శృంగారనైషధము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శృంగారనైషధము

ద్వితీయాశ్వాసము

శ్రీరాజరాజవేమ
క్ష్మారమణకృపాకటాక్షసంవర్ధితల
క్ష్మీరక్షితబుధలోక! యు
దారగుణాధార! సింగనామాత్యమణీ.

1


వ.

అవధరింపుము.

2


హంస నలునిచే విడువఁబడి కృతజ్ఞతఁ జూపుట

తే.

అట్లు పురుషోత్తముం డైనయతనివలన
ముక్తి గాంచినయాద్విజముఖ్యుఁ డెలమి
డెందమునకును వాక్కున కందరాని
యధికతర మైనయానంద మనుభవించె.

3


క.

చుట్టంబులుఁ జెలులుం దన
చుట్టుఁ దిరిగి యుండ ముదము సొం పెసలారన్
నెట్టిపడి చచ్చి క్రమ్మఱఁ
బుట్టినచందమున హంసము దటాకములోన్.

4

సీ.

ఱిక్కించికొనియున్న ఱెక్క మొత్తముతోడి
        యొడలు జాడించి నెవ్వడి విదిర్చుఁ
జేదోయియొత్తునఁ జేసి నెత్తురు లైన
        యవయవంబులు నోర సవర చేయుఁ
గుటిల చంచూపుటకోటికుట్టనములఁ
        దనుకీటములనిరోధంబు మాన్చుఁ
దొడరుజుంజురుమేనిదుర్వికారంబునఁ
        బులుఁగుఁజుట్టాల బి ట్టులియఁజేయు


తే.

నూర్మిపంక్తుల నుయ్యాల లూఁగి యాడుఁ
దివుటఁ దియ్యనితమ్మిపూఁదేనె గ్రోలుఁ
బ్రమదమున నాఁచుఁదీగెజొంపములఁదూఱు
నరుగుఁ గేళికులాయశుద్ధాంతములకు.

5


వ.

ఇవ్విధంబునం గొంతదడవు గ్రీడించి యానీడోద్భవంబు భవార్చనాయోగ్యంబును రుద్రాక్షమధువ్రతపరివృతంబును బహుశైవలక్ష్మతాసమన్వితంబును నగుటఁ బద్మంబునుం బోని నిషధరాజు హస్తంబునకు గ్రమ్మఱ నరుగుదెంచె నమ్మహాభుజుండును భుజంబు సాఁచి యమ్మానసౌకంబు మన్నించి యిమిడ్చికొనియుండె నప్పుడు.

6


తే.

ఇష్టమానస మయినయాహేమఖగము
నలునిమానస మానందజలధియందుఁ
గర్ణశష్కులికలశంబుఁ గౌఁగిలించి
యీఁదఁ జేయుచు మృదుభాష నిట్టు లనియె.

7


వ.

దేవా! యవధరింపుము ధర్మశాస్త్రమర్మపారగులైన పెద్దలు ‘దుర్బలకులజిఘాంసువులైన ఝషంబులను నీడద్రుమపీడా

కరంబు లైననీడజంబులను ననవద్యతృణహింసానృశసంబు లగుమృగంబులను మృగయావినోదంబుల వధియించి మహీధవుండు కిల్బిషంబునఁ బొందం’ డని చెప్పుదు. రిప్పట్టునం బట్టువడిననన్ను విడిచిపెట్టి ప్రాణంబు రక్షించిన యుపకారికిం బ్రియంబు సేయుదు నన నేర్తునే! యైనను నీకు నొక్కప్రియంబు చేసెద. నయాచితోపపన్నం బయినహితంబు పరిహరింపం బని లేదు. నిఖిలభువననాయకుండ వైననీకు మముబోంట్లు సేయునుపకారం బవేక్షణీయంబు గాకుండుట యెఱుంగుదు. నైనను గృతజ్ఞతాగుణలేశంబు క్లేశపఱుచుచున్నయది. సన్నంబు దొడ్డయనువిశేషంబు విచారింపక హస్తకల్పజనాంతరం బయినదైవంబుప్రశస్తి విమర్శించి నాచేయుప్రయోజనం బంగీకరింపుము.

8


హంస నలునికడ దమయంతి నభివర్ణించుట

సీ.

ప్రత్యర్థిసార్థసార్థకనామధేయుండు
        భూమీశ్వరుం డొప్పు భీముఁ డనఁగ
నారాజు త్రిదివంబు సమరేంద్రుఁడునుబోలెఁ
        దేజంబున విదర్భదేశ మేలు
దమనాహ్వయుం డైనతపసిసద్వరమునఁ
        గాంచె నాతఁడు కన్యకాలలామ
సర్వలోకాంగనాసౌభాగ్యగరిమంబు
        దమియించుకతమున దానినామ


తే.

మభ్రభారతి దమయంతి యంచు నొడివెఁ
దద్గుణంబులు వర్ణింప ధరణినాథ!

యబ్జసూతికి నైన శక్యంబు గాదు
పలుకుఁబూఁబోఁడి కైనను నలవి గాదు.

9


తే.

విదుషి యాయింతి దలఁదాల్చు వెండ్రుకలకు
నహహ! యెబ్భంగి సాటి సేయంగవచ్చుఁ
బశువుచేతఁ బురస్కృతిఁ బడయలేక
చాపలంబున వర్తించుచామరములు?

10


క.

ఖురకండూయనమిషమున
హరిణంబులు సాంత్వనంబు నాపాదించున్
దరుణివిలోచనములచేఁ
బరిభూతము లైనతమచపలదృష్టులకున్.

11


క.

లలనకనుదోయిముందట
నలనడ నలినంబు మలిన మయ్యెను హరిణం
బులు పూరి మేయం దొణఁగెను
గలితద్యుతి ఖంజ మయ్యె ఖంజనకులమున్.

12


తే.

రాజబింబంబునందు సారము హరించి
చేయఁ బోలు విధాత యాచెలువమోము
నడిమిరంధ్రంబునందుఁ గానంగ వచ్చు
ఖనిఖనీలిమ యది నివదర్శనము గాదె!

13


క.

ప్రవిలేపనపాండరమును
నవలాంఛనగోమయాంచనము నగురాకా
ధవళాంశమండలము విధి
నివాళి సేయును లతాంగి నెమ్మొగమునకున్.

14


సీ.

జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన
        రతిమన్మథులవిండ్లు రమణిబొమలు

కాంతినిర్ఝర మీఁదుకామయౌవనముల
        కుంభప్లవము లింతికుచఁయుగంబు
నడు మింత యని కేలఁ దొడిపట్టినధాత
        యంగుళిరేఖ లబ్జాస్యవళులు
యువమనోమృగరాజిఁ దవిలింపఁ దీర్చిన
        మదనవాగుర లిందువదనకురులు


తే.

బాల్యతారుణ్యసీమావిభాగమునకు
నజుఁడు వ్రాసిన లేఖ తన్వంగియాలు
భానువరమునఁ బడసిసపంకజముల
యపరజన్మంబు పూబోణియడుగు లధిప!

15


క.

జలదుర్గస్థమృణాళా
వలిజిత్కమనీయబాహువల్లరి యగునా
జలజానన నీకుం దగుఁ
బలుకులు వేయేల యధికబలశౌర్యనిధీ!

16


క.

హాటకకలశంబులకును
బాటి యగువధూటి మెఱుఁగుఁబాలిండ్లు నిరా
ఘాటస్ఫురణప్రభ యను
నేటికిఁ జక్కవలకవ యయి విరాజిల్లెన్.

17


తే.

వలుదయును వట్రువయుఁ గాఁగ నలినభవుఁడు
భీమభూపాలపుత్త్రికిఁ బిఱుఁ దొనర్చె
నర్కరథశిల్పశిక్షఁ బుష్పాస్త్రుతేరు
నేకచక్రంబు సేయ నూహించి యొక్కొ.

18


మ.

వనజాతేక్షణ యూరుయుగ్మమున లావణ్యంబునం గేళికా
ననసంక్రందనపట్టనప్రకటజన్మస్థానలన్ రంభలన్

ధనదాపత్యతపఃఫలస్తనుల నత్యంతాభిరామాంగులన్
మనుజాధీశ! యధఃకరించుఁ బొగడన్ మాబోంట్లకున్ శక్యమే?

19


మ.

మృదురీతిం బ్రతివాసరంబు గమకర్మీభూతనానానదీ
నదకాంతారపురీశిలోచ్చయుఁడనై నైకాద్భుతశ్రీజిత
త్రిదివం బైనవిదర్భదేశమున నారీకత్నముం గాంచితిన్
సదసత్సంశయగోచరోదరి శరత్సంపూర్ణచంద్రాననన్.

