Jump to content

శృంగార సావిత్రి/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీః

శృంగార సావిత్రి

ప్రథమాశ్వాసము

అవధరింపుము పాండవేయాగ్రజునకు
నవలికథయందుఁ గల్గువృత్తాంత మెల్ల
నానుపూర్విగఁ దెల్ప నమ్మౌనిచంద్రుఁ
డింపుపలుకుల మై పులకింపుచుండ.


గీ.

మద్రదేశాధినాథుఁ డమ్మాడ్కి నుగ్ర
తపముఁ జేయుచు నుండఁగ ధరణినాథ,
స్వర్గమునఁ గొన్నివింతలు చాలఁ బొడమె
విన్నవించెద నవి యెల్ల విస్తరించి.


మ.

అఱువైయేవురువేలుపుంగలుకు లొయ్యారంబుగాఁ గుల్కఁగా
వరుసన్ ముప్పదిమూఁడుకోట్లుసురలున్ వర్ణింపుచుం గొల్వఁగా

స్థిరవాక్యంబుల నారదాదిమును లాశీర్వాదముల్ సేయఁగా
నెఱనీ టై యలపాకశాసనుఁడు దా నిండోలగం బుండఁగన్.


సీ.

ఎదురైనచోఁ బౌరు లేమియే మని వేఁడ
                 మఱియేమి లే వన్ని మంచి వనుచు
నయ్యకుఁ బైన మౌ నని జయంతుఁడు వేఁడ
                 విన్నవించెద నంత కున్న దనుచు
నన్న మా కేమంటి వనుచు మేనక వేఁడ
                 నీదాఁక వచ్చెనే నిలువు మనుచు
వాఁకిటికొల్వు లెవ్వఁడ వంచుఁ దను నాఁగఁ
                 గన్నఁ గానరె యంచుఁ గదుముకొనుచు
నిలువ కెవ్వరిఁ జూడక తెలివి లేక
యించుకించుక దగ వగరించుకొనుచుఁ
బాకశాసనుహుజురునందాఁక నొకటఁ
జారుఁ డొక్కఁడు బిఱబిఱఁ బాఱుతెంచి.


గీ.

స్వామి, యవధారు దేవతాసార్వభౌమ,
స్వర్గసింహాసనాధ్యక్ష, వసుధ నున్న

బదరికాశ్రమమందుండి యిదిగొ యిపుడు
వెడలి వచ్చితి నొకవార్త విన్నవింప.


గీ.

గాలి చొరరాకయున్న యక్కాననమున
నొక్కనృపుఁ డెవ్వఁడో కాని యుగ్రతపము
సేయఁ గూర్చుండె నాతపస్స్థితికి నాక
వనము నీఱయ్యెఁ గువలయం బనువుదప్పె.


సీ.

ఏమి కావలె నంచు నెదుటఁ దోఁచి విధాత
                 యెంత వేడిన వచియింపఁ డయ్యె
వరము లిచ్చెద నంచు హరి మ్రోల వేంచేసి
                 లె మ్మన్న నింత చలింపఁ డయ్యె
ఫల మొసంగితి నంచు భవుఁడు ప్రత్యక్ష మై
                 మొనసినఁ జే యెత్తి మ్రొక్కఁడయ్యె
చాలు మెచ్చితి నంచు శాంభవి యటు నిల్చి
                 చేయి చూపినను వీక్షింపఁ డయ్యె
విబుధకులనాథ, తపము నా వినమొ కనమొ
నాటితరమైన తపముచందంబు గాదు
తెలియఁ గోరిక యెద్దియో తేటవడదు
వింత యై తోచె నేమని విన్నవింతు.

క.

అన విని యేమేమీ యని
పని యిది బా గాయే నని తపంబులవింతల్
ఘన మాయె నని సురోత్తముఁ
డనియెన్ దనయంతరంగ మవియం గలఁకన్.


ఉ.

సమ్మతి మిమ్ము నమ్మి తగుచారు లటంచును వేగుపంపి నే
నెమ్మది నుంటి నేమనుచు నేఁ డెఱిగింపఁగ వచ్చి తీవు వాఁ
డెమ్మెయి నుండు నేపదవి కెవ్వరిఁగూఱిచి యేతపంబు భా
వమ్మునఁ జేయఁబూనె నొకవార్తయుఁ దెల్పవు పోలుపొందుగన్.


క.

అని ముందు వెనుక తోచక
మనమునఁ గళవళము దోఁప మన కిఁకమీదన్
బని యే మని తను వేఁడిన
మునుపుగఁ దలపోసి వినయమున గురు డనియెన్.


గీ.

ఓసురాధినాథ, యోజింప నేటికి
వానితపముపెంపు వానితెంపు

తెలియ విన్నయపుడె తెల్లమిగాఁ దోఁచె
నింతతపము సేయ నెవ్వఁ డోపు?


క.

విశ్వామిత్రుఁడు గావలె
శాశ్వతసామ్రాజ్యపూజ్యసంపన్నిధి యా
నశ్వపతినృపతి గావలె
నీశ్వరునకు వశమె తపము లీవిధిఁ జేయన్.


గీ.

కౌశికుఁడు గాఁడు నేఁడు నాకడకు వచ్చి
మేనకకు దానుఁ గుజరాతిమేలికోపు
లెత్తి చేరువ వేసితి నింతసేపు
సాముచూడంగ రమ్మని చలము సేసె.


ఉ.

కావున మద్రదేశజనకాంతుఁడ కావలెఁ గాక యున్నచో
నీవును నే నెఱుంగ ధరణీపతి కెవ్వని కింతసాత్త్విక
శ్రీ విలసిల్లఁగాఁ దపము సేయ సమర్థత గల్గు నందుపై
దేవరచిత్త మేక్రియఁ బ్రతిక్రియఁ జేసెదొ చేయు మంచనన్.

క.

మంచిది యని నికటతట
ప్రాంచచ్చంచలదృగాననాంబుజములపై
నించునలతేఁటిదాఁటుల
నెంచం దగుచూపు లించుకించుక నిగుడన్.


ఉ.

అందఱిఁ బాఱఁజూచి యమరాధిపుఁ డిందఱిలోన నెవ్వ రా
టందును బాటయందుఁ జదువందును మించిన జాణ లట్టివా
రందుకొనుండు వీఁడె మన నందఱు మోములు చూచుకొంచు నీ
వందుము నీవ యందుకొనుమందు రెటుం జెయి చాఁప రెవ్వరున్.


గీ.

అటు లిటులు చూచి వారిత్రొక్కటలు సూచి
యెన్నఁటికి నాటపాటలవన్నె లనుచుఁ
గంకణఝణంఝణధ్వనుల్ గ్రమ్ముకొనఁగ
నిగిడి మేనక కేల్ దోయి మొగిచి నిలువ.


శా.

ఔనే మేనక , వన్నెఁ దెచ్చితివి విశ్వామిత్రజాగ్రత్తపో

హానిం జేసినదాని కెంతపని నీ వాపాటచే నాటచే
నానం బూనక యున్న నొండొరులచే నౌనే నినున్ మాన కా
మౌనుల్ నీనునుమోవిపానకములన్ మైవెంతు రెల్లప్పుడున్.


క.

తలవంపు లాయె రంభకు
నల తారకు మోము తెల్ల నాయెను మిగులన్
గళ దఱిగెను శశిరేఖకుఁ
గలికీ, నినుఁ జూచి విడెముఁ గైకొను మింకన్.


