శృంగార సావిత్రి/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము

అవధరింపుము పాండవేయాగ్రజునకు
ఋషివరుండు మార్కండేయుఁ డిట్టు లనియె
నటులు సావిత్రి సకలవిద్యలు గ్రహించి
తగినకాంతుని వరియింపఁ దలఁచు చుండ.


క.

ఒకనాఁ డనుఁగుంజెలు లా
ముకురాననతోడ నందముగను వసంతం
బొకటఁ దగెఁ గేలికావని
నకలంకం బగుచు నీదుయౌవనము క్రియన్.


మ.

పొలుపొందం జనుగుత్తులం దనరు నొప్పున్ మ్రోవి నందంద తే
నెలు చిందున్ గలకంఠరావముల నెంతే వింతగాఁ బర్వు నిం
పొలయన్ నెమ్మి నటింప నైన నొకటే యుక్తంబు గా దింతకున్
ఫల మై యుండదె బోటి యాయినకరస్పర్శంబు తాఁ గల్గినన్.

చ.

అనుచు ననంగ నంగనల యాచతురోక్తుల కెందు లేని సి
గ్గున మఱుమాట లేక చెలి కొండొక సేపున కమ్మలార, గ్ర
క్కునఁ జని పూలుఁ గోసుకొని కూడి కొలంకుల జల్లు లాడి యా
వనిఁ గలవింతఁ జూచి మఱి వత్తుము వచ్చెదరే యటం చొగిన్.


మ.

తళుకుంబావలుఁ ద్రొక్కి యొక్కసఖికైదండన్ జెలుల్ గూడ వే
డ్కలతో నేఁగె లవంగలుంగబదరీఖర్జూరజంబీరవం
జులమందారరసాలసాలకదళీచూతక్షమాజాతభా
గలిసంగీతభరాభిరామ మగునయ్యారామమున్ జూచుచున్.


క.

బోటులుఁ దానును బువ్వుల
తోఁటననలఁ జిదుము ముదముతో నేమేమో

పాటలు పాడుచుఁ బూవులు
గోటన్ మీటుచును దూటి గోయుచు మఱియున్.


సీ.

ఏలయేలతమాల బాలరసాలసా
                 లముకొమ్మ కొమ్మ ఫలమ్ము లమ్ము
మేలు మేలును మేలు మేలుసునాసనా
                 సరి నంట నంటకు సారె సారె
చాలుఁ జాలును నేల నేలఁగ నల్ల న
                 ల్లది దాని దీనిని నమ్మ నమ్మ
గోల గోలతనాల చాల నాలమునబ
                 న్నము రాఁగ రాఁగదే నవ్వ నవ్వ
చెలువ చెలువయ్యె బల్ పల్కు చిలుక చిలుక
వెలఁది వెలఁది నీ కేఁగేల నలరునలరు
నెలఁత నెలతమ్ములే లేయొరులవిరు లని
చెలియ చెలి యయ్యెనే నెమ్మితలముతలము.


మ.

అని నానాగతిఁ బల్కుచున్ విరుల నందం దంది నే ముందుముం
దని రాగిల్లుచుఁ గేల గిల్లుచును బాగౌఁ తీగె లుయ్యాలచెల్వునఁ దా

రూఁగుచు డాఁగుచున్ బొదలు బువ్వుందేనియల్ 'గ్రోలుచున్
దనియం దేలుచు సోలుచున్ నగుచుఁ గాంతల్ కాంతలై వింతగన్.


మ.

నును పుప్పొ ళ్లొడలన్ దుమార మెగయన్ ముంగేల కంఠంబులన్
ననదండల్ మెఱయన్ గొలంకుదరిచెంతన్ రంతులన్ జేరి రాఁ
గనువిల్కాఁ డనువీరునిం గొలిచి వేడ్కన్ సాహుసే బాహుసే
యనుచున్ బూవుల బూదిపూఁత తగ నీ రాడంగఁ బోవున్ వగన్.


చ.

లలితసరోజరాజిని దొలంకుకొలంకుకెలంకులందు సొ
మ్ములు సడలించి పావడలు ముద్దుగఁ దాల్చి లతాంగు లొండొరుల్
పిలుచుచు నీరు సొచ్చిరి తమిం దమమోములు చన్నులున్ భుజం

బులుఁ గను లల్లతామరసమూలముమాదిరి చూడనుం బలెన్.


యమక రగడ.

కంటిలోను బడఁగా జల మూనకు
గంటిలోను బడఁగాఁ జల మూనకు
విరట వేయక దానికి వెంట న
వ్వింట వేయక దానికి
నీఁతనీళ్ళు చొరనీవె బాల
యీఁత నీళ్ళు చొరనీవె బాల
కలికితామరల గైకొనకొల్లవు
కలికి తామరలఁ గైకొన కొల్లవు
నిలు వింతె లేనెర మ్మనరా
నీలు వింతె లేనే రమ్మన రా
సరి తా విచ్చెను జల్లఁగ నాయమ
సరి తా విచ్చెను జల్లఁగ నాయమ
వడి గలపద్మిని వారిని ముంచితి
దా........................................
.............................................
ముద్దియ వేలను ముం దగు నాతో

పో విడనాడకు పోకలు వలదే
తావుల నీ రటు తనరఁగ డాయన్.


చ.

అని విరిబోఁడు లొండొరులనాడినమాటలె మళ్ల నాడుకొం
చును జలకేళి చాలు ననుచుఁ గనుదమ్ములఁ గెంపు చేఱ నొ
య్యనఁ జనుదోయిపై కరము లానుక వెల్వడి చల్వపావడల్
మినుకుదుకూలముల్ తళుకుమేలిమిసొమ్ములు దాల్చుచుండఁగన్.


గీ.

చెంత నొకగుజ్జులేమావిచిగురుఁగొమ్మ
నొక్కరాచిల్క ముక్కున నొక్కజపస
రంబు కఱచుక యుండ నారాకుమారి
కని పడంతుల నిలుడని కదియఁ జేరి.


ఉ.

పట్టఁగఁ బోవుచో నవలిపార్శ్వమునన్ బులిదిండు దిండుగాఁ
జుట్టినకెంజడల్ సలిలశోభిక మండలు యోగపట్టెచే

దిట్టపువీణ బూదిమెయి తెల్లనికుంచెయుఁ గక్షపాల కు
ర్మట్టపుపావలుం గలుగు మౌనిశిఖామణిఁ జూచి నవ్వుచున్.


క.

ఇతనిది కావలె జపసర
మితఁ డెవ్వఁడొ దొడ్డతపసి యితఁ డీవీణన్
జతురుఁడు గావలెఁ గల్పన
జతచూతుమటంచుఁ జిలుకఁ జయ్యనఁ గొంచున్.


చ.

తనుఁ గని మాది మాది యని తాపసవర్యునిదండఁ జేరి కాం
త నిలిచి దండ మీజపముదండవు మీది గదండి (డ) కొండు కొం
డనఁ గొని నీకు మెచ్చు గల దండజయానరొ, యేమరించి దీ
నివిఁ గొని వచ్చె నీచిలుక నేరెడుపం డ్లనియేమొ భ్రాంతిగన్.


మ.

అతిమోదంబు ఘటిల్లె మామదికి నిషావాప్తి నీ కౌను గా

వుత మంచున్ వచియించి వీణదెస నీవున్ సారె చూచేవు నే
ర్చితివో యించుక దీనిపోఁడిమియుఁ జూచే యంద మాచంద మౌ
నలివా, కాక యొకింత కన్నగుఱు తేమైనన్ మదిం దోఁచెనో.


గీ.

అని మునీంద్రుండు వలుక నయ్యబల మ్రొక్కి
దేవ, మానేరుపుల కేమి దీని మునుపె
పర్వతునిచేత నుండఁగాఁ బలుకు మెచ్చి
ప్రీతి నే వేఁడ నారదుచేతి దనియె.


క.

అనినఁ దనచేతివీణియ
నొనరఁగ నీచేత నేటి కుంచెను బుడమిన్
బనివడి యతఁడు మెలంగఁగఁ
బని యే మన నన్నుఁ జూచి పర్వతుఁ డనియెన్.


శా.

నాకున్ నారదమౌనికిన్ మిగులఁ బ్రాణస్నేహ మాసాల్వధా
త్రీకాంతాత్మజుఁ డాకుమారకుని దర్శింపంగ వా రేఁగ నం

దాకన్ నేనును బోయి మే మెదురు వీణల్ పూని వాయించుచో
నేకీభావముచేత మారువడిపోయెక్ వీణ లానాఁ డనెన్.


ఉ.

కావున నాఁటివీణవలెఁ గానఁబడెన్ మునినాథ చూడు మీ
భావము నారదుం డనుచుఁ బాఱెడుబుద్ధి కనంగ నంగనా,
నీ వనుమాట లన్నియును నిక్కము చొక్కపునీదువాక్యపుం
గ్రోవ గణింప నశ్వపతికూతురునుంబలెఁ దోఁచె మామదిన్.


క.

ఎన్నం దుల లేదని నీ
కన్నందులకున్ మనోహరాకార మహో
విన్నందులకున్ గన్నులఁ
గన్నందులకున్ మనంబు కడుముద మందెన్.


ఉ.

వింతగ సత్యవంతుఁ డల వీణకు బ్రహ్మయటంచు నెంతుమీ

వింతకు మించి నేర్చితి మఱేమి సరస్వతివే తలంపునం
గొంత వినంగఁ జేయవలెఁ గోమలి నీవగ నంచుఁ బల్కి యా
చెంతను గూరుచుండి తనచేతివిపంచి యొసంగ వేడుకన్.


మ.

తమి కేలం గొని మున్నునుద్గృహముమీఁదన్ స్థాయి సంచారముల్
గ్రమ మొప్పన్ స్ఫురితంబు కంపితము డాల్ గ్రామంబులున్ మూర్ఛ లం
దముగా నౌడవషాడపంబులు తగన్ రాగాదిగీతప్రబం
ధము లిం పొందఁగ గాత్రమం దొదుగ నంతన్ వీణ వాయించినన్.


ఉ.

మేలు లతాంగి, చాలు నిను మెచ్చఁగ వచ్చును సత్యవంతుఁ డీ
మేళము గూర్చి పర్వతుని మేలిమి చూడఁగఁ జూపఁ బంపె మున్

వేళ లెఱింగి తీ వవుర నీమది వానిమనంబు నొక్క టై
పోలిక యీనృపాలునకుఁ బొల్పుగ నీవగద తెల్పఁగావలెన్.


క.

ఒకప ల్కైనను మే మత
నికి నాతఁడు మాకు దాఁచ నేర మబల, మే
మొకగురువుల మనియును వాఁ
డొకశిష్యుఁ డనియును లేక యుందుము చెలిమిన్.


మ.

అదిగో పర్వతుచేత నిన్ను వినినాఁ డానాఁడు నాఁడాదిగా
నిదియే లోకముగాని వేఱొకటి లే దేకాంత మైనప్పు డో
ముదితా, వానివిరాళిఁ జూడఁదగ దేమో భ్రాంతునిం బోలె మా
మదికిం దోచును నిల్పుచో నిలఁడు వేమా రుస్సు రంచున్ నగున్.


సీ.

చదరంగమున కెత్తు సవరించుకైవడిఁ
                 దల వంచి వెతఁ గుందుఁ దెలియకుండఁ

గవిత లాలోచించుగతి మిన్నుదెసఁ జూచి
                 యేమేమొ తలపోయు నెఱుఁగకుండఁ
గలువపువ్వులబంతి చలువఁ గైకొనురీతిఁ
                 గన్నీరు పో నొత్తుఁ గానకుండ
వడి కేలి తమ్మిపుప్పొడి నూఁదినటు వంత
                 నుస్సు రంచనుఁ దోఁచకుండ
నెంత మది చింత పొడమిన నించు కైనఁ
దోడిచెలికాండ్ర కును దెల్పఁ బోఁడు నృపతి
యతనితాపంబు లోలోనె యడఁగి యుండుఁ
గాలకూటంబు మ్రింగినశూలిలీల.


క.

తను మిగిలినరూపరి యని
మనసిజుఁ డిటు సేయకున్న మాత్సర్యముచే
వనితా, చక్కందన మ
న్నను దగునది గాక మిగిలినం దగు వగునే.


