంజడలు
నలుపెక్కు కుత్తుక నాగభూషలును
వెలుగు కన్నులు కల్గి [9]వెలయు ముక్కంటిఁ
జెలిమిఁ గన్గొని మ్రొక్కి సేవించి యడుగ


నతఁడు నియ్యెడ మీరు హరినిఁ గన్గొనెద
రతిరయంబున నని యాత్మీయమాయ
నంతర్హితుండైన నమ్మునులంత
చింతతో నటకుఁ బశ్చిమకోణమునను1160.
హరిసైన్యపతి జైత్రయాత్రాభిరతిని
పరశిలాతలమున వరుస సైనికులు
తనుఁ గొల్వ నుండ నాతనిఁ గాంచి యలరి
వినతులై తమ కోర్కె వివరింప నతఁడు
గర మొప్ప మాయావిఁ గనుఁగొన మీకు
బరమ మౌ నొక్క యుపాయంబు గలదు
జలజాక్షునకుఁ గేళిసరసిగా నింపు
సలుపుచు నుండు నాస్వామి పుష్కరిణి
సలిలంబులన్ భక్తి స్నానంబు సేసి
కొలుచు ధన్యులకుఁ గన్గొనవచ్చు హరిని1170.
అని చనినంత వారా స్వామిసరసి
గనుగొనఁ జేరి యక్కడ శంఖనృపతి
వసుఁడు శ్వేతద్వీపవాసులు నుండ
వెస వారలను జూచి విస్మితులగుచు
స్నాతులై శ్రీనివాసధ్యానపరత
నాతటంబున నుండి రందఱుఁ గూడి
అని తెల్ప విని జనకావనీశ్వరుఁడు
ముని వామదేవుని ముదమునం బొగడి
యందు శంఖుఁడు వసుం డనువార లెవ్వ
రెందుకు నటు వచ్చి రెలమిఁ దెల్పు మన


శంఖుఁడను రాజుకథ.


మునివరుఁ డాకథ ముందుగాఁదొడఁగి
వినుతవృత్తాంతంబు వివరించె నిటుల
మునుపు [10]హైహయ దేశమున శ్రుతాఖ్యుండు
జనపతి యై యుండు శంఖుఁడన్ సుతుఁడు
జనియించె నతని కా శంఖభూవరుఁడు
దనర బ్రహ్మాదిచందంబునఁ జాల
హరిభక్తుఁడై వైష్ణవారాధనంబు
సరగ సల్పుచు వెన్ను సాక్షాత్కరించ
వలసి యనేకము ల్వాజపేయములు
నల రాజసూయము లశ్వమేధములు1190.
విశ్వజిత్సత్రాది వివిధయజ్ఞములు
శాశ్వతికాసక్తి సవరించి హరిని
పొడగాననికొఱంతఁ బూని శోకించు
నెడ కరుణార్ద్రుఁడై యీశ్వరుం డతని
కనియె నదృశ్యత నందఱు వినఁగ
జనపాల నీ కింత సంతాప మేల
ననుపమం బగు వేంకటాచలంబునను
సనకాదిసేవ్యమై స్వామిపుష్కరిణి
యను నొక్కసర మున్న దచ్చట నియతి
ననుదినంబు మునింగి యజియించి నన్ను1200.
గనుఁగొనియెదవు శంక దొలంగు మింక
నను డాలకించి హైహయరాజసుతుఁడు
ఘనవిస్మయంబు బొంగఁగ మెయి పడక


వనజనాభుఁడె దయన్ వచ్చి పల్కె నని
తెలిసి జాగిలి మ్రొక్కి దృఢభక్తి మెఱయ
నలరుచు శ్రీ వేంకటాచలంబునకు
నరిగి స్వామిసరంబు నచ్చటఁ గాంచి
ధరణి సాష్టాంగమై తగఁ బ్రణమిల్లి
విసువక నర్తించి వినుతి సేయుచును
పొసఁగఁ బ్రదక్షిణంబులు సల్పి యందు1210
త్రిషవణస్నానముల్ దినము సల్పుచును
ఋషివృత్తి హరి భజియింపుచు నుండె
వెస నీకు నరపాల వివరింతు నల్ల
వసుచరితంబు పావన మద్భుతంబు

వసుఁడను రాజు కథ.


వసుధఁ జెందె విభుండు వరధర్మవిదుఁడు
వసుఁడను నొక రాజు వైష్ణవోత్తముఁడు
సకలతత్వజ్ఞుండు శమదమాన్వితుఁడు
సుకృతైకశీలుండు సుజనపూజకుఁడు
సర్వాత్మబంధుండు సత్యసంధుండు
నిర్వైరమతి బ్రహ్మనిష్ఠముఖ్యుండు1220
నిగమాగమపురాణనిచయార్ధవేది
నగధరపాదార్చనానిరతుండు
నిరవద్యగుణగణాన్నిద్రవైభవుఁడు
సురకిన్నరాదులు సొరిది నుతింప
నమృతసారపటీరహారనీహార
విమలకీర్తి వహించి విపులఁ బాలింపు
ౘలరంగ నొక్కనాఁ డమరేంద్రసభను


