శుకసప్తతి/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శుకసప్తతి

తృతీయాశ్వాసము

శ్రీజానకీమయూరీ
రాజన్మేఘాయితాంగ! రతిరాజశత
భ్రాజితసౌందర్యసుధా
రాజతగిరికీర్తిసాంద్ర రామనరేంద్రా! 1

తే. అవధరింపుము సకలరాజాధిరాజ
నతపదాంభోజుఁ డగుధర్మనందనునకు
సరసలౌకికవైదికాచారవిహిత
హితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టు లనియె. 2

తే. అటులు నిజగృహమున కేగి యబ్జవదన
పగలు గడవంగఁబడుటయుఁ బార్థివేంద్రు
కేళిగృహమున కరుగునవ్వేళఁ గాంచి
మరునియెకిరింత సంతోషభరిత యగుచు. 3

క. ఒకకథ వినియెదె మఱి పొం
దికతో నటు నిల్చి తర్జనీనాసాయో
గకరణధురీణ మిది యని
యకలంకసుధావిధోక్తు లలరం బలికెన్. 4

క. ధర శాలివాహనుం డను
నరనాయకమౌళి పెనుప నలువై విభవా
కరము ప్రతిష్ఠానం బను
పుర మలరు న్వేల్పుఱేనిప్రోలుం బోలన్. 5

క. అప్పురిఁ గుబేరుకలిమికి
దప్పులు ఘటియించు సోమదత్తుం డనుపే
రొప్పు నొకవైశ్యుఁ డలరుఁ గ
కుప్పటలిని గీర్తివల్లికోటులు ప్రాకన్! 6

సీ. నవరత్నములు సువర్ణమును వెండియును లో
హాంతరములు పటలాంశుకములు
గోవజవ్వాది కుంకుమపూవు పచ్చక
ప్పురముఁ బన్నీరుచెంబులుఁ బటీర
తరుఖండపటలి యందలపుఁ గొమ్ములు జల్లి
సవరము ల్పాదరసంబు జాజి
యింగువ లేలాలవంగము లోడపోఁ
కలును గోరోచనగంధకములు
తే. కొచ్చికుక్కలు మానిసిక్రోఁతు లరిది
పంచెవన్నెలచిలుకలు బహువిధముల
పారువాతిన్నె లిఁకమీఁద బలుక నేల
పొదలు వానింటఁ బులిజున్ను మొదలుగాఁగ. 7

క. ఈళయు ముమ్మెంగియు బం
గాళము పైగోవ మొదలుగాఁ బొదలెడుద్వీ
పాళిఁగలసరకు లాతని
కౌలున దిగు మాట నిజముగలవాఁ డగుటన్. 8

శా. ఏయూరం దనయాపణంబు మఱియిం కేబేరిపేరైన నా
త్మాయత్తం బగువిత్త మేయడవియందైన న్నిజద్రవ్య మీ
చాయన్సంపద వృద్ధి బొంద ధనదస్పర్ధాళుఁడై నిల్బెఁబో
యాయూరవ్యుఁడు గోట్లకుంబడగ లెన్నైనం బ్రమోదంబునన్. 9

చ. వలసిన బేరము ల్దెలియవచ్చినవారలు వాదుగల్గువా
రలు తెగగుత్తగొల్లలును రత్నపరీక్షలవారు కార్యము
ల్గలిగిన యింగిలీషులముఖాములు చెంగట నుల్లసిల్లఁగాఁ
గొలువొసఁగు న్మహీశుగతిఁ గోమటి యాత్మగృహాంగణంబునన్. 10

క. అతఁడు ధూర్తచకోర
ఖ్యాతంబగు నొక్కచిలుక నతులితగమనా
యాతేరితవిజ్ఞానస
మాతులశేముషిఁ గృపాళుఁడై పోషించున్. 11

తే. అప్పురంబునఁ గామసేనాభిధాన
యైన వెలచాన మీఱు జయైకతాన
మీనకేతననలినప్రసూనశరస
మానతానూనవీక్షావితాన యొకతె. 12

ఉ. కారుమెఱుంగురాచిలుక కస్తురివీణె పదాఱువన్నె బం
గారము నచ్చుకుప్పె తెలిగంబుర వెన్నెలలోని తేట సిం
గారపుఠీవి లేనగవు గల్గిన చక్కెరకీలుబొమ్మ యొ
య్యారపుజీవగడ్డ యన నచ్చెలి మెచ్చులు గాంచె నెంచఁగన్. 13