20


మ.

కమలేందీవరషండమండితలసత్కాసారసేవారతిన్
గమికర్మీకృతనైకనీవృతుఁడనై కంటిన్ విదర్భంబునన్
రమణిం బల్లవపాణిఁ బద్మనయనన్ రాకేందుబింబాననన్
సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సాహేతుశాతోదరిన్.

21


వ.

కాంచి, విబుధపురపురంధరీరామణీయకం బీరమణీరత్నంబుముందట నిస్సారంబు పొమ్మనియును విధాతచిత్తంబున నీమత్తకాశినికిం దగిన యుత్తముణ డగువరు డెవ్వండు గలిగియున్నవాఁడొకో యనియును జింతించుచుం గొంతదడవు నివ్వెఱపడి చూచుచుండిరి. ననంతరంబ యనురూపలావణ్యరేఖాసంపన్నుఁ డైనపిన్నవయసురాకొమరు నవలోకింతు నని లోకాలోకపర్యంతంబుగా నీలోకంబు విశ్వంబునుం బరిభ్రమించి యుర్వీశ్వరకుమారకుల నెల్లం బూర్వపక్షంబు గావించుచు వచ్చి వచ్చి యిచ్చోట నిన్నుం గనుంగొని సిద్ధాంతీకరించితి. సాదృశ్యనిబంధనంబై పొడమినసంస్కారబోధంబుఁ జిరకాలావలోకిత యగునబ్బాల యిప్పుడు నామనంబునం బొడగాననవచ్చుచున్నయది.

22

క.

దమయంతీకిలకించిత
మమృతాంశుకులావతంస యలరించు నినున్
విమలతరతారహారము
రమణీరమణీయకుచభరంబును బోలెన్.

23


తే.

సౌరభము లేనియట్టిపుష్పంబువోలె
గండుఁగోయిల వెలియైనకానవోలె
నధిప! దమయంతితోడిసఖ్యంబు లేని
నీదుసౌందర్యవిభవంబు నిష్ఫలంబు.

24


వ.

కావున నిఖిలవైమానికనికాయకామ్యమానయాన యమ్మాన్యవతికి నిన్నుం గూర్ప నాకు నేర్పు గల దక్కొమ్మ నెమ్మనంబున నిన్నుం దక్కఁ దక్కొరుం బరిగ్రహింపకుండ నట్లుగా భవద్గుణంబులు ప్రశంసించెద, నన్నుం బనిగొమ్ము, లెమ్ము, కార్యంబున నార్యులు నిజప్రయోజనంబు నెఱింగింతురు, గాని మాటలం బ్రకటింప రని పరిస్ఫుటంబుగాఁ బలికిన.

25


తే.

ఆద్విజాధిపువలన సంప్రాప్తమైన
వాక్సుధాధారఁ గ్రోలి భూవల్లభుండు
లలితలీలఁ దదుద్గారలవమువోలె
మొలకనవ్వు వహించెఁ గెమ్మోవిమీఁద.

26


వ.

ఇవ్విధంబున మందస్మితసుందరవదనారవిందుండై కరారవిందంబునం బతంగపుంగవునంగంబు నివురుచు మృదుభాషణంబుల నిట్లనియె.

27


సీ.

అండజాధీశ నీయాకారరేఖతోఁ
        దులఁదూఁగలేవు వస్తువులు జగతి

నీడోద్భవశ్రేష్ఠ! నీదుసౌశీల్యంబు
        పలుకుల కందంగఁ గొలఁది గాదు
పతగపుంగవ! నీసుభాషితంబులయట్ల
        యవయవంబులు సువర్ణాత్మకములు
పక్షివంశవతంప! పక్షపాతము నీకు
        గతియంద కాదు సద్వితతియందు


తే.

[1]నధికతాపపరీతాత్ముఁ డైననాకు
నెట్లు వచ్చితి చలిగాడ్పునట్లు నీవు
పూర్వజన్మమహాతపస్స్ఫురణఁ జేసి
నీదుసన్నిధి సమకూరె నిధియుఁబోలె.

28


మ.

త్రిజగన్మోహమహౌషధీలతిక ధాత్రీపాలకన్యావరో
ధజనోత్తంసమణిప్రరోహ మగునాతన్వంగి వేమాఱునుం
బ్రజ లెల్లన్ వినుతింపవిందు మొదలం బక్షీంద్ర యూహింప
నక్కజ! మీ విప్పుడు సంస్తుతింప సది సాక్షాత్కారముం బొందెడున్.

29


తే.

[2]సహృదయుండును హృదయంబు సమ్మతింప
సరయువారికి నఖిలంబు నకలుషంబు
చెంతనైనను సూక్ష్మ మీక్షింపజాల
దాన నాలంక్రియామాత్ర మక్షియుగము.

30


ఉ.

తియ్యనితేనెవోలె సుదతీతిలకంబుగుణంబు లుత్సవం
బయ్యె శ్రుతిద్వయంబునకు నాదిమకాలమునందు నిప్పుడా
తొయ్యలి నీవు సమ్మదముతో వినుతింపఁగ మన్మథాగ్నికిం

ధాయ్యయుఁబోలె నయ్యె నది; ధైర్యము పల్లటిలెన్ ఖగేశ్వరా!

31


శా.

కాలాంతఃపురకామినీకుచతటీకస్తూరికాసౌరభ
శ్రీలుంటాకము చంచనాచలతటశ్రీఖండసంవేష్టిత
వ్యాలస్ఫారఫణాకఠోరవిషనిశ్శ్వాసాగ్ని పాణింధమం
బేలా నాపయి దక్షిణానిలము పక్షీ! సేయు దాక్షిణ్యమున్?

32


క.

నెలనెల దప్పక యుండఁగ
నెల భాస్కరుఁ జొచ్చు టెల్ల నియమముతోడన్
గలహంస వేఁడివెన్నెల
సొలయక నాయంగకములు సూఁడుటకుజుమీ.

33


ఉ.

మోహము దాహమున్ మదికి మూఁడ్చుచు నున్నవి పాయవెప్డు సం
దేహము మీనకేతనునిదివ్యశరంబులు పువ్వుమొగ్గలో?
యూహ యొనర్పఁగాఁ బిడుగులొ? కులిశంబులొ? యట్ల! భారతీ
వాహకులావతంస! విషపల్లిసముద్భవముల్ ప్రసూనముల్.

34


హంస దమయంతికడకు దూతయై చనుట

వ.

కావునం దీరంబు లేనివిరహభారం బనుపారావారంబున మునుంగంబాఱుచున్న నాకుం దెప్పగా విరించి నిన్నుఁ గల్పించినాఁడు, మిముబోంట్లగు పెద్దలగుణంబులు పరార్థప్రవణంబులు గదా! పొమ్ము, కార్యము సాధింపుము, పునస్సమాగమంబయ్యెడు, నీవు వచ్చునంతకు నిచ్చోటన యుండుదుంజుమీ! చూతము గదా నీగమనవేగం! బని పల్కి యన్నీడజంబు వీడుకొల్ని క్రీడావనంబులో నొక్కనికుంజక్రోడంబునీడ నన్నరేంద్రుండు చంద్రకాంతశిలాతలం

బున విశ్రమించి రాయంచపలుకులు మనంబునం దలపోయుచుండె. గలహంసంబును నలుని వీడ్కొని భూమండలమండనాయితంబైన కుండిననగరంబుస కభిముఖంబై ప్రార్థనాసిద్ధిసూచకంబులగు ననుకూలగంధవాహాదినానావిధశుభనిమిత్తంబులను సంధించుచు నికషపాషాణపట్టనిభం బయిననభస్థలంబునం దసపసిండిఱెక్క లొరపెట్టుచందంబున నెందంబుగా ఝంకారితపతత్త్రధారావిహారంబుగ గోడివడి డిగ్గునప్పు డల దిగువ నున్నపతంగంబులు వడవడ వడంకుచు నొంటికంటఁ గనుంగొన నొక్కొక్కమాటు విధూతపక్షతియును నొక్కొక్కసారి యూర్ధ్వాయనదుర్విభావంబును నొక్కొక్కమాటు వితతీకృతనిశ్చలచ్ఛదగుచ్ఛంబును నగుచు వనంబులు గడచి శైలంబులు దాఁటి నదులు లంఘించి చని చని ముందట.

35


కుండిననగరవర్ణనము

ఉ.

అండజరాజు గాంచె లవణాంబుధివేష్టితమేదినీపధూ
కుండలమండనం బయినకుండినమున్ నిజకీర్తికల్పితా
ఖండలపట్టణప్రథితఖండనమున్ గ్రథకైశికేంద్రదో
ర్దండబలాభిగుప్తము సుదగ్రహిరణ్మయవప్రదీప్తమున్.

