శృంగారశాకుంతలము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శృంగారశాకుంతలము
ప్రథమాశ్వాసము
శ్రీవత్సాంకుఁడు భక్తవత్సలుఁడు లక్ష్మీప్రాణనాథుండు రా
జీవాక్షుండు సమస్తభూతభువనక్షేమంకరానేక రూ
పావిర్భావుఁడు వాసుదేవుఁ డను కంపావాసుఁడై దాన వి
ద్యావిఖ్యాతుని మంత్రి వెన్నని నితాంతశ్రీయుతుం జేయుతన్.1
సీ. పూని చరాచరంబు భరించు నొకమూర్తి
యుడుపుఁ దృష్ణాభేద మొక్కమూర్తి
యారగించు మనోజ్ఞమగు హుతం బొకమూర్తి
యొసఁగు జైతన్యంబు నొక్కమూర్తి
యాదిత్యులకుఁ ద్రోవయై పొల్చు నొకమూర్తి
యుడుగణంబుల నేలు నొక్కమూర్తి
విశ్వంబు చీఁకటి విరియించు నొకమూర్తి
హోతయై దీపించు నొక్కమూర్తి
తే. యరయ నెవ్వనియందు నయ్యష్టమూర్తి
యిష్టఫలదాత కరుణాసమేతుఁ డగుచు
వెలయఁ జిల్లర నాగయ వెన్నమంత్రిఁ
జిరతరైశ్వర్యసంపన్నుఁ జేయుగాత.2
శా. చేయు న్విశ్వము నెవ్వఁ డంచితకళాశిల్పం బనల్పంబుగా
వ్రాయుం బ్రాణుల ఫాలపట్టికల నెవ్వం డర్హవర్ణంబు లా
మ్నాయవ్రాతము లూర్పు లెవ్వని[1]కి నయ్యబ్జాతగర్భుండు దీ
ర్ఘాయుష్మంతునిఁ జేయు నాగవిభు వెన్నామాత్యచూడామణిన్.3
మ. జననీస్తన్యముఁ గ్రోలుచుం జరణ[2]కంజాతంబునం గింకిణీ
స్వన మింపారగఁ దల్లిమేన మృదులస్పర్శంబుగాఁ దొండ మ
ల్లన యాడించుచుఁ జొక్కువిఘ్నపతి యుల్లాసంబుతో మంత్రి వె
న్ననికి న్మన్నన సొంపు మీఱ నొసఁగు న్భద్రంబు లెల్లప్పుడున్.4
సీ. పగడంపుఁ జిగురుజొంపము సొంపు విహసింపు
కడునొప్పుఁ గుఱుచ కెంజడలవాఁడు
విదియ చందురుతోడ వీడుజో డాడెడు
రమణీయ దంష్ట్రాంకురములవాఁడు
సీధుపానక్రీడఁ జెంగల్వ పూఁజాయ
దొంగిలించెడు కన్నుదోయివాఁడు
క్రొత్తనీలాలరంగునకు నించుక మించి
మెఱుఁగారు నల్లని[3]మేనివాఁడు
తే. పృథివి కవతంసమణి యైన బిట్రగుంట
దానకంబుగ నవతారమైనవాఁడు
భైరవస్వామి సకలసంపదల నొసఁగి
మనుచుఁ జిల్లర వెన్నయామాత్యవరుని.5
ఉ. మెచ్చగు విచ్చు దమ్మిపువు మేడలలోన నిధానదేవత
ల్వచ్చి కటాక్షసంజ్ఞకుఁ గెలంకులఁ గొల్వఁగ నోలగంబు సొం
పచ్చుగనుండు చంద్రముఖి యాదిమలక్ష్మి వసించుఁ గావుత
న్మచ్చిగ వెన్నయప్రభుని మందిరరాజమునందు నిచ్చలున్.6
మ. పొసఁగ న్నేఁ గృతిఁ జెప్పఁగాఁ బరిమళంబు ల్చాల కొక్కొక్కచోఁ
గొస రొక్కించుక గల్గెనేనియును సంకోచంబు గాకుండ నా
రసి యచ్చోటికి నిచ్చుఁగాత పరిపూర్ణంబొంద వాగ్గేవి యిం
పెసలారం దన విభ్రమశ్రవణకల్హారోదయామోదముల్.7
శా. అర్థి న్మామక మానసాబ్జమున నధ్యాసీనుఁ గావించి సం
ప్రార్థింతు న్యతి సార్వభౌముఁ బరమబ్రహ్మానుసంధాత నా
నార్థాలంకృతబంధురశ్రుతిరహస్యజ్ఞాత శ్రీభారతీ
తీర్థశ్రీచరణంబు నుల్లసితముక్తిప్రేయసీవల్లభున్.8
వ. అని యిష్టదేవతాప్రార్థనంబు గావించి.9
సీ. వల్మీకసంభవ వ్యాసమౌనీంద్రుల
వాణి కంజలిబంధపాణి యొసఁగి
భట్టబాణ మయూర భట్టారకుల
మంజుభాషావిశేషంబుఁ బ్రస్తుతించి
భవభూతి శివభద్ర బంధుర భారతీ
హేలా విలాసంబు నిచ్చగించి
మాఘ భారవుల నిరాఘాటచాటు
సరస్వతీపుణ్యగౌరవముఁ దలఁచి
తే. లల్లటుని గాళిదాసు సౌమిల్లకునిని
భామహుని దండి వామను భాను హర్షు
హర్షసంపూర్ణహృదయుఁడనై కవిత్వ
సమధికస్ఫూర్తికై భక్తి సంస్తుతించి.10
క. ఇట్టల మగుమతి భారత
ఘట్టమునకు నడవవచ్చుఁ గట్టిన కవితా
పట్టాభిషక్తు నన్నయ
భట్టోపాధ్యాయుఁ దలఁచి పరమప్రీతిన్.11
గీ. ఉభయ కవిమిత్రు నత్యంతశుభచరిత్రు
భానుసమతేజు గొమ్మయప్రభుతనూజు
సుకృతవిభ్రాజిఁ దిక్కనసోమయాజిఁ
బ్రణుతబహుదేశకవిరాజిఁ బ్రస్తుతించి.12
వ. ఒక్కప్రబంధంబు రచియింపఁబూని యున్నంత.13
సీ. సకలభూపాలకాస్థానసౌధంబుల
వర్ణింతు రేమంత్రి వాగ్విభూతి
సంతాన సురధేను చింతామణుల పెంపు
ధట్టించు నేమంత్రి దానమహిమ
యాశాంతదంతిదంతాఘాటములమీఁద
విహరించు నేమంత్రి విమలకీర్తి
సుకవిగాయకబహుస్తుతిఘోషణంబున
నలరు నేమంత్రి గేహాంగణంబు
తే. వాఁడు కౌండిన్యగోత్రాభివర్ధనుండు
మదవదరిసైన్యపతిమానమర్దనుండు
నాగయామాత్యతనయుండు నయవిశేష
విజితసురమంత్రి చిల్లర వెన్నమంత్రి.14
వ. ఆమంత్రిమందారం బొక్కనాఁడు పురాణేతిహాసప్రసంగంబుల
వినోదించుచుఁ దనమనంబున.15
శా. నల్లిల్లున్ గుడియున్ వనంబును నిధానంబున్ దటాకంబు రం
జిల్లుం గొండొకకాల మేఁగ నవి విచ్ఛేదంబునుం బొందు నే
పొల్లుం బోనిది కీర్తికిం గృతియ పో భూమండలిం దానికిం
దెల్లం బిప్పుడు రామభారతకథాధీనప్రబంధావళుల్.16
సీ. వల్మీకసంభవు వాక్యసంపన్నత
దశరథాధీశనందనుని కీర్తి
సాత్యవతేయు వాచావిలాసంబునఁ
గౌంతేయపంచకాగ్రణి ప్రశస్తి
చిత్తపవచనరాజినిబంధనంబున
దారమహాపురాధ్యక్షు మహిమ
కాళిదాసవచోవిశాలతాప్రౌఢత
విక్రమాదిత్యభూవిభుని చరిత
తే. మఱియుఁ దత్తత్కవీంద్రసమగ్రవాగ్వి
భూతిఁ దెలుపుచు నున్నది పూర్వరాజ
శీలదానాదిచర్యావిశేషములను
గీర్తి సదనంబు కృతియ తర్కింప ధరణి.17
క. ఆచంద్రతారకంబుగ,
భూచక్రమునందుఁ గీర్తిఁ బోషింపఁగఁ దా
రోచిష్ణు వగు ప్రబంధము,
వైచిత్రి యొనర్చు సుకవివరుఁడు కలిగినన్.18
సీ. నన్నపార్యుని ప్రబంధప్రౌఢ
వాసనాసంపత్తి సొంపు పుట్టింప నేర్చుఁ
దిక్కన యజ్వవాగ్ఛక్తి కామోదంబు
చెలువు కర్ణముల వాసింప నేర్చుఁ
నాచిరాజుని సోము వాచామహత్త్వంబు
సౌరభంబులు వెదచల్ల నేర్చు
శ్రీనాథభట్టు భాషానిగుంభంబుల
పరిమళంబుల గూడఁ బఱచ నేర్చు
