శుకసప్తతి/పదునైదవకథ

వికీసోర్స్ నుండి

పదునైదవకథ

క. [1]కుముదబిలం బనునొకపుర
మమరు సురవ్యజనితధ్వజానీకమద
భ్రమదప్రమదప్రమదా
సుమదామకటాక్షజనితసూనశరంబై. 502

[2]

తే. అందుఁ దనరారు వీరాఖ్యుఁడైన యొక్క
రౌతు వానికి దోసిటిప్రాలముద్దు
గుమ్మ మదవతి యన నొక్కకొమ్మఁ గలదు
కమ్మపూవులరెమ్మ బంగారుబొమ్మ. 503

క. ఆలలన నాయకుని యుప
లాలనమునఁ దనివిలేక లలితాకారా

వాలములగు జారుల కను
కూలముగా మెలఁగుచుండుఁ గోర్కులుదీరన్. 504

సీ. అత్తగారికిని దీర్ఘాయువిచ్చినయట్టి
బ్రహ్మదేవునిమీఁదఁ బండ్లుకొఱుకు
భర్తకుఁ బొరుగూరుపయనంబుఁ జెప్పని
ధరణీధవునిమీఁదఁ దప్పులెంచు
జంద్రసూర్యులప్రకాశము మాయఁ జేయని
కటికిచీఁకటిమీఁదఁ మెటికవిఱుచు
బసులగోడలునాన్పి వసుధపైఁగూల్పని
ముసురువానలమీఁదఁ గసరుఁజూపు
తే. పదినెలకు రేలు మఱి పారవశ్యగరిమ
నెనయఁజేయని నిద్ర నేమేమొ దూఱుఁ
దవులుకోర్కులచే వెలిచవుల కరుగ
సందుగానక కుందు నయ్యిందువదన. 505

చ. కడకుఁ దొలంగినం గెలనఁగాఁపుగనుండెడు చేడెతోడ నీ
వెడపక వింత వానిరతి కేగతి నేగుదు వమ్మచెల్ల యె
కుడుభయ మయ్యెడుం దలఁచికొన్ననె యంచని యిట్టిసౌఖ్య మె
క్కడఁ గలదంచు విస్తరముగా నది చెప్పినఁ గోరుజారులన్. 506

చ. జననము నందినం బురుషజన్మము కావలెఁ గాక యాఁడుధై
నను గుడిముద్ర వైచికొనినం దగు లేక కులాంగనాస్థితిం
దనలినఁ గామరూపమయిన న్వలదాయని చింతసేయు న
వ్వనరుహపత్రనేత్ర తలవ్రాఁతకుఁ దప్పులుగల్గనేర్చునే. 507

క. పెనిమిటియు నత్తవదినెలు
కనుఁగలిగి మెలంగ వెడలఁగా నెడ లేమిం

దినదినముఁ దత్తలోదరి
మనముననే యిట్టి నేలమాలెలు ద్రవ్వున్. 508

చ. వరునింగన్ను మొఱంగి యిల్వెడలి పోవం బోయి జూరోపభో
గరతింజొక్కఁగఁ జొక్కుచోఁ దలవరు ల్గద్దించినం డాఁగ డాఁ
గి రయోదారత నిల్లు సేరి సతిభంగింగుట్టుతో బంధుమో
హరముం జెందఁగ నవ్వధూమణి యుపాయం బెంచు నెల్లప్పుడున్. 509

మ. ఇది జారుం డిలు సేరఁగాఁ దగినతా విచ్చోటఁ దత్సంగమా
భ్యుదయార్హం బిది యింటివా రెఱిఁగినం బొమ్మంచు వానిన్రయం
బొదవం బంపఁగవచ్చు త్రోవయని తానూహించు గేహంబున
న్మదవత్యంబుజలోచనామణి మదోన్మాదం బుదారంబుగన్. 510

క. ఈరీతినుండి యయ్యం
భోరుహముఖి మగఁడు మోసపోవనికతనన్
జారరతి కొకమహోపా
యారంభముఁ బూని దీనయైనది పోలెన్. 511

క. ఒకనాఁటిరాత్రి నిజనా
యకుతో గురుభూమిఁ దగుమదంబ జనానం
దక యెటువలె నున్నదియో
యకటా మాయన్న ధవళుఁ డరుదేఁడేమో. 512

తే. తొమ్మిది పదేండ్లు గావచ్చెఁ దోఁడుఁ జూచి
గురుతుసైతంబు మఱచితిఁ గోరి యటకు
మీరు నన్నంపఁగాఁబోరు వారు నిటకు
రారుగా చూచుటెట్లు వారలను నేను. 513

