శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 12

వికీసోర్స్ నుండి

బాధ్యత ఎవరిదని తీర్మానించునది యాయా యాత్మలకర్మము. ఒక యింజనీరు తనకు తెలిసినమాదిరిగ, తన యిష్టమునుబట్టి యింటిని కట్టవచ్చును. కాని దానిలో నివసించువాడు అతను చేయుకర్మముల ననుసరించి ప్రవేశించును. ఒకడు తనయింటిని శిధిలపరుపవచ్చును. దానికి తగిన పేదవాడొకడు తరువాత దానికి వెలనిచ్చియో, బాడిగనిచ్చియో దాని ననుభవించు టకు రావచ్చును. అట్లే తండ్రి తనయొడలిని గుణములను చెరచుకొని తనకు పుట్టినపిల్లల దేహమును గుణమును మొదటినుండియు చెరుపవచ్చును. కాని యాదేహములకు దగినయాత్మ అతనికి పిల్లలుగ దేహము బొందగోరివచ్చును. ఔరసపుత్రుడనుట దేహమును పొందుటమట్టుకే. ఏయాత్మ కును ఏయాత్మయు కొడుకు కాడు. కర్మమునకు దగినట్లు దత్తపుత్త్రునివలె వచ్చి చేరువాడే కొడుకు. ఐనను ప్రకృతి శాస్త్రములలో చెప్పబడి మనయనుభవమున కానబడు పరంపరావిధియైన దేహధర్మము, కర్మవిధిని కొరతపరుప చాలదు.


(12)

ప్రకృతి, జీవుడు, పరమాత్మ.

(గీత: 7, 9, 13, 15 అధ్యాయములు).

ప్రపంచముననున్న ప్రాణములేని యన్నివస్తువులు, స్థావర, జంగమ ప్రాణుల దేహములు ప్రాణుల యింద్రియ మనోబుద్ధి సూక్ష్మములు మొదలగువాని కన్నిటికిని ప్రకృతి యనిపేరు. ఒక్కొక్కప్రాణిలోను యజమానిగానుండి దానిని నడిపించి దానిమూలమున విషయముల ననుభవించుచు వచ్చు వాడు జీవుడు. ఆప్రకృతి, జీవుడు ఈరెంటికిని వెనుక మరుగుపడి యుండి, నిలుకడలేక మారిమారి వచ్చు ప్రపంచమునంతటిని దాల్చి యొకనియమముతో పరిపాలించుచు మారుదలయు నాశమును లేనిపరమాత్మ కీశ్వరుడనియు, శ్రీమన్నారాయణు డనియు నింకను నెన్నోపేళ్ళున్నవి. 'వాడు' అనువాడు వస్తువునకు లోపల మరుగుపడి అడగియుండును; ఏప్రమాణ మునకును ప్రాణముగా నిలిచియుండును; ప్రత్యేకముగగూడ నిలిచియుండును.

జగత్తునియమముగురించి గీతలోని 7, 9, 13. 15 అధ్యాయములలో చెప్పబడియున్నది. వానిని దెలిపినమీదట వానియర్థము చెప్పబడుచున్నది. ముఖ్యములైన శ్లోకములు;


ప్రకృతిం పురుషంచైవ విద్ధ్యనాదీ ఉభావపి
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధిప్రకృతి సమ్భవాన్.


ప్రకృతి, పురుషుడు, ఈరెండును అనాదులని తెలియుము. రూపముయొక్క మార్పును, గుణములును ప్రకృతి

వస్తువులందుండునవని తెలియుము. 13-20


కార్యకారణ కర్తృ త్వే హేతుః ప్రకృతి రుచ్యతే
పురుషస్సుఖదుఃఖానాం భోక్తృ త్వే హేతు రుచ్య తే.


కార్యములకుగల హేతువు ప్రకృతివస్తువందురు. సుఖదుఃఖములు కలుగుటకు హేతువు పురుషుడందురు. 13-21


పురుషః ప్రకృతిస్థోహి భుంక్తేప్రకృతిజాన్ గుణాన్
కారణం గుణసంగో౽స్య సదసద్యోనిజన్మసు.


