శుకసప్తతి/పదాఱవకథ

వికీసోర్స్ నుండి

పదాఱవకథ

క. ఏలానగరంబున గో
పాలుం డొకఁ డమరు విష్ణుభక్తుఁడు ధర్మా
లోలమనస్కుఁడు తంత్రీ
పాలుం డనువాఁడు నిఖిలబంధుప్రియుఁడై. 545

సీ. పులుల వాకట్టుమందులు పాముబదనిక
ల్పొదుగుచేపుఁడుమంత్రములను గోడె
దామెనపగ్గము ల్తలత్రాళ్లు నురిత్రాళ్లు
చిక్కంబులును జల్దిచిక్కములును
మాఱుమానిసిఁగన్న దూఱువేపులజోళ్లు
కొలికిచెప్పులు జమ్ముగూడ లలఁతి
పిల్లగ్రోవులు నెక్కువెట్టినవిండ్లు కం
బళ్లు దుప్పట్లును వల్లెతాళ్లు
తే. మొదలుగాఁగల పరికరంబులం గొఱంత
లేక భూమీరుహచ్ఛాయలే గృహాళి
గాఁగ వాఁడాలమందలం గాచుబాళి
నడవిమానిసియై తిరుగాఁడు నెపుడు. 546

చ. పిదికిన యాలపా ల్వెదురుబియ్యము కావడికుండ నించి య
య్యదుపతి కింద్రియంబుగఁ దదాహృతవహ్నిసమిత్పరంపరా
భ్యుదయము నొందఁజేసి పయిపొంగలి వెట్టి భుజించు నాతఁ డిం
పొదవఁగఁ డేకుటాకుల వనోర్విని మందలఁ గాచువేళలన్. 547

సీ. మేర లెంచక సూరివారిండ్ల కేగి పా
ల్పెరుఁగు వెన్నలు మ్రుచ్చిలించె ననుచు
నీరాడుతఱి నాఁడువారుకట్టినపాఁత
లెత్తుకపోయి చెట్టెక్కె ననుచుఁ
బ్రతుకుభాగ్యము క్రిందఁబడఁగ బాఁపనయిండ్ల
కరిగి యాఁకటికిఁ గూ డడిగె ననుచుఁ
గడపటఁ జుట్టాల గరితలపైఁటలోఁ
జెయి వేసి యేమేమొ చేసె ననుచు
తే. వ్రాసికొన్నారు బాపనబైసిగాండ్రు
కొలముస్వామి విచారించుకోక యిట్లు
చేయునే యంచుఁ పెద్దలచేత వినెడు
కృష్ణకథలందు నిటువంటి వెల్ల వినఁడు. 549

సీ. తులసిపూసలు బోడితలయు నడ్డాదిడ్డి
పట్టెనామములు సంభ్రమము నొప్పఁ
బరువు లెత్తిన యెద్దుపై నొంటి తముకురా
నములును వేణునాదములు పొసఁగ
రచియించు తపముద్రలును బైఁపైఁబల్కు
గోవిందలును హాస్య మావహింప
నతిరసంబులఁబుట్టి యవనతులైన వా
రలకొసంగెడు దీవనలు సెలంగఁ
తే. గొలమువా రెంచఁగల గొల్లకొడుకుఁ గనఁగ
బంటులునువోలెఁ జుట్టము ల్వెంటనంటఁ
గోరి మ్రొక్కులు చెల్లించుకొఱకుఁగాఁగ
నాతఁ డేటేఁటఁ దిరుపతి కరిగివచ్చు. 549

క. వానికి మనోహర యనం
గా నొకయంగన యెసంగుఁ గంతునితేజీ
కూనయన వానిగేదగి
జీనీజముదాళి యనఁగ నేమ మెసంగన్. 550

క. శోభితముఖదారితశశి
వైభవ యాలోకన గురుప్రవర్ధితమదన
ప్రాభవ యెవ్వరితరమ
య్యాభీరగభీరనాభి నభినుతి సేయన్. 551

చ. చనుగవయొప్పు నెన్నడుము సన్నదనంబు మెఱుంగులీనుమో
మునఁగలతేట నెన్నడలముద్దును మాటలనేర్పు కోపుచూ
పునఁగల యందముం బిఱుదుపొంకముఁ గల్గినదానిఁ జూడగొ
బ్బునఁ బదివేలమన్మథులు పుట్టుదు రప్పురిఁ బల్లవాత్మలన్. 552