క.

కంతుని వసంతు రజనీ
కాంతునిఁ బవమానశుకపికప్రకరములన్
గొంతసహాయము సేసెదఁ
గాంతా, పని గొమ్ము పొమ్ము క్రమ్మఱు మంచున్.


గీ.

ఉడుగరయుఁ గొన్నిసొమ్ములు విడె మొసంగి
పసుపుపావడ పైఁడందె పచ్చపూలు
గెలిచివచ్చిన నొసఁగెదఁ బలుకు లేల
యతివ, యిది మాటవాసి పొమ్మంచుఁ బనుప.

చ.

తొలఁకెడుచిన్నిలేనగవుతోఁ గరతోయజముల్ మొగిడ్చి ము
ద్దులనునుఁజెక్కుటద్దములతోఁ గళతో మరుఁ డెత్తు పువ్వుగు
త్తులవలె నున్న చన్నుఁగవతో వగతో విడఁబాటు నీటు రీ
తులఁ దగుచూపుక్రొందళుకుతోఁ జెలితోఁ దిరిగెన్ గిఱుక్కనన్.


క.

ఇరుగెడల నూడిగంపుం
దెఱవలు మరుఁ డెక్కుపువ్వుఁదేరులవలెఁ జన్
గిరుల నిడుముత్తెసరులన్
విరులం దగుజడలు మెఱయ వెంబడి నడవన్.


గీ.

తురగముల నెక్కి మధుఁడుఁ జందురుఁడు దెరల
మదపుటేనుఁగుపైఁ బవమానుఁ డరుగఁ
దనబలముతోడఁ బారియందలములోనఁ
గమ్మవిలుకాఁడు రా మేనకావధూటి.


క.

తానును దనచెలికత్తెలుఁ
బూనుకొని విమాన మెక్కబోవఁగ నిలు మో

మేనక, యని కౌశికముని
తో నరిగెన్ బొజ్జ గదల దోవతి వదలన్.


గీ.

అరిగి పయ్యెదకొంగు చే నదిమి పట్టి
యెట్టు వచ్చితి నని బుస గొట్టుకొనుచు
నలుక నేమేమొ యనఁ బోయి యంతలోన
నతివనగుమోముఁ జూచి దీనతను బలికె.


సీ.

ఇంతి, నీ వేవేళ నేమి గావలె నన్నఁ
                 దప మెల్లఁ జెఱిపి నీతలఁపుఁ దీర్తు
నెలఁత, నీ వొరుఁ గూడి నేఁడు గూడ దటన్నఁ
                 బాఱి చుట్టుదు నీదుపడుకయిల్లు
వనిత, నీపడుచుల కెన లేనికోపుల
                 చేరున వేసి మెచ్చింతు నిన్న
కలికి, ని న్నెవ్వరుగా దన్న వారితో
                 జే సాఁచి జగడముల్ సేయఁ జొత్తు
నింత దయవాఁడ నగుటచే నెంత కైన
బూని పెద్దతనం బెల్ల బూదిఁ గలిపి
జపతపంబులు విడనాడి జడుఁడ నైతి
[1]వెలఁదికడ నీరు గానైతి వెఱ్ఱి నైతి.

ఉ.

అక్కట! నీవు నన్ను విడనాడి చనం బద మెట్టులాడె? నే
నెక్కడ నిల్తు; నిల్చి మఱి యెవ్వరిఁ జూతును; చూచి ప్రాణ మే
నిక్కము గాఁగ నేకరణి నిల్పుదు; నిల్పిన లాభ మేమి? నీ
వక్కఱ కైనదాన వని హా! మది నమ్మితి దేహ మమ్మితిన్.


చ.

ఒకరికిఁ గాకపోతి నని యుస్సురు మం చన నింత యేల నే
నొక టని నీవు నొక్క టని యున్నదె దేహము నీయధీన మం
చొకవగ పావురాపలుకు లొయ్యఁ జెవిం జొరఁ జేసి ఱొమ్ము ఱొ
మ్మొకటఁ గదించి చన్నుఁగవ నొత్తి చుఱుక్కన మోవి నొక్కుచున్.


గీ.

వంత విడు నేఁడు రే పట వత్తు ననుచుఁ
గొంత లాలించి తేలించి కుస్తరించి

మునిజనవిరించి మరలించి ముదము గాంచి
మేన బోటులుఁ దాను విమాన మెక్క.


చ.

మదనుఁడు తోడు రాఁగఁ బవమానుఁడు ముంగలఁ బోవఁ జంద్రుడున్
బదరక యింత నంతఁ బయిపాటున క్రమ్ముక రా వసంతుఁ డా
మదశుకశారికాపికసమాజముతో నెలగోలు గాఁగఁ బో
నదె యిదె యంచు నాబదరికాశ్రమభూమికిఁ జేరి రయ్యెడన్.


క.

ఒకగుజ్జుమావిక్రిందను
మకరాంకునితోడఁ దాను మంతనముగ మే
నక కొంతసేపు యోజన
ప్రకటించి, దృఢీకరించి, పచరించి వెసన్.


గీ.

చెలియ కైదండ గొని లేచి బలము నీవు
నిలిచి రమ్మని మరుని కన్గీటి బోటి
తానుఁ దనమేళమును గూడి తపసిపల్లె
నల్లనల్లనఁ జేరఁ బో నాడ నాడ.

.

సీ.

అల దేవపూజకై యగ్రోదకంబులు
                 గొనివచ్చు నేనుఁగుగుంపుఁ జూచి
మొనసి పార్థివలింగమునకు మెత్తనిమృత్తి
                 కలు మోచిచను పందికదుపుఁ జూచి
హరిసమర్పణకు నై పరిపశ్వఫలరాజి
                 వెసఁ దెచ్చుభల్లూకవితతిఁ జూచి
గుమిగూడి శివపూజకొఱకు దూర్వాంకుర
                 మ్ములు దెచ్చు లేఁటిపిల్లలను జూచి
వెఱచి తల యూఁచి యౌర యీవింతవగలు
కన్నవిన్నవి గావు లోకంబునందు
న న్నిచట నేమిగాఁ జేయనున్నవాఁడొ
దేవుఁ డిఁక నేఁటి కని మేనకావధూటి.


క.

అటచని ముందటం గనె నా
వటమగు నొకవటముక్రింద వాడినయెడలున్
గటిదాఁక వ్రేలుజడలున్
జిటిలినమైబూదిపొడలు చెలు వగుతపసిన్.


క.

పొడగని గడగడ వడకుచుఁ
గుడియెడమల మెలఁగుపడఁతిగుంపులఁ గేలన్

.

గడ కనిచి నిలిచి యించుక
తడవు విలోకించి యిది గదా తపమన్నన్.


ఉ.

మౌనము ఱొమ్ములోనిబిగు(మానము నందపుమేనినిగ్గు) సి
గ్గూనినమోము మై కదలకుండు దృఢం బరమోడ్పుఁగన్ను లౌ
రా! నుతియింపఁగా వశమె రాజకుమారకుఁ డౌట నంత ము
ద్దైనతపంబు చేసెడి నయారె యొయారము (మీఱనీవిధిన్.)


సీ.

