Jump to content

శృంగారశాకుంతలము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శృంగారశాకుంతలము

ద్వితీయాశ్వాసము

     శ్రీ సదన సదారాధిత
     వాసుకికేయూర వంశవర్ధన వినయా
     వాస పయోజాసనక
     న్యాసఖకీర్తి ప్రసన్న నాగయ వెన్నా!1
వ. ఇత్తెఱంగున దుష్యంతమహీకాంతుండు సంతోషంబున ఘోషంబున నా
     రాత్రి నిలిచి మఱునాఁడు సూర్యోదయం బగుటయుఁ గల్యకరణీయం
     బులుం దీర్చి లావరుల నేర్చి కదలి.2
చ. మెకములఁ బట్టఁ గట్టి వలమీటి చనం జననీక యాఁగి [1]తెం
     కికిఁ జనఁజేయ బోనునకుఁ గీడ్కొలుపం బయి వచ్చెనేని ద
     ప్పక పొడువంగ నేర్పు ఘనబాహుబలం బుసు గల్గి [2]నేటు వేఁ
     టకు నెఱవాదులైన సుభటప్రకరంబులు మ్రోల నేఁగఁగన్.3
క. ముదమును మదమును మనమున
     గుదిగొన గోష్ఠంబుఁ గడచి కొండొకచని య
     ల్లదె యిదె కాంతారంబన
     నెదురం జూపట్టుదాఁక నేఁగగ నచటన్.4
సీ. ఛాయామృగంబుల వ్రేయ గర్జిల్లఁ బ్ర
                    చండమై పొడము భేరుండరవము
     భేరుండనినదకంపితములై పాఱెడు
                    శరభసంతతిసాధ్వసస్వనంబు

     శరభనినాదవిప్రస్తంబులై గమ
                    నించు కంఠీరవనిక్వణంబుఁ
     గంఠీరవారవస్ఖలితంబులై చను
                    భీతవన్యకరీంద్రబృంహితమ్ము
తే. మక్కడింపఁ దదీయకల్మాషభీష
     ణోగ్రఘోషంబునను సత్వయూధవివిధ
     సత్వరధ్వానముల బహుజాతపక్షి
     కలకలంబులు వినవచ్చెఁ గర్ణములకు.5
క. ఆరావములుఁ గృతాంతా
     కారములై వేఁటకుక్క కదుపులు పెలుచం
     దారకులు పట్టి తిగువం
     గా రయమున మృగయులకు [3]మొగంబుల కెగయన్.6
గీ. సంతసంబందు నృపతియాస్యంబుఁ జూచి
     తిమురుకుక్కల బెడిదంపుఁ దెంపుఁ జూచి
     మృగయవర్గంబు గర్వంపుఁ బొగరుఁ జూచి
     యుల్లమునఁ జాల మాండవ్యుఁ డులుకు పుట్టి.7
వ. వనంబుఁ జేర వచ్చితిమి, మృగంబులు గానవచ్చుచున్నయవి, యీ
     వచ్చినవారిలోన నెవ్వరిని విచారించినం గాతరత్వంబు లేదు పోతరంబు
     బహులంబై యున్నది. ఏను [4]బేదబ్రాహ్మణుండ నివ్వనమృగంబుల నవ
     లోకించిన శరభస్వామి తలంపునంబడి పుట్టిన శరభంబులును, వైకుంఠ
     కంఠరవంబుమీఁది యుత్కంఠ నావిర్భవించిన సింగంబులును, జాంబ
     వంతుం డల్ల పనిసేయునప్పు డుప్పతిల్లిన భల్లూకంబులు, నాగ్రహంబున
     వ్యాఘ్రరక్షోభర్త లాక్షారుణాక్షంబుల నధిక్షేపించి చేయు నిక్షుచాప
     వ్యాపారంబున నుదయించిన పులులును, గుంభిదానవునకు సంభవంబైన
     యిభంబులును, గృతాంతుని లాయంబు లులాయంబుసంతతిం బ్రబలిన

     కారెనుపోతులును, గుహనావరాహంబుపై మోహంబున సమూహం
     బైన పందులును, గాని యేతన్మాత్రంబులు గావు. నాకుం బోవుట బుద్ధి
     గాదు, కాదని మగుడ నుద్యోగించిన మందకును దూరంబుగా వచ్చితిమి.
     [5]నడ గఁడు నడతెగె మానిసి మట్ట్ర చిట్టాడని యీ చిట్టడవి నెట్లు చన
     నేర్తు నొకయుపాయాంతరంబున దోడు వెట్టించుకొని[6]యెదం గాక
     యని యల్లనల్లన భూవల్లభుం జేరంజని యి ట్లనియె.8
సీ. కర్మకాండం బెఱుంగని పామరుండుఁ గా
                    ర్యాదిఁ జేకొని వినాయకునిఁ గొల్చు
     వేఁటమైఁదమి విఘ్నవిభుఁబ్రార్థనమ్ము సేయ
                    కయు వచ్చినారము గమనవేళ
     శరభశార్దూలాది చండసత్వంబుల
                    మర్దించుకొఱకునై మనదురాక
     మృగములు మనచేతఁ దగులువడంగ నం
                    దుల భీతి ప్రజలకుఁ గలుగకుండ
తే. గజముఖుని నేని బ్రార్థింతు ప్రజములోన
     బాలకును నేతి కుండ్రాల ప్రాల క చటి
     గొల్లలకుఁ జెప్ప నన్నుఁ దోడ్కొని చనంగ
     నంగజాలల ననువు ధరాధినాథ.9
క. సేమంబు పూని మృగజయ
     కామన సంకల్పపూర్వకముగ జపంబున్
     హోమముఁ జేయుచునుండెద
     సామజవదనునకుఁ దత్ప్రసాదము కలిమిన్.10
సీ. చిక్కుఁజీరుగ గూల్చు సింహపోతకములఁ
                    దోలి తొప్పఱలాడు గ్రోలుపులుల
     విలయంబు నొందించు విపినంబుపందుల
     వెరఁజి వెంపఱలాడు హరిణములను

     విఱువు కంఠాస్థుల నుఱికి చివ్వంగుల
                    మొత్తి మోదరలాడు మత్తకరుల
     గూల్పు ముర్వరఁ [7]దన్నికొన మన్నుఁబోతుల
                    వచ్చి వందఱలాడు వాహరిపుల
తే. జంపి వసియాడు శశములగుంపు కుఱికి
     చించి చెండాడుఁ గణుజులఁ జేతికొలది
     వెదకి వేఁటాడు దుప్పుల మెదలనీక
     చండవిక్రమచాప దుష్యంతభూప.11
క. అనుటయు మాండవ్యుని మన
     మునఁ గలిగిన భీతిఁ దెలసి భూపాలకుఁ డి
     ట్లను బ్రాహ్మణమిత్రునిఁ
     బాఱుని నే ని న్నకట యేమఱుదునే యెచటన్.12
వ. నీవు నావెంట నంటుకొని యొంటివడక తోడునీడయుంబోలెఁ నేతెమ్ము
     ప్రమాదంబు గాకుండఁ బ్రమోదంబుగా వేఁటవేడుక జూపి కుసుమంబు
     నుంబోలెఁ [8]గందకుండ నిన్నుం దెచ్చెదనని భుజం బప్పళించి మృగయ
     వర్గంబునుం దానును నిరర్గళప్రచారంబుల డాయనేఁగి [9]ప్రోగు వారించి
     దాపులమేపుల జువ్వులమొవ్వుల రేఁగులగోఁగుల రేలలజాలల వొద్దుల
     మద్దుల గురుగుల విరుగుల నెమ్ములజమ్ముల నేరేళ్ళమారేళ్ళఁ గలువల
     బలువులఁ గొడిసెల నొడి సెల నందుగుల నిందుగులఁ గలుగొట్లఁ గొట్లఁ బం
     చారుల నారులఁ బ్రేంకణంబుల గణంబులఁ గొండమామిళ్ళ వావిళ్ళ
     తాండ్లమాండ్ల జంద్రులనుంద్రుల వెలగలమొలగల బీరలగారల వేములఁ
     బ్రేముల మఱియునుం బెదబిచ్చి పినబిచ్చి నల్లిందనెల్లింద యిప్పకప్పు
     మద్ది గద్దగోరు గోరంట వెలమ యులిమిరి మూఁగవేఁగిస మొదలుగా
     బెక్కుతెఱంగుల మ్రాఁకులు మూఁకలుగొని యిసుము జల్లించిచల్లిన
     రాలని దట్టంబునం బొడకట్టు లేక పరిక్రీడమాన క్రోడ సింహ సైరిభ
     శరభ శార్దూల చమరు రురు కురంగాది జంతుఘోషంబులును, గంకకల
     వింక కడింజర ఖంజరీట కపోత శిఖావళ శుక పికానేక పక్షికుల కలకలం

     బులను, ఝంఝాపవనఝంపాసంపాతకంపమానకల్పాంతకాలజలధి
     ననుకరించు నరణ్యంబుఁ బ్రవేశించి వలయు వంకలం గాలువలలు
     [10]నురులు బోనులు దీమంబులు, జిగురుంగండెలు వెట్టి వేయించి సార
     మేయంబుల విడిపించిన.13
సీ. గళనాళములఁ ద్రుంచెఁ గారుపోతులఁ
                    గొన్ని తోలాడెఁ గొన్ని శార్దూలములను
     నెలుఁగులఁ గొన్ని మేనుల నఖంబుల వ్రచ్చె
                    జమరి మృగంబులఁ జంపెఁ గొన్ని
     కొఱప్రాణములఁ జేసి కూల్చె దుప్పులఁ గొన్ని
                    చెండెమన్నులఁ గొన్ని గుండెలవియ
     గఱచెఁ బందుల గొన్ని కంధరాంతరములు
                    కొండగొఱియల మన్నిగొనియెఁ గొన్ని
     చటులగతిఁ గొన్ని కణుజుల సంహరించె
     వెంటఁబడిఁ గొన్ని శరముల విత్తు [11]మాల్చెఁ
     గొన్నిజింకల ప్రేవులు గ్రుచ్చివైచెఁ
     గుక్క లాటవికంబులు నుక్కు మిగిలి.14
సీ. కడిమిమైఁ బిడియానఁ బొడిచి యొక్కఁడు కొఱ
                    ప్రాణంబుతోఁ బులిఁ బట్టి తెచ్చె
     భల్లాన నిర్గతప్రాణంబు గావించి
                    లావున నొక డేకలంబుఁ దెచ్చె
     నసిధార మెడద్రెవ్వ నడచి కొమ్ములతోన
                    నొకఁడు కార్పోతు మస్తకముఁ దెచ్చె
[12]బాణాభిహతిఁ గూలఁబడవేసి యొకఁడు
                    కాననదంతితొండంబు నఱకి దెచ్చె
తే. గుఱుచకుంతాన బెను మోర గ్రుచ్చి యెత్తి
     యెలుఁగు నొక్కఁడు కాల్వట్టి యీడ్చి తెచ్చె

     ఠేవమై జిల్లకోల నాటించి యొక్కఁ
     [13]డేదుఁ గొనివచ్చెఁ గరిపురాధీశుకడకు.15
చ. అవి గనుఁగొంచు నెంతయుఁ బ్రహర్పషమునొందుచుఁ దానులీలఁగా
     నవిరళశక్తిఁ గాంచనసమంచితపుంఖశిలీముఖంబులం
     గవయవరాహదంతిరురుకాసరపఙ్క్తులఁ గూలనేయుచున్
     గదిసి తదీయకంఠములు ఖడ్గముఖంబునఁ దైవ్వనేయుచున్.16
క. వనచరులను జూచుచు నటఁ
     జన జనపతి కాంచె నొక్క చక్కని యిఱ్ఱి
     న్మునిపతి పెంపుడుబుఱ్ఱిని
     వనమునఁ జరియించువేళ వలపులకుట్టిన్.17
క. హరిణము నెఱిఁగని పుంఖిత
     శరుఁడై వెంబడిన యరిగె జనపతి కడిమి
     న్వరయజ్ఞమృగము వెంబడి
     నరిగెడు సాక్షాల్పినాకహస్తుడుపోలెన్.18
చ. విలుకొని వెంట వెంటఁ బృథివీపతి రా శరపాతభీతిఁ దా
     మలఁగి మలంగి కన్గొనుచు మార్గము క్రేవకు నడ్డగించుచు
     న్నిలుచుచుఁ గొంతకొంత గమనించుచు నర్ధము మేసి మేసి ద
     ర్భలు వివృతాస్యపార్శ్వముల రాలఁగ మింటికిఁ జౌకశించుచున్.19
సీ. శాలాంతరంబు మోసంటై న విడివడి
                    యరుదెంచు గాడ్పువాహనమృగంబొ
     శశముతో నొంటక జగతిపై వచ్చిన
                    చంద్రునిలోని లాంఛనమృగంబొ
     వీరభద్రుని కృపావీక్షణంబునఁ బున
                    ర్నవమై చరించు జన్నపు మృగంబొ

