శృంగారనైషధము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శృంగారనైషధము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాప్రార్థనాదికము

శ్రీరామాకుచమండలీమృగమదశ్రీగంధసంవాసిత
స్ఫారోదారభుజాంతరుండు ధరణీసంశ్లేషసంభావనా
పారీణుండు కృతాస్థుఁ జేయుఁ గరుణాపాథోధి పద్మాక్షుఁ డిం
పారన్ మామిడిపెద్దమంత్రిసుతు సింగామాత్యచూడామణిన్.

1


మ.

[1]*కనకక్షోణిధరంబు కార్ముకముగాఁ గద్రూతనూజుండు శిం
జినిగా మాధవుఁ డమ్ముగాఁ బురము లక్షీణైకదోశ్శక్తి గె
ల్చిన జోదీశ్వరుఁ డిచ్చుఁ గాత జయలక్ష్మీసుస్థిరైశ్వర్యశో
భనముల్ పెద్దయసింగమం త్రికి జగత్ప్రఖ్యాతసత్కీర్తికిన్.

2


ఉ.*

హాటకగర్భుచేతఁ గమలాసనుచేఁ జతురాస్యకంఠశృం
గాటకవీథికాకృతవిగాహచతుశ్శృతిచేత దేవతా

కోటికిరీటసంఘటితకోమలపాదసరోజుచే జగ
న్నాటకసూత్రుచేతఁ గృతినాథుడు గాంచుఁ జిరాయురున్నతుల్.

3


శా.

జే జే యంచు భజింతు నిష్టఫలసంసిద్ధుల్ మదిం గోరి ని
ర్వ్యాజప్రౌఢకృపావలంబునిఁ గటప్రస్యందిదానాంబునిం
బూజాతత్పరదేవదానవకదంబున్ బాలకేళీకళా
రాజత్కౌతుకరంజితోరగపతిప్రాలంబు హేరంబునిన్.

4


సీ.

సింహాసనము చారుసితపుండరీకంబు
        చెలికత్తె జిలువారుపలుకుఁజిలుక
శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు
        పసిఁడికిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁదమ్ములు కేళిగృహములు
        తళుకుటద్దంబు సత్కవులమనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
        చక్కనిరాయంచ యెక్కిరింత


తే.

యెపుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్రచందనమందారసారవర్ణ
శారదాదేవి మామకస్వాంతవీథి
నిండువేడుక విహరించుచుండుఁ గాత.

5


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబు చేసి.

6

ఆదికవిస్తుతి

సీ.

వ్యాసవాల్మీకిసంయమివాక్సుధాంభోధి
        లోలోర్మిపంక్తుల నోలలాడి
భట్టబాణముయూరభారతీసందర్భ
        సౌభాగ్యగరిమంబు సంగ్రహించి

భాససౌమిల్లిక ప్రతిభాసమున్మేష
        హేలావిశేషంబు నిచ్చగించి
మాఘభావవివచోమకరందనిష్యంద
        మాధుర్యమునకు సమ్మదము నొంది


తే.

కాళిదాసు మనంబులోఁ గాంచి మ్రొక్కి
రాజశేఖరుఁ గవిరాజు బ్రస్తుతించి
ధీరమతి నన్నపార్యునిఁ దిక్కయజ్వ
శంభుదాసునిఁ గర మర్థి సన్నుతించి.

7


వ.

నవరసభావానుబంధబంధురంబుగా నొక్క ప్రబంధంబు నిర్మింప దలంచి కౌతూహలాధీనమానసుండ నై తన్మహాప్రబంధప్రారంభంబునకుం దగినపుణ్యశ్లోకపురాతనమహారాజచరిత్రం బెయ్యది యొకో యని వితర్కించుచున్న సమయంబున.

8

కృతిపతిప్రశంస

సీ.

తనకృపాణము సముద్ధతవైరిశుద్ధాంత
        తాటంకముల కెగ్గుఁ దలఁచుచుండఁ
దనబాహుపీఠంబు ధరణిభృత్కమఠాహి
        సామజంబులకు విశ్రాంతి యొసఁగఁ
దనకీర్తినర్తకి ఘనతరబ్రహ్మాండ
        భవనభూముల గొండ్లిఁ బరిఢవిల్లఁ
దనదానమహిను సంతానచింతారత్న
        జీమూతసురభుల సిగ్గుపఱుప


తే.

బరఁగు శ్రీవేమమండలేశ్వరునిమంత్రి
యహితదుర్మంత్రివదనముద్రావతార

శాసనుఁడు రాయవేశ్యాభుజంగబిరుద
మంత్రి పెద్దయసింగనామాత్యవరుడు.

9


శా.

పంచాంగ స్థిరమంత్రరక్షణకళాప్రౌఢుండు బాలామనః
పాంచాలుండు విరించివంశజలధిప్రాలేయభానుండు దో
శ్చంచచ్చాపకృపాణలబ్ధవిజయైశ్వర్యుండు దిక్కామినీ
కాంచీమౌక్తికకీర్తి పెద్దవిభుసింగం డొక్కనాఁ డిమ్ములన్.

10


వ.

మృదుమధురచిత్రవిస్తరకవితావిలాసవాగీశ్వరు లగుకవీశ్వరులును, పతంజలికణాదాక్షచరణపక్షిలాదిశాస్త్రసిద్ధాంతకమలవనహంసు లగు విద్వాంసులును, భరతమతంగదత్తిలకోహలాంజనేయప్రణీత సంగీతవిద్యారహస్యవిజ్ఞానవైజ్ఞానికస్వాంతు లగుకళావంతులును, శక్తిత్రయచతురుపాయషాడ్గుణ్యప్రయోగయోగ్యవిచార లగురాయబారులును, నిఖిలపురాణేతిహాససంహితాతాత్పర్యపర్యాలోచనాధురంధరధిషణాసముత్సాహం బగు పౌరాణికసమూహంబును, బరివేష్టింపం గొలువుండి, సకలవిద్యాపారీణుండు సరససాహిత్యగోష్ఠీవినోదప్రసంగంబున.

11


శా.*

భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి
ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచారభీమాంబకు
న్గారామైనతనూజ న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ప్రౌఢిమన్.

12


శా.

బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడ వురుప్రజ్ఞావిశేషోదయా
జిహ్మాస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత
బ్రహ్లాండాదిమహాపురాణచయతాత్పర్యస్థనిర్ధారిత
బ్రహజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే!

13

క.

జగము నుతింపఁగఁ జెప్పితి
ప్రెగడయ్యకు నాయనుంగుఁ బెద్దనకుఁ గృతుల్
నిగమార్థసారసంగ్రహ
మగునాయారాధ్యచరిత మాదిగఁ బెక్కుల్.

14


వ.