సొగసైన నామోముఁ జూడఁగల్గినఁ జాలు
                 గలువఱేఁ డున్నాఁడు కడమ కెల్ల
నునుదావియూర్పు మూర్కొనఁగల్గినను జాలుఁ
                 బవమానుఁ డున్నవాఁ డవలి కెల్ల
గఱకుచూపు లెఱుంగఁగల్గినఁ జాలును
                 గొనితూపు లున్నవి కొదవ కెల్లఁ
నింపుఁబల్కుల నాలకింపఁగల్గినఁ జాలు
                 జిలుకచా లున్నది వెలితి కెల్ల

ననుచుఁ దలపోసి తత్తరంబును దలంకు
నయము వినయంబు దోఁపఁ బంతంబు చూప
సమయ మని వారివారి హెచ్చరిక నునిచి
ముకుళితాంజలి యై మౌనిమ్రోల నిలిచి.


క.

ఆటల పాటల మాటల
తేటల నీటులను వగకుఁ దేలేక వితా
పా టాయెఁ జెవిటిముందటఁ
జాటించుచు సంకుపట్టు చందం బయ్యెన్.


మ.

(అనువొందన్ మునుముంద గుబ్బచను) లొయ్యారంబుగా గోళ్లచేఁ
గొని పో మీటుచు ముత్తెపున్ సరుల చిక్కుల్ చక్కఁగాఁ దీర్చుకొం
చు నునుంజెక్కునఁ జేయి సేర్చి మొగమచ్చో వాంచి పాదాంగుళం
బున (నేలన్ విలిఖించు చాతపసి) మో
మున్ దీనతన్ జూడఁగన్.


ఉ.

అంతట దైవయత్నమున నమ్ముని ఱెప్ప లొకింత విచ్చి గో

రంత ప్రపంచముం గనిననంతఁ దళుక్కనఁ దోఁచె మేనకా
కాంత పసిండిమేను గలకాం(చిరవంబుని మేనివల్పు దా)
నంత వడిన్ ఘటించుతప మాకరణిం ఫలియించెనో యనన్.


క.

మగనీటా నగుబాటా
మొగమోటా లేక తపసి మురిపపునవలా
నగుచినెనేలు బిగిచన్నులు
జిగికన్నులు(నరసి మురిసి జిలజిలఁ బడియెన్.)


ఉ.

పెల్లుగ గండుతుమ్మెదలపిండులు మ్రోసెను తూరిశారికల్
గొల్లనఁ గేక వేసె నల కోయిలగుంపులుఁ గూసెఁ జల్లనై
మెల్లన మందమారుతము మీఁదికి డాసెను (మాటిమాటికిన్)
గొల్లలుగాఁ దపస్వి విరిగోలల సేసెను మారుఁ డయ్యెడన్.

క.

వెడవిలుతుం డప్పఁడతుక
కుడియెడమల బెళకి చూచు కులుకుంజూపుల్
విడి సురియలు గాఁ గొని ముని
పడెఁ బొడుఁడని(యానసైన్యపటలికి నొసగెన్.}


ఉ.

క్రుమ్ముల సొమ్మసిల్లి నృపకుంజరమౌని యొకింతలోన ధై
ర్యమ్మున సేద దేరి వినయంబున మ్రొక్కి నుతించువేలుపుం
గొమ్మను జూచి యోకులుకుగుబ్బెత, యెవ్వరిదాన వీవు నీ
(విమ్మెయి నన్ను నొంచుటకు నేమికతం బెఱుఁగింపుమం చనన్.)


గీ.

కొప్పు చక్కంగ నొత్తి ముంగురులు దువ్వి
జాఱుపయ్యెద సవరించి జగ్గు మించి
మెఱుఁగుకములు తళుకుముంగరయుఁ గదల
మొలకచిఱునవ్వు గులుక నా (కలికి పలికె.)


ఉ.

ఓమునిరాజచంద్ర జగదున్నతసన్నుతకీర్తిసాంద్ర యె

నే మని పేరు నేనె వచియింపుదు మేనక యందు రందఱున్
శ్రీమహనీయుఁ డైనసురశేఖరుకొల్వున నున్న బోగపుం
దామరసాక్షులం బిరుదు దాల్చినదాన జగం బెఱుంగఁగన్.


సీ.

నలువ దా నెక్కునందల మంపి పిలిపించి
                 వీణియ నాచేత విన్నమాట
హరుఁడు నే వినిపించుదురుపదానకు మెచ్చి
                 తొడమీఁదఁ గూర్చుండు మనినమాట
హరి పిల్చి నాచేత నభినయంబును జూచి
                 తనయొద్దఁ గొలువుండు మనినమాట
నారదపర్వతుల్ పోరి తన్ లయకోస
                 మై తారతమ్యంబు లడుగుమాట
మున్ను వినియుందురే కదా నన్ను నేనె
పొగడుకో రాదు గాక యోపుణ్యమూర్తి,
యమరనాథుహుజూరుపాత్రముల కెల్ల
గుండెలో గాల మనిపించుకొంటి నేను.

క.

వెంబడి నాపయి మాత్స
గ్యంబులు పెరుఁగంగఁ గూడి రంభాదిసతుల్
తుంబురునిం బిలిపించిన
తంబుఱయును దాను నతిముదంబున వచ్చెన్.


ఉ.

వచ్చిన నచ్చరల్ వడిగ వానికి బోధన సేసి కొల్వునం
దెచ్చి ప్రతిష్ఠ గా నిడిన దేవర, యే మని విన్నవించెదన్
ముచ్చట దీర రక్తిగొన ముద్దులు గుల్కఁగ గోటివాద్య మే
యొచ్చెము లేకయుండ మఱియున్ మఱియున్ వినిపించే వింతగన్.


చ.

ఘనమును రక్తియుం దొలఁకఁగాఁ దగుగీతములుం బ్రబంధముల్
మునుపుగ రాగముల్ పదములుం బయిమీటు(ఱు)పొలంబుఁ దెచ్చుచో
మనమున మెత్తుఁ గాని యొకమాటును నేఁ దల యూఁచ నైతి వెం

టనె మఱి మాట మాట జగడంబు ఘటించెను నాకు వానికిన్.


క.

నీ వెంతని నీ వెంతని
దేవేంద్రునిసముఖమందుఁ దీరనిపో రై
యావేళఁ బులిమి పుచ్చుక
నే వచ్చితి నాదువెంటనే తుంబురుఁడున్.


ఉ.

ఇంటికి వచ్చి యొంటిఁ బడకింటను నన్నుఁ గవుంగిలించి నీ
వంటిరసజ్ఞురాలిని దివంబునఁ గాన నిఁకేల నన్ను నీ
బంటుగ నేలుకొమ్మనుచుఁ బైఁ బడె బైపయి నున్నదాన నై
యుంటను నేనునుం దగిలియుంటిని జంటగఁ గూడి వానితోన్.


క.

గాయకుఁ డౌటను రతులం
గాయకుఁడై మిగులఁ గళలు కరఁగించుచు నా
కాయం బెల్లను దనకడ
కాయంబుగఁ జేసికొనియె నది యేమందున్.

ఉ.

వలపుల కేమి ముం దెఱుఁగువారికి నూరికిఁ గాకపోతి ర
చ్చలఁ బడి మేలువాఁ డనఁగఁజాలినకౌశికమౌనితోఁ గడున్
బలుకనె సైఁచదాయె నట పల్మఱు చూచి సహించలేక పై
నలుగుచు మండి మండిపడి యమ్ముని యూఁదక వాదు కిట్లనెన్.