కలశోద్భవవసిష్ఠకణ్వాత్రిముఖులు
వరమునుల్ చనుదెంచి వరుస నుండునెడ
సురల కమ్మునులకున్ శుభగోష్ఠివేళ1230.
మును పూజ్యు లమరులో మునులో యటంచు
మొనసెఁ సంవాదంబు ము న్నింద్రుఁ డరసి
యిది నిర్ణయం బని యేర్పరింపంగ
మదిఁ దోఁచకునికి యో మౌనీంద్రులార
మన కేల వాదంబు మహి వసురాజు
తనరంగఁ దేర్చు ని ద్ధర్మసంశయము
పోద మా నరపాలుపొంతకు ననుచు
సాదరంబుగ మౌను లమరు లింద్రుండు
చనుదెంచి ధరణికిం జయ్యన నపుడె
జనపాలమణి యుండు సభఁ జేరుటయును1240.
అల వారి నరపాలుఁ డాశ్చర్య మొదవ
తిలకించి యమితభక్తిని వేచి సేమ
మరసి యర్ఘ్యము పాద్య మాచమనీయ
మరుదారఁగ నొసంగి యాసనంబు లిడి
తగ నర్చన లొనర్చి తదనుజ్ఞ వడసి
వగ మీఱఁ గూర్చుండి వారికి ననియె
సుదినాహమిది మిమ్ముఁ జూడఁగల్గుటను
మది నన్ను గరుణించి మన్నించఁ దలఁచి
దేవమునుల్ వచ్చితిరి నా గృహంబు
పావనం బయ్యె నా భాగ్య ముప్పొంగె1250.
నేమి నే సేయనయ్యెడి దానతిండు
నేమించి పనిగొన నే కింకరుండ


నని పల్కి వసురాజు నమరులు మునులు
గనుఁగొని మధురవాక్యములకు నలరి
జననాథ ధర్మసంశయము ని న్నడుగఁ
జనుదెంచితిమి నీవు సత్యంబు వల్కు
మమరులు యోగ్యులో యగ్రపూజలకు
యమిముఖ్యు లర్హులో యని సంశయంబు
జనియించె నిందు నిశ్చయ మెట్టి దనుఁడు
జనపతి సుర లగ్రసంభావ్యు లనియె1260
అనుటయుఁ గోపించి య మ్మునీశ్వరులు
కనుగవ నిప్పుకల్ గ్రక్కు వెక్కసపు
కడక న వ్వసురాజుఁ గనుఁగొని సభను
చిడుముడి మొకములు జేవురింపంగ
దొరలఁ కిచ్చకముగాఁ దొడి నసత్యంబు
దొరల బల్కితి గాన దుర్గమం బైన
పాతాళతలమునన్ బడు మంచు శాప
మాతతోద్ధతి నిడ నాతఁ డాక్షణమె
ధర నిల్వలేక పాతాళతలంబు
చొరఁ దెప్పునం బడుచో మది హరిని1270

మునులశాపముచే పాతాళమునఁబడు వసురాజును రక్షింప స్వామి గరుడునిబంపుట


ధీరత భావించి తెమలని భక్తి
నారాయణముకుంద! నను బ్రోవఁగదవె
శరణు లక్ష్మీకాంత! శరణు గోవింద!
శరణు హృషీ కేశ! శరణు సర్వేశ!
యనుచును బడుచుండ నతని మారుతుఁడు
కనుఁగొని శాపంబు కలుగుట యరసి


హరిభక్తుఁ డితఁ డంచు నర్మిలి సంది
ధరియించి నొయ్య నత్తరి నిల్వ నిడియె
నచ్చోట నతినిబిడాంధకారమున
కిచ్చోటువడుచు నా క్షితివల్లభుండు1280
హరినిదిధ్యాసనాయత్తచిత్తమున
బరమవైరాగ్యసంపన్నుఁడై మదిని
శోకలేశం బైన చొప్పడ కెపుడు
లోకోన్నతానందలోలుఁడై యుండ
క్రూరదైతేయులు కొందఱు పూర్వ
వైరంబుఁ దలఁచి యా వసువసుధేశుఁ
దొడరి హింసింపఁగాఁ దోయజాక్షుండు
కడునిజభక్తుని గాసి యెఱింగి
కారుణ్య మలరంగఁ గరుడునిఁ బిలిచి
వీరాగ్రగణ్య యో వినతాతనూజ1290
నాదు భక్తుఁడు వసునరపాలుఁ డనెడు
చేదిపుంగవుఁడు ఋషిక్రోధమునను
పాతాళతలమునన్ బడె నట్టి వాని
దైతేయసంఘంబు దగిలి బాధింపు
చున్నది యందు నీ వుర్వడి నరిగి
మున్నుగా దైత్యుల మోహరం బడఁచి
య య్యధోగతి నుండు నత నుద్ధరించి
చయ్యనఁ దెచ్చి రాజ్యంబున నిలుపు
మని యానతిచ్చిన నా పక్షిరాజు
వనజాక్షునకు మ్రొక్కి వలగొని వెడలె1300


పక్షిరాజు పక్షవిక్షేపముల వర్ణనము.


