Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 8

వికీసోర్స్ నుండి

గీతాసంగ్రహారంభము

(8)

(ఆత్మ)

(గీత:- అధ్యాయములు - 2, 13)

జీవుడు, జీవాత్మ, ఆత్మ, దేహి అని చాలపేళ్ళతో పిలువబడు వస్తువొకటి దేహములో దేహమునకు యజమానియై వాసముచేయునను తత్త్వమును మొదట మనము తెలిసికొనవలెను. కంటికగపడు దేహముమాత్రము సత్యము, అదితప్ప మరియేదియు లేదని యెంచుట తప్పు. జీవు డింద్రియములకు గోచరింపడు; అయినను దేహములోపల నంతటను వ్యాపించి, యంతను నడిపించుచు ననుభవించుచు వచ్చుచున్నాడు. మనుష్యునికుండు బుద్ధివేరు; ఆత్మ వేరు. చైతన్యము, ఆలోచన, ఆశ మొదలగు మనోభావములు, నిదానబుద్ధి, వివేకము, ఇవి యెల్లను మనుష్యుని దేహమునకు సంబంధించిన స్వాభావికములయిన వ్యాపారములు. ఇవియే ఆత్మ కావు. వీనినెల్లను విడిచి, వానికి వెనుక నిలిచియున్నది యాత్మ.

ఆత్మ శరీరమునందంతటను వ్యాపించియున్నది. కడుపు లోనో, గుండెలోనో, తలలోనో మాత్రముండునది కాదు. దానికి వేరుగ నవయవము గాని, కోశము గాని లేదు. 'ఈథరు' లేక 'ఆకాశ' మని భౌతిక శాస్త్రజ్ఞులు కల్పించు కొనిన కల్పనాపదార్థమువలె దీనికి తూకములేదు. నివాసము లేదు. పరిమాణము లేదు. మనుష్యునికి మాత్రమేకాక ఎల్ల ప్రాణులకును, లతా, గుల్మ, వృక్షములకును నాత్మయున్నది. దేహమనునది ఆత్మ యుండుటకు స్థలము. కావున దేహమును క్షేత్రమనియు, ఆత్మను క్షేత్రి యనియు, క్షేత్రమును చూచు వాడు క్షేత్రజ్ఞుడనియు, చెప్పుట గలదు.

మనుష్యుడో, జంతువో, స్థావరమో, మరణము నొందినప్పుడది దేహమునకు మట్టుకు సంభవించునది. దేహము పూడ్చబడును. కాల్చబడును. లేక ప్రాణుల కెరయగును. ఆత్మ చావదు. దానిని చంపుటకును వీలులేదు. జనులు చనిపోయినారని దుఃఖించుట మూఢత్వము. చినిగి పోయిన లేక అక్కరలేని వస్త్రమును తీసివైచి, మనుష్యుడు క్రొత్తవస్త్రమును ధరించినట్లు, ఆత్మ వేరుదేహములోనికి పోయి ప్రాతదేహమును విడిచిపెటును. ఇదియే సత్యము. దీనికి మన మేల దుఃఖపడవలెను?

శ్రీ భగవానువాచ:


అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం శ్చ భాషసే
గతాసూ నగతాసూం శ్చంనాను శోచన్తి పండితాః

శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు: ఎవరినిగూర్చి దుఃఖింప

నావశ్యకతలేదో, వారినిగూర్చి దుఃఖించుచున్నావు. తెలిసిన వారివలె మాట్లాడుచున్నావు. చచ్చినవారికోసమును, ఉన్న వారికోసమును తెలిసినవారు దుఃఖపడరు. 2-11


నత్వేవాహం జాతు నాసం న త్వంనేమే జనాధిపాః
నచైవ న భవిష్యామస్స ర్వే వయ మతఃపరమ్.


ఇంతకు ముందు నే నెన్నడును లేకుండుటలేదు. నీవును నిక్కడనున్న రాజులునెవ్వరును నట్లే. ఇకమీద నొకనాడును మనము లేకుండ బోవుటయు నుండదు. 2-12


దేహినో౽ స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాన్తరప్రాప్తిర్ధీర స్తత్ర నముహ్యతి.


ఆత్మ కీదేహమున నెట్లు బాల్యము, యౌవనము, ముసలితనమును గలుగుచున్నవో, అట్లే వేరొక శరీరమును జన్మమును ఏర్పడును. కావున, దీనికి ధీరుడువిచారింపనేల? 2-13


అవినాశి తు తద్విద్ధియేన సర్వమిదం తతమ్
వినాశ మవ్యయ స్యాస్య న కశ్చిత్కర్తు మర్హతి.


