Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 27

వికీసోర్స్ నుండి

సత్యమైన జ్ఞానప్రకాశమునకును ఉన్న భేదము సత్యమైన యద్వైతజ్ఞాన ముదయించినయెడల జీవితము తనంతటనే శుద్ధమైపోవును. విషయలంపటములు తొలగిపోవును. విషయ సంగములు తొలగగా తొలగగా జ్ఞానము మరింత యెక్కువగా ప్రకాశించుచుండును.


దీనిచేతనే భగవద్గీత యనునది, ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైతమతములలో చేరినవారికందరకును శాస్త్రముగ నుండి వచ్చుచున్నది. బ్రహ్మమును, జీవుడు నొక్కడా, వేరా యను ప్రశ్న భగవద్గీతలో నుపదేశింపబడిన యనాసక్త యోగమును, జ్ఞానయోగమును, ప్రపత్తిమార్గములను నేవిధమునను బాధింపవు.


(27)

విశ్వరూపదర్శనము


భగవద్గీత పదకొండవ అధ్యాయములో భగవంతు డర్జనునకు, విశ్వరూపము చూపించుట చెప్పబడినది. మేలు, కీడు, సుఖము, దుఃఖము, చీకటి, తేజస్సు, అను ద్వైతములను గడచి నిలుచు భగవంతుడు తన సర్వవ్యాపకమై విశ్వరూపము నర్జనుడు చూచున ట్లతనికి జ్ఞానదృష్టిని అనుగ్రహించి దర్శనము నిచ్చెనని చెప్పబడినది. దీని తత్త్వమేమి? అంతఃశ్శుద్ధియు, బాహ్యశుద్ధియు గల శుద్ధజీవనమును నొకడు నడిపి, సకలకర్మములను సంగము లేక భగవంతుని కర్పణముగచేసి బుద్ధిని స్థిరముగ నిలుపుకొని యడుగడుగునకు ధ్యానముచేయుచు వచ్చినయెడల భక్తునికి భగవంతుని విశ్వరూపము కనబడును. అనగా జ్ఞానోదయమై భగవంతు ననుభవించుననునదే. ఆదర్శమును గూర్చి సంజయుడు చెప్పుచున్నాడు :-


ఏవముక్త్వా తతోరాజన్ మహాయోగేశ్వరో హరిః
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం


సంజయుడు చెప్పుచున్నాడు: "రాజా! ఇట్లుచెప్పిన పిదప, మహాయోగేశ్వరుడైన హరి, తన పరమైశ్వర్యరూపమును పార్థునకు చూపెను." 11-9


దివి సూర్యసహస్రస్య భవేద్యుగప దుత్థితా
యదిభా స్సదృశీసాశ్యా ద్భాస స్తస్య మహాత్మనః


ఆకాశమున ఒక్కటే క్షణమున వేయి సూర్యబింబములు కనబడినయెడల నాకాంతిని విశ్వరూపపుకాంతితో పోల్చవచ్చును. 11-12


తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకథా
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా.

అప్పుడు పలువిధములుగ నున్న జగత్సృష్టియంతయు,

నాదేవదేవుని శరీరమున నొకచో గూడి నిలిచియుండుటను పాండవుడు చూచెను. 11-13


అర్జునునిస్తుతి :-

అర్జున ఉవాచ:-


పశ్యామి దేవాం స్తవ దేవ దేహే
సర్వాం స్తథా భూతవిశేషసంఘాన్,
బ్రహ్మాణ మీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్.


దేవా! నీదేహమున ఎల్లదేవతలను ప్రాణికోట్లను కమలాసనమున గూర్చున్నబ్రహ్మను, యీశుని, ఎల్ల ఋషులను, దివ్యసర్పములను, చూచుచున్నాను. 11-15


అనేక బాహూ దర వక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతో నంతరూపం,
నాంతం నమధ్యం నపున స్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.


