శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 24

వికీసోర్స్ నుండి

చురుకుగలవియు, విదాహమును గలిగించునవియు నగునాహారములను రజోగుణము కలవారు కోరుదురు. ఇవి దుఃఖము, శోకము, రోగము, వీనికి కారణమగును. 17-9


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం.


ప్రాచిది, రసహీనమైనది, కంపుకొట్టినది, రాత్రియంతయు నిలువనుంచినది, ఎంగిలి, అశుద్ధమైనది. ఇట్టి యాహారములందే తమోగుణముకలవారు ప్రీతినిచూపుదురు. 17-10


ఇవి వేలకొద్ది సంవత్సరములక్రింద వ్రాయబడిన శ్లోకములని జ్ఞాపకముంచుకొని, వీనిసారాంశమును గ్రహించి, దిన దినజీవితమును గడపుకొనవలెను.


(24)

ప్రపత్తి.

(గీత: అధ్యాయములు 9, 10, 12, 14, 18)


అవ్యక్తబ్రహ్మమును ధ్యానించుట కష్టము. సర్వ కళ్యాణగుణములును గల సర్వేశ్వరు నుపాసించుటే సులభమైనమార్గము. కర్మయోగమార్గమున చెప్పినట్లు స్వలాభము నువిడిచి, సంగము లేక సమచిత్తముతో కర్మములను, చేయుటకు తోడుగ, కరుణామూర్తియగు నారాయణునికే మనము చేయుకర్మముల నెల్ల నర్పణముచేయుచునడుచుకొనవలెను. తుద కతనియనుగ్రహమే మనలను కాపాడును. మరియొకటి కాదు. అతనియనుగ్రహమున్న యింద్రియముల నడచి, నడుచుకొన వచ్చును. సమత్త్వమును, శాంతమును, మనస్సును నమర్చుకొన వీలగును. ఆశ, జయము, మైకము వీనినుండి మనలను కాపాడుటకు, భగవానునియనుగ్రహము లేకున్న వీలులేదు. అట్లయిన యేకర్మమును చేయజొచ్చినను ఈశ్వరు నుద్దేశించి యతని కర్పణముగ దానిని చేయవలెను.


ఇదియే భక్తిమార్గ మనునది. ఇది కర్మయోగ మని చెప్పబడుమార్గమునకు బదులుగచేకొనగూడిన యొక ప్రత్యేక మార్గము కాదు. కర్మయోగమున చెప్పబడిన మనోభావము లేనివాడు భక్తియోగముచేయచాలడు. ఈశ్వరస్మరణమును, భక్తియు లేనివాడు కర్మయోగమార్గము ననుసరించుటయు నరుదు. భక్తియోగమును, కర్మయోగమును ఒకదాని కొకటి సహాయకారులు. చదువునప్పుడు వ్యత్యాసము కనబడినను, సరిగ నభ్యసించినయెడల రెండునునొక్కటేయని తెలియును.


శ్రీమన్నా రాయణుని శరణుజొచ్చుటయే యెల్ల మార్గములకును గమ్యస్థానము. తక్కినమార్గములనుగూర్చి వివరించు కొనుచున్న యెడలఫలములేదనుట గీతలోనితుదియుపదేశము. ఎట్టిపాపియైయున్నను, భగవంతునిమనఃపూర్వకముగ శరణు జొచ్చినవాడు నాశము నొందడు. ఎంతటి జ్ఞానియై యున్నను అతనిని శరణుజొరకున్న తరించుటకు వీలులేదు.


క్లేశో౽ధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్
అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే.


అవ్యక్తమున మనస్సు నిలిపినవారికి కష్ట మెక్కువ. దేహధారులకు అవ్యక్తోపాసన మిక్కిలి కష్టము. 12-5


యేతు సర్వాణి కర్మాణి మయిసన్న్యస్య మత్పరాః
అనన్యేనైవ యోగేన మాంధ్యాయన్త ఉపాసతే
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్
భవామి నచిరాత్పార్థ మయ్యావేశిత చేతసాం.