కావున నాకు నొక్కప్రబంధంబు పుణ్యశ్లోకపురాతనరాజర్షిచరితానుబంధబంధురంబుగా రచియింపు మందును.

15


సీ.

కవిరాజరాజిశేఖరహీనముకుటంబు
        శ్రీహీరకలశాబ్దిశిశిరకరుడు
మామల్లదేవీకుమారరత్నంబు చిం
        తామణిమంత్రచింతనఫలంబు
కవికులాదృష్టాధ్వగమనాధ్వనీనుండు
        కాశ్మీరనృపసభాకమలహేళి
ఖండనగ్రంథసంగ్రంథకర్కశబుద్ధి
        షట్కర్మధర్మైకచక్రవర్తి


తే.

భట్టహర్షుండు ప్రౌఢవాక్పాటవమున
నెద్ది రచియించె బుధలోకహితముపొంటె
నట్టినైషధసత్కావ్య మాంధ్రభాష
ననఘ యొసరింపు నాపేర నంకితముగ.

16


చ.

పనిపడి నారికేళఫలపాకమునం జవి యైనభట్టహ
ర్షునికవితాసుగుంభములు సోమరిపోతులు కొంద ఱయ్య లౌ
నని కొనియాడ నేర రది యట్టిద; లేజవరాలు చెక్కు గీఁ
టిన వస వల్చుబాలకుఁడు డెందమునం గలఁగంగ నేర్చునే?

17


వ.

అని పలికి సబహుమానంబుగాఁ గర్పూరతాంబూలం బొసంగి జంబూనదాంబరాభరణంబులు గట్ట నిచ్చి వీడ్కొలిపిన; నేను

నమ్మహాప్రథానునిం గృతినాయకుం జేసి నైషధకావ్యంబు దొడంగితిఁ దత్ప్రారంభంబునకు మంగళాచారంబుగాఁ దదీయవంశావతారం బభివర్ణించెద.

18


కృతిపతివంశావతారవర్ణనము

శా.

తోరం బైనతపోవిశేషమున సద్యోజాతవక్త్రంబున
న్గౌరీవల్లభుచేత దీక్షఁ గొనియె న్సప్తర్షులం దొక్కఁడై
తారావీథి నలంకరించెఁ, గనియెం ద్రయ్యర్థసంఘాతమున్,
భారద్వాజమహామునీంద్రుఁ దగదే భక్తిం బ్రశంసింబపఁగన్.

19


ఉ.

ఆమునినాథునన్వయమునం దుదయించెఁ బయఃపయోనిధిన్
యామవతీకళత్రుం డుదయం బయినట్లుగఁ గల్పవృక్షచిం
తామణి కామధేనుసమదాననిరూఢుఁడు విద్విషత్తమ
స్స్తోమదివాకరుండు పెదతూర్కనమంత్రి కులాగ్రగణ్యుఁడై.

20


వ.

తత్సంతానక్రమంబున.

21


మ.

కుటిలారాతివరూథినీధవశిరఃకుట్టాకధాటీషహా
పటహధ్వానవిపాట్యమానదశదిగ్భాగుండు త్రైలోక్యసం
పుటపేటీపరిపూర్ణకీ ర్తిమయకర్పూరప్రకాండుండు శ్రీ
చిటిపెద్దప్రభుఁ డొప్పె విక్రమపురీసింహాసనాధ్యాసియై.

22


క.

ఆచిటిపెద్దప్రభునకు
వాచస్పతిసదృశనీతివైభవలక్ష్మీ
వైచిత్రి కధికవిమలశి
వాచారఘనుండు మామిడన్న జనించెన్.

23


ఉ.

స్వామిహితంబునన్, సమదశాత్రవభంజనశక్తి, బంధుర
క్షామహనీయసంపద, వసంతసమాగమఫుల్లమల్లికా
స్తోమతుషారపాండురయశోగరిమంబున, ధర్మశీలతన్,
మామిడిమంత్రిఁ బోల మఱి మంత్రులు లేరు వసుంధరాస్థలిన్.

24

తే.

అతనియర్ధాంగలక్ష్మి యక్కాంబ గనియె
నాత్మజుల వేదమూర్తుల నబ్ధినిభుల
వెలయ శ్రీపెద్దనామాత్య వీరభద్ర
మారనప్రభు నామన మంత్రివరుల.

25


సీ.

అనవద్యహృద్యవిద్యాబుద్ధిసంసిద్ధి
        బిసరుహాసనుసుద్ది పెద్దవిభుఁడు
భగ్రనిర్నిద్రవాఙ్ముద్రాసముద్వృత్తిఁ
        గద్రూభవుఁడు వీరభద్రమంత్రి
మేరుభూధరసారధీరతాగుణహారి
        వైరిశైలబలారి మారశౌరి
స్వామిభక్తిహితైకభావవైభవభూమి
        భామినీరతిరాజు నామరాజు


తే.

మామిడీశ్వరసాగరామరకుజంబు
లక్కమాంబికాశుక్తిరత్నాంకురములు
వంశపావను లర్థార్థివాంఛితార్థ
దానశౌండులు సౌభ్రాత్రధర్మపరులు.

26


మ.*

అనతారాతివసుంధరారమణసప్తాంగాపహారక్రియా
ఘనసంరంభవిజృంభమాణపటుదోఃఖర్జూద్వితీయార్జునుం
డనవేమాధిపు రాజ్యభారభరణవ్యాపారదక్షుండు పె
ద్దనమన్త్రీశుఁడు మామిడన్నసుతుఁ డేతన్మాత్రుఁడే చెప్పఁగాన్.

27


ఉ.

హేమధరాధరేంద్రమున కెక్కటిపెద్దధృతిన్ భుజంగమ
స్వామికి మేలుచేయి పటువాగ్విభవంబున బుద్ధిసంపదం
దామరచూలికి న్సరి ప్రధానులు దక్కినవారు సాటియే
మామిడివీరభద్రున కమాత్యశిఖామణి కివ్వసుంధరన్?

28

ఉ.

సత్యవచోనిరూఢుఁడు నిశాకరశేఖరభక్తిభావనా
సాత్యవతేయుఁ డుద్భటభుజాబలవిక్రమకేళి విక్రమా
దిత్యుఁడు కార్యఖడ్గసముదీర్ణుఁడు మామిడిమంత్రి మారనా
మాత్యుఁడు వానిఁ బోల వశమా ధరణీధవమంత్రికోటికిన్?

29


శా.

స్వామిద్రోహరగండలాంఛనునకున్ సంగ్రామగాండీవికిన్
వేమక్ష్మాపతికార్యభారకలనావిఖ్యాతధీశక్తికిన్
నామామాత్యున కన్యరాజనిటలాంతర్న్యస్తభాగ్యాక్షర
స్తోమాపాకరణప్రవీణునకు మంత్రు ల్సాటియే యెవ్వరున్?

