శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 22

వికీసోర్స్ నుండి

(22)

నాస్తికము కూడదు.

(గీత : అధ్యాయము 16.)


ఈశ్వరుని చేరుటకు సాధనములయిన యెల్లమతములను, మార్గములను భగవంతు డంగీకరించునని గీత చెప్పుతూ నాస్తికము లేక అనాత్మవాదమును ఖండించుచున్నది. ఈక్రింది శ్లోకములు నాస్తికవాదమునుగురించి చెప్పుచున్నవి. "ధర్మమనునదేమి? సత్యమనునదేమి? ఏదిలేదు. మనుష్యులు చేరి, తమ సుఖముకొర కేర్పరచుకొన్న యేర్పాటే ధర్మము" అని యీకాలమున కొందరాడు మాటలనే యివి సూచించు చున్నట్లున్నవి.


ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు రాసురాః
నశౌచం నాపిచాచారో నసత్యం తేషు విద్యతే.


అసురత్వము నాశ్రయించినవారికి పనిచేయు క్రమము తెలియదు. పనినుండి విరమించుట కూడ తెలియదు. శౌచము, సదాచారము, సత్యము, అనునవి వారిలో కనపడవు. 16-7



అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరం
అపరస్పరసంభూతం కి మన్య త్కా మహైతుకం.

వారు "ఈలోకములో సత్యమను పదార్థము లేదు.

లోకము ధర్మముతో ప్రతిష్ఠింపబడి యుండలేదు. పరిపాలించు నీశ్వరుడును లేడు," అనిఅందురు. ఒకటితో నొకటి కలియగా ఆకూడికవలన నెల్లసృష్టియు నగుచున్నదనియు, లోకమునకు కామమే హేతువనియు వారందురు. 16-8


ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మనో ౽ ల్పబుద్ధయః
ప్రభవ న్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో౽హితాః


అల్పబుద్ధిగలిగి యాత్మను నాశనము చేసికొనువా రిట్టి చూపుగలవారయి, క్రూరకార్యములను చేసి, లోకమునకు కీడుచేసి, దానినాశమునకు కారణ మగుదురు. 16-9


కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః
మోహాద్గృహీత్వా౽సద్గ్రాహాన్‌ప్రవర్తన్తే౽శుచివ్రతాః


తృప్తినొందచాలని కామము నాశ్రయించి, డంబమును, గర్వమును, మదమును బొందినవారై, మోహముచే కలుగుతప్పుటభిప్రాయములతో కూడినవారై, యశుద్ధవ్రతములతో నుండువారై వారు ప్రవర్తింతురు. 16-10


చింతా మపరిమేయాం చ ప్రలయాంతా ముపాశ్రితాః
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః


మరణమునకు తీరని మితిలేనిచింతనుపొంది కామోప భోగములను తృప్తిపొందించుకొనుటయందే యాసక్తి గలిగి, యిదియే పురుషార్థమని నిశ్చయించుకొని, 16-11


ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః
ఈహంతే కామభోగార్థ మన్యాయే నార్థ సంచయాన్.


వందలకొలది నాశాపాశములచే కట్టువడి, కామమునకును, క్రోధమునకును నాటపట్టులై, కామభోగమునకై యన్యాయముచేయుచు, ధనము మొదలగువస్తువులను చేర్చు కొనకోరుదురు. 16-12


నేడు లోకమునగల స్థితి యిదియే గదా ! ప్రత్యేక మనుష్యులయాశలును, చేతలును, జాతికూటములదృష్టులును, ఇట్లే యుండుచు వచ్చుచున్నవి. ఈశ్వరునిమరచిన నాగరికత మున్ముం దెట్లుండు ననుదాని నింకను చూడుడు.


ఇద మద్య మయా లబ్ధ మిమం ప్రాప్స్యేమనోరథం
ఇదమస్తీ దమపిమే భవిష్యతి పునర్ధనం.
అసౌ మయా హతశ్శత్రు ర్హనిష్యే చాపరానపి
ఈశ్వరో౽హ మహం భోగీ సిద్ధో౽హంబలవాన్ సుఖీ.


