శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 20

వికీసోర్స్ నుండి

ముచేయువారియెడలను సమముగనే నడచువాడు, నిందను పొగడ్తను సమముగా గొను ధీరుడు. 14-24


మానవమానయోస్తుల్య స్తుల్యోమిత్రారిపక్షయోః
సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్సఉచ్య తే.


గౌరవమును అవమానమును సమముగ తలచువాడు, మిత్రులయందును పగవారియందును సమభాగమును పూనువాడు, తనకొరకు పనుల నారంభింపనివాడును, ఇట్టివాడే గుణములనుగడచినవాడని త్రిగుణాతీతుడనిచెప్పబడును. 14-25


(20)

స్వభావగుణములు

(గీత : అధ్యాయములు 4, 13, 14, 18)


మనుష్యుడు తప్పుదారి నేలపోవు ననుదానికి కారణము అడుగడుగునకు జ్ఞాపకమునకు తెచ్చికొనవలెను. చెడు పనులను చేయువారిని చూచి శాంతమును విడువక, వారియెడల విశ్వాసము చూపుటయు, మనస్సును కలతనొందింపక దానిని స్థిమితముగ చేసికొనుటయు, మిగుల మంచిది.


తన్ను తా నడచుకొనలేక, మనస్సు నజాగ్రత్తగ విడిచినయెడల జన్మతోడ స్వాభావికముగ వచ్చు గుణముల యుద్రేకముపనిచేయును. స్వభావమనునది అందరకును వేదనను కలిగించును. అది కార్యరూపమున బయలుబడును. దీనినొకని యందు చూచి మనము కోపింపవచ్చునా? ఇతరుల పనిని చూచి వేసరపడునప్పుడెల్ల వారువారు తమలోని లోపములను జ్ఞాపమునకు తెచ్చుకొనవలెను. నీమనస్సు శుద్ధముగ నున్నదా? ఇతరులకు దెలియునట్లది బయటికి కనబడకపోయినను అది లోపలనే చేయుపనిని నీవు చూచుచునే యుందువు గదా. దానిని నీవడచినయెడల అది నీభాగ్యము. ఇతరులా భాగ్యమును బొందకయుండుటను నీవు విచారపడవలయును. భగవదనుగ్రహమును సంపాదించినయెడల గదా వారి యాత్మ అస్వాభావికమయిన కర్మమునుండి బయట బడగలదు. లోకమున నడచునదంతయు నీశ్వరసంకల్పము. ఏది చెడుగు, ఏది మంచి యని నీవు తీర్మానింప వచ్చునా? తుద కేదిచెడుగు, ఏదిమంచి, అనునదీశ్వరునికే తెలియును. జగత్తు విధానమును తెలియని మనము దానిని తీర్మానింప వీలులేదు.


ప్రకృత్యైవ చకర్మాణి క్రియమాణాని సర్వశః
యఃపశ్యతి తథా౽త్మానా మకర్తారం సపశ్యతి.


ఏవిధమునను పనులు ప్రకృతివలననే చేయబడుచుండును. కావున నాత్మయనునది కర్తకాదని కనుగొన్నవాడే

తత్త్వమును దెలిసినవాడు. 13-30


సత్త్వం రజ స్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః
నిబధ్న న్తి మహాబాహో దేహే దేహిన మవ్యయం.


సత్వము, రజస్సు, తమస్సు, ఈ గుణములు ప్రకృతిలో పుట్టును. స్వభావముచేత నాత్మ యవ్యయమైనదైనను దేహమునందు నిలుచునపుడది యీగుణములచే కట్టబడు చున్నది. 14-5


నా న్యం గుణేభ్యః కర్తారం యదా దృష్టా౽ను పశ్యతి
గుణేభ్యశ్చ పరంవేత్తి మద్భావం సో౽ధిగచ్చతి.


గుణములు తప్ప వేరే కర్త లేడను దానికి జీవుడు కనుగొని గుణములకు పైనున్న తత్త్వమును దెలిసిన యెడల నా స్వరూపమును తెలిసినవాడగును. 14-19


న త దస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి స్స్యాత్త్రిభిర్గుణైః.


ప్రకృతియందు కనపడు ఈ మూడుగుణములనుండియు విడబడి నిలుచు ప్రాణి భూలోకమునందు లేదు. ఆకాశము నందును దేవతలయందునుగూడ లేదు. 18-40


స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్స్వేన కర్మణా
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యన్య వశో౽పి తత్.


స్వబావముగనుండు కర్మములచే కట్టువడియున్న నీవు మోహము వలన దానిని చేయననినను నీవశము కాకయే

నీవు దానిని చేయుదువు. 18-60


న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే.


ప్రభువు అనే జీవుడు కర్మను, కర్మఫలము, వీనిలో దేనిని సృజింపడు. ప్రకృతిస్వభావము చేతనే యంతయును నడచును. 5-14


నాదత్తే కశ్యచి త్పాపం న చైవ సుకృతం విభుః
అజ్ఞానేనా౽వృతం జ్ఞానం తేన ముహ్యంతిజంతవః.


జ్ఞానమనునది అజ్ఞానముచే చుట్టబడియుండినందున జీవులు మోహమునొందుదురు. ప్రకాశమునొందిన యాత్మ యేదైన చెడుపనినిగాని మంచిదనబడుదానినిగాని యంటి యుండదు. 5-15


ఆనాదిత్వా న్నిర్గుణత్వాత్ పరమాత్మా౽య మవ్యయః
శరీరస్థో౽పి కౌన్తేయ నకరోతి నలిప్యతే.