శా. మైనిగ్గు ల్తెరయెత్తగా నమృతకుంభంబంది యేతెంచు మా
యానారాయణిలీలఁ దక్రఘట దీవ్యన్మస్తయై చూపుల
జ్ఞానమ్రత్వముఁ జెందఁ జల్లఁ గొనరో చల్లంచు నేతెంచుచో
దానింజూచిన కంతుఁడైన రతిమీఁదం దప్పు గల్పింపఁడే. 553

క. ఆలీలావతి తంత్రీ
పాలుఁడు దినదినము మందపాలై తిరుగన్
జాలిపడి మనసుఁ బట్టం
జాలక పరపురుషభోగసంగతిఁ గోరెన్. 554

సీ. అరిది సిబ్బెపుగుబ్బ లన్యుచేతికి నిచ్చి
నప్పుడే చనదె శుద్ధాన్వయంబు
పవడంపుజిగిమోవి పరుపంటిమొన కిచ్చి
నప్పుడే చనదె గుణార్జవంబు

మితిలేని మెఱుఁగుమే నితరుకౌఁగిటి కిచ్చి
నప్పుడే చనదె మహాభిమాన
మతనిఁ గన్మొఱఁగి యీగతి జారుఁబొందిన
సుద్దెఱింగిన రాజు బుద్ది చెప్పు
తే. నింత యేమిటి కాజారుఁ డేలు టెంత
తెవులుగొన నమ్మరాదంచుఁ దెలిసికొనరె
యకట తిమిరంపునిండుప్రాయంబు కతన
నెఱుఁగ రింతియెకాక రాకేందుముఖులు. 555

ఉ. అమ్మహిళలలో లలామ వినుమాగతి జారులఁ గోరి కానికా
ర్యమ్మగునైన మాకొలమురాధకు వచ్చినదూఱు నాకు రా
నిమ్మని నిశ్చయించి యెదురింటి గుణార్ణవనామధేయునిం
గ్రమ్మినబాళినంటి యెలప్రాయము చూఱలొసంగె వానికిన్. 556

సీ. ఒక తెల్వి వొడము నయ్యొఱపులాఁడికిఁ గమ్మ
తమ్మియందము గ్రమ్ము నేమొగమున
నొకనవ్వు వొడము నయ్యురగవేణికి మిన్న
గన్న కెంపులవన్నె చిన్నిమోవి
నొకతళ్కు వొడము నయ్యువిదమిన్నకు మంచి
యంచగుంపులసంచు మించునడల
నొకనీటు వొడము నయ్యురునితంబకు మేటి
రంగుబంగరపుబెడంగు మేన
తే. నత్తయానతి మజ్జిగ లమ్మువేళ
దానిదారున నీక్షించె నేని యింక
జాలిమాటలు తలమీఁది చల్లకడవ
పడుటసైతము నెఱుఁగ దప్పడఁతి యపుడు. 557

సీ. [1]ఆగుణార్ణవునియిల్లాలికి మెఱుమెచ్చు
కూర్మితో వండినకూర వెట్టుఁ
గమ్మనేతులు చల్లకడవలోపల డాఁచి
గోనిపోయి పురయామికుల కొసంగు
నేరంబులోమెడు నియతికానికి గట్టి
మీగడ కనుక గాఁగ నిచ్చు
నాజ్ఞవెట్టఁగఁ గర్తలైనబంధులకు నె
య్యంబున నడుగని యప్పు లిచ్చు
తే. దనవిధంబంత మెల్ల నేతప్పతార్చ
వలసి యీలీల మెలఁగు నవ్వనజగంధి
జారవిద్యల కొడిగట్టు సతుల కింత
యెచ్చరిక యుండవలయుఁ బూర్ణేందువదన. 558

క. వినుము ప్రభావతి నేమ
న్ననఁ దెలిపెదఁ జూపి మోపి యనుటయుఁ గాదా
యని తలఁపకు మిఁక నీకై
నను హెచ్చరి కింతలేక నడువం దగునే. 559

తే. తగనవధరింపు మవలికథావిశేష
మమ్మనోహర యిట్లు గుణార్ణవునకు
మేలునడియున్న నొక్కనాఁ డేలినాతఁ
డనుప నాతఁడు పొరుగూరి కరుగుటయును. 560

