Jump to content

శుకసప్తతి/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి


ఉపోద్ఘాతము

కవికాలము

శృంగారకథలను శుకసప్తతియను పేరుతో, మనోహరమగు సుందరశైలితో, ఆహ్లాదకరమగు వర్ణనలతో, అడుగడుగునకు నవ్వించు సన్నివేశములతో, రచించిన యసాధారణ కవియగు కదిరీపతిని గురించి కాని యాతనిగ్రంథమునుగురించి కాని నేఁటివఱకు మనకు సమగ్రముగాఁ దెలియకుండుట యత్వంతవిచారకరము. ఇంచుమించు ౩౦౦ ఏండ్లక్రిందటిగ్రంథమే మసకు పూర్తిగా లభింపకపోవుట మన దురదృష్ట మనవలెను. ౧౯౦౯ లో మొదటిసారి దొరికినంతవఱకు ముద్రించినప్పుడు కృత్యాదిపద్యము లేవియు లభించియుండ లేదు. అట్టిసందర్భమందు ౧౯౨౧ లో నేను, మద్రాసులో ఇప్పటి ప్రధానన్యాయమూర్తులును, అప్పటి ఎఫ్. ఎల్, విద్యార్థులునునగు శ్రీపీ. వీ. రాజమన్నారుగారిసంపాదకత్వమున వెలువడు “కళ” యను మాసపత్రికలో శుకసప్తతిని గురించి వ్యాసము వ్రాసినప్పుడు ఆందలి కొన్నివర్ణనలనుబట్టి యా గ్రంథము క్రీ. శ. ౧౬౦౦౼౧౬౫౦ ప్రాంతమందు రచింపబడినదని వ్రాసియుంటిని. గ్రంథములో పరంగివారు, ఇంగిలీసులు, వారి "ముఖాములు” మున్నగునవి పేర్కొనబడినందున ఇంగ్లీషువారు. క్రీ.శ.౧౬౦౦ నుండియే మన దేశముస వ్యాపార మారంభించియుండినందున కవికాలము నావిధముగా నిర్ణయించియుంటిని. తర్వాత వావిళ్ల వారిముద్రణము 1935 లో వచ్చెను. అందు వారు కృత్యాదిపద్యములను ముద్రించిరి. వాటిని చదివినతర్వాత నేను కళలో నిర్ణయించినకాలమందు మార్పేమియు నవసరము కాలేదు. నా మొదటినిర్ణయమే స్థిరపడినది. ఇతనివంశము వారందరును విజయనగరసామ్రాజ్యముతో శ్రీకృష్ణదేవరాయల కాలమునుండియు సంబంధముకలవారై సేనల కధిపతులై చక్రవర్తులచే బిరుదులందినవారై యుండిరి. పెదయౌబళరాజు “సమ గ్రమహాహవోగ్రసప్తతిసహస్రచాపభృత్సైన్యజితమదాహితేంద్రుండు." ఇది అతిశయోక్తియో లేక సహజోక్తియో తెలియదు. కరె మాణిక్యరాజు "రామరాయ క్షమావరదత్త బిరుదాంకుఁడు.” రామరాజు "శ్రీరంగరాయదత్తమత్స్యమకరధ్వజాఢ్యుఁడు." మఱి శుకసప్తతిక ర్తయగు కదిరీపతి కేవల మాకులపై గంటము త్రిప్పినవాడు కాఁడు. అహితులపై కఠారినికూడ ప్రశంసాపాత్రముగాఁ ద్రిప్పినట్టివాఁడు.

ఈకవికుల మెట్టిదో స్పష్టముగా లేదు. ఇతడు చంద్రవంశపుక్షత్రియుఁడైనట్లు తానే తెలుపుకొన్నాడు. రాజపదాంతనాములగుటచేత "రాచవారు” అనుకులము వారై యుందురు. వీరు అళియరామరాజు లేక శ్రీరంగరాయల వంశమువారైనట్లు తెలుపుకొనలేదు. ఆరాజులవద్ద సేనానులుగా నుండినట్లుమాత్రమే తెలుపుకొన్నారు.

ఱంకుబొంకుల ముచ్చట

మనదురదృష్టము చేత శుకసప్తతి పూర్తిప్రతి యింతవఱకు దొరకియుండలేదు, ఆంధ్రభాషోద్ధారకులగు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారికృషి ఫలితముగా నిప్పు డించుమించు సమగ్రముగా శుకసప్తతి లభించినది. అందుకు శ్రీ శాస్త్రిగారికి ఆంధ్రలోకము కృతజ్ఞతాబద్దమైనది. ఇదివరలో ముద్రితమైన ప్రతిలో ఉపకథలతో సయితము మొత్తము 31 కథలుకలవు. వీటికి 45 రాత్రులుపట్టినట్లు లెక్కించిన తెలియవచ్చెడి. ఎటుచూచినను 70 సంఖ్య పూర్తికాలేదు. నాల్గవయాశ్వాసములో 127 పద్యములే లభించియుండెను. ఇప్పుడు నాల్గవయాశ్వాసము ఇంచుమించు పూర్తిగా లభించినది. 70 రాత్రులవఱకు కథ పెరిగినది. దీనినిఁబట్టి సప్తతియనిన 70 కథలు కాదనియు 70 రాత్రులని స్పష్టమైనది.