సీ. ప్రత్యక్షబాహాటపాంచాలనటనలు
గనుపట్టఁగాఁ బుస్తకములు చదువుఁ

గనుఁగొన్న రూపమచ్చున నొత్తినట్టులఁ
దళుకొత్త భావచిత్రములు వ్రాయు
నట్టువకాని యందముగాక వింతగాఁ
గోపులు గల్పించుకొనుచు నాడుఁ
జేరి తంబుర మీటి సారసుథాసూక్తి
దేటలూరఁగ వింతపాటఁ బాడు
తే. జాతివార్తలు దొలఁక రసంబు గులుకఁ
గవిత రచియించుఁ గల్పించి కతలు నుడువు
మనసు గరఁగంగఁ దీయనిమాటలాడు
జిలుకరౌతుకటారి యవ్వెలమిటారి. 14

సీ. పలుకుముద్దులకుఁ గోవెలజియ్యగాండ్రెల్లం
గుంటెనకాండ్ర వెన్వెంటఁబడఁగఁ
జనుజక్కవలు గన్న సన్న్యాసులైనను
దలవరివారితోఁ జెలిమి సేయఁ
దళుకుఁజూపులకు విద్వాంసులైనను నిజ
రామలతోడ రారాపొనర్పఁ
బొలుపున కాచార్యపురుషులైనను దమ
వేషభాషలమీఁద వెగటు పడఁగఁ
తే. దెఱపిగని చూచినట్టి పతివ్రతలును
నిజకులాచారవృత్తిపై నెటికె విఱువ
వింతయొయ్యార మెసఁగఁ గోవెలకుఁ బోయి
మరలి యింటికి వచ్చు నమ్మచ్చెకంటి. 15

చ. తొలఁకెడుతత్తఱంబువగతోఁ దొడనిగ్గు హిజారుమీఁద మె
ట్రిలువడినొంటికట్టున ఘటించిన చీరసగంబు మూపుపై

నలవడబోటి దట్టి మొదలైనవి తేఁ దిరుమంజనంపువే
ఫలు దఱితప్పెనంచు నవలా భయమందుచు నిల్లు వెల్వడన్. 16

క. కొడుమెత్తుకొఱకు గుడికిన్
నడుచు న్వెలపడుచు నాభినామమునుం గ్రొ
మ్ముడిసౌరు న్మడిచారు
న్వడిజాఱుంబైఁట వింతవగఁ గనుపింపన్. 17

సీ. తానున్న కేళికంతటికి గణాచారి
పెక్కుసుద్దులు మ్రోయు పెద్దబేరి
పేరుకోఁదగినట్టి యూరలేని యుటంకు
పరులబుద్ధులకుఁ జొప్పడనిమంకు
కల్లలు పచరించి గద్దించుతాటోటు
పూనియొక్కరి కీయలేని జూటు
కలహంబె కూడుగా మెలఁగెడుగయ్యాళి
నిష్ఠురత్వము సూపు నెఱకరాళి
తే. బేరజపుగట్టిజంత పాడూరిసంత
చలము సాధించు దిట్ట రోసాలపుట్ట
లోకముల కెల్ల సూచి యల్లుండ్రబూచి
యెంచఁగల యుచ్చమల్లి యయ్యింతితల్లి. 18

తే. దాని నుతియింపఁ దరమౌనె తాటకావ
ధూటితల్లియొ పూతనతోడఁబుట్టొ
శూర్పనఖమేనగోడలొ చూడ లంకి
ణీతనూజయొ యనఁగ వన్నియకు నెక్కె. 19

సీ. ఇరుగింటిదయ్యంబు పొరుగింటికినిగూబ
యెదురింటివారల కెదురుచుక్క
వాడకుఁబగ యూరివారలతలనొప్పి
పెంపుడుకూఁతుండ్ర పెద్దపిడుగు
పరదేశులకుఁ బులి బాఁపలగాలంబు
యాచకకోటుల కాసవిఱుపు
దాసర్లమిత్తి సన్న్యాసుల తెరబొమ్మ
జోగిజంగాలకు సొంటికొమ్ము
తే. పాఠకులకొట్టు నట్టువపాలియదురుఁ
గ్రోవి భరతంపుటయగారి గుండెదివులు
బట్టువాకట్టు బవనీలపాముకూన
యనఁగ విఖ్యాతిఁ గాంచు నాయాఁడుఁగూచి. 20