30


ఉ.

తమ్ములు దన్ను మువ్వురును దైవముఁగా గురుఁగా మహానిధా
నమ్ముగ దాతఁగాఁ దమమనంబుల భావన సేసి కొల్వ భా
గ్యముల కెల్ల నెల్ల యయి కాంచెఁ బ్రసిద్ధి నృపప్రధానర
త్నమ్మగుమంత్రి పెద్దన యుదాత్తమతిన్ రఘురాముకైవడిన్.

31


సీ.

గౌతమగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ
        పరమసంయమిసూత్రపావనుండు
గారాపుఁబౌత్త్రుండు గంధవారణుఁ డగు
        శ్రీ తనామాత్యశేఖరునకు
పేషణిహనుమంతబిరుదాంకు లగు రాచ
        వారికి నెయ్యంపువరసుతుండు
చౌహత్తమల్లుండు దోహత్తనారాయ
        ణుండు ఖండియరాయచండబిరుద


తే.

మంత్రియల్లాడరాజును మహితపుణ్య
యన్నమాంబయుఁ దనకు నత్యంతగరిమఁ
దల్లియును దండ్రియును గాఁగఁ దనరునట్టి
తల్లమాంబికాదేవి నుద్వాహమయ్యె.

32

మ.

వనితారత్నము తల్లమాంబికకు శ్రీవత్సాంకతుల్యుండు పె
ద్దనకుం బుట్టిరి నందనుల్ విమలవిద్యాభారతీవల్లభుల్
వినతాసూనుసమానవిక్రమనిధుల్ వీరుండు వేమాహ్వయుం
డును శ్రీప్రెగ్గడదండనాథతిలకుండున్ సింగనామాత్యుఁడున్.

33


వ.

అం దగ్రజుండు.

34


సీ.

కాలకంఠ కరోలకంఠహుంకారంబు
        చెవులు సోఁకనినాఁటిచిత్తభవుఁడు
కుపితరాఘవఘనక్రూరనారాచంబు
        తనువు నాఁటనినాఁటివనధిరాజు
క్రుద్ధకుంభోద్భవభ్రూలతాకౌటిల్య
        వికృతిఁ గ్రుంగనినాఁటివింధ్యశిఖరి
వీరభద్రోదారఘోరవీరావేశ
        విహతిఁ గందనినాఁటితుహినకరుఁడు


తే.

చక్కఁదనమున గాంభీర్యసారమునను
బ్రకటధైర్యకళాకలాపములయందు
దండనాయకచూడావతంస మైన
మంత్రిమామిడివేమనామాత్యుఁ డెలమి.

35


మ.

తగుఁ గైవార మొనర్ప విక్రమకళాధౌరేయతాశాలి శ్రీ
ప్రెగడన్నధ్వజినీశుఁ డంబునిధిగంభీరుండు శుంభద్ద్విష
న్నగరద్వారకవాటపాటనవిధానప్రౌఢబాహార్గళా
యుగళుం డాహవసస్యసాచి థరలోనొక్కండు వేరుక్కునన్.

36


సీ.

గగనకల్లోలినీకల్లోలమాలికా
        హల్లీసకములతో నవఘళించి

చరమసంధ్యాకాలసంఫుల్లమల్లికా
        స్తబకషంక్తులతోడ సరస మాడి
శరదాగమారంభసంపూర్ణపూర్ణిమా
        విమలచంద్రికలతో వియ్యమంది
బిసరుహాసనవధూపృథుపయోధరభార
        హారవల్లరులతో ననఁగి పెనఁగి


తే.

వెలయు నెవ్వానియభిరామవిమలకీర్తి
యతఁడు త్రిభువనరాయవేశ్యాభుజంగ
కదనగాండీవిజగనొబ్బగండబిరుద
శాశ్వతుం డొప్పు సింగన సచినవరుఁడు.

37


మ.

అరుదార న్వివిధాగ్రహారములతో నాందోళికాచ్ఛత్త్రచా
మరకల్యాణకళాచికాదిబహుసమ్మానార్హచిహ్నంబు లా
దర మొప్పారఁగ వేమభూవరునిచేతం గాంచె సామ్రాజ్యసం
భరణప్రౌఢుఁ డమాత్యసింగఁడు నయప్రాగల్భ్యగర్వోన్నతిన్.

38


వ.

ఈదృగ్విధగుణాలంకారుఁ డైనయమ్మహాప్రధానశేఖరునకు.

39


షష్ట్యంకములు

క.

శ్రీమంతున కావర్జిత
సామంతున కహితహృదయజలజాతవనీ
హేమంతునకును సలలిత
భామాకంతునకు సచివభాస్వంతునకున్.

40


క.

కుకురు కురు చోళ కేరళ
శక మరు కర్ణాట లాట సౌవీర నృప

ప్రకరసభాభగణమహా
సుకవిజనానీకవినుతశుభచరితునకున్.

41


క.

చెంచిమలచూడకారున, కంచితకరుణాతరంగితాపాంగునకున్
జంచలనయనాకలకిల, కించితలీలావిలాసకేళీరతికిన్.

42


క.

హాటకగిరిధీరున కరి, తాటంకవతీకపోలతలకరిమకరీ
పాటచ్చరకఠినధను, ర్జ్యాటంకారునకు మన్మథాకారునకున్.

43


క.

శ్రీమహితు పెట్టసుతునకు, వేమక్షితిపాలరాజ్యవిభవకళార
క్షామణికి సింగసచివ, గ్రామణికిం బాండ్యరాజగజకేసరికిన్.

44


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన యిమ్మహాప్రబంధంబునకుం గథానాయకుండు.

45


కథా ప్రారంభము

నలమహారాజవర్ణనము

సీ.

తపనీయదండైకధవళాతపత్రితో
        ద్దండతేజఃకీర్తిమండలుడు
నిర్మలనిజకథానిమిషకల్లోలినీ
        క్షాళితాఖలజగత్కల్మషుండు
వితతనవద్వయద్వీపనానాజయ
        శ్రీవధూటీసమాశ్లిష్టభుజుఁడు
నిఖిలవిద్యానయీవృత్తరంగస్థలా
        ౽౽యతనాయమానజిహ్వాస్థలుండు


తే.

ప్రస్తుతింపంగఁ దగుసముద్భటకఠోర
చటులగుణటంక్రియాఘనస్తనితఘోష

చాపనీరదభవశరాసారశమిత
బలవదహితతేజోదవానలుఁడు నలుఁడు.

46


చ.

