శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 7

వికీసోర్స్ నుండి

తోచినవికూడ, తరువాత అర్థరహితములై కాన్పించును. మన స్సునకు గురియైనవిషయము ప్రకాశముపొంది ప్రజ్వలించును. ఆవిధమున భగవంతునిదయను పొంది యంతరాత్మనుండి కని యానందించు విషయము నితరులకు వ్యక్తము చేయుటకు శక్తిలేకపోయి యుండవచ్చును. కాని యట్టి యనుగ్రహ మును, ఆనందమును సత్యములే.

(7)

శాస్త్రమును పఠించు క్రమము

ఏమతమునై నను సంప్రదాయమునై నను సరిగ తెలిసి కొనుటకు ద్వేషము, తిరస్కారము కల బుద్ధితో ప్రవర్తింప కూడదు. ఒకవిషయమును ద్వేషించిన నావిషయతత్త్వము గోచరింపదు. "మోసగాండ్రయి మనలను వంచించుటయే వీరి యుద్దేశమై యున్నది. ఏదో లాభముకొరకసత్యమును, మోసమును చేర్చి మతముల నేర్పరిచి, స్మృతు లను పురాణములను పూర్వులు వ్రాసినా" రనిపఠింప తొడగితిమేని నొకటియు తెలియదు. ఇట్లెంచుట మూఢ త్వము. మన కిప్పుడున్న జ్ఞానమును, జాగ్రతయు, సందేహ భావమును నాకాలపు జనులకు నుండెను. వారంద రును మూఢులనియు, మిక్కిలి సులభముగ వలయందు చిక్కిపోయిరనియు నెంచుట తప్పు. మనకున్న బుద్ధి. చురుకు దనమాకాలపు జనులకు గూడ నుండెను. విషయములందు బుద్ధిని ప్రవేశింపచేసి, విచారించి, యసత్యమును మోసమును గ్రహించి తొలగించుటకు ఆనాడవకాశము లేకపోలేదు. మతములను స్థాపించిన పెద్దలను ప్రత్యక్షముగ కన్నవారును, విన్నవారును ఆమతస్థాపకులు మంచియుద్దేశముతోనే ప్రవర్తించినారని నమ్మి యాపెద్దలను గౌరవించుటచేతనే నామతములు కొనియాడబడుచు వచ్చినవి. మోసముచేతను, జనుల తెలివితక్కువచేతను యవి యభివృద్ధి బొంది నిలబడిన వని యెంచుట కేవలము తప్పు.

ఏసంస్థయైనను కాలము గడచిన కొలదిని స్వార్థపరులగు కొందరకు వశమై వారి స్వార్థమునకు సాధనమగును. అట్లే మతసంస్థలును మతములును గూడ చెడిపోయియుండుట సత్యము. కాని తరువాతి కాలమున చెడియుండుట, పూర్వముండిన మహాత్ముల నవమానించుటకు కారణముగా గొనుట మంచిపని కాదు. మురికికాలువలోని నీళ్లను చూచి మేఘములలోని నీళ్లును నట్లే యుండుననవచ్చునా? మేఘములను వానినుండికలుగు వర్షమును నెట్లు గౌరవముతో చూడవలెనో యావిధముననే యాదిఋషులను వారు తెలిపిన ధర్మసూత్రములను గౌరవించి పఠింపవలెను. దొంగను చూచి పట్టుకొనుటకు నింటిలో శోధన చేయ ప్రవేశించు రక్షకభటుని మనోభావముతో భగవద్గీతనుగాని యితరమతస్థులు గౌరవించు మార్గ దర్శకగ్రంధములను గాని చదువుటవలన లాభములేదు; అట్లు చదువనుగూడదు. అట్టి గ్రంథములను చదువునప్పుడు తండ్రికడకు కొడుకుపోవునట్లు భక్తి విశ్వాస యుక్తులై వానియొద్దకు పోవలెను.


__________