సీ. గూనివీఁ పనరాదు కోలమూతినిజాఁచుఁ
గొడిపెమో మనరాదు గొడఁగసాగు
బాకిమో మనరాదు పగసాటి బెదరించు
నొంటిప ల్లనరాదు కంటగించు
నరవెండ్రు కనరాదు నాఁడెల్ల జగడించు
వాటుగా లనరాదు చేటుఁదెచ్చుఁ
జెవు డనఁగారాదు చేట యెత్తుకవచ్చు
గ్రుడ్డిక న్ననరాదు గొట్టుసేయు
తే. వెఱ్ఱి యనరాదు పైఁబడి వెక్కిరించు
గామి డన రాదు మొగమున గంటువెట్టు
పెంకి యనరాదు వట్టిగుంపెనలు సేయు
ముద్ది యనరాదు గ్రుద్దు నయ్యెద్దుమొద్దు. 21

క. గడెతడవు వేసటలచే
సుడివడ కటు తనదు ప్రాఁతసుద్దులు విన్నన్
వడినిచ్చు నొక్కపుచ్చిన
యడగొంటుం బడుకక్రిందియాకులు రెండున్. 22

సీ. రమనేలినట్టి గురస్తునందు రదేమొ
నేలమిన్నులు గొల్వ నేర్చుటరుదె
మేనకాంగననంటుకాని మెత్తు రదేమొ
సృష్టికిఁ బ్రతిసృష్టి సేయుటరుదె
కడవఁబుట్టినవానిఁ గడునుతింతు రదేమొ
పాథోధి పుక్కిటఁ బట్టుటరుదె
లంకఁగాల్చినవాని బింక మెంతురదేమొ
హెచ్చుమందులకొండఁ దెచ్చుటరుదె
తే. యనుచు మదితప్పితప్పి నీళ్లానిపూని
తోడిముదుసళ్లఁ బెక్కండ్ర గూడఁబెట్టి
పట్టి తలనొవ్వ రవ్వగాఁ బవలురేలు
వట్టిపగ్గెలు ప్రేలు నవ్వారజరఠ. 23

క. అది నెమ్మదివదలని చల
మొదవఁగఁ దనసుతకుఁ బైఁడి యొకనిద్దురకుం
పదివేలమాడ లీయక
కదియఁగ నీదెట్టి విటశిఖామణినైనన్. 24

క. ఆకామసేననవబి
బ్బోకము గనుఁగొనుట మదనభూతావేశ
వ్యాకులితమానసాంబుజుఁ
డ్రై కుందుచు సోమదత్తుఁ డతివిరహమునన్. 25

క. అక్కలికి కొనఁగవలసిన
రొక్కము పురహరుఁడు దానరూపము రతిగాఁ
జక్కెరవిలుతుఁడు వెఱపు
న్మొక్కలితన మెపుడుఁ దన్ను ముంపఁగ నుండెన్. 26

ఉ. అంతట నొక్కనాఁ డతఁ డొయారము మీఱఁగఁ గామసేన నే
కాంతమునందుఁ జేరి మనసారఁగఁ బుక్కిటివీఁడె మిచ్చి గి
ల్గింత లెసంగు కౌఁగిటి బిగింపుల నింపులనింపు పారువా
వింతరొద ల్ముదంబు నొదవించునటు ల్కలఁగాంచి వేడుకన్. 27

చ. తనచెలికానితోఁ బసిఁడిదార్చక యేనల కామసేనతో
నెనసితి నిన్న నంచు వచియించిన నాతఁడు దానియింటికిన్
జని మది నిల్పఁజాలక ప్రసంగవశంబున సోమదత్తుఁ
డినవచనంబు లెల్లఁ బ్రకటించినచో వెలముద్ది యుగ్రయై. 28

క. ఏ నెఱుఁగకుండ నాసుత
తో నెనయుట యెట్టు లిట్టిదుడుకులు గలవే
కానీ రొక్కం బీయక
పోనో చూచెదము తనప్రభుత్వం బనుచున్. 29