ఈశుకప్తతికథలు ఱంకుపోయి బొంకాడినకథలనియు, అందుచేత స్త్రీలు బాలురు, శిష్టులు, చదువరానట్టివనియు, ఇట్టి పచ్చిశృంగారము గర్హ్యమనియు తెనుఁగుసాహిత్యచరిత్రకారులు, విమర్శకులు, ఆక్షేపించుచు వచ్చినారు. ఇది విచారకరము, ఈకథలలో 1వ, 4వ, 11వ, 15వ, 20వ కథలో మొదటి యుపకథ, అయిదవ యుపకథ, ఆఱవ యుపకథ, మొత్త మేడుకథలు ఱంకుబొంకులు లేనివై శిష్టులు చదువదగినవైయున్నవి. అట్టివారికొఱకు వీటిని కృత్యాదిపద్యములతో జేర్చి వేరుగా శిష్ట ప్రతి నొకదానిని ముద్రింపవచ్చును. తక్కినకథలలో ఱంకుముచ్చట్లున్నను కవి యెచ్చటను నసహ్యమగునట్టి, లేక జుగుప్సాకరమగునట్టి, వర్ణనలను జేయ లేదు. శ్రీనాథుని శృంగారనైషధములో, హరవిలాసములో, సారంగు తమ్మయ వైజయంతీవిలాసములో, క్రీడాభిరామములో, కూచిమంచి తిమ్మకవికృతులలో, బహుప్రబంధకవుల సంభోగవర్ణనలలో నుండిన పచ్చిశృంగార మిందు లేనే లేదు.

ఱంకుబొంకు, పచ్చిపిచ్చిశృంగారము, నీతిబాహ్యత మున్నగుపదాలకుఁ గవితలో నెంతవఱకు హద్దుపద్దు లుండవచ్చును? ఆనువిషయమును గురించి బహుప్రాంతములలో చర్చలు జరిగినవి. మనతెనుఁగునందుమాత్ర మే యిట్టివి కలవని తలపరాదు. సంస్కృతములో బహుగ్రంథము లిట్టివి కలవు. అచ్చతెనుఁగులో నేది బూతగునో దానిని సంస్కృతములో స్పష్టముగా నుచ్చరించుట బహుపండితులకుఁ బరిపాటి, మరుగుమాటలకు సంస్కృతము సహాయపడుచున్నదన్నమాట. శిష్యుల కేవగింపు గలిగించు కవితలను మహాకవులు కొందఱు ప్రతిభాషలో కొంతయైనను వ్రాసిరి. ఇతరదేశములందును జనులనీతికి భంగముకలిగించునని కొన్ని గ్రంథములను నణచివేసిరి. కాని తత్ఫలితముగా వానికి ప్రచార మెక్కువై యవి మఱింతవ్యాప్తిలోనికివచ్చెను. ఇటలీదేశములో 'బొకాషియో' అను నతడు క్రీ. శ. 1353 లో అనగా 600 ఏండ్లకు పూర్వము 'డెకామెరన్' (దశదివసకథలు) అను పదిదినాలకథలను నూఱింటిని రచించెను. అవన్నియు శృంగారకథలే. ఈ 600 ఏండ్లలో ప్రపంచములోని ప్రసిద్ధరచనలు ఆ 'డెకామరన్'నుండి ఏర్పడినట్టివి. 1894లో అమెరికాలోని న్యూయార్కులో అవినీతివిధ్వంసకసంఘ మొకటి 'డెకామెరన్' పుస్తకాన్ని నిషేధించుటకై కృషి చేసెను. అప్పుడు న్యూయార్కునగర న్యాయమూర్తియగు ఓబ్రిన్ (O'Brien). ఇట్లు తీర్పు చెప్పెను. “ప్రపంచవిఖ్యాతిగన్న సాహిత్యము (classics) ను ఖండించుట సాధ్యము కాదు. షేక్ స్పియర్, చాజర్, లారెన్సుస్టరన్, ఇంకా యితర ప్రసిద్దాంగ్లరచయితలు కూడా నిషేదింపదగినవా రగుదురు. అన్నియు నట్లుండ బైబిల్ లోని పూర్వభాగములో (old testament) కావలసినన్ని బూతులున్నవి. అది ఇంటింట నుండు గ్రంథము” ఇంగ్లండులో అమెరికాకవియగు వాల్టు విట్మన్ కవితను ఫ్రెంచిరచయితయగు ఎమిలి జోలా రచనలను (ముఖ్యముగా 'నానా'యను నవలను) ఫ్లాబర్ట్ యొక్క మేడం బవరీ నవలను నిషేధింపఁజూచిరి. ఇప్పుడిప్పుడు అమెరికాలోని హార్వర్డు, కొలంబియా విద్యాపీఠాలలోను, కొన్ని కాలేజీలలోను, సాహిత్యవిజ్ఞానార్థమై 'డెకామరన్' పుస్తకాన్ని పాఠ్యగ్రంథముగా నిర్ణయించుచున్నారు. ఇట్టి డెకామరన్ లోని ఒక కథను పూర్తిగా పోలినట్టికథ శుకసప్తతిలో కలదు. డెకామరన్ లో పదవదినమందలి నాల్గవకథతో శుకసప్తతిలోని ఎనిమిదవకథ సరిపోలినది. డెకామరన్ లో ఏడవదివసపు పదికథలన్నియు కాముకులు చిక్కులలో నిరికి సమయస్ఫూర్తిచేఁ దప్పించుకొన్న శృంగారకథలు. అట్టి విధానముకలవే శుకసప్తతిలోని అత్యధికకథలు. శుకసప్తతికథలు ఱంకుపోయి బొంకాడినకథలని ప్రచారము మొదలైనతర్వాత అందఱును అదే ధోరణిలో పడిరి. ఈ గ్రంథమునుకాని, ఇందలి కొన్ని కథలనుగాని పాఠ్యగ్రంథాలలోని సంకలనములలో చేర్చరైరి. పిల్లలమఱ్ఱి పినవీరన, అయ్యలరాజు రామభద్రుఁడు, కూచిమంచి తిమ్మకవి, కంకంటి పాపరాజు, కుమ్మరి మొల్ల, గట్టు ప్రభువు, సంకుసాల రుద్రకవి, మున్నగువారి కిచ్చిన స్థాన మైనను కదిరీపతి కియ్యలేదు. యథార్థముగా ఉత్తమకవులశ్రేణిలో కదిరీపతి చేరునట్టివాఁడు.