తే. మహితగుణశాలి పిల్లలమఱ్ఱి వీర
నార్యుఁ డాయింటఁ బైతామహం బగుచును
వెలయుచున్నది నేఁడు కవిత్వలక్ష్మి
యఖల సత్కవినికరంబు నాదరింప.19
క. ఆసుకవిచేత శివభజ
నాసక్తునిచేతఁ గశ్యపాన్వయుచేతన్
భాసురనవకవితాల
క్ష్మీసదనునిచేత వలయుఁ గృతిఁ జెప్పింపన్.20
మ. అని సాధ్వీమణి నాగమాంబకును, విద్యాభారతీజాని గా
దనకుం బుత్రుని వీరభద్రపదపద్మధ్యానశుద్ధాంతరం
గుని నన్నుం బిలిపించి లోనఁ దనకోర్కుల్ సందడింపఁగ మ
న్నన దైవాఱఁగ గారవించి పలికె న్గంభీరవాక్ప్రౌఢిమన్.21
సీ. రచియించినాఁడవు రమణీయవాగ్రీతి
నవతారదర్పణం బభినవముగఁ
బల్కినాఁడవు తేటవడఁ జేసి నారదీ
యము సత్కవిశ్రేణి యాదరింపఁ
జెప్పినాఁడవు శేముషీవిశేషంబున
మాఘమాహాత్మ్యంబు మంజుఫణితిఁ
గావించినాఁడవు ఘనబుద్ధిమానసో
ల్లాససారము సముల్లసితశయ్య
తే. భారతీతీర్థయతిసార్వభౌమగురుకృ
పాతిశయలబ్ధకవితావిభూతి గలిగి
గౌరవముఁ గాంచినాఁడవు కవులచేత
విపులచాటూక్తినిర్నిద్ర! వీరభద్ర!22
గీ. కలదు చాలంగఁ బ్రేమ నీవలన నాకు
వేడ్క నడిగెదఁ గవులెల్ల వేడ్క పడఁగ
షట్సహస్రకులోద్భవసచివులందు
సుకృతిగాఁ జేయు నా కొకసుకృతిఁ జేసి.23
శా. ప్రఖ్యాతం బన మిశ్రబంధ మన నుత్పాద్యం బనంగాఁ ద్రిధా
వ్యాఖ్యాతం బగు వస్తు వందు మఱి యధ్యాహారముం జేయఁగాఁ
బ్రఖ్యాతం బితివృత్తమైన కృతి చెప్పన్ వక్తకున్ శ్రోతకున్
విఖ్యాతిం గలిగించుఁ బుణ్యమహిమన్ విశ్వంభరామండలిన్.24
క. శృంగారము ముఖ్యంబగు
నంగియు నంగములుఁ దలఁప [4]నన్యరసములు
న్సాంగ మగునేనిఁ డంకము
బంగారముతోడి యొర ప్రబంధము వొందున్.25
గీ. కథప్రసిద్ధయు మిగులశృంగారవతియుఁ
బరిగణింపంగ శ్రీమహాభారతమునఁ
గథితయైన శకుంతలాఖ్యానభంగి
నది ప్రబంధంబుఁ జేయు ప్రఖ్యాతినొంద.26
సీ. [5]సరపువ్వులుగ మాలకరి పెక్కుతెఱఁగుల
విరుల నెత్తులుగఁ గావించినట్లు
కర్పూరకస్తూరికావస్తువితతిచే
శ్రీఖండచర్చ వాసించినట్టు
లొడికంబుగా గందవొడికి నానాసూన
పరిమళంబులు గూడఁ బఱచినట్లు
సరఘలు వివిధపుష్పమరందల
వములు గొనివచ్చి తేనియఁ గూర్చినట్లు
తే. భారతప్రోక్తకథ మూలకారణముగఁ
గాళిదాసుని నాటకక్రమను కొంత
తావకోక్తికి నభినవశ్రీ వహింపఁ
గూర్మిఁ గృతి సేయు నాకు శాకుంతలంబు.27
వ. అని సవినయంబుగాఁ గర్పూరతాంబూలంబు జాంబూనదపాత్రంబున
నర్పించి ప్రార్థించినఁ దద్వచనప్రకారంబున మిశ్రబంధంబుగా శాకుం
తలం బను ప్రబంధంబు బంధురప్రీతిం జెప్పఁబూనితి నేతత్ప్రారంభంబు
నకు మంగళాచారంబుగాఁ గృతినాయకుని వంశావతారం బభివర్ణించెద.28
క. ఖండేందుధరసమాను న
ఖండతపోరాజ్యసమధిగతపీఠస్థున్
గౌండిన్యుఁ జెప్పఁదగు ముని
మండలమకుటావతంసమాణిక్యంబున్.29
శా. త ద్వంశాంబుధిఁ గల్గె మేడన సుధాధాముండు భూమండలిన్
విద్వత్సన్నుతశీలి యాచకసురోర్వీజంబు దిక్పాలయో
షిద్వక్షోరుహహీరమౌక్తికమణిశ్రేణీలసత్కీర్తి జం
బూద్వీపావని పాల మంత్రి విభవాంభోజాటవీచంద్రుఁడై.30
ఉ. భూనుతవైభవస్ఫురణఁ బొల్పు వహించిన సోమరాజు ప
నగరామరావతికి లేఖప మంత్రియుఁబోలె నీతివి
ద్యానిపుణత్వ మొప్పఁగఁ బ్రధానులలో నుతికెక్కె భామినీ
మీనపతాకమూర్తి యగు మేడన రాజులు గారవింపఁగన్.31
సీ. లవణాబ్ధివేలహేలాకాంచియుగ నంధ్ర
ధరణిమండలికి ముత్యాల జల్లి
సంగ్రామపార్థరాజన్యరాజ్యశ్రీకిఁ
బెంపుమీఱిన జగజంపు వెల్లి
దాతలు సముంచితప్రసూనములుగాఁ
గామితార్థము లిచ్చు కల్పవల్లి
యఱువదినాల్గువిద్యలకు నపూర్వఘం
టాపథం బైన పట్టన మతల్లి
తే. పంట నృపకౌస్తుభములకుఁ బాలవెల్లి
కదనజయలక్ష్మి తొలుచూలు గన్నతల్లి
విపులభుజగర్వదర్పితవిమతరాజ
రాజి హృద్భల్లి ధర సోమరాజు పల్లి.32
క. ఆనగరము పైతామహ
మైన నిజస్థానముగ సమంచితలక్ష్మిన్
దా నొంది మంత్రి మేడన
జానుగ భజియించె సప్తసంతానము[6]లన్.33
క. ఆ మేడన మంత్రికి సా
ధ్వీమణి మాంచాంబకున్ శ్రుతిత్రయము గతి
న్రామత్రయంబు పోలిక
నాముష్యాయణులు గలిగి రనుపమతేజుల్.34
వ. అందు.35
శా. దుర్గాంభోధిగభీరు రూపజితచేతోజాతు నుద్యత్ప్రభా
రుగ్ధాముం గరుణాభిరాము ధృతి మేరుక్ష్మాధరంబు న్సుధా
దిగ్ధస్వాంతు నిశాంతదానసురపృథ్వీజాతము న్బాంధవ
స్నిగ్ధుం జిల్లర యెఱ్ఱయ ప్రభుమణిం జెప్పందగుం బెంపునన్.36
శా. ఆయెఱ్ఱయ్యకుఁ గూర్మితమ్ముఁడగు వెన్నాఖ్యుండు ప్రఖ్యాతిగా
మ్రోయించె న్బహుదేశభూవరసభామూర్ధంబులం దుల్లస
త్సాయంకాలనటన్మహానటజటాసంఘాట[7]ధాటీవళ
త్తోయస్ఫాలన ఫక్కికానఘయశస్తుత్తుంభనిర్ఘోషమున్.37
వ. తదనుసంభవుండు.38
సి. గౌతమ మునినాథుచేత నొప్పరి మేను
వికృతి నొందనినాఁడు వేల్పుఱేఁడుఁ
బెండ్లిలో గిరిజాస్యబింబంబుఁ జూచుచో
దాల్మి వీఁడని నాఁడు తమ్మిచూలి
కలశపయోరాశి చిలుకు కవ్వపుఁ
గమ్మకుంది కబ్బనినాఁడు మందరంబుఁ
గాళికావిభుని డాకాలితాటింపులఁ
గమల బారనినాఁడు కుముదహితుఁడు
తే. భోగధీధైర్యకాంతులఁ బోల్పఁబోలుఁ
గాని నాఁటిక నేఁడీడు గా రనంగ
వెలసె వెన్నయయనుజుండు వినయధనుఁడు
త్యాగశిబిరాజు చిల్లరనాగరాజు.39
క. ఆ నాగసచివధీమణి
శ్రీనాయకుఁ డిందిరను వరించిన కరణి
న్మానవతీతిలకముఁ బృథ్వీను
తగతిఁ బోతమాంబ వివహంబయ్యెన్.40
ఉ. ఆ పురుషావతంసమున కా[8]సుచరిత్రకు నుద్భవించి రు
ద్దీపితకీర్తి వెన్ననయు ధీనిధి మేడనయు న్సమస్తవి
ద్యాపరమేష్టి యాదెనయు ధార్మికుఁ డెఱ్ఱనయు న్సుధానుస