క. అని పలుక న్వరుఁ డూరా
ర్చినమాటలు వారితిన్నెఁజేరిన పథికుం
డనుపమధూర్తుం డొక్కఁడు
విని చూతము గాక దీనివిధ మని యంతన్. 514

తే. వేగ మఱునాఁడె యంగటివీధి కేగి
పచ్చడము చీకయును బండ్లుఁ బసుపుఁగొనుచు
వచ్చి వారింటి కేగి బావా యటంచు
వీరునకు మ్రొక్కి యతని నివ్వెరగుఁ గాంచి. 515

క. తివిరి జనానందక గా
రవమున నీయనుజఁ జూచి రారా పోరా
ధవళాయన వచ్చితి నన
నవహితుఁడై వీరుఁ డద్భతానందమునన్. 516

క. ధవళుఁడ వీవేనా యని
కవుగిటఁ గదియించి నెనరుగలబంధుఁడవౌ
దువు నేఁటికైన వచ్చితి
వవసర మిపుడైనఁ గలిగెనా యని పలుకన్. 517

తే. వారిమాటలు విని మదవతి మదీయ
వచన మేజాణయో విని వచ్చి యిట్లు
సందుకొన్నాఁడు కార్యంబు చక్కనయ్యెఁ
గాంక్ష యొనఁగూర్ప ధగళుఁడే కలఁడటంచు. 518

తే. వచ్చి కల్పితసంభ్రమావార్య యగుచు
మ్రొక్క దీవించునాతనిమోముఁ జూచి
యస్న యాశీర్వదించినయంతఫలము
నీవు వచ్చినకతమున నేఁడు గలిగె. 519

సీ. మనయమ్మ కడుసుఖమున నున్నదే యయ్య
పెద్దవాఁ డయ్యెఁగా పేర్మి నతనిఁ
బోషింతురే మీరు పొరచూపు లేక నా
యరిది చెల్లెలి వచ్చి యత్తవారు
తోడ్కొని పోయిరే దూరంబుగాన యే
వార్తయు వినము మావదినె వేక
టని వింటి నేబిడ్డఁ గనియెను మగవానిఁ
గనియెనో యది మేలుగాక యాఁడు
తే. దాననై పుట్టి మిముఁ జూడఁ గానకిట్టు
లేను బడుపాటు చాలదా యెన్నఁడైన
దలఁతురా నన్ను మీరు డెందంబునందు
నేల తలఁతురు మఱచిపోయితిరి నన్ను. 520

చ. చెలియలి పెండ్లి చేసితిరి చిల్లరపబ్బము లెన్నియైన శో
భిలె నను నెన్నఁ డైనఁ బిలిపించితిరే పిలిపింపకున్న నే
మలరెడుకూర్మి నాఁడుఁబడు చాసపడుం గద యంచుఁ బచ్చపోఁ
గులు గలచీర యంప నొనఁగూడకపోయెనె యేమి చెప్పుదున్. 521

తే. ఇపుడు మీపుణ్యమున నాకు నేమి కొదవ
యుండె నేను ధరింపఁగా నొకరి కీయఁ
గలదులే యందులకు నంట గాదు మీద
యాతిదాక్షిణ్య మిటువంటి దంటి నింతె. 522

క. అనవలసి యంటి నిన్నుం
గనుఁగొనుటే చాలు బడలికలు కనుపించెం

జనుదెమ్ము కంచ మిడినది
యనుచుం గను గీఁటి పిలువ నాతఁడు మదిలోన్. 523

తే. కల్లవగజూదకత్తెలఁ గంటిఁగాని
యింతమాయల జగజంత నెండుఁగాన
నెట్లు నమ్మెడి దొర యీయింట దీని
కడమనడతలు తెలుతముగాక యనుచు. 524

క. చని యది వడ్డింపఁగ భో
జనకృత్యముఁ దీర్చి యంతఁ జలజాప్తుఁడు గ్రుం
కిన దానికన్ను సన్నం
గని కూటములో వసించె గంకటిమీఁదన్. 525

చ. మదవతి యంత నాత్మవిభు మన్మథకేళిని దేల్చి కూటి చొ
క్కొదవఁగ నిద్రఁజెందు పతి నొయ్యన నారసి లేచి చెంబుతో
నుదకముఁ గొంచు ధూర్తమణి యుండెడి చోటికి నేగి మాయపు
న్నిదురవహించి యున్న యతనిం గరసంజ్ఞల లేపి యిట్లనున్. 526