సీ. శ్లేష్మంబు కుత్తుకఁ జిఱ్ఱుబుఱ్ఱున కఱ్ఱు
కఱ్ఱును దగ్గు లగ్గలముఁ గాఁగఁ
జన్నులు తలఁగడ సంచులవలె వెళ్లి
పయ్యెదమీఁద జంపాల లూఁగ
బీదనరాలతోఁ బెరుఁగువాఁగడుపులో
బల్ల నల్లడలందుఁ దుళ్ళిపడఁగ

బుగ్గలాహిరియూటఁ బొడము వాసనతోడి
కంకినోటను జొంగ యంకురింపఁ
తే. దిరుకొళములోనఁబడిన క్రోఁతియునుబోలె
వడకుకొంచును నేచుట నెవ్వారిఁ గన్న
గ్రుడ్లు మిడికించుచును గుడ్లగూబరీతి
వేగఁ దనయిల్లు వెడలె నావృద్ధవేశ్య. 30

తే. అంతలోననె శాలివాహను దివాణ
మునకు నేగుటకై బంధుజనులు గొలువ
వచ్చునలసోమదత్తు నవ్వారవనిత
జనని వీక్షించి సందడి జడియ కరిగి. 31

తే. వెఱ్ఱి నీ రానుకతమున వెడలునట్టి
చొక్కుబోఁదట్టి యొకకన్ను వెక్కఁబెట్టి
దడిగఱవఁబోవు వేసిచందమునఁ బట్టి
పరుసమెచ్చఁగ నూరుజప్రముఖుఁ బలికె. 32

శా. అయ్యా యల్లుఁడ యెంతపెద్దఱికమయ్యా నిల్చిమాటాడనీ
వియ్యంజాలని సెట్టివా నెనరు లే దీపట్ల నిట్లైన నీ
వియ్యా లందఱి కేదిదిక్కు మఱి నీ వెన్వెంటనే వచ్చు మా
యయ్య ల్చెప్పరె నీకు మాకుఁ దగవీయాదాయమే కంటివో. 33

క. నలుగురిలో ని ట్లాపని
పలుకఁగఁ దగదైన వెఱ్ఱిపట్టినకతనం
దెలిపెద నీకేరోసము
గలిగిన బ్రతికితిమి మంచికార్యం బిదియున్. 33

క. ఇయ్యెడఁ గలగిన రోవెల
యియ్యక నా కెఱుక లేక యిటు నే నింటం
దయ్యమువలె నుండఁగ మా
తొయ్యలితో నెట్లు కూడితో నే నెఱుఁగన్. 35

క. పైఁడేమి బ్రాఁతి యిదిగో
నేఁ డిచ్చెదు మ్రుచ్చు వగల నెలఁత రమింపం
బోఁడిమి చెడదే మఱి బురి
కాఁడవుఁ దగ కొదవలే జగంబు లెఱుంగున్. 36

తే. నిన్ననే నన్ను మొఱఁగి నాచిన్నదాని
నక్కటా యోడరేవున నమ్మికొందు
వేమిటికొ జాఱవిడిచితి వింతెకాని
యంత దబ్బఱకాఁడ వీవౌదొ కావో. 37

తే. మంచిమణులకు వెలఁ బొసఁగించువేళ
హెచ్చువెలలకు సొమ్ము చేయించుచోట
నగరి జాలెలు నీయింట నిగిడియున్న
వింత మాకేల మారొక్క మిచ్చిపొమ్ము. 38

క. అన సోమదత్తుఁ డద్భుత
మున నచ్చట నిల్చి వెఱ్ఱిముద్దియ కలలో
నెనసితి నీదు తనూభవ
ననుపమరతి నింతెకాని యన్య మెఱుంగన్. 39

తే. అనిన నమ్ముద్ది మంచి దట్టైన నేమి
నాతనూభవవలన ననంగసౌఖ్య
మబ్బెఁగద నీకు నిదియు లేదన్న నందు
వర్థ మిప్పించి యవ్వల నడుగుపెట్టు. 40

క. అని రట్టుసేయ నచ్చటి
జనములు సొమ్మీయకునికి చనదని వగదెం
చిన దాని దోడుకొనిపో
యె నతం డింటికిని రొక్క మిచ్చెద నంచున్. 41