36


వ.

అప్పట్టణంబున కరిగి వప్రనదీప్రాకారంబు లగుప్రాకారంబులవలనను, నారసాతలగంభీరసలిలసంచారంబు లగుపరిఖాకూపారంబులవలనను, బ్రస్ఫుటస్ఫటికోపలవిగ్రహంబు లగుగృహంబులవలనను, శశిభిత్తివిమలభిత్తిసమత్సేధంబు లగుసౌధంబులవలనను, నింద్రనీలమణిచ్ఛాయాకల్పితాకాలకాలిక లగుచంద్రశాలికలవలనను, గేలీవిలోలబాలికాకుచ

లికుచఘుసృణపంకకషాయితాంభఃపూరంబు లగుకాసారంబులవలనను, ఘనఘనాఘనఘటాకఠోరఘర్ఘరధ్వానగోధూమఘరట్టంబు లగుహట్టంబులవలనను, అనిలచలచ్చేలాంచలదండతాడనావిహితహేళిహయాళీకాలనక్రియాదత్తామారువిశ్రాంతు లగుప్రాసాదవైజయంతులవలనను, నవవికచవివిధకుసుమవాసనాపేటిక లగులీలోద్యానవాటికలవలనను, బటీరకర్పూరకస్తూరికాకుంకుమదహిమాంబుప్రముఖ నిఖిలపరిమళవస్తువిస్తారసౌరభోద్గారసముత్పణంబులగు నాపణంబులవలనను, హావభావవిలాసవిభ్రమైకభాజనంబు లగువనితాజనంబులవలనను, జనవిజితమరత్కురంగంబు లగుతురంగంబులవలనను, అసమసమరవిజయకారణంబు లగువారణంబులవలనను, నభిరామంబై యక్కలహంసంబునకుఁ గౌతుకం బాపాదించె. వెండియు.

37


తే.

పరిఖ గుడివోల దనచుట్టు దిరిగి యుండఁ
బరుల కేరికి గ్రహణగోచరము గాక
విషధరాధీశభాషితవిషమభాష్య
ఫక్కికయుఁ బోలె నొప్పె నప్పట్టణంబు.

38


క.

నెలపొడుపుల సురనదిని
ర్మలతరతదగారకుట్టిమస్రవదిందూ
పలతుందిలాప యగుచుం
దెలి వొందుఁ బతివ్రతౌచితీసంపత్తిన్.

39


తే.

క్రుంగఁబాఱుసహస్రాంశుఁ గూడ లేక
వెనుకఁ జిక్కినజరదంశువితతివోలెఁ

బొలుచునపరాహ్ణవేళ నప్పురమునందు
భాసురాలేపకాశ్మీరపణ్యవీథి.

40


శా.

వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరిస్తవా
పాదబ్రహ్మముఖౌఘవిఘ్నతనవస్వర్గక్రియాకేళిచే
నాదిన్ గాధితనూజుచే సగము సేయం బడ్డమిన్నేఱు ప్రా
సాదస్వచ్ఛదుకూలకైతవమునం జాలంగ నొప్పుం బురిన్.

41


తే.

అమరు హాటకమయకవాటములతోడ
గురుతరం బైనయవ్వీటికోటగవను
కులిశధారకుఁ దప్పి ఱెక్కలును దాను
బయటఁ గొలు వున్నపసిడికొండయునుబోలె.

42


మహాస్రగ్ధర.

దమయంతీకేళిధాత్రీధరశిఖరహరిద్రత్నభాదర్భసందో
హ మజాండాఘాతభగ్నస్యదభవమదతావాప్తలజ్జావనమ్ర
త్వముమై నుత్తానగామర్త్యసురభివదనాంతఃస్థమై లిల నత్య
ర్థము గోగ్రాసప్రదానవ్రతసుకృతము తోరంబుగా వీటి కిచ్చున్.

43


వ.

ఇట్టి విచిత్రశోభావైభవంబులకుం బట్టైన యప్పట్టణంబు గలయం గనుంగొని పతంగపుంగవుండు కన్యాంతఃపురప్రదేశంబున నొక్కశృంగారవనంబులోన సఖీమధ్యంబునఁ దారకామధ్యంబున శీతాంశురేఖయుంబోలె నున్నయారాజపుత్త్రిని వీక్షించి యభ్రమండలంబుననుండి విభ్రమభ్రమణరయవికర్ణస్వర్ణమయపర్ణపాళీచ్ఛాయాపటలంబు దిక్కులఁ బిక్కటిల్ల మెఱుంగు మెఱసినచందంబునం గొఱివి ద్రిప్పిన

పోల్కి దమయంతీవదనచంద్రబింబంబు సేవింపం బని పూని వచ్చుపరివేషచక్రంబుచాడ్పున వలయాకారంబున నవతరించుచు నాకుంచితపక్షమూలంబును నివేశదేశాతతధూతపక్షంబునుంగా నాక్షణంబ వ్రాలిన.

44


రాజహంస దూత్యము

ఉ*.

దుందుభివాద్యనిస్వనముతోఁ దులఁదూగెడు పక్షనాద మం
దంద యతర్కితోపసతమై వినఁబడ్డ విహారలీలలం
జెంది పరాకునన్ మెలఁగు చిత్తము లుద్దవిడిం గలంగఁగా
నిందునిభాస్య లప్పుడు సమీక్షణ చేసిరి రాజహంసమున్.

45


వ.

అమ్మత్తకాశినులు దమచిత్తంబులు విముక్తతత్తత్విషయగ్రహణంబులై యాహంసంబునందుఁ బరబ్రహ్మంబునందునుం బోలె వర్తించుచుండం జూచుచుండిరి. విదర్భరాజుపట్టి తననెమ్మనంబునఁ బుట్టిన కౌతూహలంబుస నమ్మరాళంబుఁ బట్టం దలంచి యొయ్యనొయ్యన కదియ నేతెంచిన నజ్జాలపాదంబును నబ్బాలతలం పెఱింగి యెగసియం దప్పఁ గ్రుంకియు దాఁటుకొనియుఁ దనమీఁదవ్రాలు కేలుదోయియొడుపు దప్పించుకొనియెం గాంచనపత్త్రరథగ్రహణలీలావ్యవసాయంబు నిష్ఫలంబైన రాచూలిం జూచి చెలులు గలకలం జేసఱచి నగిరి హస్తతలతాళకోలాహలంబునం బులుఁగు బెదరించితిరి, దీన మీకు నేమి లాభం బయ్యె నని సఖీజనంబులం గనలి పలుకుచు మార్తాండు ననువర్తించు ఛాయాదేవియుంబోలె నిత్తోయజాక్షి, మానసౌకంబు వెనుకొని చనియె నన్నారీనివహంబుసు మేలంపుమాటలకైవడి హంసగమన హంసాభిముఖియైనయాత్రఁ బెద్దలు నిషేధింతురు

సుమీ యనుచు మందగతిం బిఱుందన యేతెంచె. నీడోద్భవంబును నచ్చేడియమందగమనవిలాసంబు పరిహాసంబునకై యనుకరించునదియునుంబోలె ముందటం జరియించుచుం జేయీక యీఁకలు ముగిఁడించుకొని యీఱంబైన యొక్కలతాగేహంబు దూఱె నట్లు దూఱిన వెలరువాఱి చేయునది లేక నిషేధజనితరోషనిరుద్ధాశేషనిజవయస్యయు నాత్మచ్ఛాయాద్వితీయయుఁ బ్రస్వేదాంభఃకణవిభూషితాంగియు నిశ్శ్వాసవేగకంపితస్తనభారయునై యూరకుండె నప్పు డయ్యండజంబు మనుష్యభాషణంబుల.

46


శా.

కాంతా! శైశవచాపలంబున లతాకాంతారవీథిం బరి
శ్రాంతిం బొందెద వేల? బేలవె? నను శక్యంబె పట్టంగ? నీ
వెంతే దవ్వుగ నేగుదెంచితి గదే! యేలమ్మ! నీబోటు లం
తంతం జిక్కిరి చిక్కకుందుదురె నీ వాక్షేపముల్ పల్కఁగన్.

47


ఉ.

ఆళియుఁబోలె నిప్పుడు వనాళియమార్గమునం జరించుని
న్నోలలితాంగి! కాదనుచు నుస్నది మందసమీరణంబునం
గ్రాలుప్రవాళమంజరుల గమ్మకరంబుల విభ్రమంబుగా
బాలరసాలపుష్పరసపాయి వనప్రియ కంఠహుంకృతిన్.

48


సీ.

