శుకసప్తతి/ప్రథమముద్రణపీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రథమముద్రణపీఠిక

ఈ గ్రంథకర్త పాలవేకరి కదిరీపతినాయకుఁడు. కృత్యాది పద్యములు దొరకనందున నిక్కవి కాలనిర్ణయాదుల కిచట ననువుపడలేదు. కదిరి రాజ్యమును బాలించిన ప్రభువు. ఈకదిరి యనునది నెల్లూరుమండలములోనిదని చారిత్రకులగు రావు బహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమయాంధ్రకవుల చరిత్రములో వ్రాసియున్నారు. మనకుఁ గడపజిల్లాలో నగపడుచున్నది. ఇక్కవికవిత్వము స్వభావసిద్ధములు సమయోచితములునగువర్ణనలతో క్రొత్తరుచులను బుట్టించుచుఁ బ్రౌఢమై హృదయంగమ మై యున్నది. సంస్కృతాంధ్రములు రెంటియందును సమానప్రజ్ఞ కలవాఁడు. హంసవింశతియందువలె నిందతిగా వర్ణించి యుండలేదు. కాని యవసరము కలిగినప్పుడు చమత్కారములను విడిచిపెట్టలేదు.

ఇప్పొత్తము మాకు మొదట పుదుక్కోటసంస్థానములోని పుస్తకభాండారమునుండి దివానుగారగు మహారాజ శ్రీ దివాన్ బహదరు సీలం రామదాసునాయుడు, బి. ఏ., బి. యల్ ., గారిచే దయాపూర్వకముగా నంపఁబడినది. ఆతాళపత్రగ్రంథము శిథిలమై యుండినందున శుద్దప్రతి తేలక మద్రాసు గవర్నమెంటు ఓరియంటల్ మాన్యూస్క్రిప్ట్సులైబ్రరీలో నున్నదాని కొకప్రతి వ్రాసి తెచ్చితిమి. అదియు నసంపూర్ణముగానే యున్నది. ఆప్రతి విద్వచ్చిరోమణియు భాషాభిమానియునగు సి. పి. బ్రౌనుదొరవారివలన వాయింపఁబడినది. అందు వార చ్చటచ్చట వ్రాసిన తమ యభిప్రాయముల నీ క్రింద నాంధ్రతాత్పర్యముతో నుదహరించి ఫలితార్థమును గ్రహింపుఁడని పాఠకులకు విన్నవించుచున్నారము.

"This Sukasaptati or Tales of the Parrot in Telugu, being a series of amorous tales. Twenty in number, the book not having been completed, this is very rare and merits publication, as abounding in common colloquial expressions.

This edition was prepared under my directions in the year 1831.”

(తా॥ ఈశుకసప్తతి లేక చిలుక చెప్పిన కథలు అనునవి తెనుఁగులోఁ గొన్ని చక్కని శృంగారకథలు, పుస్తకము పూర్తిగా లేదు. ఇవి యిరువదికథలు, సాధారణముగా వాడుకభాషలో వ్రాయఁబడినందున నిది యరుదైనదియు ముఖ్యముగా బ్రకటింపవలసినదియును. ఈ వ్రాఁతప్రతి నానియోగమువలన 1831 సం॥ న సిద్ధము చేయఁబడినది.)

మఱియొక తావున (గ్రంథాంతమున) నీ క్రిందిరీతిని వ్రాయఁబడియున్నది.

SUKASAPTATI.

A series of Telugu stories illustrating the various dialects of the Telugu language,

This valuable work is very rare indeed and I never met with a perfect copy. The present one has been collected with five manuscripts procured with difficulty in various parts of this peninsula.

Had it been composed in times when Telugu learning was patronized, it would have been better preserved; but the compositions of a dark age however valuable are seldom preserved with any care.

This book, "The Seventy Tales of the Parrot" has the same title with the well known Sanscrit composition of which, however, it is not a translation but an imitation. The work seems incomplete, the author not having finished the whole, it is perfect as far as it goes. (Thus there are not in fact 'Seventy' Tales.)

The discrepancies in the various manuscripts of the book are very great indeed, whole lines being substituted one for another. It will therefore be very difficult to select a pure text.

The Hamsa vimsati is a work of the same description and the close resemblance in many passages shows that one must have been borrowed from the other.

Since writing the foregoing remarks I have persuaded Zuluri Appayya, a very eminent Telugu scholar to revise and correct the work. He has done this very carefully and successfully. He considers it to be superior in style and good taste to the Hamsa vimsati which, however, contains a greater variety of words and technical phrases.

He objects however very justly to the title of the work and proposed to say the THIRTY Tales of the Parrot not the SEVENTY Tales, for the book was never completed.