క. చని ధూర్తచకోరమునకు
దనవృత్తాంతంబుఁ దెలుపఁ దత్కీరము న
వ్వి నిజంబుగఁ గెలిపించెద
నిను వెఱవకు మనియె వైశ్యనీరజగంధీ. 42

క. ఆవైశ్యునిఁ దత్కీరం
బేవిధి గెలిపింపవలయు నెఱిఁగింపఁగదే
నీవే జాణ వటన్నన్
భావించుచుఁ జిలుకతోఁ బ్రభావతి పలికెన్. 43

క. ఏలాగున గెలిపించెనొ
బాళిమెయిం బ్రహ్మలోకపర్యంతము నే
నాలోచన యొనరించితిఁ
జాలదు నాహృదయ మిది నిజంబుగఁ దెలియన్. 44

వ. అనిన విని యవ్విహంగమపుంగవం బనంతరకథావిధానం బిట్లని తెలుపం దొడంగె నవ్విధంబున నాధూర్తచకోరంబు దత్తప్రతిజ్ఞం బైనవిత్తంబు సోమదత్తునిచేత మూటగట్టించి దానికిం గట్టెదుర నొక్కనిలువుటద్దంబుఁ బెట్టించి పెద్దలతో నవ్వెలముద్దిం బిలిపించి దర్పణప్రతిబింబితార్థంబుఁ గైకొనుమని పలికిన నచ్చటివారును స్వప్నదృష్టంబునకు నిదియె సమానంబని నిర్ణయింప నప్పణ్యవృద్ధయు నగణ్య లజ్ఞానమ్రవదనయై సదనంబునకుం జనియెనని పల్కునవసరంబునం బ్రభాతం బగుటయు. 45

క. అంతిపురంబున కరిగి ది
నాంతమున న్నృపతిఁ జేరి నరిగెడుతమితోఁ
జెంతకు వచ్చినకోమటి
యింతింగని చిలుకరాయఁ డిట్లని పలికెన్. 46

క. రమణీ యాధూర్తచకో
రముకథ యిఁకఁ గొంత కలదు రాజవియోగ
భ్రమమడఁచి తెచ్చికోల్నె
య్యము తోడుతనైన వినుమటంచుం బలికెన్. 47

క. ఆగతి నింటికిఁ జని యా
బోగము ముసలాపె యాత్మపుత్రికతో నా
జాగెల్ల దెలిపి పరిభవ
యోగంబున మదికి ఖేద మొదవఁగ నంతన్. 48

సీ. పుట్టలమ్మ యటన్నఁబో యెంతలేదను
సందివీరుల టన్న జాము గొణుగు
నెక్కలమ్మ యటన్న నొక్కటికొదవను
బోతురాజు లటన్న బూతు నుడువు
ధర్మరాజు లటన్న దబ్బఱలే తిట్టుఁ
గంబమయ్య యటన్నఁ గ్రాసి యుమియు
గ్రామగంగ యటన్నఁ గాదా మరో యను
దేవాదులన్న గద్దించి చూచు
తే. నిన్ని దేవళ్లఁ గొలిచి నేనేమి గంటి
పోయి పచ్చని పులుగాసిపులుఁగుచేత

మోసపోయితి ననికుందు మొనయుఖేద
మారట మొనర్ప విసివి యయ్యారిబసివి. 49

సీ. నట్టింట దేవళ్లుపెట్టెఁ బెట్టినతిన్నెఁ
గొట్టించి వెసఁ బందిగూడు చేసె
మెడనున్న పాదాలు విడిచి యెవ్వరిఁగన్న
మొరుగుతలారికి మురువు చేసె
బానలో దాఁచిన పట్టుపుట్టము చించి
పొదుగుడు కోళ్లకుఁ బొత్తి చేసె
దేవాదుల కడెంబు దిగిచి కమ్మతగాని
పట్టికానికి మొలకట్టు చేసెఁ
తే. గాటిఱేనికి మీఁదుగాఁ గట్టి యున్న
గట్టివరహాని వరహానిగాఁగఁ జూడఁ
కాడఁబోఁగూడ కొక్కమాటాడకుండ
గుండనికి రంగుబంగారు గోరుసేసె. 5