నలినసంభవువాహనము వారువంబులు
        కులముసాములు మాకుఁ గువలయాక్షి!
చదలేటిబంగారుజలరుహంబులతూండ్లు*
        భోజనంబులు మాకుఁ బువ్వుఁబోణి!
సత్యలోకముదాక సకలలోకంబులు
        నాటపట్టులు మాకు నబ్జవదన!

మధురాక్షరము లైనమామాటలు వినంగ
        నమృతాంధసులు యోగ్యు లనుపమాంగి!


తే.

భారతీదేవి ముంజేతిపలుకుఁజిలుక
సమదగజయాన! సబ్రహ్మచారి మాకు
వేదశాస్త్రపురాణాదివిద్య లెల్లఁ
దరుణి! నీయాన ఘంటాపథంబు మాకు.

49


వ.

ఒక్కనాఁడు విధాత వినోదార్థంబు వాహ్యాళి వెడలి వచ్చునప్పుడు మాకులస్వాము లైనయతనిరథ్యంబులు శ్రమంబునన్ డీలుపడి యున్నం జూచి యేను విమానదండంబు కంఠంబున ధరియించి విరించిచేతం బారితోషికంబు వడసితి. నేను దివ్యతిర్యగ్జాతిని. మముబోంట్లు పాశాదికంబులం గట్టుపడుదురె గుణపాశంబులం గాక! భూలోకంబున రాజబృందారకులు కొందఱు గలరు, వారితోఁ జెలికారంబు వాటించి యుండుదు, విశేషించి యందు నిషధదేశాధీశ్వరుం డగునలుం డను రాజుమీఁద మిగులం బక్షపాతంబు గలిగి యుందు.

50


తే.

కనకశైలంబు డిగ్గి యాకాశసింధు
సలిలములఁ దోగి మిగులంగఁ జల్లనైన
చారుహాటకమయగరుచ్చామరముల
వీతు నతనికి వైశాఖవేళలందు.

51


మ.

రణకండూభరదుస్సహం బయినయా రాజస్యదేవేంద్రద
క్షిణబాహాగ్రమున జనించినమహాకీర్తిప్రవాహంబు గా
రణసంక్రాంతగుణానుషంగముననో ప్రస్ఫీతదిఙ్మత్తవా
రణగండస్థలకుంభకూలములతో రాయుం దివారాత్రముల్?

52

తే.

అతనిబాహాపరాక్రమం బభినుతింప
నలవియే పద్మజునకైన నబ్జవదన?
శాతతద్బాణధారాభుజంగభుక్తి
వైరిరాజప్రజీయాసుమారుతంబు.

53


చ.

వినుకలిఁ గూర్మిఁ జిక్కి పృథివీభువనంబునకుం డిగంగ నే
యనువును లేక రంభ యనునచ్చరలేమ నలున్ వరింపఁ బూ
నినతనకోర్కి నొక్కమెయి నిండఁగఁ జేయుటకై భజించెఁ దాఁ
గొనకొని వేల్పులందు సలకూబరుఁ దచ్ఛుభనానువాసనన్.

54


వ.

ఆరాజుకడం జనవు గలిగి వర్తింతు మఱియును.

55


మ.

స్మరవాత్స్యాయనకూచిమారకృతశాస్త్రగ్రంథసందర్భముల్
పరిశీలించినవాఁడ దంపతుల కుత్పాదింతు సారస్యముల్
మురిపెం బొప్పఁగ మందమందగమనంబుల్ నేర్పుదు న్మేదినీ
శ్వరశుద్ధాంతనితంబినీజనులకున్ సంపూర్ణచంద్రాననా!

56


వ.

భామినీజనంబులకు భావభవనవ్యాజ్ఞావిశ్వాసముద్రానిక్షేపభూమినై యుండుదు నన్నుఁ దివ్యజ్ఞాతిమాత్రంబుగాఁ దలంపవలదు, విరించివదనకమలవినిర్గతవివిధాస్త్రవాసనాపూర్ణకర్ణుండ నైనయేను సామాన్యుండనే! నన్నుం బనిగొమ్ము, ఈశరీరంబు పరోపకారార్థము గదా! పద్మాసనుని శిల్పప్రయాసంబు లక్ష్మీనారాయణులయెడలను గౌరీవృషభాంకులపట్టుననుంబోలె మీయెడల బరస్పరయోగ్యసమాగమంబునకు బాల్పడుంగాక! వేలాతిక్రాంతకాంతగుణాబ్ధివేణి వగునీవు నలునిపాణిపల్లవంబు పరిగ్రహింప నర్హురాలవు, కోమలంబగు మల్లికాముకుళదామంబు గర్కశం బగుకుశ

సూత్రంబునం గట్టఁ బాత్రంబుగాని తెఱంగున నిషధరాజుదక్క వేఱొక్కండు నిన్ను వరియింపం బాత్రుండు గాఁడు. మఱియు నొక్కవిశేషంబు.

57


చ.

అడిగితి నొక్కనాఁడు గమలాసనుతేరికి వారువంబనై
నడుచుచు 'నుర్విలో నిషధనాథుని కెవ్వతె యొక్కొ భార్య య
య్యెడు?' నని చక్రఘోషమున నించుకయించుక గానియంత యే
ర్పడ [3]వినఁ గాని నీ వనుచుఁ బల్కినచందము దోఁచె మానినీ!

58


ఉ.

నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి యెల్లి నేఁటిలోఁ
దూర్ణము సేయఁగాఁ గలఁడు తోయజసూతి, తదన్యథా వృథా
దుర్ణయవృత్తికిన్ మనసు దూర్చిన నేని జగజ్జనాపవా
దార్ణవ ముత్తరించుటకు నాతని కెయ్యది దెప్ప చెప్పుమా?

59


వ.

అనిన విని ముహూర్తమాత్రంబు చింతించి యాయింతి శకుంతవల్లభున కిట్లనియె.

60


తే.

బాల్యమునఁ జేసి యేను జాపలముఁ బూని
నిన్ను నాయాసపెట్టితి నిగ్రహమునఁ
దప్పుఁ జేసితి లోఁగొమ్ము దయ దలిర్ప
బ్రహ్మవాహనకులముఖ్య! పక్షిరాజ!

61


సీ.

దర్శనీయంబు నీతనువిలాసం బెప్డు
        నీమనం బత్యంతనిర్మలంబు
మధురాక్షరములు నీమహితభాషణములు
        కీర్తనీయంబు నీవర్తనంబు

ప్రౌఢియుక్తంబు నీప్రతిభావిశేషంబు
        కమనీయతరము నీకల్కితనము
శ్లాఘనీయంబు నీసౌహార్దగరిమంబు
        ప్రార్థనీయంబు నీప్రాభవంబు


ఆ.

మత్స్యమూర్తి యైనమధుకైటభారాతి
భాతి నీవు భువనపాననుఁడవు
నిండునెలయుఁ బోలె నేత్రోత్సవంబ వై
యున్నవాఁడ విట్టియొప్పు గలదె?


వ.

నామనోరథంబు కంఠపథంబున వర్తించుచున్నయది, ప్రజల లజ్జాభియోగంబును దుర్లభజనానురాగంబును సమస్రాధాన్యంబు సధిష్టించి యున్నయవి, యందనిమ్రాఁకులపండ్లు గోయం దలంచెద, రాజుఁ బాణిగ్రహణంబున వశీకరింపం గోరెద, బాల్యచాపలంబున బేలనై యున్నదాన నని సాభిప్రాయంబుగాఁ బలికె నప్పుడు.

63


తే.

రమణి మందాక్షమందాక్షరంబు గాఁగఁ
బరిమితోక్తుల నిబ్భంగిఁ బలుగుటయును
సంశయాళువై హంసవతంసితంబు
హృదయమున నొయ్యఁ జింతించి యిట్టు లనియె.

64


వ.

ఓరాజవదన! రాజపాణిగ్రహణంబు దృష్టాంతీకరించి పలికిన నీసుభాషితంబులకు నర్థం బెయ్యది? యంతిమవర్ణంబునకు వేదవర్ణంబునుంబోలె నయ్యర్థంబు నావీనులు ప్రవేశింప నర్హంబు గాదె! తిర్యగ్జాత నైయుండియు మాయేలిక నాళీకభవునియాన, యేను జన్మించినయది యాదిగా నెన్నండును మృషాభాషణంబులు వలుక, సత్యంబు పలుకుదుం,

బలికిన ప్రయోజనంబు సాధింతు, లోకాలోకపర్యంతం బైనథాత్రీమండలంబునందు నీ వెయ్యది యపేక్షించితి వప్పదార్థంబు గొని వచ్చి నీకు సమర్పింపంజాలుదుఁ, గందర్పాకారు లైనరాకుమారు లెల్లరు నాకు వశవర్తులై యుండుదురు, విశేషించి యన్నిషధభూవల్లభుండు నన్నుం మన్నించి యుండు.