ఉ.

ఓసి దురాత్మురాల, తప మూరకె బూడిదపాలు చేసి
వాసము చేరి నిల్చి యొకవన్నెకుఁ గాకపోతి నీ
దోసము గాదు నీకుఁ గల తుంబురుపొం గణఁగింపకున్న నీ
దోసమే కాక యం చలుకతో నొకతోయము గాఁగఁ జూచుచున్.


గీ.

నేడు మొదలుగ నెవ్వనితోడనైనఁ
బలికితేనియుఁ బ్రాణాన కలుగువాఁడఁ

గాక యొకఁడు వహించుకోఁ గలిగెనేని
యెన్ను మాబ్రహ్మ నైన నిట్టట్టు సేతు.


క.

అనుమాటలు సవసవగా
విసెనో వినలేదో యంత వీథులలోనన్
జన వెఱచి యొదుగసాగెన్
బనివడి తుంబురుడు దొంగబంటుంబోలెన్.


సీ.

ముచ్చటకైనఁ దుంబురుఁడంచుఁ బేర్కొన్న
                 గినుక నాఁటికిఁ బ్రాణమునకె తెగును
తంబుఱ గోటివాద్య మొకింత విను మన్న
                 నిల్లెల్ల బెదరంగ గల్లురు మను
నుబుసుపోకలకు నై యుస్సురుమనరాదు
                 దయ యంచు నాఁ డనర్థంబు సేయుఁ
బాటించి విరహంబు పదము పాడఁగ రాదు
                 తీరనిపోరు నల్ తిండి సేయు
గడియసే పింద్రుకొలువునఁ దడయరాదు
చెట్టపట్టుక బాసలు సేయు మనును
కంటికిత వైనవారితోఁ గలయకుండ
నొంటి మఱి కాఁపురానకు నుండవలసె.

.

గీ.

పోటుబంటులు కోటానకోటు లొకటఁ
గ్రందుకొని సందడిలు నాదుమందిరమునఁ
బామువలె మౌని యెన్నఁడు పాదుకొనియె
నది మొదల్ పోతుటీఁగయు మెదలదయ్యె.


మ.

ఒకనాఁ డాబలభేదికొల్వునకుఁ దా నొంటిం జనం ద్రోవఁ గా
చుక పొం చుండినతుంబురుండు సవగా సూచించినం జూచి యిం
చుకసే పూరక బెండుబొమ్మక్రియ నచ్చో జబ్బుగా నిల్చి ని
ల్వక పై వాలితిఁ గ్రాఁగి యున్నతనువెల్లం జల్లనై జుమ్మనన్.


ఉ.

వాఁడును గౌఁగిలించుకొని వాడినమో మెద మోపి కొప్పునం
గూడఁగ ముంగురుల్ గొనబుగోళ్ళను దువ్వుచు నామనం బిఁకం
జూడఁ గరంగుచున్న దనుచుం గరముం దనఱొమ్ము సేర్చి మ

ల్లాడుచు నెంత చేసె ముని హాయని నా కనియెం బ్రియంబుగన్.


ఉ.

మేనక నిన్నుఁ బాసి యిఁక మే నకటా నిలుపంగఁజాల నన్
గానక నీవు తాళ వటు గాన కడున్ సొగసైనవేడుకన్
మానక యుండకుండ మానకరుం డగుదుష్టమౌని కో
పాన కడంగి నీపెదవిపానకముం జవి చూపి తెంతయున్.


సీ.

సత్యసంధుని హరిశ్చంద్రునంతటివాని
                 మాలను గొలిపించుమంకు గాఁడె
నారదమౌనియంతటివానిఁ జెలిచేసి
                 బిడ్డలఁ గనిపించుపెంకె గాఁడె
తనుఁ గన్న బ్రహ్మయంతటివాని సృష్టికి
                 బ్రతిసృష్టి కల్పించుభ్రష్టు గాఁడె
యిదిగొ యీయున్నదేవేంద్రునంతటివాని
                 దూఱు సేయ ఘటించుద్రోహి గాఁడె

రాచపు ట్టనుపేరుమాత్రంబ కాక
సమయమున దుష్టమాంసము సాగమెసవు
నీవు విడిచిన వాఁడు నిన్ విడువఁ డింక
వానిపే రైన నుడువండు వాసవుండు.


క.

నను వలసియున్న గాధే
యుని నేస్తము విడువవలసియున్నను నీకున్
వినిపింతు నొకయుపాయము
వనితా, కడ తొలఁగియుండవలెఁ బదిపూటల్.


చ.

తొడిబడి యేడ కేగినను దోడనె వాఁడును రాకపోవఁ డె
య్యెడఁ జనియున్న నిన్ను వహియించుకొనం గలవానిఁ గాన మా
పుడమి భరించునశ్వపతిపొంతకుఁ బొ మ్మతఁడైనఁ బూని నిన్
విడువక వీఁకతో వెనుక వేసుకొనంగలఁ డెంచి చూచినన్.


గీ.

శాంతి నెప్పుడు బదరికాశ్రమమునందు
నుచితభక్తిఁ దపోవృత్తి నున్నవాఁడు

గరుణ గలవాఁడు సత్యంబు గలుగువాఁడు
పొ మ్మని వచింప నింటికిఁ బోవ కపుడు.


చ.

కట్టినకాసెతోఁ జిటులుగంధముతో నరవాడుపూలతోఁ
బెట్టినసొమ్ముతోఁ జెమట వెట్టినకస్తురిజాఱుబొట్టుతోఁ
బట్టినబోటితోఁ దొడుగుపావలతో నొరుతోడఁ దెల్ప కే
నిట్టె బిరాన వచ్చితి నిఁకేకరణిం గరుణించి ప్రోచెదో.


క.

శరణాగతరక్షామణి
బిరుదాంకా భామినీనవీనమృగాంకా
కరుణింపుము నాతహతహ
మఱిపింపుము కినుక లేక మన్నింపు మొగిన్.


క.

విశ్వమున నీసమానము
విశ్వామిత్రుం డటంచు వినుతింతురు గా
నశ్వపతినృపతివర, మ
ద్రేశ్వర, ప్రాసాన కందురేమొ కవీంద్రుల్.

చ.

అని చిఱునవ్వు నవ్వి వనితా, యిది యెంతప్రయోజనంబు నిన్
గనుగొనఁ జూడఁగాఁ గలఁడె కౌశికుఁ డింకఁ దలంకు మాను మే
యనువున నెన్నినాళ్లు మనసైన సుఖంబుగ మావనంబునన్
గొనబున నుండు మేపనులకున్ విడనాడ మరాళకుంతలా!


క.

ఇం దుండు మనెడుసందునఁ
జెందొవతూపులను రెండుచేతుల నిండన్
గ్రొందలిరాకురాజిదొర
ముందువెనుక దోఁచ కపుడు ముని కళ గొనఁగన్.


చ.

కలికి నెగాదిగన్ గని యిఁకం దపముం జప మంచు ఛాందసం
బులు తలపెట్టినం మనసు ముందటిరీతిఁ దదేకనిష్ఠ మై
నిలువదు తీరినప్పటికి నేర్చుగతిన్ దప మోపినంతయున్

సలుపఁగ వచ్చు నీవనిత నాఁటికి వచ్చునె ప్రాణ మిచ్చినన్.