వెడలె నిష్ఠురపక్షవిక్షేపణములఁ
గడలినీరెల్ల చిక్కటిలి ఘూర్ణిల్ల
గిరులు ద్వీపంబులు గిరగిర దిరిగి
యొరయిక నొండొంట నూటాడుచుండ
బడబానలజ్వాల పటలంబు చిటిలి
మిడుగురుల్ గాగ నూర్మికలు బై కెగయ
తిమితిమింగిలకోటి తీక్ష్ణాగ్రనఖర
సముదయంబునఁ చిక్కి చక్కులై తునియ
భోగిసంఘాతంబు భోగముల్ ముడిచి
వేగ చుట్టలుజుట్టి వెడవెడ వడక1310
జవతజంఝామరుజ్ఝాటార్భటంబు
చెవిఁ జొర వరుణుండు చింతించి కలఁగ
చొచ్చి నిజాంగతేజోరాజిఁ దమము
విచ్చి య చ్చో టెల్ల వెలుగొంది మెఱయ
చని ఠీవి యావసుజనపాలుఁ జెనకు
దనుజుల తుండాగ్రధారఁ జెండాడి
పరమవైష్ణవుఁ జేరి పార్థివుఁ జేరి
యరుదార మును సేమ మడిగి యిట్లనియె
విను వసుభూపాల వెన్నుండు నిన్ను
కొనితెచ్చి మున్నట్ల కుంభిని నిలుప1320
నన్ను బుత్తెంచె నింతట వేగ నాదు
వెన్నెక్కు మిప్పుడే వెస నీదు పురికిఁ
గొనిపోదు ననవు డా క్షోణీశ్వరుండు
వినతుఁ డై కేల్మోడ్చి వినతాతనూజు


వినుతించి యో దేవ వేగ నన్ బ్రోవ
నెనరునఁ గరుణించి నీ విట్టి వేళ
నిటు వచ్చితివి నా దభీష్టదైవంబ
వటుగాక నీ వెన్ను నంటి యా వెన్నుఁ
డెక్కుట తగుగాక నే నెక్కఁదగునె
యెక్కువ యీ మాట కిదె మ్రొక్కినాడ1330
నపచార మిది యట్టి యైశ్వర్య మొల్ల
కృప నియ్యడనె యున్కి కేవలహితము
అని భక్తిమీర సాష్టాంగమై [11]యెఱఁగి
వినయంబునను నిల్చు విధము నీక్షించి
ఖగరాజు వసురాజుఁ గౌఁగిట నలమి
తగునట్ల బలికితో ధరణీతలేంద్ర!
ఇంత భక్తుఁడ వౌట యిందిరారమణుఁ
డెంతయుఁ గరుణించె నిది నీకె తగియె
నయిన నాభుజముల నలరి నీ పురికి
బ్రియమునఁ గొంపోదు ప్రియము దీపింప1340
నని యానృపాలుని నక్కునఁన్ జేర్చి
కొని తెచ్చి జగతికిఁ గుతుకం బెలర్ప
రాజ్యాభిషేకంబు రమణ గావించి
పూజ్యత మ్రోయ నప్పుడె మళ్ల నరిగె
ఈ కథ వినువారి కెందు నాపదలు
బైకొన వెంతటి ప్రారబ్ధ మున్న
నుద్ధరించును వసు నుద్ధరించుక్రియ
సిద్ధసంకల్పుఁడా శ్రీనివాసుండె


నంతట నా నృపాలాగ్రణి యలరి
సంతతంబు ముకుందచరణసంస్మరణ1350
రాజయోగముఁ జెంది రమ్యశీలుఁ డయి
భూజనంబులఁ బ్రోచి పొగడొందుచుండె
హైహయేంద్రునకు నభీష్టం బొసంగ
శ్రీ హరి వేంకటక్షితిధరంబునను
ప్రత్యక్షమగుటఁ దా భావించి మదిని
సత్యసంకల్పుఁ డా జలజలోచనుని
బొడగాంతు ననుచు నుబ్బుచు స్వామిసరసి
కడకేగి యందఱు గలసి కొన్నాళ్లు
పూనినసద్భక్తి పూజాదివిధుల
శ్రీనివాసులను భజింపుచుండంగ1360
హరి భక్తవత్సలుం డబ్జనాభుండు
పరమాత్ముఁ డిందిరాప్రభుఁ డచ్యుతుండు
వేదాంతవేద్యుండు విశ్వవిశ్వాద్యుఁ
డాదిమధ్యాంతదూరానందమయుఁడు
దేవాదిదేవుండు దీనరక్షకుఁడు
శ్రీ వేంకటేశుండు చెలిమి నవ్వేళ
నందఱిఁ గరుణించి యవ్యాజలీల
నందఱికిని నన్ని యాకృతుల్ దోఁప

స్వామిపుష్కరిణితీరమున శ్రీ వేంకటేశ్వరులు వసురాజాదులకుఁ బ్రత్యక్షమగుట.


శాశ్వతస్వామిపుష్కరిణితీరమున
విశ్వరూపముదాల్చి వినతాతనూజుఁ1370
డగు గరుత్మంతుపై నధిరూఢుఁడగుచు
నగణితమణిభూషణావళి మెఱయ


నాశ్చర్యమొదవఁ బ్రత్యక్షమై నిలిచె
నిశ్చలాకృతిఁ జూచి నివ్వెఱ గంది
యందఱు నిలుచుండి రానందమొంది
ఇందిరావిభుమాయ లింతనఁ దరమె
వేవేలముఖములు వేవేలకండ్లు
వేవేలువీనులు వేవేల్ భుజములు
వేవేలుపాదముల్ వేవేలుతొడలు
వేవేలుచక్రముల్ వేవేలుశంఖు1380.
లలరంగఁ గోటిసూర్యప్రకాశముగ
వెలయంగఁ జెలఁగు న వ్విష్ణురూపంబు
గనుఁగొని యందఱుఁన్ గడుఁ దెలివొంది
వినుతించి సాష్టాంగవినతు లొనర్చి
శిరముల నంజలుల్ చేర్చి నర్తించి
పురుషోత్తమ ముకుంద పుండరీకాక్ష!
కనకాంబర! మురారి! కౌస్తుభాభరణ!
యనుచును వేర్వేర నలరి కీర్తించి
వసురాజు శంఖభూవరుఁ డగస్త్యుండు
వసువులు గరుడు డఁ వ్వనజసంభవుఁడు1390.
నల శక్రుఁడును మోక్ష మర్థింపుచుండ