ఇప్పు డీలాభము నొందితిని. ఇకముం దీలాభమును పొందుదును; ఈవస్తువును పొందితిని, ఇంకను నాకు ధనము లభింపగలదు. 16-13 ఈపగవానిని చంపితిని. ఇంక నితరులను చంపెదను. నే నీశ్వరుడను, నేను భోగిని, నేను సిద్ధుడను, నేను బలవంతుడను, నేనుసుఖపడుచున్నాను, అని ఇట్లెన్నుచుందురు. 16-14


అనేక చిత్తవిభ్రాంతా మోహజాల సమావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకే౽శుచౌ.


పలువిధములగు చిత్తవిభ్రాంతి నొంది, మోహమను వలలో చిక్కి, కామభోగములలో తగిలి అశుద్ధమైన నరకమున పడుదురు. 16-16


ఆఢ్యో౽భిజనవానస్మి కో౽న్యో౽స్తి సదృశో మయా
యక్ష్యేదాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః.


"నేను పుణ్యవంతుడను. నాకు స్వంతబంధువు లనేకు లున్నారు. నాతో సమానమయినవా డెవడున్నాడు? యజ్ఞములను చేయుదును. దానములు చేయుదును. సుఖముల పడయుదును"అనిఇట్లజ్ఞానముచేమోహమునొందుదురు. 16-15


ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః
యజన్తే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం.


వారు తమ్ముతామే పొగడుకొందురు; వారు పిడివాదముచేయువారు; ధనము, అభిమానము, మదములతోకూడిన వారు. డంభమునకు విధి నుల్లంఘించి పేరుకు మాత్రము

యజ్ఞములను చేయుదురు. 16-17


అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః
మా మాత్మపరదేహేషు ప్రద్విషన్తో౽భ్యసూయకాః


అహంకారమును, బలమును, దర్పమును, కామమును క్రోధమునుబొందినవారై, వీరు తమదేహములలోను, ఇతరుల దేహములలోను, పరమాత్మనై యున్న నన్ను పగతో చూతురు. 16-18


మోసమును పశుబలమును ఉపయోగించి సంపాదించిన ధనమును, దాని నాశ్రయించిన నాగరికతయు, ప్రతిష్ఠకొరకు మనస్సును తృప్తిపరచు కొనుటకును చేయు దానములును, సార్వజనికోపయోగము లయిన మంచికార్యములును, నీవేషములకు పునాదులై నిలుచు నధర్మమును ధర్మముగాచేయసమర్థములు కావు. ఇట్టి యనాత్మవాదమును, నాస్తికమును, తుదకు నాశమునకే మార్గము లగును.


పూర్వులు చూచినసత్యముల నెడపెట్టకూడదు. వారు తాము చేసిన చింతచేతను, నభ్యాసముచేతను, తపస్సు చేతను ధ్యానముచేతను చూచిన సత్యమునుమరచి, మనము మొదటి నుండియు ప్రయత్నించి, మనమే చూడ నెంచుట యుచితము కాదు. సంపాదించిన ధనము నుంచుకొని, దానిపై నింకను సంపాదింపకోరుట మనకు కర్తవ్యము. పూర్వులు చూచిన సత్యములకు శాస్త్ర మనిపేరు. ఒక్కొక్కడును మరపునొంది మొదటినుండియు నారంభించుట యనునది సాధ్యము కానిపని యగును.


యశ్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిం.


శాస్త్రవిధులను బయటికి త్రోసి, కామము ప్రేరించి నట్లు నడచువానికి సిద్ధి లేదు; సుఖము లేదు, పరగతియు లేదు. 16-23


తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి.


కావున, నీవు దేనిని చేయవచ్చును, దేనిని విడువ వచ్చును, అనువ్యవస్థను తెలుసుకొనుటకు శాస్త్రమునేప్రమాణముగా నుంచుకొనుము. శాస్త్రవిధానమును దెలిసి, నీవు కర్మములనుచేసి జీవితమును గడుపువాడవుగమ్ము. 14-24


(23)

గుణ విభాగము

(గీత: అధ్యాయము 17)


మన ప్రకృతిగుణములకు తగినమట్టు కుపాసనకు మూర్తిని వెదకుకొందుము. మనము దేని నుపాసింతుమో దాని