శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 28
(28)
తుదిపలుకు
ఇంక మనము చదివిన విషయములను సంగ్రహముగ
చెప్పవలెననిన పూర్వజన్మమున చేసిన కర్మములచేతను,
సంగమములచేతను కొన్నిగుణములతో గూడి దేహప్రకృతులను
పొంది పుట్టుదుము. ఈ స్వభావగుణములే జీవుని
బంధించుచున్నవి. వానిని సంపూర్ణముగ నిగ్రహించి విడువ
వచ్చునని, పక్వము కానికాలమున సన్యసింప ప్రయత్నించి
నందువలన ప్రయోజనము లేదు. కాని ఈ స్వభావగుణములను
గెలిచి, విడుదలనొంద ప్రయత్నించుటకు, స్వాతంత్య్రమును,
శక్తియు, జీవుని కున్నవి. ఈ జన్మమున జీవుడెట్లు
నడుచుకొనుచున్నాడో యామార్గము ననుసరించియే యతని
తరువాతి చరిత్రము నుండును. ఒకడు పూర్వకర్మమునుండి
సంపూర్ణముగనో లేక కొంచము కొంచముగనో విడుదల
నొందుటయో లేక పూర్వముండిన బంధమున కింకనుచేర్చి
యధికబంధము లేర్పరుచుకొనుటయో, ఈజన్మమున నతడెట్లు
నడచుకొనుచున్నాడో దాని ననుసరించియుండును.
భగవంతుని యనుగ్రహమువలన యెట్టి బంధము
నుండియు జీవుడు విడుదలను బొందవచ్చును. ఆ యనుగ్రహ మును సంపాదింప జీవుడు చేయవలసిన ప్రయత్నములు కర్మ
విధిప్రకారము, పూర్వకర్మబంధమును త్రెంచివేయు పుణ్య
కర్మములగును. భగవంతుని దివ్యానుగ్రహము బడయుటకు
మార్గము గీతయందు చెప్పబడియున్నది. దీనికే యోగమని
పేరు.
గీతలో చెప్పబడిన యోగమునందలి యంగము లేవియన:-
(1) ఇంద్రియములను అరికట్టుట, శుద్ధమైన జీవనము,
చక్కని యాచారము అనగా ఉపాసన, కర్మము, ఆహారము,
విహారము, నిద్ర మొదలగువానియందు నియమము.
(2) స్వభావమువలననో, సంఘమునందు తాను
పొందిన స్థానమువలననో, సందర్భమువలననో, తన కేర్పడ్డ
పనులను స్వలాభమును కోరక, సంఘమును విడువక యంతయును
లోపములేక చేయుట.
(3) జయాపజయములను సమబుద్ధితో ననుభవించుట,
కష్టములనుచూచి మనస్సున కలతనొందక, దుఃఖములు,
క్లేశములున్నను, ధైర్యమును శాంతినివిడువక మనస్సును
సమత్త్వమునకు తెచ్చికొనుట.
(4) మనస్సును ఎడతెగక కాచికొని, కామము,
క్రోధము, ఆశ, అను ఉద్రేకములకు ఎడమివ్వకుండుట.
(5) ఇట్లు లోపలను, బయటను శుద్ధముచేసుకొని, మనస్సును స్థిరపరచుకొని, యప్పుడప్పు డధ్యాత్మధ్యానము
చేయుట.
(6) భగవంతుని సంపూర్ణముగ శరణుజొచ్చుట.
పై చెప్పబడిన యంగములలో నొక్కొక్కదానిని
ప్రత్యేకముగ పేరుచెప్పి క్రమముగ చెప్పవలసిన యెడల,
వానిని సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము,
సన్యాసయోగము, అధ్యాత్మయోగము, భక్తియోగము
అని అనేకవిధములుగ చెప్పవచ్చును. కాని నిజముగ
నభ్యాసముచేయు క్రమమున నివన్నియు నొకదానిలో నొకటి కలిసి
యుండును. ఒకటిగా దానిని పొందవీలులేదు. కావున గీత
యందీక్రమముల నెల్ల నొక్కటిగ గూర్చి యేకముఖముగ
భగవంతు డుపదేశించి యున్నాడు.
భక్తితోడను, శ్రద్ధతోడను, దీనిని చదువువారిలో
కొందరికి తుదకొక సందేహము తోచవచ్చును. గీతలోచెప్పి
యున్నదంతయు సరియే. కాని సాధారణమనుష్యుల కది
యుపయోగపడునా? దీనిలో చూపబడిన లక్ష్యములన్నిటిని
పొందుశక్తిమనకు లేదుగదా ! ఇది మనకెట్లు ప్రాప్తమగును?