ఇంద్రాది దేవతలు దేవజిదాది దైత్యుల సంహరింపుమని వేఁడుట.
బలవైరి ముఖ్య దేవతలు కేల్మోడ్చి
దేవజిదాది దైతేయులఁ దునిమి
కావవే మమ్మంచు కాంక్షించి వేఁడ
మరికొందఱైశ్వర్యమహితపుత్రాది


వరములు ప్రార్ధింప వారి నందఱిని
కరుణఁ గటాక్షించి గడు నాదరించి
వరదుఁ డౌ నా శ్రీనివాసుఁ డిట్లనియె
చింతామణీమూర్తి శ్రీ వేంకటాద్రి
నెంతయు సురధేనువెసకము న్మించు1400
జగదేకపావని స్వామిపుష్కరిణి
యగణితవైభవం బలరంగ నుండు
నానందనిలయవిఖ్యాతిసంతాన
మానితం బగు నా విమాన మిం దుండు
కనుఁగొను మాత్ర మీ కాంక్షితవరము
లనుపమధర్మకామార్థమోక్షముల
నిచ్చు నంచును నానతిచ్చి య చ్చెంత
వచ్చి నిల్చున్న విష్వక్సేనుఁ గాంచి
దేవజిదాదిదైతేయులఁ ద్రుంచు
వేవేగ ననుచు వావిరి సెల విచ్చి1410
కనుచు నందఱు నుండఁగా నచ్యుతుండు
తన మాయచేత నంతర్ధానమొందె
అపు డందఱును విస్మయానందములను
చపలత మించ నాస్వామి భావించి
ధరణి జాగిలి మ్రొక్కి తత్ప్రభావములు
మరిమరి బొగడుచు మరలి చూడంగ
చెంత నత్యంత మచింత్య మై కాంతి
మంత మౌ నొక్క విమానరత్నంబు
ప్రాదుర్భవించ నా భవనాంతరమున
వేదవేద్యుండు శ్రీ వేంకటేశ్వరుఁడు1420


నెలకొని యుండుటన్ నిఖిలభక్తులును
వలగొని తిరిగి యా వరవిమానంబు
నరసి యా గోవిందు నానందమయుని
నెరసిన భక్తి వందింపుచు పదియు
రెండేండ్లటుండి ప్రార్థితముఁ జేకొనిరి
చండికావిభుఁడును జలజసంభవుడుఁ
గురుఁడు వాసవుఁడు శుక్రుడు సురాసురలు
సరగ నేగిరి తమ సదనంబులకును

విష్వక్సేనుఁడు దైత్యసంహారార్థము యుద్ధసన్నద్ధుఁడై వెడలుట


అంత విష్వక్సేనుఁ డమితసైన్యంబు
లెంతయుఁ గొలువంగ నిల దిక్కు లద్రువ1430
యుద్ధసన్నద్ధుఁడై యురుశంఖభేరు
లుద్ధతి మెఱయ బిట్టురుములకరణి
భటసింహనాద మార్భటిఁ బిక్కటిల్ల
చటులతీక్ష్ణాయుధచ్ఛటలు వెలుంగఁ
గనకరథంబుపైఁ గడువడి నెక్కి
కినుక నాదైత్యులఁ గీటణగింప
వెడలె నప్పుడు పుష్పవృష్టి చెలంగె
తొడివడ దేవదుందుభులును మ్రోసె
నచ్చరల్ నర్తించి రమరగంధర్వు
లెచ్చుగాఁ గీర్తించి రెల్లలోకములు1440
నపరిమితానంద మంది చెన్నొంద
రిపుగణంబులు తత్తరింపుచు డాగె
అల దేవజిత్తుండు నగ్నిజిత్తుఁడును
తొలఁగక మృత్యుజిత్తుఁడు నట్టిరవళి


విని సైన్యనాథుండు వెడలుట దెలిసి
ఘనదుర్గమైన వింధ్యాచలావనిని
దానవసంఘ మత్తరిఁ బురికొల్పి
కాన గయ్యానకు కాళ్లుద్రవ్వుచును
శస్త్రాస్త్రములచేత సమయక వరము
నిస్త్రాసముగను జెందిన గర్వమునను1450.
తనసేన నెదిరించి తాకి పోరుటయు
తనరు సువర్చలాతనయుండు కిన్క
గాలాంతకు నరిఘ్నుఁ గదనభీషణుని
నాలంబు సల్పంగ ననిచిన వారు
పరిఘ తోమర కుంత పట్టస శార్ఙ
పరశు ముద్గర గదా ప్రాస శూలాది
భూరివిధాయుధంబులు ధరియించి
దారుణోద్ధతి హత్తి దైత్యుల మొత్తి
రథములఁ జిదిమి ద్విరదములఁ దునిమి
రథికుల వ్రాల్చి తురంగాళి గూల్చి1460.
చెండినఁ గని దేవజిత్తుఁ డత్తఱిని

దేవజిత్తుతోడియుద్ధము.