ఈలోకములోనున్న యెల్లప్రాణుల శరీరములందును వ్యాపించి యున్న వస్తువు నాశనము కానిదని తెలిసికొనుము. దీనిని నాశనముచేయుట యెవ్వరికిని సాధ్యముకాదు. 2-17


న జాయతే మ్రియతే వా కదాచి
న్నాయం భూత్వా భవితావా నభూయః
అజో నిత్య శాశ్వతో౽యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే.


ఇతడు పుట్టుటలేదు. ఏకాలమందైనను చచ్చుటయు లేదు. ఇతడొకసారియుండిమరియొకసారిలేకుండనుండుటలేదు. జన్మములేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు, పురాతనుడై యితడు శరీరము చంపబడినను తాను చంపబడడు. 2-20


వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో ౽ పరాణి
తథా శరీరాణి విహాయజీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ.


చినిగిన బట్టలను విడిచి క్రొత్తవానిని నరుడెట్లు గ్రహించుచున్నాడో, అట్లే జీర్ణములైన దేహములను విడిచి, కొత్తవానిని దేహి పొందుచున్నాడు. 2-22


అచ్ఛేద్యో౽యమదాహ్యో౽య
మక్లేద్యో౽ శోష్యఏవ చ
నిత్యస్సర్వగతస్థ్సాణు
రచలో౽యం సనాతనః.


అతడు నరకబడతగని వాడు, కాల్చుటకు సాధ్యము కానివాడు, తడుపబడవీలులేనివాడు, శుష్కింపజేయ సాధ్యముకానివాడు, నిత్యుడు, అన్నియెడలనుండువాడు, ఒకచోట నెలకొననివాడు, చలించనివాడు, సనాతనుడు. 2-24


అవ్యక్తో౽యమచింత్యో౽యమవికార్యో౽యముచ్య తే
తస్మా దేవం విదిత్వైనం నాను శోచితు మర్హసి.


అతడు వ్యక్తముకానివాడు, చింతింప వీలులేనివాడు. వికారము పొందింపబడజాలనివాడని చెప్పబడుచున్నాడు. కావున నతని నట్లు తెలిసికొని నీవు దుఃఖింపగూడదు. 2-25


దేహీనిత్య మవధ్యో౽యం దేహేసర్వస్య భారత
తస్మా త్సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.


ఎల్లర శరీరమందున్న యీయాత్మ యెన్నడును చంపబడ వీలులేనివాడు. కావున ఈభూతముల వేనిని గూర్చియు దుఃఖింపనక్కరలేదు. 2-30


యావత్సఞ్జాయతే కిఞ్చిత్ సత్త్వం స్థావరజంగమమ్,
క్షేత క్ష్రేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్ష భ.


స్థావరమైనదిగాని, జంగమమైనదిగాని, ఏప్రాణి పుట్టి నను నది క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగమువలన కలిగినదని తెలిసికొనుము. 13-27


యథా సర్వ గతం సౌక్ష్మ్యా దాకాశం నోపలిప్యతే,
సర్వత్రా౽నస్థితో దేహీ తథా౽త్మానోపలిప్యతే.

అంతటను వ్యాపించియున్న యాకాశము సూక్ష్మమైన

దగుటచేత నెట్లు దేనికి నంటక యుండునో, అట్లే అన్ని యెడలను నిలిచియున్న యాత్మ దేహములందు వాని నంటకయుండును. 13-33


యథా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోక మిమం రవిః
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత.


సూర్యుడొక్కడే యయినను లోకమంతటి నెట్లు ప్రకాశింపచేయుచున్నాడో, అట్లే ఓ యర్జునా ! క్షేత్రి, క్షేత్రమునంతటిని ప్రకాశింపజేయుచున్నాడు. 13-34


(9)

కర్మ విధి

(గీత - అధ్యాయము 15).

జీవునికిని పరమాత్మకును పరస్పరసంబంధ మేమి? దేహమునకును దేహములో రాజ్యముచేయు జీవునికిని సంబంధమేమి? వీనిని గూర్చి యిప్పుడు చెప్పబడును. దేహమునకు జీవాత్మ యెట్లో, అట్లే జీవాత్మకును పరతత్త్వము. దేహమును జీవుడెట్లు చేతనపదార్థముగ ప్రకాశింప జేసికొని దానిలో నంతర్భావమై యుండునో అదేమాదిరిగ జీవునిలో