     పార్వతీకన్యక [14]ప్రార్థింప విడిచిన
                    యురగేంద్రకంకణు కరమృగంబొ
తే. యనఁగ మాయామృగమువోలె నామృగంబు
     ధరణిపతి బాణనిహతికిఁ దగులువడక
     నదులు నగములు ఘనకాననములు గడచి
     చటులగతి నేఁగె మాలినీతటమునకును.20
క. ఏతెరువున నరిగె మృగం
     బా తెరువున నదులు వనము
     లద్రులనక ధాత్రీతలపతి సైన్యసమా
     న్వీతుండై యరి గె మాలినీనది దాఁకన్.21
గీ. అచట మృగమును బో లేక యలసి నిలిచె
     నానెలవు నాశ్రమాంతిక మగుటఁ జేసి
     స్థలవిశేషం బెట్టిదో ధరణిపతికి
     హరిణపతిమీఁద నెంతయుఁ గరుణపుట్టె.22
వ. ఇత్తెఱంగునం గురంగంబుమీఁదఁ గురంగాంకకులీనుండు కృపాతరంగి
     తాంతరంగుడై యేయకయుండం దత్తరంగిణీతటంబున.23
సీ. కడఁగి సంక్రీడించు నడవియేనుంగుల
                    గండస్థలుల దానగంధములను
     జెంచులరాచకెంజిగురాకుఁబోఁడుల
                    శిరసుల జవ్వాదిపరిమళముల
     విచ్చిన నెత్తమ్మివిరులఁ దుమ్మెద లాడ
                    జాఱిన పూదేనెసౌరభములఁ
     గూలద్రుమంబుల గాలితాకున రాలి
                    వచ్చిన యలరు క్రొవ్వాసనలను

తే. శబలితంబగు నయ్యేటిసలిలకణము
     లల్లనల్లన గొనుచు మందానిలుండు
     చల్లఁగా వీచి వనపథశ్రాంతి దీర్ప
     నది గనుంగొను వేడుకఁ గదలికదలి.24
మ. ఒకచో మత్తమరాళనృత్తనినదం బొండొక్కచోఁ జక్రవా
     కకుటుంబస్మరకేలిజాతకలనిక్వాణంబు వే ఱొక్కచో
     వికచాంభోజమరందసన్మధుమదావేశభ్రమద్భృంగగా
     నకలాపధ్వని మానసంబుసకు నానందంబు సంధింపఁగన్.25
క. కంజకుముదోత్పలచ్యుత
     కింజల్కపరాగపటలకీలిత మగుచు
     న్మంజుసరోవరదేవత
     మాంజిష్ఠము గట్టుకొనినమాడ్కిం దనరున్.26
మ. చలదిందీవరచారునేత్ర సముదంచచ్చంచరీకాలకం
     జలజాతాననఁ గంబుకంఠి బినహస్తం జక్రవాకస్తనిం
     బులినశ్రోణి మరాళరాజగమన న్భూజాని గాంచె న్నట
     జ్జలకల్లోలపరంపరానినదవాచాశాలిని న్మాలినిన్.27
వ. కాంచి వితతపరిశ్రాంతుఁడును, సంతోషితస్వాంతుండునునై బెదరి
     బెదరి తనవదనంబుఁ గనుంగొనుచుం గదలకున్న యిఱ్ఱిగున్న వీక్షించు
     చున్న యవసరంబున.28
సీ. దీర్ఘదీర్ఘంబులై తిరి గట్టిమడములు
                    గడచి తూలాడు కెంజడలతోడ
     వింజామరము విచ్చి వ్రేలవైచినమాడ్కి
                    డాలొందు నరపగడ్డంబుతోడ
     ఫాలబాహూదరపార్శ్వదేహంబుల
                    గొమరారు భూతిపుండ్రములతోడఁ
     బోళెంబు విడిచి కప్పుకొని వచ్చిన
                    కొత్తమణుఁగుఁ జమూరుచర్మంబుతోడ

తే. బ్రహ్మతేజోధికులరైన బ్రహ్మచారు
     లిద్ద ఱిరువంక నలమి రా నెలమితోడ
     నగ్నిశిఖవోలియును జల్లనైనకాంతి
     యడర నొకవృద్ధముని వచ్చె నధిపుకడకు.29
వ. వచ్చి వెడవెడ దీవించి కృతాంజలియై యున్న రాజునుం గూర్చుండు
     మనక తాను నాసీనుండుం గాక నిలిచి హరిణంబు నంగుళిముఖంబునం
     జూపి.30
క. ఆశ్రమసారంగం బిది
     యాశ్రితమందార దీని నలయించితి నీ
     విశ్రామమునకు నిది మా
     కశ్రాంతముఁ బ్రాణమిత్రమై చరియించున్.31
ఉ. ఏమని చెప్ప నప్పు డటు లీనిన మైఁదడి యాఱలేదు దా
     నీమహితాశ్రమంబునకు నేసరవింబడి తప్పివచ్చెనో
     ప్రేమయుఁ జేసి యంగుళులఁ బెట్టిన దర్భలు మేయుచుండగా
     నోమనఁ బాపగోలెఁ కృపనోమితి నీమృగరాజడింభమున్.32
క. తనతల్లులు మునిపత్నులు
     తనతండ్రులు మునిజనములు; తససహజన్మల్
     మునికన్యలుగా; గారవ
     మున బెరిగి వనౌకసులకు ముద్దులు గురియున్.33
 వ. ఇది యొకనా డాహారవిహారార్థం బరిగి కాననంబులం గసవు మేయుచు
     దాపసజనంబు వేర నెవ్వరుం గనుంగొనినం గనుచూపు మేరన మేత
     చాలించి డాయవచ్చి యెరసికొనుచు సౌహృదోత్కంఠం గంఠం బెత్తి
     కండూయనంబుఁ చేయించుకొను; మమ్ము సమ్ముఖంబున నాలోకించు
     చుండియు బెండుపడి యోలంబునం దల వ్రాలవై చుకొని మిన్నకున్న
     యది; యొచ్చెల యెంత నొచ్చెనో కదా యని డగ్గఱి కపోలంబులు
     పుడికి, గళంబు దువ్వి. యంగంబులు నిమిరి, సారంగంబు నుపలాలించుచుఁ

     గృపాతరంగిణీతరంగంబులగు నపాంగంబుల మృగంబు వీక్షించు ముని
     పుంగవుం గని నృపపుంగవుండు కలంగిన యంతరంగంబున.34
క. నొచ్చేనొ వీరల హృదయము
     లిచ్చట నామీఁద నలిగి యేమని శాపం
     బిచ్చెదరో కద నాలుక
     వెచ్చన మునులకును గినుక వేగమ వచ్చున్.35
సీ. భృగుని నూసరవెల్లి వగుమని యొకఁ డల్గె;
                    సగరుల నొకఁడు భస్మముగఁ జూచె;
     శీతాంశు నొకఁడు నాశిలుచుండఁ గోపించె;
                    భానుని నొకఁ డుర్వి బడ నదల్చె;
     నబ్ధులేడును నొకఁ డాపోశనము గొనె;
                    నగభేది నొకఁ డేవముగ శపించె;
     జంకించి యొకఁ డగ్ని సర్వభక్షకుఁ జేసె;
                    నహుషుని నొకఁ డంపె నహుల గలయ;
తే. గోత్రరిపులక్ష్మి మున్నీటఁ గూల్చె నొకఁడు;
     మునుల మనసుల నొప్పించి మొక్కవోయి
     బైసి దొలఁగిన వా రెంతలేసివార
     లితరజనముల గణుతింప నెంతవారు.36
చ. దిరిసెనపూవుకంటెను నుతింపగ మెత్తన చాలఁ జిత్తముల్,
     కెరల యుగాంతవాయుసఖకీలలకంటెను వేడినాలుకల్,
     దరిసిన గూలద్రోయుదురు దంతులతోడి దిగీశరాజ్యముల్,
     కరుణ వహించిరే మునులు కట్టుదు రల్పుల బ్రహ్మపట్టముల్.37
గీ. కుడిచి కూర్చుండి యురక యెన్నడును లేని
     వేఁట యే నేల వచ్చితి విపినమునకు
     వత్తుఁ గా కేమి దుష్టసత్త్వములఁ జంపి
     యేల తనియక వచ్చితి నిఱ్ఱిబడిని.38

వ. విధికృతం బెట్లు కానున్నదో కాక యని యాకులితచిత్తుండై, యానృపో
     త్తముండు తాపసోత్తముపదంబులకు ముదంబొదవం బ్రణామంబు చేసి
     కరకంజంబు లంజలిబంధంబు గావించి యంటియంటి మంజులోక్తులఁ
     దపస్వికుంజర! యేను దుర్వ్యసనంబున మృగయావిహారంబునకుఁ
     గడంగినది లేదు. సింహశరభసైరిభద్వీపిద్వీపాదిదుష్టమృగంబులు
     గోష్ఠంబులకు, నేదిష్ఠగ్రామంబులకు, నరిష్టంబు సేయుచున్న యవి యని
     భిల్లపల్లవజనంబు లెఱింగించిన, వాని మర్దించుటకు నై, నిర్దయశార్దూల
     సమ్మర్దంబును, మదభరోత్కంఠకంఠీరవారావభైరవంబును, శరభ
     సైరిభధ్వానభయదంబును, బ్రచండవేదండప్రకాండబృంహితాకాండ
     జలదగర్జాస్ఫూర్జితంబును, సముల్లసద్భల్లూకహీంకారనిక్వణకలితంబును,
     నుద్ధతస్తబ్దరోమోద్దామనిర్ఘృణదీర్ఘఘుర్ఘరనిర్ఘోపభీషణంబును, దుర్వ
     హదర్వీకరభీకరంబునునైన యరణ్యంబున వేఁటలాడుచు వచ్చి యిది
     యాశ్రమమృగం బౌట యెఱుంగక కురంగలించియుండ వన్యమృగంబ కా
     నిర్ణయించి, వేటాడి, యలయించితి. ఈయజ్ఞానంబు సహింపవలయు
     ననినం బరమజ్ఞానియగు మునీంద్రుఁడు నరేంద్రు నాలోకించి.39
క. జననాథ దుష్టమృగమ
     ర్దన మొనరింపంగ నీ వరణ్యంబునకుం
     జనుదెంచు టంతరలో
     కనముల నెఱుఁగుదుము నీకుఁ గలుషము గలదే.40
గీ. దీని నాశ్రమమృగమని తెలియ [15]కీవు
     వచ్చు టెఱుఁగుదు మవనీశ వలదు భయము
     వైరిమర్దనుఁడవు, వంశవర్ధనుఁడవు
     కీర్తిఘనుఁడవు నీ కొక కీడు గలదె.41
ఉ. సర్వజనైకపూజ్యుఁడవు సత్యయుతుండవు నీవు మామకా
     శీర్వచనంబునం గను ప్రసిద్ధు నపూర్వసుపర్వనాయకాం
     తర్వసుఁడైన నీ యనుఁగుఁదాతఁ బురూరవుఁ బోలువాని, నీ
     యుర్వరఁ జక్రవర్తి పద మొందు సుపుత్రుని, సచ్చరిత్రునిన్.42