భండనంబున చొరంబడ వానిదండ
లన మృత్యుజిత్తుండు నగ్నిజిత్తుఁడును
చలమున సాహసోత్సాహముల్ మించ
మోహరించి మహోగ్రములగు పాశుపత
మోహన తామసముఖ మహాస్త్రములు
సంధించి మాయలు సవరించి సైన్య
మంధకారావృతం బగునట్లు చేసి


కడుఁ జిక్కు పఱచినఁ గాలాంతకుండు
కడగి యైంద్రైషికక్రౌంచసౌర్యాది1470
వివిధాస్త్రములఁ బేర్చి వికటతమంబు
జవమునన్ బొలియించె శత్రుసేనలను
దునియించి మృత్యుజిత్తును దేవజిత్తు
నని నవనిం గూల్ప నగ్నిజిత్తుఁడది
కని కిన్క మాయలఁగప్పి బ్రహ్మాస్త్ర
మనుపమవరలబ్ధ మగు శరంబునను
బూనించుట యెఱింగి బొసఁగ సైన్యేశుఁ
డానికౌనారాయణాస్త్రంబు నేసె
నపుడు గల్పాంతాగ్నియటుల జ్వాలంబు
లపరిమితంబులై యడరిన భీతి1480
నమరేంద్రచంద్రాదు లందఱు వడకి
భ్రమ మొంది యురుకంగ బ్రహ్మాండ మద్రువ
నయ్యస్త్ర మగ్నిజిదాదిదైత్యులను
చయ్యన సమితి భస్మంబుగాఁ జేసి
వడిమీఱ మగుడి విష్వక్సేను పొదిని
యడకువఁ జొచ్చె నత్యాశ్చర్యముగను
అప్పు డింద్రాదు లౌ నమరులు మునులు
మెప్పునఁ దన గెల్పు మిగుల నుతింప

విష్వక్సేనుఁడు వచ్చి దైత్యసంహారముమ స్వామికిఁ దెల్పుట.


సేనాధినాథుండు శీఘ్రంబె మరలి
శ్రీనివాసాద్రికిఁ జేరి దైత్యారి1490
చరణపద్మములకు సాష్టాంగ మెఱఁగి
కరములు మోడ్చి యా కార్యమంతయును


విన్నపంబొనరించ విని సంతసించె
వెన్నుఁ డంతట నొకవేళ వేటాడ
చెలగు వేడుకఁ బూని చెంచురూపొంది
యలఘువిక్రము వృషభాసురుఁ ద్రుంచి
ఆకాశవిభుపుత్రి యైన పద్మనిని
జేకొని పెండ్లాడి సిరులురంజిల్లఁ
గొలుచువారికి నెల్లఁ గోర్కె లిచ్చుచును
విలసితలీలల విహరింపుచుండెఁ1500.
గావున నట్టి వెంకటగిరి మహిమ

వేంకటాద్రికి వివిధ నామములు గలుగుటకుఁ గారణము.


వావిరిఁ గొనియాడవశమె ధాతకును
నారాయణవిహారనగ మౌట నదియె
నారాయణాద్రి యన్నామంబుఁ గొనియె
వైకుంఠముననుండి వచ్చిన కతన
వైకుంఠగిరి యను వరసంజ్ఞఁ జెందె
శ్రీనివాసనివాససీమ దా నగుట
శ్రీనివాసాద్రిప్రసిద్ధి వహించె
మొదట నాదివరాహమూర్తిఁ జేకొనుట
నదియె వరాహాద్రి యనఁ బ్రకాశించె1510.
నరసింహుఁడు హిరణ్యు నలిసేసి యందు
సిరిఁగూడి దనరుట సింహాద్రి యయ్యె
శ్రీశతపత్రాక్షి చెలిమి నుండుటను
శ్రీశైల మను పేరు చెంది చెన్నొందె
అరుల విష్వక్సేనుఁ డచట ఖండించి
హరిని నిజాఖ్య నియ్యచలంబు మెఱయ


వర మిమ్మనుచు వేడ వసుధలో నిట్టి
గిరియె విష్వక్సేనగిరి యనం దనరె
మును శౌరి యొకకల్పమునఁ బాలకడలి
ననువుగా శేషశయ్యను బవ్వళించి1520.
శ్రీభూమినీళలు చెల్మి భజింపఁ
బ్రాభవోన్నతి నుండుపట్ల నారదుఁడు
వచ్చి సన్నుతిసేయ వరదుఁడై యతని
మచ్చిక నీక్షించి మన్నన చేసి
ధర నీవు చూడని తావు లే దెచట
నరుదార మాకు విహారయోగ్య మగు
నొకదేశ మెఱిగింపు మో మౌని యనిన
నగి యాతఁ డో దేవ న న్నడిగెదవె
ద్రవిడాంధ్రదేశమధ్యమున వింధ్యాద్రి
కీవల దక్షిణదిశ నెనుబదామటను1530.
రమణీయమై వనరాశి రాజిల్లు
నమరిక విహరింప నది మీ కనుటయు
నలరి శేషునిఁ జూచి యా ముకుందుండు
చిలువలరాయ యీక్షితి విహరింప
వలె నందు నీవె పర్వతముగా నుండు
మని యాన తిచ్చిన న య్యనంతుండు
పనుపుచొప్పున వచ్చి ప్రాఙ్ముఖంబుగను
కాళహస్తియె మస్తకంబుగాఁ దనదు
వాలభాగం బహోబలముగా నొక్క
కొండయై ధర నుండె కొన్నాళ్ల కదియె1540.
పుండరీకాక్షుని పురి విహారాద్రి