పురుషుడు ప్రకృతిలోనుండి ప్రకృతివలన పుట్టిన గుణముల ననుభవించుచుండును. గుణములలో నితనికుండు సంగమే ఇతడు మంచివియు, చెడ్డవియునగు జన్మముల నెత్తు టకు గారణమై యున్నది. 13-22


ద్వా విమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షరస్సర్వాణి భూతాని కూటస్థో౽క్షర ఉచ్యతే.


లోకములో క్షరము, అక్షరము అను రెండువిధముల తత్త్వములున్నవి. క్షరమనగా సర్వభూతములు; వానిలో మారకుండనుండు వస్తువక్షరము. 15-16


ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః
యోలోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.


పురుషుడనువాడు జీవుడు. ఉత్తమపురుషుడువేరు. అతడే పరమాత్మ యనబడువాడు. అతడు మూడులోకము లను నావరించి వానిని ధరించుచున్నాడు. అతడవ్యయుడు,

ఈశ్వరుడు. 15-17


యస్మాత్ క్షర మతీతో౽హ మక్షరాదపిచోత్తమః
అతో౽స్మిలోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః


నేను క్షరమునకు మించినవాడనై అక్షరముకంటె నుత్తముడనై యుండుటచేత లోకమునందును వేదమునందును పురుషో త్తముడని పొగడబడుచున్నాను. 15-18


భూమిరాపో౽ నలో వాయుఃఖం మనోబుద్ధి రేవ చ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా.


భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ యెనిమిది భేదములుగా నాప్రకృతి వేరు పడియున్నది. 7-4


అప రే౽యమిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మేపరామ్
జీవభూతాం మహాబాహో యయేదం ధార్య తేజగత్


ఇది నానికృష్టస్వరూపము. దీనినుండి వేరుపడి యున్న నాస్వరూపమును దెలిసికొనుము. అదే ప్రాణులకు ప్రాణ మనునది. దానిచేతనే నీలోకము ధరింప బడుచున్నది. 7-5


ఏత ద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయ స్తథా.


ఎల్లప్రాణులకును నది కారణమని తెలియుము. లోక మంతయు నావలన పుట్టుటయు, నాయందు లీనమై లేకుండ

బోవుటయు కలుగుచున్నది. 7-6


మత్తః పరతరం నాన్యత్కించి దస్తి ధనంజయ
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.


నన్ను మించియున్న వస్తువేదియులేదు. దారమునందు మణిగణములవలె నిదియంతయును నాయందు కూర్పబడి యున్నది. 7-7


రసో ౽ హమప్సు కౌంతేయప్రభా౽స్మి శశిసూర్యయోః
ప్రణవ స్సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు.


నీటిలోని రసము నేను. నేనే సూర్యచంద్రులలోని కాంతిని. అన్ని వేదములలోను నేను ప్రణవము. ఆకాశము లోనిశబ్దము నేను. మనుష్యులలో నేను పౌరుషమును. 7-8


పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావ సౌ
జీవనం సర్వభూ తేషు తపశ్చాస్మి తపస్విషు.


భూమియందలి గంధగుణమును, అగ్నిలోని తేజస్సును, అన్ని ప్రాణులలోని ప్రాణమును నేను, తపస్సుచేయువారి తపస్సు నేను. 7-9


బీజం మాం సర్వ భూతానాం విద్ధిపార్థ సనాతనం,
బుద్ధిర్బుద్ధి మతా మస్మి తేజ స్తే జస్వినామహం.


ఎల్లప్రాణులకును నేను సనాతనమైన బీజమని తెలియుము. బుద్ధిగలవారి బుద్ధిని నేను. కాంతిగలవారి కాంతిని

నేను. 7-10


బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం,
ధర్మా ౽విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ.


బలముగలవారిలో కామరాగములులేని బలమును నేను. ప్రాణులయందు ధర్మమునకువిరుద్ధము కాని కామమును నేను. 7-11


యేచైవ సాత్త్వికా భావారాజసా స్తామశాశ్చయే,
మత్త ఏవేతితా న్విద్ధి నత్వహం తేషు తేమయి.


సాత్త్విక, రాజస, తామస గుణములకు సంబంధించిన భావములెల్ల నానుండియే పుట్టును. వానిని నాయందుంచు కొందును. నేను వానియందుండను. 7-12


త్రిభిర్గుణ మయైర్భా వైరే భిస్సర్వ మిదం జగత్,
మోహితం నాభిజానాతి మా మేభ్యః పరమవ్యయం.