అలయకధీతిబోధములు నాచరణంబు ప్రచారణంబు గాఁ
గలుగునుపాధిభేదముల గాఢమతి న్నిగమాదు లైనవి
ద్యలు పదునాలుగింటికి నతం డొనరించెఁ జతుర్దశత్వముం;
దెలియఁగ లేము కారణము దీనికి నెమ్మెయిఁ జర్చ చేసినన్.

47


తే.

అతనివిద్య జిహ్వానటి శ్రుతివిధమున
నంగగుణమున నష్టాదశాత్మ యగుచు
విస్తరిల్లె నవద్వయద్వీపపృథగ
శేషభూజయలక్ష్మీజిగీషబోలె.

48


తే.

తాఁ ద్రినేత్రునియపరావతార మగుటఁ
దెలుపు దిక్పాలకాంశావతీర్ణుఁ డతఁడు
కామసంచారహరణప్రగల్భ మైన
శాస్త్ర మనువేరియధికలోచనము కలిమి.

49


చ.

కెరలి మహాసివేమసహకృత్వరితద్భటకోటిచాతురీ
తురి సమరాంగణంబులఁ జతుర్హరిదావరణంబులన్ యశోం
బరముల నేయుచుండు బహుభంగులఁ బున్నమనాఁటినిండుచం
దురునునుసోగవెన్నెలలతోఁ దులఁదూఁగెడు తద్గుణంబులన్.

50


తే.

తద్ధిశాజయయాత్రోత్థధరణిధూళి
దోఃప్రతాపవైశ్వానరధూమరేఖ
పాలమున్నీటిలోఁ బడి పంక మయ్యె
నమృతదీధితిమైఁ జెంది యంక మయ్యె.

51

చ.

అరయిక గల్గి భూమివలయం బఖిలంబుసు నీతి బాధలం
బొరయక యుండ నానృపతి పుంగవుఁ డేలుచు నుండ నొండుచో
నిరవయి యుండ కుండుటఁజుమీ యతీవర్షము లాశ్రయించెఁ ద,
త్పరనరనాథయూథవనితాజనతానయనోత్పలంబులన్.

52


ఉ.

కొం డని వేడ్కతోఁ బసిఁడికొండ ధనార్థుల కెల్లఁ బంచి యీ
కుండుట దానధారకుఁ బయోనిధు లెల్ల వ్యయింపలేమి యీ
రెం డపకీర్తులం చల ధరించినవాఁడు ప్రదానశీలుఁ డా
తం డిరువాయ గా ముడికి దార్చిన వెండ్రుక లన్మిషంబునన్.

53


చ.

నియమవిచిత్రభంగి మహనీయుఁడు భూమివిభుండు మిత్రజే
తయును నమిత్త్రజేతయుఁ బ్రతాపగుణంబున నీతిఁ జూరదృ
ష్టియును విచారదృష్టియు, నటే! పరిపంథిమహీశులట్ల త
ద్భయమున భేత్తృతాగుణము వాసెనొ కాక విరుద్ధధర్మముల్.

54


మ.

ధన నేకాంఘ్రికనిష్ఠికాంగుళమ యాధారంబుగా నిల్చి ని
ర్భరలీలం గృతవేళ నెట్టన యధర్మంబుం దపస్విత్వముం
బొరసెం దక్కినవార లెవ్వరు తపంబుల్ సేయ! రమ్మేదినీ
శ్వరుసామ్రాజ్యమునందు ధర్మము చతుష్పాదంబునం గ్రాలఁగన్.

55


క.

ఆరాజు విజయలక్ష్మికి
నీరాజన మాచరించు నిర్దగ్ధదిగం
తారాతిరాజనగరీ
దారుణవైశ్వానరప్రదక్షిణశిఖలన్.

56

చ.

ఇతఁడు దరిద్రుఁ డౌ ననుచు నేర్పడ నర్థిలలాటపట్టికన్
శతధృతి వ్రాసినట్టి లిపిజాల మనర్థము గాని యట్లుగా
వితరణఖేలనావిభవవిభ్రమనిర్జితకల్పభూరుహుం
డతఁడు దరిద్రతాగుణమునందు దరిద్రుని జేయు నాతనిన్.

57


తే.*

అతనికీర్తిప్రతాపంబు లవనిఁ గలుగ
నేల యివి! యంచు మదిలోన నెపుడు దలంచు
నపుడ పరివేషమిషమున నబ్జసూర్య
మండలముల విధాతృండు గుండలించు.

58


వ.

అన్నలుండు నళినబాంధవుండునుంబోలెఁ బ్రతిదినంబును నభ్యుదయంబు నొందుచుఁ, గ్రమంబున శైశవంబు నతిక్రమించి యౌవనారంభంబున నరిదుర్గలుంఠనావసరంబులంబోలె లోహార్గళదీర్ఘపీనతయును గోపురద్వారకవాటదుర్ధర్షతిరఃప్రసారితయును బాహావక్షంబులచేత బందీగ్రాహంబు గ్రహించి రోమకోటికపటంబున హాటకగర్భుడు పాటించి లిఖించిన సుగుణగణనారేఖ లవయవంబులం బొలుపార సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబు విడంబింపం జాలునెమ్మొగంబునకుం గళంకాలంకారశంక నంకురింపఁజేయంజాలు కోమలశ్మశ్రురాజి విరాజిల్లం గండు మెఱసి రెండవకుసుమకోదండుండునుంబోలె విలాసినీమండలికిం గన్నులపండువై వెండియు.

59


తే.

దాస్య మొనరించు విధుఁ డేతదాస్యమునకుఁ
బల్లవము లేతదంఘ్రిసంపల్లవములు
జలరుహములకుఁ దచ్ఛయచ్ఛాయదాయ
నాఁగ నతఁ డొప్పె నవయౌవనాగమమున.

60

వ.

అయ్యవసరంబున.

61


తే.

వానిఁ గలలోనఁ గానని వనజముఖియు
వాని మార్పును బేర్కోని మానవతియు
వానిఁ గా నాత్మ భావించి వరునిఁ గవయ
నప్పళింపనిసతియు లేదయ్యె నచట.

62


చ.

దరహసితావధీరితసుధాకరబింబము నేత్రనిర్జితాం
బురుహము నైనయానిషధభూవరునుల్లసితాననంబుతో
సరి మఱి యొండ్లు గల్గమికి సంశయ మేటికిఁ దద్ద్వయీవిజి
త్వరకమనీయవస్తురహితం బగునట్టిచరాచరంబునన్?

63


క.

తలవెండ్రుక లెగఁగట్టెడు
కొలఁదిన నానృపకుమారకుఁడు కడిమిమెయిన్
నలుదెసలకరులగండ
స్థలఫలకములన్ లిఖించె జయశాసనముల్.

64


తే.