తే. అంతఁ దత్పుత్రి కీరమా యింత చేసె
దాని నంజుడు దినకున్న నేను సాని
కూఁతురనె యంచుఁ దల్లిని గుస్తరించి
మఱియు నవ్వార్త యూరెల్ల మఱవనిచ్చి. 51

క. వలసిన సతికే చిన్నెలు
గలవో యచ్చిన్నెలెల్లఁ గనుపించుచు న
వ్వెలవెలఁది సోమదత్తుని
వలకు న్లోపఱిచి మేలువానిం జేసెన్. 52

తే. చేసి యొకనాఁడు మీయింటి చిలుక కతలు
చెప్పునందురు నామాట చిన్నఁబుచ్చ

కిపుడె తెప్పించరా దాని యెడను గలుగు
పొలుపు గనుఁగొని మరల నంపుదము గాని. 53

చ. అనవిని సోమదత్తుడు నిజాప్తులఁ బంచిన వారు దెచ్చినం
గనుఁగోని కామసేనయు వికాసపుమాటలుగా వచించి యెం
దును సరిలేక మించు నలధూర్తచకోరశుకాగ్రగణ్యముం
దనగృహసీమ మంచుకొని దబ్బఱ నెయ్యము నిబ్బరంబుగన్. 54

తే. కొన్ని దినములు చన రోషకుటిలహృదయ
వనజయై దీనిమాంసంబు వండుమనుచుఁ
జిలుక నెవ్వరు గనకుండఁ జేతికొసఁగ
బోనకత్తియ వెస పాకభూమి కరిగె. 55

మ. అపు డాధూర్తచకోరకీరవర మయ్యాపన్మహాంభోధి యే
నిపుణత్వంబున నీఁదఁగావలయు నీ నేర్పెల్ల శోభిల్లఁగాఁ
జెపుమా చూతమటంచుఁ బల్కి తెలియం జింతంపఁగా నవ్వి వై
శ్యపయోజాస్యకుఁ జిల్క తక్కిన కథాంశం బిట్లు తెల్పెం దగన్. 56

క. ఆరీతిఁ బాకగేహముఁ
జేరిన యావంటలక్క చిలుకం దఱుగం
గోరి పచనక్రియాచిం
తారతితో నీలకత్తి నలుగడ నెమకన్. 57

ఉ. అత్తఱిఁ దాని జూచి శుక మంగన యెంతటిపుణ్యమూర్తివో
బత్తిజనింప నాదుచెఱఁ బాపెదుఁ గావున నిన్నువంటి య
త్యుత్తమ కేను నేర్పెడు ప్రయోజన మున్నదెయైన నామనం
బుత్తలమందె నీకిటుల యో జరయింతటి పాటొనర్చెనే. 58

క. ఏను ద్రికాలం బెఱుఁగుదు
మానిని పదినాళ్లలో సమంచితరేఖా
సూనవయి నిండుజవ్వన
మూనంగా నీకు హేతు వున్నది సుమ్మీ. 59

వ. ఇంత యెఱింగిన నీ కీయపాయంబుఁ దప్పించుకొనరాదే యని యంటివేని యలంఘనీయంబగు విధివిధానం బిట్టి దని నిశ్చయించి యున్నదాన నది యట్లుండె నవయౌవనాపాదకం బగు నొక్కమంత్రంబు నా కభ్యాసం బైయుండు; నది నాతోడనె పోయెడుం గదా యను విచారంబు తీరకునికి నీకు నుపదేశించెద దానివలన నీకుఁ బ్రాయంబు వొడముట కడుగనేల నీవిచ్చినవారికిం గలదు కాలయాపనంబు సేయక యిచ్చోట గోమయంబున నలికి మ్రుగ్గువెట్టు మనుటయు నావృద్ధ సంభ్రమాశ్చర్యానురుద్ధయై యచ్చిలుకఱేని నచ్చట నునిచి తదుక్తప్రయోజనంబులకుం బోయిన. 60

క. ఆధూర్తచకోరము గరు
దాదృక్పటపటనినాద మడరం బరదు
స్సాధంబై వరమానా
బాధత్వర మెఱయఁగా నభంబున కెగిరెన్. 61

తే. ఎగిరి చెంగట నీశానగృహములోన
గూళ్లు పెట్టిన చిలుకలఁ గూడుకొనియె
దానిఁ గానక భయమంది బోనకత్తె
కార్కవాకవపాకపాకం బొనర్చె. 62