ల్లాపుఁడు వీరభద్రుఁడును లాలితనీతికళాధురంధరుల్.41
వ. ఇట్లు సమంచితదానవంచితకల్పతరుపంచకంబగు నా యమాత్యకుమార
పంచకంబునందు.42
మ. కులపాథోనిధిపూర్ణచంద్రముఁడు దిక్కుంధీనహేలాకట
స్థలనీరంధ్రమదప్రవాహలహరీచక్రాంగసత్కీర్తి కుం
డలిరాట్కుండలపూజనారతుఁ డఖండశ్రీసమన్వితుఁడై
వెలసెం జిల్లర వెన్నమంత్రి సకలోర్వీచక్రవాళంబునన్.43
క. వెన్నయ కూరిమి తమ్ముఁడు
సన్నుతచరితుఁడు సమస్తజనసమ్మతుఁ డ
త్యున్నతవాచావైభవ
పన్నగపతి మేడ మంత్రి ప్రస్తుతి కెక్కెన్.44
ఉ. మేడన పేర్మినొందెఁ బుడమి న్నయసంపద దేవమంత్రితో
నీడన యాచకావళి కభీష్టపుటీగుల కల్పశాఖికిం
జోడన ధీజనస్తుతవచోవిభవంబున శేషచక్రి వాఁ
దోడన సాటిగా నతనితోఁ బెఱమంత్రులు జాడు బేడనన్.45
శా. ఉన్నా రెన్నిక కెందఱే సచివు లత్యుచ్చోదరు ల్చాలసం
పన్ను ల్వారలఁ గింపచానుల గణింపం బోరు వాగ్వైఖరు
ల్మిన్ను ల్మోసి వెలుంగు సత్కవిజను ల్మేడయ్య వర్ణింతు రా
వెన్నామాత్యు ననుంగుదమ్ముని జగద్విఖ్యాతచారిత్రునిన్.46
క. ఆతని యనుజన్ముండ[9]గు
నాతఁడు బుధవిబుధతరువు నళినదళాక్షీ
నూతనమదనుం డాదెన
భూతలము యశఃపటీరమున వాసించెన్.47
ఉ. ఆది నృపప్రధాను లెనయౌదురు గాని సుధీగుణంబుల
న్మేదిని నేఁటి వారి నుపమింప సమానులుగారు ధర్మ స
మ్మోదికి సత్కళానివహమోహనవేదికి లోకహృన్ముదు
త్పాదికి మిత్రభృత్యహితబంధువినోదికి మంత్రియాదికిన్.48
సీ. కులసమాగతధర్మగుణరక్షణమున
సీతాకాంతు రెండవ తమ్మునికిని
నవికారనవమోహనాకారమునఁ
బురందరసూతి రెండవ తమ్మునికిని
సన్నుతాశ్రాంతవిశ్రాణనంబున
బరేతస్వామి రెండవ తమ్మునికిని
సుకృతసంధుక్షణాశోభితామలబుద్ధి
దశకంఠు రెండవ తమ్మునికిని
తే. ధరణి వెన్నయ్య రెండవ తమ్మునికిని
సాటి యనవచ్చు నప[10]విల సద్గుణముల
నఖిలబంధుజనంబుల నాదరింప
సన్నుతి వహించు నాదెనసచివవరుఁడు.49
వ. తదనుసంభవుండు.50
సీ. జలజసంభవుఁడు ప్రజ్ఞావిశేషంబున
నిర్జరాచార్యుండు నీతిగరిమ
నాతాశనస్వామి వాచానిరూఢత
ధర్మనందనుఁడు సత్య[11]ప్రశస్తి
జహ్నకన్యాసూతి సచ్చరిత్రంబున
శైలారి శంభుపూజనము కలిమి
జామదగ్న్యుడు ప్రతిజ్ఞాపాలనంబున
సౌమిత్రి భ్రాతృవత్సలత పేర్మి
తే. వంశవనవాటిచైత్రుఁ డన్వయపయోధి
చందురుఁడు గోత్రజలజకాసారతిగ్మ
కరుఁడు కులసందనారామకల్పతరువు
మహితగుణశాలి యెఱ్ఱనామాత్యమౌళి.51
గీ. ఎఱ్ఱనామాత్యుననుజన్ముఁ డహిప
భూషణాంఘ్రిపంకేరుహభ్రమరాయమాణ
మానసుఁడు మానధనుఁ డసమానగుణుఁడు
వీరభద్రుండు వితరణవిబుధతరువు.52
ఉ. ఈ జగమెల్లనుం బొగడు నెప్పుడు నెన్నిక చేసి నిత్యవి
భ్రాజితనీతిమార్గబలభద్రుని జాతకృపాసముద్రునిం
బూజితరుద్రుని న్వివిధపుష్పశరాసనకేళిభద్రుని
న్రాజితదానసంపదమరద్రుని జిల్లర వీరభద్రునిన్.53
వ. ఇట్లు విశిష్టమాతాపితృజన్యులు నభినంద్యసౌజన్యులు నగు వీరల
యందు.54
సీ. కూర్చుండు వయసున గూర్చుండ నేర్చెను
ననుదినత్యాగసింహాసనమునఁ
గొంకక నడ నేర్చుకొనుచుండి నడనేర్చెఁ
దప్పక వేదోక్తధర్మసరణి
మాటలాడఁగ నేర్చు నాటనుండియు
నేర్చెఁ బలుకంగ హితసత్యభాషణములు
చదువంగ వ్రాయంగ [12]సరవి నేర్చిన
నాఁడె నేర్చెను గార్యంబు నిర్వహింప
తే. వినయమున కాకరంబు వివేకమునకు
సీమ జన్మస్థలంబు దాక్షిణ్యమునకు
నాలవాలంబు విద్యల కరయ మూర్తి
మరుఁడు చిల్లర వెన్నయామాత్యవరుఁడు.55
చ. అతఁడు వివాహమయ్యె సముదంచితవైభవ మొప్పగాఁ బతి
వ్రత యగు భైరమాంబయును వర్ణితనిర్మలవాగ్విలాసవా
క్పతియగు సూరమంత్రియును భాగ్యఫలంబునఁ గన్నయన్నమన్
క్షితి ననసూయతోడ సరిసేయఁగ వచ్చు లసద్గుణాన్వితన్.56
సీ. మాంగళ్యశృంగార మంగీకరించి
వర్తించుచో బార్వతీదేవిగుణము
నఖిలార్థులకును నిష్టార్థంబు లిచ్చి
సంభావించుచో రమాదేవిగుణము
హితమితోక్తులచేత నెదిరికిఁ బ్రీతి
నొందించుచో భారతీదేవిగుణము
బరమపాతివ్రత్యపరతమైఁ బతి
భక్తి గావించుచో శచీదేవిగుణము
తే. వరుస నే నోమునోచి యొప్పరసె గాక
సతుల కిట్టి గుణంబులు జగతిఁ గలవె
యనఁగ బొగడొందె నుతబంధుజనకదంబ
యాస్యజితపూర్ణశశిబింబ యన్నమాంబ.57
ఉ. శ్రీవత్సాన్వయ సింధుజాతయగు లక్మిం బ్రీతి నన్నాంబికం
దేవింగా వరియించి యా పరమసాధ్వీమౌళిరత్నంబుతో
శ్రీవత్సాంకుఁడు వోలె వెన్నన ఘనశ్రీమంతుఁడై సత్కృతు
ల్గావించె న్నిజబంధుమిత్రతతికిం గార్హస్థ్య మొప్పారగన్.58
సీ. రక్షించె బంధువర్గముఁ బ్రమోదంబంద
నర్థుల కిచ్చె నిష్టార్థసమితి
గట్టించె ఘనతటాకంబు లంబుధులుగా
ధర్మకాననములు తఱుచు నిలిపె
స్థిరసమున్నతి సంప్రతిష్టించె నల్లిండ్లు
వరవిధానంబులు త్వర ఘటించె
నన్నసత్రము లెడరైనచో సాగించె
నోలిఁ జేయించె దేవోత్సవములు
తే. సప్తసంతానవతిఁ జేసె జలధి నేమిఁ;
జేసె ధర్మంబు లెన్నేనిఁ జెలువు మిగుల
జేయుచున్నాఁడు సుకృతము లాయతముగ
మనుజమాత్రుండె వెన్నయామాత్యమౌళి.59
మ. వెలయం జిల్లర వెన్నయప్రభుఁడు దా వేదోక్తసంసిద్ధి వే
ళలఁ బ్రాసాదపుఁ బంచవర్ణమునఁ గాలగ్రీవు బూజింపఁగా
నలవాటై మఱి యొం డెఱుంగవు తదీయశ్రీనివాసంబునం
బలుకుం బంజరశారికాశుకములు న్బంచాక్షరీమంత్రమున్.60
చ. విడువక సోమవారములు వెన్నన సేయఁగ వత్సలత్వ మే
ర్పడఁ దను దానవచ్చి నిజభక్తముఖంబుల నారగింపఁగాఁ
దడఁబడి [13]పోక గంధముల తావులు పూనిన షడ్రసంబులం