క. ఈ మాలినీతరంగిణి
     సీమముగా నింత నుండి క్షితినాయక ని
     స్సీమతపోనిధి కణ్వమ
     హాముని తపముండు నాశ్రమాటవి యిచటన్.43
సీ. మునులు నిత్యస్నానములు దీర్చి యెడలక
                    కాసారముల కంచ గదియ వెఱచు
     మౌనిజనం బనుష్ఠానంబుఁ దీర్పక
                    మృగశాబకము దర్భమేయ వెఱచు
     సంయమీంద్రులు శివార్చనలు చెల్లింపక
                    ప్రసవంబునకుఁ దేఁటి ముసర వెఱచుఁ
     బారికాంక్షులు ఫలాహారతృప్తులు గాక
                    కీరంబు పంటికిఁ జేర వెఱచుఁ
తే. దపసిజనములు నుతిమంత్రజపము లుడిగి
     వచ్చియుండక పికశిఖావళములాది
     గావనంబునఁ గల విహంగమకులంబు
     తత్తరము నొంది నోరువా యెత్త వెఱచు.44
సీ. వృద్ధసింహమునకు విహరింపఁ దొండంబు
                    కైదండగా నిచ్చు గంధగజము
     పులి క్రొత్త యీనిన పొదరింటిలోనికి
                    బురిటాలి తగవుఁగొంపోవు హరిణి
     శరభంబు కొనగోళ్ళ శిరము దువ్వగఁ
                    బొక్కి కనుమోడ్చు సుఖనిద్ర గండకంబు
     సింహకిశోరంబు చేరవచ్చిన
                    వింత లేక చన్నిచ్చు బాలెంత కరిణి
తే. యెలుకతోడుతఁ జెరలాడు నెనసి పిల్లి
     నెమ్మిఁ బురివిచ్చి నిలిచి పింఛమ్ము నీడ

     భుజగకన్యక నాడించుఁ [16]బూరినమలి
     యనఘ కణ్వమునీంద్రు పుణ్యాశ్రమమున.
మ. పవనుం డాహుతి గంధము ల్గొనుచుఁ బై పై వచ్చె నాసాపుటీ
     వివర ప్రీతిగ నాస్వదింపుము చతుర్వేదోక్తమంత్రధ్వనుల్
     కవియం బారెడు యజ్ఞవాటముల నాకర్ణింపు వీక్షింపు న
     చ్చె వియద్వీథికి హోమధూమలతిక ల్జీమూతజీవాతువుల్.46
వ. సంయమీంద్రులు నరేంద్ర నీ విచటికి వచ్చుట తమదివ్యజ్ఞానంబున నెఱింగి
     యున్నవారు నీ వెఱుంగమి చేసికొనిపోవక యాయురైశ్వర్యాభివృద్ధి
     కరంబును, గలుషకర్శనంబును నగు తాపసదర్శనంబుఁ జేసిపొమ్మని
     యమ్మునివరుండు నిజేచ్ఛం జనియే నృపవరుండును నచటనుండి యరదం
     బెక్కి చనుట యుచితంబు గామింజేసి, తేరు మాలినీతీరంబున నునిచి
     శరాసనాదిసాధనంబులు సారథిచేతి కిచ్చి, తేవనంబునం బరమపావనం
     బగు తపోవనంబు సొచ్చి.47
సీ. శుకగర్భకోటరచ్యుతములై నివ్వరి
                    ప్రా ల్కిందఁ జెదరిన పాదపములు
     దలలకు గాక కాయలు నూఱ నందులఁ
                    జమురంటి [17]మెఱయు పాషాణతతులు
     నిబిడవల్కలశిఖానిష్యందరేఖల
                    [18]జాఱులుగల జలాశయపదములు
     దమమేను లొరసికొంచు మనుష్యు లరిగిన
                    భయమునఁ జంచలింపని మృగములు
తే. గలిగి యన్యోన్యమైత్రి నక్కడఁ జరించు
     పులులకూనలు, జింకపిల్లలు, మృగేంద్ర
     పోతకంబులు, నాలక్రేపులును గదుపుఁ
     గట్టికొని కూడియాడ నక్కజముఁ జెంది.48

శా. వేదాధ్యాపకులైన రాచిలుకలన్ వేదాంతమీమాంసలన్
     వాదం బిమ్ములఁ జేయు శారికల దత్త్వం బిందు[19]జూటుండుఁగా
     నాదేశించు పురాణముల్ చదువు చక్రాంగంబులన్ సామముల్
     నాదంబొందఁ బినాకిఁ బాడు నళులన్ వందారుఁడై చూచుచున్.49
చ. చనునెడ నంతలో గుడిభుజం బదరంగఁ దొణంగినన్ మనం
     బునఁ గడుఁ జోద్యమందుచుఁ దపోవన మిచ్చట దీనికిన్ ఫలం
     బొనర మనోజ్ఞమూర్తియగు యుగ్మలిఁ గౌఁగిలిఁ జేర్పఁగావలెన్
     గొనకొని యీశ్వరుండ యెఱుఁగం గనరానిది మానుషంబునన్.50
మ. అని నాల్గేనుపదంబు లేఁగునెడఁ గర్ణానందసంధాయులై
     వినగా వచ్చెఁ బ్రియంవదా నిగిడి రావే యంచు రారాఁగదే
     యనసూయా యని వృక్షసేచనము సేయం జాలఁబ్రొ ద్దెక్కెఁగా
     యని యాక్షేపము సేయు నొక్క తనుమధ్యామంజులాలాపముల్.51
క. ఆమాట లాలకించుచు
     భూమీశుఁడు కొన్నిచరణములు చని యడరన్
     గామునిదీపము లనఁజను
     వామాతుల ముగురఁ జూచి వారలలోనన్.52
శా. చంచత్పల్లవకోమలాంగుళకర స్సంపూర్ణ చంద్రానన
     న్యంచచ్చందనగంధి గంధగజయానం జక్రవాకస్తనిం
     గించిన్మధ్య దటిల్లతానిలసితాంగిం బద్మపత్రాక్షి వీ
     క్షించెన్ రాజు శకుంతల న్మధుకరశ్రేణీలసత్కుంతలన్.53
సీ. దర్పకురాజ్యంబు దలచూప నెత్తిన
                    బంగారుటనటికంబము లనంగ
     రతిమన్మథులు విహారమునకై చేతుల
                    బట్టి యాడెడి నిమ్మపం డ్లనంగ

     రేయివెన్నెలనాఁటి రేయెండ యుదయింపఁ
                    బెదరు చకోరంపు బిల్ల లనఁగ
     శృంగారసరసిరాజీవకాననమున
                    విచ్చిన కనకారవింద మనఁగ
తే. నూరుయుగమును జనుదోయి యొప్పు విప్పు
     కన్నుఁగవ నెమ్మొగంబు నుత్కంఠ బెనుపఁ
     గౌతుకముఁ జేసె మేదినీకాంతుమదికి
     విపులలావణ్య[20]పరసీమ తపసిలేమ.54
వ. అప్పు డప్పుడమిఱేఁడు విస్మమాయత్తంబగుచిత్తంబున నత్తపస్వి
     మత్తకాశిని నవలోకించి తనమనంబున.55
సీ. సురకన్య కాబోలు సురకన్య యయ్యెనే
                    ఠీవిమై ఱెప్పలాడించు టెట్లు
     పుత్తడి కాఁబోలుఁ బుత్తడి యయ్యెనే
                    హంసీగతుల నడయాడు టెట్లు
     వనలక్ష్మి యయ్యెనే వనలక్ష్మి కాఁబోలు
                    గటివల్కలంబులు గట్టు టెట్లు
     రతిదేవి కాఁబోలు రతిదేవి యయ్యెనే
                    వలరాజుఁ బెడఁబాసి వచ్చు టెట్లు
తే. కన్నుఁగవ యార్చుటను సురకన్య కాదు
     నడచియాడెడుఁగానఁ బుత్తడియుఁ గాదు
     లలిఁ దపశ్చిహ్నమున వనలక్ష్మి కాదు
     ప్రసవశరముక్త యైనది రతియు గాదు.56
వ. మానవమానవతియు కావలయుఁ గాక దేవకామిని యయ్యెనేని నన్ను
     నవలోకించి యంతర్ధానంబునొందుఁ గాకుండెనేని నన్యోన్యసల్లాపంబు
     లుజ్జగించి యూరకుందురు గావున నొక్కదిక్కున మఱుగుపడియుండి

     యవలోకింపవలయు నని సమీపవటవిటపిమూలంబునం దాగి కనుం
     గొనుచుండె నయ్యవసరంబున.57
క. బిందెలు కరములఁ గొని యర
     విందాస్యలు జలము దెచ్చి వేడుకతో నం
     దంద తరుసేచనంబును
     సందడిగొని సేయుచును ససంభ్రమలీలన్.58
క. అనసూయ నిగిడి చన న
     య్యనసూయం గడచి వడిఁ బ్రియంవద చన న
     య్యనసూయఁ బ్రియంవద మును
     కొని వేగిరపాటుతో శకుంతల చనఁగన్.59
సీ. అరుణపల్లవములు హస్తాంగుళంబులు
                    గెంజాయఁ దమలోన గ్రేణి సేయ
     వెలిమంచుమొగ్గలు విమలదంతంబులు
                    చెలువంబుఁ దమలోన గలసి వెలయఁ
     బరువంపు గుత్తులుఁ బ్రన్ననిపాలిండ్లు
                    మవ్వంబుఁ దమలోన మార్చికొనఁగఁ
     జిందుతేనియలును జెమటచిత్తడియును
                    గ్రొత్తావి తమలోన బిత్తరింప
తే. లలితపుష్పితజంగమలతికవోలె
     వల్లికావృక్షముల యాలవాలములకు
     జలము వోయు శకుంతల చంద్రవదన
     చారుతరవైభవముఁ జూచి జనవిభుండు.60
చ. దిరిసెనపువ్వుకంటె గణుతింపఁగ మెత్తన మేనుదీఁగె యీ
     తరుణికి; నిట్టికోమలి లతాతరుసేచన మాచరింపఁగాఁ
     గరుణ యొకింత లేక కడఁగట్టె మునీంద్రుఁడు మాట లేటికిన్
     సరవి యెఱుంగలే కకట జాదులు వేఁచర మంగలంబునన్.61

గీ. చందనంబునఁ బుష్పంబు గుందనమునఁ
     బరిమళం బిక్షులతికను ఫలమువోలె
     రతిమనోహరమైన యీయతివమేన
     నరయఁ గనుగొంటిఁగాదె యీయౌవనంబు.62
వ. ఈలతాతన్వి తపస్వినీచిహ్నంబులు పూనియున్నను నెరవు దోఁచుచు
     శరీరకాంతి సౌందర్యసౌభాగ్యంబువలన రాజసంబును, ప్రతాపంబును,
     గర్వంబును, ఠేవయు నించుకించుక ప్రకాశించుచున్న యవి, మౌనికన్యా
     కలితంబగు బ్రహ్మతేజోవిశేషంబు కేశంబును గాన[21]రాకున్న దది
     యట్లుండె.63
ఉ. సందియు మేల యీవికచసారసలోచన రాజపుత్రి నా
     డెందము మౌనికన్యలబడిం జననేరదు నిక్కువంబ యే
     చందమునందు సంశయవిచారపదం బగునట్టి వస్తునీ
     మం దమచిత్తవృత్తులు ప్రమాణము లుత్తములైనవారికిన్.64
ఉ. పౌరవవంశసంభవుల పావనచిత్తవిధంబు లన్యకాం
     తారతికిం బ్రమోదభరితంబులు కావు ప్రకంప మొంది యీ
     ధారుణి సంచలించినమ దామరచూలి వరంబు దప్పినన్
     వారిధు లింకినన్ మఱి దివాకరచంద్రులు తప్పఁ గ్రుంకినన్.65
క. కానీ సంశయ మెల్లను
     [22]మానుం బరిపాటి వీరిమాటలవలనన్
     లోనున్నరాగి వెలుపల
     గానంగావచ్చు పూఁతకడియముభంగిన్.66
గీ. వీనులకుఁ బండువులుగాగ వీరిమాట
     లాలకించెదఁగా కని యధిపుఁ డుండె
     నంత నొకతేటి వచ్చి శకుంతలాము
     ఖాంబుజమునందు ముసరిన నలఁత నొంది.67