క. ఏమోయి నిన్న నడిచిన
నామాటలు పొంచి విని ఘనంబై తగుమ
త్ప్రేమ యొనఁగూర్పవచ్చిన
సామివి గద నిన్ను మెచ్చఁ జనదే నాకున్. 527

ఆ. అందగాఁడ వగుదు వప్పుడె కంటి నీ
దారి మగఁడు నిద్రఁ దేఱి నన్ను
వెదకు నటకుమున్ను వేగఁ బోవలయు నీ
జోలి యేల ప్రక్కఁ జో టొసంగు. 528

చ. అన విని వాఁడుపల్కు భవదద్భుతచాతురిలో శతాంశమై
నను గలదా మదీయనిపుణత్వము నేర్పరులందు నిన్ను నె
న్నినఁ దగు మున్ను నాగుఱుతు నీవు నెఱుంగవు నిన్ను నే నెఱుం
గనెకద యిట్టిచో నిజముగా నిలనాడితి గాన మాననీ. 529

క. అది యెంతయైన నున్నదె
కద యీయద్భుతము జోక గలుగుట మేలౌ
ముదిత కొఱగానివా వి
ట్లాడవినచో మదనకేళి కొడఁబడఁ దగునే. 530

క. అన విని యది యిట్లను నా
మనముఁ గనన్వలసి పలుకుమాటలు చాలు
మన యిద్దఱి ఘనసాహస
మునకు న్ఫల మతనుకేళిమోదము గాదే. 531

క. చక్కనివనితా పురుషుల
కెక్కడి వావులు మనోజుఁ డెక్కడ నున్నాఁ
డక్కడఁ దగవులు నడచునె
మొక్కలితన మేల మేలములు వల దింకన్. 532

క. అని పలుక మఱియు నాతఁడు
మనసీయక యున్నఁ జూచి మంచిది పతిచే
నినుఁ దునిమించెద ననుఁ గనుఁ
గొనరా యని బోఁటి పోటుకూఁతలు వెట్టెన్. 533

క. గడగడ వడంకి యతఁ డో
పడఁతీ నీ వానతిచ్చుపనిఁ జేసెద నా

కడ నెగ్గుఁ దలఁపవద్దని
యొడఁబడిన న్మంచిదని సముత్సాహమున్. 534

క. మది నాతని రక్షింపఁగ
నది యెంచెఁ బ్రభావతీ మహామతి వౌదే
కద యెట్లు కావవలెఁ బది
పదిగ విచారించి తెలియఁబల్కు మ టన్నన్. 585

క. కోమటిమిటారి చిలుకా
నామతివిస్తార మేమనన్వచ్చు వచ
శ్శ్రీ మెఱయ నీవె తెల్పుము
నా మంచి దటంచుఁ గీరనాథుం డనియెన్. 536

వ. ఇవ్విధంబున నమ్మదవతీవరారోహ యుపాయపరాయణయై యుండె నంతకమున్న కర్ణనిర్భేదనం బగుతదాక్రోశంబు నిద్రాభంగంబుఁ గావించుటయు నవ్వీరుం డదరిపడి లేచి కృపాణపాణియు వికటీకృతభ్రుకుటినిటలుండును నగుచు వచ్చు నంతకమున్న యయ్యింతి సమంతికప్రవర్తియగు నాధూర్తుని సవికారంబుగాఁ బడియుండు మని బోధించి యగాధవ్యధాబాధితయుం బోలె నిజనాథుని కెదురుగాఁ బఱతెంచి సాక్రందనంబుగా ని ట్లనియె. 537

క. పని గల్గి నీరపాత్రము
గొని ముంగిటి కేగుదెంచి కోయనుకూఁత
ల్విని చేరిన వికృతాకృతి
గని యున్నాఁ డన్న యేమి కతమో యెఱుఁగన్. 538

క. ఇన్నాళ్లు రానివాఁడే
యెన్నిక లొనఁగూర్ప నిచటి కేతెంచెనొ మా

యన్ననుఁ గనుఁగొన రావే
ని న్నని వచ్చుట నుపేక్ష నించుట తగునే. 539

క. అన విని వదరకువే యా
తని కేమియు లే దటంచు దాని పిఱుందం
జని వీరుఁ డతని యాకృత
గని త్రోవం గాలి సోఁకె గావలె ననుచున్. 540

తే. వెన్ను చఱచి ధవళ వెఱవకురా యంచుఁ
బలుక నంత నతఁడు తెలివి నొంది
వారిఁ జూచి లేచి మీ రేల వచ్చితి
రేమి యెఱుఁగనైతి నింతతడవు. 541