గడుగఁబడెం గళస్థవిషకల్మష మర్ధశశాంకమౌళికిన్.61
సీ. విలసితంబైన కావలి వెన్న మారాధ్య
మణిదత్తయగు శైవమంత్రశక్తి
సమధికస్ఫూర్తితో శాశ్వతైశ్వర్య
బీజంబైన శంభుపూజాఫలంబు
ప్రమథాధిపతి గూర్చి భక్తితోఁ
గావించు సోమవారవ్రతసుకృతగరిమ
యన్నమాంబిక కంధరాంతరంబునఁ
జాల శోభిల్లు మంగళసూత్రలక్ష్మి
తే. సకలసౌభాగ్యములకును సాధనములుఁ,
గారణంబులుఁ, దగు బోధకములుఁ, గాఁగ
సచివసంఘములోనఁ బ్రశస్తి గాంచె
విశ్వనుతకీర్తి చిల్లరవెన్నమంత్రి.62
షష్ఠ్యంతములు
క. ఏతాదృశగుణగణవి
ఖ్యాతునకును నిత్యఘనదయాన్వితునకున్
శ్రౌతపదానందునకును
బోతాంబాగర్భజలధిపూర్ణేందునకున్.63
క. శరనిధిగాంభీర్యునకును
బరహితకార్యునకుఁ దుహినపర్వతకన్యా
వరపదపంకజపూజా
కరికాలునకును నిరస్తకలికాలునకున్.64
క. బాలామదనునకు రమా
హేలాసదనునకు బంధుహితజనరక్షా
శీలాయతమతికిని నిఖి
లేలాజనవినుత సురమహీధరధృతికిన్.65
క. కౌండిన్యగోత్రునకు ను
ద్దండాహిత సచివమతిలతాదాత్రునకుం
బండితచింతామణికిఁ
బ్రచండవచోవిభవవిష్ణుశయ్యాఫణికిన్.66
క. అన్నాంబికాసమంచిత
హృన్నలినాదిత్యునకు మహీదివిజానీ
కౌన్నత్యునకును జిల్లర
వెన్నామాత్యునకు సత్కవిస్తుత్యునకున్.67
వ. అభ్యుదయ పరంపరాభివృద్ధియు నభీష్టఫలసిద్ధియుం గా నాశీర్వదించి
నా యొనర్పం బూనిన శాకుంతలకావ్యకథాలతాలవాలం బగు పురీ
లలామంబు.68
సీ. పద్మరాగోపలప్రాకారరుచిజాల
గండూషితవ్యోమమండలంబు
పాతాళజలఝరీపర్యాప్తకల్లోల
సుకుమారపరిఘోపశోభితంబు
శక్రనీలశిలావిశాలగోపురరోచిర
సమయజనితమిథ్యాతమంబు
కనకగోపానసీఖచితముక్తాఫల
[14]రాజి విలగ్నతారాగణంబు
రాజసదనాగ్రదేశవిరాజమాన
తోరణాలీనమణిగణద్యుతివితాన
విభవలక్ష్మీవిలంబితవిలసదింద్ర
చాపరుచిచాపలము హస్తినాపురంబు.69
ఉ. ఆ పురి నున్నతస్ఫటికహర్మ్యవిభాపటలంబు నింగి ను
ద్దీపితమై చెలంగ నిది దివ్యతరంగిణి యెత్తివచ్చెఁ దా
నీపయి తోవ్ర నంచు బయలీదుఁచుఁ గోయదలంతు రగ్రసం
స్థాపితహేమకుంభములు తామరలంచు వియచ్చరాంగనల్.70
మ. దివిఁ బ్రాకారము ముట్టియుండగఁ దదుద్దేశంబునం గోటతోఁ
దవులుం జక్రమ నిక్కమంచుఁ బురిమీఁద న్రాక పార్శ్వంబులం
[15]గవనుంద్రోవ ననూరుయత్నమున రాఁగా నౌటఁగాఁబోలుఁ బో
రవితే రుత్తరదక్షిణాయనములం బ్రాపించి దీపించుటల్.71
శా. ప్రాసాదోపరినాట్యశాలికలపైఁ బద్మాననల్నర్తనా
భ్యాసక్రీడ లొనర్పం [16]దద్భ్రమిరయవ్యాయామజం బైన ని
శ్వాసామోదముఁ బ్రోదిసేయు నికట స్వర్వాహినీకూలకు
ల్యాసంవర్ధితకేసరప్రసవమధ్యాసారసౌరభ్యముల్.72
చ. మెలఁతుక లప్పురి న్నిడుద మేడలఁ గ్రీడలు సల్పుచుండి మిం
చులు జళిపించు కన్గవల సోరణగండ్లను జూడ నీడగుం
దెలుపును నల్పుఁగూడ నెడత్రెవ్వని చూపులఁ గైరవంబులుం
గలువలు దోరణావళుల గట్టిన యోజల రాజవీథులన్.73
క. పురికోట రత్నదీప్తుల
నరుణములై చుక్కలుండ నంగారకునిం
బరికించి యందుఁ దెలియక
కరము విచారింతు రెంత [17]కార్తాంతికులున్.74
క. పరిఘజలంబులు మొదలను
సురనది నీ రాడ పరికె చుట్టున నుండం
బురికోట లగ్గపట్టఁగ
నరిది వితర్కింప వాసవాదులకైనన్.75
చ. శ్రుతి గవుడొందినం గమలసూతికినై నను దీర్చి చెప్ప నే
రుతురు పురాణశాస్త్రములు ప్రొద్దున నిండ్లను గీరశారికా
తతుల పరీక్ష లీవిని ముదంబును బొందుదు రింద్రుపట్టముం
గ్రతువులు వే యొనర్చినను గైకొన రప్పురి విప్రసత్తముల్.76
ఉ. మందరగోత్రధీరు లభిమానధను ల్పురభేది వచ్చినం
గ్రిందు పడంగ నేరని యందము లంచితనిత్యభోగసం
క్రందను లార్తరక్షణపరాయణు లంబుజలోచనా శుక
స్యందను లర్థిలోకహరిచందసు లా పురి రాజనందనుల్.77
ఉ. వెచ్చము పెట్టు మన్నఁ బదివేలకు నుద్దరు లొల్ల రర్థము
ల్దెచ్చిన శేషు నౌదలల దివ్యమణుల్వలెనన్న విల్వలన్
హెచ్చును గుందు నాడుకొన కిత్తురు లాభముఁ గోర కెన్నఁగా
నెచ్చటఁ గోటికిం బడగ యెత్తని వైశ్యులు గల్గ రప్పురిన్.78
క. సంగరము లేక యుండిన
సింగంబులఁ బులుల సమద సింధురముల నే
కాంగిఁ దొడరి పడవై తురు
పొంగునఁ దమ కుబుసు పోక పురి వీరభటుల్.79
శా. పక్షంబు ల్మును శాలిహోత్రుఁడు శపింపం బోయినం బోవనీ
శిక్షానైపుణి నర్కుతేజుల నధిక్షేపింపఁగాఁ జాలిన
ట్లక్షీణత్వర నింగినైన గతిసేయం జాలు నుచ్చైఃశ్రవ
స్సాక్షాత్కారము లప్పురిం దురగముల్ ఝంపాకళాసంపదన్.80
మ. గణనాతీతములై సురేంద్రుఁ డెఱక ల్ఖండింప వజ్రాయుధ
వ్రణరక్తంబన బిందువు ల్వొడమఁగా వర్తిల్లు జాతవ్యధా
క్వణనం బై పటుబృంహితంబులు సెలంగ న్సామ్య మొందింపఁ బ
ట్టణమార్గంబునఁ బడ్డ పెద్ద నడగొండ ల్వోలె శుండాలముల్.81
సీ. హరినీలరుచుల నీలాలకంబులు గావు
చిత్తజు మధుపళింజినులు గాని
క్రొన్నెల వంకలాగుల భ్రూలతలు గావు
విషమాస్త్రు తియ్యనివిండ్లు గాని
యలసంబులైన వాలారుఁ జూపులు గావు
రతిరాజు మోహనాస్త్రములు గాని
బంధురస్థితిఁ బొల్చు కంధరంబులు గావు
కందర్పు విజయశంఖములు గాని
తే. నలినదళలోచనలు గారు నడువ నేర్చు
కంతు నవశస్త్రశాలలు గాని యనఁగ
నంగకంబుల సౌభాగ్య మతిశయిల్ల
వారసతు లొప్పుదురు పురవరమునందు.82
చ. వెలకుఁ దగం బ్రసూనములు వేఁడుచు మార్వరికింప నెత్తులం
గలసి చిగుళ్ళు వెట్టి యడకట్టిన క్రొవ్విరిమొల్లపూవుటె
త్తులు దశనాధరద్యుతులఁ దోఁచిన బైకొన రీవిగా విటు
ల్విలువగ వారిచిత్తములు విల్తురు తత్పురిపుష్పలావికల్.83