తరుణపాథోరుహాధోవిధానములను
ధరణినాథకిరీటాగ్రధానములను
నూర్థ్వమయ్యెడు నిది యంచునొకొ విధాత
తత్పదం బూర్ధ్వరేఖాంకితంబు సేసె.

65


తే.

అప్పుడు లీలావినిర్జితానంగుఁడైన
యతనిఁ గనియును వినియుఁ జింతానురక్తి
స్వర్గమర్త్యపాతాళవిష్టపములందు
విబుధనరభోగికాంతలు వివశలైరి.

66


ఉ.

ఱెప్పలు వాల్ప కప్పుడమిఱేనిమనోహరమూర్తి నిచ్చలుం
దప్పక చూచి చూచి విబుధప్రమదల్ ప్రమదంబు లాత్మలం

జిప్పిలుచుండ నెద్ది పరిశీలన సేసిరొ యట్టియబ్బెసం
బిప్పుడు వారు చూపుదు రపేతనిమేషములైనచూపులన్.

67


తే.

తద్గుణాకర్ణనంబునఁ దదనిరీక్ష
ణమున ధన్యత్వమును నధన్యతయుఁ బొంది
యభిమతానభిమత మైనయక్షియుగముఁ
దాల్చుఁ జక్షుశ్శ్రవఃస్త్రీకదంబకంబు.

68


చ.

[2]మొలచినకూర్మి గన్నుఁగవ మోడ్చినయప్పు డజప్రభావనా
బలమున నానృపాలకునిఁ బాయక చూతురు మర్త్యభామ లా
యలికులనీలవేణులకు నమ్మెయి నవ్విభుఁ జూచువేళలన్
గలుగవు వో నిమేషపరికల్పనఁ బుట్టెడునంతరాయముల్.

69


సీ.

కోరి లీలాగేహకుడ్యభాగంబుల
        వ్రాయుదు రమ్మహీశ్వరునిమూర్తి
వ్రాసి కన్యాత్వగౌరవము వీసరపోవ
        దర్శింతు రనురాగతరళదృష్టి
దర్శించి యతని కేఁ దగుదునొ తగనొ యం
        చించుకించుక సంశయింతు రాత్మ
సంశయించి కరాంబుజములఁ గ్రొమ్మించుట
        ద్దము లెత్తిచూతురు తముఁ దారు


తే.

రాజకన్యలు జగతి నాక్రమమునందు
గందు వారలనిట్టూర్పు గాడ్పువేఁడి
ముకురములు చారుమోహనమూర్తి యనఁగఁ
బరఁగు దమయంతిచేతిదర్పణముదక్క.

70

వ.

ఇవ్విధంబున ననన్యరూపలావణ్యరేఖావిలాసభాసమానయగు భీమనందన యానరేంద్ర బృందారకునియందు డెందంబు నిలుపుటయును.

71


తే.

అప్పు డనలావరుద్ధత నారఁ గూరి
బాణపురమును బోనియాభైమిమనముఁ
బుష్పబాణాసనుఁడు భోగభోజి యైన
వరవయోవిశేషంబు వార్వముగఁ దఱిసె.

72


దమయంతి నలునియం దనురక్త యగుట

వ.

దమయంతియు శ్రవణప్రీతివాసనావశంబునం బ్రతిదినప్రవర్ధమానంబగు మనోనురాగంబు నిరూఢంబై యుండ.

73


మ.

జనకుం గొల్వఁగ వచ్చినప్పుడు తదాస్థానంబులోఁ బాఠకుల్
వినుతప్రౌఢి వసుంధరాధిపతులన్ వేర్వేఱ కీర్తించుచో
వనితారత్నము వీరసేనుతనయున్ వర్ణింపఁగా నున్నత
స్తనభారంబు కెలంకుల న్నినుచుఁ జంచల్లీలరోమాంచముల్.

74


తే.

మహిమ హిమవేళలందు నమ్మానవతికి
మాసరము లయ్యెఁ దలఁపంగ వాసరములు
పొడవు గలిగి తపర్తుసంపూర్తియందు
సంచితాయమవతు లయ్యె యామవతులు.

75


సీ.

సఖులుఁ దాఁ బుష్పాస్త్రుసామ్రాజ్యపదవికి
        నభిషేక మొనరించు నవనినాథు
నలనామధేయ మైనతృణంబు వినఁబడ్డ
        నధిపతిపే ర్విన్న యట్ల యలరు

నిషధదేశపువిప్రనికరంబుఁ బూజించి
        యలయక ప్రియుసుద్ది యడుగఁ దలఁచు
నభ్యాసవశమునఁ బ్రాణేశ్వరునిమీఁది
        యించుగీతములు వాయించు వీణ


తే.

నేర్పు గలచిత్రకరులచే నిలయభిత్తి
భువనమోహనాకారతఁ బొలుపు మిగుల
మగని మగువను వ్రాయించి మదిఁ దలంచు
నిషధరాజును దన్నుగా నీరజాక్షి.

76


ఉ.

పువ్విలుకానితోడ సరిపోలెడుచక్కనివాఁడు భూమిలో
నెవ్వఁడు చెప్పుడా? యనుచు నిష్టవయస్యలఁ గూర్చి యాత్మలో
నువ్విళులూరుచుం బలుకు; నొప్పులకుప్ప! నలుండు గాక యొం
డెవ్వఁ? డనంగ మెచ్చు దరళేక్షణ నెయ్యము వియ్య మెట్టిదో.

77


వ.

మఱియు మనోరథపరంపరాసంవరణప్రసూనదామంబున నమ్మహీపతిం బతిగా వరియించియుం ద్రిభాగశేషంబు లగువిభావరీసమయంబు నిమీలితంబైన నేత్రయుగ్మంబును బాహ్యేంద్రియమౌనముద్రాభిముద్రితం బైనయంతఃకరణంబును మొఱంగి నిద్రాసమానీతుం డైనయారాజమనోజాతుతో నెంతయుం దడవు మంతనం బుండియు నిరంతరస్మరణసరణీధారావాహికావగాహంబున నెడనెడం బొడచూపు నప్పుడమిఱేనిం గనుంగొని లజ్జాసాధ్వసభ్రమంబులు మనంబులో ముప్పిరిగొనం బ్రమోదించియు నవ్వైదర్భి నిర్భరమదనశరశలాకాశంకుసంకలితవేదనాదూయమానమానసయై విజృంభితమనోభవభుజావష్టంభంబు లగుహిమా

రంభంబులును గాలాగరుకళంకితకామినీకంఠమూలంబు లగుశిశిరకాలంబులును గలకంఠకామినీకంఠకోమలకుహూకారకోలాహలకరంబితకకుబంతంబు లగువసంతంబులును, సాయంతనసమయసంఫుల్లమల్లికామోదమేదురసమీరణౌఘంబు లగునిదాఘంబులును విరహిజనహృదయభయంకరస్తనితసందోహంబు లగుజలధరానేహంబులును సకలజనమనోవికాసమయంబు లగుశారదసమయంబులును గడపుచుండె. నవ్వేళ జలధివేలావలయవలయితవసుంధరాభువనమండలాఖండలుం డగునలుండును విమలనిజకీర్తిమౌక్తికమాలికాసంతానంబులకు నంతర్ఘటనాగుణంబులుంబోలెఁ బొలుచు నక్కాంతాలలామంబు గుణంబులు జనపరంపరవలన వినియె. నాసమయంబున.