65


సీ.

అతఁడు పాణిగ్రహణార్హుండు విను నీకు
        నతనిఁ గూర్పఁగ నేర్తు నతివ! యేను
పిన్నపాపపు నీవు పితృపరాధీనవు
        కార్యనిర్ణయశక్తి గలదె నీకు?
నావల నిషధరా జఖిలలోకేశ్వరుం
        డీవలఁ బరమేష్ఠిహితుఁడ నేను
సందేహడోలాధిశాయి యైనప్రసంగ
        మిప్పట్టునందు నే నెట్లొనర్తు?


తే.

[4]మొదల సంఘటియించినఁ బొంది కార్య
మవల విఘటించె నేని గౌరవము దప్పి
ప్రాణమై నన్ను రమ్ము పొమ్మను నృపాలు
నెదురఁ దల వంచికొనియుండ నెట్లు నేర్తు?

66


ఉ.

ఇప్పటినీతలంపు తెఱఁ గిట్టిద యౌ నిటమీఁద నెప్పుడే
చొప్పున నుండునో నిజము సుద్ది యెఱుంగము గాని యుగ్మలీ!

చెప్పెడి దేమి! బాలికలచిత్తము లంబుతరంగలోలముల్
తప్పునొ తాఁకునో కుసుమధన్వునియేటులు దైవికంబుగన్!

67


వ.

శంకాకళంకితం బయినయివ్విషయంబునందు బ్రామాఁణికుండ నై యేను వర్తింప నంగీకరింపం గాని వేఱొక్కకార్యంబునకు నన్ను నియోగింపుము, దుర్ఘటం బయిన నది
సంఘటించెద, నని పలికిన నాపతత్త్రిపుంగవువకు ధాత్రీపురుహూతపుత్త్రి యిట్లనియె.

68


దమయంతి నలునిఁ దక్క నన్యుని వరియించ ననుట

తే.

నిషధభూపాలు వొల్ల కే నృపతి నొరుని
నభిలషించితినేని హంసాగ్రగణ్య!
యామవతి చంద్రు నొల్లక యన్యు నొకని
నభిలషింపంగ నోంకార మాచరించు.

69


తే.

అబ్జినీమానసానురాగాభివృద్ధి
యర్కసంపర్కమునఁ దక్కనగునె యొంట?
నలుని దక్కంగ నొరుని నేఁ దలఁతు నెట్లు?
విడువు సందేహమోహంబు విహగరాజ!

70


తే*.

అనలసంబంధవాంఛ నా కగున యేని
ననలసంబంధవాంఛ నా కగును జూవె!
చాలు సందేహవక్రభాషణము లింకఁ
దరళ! చకకాంగ ! పాథఃపతంగశక్ర!

71


ఉ.

దివ్యఖగేంద్ర! నమ్మవు మది న్నను నీయెడ నాకు విప్రలం
భవ్యవహారము న్నిలుపఁబట్టగ నేమి ఫలం? బశక్యశం

కవ్యభిచారహేతు వనఁ గల్గినమాటయ వేదవాక్యముల్
భవ్యవిచార! కా వనిన భావన సేయుము యెవ్వి వేదముల్?

72


తే.

తండ్రి నిషధాధిపతి కీక తక్కి యొరున
కీఁ దలంచిన నే విహగేంద్ర! వినుము.
దేహ మనలంబునకు నాహుతిగ నొనర్చి
యతనిఁ బొందంగఁ గందు జన్మాంతరమున.

73


శా.

తద్దాసీత్వపదంబు గైకొని కృతార్థత్వంబునం బొందుదుం
దద్దివ్యాంఘ్రిసరోజవందనవిధిం దాత్పర్యముం జెందుచుం
దద్దాక్షిణ్య మపేక్ష సేయుదు మదిం దత్సేవకుం జొత్తు నే
దద్దోరంతరపీఠిఁ జేరుతుఁ గుచద్వంద్వంబు నీసత్కృపన్.

74


తే.

అతనిఁ గోరుదు నే నంతరంగసీమ
నంత చింతామణికిఁ జింత యాచరింపఁ
పద్మముఖుఁ డైన యతఁడు నాపాలి కనఘ!
పెన్నిధానంబు మాటలు పెక్కు లేల?

75


తే.

వింటిఁ దద్గుణనికరంబు వీను లలరఁ
గంటి నాతని మోహసంక్రాంతి దిశలఁ
బోలఁ దలఁచితి నీరంధ్రబుద్ధిధారఁ
జాల వలచితి నతని కే సత్య మిదియ.

76


సీ.

ఆతనిఁ గూర్చి నాప్రాణంబు రక్షింపు
        మింతయు నీచేతి దేమి చెప్ప?
నాశ్రితసంరక్షణాభ్యుత్థితం బైన
        పరమపుణ్యంబు చేపట్టు మిపుడు
మిథ్యావిశంక యేమిటికిఁ! బాటింపుమీ
        యవలంబనంబు, సేయకు విలంబ

మనురాగజలధి వేలాంతర్వినిర్మగ్నఁ
        దెప్పవై ననుఁ జేర్పు తీరమునకు


తే. ధర్మపరులు వరాటికాదానమాత్ర
లాభమున కైన మెత్తు రుల్లములలోన
బ్రాణనాథప్రదానతత్పరుఁడ వైన
నిన్ను నేమని మెత్తునో? నిర్మలాత్మ!

77


చ.

మనమున లోకపాలు రెనమండ్రును మెచ్చఁ దృణీకరింతుఁ ద
క్కినసురకోటి, రాసుతులఁ గీడ్పడఁ జూచుటఁ జెప్ప నేటికిన్!
గొనకొని యానృపాలునకుఁ గూర్చుటకై శపథంబు చేసెద
న్ననవిలుకానిపాదనలినంబులపై రతిచన్నుదోయిపై.

78


క.

కార్య మి దకాలయాపన
స్థైర్యసహము గాదు చను ముదంచితగతి నో
యార్య! భవన్నయధౌరం
ధర్యము చూతము గదా! యుదాత్తస్ఫురణన్.

79


తే.

అతఁడు శుద్ధాంతగతుఁ డైనయపుడు నీవు
నాప్రసంగంబుసేఁత విన్ననువు గాదు
భామినీముఖదాక్షిణ్యబలిమికలిమి
నితరకాంత నిషేధించు నెవ్వఁ డైన.

80


ఉ.

నాగతి విన్నవించుట యనర్హము సుమ్ము నిజావరోధసం
భోగనిశాంతతృప్తుఁ డగుభూపతికిన్ సలిలంబు దప్పి వోఁ
ద్రాగినవారి కిం పగునె తన్పును దియ్యఁదనంబు వాసనా
యోగముఁ గల్గెనేని విహగోత్తమ! నిర్మలవారిపూరముల్.

81

తే*.

అధికరోషకషాయితస్వాంతుఁ డైన
నరపతికి విన్నవింపకు నాయవస్థ
బైత్యదోషోదయంబునఁ బరుస నైన
జిహ్వికకుఁ బంచదారయుఁ జేఁదుగాదె!

82


ఆ.

కదిసి నాతెఱంగు కార్యాంతరాసక్త
చిత్తుఁ డైనపతికిఁ జెప్పవలవ
దనపబోధనిద్ర యవమానముద్రకు
బ్రథమకారణంబు పక్షిరాజ!

83


వ.

కావున నవసరం బెఱింగి యాత్యంతికాసిద్ధి విలంబిసిద్ధుల యందు నీకు నెయ్యది శుభంబై తోఁచు నదియ చూచుకొనునది యని యప్పైదలి మదనోన్మాదంబునం జేసి లజ్జాభరం బుజ్జగించి కులకన్యాజనంబులకు నుచితంబులు గాని యతిప్రౌఢవచనంబులం బలికిన.

84


ఉ.

ఆపరమేష్ఠివాహనకులాగ్రణి భీమతనూజ మన్మథా
జ్ఞాపరతంత్రతన్ నలవశంపదమాససఁ గా నెఱింగి చం
చూపుటమౌనముద్రఁ దఱిఁ జూచి వినిద్రవివేకశాలి యు
ద్యాపన చేసెఁ గన్నుఁ గొనలందుఁ దొలంకఁగ మందహాసముల్.

85


సీ.