ఈమూడుగుణములుగా నున్న భావములతో ఈలోక మంతయు మోహమును బొంది వీనియన్నిటికి నతీతుడనై నాశరహితుడనైన నన్ను తెలిసికొనలేదు. 7-13


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్య యా,
మా మేవయే ప్రపద్యం తే మాయా మేతాం తరంతి తే.


గుణములచేత నొప్పుచున్న యీ నా దేవమాయను గడచుట కష్టము. నన్నే యెవరు శరణుచొత్తురో వారేయీ

మాయను గడువగలరు. 7-14


నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః
మూఢో౽యం నాభిజానాతిలోకోమామజ మవ్యయం.


యోగమాయచేత చుట్టబడి యుండుటవలన లోకము లో నెవరికిని కనబడను. ఈజ్ఞానములేని లోకులకు పుట్టుకయు నాశమును లేని నన్ను గూర్చి తెలియదు. 7-25


ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత
సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప.


ఇచ్ఛాద్వేషములచేత గలిగిన రెండు విధములగు మోహమువలనను నెల్లప్రాణులును లోకములో మోహము నకు వశమగుచున్నవి. 7-27


మయా తత మిదం సర్వం జగ దవ్యక్తమూర్తి నా
మత్స్థాని సర్వభూతాని నచాహం తే ష్వవస్థితః


అవ్యక్తమూర్తితో నే నీలోకమంతటను వ్యాపించి నిలుచుచున్నాను. నాలో భూతములన్నియు నెలకొనియున్నవి. నానెలవు వానిలో లేదు. 9-4


న చ మత్స్థాని భూతాని పశ్యమే యోగ మైశ్వరమ్
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః.


మరియొక విధముగ చూచినచో భూతములు నాలో నిలిచియుండలేదు. నా యీశ్వరయోగమును జూడుము. ప్రాణులను నేనే ధరించుచున్నాను. అయినను వాని నాశ్ర యించి యుండలేదు. ప్రాణులకుండిన ప్రత్యేకత్వమును నా వలననే కలుగుచున్నది. 9-5

ప్రకృతిధర్మముననుసరించి జగమంతయు నడచివచ్చుచున్నది. ఈప్రకృతి ధర్మమును భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు తెలిసికొని నిర్ధారణ చేసియున్నారు; ఇంకను చేయుచునే యున్నారు. అయినను నీప్రకృతిధర్మమెట్లున్నదో విజ్ఞాన శాస్త్రమున గానవచ్చుటలేదు. ఒకనిర్మాణము లేక యంత్రము లేక ప్రాణి దేహస్వరూపము, అంగములకూర్పు, గుణము, అవిచేయు కార్యవిధానము వీనిని పరిశోధించి నిశ్చయించి చెప్పుట విజ్ఞానశాస్త్రమునకును విషయము. ఆప్రకృతి నియమ మెట్లున్నదని తెలియుట కాశాస్త్రమునకు సాధ్యముకాదు. 'ప్రకృతివిధి' 'స్వభావనియమము' అనునప్పుడు స్వభావమును నొక ప్రత్యేకశక్తి యుండుననియు అది యేర్పరుచువిధిని భూతపదార్థము లనుసరించి వచ్చుచున్నవనియు చెప్పుట సరికాదు. మనము పరిశోధించి కనుగొనిన కూర్పునకు సంగ్రహముగా మనమొసగు పేరుమాత్రమే 'స్వభావము.' అట్టిపేరు పెట్టినంతమాత్రముననే మూలకారణమును చూచి గ్రహించినట్లుకాదు. ఒకపేరే కారణమైయుండదు. జ్వరము వచ్చినవానికి తలనొప్పియుండును. జ్వరము తలనొప్పిని కలి గించిన దందుము. 'కామిలరోగము కంటిని పచ్చగాచేసినది' అందుము. 'కామిల' అనునొక పిశాచమో, భూతమో, యా రీతిగా జేసినదని చెప్పుట సరికాదు. కలరాయో, ప్లేగు జ్వరమో, చాలామందిని చంపినవి అనునప్పుడు కలరా యను నొకరాక్షసుడు, లేదా ప్లేగుఅను నొకయసురు డిందరు మనుష్యులను తనకెరగా జేసికొన్నాడని చెప్పుట సరికాదు. అదిమనముచూచినవిషయములనుసంగ్రహముగా చెప్పువిధమే తప్ప, కార్యమునకు కారణమునుచూచి గ్రహించు విధము కాదు. ఇట్లే ఒకదానినిగూర్చి యిది ప్రకృతివిధి యనిన, కారణమును జూచి గ్రహించితిమనుటకాదు. ప్రకృతిధర్మమనునదియు, ఈశ్వరసంకల్పమనునదియు నొక్కటే. ఈశ్వర సంకల్పముననే ప్రకృతివిధి యేర్పడియుండును. ఈశ్వరుడున్నాడని యనుకొందమన్న ప్రకృతివిధి నాతడు సంకల్ప ముగా నేర్పాటుచేసికొని యుండవలెను.