క. ఆఘోషాంగన మదన
జ్యాఘోషం బితరవరసమాక్రమనిష్ఠా

ద్రాఘిష్ఠంబై మించె ని
దాఘసమవియోగవహ్ని తనమది ముంచన్. 561

సీ. అదలించి పిదుకని యావులుండఁగ వేగ
దోహనధేనువుదూడ విడుచు
బానలోపలఁ బచ్చిపాలుండ మించిచే
మిరియిడ్డ పా ల్పొయిమీఁదఁ బెట్టుఁ
బేరి పక్వంబైన పెరుఁగుండఁ గవ్వంబు
పులిచల్లలో నుంచి చిలుకఁబోవు
వెసలలో మూనాళ్ల వెన్న లుండఁగ నాఁడు
కాఁచి డించిననెయ్యి కరఁగఁబెట్టు
తే. దివమునను సంజకడయంచు దివ్వ లెత్తు
దద్దరిలినట్లు నడురేయి ప్రొద్దుపొడిచె
ననెడుమతిఁ బాచిపనులు చేయంగఁబూను
వలపువెఱ్ఱికిఁ జిక్కి యవ్వనజగంధి. 562

క. ఈరీతి నుండ మచ్చిక
దేర న్వలసినవియెల్లఁ దెప్పించుటకై
వారసతు ల్బొజుగులతో
బోరామి యొనర్పఁ బసులపొంగలి వచ్చెన్. 563

సీ ఇంక నాల్గావంబు లిడనైతిఁగా యంచుఁ
గుమ్మరి నెమ్మదిఁ గుందికొనఁగఁ
గుడుమురూకలకెల్లఁ గొననైతిఁగా యంచు
బేరి తేరనియారి వేర మొంద
గొఱియమందల నించుకొననైతిఁగా యంచు
గొల్లవాఁ డూరకే క్రుళ్ళుకొనఁగఁ

బెనుపసుపే విత్తు కొననైతిగాయంచు
గాఁపు నిద్దురలేక కళవళింప
తే. మొనసి వెలచూపిచూపకమునుపె వారి
సరకు లమ్ముడువోయె నేజాతివారి
కేని బాటింపవలసి పేరెక్కినట్టి
యాదినంబున నంబురుహాయతాక్షి. 564

తే. అపుడు పొంగటికైన బియ్యంబుఁ దెమ్ము
శీఘ్రముననంచు నొకరూక చేతికిచ్చి
యత్త పొమ్మన నమ్మనోహరతరాంగి
సాంద్రమైనట్టి చెంగటి సంత కరిగె. 565

క. తండులములు గొని పుట్టిక
నిండం బెట్టుకొని రాఁడె నేఁ డైనను జా
రుం డని మదిఁ దలఁచుచు న
మ్మిండం డేతేఱఁ దత్సమీహిత మొదవన్. 566

క. కనుచూపుమేర దానం
గనుఁగొని యమ్మగువ యగునొ కాదో యనుచుం
జను దెంచి గుణార్ణవుఁ డే
గినకార్యము చక్కనగుటఁ గెరలిన తమితోన్. 567

క. అంత మనోహరుఁ గనుఁగొని
సంతసమున మనసు నిలుపఁజాలక యపుడే
కంతురణకేళికై యువ
కాంతునితో నచట వల్లికాగృహసీమన్. 568

తే. చేరి పుట్టిక వెలుపలిచెట్టునీడ
డించి పొదలోని కరిగి యమ్మించుఁబోఁడి

జారుతోఁ గూడి తమ్మినేజావజీరు
దురమునను దన్మయావస్థతో రమించె. 569

చ. అదిగని యొక్క ధూర్తవరుఁ డబ్బెర పొంగటి కంచు నెమ్మదిం
బెదరక మెల్లనే యరిగి బియ్యముఁ గైకొని యెంచరానినే
ర్పొఁదవఁగ గంపలోన సికతోత్కరము న్వెస నించిపోయిన
న్మదవతి జారుఁ బొందెడు సుమాళమె కాని యెఱుంగ దేమియున్. 570

తే. అంతఁ బొదరిల్లు వెడలి గుణార్ణవునకు
బురముఁ జేరంగఁ బెఱత్రోవఁ బోవఁజెప్పు
సందడిని గంపనయెత్తి‌ మస్తంబుమీఁదఁ
దాల్చి కొనివచ్చె నది యాత్మ ధామమునకు. 571