క.

అతఁ డింతకు మతి నెంతటి
వెతఁ జెందునొ తెలియరాదు వేచనియెదఁ బ
ర్వతుతో మే మడిగితి మను
మతివా, నీకడకు వచ్చినప్పుడు నియతిన్.

గీ.

కొమ్మ, నీభావ మే మని కొన్నిమాట
లాడనేరకవోయినవాడఁ గాను
నెలఁత, నినుఁ జూచినప్పుడ తెలిసె నాతఁ
డింత కే మౌనొ యది గదా యెల్లపనులు.


మ.

అనినం గామిని నెమ్మదిం బొగిలి యయ్యా, యంతగా మీనృపా
లునకుం గల్గినఁ జాలు మీరు మది నాలోచించినం గాకపో
వునె మున్ బర్వతుచేత విన్నపుడె దేవుండొక్కఁడే సాక్షిగా
దనయాధీనము సేసితిం దనువు మీఁదన్ మీఁద చిత్తం బికన్.


చ.

అతనికి నాకు సంఘటన లౌనటు సేయుభరంబు మీఁది మీ
రతులగతిన్ జనన్ వలయు నానృపుఁ డింతక యెంతచింతలన్
వెతఁ బడుచున్న వాఁడొ పదవే యని యమ్ముని వీడుకొల్పి యా

సతి తన కింత నంత పొదచాటునఁ బొంచినబోంట్లఁ జేరినన్.


ఉ.

ఒక్కమిటారి కేలిఁ గొనుచున్న పడంతుల రంత దల్చి యో
యక్కరొ యెవ్వఁడే తపసి యాతఁడు మాట ల దేమి యాడితే
గుక్కకు మింక పెండ్లిపలుకుల్ వలె నుండెనొ నేడొ రేపొ మా
యక్కవు గావె తెల్పు మన నౌ నది యైనఁ గదా ముదంబునన్.


గీ.

అంతమాటల పల్కెద వంబుజాక్షి,
యెంతవాఁ డైన నిన్ను విన్నంతతోన
కంతుననకోలమొనపాలు గాక యున్నె
యంతయును వింటి మాపొదపొంత నుండి.


క.

పర్వతునిచేత గా దిది
నిర్వాహకుఁ డితఁడు మంచినేర్పరి దొరికెన్
బర్వేందువదన, మాటల
పూర్వోత్తర మెఱుఁగ పలుకుపోడిమి దెలిసెన్.

మ.

అన సావిత్రి పడంతులం గనుచు నౌనౌ నంతవాఁ డైన నే
మనుమాన మ్మొక టీత డయ్యెడలఁ గయ్యాల్ సేయునే కాని యీ
పనికిం బూనఁడు దైవయత్నమున నాభాగ్యంబునం బూనె నొ
య్యన మాటాడక మున్నె యానృపతి యేమౌనో మనోజవ్యథన్.


గీ.

చెలువుఁ డటులుండ నా కింటితలఁ పిఁ కేల
ప్రొద్దు గ్రుంకెడు నిండ్లకు బొండు మీఁద
నమ్మతోమాత్రమును దెల్పుఁ డమ్మలార,
అయ్యతో నాడఁ బోకుఁ డావంతయైన.


సీ.

చెలులార, మీ రేల చిలుకలఁ దొలఁగా
                 నలుకుగా నవియును బలుకుఁ గాక
సతులార, మీ రేల చలిగాలి నేఁచగాఁ
                 గసరుగా నవియును విసరుఁ గాక
సకులార, మీ రేల పికములఁ గదమఁగా
                 బెదరుగా నవియును వదరుఁ గాక

కొమలార, మీ రేల భ్రమరాళిఁ దఱుమఁగా
                 వేఁగుగా నవియును మూఁగుఁ గాక
నామనోహరుఁడౌ ప్రాణనాథుఁ డచటఁ
జింతవంతలఁ బొరలుట చెవుల వినియు
బ్రాణములు నిల్పునావంటి పడఁతియెడల
నవియు నిటు సేయకుండునే యమ్మలార!


మ.

ననలుం గందము గప్పురం బొడలి మంటం బెట్టుచోనంటి మి
మ్మును నన్నంటకుఁ డమ్మ యమ్మరుని యమ్ముల్ గ్రమ్ముచో మిమ్ముఁ దాఁ
కునొ యేమో కడ కేఁగుఁ డమ్మ మదిలో గూర్చున్న నాకాంతు నొ
య్యనఁ గాపాడునుపాయముం దెలుపుఁ డమ్మా, నాకు మేల్ గోరినన్.


మ.

అనుచుం గన్నులు దేలవైచుఁ జెలులారా యిం కిటం బుద్ది యే
మనుఁ గాంతుం డెటు లున్నవాఁడొ కదరే యంచున్ వచించున్ నిజం

బునకున్ నారదుఁ డేఁగునే యను నదేమో మీరు పోలేరుగా
యను నల్వంకలఁ జూచు లేచుఁ బొరలున్ హా దైవమా యం చనున్.


క.

ఈలీల గోల మరువిరి
కోలలపా లై విరాళిఁ గొని యటు లుండన్
బాల యొకతె పలికెను ద
త్కాలోచితవృత్తి బ్రొద్దు గడపుటకుఁ దగన్.


మ.

వనజాక్షీ, కనుఁగొంటి వే నయనపర్వంబౌచు నస్తాచలం
బున నొప్పెన్ రవిబింబ మెఱ్ఱజిగిచేఁ బొల్పొంది నీకాంతుఁ డ
ల్లన మాణిక్యవిభూషణంబు లెదఁ గ్రాలన్ రేవు నూరేఁగుబా
గునఁ జెన్నారెడు పెండ్లి పీఁటపయి దాఁ గూర్చుండుతీరుం బలెన్.


క.

వనితా, సంధ్యారాగము
తనరెను మీరొకరి కొకరు తమిఁ జూడక ము

న్ననువుగఁ గల్యాణపుజగ
తిని బట్టెడు చంద్రకావితెరయుంబోలెన్.


గీ.

చూచితే ముందు వెన్కయుఁ దోఁచ కొకటి
కటికిచీఁకటు లెల్లెడఁ గ్రమ్ముకొనియె
నువిద పతిమ్రోల నీవు గూర్చున్నవేళ
నిన్ను నునుసిగ్గు పై ముంచుకొన్నరీతి.


క.

నల్ల నగుమింట నెగడెడు
తెల్లనితారకలు చూడు తిలకించెను నీ
వల్లభుఁడు నీదుతలపై
జల్లినతలఁబ్రాలరీతి జలజాతముఖీ.


ఉ.

కాంతరొ చూడు తూరుపునఁ గానఁబడెం దొలిగట్టుమీఁదఁ దా
వింతయు చంద్రమండలము వెల్లనికాంతి వివాహ మైనచోఁ
జెంతను నీవు నీపతి భుజింపఁగ ముక్కలిపీఁటఁ బువ్వపుం
బంతికి వెండిపళ్ళె మిడు బాగు గనంబడెఁ జూడఁ చూడగన్.

.

గీ.

అనిన నొక్కింత నవ్వి యోయంబుజాక్షి
వంతఁ బడువారి నవ్వింప వచ్చె దీవు
బయలు పందిరి వెట్టెదు ప్రౌఢ వౌదు
వెన్నియుపమలు కల్పించి తింతలోన.


శా.

తల్లీ, యింతటిభాగ్యముం గలిగినం దాఁ జాలుఁబో చంద్రునిం
బల్లెం బం చన నేర నే మనసులోఁ బాల్ త్రాగఁగాఁ గోరుచో
జిల్లేడాకుల దొప్ప గావలయునే చింతింపఁగాఁ జంద్రికల్
వెల్లంబాఱు నభంబు వెండిజిగిపల్లెం బన్నఁ గారాదొకో.


మ.

 అతివా, యెక్కడిమాట మాటల పరాకై యుంటిఁ జంద్రుండు గాఁ
డతఁ డాసల్పు కళంకు గాదు మదనుండన్ సాహెబూపం పనన్
వెతలం బెట్టఁగ నిల్వుకోక లటు లెంతే దాల్చి చూడంగ ను

ద్ధతుఁ డౌ నల్లనిమోముతోడ బిసిరౌతౌ నీతఁ డళ్కయ్యెడిన్.


చ.

అని కనుదోయి హస్తముల నాని వడంకుచు నున్నకన్నె న
క్కునఁ గదియించి యేల భ్రమఁ గుందెద వమ్మరొ నారదుండు మూ
పునఁ దనవీణ మోచుకొని పొందుగ నీపతిమేలివార్త నీ
కును వినిపింప వచ్చె నదిగో తిలకింపు మనన్ ముదంబునన్.


క.

కను విచ్చి చూచి కా దని
కనుఁగొనలన్ నీరు జాఱఁగా నుస్సు రటం
చును ననవిలుతునిములుకులు
వెనుదగిలె నటంచుఁ గురుల విరులన్ విడుచున్.


సీ.

మరునితూవులఁ గంది మగువ నివ్వెఱగంది
                 పరువుతో వెన్నెలబయిటి కేఁగు
వెన్నెల మై సోఁక వెలఁది నిల్వఁగ లేక
                 నెఱిగుంపు లేమావినీడ నిలుచుఁ

జిగురుమావిని జిల్క చెలఁగి పల్కులు గుల్క
                 విరిబోఁడి సురపొన్నసరస కరుగు
సురపొన్న విరిచాయఁ జొక్కి తేఁటులు మ్రోయఁ
                 గలికి బంగరుతమ్మికొలను డా యు
కలఁగు మదిఁ దారు నాల్గువంకలకుఁ బాఱుఁ
జలువలను గోరు గపురంపుసరవిఁ జేరు
విరులపొదఁ దూఱుఁ జెలిఁ జీఱు మరుని దూఱుఁ
దత్తఱము మీఱఁ దొలుతటితప్పు లేఱు.


క.

ఇటులు పరితాప మందుచు
నటు నిటు వెతఁ గుందుచుండ నాప్రాణసఖుల్
కటకటబడి పడఁతుక నో
ముటకై శైత్యోపచారములు సేయునెడన్.


గీ.

ఇంతి యొక్కతె సావిత్రి నెదను చేర్చి
కూర్మి నొకకొన్నిమాటలఁ గుస్తరించి
కొమ్మ యిందున్న దనుచాయఁగో యటంచుఁ
బలుకుకోయిలకడ చూచి పలికె నలుక.


క.

తలఁపఁగ నినుఁ గని పెంచిన
బలగము సహితంబు చెట్లఁ బరపిరి పికమా

యిల యెంత పేరు వెట్టిరి
కలకంఠ మటంచు నిన్నుఁ గాకులు పొడువన్.


క.

అనుచు నలిమింటి పైఁ బడు
ననువునఁ బొడచూపు నామృగాంకునివంకన్
గనుఁగొని మనమునఁ బెనగొను
కినుకను బేరుకొనుచుఁ బలికెను జెలి యంతన్.


చ.

చదివెడువారి కెల్లఁ దలఁచం దలవంపులు జేసినావు దు
ర్మదమునఁ బిన్ననాఁటిమహిమల్ దలపోసిన సిగ్గు గాదె యా
మొదలిటిప్రాఁతఱంకు పయి మోపుకయే ద్విజరాజ నంచుఁ ద్రు
ళ్ళెద విలమీఁద నీకు గతి లేదు నిశాచర బాస చేసెదన్.


క.

ఆహరునిఁ గన్నుఁ గానక
యాహా, తలద్రొక్కినా వటందురు చంద్రా,
సాహస మటరా దేవ
ద్రోహము నేఁజెల్ల! పచ్చితురకవు గదరా!

గీ.

అనుచుఁ బై వచ్చు తెమ్మెర కనియె బోటి
యవుర, నీ వింత సోఁకినయంతలోన
నొడ లెఱుంగక వడఁకుచు నున్న దబల
గాలి యనుమాట యిది నీకుఁ గల్ల గాదు.


క.

అని యింతకు మూలము క్రొ
న్ననవింటివజీరుఁ డనుచు నలుదెసఁ గనుచున్
నునువిరుల రాల్చుతరువులఁ
గనిశరముల నేయుమరునిఁగాఁ గని పలికెన్.