చ. అనవుఁడు నవ్వి వీరుఁడు నిజాంబుజలోచనఁ జేరఁబిల్చి మం
తనమున నీతఁ డొంటికి మనంబున భీతి వహించెనేమొ నీ
వినుఁ డుదయించుదాఁక వసియింపు సహాయముగాఁగ నంచుఁ బో
యిన నగి ధూర్తుతోడ రమియించె వధూమణి యాస దీఱఁగన్. 542

క. అంతటఁ దెలతెలవాఱెం
గాంతాయని పలుక వైశ్యకామిని యిచట
న్వింత గదె తెల్లవాఱె శ
కుంతల యని యంతిపురము గుట్టునఁ జేరెన్. 543

తే. చేరి రేయి మహీకాంతుచెంత కరుగు
దానితోఁ బూని తోయజోద్యన్మరంద
ధార లూరఁగఁ గీత మోతరుణి యొక్క
కథ విను మటంచు వెస నరికట్టి పలికె. 544

  1. క. జగతిఁ బొగడొందు విద్యా
    నగరంబునఁ బరమధూర్తనాయకు లగుచున్
    నెగడుదు రిద్దఱుభూసురు
    లగణితులై విందుఁ డనఁగ ననువిందుఁ డనన్.

    సీ. తల్లిబిడ్డలు నన్నదమ్ములకైన నాఱనిపోరు గల్పించి రట్టు సేయ
    యామికావళికన్నుఁ బ్రామి యంతఃపురాంగణములైనను జొచ్చి కన్నవెట్టఁ
    పతిభక్తి సతి నరుంధతివంటి వాల్గంటినైన బెల్లించి వెల్లాలి సేయఁ
    దప్పక శకునియంతటివానినైన జూదంబున గెల్చి పందెంబు గొనఁగఁ
    తే. జీరకును గొఱ్ఱెకును లంజవారితల్లి
    పూఁటకొప్పించి తియ్యనిమాటలాడి
    రాయి గరగించుచును నప్పురమున వార
    లొకనికొక్కఁడు మెచ్చకయందు రెపుడు.

    సీ. పగడసాలలఁ గోడిపడవులఁ బుట్టచెండాటల నిష్కారణార్యనింద
    మదిభోగములఁ జేరి మగడాలిచక్కటికథల దుర్వ్యవహారకర్మకలన
    దీవుల నీరాటరేవుల రచ్చల మాటల జనవశ్యమంత్రశక్తి
    బొమ్మలాటల వట్టిఁబూటకంబుల వంతుపాటిల కొక్కపఠనశక్తి
    తే. పగటినిద్రల వెలయాండ్రఁ బట్టుపనులఁ జాడికూతల పరిహాససరణినడక
    లేనిదుడుకుల బెట్టుటఁ బూనికొనుచుఁ బ్రొద్దుపోనిత్తు రెపుడును భూమిసురులు.
  2. తే. వారలంతట నలకంచి వరదరాజు
    గరుడసేవ నిరీక్షింప నరిగి పోపు
    పరుసవెంబడి జని యన్యభామినీవి
    లోకనాపేక్ష నెమ్మదిలోన హెచ్చ.

    సీ. వృద్ధవేశ్యతనూజవిటుఁదిట్టుమాటల
    వెలపువ్వుఁబోండ్ల నవ్వించుకొనుచు
    నత్తకోడండ్ర కాట్లాటమాటలు
    గులస్త్రీలసిబ్బితిచూసి చెప్పికొనుచు
    వరునిలో నిల్లాలు ప్రతిరాత్రి యాడుమా
    టలఁ గులాంగన గుట్టు కలఁచికొనుచుఁ
    గొట్లకే గొణిగెడు గుందనిమాటల
    కొమిర బానిసెగుంపుఁ గూర్చుకొనుచుఁ
    తే. గోడెకాండ్రెల్లఁ గూడిరాఁ గొంతతడవు
    కథలు మఱికొంతతడవు శృంగారవతుల
    చిత్తము లెఱుంగు నేర్పులుఁ జెప్పికొనుచు
    నరుగుచోఁ ద్రోవఁగడపి రయ్యవనిసురులు.

    తే. పరుసడిగ్గినచోఁ దమవంతువగల
    కాసపడి చూచు కొమిరయిల్లాండ్రచెంత
    నగుచు నన్నేల వేల్పు లన్నంబు వార్చి
    కొండ్రు వారలు వండినకూర లిడఁగ. (పాఠాం)