విను మింతి! యీయర్థమును ఘటింపగఁ జేయఁ
        బుష్పనారాచుండు పూఁటకాఁపు
సమరూపలావణ్యసౌందర్య మగుమిథు
        నంబు గూర్పకపోఁడు సలినభవుఁడు
నినుఁ జేరి నిషధనాథునియింద్రియములకు
        నిజదేవభూయంబు నివ్వటిల్లుఁ

గన్నులు చల్లఁగాఁ గనుఁగొందు నేను మి
        మ్మిరువుర దేవి దేవరనుఁబోలె


తే.

వీవు మారాజుపైఁ గూర్మి నిలుపు గలిగి
చిత్త మఱ సేయకున్నట్లు చెప్పి లిపుడు
వినుము నీవును నతనినెమ్మనమునందు
గలుగు నీమీఁదిప్రేమంబు నలినవదన!

86


తే.

వెలఁది! సంకల్పసోపానవితతియందు
నతఁడు సూడంగ సంచరిం తహరహంబు
ధరణిపుఁడు దీర్ఘనిశ్శ్వాసభరము నించు
నద్భుతము గాదె మీచంద మరసిచూడ?

87


తే.

హంసతూలికాతల్పంబునందు మేనుఁ
జేర్పినప్పుడు నేత్రరాజీవయుగముఁ
జేరి చుంబించి మోహింపఁజేయ నతని
వతివ నిద్రయు నీవు నే మౌదురొక్కొ?

88


వ.

బాల! యాలేఖ్యమయభవన్మూర్తిసౌందర్యసందర్శనలాలసుండును నశ్రుధారాధౌతదీర్ఘలోచనుండును నిశ్శ్వాసపరంపరాసంపాతపరిమ్లానపాటలాధరుండునుఁ బ్రవాళశయ్యాశరణకమ్రశరీరుండును మదనదాహజ్వరారంభకంపితస్వాంతుండును నయి, విప్రలంభవేదనావికారంబున నకాండహాసంబును నకారణభయంబును ననవసరసముత్థానసంభ్రమంబును నలక్ష్యప్రేక్షణంబును నప్రతివచనవాగారంభణంబునుం గలిగి యార్తిధారాప్రవాహంబున మూర్ఛాంధకారపంకంబున మునుంగుచున్నవాఁడు, భవత్ప్రాపకం బైనదోషంబునకు వెఱవఁడు. దాస్యంబున కైన లజ్జింపడు.

89

చ*.

మదనుఁడు రెండుచేతులను మార్పడ నేయఁగఁ దూపు లైదునుం
బది యయి వేఱువేఱఁ బరిపాటి నవస్థలు సంపుటింపఁగాఁ
దుదిదశ రాజనందు వెడదోచుచు నున్నది యేను వచ్చుచో
నది చిగురాకుఁబోణి యట నంబరపుష్పవికాస మయ్యెడిన్.

90


వ.

మదనశరవేదనాదూయమానమానసుం డైన యతండు పుత్తేర నీసమ్ముఖంబునకు వచ్చితి. నీచిత్తంబులోని భావంబు నెఱింగితి.

91


తే*.

తరుణి! వైదర్భి! నీ వెట్టి ధన్యవొక్కొ
భావహావవిలాసవిశ్రమనిరూఢిఁ
గౌముదీలక్ష్మి యప్పాలకడలివోలె
నదురఁ జేసితి నిషధరాజంతవాని.

92


వ.

చంద్రుఁడునుఁ జంద్రికయుఁబోలెఁ బువ్వునుం దావియుం బోలె రసంబును భావంబునుఁబోలె నవినాభావసంబంధంబున నతండు నీవును నన్యోన్యప్రేమానుబంధంబున ధన్యత్వంబు నొందుండు. బాణిద్వయంబుచేతం బల్లవితంబును మందస్మితంబుచేతం గోరకితంబును శరీరసౌకుమార్యంబుచేతం బుష్పితంబును గుచభరంబుచేత ఫలితంబును నైనభవన్మూర్తికల్పపాదపంబునకు నృపతినందనుండు నందనోద్యానం బయ్యెడుం గాక మఱియును.

93


తే.

మహితబంధాఢ్యరతికేళిమల్లయుద్ధ
సమయములయందు దివి మరుత్సముదయంబు
గుసుమవర్షంబు మీమీఁదఁ గురియుఁగాక
వనజదళనేత్రి! శృంగారవనములోన.

94

చ.

నెలఁతుక ! యానృపాలునకు నీకుఁ బరస్పరసంగమంబునం
గలయఁగ డాసి మానసయుగంబు వికాసము నొందుఁగాక పూ
విలుతుని దేహయష్టిఁ బ్రభవింపఁగఁ జేయ సమర్థమైన ని
ర్మలపరమాణుయుగ్మకముమాడ్కిని దైవమనోనుకూలతన్.

95


శా.

గ్రీవాలంకృతిపట్టసూత్రలతికాశ్రీకారరేఖాంకితన్
దేవీ! యవ్రణవంశసంభవగుణాన్వీత న్నినుం గాయజుం
డావిర్భూతరతిం ధనుర్లతికఁ గా నంగీకరించుం బలే!
పూవింట న్నిషధాధినాథు గెలువుం బూనంగ రాకుండుటన్.

96


తే.

తరుణి! నతనాభిమండలోదంచనాభి
రామరోమావళీజ్యావిరాజమాన
నీదుతను పుండవిలు సేసి నెఱకు లేయు
రతివరుఁడు హారగుళికల రాజహంసు.

97


హంస దమయంతి వీడ్కొని నలునకు దూత్యసిద్ధిం దెల్పుట

వ.

అని పలికి వీరె సఖులు వచ్చుచున్న వారు, మంత్రరహస్యంబులు బయలుపడ కుండవలయు, నన్ను వీడుకొల్పు, పోయివచ్చెద నని తదనుమతి వడసి గగనమార్గంబున నిషధాధిపరాజధానికి నభిముఖుండై చనియె నప్పుడు.

98


మ.

మరువాలారుశరంబులం దొరఁగుకమ్మందేనెతోఁ గూడి య
య్యరవిందాక్షికిఁ బక్షిపుంగవగవీహయ్యంగవీనంబు ని
ర్భరహర్షంబు నొనర్చె మున్ను రుచిసౌరభ్యంబునం బిమ్మటన్
మురియుం ద్రోయుచు నూన్చె నెమ్మనమునన్ మూర్ఛాసముచ్ఛ్రాయమున్.

99

తే*.

ప్రాణబాంధవుఁ డైనయప్పక్షిరాజు
నభ్రమార్గంబునం దొయ్య ననుచరింప,
నశ్రుధారాప్రవాహంబయవధి గాఁగ
దైన్య మందుచు మరలె వైదర్భిచూడ్కి.

100


వ.

ఇవ్విధంబునఁ బక్షవిక్షేపభేదసూచితనిజకార్యప్రయోజనసద్భావుం డై యమ్మహానుభావుఁడు దనరాక కెదురుసూచుచుం దటాకప్రాంతకేళీవనాంతరంబున నశోకానోకహచ్ఛాయాశీతలశిలాతలంబున నుపవిష్టుం డైననిషధరాజుం గనుంగొని తనపోయివచ్చిన వృత్తాంతం బంతయు నెఱింగించిన ముదితస్వాంతుండై.

101


మ.

పరసత్వంబు నిగూఢకార్యఘటనాచాతుర్యసంపత్తియుం
బురుషార్థైకపరాయణత్వమును నభ్యుత్థానలీలాధురం
ధరతాప్రౌఢియునుం గృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్
సరసీజాసనవాహనావ్వయవతంసా! హంస! నీకందముల్.

102


క.

పరవతి యగుదమయంతిని
ధరణీధవకన్య నల్పతారుణ్యసఖీ
పరివార మెఱుఁగ కుండఁగఁ
బరిచిత నిమిషమునఁ జేయఁ బరులకు వసమే?

103


వ.

అని గారవించి.

104


శా*.

ఏమేమీ! యని విన్నమాటయ వినున్ వీక్షించునెమ్మోము సాం
ద్రామోదంబునఁ బక్షముల్ నివురు హస్తాంభోజయుగ్మంబునన్
భామారత్నమురూపసంపదఁ దగన్ భావించు నానందమృ

ద్వీమత్తుం డయి చొక్కుఁ జిత్తమునఁ బృథ్వీనాయకుం డెంతయున్.

105


హంస నలుని వీడ్కొని సత్యలోకంబున కేగుట

వ.

ఇవ్విధంబున నానందరసమగ్నుండై యన్నరేంద్రుం గనుంగొని విహంగపుంగవుండు కార్యంబు సంఘటితం బయ్యె, నింక నాకుం బంకజాసనునకుం బరిచర్య చేయం బోవలయు
నని పలికి యతనిచేత సముచితప్రకారంబు వీడుకోలు వడసి యమ్మానసౌకంబు బ్రహలోకంబునకుం జనియె. నప్పుడు.