శుకసప్తతికథలకు మూలము

తెనుఁగులో శుకసప్తతికథలు అను నొకవచనగ్రంథ మున్నది. దానినుండి కదిరీపతికవిత యేర్పడినదనికానీ, కదిరీపతికవిత కది వచనమనికాని చెప్పుటకు వీలులేదు. బహుశః అది యిటీవల రచింపఁబడినదై యుండును. పద్యకావ్యమునకు వచనగ్రంథమునకు చాల వ్యత్యాసమున్నది. సంస్కృతములో నొకశుకసప్తతికలదని మాత్ర మెరుగుదును. కాని దానిని చూడలేదు. దానిని చూచినపండితులు దానిపై నభిప్రాయ మీయవచ్చును. కథాసరిత్సాగరము ప్రపంచకథలకు మూల ఖని. దానినుండి కొన్ని శుకసప్తతికథ లేర్పడినవి. కథాసరిత్సాగరము (క. స.) లోని లంబకము 2 తరంగము 4 లోని లోహజంఘునికథ శుకసప్తతిలోని 17వకథను బోలినది. క. స. లోని లం-2, త-5 లోని పరివ్రాజికా కథ శు. స. లోని యాఱవకథను బోలినది. క.స. లోని లం-2. త-5 లోని శుక్తిమతికథ శు. స. లోని 14వ కథతో సరిపోలును, ఈ విధముగాఁ గొన్నికథలు కథాసరిత్సాగరమూలకములు, శుకసప్తతిలో విక్రమార్కునికి సంబంధించిన 10 కథలు కలవు. అవి విక్రమార్కునిపేర ప్రచారమందుండు కథలనుండి గహించియుండును. 'డెకామరన్'లోని యెంకకథ శుకసప్తతిలోని యొకకథను బోలిన దంటిని. దీనినిబట్టి యిట్టికథలు మనదేశమునుండి యూరోపుఖండములో నెంతోదూరమందుండు దేశములందును వ్యాపించెనని తెలియవచ్చెడి. సంస్కృతశుకసప్తతి నుండి క్రీ.శ. 18 వ శతాబ్దినుండి ఫార్సీలోనికి "తోటీ కథలు అనుపేరుతో తర్జుమా యయ్యెనందురు. దాని నుండి యూరోపుభాషలలోని కీకథ లనువదింపఁబడెను. ఒక యూరోపియన్ భాషలో నీకథలు (Tristan un Isolde) అను పేరుతో ననువదింపఁబడెనట! ఈ విషయమునుబట్టి క్రీ. శ. 1300 కు పూర్వమే మనదేశమందు సంస్కృతములో శుకసప్తతియుండెనని 'డెకామరన్' కథలకన్న ముందే మనకథలు వ్యాప్తిలో నుండెననియు, బహుశః సంస్కృతమూలమునుండియే కదిరీపతి కథావస్తువును మాత్రము గ్రహింపవలెననియుఁ జెప్పవచ్చును. కానీ కథలలోని పాత్రధారులందును తెనుఁగువారే. వారును కదిరీపతికాలమువారే! ఈవిధానమును కవి యవలంబించి మనకు మహోపకార మొనర్చినాఁడు. 'డెకామరన్' తర్వాత ఫ్రాన్సులో ‘హెప్టామరన్' అను శృంగారకథలు పుట్టెను. అవి కూడ యిట్టికథలే. ఆ ‘హెప్టామరన్'కుకూడ 'డెకామరన్'వలె అధికవ్యాప్తి కలిగెను. ఈవిధముగా పైకథలన్నియు శుకసప్తతికథల సబ్రహ్మచారులని యెఱుఁగవలెను.