మ.

శివుఁ డేమో నిను భూతి చేసె ననఁగాఁ జెన్నొంది తద్వాక్యరీ
తి విచారింపక నమ్మి యుంటిమి “విభూతిర్భూతి రైశ్వర్య” మం
చు వినంగాఁ దెలిసెన్ నిఘంటుఁ గనినన్ జూతంబుతో నింద్రజి
త్తు వగన్ మబ్బున డాఁగి యేతురె జగద్ద్రోహంబుగా మన్మథా!


క.

అలశివునికంటిమంటలఁ
బొలు పెల్లన్ మంటఁ గలసిపోతివి తిరుగం

దలపోసి మాచినాయఁడు
గలఁడే మాపాపఫలము గా కిది మదనా!


మ.

అని దూషించుపడంతులం గనుచుఁ గన్యారత్న మోయక్క, ప
క్కన నీయన్నల నేల దిట్టెదవు భాగ్యం బింతగా నోచితే
యని నన్ దిట్టుము కాక నాదుపతి నన్నాసక్తి మన్నించుచో
ననుఁ గా దందురె వీర లెట్లగునొ మున్ బ్రహ్మానుకూలం బొగిన్.


క.

నా విని యావనితామణి
నీ వింతగ మదిని దెలియ నేర్చుట చాలున్
నీవిభునిచెంత నుండియు
నావేలుపుఁదపసి రేపె యరుదెంచుఁ జుమీ.


చ.

సకియరొ చూడు మాచరమశైలమునన్ నెల గ్రుంక నీడఁ జం
డకరుఁడు తూర్పుకొండను గనంబడెఁ గాలము పేరి యైంద్రజా

లికుఁ డొకచిప్పలోపల తెలిం గలబంతి నడంచి యొక్కచి
ప్పకుఁ బయిఁ చూపెనో యెఱుపుబంతి యనం జెలు వొందె వింతగన్.


ఉ.

ఇంతకు నారదుండు మనయింటికి వచ్చునొ యేమొ నీమదిన్
వంతలు దీరు మంచిశకునంబులు గానఁబడెన్ బడంతి యిం
దింతవడిన్ జరించఁ దగ దింటికిఁ బోదము ర మ్మటంచునున్
గొంతటి యుక్తి యౌ ననుచుఁ గొమ్ములు సమ్మతి చేసి పిల్వఁగన్.


క.

సావిత్రి తనదునగరికి
నావెలఁదులతోడ మగుడి యచ్చట నెంతేఁ
దా వగఁ గుందుచు నారదుఁ
డీవేళకు రాఁ డటంచు నెంచుచు నుండెన్.


గీ.

అనిన మునినాథునకు ధర్మతనయుఁ డనియె
మౌనికులచంద్ర, నారదమౌని యిపుడు

వడిగ నలసత్యవంతునికడకు నేఁగె
నని వచించితి రవి యెల్ల నానతిండు.


సీ.

నావుడు విను మంత నారదుం డావేళ
                 మరునితూపుల శయ్యఁ బొరలుచున్న
సత్యవంతునిమ్రోల సంతసంబున నిల్వ
                 నతఁడు కన్విచ్చి సాష్టాంగ మనుచు
మెల్లనె వచియించి మీరు వోయినకార్య
                 మే మని వేఁడ మౌనీంద్రుఁ డనియె
మంచిది గాక నీ వంచినపని గాక
                 పోవునే యన్న భూభుజుఁడు నగుచు
సఖులం గడకంటఁ గని వారు సైఁగ తెలిసి
యవలం జని నిల్వ మఱి యేమి యచటిమాట
లతివ యేమనె మీర లే మంటి రపుడు
తెలుపుఁ డని పల్క నమ్మౌనితిలకుఁ డనియె.


చ.

నృపతికుమార, మద్రపతియింటికి నేఁ జనలేదు పూజకా
యుపవనమందు నాసపడి యొంటిగఁ బూవులు గోయుచుండ నా

.

జపసర మొక్కచిల్క గొని సైఁగఁగఁ జాఱఁగ నేను బోవుచో
నపు డొకవింత గంటి పొదయాకడ నే కడఁ జూడ నెన్నఁడున్.


క.

మెఱుఁగో మరువిరిశరముల
మెఱుగో తెలియంగ రాదు మేనితళతళల్
గరగరిక నిన్ను నైనం
గరిగరిగాఁ జేయు నేమి గణుతింపఁ జెలిన్.


గీ.

చిలుకచేఁ గొన్న జపసరం బలికి మాకు
నొసఁగుటకు వచ్చె మెల్లన బిసరుహాక్షి
యపుడు మత్తేభమని తోఁచె నంత దెలిసె
నెదిరి రజతశుక్తిన్యాయ మిది యటంచు.


గీ.

అపుడు మాకు నమస్కార మనియె నతివ
యామృదూక్తికి మెచ్చి ముత్యములు నోట
నించవలె నంచు మది నెంచ నృపకుమార,
తరుణి పలు చాలయత్నకృతంబు లయ్యె.


గీ.

ఇంతి మునివ్రేళ్ళ జపసర మీయఁ రాఁగ
గోళ్ల నలవేళ్ళ యిది యొక్కకొమరు గొలిపె

కొమ్మ యటు ద్రిప్ప ముత్యముల్ కూర్చినటులు
చెలియ యిటు ద్రిప్పఁ బగడముల్ చేర్చినటులు.


గీ.

మునుపు నీవీణ చూచినానని వచించు
చో నొఱవు గాఁగ నేలు కేలినుం...
తోఁచె మామది గుబ్బలతోరమునకుఁ
గౌను విఱుగక యుండ చేఁ గాచెననుచు.


గీ.

వనిత నాశిక నువ్వుఁబు వ్వనుచునుండి
వెనుక సంపంగి యని తోఁచె వీణ మీటు
తఱిని దఱి లేచి నెమ్మోముఁదమ్మితేనె
నలకలను తేంట్లు గొనకుండ నిలుపవలయు.


గీ.

నీప్రసంగఫుమాటలు నే వచింపఁ
బడఁతి కడకంట బోటులకడను జూచె
నెపుడు శ్రీహరిసాక్షిగా నృపకుమార,
నిండె నీభాగ్య మనుకొంటి నెన్మునమున.


క.

ఆసొగసు చూడనేరక
రాసుతుఁడు స్వయంకృతాపరాధము నే నీ
వేసటయు విరహ మెన్నితిఁ
దా స్రుక్కెను నాతి ముడుఁగుఁదామరరీతిన్.

క.

....ను పంప నే నొక
పొదమఱుఁగున నుండి కొంత పొంచితి నిపు డా
మదవతివిరాళి నుడిపిన
నెది నీవు కవిత్వమందు విఁక నే మందున్.


గీ.

వెల్లులు ప్రోడ లౌటఁ జీటికి మాటికి
నబల...తు టదిగొ యిదిగొ
యనుచుఁ బలుకఁ గలికి యడియాసచేఁ బ్రాణ
మొక్కరీతి నిలిపె నోకుమార!


ఉ.

అంచు వచించినన్ నృపతి హా యని కన్నుల నీరు నించి రె
ట్టించినవంత చేఁ గలఁగి డెందముఁ జిందరవందు గాఁగ నొ
క్కించుక ధైర్య మూఁది నుతియించి విరించికుమార మీర లే
మం చరుదెంచినా రచట నశ్వపతిన్ గని రాక యియ్యెడన్.


గీ.

అవల వేయునబద్ధము లాడి యైన
నొక్కపెండ్లి చేసిన నది యుచిత మండ్రు

కాన నెటులైన మధ్రభూకాంతుతోడఁ
బొసఁగ మాటాడుఁ డని మునిఁ బోవఁ బనిచి.


సీ.

చెలి పటంబున వ్రాసి చెలు వెగాదిగఁ జూచు
                 మది రాక్షి . . .మనసు నిల్పు
రమణి నెన్నఁడు గూడి రమియింతునని యెంచు
                 హా, యిందుబింబాస్య, యని వచించు
నెలఁతను దలపోసి నిద్దుర వేగించు
                 మగువపైఁ దమిచేత మై కృశించు
రుచిరాంగిపై వింతరుచులను విరసించు
                 నువిదపై భ్రమ లజ్జ నవలఁద్రోయుఁ
గలికి తలంచి మేనికాఁకచేఁ దపియించు
ముద్దియ మది నెంచి మూర్ఛపోవు
నానృపాలుఁ డిటు దశావస్థలను బొందు
చుండు నిచట నారదుండు నంత.


సీ.

కొన్నిదినంబులకును మద్రపురమున
                 కరిగి యయ్యెడ నంతిపురములోన
పగడపుఁజవికలోఁ బగ......డుచు
                 మాళవితో నున్నమద్రపతిని

గాంచి వారలనతుల్ గైకొని కూర్చుండి
                 యవ్వల ముసిముసినవ్వు దొలఁకఁ
దనుఁ జూచుసావిత్రి దయఁ గనుంగొని రాజు
                 వలనికై చూచి యోవసుమతీశ!
యెవ్వ రీకన్య నీకూతురే మఱేమి
భాగ్యశాలివి యెన్నఁ డీపడుచు పెండ్లి?
తగినవరుఁ డున్నవాఁడె పొంతనము లమరి
యున్నవే సత్యవంతుఁడా యన్న నగుచు.


మ.

జననాథుం డనియెన్ మునీంద్రతిలకా
సర్వజ్ఞ! దైవజ్ఞు లీ రనుటల్ తప్పునె? సత్యవంతునినె పెండ్లాడం దలం పూనె ని
య్యనుఁగుంగూతు; రతండు మీకుఁ గడునెయ్యం బైనశిష్యుం డటం
చును విన్నా మిది మాకు భాగ్య మిట నంచుం బల్కఁ దా నిట్లనెన్.


ఉ.

ఆతఁడు మాకు శిష్యుఁ డని యంటివి గా నిజ; మైన నేమి సం

గీతము మాత్ర మే మతనికిన్ మఱి నేర్పుట; లీకవిత్వ మే
మాతనిచే గ్రహించితిమి యందునఁ గాదె ప్రబంధయత్నముల్
సైతము సేయఁ గోరితిమి చాయకుఁ బోక స్వతంత్రరీతిగన్.


క.

మక్కువను మొన్న నాతని
చక్కఁదనంబునకుఁ గాదె సరసపుఁబద్యం
బొక్కటి రచియించితిఁ గవు
లక్కట ఝషభషపుఁగవిత లల్లన్ గినుకన్.


ఉ.

నీవగ గుల్కుపల్కులకు నీనునువీనులు జొక్కు నీదులే
మోవిని నీదుకన్నుఁగవ ముద్దుగొనన్ దలపోయు నన్నచోఁ
దా వినఁ జూడ నేర్చు వనితామణి చొక్కక ముద్దుగోరకే
పోవునె సత్యవంత, యతిభోగజయంత, నితాంతవైభవా.

.

గీ.

అనిన నొకకొంద ఱిది విని యతిశయోక్తి
యనిరి నేను స్వభావోక్తి యనుచునట్లె
నిర్వహించితి నందు నానృపతి కొన్ని
పలుకు లపు డాడె నవి యొక పద్యమయ్యె.


గీ.

అవుర, నాస్వామి కవిరాజ వవుదు వయ్య,
బట్టబయట రసస్థితుల్ పరగఁజేసి
మెఱుఁగు గల్పించఁ గలఘనుల్ మీరె కారె
కాక యుండిన నారదఖ్యాతి గలదె.


గీ.

అనుడు పద్యము విని మెచ్చి రచటి పెద్ద
లతనిఁ బొగడంగఁ దరమె బ్రహ్మాదులకును
వింత గా దిది వాని వరింతు ననుచుఁ
బ్రతినఁ బూనినయీకాంత భాగ్య మెంత.


క.

ఇందులకుఁ గదవ లే దొక
సందేహము గలదు రాజసంక్రందన, మే
మందుం డిటు రాగా నీ
సందున నొకజోలి గలిగెఁ జక్కఁగ వినుమీ.


క.

అది మఱి దేవరహస్యం
బది యెవ్వరు వినఁగఁగూడ దందఱిఁ గడగాఁ

బద మనుము నీవు కూఁతురు
నిది వినుఁ డని మౌని దెలిపె నేకాంతముగన్.