78


నలుండు దమయంతియం దనురక్తుఁ డగుట

శా.*

ఆవామాక్షి మనోహరాకృతి యమోఘాస్త్రంబుగా భూవరున్
లావణ్యాధికు నచ్చలంబు మెయిగెల్వంబూని యిందిందిర
జ్యావల్లీకిణకర్కశం బయినహస్తం బుధ్ధతిం జాఁపి వే
పూవుందూపులజోదు పుచ్చుకొనియెం బుండ్రేక్షుకోదండమున్.

79


క.

శ్రవణావతంస మయ్యెను
ధవళాయతనేత్రగుణము ధరణీపతికిన్
శ్రవణావతంస మయ్యెను
బువువింటిగుణంబు నపుడ పుష్పాస్త్రునకున్.

80


ఉ.

ఆవసుధాధినాథుని మహాధృతిశాలి జయించు తెంపునన్
భావజుఁ డప్పు డున్మదనబాణము తియ్యనివింటఁ గూర్చుచోఁ

గేవలసాహసంబు మదిఁ గీల్కొనఁ జేసియు ముంచె దాఁ ద్రిలో
కీవిజయార్జితంబు లగుకీ ర్తిభరంబుల సంశయాంబుధిన్.

81


తే.

అతనుఁ డఁట జోదు! పూమొగ్గ యఁట శరంబు!
చించినది యఁట తద్ధైర్యకంచుకంబు
నలుని దమయంతితోఁ గూర్పఁదలఁచియున్న
ధాత మదియెత్తికో ల్తుదిఁ దాఁకకున్నె!

82


ఉ.*

ఎయ్యది కారణంబుగ మహీపతి యంచితధైర్యకంచుకం
బయ్యతనుండు సించె నలరమ్ములచే నది కారణంబుగాఁ
దొయ్యలి రాజనందనునితోడన కూర్పఁ దలంచుచున్నయా
దయ్యము నెత్తికోలు తుదిఁ దాఁకుటఁ గానఁగ నయ్యె నయ్యెడన్.

83


ఉ.

ఏస విరి న్విరించి నొకయేటుసఁ దామరపాన్పుపైఁ బడం
ద్రోసినజోదు మన్మథుఁడు దుర్వహనూత్నవియోగవేదనా
యాసిత మైనరాజుహృదయాబ్జము గాఁడఁగ నేసె నెంతయుం
గాసిలి తేఁటిఱెక్క గఱి గట్టినపుష్పశిలీముఖంబులన్.

84


తే.

లలన లజ్జాసరిద్దుర్గలంఘనమున
రాజహృదయంబుఁ జొచ్చినక్రమముఁ జూడఁ
దరుణిమారంభపరికల్పితంబు లైన
వలుఁదకుచకుంభములప్రభావమునఁ జూవె.

85


సీ.

జాగరోద్భూతదృగ్రాగంబు మాణిక్య
        కర్ణకుండలదీప్తిఁ గప్పిపుచ్చు
రాజకార్యపరంపరాఖేదమిషమున
        నిట్టూర్పుగాడ్పుల నిహ్నవించు

ఘనసారబహుళచందనవిలేపనమున
        నాపాండుభావంబు నపలపించు
దోరంతరన్యస్తతారహారంబుల
        నంతఃపరీతాప మపనయించు


తే.

మాననీయశశాంకకోమలము లైన
యామినీసమయములుఁ బర్యంకములును
సాక్షులుగ నొంచువలవంత జనవిభుండు
కన్నెకూర్మి ప్రకాశంబు గాకయుండ.

86


వ.

ఇవ్విధంబున నసంవరం బైనశంబరవైరివిక్రమంబు క్రమక్రమంబునం బరిస్ఫుటం బగుచుండ వియోగవేదనాచిహ్నంబులు నిహ్నవింపం గొలంది గాక చీకాకుపడి యాకారరేఖావినిర్భర్త్సితమత్స్యలాంఛనుండగు రాజకుమారుం డొక్కనాఁ డారామవీక్షావిహారంబునం గాలక్షేపంబు సేయువాఁడై ప్రభంజనాధ్యేయజపంబును జంచలఖురాంచలక్షోదితక్షోణిమండలంబును నిగాళగదేవమణిదీప్తిచ్ఛటాపటలశంకావహకృకాటికాధవళకేసరకేశరశ్మిసంచయంబును వల్గువల్గాసుషక్తవదనతావిడంబితవక్త్రస్థభుజగవైనతేయంబును జలాచలప్రోథతానుమీయమాననిజవేగదర్పప్రశంసాప్రవచనోపన్యాసంబును నై సింధుజంబును శీతమహస్సహోదరంబును నగుట రెండవ యుచ్చైశ్రవంబునుం బోలిన యౌపవాహ్యంబు నారోహించి.87


తే.

ప్రమదనిష్పందతరనేత్రపద్ము లగుచుఁ
బౌరజనులు విలోకింపఁ బ్రకటలీల

సముచితానల్పపరివారసహితుఁ డగుచు
నవనినాథసుతుండు వాహ్యాళి వెడలె.

88


వ.

తత్ప్రదేశంబున.

89


ఉ.

నేమ మెలర్పఁగా గొడుగునీడ వహించువసుంధరాస్థలీ
సీమనె యెక్కి యాడెను విచిత్రగతిం దురగోత్తమంబు నా
భూమివిభుండు దద్భ్రములు వో యెడత్రెవ్వక యభ్యసించు వా
త్యామయచక్రచంక్రమవిహారములన్ సుడిగాడ్పు లీడ్చుచున్.

90


వ.

ఇవ్విధంబునఁ గొంతతడ వతిజవనచతురతురగనర్తనక్రీడాడోలాయమానమణికుండలమరీచిమండలీనీరాజితగండస్థలుండై
వాహ్యాళివిహారంబు సలిపి వలయునమాత్యులం బరివారంబును నచ్చోటన యుండ నియమించి యొక్కరుండునుం బాదచారియై ఘనచ్ఛాయంబునుం బ్రవాళరాగచ్ఛురితంబును నగువిలాసకాననంబు పయోనిధానంబు నంబుజాక్షుండునుం బోలెఁ బ్రవేశించి.

