శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 13

వికీసోర్స్ నుండి

(13)

కర్మ యోగము.


(గీత: అధ్యాయములు 2, 4.)

హిందూమతమున మార్పునకును వృద్ధిచేయుటకును ఎడములేదని కొందరితలంపు. చెడిపోయి పాడయిన భాగము లను తొలగించుటయు క్రొత్తవాని నేర్పాటు చేయుటకును వైదికమతమున వీలులేదని సాధారణముగ హిందూమతమును దూషించుట వాడుకయైనది. పూర్వులను గౌరవించుటచేతను ఒక మతాభివృద్ధి కడ్డములేదు. హిందూధర్మమనునది మార్పులను వృద్ధిని పొందని మతముకాదు. తత్త్వమేమని ప్రకృతిశాస్త్ర నిపుణులెట్లు సత్యమున కొక్కదానికే బద్ధులై పరిశోధన చేయుచుందురో, అట్లే వేదాంతమందును మనపూర్వులు పరిశోధన చేసియున్నారు.

తత్త్వమే, ప్రధానముగా బుద్ధినిఅన్ని మార్గములలోను నెంతదూరము ప్రవేశింపచేయ వీలగునో అంతదూరము పోవు టకు దేనినైనను అడ్డమని యాలోచింపక సత్యశోధనను చేసి పొందిన విషయములే వేదాంతమనునది. అదేహిందూమతము.

(ఇచట ఒక వాక్యము పీడీఎఫ్ లో లుప్తమైనది ) చున్న యాచారములను తగినకారణము లేక విడువగూడదను మనోభావము అభివృద్ధి కడ్డము రాదు. తత్త్వవిషయమున హిందూమతము మారిమారియేవచ్చుచున్నది. పుస్తకములను మాత్రము మార్ప వీలులేదు కాని, మనుష్యుల భావములును, విశ్వాసములును కలసియే యొక మతమగును. చైతన్యముగల మనుష్యసంఘపు మనస్సులోని తలపు లెట్లు మార్పాటు బొందునో, యట్లే వారిమతమును మారివచ్చు చున్నది. హిందూమతము మనుష్యునివృద్ధికి పూర్ణస్వాతంత్య్ర మిచ్చుచు వచ్చుచున్నది. ఎట్టి యడ్డమును లేక బుద్ధి నుప యోగించి పరిశోధనచేయు స్వాతంత్య్రము నిచ్చుటచే లోకములోని వేరుమత మేదియును హిందూమతముతో ఏవిధమునను పోల్ప వీలులేదు.

హిందువులు శాస్త్రములుగా గ్రహించిన పురాణములు, స్మృతులు మొదలగు తొల్లింటి గ్రంథములం దొక్కొక్క విషయము ప్రధానముగ నున్నది. తత్త్వమునకు పలుమొగము లున్నవి. ఒక్కొక్కముఖము, ఒక్కొక్కధర్మము, నారాధించుచున్నది. హిందూధర్మమును వృద్ధిపొందించుచు వచ్చిన ప్రాజ్ఞు లాయాకాలములందు కనిపెట్టిన సత్యముల నాయా కాలములందు వ్రాసియుంచిరి. పదివేల సంవత్సరములుగ హిందూధర్మము వృద్ధినొందుచు వచ్చినది. అది మిగుల

(ఇచట ఒక వాక్యము పీడీఎఫ్ లో లుప్తమైనది ) చున్నాము. దాని యొకకొమ్మవలె మరియొక కొమ్మలేదు. చూచుట కధికభేదములు కనబడును; కాని అన్నిటికి నొక్కడే జీవము. వ్యత్యాసములను చూచి భ్రమ చెందగూడదు.

భగవద్గీత యనునది హిందూమతమున నందరును నొప్పుకొని గౌరవించుగ్రంథము. దాని నన్ని సాంప్రదాయము లకు జెందినవారును శాస్త్రముగ నంగీకరించియున్నారు. ఈ భగవద్గీతనుండి రెండు ముఖ్యములైన విషయములవలన హిందూమతము క్రొత్తకళను పొందినదని చెప్పవచ్చును. ఒకటి, కేవలము యాగాదిక్రియలకు అనగా వైదికయజ్ఞ మార్గమునకు ప్రాధాన్యము నిచ్చునది. రెండవది త్యాగ మార్గ మొక్కటే మోక్షసాధన మను నభిప్రాయమును స్థిర పరచునది. జీవితమునకు కావలసిన కార్యములను చేసియే ధర్మమును నిలుపవచ్చునను సత్యమును గీత చక్కగా చాటు చున్నది. సంఘక్షేమమునకు వలసిన కార్యములను జేయుచుండ వలెననియు, ఆకార్యములలో వాడువాడు తన కేర్పాటు కాబడిన పనులను సరిగభగవత్ప్రీతిగ చేసినయెడల మోక్షమున కడ్డమేర్పడదనియు, అదియే కర్మబంధమునుండి విడబడుటకు మార్గమనియు గీత యొత్తి యుపదేశించుచున్నది.