ఎల్లపనులను నాకు సమర్పించి మనస్సును నాయందే నిలిపి అనన్యమైన యోగముతో నన్ను ధ్యానించి నడచు వారును నాయందు చిత్తమునుంచువారునైన జనులను, మరణము, సంసారము అను సముద్రమునుండి వేగముగ విడిపింతును. 12-6, 7


మాం చ యో౽వ్యభిచారేణ భక్తియోగేన సేవతే
సగుణాన్సమతీ త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే.


చలింపని భక్తియోగముతో నన్నుపాసించువాడు, గుణములను గడచి బ్రహ్మపదమును పొంద తగినవా డగును. 14-26


మచ్చిత్తా మద్గతప్రాణా బోధయ న్తః పరస్పరం
కథయ న్త శ్చ మాం నిత్యం తుష్య న్తి చ రమన్తి చ.


చిత్తమును నాయందు నిలిపి, ప్రాణమును నాయందే చొప్పించి నన్నుగూర్చి యొకరితో నొకరు చెప్పి తెలిసి కొనుచు నాభక్తులు తృప్తిని శాంతిని పొందుదురు. 10-9


తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాన్తి తే.


ఎప్పుడును మనస్సు వశముచేసుకొని ప్రీతితో నన్ను చేరువారికి నేను బుద్ధియోగము నిత్తును. దానివలన వారు నన్ను పొందుదురు. 10-10


తేషా మే వానుకంపార్థ మహ మజ్ఞానజం తమః
నాశయా మ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా.


వారినికరుణించుటకు వారిమనోభావములందు చొచ్చి ప్రకాశించుజ్ఞానజ్యోతితో వారియజ్ఞాన మను చీకటిని తొలగింతును. 10-11


అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.

వేరుతలపును తలపక నన్నుపాసించు నిత్యయోగుల

యోగక్షేమమును నేనే భరింతును. 9-22


తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత
త త్ప్రసాదా త్పరంశాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం


ఈశ్వరునే తుదివరకు శరణుచొరుము. అతనిఅనుగ్రహమున అంతటను సంపూర్ణశాంతియును శాశ్వతస్థానమును పొందుము. 18-62


సర్వ గుహ్య తమం భూయ శ్శృణు మే పరమం వచః
ఇష్టో౽సిమే దృఢమితి తతో వక్ష్యామి తేహితం.


అన్నిటికంటె ముఖ్యమైనదియు, నన్నిటికంటె రహస్య మైనదియు నైన నాపరమవచనమును వినుము. నాకు నీవు ప్రేమపాత్రుడవు కావున నీకు హితమును వృద్ధియు నగునట్లు చెప్పుచున్నాను. 18-64


మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౽సిమే.


నీమనస్సును నాయందు విడువుము. నామీద భక్తి నిలుపుము. నాకనియే హోమములనెల్ల చేయుము. నాకే నమస్కరింపుము. నన్ను చేరుదువు. ఇది సత్యము. నీకు వృద్ధి

గూర్చెదను. నీవు నాకు ప్రియమైనవాడవు. 18-65


సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః


తక్కిన యెల్లధర్మములను విడిచిపెట్టి నన్నే శరణు పొందుము. ఎల్లపాపముల నుండియు నేను నిన్ను విడిపించెదను. దుఃఖింపకుము. 18-66


(25)

అంతయు నొకటి

(గీత: అధ్యాయములు 5, 6, 8, 13, 18)


మనస్సును అరకట్టి చేయు కర్మములను భగవంతుని కర్పణముగా చేయుచు వచ్చిన యెడల, జీవలోకమంతయు నొక్కటేయను జ్ఞానప్రకాశమును పొందకలుగును. తానని ఒరులని భేదము విడిచి యెల్ల ప్రాణులును పరమాత్మయందు నిలుచు మనోభావమును పొందుటే గీతలో చేయబడిన ఉపదేశము. ఆత్మను అజ్ఞానమనునది చుట్టుకొని జ్ఞానజ్యోతిని మరుగుపరచును. ఈ అజ్ఞానమును పోగొట్టి ఆత్మలో జ్ఞాన ప్రకాశమును ఉదయించునట్లు చేసుకొన్నయెడల ఆమార్గమును పట్టినవాని కంటికి, విద్యయు, కళలును, శీలమును గలిగిన పండితుడును, దేనినినేర్వని యొక పామరుడును