యగుటను శేషాచలాఖ్య మై వెలసె
మగుడ పక్షివిభుండు మహిఁ దెచ్చెనదియ
గరుడుండు తొలుత నిక్కడికిఁ దెచ్చుటయు
గరుడాచలం బనఁగా నుతికెక్కె
వృషభాసురుఁడు వెన్ను వేడుట నదియె
వృషభాచలం బన విఖ్యాత మయ్యె
అంజన యటు తపం బాచరించుటను
అంజనాచల మన నయ్యె న య్యద్రి
నీలసైన్యాధిపు నిజవాస మగుట 1550
నీలాద్రి యనుపేర నీటు వాటిల్లె
కనకమయంబుగాఁ గనుపట్టుకతన
కనకాచలంబనఁగాఁ బొగడొందె
తీర్ధంబులన్ని యిందే యుండుకతన
తీర్థాచలంబన తేజిల్లెనిదియె
జ్ఞానస్వరూపమై జ్ఞానదం బగుట
జ్ఞానాచలం బను సంజ్ఞ చేకొనియె
పటుపాపరాశి వెంపదవాచ్య మగుట
కట దాహనే యనఁ గల్గు నర్థమున
తతపాపముల నెల్ల దహియించు కతన 1560
క్షితి నిదే వేంకటగిరి యనం దనరె

మాధవ సోమయాజి కథ.

ఇందు నే నొక కథ యిపుడు దెల్పెదను
పొందుగా వినరయ్య బుధచంద్రులార !
శ్రీ శైలమునకుఁ బశ్చిమమున నంధ్ర
దేశభాగంబునఁ దిరముగా నొక్క


పురము నందన మన భూరిసంపదల
వరలుచురధదంతివాజినద్భటులు
నెగడ చాతుర్వర్ణ్య నిలయమై జగతి
బొగడొందుచుండు న ప్పురరత్నమునను
తనరు నెప్పుడు పురందరసోమయాజి 1570
యను నొక్క బ్రాహ్మణుం డతిధర్మపరుఁడు
నిర్మలషట్కర్మనిరతుఁ డౌ నతని
కర్మిలి దనరంగ నాత్మజుం డొకఁడు
జనియించె మాధవసంజ్ఞ కుం డగుచు
ననువుగా నుపనయనాదులం దనరి
క్రమమున యవ్వనారంభంబు మేన
సమకట్టి నంతట స్నాతకవ్రతము
సవరించి కులమును చక్కదనంబు
నవవిలాసములు వినయము శీలంబు
కలితలావణ్యంబు కలికితనంబు 1580
గల చంద్రరేఖయన్ గన్నెఁ బెండ్లాడెఁ
గొన్నాళ్ల కా కన్యకును నంగలతికె
వన్నెమీరంగ జవ్వన మిగురొత్త
మనసున నొకకాంత మరులుతోఁ దొరలి
మొనసిన లేసిగ్గు మొలక లిగిర్చె
ననబోణి కనుబొమల్ నటియించు కొలఁది
ననవిల్తుఁ డుబ్బున నటియింప సాగె
నలినాక్షిచూపు లొందఁగ చాపలంబు
నల వల్లభుమనంబు నందె చాపలము
నువిదకుఁ జన్గవ నుబ్బెక్కె నంత 1590


పువువింటికిని నారి పొడవుగ నెక్కె
చెలి యారు రేఖగాఁ జెలగంగ నట్ల
కలువలకోరి రేఖ వహించె నపుడె
చానకు లేఁగౌను సన్న మై నంత
నానేత కాత్మధైర్యము సన్నగిల్లె
తరుణికి పిరు దున్న తస్థితి నొంద
మరుఁ డున్న తస్థితి మగల మార్కొనియె
మదిరాక్షిగమనంబు మాంద్యంబుఁ బూన
మదనుచే విభుఁ డందె మందభావముల 1600
నపు డట్టి జవ్వని హావభావముల
నపరిమితాసక్తి నతఁడు మేల్ చెంది
సతతంబు న వ్వథూసంగసౌఖ్యముల
మతి నిల్ప తీరని మరు లగ్గలింప
నంగన కవఁగూడి యలరుతోటలను
చెంగల్వబావుల శృంగారవనుల
సరసవిహారముల్ సల్పుచుఁ గామ
పరవశుండై యుండె బహువాసరములు

వసంతవర్ణనము.

అంత వసంతోదయంబున వనము
లెంతయు నుత్సవం బెసఁగుటన్ జెలఁగి
తలిరాకుచెంగావి దనరంగఁ బూని 1610
యలరుల యాభరణావలిఁ దాల్చి
వరలుపుప్పొడి గందవొడి సవరించి
విరులచే పన్నీరు వెదజల్లుచుండ
కృతిఁగూడి కోకిలల్ గీతంబుసేయ


లతకూనలు నటింప లయమీఱ భరతు
లుల్లాసమునఁ దాళ ముగ్గళింపంగ
చల్లతెమ్మెరతావిఁ జల్లుచుఁ బొదఁలె
వలరాజుకైదువుల్ వాఁడి మీఱుటను
చెలరేగి విరహుల చికాకుపఱుప
నలి గుణధ్వని సేయు నార్భటు లెపుడు 1620
నలరుతోఁటల విననయ్యె నయ్యెడను
మాధవోత్సవలీల మరుగుటనట్టి
మాధవుం డవ్వేళ మగువ కైసేయ
కుసుమాపచయమునకును కాంక్షఁజెంది
విసువక నొకతోఁట విహరించు తఱిని

మాధవ మాతంగీ సమాగమము.