91


నలుని యుద్యానవనవిహారము

తే.

పత్త్రములమీఁద మూఁగినభ్రమరకులము
హరవిసర్జనజనితదుర్యశముఁ బోలఁ
గమియ విచ్చినగేదంగికన్నెపువ్వుఁ
గౌతుకము పల్లవింపంగఁ గాంచె విభుఁడు.

92


వ.

విరహీజనహృదయచ్ఛేదనక్రియాక్రకచంబులు వియోగిమర్మవిదారణవ్యాపారకర్ణినారాచంబులు పాంథజనహృషీకసూచకశలాకలు నగుకనకకేతకీజాలంబులఁ జేరం జనుదెంచి.

93

చ.

చిలుపనికమ్మఁదేనియలు చిప్పిలి హస్తము లస్తకంబునన్
నిలువక నేరువాఱునెడ నీయతిసాంద్రపరాగము ల్గదా
యలరులవింటిజోదునకు నప్పటి కప్పటి కప్పళించుకోఁ
గలిగెడు నంచు వే కనలు గైకొని దూఱె విభుండు కేతకిన్.

94


మ.

దమయంతీస్తనకుంభవిభ్రమముఁ బొందం గోరుటన్ ధూమ
పానముఁ గావించు చధోముఖంబు లగునానాకుంభముల్ వోలె ధూ
పములన్ దోహద మాచరింపఁగఁ గడుం బక్వంబులై యున్నదా
డిమముల్ సూచి నృపాలకుండు మదిఁ బాటించెన్ మహౌత్సుక్యమున్.

95


తే.

మన్మథుం డేయుకింశుకమార్గణములు
చన్నుఁగవ నాటుటయుఁ బాంథసతియుఁ బోలెఁ
బాఱుదెంచి కీరంబులు పండ్లు గఱవ
వణఁకుబాడిమిఁ జూచె భూవరుఁడు వేడ్క.

96


వ.

మఱియు మందానిలపరిస్పందంబునం గందళితంబు లైనమకరందబిందునిష్యందంబులు చిందించుగురివెందపూఁబందిరులును వలచరాచవారికి వనదేవత లొనర్చునీరాజనప్రదీపాంకురంబులుం బోనికోమలకోరకంబులం గరంబు సొంపారుసంపెంగలును మదనచాపవిముక్తంబులై మొదలం గ్రోలిన భవశరీరభస్తాంగరాగంబు పరాగవ్యాజంబున వెడలం గ్రాయుచున్న సురపొన్నలును రోలంబనికురుంబంబులకుఁ బానగోష్ఠీస్థానంబు లగువికస్వరస్థలకమలినీకదంబంబులును గలకంఠకంఠహంకారంబులం బాంథులకు భయంబు సంపాదింపఁ జాలు క్రొమ్మావిమోకచాలును ధూమకేతుమండలంబులుంబోలె విరహిజనులగుండియ లవియించుచుఁ జంచరీక

పరంపరాశిఖరంబులై సొంపారుచాంపేయంబులును వలయాకారంబునం బరిశ్రమించుభ్రమరంబులసంగతిం గేసరరేణువిస్ఫులింగంబు లెగయ బాణోత్తేజనప్రకారంబు నంగీకరించుచు ననంగునకుం బ్రథానశాణంబు లగునారంగంబులును మృదులపవమానసంపాతకంపమానకిసలయకంటకప్రక్షతంబులై మదనముద్రాభిముద్రితంబు లగువారాంగనాజనంబుల వట్రువపాలిండ్లకుం జుట్టంబులై తోరంబు లగుమారేడుఁబండ్లును నిఖిలయువద్వయీచిత్తనిమజ్జనోచితంబు లగుసజ్జకపుఁ బూమొగ్గలును బ్రవాళగర్భగహ్వరంబులందు వహియించుచు నించువిలుకానితూణీరంబులకుం బోల్పఁ బట్టైన
కలిగొట్టుపొదలును నొండొండ చంద్రఖండంబులు వెడలంగ్రక్కు రాహుమండలంబులుంబోలెఁ గుటిలసితకుట్మలంబులు వ్రేలం గాఢాంధకారంబునం గాఱుకొను మునిద్రుమంబులును గనుంగొనుచుఁ బోషితరాజకీరంబులు కైవారంబులు నేయఁ బ్రోదికోయిలలు మంగళగానం బొనర్పఁ గొలంకులకెలంకులను బావులక్రేవలను నికుంజక్రోడంబులనీడలను విశ్రమించుచుం బ్రసవమృదుగంధపశ్యతోహరంబు లగుగంధవాహంబుల రాకలు విహారశ్రాంతి నపనయింప వికటఘటీయంత్రసలిలధారాసారణీమార్గంబులఁ డెక్కెంబునకుం జక్కనిగండుమీను వెదకుమీనకేతుండునుంబోలె నుద్యానం బెల్లఁ గ్రుమ్మరి యగ్రభాగంబున.

97


సీ.

శేషపుచ్ఛచ్ఛాయఁ జెలువారుబిసములు,
తన్మగ్నసురదంతిదంతములుగ

నిండాకవిరిసిన పుండరీకశ్రేణి
        యామినీరమణరేఖాళి గాఁగఁ
బ్రతిబింబితోపాంతబహులపాదపములు
        గర్భస్థశైలసంఘములు గాఁగ
నేకదేశంబున నిందీవరంబులు
        కాలకూటమయూఖఖండములుగ


తే.

బాలశైవాలవల్లరీజాలకంబు
బాడబానలభవధూమపంక్తి గాఁగ
వారిరాశయుఁబోలె గంభీరమైన
ఘనతటాకంబుఁ గాంచె నజ్జనవిభుండు.

98


వ.

కాంచి యొక్కింతతడవు మనంబునం గొనియాడుచుం దిమితిమింగిలఢులీకుళీర మత్స్యకచ్ఛపమకరనికరసంచారతరళ తరంగమాలికాడోలారోహలీలావ్యాలోల కలహంససంసదాలాసకోలాహలముఖరితదిశాభాగం బైన యమ్మహాతటాకంబుతీరప్రదేశంబున.

99


సీ.

విలులితజంబాలపులినభాగమున ను
        ద్దండపద్మాతపత్రంబునీడఁ
గమలకాండకఠోరకంటకాంకురపంక్తి
        నొయ్యనఁ గంధరం బొరసికొనుచు
నొంటికాలనె నిల్చి యూర్మిమారుతములం
        జిగురుఱెక్కలఱేకు లెగయుచుండ
విరళమై పక్షతిద్వితయంబు వెడజాఱఁ
        జంచు లొకించు కాకుంచితముగ

తే.