మ. సరసుల్ చొచ్చి సరోజకోటరకుటీసంవర్తికాచారుకే
సరగుచ్ఛంబులు గ్రొచ్చి బాహ్యవనపుష్పశ్రేణి నిర్యన్మధూ
త్కరముం దెచ్చి తదీయసౌరభము లుద్గారింపుచు న్సంతత
స్మరసంజీవనమై చరించు గలయ న్మందానిలుం డప్పురిన్.84
గీ. శశవిషాణంబు గగనపుష్పంబునైన
వణిజు లిండులలో విలువంగ గలవు
హంసగమనల మధ్యంబునందు దక్క
లేమి యేవస్తువులయందు లేదు పురిని.85
వ. ఇత్తెఱంగున సమస్తవస్తువిస్తృతి బ్రస్తుతి వహించి పయఃపారా
వారంబు ననుకరించుచు సర్వతోముఖదర్శనీయంబును, సదాగతి
సంచారసమంచితబహులహరీమనోహరంబును, సంతతానంతభోగ
లీలాలాలితపురుషోత్తమోపేతంబును సమున్నతలక్ష్మీజనకంబును నై
యమరావతియునుంబోలె శతమఖపవిత్రాయమానంబును, నలకా
పురంబునుంబోలెఁ బుణ్యజనాకీర్ణంబును, మథురాపురంబునుబోలె నుగ్ర
సేనాభిరక్షితంబును నంతరిక్షపదంబునుంబోలె ననువర్తితమిత్రరాజ
సంబాధంబును, బరమేశ్వరు వామభాగంబునుబోలె సర్వమంగళాలంకృతం
బును, మేరుమహీధరంబునుంబోలెఁ గల్యాణమహిమాస్పదంబును,
మహాకవిప్రబంధంబునుంబోలె నుత్తమశ్లోకబంధురంబును, రత్నాకరం
బయ్యును గుట్టిమప్రదేశసుగమంబు నై, ముక్తామయం బయ్యును
భూరిక్షయోపేతంబై, ప్రకటితపర్జన్యవైభవోదారంబయ్యును జిర
ప్రభాభాసురం బై , మంగళాచారమహితంబయ్యును సౌమ్యపరిచారికా
ధిష్టితంబై, యారూఢపాతిత్యంబు క్రీడాకందుకంబులయందును, బరిచిత
స్నేహనాళంబు రత్నదీపంబులయందును, నీరసత్వంబు సముద్రంబుల
యందును, ద్రాసదోషంబు పద్మరాగాదిమణులయందును, యతిని
బంధంబు పద్యంబులయందును, దారిద్ర్యంబు విద్రుమాధరామధ్యంబుల
యందును, బదచ్ఛేదంబు వాక్యంబులయందునుగాని దనయందుఁ గలుగ
దన నొప్పు నప్పురంబు కప్పురంపు దాళువాలించు సన్నసున్నంబుల
చేఁత లేతవెన్నెలల నెమ్మించు గ్రొమ్మించులుం గల మేడలును, విరా
జితంబులగు వాడలును, రేయెండకు మాఱుమండు పదాఱువన్నె
బంగారు ముద్దవరుస నద్దుకొనవైచి యద్దంబులమీఁదువలె నుండ నున్నఁ
జేసి విన్ననువున మెఱుంగువెట్టినం ద్రొక్కినజిక్కంజీరువారుచుం
దళతళ వెలుంగు వేదులును, విలసితంబులగు వీథులును, బూర్వంబునం
బార్వతి యెఱంగిన తెఱం గగ్గిరికన్యచేతం బాణపుత్రి నేర్చిన రీతి నా
రక్షోరాజిరాజనందనచేత ద్వారవతీగోపికాపికవాణుభ్యసించినబుద్ధి
శుద్ధదేశివృత్తంబులవిశేషంబులు భిత్తిభాగంబులం జిత్తరువులం జిత్త
రంజకంబు లగుచుఁ బ్రత్యక్షభంగి నంగీకరించు విలాసలీలలను విలసిల్లు
నాట్యశాలలును, నొక్కవీక నాకసం బెక్క విశ్వకర్మ నిర్మించిన తాపు
రంబులఁ బొలుచు గోపురంబులమీఁదికిఁ రాఁబో సుసరంబులుగాఁ గట్టినం
గారుకొనుచు నేచిన మేచకద్యుతులు పుక్కిలించు శక్రోపలసోపా
నంబులును, సాదనంబు లగు ప్రాసాదంబులును, నుదంచచ్చంచరీకచక్ర
హంసక్రౌంచజలపక్షికులకలకలంబులం గొలకొల మను కొలంకుల
నలంకరించు పంకరుహకుముదకువలయకల్హారషండంబులును, దండతం
డంబులుగ తావులం గదంబించు బావులును, జిత్తంబు లుబ్బి గబ్బితనంబున
విత్తంబు లొడ్డి నెత్తంబులాడి యోడినధనంబు లాడినం గాని పెట్టమను
దిట్టమాటలం బుట్టిన జగడంబులు విగడంబులై యుద్ధపతత్తంబు లగు
పంతంబులఁ గుంతంబులం గొనివచ్చు జూదరిఘట్టంబుల హెచ్చగు రచ్చ
కొట్టంబులును, గలిగి వినోదంబులకు నాకరంబును, విశ్రామంబులకు
సీమయు, విక్రమంబునకు నెలవును, విజయంబునకుఁ దావకంబును, విద్య
లకు నుపాధ్యాయయు, వితరణంబులకు సదనంబును, విభవంబులకు బ్రభవ
స్థానంబును, విలసనంబులకు వినిమయంబునునైన యప్పురి కధీశ్వరుండు.86
సీ. విశ్వసన్నుతశాశ్వతైశ్వర్యపర్యాయ
కుటిలకుండలిరాజకుండలుండు
దిగిభశుండాకాండదీర్ఘబాహాదండ
మానితాఖిలమహీమండలుండు
జనసన్నుతానన్యసామ్రాజ్యవైభవ
శ్లాఘాకలితపాకశాసనుండు
కులశిలోశ్చయసానుకోణస్థలన్యస్త
శస్త్రవిక్రమజయశాసనుండు
తే. భాసమానమనీషాంబుజాసనుండు
సకలదేశావనీపాలమకుటనూత్న
రత్నరారజ్యదంఘ్రినీరజయుగుండు
శంబరారాతినిభుఁడు దుష్యంతవిభుఁడు.87
మ. రజనీనాథకులావతంసుఁ డసిధారాదారితారాతిరా
డ్గజకుంభవ్రణమార్గనిర్గళితముక్తారక్తహారుండు స
ద్విజసుతర్పణకేలిలోలుఁ డఖిలద్వీపావనీపాలది
గ్విజయాన్వితుఁడు పాపభీతుఁడు మహావీరుం డుదారుం డిలన్.88
మ. ప్రజ లెల్లం జయవెట్ట ధర్మమహిమన్ బాలించె వీరారి భూ
భుజుల న్వేల్పులఁ జేసి యధ్వరములం బ్రోచెం బదాంభోజన
మ్రజనాధీశులఁ గాచి నిల్పె నిజసామ్రాజ్యంబుల న్సర్వసా
ధుజనస్తుత్యుఁడు సత్యకీర్తి యగు నాదుష్యంతుఁ డత్యున్నతిన్.89
సీ. నిచ్చెనఁ జేసె దోర్నిసితాసి కేరాజు
దివి నేఁగు సమదపృథ్వీభుజులకుఁ
గల్పవృక్షముఁ జేసెఁ గరకాండ మేరాజు
భూచక్రమునఁ గల యాచకులకు
గేహాటములు చేసెఁ గ్రేగన్ను లేరాజు
చెలఁగి సంక్రీడింప సింధుసుతకుఁ
బూఁటకాపుగఁ జేసె భుజశక్తి నేరాజు
ఫణిరాజు మోచు భూభరముఁ దీర్ప
తే. ననుచు వర్ణింపఁ దగదె శీతాంశువంశ
రాజహంసంబు దానధారాప్రవాహ
జలపరీక్షాళితాఖిలకలుషనికరు
సంచితాశ్రాంతకృపుని దుష్యంతనృపుని.90
ఉ. ఆజననాథయూథమణియం దుదయంబును బొంది దిగ్జయ
వ్యాజమునం బ్రతాపనలినాప్తుఁడు కీర్తివిభుండు రాఁ దదు
ద్వేజితు లౌటఁగాదె పరివేషమిషంబున నాత్మగుప్తికై
యోజ నమర్చికొండ్రు రవియుం గమలారియు నింగి వప్రముల్.91
సీ. ఆలానదండంబు హేలాహవాహూతరిపు
రాజధరణీకరేణువునకు
మానదండము మహామనుజేశగర్వాబ్ధి