శుకసప్తతిలోని విశిష్టతలు

1. శైలి:- శుకసప్తతిశైలి యందఱికిని యర్థమగునట్టిది. నిఘంట్వపేక్ష కలిగింపనట్టిది. అతిసరళము. అతిమధురము. కథ రమ్యముగా నడిపించుట కెట్టిభాష వాడవలెనో యట్టిదే వాడినాఁడు. మనము వచనములోసయిత మంతధారాళముగా వ్రాయజాలము. తెనుఁగులో ప్రబంధయుగమందు వ్రాసినకవితలన్నియు కఠినమగుశైలిలోను, ఉత్ప్రేక్షాతిశయోక్తులతోను, శబ్దాలంకారములతోను, ద్వ్యర్థులతోను, ఒకేవిధమగు నొకేసమయములతోను నిండినదై, ఆనందము నిచ్చుటకుమారుగాఁ గ్లేశము నిచ్చునట్టిదై యుండెను. ప్రబంధములకథలుకూడ కవి యొకధోరణిలోనివి. ఒకయూరును ఒక రాజు ఏలెను. అతఁడు వేటకుఁబోయెను. ఒక కన్యకను చూచెను.ఉభయులకు విరహతాప మయ్యెను. శైత్యోపచారములు జరిగెను. చచ్చునంతపనియై యెటులో యుభయులకు సమాగమమయ్యెను. వారి పెండ్లియు నిషేకమును నయ్యెను. ఇది కథ. మధ్యమధ్య నష్టాదశవర్ణనలు నింపుట. స్త్రీవర్ణన యొకేమాదిరిగా నుండుట. ఇదంతయు కవుల భావదౌర్బల్యమును, క్షీణదశను తెలుపునట్టిది. ఒకదిక్కున అప్పకవి యపూర్వనిబంధనలు చేయుచుండ నదేకాలమందు మరొక దిక్కు కదిరీపతి యానిబంధనలను తృణీకరించి స్వతంత్రుండై కబ్బమును రచించెను.

తెనుఁగులోఁ గథలు వ్రాసినవారు వ్రేళ్లమీఁదిలెక్కవారు. పింగళసూరన, మంచెన, వేంకటనాథుఁడు, జక్కన, కేతన, గోపరాజు, అన్నయ, కదరీపతి, అయ్యలరాజు నారాయణకవి కథలను వ్రాసినట్టివారు. వీరందఱును చక్కగా రచించినవారే. అందులో మంచెన, కేతన, కదిరీపతి రచనలే యుత్తమమైనట్టివి.

ఉ. కారుమెరుంగు రాచిలుక, కస్తురివీణ, పదారువన్నెలం
    గారము, రస్తుకుప్పె, తెలిగంబుర, వెన్నెలలోని తేట, యొ
    య్యారపుఁడెంకి, యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ, సిం
    గారపు దొంతి, యైనకులకాంత నయో యెడబాయనేర్తునే.(1 వ కథ)

అనుచో నచ్చతెనుఁగుపదాలకూర్పు నెంతసొగసుగాఁ గావించెనో గమనించుఁడు.

సీ. పా. మంజులద్రుమలతాకుంజపుంజస్థలీ
    ఘుటఘుటార్భటిలుఠత్కిటికులము(2వ కథ)

క. కుముదబిలంబను నొకపుర
    మమరు సురవ్యజనితధ్వజానీకమద
    భ్రమదప్రమదప్రమదా
    సుమదామకటాక్షజనితసూనశరంబై.(15 వ కథ)

ఇత్యాదులందలి సంస్కృతసమాసములకూ ర్పీకవి యుభయకవిమిత్రుఁడని తెలుపుచున్నది. చిత్రకళాపరిణతిఁ జెందిన చిత్రకారుఁడు తనకుంచెతో రేఖల గీసి రంగులనుంచి యెట్లు మనోహరదృశ్యముల మనయెదుటఁ బెట్టునో యటులే యీకవియుఁ గొన్నిసుందరానుగుణ్యపదములతోఁ దాను వర్ణించినవ్యక్తినిగాని వస్తువునుగాని మనయెదుట ప్రత్యక్షమగువట్లు చేయును. ఒకసిన్నది క్రమక్రముగా నెదిగి పెద్దదైనదనుటకు— "అంతనది యంతయై యింతయై వినూత్నపేశలాకారయై మించి పెండ్లి కెదుగ" అని సంగ్రహముగా చిత్రించి నిరూపించెను. ఇతర కవులైదు పద్యాలలో వ్రాసినను మనసులో హత్తుకొననిదృశ్యము నయిదు బిరుదములతో సరిపుచ్చినాఁడు. మేఘము కొద్దికొద్దిగా పెరిఁగి యాకాశమంతయు నిండుకొనుటను “అపు డొక్కించుక మబ్బు గానబడి యింతై, యంతయై, మించి, విష్ణుపదంబంతయు నాక్రమించి” అని మనోహరముగా చిత్రించి చూపించెను.