క. కరమునఁ బలుమఱు నామధు
     కరము నదల్ప నది నెమ్మొగము విడువమికిం
     గరము వడంకుచు రజనీ
     కరముఖి యనసూయఁ జూచి కడుదీనతతోన్.68
ఉ. ఈయలిపోత మే నెఱుఁగ నెక్కడనుండియొ వచ్చి మోముపై
     రాయిడి చేయుచున్నది, కరంబులఁ జోపినఁ బోవ దన్న, వో
     తోయజనేత్ర! నే నెఱుఁగుదున్ విరవాదికి నీరు వోయఁగా
     నాయెడనుండి వచ్చె భవదాననగంధము నాస్వదింపఁగన్.69
మ. శ్రవఁణేంద్రీవరమున్ బజించె, నదియుం బ్రస్థానముక్తంబుగా
     భవదక్షిన్ వసియించె, నక్షి ముకుళింపం దేఁటి నెమ్మోముపైఁ
     దవిలెన్ దానిఁ దొరంగఁ జోపుటకు హస్తం బెత్తి వారించె దౌ
     నవు నంభోరుహసామ్యదోషము వయస్యా! లేదె నీచేతికిన్?70
గీ. కమలరుచి నీముఖాక్షిహస్తములు చూచి
     పద్మనీభ్రాంతి నీయళి వాసిపోవ
     దని యెఱుఁగు, నీ వెఱుంగుదు వనఁగ విభుఁడు
     తెఱవ మోమున [23]భ్రమరించు తేఁటిఁ జూచి.71
మ. వనితం జంచ దపాంగఁ జేసి కనుఁగ్రేవల్ ముట్టుచుం జేరి, మం
     తనముంమ జెప్పెడుభంగి నొయ్యఁ జెవిచెందన్ మ్రోయుచున్, మెల్లమె
     ల్లన మోవిన్ రతిసౌఖ్యసంపదలఁ గొల్లల్ గొంటి, ధన్యుండ నీ
     వనఘా! తుమ్మెద! నేను వెల్వడితిఁ దత్తాన్వేషముం జేయుచున్.72
వ. విమలసుధాకరకులీనుండ నేను శంకాకలంకితచిత్తుండనై యుండ,
     మలీమసమధుపకులీనండ వీవు నిశ్శంకం గొంకక పంకజముఖిం జ
     విగొంటివి. చండాలిభర్త పుణ్యుండును, విశ్వంభరాభర్త యపుణ్యుండు
     ను నయ్యెంగదా! యనుచు నాచంచరీకంబు నాక్షేపించుచు నాడు పల్ల

     వాధరుల సల్లాపంబులు [24]చెవులకుఁ జల్లఁగా వినుచు నుల్లసంబున భూవల్ల
     భుండు చప్పుడు సేయకుండె నప్పుడు శకుంతల విస్రస్త[25]కుంతలయు
     విధ్వస్తధైర్యయు, విన్యస్తసాధ్వసయునై యనసూయాప్రియంవదల
     నవలోకించి.73
గీ. ఏను మీచెలి నిం తేల యెరవు సేయ
     వింతవారైన మొఱ యాలకింతు రకట
     ప్రాణసములరు కావరే ప్రాణ మెత్తి
     మమత విడువక మార్పరే మధుపబాధ.74
క. నేఁ జనినచోటి కెల్లను
     దాఁ జనుదెంచుచును మఱలఁ దనుఁ జోఁపంగా
     మీఁజేతులెల్ల గిజగిజ
     గాఁ జేసెను మొగలిముండ్లు గాఁడినభంగిన్.75
గీ. వివర మొనరింప బొందులు వేఱుగాని
     ప్రాణ మొక్కటి మనకుఁ బద్మాక్షులార
     పాపరే నాకు నీయీతిబాధ యనిన
     జిట్టకాలకు వార లచ్చెలువతోడ.76
ఉ. ఇంతి తపస్వికన్యకల మే మసనుర్థల మీతిబాధ భూ
     కాంతుఁడు మాన్పి ధాత్రిప్రజఁ గావను బ్రోవను గర్త కాన దు
     ష్యంతున కేము చెప్పెదము సాధుజనార్తిహరుం డతండు దు
     ర్దాంతుని నియ్యలిం గెడపి తామరపూఁజెఱసాలఁ బెట్టెడున్. 77
వ. రాజుసన్నిధికిం బోయెదమని నగవులకు రెండుమూఁడుపదంబు లరిగిన
     ననసూయాప్రియంవదలవెంట నాక్రోశంబు సేయుచు శకుంతలయుం
     గదలె నయ్యవసరంబున భూవల్లభుం డప్పల్లవాధరలం గనుంగొని లీలా
     వ్యాజంబున నీరాజవదన లాశ్రమసదనంబునకుం జనకుండ నెఱింగించు

     కొన నిది యవసరంబని మ్రానిచాఁటు విడిచి జవనిక వాయందట్టినం
     [26]బొడసూపు బహురూపి తెఱుంగున మఱుంగుపడియున్న తా నన్నలి
     వి[27]లోచనలకుం గోచరుండై నిలిచి వెఱవకుం దోడకుండు తపస్వికన్య
     లకు మీకు నాకులం బొనర్చిన దుశ్చరిత్రుఁ డెవ్వండు వాని నాజ్ఞాపించెద
     ననిన సుధామధురంబులగు నతని వాక్యంబు [28]లాకర్ణించి కనుంగొను
     నెడ.78
సీ. కస్తూరివ్రాసినకరణి మీసలు నల్లదొగడురేకు
                    జనించు మొగము మెఱయఁ
     గ్రొత్తమ్మిసోగఱేకులమీఁదఁ దుమ్మెద
                    లున్నలాగునఁ బెద్దకన్ను లమర
     నాజానుదీర్ఘంబులైన బాహులపెంపు
                    శేషభోగాకృతిఁ జెలువ మొందఁ
     బిడికిలింపగవచ్చు నడిమి యొప్పిదముతో
                    నురమువిస్తారంబు సిరి వహింప
తే. నాననము పూర్ణచంద్రుపెం పపహసింప
     గగనమున నుండి వేడ్క నకాండ మిలకు
     నదరిపాటుగ డిగిన జయంతుఁ డనఁగఁ
     జాల నద్భుత మొసఁగె దుష్యంతమూర్తి.79
వ. ఇట్లు పొడచూపిన నృపాలచంద్రు నాకారతేజోవిశేషంబులు భావించి
     జయంతుఁడో కంతుఁడో నలకూబరుండో యిచ్చటికి వచ్చుట కెయ్యది
     కారణంబకో యని యద్భుతంబును జయంబును మనంబునం బెనగఁ
     గొండొకవడి గనుంగొని నరుండకా నిశ్చయించి యతని కులనామధే
     యంబు తెలిసికొనవలెనని యనసూయాప్రియంవదలు రాజువదనార
     విందం బాలోకించి.80
ఉ. ఎక్కడివాఁడ వన్న జగతీశ్వరలక్షణలక్షితంబు నీ
     చక్కనిమేను దీర్ఘభుజశాఖలుఁ దేజముఁ జర్చ సేయఁగా

     నిక్కడి కొంటి వచ్చుటకు నెయ్యది కారణ[29]మంతవట్టు నీ
     నిక్కముఁ జెప్పమన్న ధరణిపతి సత్యచరిత్రుఁ డాత్మలోన్.81
క. వారక యసత్యవచనము
     నారకహేతు వనఁగను [30]వినంబడెడుం బు
     ణ్యారణ్యములోపల ముని
     దారికలకుఁ బొంక నేల ధర్మచ్యుతిగన్.82
వ. అని విచారించి వారలతో నేను దుష్యంతుఁడ గాంతారంబున దుష్ట
     మృగంబుల మర్దించుటకై వేఁటవచ్చి మాలినీతీరంబునం బరివారంబు
     నిలిపి కణ్వమహాముని న్నమస్కరించి పోవుతలంపున వచ్చి యిచ్చట నొక్క
     కలువకంటి యొంటి నాక్రోశింప మీయార్తనాదంబు విని యరుగుదెంచు
     నప్పటికి మీసరససల్లాపంబులై యున్నయవి యని యల్లనల్లన శకుంతలం
     గనుంగొనుచుండ నచ్చట.83
శా. ఆకాంతాతిలకంబు చన్నుఁగవపై నందంద రోమాంచ మ
     స్తోకంబై పొడకట్ట నుత్కలికచేతోభీతి సంధిల్ల నా
     క్ష్మాకాంతామణి మంజుభాషణము లాకర్ణించుచుం దోన తా
     నాకర్ణించె మనోజచాపగుణసాహంకారఠంకారముల్.84
క. భావభవవుష్పచాప
     జ్యావల్లీరవము తన్మయత్వముఁ దెలుపం
     దేవేంద్రతనయసన్నిభు
     నావిభుఁ గనుఁగొనుచునుండె ననిమిషదృష్టిన్.85
చ. కొలఁదికి మీఱు కోర్కుల శకుంతల చూడ నృపాలుడెందము
     న్నలుపును దెల్పునైన నలినచ్ఛదలోచన లోచనచ్ఛవు
     ల్శలలము లట్ల నాటుకొన సౌరభలోభమున న్మధువ్రతం
     బులు పగులంగా నాటుకొనెఁ బుష్పధనుర్ధరుఁ డేయు తూపులున్.86

క. వాలికలై విరిదమ్ముల
     యేలికలై భావభవుని యెలదూపులకుం
     బోలిక లై యుత్కలికల
     మూలికలై యబలఁ దాకెఁ మొగి నృపుచూపుల్.87
ఉ. బాలికచూపులున్ ధరణిపాలకు చూపులు నొండొకళ్ళపైఁ
     గీలుకొనంజనంగఁ గనుగ్రేవల నవ్వుచు నిల్చి యిద్దఱ
     న్వాలికవువ్వుఁదూపు లిరువంకలఁ బాఱఁగ నిక్షుచాపముం
     గేల నమర్చి యేయఁదొడఁగెం బ్రసవాస్త్రుఁడు సవ్యసాచియై.88
ఆ. కాముఁ డనెడు వేఁటకాఁ డేయుచును రాఁగ
     నువిద [31]చేత మనెడు [32]నోదమునను
     వసుమతీశచిత్తవన్యకరీంద్రంబు
     పడియెఁగాని మగిడి వెడలదయ్యె.89
వ. ఇత్తెఱంగున లతాంతశరనికరనిర్భిదేళిమస్వాంతుండై యుండ నందు
     శకుంతలాలికుంతల తనమనంబున.90
చ. విరులశరంబునుం జెఱకువిల్లును బూనఁడు గాని వీడుగో
     మరుఁడు మరాళయానలకు; మానవతీవచనంబు పల్లవా
     ధరలకుఁ జెల్ల దింక విదితంబుగ నీతనిఁ జూచిరేని; నా
     తరుణి కితండు గూర్చునది దర్పకు నేలదె యింటిబంటుగన్.91
గీ. యక్షనందనురూపంబు హాస్యకరము
     పాకశాసనిరూపంబు బడసివాటు
     విషమబాణునిరూపంబు వినిమయంబు
     ధరణి నారాజచంద్రుసౌందర్యమునకు.92
వ. ఇతండు ప్రియుండు గాఁగల భాగ్యవతి కన్య యెవ్వతెయొకో యని
     చింతించుచుఁ గనుంగొనుచున్న యన్నలినలోచనతో ననసూయాప్రియం