I have since obtained another manuscript (1839) which contains some additional passages.

(తా॥ ఈశుకసప్తతి ఆంధ్రభాషావైలక్ష్మణ్యమును బ్రకటించు కథలుగల యొక తెలుఁగు గ్రంథము. ఈ యమూల్యగ్రంథముయొక్క ప్రతులు చాలనరుదు. నిండుప్రతి యెక్కడను నాకు దొరకలేదు. ఈదేశమునంగల యనేకస్థలములలోని యైదు వ్రాఁతప్రతులనుబట్టి యతికష్టముపై నీ ప్రతిని వ్రాయించినాను,

ఇది భాషకు రాజావలంబనము చక్కఁగఁ గలకాలములో వ్రాయఁబడియున్నయెడల భద్రముగాఁ గాపాడఁబడియుండును. అవలంబన లేని యిటీవలిదినములలో వ్రాయఁబడిన గ్రంథము లెంతవిలువగలవియైన జాగ్రత్త చేయఁబడియుండలేదు.

"శుకసక్తతి" యను పేరుగల ప్రసిద్ధగ్రంథ మొకటి సంస్కృతమునం గలదుగాని యాపేరునే యిదియుఁ గలిగి యున్నను దానికి భాషాంతరీకరణము మాత్రము గాదు. దాని ననుసరించి వ్రాయఁబడినది. ఈగ్రంథ మసమగ్రముగా గనఁబడుచున్నది. దీనింబట్టి చూడఁ గవియే దీనిని బూర్తి చేసినట్లు తోఁచదు. ఇందు డెబ్బదికథలు లేవు.

వివిధ ప్రతులలోఁ బరస్పరనిరోధములు చాలఁ గలవు. చరణములకుఁ జరణములే మార్పులుండుటచే నేది శుద్ధప్రతియో నిర్ణయించుట కష్టము.

హంసవింశతియును నిట్టి గ్రంథమే, చాలపద్యము లందు నిందును సరిపోలియుండుట చేత నొకదానిని గాంచి యొకటి వ్రాయఁబడిన ట్లెంచవలసియున్నది.

నే నీగ్రంథమును బరిప్కరించుటలో మిగులసమర్థతగల తెలుఁగుపండితుఁడగు శ్రీ జూలూరి అప్పయ్య గారిసహాయమును బొందియున్నాఁడను. అతఁడు మిగులజాగ్రత్తగను జయప్రదముగను నీ కార్యమును జరపినాఁడు. హంసవింశతిలో జాతీయపదములు విశేషముగా నీయఁబడియుండినను దానికంటె నీ గ్రంథమే రచనయందును మాధుర్యమునందును హెచ్చుగానున్న దని యాతఁడు తలంచుచున్నాఁడు.

అయినను నీ గ్రంథమున కీపేరు తగియుండ లేదని యాతఁడు తలంచియున్నాఁడు. అది సత్యము. దీనిని శుకసప్తతి యనుటకంటె శుకత్రింశతి యనఁదగునని నుడివినాఁడు. ఎందు చేతననఁగా గ్రంథము పూర్తి చేయఁబడి యుండ లేదు గనుక.

తెనుఁగులో శుకసప్తతియను నొకవచన కావ్య మంగడులలో దొరకునుగాని యిది దానినిబట్టి వ్రాసినపద్యకావ్యము కూడఁ గాదు.

1839సం॥ లో మఱికొన్ని యెక్కువ పద్యములుగల ప్రతి నొకదానిని సంపాదించినాఁడను.) అని దొరగారు వ్రాసి యున్నారు.

ఇంకను మఱికొన్నిపద్యములు వేఱొకప్రతిలో దొరకినను నవి తప్పులుకుప్పలును సందర్భహీనములునుగా నున్నవి. అవియైనను నాలగవయాశ్వాసము కడవఱకు లేవు. ఒక్కకథయైనఁ బూర్తికాలేదు. కావున నీ 4-వ యాశ్వాసములో 21 వ కథ కడకుఁ బూర్తిచేసి మొదటిభాగమని పేరిడితిమి. ఇందుఁ బెద్దకథలు 21 యును నుపకథలు తొమ్మిదియును గలసి ముప్పది కథలుగలవు. ఎక్కడనైన నెక్కుడుకథలుగలపుస్తకము దొరకినచో మాకుఁ బంపి యీకొఱఁత మావలనఁ దీర్పించి ఆంధ్రభాషకు మహోపకారముం గావింపఁ బాఠకులం గొనియాడుచున్నాము.

సుజనవిధేయుఁడు,

కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణరావు,

సరస్వతీపత్రికాధిపతి, కాకినాడ.