Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 21

వికీసోర్స్ నుండి

జ్ఞానమనునది కేవల గ్రంథపఠనమువలనను, ధ్యానమువలనను రాదు. సత్యమైన జిజ్ఞాసయే జ్ఞానము. ప్రయోజనకారి యగునట్లు సరియైన తత్త్వవిచారము పొందకోరిన యెడల నింద్రియములను, మనస్సును, కర్మములను నడచి, వశపరుచు కొనవలెను. ఇట్లడపనియెడల పొందిన జ్ఞానము లోపల జొచ్చి, యాత్మకు సహాయపడదు. నూనెమీద నీరు విడిచిన మాదిరిగ ఫలకారికాకుండబోవును. సత్యమయిన జ్ఞానమును బొందక, కర్మములను మనస్సును నడచి వశపరుచుకొనక, స్వభావగుణములను యధేచ్ఛముగ తమ పనులను చేయవిడచినయెడల కర్మభారము వృద్ధి యగుచునే పోవును.


(21)

అందరకును మోక్షము.

(గీత : అధ్యాయములు 4, 7, 9)


మహాపాపము చేసినవాడయినను, 'నాకేదిగతి?'యని యెవడును నిరాశను పడనక్కరలేదు. వానికిగూడ తాచేసిన పాపమునుగూర్చి దుఃఖపడి భగవంతుని శరణుజొచ్చినయెడల విడుదలయున్నది. ఇది గీతలోని ధృఢమైన బోధన. ఇదేమి? కర్మబంధము నింత సులభముగ తప్పించుకొన వీలున్నదా యని సందేహపడనక్కరలేదు. చేసిన పాప కార్యమును గురించి, స్మరించుచు పాపపు తలపులను గురించి నిజమైన పశ్చాత్తాపము నొంది, మనస్సును త్రిప్పుకొన్న యెడల నదియు నొకకర్మమే యగును. దాని ఫలమును కూడ ఆత్మపొందును. కావున, భగవంతుని శరణుజొచ్చిన యెడల కర్మభారము తొలగిపోవుననుట కర్మవిధికి విరుద్ధము కాదు.


కాని తరువాత మంత్రములను చదివి ప్రాయశ్చిత్తము చేసికొనవచ్చునని తలంచి పాపకార్యము చేసినయెడల తప్పించుకొన వీలులేదు. నిజముగా మనస్సును త్రిప్పుకొనని యెడల పాపము పోదు. కావలెనని చేసినవారి కిట్టి నిజమైన పశ్చాత్తాపము రానేరదు. తాచేసిన పాపమునకు తగినంత పశ్చాత్తాపపడిన నా పశ్చాత్తాపమే వానికి గొప్ప కష్టమును దుఃఖమును తెచ్చి, ఇతరులు విధించు దండనకంటె నెక్కువ దండన యగును. అట్టిక్లేశము ననుభవించిన, తన్ను తానే శుద్ధిచేసికొనుట యగును. కాని, యెంతదూరము నిజముగ క్లేశపడుదుమో, అనగా మనమే దుఃఖమునొంది దండించు కొందుమో, అంతమట్టుకు మున్నుచేసినపాపమునుండి తప్పుకొందుము. పశ్చాత్తాపపడుటయు, భగవంతుని శరణుజొచ్చుటయు, అంతరాత్మ వేగమునే తప్ప, వేరుమంత్రముగాని, మాట గాని, జపము గాని, స్మార్తక్రియగాని పనిలేదు. పురోహితుడో, గురువో చెప్పు మంత్రము చేతనే ప్రాయశ్చిత్తము కాచాలదు. మంత్రమును, క్రియయు, పురోహితుడును, గురువును ఉపయోగపడక పోరు. పునీతులగుటకు ఋషులును పూర్వులును నుపయోగించినపదములును, కార్యములును, సంకేతములును మనమును నుపయోగించినయెడల మంచి తలవులును, ధైర్యమును, భక్తియు కుదురును. ఇతరులకు తెలియునట్లు చేయు క్రియవలన చేసిన పాపమును గూర్చి సిగ్గునుగల్గును, ఇవన్నియు మనస్సును పునీతముచేయకలుగు సాధనలు. ఇంతేతప్ప దానిని గొని సత్యము నేమరకూడదు. ఒకవేళ నితరుల నేమరింప వచ్చును. తన్ను మోసము చేసికొనవచ్చును. కాని సత్యము నేవిధముననైనను నేమరకూడదు. కర్మవిధి యనునది సత్యపురూపమే. కావున దానినేమరగూడదు. ఒక వర్తకుడు తప్పు త్రాసుతోనో, తప్పుకొలతతోనో జనులను మోసపుచ్చవచ్చునుకాని, యే వ్యాపారియుతనలెఖ్కలోనే మోసముచేసికొనడు. వైద్యుడు రోగియెడల అసత్యము పలుకవచ్చును. కాని యుష్ణమాపక ధర్మామీటరు అను యంత్రము తప్పు చూపించదుగదా! ఇతరశాస్త్రపుస్తకములలో నేమిచెప్పియున్నను. భగవంతుని శరణుజొచ్చి విడుదలనొందుటకు జాతిగాని, కులము గాని బాధింపదు. దీనిలో ఆడు, మగయు, వ్యత్యాసము లేదు. దీనికి గీతలో చెప్పబడియున్న శ్లోకములు:


నమో౽హం సర్వభూతేషు నమే ద్వేష్యో౽స్తినప్రియః
యే భజన్తితుమాం భక్త్యా మయితే తేషు చాప్యహమ్.