106


తే.

నిషధభూవల్లభుం డాత్మ నిండియున్న
కౌతుకంబు ప్రకాశంబు గాకయుండ
వనము వెలువడి పరివారజనులు గొలువ
వచ్చెఁ గ్రమ్మఱ నాత్మనివాసమునకు.

107


వ.

వచ్చి విదర్భరాజకన్యావియోగవిహ్వలుం డగుచుఁ గాలంబు గడపుచుండె. నంత నక్కడ.

108


దమయంతీవిరహవర్ణనము

చ.

నలవసుధాకళత్రునిగుణంబె గుణంబుగ సారసౌరభా
కలికతదీయకీర్తికలికామయ మైనశరాసనంబునన్
విలసితసౌమనస్యపదవీరుచిరం బగుతద్విలాసమున్
ములికగఁ జేసి మన్మథుఁడు ముద్దియ నేయఁదొడంగె నెవ్వడిన్.

109


తే.

అతనుతాపజ్వరంబు మై నమరియుండఁ
జపలలోచన ప్రియకథాసరసిఁ దేలె
నాయపథ్యంబునన కదా యంతకంత
కలరుఁబోణికి సంతాప మతిశయిల్లె.

110

తే.

కమలనేత్రత కవస్థానవిముఖ మైన
చంచలత్వంబు మదిఁ బ్రకాశించుచుండె
బాల యాలీల యభ్యసింపంగఁ బోలు
రమణదూతపతంగశక్రంబుతోడ.

111


ఉ.

బాలిక చెక్కుటద్దములపజ్జలఁ గోమలమందహాసరే
ఖాలవ మంకురింపదు వికాసము చాలదు నెమ్మనంబునన్
వాలిక మించుఁ గన్గొనలవాకిట నల్లన సంచరింపనుం
జాలక చాల గుంటువడెఁ జారునిరీక్షణఖంజరీటముల్.

112


సీ.

అతివ సమ్ముఖవస్తు వగువస్తువును గాన
        దాత్మ యంతర్ముఖం బౌటఁ జేసి
చెలువ క్రొమ్మించు లేఁజెక్కుటద్దం బొయ్య
        బాణిపల్లవశయ్యఁ బవ్వళించెఁ
గోమలినిట్టూర్పుక్రొవ్వేఁడి నెత్తావి
        మొకరితేంట్లును మూతిముట్ట వెఱచెఁ
దరుణిలోచనబాష్పధారాలవంబులు
        ముత్యాలసరులతో ముద్దుగురిసెఁ


తే.

జామ శరకాండపాండిమచ్ఛాయ నొందె
బోటిమది కింపు గాదయ్యె నాటపాట
మృగవిలోచన కంతంత మేను డస్సె
నంతకంతకు సంతాప మతిశయిల్లె.

113


చ.

ఉదితమనోనురాగదహనోష్ణభరంబున నాలతాంగికిన్
హృదయమునందు జొబ్బిలి వహించినచందనకర్దమంబు బు
ద్భుదముల నీనెఁ గల్పితవిభూషణజాలమృణాళవల్లరీ
వదనములం దమందగతి వారక పిచ్చిలఁ జొచ్చె ఫేనముల్.

114

మ.

దశ లంతంతకు నెక్కఁగా విరహసంతాపాతిరేకంబునన్
శశిబింబాననకుం దమస్వనకుఁ గార్శ్యం బొందె దేహం బహ
ర్నిశమున్ సాంద్రనిరంతరస్మృతిసమున్మేషంబునం గాంతకుం
దశదిగ్భిత్తులయందుఁ గానఁబడియెం దద్రూపచిత్రావళుల్.

115


తే.

చెలులు శిశిరోపచారముల్ సేయుపొంటెఁ
బ్రోవులిడ్డమృణాళకర్పూరవితతిఁ
గాంచి వైదర్భి మదిలోనఁ గళవళించె
జాలకాయాతచంద్రికాజాల మనుచు.

116


క.

బిసపన్నగభూషణయును
బ్రసవరజోభూతిమతియు బాండిమలక్ష్మి
వసతియు నై చూపెను సతి
యసమాయుధునకుఁ బినాకియాటోపంబున్.

117


తే.

మన్మథానలతాపంబు మాన్ప వేఁడి
డెందమునఁ జేర్పఁబూనిన కెందలిరులు
వెలఁది నిట్టూర్పుఁగాడ్పుల వెచ్చదాలి
బెరసి యరత్రోవయంద మర్మరము లయ్యె.

118


సీ.

చిగురుఁదామరపాకు జివ్వంచుఁ జనుదోయి
        మొదలు క్రొవ్వేడిని ముణుఁగఁబాఱెఁ!
దరుణరంభాగర్భదళతాళవృంతంబు
        పైగాలివెక్కన పలుకఁబాఱె
లలితముక్తాహారగుళికాకలాపంబు
        ఘ్రాణానిలంబునఁ గందఁబాఱెఁ
గర్ణపూరకలాపకల్హారదళరాజి
        యశ్రుధారల నురియంగ బాఱె

తే.

దర్ప మొలయ నాలీఢపాదమున నిల్చి
మండలీకృతచాపుఁడై మన్మథుండు
గనలి సవ్యాపసవ్యమార్గములఁ దొడిగి
పువ్వుఁదూపులు పుంఖానుపుంఖ మేయ.

119


వ.

ఇవ్విధంబునం బ్రతిపచ్చంద్రరేఖయుంబోలెఁ గళామాత్రావశేషయై విషమశరళరాశీవిషవిషవేదనాదూయమానమానస యగుచు శిశిరశైవాలపలాశగుచ్ఛంబులను సరసబిసకిసలయచ్ఛేదంబులను దుషారసలిలధారానేకంబులను గర్పూరపరాగపాళిసముద్ధూళనంబులను జందనచర్చామచర్చికాక్షాళనంబులను చంద్రకాంతశిలాతల్పంబులను గదళీదళతాళవృంతసంతానంబులను వాసరంబులు గడపుచు నొక్కఁడు విభావరీసమయంబునఁ గేళిసౌధమణిచంద్రశాలాప్రదేశంబున సఖీజనులు పరివేష్టించి యుండ నిండుచందురుం జూచి వైదర్భి యుపాలంభగర్భంబుగా నిట్లనియె.

120


చంద్రదూషణము

ఉ*.

హాలహలద్వయంబు గలశాంబుధిఁ బుట్టె వినీలపాండుర
జ్వాలలతోడి నందొకవిషం బొకవేలుపు మ్రింగె నెందఱో
వేలుపు లోలిమై ననుభవించిన రెండవయీవిషంబు ని
ర్మూలము గాకయున్నయది ముద్దియ! పాంథులపాప మెట్టిదో?

121


సీ.

విరహిణీవధమహాదురితపంకకళంక
        కలుషితాత్మకుఁ డైనఖలుఁడు వీఁడె
కాలకూటకతోరకల్పాంతవహ్నికిఁ
        దోబుట్టు వైనఘాతుకుఁడు వీఁడె

చండదీధితికరజ్వాలమండలములోఁ
        బ్రోదిఁ బొందినమహోగ్రుండు వీఁడె
బాడబంబును దానుఁ బాథోధికుక్షిలో
        పరిపొత్తు మన్నదుర్జాతి వీఁడె


తే.

సైంహికేయనిశాతదంష్ట్రావిటంక
విషరసప్రతిపాకభావితుఁడు వీఁడె
గగన మనురుద్రభూమి నేకతమ తిరుగు
నదరు లుమిసెడికొఱవిదయ్యంబు వీఁడె.

122


సీ.

జననకాలమునాఁడు జలరాశికుక్షిలోఁ
        దరిగొండ పొరివోవఁ దాఁకెనేని
గ్రహణవేళలయందు రాహు వాహారించి
        తృప్తిమై గఱ్ఱునఁ ద్రేఁచెనేని
విషమనేత్రుఁడు చేతివిష మారగించుచోఁ
        బ్రతిపాకముగఁ జేసి త్రావెనేవి
సపరపక్షము పేరి యపమృత్యుదేవత
        యొకమాటుగా నామ ముడిపెనేని


తే.

కుంభసంభవుఁ డబ్ధితోఁ గూడఁ గ్రోలి
తజ్జలముతోడ వెడలింపఁ దలఁపఁడేని
విరహిజను లింత పడుదురే వీనిచేత?
నక్కటా! దైవ మటు సేయదయ్యెఁ గాక.

123


తే.