సీ.

జననాథ, సత్యవంతుని కడనుండి మే
                 మిటు వచ్చుచో దేవభటుఁ డొకండు
బ్రహ్మయు మఱి సరస్వతి వీణియను వాదు
                 గలిగి గొబ్బున నన్నుఁ బిలువు మనిరి
రమ్మన్న నపుడు నేబ్రహ్మలోకము చేరి
                 యంతఃపురంబున కరుగుచుండఁ
గోణెవాకీట నొక్కకొమ్మయు సావిత్రి
                 యునుగూడి గుసగుస మనఁగ నిలిచి
యమ్మ యిది యేమి యేకాంత మంటి నన్న
నన్న మీశిష్యుఁ డెచ్చట నున్నవాఁడు
వానిపురమున నుండియే వచ్చి తిపుడు
యతనిమాటలె కావె యేకాంత మనియె.


ఉ.

నావుడు దేవి బ్రహ్మతిరుణాళ్ళకు వేంకటశైలనాథునిన్
సేవ యొనర్పఁ బోయితి విశేషము లీనడుమన్ మఱేమి యై

నా వినినారొ యంటి ననినన్ బుడమిన్ రిపు లాక్రమించినన్
దావిగతాక్షు లైనతలితండ్రులతో వనిఁ జేరె నం చనెన్.


సీ.

అంతలోన విధాత నాదేవి నన్నును
                 బిలుప నంపినఁ బోయి కొలిచి యుండ
సావిత్రి బహ్మతో సత్యవంతునిమాట
                 కే మంటి వనఁ బెండ్లి కేటి మీఁదఁ
గద గండ మీపు డేమి మొదటి నారాయణు
                 చేతియొప్పపులేఖవ్రాతఁ జూడు
మనుచు ముందఱ నుంచఁ దనకుఁ గా నిది దిద్ది
                 మంచిసంప్రతుల వ్రాయించు మనియె
ననిన నది మేర గాదు నా కైన వ్రాసి
కొనెద నిప్పుడు మఱవక వెనుక నైన
స్వామి యుత్తరు విప్పింప వలయుననుచు
వ్రాసికొని మమ్ముఁ బొమ్మనె వనజభవుడు.


క.

అంతటను దేవి నాతో
వంత విడువు లేఖ బాగ వ్రాయించితి శ్రీ
కాంతునియుత్తరు వొక్కటి
యింతే యయ్యేని పుడమి కేఁగు మనంగన్.

ఇక్కడ కొంత గ్రంథపాతము.

నారదుఁడు, సత్యవంతుని జీవితపరిమాణమును, సావిత్రికిని నామె తండ్రికిని జెప్పుట, సావిత్రి ఏమయినను, సత్యవంతునే వరింతు ననుట, సావిత్రీసత్యవంతుల వివాహము, ప్రధానముగా నాలుప్తగ్రంథభాగమున నుండఁబోలును.

గీ.

అవధరింపుము పాండవేయాగ్రజునకు
ఋషివరుండు మార్కండేయుఁ డిట్టు లనియె
నటుల నాయత్తమామల కాత్మపతికిఁ
జెలఁగి సావిత్రి పరిచర్య సేయుచుండ.


చ.

తమి గొని సత్యవంతుఁడును దా నొకచొక్కపుఁబర్ణశాలయం
దమరినపువ్వుఁబాన్పున బ్రియంబునఁ దేలుచు వింతవింతచం
దముల రమించుచుండి యొకనాఁటినిసిన్ దెలవాఱుజామునం
దమరమునీంద్రుఁ డల్లయపు డాడినయాపలుకుల్ తలంచుచున్.


సీ.

మునుపు గుబ్బలరొమ్ము మనసు దీరగఁ గ్రుమ్ము
                 గడు నొచ్చెనో యంచుఁ దడవి చూచు
మొదట గోటను చెక్కు సదమదంబుగ నొక్కు
                 దుదఁ దాఁకెనో యంచు వెదకి చూచుఁ
దొలుత వాతెఱకెంపు దొరలఁబంట ఘటింపు
                 వెనుక నాటెనొ యంచు విచ్చి చూచు

ముందఱఁ బైకొంచు ముచ్చటార రమించుఁ
                 బిదప డస్పెనొ యంచు పిలిచి చూచు
మున్ను మదికున్న పెనఁగొన్న మోహమునను
దగుతగము లేంచ కెంతకెంతకుఁ బెనంగుఁ
బిమ్మటను నాఁటిమాటకు సొమ్మసిల్లి
కొదుకు నేమిట నేమౌనొకో యటంచు.


క.

ఈరీతి మనసుత్రొక్కట
తో రాతిరి కూటమీగతో(?)భోజన మై
కారాకూరము సేయఁగ
నారాకూఁతురు దినంబు లరయుచు నుండన్.


క.

చుక్కలజిగి మానెను కవ
జక్కవలకు వేడ్క సాగెఁ జక్కెరవిలుతుం
డెక్కడికో యేఁగెను దమ
కెక్కడి బ్రతు కనుచుఁ జీఁక బెల్లను డాఁగెన్.


ఉ.

తూరుపు తెల్ల నైన రవి దోవక మున్నుగ లేచి తా నలం
కారము మీఱి వేఁడియుదకంబుల నత్తకు మామగారికిన్

గూరిమీతోడ స్నానమునకుం ఘటియించి ప్రియుండు వారికిం
గూరుచునాసపర్యలకుఁ గోరిన దెల్లను దా నమర్చుచున్.


క.

అలపతి పొలమునఁ దెచ్చిన
పలుదెఱఁగులకందమూలఫలముల నాయా
తలఁ పెఱిఁగి రుచుల నమరుచు
నలరుచు భుజియింపఁ బతికి నయ్యరువురకున్.


గీ.

ఇటుల వారికిఁ బరిచర్య నింపు చేసి
తాను భుజియింప నొల్లక తనకు వార
లొసఁగుదీవన లెన్నుచు నొక్కచోట
నొంటి నేకాంతముగఁ గూరుచుండి యపుడు.


మ.

మొదల న్నారదుఁ డాడి పోయినదినంబున్ గూడ మున్నూటయేఁ
బదియా ఱయ్యె దినంబు లింక గణియింపన్ నాలుగోనాఁటికిన్
గద నారాయణపాదపద్మములు నాకాంతుండు సేవింప నౌ

నది యీలో ఋతువేళ రా నిది యభాగ్యం బింక నాపూన్కికిన్.


క.

నిరు డీదినములనే కద
హరిహరి మఱి పెండ్లిపాట లై యుండుట లొ
క్కరు గడవఁ గలరె జగదీ
శ్వరుఁ డిఁక నెటు సేయనున్నవాఁడో తలఁపన్.


క.

 కా నున్నది కా కుండునె
కానిది మఱి యౌనె! కమలగర్భుఁడు మొదటన్
దా నొసట వాసి యుండఁగ
నే నేల విచారపడఁగ నిటు నటు లంచున్.


క.

ఈవగ ననుఁ బుట్టించిన
సావిత్రికి లేని బరవసము నా కేలా
నావలనఁ గొదువ లే దిఁక
నావల్లభుతోడి దయ్యె నాజీవనమున్.


క.

అని సావిత్రిని గొలిచెద
ననుచుఁ ద్రిరాత్రోపవాసమగు నొకవ్రతమున్
మనమునను బూని యప్పటి
యొనరిక పరిచర్య సేయుచుండెం బతికిన్.

గీ.

ఎంత దాఁ దెల్పినను భుజియింప కున్న
సత్యవంతుఁడు సేరి ప్రసంగముగను
దండ్రి కెఱిఁగింప వగచి యతండు వడిగఁ
గోడలిని బిల్చి కూరిమితోడ ననియె.


శా.

తల్లీ యీవఱకుం భుజింపవట సంధ్యాకాల మౌదాఁక నే
చెల్లంబో భుజియింపకుందురె మహాసింహాసనస్వామి రం
జిల్లం గాంచిన ముద్దుపట్టివి మ ఱేసింగారముల్ లేక నా
యిల్లుం జేరుటఁబట్టి యిట్టివెత లాయెన్ మా యభాగ్యంబునన్.


ఉ.

అన్నము లేకయున్న మఱి యా కలమైన ఫలంబు లైన నిం
దున్నవి నీవునున్ సరసియుంచి భుజింపక యుందు రమ్మ మా
కన్నులు లేనిదుఃఖమును గానకయుందుము నీవు పోవ మే

.

మన్నది యేమి లేదుగద వమ్మ యి దేమిటి కమ్మ యిమ్మెయిన్.


క.

నాకూఁతు రనుట లే దిఁక
నీకోడ లటంచుఁ గంటి నీరు దొరుగఁగా
నాఁకటికిఁ దాళలే దని
మాకున్ మీతండ్రి తెలిపె మగువా తొలుతన్.


మ.

అనుచుం గన్నుల నీరు నించుకొన నయ్యబ్జాక్షి పాదంబుపై
నెనయన్ వ్రాలి భవత్ప్రసాదమున నా కిష్టాన్నముల్ లేవె బా
పనముత్తైదువు లెల్ల నోములు ఘటింపన్ నాకునుం నోమఁగా
మన సై పూనితి నీవ్రతం బొకటి మామా! దీన మే లోందెడున్.


శా.

మళ్ళన్ మీర లనుజ్ఞ లీవలె ననన్ మాయమ్మ కానిమ్ము మా
కెల్లన్ నీ వొకతేప నాపదలుబొయ్యేనోముగా నోముమీ

తల్లీ ని న్నవుఁ గా దనన్ వెఱతు మాదారిద్ర్యముం బోయె నీ
వుల్లాసంబున నాదిలక్ష్మివలెనే యుండంగఁ జూడన్ వలెన్.


గీ.

అనినఁ బ్రియమంది సావిత్రి యహరహంబు
మగని నెడఁబాయ కాయత్తమామలకును
గొలువు సేయుచు మూఁడుపూటలు గ్రమించి
తెఱవ తరువాత నాలవదినమునాఁడు.


ఉ.

ప్రొద్దున లేచి తాఁ బసపు పూసుక కుంకుమ బొట్టు దీర్చి యా
పెద్దల కెల్ల మ్రొక్కి తనపెన్మిటికిం బరిచర్య సేయఁగాఁ
బ్రొ ద్దొకజాము సాగుటయు బోటిని బిల్చి ప్రియంబుతోడ నిన్
వద్దన లేము చాలు నుపవాసము పారణసేయు మిం కిటన్.


క.

అనినన్ మామకుఁ గోడలు
వినయంబున మ్రొక్కి రాత్రి విధుమండలముం

కనుఁగొనినదాఁక పారణ
యొనరింపఁగ రాదు కొదవ యున్నది నేఁడున్.


క.

అని తెలిపి సత్యవంతుఁడు
పనిపూనుక కందమూలఫలములు తేరన్
వనమున కేఁగెడుకదలికఁ
గని యిది బాగయ్యె ననుచుఁ గళవళపడుచున్.


క.

ధవునిచెంగటి కరిగి పాదముల కెఱఁగి
వనుల వింతలు నేఁ జూడవలయు ననిన
నెన్నఁడును గోర విది యేమొ హేతు వనుచుఁ
జెలియనునుఁజెక్కు ఱొమ్మునఁ జేరి పలికె.


మత్త.

వేడుకన్ మును కేళికావని వీథులం బువుఁబోండ్లతో
గూడిమాడి చరించ నేర్చిన కోమలాంగికి నీ కయో
నేఁడు ముచ్చట లయ్యె నీమృగనిష్ఠురాటవిలోన నా
టాడఁగా ననుఁ జెట్టవట్టున దయ్యొ యిందుల కోసమే.

ఉ.

మెత్తని నీతనూలతిక మేకొన నొల్లదు పైన నున్న నీ
తత్తర మెంచ నన్ నిలువఁదాళదు నే నెటు లాడలేను నీ
యత్తను మామగారిని బ్రియంబున వేఁడుము మంచి దంచు నా
రుత్తరు విచ్చినం జను దమోవనితావనితావు లారయన్.


మత్త.