ఆదియనునదిలేక, గుణమునులేక, యిట్లు మార్పులేక పరమాత్మ దేహమందున్నను అది యేపనిని చేయకయు, పని నంటకయు నుండును. 13-32


ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే౽ర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా.


ఎల్లప్రాణులలోను నీశ్వరుడున్నాడు. మాయబలము చేత నీశ్వరు డెల్లజీవులను చక్రములందు తిరుగు ప్రతిమవలె త్రిప్పును. 18-61


ఈ శ్లోకమువలన నేమితెలిసికొంటిమి? పుట్టినప్పుడు ఏగుణములతో పుట్టితిమో యవి మనలను ప్రేరేపించును. పాపముచేసినాడని యొకనిని ద్వేషింపకూడదు. హేళనయు చేయకూడదు. మనమా పాపమును చేయలేదని గర్వపడను కూడదు.


ఈ శ్లోకములను గ్రహించి మన కెట్టిబాధ్యతయులేదని చెప్పకూడదు. అంతయును పుట్టుగుణమని విడిచి యెట్టిబాధ్యతయు లేక నడచుకొనుటకీశ్లోకములు ప్రమాణమని భావించుట మూఢత్వమగును. ఆత్మశక్తిచే స్వభావగుణములను, అనగా తాను పూర్వజన్మమున చేసినకర్మలఫలముగా సంపాదించిన స్వభావగుణములను వశముచేసికొనవలెను. వాని నడచి గెలిచి విడుదలపొందవలెను. స్వభావగుణములను గూర్చి గీతయందు చెప్పబడిన శ్లోకములెల్ల నితరులను విశ్వాసముతో చూచుటకును తనలో మనస్సున కళవళము నొందక యుండుటకును సాధనముగ సత్యము నెత్తి చూపుటకును తప్ప, నొక్కొక్కడును దనవిషయమున బాధ్యతను తప్పించుకొని ప్రయత్నముచేయక చెడిపోవుటకుగాదు.


ఈ యుపదేశ మితరులను చూచి వీరు పూర్వకర్మము నకు ఫలమని నీచకులము లేక నీచగుణము గలవారిని నీచముగా జూచి, క్రూరముగాను, అసూయతోను, గర్వముతోను నడచుకొనుట కాధారము కాదు. అట్లెవడైన నడచినయెడల తన యాత్మను నీచపరుచుకొన్నవాడగును.


ఆత్మ దేనిచేతను మారదు. అది ప్రత్యేకముగ నిలిచి యుండును. ప్రకృతిగుణములే యెల్లచేష్టలను చేయుచున్నవి. ఆచేష్టలచేత ఆత్మ మారుదల నొందదు. దాని స్వరూపమును స్పష్టము చేయుటకు చెప్పినది. పాలలో మజ్జిగ వేసినయెడల పెరుగగునట్లు, దేహముతోచేరిన యాత్మస్వరూపము పాపపుణ్యములచేత మారిపోదు. "ప్రత్యేకముగా నిలుచును." "మారుదల పొందదు" అనుదానివలన దెలి యవలసిన దింతేకాని, యాత్మకు బాధ్యతలేదని చెప్పుట కాదు. చేయుపనుల పాపపుణ్యఫలము నది పొందదనియు కాదు.


స్వభావగుణములు జడప్రకృతియైన దేహమున నాటు కొని యున్నను నవి యింద్రియములను మనస్సును తమ యధీనమున నుంచుకొని, వానిమార్గమున నాత్మనుగూడ బంధించి విడుచును. కాని, గుణములతో పోరాడి, గెలిచి, బంధమునుండి తప్పించుకొనుట కాత్మకు శక్తియు స్వాతంత్య్రము నున్నవి. దీనికి జ్ఞానమను సాధనము కావలెను. జ్ఞానమనునది కేవల గ్రంథపఠనమువలనను, ధ్యానమువలనను రాదు. సత్యమైన జిజ్ఞాసయే జ్ఞానము. ప్రయోజనకారి యగునట్లు సరియైన తత్త్వవిచారము పొందకోరిన యెడల నింద్రియములను, మనస్సును, కర్మములను నడచి, వశపరుచు కొనవలెను. ఇట్లడపనియెడల పొందిన జ్ఞానము లోపల జొచ్చి, యాత్మకు సహాయపడదు. నూనెమీద నీరు విడిచిన మాదిరిగ ఫలకారికాకుండబోవును. సత్యమయిన జ్ఞానమును బొందక, కర్మములను మనస్సును నడచి వశపరుచుకొనక, స్వభావగుణములను యధేచ్ఛముగ తమ పనులను చేయవిడచినయెడల కర్మభారము వృద్ధి యగుచునే పోవును.


(21)

అందరకును మోక్షము.

(గీత : అధ్యాయములు 4, 7, 9)


మహాపాపము చేసినవాడయినను, 'నాకేదిగతి?'యని యెవడును నిరాశను పడనక్కరలేదు. వానికిగూడ తాచేసిన పాపమునుగూర్చి దుఃఖపడి భగవంతుని శరణుజొచ్చినయెడల విడుదలయున్నది. ఇది గీతలోని ధృఢమైన బోధన.