ప్రాణసఖులార! వెన్నెల బయలి కిపుడు
మించుటద్దంబుఁ గోలయుఁ గొంచు రండు
చోరుఁ డలచంద్రుఁ డద్దంబు సొచ్చినపుడు
వంచనము లేక వ్రేయుఁడీ పొంచియుండి.

124

తే.

మనము గారానఁ బోషించి కనకపంజ
రమున నిడ్డ కేళీచకోరవ్రజంబు
వీనివెన్నెలఁ దెగఁ గ్రోలు గాని విడువు.
డొక్కగ్రుక్కన గుంభజుఁ డుదధిఁబోలె.

125


తే.

శ్రవణపూరతమాలపల్లవచయంబు
మేపుదము వీనిలో నున్నమృగశిశువున
కది ప్రవర్ధన మొందెనే ముదితలార
మండలం బెల్లఁ దానయై యుండుఁ గాని.

126


క.

రాహుగ్రహవదనగుహా
గేహాంతర్ధ్వాంతపటలకేళీరసకౌ
తూహలనవఖద్యోతం
బీహరిణాంకుండు వీని కేటికి వెఱవన్?

127


వ.

అని మఱియును.

128


మ.

అవతంసంబవు పార్వతీపతికి దుగ్ధాంభోధికిం గూర్మిప
ట్టివి బృందారకధేనుకల్పతరువాటీకౌస్తుభశ్రీసుధా
నవదిగ్వారణసోదరుండవు జగచ్ఛ్లాఘ్యుండ వీ విట్టినీ
కవునే ధర్మువు శోచ్యపాంథజనసంహారంబు తారాధిపా?

129


క.

చేయకుము చంద్ర! సుమన
స్సాయకునిం గూల విరహిజనపీడనమున్
వ్రేయకు మందంద పయ
స్తోయధివంశమున కపయశోడిండిమమున్.

130


వ.

అని బహుప్రకారంబుల.

131


తే.

ఇవ్విధంబునఁ గ్రథకైశికేంద్రతనయ
మదనవేదనదోదూయమాన యగుచు

బహువిధంబుల విధు దూఱి పలుకుచుండెఁ
దొడఁగి మధురంబుగా విధుంతుదునిఁ బొగడి.

132


వ.

అనంతరంబ.

133


మన్మథదూషణము

తే.

అంతరిక్షంబునం దతివ్యవహితుఁ డగు
నిందు నిందింపఁ గారణం బేమి నాకు?
నెమ్మనంబున యందు సన్నిహితుఁడైన
కంతుఁ బాపాత్ము నిందింతుఁగాక యనుచు.

134


చ.

ననవిలుగాఁడ మన్మథ! యనాథవధూవధపాతకంబు నిన్
గొని మునిఁగించెఁ గ్రూరహరకోపకటాక్షశిఖిస్వరూప మై
మనమున నీవు నిర్దయత మానవు చూడఁగ నేముహూర్తవే
ళను జనియించితో యకట! లచ్చికి నమ్మధుకైటభారికిన్.

135


తే.

కామ! పరమేష్టి నీమనఃక్రౌర్య మెఱిఁగి
పుష్పములు నీకు నాయుధమ్ములుగఁ జేసె
నవియు బహుళంబుగాఁ జేయ కైదె చేసె
నింతకైనను బ్రతుకునె యిజ్జగంబు?

136


ఉ.

రాక సుధాంశుమండలమురాకకు మాఱుమొగంబు సేయుచో
డీకొని వచ్చుదండధరదిక్పవమాన మదక్షిణం బవుం
గాక వియోగికిం గుసుమకార్ముకశృంగము వంగఁ జేయు నీ
యీకరపంకజాతము రతీశ్వర! దక్షిణ మైననాఁటికిన్.

137


సీ.

భువనమోహనసముద్భవ మైనయఘమున
        నశరీరభూతంబ వైతి మదన!
విరహమాలిన్యదుర్విధుఁ గాని సోకవు
        కలిదోషమవె నీవు కాయజుండ

ప్రాల్గలరతిదేవిభాగ్యసంపదఁ గదా
        ప్రసవసాయక! చచ్చి బ్రతికి తీవు
చాలదా! యేలెదు సకలప్రపంచంబు
        పంచత్వ మొందియుఁ బంచబాణ!


తే.

తమ్మిపూఁజూలి నీయాగ్రహ మ్మెఱింగి
లోక మవ్యాకులతఁ బొందుఁగాక యనుచుఁ
దక్కుఁగలకైదువులు మాని దర్పకుండు
విరులు నీకాయుధములు గావించినాఁడు.

138


వ.

అని పలికియు వైదర్భి లీలోద్యానంబునందు సరసరసాలకోమలకిసలయాస్వాదనకషాయకంఠకలకంఠకామినీకుహూకారుకోలాహలపంచమంబు వీతెంచిన నప్పల్లవాధరియుల్లంబు జల్లన నొల్లంబోయి మూర్ఛిల్లిన.

139


సఖులు దమయంతికి శిశిరోపచారములు సేయుట

ఉ*.

గొజ్జఁగినీరు సల్లె నొకకోమలి ద్రిప్పె లతాంగి యోర్తులా
మజ్జకతాలవృంత మొకమానిని చందనకర్దమంబునన్
మజ్జన మాచరించెఁ గుచమండలి నొక్కవధూటి యెంతయుం
బుజ్జన మొప్పఁ బాదములఁ బుప్పొడియొత్తె విదర్భకన్యకున్.

140


సీ.

పద్మిని! కన్నీరు పన్నీటఁ దుడువుము
        రంభాదళంబు సారంగి! వీవు
కల్పవల్లి! యొనర్పు కర్పూరతిలకంబు
        చక్రవాకి! యలందు చందనంబు
వలిపెంపుఁజెంగావివలువఁ గప్పు చకోరి!
        బిసకాండహారంబు వెట్టు హరిణి!

కలకంఠి! చేర్పు చెంగలువయెత్తు దలాడఁ
        కలి! పైఁ జిలికించు కమ్మఁదేనె


తే.

బాలశైవాలమంజరీజాలకంబు
లిందుమతి! యొత్తు మఱి చేతులందుఁ గదియ
నప్పళింపు మందారిక! యడుగులందు
జల్లగాఁ బుండరీకకింజల్కధూళి.

141


దమయంతీ స్వయంవరప్రకటనము

వ.

అని పలుకుచు సంభ్రమించుసఖీజనంబులకలకలం బాలించి యిది యేమి కోలాహలం బని భీమభూపాలుండు దేవీసహితుండై యడుగఁ దద్వయస్యాజనంబులు దా రెఱింగిన తెఱం గెల్లను విన్నవింప నన్నరనాథుండు ముద్దుగూఁతుమనోభిలాషంబునకు ననుకూలంబుగా జగంబునం దెల్ల స్వయంవరంబుఁ జాటింపం బంచిన.

142


తే.

సప్తసాగరపరివృతక్ష్మాతలమున
జాటఁబడియెను వాదిత్రసంయుతముగ
ధరణినాథకుమారహృద్ధైర్యహారి
భోజకన్యాస్వయంవరాభ్యుదయమహము.

143


ఆశ్వాసాంతములు

మ.

నవరత్నోపలదివ్యలింగవరదానప్రీతదాక్షాయణీ
ధవ! కర్పూరవసంతరాయ! యనవద్యద్వాదశీవాసరో
త్సవరుక్మాంగద! వేమభూపతిమహాసామ్రాజ్యరక్షామణీ!
యవనాధీశసభానిరంకుశవచోవ్యాపారపారంగతా!

144

క.

ఆచక్రవాళశైల
క్ష్మాచక్రమహామహీశకటకాస్థానీ
వాచాటచాటుకవితా
గోచరకీర్తిప్రతాప! కులమణిదీపా!

145


పృథ్వీవృత్తము.

చతుర్ముఖవిలాసినీశయవిలాసపంకేరుహ
స్రుతామృతమధూళికాసురభిసారసారస్వతా!
వితీర్ణిమహిమార్ణవా! విభవయోగసంక్రందనా!
ప్రతాపగుణభూషణా! పరిణతార్థసంభాషణా!

146


గద్య.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బయినశృంగారనైషధకావ్యంబునందు ద్వితీయాశ్వాసము.

  1. 'సహృదయంబును సుహృదుండు' పాఠాంతరము.
  2. 'సహృదయంబును సుహృదుండు' పాఠాంతరము.
  3. విననైతి
  4. తే. ‘మొదల సంఘటియించినపొందు పిదప, కార్య మఘటించెనేనియు ఘనతదప్పి’ అనియు, ‘మొదల సంఘటించినఁ బొంది పిదపనున్న, కార్య మఘటించె నేనియు ఘనత దప్పి’ అనియుఁ బాఠాంతరములు.