2. నుడికారము:--ఇతని శైలిలో జాతీయములు నిండుగాఁగలవు. ప్రాచీనులు జానుతెనుఁగున కుత్తమస్థాన మిచ్చిరి. ఈకవి కవితయంతయు జానుతెనుఁగే. తలవెఱ్ఱిగొని, పులిపులియయ్యె, నలినలియయ్యె, గులగులయయ్యె, తుకతుక, సవసవ, పిలపిల, కడుపుచుమ్మలుచుట్ట, పంటపగబట్టె, పుడకలు విరిచిన, చింతాకుముడుగుతరి, బుడిబుడియేడ్పు, తక్కులుతక్కు, కనకననిప్పులు, నీదుశౌర్యముగూలన్, బలబలవచ్చు, పొరపొచ్చెము, గాజుగడపికట్లు, గ్రుక్కుమిక్కనక, మెరమెరలు, కుంటిసుంకరి బెదరింపు, ప్రేగులోపలితీట, దట్టిగట్టు, తలతలమని, పదింబదిగ, నీళ్లునమలిన, లేదుబంతి, తలవాకిటకాఁపురమయ్యె, జోకలరేకల, ఇల్లుపట్టకతిరిగెడు, నేలమాలెలుద్రవ్వు, లోనలొటారము, ఇట్టి వెన్నని చూపవలెను. ప్రతిఫుటలో నిట్టివి నిండియున్నవి.

ఇతనికవితలో సామెతలకుఁగూడ కొదువ లేదు. నక్క గన్నవాఁడెల్ల వేఁటకాణడు, విపదిధైర్య మథాభ్యుదయే క్షమా, కంచంబుచెంత పిల్లికరణి, చనుమనుచుఁ ద్రోయ విస్తరి చినిగెడు నన్నట్లు, తిరుకొళములోనఁ బడినకోఁతిచందమున, దడి గరవబోవువేపిచందమున, కుంభంబుమీఁది పొట్టేలుక్రియన్, స్వామిద్రోహ మిదంభారం, తెగువయే దేవేంద్రపదవి, మగడొల్లని యాసతిని మారి యొల్ల దనంగన్, అడుగు వాసినచో నక్కర వాయు, ఇట్టిసామెత లెన్నియో యీకవితయం దిమిడియున్నవి.

3. హాస్యరసము:—సంస్కృతాంధ్రసాహిత్యశాస్త్రములందు హాస్యరసమును గురించి నిర్వచించినారు. కాని రెంటను హాస్యరసమునకు తగినరచనలు కానరావు. తిండిపోతు విదూషకుని చచ్చుమాటలు హాస్యజనకములు కాకపోయెను. బూతుమాటలతో వర్ణనలతో భాణాదులందు, చాటువులందు, హాస్యము నుత్పత్తి చేయఁజూచిరి. అది జుగుప్సగా మారెను. మొత్తము తెనుఁగువాఙ్మయములో కదిరీపతివలె చక్కనిహాస్యమును పోషించినకవియింకొకఁడు కానరాఁడు.

సీ. వలుదలై మెరయు పార్వణపుముద్దలవంటి
                వలిగుబ్బ లెన్నడు వచ్చికొందు
    ... ... .... ......
గీ. అనుచుఁ గోరుచు నవ్వుచు నాడికొనుచు
    సారె గేరుచు చూచినవారు వీని
    పుట్టు కిష్కింధలోను గాఁబోలు ననగ
    నాసుశర్మయు నాత్మగేహమున కరిగె.(14 వ కథ)

సీ. అవునషే నను వివాహము గమ్ము విద్వాంసు
                రాల వయ్యెదవు శీతాంశువదన...(4 వ కథ)

ఈపద్యాలలోఁ దేలికయగుహాస్యము కలదు.

క. కనుచాటుతిండి నడిపిన
    పనులం గండలును బెరిగి బకుతండ్రి, హిడిం
    బుని కొడుకన, గణనాథుఁడు
    ఘనబలమున బిరుదు జెట్టికైవడి మెలగున్.....(10 వ కథ)

గీ. దాని నుతియింప దరమానె, తాటకావ
    ధూటితల్లియొ, పూతనతోడబుట్టొ...(17 వ కథ)

ఇందలి యుపమానము లెంత చక్కగా నిమిడినవో గమనింపఁదగినవి.

క. తగిలించుకొన్న పిమ్మట
    నిగిలించుటె కాని కార్య మేమున్నది...(11 వ కథ)

ఉ. అక్కట పొట్టచించిన నొకక్షరమైనను రాదు పెక్కులుం
    డక్కులుగాని యమ్మనినడమ్మన నేరడు....(14 వ కథ)

సీ. "పోలిరెడ్డికి మగపోడిమి లేదుగా, గాది కేలాగున కడుపు నిక్కె?"
    “వదరకే మగవారు వచ్చెద రదె చక్క, జెక్కుకో పయ్యెద చెఱగుకొంగు"

    “ఓసి లేవే మల్లి! వేసాలు సేయకు, మగవార లెరుగనిమర్మ మెద్ది"
    “నీ కేటి సిబ్బతినెరరాగవై మించి, యడగదొక్కినదాన వత్త గారి”
    “పెద్ది! విన లేదె! మనసుబ్బు పెరటి గోడ
    దాటగా మామ గనె నట", "యేటి సుద్ది,
    యెసగి మగ డొల్లకున్న న దేమి సేయు,”
    ననుచు కసివోవ బలుమాట లాడికొనుచు.