ఆ విరిదోఁటలో నలరు చెంగల్వ
బావుల తావులు పరిఢవిల్లంగఁ
జెలఁగు కాసారంబు చెంగట నొక్క
అలివేణి మాతంగి యార్తవస్నాన
మొనరించి రుచిరనీలోత్పలలక్ష్మి 1630
వనితయై కొలను వెల్వడి నిల్చుపగిది
నిలిచి తుమ్మెదగుంపు నెమ్మేని తావి
కలరి వెంబడి వచ్చునటుల పెన్నెరుల
కీలుగంటు రహింప కెంపుదీపించు
దాళింబవిరిచాయ దగు చంద్రకావి
వలిపెంబు ధరియించి పవలుదచన్దోయి
జిలుగుమేల్ రవికఁ గైసేసి గుత్తముగ
వెలిచి పుత్తళినగల్ వెలయంగఁ బెట్టి


నలికట్ల దండలు నలువొప్పఁ దాల్చి
సంకుముత్తియముల నరులు కంఠమున 1640
పొంకంబుగాఁ బూన్చి పోల్ప నవ్వేళ
నల సంజకెంజాయ లావరింపంగ
పలచగా చీఁకటి పై పైఁ జెలంగ
మొలకచుక్కలగుంపు మొనసిన సంధ్య
పొలుపున న య్యించుఁబోఁణి రాణించె
అపు డాతఁ డయ్యంబుజాక్షి నీక్షించి
చపలచిత్తుండయి చాలమోహించి
అయ్యారె యొయ్యారి యౌర యీరూపు
వెయ్యారు చెలులలో వెదకినఁ గలదె
చందురుసగబాలు సరిఁబోలు నుదురు 1650
కెందమ్మి రేకులఁ గేరు కన్నులును
కొదమతేంటుల బారు కొమరారు కురులు
మెదలునద్దపునిగ్గు మెఱయు చెక్కిళ్లు
తులలేని పగడపుందునుక యౌమోవి
తెలిముత్యముల సరిదెగడు పల్వరుస
అలరుబంతుల పంత మడఁచు పాలిండ్లు
కలదులే దనుపాటిగాఁ దోఁచు కొను
కదళీయుగము మించు గదలించు తొడలు
మృదుహంసగతులను మెచ్చని నడలు
జగినీలపుసలాకఁ జెనకు మైసొబగు 1660
మగువల కీతీరు మరి జూడ మెందు
దీనిఁ గౌగిటఁజేర్చి తియ్యని మోవి
యాని రమించిన నదియె భాగ్యంబు


అని మది నూహించి య వ్విప్రవరుఁడు
వనితచెంతకుఁ జేరి వలరాజుబారి
తగిలి యెంతయుఁ దారి తమకంబు మీఱి
వగలాడి యెవతె వెవ్వరిదాన వీవు
నిను జూచి మరులు చెందితి నిందువదన
పనిఁబూని దీవింతు బ్రాహ్మణో త్తముఁడ
తరుణీలలామ నీ దయకుఁ బాత్రుఁడను 1670
మరు కేళి నను గూడి మన్నింపఁగదవె
అనుటయు నా మతంగాంగన యులికి
వెనుకకు జని కొంత విను బాపనయ్య
వొద్దికి రా కందె యుండు దోసంబు
పెద్దకులము దాన పెక్కు లేమిటికి
మాలదానికి నీవు మరు లొందఁదగునె
సాలుమాలినవెఱ్ఱిబాపనవాఁడ
యెంతపాపము గట్టి యెంచినా విపుడు
చెంతకు రాక విచ్చేయు మింకనిన
మోహంబున నతండు ముదితను జూచి 1680
హా హా విధాత యీ యంగనామణిని
నిరుపమసౌందర్యనిధిగా సృజించి
మరియు నంత్యజఁజేసి మహిసురు లంట
రాదంచు ధర్మశాస్త్రంబులు గొన్ని
బోధించి చెఱిచెఁగా బుధుల వంచించి
యింత చక్కనిదాని నెనసి కూడినను
సంతతన్వర్గ మిచ్చట నబ్బుగాదె
దీనిఁ గూడనియట్టి దేహ మేమిటికి