చ.

నెపమునఁ బూర్వజన్మమున నేను ఘటించుతపఃఫలంబు గా
కిపు డొనరించునట్టితప మింతటిభాగ్య మొసంగ నేర్చునే
తపమును సంధ్యయుం జపముఁ దానము దానముఁ జేయు టెల్ల నీ
చపలమృగాక్షి లేబిగువుచన్నులఁ గ్రొన్నెల నుంచనే కదా.


సీ.

ఈకాంతచిగురుమో విసుమంత చవిగొన్న
                 నమ రేంద్రుతోడఁ బోరాడరాదె
ఈబోటిచుఱుకుచూ పేపాటి పాఱిన
                 నించువిత్తునిఁ గలహించరాదె
ఈచానతేటప ల్కేమైన దొరకిన
                 బ్రహ్మతోడను వాదువెట్టరాదె
యీలేమ పసిఁడిమే నెద నూనఁ గల్గిన
                 హరికి గొలారిక మంపరాదె

దీనిఁ బొసఁగించి బిగువుసందిట గదించి
కళలు గరఁగించి చొక్కించి గారవించి
మిగులఁ దేలించి లాలించి వగలుమించి
పంత మలరించువాఁడు సౌభాగ్యశాలి.


చ.

అనువుగఁ బంచభక్ష్యపరమాన్నము లుంచి భుజింపు మన్న నొ
ల్లనియవివేకి యేజగములం గలఁడే తనపాలిదైవ మీ
వనితను జూపి యింకఁ దడవం బని లేదని కొంతతత్తఱం
బును దమకంబునుం బొడమ మోహమునం జెలితోడ నిట్లనున్.


చ.

చిలుకలకొల్కి, మా కొకవిశేషము తోఁచెను నీవు తెల్పుప
ల్కుల నల గాధిరాజుకొడుకుం భ్రమియించినదాన వీవు నీ
జిలిబిలిమాటలుం సొలపుఁజిన్నెలు మ మ్మిఁక నేమి సేయునో

తెలియదు నేఁడు నన్నఁ గడతేర్పుము నేర్చిన నేర కుండినన్.


క.

మెప్పుగ నినుఁ గాపాడుట
కొప్పితిఁ బాపమును బుణ్య మున్నది నీచే
నిప్పుడు తుంబురు నీడకు
దెప్పించు మటన్న మేము తేలేము సుమీ!


చ.

అని యొకచిన్నిముద్దులయొయారపుజూదపుఁదేటనవ్వుతోఁ
గనుఁగొన ముర్వు ముంగరయుఁ గమ్మ తళుక్కన మోముఁ ద్రిప్పి వ
చ్చినపని చూడఁగాఁ గడమ చేసెద రౌర బళా యటంచు సి
గ్గున నడయాడుదానివలెఁ గోమలి యవ్వల నివ్వలన్ నిలన్.


క.

తిలకించి తపసి ముఱిపెము
తిలకించిన నారువోయుతీరున మేనుం
బులకించిన నిలఁ జాలక
పలికించెద బోటి ననుచుఁ బదరుచు ననియెన్.

గీ.

దాఁచ నేటికి బోటి, నిన్ జూచినపుడె
యిదిగొ చూడుము సాత్వికం బుదయమయ్యె
సుదతి, రాజస మింతగాఁ జూపవలెనె
యింత చేరియుఁ దామస మింత యేల?


సీ.

చెలియ, వాతెఱతేనె చిందిపో నంచునో
                 నో రూర నొకపల్కు నుడువ వేల?
పొలతి, నీ చూపుఁదూపులు దుయ్యునంచునో
                 సొగసుఁ గ్రీగంటను జూడ వేల?
యింతి, చన్ జక్కవ లెగసిపో నంచునో
                 నురమున నడ్డకే లుంచ వేల?
తరుణి మారునియేటు దాఁకు నటంచునో
                 నిలిచినచో నింత నిలువ వేల?
కాంత, జడుఁ డటంచునొ న న్నొకింత యైన
నించువిలుకానిరతిఁ గరుణించ వేల?
బొమ, యిది బై లటంచునో సైగఁ గాఁగఁ
గపురపుటనంటిచాటు కేఁగంగ నేల?


క.

కాక మదిలోనికోరిక
మాకుం దెలుపంగఁ గలది మఱి యే మైనా

యేకాంత మొకటి గలదో
కోకస్తని దెలుపు మనుచు గొబ్బున లేవన్.


చ.

కదలిక చూచి నాతలఁచుకార్యమ దౌర ఫలించె నంచు నా
మదగజయాన లేనగవు మాటికి మోమునఁ దేట లీనఁ దా
నెదురుగఁ జేరి మీర లిది యేమి తలంచితి రింతకంటె నా
మది గల దైన నే వెఱతు మౌనులతోడుతఁ బొందు సేయఁగన్.


చ.

మునుమును పెందు లేనిప్రియముల్ సవరించి యొకింత లోగినన్
వెనుక దిశించి చూడ రవనిన్ మగవారల నమ్మరాదు నా
మనమున నంతగా వలయుమాటలు గల్గిన నేటిమాత్ర మా
సనవిలుకానికేళికల నన్ మెఱయించెద నంచు సిగ్గునన్.

చ.

కులుకుచు మోము వాంచు నదె కోపము చేసెదవే యటంచు మై
పులకులు వోవఁగాఁ జుబుకముం గొనగోళ్ళను సోఁక నొత్తి చె
క్కులు కబళించి ముద్దు గొనఁ గొంకుచు నల్ దెసఁ జూచి యంతటన్
నిలువునఁ గౌగిలించుకొన నిల్వక యమ్మునిరాజు వేడుకన్.


ఉ.

పాయనికౌఁగిటన్ రవిక పక్కున విచ్చినఁ జన్నుదోయి కే
ల్దోయి గదించి చొక్కి యటు తోచక తూఁగెను మోహవార్థి నా
చాయ మునుంగకుండిన వెసం దరిఁజేరునుపాయ ముంచి నం
దీయనికుండ లానుకొని యీఁదుచు తేలుచు నున్నపోలికన్.


ఉ.

అంతట తాళలేక యొకయందపులేఁబొదరింటిలోని కా

.

యింతిని సమ్మతించుకొని యేఁగి ముదంబున రాజయోగి యే
కాంతము గాఁగఁ గ్రొంజిగురుటాకుమిటారపుశయ్యమీఁద న
త్యంతవినోదవైఖరుల నందుచు నిండిన వేడ్కఁ జెందుచున్.


సీ.

సుదతి బాగా లీయఁ జొక్కు వుట్టు నటంచు
                 విడువక పుక్కిటివిడెము వేఁడుఁ
గలికి ముద్దు లొసంగఁ గాఁక తీఱదటంచుఁ
                 గమ్మవాతెఱపానకంబు వేఁడుఁ
గొమ్మ లేఁజనుదోయి ఱొమ్మునఁ గదియింప
                 మనసు నాఁటఁగఁ గ్రుమ్ము మనుచు వేఁడు
బాల కేళికిఁ దన్నుఁ బ్రార్థింప మఱచిపో
                 యితి నంచుఁ బుంభావరతికి వేఁడు
నువిద చెవిలోనఁ గవకివకవలు గొణఁగ
నతివ, యిది మాకు నేర్పు మటంచు వేఁడు
మగువ కళ లంటఁ గరఁచి యేమరలు సేయ
నబల, యిది యేమి చేసితి వంచు వేఁడు.