గంభీరతాపరీక్షావిధికిని
నాళదండము సమున్నతజయశ్రీ
వధూసముచితక్రీడాబ్జసౌధమునకు
నాధారదండంబు హరిణాంకకులకు
భృజ్జనశుభ్రకీర్తిధ్వజంబునకును
తే. యష్టదండంబు వృద్ధశేషాహిపతికి
మూలదండంబు సైన్యసముద్రతతికి
కాలదండంబు శాత్రవక్ష్మాపగతికి
బాహుదండంబుఁ జెప్పఁ దత్పార్థివునకు.92
చ. జగమున రెండుతత్త్వములు శాస్త్రులు చెప్పుదు రందులోపలన్
జగడము కాని యొక్కరయినం బొడఁగానరు వానిరెంటిలో
సగుణముఁబట్టి నిర్గుణము శత్రువధూగళసీమలం జను
ల్పొగడఁగ జూపు నవ్విభుఁ డపూర్వముగా ఘనశాస్త్రపద్ధతిన్.93
ఉ. పాయక శిష్టలోకపరిపాలనముం బహుదుష్టశిక్షయుం
జేయుచు రాజ్య మవ్విభుఁడు సేయగఁ దారు నిజప్రయోజనం
బేయెడ లేకయున్న ధరియింతు రుదంచితలాంఛనార్థమై
తోయజనాభుఁడు న్రవిసుతుండు సుదర్శనకాలదండముల్.94
సీ. చెఱుపనేరఁడు విశ్వసించి యుండినవాని
నభిలషింపఁగనేరఁ డన్యవనిత
నిందింపనేరఁడు నీచశత్రుగణంబు
బొంకనేరఁడు హాస్యమునకుఁ బలికి
విడువనేరఁడు చెడ్డవిటునిఁ జేపట్టినఁ
గడపనేరం డర్థిగణమువాంఛ
నడుగు వెట్టగనేరఁ డపశయంబగుత్రోవఁ
జనఁగనేరం డార్తజనము విడిచి
యైదు పది సేయనేరఁ డాహవముఖమున
గ్రించునందును నేరఁడు గీ డొనర్ప
ననుచు నేరము లెన్నుదు రవనిజనులు
విపులయశుఁ డైన దుష్యంతవిభునివలన.95
వ. ఆ రాజపరమేశ్వరుం డొక్కనాఁడు శుకతుండరోచిరుద్దామవిద్రుమ
స్తంభసంభారసమున్నతంబును, హాటకమణివిటంకాలంకారవిశ్రుతనిశ్రే
ణికాపదగమ్యమానచంద్రశాలోపకంఠంబును, గంఠేకాలకంఠమేచక
రుచికచాకచిక్రీడాచతురసితేతరపట్టపటలప్రాలంబముక్తాఫలవితానతార
కితవియత్సమంబును, నత్యంతసమున్నతిమదుపరినిశాతశాతమన్యవశిలాశ
లాకానీలనీలచ్చర్దివిలగ్నవినూత్నరత్నకేసరస్తబకనిబిడబిసకనకకుముదా
రవిందసౌగంధికసందర్శితకపటగగనపుష్పంబును, నభిరామదూర్వాదళదా
మకోమలప్రభాపటలగర్వసర్వస్వపశ్యతోహరహరిదుపలభిత్తికాంతరజిత
రూపవాతాయనంబును,వళక్షకిరణచ్ఛవిచ్ఛటావిస్ఫుటస్ఫటికపాషాణఫలక
సోపానమార్గనిర్గమప్రవేశద్వారవిద్యోతమానవిపులతపనీయకవాటాలంకృ
తంబును, నభ్రంకషశిరోభవనశిఖరస్థాపితశాతకుంభకుంభకాంతిగండూషిత
నభోమండలంబును,[18]ద్రయ్యంతరాస్తీర్ణవిచిత్రరత్నకుధాసనవిన్యాసంబుల
శోభిల్లు సభాసౌధంబున నమూల్యరత్నకీలనజాజ్వల్యమానకల్యాణభద్ర
పీఠాంతరంబున నాసీనుండై యొక్కమంజువాణి వింజానురంబును, నొక్క
[19]జోటి వీటికాపేటికయు, నొక్కబాల యాలవట్టంబును, నొక్కకరటి
గమన [20]సురటియు, నొక్కలేఁజిగురాకుఁబోఁడి కాళంజియు, నొక్కచందన
గంధి గంధవొడిబరిణయు, నొక్కపుండరీకనయన యగరుధూపధూమ
కరండంబును, నొక్కకన్నె పన్నీరుతోడి కప్పురంపుగిండియు, నొక్క
భృంగాలక బంగారుసంగెడయు ధరియించి డగ్గఱి కొలిచియుండఁ
బాండ్యపల్లవపాణి యాటలాడ భోటకరహాటకళింగాంగవంగబంగాళ
చోళనేపాళకాదిభూపాలకకుమారవర్గంబుం దగిన నెలవులం బలసి
సేవింప హితపురోహితామాత్యబంధుమిత్రభృత్యపాఠకపీఠమర్దవిదూష
కాదులు భజింప సుధర్మాంతరంబున నోలగం లైన దేవేంద్రుడునుం బోలె
సాంద్రవైభవంబునం గొలువుకూర్చున్న యవసరంబున.96
ఉ. జుంజురుపల్ల వెండ్రుకల జొంపములుం గల మస్తకంబులుం
గెంజిగురాకుఁ గెంపుఁ దులకించెడు వట్రువకన్నులుం జర
త్కుంజరచర్మపట్టములకు న్సరివచ్చు బెరళ్ల మేనులు
న్ముంజులు గొల్వఁ గొందఱు సముద్ధతి వచ్చి పుళిందవల్లభుల్.97
సీ. కాననేక్షువుల ముక్తములైన ముత్యాలు,
ముదిరిపండిన మంచి వెదురు బ్రాలు,
దినములోఁ [21]గ్రొత్త యెత్తిన కఱ్ఱజవ్వాది,
ముక్కులు మురియని [22]మొరళిపప్పు,
జంద్రికారుచిఁ బొల్చు చమరవాలంబులుఁ,
బొందుగాఁ గాఁచిన [23]పూతివడువు,
అలఁతి దంతంపుఁగామల పీలిసురటులు,
సోదించి వడిచిన జుంటితేనె,
తే. కమ్మఁబిల్లులపిల్లలు, కారుకోళ్ళు,
కన్ను దెఱవని కస్తురిగమి శిశువులు,
పులులకూనలు, భల్లూకపోతకములు
నాదిగాఁ దెచ్చి పతి కుపాయనము లిచ్చి.98
వ. ప్రణామంబు లొనర్చి కేలుదోయులు ఫాలంబులం జేర్చుకొని వినయ
వినమితస్కంధులై క్రిందుచూపుల నిల్లుతారల వారం గనుంగొను
చున్న వారల నవలోకించి చిత్తంబు మృగయాయత్తం బగుటయు
నృపోత్తముం డి ట్లనియె.99
క. దలముగఁ గ్రొవ్విన మృగములు
గలిగి సమీపమున నేఱుఁ గాలువ [24]యేదేఁ
గలిగి తఱచైన తరువులు
గలిగిన పేరడవి యెచటఁ గలదు గణింపన్.100
క. నావుడు వారలు విభుతో
దేవర వేటాడవలసితే విచ్చేయం
గావలయును యమునాతటి
నీవరసీమంతికావనీవసమునకున్.101
క. రోమము పెఱికిన నెత్తురు
నామము లేఁదొడలు చమురునుం జేసినయ
ట్లాము గవిసి యుండును నా నా
[25]ముఖయూధంబు లవ్వనంబునఁ గలయన్.102
గీ. ఊళ్ళ కూళ్ళు సమీపమై యునికిఁ జేసి
లేశ మైనను గొరనాఁగ లేమిఁ జేసి
యచటి కొర్నెలఁ బసికి మేయంగఁ గలిమి
నగరి కీలార మున్నది నరవరేణ్య.103
ఉ. జల్లెడపాటు వడ్డయవసంబులు మేసి సమీపసీమలం
జల్లని నీరు ద్రావి సుఖసంగతి దాపులు గ్రేపు లాఁగఁగాఁ
బొల్లగఁ జేరి గోవృషభము ల్మది కింపులు సేయ నుండియుం
బల్లిక బెబ్బులు ల్దిరుగ సాధ్వస మందును మందధేనువుల్.104
ఉ. సాయకపుంఖితంబులగు చాపములం ధరియించి యుక్కునం
బాయక రేయునుం బగలుఁ బాలెము వెట్టి మెకంబుఁ గన్నచో
నేయుచుఁ బొంచి రాఁ దెఱుపియీక చరించుచునున్న మంద క
త్యాయతవర్ణసత్వనినదావళి హావళి మాన దెప్పుడున్.105
గీ. కోలఁ బదినైదు గుదిగ్రుచ్చి కొనఁగ నేయ
వచ్చు మృగముల నెమకంగవలవ దచట