పూనిన బ్రాహ్మణ్యమున నేమి యనుచు
మదినిట్లు దలపోసి మాలని డాసి 1690
ముదితరో స్త్రీరత్నమున కేటి కులము
పావనరూపవై భవమునఁ గులము
పావనంబగుఁ గాని పాపంబు గాదు
బురుదలో రత్నంబు పుట్టిన దానిఁ
బరికించి కొనరొకో పండితో త్తములు
గేదంగి ముండ్లతోఁ గీలితం బైన
నాదరంబున దాని యలరు చేకొనరె
నీఁగలు ముసరంగ నెంగి లౌతేనె
నాఁగిన తమిఁ గ్రోలనగు గాదె తరుణి
గోమాంసమున గల్గు గోరోచనంబు 1700
భూమిఁ బావనమంచు బుధులు గైకొనరె
కావున నీవంటి కామీనీమణిని
పూవిలుతునికేళిఁ బొందుట తగదె
యని చేరి కౌఁగిట నలమి కెమ్మోవి
తనివిదీరఁగ నాని దగిలి రమించి
ధనములు మణులు వస్త్రములు సొమ్ములును
తన కల్మి యెల్ల నత్తరుణి కొసంగి
యెడబాయఁజూలక నెవ్వేళ దాని
పడకిల్లు వెడలక పశుమాంసమధువు
లుడుగక భుజియింపుచుండి కొన్నాళ్ల 1710
కడిగిన దొసఁగంగ నర్థంబు లేమి
తెగమ్రుచ్చిలించియు తెరువాటుగొట్టి
మగువల బాలురన్ మదిమది జంపి


కడలేని బహుపాతకములు గావించి
గడియించు సొమ్ము లా కాంత కిచ్చుచును
చిరకాల మీగతిఁ జెలఁగంగ మేన
జరబుట్టి వాని కా శక్తి దొలంగె
అయ్యెడ న య్యింతి యా ప్తబంధువులు
చయ్యన ధన మియ్యఁజాలనివాని
నం దుండనియ్యక యదలించి కొట్టి 1720
నిందించి తోలిన నిర్ధనుండగుట
నతిదుఃఖసంతప్తుఁడై వెడలి వాఁడు
క్షితిఁ గాననంబులు చేరి యం దందుఁ
దిరుగుచు బడలికన్ దీనుఁడై భాగ్య
పరిణామమున శేషపర్వతో త్తమముఁ
గనుఁగొని యం దెక్కఁగా దాని మేన
ఘనతరాగ్నిజ్వాల గప్పి మండుచును
పాతకంబుల నెల్ల భస్మీకరింప
నాతండు పరిశుద్ధుఁడై యాక్షుణంబె
బ్రహ్మవర్చసమునన్ బ్రబలుచుండంగ 1730
బ్రహ్మర్షు లవ్వాని పాతకంబులను
ధరణీధరంబట్ల దహియించుటయును
పరమపవిత్రుఁడై బ్రాహ్మణుండపుడె
విలసిల్లుటయుఁ జూచి విస్మయంబొంది
యలఘుపాపైకదాహక మౌట నిట్టి
నగము వేంకటసంజ్ఞ నలువొందె ననుచుఁ
బొగడుచుండిరి మహాద్భుత ముద్భవిల్ల
నటుగాన ని య్యితిహాసంబు వినినఁ


బటుబుద్ధిఁ జదివినఁ బరగవారలకు
సకలపాతకములు సమయును బుణ్య 1740
నికరంబు చేకురు నిశ్చయంబంచు
నల మునీంద్రులకు బ్రహ్మాండపురాణ
కలన సూతుఁడు దెల్పె కమనీయఫణితి
అని విచిత్రార్థసమర్థనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యుపేర
విపులానుభావభావితసంవిధాన
కపటనాటకజగత్కారణుపేర
భాసురాంగశ్రుతిభారతీభవ్య
లాసికాగీతవిలాసునిపేర
తారకాంతకపితృద్వంద్వా న్వధీత 1750
తారకమంత్రాభిధానునిపేర
ప్రత్యాహృతోత్తరాపత్యచై తన్య
సత్యనిత్యబ్రహ్మచర్యునిపేర
క్షీరపారావారశీకరాసార
పూరితనిజముఖాంభోజునిపేర
పావనభక్తాప్తబంధునిపేర
గోవిందరాజముకుందునిపేర
శ్రేష్ఠలూర్యన్వయశ్రేష్ఠశీలుండు
ప్రేష్ఠమహాయశ శ్రీధురీణుండు
గోత్రభారద్వాజగోత్రవర్ధనుఁడు 1760
సూత్రుఁ డాపస్తంబసూత్రానువర్తి
అష్టభాషాకవిత్వార్జితప్రోద్య
దష్టావధానవిఖ్యాతబై రుదుఁడు


శ్రీ కృష్ణయార్యలక్ష్మీగర్భవార్ధి
రాకాసుధానిధి రాజపూజితుఁడు
వివిధవిద్యాశాలి వేంకటార్యుండు
సవరించు శ్రీనివాసవిలాసమునను
హరువొంద నిది చతుర్థాశ్వాసమగుచు
ధరఁ బొల్చు నాచంద్రతారకంబుగను. 1769

చతుర్ధాశ్వాసము. సమాప్తము.



___________
  1. "మహేంద్రయమర" వ్రా. ప్ర. పాతము.
  2. "అనుచు వేడం దలై " వ్రా .ప్ర. పాఠము.
  3. "వగుచు నలనేవంత" వ్రా. ప్ర. పాఠము
  4. "దొరకైన " వ్రా. ప్ర. పాఠము.
  5. వ్రా.ప్ర. "వెఁదీలగెచేగట్టె"
  6. వ్రా. ప్ర. గెరల్ జవిరికరీక
  7. "గనమీనహాస్య" వ్రా. ప్ర. పాఠము.
  8. "కౌనకో" వ్రా. ప్ర పాఠము.
  9. “కన్నులుకుల్కి వెలయు” వ్రా.ప్ర. పాఠము
  10. "హ్లేహయ ” వ్రా. ప్ర. పాఠము.
  11. "మైయరిగి " వ్రా. ప్ర . పాఠము.