క.

ఈలీలఁ జిగురువిల్తుని
కేళిం బెనఁగొనుచుఁ గెరలి కిలకిల నగుచున్
సోలుచు శృంగారాంబుధిఁ
దేలుచు రమియించి తనివి తీరక యంతన్.


సీ.

పఱవనిపఱుపుగాఁ బఱచినవిరులచేఁ
                 బెనుపైన పొగడసంపెఁగలనీడ
నేడాకనంటుల కిద్దరద్దరి మోయు
                 పువుఁదేనెవాకచేరువలచాయ
మల్లెతీవల నల్లిబిల్లిగా నల్లిక
                 యింపైన లేఁబొదరిండ్లలోన
జలువతెమ్మెర నించుకలువపుప్పొళ్ళచే
                 నీ టైనయిసుకతిన్నియలచెంత
నాడ నీడను వేడుకఁ గూడిమాడి
యచట నిచటను దమితోడ ననఁగి పెనఁగి
నక్కడిక్కడ మల్లాడి యలసిసొలసి
యదియ వైకుంఠ మై యుండె నంతలోన.
మ. నునుపుంజెక్కులఁ గ్రమ్ము లేఁజెమటబిందుల్ జార్చి గోటం జిటు

క్కునఁ బో మీటుచు జాఱుపయ్యెదచెఱంగుల్ చక్కఁగా నొక్కి చె
క్కిన ముంగుచ్చెలకొంగు దీసి దగతోఁ గెంగేలఁ గీలించి మో
హినిచందంబున నొక్కబోటి యటకై యేతెంచె శీఘ్రంబుగన్.


గీ.

బ్రమసినటు లున్నమేనకాపద్మముఖికి
మ్రొక్కి నవ్వుచుఁ గొప్పులోఁ జెక్కుకొన్న
కాకిత మొసంగ శిరమునఁ గదియఁ జేర్చి
యంత గోట లకోట యొకింత విచ్చి.


క.

వేయుంగన్నులవేలుపు
సేయు సిఖా చూచి ముద్దుచేతులచే నౌ
రాయిది దేవశిఖామణి
చేయుసిఖా యనుచు మెప్పు సేయుచుఁ జదివెన్.


సీ.

శ్రీమన్మహాదేవసింహాసనాధ్యక్ష
                 చక్షుస్సహస్రకటాక్షజాల
వీక్షణాలంకార దక్ష రాక్షసశిక్ష
                 ణ భువనత్రయరక్షణప్రభావ

వైభవనిధి యైనవాసవుండు బిరుదు
                 పాత్ర నీమేనకపాలి కనుపు
పరమాణు విది నిన్న బ్రహ్మ విశ్వామిత్రు
                 నాడకుఁ బిలిపించి యతనిమీఁద
ముట్టినపిరాదుచేఁ దనముదల లేక
నాళమున కేఁగవలవ దన్నాఁడు గనుక
జులబులిఁకఁగూడ దీలే(రోఖా)ఖ చూచినపుడు
వడిగ మాపాద మాన రావలయు నీవు.


క.

అని మెల్లఁగఁ జదువఁగఁ జ
ల్లనఁ దనడెందంబుఁ గలఁగ నముని ధరఁ దె
ప్పున వ్రాలె మొగలిజంబువ
గొని వెనుకై మరుఁడు కూలఁ గ్రుమ్మె ననంగన్.


ఉ.

వ్రాలిన నవ్వి మంచిదయవాఁడవు నేఁ డవురౌర వింత నీ
పాలనె కల్గె నీసుఖము పాటిది కాదొకొ మాసుఖంబు నా
మేలి మొకింత యైన మది మెచ్చవు నే నిలు సేరఁ గల్గుటే.

చాలు నటంచు నెంచవు విచారము సేయుదు రయ్య, యియ్యెడన్.


చ.

అడలకు మింక నీవలసినప్పుడు వ్రేలెడుచీటి పంపినన్
దడయక వచ్చెదన్ నిజము నమ్ముము నెమ్మది నంచుఁ జేరి తా
నడుగులమీద వ్రాలి వినయమ్మున నిల్చినఁ గొంతసేపు తొ
క్కడఁబడి నవ్వుతో నొకవగం దలఁ యూఁప నదే నెపంబుగన్.


గీ.

మరలి ముసిముసినవ్వుతో మరుఁడు దాను
నొకవిమానముపై నెక్కి యున్నవారిఁ
గూర్చుకొని వాసవునినిండుకొలువు కేఁగి
యంతయును దెల్పి బిరు దందె నచట మేన.


క.

ఇచ్చటను రాజమునివరుఁ
డచ్చటఁ బో నిలువ లేక యది చేసినయా
తచ్చనలకు మచ్చికలకు
ముచ్చటలకు నదియె లోకముగఁ బరవశుఁడై.

సీ.

తాన మాడుటె కాని మానె సంకల్పంబు
                 నీళ్ళు చల్లుటె కాని నిలిపె సంధ్య
వ్రే లెన్నుటే కాని విడుపు చేసె జపంబు
                 తడవు మ్రొక్కుటె కాని విడిచె భక్తి
ముక్కు పట్టుటె కాని గ్రు(డ)క్కె నోంకారంబు
                 మౌన మొందుటె కాని మఱచె దెల్వి
కన్ను మూయుటె కాని కనఁడు లో లక్ష్యంబు
                 ధ్యానించుటే కాని యాఁచెఁ దపము
కోర విన సోఁకఁ గన రుచిగొనను మూరు
కొనను మౌనియు మేన పల్కులును మేను
రూపు వాతెఱ మైతావి దోఁప మనము
చెవియొడలుకన్న జిహ్వనాసికయు మఱచు.


క.

కొంచించి నిలుప మన సా
పంచేంద్రియములనుగూడి బయలై దుముకన్
మించినచలమున మది గుది
యించెన్ వశవర్తి గాఁగ నింద్రియములతోన్.


చ.

చెదరక తొల్త నొక్కటిగఁ జెల్వపయిన్ మది వాఱఁగాఁ జుమీ

యది యిటు త్రిప్పి నేర్పున నిజాంతరలక్ష్యము నందుఁ
గూర్చి యా
పొదలికచేత వాయువులు బూరక రేచక కుంభ కంబులం
గదలిచి కుండలిన్ బొడవుగా నిగిడించి తదేకనిష్ఠమై.


క.

పొందుగ షోడశపద్మము
నందు మదిం దగులుపఱిచి యానందముతో
నందుంచిన సావిత్రిని
జెందుచుఁ గొన్నేండ్లు తపము సేయుచునుండెన్.


సీ.

నిక్కి యించుక మేను నిగిడించి నిలుచుచోఁ
                 బటపట బ్రహ్మాండభాండ మగలుఁ
గుంభకంబున నొడల్ కొంత యుబ్బించుచోఁ
                 గటకట దిక్కులు పెటిలి పడును
పట్టఁజాలనిచూపు లట్టిట్టు పఱచుచోఁ
                 జిటచిట నడ వెల్లఁ జిమిడు మండుఁ
బట్టి విడ్చుచు నట్టె నిట్టూర్పు పుచ్చుచోఁ
                 గిటగిటఁ గొండలు గిఱ్ఱఁ దిరుగు

నట్టి ఘోరంపుఁదపము నాపుట్టు మొదలు
గట్టిఁగాఁ జూచియును గాన నెట్టియెడల
నిట్టియెడ నేను బోవ కున్నట్టులైనఁ
బుట్టు వింత యటంచుఁ దా నట్టె యపుడు.


