Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 23

వికీసోర్స్ నుండి

మొదటినుండియు నారంభించుట యనునది సాధ్యము కానిపని యగును.


యశ్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిం.


శాస్త్రవిధులను బయటికి త్రోసి, కామము ప్రేరించి నట్లు నడచువానికి సిద్ధి లేదు; సుఖము లేదు, పరగతియు లేదు. 16-23


తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి.


కావున, నీవు దేనిని చేయవచ్చును, దేనిని విడువ వచ్చును, అనువ్యవస్థను తెలుసుకొనుటకు శాస్త్రమునేప్రమాణముగా నుంచుకొనుము. శాస్త్రవిధానమును దెలిసి, నీవు కర్మములనుచేసి జీవితమును గడుపువాడవుగమ్ము. 14-24


(23)

గుణ విభాగము

(గీత: అధ్యాయము 17)


మన ప్రకృతిగుణములకు తగినమట్టు కుపాసనకు మూర్తిని వెదకుకొందుము. మనము దేని నుపాసింతుమో దాని గుణము మనకు వచ్చును. ఇట్లుపాసనచేయువానిగుణమును ఉపాసన క్రమమును నొకటి నొకటి సంబంధింపబడియున్నవి.


ఏవిధమైన శ్రద్ధనుగాని నమ్మికనుగానికలిగి కర్మములు చేయుదుమో నదియును ఇట్టిదియే. పొందిన గుణమునకు తగిన శ్రద్ధమనస్సునకు చేరును. చేకొన్న శ్రద్ధకు తగినగుణమువచ్చి చేరును.


ఆచారములును, ప్రవృత్తివిషయములును ఇట్లే ఇవన్నియు మనము వడసిన గుణమునకు దగినవరకు నేర్పడును. గుణమును వానిననుసరించి మారును. పొయ్యిలోని నిప్పునకును కట్టెలకును గల సంబంధమువంటిది. మొదట నిప్పుకట్టెను మండించును. కట్టె మండినయెడల నిప్పు మరింత మండును. పరస్పరము సహాయ మేర్పడును. మంచి గుణములు పొందినవాడు, మంచి గురువును మంచి దైవమును, మంచి మనోభావములను, మంచి లక్ష్యములను ఏర్పరచికొనును. దానిచే గుణ మింకను మేల్మిని పొందును. మంచిగుణములం దతనికి రుచికలుగును. మంచియాహార మతనికి సంతోషమిచ్చును. వానిచే వాని మంచిగుణమింకను వృద్ధియగును. గుణములేనివాని బుద్ధియో, యుపయోగములేని యుపాసన, యుపయోగములేని తామస ప్రకృతి దురాచారము మొదలగువానిలో ప్రవర్తించును. రానురాను తామసగుణ మధిక మగును. ఈ సుడిగుండమునుండి తప్పించుకొను మార్గమేదనిన కర్మమునుగూర్చి పూర్వము చెప్పినదానిని జ్ఞాపకమునకు తెచ్చికొనుటయే. ఆత్మకు స్వతంత్రబుద్ధి యున్నది. కర్మము చేయుట కధికారమున్నది. దానినుపయోగించి కర్మబంధము నుండి తప్పుకొను మార్గమును, స్వభావగుణముల నడచుటకు తగిన యుపాసన, ఆచారము, ఆహారము వీనిని నిత్యనియమముగ నుంచుకొనవలెను. ఇట్లుచేసినయెడల మేలును పొందుదుము. పూర్వకర్మఫలమునకును నీజన్మమున చేయుకర్మమునకును బీజాంకురసంబంధ మున్నది. చెట్టునుండి బీజము కలుగును. బీజమునుండి చెట్టు మొలచును. కారణము కార్యమగును, కార్యము కారణ మగును. ఇదే ప్రతి దినాచారమునకును, గుణమునకును పరస్పరసంబంధము. ఒకదానికి మరి యొకటి కారణ మగును.


త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా
సాత్త్వికీ రాజసీచైవ తామసీ చేతి తాం శృణు.


ఒడలు దాల్చిన యాత్మకు స్వభావగుణమైన శ్రద్ధ మూడువిధములుగ కనబడును. సాత్త్వికము, రాజసము, తామసము అని. 17-2


సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత
శ్రద్ధామయో౽యం పురుషో యో యచ్ఛ్రద్ధ స్స ఏవసః

ఎవరికిని తమతమ జన్మగుణము ననుసరించి శ్రద్ధ కలుగును.

జీవుడు తాను చేకొనిన శ్రద్ధ కనురూపుడై యుండును. ఎవ డేవస్తువునందు శ్రద్ధగల్గునో వా డావస్తువువలె నగును.


డంబమునకు చేయబడు తపస్సును, ఆచారమును, ఫలము నీయవు. లాభముగోరి చేయబడునదియు నట్లే. 17-3


అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః
దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః.


కొందరు డంబమును అహంకారమును గలిగి, కామముచేతను చిత్తవికారముచేతను ప్రేరితులరై శాస్త్రములో నియమింపబడని ఘోరమైన తపస్సు చేయుచుందురు. 17-5


కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః
మాం చై వా న్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్.