అనిన భాగ్య మయ్యె నంచు నత్తమామ గారికిన్
వినయ మెక్క మ్రొక్కి యొక్కవిన్నపంబు చేసెదన్
వినుఁడు మీ కుమారకుండు నేఁ డరణ్యవాటికిన్
దనరఁ బోవుచున్నవాఁడు నాకు ముచ్చ టయ్యెడిన్.


క.

అందుల వింతలు గలవట
చందనముల వగల లతలచందమ్ముల మా

కందమ్ముల కుందమ్ముల
కందమ్ములఁ జూడ వేడుకలు కొనసాగున్.


క.

నా కావింతలు కనుగొన
నాఁకలియును దఫ్ఫి పుట్ట దటు గావున మీ
రీకోరినవర మీవలెఁ
జేకొని నామాట త్రోపుసేయకుఁ డనియెన్.


గీ.

వగచి నాతల్లి నీవు నీ మగఁడు వేడ్కఁ
బోయి రండని దీవించఁ బోయి కటికి
భావ మొకరీతిగా నఱపఱిక మైన
తెలివితోఁ బోయి రమ్మని పలికి రంత.


క.

సావిత్రి యత్తమామల
చే వేడ్క ననుజ్ఞగొనుచుఁ జిత్తం బలరన్
సావిత్రీదేవిని మది
భావించుక మగనివెంటఁ బడి వడిఁ జనియెన్.


క.

ఇక్కరణిఁ బుణ్యదంపతు
లక్కాననమధ్యసీమ నరుగుచు మఱియున్
దిక్కులు కనరాకుండఁగఁ
గ్రిక్కిఱిసిన యొక్కవనిఁ జరించుచు నచటన్.

సీ.

ఇంతేసి బలుమ్రాఁకు లెవ్వఁడు వేయించె
                 నా కానతీ మనోనాథ యనిన
ఇంతేసి యేనుంగు లిం దుండ మన కేల
                 యీ లేమి తెలుపు ప్రాణేశ యనిన
ఇంతేసితోఁపుల కేల కట్టరు నీళ్ళు
                 జీవితేశ్వర నాకుఁ జెప్పు మనిన
నింతేసిపొదరిండు లిచ్చట నుండఁగా
                 హృదయనాయక నగ రేటి కనినఁ
బొక్కిపొక్కి పడుచు నొక్కమాటాడక
కంటనీరు జాఱిఁ గరఁగి కరఁగి
కటకటా విధాతఘటన యెవ్వరి కైనఁ
గడవవశమె యంచుఁ గడవడించు.


చ.

కనుఁగవ విచ్చి కాంతునిమొగంబు నెగాదిగఁ జూచి నాథ పే
ర్కొన మన పెండ్లి నేఁటివఱకున్ మఱి యెన్నిదినంబు లయ్యె నం
చన నొకవత్సరంబు సరి యయ్యె నటంచు వచింప గుండె భ

గ్గనఁ బగులన్ మదిం బొగుల హా హరి యంచును గన్ను మోడ్చుచున్.


గీ.

ఆత్మనాయక యీజీబుటడవిలోనఁ
జండభానుండు రేలు దాఁగుండు నేము
యుండకుండిన నిటువంటియెండతోడఁ
బొద్దు గ్రుంకిన నేడకుఁ బోవుఁ జెపుఁడ.


సీ.

కొమ్మమేలుగఁ జనుగుత్తులఁ గనుపట్టె
                 గోరంటవలదె యోగుబ్బలాఁడి
లతకూనమోవి చల్లఁగఁ గనుపట్టి ప
                 ల్వగల నొక్కఁగరాదె చిగురుఁబోఁడి
కలకంఠి పొగడ చొక్కము గాఁగ నెలుఁగిచ్చె
                 జెవియొగ్గి వినరాదె కువలయాక్షి
శ్యామ క్రొవ్విరివికాసము చూడరాణించె
                 దండ రాసించరా దా లతాంగి
అనినఁ బతిచతురోక్తుల కల్ల నగుచు
మీకుఁ బ్రత్యుత్తరము లీయ నాకుఁ దరమె
నారదుఁడు మీమహత్త్వమంతయును మున్నె
తెలిపినాఁ డది నామది నిలిచి యుండె.

శా.

ఆమైఁ జూచితె ప్రాణనాయక గజం బాపెంటియేనుంగుతోఁ
గామక్రీడకుఁ బాఱెడిం గలసి సింగం బుండుటల్ కానలే
దే మౌనో యన నేమి గాదు శరభం బెంతే దృఢారంభమై
యామూలం గని పొంచి యున్నయది సింహంబున్ గ్రహింపం దమిన్.


క.

అన నిది దైవాధీనము
వనజోదరుఁ డిట్ల జముని వారింపఁ గలం
డని సావిత్రియు దేవిని
మనమునఁ దలపోసి తల్లి మఱవకు మంచున్.


ఉ.

కంటిని ఱెప్ప గాచుక్రియఁ గాంతునివెంబడి జంట వీడఁబో
కంటి మెలంగెఁ దాను దనప్రాణము లాతనికైవసంబుగా
నుంటఁ బరుల్ హరింతు రనుయోజనయుం బలె వీరిఁ జూచి నే

.

నింటికిఁ బోవలే ననురహి న్నిలిచెన్ నడిమింట భానుఁడున్.


ఉ.

అంతట సత్యవంతుఁడు నిజాంగనతో నిఁకఁ బోవకుండినన్
వంతలఁ బొర్లుచున్ మునలివారలు బారలు చాఁపుచుందు రో
కాంతరొ దేవపూజలకుఁ గావలెఁ దావులపూవు లంచుఁ దా
నంతట నున్నభూజముల నందిన పూవులు గొన్ని కోయుచున్.


చ.

కరడియ చూచి చాల దని క్రమ్మఱ సంపఁగికొమ్మ వంచి పైఁ
దిరిగినకొమ్మకై నిగిడి తీయఁగఁ బుప్పొడి కంట రాలఁగన్
జుఱుకుచుఱుక్కునం దుడుచుచున్ విరిగొమ్మ వదల్చి చాలుఁ గ్రొ
వ్విరు లిదె బాల యందుకొనవే యని చేతి కొసంగి దీనతన్.

మ.

తల దిమ్మెత్తెను మోపు మోచుక్రియ డెందం బేమొ వెఱ్ఱెత్తిన
ట్టుల కానంబడె మేను త్రోపువడినట్టుల్ వాలెడిన్ ఱొమ్ములో
శిలవోలెన్ బరు వయ్యెడిం గడుపులోఁ జే పెట్టి గాలించుబా
గుల జాలయ్యెడు బోటి తాళుకొన నాకున్ గూడ దావంతయున్.


శా.

కొమ్మా పట్టు మటంచుఁ జెక్కు నునుచెక్కుం జేర్చుచున్ వ్రాలి యో
యమ్మా నే నినుఁ జూడనైతిఁ గదె యయ్యా యెంత చింతింతువో
యమ్మా యా విధి యింత సేయు నని యాహా కానలేనైతిఁ గా
మమ్ముం బ్రోవు ముకుంద మాధవ హరే మాం పాహి సర్వేశ్వరా.


చ.

అని నిదురించురీతి నయనాంబుజముల్ మొగిడింపఁ జూచి యే

మనక పతివ్రతాతిలక మంత హరిస్మరణాంతరంగయై
కనుఁగవ నీరు నించక వికారము లేక గరంబు మ్రింగి వ్రా
లిన శివుచెంత నున్నసతిలీల నిజేశునిఁ జూచుచుండఁగన్.


వన.

కనియె ముంగలఁ గాలమేఘనికాశగాత్రుఁ బవిత్రునిం
ఘనవిహారకు రక్తతారకుఁ గాంచనాంబరధారకున్
జనభయంకరు ఘోరకింకరుఁ జండిమప్రతిశంకరున్
కనదుదార? కంటకుండలకాంతు నంతఁ గృతాంతునిన్.


క.

అప్పురుషుఁడు చేపాశము
విప్పుకొనుచు రాఁగఁ జూచి విభునిన్ ధరపై
నొప్పుగను డించి మ్రొక్కుచు
మెప్పుగ నంజలి యొనర్చి మిక్కిలి భక్తిన్.

గీ.

అయ్య యెవ్వర వీవు నా కాన తీవె
యడవి నిటు లున్నమమ్ము నీయెడవిని యమ
ధరరాజునుబోలె బ్రత్యక్షమైతి
రేమి సేయఁ దలంచితి రోమహాత్మ.


చ.

పగతుర నైనఁ గోపమునఁ బాఱఁగఁ జూడని యీకృపాళునిన్
వెగటుగఁ జూచి చేరెదవు నే నబలన్ మఱి యేమి నేర నా
మగఁ డితఁ డోమహాత్మ యన మానిని నీమగఁ డౌటనే సుమీ
మిగిలినవారిఁ బంపకయె మే మరుదెంచితి మేను గాలుఁడన్.


ఉ.

అతులపతివ్రతాతిలక మౌటను కంటివి నన్నుఁ గాన రా
నితరుల కేను ద్రోవ విడు మీతఁడు సంతతవిష్ణుభక్తుఁ డో
యతివరొ కాల మెవ్వరికి నైనను దాఁట వశంబు గాదు పొ

మ్మితఁ డిదె విష్ణులోకమున కేఁగెడు మాపురిత్రోవగా ననన్.


క.

హరిభక్తుల కేటికి నీ
పురిత్రోవ యటన్న లోకమున 'రాజ్యాంతే
నరకం ధ్రువ' మనువాక్యం
బెఱుఁగవె కొన్నాళ్లు రాజ్య మేలఁడె యితఁడున్.


మ.

అనుచుఁ దొంతరచిక్కుఁద్రాటను నృపప్రాదేశమాత్రాత్మజీ
వుని బంధించి యముండు పోవఁ గని పువ్వుంబోడి ప్రాణేశువెం
టనె రాని మ్మని మ్రొక్కి పూలఁ బొదరింటం డాఁచి వెన్నంటఁ గ
న్గొనియున్ జూడక దక్షిణాభిముఖుఁ డై ఘోరంపుమార్గంబునన్.


క.

ధర్ముం డీగతిఁ జని చని
కూర్మిన్ సావిత్రిఁ జూచి కోమలి యటపై
దుర్మార్గము నడఁజాలవు
నిర్మలమతి వలదు వలదు నిలువు మటన్నన్.

గీ.

విభుని విడనాడి దుష్టులవెంటఁ బోవ
నదియ ధర్మాత్మ దుర్మార్గ మండ్రు గాక
వరునితోఁ గూడి సత్సహవాసముగను
మంచిత్రోవను బోవ సన్మార్గ మనరె.


క.

కావున సన్మార్గం బిది
మీవెంటనె రాఁగ ననిన మెచ్చితిఁ దరుణీ
నీవల్లభుజీవము వెలి
గా వేఁడుము వర మొకటియుఁ గరుణింతు ననన్.


ఉ.

స్వామి మహాప్రసాద మల సాల్వమహీపతి యై చెలంగుమా
మామయు నత్తయున్ మొదటిమార్గమునన్ బహురాజ్యవైభవ
శ్రీమహనీయు లై ముదము చెందుచుఁ గన్నలఁ జూచునట్టు లీ
వే మముఁ బాసి యెంత పలవింతురొ కన్నులు గాన కవ్వనిన్.


క.

అన మంచిది నీ విఁక నిలు
మనుచున్ వడివడిగఁ జనగ నంటిపఱచుచున్

వనితామణి యాదినమణి
తనయునకున్ నెనరు పొడమఁ దా నిట్లనియెన్.


గీ.

ధర్మదేవత వందు రందఱును నిన్ను
నన్ను నాభర్త నెడఁబాప న్యాయ మగునె
వరునిజీవము నాదుజీవమును బెనఁచి
చేకొనఁగ రాదె నే నంత మీకు బరువె.


గీ.

ఏడడుగులు మాటాడుచుఁ
గూడ న్నడచినను దెలిసికొన నేస్తము నీ
తోడంబుట్టినజమునకు
జోడుగ సమవర్తి నన్నుఁ జూడన్ వలదే.


క.

అనఁ దిరిగి చూచి తల్లీ
తను దూఱఁగ నేమి నే స్వతంత్రుఁడ నటవే
కొనిపోవ నుంచిపోవన్
వనజాక్షుఁడు దక్క నొకరివశమే తలఁపన్.