అనేక బాహువులు, ఉదరములు, వక్త్రములు, అనేక నేత్రములునుగల మేరలేని నీరూపమును అన్ని దిక్కులందును చూచుచున్నాను. అన్నిటికి నీశ్వరుడా ! విశ్వమును నీరూప ముగ కొన్నవాడా ! నీకంతమనియు, మధ్యమనియు, నాదియనియు, గానలేకున్నాను. 11-16


కిరీటినం గదినం చక్రిణం చ
తేజో రాసిం సర్వతో దీప్తిమంతం,
పశ్యామి త్వాం దుర్ని రీక్ష్యం సమంతా
ద్దీప్తా నలార్కద్యుతి మప్రమేయం.


కిరీటమును, గదను, చక్రమును, ధరించినవాడై, తేజోరాశియై, అన్నిప్రక్కలను, వెలుగును వ్యాపింపచేయు చున్నావు. ధగ ధగమండు మంటవలెను, సూర్యునివలెను, చూడ నసాధ్యమైన ప్రకాశముతోగూడిన నిన్ను చూచు చున్నాను. 11-17


త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వశ్య పరం నిధానం,
త్వమవ్యయ శ్శాశ్వతధర్మగోప్తా
సనాతన స్త్వం పురుషో మతోమే.


నాశము లేనివాడా! తెలియదగినవాడవు. లోకమున కాధారుడా! నశింపనివాడా! ఎప్పుడును ధర్మమును కాపాడు వాడా ! మార్పులేనివాడా ! నిన్ను కనుగొంటిని. 11-18


త్వమాదిదేవః పురుషః పురాణ
స్త్వమస్య విశ్వస్య పరంనిధానం,


వేత్తాసి వేద్యంచ పరంచ ధామ
త్వయా తతం విశ్వ మన న్తరూప.


నీ వాదిదేవుడవు ! ఆదిపురుషుడవు, నీవే సర్వమునకు పరమ నిలయమవు, తెలియదగిన తత్త్వమవై, పరమపదవివై, అనంతరూపుడవై లోకమంతటను వ్యాపించియున్నావు. 11-38


వాయు ర్యమో౽గ్ని ర్వరుణ శ్శశాంకః
ప్రజాపతి స్త్వం ప్రపితామహశ్చ,
నమో నమస్తే౽స్తు సహస్రకృత్వః
పునశ్చ భూయో౽పి నమో నమస్తే.


వాయువవు నీవే, యముడవు నీవే, అగ్నివి నీవే, వరుణడవును, చంద్రుడవును, బ్రహ్మమును నీవే; నీకు వేయు సారులు నమస్కరించుచున్నాను. మరియుమరియు నీకు నమస్కరించుచున్నాను. 11-39


నమః పురస్తా దథ పృష్ఠతస్తే
నమో౽స్తుతే సర్వత ఏవ సర్వ,
అనంతవీర్యామితవిక్రమ స్త్వం
సర్వం సమాప్నోషి తతో౽సి సర్వః.


ముందుభాగమున నీకు నమస్కారము, వెనుకభాగమున నమస్కారము; అంతయు నయినవాడా! నీ కెల్లప్రక్క లను నమస్కరించుచున్నాను. ఎన్నడును అంతము లేనివీర్యముగలవాడా! అలవి లేనివిక్రమము గలవాడా ! అన్నిటను పూర్ణుడవై యున్నవాడా ! అంతయు నైనవాడవునీవే. 11-40


పితా౽సి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్,
నత్వత్సమో౽స్తభ్యధికః కుతో౽న్యో
లోకత్రయే ప్యప్రతిమ ప్రభావ.


చరాచరలోకమునకు తండ్రివి, పూజ్యుడవు, గొప్ప గురుడవు, నీకు సముడెవడును లేడనగా, నిక నీకంటెనెక్కువ వాడెవడుండును? మూడులోకములందును నీప్రభావమునకు సాటిలేదు. 11-43


తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహ మీశ మీడ్యమ్,
పిత్రేవ పుత్త్రస్య సఖేవ సఖ్యుః
ప్రియఃప్రియాయా౽ర్హసి దేవ సోఢుమ్.


శరీరమును సాష్టాంగముగ వైచి నీ యనుగ్రహమును వేడుచున్నాను. ఈశా! పూజ్యుడా ! కొడుకును తండ్రివలెను, స్నేహితుని స్నేహితునివలెను; ప్రియురాలిని ప్రియుడువలెను నన్ను సహింపవలెను, దేవా! 11-44