ఉ. వచ్చిన నత్తగారు తలవాకిటికిం బఱతెంచి యింతసే
పెచ్చట నేమి యంచని శిరోగ్రమునం దగుగంప డించి నే
మెచ్చితిఁ గోడలా యిసుక మేదినిఁ బుట్టదటంచు నెంచియో
తెచ్చితివంచు నాగ్రహమతి న్నెమకె న్వలెత్రాఁడు ముంగిటన్. 572

క. ఆయెడ నాగోపాంగన
యేయనువున బొంకనలయు నెఱిఁగింపఁగదే
కాయద్యుతినిర్జితశం
పాయన నచ్చిలుకతోఁ బ్రభావతి యనియెన్. 573

క. చిలుకా యీచిక్కులు సం
ధిలుగాథలు నాకుఁ గానె నేర్చితివో కా
వలసి తలంపునఁ దలఁచితొ
తెలియదు గద యవలికథయుఁ దెల్పుము వేగన్. 574

వ. అనిన విని యాభామాలలామంబునకుఁ గీరసార్వభౌముం డిట్లనియె. 575

క. ఆదారి నత్త కినిసెనొ
లేదో యాలోన నుమ్మలించుచు నేనిం
కేదియుఁ జెప్పిన నిక్కము
గాదే కద యనుచు గోపకామిని యేడ్చెన్. 576

క. ఆమాటలు విని యత్త ద
యామేదురహృదయయై ప్రియంబున నడుగం
గోమలి యిట్లను గోకిల
కోమలకాకలిని గేలిగొనియెడి పగిదిన్. 577

తే. ఓపలేనన్న వినక కెం పొదవు చూడ్కి
నంపఁగా నేను మీకు మాఱాడ వెఱచి
సంత కేగితిఁ గద యందు సరఁగఁ జెఱఁగు
ముడి విడువ రూక వెస జాఱి పడియెనమ్మ. 578

క. వెదకితి నచ్చోఁ గానక
కద యంతటఁ బ్రొద్దువోవఁగా భయమున నె
మ్మది నింటికిఁ జని తూర్పె
త్తెద నని యచ్చోటి యిసుము దెచ్చితి గంపన్. 579

చ. వెలుపల వడ్డి కిచ్చినను వీసము వచ్చును నట్టు లాయెనో
బలబ వేగ వచ్చు నలబాపని కిచ్చినయట్టు లాయెనో
యలయక నాల్గుచట్ల పెరుఁ గమ్మినఁ జేతికి రానిరూక నా
వలె నలసంతలోనఁ బడవైచిన వారలఁ గాన నెచ్చటన్. 580

క. అని పల్క నత్త కనికర
మున రావే యెంత లేదు పోయిన యపుడే
మనసొమ్ముగాదు వగవకు
మని యూరార్పంగ నది గృహంబున కరిగెన్. 581

క. ఇట్టివగఁ గనినఁ జనుమా
గట్టిగ నని చిలుక పలుకఁగాఁ దమితోడన్
నిట్టూర్పు నిగుడఁ గోమటి
పట్టపుదేవేరి కేళిభవనం బెనసెన్. 582

క. ఆపగలు గడవఁబడుటయు
భూపతిభవనంబుఁ జేరఁబోయెడుతఱి నా
కోపనఁ గనుఁగొని సుమన
శ్చాపుని యెకిరింత సంతసం బుప్పొంగన్. 583

శా. కోగ్రగ్రావభిదాదికీర్తితగుణవ్యూఢోహగాఢత్రినే
త్రగ్రావోద్ధరణోగ్రబాహుబలగర్వగ్రంధిలంకాధినా
థగ్రీవగ్రసనోజ్జ్వలాద్భుతభుగస్త్రస్థేమవాతూలభు
గ్భుగ్రాజత్పటుశౌర్యవైభవహృతాంభోధిప్రభుప్రాభవా. 584

క. భోద్రేక బ్రథ్నవచః
కద్రూభవభూరిభావుకప్రాభవ దై
త్యాద్రివరధ్వంస సద
క్షుద్ర కృపావీక్ష భానుకులహర్యక్షా! 585

హంసయానవృత్తఖడ్గబంధము—
దారితారిభూరిధైర్యధామధామభూరుహా
భారతీశవంద్యశౌరి భాస్వదబ్జలోచనా

నారదస్తుతప్రభావనవ్యమేఘసన్నిభా
భారతీశశాంకకీర్తిభాసుసూరిరంజనా! 586

గద్య. ఇది శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబైన శుకసప్తతియను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

  1. ఇంటవండినకూర లిడి సారెకును గూర్మిచెలువునితోడ మచ్చికలు సేయు