మహాత్ములకు మాత్రము దీనిలో చెప్పబడినది సాధ్యము.
అని ఈరీతిగా నాక్షేపణ తోచవచ్చును.
కృష్ణుడు చూపించిన దారిమాత్రమే కాదు, లోకములో జనులనుసరించు నెల్లమతములును, మార్గములును, నీ యాక్షేపణ కెడమిచ్చును. ఏయుత్తమ మతమునం దైనను, యేధర్మగ్రంథమున చెప్పబడిన జీవనక్రమమైనను లోపము లేక పూర్తిగ ననుసరించుట కందరికిని సాధ్యము కాదు. ఉదాహరణమునకు, ఏసుక్రీస్తునుపదేశములను తీసుకొందము. అతడు నడచి చూపినదారియు, చేసినయుపదేశములును సంపూర్ణముగనాచరణములోనికితెచ్చుటయెల్లరకుసాధ్యమగునా? కాని, వారిమార్గమునుబట్టి పోవువారికి దానివలన ప్రయోజనములేదా? ఎందరో జనులనదికాపాడి ఉద్ధరించినది. మహాత్ములకుమాత్రమేకాదు, పామరులకుకూడ, దేహమున కాహారము యెట్లో యట్లే యంతరాత్మకుగల యాకలిని తృప్తినొందించు నాహారమై, యాయుపదేశ ముపయోగపడుచు వచ్చినది. అట్లే యెల్లమార్గములును. అట్లే గీతయును.
చేతితో దీపమును బట్టుకొనిపోవునప్పుడు మననీడయే దారి కడ్డమువచ్చును. చెట్టును, పొదయు, వెలుగున కడ్డు పెట్టును. కాని ఇది వెలుగుదోషము కాదు. దీప ముపయో గింపకయు పోలేదు. పాపము, కష్టము, సందేహము, ఆశ, మనోద్వేగము ఇవి యడ్డముగ వచ్చినను, గీతయం దుపదేశింపబడిన లక్ష్యములను ముందుంచుకొని, మనము నడచిన యెడల చీకటినిదాటి కృతార్థులము కావచ్చును. ఒక్కొక్కడు నంతటిని చేయసాధ్యము కాకున్నను, అందరు నొక్కటే జీవితలక్ష్యమునుబట్టి నడచుటవలన నందరి జీవనక్రమము నేకభావమునొంది, యందరి సంఘజీవనమునందును, సుఖము నెలకొనును.
సాధారణముగా దేహారోగ్యమునకు, సుఖాధారముగ
చెప్పిన పథ్యములనుగూడ నందరును దోషముకాని లోపము
గాని లేకుండ సంపూర్ణముగ ననుసరింప సాధ్యముకాదు.
కాని, లోపములతో గూడియున్నను, ఆరోగ్య శాస్త్రోపదేశముచేత
నెక్కువ ప్రయోజనముండునని మనము చూచు
చున్నాము. దేహారోగ్యముకంటెను నాత్మసుఖమును సంపాదించుట
కఠనముకదా? దానికై యుపదేశించియున్న పద్ధతులు
కఠినముగనే యుండును. అందరును వానిని లోపములులేక
యనుసరించుట యసాధ్యముగనే యుండును. కాని
యుపదేశము ప్రయోజనకారి కాకపోదు. ఉత్తమలక్ష్యములు,
మనుష్యుని జీవనములు, హితసాధకములై యున్నవి.
సంపూర్ణముగ నొంద సాధ్యముకాదని, ధర్మప్రకాశము నార్పివైచి,
చీకటియం దుండగూడదు. గీతలోనే భగవంతుడు చెప్పి
యున్నాడు.
నేహాభిక్రమనాశో౽స్తి ప్రత్యవాయోన విద్య తే
స్వల్ప మప్యస్య ధర్మస్యత్రాయతే మహతో భయాత్.
మున్నది. నష్టములేదు. పథ్యముచేయక సేవించిన ఔషధము వలె కాదు. లోపదోషము లుండుటవలన, నేయపాయమును కలుగదు. ఈధర్మమును కొంచమే యాచరించినను, సంసారమను గొప్పభయమునుండి రక్షించుకొనవచ్చును. 2-40
సమాప్తము.
శ్రీకృష్ణార్పణము.
ఓం నమోనారాయణాయ
8 - 4 - 1984