గీ.

ఇంత యేటికి నిన్ను వహించుకొనుచు
దినము నీచేత నోమించుకొనినతల్లి
యగుట సావిత్రియును బిల్లతగులు వడిన
హంసియునుబోలి తిరుగు నియ్యంబరమున.

క.

తనచేతఁ గాక తక్కిన
ఘనులకు మొఱ చేసి చేసి కాకుండిన నా
వనరుహనయనుని వైకుం
ఠనివాసుని వేఁడుకొన నటన్ జనఁ దలఁచెన్.


క.

ఇటు గనుక ధవునిజీవం
బిటు వేఁడక తగినవరము నేదైనను నొ
క్కటి వేఁడుము నే నొసఁగెద
దిటముగ నన మదిని బొదలు తెగువ దొలంకన్.


క.

కూతురు నల్లుఁడు నిచ్చట
నీతెఱ వగుమాట వినిన నెంత పొగులునో
మాతండ్రి యపుత్రకుఁ డిక
నాతనికిన్ సుతులు నూర్వు రగువర మీవే.


గీ.

అనిన నారీతి నిచ్చెద నడల వలదు
నిలువు నాతోడ నాతోడ నీవు రాకు
మసుచు బిఱబిఱ చనియె మీయయ్య యనిన
ధర్మజుఁడు వల్కె మునికి సంతసముతోడ.


క.

మాయయ్యపలుకు లెఱుఁగుదు
మాయెడ సావిత్రి చనియె నంటి వపుడు నా

రాయణుకడ కామా టే
మాయెఁ దెలుపు తాపసోత్తమాయని వేడన్.


క.

విని మార్కండేయమహా
ముని తా నిట్లనియె నట్లు మోహముకతనన్
వినువీథినిఁ దిరుగ జగ
జ్జనని మహాయోగమూర్తి సావిత్రి దయన్.


క.

తనమనోహరుఁ డైనయవ్వనజభవుని
తొడుక పోయెద శ్రీపతికడ కతండు
తాను మనవిగఁ దెల్పి పాదములఁ బడినఁ
గా దనఁ డటంచు సత్యలోకంబు సేరి.


క.

నిగనిగనిమిద్దెలో ము
ద్దుగ గాయత్రీసరస్వతులచే విద్యల్
వగవగను వినుచుఁ గనుచున్
దగుచున్ నగుచున్నవేళఁ దా నటు చనఁగన్.


సీ.

వడి లేచి యిదె యమ్మవారు వచ్చి రటంచుఁ
                 గడమబోటులు మ్రొక్కి కడల నిల్వఁ
దా వీణతో లేచి రా వక్క యని సర
                 స్వతి యేదు రేఁగి చే సాఁచి దివియ

వేదాంత మడుగుటల్ వెస నిల్పి గాయత్రి
                 చెలియ ర మ్మనుచు నవ్వలికి జరగ
రా రమ్ము రాఁగదే రావె రావో యంచు
                 నల్గొగంబులతోడ నలువ పిలువ
వచ్చెద నటంచుఁ దలగడవలను చేరి
యజునిచెవిలోన గుసగుసమని యటంచు
గొంత యేకాంతముగఁ దెల్పఁ గొదవ వినక
మునుపె తలయూఁచెఁ బోరాదుమనమటంచు.


క.

మఱి వినుఁ డని గాయత్రీ
సరస్వతులు తెలుప వినుట చాలును మీరే
మెఱుఁగ రిది మొదటిపుట్టువ
యరసినచో నాకు నేర మగు నే వెఱతున్.


గీ.

అనిన సావిత్రి బ్రహ్మతో ననియె నీవు
స్రష్ట వని యుండి మఱచుటే స్రష్టతనము
నోరు మూసినఁ బెడతల నుడువు దనుచు
నలువ ని న్నెంతు రాజసం బలరె నిపుడు.


క.

నీపాప మేమి సేయుదు
వాపాప మహిన్ జనింప నటు చేసినదే

నా పాపము నాపాలిటి
యాపాపం బవ్వలించు హరి గలఁ డింకన్.


మ.

అదియు జూచెదఁ బోయి వచ్చద నటం చందుండి సావిత్రి తా
మది భావించినయంతవేగ విరజామాంగల్యరంగన్నదిం
గదియం జేరి కిరీటకుండలయుగగ్రైవేయముక్తాసరాం
గదపీతాంబరశంఖచక్రధరులం గాంచెన్ సరూపాఢ్యులన్.


క.

చూచుచు వైకుంఠపురం
బాచెంతం దోచినంత హరి హరి యనుచున్
దోఁచినగతి వర్ణించుచు
నాచాయన్ రాజవీథి నరుగుచు నచటన్.


సీ.

చతురంగబలములసందడిని సునంద
                 కుముదు లుండెడుహజారములు చూచి
యందందుఁ బుష్పదంతాదు లాయత్త మై
                 వసియించుకొలువుదావళ్లు దాఁటి

వచ్చినదొరల విష్వక్సేనగరుడు లి
                 మ్ముల నిల్పు పెండ్లిచౌకలు గ్రమించి
సమయ మౌదాఁక నీశ్వరనారదుల్ చద
                 రంగ మాడెడుచప్పరమ్ము లరసి
యవల శుకసనకసనందనాదు లొంటి
నగజచేఁ దత్త్వముల్ వినునగరు చొచ్చి
సమయ మడుగక నవమణిస్థగిత మైన
వనజనాభునిపడకయిల్ వడిగఁ జొరఁగ.


క.

నిలునిలు మని జయవిజయులు
తళతళ మనుపసిఁడికట్లఁ దగుబెత్తములన్
నిలుపఁగ నగి ననుఁ బోవన్
వల దనునేకాంత మేమి నాకుం దడయే.


గీ.

ఎన్ని వరుసల నుత్తరు విచ్చినా నొ
కింత తారతమ్యంబులే యెఱుఁగలేరు
పోని మీ రైన నే వచ్చినా నటంచు
వడిగఁ జని తెల్పి రం డన వారు నగుచు.


క.

ఓవెఱ్ఱిటితల్లి తెలియదె
మీవద్దనె కొలిచినారమే వా రెల్లన్

మీవలె దుడుకులు చేసిరె
పో వల దన నిలువ లేదా పోపొ మ్మనఁగన్.


క.

నే పోవ కుండ ననఁగా
నే పోవఁగనీ ననంగ నే పోదు ననన్
నే పోనీ నన నఱవఱ
లై పెదపెదమాట లయ్యె నపు డట్టియెడన్.


సీ.

సందిటిబో పట్టుసల్లి యున్నవిధంబు
                 పెదవి గ్రోలుచుఁ గొంత వదలుతీరు
నే మోమొ పలి కిప్పు డే మంటి ననురీతి
                 వినుమాట తప్ప నూఁకొనెడుదారి
మఱిమఱి మితితప్పుమడుపు లందుతెఱంగు
                 గోట నొక్కినఁ దాళుకొనెడినీటు
చే విదల్చుచునట్టె చెవి యొగ్గుచందంబు
                 బయలు తప్పక చూపు పఱపుహొయలు
చూచి నాస్వామి యెక్కడఁ జూచె దిపుడు
నీకు నాతోను నాతోన నీవు తెల్పు
మనుచు నిందిర తను వేఁడ నల్ల నగుచు
వనిత మఱి యేమి లే దని వరదుఁ డపుడు.

సీ.

బురుసారుమాలతో నరవీడువిరిపూల
                 నొగి జాఱుసిగ కేల నొత్తికొంచు
వడి లేచుచోఁ జుంగు పుడమిఁ జీరుపసిండి
                 నీటుదుప్పటి వల్లెవాటు గొంచు
మినుకుజన్నిదముతో మెలిగొన్నముత్యంపుఁ
                 తెలిసరుల్ చిక్కులు దీర్చుకొంచు
మొదటఁ దబ్బి బ్బౌట మొనవేళ్ళఁ గై జాఱు
                 నుంగరంబులుఁ జక్క నుంచుకొనుచుఁ
జిటులుగంధంబు చెక్కులఁ జెమరుచెమట
చెదరుతిలకంబు చిఱునవ్వు చెన్నుదొలఁక
జిలుగుపావలు ద్రొక్కుక కలిమిచెలువ
యొసఁగుకైదండతో వింతసొగసు మీఱి.


క.

వాకిటికలకల మే మని
శ్రీకాంతుఁడు వెడలి నలువచెలువం గని యే
మీ కోడల నీకలకల
మాకానరుతాళుకొనుము మముఁ జూచి యనన్.


చ.

పదములమీద వ్రాలి సితపద్మవిలోచన బంధమోచనా

వదనవిధూతచంద్ర శివవర్ణితనిర్మలకీర్తిసాంద్ర నీ
రదసమగాత్ర లోకనుతరమ్యచరిత్ర భవత్కటాక్షమున్
బదిలము గాఁగ నమ్మి యొకబాలను బేరిడి నేను పెంచితిన్.


క.

దేవర సకలం బెఱుఁగుదు
రావనితకుఁ బ్రాణనాథుఁ డగువిమలాత్మున్
దావకభక్తునిఁ గొని యదె
పోవుచునున్నాఁడు జముఁడు పొరిఁ దనపురికిన్.


గీ.

అనఁగ నంతలోన నతిరయంబున నొక్క
విష్ణుదూత వచ్చి వినయముగను
దేవదేవ స్వామి దేవరభక్తుని
బూని జముఁడు తొడుకపోఁ దొడంగె.


మ.

అనుమాటల్ విని యేడ నేడఁ బద యౌనే దేవి నీ వాడువాఁ
డును వాడేకద కూడి రమ్మనుచుఁ జూడ్కుల్ భూమిపైఁ బాఱ నె

వ్వనిదిక్కున్ గనుఁగోక పేరుకొని విష్వక్సేనునిన్ బిల్చి నీ
వును నీవారలుఁ గోల్వుచావడినె నిల్వుం డంచుఁ జే వీచుచున్.


క.

గుబ్బలబరువున వడఁకెడి
లిబ్బులబిబ్బోకవతిని లీలం గేలన్
గొబ్బునఁ గౌఁగిటఁ జేర్చుక
నిబ్బరమున గరుడు నెక్కి నిండినవేడ్కన్.


సీ.

మొనసి పన్నగవైరి తనఱెక్కలు ముడించి
                 కొని వగఁ దగ మెట్టుకొనుచుఁ జనఁగఁ
దగిలి చిల్వలరాజు తన వేయుపడగల
                 గొడు గెత్తి బుసకొట్టుకొనుచు నడవ
నంటి వేలుపుమౌని యరవీడుజడలతోఁ
                 దనవీణ పలికించుకొనుచుఁ బఱపఁ
గదిసి తక్కినవార లదె మించె నిదె కూడు
                 కొనుఁ డంచు వగరించుకొనుచు నరుగ
మించి గిబ్బతేజీ దుమికించుకొనుచు
దేవి సావిత్రి యచ్చటి త్రోవఁ జూప

వెనుక బ్రహ్మాదు లింతంత వెంట నంట
నశ్వపతిపుత్రి కపుడు ప్రత్యక్ష మయ్యె.


క.

ఈకరణిఁ గరుణతోడను
వైకుంఠనివాసుఁ డైనవనజూక్షుఁడు ప
ద్మాకాంతాయుతవక్షుఁడు
వీకం బొడచూప భయము వినయము తొలఁకన్.


ఉ.

ఆయెడ మ్రొక్కుచున్ ముకుళితాంజలి యై చెలి సన్నుతించె నా
రాయణ వాసుదేవ హరి యచ్యుత కేశవ నారసింహ కం
జాయతపత్రనేత్ర దనుజాంతక మాధవ పక్షివాహ నా
కాయము నాదుజన్మమును గన్నులుఁ బావన మయ్యె మీదయన్.

నాగబంధము

చ.

నగహరి దేహసార సుజనా జగదుత్తమ యేకవీర మం
దరధర పూతహారనరన్రదవిగ్రహ గౌరమేదురాం

బర శుకమోదకార జనమానవవర్ణిత శౌరి కోవిదా
చరణ రమామనోరమణ బాణకరచ్ఛిద ధీరపావనా.