మనవేడుకకు లేక సంతోషమున కీశ్వరుడు తన సంకల్పమును మార్చుకొనడు. స్వభావనియతి యనునది యతని సంకల్పము. అది దినదినమును మారిమారి అనగా ఒకనాడుండినది మరునాడుండక వ్యవస్థలేకయే, లోకమును నడిపించుటను చూచుచున్న కారణము చేతనే ఈశ్వరుడను నొక చేతనాశక్తి యున్నదని ఒప్పుకొనవలయు నని వాధించుట మూఢత్వము. ఈమౌర్ఖ్యముచేతనే యాస్తి కతకాధారముగా వేనినైన నాశ్చర్యకరములగు సంభవములనే కొన్నిమతములవారు వెదకికొనిచున్నారు. సాధారణముగ మనము దినదినమును చూచు ప్రకృతిధర్మమే పెద్ద యాశ్చ ర్యము. అదియే చాలు నీశ్వరునియందు భక్తి కాధారమును కల్పించుటకు. నేడు సూర్యుడుదయించి యస్తమించి, రేపు తిరిగి ఉదయింపకుండినను,అదియు బ్రకృతిధర్మములో చేరునే కాని, యది మాత్రము ప్రత్యేకముగా యాస్తిక నిదర్శనము కాజాలదు. వానయు, మెరుపును, గాలియు, భూకంపమును నొక్కొక్కసమయమున నియమము తప్పివచ్చును. ఒకనాడుండువిధము మరునాడు లేదు. దానిని చూచి తృప్తిపడుదుమా? ఏదియైనను, ఏవిధమున కనబడినను, వానికన్నిటికిని కలిపి యొక్కటే పేరిచ్చుచున్నాము. 'ప్రకృతి' లేక 'స్వభా వము' అని. కావున నున్నపాటున క్రొత్తగా నియమమును తప్పినడచినయెడల నొక లాభమును లేదు. నియమమనునది పుస్తకములో వ్రాయబడి యున్నదికాదు. ఇదివరకు లేని యొక క్రొత్తదానిని చూచినను నదికూడ ప్రకృతి నియమములోనే చేరును.

ఈశ్వరుని సంకల్పము తాను కనబడక, మరుగుననుండి, సకలమును కారణకార్యరూపమున నడిపించుచుండుటయే. దీనినే పైగీతాశ్లోకములలోని తుదిరెండు శ్లోకములు చెప్పుచున్నవి. 'మరుగుపడి యున్నా డీశ్వరుడు' అనుదాని తత్త్వమేమి? ఏతత్త్వమును పరీక్షచేయుచున్నామో దానిలో పరిశోధన చేయుచున్న మన మిమిడి యున్నాము. పరిశోధన చేయబడిన విషయములో మనమును మనబుద్ధియు చేరి యుండనందున యీ అదృశ్యత ఏర్పడుచున్నది.