ధర్మమార్గమున నిలుచువాడు తనకు సంఘములో నేమిపని యేర్పడియున్నదో దానిని చక్కగా జేయవలెను. తన స్వభావగుణముచేతనో, తానుపుట్టిన కులము, కుటుంబము, ఉన్నస్థానము మొదలగు కారణములచేతనో తన కేర్పడి యున్న కార్యములనెల్ల సరిగ జేయవలెను. కాని ఆకార్యము లచే తనకే సుఖమో, లాభమో, కలుగవలెనను నుద్దేశ ముతో చేయగూడదు. 'నాపనిని నేను చేయవలెను' అను తలపు తప్ప, మనస్సులో కార్యమునందు తనకు ఫలము కలుగవలెనను నాశ నుంచుకొనగూడదు. లాభముకోరి యితరులు చేయునట్లే కర్మయోగియు తాను చేయుకార్యము నెక్కువ యాసక్తితో జేయును. ఉదాసీనముగా నుండడు. ఇతరులవలె పైకికనబడిననులోపలకార్య ఫలమునకును నితనికిని మధ్య ఆశ యనుబంధములేకుండ ప్రత్యేకముగ పనిజేయును. స్వీయలాభమును కోరకపనులను చేయగనే కార్యము సిద్ధించినయెడల మరల మైమరచి, సిద్దింపనియెడల క్రుంగి పోవుట కలుగదు. కార్యమునందు కష్టములును, నడ్డములును నేర్పడినయెడల వానినెట్లో సహించుకొనవలె ననిమాత్రము యోచించి చేయునేగాని వానికొరకు దుఃఖపడి మనస్సునకు కలతనొందించుకొనడు. స్వార్థము నపేక్షించని వానికి శాంతము తనంతటతానే వచ్చును. సుఖమును, దుఃఖమును, జయమును, అపజయమును, అతనిని తాకజాలవు.

ఈవిధము ననుసరించి పనులనుజేయ నలవాటుపడిన సాధకుడు యోగమున పైకిపోవుటకు కావలసినమార్గములందు శక్తిని శీఘ్రముగా బొందును. అడుగడుగునకు బాగుగ చింతించుచు, మనస్సు నేకాగ్రము చేసి యింద్రియములను మనస్సును విషయములందు త్రిప్పక స్వాధీనమందుంచుకొని ధ్యానము చేయును. అట్టిధ్యానము చేయుటవలన జ్ఞానమును పొందును. ఆజ్ఞానమువలన నెల్లజీవులయందును తనయాత్మను చూచును. అంతయును భగవంతునిదివ్య విభూతి యందడగి నిలుచుటను గాంచును.

గీతలో జెప్పబడినమార్గము లోకవ్యవహారమును చేసికొనుచునే యది తన యాంతర్యమును మట్టుకు తాకకుండజేసికొను మార్గము. కార్యమును జేయక విడిచిపెట్టుట నిజమగు త్యాగము కానేరదు. కార్యములఫలములమీద నాశను విడుచుటయే త్యాగము. మోక్షమున కనగా విడుదలకుమార్గము కార్యప్రవృత్తులందు స్వార్థము నాలోచింపక యాత్మను విడి పించుకొనుటయే. ఆస్వార్థమునుండి మరలినపిదప నేకార్యము జేసినను నది యాత్మను కర్మబంధమున కట్టదు. ఇదియేగీతా సారము. ఇట్టి స్వార్థమును విడిచినయెడల జయాపజయము లందు మనస్సును త్రిప్పక, నిష్కామియై వాడువాడు తనతన పనిని చేసినయెడల, కర్మయోగ మార్గమునకును, సన్యాస మార్గమునకును గల వ్యత్యాసము తొలగిపోవును.


కిం కర్మకి మక ర్మేతి కవయో౽ప్యత్ర మోహితాః
తత్తే కర్మప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసే౽శుభాత్.

ఏది కర్మము, ఏది యకర్మము, అను విషయమున

పండితులును మోహము నొందియున్నారు. కావున నీకుకర్మ స్వభావమును దెలిపెదను. దీనిని దెలిసికొని యశుభమునుండి విడబడుదువు. 4-16


కర్మణ్య కర్మ యః ప శ్యే దకర్మణి చ కర్మయః
స బుద్ధి మాన్మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృత్.


చేసినదానియందు చేయకుండుటను, చేయనిదాని యందు చేయుటను నెవడు తెలిసికొనునో వాడేమనుష్యులలో బుద్ధిమంతుడు. ఎల్లపనులను జేయుచువచ్చినను వాడుయోగ మును బొందియున్నవాడు. 4-18


యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం త మాహుః పండితం బుధాః.


ఎవనిపనులన్నియు నాశనుండి విడబడియుండ, జ్ఞాన మనునగ్నిచే గాల్ప బడునో, వానిని పెద్దలు పండితుడని యందురు. 4-19


యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమ స్సిద్ధా వసిద్ధౌ చ కృత్వా పి న నిబధ్య తే.


అప్రయత్నముగ కలిగిన లాభమును గొని సంతో షము గలవాడై, దుఃఖము తెచ్చునవియు, సుఖమునిచ్చు నవియు నను భేదమునువిడిచి. కార్యసిద్ధి కలిగినను, కలుగ కున్నను, సమముగానిలిచిన వాడై మనస్సులో కొరతల కెడమీయనివాడై నిలుచువాడు కర్మమును జేసినను దానిచే కట్టుపడడు. 4-22


కర్మణ్యే వాధికార స్తే మాఫలేషు కదాచన
మా కర్మఫలహేతు ర్భూర్మాత్మే సంగో౽స్త్వకర్మణి.


కర్మమును జేయుటయందు మాత్రమే నీకధికారము. దానిఫలములం దెన్నడును నీకధికారములేదు. చేసినదానిఫల మును కోరకుము. కాని, కర్మమును చేయకుండుటయందు మనస్సును నిలుపకుము. 2-47


యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్యసిథ్యోస్స మోభూత్వా సమత్వంయోగ ఉచ్యతే.


యోగమునందు నిలిచి, సంగమునువిడిచి, కోరిక నెరవేరుటయు నెరవేరకుండుటయు నొక్కటేయని తలచి, పను లను చేయుము. ఈసమబుద్ధియే యోగమనబడును. 2-48