(14వ కథ)

ఇట్టి సన్నివేశములందలిహాస్య మానందదాయక మైనది. ఒక స్త్రీ తనభర్తను పురికొల్పుటకై 'చిఱ్ఱుబుస్సనుచు నసూయాక్రాంతయై,

గీ. చట్టితోఁ జట్టి పగులంగఁ గొట్టి తనదు
    పదరులకు నింటిబలుకుక్క లదరికూయ
    నడరు భయమున గ్రుక్కుమిక్కనక వెనుక
    వెనుక కొదిగెడు తనప్రాణవిభుని జేరి.

ఇట్లనెను,

    "పొరుగింటి పద్మినీసతి, గిరుకుచు మట్టియలు గిలుకుగిలు కని నడువన్
    మెరమెరలు పుట్టవే కాఁ, పుర మేటికి మగఁడు పొట్టపోయకయున్నన్."

(20వ కథలో 1వ ఉపకథ )

“గిరుకుచు మట్టియలు గిలుకుగిలుకని నడవన్" అని చదువగానే యాస్త్రీ ప్రౌఢయనియు, ముత్తైదువయనియు, వయ్యారి యనియు, గల్లుగల్లుమని మట్టెలకలస్వనముతో మన సమీపమందే నడిచి వెళ్లిన ట్లనిపించకమానదు. కథాసన్నివేశములందు, వర్ణనలందు, ప్రతిపుటలో నుత్తమహాస్యమును నింపిన ఈకవిత మున తెనుఁగు సారస్వతములో క్రొత్త పద్ధతి!

4. లోకానుభవము:--కదిరీపతి లోకానుభవ మసదృశమైనది. అతఁడు తానువర్ణించువిషయములను సమగ్రముగా పరికించి గమనించి(keen observation) నట్టివాఁడు. ఒక యువతి తన భర్తతోఁ బుట్టినింటికి వెళ్లక యెన్నో యేండ్లయ్యెననియు తన తల్లిదండ్రుల యొక్కయు నన్న యొక్కయు గుర్తే మరిచితి ననియు రాత్రి పల్కుటను నరుగుపై పండిన తెరువరి విని మరునాఁ డామెయన్న నని చెప్పి యింటిలోనికిపోఁగా నాకులట తనభర్తను నమ్మించుటకై కృతకసోదరునితో నెన్ని మాటలు మాట్లాడెనో చూడుఁడు.--

సీ. మన యమ్మ కడుసుఖమ్మున నున్నదే, యయ్య, పెద్దవాఁడయ్యెగాఁ, బేర్మి నతని
    బోషింతురే మీరు పొరచూపు లేక నా, యరిది చెల్లెలి వచ్చి యత్తవారు
    తోడ్కొనిపోయిరే, దూరంబు గాన యే, వార్తయు వినము మావదినె నేక
    టని వింటి నే బిడ్డ గనియెనొ మగవాని, గనియెనో యది మేలుగాక యాడు
    దాననై పుట్టి మీము జూడ గాన కిట్టు
    లేను బడుపాటు చాలదా, యెన్నడైన
    దలతురా నన్ను మీరు డెందంబునందు
    నేల తలతురు, మరచిపోయితిరి నన్ను.

చ. చెలియలి పెండ్లి చేసితిరి, చిల్లరపబ్బము లెన్ని యైన శో
    భిలె నను నెన్నడైన బిలిపించితిరే పిలిపింపకున్న నే
    మలరెడుకూర్మినాఁడుపడు చాసపడుంగద యంచు పచ్చపో
    గులుగలచీర యంప నొనగూడకపోయెనె యేమి చెప్పుదున్.

గీ. ఇపుడు మీపుణ్యమున నాకు నేమికొదవ
    యుండె నేను ధరింపగా, నొకరి కీయ
    గలదులే యందులకు నంటగాదు మీద
    యాదాక్షిణ్య మిటువంటి దంటి నింతె.(15వ కథ)

ఆచతుర వచ్చినవాని నోరు తెరువనీయకయే మీఁదమీఁద ఇన్ని కొట్టిపెట్టినది! కవి వర్షర్తువును వర్ణించినా “గొంగడిముసుగుతో గొల్లలు చట్రాతిపై ని బందారాకుపరిచికొనగ" అనును. రాటమును వర్ణించినప్పుడు దానియంగాంగములన్నియు తెలుపును, మద్యపానమునకై వెళ్లువారు "తమ మునిచెరగులందు గాసుదుడ్డును బంగారుపూస వెండి తునక, మొదలింటిచిరువాడు గొనిన దెల్ల గొచుచు" వెళ్లిరనును. సంక్రాంతిని వర్ణించుచో “ఇంక నాల్గావంబు లిడనైతి గాయంచు గుమ్మరి నెమ్మది గుందికొనగ" అనును.