     వదలు రాజు విచ్చేసియున్నవాఁ డెక్కడఁ జూచెద, వేల నివ్వెఱపడియున్న
     దాన వర్ఘ్యపాద్యంబు లొసంగవలయుఁ బర్ణశాల కతిత్వరితమ్మున రమ్మని
     కరమ్ము పట్టుకొని తోడ్కొనిపోయి యచ్చట సర్వంబును సమీచినంబు
     చేయించి భూపాలుపాలికి నొక్కశిష్యుం బుత్తెంచిన.93
క. అంతేవాసియు నాదు
     ష్యంతుని గని యధిప యతిథిసత్కారము నీ
     కెంతయు భక్తి నొనర్ప శ
     కుంతల పుత్తెంచెఁ దోడుకొనిర మ్మనుచున్.94
గీ. వేగ విచ్చేయుమనిన నావిప్రుతోడ
     ననఘ యందు శకుంతల యనఁగ నెవ్వ
     రే, తపస్విని, వ్రత మెద్ది, యెట్టి చర్య,
     యరయ కింతులచేఁ బూజఁ యనుచితంబు.95
క. అనవుడు భూపాల తప
     స్విని గా దాయింతి భువనసేవ్యుండగు క
     ణ్వునికూఁతు రాయమకునై
     మునిముఖ్యుఁడు సోమతీర్థమునకుం జనుచున్.96
వ. అతిథిసత్కారం బొనర్ప నాకన్నియను నియమించిన నంతరాంతరంబు
     లెఱింగి యార్యులకు సపర్యలు సేయుచుండు ననిన నతనివడనంబు నవ
     లోకించి యూర్ధ్వరేతుండు కణ్వముహామునీంద్రుం డతనికి నపత్యలాభం
     బెట్టు గలిగె నది యద్భుతంబు వినవలయు ననిన.97
క. ఎం తేనియుఁ గల దీవృ
     త్తాంతము మీ రలసినార లరుదెండు పథ
     శ్రాంతి హరియింపుఁ డమల
     స్వాంత శకుంతల యొనర్చు నాతిథ్యమునన్.98

క. తడయవల దనిన నే మిట
     బడలినయది లేదు కాశ్యపమునీంద్రున కీ
     పడతి జనించిన క్రమ మే
     ర్పడ వినుపింపు మన నతఁడు భాసురఫణితిన్.99
వ. మధ్యమలోకపాలకుండవైన నీవచనంబు మాకు నలంఘనీయంబు తత్క
     థాక్రమంబు యథాక్రమంబునం జెప్పెద దత్తావధానుండవై చిత్త
     గింపుము.100
సీ. మునిమనోమోహనముక్తినటీనాట్య
                    రంగంబులగు హేమశృంగములను
     గనకాబ్జకైరవకల్హారసౌరభో
                    ద్గారంబుగు జలాధారములును
     గ్రీడారతిశ్రాంతకిన్నరీపరిచిత
                    స్నేహంబులగు గుహాగేహములును
     గురజన్మదాలినీమంజులమంజరీ
                    పుంజంబులగు లతాకుంజములును
తే. నలరి పెంపొందుఁ బూర్వాపరాంబునిధుల
     నడుమ ధరణికి మానదండంబువోలె
     దేవతాత్మధరాధీశదిగ్విభూష
     పుణ్యనిలయంబు నీహారభూధరంబు.101
ఉ. ఎంచి నుతింప శక్యమె యహీశ్వరునంతటివానికైన ర
     త్నాంచితరోచిరుధ్గమనిరస్తసమస్తరవీందుజాలముం
     గాంచనకందరాయవనికాయితవారిధరాంతరాళని
     ర్వంచితదేవతామిథునవాంఛితమూలము శీతశైలమున్.102
గీ. భూధరములెల్లఁ దను వత్సముగ నొనర్పఁ
     బృథునృపాలోపదిష్టయై ప్రియము మీఱ
     నఖిలరత్నౌషధులను జన్నవిసి పిదికె
     నమరశైలంబు దోగ్ధగా నవనిసురభి.103

ఉ. వారని మంచు పైఁ బొదివి వచ్చినపోయినచొప్పు మాసిన
     న్భూరినఖాగ్రముక్తమయి పొల్పగు ముత్తెపుఁజాలు వెట్టఁగా
     దా రటు లేగి కాంతురు హతద్విపకేసరివాససీమలన్
     వీరకిరాతు లద్రివనవీథుల సింగపువేఁట లాడుచున్.104
ఉ. మానము దప్పకుండ నసమానదరీముఖరాయమానహే
     లానిలపూర్ణరంధ్రనిచయంబయి కీచకరాజి మ్రోయఁగా
     నానగరాజు కిన్నరుల యంచితగానవినోదవేళలన్
     దా నొకవాసికాఁడువలెఁ దక్కఁగ నూల్కొనఁజేయు తానముల్.105
క. ధరణీధరసానుతటములు
     పరిమళవంతములు సేయుఁ బాయక యెపుడున్
     గరికండూయననిస్సృత
     సరళక్షీరప్రసూతసౌరభలహరుల్.106
ఉ. బింగపుఱాలుగా హిమము పేరిన యగ్గిరిత్రోవ దుర్వహో
     త్తుంగకటీకుచాలసవతు ల్తురగాస్యలు సంచరించుచో
     నంగుళిపార్శ్వభాగముల కార్తి యొనర్చినఁగాని యయ్యెడ
     న్జంగలు చాఁచి మందగమనంబున కొందగనీ రపాయముల్.107
సీ. ఏదేవినఖరోచు లిందురేఖలభంగిఁ
                    బ్రవహించు నోంకారపాదపీఠిఁ
     గొమరొందు నేదేవికుడివంక నర్ధప
                    ల్లవితశంకరరూపలలితముద్ర
     ఏదేవియందు బ్రహ్మాదులీడని నతా
                    వృత్తిఁ దాల్తురు కల్పవిరమవేళ
     జనియించు నేదేవి శాంభవీవిలసన
                    శ్రీశతాంశమున వైరించసృష్టి
తే. కన్నుసన్నల నేదేవికడఁ జరింతు
     రఖిలదిక్పాలశుద్ధాంతహరిణనయన

     లామహాదేవి పుత్రిక యయ్యెఁ గూర్మి
     నెట్టితప మాచరించెనో హిమనగంబు.108
వ. ఇట్లనన్యసామాన్యసౌభాగ్యప్రాభవవైభవంబుల జగన్నుతంబగు నమ్మహా
     శైలంబునుపాంతంబున సర్వర్తుకిసలయప్రసవఫలభరప్రకాండమండితం
     బగు కాననాంతరంబున, బుండరీకకైరవోత్పలషండసంపన్నంబగు జల
     జాకరసమీపంబున నొక్కచిక్కణసికతాప్రదేశంబున.109
సీ. పంచాక్షరీమంత్రపరమోపనిషదర్థ
                    వాసనాసురభి యెవ్వానిబుద్ధి
     శ్రుతిపాఠపూతవాక్పతిముఖస్తుతులచే
                    వదలె నెవ్వఁడు నవస్వర్గసృష్టి
     బాహుజుం డయ్యుఁ దపశ్శక్తి నెవ్వాఁడు
                    బ్రహ్మర్షియై యెక్కె బ్రహ్మరథము
     బండె మోడి దివంబు పంచి యిప్పించె ని
                    శ్శంక నెవఁడు హరిశ్చంద్రునకును
తే. నమ్మహాత్ముండు సకలలోకైకవినుతుఁ
     డౌర్వశేయునితోడి మండ్రాటకాఁడు
     నిష్టతోఁడుత నాశ్చర్యనియమవృత్తి
     దపమునకు నుండె నంబికాధవునిగూర్చి.110
ఉ. పద్మజసంభవుం డతులభాస్కరతేజుఁడు గాధిసూనుఁ డ
     చ్ఛద్మమతిం దపోనియమసంగతి నొంది సముల్లసన్మన
     స్పద్మమునందు నిందుధరు శైలసుతాధవు భోగికంకణు
     న్బద్మినిశాచరాంతకుఁ గృపానిధి నిల్పి యనన్యచిత్తుఁడై.
మ. ఇవముం గందువలం జలంబునను, నట్టెండ ల్వెసం గాయువే
     సవులం బంచమహాగ్నిమధ్యమున, వర్షావేళల న్వన్యవృ
     క్షవితానంబులు లేని బట్టబయల న్శాకాశనుండై యుమా
     ధవుఁ జింతించుచు నిల్చి చేసెఁ దపముం దాత్పర్యధైర్యంబునన్.112

గీ. మానసాంబుజకర్ణికామధ్యమునను,
     గొన్నిదినములు శశిమౌళిఁ గుదురుగొల్పి
     మీఁదిగాడ్పుఁ గ్రీగాడ్పుతో మేళవించి
     భానుశశిమార్గములు గట్టువఱపి తగను.113
శా. లీల న్మధ్యమనాడినా జమిలిగాలిం జొన్ప లావెక్కి యు
     త్కీలంబై యెగఁబ్రాకి చిద్గగనవీథిం జెంది యందున్న యా
     ప్రాలేయద్యుతిమండలంబు గరఁగింపం దత్సుధాసారముల్
     మూలం గూర్కెడు పాఁపకన్నె దెలుప న్మూర్ధాభిషేకంబునన్.114
క. కరువలి దిరిఁగెడు తొల్లిటి
     తెరువులుచెడ నంతరరులఁ దెఱపి కనుకనిన్
     బరువులు వెట్టెఁడు తమతమ
     యిరవులు గోల్పడిరి పడిరి యెట్లనొ తారున్.115
క. వశమై పంచమనాడియందుఁ బవనద్వంద్వంబు వర్తింపఁగా
     దశనాదంబులు సంభవించి మొరయ న్దాన న్సదానందుఁడై
     యశనాయానలపీడయు న్మఱియు దైన్యాదైన్యము ల్లేక యా
     శశిజూటుండును దాను దానయయి విశ్వామిత్రుఁ డిట్లుండఁగన్.116
మ. అవనీచక్రము గ్రుంగె, నింగి ఘనగర్జాడంబరం బయ్యెఁ, జి
     క్కువడెఁ జుక్కలు డుల్లె దిక్కరులు సంక్షోభించెఁ గుంభీనస
     ప్రవరుం డుల్కిఁ దలంకె ధాత వగిలెం బ్రహ్మాండభాండంబు, బి
     ట్టవిసెన్ నిర్జరరాజధాని, వడి నూటాడె న్మహాశైలముల్.117
వ. ఇట్లు విశ్వాధికుండగు విశ్వామిత్రుండు తపంబు సేయ భీతుండై పురు
     హూతుం డెంతయు నంతరాయంబు నొందింప నిలింపచంపకగంధులందు
     నెవ్వరు గలరోయని సమీపంబునం గొలిచియున్న [33]నిర్జరజనంబు నవలో
     కించి.118

సీ. కమనీయసురసభాగారమధ్యమునకు
                    దీపించు మాణిక్యదీప మనఁగ
     రంభాదిదేవతారంభోరువుల కెల్లఁ
                    జారుచూడావతంసం బనంగ
     జగములు గెలువంగ సానఁబట్టించిన
                    రతిరాజునవఖడ్గలతిక యనఁగ
     యతులమానసము లుద్దృతుల నాకర్షించు
                    పరవశయమంత్రదేవత యనంగఁ
తే. బంత మాడిన హరినైనఁ బద్మభవుని
     నైన హరునైన మోహరసాబ్ధిఁ ద్రోచి
     యీఁదు లాడింపనోపెడు నిగురుఁబోఁడి
     మేనకాసతిఁ జూచి సన్మాన [34]మొసగి.119
వ. సకలసౌభాగ్యసౌందర్యమందిరంబగు నీచేతంగాని గాధినందనుతపంబు
     విఘ్నంబు గానేరదు. శీఘ్రంబ చని యమ్మౌనివరుని మరుని యాజ్ఞకు
     లోను చేసి రమ్మనిన మహాప్రసాదం బని యక్కొమ్మ పాకశాసను శాస
     నంబునఁ గౌశికు తపోవనంబునకు వచ్చిన వియచ్చరపతి యాజ్ఞ నయ్య
     చ్చరమచ్చెకంటి వెనుకొని.120
శా. ఏతెంచె న్మధుమాసలక్ష్మి, తరుణీహిందోళరాగధ్వను
     ల్వీతెంచె, న్బటుమీనకేతనముతో విల్లంది పూఁదేరిపై
     దోదేంచె, న్దలిరాకుఁ గైదువులుఁ దోడ్తోఁ దాల్మి లేఁదీగల
     న్వేతెంచె న్జగదేకవిక్రమకళావీరుండు మారుం డొగిన్.121
ఉ. వామనదిగ్గజంబు మదవాసనకుం జన కోహటించు ను
     ద్దామగతి న్నభోమణిరథంబు హయంబు లనూరుఁ డుద్ధతుం
     డై మగుడింపఁగా మగుడ కడ్డము దాఁకె ననంగ నుత్తరా
     శాముఖవీథి నేగె దివసంబులు దీర్ఘత పల్లవింపగన్.122