ఇట్లు బుద్ధిచెడినవారు తమ శరీరములోని భూతసమూహమును, నన్నును, హింసపెట్టుదురు. వీరసురబుద్ధి గలవారని తెలియుము. 17-6


తపస్సనునది మనోవాక్కాయములను మూడింటితో చేయబడినది. ఆర్జవము, శుచి, పెద్దలయెడ నడకువ, బ్రహ్మచర్యవ్రతము, భూతదయ, ఇవి దేహముతోచేయు తపస్సు; వాక్తపస్సనునది, సత్యము, ప్రీతి, హితమైనమాట, మంచి ధర్మగ్రంథములను చదువుట. మొదలగునవి. మనస్సును శాంతముగ నుంచుట, శుద్ధమైన తలపులను తలచుట, భోగములనుగూర్చిన తలపులను విడచుట ఇవి మనస్తపస్సగును. ఇట్టి పలువిధములైన తపస్సులను లాభమును కోరక యితరుల గౌరవమును సంపాదించు నుద్దేశములేక తపోమహత్త్వమును గోరియే చేయవలెను. ఇతరులకు హింసనుచేయుటకు గాని, పిడివాదముచేయు బుద్ధితోగాని తపస్సుచేయుట కేవలము తప్పు.


దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం
బ్రహ్మచర్య మహింసా చ శారీరం తపఉచ్య తే.


దేవుడు, ద్విజులు, గురువులు, ప్రాజ్ఞులు వీరిని పూజించుట, శౌచము, తిన్ననినడక, బ్రహ్మచర్యము, అహింస, ఇవి శరీరమునకు సంబంధించిన తపస్సు. 17-14


అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యా యాభ్యాసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే.


ఇతరుల మనస్సును కలతపరుప నట్టియు, సత్యము ప్రియమునైనట్టియు, హితకరమైనట్టియు మాటను మాట్లాడుటయు, శాస్త్రమును చదువుటయు, ఇవి వాక్కుతో చేయబడు తపస్సు. 17-15


మనఃప్రసాద స్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః
భావసంశుద్ధి రిత్యేత త్తపో మానస ముచ్య తే.

మనశ్శాంతి, సౌమ్యస్వభావము, మౌనము, ఆత్మవినిగ్రహము,

భావశుద్ధి, ఇవిమనస్సుతోచేయబడుతపస్సు. 17-16


దానమును ఇట్లే. ఏ యుద్దేశముతో చేయుదుమో దాని ననుసరించి, విభజింపవచ్చును. ఇవ్వవలె ననుకర్తవ్యము గమనించి, వినయముతో మనస్సున ప్రతిఫలమున కెదురుచూడక యిచ్చునదే శ్రేష్ఠమైనదానము. పుణ్యాశతో యిచ్చుట కూడ రెండవ పక్షమే.


దాతవ్య మితి యద్దానం దీయ తే౽నుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతం.


ఇచ్చుట కర్తవ్యమని తెలిసి, ప్రతిఫలమును గోరక, తగినస్థలమును, పాత్రమును, కాలమును, చూచి చేసిన దానము సాత్త్వికదాన మగును. 17-20


యత్తు ప్రత్యు పకారార్థం ఫల ముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్రాజస ముదాహృతం.


ప్రతిఫలమును కోరియో, ఫలము నుద్దేశించియో, మనస్సున కష్టముతోనో ఇవ్వబడిన దానము రాజసదాన మగును. 17-21


అ దేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే
అసత్కృత మవజ్ఞాతం తత్తామస ముదాహృతం.


తగనిస్థలమున తగనికాలమున, తగనివారికి చేయబడు నదియు, గౌరవింపక యవమానించి చేసినదానము తామస దాన మగును. 17-22


మనము అనుదినమును తినుతిండి మన గుణములను గొప్పవిగను, నీచములుగను మార్చును. సాత్త్వికాహారమేది, శాంతచిత్తత కడ్డమువచ్చు రాజసాహార మేది? బుద్ధినడచు తామసాహార మేది? అనునది గీతలో సూచింప బడినది.


ఆహార స్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః
యజ్ఞ స్తప స్తథా దానం తేషాం భేద మిమం శృణు.


హోమమును, తపస్సును, దానమును, మూడును, మూడువిధములుగ నుండును. వారికివారికి ప్రియమైన భోజనముమూడువిధములుగనుండును. వానిభేదమునువినుము. 17-7


ఆయుస్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః
రస్యా స్స్నిగ్ధాస్థ్సిరాహృద్యాఆహారాస్సాత్త్వికప్రియాః.


ఆయుస్సు, శక్తి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి వీనిని వృద్ధిచేయునదియు, రసముతో గూడినవి, జిడ్డు గలవి, స్థిరముగ నుండునవి, శాంతి నిచ్చునవి యైన ఆహారములు సత్త్వగుణముగలవారికి ప్రియము. 17-8


కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః
ఆహారా రాజస స్యేష్టా దుఃఖ శోకామయప్రదాః.


కారము, పులుపు, ఉప్పు, మిక్కిలివేడి, ఎక్కువ చురుకుగలవియు, విదాహమును గలిగించునవియు నగునాహారములను రజోగుణము కలవారు కోరుదురు. ఇవి దుఃఖము, శోకము, రోగము, వీనికి కారణమగును. 17-9


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం.


ప్రాచిది, రసహీనమైనది, కంపుకొట్టినది, రాత్రియంతయు నిలువనుంచినది, ఎంగిలి, అశుద్ధమైనది. ఇట్టి యాహారములందే తమోగుణముకలవారు ప్రీతినిచూపుదురు. 17-10


ఇవి వేలకొద్ది సంవత్సరములక్రింద వ్రాయబడిన శ్లోకములని జ్ఞాపకముంచుకొని, వీనిసారాంశమును గ్రహించి, దిన దినజీవితమును గడపుకొనవలెను.


(24)

ప్రపత్తి.

(గీత: అధ్యాయములు 9, 10, 12, 14, 18)


అవ్యక్తబ్రహ్మమును ధ్యానించుట కష్టము. సర్వ కళ్యాణగుణములును గల సర్వేశ్వరు నుపాసించుటే సులభమైనమార్గము. కర్మయోగమార్గమున చెప్పినట్లు స్వలాభము