5. స్వాభావికవర్ణనలు:-కవిలోకానుభవము అతని వర్ణన లందంతటను వ్యక్తమగును. తనకథలలో కొరవంజిని, రెడ్డిని, తురకజవానును, చాకలిని, జెట్టిని, గోమటిని, పురోహితుని, గొల్లను, జోగురాలిని, బోగముదానిని మున్నగువారిని వారివ్యక్తిత్వమున కేలోపమును గావింపక వారిభూషణములను, వస్త్రములను, కట్టు, బొట్టు, వేషాదులను సమగ్రముగా వర్ణించి మనకు ప్రత్యక్షముగాఁ గనిపించునట్లు చేయును. కవికాలమందు తెనుఁగుదేశము గోలకొండ సుల్తానుల వశమయ్యను. అందుచే తెనుఁగుదేశమందు తుకజవానులు జనులను భయపెట్టి జీవించెడివారు. ఒక జవానును కవి యిట్లు వర్ణించెను.

సీ. మెలిపెట్టి చుట్టిన తెలిఫరంగిముడానుపై, లపేటాడబ్బుపనులు జెలఁగు
    బంగరువ్రాఁతలపట్టుహిజారు, కం, బరుచీనినిమతాని పాడు నొసలు
    తనుకాంతి గనుపింప దలిరు నంగీజోడు, వలిపెంపు శాలువ వల్లెవాటు
    బడుదలలోన డాబాకత్తివదలుపా, పోనులు గోరంట బొలుచుగోళ్లు
    నడుమసీలున్నతోలు డాల్బెడగుసూప
    నభయముగ వెంట నరుదెంచు నభరువాఁడు

    నమరు ముస్సైజుతేజుతో నరుగుదెంచె
    దారుణాకారు డైన యుద్దారుఁ డొకఁడు.

(14వ కథ.)

ప్రబంధకవుల నాయికానాయకులకు విరహతాపము వచ్చినవారు పడెడునవస్థ యింతంత కాదు. వారు చంద్రుని, వసంతుని, వాయువును, చెడదిట్టుదురు. చిగుగటాకులను, కమలపత్రములను, ఱేకులను, పన్నీటిని, తెప్పించుకొని వాటిపై పొరలాడుదురు. కోకిలలను, తుమ్మెదలను, రావించి చీవాట్లు పెట్టుదురు. కదిరీపతి నాయికానాయకులందఱును సాధారణజనులే. కావున వారివిరహతాపముకూడ సహజమైనట్టిది. ఒకపంచాంగపు బ్రాహణునికి విరహతాపము ముంచుకొనిరాగా నతనియవస్థ యిట్లుండేను.

సీ. ఒడిలోన పంచాంగ ముంచుకొన్నది గాన కెటుపోయె ననుచు నూరెల్ల వెదకు
    పని లేనిపని వీథి జనుచుఁ గ్రమ్మరు నాత్మగృహ మంచు నెంచి యిల్లిల్లు దూరు
    అపుడు భుక్తి యొనర్చి యపునషేసంకటితింటినా యని యింటితెరవ నడుగు
    కంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న, పొలుపు సారెకు దెల్పు నప్పుడమివేల్పు.

(14వ కథ.)

ఒక గొల్లభామకు విరహతాపము కలిగెను. ఆమె యి ట్లవస్థపడెను.

సీ. అదలించి పిదుకనియావు లుండగ వేగ, దోహనధేనువు దూడవిడుచు
    బానలోపల పచ్చిపాలుండ మించి చే, మిరియిడ్డపా ల్పొయిమీఁద బెట్టు
    పేరి పక్వంబైన పెరుగుండ గవ్వంబు, పులిచల్లలో నుంచి చిలుకబోవు.

(14వ కథ.)

ఈకవి శబ్దాలంకారములజోలికి పోలేదు. మారుమూలపదాలను వెదకెవెదకి వేయలేదు. ద్వ్యర్థులను బ్రయోగింప లేదు. అందందు వ్యాకరణవిరుద్దప్రయోగములున్నను నవి కవి తెలిసియే కావలెనని వాడినవే కావున వాటివల్ల కవితకు న్యూనతకలుగుట లేదు.

౬. సాంఘిక చరిత్ర ౼ ౩౦౦ ఏండ్ల కిందట మన యాంధ్రు లెట్లుండిరి; స్త్రీపురుషులవేషము లెట్టివి. వారి వస్త్రము లెట్టివి, ఆభరణము లెట్టివి, వా రేపరిశ్రమలందు ప్రవీణులు, వా రేదేశాలతో వ్యాపారము చేసిరి, వారి వినోదములు, ఆటలు, పాటలు ఎటువంటివి, గ్రామాధికారులయొక్కయు, తలారులయొక్కయు అధికారము లెట్టివి, ఏయే తప్పుల కెటువంటిశిక్ష లుండెను, వివాదముల పరిష్కార మెటుల జరిగెడిది, శైవవైష్ణవమతముల ప్రాబల్య మెంతవఱ కుండెను, ఏయే దేవర్లను జను లాసక్తితో కొలుచుచుండిరి. ఇట్టి యనేకవిషయముల కీగ్రంథ మొకరత్నాలగని. ఇట్టి గ్రంథాలు కొన్ని యుండినందునను మనపూర్వికులను గురించి కొంతకొంతయైనను తెలుసుకొనగలిగినాము.