గీ. తరణి మధువేళఁ బద్మినీసరసకేళిఁ
     దడసె నన వాసరంబులు నిడుపు లయ్యెఁ
     బాసి విరహంబు సైపమిఁ జేసి రథము
     దఱిమికొనివచ్చె నన రేలు కుఱుచ లయ్యె.123
క. భూరుహము లెల్ల నామనిఁ
     గారాకులు రాలి చిగురు గలయ నలమి సొం
     పారెను మధుమాసమునన
     గారణములు డులిచి క్రొత్త గప్పినభంగిన్.124
చ. మలయసమీరమ న్విటుఁడు మచ్చరికంబునఁ బట్టి తీవలం
     జెలువలపైఁ బురాణదళచేలములన్ హరియింప లజ్జ నౌ
     జలనము నొందఁగా ననుపుజాణఁడు చైత్రుఁడు గప్పెఁ దోనలో
     నొలసినకూర్మి పేర్మి చెడకుండఁగఁ గెంజికురాకుబట్టలన్.125
సీ. తళతళమించు కెందలిరుటాకుల నెడ
                    నెడ నొయ్యనొయ్యనఁ దొడిమ లెత్తెఁ
     దొడిమలనడుమ వాత లొకింత గనవచ్చి
                    రావన నన లంకురంబు నొందెఁ
     ననలంకురం బంది నవకంబుతోఁ గూడి
                    బలసి లేదావుల కలిక లయ్యెఁ
     గలికల పరిమళంబులు వాకొలుపు మోము
                    లరవిచ్చి మవ్వంపు టలరు లయ్యె
తే. నలరుగుత్తులు మకరంద [35]మలక నెఱయ
     విచ్చి సోడు ముట్టింపఁగా వీథికలను,
     దరుణభావంబు నొందించెఁ దరుల లతల
     నభినవంబైన నవవసంతాగమంబు.126

శా. సంపెంగ ల్పరువంది క్రొవ్విరులచే శంపాలతాలక్ష్మి నొం
     దింపం, బాదపము ల్ఘనంబులయి పూదేనె ల్దువాళించి వ
     ర్షింప, న్వల్పిరి చల్లి పాంథజనరాజి న్గమ్మగాడ్పు ల్చలిం
     పింప, న్మాధవుఁ డంబుదాగతి విడంబించె న్విజృంభించుచున్.127
శా. హేమంతంబను రాజు సేన పఱుపన్ హేలాగతిన్ జైత్రుఁడన్
     సామంతుం డెదురం దదీయజవరాజత్కీరతుక్ఖారరిం
     ఖామార్గంబుల నించు పాంసువులు నాఁగం బర్వె నారామకుం
     జామల్లీలవలీలవంగనవపుష్పశ్రేణికారేణువుల్.128
ఉ. తెమ్మెర లూపఁగా నలరు దేనియ లాని మదించి యింపునన్
     దుమ్మెదలేమ లాగతులతో మధురస్ఫుటకోకిలానినా
     దమ్మునఁ బాడుచుండెను లతానవడోలల నూఁగియాడుచుం
     గమ్మనివింటిజోదు జయగాథలు పుష్పితభూజవీథులన్.129
ఉ. ఆ పువువింటిజోదు మధుపావళి నారి యొనర్చి చక్కఁగా
     మోపిడి పట్టి జుమ్మనుచు మోయఁగ మీటుచునున్నవాఁడు మా
     కా పని గాదు తాల్మిఁ గొఱఁగా దిఁక చన్నుల నంటబట్టుకొం
     డో పతులన్ లతాంగు లను నోజఁ గరం బెలుఁగించె గోయిలల్.130
క. వలరాజు దండు వెడలఁగ,
     బలములు నియమించు సైన్యపతు లెదులెదురన్
     దలతలఁ డను నెలుగులఁ క్రియ
     గలకల నెలుగించె నల్లకరరాచిలుకల్.131
సీ. సమవర్తి రాణివాసాలపాల్లిండ్లపై
                    మృగమదామోదంబు మేఁతపట్టి
     దర్వీకరస్త్రీలు తన్ను వాచవిచూడ
                    గందంపుఁగొండ చెంగటసుఖించి
     దర్గరశైలమధ్యమునఁ గర్పూరంపు
                    తరువాటికలలోనఁ దెరువు దప్పి

     తామ్రపర్ణఖ్యాతిఁ దనరారు ముత్యాల
                    యేటి యంబువులలో నీఁదులాడి
తే. విరహిజనముల హృదయకోటరములందు,
     రాఁజు మదనానలము మించ రవులు గొల్పి
     గాధిపుత్రుండు దపమున్న కాననమున,
     నల్లనల్లన వీచె మందానిలుండు.132
వ. ఇత్తెఱంగున సంతోషితసకలజనస్వాంతంబగు వసంతంబు సనుదెంచిన
     నుల్లసితపల్లవంబును, నుదారకోరకంబును, నుత్ఫుల్లకుసుమంబును,
     నున్నతస్తబకంబును, నుద్గతమకరందంబును, నుద్ధూతపరాగంబును,
     నుదంచితఫలంబును నై చైత్రరథమునకుం బ్రత్యాదేశంబును, నందనంబు
     నకుం బ్రతిచ్ఛందంబును నగు విశ్వామిత్రునాశ్రమవనంబున మనంబు
     లలర నలరువిలుకాఁడు సహాయంబుగా విహారవిలాసినులు పుష్పాప
     చయంబు సేయం బూని.133
క. దలదరుణతరుణకిసలయ
     విలసత్ఫలభరితవిపినవీథీవిచర
     త్కలకంఠశారికాశుక
     కులకంఠధ్వనులు చెవులకున్ జవు లొసఁగన్.134
గీ. వలవుగాడుపు లూర్పులఁ గలసి వెలయ
     దుమ్మెదలుఁ గుంతలమ్ములుఁ దొట్రుకొనఁగ
     బువ్వులును నవ్వులును గూడి పొత్తు గలగి
     విరులు గోయ దొడంగి రవ్వేళ యందు.135
ఉ. ఆసవగంధులైన వదనానిలముల్ పయిఁ బ్రోది సేయఁగా
     గోసినకంటె వేగమునఁ గోసినవృంతమునందుఁ బుట్టగాఁ
     గోసె మనోజ్ఞమూర్తి యొకకోకిలభాషిణి నిండువేడుకన్
     డాసి వయస్యలెల్లఁ బొగడ [36]న్బొగడ న్బొగడప్రసూనముల్.138

క. మవ్వపుటలరులు గోసెను
     క్రొవ్వాడినఖాంకురములఁ గొమరు దలిర్పన్
     బువ్వారుబోఁడి యొక్కతె
     నవ్వులు బువ్వులును జడిగొనన్ సురపొన్నన్.137
సీ. చటుకున నడచి రసాలంబు నొక్కతె
                    ననిపించి యాప్రసూనములు గోసెఁ
     జులుకఁగాఁదన్ని యశోకంబుఁ [37]బూయించి
                    విద్రుమాధరి యోర్తు విరులు గోసెఁ
     నవ్యరీతులఁ బ్రేంకణము వికసింపించి
                    వనిత యొక్కతె ప్రసవములు గోసె
     సమదరాగస్థితి సంపెంగ విరియించి
                    చంద్రాస్య యోర్తు పుష్పములు గోసెఁ
తే. గలికిచూపులఁ బరువంబుగా నొనర్చి
     తిలకమునఁ బూవు లొకవేల్పుతెఱవ గోసె
     నిండుఁగౌఁగిటఁ గొరవి మన్నించి యొక్క
     సురతలోదరి యలరుమంజరులు గోసె.138
వ. మఱియును బురందరపురారవిందలోచనలును లోచనానందకరంబులగు
     తరులతాంతరంబుల లతాంతంబులు దెచ్చి రేకు మడంగకుండఁ, గందకుండ,
     మకరందంబు చిందకుండఁ, దేఁటి గ్రోలకుండ, బరాగంబు రాలకుండ,
     మేనకాహస్తంబునకు నిచ్చిన నాహస్తిరాజగమన యానవీనప్రసూనంబుల
     ప్రసూనశరదమనమూర్తియగు విశ్వామిత్రుపాదపద్మంబులకు సమ
     ర్పించి దండంబు పెట్టి లేచి సమీపంబునం బూచినసహకారంబునీడ నొక్క
     పాదం బాకుంచితంబుగాఁ దరువున నొఱిగి యొయ్యారంబున నొసలి
     చిట్టంటుజెమట మాటిమాటికిఁ గొనగోర మీటుచు దుంటవిలుకాని
     మోహనశక్తియుంబోలె నున్నయెడ.139

సీ. తేటిమొత్తమునేపుఁ దూఁటు బుచ్చఁగనోపు
                    కమనీయనీలాలకములు చూచి
     చిగురుటాకుల డాలుఁ జిన్నఁబుచ్చఁగఁజాలు
                    సాంద్రంపు కెంపుహస్తములు చూచి
     కరికుంభముల క్రొవ్వుఁ గాకుసేయఁగ నవ్వు
                    దోరంపు నెరిచన్నుదోయిఁ జూచి
     చంద్రబింబము పెంపు సవతుగా దనిపించు
                    మొలకనవ్వులముద్దుమోముఁ జూచి
తే, రసము లుట్టెడు బింబాధరంబుఁ జూచి
     పసిఁడిపొడి రాలు కక్షవైభవము జూచి
     కమలముల నేలు పాదపద్మములు చూచి
     మునికిఁ జక్కిలిగింతలు గొనె మనంబు.మూస:Float right140
శా. ఆతన్వంగిపయిం బ్రియం బొదవి విశ్వామిత్రుఁ డీక్షించుచుం
     జేతఃపద్మమునందు నున్న శివునిం జేమోడ్చి ప్రార్థించి తా
     నాతారాద్రికిఁ బంపి యచ్చట లతాంతావాససీమ న్మనో
     జాతుం బ్రీతుని జేసె దేవగణికాసంభోగసౌఖ్యంబులన్.141
క. మేనకయుఁ, దాను హిమగిరి
     తానకముగ జపముఁ, దపముఁ దనమదిలోనం
     బూనక, యొకనాఁడైనను
     మానక సుఖియించుచుండె మన్మథకేళిన్.142
సీ. ప్రసవకార్ముకుఁ డను పాపకర్మునిచేత,
                    సూనాస్త్రుఁ డనెడు దుర్మానిచేత,
     నంబుచరధ్వజుం డను కిరాతునిచేత,
                    మన్మథుం డను నసన్మార్గుచేత,
     శంబరాంతకుఁ డను జాల్మచిత్తునిచేతఁ,
                    గందర్పుఁ డను పలుగాకిచేత,

     నంగసంభవుఁ డను నతినిర్దయునిచేత,
                    దర్పకుం డను నాకతాయిచేతఁ,
తే. జెడ్డవారలఁ గథలుగాఁ జెప్పనేల,
     వేల్పుఱేఁ డంప నొకదేవవేశ్యఁ జూచి
     తొడరి యజునైన నొసలివ్రా ల్దుడువ నోపు,
     కౌశికునియంతవాఁ డూడ్చెఁ గచ్చడంబు.143
క. ఈగతి వేలుపురై యెల
     నాగను దగులుకొని నాఁడునాటికిఁ గోర్కు
     ల్తీఁగలు సాగఁగ మన్మథ
     భోగంబుల మనసు తృప్తిఁబొందిన పిదపన్.144
క. ఆళీమిళదమరీగత
     కేళీవనపవనచలితకేసరధూళీ
     పాళీముహురసుగతభృం
     గాళీగణ్యంబు హిమనగారణ్యంబున్.145
వ. ప్రవేశించి యచ్చటఁ దపంబునకు నిలిచె, మేనకయు నమ్మునిసంగంబున
     నొక్కకూఁతురుం గని యప్పు డటుపుట్టిన యప్పురుటిపట్టి నల్లనల్లన పట్టు
     కొనిపోయి మాలినీనదిసైకతంబున నేకతంబున బద్మపత్రంబులు పొత్తు
     లుగా నమర్చి మెత్తమెత్తన యునిచి దివంబున కరిగె నిచ్చట.146
క. అత్తటిని శకుంతంబులు
     తత్తనువున కెండ గాలి దాఁకక యుండ
     న్మెత్తనియీకలఁ బొదుపుచు
     నెత్తురుగందుపయి నిల్పె నెయ్యముఁ గృపయున్.147
ఉ. ఆనది నొక్కనాఁడు ముదమారఁగ శిష్యులుఁ దానుఁ గూడి వి
     జ్ఞానరసుండు పుణ్యనిధి సాధువరేణ్యుఁడు, కాశ్యపుం డను
     ష్ఠానము సేయ నేగి యచటం బొడఁగాంచె శకుంతపక్షర
     క్షానిరుపద్రవస్థితిఁ బొసంగిన కౌశికవీర్యసంభవన్.148