ఒకగారడివాడొక కొలనిని సృష్టిచేసి, దానిలో చేప లుండునట్లు చేయుచున్నాడని యనుకొందము. చల్లని నీటిలో నున్న చేపలా కొలనిని స్వాభావికసృష్టిగనే యెంచును. ఆహారమును సంపాదించుకొని, యొక యాశ్చర్యమును బొందక, తమజీవితమును వ్యాపారమును సాగించుచుండును. గారడివానిచేత సృష్టింపబడినవానిబుద్ధికి, గారడివాని యునికియు సంకల్పమును దెలియదు. ఉన్నపాటున నతడా కొలని నీటిని వేడినీళ్లుగచేసి, చేపలకు దుఃఖము నేర్పాటు చేసిననుగూడ చేపలు దాని కొక కారణమును చూచుకొని శాంతినొందును, లేదా చచ్చును. అంతే. గారడివాడు బయ టికి కనబడడు. లేదా, వేడినీటిలో కూడ ఆచేపలు జీవించి యుండుటకు గారడి వాడేమిచేసినను, వారిలో విజ్ఞాన శాస్త్ర జ్ఞులై పరిశోధనచేయుచేపలు తమ స్వభావవిధిని పుస్తకము లలో వ్రాయుదురు. ఇట్లే యీశ్వరుడును మరుగుననుండి నిలిచియున్నాడు.

అంతయును నీశ్వరనియమమునకు లోబడి నిలిచియున్నను, కారణకార్యసంబంధమున నున్న గొప్ప స్వాతంత్య్రము మన మనుభవించు చున్నాము. కారణమునకును కార్యమునకును నేర్పడియున్న మార్పులేని బంధమొకప్రక్క మనకున్నను, అదే మనకు కర్మస్వాతంత్య్రమును తెచ్చుచున్నది.

జగత్సష్టియు, స్థితియు నీశ్వరునినుండియే వచ్చును. ప్రకృతి యనునదతని పనిముట్టు అని క్రిందచూపిన శ్లోక ములు తెలుపుచున్నది.


యథా౽కాశ స్థితో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్
తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ.


అన్ని చోట్లను వీచుటకు మహాబలముగల గాలి ఎట్లె ప్పుడును నాకాశమున నెలకొని యున్నదో, అట్లే భూతము లన్నియు నాలో నెలకొనియున్నవని తెలిసికొనుము. 9-6


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః
భూతగ్రామ మిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్.


నాకు లోబడిన ప్రకృతియందు నిలిచి మరల మరల భూత సంఘమునంతటిని స్వభావబలముచేత నుండునట్లు చేసెదను. 9-8


మయా౽ధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్
హేతునా౽నేన కౌంతేయ జగద్వి పరివర్తతే.


నాయధ్యక్షత్వమున ప్రకృతి చరాచరలోకములను సృష్టించును. ఈహేతువుచేత లోకము చుట్టిచుట్టి తిరుగు

చున్నది. 9-10


అహం క్రతురహం యజ్ఞ స్స్వధా౽హ మహమౌషధమ్
మన్త్రో౽హమహమే వాజ్యమహమగ్ని రహంహుతం.


నేను క్రతువు, నేను యజ్ఞము, నేను పితరులకిచ్చు పిండము, నేను ఔషధము, నేను మంత్రము, నే నాజ్యము, నే నగ్ని నేను హవిస్సు. 9-16


పితా౽హమన్య జగతో మాతా ధాతా పితామహః
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజు రేవచ.


ఈ జగమునకు తండ్రిని నేను, తల్లిని నేను, దీనిని తాల్చువాడను నేను, నేనే పితామహుడను, తెలియదగిన తత్త్వము నేను, పవిత్రముచేయువాడను నేను, ఓంకారము నేను, ఋక్ సామయజుస్సులును నేను. 9-17


గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్
ప్రభవః ప్రలయఃస్థానం నిథానం బీజ మవ్యయం.


ఈలోకపుగతినేను, భర్తనునేను, ప్రభువు, సాక్షి, నెలవు, శరణము, తోడునునేను. దీని పుటుక, స్థితి, వాసము, నాశములేని బీజమును నేను. 9-18


తపా మ్యహ మహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామి చ
అమృతం చైవ మృత్యుశ్చ స దస చ్చాహ మర్జున.


నేను వేడిని తెత్తును. వర్షమును నిలుపుటయు విడుచు టయు నేనేచేయుచున్నాను. నేనే అమృతము, నేనే మర ణము. ఉండువాడను నేను; లేనివాడను నేను. 9-19