సీ.

ఈఁదుచు జలరాశిపైఁ దేలు దొకవేళ
                 నూరకే మునిఁ గుందు వొక్కవేళఁ
బొలుపుగా మొగముద్రిప్పుకయుందు వొకవేళ
                 నుగ్రంబుగాఁ జూచె దొక్కవేళఁ
బ్రభువులఁ జే సాఁచి బ్రతిమాలు దొకవేళఁ
                 జక్కఁగాఁ జెండుదు వొక్కవేళ
రాజవై ధర యెల్ల రక్షింతు వొకవేళ
                 గ్రక్కునఁ బెకలింతు వొక్కవేళ
నుందు వొకచోటఁ గదలక యొక్కవేళ
దిక్కు లల్లాడఁ దిరుగుదు వొక్కవేళ.
బరిపరివిధంబు లగుమీప్రభావ మెఱుఁగ
బ్రహ్మ కైనను దరమె యోపద్మనాభ.


ఉ.

ఇంతటి మీమహామహిమ
యించుకయుం గననైతి, నంచుఁ గొం

డంతటివాడు గ్రుంగఁబడి యల్లదె మ్రొక్క నుతించసాగె నీ
యంతకునిన్ భవత్కరుణ నారయుఁ డీతనిచేత నామనః
కాంతునిప్రాణ మున్న దటు గావున స్వామికి విన్నవించితిన్.


మ.

అని నానాగతులన్ నుతింప వరదుం డాకాలునిం జూచి నే
మునుపుం దెల్పనె యెంత తెల్పినను నీమూఢత్వమే పోకపో
యె నయో యాతనివిష్ణుభక్తి వినవో యీసాధ్విచారిత్రమున్
మనసావిత్రి వహించుటల్ కనవొ యైనా యింత గర్వింతువే.


ఉ.

అంతక నిన్ను నీపురికి నంపుదు నింతకు నేఁటి కీమహీ
కాంతుఁ గృపాంబుధిన్ బ్రదుకు కంటి పతివ్రత లున్నత్రోవ నీ

వింతటినుండి పోయిన సహించను నీమన సంచుఁ బల్కి యో
యింతిరొ నీకు నీపురుషు నిచ్చితి నీ పతిభక్తి మెచ్చితిన్.


గీ.

వనిత వేయేండ్ల కైదువతనము గలిగి
యింట సంపద పూలచే రెత్తినటుల
కలిగి కొడుకులు మనుమలు కల్గి మనుము
తరుణి నానాఁటఁ దామరతంప రగుచు.


మ.

అని దీవించుచు శ్రీనివాసుఁ డటఁ దా నంతర్హితుం డైన వెం
టనె బ్రహ్మాదులు పోయి రంత నృపుప్రాణంబుల్ జముం డిచ్చి పో
యెను సావిత్రియు నాపతివ్రతను దా నెంతేని దీవించి యా
త్మనివాసంబున కేఁగె నం చనఁగఁ బ్రేమన్ ధర్మరా జిట్లనెన్.


గీ.

ఎంత భాగ్యవతియొ యెంచంగ సావిత్రి
యంతదేవిఁ గొలిచి యముని గెలిచె

శంఖచక్రధరుని సత్యంబుగాఁ జూచె
బులక లొదవె నవలఁ దెలుపుఁ డనిన.


శా.

అంతన్ ధర్మనృపాల వింటె సతి తా నానందవారాశిచే
నంతస్తాపము లెల్లనుం దడిపి యాహా నోముమే లంచుఁ ద
త్కాంతారంబులు దాఁటి యొక్క పొదపొంతం గాంతుదేహంబు దా
నెంతే హేలను దీయుచున్ దొడలపై నింపొందఁగా నుంచుచున్.


ఉ.

కాంతునిమో మెగాదిగను గన్గొని చూచుచు నుండునంతలోఁ
గొం తటు కన్నులం బులుముకొంచును నిద్దుర మేలుకొన్నలా
గెంతయు దోఁప లేచి యిది యేమి పడంతుక లేప వైతి వీ
పొంతల నింతగా నిదుర వోవఁగ నిత్తురె ప్రొద్దు వ్రాలెడిన్.

మ.

కలకంఠీ కల గంటి నే నొకటి యింకం దెల్విరాలేదు న
న్నెలుఁ గొక్కండు గ్రహింప వెంటఁ బడ నే నెందేని నేఁగంగ న
వ్వల వేఱొక్కపడంతి యొక్కరునిఁ దేవాఁ డామృగంబున్ శరం
బుల నేయన్ విడిపించుకొంటి నదియేమో చూచిన ట్లయ్యెడిన్.


ఉ.

అన విని నవ్వి మంచికల యౌ నిది నీకల రేపు విప్పెదం
గనుఁగొను మల్లపశ్చిమనగంబున నర్కుఁడు గ్రుంకెఁ బైపయిం
దనుజులఁ బోలి గాయములఁ దాకుట నెత్తుటం దోఁగి నిల్వఁజా
లనికతనన్ ధరం బడినలాగు గనంబడెఁ జూడఁ జూడఁగన్.


చ.

తొడరి జముండుఁ దానుఁ దనదూతలతో రవిఁ గ్రమ్ముకొన్నయా

వడువునఁ జీకటుల్ గవిసె వల్లభ నల్దెస వానిఁ దోలఁగా
సుడిసినవేల్పులో యనఁగఁ జుక్కలు రాజిలె సేద దేఱి యె
ప్పుడుబ లెఁ దెల్వితో నిలిచె బ్రొ ద్దనఁగా నెల దోఁచెఁ దూర్పునన్.


క.

అని యుపమ మీఱఁ బల్కిన
విని యౌ నౌ నతనికీర్తి వెలసినరీతిన్
బెనఁగొని నలుదెస వెన్నెల
కనఁబడె నిది పట్టపగలు గావలెఁ జూడన్.


ఉ.

కాంతరో చూడు త్రోవ యిదె గానఁగ నయ్యెడు మెల్లమెల్లనే
యింతటఁ బోవఁగా వలయు నింటికి నొంటి నిటుండ రాదు నో
వంతగ లేదొడల్ చులుకనైనది తల్లియుఁ దండ్రి నేడు తా
మెంత విచార మంది రొక దే ననుఁ బా సిఁక నేమి సేయుదున్.

సీ.

గడియలో నలుమాఱు గౌఁగిట ననుఁ జేర్చి
                 యొడ లెల్లఁ దడవక యుండలేరు
నిమిషంబు తమచెంత నిలువకుండిన నన్ను
                 నొకటఁ బేర్కొని పిల్వకుండలేరు
గోరంతసేపు నేఁ గూరకుఁ బోయున్న
                 నూఁతకా లూని రాకుండలేరు
క్షణము నే భుజియింపక పరుండినను శౌరి
                 కొగి మ్రొక్కు మీఁ దెత్త కుండలేరు
పండి పడనున్నపండులై యుండువారు
రెండుకన్నులుఁ గొనరా కుండువారు
నాకుఁ బలవించి పలవించి నన్నుఁ దలఁచి
తలఁచి తా రేమి తలఁచిరో తెలియరాదు.


చ.

అడవుల మాకడన్ దపసి వై యొకరాజ్యసుఖంబు లేక ని
న్నడలఁగఁ జేసెనే నలువ యాకలముల్ గొని తెచ్చె దయ్య నా
కడుపునఁ బుట్టి యిందు కొడిగట్టఁగఁ జేసెను దైవ మయ్యయో

కొడుక యటంచు నా కడలు కూరిమి త ల్లిపు డెంత గుందెనో.


క.

సంతానమువలె నీ వొక
సంతానము గలిగి తిదియ సంపద యని న
న్నెంతయుఁ గొనియాడును నేఁ
డింతీ నాతండ్రి చింత నెంత పొగిలెనో.


మ.

అని చింతింపఁగఁ గాంతయుం బొగిలి దుఃఖాక్రాంత యై
కాంతునిం
దనహస్తంబుల వాల్చి యెత్తి తెలి వొందం జేయుచుం గౌఁగిటం
గొనుచున్ దేహము దుమ్ముపోఁ దుడుచుచున్ కొప్పున్ ముడిన్ వైచుచున్
దనడాకేలఁ గుఠారమున్ గరిడియం దాఁ బూని లీలాగతిన్.


గీ.

తనదువలకేల నతనిమే నొనర గ్రుచ్చి
యతనిడాకేల నెగనెత్తి యానుకొనఁగఁ
దనదువలమూపుపై నుంచి ధవుని నచట
వనిత మెల్లన నడిపించుకొనుచు మగిడె.

ఉ.

ఇక్కడ నాశ్రమస్థలిని వృద్ధులు పుత్రుఁడు రాక యున్కికిం
బొక్కుచు నాల్గుదిక్కులకు మోములు ద్రిప్పుచు బారఁ జాఁపుచున్
వెక్కుచు నోకుమార యని వేమఱు గొంతులు రాయఁ గూయుచున్
ఱెక్కలు దీయుపక్షు లన నిల్చి రిఁ కే మని తెల్ప నవ్వెతన్.


శా.

ఈలీలం బలవించుచున్ గరము లెంతేఁ జూపుచున్ మింటికై
యోలోకేశ్వర యోగజేంద్రవరదా యోప్రాణిసంరక్షకా
యోలక్ష్మీపతి మాకు నీవె శరణం బోతండ్రి మాపుత్రునిం
బాలుం గానఁగఁ జేయు మంధకుల మాపద్బాంధవా యం చనన్.


ఉ.

అంత వరప్రభావమున
నప్పుడె కన్నులు వచ్చి నల్దెసన్

వింతగ దంపతుల్ గనుచు నేఁ డిది యేమి సుతుండు రాని బల్
వంతఁ జరింపఁ గన్ను లెటు వచ్చె నటంచును గన్నులందు నీ
రెంతయు నాన నెప్పటిరహిన్ గను గాననివారలున్ బలెన్.


క.

తడఁబడుచు నడవి నలుగడ
నడలుచు మునివరులఁ గొడుకు నడుగుచునుండన్
బడతియుఁ దానును సంతస
మడరఁగ నలసత్యవంతుఁ డపు డేతెంచెన్.


చ.

తనయునిఁ జూచి బారఁగొని తల్లియుఁ దండ్రియుఁ గౌఁగిలించి మో
ము నెడఁద మోపుచున్ శిరము మూర్కొని పేర్కొని యోకుమార బా
లునివలె నింతసే పడవిలో జరియింపుదు రయ్య మౌను లె
ల్లను దెలుపంగఁ బ్రాణ మొకలాగున నిల్పితి మేమి దెల్పఁగన్.

క.

నావుడుఁ దండ్రీ యౌ నని
తా వని కేఁగుటయు బడలితో వ్రాలుటయున్
దా వెగటుగఁ గల కనుటయుఁ
దా వచ్చుట దెలుప సాధ్వి తా నిట్లనియెన్.


సీ.

ఓమామ నారదుం డొకనాఁడు దెలిపె నీ
                 ఘనునకు నేఁటికి గండ మనుచుఁ
గాన నేఁ డితనితోఁ గాననంబున కేఁగి
                 నే నుండ నీతండు నిద్రవోవ
జముఁడు ప్రాణము గొంచు జరగ నే వెంటనె
                 చన దయచేసె నాజముఁడు నాకుఁ
కొన్ని వరములు మీకు నయనముల్ రాజ్య
                 మును గల్గ మాతండ్రి తనయులఁ గనఁ
దుదను నే నోము సావిత్రి తొడుక రాఁగ
నపుడు మనపాలి శ్రీకాంతుఁ డరుగుదెంచి
మీతనయుజీవ మిప్పించి మిగుల నన్ను
దయను దీవించి చనె నని తరుణి పలుక.


గీ.

పులక లొదవంగ నానందజలధిఁ దేలి
నిలిచి దంపతు లోతల్లి నీవు గలుగ

మళ్ళి బ్రదికితి మాపద లెల్లఁ బోయె
వనిత మాపాలి భాగ్యదేవతవు నీవు.


క.

అని కొనియాడఁగ నచ్చటి
మును లాగుణవతికి సతికి మ్రొక్కుచు నెంతే
వినయమున వారు దాముం
దనరుచు నుండంగ నొక్కనాఁ డరుదందన్.