వ. కాంచి యది విశ్వామిత్రవీర్యం బగుట నార్యజనసేవితుండగు కణ్వ
     మునీంద్రుండు గాధిపుత్రునిమీఁది మైత్రియుఁ, దల్లి తొఱంగునిసుంగుమీఁది
     కారుణ్యంబును బెనఁగొన నావేల్పుంబూఁప నొక్కశిష్యునిచేతి కిచ్చి,
     యాశ్రమంబునకుం దెచ్చి, శకుంతరక్షితయగుటయు శకుంతలయను
     నామంబు వెట్టి, ప్రేమంబునం బెనుపుచున్నవాఁ డన్నప్రదాతయు,
     నభయప్రదాతయు నీయిద్దఱుం గన్యలకు గురువులై రీరెండుదెఱం
     గులు నమ్మునిపుంగవుని యంద కలిగెఁ గావున నతండు తండ్రియు
     నయ్యింతి కూఁతు రయ్యె, నిది శకుంతలావృత్తాంతం బని యాద్యంతంబును
     నెఱింగించిన మహీకాంతుఁడు నితాంతసంతోషంబు నొందె నంతట నూష్మ
     కాంతుండును జరమగిరిశిఖరంబునకు బంధూకపుష్పమంజరియుంబోలె
     గెంజాయ నలంకరించె.149
గీ. అపుడు భూపతి విప్రుని నాదరించి
     చరమసంధ్యావసర మయ్యె సంయమీంద్ర
     కన్యకలు చెప్పి పుత్తేరఁ గాదనంగ
     రాదు నడువుము వేగమ పోద మనుచు.150
శా. శంకాతంతువుఁ ద్రెంచి యీ వడుగు దాఁ జక్షుఃప్రియం బొప్పగాఁ
     గొం కొక్కింతయు లేక నిర్భయుఁడనై కోర్కెల్ కొనల్ సాగఁగా
     నింక న్నా కొకమాటు చూడఁగలిగెన్ హేలాశరత్పూర్ణిమా
     పంకేజాహితబింబచారుముఖబింబశ్రీకబింబాధరిన్.151
మ. అని చింతించుచు సంతసించుచు రయం బారంగ సారంగలాం
     ఛనవంశాగ్రణి యేఁగుచో జటులవర్షాకాలకాలాంబుద
     స్తనితధ్వానపథాధ్వనీనగళగర్తక్రోడనిష్ఠ్యూతని
     స్వననిర్భగ్ననితాంతశాంతబహుసత్వస్వాంతకాంతారమై.152
క. శైలద్రుమచరదేణీ
     జాలోదరదళనకేళిసమయాతిగళ
     త్కీలాలసిక్తదంష్ట్రా
     భీలనఖం బగుచు నొక్కబెబ్బులి వచ్చెన్.153

శా. ఆశార్దూలముఁ జూచి భీతహృదయుండై మేను కంపింపఁగా
     నాశల్ చూచుచు బ్రాహ్మణుం డపుడు ప్రాయఃప్రాణరణార్థ మై
     యోశార్దూలమృగేంద్రచర్మధర, యోయుగ్రాక్ష, యోయద్రిజా
     ధీశా యీయపమృత్యువుం గడపరావే యంచు గీర్తింపఁగన్.154
వ. ఆవిప్రవరుని యార్తియు నిర్దయశార్డూలవిస్ఫూర్తియుం గనుంగొని
     కారుణ్యమూర్తియగు నారాజు భీతచేతస్కుండైన వాని నుపచరించుచు
     శీఘ్రగమనంబున వచ్చు వ్యాఘ్రంబు నడ్డగించునప్పు డది నగరివేఁటపులి
     యగుటం దెలిసి మృగయు లెట్టు దీని నేమఱిరి, దీనివలన నీయాశ్రమ
     వనతనుసత్త్వంబులకు నపాయంబు పుట్టిన మహాపరాధంబు వచ్చు ననుచు
     నమ్మృగరాజుం బట్టుకొన బంధురగమనంబున నిజస్కంధావారంబునకుం
     జనుచు దనమనంబున.155
క. తాపసశిష్యుని లలితా
     లాపంబుల నాశకుంతలావృత్తాంతం
     బేపారఁగ వినియును నా
     త్మాపాలుఁడు సంతసిలక సంశయచింతన్.156
గీ. కన్య క్షత్రియవీర్య యౌఁగాక యేమి
     కణ్వుఁ డొకనికి నీఁ గడకట్టెనేని
     చెలువ నామీఁదఁ గూరిమి సేయదేని
     రెంట దుష్యంతుకోర్కి పూరించు టెట్లు.157
చ. కొనగొని తావి మూర్కొనని క్రొవ్విరి, యెయ్యెడ వజ్రసూచి డా
     యని రతనంబు, జిహ్వచవి యానని తేనియ, గోరు మోపి గి
     ల్లని చిగురాకు, లాలితవిలాసనికేతన మాలతాంగి, దా
     ననుభవకర్త యేఘనుఁడొ యావిధియత్న మెఱుంగనయ్యెడున్.158
ఉ. ఆడదుగాని మాట లొకయంచుల నించుక వీను లొగ్గి నా
     యాడినమాటలెల్ల విను నర్మిలితోఁ దను నేను జూచినం

     జూడదుగాని యొండుదెసఁ జూచినఁ దా నను జూచుచుండు నీ
     జాడలు నాపయిం దగులుచందము డెందముఁ జేర్పనేర్పఁగన్.159
ఉ. అచ్చపలాక్షి కన్య విమలాశ్రమవాసిని ప్రేమచిహ్నము
     ల్మచ్చిక లేక చేయ దనుమానము గల్గదు సత్యసంతతు
     ల్వెచ్చపుఁగూరుము ల్పరిఢవింపఁగ నేరదు నేర దబ్జసం
     పచ్చటులంబులై మెఱయు పచ్చనిచూపులక్రేళ్ళు చూడఁగన్.160
మ. చికురంబు ల్నొసలంట నున్న చెమటల్ జెక్కు ల్దలిర్పన్ ఘటో
     దకభారమ్మునఁ గెంపు హస్తయుగ ముద్గారింప నంసంబు లిం
     చుక జాఱం జనుదోయి యూర్పువడి సంక్షోభించి కంపింపఁ దా
     నొకకేలం దుఱు మావటించు చెలువం బుల్లంబుఁ గొల్లాడదే.161
వ. అనుచు నచ్చెలువచెలువంబు దనమనంబున నునుచుకొని, యచ్చోటు
     వాసి మగిడి చూచుచు, నిలచుచు, నివ్వెఱపడుచుఁ, బ్రొద్దువంకఁ గనుం
     గొనుచుఁ, బెద్దసడిం గొండొకదవ్వు గమనించుచు, నిట్టూర్పు నిగిడించుచు
     నెట్టకేలకు వేలంబున్నచోటికిఁ దపసిబోటికి మనం బిచ్చి యేటి కెదురంటిన
     కరణి ధరణీనాయకుండు ప్రవేశించి.162
చ. తనకు శకుంతలావదనదర్శనయాత్రకు విఘ్న మాచరిం
     చిన పులిఁ జంపఁ జూచియును బెంపుడు గావున వేఁటకాండ్రమీఁ
     ద నెపము పెట్టి యేమఱుట తప్పుగఁగట్టి యథాపరాధదం
     డన మొనరించె నుత్తమజనంబులు చూప రనర్హకోపముల్.163
గీ. అవనిపతి యివ్విధంబున నరుగుదెంచి
     యపరసంధ్యాభివందనం బాచరించి
     యుష్ణమును దీర్ఘమును గాఁగ
     నుస్సు రనుచు సంయమీంద్రకుమారిక సంస్మరించి.164

సీ. పిలువవచ్చినఁ బోక నిలిచి యేటికి నింతి
                    పుట్టువుఁ దెలియ దుర్బుద్ధి పుట్టెఁ
     బుట్టనీ యతఁ డేల పూర్వాపరంబులు
                    సూచించి విడువక జోలిపట్టెఁ
     బట్టనీ గమనసంభ్రమవేళ శార్దూల
                    మదరిపాటున నేల యడవి సొచ్చె
     జొచ్చిరానీ మాటు సుద్దిపంపకయుండఁ
                    జనుదెంచె నేటికి జరమసంధ్య
తే. విఘ్నములు పెక్కు లిటు సంభవింపఁజేసి
     తెఱవఁ గని కన్నులాఁకలిఁ దీర్పకుండ
     నదయుఁడై విధి కంచము మొదలివాని
     లేశమంతయుఁ గృపలేక లేవనెత్తె.165
క. అని దైవము దూఱుచుఁ
     దనమనమెల్లను గొల్లఁగొనిన మానిని తరుసే
     చనచర్యలు నలసవిలో
     చనముఖభావములు మానసము నలరింపన్.166
ఉ. మజ్జనభోజనక్రియలు మాని వలాని యరోచికంబునన్
     ఖజ్జము గొంతకొంత కసిగాటులుగా భుజియించి యెవ్వరిం
     బజ్జను జేరనీక తనభావము లోపల దాఁపురంబుగా
     సజ్జకుఁ జేరియుండె నృపచంద్రుఁడు సాంద్రవియోగవేదనన్.167
క. ఆవేళ హస్తినగర
     క్ష్మావల్లభుఁ డున్నయెడకుఁ జనవునఁ జేరం
     గావచ్చిన మాండవ్యుఁడు
     భావము దెలియుగవలసి బరిహాసోక్తిన్.168
క. వనమునకు నొంటి యరిగితి
     జననాయక యచట మనను శంకించెనొ య

     మ్మునివరు లేమి పరాభవ
     మొనరించిరొ నాకుఁ జెప్పు మున్నవిధంబున్.169
చ. మనమున జంకు గల్గినను మాన్చెద నే నది మంత్రశక్తిచే
     మునుల[38]యవజ్ఞ గల్గినను ముందఱికి న్మనసీమలోనికా
     ననములు గుత్త యిచ్చి జతనంబుఁ జేసినఁ గందమూలము
     ల్దినియెడువారు గాగ నరు దెంచి వశంవదు లౌదు రందఱున్.170
వ. దీని కింత చింత యేల జగతి యేలంగలిగిన నావంటి సేవకుండు సిద్ధించి
     యుండ నశక్తుండునుంబోలె నుండు టేటిప్రాభవం బనిన సాధుజనపోష
     కుండు విదూషకున కి ట్లనియె.171
గీ. ప్రాణసఖుఁడవు నీకుఁ జెప్పక మదీయ
     వృత్తగోపన మెట్లు గావింపనేర్తు
     మచ్చనాలుకవాఁడవు మంతనంబుఁ
     బొడమనీకని రసనకు బుద్ధి చెప్పు.172
మ. మదనారాతిసమాను గాశ్యపమహామౌనీంద్రు సేవింప స
     మ్మదమారం జని యాశ్రమంబువనసీమం గంటి వాల్గంటిఁ, దో
     యదనీలాలకఁ, గంబుకంఠిఁ, గరిణీయానం, బయోజానన
     న్సదసత్సంశయగోచరోదరి, సుధాసంబాధబింబాధరిన్.173
సీ. నిండుఁజందురునకు నెత్తమ్మివలపును
                    నద్దంపుఁబొలుపును నబ్బెనేని
     కరికుంభములకు బంగారుతార్పులయెప్పు
                    శకటాంగములవిప్పు జరిగెనేని
     యరఁటికంబములకు గరభంబు నునుడాలుఁ
                    దూణీరములమేలు దొరకెనేని
     సరసిజాతములకు [39]జంత్రంబుఁబెంవును
                    జిగురాకుసొంపును జేరెనేని