పసికి నయ్యెడు కీడు వాపంగఁగలదు
వేడుకకు నిమ్ముగాఁగ వేటాఁడఁగలదు.106
వ. ఆవల దేవరచిత్తంబు కొలఁది యనిన గోరక్షణంబుకొఱకును, దుష్టమృగ
శిక్షణంబువలన సుకృతంబుగా మృగయాసౌఖ్యంబు సిద్ధించె దేవర
ప్రసాదంబు జాదులుంబలె నయ్యెనని యమాత్యుల యనుమతంబునఁ
గొలువు విచ్చి యందలి సముచితప్రకారంబుల వీడుకొలిపి వేత్రహస్తులం
బిలిపించి పట్ట ణంబున మృగయావిహారసన్నహంబునకుం జాటించిన.107
సీ. పులిమల్లఁ డడవిపోతులరాజు గరుడుండు
గాలివేగంబు పందేలపసిఁడి
విష్ణుప్రసాదంబు వేడిగుండులు పరి
పచ్చిమిర్యము వెఱ్ఱిపుచ్చకాయ
వేటమాణిక్యంబు విరవాది మెడబల్మి
పెట్టుఁగాఁడు పకారి పిడుగుతునుక
జిగురుండు చిత్రాంగి శ్రీరాముబాణంబు
పులియందు కస్తూరి బొడ్డుమల్లె
తే. యనఁగ మఱియుఁ బెక్కుతోయముల పేళ్ళు
దారకులు దేరవచ్చె నుద్దండవృత్తి
వేటకుక్కలు మృగరాజవిగ్రహములు
వటుకనాథుని వాహ్యాళివాహనములు.108
మ. శబరు ల్పట్టెడత్రాళ్ళఁ బట్టి తిగువం జండోద్ధతిం గిట్టి వ
ట్టి బయల్ ద్రవ్వుచు విడ్వరాహముల గుండె ల్వ్రయ్య నాకాశముం
గబళింపఁ జనునోజ మోర లెగయంగా నెత్తి గర్జిల్లఁగాఁ
బ్రబలెం గుర్కురకంఠనాళకుహరీభౌభౌమహారావముల్.109
గీ. మృగయు లంతటఁ దెచ్చిరి లగుడుగిడ్డుఁ
జాలె జలకట్టె కణుజు వేసడము బైరి
కురుజు లోరణమను డేగ కొలము సాళు
వములఁ బిలుపుకు వేఁటకు వచ్చువాని.110
సీ. బంగారు మెరవడి పల్లనంబులతోడఁ
గెంబట్టు కీలు పక్కెరలతోడ
ముఖసమర్పితహాటకఖలీనములతోడఁ
గాంచనగ్రైవేయకములతోడ
సమకట్టి ముడిచిన చామరంబులతోడఁ
దాఁపఁబెట్టిన యడిదములతోడ
కనకఘంటలయురుగజ్జెపేరులతోడఁ
గర్ణకీలితదీర్ఘకళలతోడ
తే. జిత్రమున వ్రాయఁగారాని చెలువుతోడ
నొప్పి యుచ్చైశ్శ్రవముతోడి యుద్దులనఁగ
వాహకులు దేఱవచ్చె దుర్వారలీల
వసుమతీనాయకుని పూజవారువములు.111
సీ. [26]వలనంబు పుట్టించి వంకంబు లొలయించి
డిల్లాయి ప్రకటించి ఠేవ చూపి
వరసంబు నొందించి [27]పల్లంబు కలిపెంచి
నిగుడంబు సమకొల్పి నెఱను నెఱపి
లవిగూర్చి లవిదేర్చి లాగిచ్చి శుండాల
ముల నోజవట్టించి ఖలువు దెచ్చి
లవణి సంకోచంబులకుఁ దెచ్చి హవణితో
రససిద్ధి వడయించి రాగెలందు
తే. నాఱుతానకములను గృత్యమ్ము లేడు
నరువదే నాసనంబుల నెఱిగి హరుఁల
నెక్కు రసికులు వచ్చిరి హెచ్చునగరి
రాగరవుతులు సమరానురాగమతులు.112
సీ. జడ లల్లి ముడిచి పాగడఁ జొళ్ళెములు
దీర్చి తలముళ్లు బలువుగా నెలవుకొల్పి
మృగము చేరఁగవచ్చు మొగసిరి చూర్ణంపు
దిలకంబు లలికసీమల ఘటించి
వాకట్టు వదినికె చేకట్టు మండలు
కరకాండమధ్యభాగములు దొడగి
కుఱుచగాఁ గట్టిన కరక దట్టీదిండు
నంతరమ్మునఁ బిడియాలు దోపి
తే. పందిపోట్లును దడవిండ్లుఁ బాఱవాతి
యమ్ములును జిల్లకోలలు నడిదములును
వలతి యీటెలు ధరియించి వచ్చి రంగ
రక్షకులు లేతతరముల ప్రాఁతవారు.113
క. అరిగెలు నిష్ఠురబాహాపరిఘలు
ధరియించి నగరిపాలురు నేతెం
చిరి శిఖపటుజిహ్వాసమ
కరవాలద్యుతులు గగనకాలిమ గడుగన్.114
శా. సింగంపుంబొది వచ్చు చందమున వచ్చెం బోయకాలారి యు
త్తుంగశ్యామలదేహసంజనితకాంతు ల్వీరలక్ష్మీనవా
పాంగచ్ఛాయలతోడఁ బెల్లొదవి మ్రోయ [28]న్వేల్లదుద్యద్భుజా
సంగత్వంగదభంగభంగురధనుర్జ్యావల్లరీఝల్లరుల్.115
గీ. ఉరులు జిగురుగండె దెరలును బోనులు
వారువారెసలును వనులు గనులు
[29]మిళ్ళువలలు పేట్లు గోళ్ళు దీమంబులు
నాదిగాగ దెచ్చి రాటవికులు.116
వ. మఱియును మూలభృత్యబలంబును, సామంత[30]కుమారవర్గంబును నర్హ
ప్రకారంబుల సముచితాలంకారులు, సాయుధులు, సవాహనులునై చను
దెంచి రప్పు డప్పుడమిఱేఁడు వేఁటకుం దగిన శృంగారం బంగీకరించి
గతివిజితమరుత్కురంగంబు లగు తుంగంబులం బూనిన యరదం బెక్కి
యిరువంకల న్ముంగలిం బింగలిం జతురంగబలంబులు గొలువ శంఖకాహళ
వేణువీణామృదంగంబులు చెలంగ నెడ లేక సందడిం గ్రందుకొన మంద
వైభవంబునం బురందరవైభవుండు పురంబు వెడలి వృద్ధహయంబుమీఁద
విదూషకుం డగు మాండవ్యుండు దోడరాఁ గొంతద వ్వరిగి యొక్క
చిక్కణప్రదేశంబున రథవేగంబుఁ దెలియువేడుక సారథిం జూచి నిమ్నోన్న
తంబులు గాక యిచ్చట సమతలంబై యున్నయది నీహయంబుల రయంబుఁ
జూపు మనవుడు నతండు యుగ్యంబుల పగ్గంబులు వదిల్చి యదల్చిన.117
సీ. కనుదృష్టి నెయ్యది మినుమిను క్కనుచుండు
ఘనత వ్రేల్మిడిలోనఁ గానఁబడఁగ
నెడత్రెవ్వియుండు నెయ్యెదియేని
నదికూడ నదికిన చందాన నన్వయింప
నేయది విలువంకయై యుండుఁ బదమున
నది సమరేకతో నందమంద
దూరాన నెయ్యడి తోఁచు నాలోకింప
నది పార్శ్వమున లేక యవులఁ జనఁగ
తే. శ్రవణములు నిక్క నిష్కంపచామరాగ్ర
ములను నిర్యాతపూర్వాంగములఁ దనర్చి
ఘనఖురోర్ధూతరేణువు గడవఁబాఱి
నిగిడె [31]భువి తేరిహయములు మృగజయములు.118
వ. అయ్యవసరంబున.119
గీ. కుక్క లలయక యుండంగఁ గొంచువచ్చు
మంచి యొక కొంత చిక్కె నాస్యందనంబు
గూడి రారాక వడి చెడి కొంత చిక్కె,
ననిలగతి నేగు రథ మెవ్వఁ డంటగలఁడు.120
క. సారథిఁ గనుఁగొని యవు డా
క్ష్మారమణుఁడు రథము దవ్వుగా వచ్చెఁ బరీ
వారము గూడదు రా నె
వ్వారలు గల రిచట నిలువవలయు ననుటయున్.121
వ. అతండును నృపాలకానుశాసనంబునం దేజుల నేఁగనీక వాగెలు గుది
యించి వీపుఁలు నిమిరి నిలుపుటయు సకలజనంబులుం గూడుకొని
యుల్లసితయానంబున మెల్లనం జని మంద చేరంజను నయ్యవసరంబున