వరుణరాజున కిడినచామరమువోలెఁ
బొడవు మిగిలినపొందమ్మిపువ్వుఁబోలె
నిబిడనిద్రాభిముద్రితనేత్ర మైన
రాజహంసంబుఁ గాంచె నారాజసుతుఁడు.

100


క.*

కాంచనపక్షం బగురా
యంచం గనుఁగొని నృపాలుఁ డనురాగముతో
వంచించి పట్టుకొనియెద
నంచుఁ దలఁచె దైవఘటన కనుకూలముగాన్.

101


నలుడు హంసముం బట్టుకొనుట

తే.

వామనుం డైనకైటభవైరివిధము
నభినయించుక్రమంబున నధిపసుతుఁడు
నడిఁకి నడిఁకి యల్లల్లన నడిచి పట్టెఁ
బాణిపద్మద్వయంబునఁ బసిఁడియంచ.

102


వ.

ఇట్లు నిషధరాజుచేతం బట్టుపడి బిట్టు మేల్కాంచి యక్కాంచనహంసంబు కంచుగీసినతెఱుంగున నెలుంగించుచు నెగయ నుంకించుచుఁ జంచుపుటంబునం బాణిపల్లవంబులు గఱచుచుఁ జరణంబులు గింజుకొనుచు నఖంబుల నొత్తుచు నలుదిక్కులుం జూచుచు నెద్దియుం జేయునది లేక చీకాకుపడుచుండ నప్పాటవసంభ్రమసముత్పతత్పతగకులంబై కమలషండంబు గలగుండుపడియెఁ గూలంబులం గులాయంబుల నుండి పుండరీకవనలక్ష్మీచరణనూపురక్రేంకారంబుల ననుకరించుచుఁ గారండవబకగ్రౌంచరథాంగకోయష్టికాదులు విహాయసంబున కెగసి కూయం దొడంగె నప్పుడు.

103

తే.

జాతరూపచ్ఛదచ్ఛటాజాతరూప
లక్ష్మి యిం తొప్పునే మరాళమున కనుచు
నద్భుతం బంది తనుఁ జూచునధిపసుతున
కిట్లనె మనుజభాషల హేమఖగము.

104


క.

ఱెక్కలకొనలం గలిగిన
యిక్కాంచన మాసపడియెదే నృప! నీకే
యక్కఱ దీనం దీరెడు
నక్కట! నీహారలేశ మబ్ధికిబోలెన్?

105


చ.

ఎఱుఁగనె నీవు ప్రాంతమున నింతట నంతట నున్కియింత యే
మఱుదునె నిన్ను విశ్వజనమాన్యుఁడ వంచును విశ్వసించి యి
త్తఱి సుఖనిద్రఁ బొందితి వృథామతి నెట్టన యాత్మ నమ్మినం
జెఱుపఁదలంతురే ఘనులు చిత్తమునన్ బగవారి నేనియున్?

106


ఉ.

హింసయ నీకు వేడ్క యగునేని కృపాశ్రయ మైనయీసరో
హంసముఁ జంప నేల! కఱవా తరువాత వసుంధరాధిపో
త్తంస! విజృంభమాణభుజదర్పనిరంకుశసాహసక్రియా
మాంసలచిత్తవృత్తు లయి మత్తిలి యుండునరాతిభూపతుల్

.107


వ.

ఫలకుసుమమూలమాత్రంబున శరీరయాత్ర నడపుచు మునులుంబోలె సలిలంబులలోనం దపంబు సేయుచున్నవారము మామీఁద దండనీతిం బ్రయోగింప నీకుం దగునె? యదియునుం గాక.

108


సీ.

తల్లి మదేకపుత్త్రక పెద్ద కన్నులు
        గాన దిప్పుడు మూఁడుకాళ్లముసలి
యిల్లాలు గడుసాధ్వి యేమియు నెఱుఁగదు
        పరమపాతివ్రత్యభవ్యచరిత

వెనుకముందర లేరు నెన రైనచుట్టాలు
        లేవడి యెంతేని జీవనంబు
గానక కన్నసంతానంబు శిశువులు
        జీవనస్థితి కేన తావలంబు


తే.

కృపఁ దలంపఁ గదయ్య యోనృపవరేణ్య!
యభయ మీవయ్య! యోతుహినాంశువంశ!
కావఁగదవయ్య! యర్థార్థికల్పశాఖి!
నిగ్రహింపకుమయ్య! యోనిషధరాజ.

109


వ.

అక్కటకటా! దైవంబ! నీకంటికిం బేలగింజయు బెద్ద యయ్యెనే? జననీ! ముదిసి ముప్పుకాలంబున సుతశోకసాగరం బెబ్భంగి నీదగలదానవు! ప్రాణేశ్వరీ! యేచందంబున మద్విరహవేదనాదవానలంబునం దరికొనియెదవు? సఖులార! యేప్రకారంబునం బుటపాకప్రతీకాశం బైనకరుణరసంబునఁ బురపురం బొక్కెదరు? బిడ్డలార! యేలాగున నతిక్షుత్పిపాసాకులంబులై కులాయకూలంబులం గులగులం గూసెద రని విలాపంబు సేయుచు దృగ్గోళంబుల వేడికన్నీరు వెడల గోలుగోలున నేడ్చినం గృపాళుండై భూపాలుండు హస్తపల్లవంబులు వదలి రాజహంసంబ! పొమ్ము సుఖం బుండు మని విడిచి పుచ్చె. ననంతరంబ.

110


ఆశ్వాసాంతము

శా.

భారద్వాజపవిత్రగోత్ర! విమలాపస్తంబసత్సూత్ర! వి
ద్యారాజార్ధకిరీట! రాజహితకార్యారంభనిర్ధారణా
ధౌరంధర్యకళాయుగంధర! సమిద్దగాండీవి! శ్రీఖండక
ర్పూరక్షోదవిపాండునిర్మలయశఃపూర్ణక్షమామండలా!

111

క.

కేళాదిరాయ! యభినవ
లీలామకరాంక! చంద్రలేఖాంకురచూ
డాలంకారపదాంబురు
హాలింగనసుఖితనిస్తులాంతఃకరణా!

112


మాలిని.

జరఠకమఠరాజస్తబ్ధరోమప్రధాన
ద్విరసనపతిభూభృద్దిగ్గజగ్రామభూమ
స్థిరతరధృతసంపద్గేహబాహాగ్రపీఠీ
పరిచయసుఖలక్ష్మీపక్ష్మలక్షోణిచక్రా!

113


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బైన శృంగారనైషధకావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. *ఈగుర్తుగలవి తిమ్మకవి పాఠములు.
  2. పొలుపొనఁగూడి; పొలుపొగిజూచి అని పాఠాంతరములు.