తే. చపలలోచన మొగముతో [40]సరియవచ్చు
     నింతిపాలిండ్లదోయితో నీడువచ్చు
     వనితయూరుద్వయంబుతో [41]నెనయవచ్చుఁ
     జంద్రముఖిపాదయుగముతో సవతు వచ్చు.174
వ. అని మఱియు నాపాదశిరోరుహాంతంబు వర్ణించు నుత్కంఠ నారాజకంఠీర
     వుండు మాండవ్య యొండు తలంపులేక విను మని యి ట్లనియె.175
సీ. వెడవిల్తుచిగురాకుగొడుగులు గొని వచ్చి
                    చరణద్వయంబుగా సవదరించి
     సంకల్పసంభవు జయకాహళుల దెచ్చి
                    జంఘాయుగంబుగా సంఘటించి
     దుగ్ధాబ్ధిమనుమని తూణీరములు దెచ్చి
                    యూరుయుగంబుగా నుపచరించి
     శ్రీదేవిసుతు హేమసింహాసనము దెచ్చి
                    జఘనచక్రంబుగా సంతరించి
తే. నీరరుహసూతిశేషాంగనిర్మితికిని
     దగినయవి లేక కంకపత్రమున నిచట
     గడమ కలదని వ్రాయు లేఖయును లిపియు
     మధ్యమును నాఱు నయ్యె నమ్మానవతికి.176
సీ. ప్రసవాస్త్రమాయావి బైల వ్రాసిన సుడి
                    బిసరుహాననకు గంభీరనాభి
     మోహచూర్ణము వోసి మూసిన బంగారుబరిణె
                    లుత్పలగంధిగురుకుచములు
     యౌవనామరభూరుహమున డిగ్గిన యూడ
                    లరవిందవననకు గరయుగంబు
     సౌందర్యజలధిలో సంభవించిన పాంచ
                    జన్యంబు మీనలోచనగళంబు

తే. వదనమను తామ్రపర్ణిఁ జెల్వంబులైన
     విశదమౌక్తికములు లేమదశనపఙ్క్తి
     శంబరారాతిసామ్రాజ్యసౌఖ్యపదవి
     యలికులాలకకెంజిగురాకుఁబెదవి.177
గీ. జవ్వనం బను తొలుకారు నివ్వటిల్ల
     సావితోడను మోహబీజంబు లలుక
     మానసక్షేత్రములు దున్ను మదనుఁ డనెడు
     కర్షకున కింతినాసిక కనకహలము.178
క. శ్రీకమలగృహము మోము ఏ
     లోకింపఁగ దీపకళికలు కనుంగవ యా
     పై కొడివారిన సన్నపు
     రేకలు నా బోమలు సుందరికిఁ జెలువొందున్.179
గీ. మహితకీర్తి శకుంతలామంజువాణి
     బోల నష్టాదశద్వీపములను గలుగ
     రనుచు శ్రుతులను సంజ్ఞల నతివయందుఁ
     దొమ్ముదులు రెండు లిఖయించెఁ దమ్మిచూలి.180
క. బాలేందునిపైఁ దిమిరము
     పాళెము వెట్టుకొని వేళఁ బరికించుచుఁ దా
     వేలము చేసినపోలిక
     బాలికహరినీలకేశపాశం బమురున్.181
గీ. చదువు రాజశుకబ్రహ్మచారులకును
     దామరసనేత్రవదన మధ్యయనగృహము
     గాణలై వచ్చు కోకిలగాయకులకు
     నాతికంఠంబు దలఁప సంగీతశాల.182

ఉ. కన్నులతీరుఁ జక్కని మొగంబుమెఱుంగును, జౌకళించు లేఁ
     జన్నులమించు, నెన్నడుము సంశయలేఖయు, మేనియందముం
     బెన్నెఱివేణి సొంపు మురిపెంబును, దిన్ననిమోవికెంపులున్
     వన్నెలుగాని కావు రవణంబులు వన్నియ లాలతాంగికిన్.183
మ. నవలావణ్యపయోధిఁ జిత్త మను మంథానాద్రికిం జంద్రికా
     పవనాశిం దరిత్రాఁడుగాఁ బెనఁచి యబ్జాతాశుగుం [42]డిచ్చినన్
     రవలిం గోకిలకీరము[43]ల్దరువ నారత్నాకరంబందు ను
     ద్భవముం బొందిన లక్ష్మి కావలయు నాపద్మాక్షి భావింపగన్.184
ఉ. చిత్తరవు న్లిఖించి మఱి జీవము వోసెనొ రూపసంపదం
     జిత్తమునం దలంచియ సృజించెనొ రెండును జర్చ సేయగా
     జిత్తరువందు నాకరణి చెల్వము గల్గదనన్యచిత్తుఁడై
     చిత్తమునం దలంచియ సృజించెఁ బితామహుఁ డాతలోదరిన్.185
శా. ఆదిం జంద్రుఁడు చంద్రికారుచుల నయ్యబ్జాస్యఁ గల్పించెనో
     లేదేఁ గంతుఁడు చెల్వము ల్వెరఁజి యాలీలావతిం జేసెనో
     కాదేఁ జైత్రుఁడు తావు లెల్లఁ గొని యాకాంత న్వినిర్మించెనో
     వేదాభ్యాసజడుం డజుం డెటులఁ గావించుం దదీయాకృతిన్.186
సీ. పాలమున్నీటిలోపల సంభవించిన
                    జలజాతనయనల చక్కదనముఁ
     జంచలాలతికల జననంబు గాంచిన
                    ధవళలోచనల సౌందర్యలక్ష్మి
     నమృతాంశుకళలయం దావిర్భవించిన
                    నీలవేణుల రామణీయకంబు
     బుండ్రేక్షుకోదండమునఁ బుట్టు వొదవిన
                    లావణ్యవతుల విలాసరేఖ

తే. నరసఖుని యూరుకాండంబునను సముద్భ
     వంబు నొందిన యుడురాజవదనచెలువుఁ
     గుప్పగాఁ జేసి మునికన్య యొప్పుతోడ
     పొసి దలపోయ నారాల కీస వెలితి.187
శా. ఆవాలుంగనుదోయి యానగుమొగం బాగుబ్బపాలిండ్లపెం
     పావేణీరుచి యాతమావిలసనం బాయొప్పు నేఁ జెప్పినం
     గైవారం బగుఁగాని యయ్యెడ శిరఃకంపంబుతోఁగూడ నా
     హావుట్టింపదె యిక్షుధన్వునకు నయ్యబ్జాక్షి నీక్షించినన్.188
వ. అని తదీయరేఖావిలాసవిభ్రమంబులు ప్రసంగించుకొనుచు నొం డెఱుం
     గక మహీవిభుం డుండె నంత నిక్కడ నాశ్రమపదంబున శకుంతలయుం
     దారున వచ్చిన విప్రువలన రాజు తనజన్మప్రకారం బడిగిన విధంబును
     దదాకర్ణనంబున నిరస్తసంశయుండై పర్ణశాలాభిముఖుండై గమనించు
     టయుఁ దదవసరంబున నకాండంబుగఁ బెద్దపుండరీకంబు వచ్చుటయు
     నాశార్దూలంబును రాజశార్దూలంబు గోవత్సమునుంబోలెఁ గొనివచ్చు
     టయు నాలోనన నపరసంధ్యాసమయంబు సంప్రాప్తం బగుటయుఁ బ్రతి
     వచనంబులకు నెడ లేకుండుటయుం చెప్పినఁ దన మనంబున.189
గీ. నరవరుం డస్మదీయజన్మక్రమంబు
     వినుట నాపుణ్య మయ్యె నివ్వనములోని
     కెన్నడును లేని శార్దూల మెట్లు వచ్చె
     నరయ రాకుండ నరికట్టె నామృగంబు.190
క. ఎప్పుడకో యీనిశి చను
     నెప్పుడకో తెల్లవాఱు హృదయేశుమొగం
     బెప్పుడకో చూచుట
     నా కెప్పుడకో భాగ్యలక్ష్మి యెదురగు టనుచున్.191

మ. చెమటం జెక్కులు తొంగలింప ముఖరాజీవంబు వాడంగ సో
     లమున న్రెప్పలు వ్రాలఁ గన్నుఁగవ దేల న్మోవి నిట్టూర్పులం
     గమలం దల్పముఁ జేరుచు న్విభునిరాక ల్గోరుచుం బ్రొద్దు భా
     రమునం బుచ్చుచు వర్ధమానవిరహగ్లాని న్మదిం గందుచున్.192
మ. మలయక్ష్మాధరనిర్గళత్పవనము ల్మండింపఁ గామాగ్ని యం
     గలతం గాల్పకయుండఁ గంతుసుమనఃకాండప్రకాండాహతిం
     జెలువెల్లం జెడకుండ నవ్విభునురస్సీమంబులో దార్కొనం
     గలలోనైనను గల్గునొక్కొ యని యక్కంజాస్య దీనాస్యయై.193
శా. ఆచంద్రాన్వయరాజచంద్రముని పొందాసించి చన్నుంగవం
     జూచుం గన్నులనీరు నించుఁ దల యూచు న్మేను శయ్యాస్థలిన్
     వైచు ల్లేచును నవ్వు నుస్సురను బోవం గంటగించున్ ధృతిన్
     గాచున్ బ్రొద్దు గనుంగొను న్వెతఁబడున్ గామాంధకారార్తయై.194
వ. ఇవ్విధంబున.195
గీ. అచట విరహాగ్ని రాజును నిచట మదన
     బాణవేదన నింతియుఁ బరితపింప
     బ్రహ్మకల్పంబువోలె నారాత్రి వేగ
     నెట్టకేలకు నంతట నినుఁడు వొడిచె.196
శా. నాగామాత్యకుమార భూరమణమాన్యశ్రీక శ్రీకంఠచూ
     డాగంగాసఖకీర్తి కిర్తితనిరూఢప్రౌఢనిర్నిద్రవా
     చాగుంజాంబుజగర్భ గర్భసుఖితాసౌభాగ్య భాగ్యస్ఫుర
     త్యాగోద్యత్సురభూజ భూజనహితవ్యాపారపారంగతా.197
క. కవితాకల్పకలతికా
నవపుష్పమరందపారణామధుపనిజ
శ్రవణేంద్రియసకలజగ
ద్భవనతమోదీపకీర్తి భాసురమూర్తీ!198

పృథ్వి. అమాత్యగుణబంధురా యఖిలబంధుకల్పద్రుమా
     సమస్తజనసన్నుతా సమధికప్రభావోన్నతా
     అమర్త్యతటినీధరాయతపదారవిందద్వయీ
     సమంచితమధువ్రతా సతతపూతసత్యవ్రతా!199

గద్యము
ఇది భారతీతీర్థగురుచరణకరుణాలబ్ధసిద్ధసారస్వతపవిత్ర గాదయా
మాత్యపుత్ర ఆరాధితామరవీరభద్ర పిల్లలమఱ్ఱి పినవీరభద్ర
ప్రణీతంబైన శాకుంతలశృంగారకావ్యమునందు
ద్వితీయాశ్వాసము.

  1. దెంకికి
  2. నేటి
  3. మృగంబుల
  4. వేద
  5. నడకయు నెడతెగె
  6. చనియెదంగాక
  7. దన్నుకొక
  8. గసుగందకుండ
  9. పోగు
  10. తెదలు
  11. మాన్చె
  12. బాణనిహతి
  13. డెద్దుగొనివచ్చె
  14. ప్రార్థించి
  15. లేవు
  16. బూని
  17. మెఱచు
  18. జాదులు
  19. జాటుండుఁగా
  20. తరసీమ
  21. రాదున్న దది యట్లుండె
  22. మానీ
  23. భ్రమియించు
  24. చెవులన్
  25. కేశయు
  26. బొడకట్టు
  27. లోచనగోచరుండై
  28. లాలకించి
  29. మింతపట్టు
  30. వినంబడునీ
  31. చెలువ
  32. నొంద
  33. స్త్రీజనంబు
  34. మెసఁగి
  35. మలికి
  36. బొగడం బ్రసూనముల్
  37. రాయించి
  38. యనుజ్ఞ
  39. జంత్రంపు
  40. సరికివచ్చు
  41. నెనకువచ్చు
  42. డించినన్
  43. దరవ