విజయకాహళారావంబు లాలకించి బిరుదధ్వజవితానంబు లవలోకించియు
దమ రాజు రాకఁ దెలసి నిసర్గభీరువులగు నాభీరువులు భీతచేతస్కులై
నవీనంబగు హయ్యంగవీనంబు గానుక తెచ్చి ప్రణామంబు లాచరించి
కరంబులు శిరంబునం బెట్టుకొని తిర్యగాలోలంబు లగు చూపులం గద్గద
కంఠ లగుచు బ్రస్ఖలితనయవాక్యంబుల నిట్లని విన్నవించిరి.122
సీ. దూరంబువచ్చిన [32]వా రిట సైన్యంబు
ప్రజలెల్లఁ జాల దూపట్టినారు
నీర్వట్టుగొని దీర్ఘనిశ్వాసములతోడ
వరరథ్యములు వ్రేలవైచెఁ జవులు
వేటకుక్కలు డస్సి వివృతాస్యముల
నిల్చి వగరించుచున్నవి దగలుదొట్టి
శిథిలపక్షముల నక్షియుగంబులు న్మోడ్చి
శ్రమనొందె డేగలు సాళువములు
తే. తిమురు మధ్యాహ్న మయ్యెను దేవ యిచట
నేఁడు [33]కాలాగి మామందపాడి చూచి
గోరసముఁ బాయసంబులు నారగించి
నిగ్రహంబైన మమ్ము మన్నింపవలయు.123
గీ. అనుచు విన్నప మొనరించు నవసరమున
హయము డిగ్గి మాండవ్యుఁడు రయముతోడ
నవనిపాలుని రథము డాయింగ వచ్చి,
చేయి పుడిసిరి వట్టి యాశీర్వదించి.124
ఉ. ఒల్లమి చేసి వీరలకు నుత్తర మీకు నృపాల పెర్వులుం
జల్లలు నమ్ముకొన్నయవి చాలఁగ నున్నవి చిత్రధాస్యము
ల్కొల్లలు త్రవ్వితండములు కుప్పలు నేతులు పాలువెన్నలుం
గొల్లల కేమి మూఁడె మనకు న్మఱి కూ డొకపూట వెట్టినన్.125
క. కానిక కప్పము వెట్టరు
మానము దప్పఁ దిని క్రొవ్వి మనుబోతుల సం
తానమువలె నున్నా రీ
కాననమున రాచసొమ్ము గతముగఁ గొనుచున్.126
వ. అది యట్లుండె నింక నొక్కవిన్నపం బవధరింపుము.127
గీ. వేఁటవోయెడువారలు విప్రుమాట
కలుగుదురు పొడప్రువ్వున గలిగినట్లు
విన్నవింపక నాలుక మిన్నకుండ దేచి
నీ మేలు గోరెదు హితుఁడగాన.128
క. పాయసముం గలలో ధూ
నాయక భోజనము సేయు నరులకు నెంతే
శ్రేయస్కరమని స్వప్నా
ధ్యాయంబునఁ జెప్ప విందు దద్జ్ఞులచేతన్.129
గీ. భోజనము సేయు మనఁగఁ దాంబూలగంధ
పుష్పములు గొమ్మనఁగఁ ద్రోసిపోవజనదు
ఇంపుతోడుత నంగీకరింపవలయుఁ
గార్యఫలసిద్ధి కవి యాదికారణములు.130
క. ఇలు వెడలి మానవుఁడు తన
తలఁచిన తావునకుఁ జేరుఁదాకను నేయం
కిలి లేక ఱెక్క తీరుపు
వలయును శాకునికవరులవచనవిధమునన్.131
సీ. హర్మ్యంబు వెడల వాయసము చేరువ
దీర్చె వృషభం బెదుర ఱంకెవేసి నిలిచె
వాడలో శునకంబు వచ్చెను దక్షిణం
బుదపూర్ణకుంభంబు లెదురుపడియె
గవని వెలుపల బెరికయుఁ బోతు వలగొనె
వలఱెక్క సూపెఁ జేవలతిఁ జెమరు
పరువు నేలను వచ్చేఁ బాల [34]పయ్యెరవంక
కుడినుండి యెడమకు నడిచె నక్క
తే. నీవు వేఁటకు విచ్చేయునెడ నృపాల
పంచి పెండ్లికి నగు శకునంబు లయ్యె
నేడు గొల్లలమాట మన్నించి నిలిచి
మృగయ కరుగుట మిక్కిలి మేలు ఱేపు.132
క. నా విష్ణుః పృథివీపతి
నా విష్ణుం డనఁగ నీవ నరవర దైవం
బీ వారగింపకుండిన
నీ వల్లవులకు శుభంబు లేలా కలుగున్.133
వ. వీరలం గృతార్థులం జేయం గృపగలదేని యారగింపవలయు నది యెన్ని
దినంబులం గోలెఁ గన్నయదిలేదు దండుగ దర్శనంబులు గొనం దలం
పయ్యెనేని ముందఱ జాగి విచ్చేయు మనిన గొల్ల లుల్లంబునం దల్లడిల్లి
యీ బ్రాహ్మణుండు పలికినది యథార్థంబు. మా యర్థప్రాణంబులు
నీసొమ్ము. వలసినట్లు చేసికొమ్మనిన మాండవ్యు ద్రిమ్మరి మాటలకు
[35]దిగులు సొచ్చిన గోపాలకుల భూపాలకుండు మృదువచనంబుల నుపచ
రించి సైన్యంబు సముచితక్రమంబుల విడియించి కనకకుంభకలితంబై
కనుపట్టు గొల్లెనలం గృతావాసుండై.134
సీ. పెనుపారు కడియంపుఁ బిండివంటలతోడఁ
గమ్మని సద్యోఘృతమ్ముతోడఁ
గనరువోకుండ గాచిన యానవాలతో
గడిసేయవచ్చు మీఁగడలతోడఁ
బెక్కులాగులఁ గదంబించు జున్నులతోడఁ
బేరి దాఁకొన్న క్రొంబెరుగుతోడఁ
బిడిచినఁ జమురు గాఱెడు మాంసములతోడఁ
దేట తియ్యని జుంటితేనెతోడఁ
తే. బాయసాహారములతోడ [36]వ్రేయు లొసఁగ
నఖిలసేనాప్రజలతోడ నారగించి
సంతసంబంది పటకుటీరాంతరమున
జనవిభుండు భజించె నిశాసుఖంబు.135
శా. కౌండిన్యావ్వయసింధుచంద్ర విమతక్ష్మాపాలకామాత్యవే
దండానీకమృగేంద్ర చంద్రవదనాతారుణ్యకందర్ప శ్రీ
ఖండక్షోదవిపాండునిర్మలయశోగంగాజలక్షాళితా
జాండాఘోరకలంక శంకరనివాసాహార్యధైర్యోన్నతా.136
క. సురసురభికల్పభూరుహ
తరణిజశిబిఖచరదేవతామణిరజనీ
కరకాలబలాహకసఖ
కరపద్మసమస్తవిబుధకవినుతపద్మా.137
మా. జనహితసుచరిత్రా సజ్జనాబ్జాతమిత్రా
జనితవృషపవిత్రా సత్కవిస్తోత్రపాత్రా
వనరుహదళనేత్రా వంశమాకందచైత్రా
యనుపమశుభగాత్రా యన్నమాంబాకళత్రా.138
గద్యము
ఇది శ్రీభారతీతీర్థగురుశ్రీచరణకరుణాలబ్ధసిద్ధసారస్వతపవిత్ర
గాదయామాత్యపుత్ర యారాధితామరవీరభద్ర పిల్లలమఱ్ఱి
పినవీరభద్ర ప్రణీతంబయిన శాకుంతల శృంగార
కావ్యమునందు ప్రథమాశ్వాసము.
- ↑ కి నానాళీకగర్భుండు; కగున్ దత్స్వర్ణగర్భుండు
- ↑ సంచారంబునం
- ↑ మేనువాఁడు
- ↑ నష్ట
- ↑ సరవిపూల్గల
- ↑ లున్
- ↑ వాటీ
- ↑ సుచరిత్రున కుద్భవించి
- ↑ ధునాతన
- ↑ లీల
- ↑ ప్రసిద్ధి
- ↑ సరవడి నేర్చియు
- ↑ పోవ
- ↑ రాజీవ లగ్న
- ↑ గవుడుం, గవడుం;
- ↑ దద్భ్రమర
- ↑ కార్తాంతికులన్
- ↑ రమ్యాంత
- ↑ బోటి
- ↑ సురంటియు
- ↑ యెత్తిన
- ↑ మొకరిపప్పు
- ↑ పూతి వఱపు
- ↑ యెందే
- ↑ మృగయూధంబు
- ↑ వరసంబు
- ↑ వల్లంబు
- ↑ న్యలదుద్య
- ↑ i. మళ్లు, ii. వేళ్లు;
- ↑ మంత్రివర్గంబు
- ↑ విభు
- ↑ వా రౌట
- ↑ కాల్మాగి
- ↑ పయ్యెదవంక
- ↑ సొబగు విచ్చిన
- ↑ ప్రమద మెసగ