ఉ.

ఉక్కుదగన్ దగన్ బదుగురూడిగముల్ వెనువెంట నంటి రాఁ
జుక్కగతిన్ గతిం గులుకుచుఁ దెలిమించువయాలితేజిపై
నెక్కి హుటాహుటిం దనయ నెప్పుడు చూతు నటంచు నశ్వరా
జక్కడి కేగుదేఱఁ గని యందఱు నెమ్మది సంభ్రమించుచున్.


గీ.

అపుడు మ్రొక్కెడువారు మే లడుగువారు
మెచ్చుకొనువారు దీవన లిచ్చువారు
నగుచు నొక రొక్క రటు నిటు నరుగుచుండ
బ్రహ్మచారి యొకం డటు పాఱుదెంచి.

సీ.

పొదివె నల్లదె మహాద్భుతధాటి రథకోటి
                 పటుకేతుపటపటపటలతోడ
నడచె నల్లదె మదోన్మదమదావళఘటల్
                 మణిఘంటికాఘణంఘణలతోడఁ
గవిసె నల్లదె నిరాఘాటఘోటకము లు
                 త్కటఖురాహతచిటపటలతోడఁ
జేరె నల్లదె రణశూరవీరభటాళి
                 బహుళకూజితకహకహలతోడ
సాల్వపుర మఁట చండప్రచండవీరు
లనెడువారఁట ముగురఁట యదిగొ చూడుఁ
డీడకేనఁట వచ్చుట లీనృపాల
వరులపైకఁట చను డంచుఁ బలుక నపుడు.


సీ.

పులితోళ్ళు నారచీరలతోడ బంధించి
                 దర్భగంటులలోన దాఁచువారు
కల కమండలువుల మొలబంటినీళ్ళలో
                 ముంచి కానక యుండ నుంచువారు
సమిధలమోపు పచ్చనియాకులను గప్పి
                 తొడిఁబడఁ బొదలలోఁ దూర్చువారు

యజ్ఞసాధక మైనయరణులకోవులఁ
                 జెట్టుపైఁ గొనగొమ్మఁ గట్టువారు
గుమిగఁ బసిబిడ్డ లిల్లాండ్రు తమరుఁ గూడి
వడి నిజాశ్రమభూమికి వచ్చువారు
నైన ముసిముసినవ్వుతో సరయుచుండ
నృపుల కిట్లనె నొకచారు డెదుట నిలిచి.


క.

ఖండించెద మని వీరుఁడుఁ
జండుఁడును బ్రచండు డిదిగొ చనుదెంచిరి మీ
రుండకుఁ డిఁక నెట కేనియుఁ
బొం డెఱిగించితిని నేను బూర్వుం డగుటన్.


వ.

అని పలుక సత్యవంతుఁ డలుక పొడమి తన
పడంతికనుసన్నఁ గదనంబునకుఁ గదలుతమ
కంబునం దనువునఁ బులకజాలంబు లొదవ
జననీజనకులకును మామకుం బ్రణమిల్లి దృఢ
కఠోరంబగు కుఠారంబు కేలం గొని యశ్వపతి
యనుమతి నతనితురంగారోహణంబుఁ జేసి
యుద్ధసన్నద్ధుండై గొబ్బున నబ్బలంబుల కెదురు
కొని నడవం గని చండప్రచండవీరు లుద్దం

డభుజదండమండలీకృతకోదండు లై యొం
డొరులం బురికొల్పి ముంగలఁ జతురంగబలం
బులం గవియింపఁ బెంపున నప్పుడు పొడమం
బ్రొద్దుపైపయిం బెళపెళన యఱుమునుఱు
ములం దళతళ మెఱయు మెఱపులం గ్రమ్ము
పొడిపొడిమబ్బులయుబ్బునం బెడబొబ్బలన్
ధగద్ధగ విచ్చుకత్తులం జుట్టి ముట్టిన నట్టిట్టి
యత్తెట్టుల పైకిందోలినఘోటకంబు నూఁకి
యకుణకిరణసమానానూననానాబాణజాలం
బులం బఱపిన నవి పుట్ట వెడలు పాములవడు
వున నేదు చిమ్మినకైవడిం గణుఁదురీఁగలు
మూఁగినబాగునన్ జల్లువాన గొట్టినపెల్లున
రాల రువ్విన తెఱంగున రింగురింగున బిసబిసఁ
గవిసిన నవిసినరథంబులుం గెడసినగజంబు
లుం బడినతురంగంబులుం జడిసినబలంబులుం
దునిసినవిండ్లును రాలినభూషణంబులున్ దొర
లుగొడుగులును విఱుగుకేతనంబులునుం
బ్రేవులు మెదడులు గుప్పలు నెమ్ముల తెట్టలు
నెత్తురు వఱదలు కండలు మెండును నై సం

గరాంగణంబు గంధసింధురంబు నీరాడిన కెం
దామరకొలని చందం బందె నందుఁ జండుం
డరు దంది నిజస్యందనంబు బిఱబిఱం గుఱి
పడం బైపడం దఱిమిన కేడించి తురంగం
బెదురుకొలిపి యమ్ము లొక్కుమ్మడిం గ్రుమ్మరిటం
చినవిధంబున మర్మంబుల నాటి తేరపీఁటం
గ్రుచ్చికొన నేసిన విగతాసుం డయ్యె నత్తేరున
కత్తించినబొమ్మకైవడిం గదలక యుండె నంత
నంతకాకారుండగు ప్రచండుం డుద్దండవేదం
డం బేటవాలుగా దులదులం బఱపిన నావాజి
వాగెమలఁచి వానికింజుట్టు కేడెంబుగా గొంత
వడిం ద్రిప్పుచుం గేలిసింగిణీ నతనికంధరంబు
నం దగిలించి దిగఁదీసినం దునిసి చతికిలంబడి
వేదండ? కడుపునుం దానును బందివిధంబునం
బొరలుచుఁ బ్రాణభీతి నొకకేల గజంబుదిక్కు
నకు నొకకరంబు తనదిక్కునకు నొడ్డుకొనం
బకపక నగుచుఁ గఱకునేజా గొనిమొన
చూపుచున్ గొంతయుడు కాడించి యం
తం మణ రాజిల నాజానేయంబు ద్రిప్పినప్ప

డిన బొసకుండు దిగులునం గడసె నది విలో
కించి కొంత కొంత వగచుచు నాసత్యవంతుండు
తన తేజీ కంధరంబు కరారవిందంబున నప్పళిం
చుచు మొగంబు దుడిసి చెవి నిమిరి మెల్ల
మెల్ల నెరవఁ గాలున నెడనెడ నడిపింప నది దూ
రంబునం గని వీరుండు భండనవీరుం డగుచుఁ
గరంబుల వాలునుం బలకయుఁ బొదల నిజ
తురంగం బారాజపుంగవుమీఁదికిం బఱపిన
దురదుర నెదురుకొని పట్టిన పట్టెంబు నఱికి
నద్దంప తిరిగి మరలం బురికొలుపుకొని
యిద్దఱు సరియుద్దు లనం గొంతప్రొద్దు ముద్దు
ముద్దుగా ముద్దుగుమ్మలు కోలాట లాడు
వేడుకం గత్తిగతియు ఫెళఫెళనునాదు
నాదారకుండ నొండొరులు కుఱికి నఱుకు
లాడుచుండ నవ్వీరుండు కొండొక బెండువడి
చండితనంబునం గండుమిగిలి పేరువాఁడికే
డెంబుమఱుంగునం గుంగిలి ముంగలకున్ నిగిడి
చుఱుకుచుఱుక్కునం గొనచిమ్ములు చిమ్మి
కమ్ముక యొక్కుమ్మడి నడిదమ్మునకు ఎసర సరకు

గొనక పలక మెలఁకువ నది నపిల యదియును
నిదె తునిమెద నని తల కుఱికి నఱక మఱుఁ
గిడినపలక తునుకతునుక లైపోవం దలపునుక
పగిలెనోయని కేలం దడవి చూడఁ గలకల
నగి తప్పెఁ దప్పె వెఱువకు మని నీకు నిది
నిజంబు చేసెదనని వెనవెన వెనుక కొదుగు
కైవడి తత్తడిం దొడల మెలంకువం దెప్పునం
బైకి నూఁకి నిజమండలాగ్రంబున వానిమేను
రెండుతుండెంబులుగా నఱికినం దక్కినవా
రలు జయజయరవంబులతో శరణంబులు
వేడినఁ గరుణారసంబున వారి నాదరించి మో
దంబున నున్నయన్నరేంద్రునిమీఁద దేవతా
గణంబులు పుష్పవర్షంబులు గురిసిరి నార
దుండు దండె మీటుచుం గడుపు చల్లఁజేసితి
వని దీవింపం దొడంగె నప్పు డాజయవంతుం
డగుసత్యవంతుండు తక్కినచతురంగబలం
బులుం గొలువ వందిమాగధులు బిరుదుకై
వారంబులు చదువఁ దా నరుల నుఱుము
చేయుటల నభినయించుతెఱంగునం గఱ

కఱన కళ్ళెంబున ములుచు తనకీర్తి దిక్కు
లకుం జాటు నీటున నోట నిగనిగనినురువులు
పరికించుచుఁ జెలంగుతురంగంబు నాడ నాడ
జోడనలు త్రొక్కింపుచుఁ దెల్లజల్లులు విచ్చుక
ఱెక్కలగతి నిక్కి చూప నచ్చటచ్చట దుమి
కించుచు నిజాశ్రమంబునకు వచ్చి ముచ్చ
టతో నందఱికి వందనంబులు చేసి దీవనలు
గైకొని యిది యంతయు దేవరప్రభావంబు
గదాయని కడగంట సావిత్రికడం గని
నేర్పు గులుకఁ బలుకుచు నానందకందళిత
హృదయారవిందుం డై సంతతారాధితగో
విందుఁ డై సుఖం బుండునంత.


చ.

హితులు పురోహితుల్ సచివు లెంతయుఁ బెద్దలుఁ బూర్వభృత్యులున్
మతి గలవారుఁ బౌరులును మంత్రులుఁ గూడి నుతించి మే మిఁకన్
బ్రతుకుదు మీవు రాజ్యపరిపాలన చేసిన రమ్మటంచు స

మ్మతపడి పిల్వ సాల్వపతి మంచి దటంచుఁ బ్రమోదితాత్ముఁ డై.


గీ.

అచటిమౌనుల నందఱి నభినుతించి
వాసి నిన్నాళ్ళు మీగర్భవాసమునను
నునిచి పోషించితిరి దయ మఱవ కెపుడు
మముఁ గటాక్షింపుఁ డని పల్కి సుముఖుఁ డగుచు.


సీ.

తనమేలు కెదురు చూచినబాంధవావళి
                 రథముల నుభయపార్శ్వముల నరుగ
నింత నంతట భద్రదంతావళం బెక్కి
                 చతురంగబలముతో సుతుఁడు నడవ
లలితసంగీతమేళముతోడ మద్రేశుఁ
                 డును దేజి దుమికించి మునుచనంగఁ
దళుకుఁబచ్చలపల్లకుల నెక్కి వరుసగా
                 నమరి కాంతయుఁ గోడ లంటి రాఁగ
భేరిభాంకారరవములు బోరుకొనఁగఁ
గులుకు మీఱుకుమారునందలములోన
నలద్యుమత్సేనభూపాలుఁ డరిగె నపుడు
తనరు ప్రాగ్జ్యోతిషం బనుతనదుపురికి.

చ.

 చని మఱునాఁడు తా సకలసంభ్రమముల్ తనరంగ సత్యవం
తునకును గట్టెఁ బట్టము జనుల్ కొనియాడ నతండు తండ్రికం
టెను గుణి యై భరింప ధరణిన్ సరి సేయఁగఁ గూడఁ దా నరేం
ద్రున కల రాజసమ్మునన్ మఱి శేషుని దిగ్గజంబులన్.


సావిత్రీచరిత్ర సమాప్తము

క.

తంజాపురిరఘునాథుని
లంజెయొ యతఁడో వచోవిలాసము మెఱయన్
రంజిల్ల బుధులు రచనా
మంజిమ సావిత్రిచరిత మహి రచియించెన్.