మ.

ఒరపుం దెల్లనిముత్తెపున్ సరులతో నొయ్యారపుంజూపుతో
గరఖట్వాంగగదాత్రిశూలమణిఢక్కాఖడ్గగుచ్ఛాళితో
విరులం జెల్వగుకొప్పుతో హిమము ఠీవింగెల్వ నౌవల్వతో
సరి మధ్యాహ్నమువేళ రాజమునికిన్ సావిత్రి ప్రత్యక్షమై.


క.

నిలిచిన లోపలిచూపును
వెలిచూ పొక టైనఁ జూచి వేడుకపడుచున్
జెలఁగుచు మ్రొక్కిన లె మ్మని
పలుమఱు దీవించి దేవి పలికెం గరుణన్.


గీ.

తపము చేసితి వింత సంతానకాంక్ష
బ్రహ్మవ్రాసినవ్రాత తప్పంగఁ జేయ

నొకరివశ మౌనె యెం దైన నోనృపాల,
కన్య నే నిత్తు నావంటిధన్య నొకతె.


క.

శతపుత్రలాభ మబ్బెను
సుతఁ గరుణను గొనుము గొసరఁ జూడకు మిఁక నా
సతి కిడుము నాదుపే రని
యతిముదమునఁ జనియె నంత నంతర్హిత యై.


ఉ.

లేచి తపంబు నేఁ డిదె ఫలించె నటంచును మద్రరాజు రా
జోచిత భూషణంబు లెద నూని యనూనవిభూతిభాసితుం
డై చతురంతయానమున నచ్చతురంగబలంబు గొల్వ లీ
లాచతురాంగనాకలితరాజవిరాజిత మౌపురం బొగిన్.


వ.

ప్రవేశించి యంత మావంతుండు తెచ్చినయ
చ్చపుముత్యంపుజంపులం గనుపట్టిన పట్టంపుటే
నుంగుపై నెక్కి సొం పెక్కి యుభయపా
ర్శ్వంబుల వింజామరంబులు వీవ ముందర

వందిమాగధజనంబులు కైవారంబులు సేయ
నంచలంచలఁ బంచమహావాద్యంబులు సెలంగ
నుచితవాహనంబుల బంధువర్గంబులు రా
రాజమార్గంబులం జని చని నిగనిగనిజాతిమ
గరాతిచెక్కడపుచొక్కంపుకెంపుకంబంబుల
నిద్దంపుమిద్దెల నబ్బురంబులగు నుబ్బుచప్పరం
బులం దళతళలీను దంతంపుబొమ్మలచెంతలవింత
వగల తొగలతెగలరాఱాజగతులం బఱచి
న బురుసాతివాసుల నిరుగెడల మెఱయు మిటా
రంపుసూర్యపుటంపు బలుదిండ్లు నిండుతలగడల
నొఱుంగు మెఱుంగుఁబోఁడులు వీణెలు కడ
నిడి వెడవిలుతుండు తెగ నిండం దిగిచి విడి
చిన యరచందురువాతి పసిండిములుకుల జగ్గున
దిగ్గనం గులుకుమేనులుం గలికి నెన్నుదురులుం
దళుకుదళుక్కనన్ బిఱబిఱ సోరణగండ్లపజ్జ
లం జేరి కలువతోరణంబులవెంటం జంటతో
రణంబులుగాఁ జూచు వారిచూపుల కెదురు
గోలు పంపినపెంపున గుంపులకు నిగిడి
చూచుచు, నిచ్చ నిచ్చలు మెచ్చులు దెచ్చు

హెచ్చు పచ్చరాగచ్చుల నిచ్చలంపుబచ్చి
పచ్చికల తచ్చలాడుగోడల నాడనాడ వ్రీడ
లతో జలక్రీడ లాడు గొల్లకాపుప్రోడచేడి
యలు విడిచినమడుంగులు దొంగిలి చన్న
పొన్న తుదనున్న వెన్నునిచిన్నెలం బిత్తరిల్లు
చిత్తరువుల గ్రొత్తగ్రొత్తగా న తతించిన ననలగు
త్తుల మత్తిల్లి యల్లనల్లన నల్లిబిల్లిగా నుల్ల
సిల్లి తేఁటిపిల్లల పెల్లురవంబులకు వియ్యంబు
లగు శ్రుతులం బొలుచు దంబుఱలనాదంబుల
కొద్దిక లగుమద్దెలల సద్దులస ద్దణఁచి ముద్దులు
గులుక నజ్జగజ్జియలనినాదంబుల వినోదం
బులు మోదంబు లాపాదింప మించునబ్బు
రంపు సిబ్బెంపుగబ్బిగుబ్బెత లుబ్బున నాటక
శాలలు వెడలి యలరువిలుతుండు కాలి
గొలుసులన్ దెప్పునం దప్పించి విడిచిన
కొమ్ముగత్తులం గలమదము, నేనుంగులతెఱం
గునం గట్టిన చనుకట్టులం బిగువుఁ బుట్టించుక
నొకరి కొకరు మునుకొని నడవం దడఁబడి
యడుగుల నెడనెడల జీరాడుగజ్జియల చేరు

లతో నీలంపురవలజాళువాఁ బోలు తలుపుల
కెలంకుల నిలిచి తొంగి చూచి సిగ్గు సిగ్గునన్
గిఱుక్కన మళ్ళిన నవ్వాకిళ్ల వే గుంచిన
బాగున మనం బించుకించుక నిలుపుచు, జంట
జంట లై యొండొంటికంటె మిన్నంటి నిగిడి
యుండు పసిండికుండల నొప్పు లుప్పతిల్లు గొప్ప
కప్పురాయుప్పరిగలతొగరుచిగురుల మిగుల
నగువగువగలఁ బగడపుజిగిమెఱుఁగులఁ బర
గుతెరచవికల మరకతపుతిరుగుతరుగుల సొగ
టాలాడు మెఱుంగుబోడు లేను గెలిచితి నేను
గెలిచితి నని గ్రక్కుగ్రక్కునం బక్కిరా రాచె
క్కడంపుమెట్ల నేట్లు పడం బడిబడిఁ దిగుచు
మెచ్చు దెచ్చుకొన్న మేనకమీఁది నుచ్చరం
బునం గ్రచ్చఱ నచ్చటఁదిగి వచ్చినయచ్చ
రమచ్చెకంటులచొప్పునం దప్పక చూచు
ఱెప్పవిప్పుగొప్పకన్నులుం దప్పు లేనియొప్పు
లుం గలిగి గుప్పుగుప్పున నిలువ మెప్పులు
గొనుచు, నక్కడివ లెఁ జిక్కు పడననునిక్కునం
దల యూఁచుచు, గుజ్జులేమావిజొంపంబులం