ఇవి శుకసప్తతిలోని ముఖ్య విశిష్టతలు. కవి తనను గూర్చి తానే యిట్లు కృత్యాదియందు వ్రాసుకొనినాఁడు.

సీ. కావ్య నైపుణీ శబ్దగౌరవప్రాగల్బ్య, మర్థావనాసక్తి యతిశయోక్తి
    నాటకాలంతార నయమార్గ సాంగత్య, సాహిత్య సౌహిత్య సరసముద్ర
    సకల ప్రబంధవాసన సువాక్ప్రౌఢిమా,న్విత చతుర్విధ సత్కవిత్వధాటి
    లక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటిమంబు, నైఘంటికవదానునయనిరూఢి.
    గనిన నీకు నసాధ్యంబె గణుతి సేయ
    ధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్ల
    ఘనకులకలాప కదురేంద్రు కదురభూప
    చెలగి వాక్ప్రౌఢిచే గృతిసేయు మవని.

కదిరీపతియనంతరము నూఱేండ్లతర్వాత వచ్చిన యయ్యలరాజు నారాయణామాత్యకవి హంసవింశతి యను కావ్యమును పూర్తిగా శుకసప్తతి ననుసరించియే రచించెను. నూర్ల కొలది పద్యాలలో శుకసప్తతిలోని వర్ణనలను, పంక్తులను, మార్పేమియు చేయక స్వీకరించెను. అయ్యలరాజు స్వతంత్రముగా ననుకరణావశ్యకత లేకయే చక్కనికవితను వ్రాయగల శక్తిసామర్థ్యములుకలవాఁడే కాని యతనికి శుకసప్తతిపై యపారాభిమాన ముండినట్లు రూపించుకొన్నాఁడు.

ప్రకృతతృతీయముద్రణము

శుకసప్తతిని మొట్టమొదటిసారి 1909 లో కాకినాడలోని సరస్వతీపత్రికవారు ముద్రించిరి. ఆముద్రణమును గురించిన విశేషములు మొదటిముద్రణపీఠికనుండి వెల్లడి యగును. తర్వాత 1935 లో వావిళ్లవా రసమగ్రమగు కృత్యాదిపద్యములతో చక్కనియచ్చుతో రెండవముద్రణము కావించిరి. ఇప్పటి యీముద్రణములోఁ బూర్వముద్రణములలోని తప్పులు సవరింపనైనవి. మఱియు కృత్యాదిపద్యములు సమగ్రముగా ముద్రితమైనవి. పాఠాంతరములు కొన్ని యీయబడినవి. శుకసప్తతిలో నించుమించు 100 పదము లర్థము కానివై యందు బహుళపదములు నిఘంటువులలో లేనివై యున్నవి. అట్టిపదములలో 9౦ పదముల కర్థనిరూపణము చేసి గ్రంథాంతమం దకారాదిగా ముద్రింపనైనది.

ఈ ముద్రణమువఱకు కావ్యముందు కొరవడినభాగాలు లభించుట యత్యంత ముదావహము.

1935లో కీ. శే. టి. శివశంకరంపిళ్లెగారు తమ అళియరామరాజు పుస్తకములో శుకసప్తతిలోని కృత్యాదిపద్యాల నుదాహరించినది చూచి వారి కవి యెచ్చటఁ లభించెనో వ్రాసి తెలుసుకొని వారిని తొందరపెట్టి మరల పంపుదునని నమ్మకముకలిగించి కృత్యాదిపద్యాలను తెప్పించుకొంటిని. అనంతపురముజిల్లా కదిరితాలూకాలోని పాతర్లపల్లె గ్రామనివాసులగు శ్రీ అంబటి వేంకటరమణప్పశ్రేష్ఠిగా రనువారివద్దనుండి యాపద్యాలప్రతిని శ్రీపిళ్లెగారు సేకరించి పంపించిరి. మార్చి 1935లో వానిని నేను వ్రాసిపెట్టుకొని శ్రేష్టిగారిప్రతిని తిరుగ పంపితిని, “నా ప్రతిలోని పద్యాలను ముద్రించునప్పుడు నా పేరు ప్రకటింపుకొనుడు” అను శ్రేష్ఠిగారి కోరికను పరిపాలించినాను.

శుకసప్తతి 17 వ కథలో

“అంతలోననె శాలివాహనుదివాణమునకు నేఁగుటకై బంధుజనుల గొలువ.” అనియు, నందే “ధర శాలివాహనుండను” అనియు కవి వర్ణించినాడు. శాలివాహనుని కాలపు కథాసరిత్సాగరమునుండి కథలను పెక్కింటిని స్వీకరించినట్లు ఇవి సూచించును.

ఇప్పుడు లభించిన భాగమునుబట్టి కవి నాల్గాశ్వాసములలో (70) రాత్రులలో కథలను చిలుకకు చెప్పించెననియు స్పష్టమైనది.

ఆంధ్రవాఙ్మయమున విశిష్టస్థానమును బొంది శిరీషకుసుమపేశలమై గులాబీ గుమగుమలతోఁ గూడినదై, ఉత్తమహాస్యరసభరితమై, అత్యంతానందమును కలిగించు ఈ శుకసప్తతి సర్యజనాదారణీయమనుటలో నతిశయోక్తి లేదు.