నేనెల్లప్రాణులందును సమముగా నుందును. నే నెవ్వరిని ద్వేషింపను, ప్రేమింపను నన్ను భక్తితో నెవరు భజింతురో వారు నాయం దమరియుందురు. వారిలో నేనుందును. 9-29


అపిచేత్సుదురాచారో భజతే మా మనన్యభాక్
సాధురేవ సమన్తవ్య స్సమ్యగ్వ్య వసితోహిసః.


మిక్కిలి చెడునడత గలవాడయినను వేరుదాని యందు మనస్సును పోనీయక, నన్ను భజించినవానిని మంచివాడనియే తలపవలెను. అతని ప్రయత్నము మంచి ప్రయత్నము. 9-30


క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి
కౌంతేయ ప్రతిజానీహి ననే భక్తః ప్రణశ్యతి.


అట్టివాడు శీఘ్రముగనే ధర్మాత్ముడగును. నిత్యశాం తిని పొందును. నిశ్చయముగ తెలిసికొనుము. నా భక్తు డెవనికిని నాశములేదు. 9-31


మాంహి పార్థ వ్యపాశ్రిత్యయే౽పిస్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే౽పియాన్తిపరాంగతిం.


పాపులు నన్ను శరణుజొచ్చినయెడల, స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను, పరగతిని పొందుదురు. 9-32


దేవుని భజించువాడేకులమువాడనికాని, మగవాడు ఆడుది యనికాని యనుట యెట్లు ముఖ్యముకాదో, అట్లే యెట్లు దేవునారాధించు ననునదియు ముఖ్యముకాదు. ఇది గీతలో మనము చూచు గొప్పవిషయము. హిందూమతమునకు గొప్ప కీర్తినితెచ్చువిషయము. భగవంతు ననేకు లనేక విధముల నారాధింతురు. మతము, సంప్రదాయము, వీనిభేదములను నేను లెక్కింపనని గీతలో భగవంతుడు స్పష్టముగ చెప్పియున్నాడు.


యేయథామాంప్రపద్యన్తేతాం స్తథైవభజామ్యహమ్
మమ వర్త్మానువర్తనే మనుష్యాః పార్థ సర్వశః.


ఎవరు నన్నెట్లుభజింతురో వారి నట్లే నే ననుగ్రహింతును. మనుష్యు లేమార్గము ననుసరించినను నన్ను పొందు

మార్గమేయగును. 4-11


యే౽ప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయా న్వితాః
తే౽పిమామేవ కౌంతేయ యజన్త్యవిధిపూర్వకం.


అన్యదేవతలను శ్రద్ధతో భజించు భక్తులును, విధిని తప్పనవారైనను నన్నే యారాధించుచున్నారు. 9-23



పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యాప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రియతాత్మనః.


ఆకు, పువ్వు, పండు, నీరు ఏదియైనను నాకొకడు భక్తితో నర్పించినయెడల తన్ను తా జయించి యిట్టిభక్తితో నాకిచ్చినదాని నాదరముతో నంగీకరింతును. 9-26


యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం.


నీ వేదిచేసినను దేనిని తినినను, నా కర్పణమనియే చేయుము. 9-27


కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే౽ న్యదేవతాః
తంతంనియమమాస్థాయ ప్రకృత్యానియతా స్స్వయా.


చాల కోరికతో కూడియున్న మనస్సును గలవారు తమతమ ప్రకృతిచేత కట్టబడి, వేర్వేరు నియమములను చేపట్టియుండ, కొంద రన్యదేవతల ననుసరించుచున్నారు.

కాని, 7-20


యోయోయాంయాంతనుం భక్తశ్రద్ధయా ర్చితుమిచ్ఛతి
తస్యతస్యాచలాం శ్రద్ధాంతామేవ విదధామ్యహం.


ఏభక్తుడు శ్రద్ధతో నేదేవత నర్పించునో యతనికా దేవతయందు ధృఢమైన భక్తిని నేనే యుంచుదును. 7-21


స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధన మీహతే
లభ తే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్.


వాడా నమ్మికను బొంది యామార్గముననే యారాధింపకోరును. కోరినవానిని నంతటిని వాడు పొందును. వానినిచ్చువాడను నేనే. 7-22


ఇట్లు మతము సంప్రదాయము, క్రమము, నేవిధమున నున్నను నెల్లమార్గములును భగవంతునే చేరునని గీతలో చెప్పబడినది. ఆకాలమున జనులనుసరించివచ్చిన మతముల మార్గములను సంప్రదాయములనుగూర్చియే చెప్పబడినది. తరువాతవచ్చిన యితరమతములను క్రమములనుగురించి అప్పుడు చెప్పుటకు సాధ్యముకాదుగదా! అయినను, చెప్పినవాక్యములలో తరువాత వచ్చినమతములను యన్నిటి నుద్దేశించి చెప్పిన మాట యని మనము గ్రహింపవచ్చును. ఎల్లమతముల నంగీకరించియున్న మాణిక్యముల వంటి యీ వాక్యములను మనము గౌరవించి యాచరణలో పెట్టవలెను.