బింపిళ్ళుగూయు చిలుకగుంపుల పెంగూఁతలన్
జెంగావుల సింగారించిన బంగారపుంగురుంజుల
కొమరుప్రాయంపు సిబ్బెంపుగబ్బిగుబ్బల బిబ్బో
కవతులు తళతళలు కులుకు జిలుగుఁబయ్యెద
లం బొగరుఁజనుగవ లుబుక బిగియించి యిం
చుక జాఱిన యరవిరివిరవాజివిరులసరుల
మరలఁ గ్రుమ్ముడులం దుఱుముకొని మిసిమివిస
రుపసిండిగాజుల నెగంద్రోచుకొని కమ్మి చిమ్మ
నఁ గ్రోవులం జిమ్ము కమ్మనిపన్నీటిజాలును బిసబిస
విసరి యొసఁగు గుబగుబవచ్చు నగరుధూపధూ
మంబుల బటికంపుఁబుటికల నించి చల్లు తెల్ల
నిమల్లెమొల్లవిరులందా నవింపునరభిషేకజలం
బులుం గట్టినపట్టంబును వేయువింజామరంబులు
గాఁ గైకొని నగుచు, మెల్లమెల్లన నునంగు
మొగసాలఁ గడచి మరకత మాణిక్య చాకచక్య
సహవాససహకారదళపల్లవతోరణరంభాస్తం
భవిజృంభమాణవినోదకాంచనసింహాసనం
బగురత్నసింహాసనంబునం గొలు వై కూర్చుం
డి కొంతవడికిం గొలువు దీఱి మజ్జనభోజనంబు

లంగీకరించి మంచి జీవదంతంపుఁగీలుబొమ్మ
చెక్కడపు జిగిబిగి పగడంపుఁ గంబంపుఁ జాదు
బోదియలనీడల వైడూర్యంపు మేలిదూలపు
సోగపుష్యరాగ దంతెల సూటికిరీటపచ్చరా
రావిరేక పసిండితాకుల నిలువుటద్దంపుఁగెం
పుగూండ్ల రంజిల్లుచుట్టుబవంతి ముత్తెంపు
జల్లులం బిక్కటిల్లు పడకయిల్లుఁ జేరిహంసతూలి
కాతల్పంబునం బవ్వళించి మాళవితోఁ దాను
దపంబు సేయుట మొదలుగా వరం బొసం
గుట తుదగా నంతయుం దెలుపుచు మదన
కేళీవినోదంబులం బ్రొద్దులు గడపుచుండ నంత
సావిత్రీవరప్రభావంబున సమారూఢగర్భ
యగు నభ్భామినీమణిం గనుంగొని మనంబు
నం బొంగుచు నారాజపుంగవుండు


సీ.

ముట్టరా దని లక్కముద్ర లుంచినరీతి
                 నాతి, నీచన్నులు నల్లనయ్యె
గో రంట కుండఁ గంబూర గుప్పినపోల్కిఁ
                 గలికి, నీచెక్కులు వెలకఁబాఱె


.

బిడికి లించక యుండఁ బెంపు చేసిన దారి
                 నారి, నీలేగౌను మీఱి బలిసె
నొక్కింత వేగింప నొల్లనిచందాన
                 జాన, నీకును నిద్ర చాలఁ బొడమె
నొకట రతికూజితంబుల నుగ్గడింప
నోప ననులీల బాల, నిట్టూర్పు లొదవె
నీకు నలకేళిపైఁ బాళి లేకయున్న
నతివ, ముచ్చటగా మాట లాడరాదె.


క.

అన విని పతిచతురోక్తుల
కును వనితామణియు నగుచుఁ గూరిమివలనన్
బెనఁగొను తమిచేఁ బైఁ బడె
ననవిలుతుఁడు మొగలిపెట్టునం బైఁద్రోయన్.


సీ.

మల్లాడి ప్రాల్మాలి చల్లనియల్లి కా
                 డలిఁ బోలు కేలు మూపులకుఁ దాఁచు
కసి దీర మనసారఁ గౌఁగి లబ్బక యున్నఁ
                 జెలువునిపై బోరగిలుచు వ్రాలు
నరుచి దీఱుంగ వాతెఱ యాని యౌ రౌర
                 చవు లంచు వెడ వెడ చప్పరించు

మణితముల్ సెవి నించు మంటి తావులు గ్రమ్మ
                 నుస్సురు మనుచు నిట్టూర్పు లూర్చు
నొడఁబడిక లిచ్చుఁ దడఁబడి మడుపు లిచ్చు
ముద్దులకుఁ జొచ్చు సుద్దులఁ బొద్దు పుచ్చు
రతికిఁ జొరఁజూచు నోపక పతిని జూచు
నాత్మగర్భావరోధ యై యావధూటి.


చ.

కలసి రమింప లేనిమతి కక్కుఱితిం బెనఁగొంచు నీగతిన్
మెలఁతుక కొన్నిప్రొద్దులు క్రమింపఁగ నంతట నంత నంత ప్రొ
ద్దుల నెల యైన మాళవికిఁ దోయజగర్భునిదేవిసత్కృపం
గలిగె గుమారికామణి యొ
కానొకమంచిదినంబునం దొగిన్.


ఉ.

పుత్రిక గల్గె నంచుఁ బువుఁబోఁడులు దెల్పఁగ మద్రరాజు లో
కత్రయ మేలినట్లు కుతుకంబునఁ గోరినవస్తుకోటి న

ర్వత్ర యొసంగి దేవికృపవల్ల జనించుట నామెపేరె సా
విత్రి యటంచుఁ బే రిడి భువిన్ బెరుఁగన్ బెనుపొందె బాలయున్.


ఉ.

బోటులతోడఁ దోయములు బొమ్మలపెండ్లియుఁ బుట్టచేండ్లుఁ గో
లాటము [2]నమ్మనమ్ము లరుగాటలు గుజ్జనగూండ్లుఁ దాటిచె
ట్లాటలు నిద్దఱాండ్ల మగనాటలు వెన్నెలగుప్ప డాఁగిమూఁ
తాటలు నాది గాఁగలుగు నాటల నాడుచు నుండె వేడుకన్.


క.

ముద్దించి తల్లిదండ్రులు
విద్దెలు నేర్పింప సకలవిద్యలు వచ్చెన్
ముద్దియకుఁ బచ్చవిలుకాఁ
డద్దిర యన మెచ్చ వచ్చె యౌవనమంతన్.


సీ.

పున్నమనాఁటి సంపూర్ణచంద్రునిరీతి
                 కళలు దేరగ సాగెఁ గలికిమోము

మెఱుఁగువెట్టినమించుమించుటద్దముమాడ్కి
                 నీడ వాఱఁగ సాగె నెలఁతచెక్కు
చికిలి సేసిన మారుచేలకోరులపోల్కిఁ
                 జాయ లూరఁగ సాగె సకియచూపు
పటిక నార్చిన గొప్ప పసిఁడికుండలభాతి
                 వన్నె మీఱఁగ సాగె వనితచన్ను
లారు పొడచూపె నడ మందమయ్యెఁ గురులు
కొప్పునకుఁ గూడెఁ గటిసీమ కుదురుకొనియె
నడుము కృశ మౌటదక్క నప్పడఁతి నిండు
ప్రాయమున సకలాంగసంపదలు గాంచె.


క.

ఏణాక్షి తండ్రిపనుపునఁ
బ్రాణసఖులతోడఁ గూడి పర్వతుచేతన్
వీణానాదము నేర్చి ప్ర
వీణ యనం బొగడు గాంచి వేడుక నుండెన్.

  1. (వెలఁది నీకరి గాపైతి వెఱ్ఱినైతి)
  2. చెమ్మ చెక్క