క. ఆకామనేన మదిఁ జిం
తాకలుషత మాని సోమదత్తునితో నే

లేకున్నతఱి బిడాలం
బాకీరముఁ బట్టి చంపె ననుచుం బొంకెన్. 63

క. అటుకనుక నేర్పుగలిగినఁ
గుటిలాలక నేఁడు నీవు కోరినపనికే
గుట తగు లేకుండినచో
నిటనుండియె మరలు మని శుకేంద్రుడు పలికెన్. 64

తే. అంతలోనన యరుణోదయంబు మించ
నాప్రభావతి యంతఃపురాంతరమున
కరిగి యానాఁటి రేయి భూవరునిఁ జేర
నేగుచోఁ జిల్క యక్కల్కి కిట్టు లనియె. 65

తే. అతివ ధూర్తచకోరశుకావతంస
మంత చేసిన గామసేనాంబుజాత
గంధిఁ జెఱతు నటంచుఁ గంకణము గట్టె
నెట్లు చెఱపంగవలయు నీ వెఱుఁగఁ జెపుమ. 66

క. అని పలికి తెలియ నేరని
వనితామణిఁ జూచు కీరవల్లభుఁ డది దా
వినిపింపఁ దొడఁగె ననితర
జనితర సంస్తవ్యవచనసంభావ్యముగన్. 67

క. ఆరీతిఁ దలఁచి ధూర్తచ
కోరము తత్క్రియకు వేళఁ గోరుచు నుండన్
మారునిచెలిఁ జెనకెడు నొ
య్యారముగల కామసేన యంతటిభక్తిన్. 68

క. ఒకనాఁడు కోవెలకు నే
గి కపర్దికి మ్రొక్క గర్భగృహమునఁ దన్మూ

రికి వెనుక డాగికొని యా
శుక మిట్లని పలికెఁ దద్వచోగతిగాఁగన్. 69

ఉ. మెచ్చితి నీదు భక్తికి సమిద్ధవిశుద్ధకళాభివృద్ధికిన్
దచ్చనగాదు నాపలుకు దప్పదు చొప్పడుఁ గాయసిద్ధి యే
నిచ్చెద నీవుఁ దల్లియు మఱెవ్వరితో నెఱిఁగింపఁ బోక యీ
వచ్చుసరోజశాత్రవుని వారమునాఁ డిటు రండు వేడుకన్. 70

క. తొలునాఁడు బోడలై ని
శ్చలభక్తిం జోగులకును జంగాలకు మీ
యిలు చూఱవిడిచి యిటురా
వలయున్ వైష్ణవుల కొసఁగవల దేమైనన్. 71

క. వారు శివద్రోహులు గద
యీరసమున శైవమతము హెచ్చఁగరా దం
చేరీతినైనఁ జెఱతురు
నారీమణి వారిమాట నమ్మకు మింకన్. 72

క. అని పల్క నాల్గుదిక్కులు
గనుఁగొని శంకరునిమాటగా నమ్మి కృపా
వననిధి హర త్రిభువనపా
వన ధీరస్వాంత యనుచు వర్ణించి వెసన్. 73

క. గుడివెడలి వైష్ణవులు గను
పడకుండఁగఁ జెలుల నరిగ పట్టుమటంచుం
బడఁతి తన యింటికడకున్
పడిఁ జని నిజజననిఁ బిలిచి నగుమొగ మలరన్. 74

క. హరుఁ డానతిచ్చినాఁ డె
వ్వరితోఁ జెప్పకుము సోమవారమునాఁ డి

ర్వురకు నెలప్రాయ మిచ్చుం
జరయు న్మృతి లేదు సంతసం బయ్యఁ గదా. 75

చ. ఆన విని వృద్ధవైశ్య పులకాన్వితయై నవయావనంబు నే
నెనసితినేని యీపడుకటిల్లు మదీయము నీవు వేఱె యిం
టను బవళింపుమన్న జగడాలకు రాకుమె యూర నీవు నే
నును గడియింపఁ జొచ్చినఁ దనూభవ గోడలు పైఁడిసేయమే. 76

సీ. ఇప్పుడే తెచ్చి నీ కిచ్చెదఁ గాని యీ
తళుకుఁగమ్మలు నేనె తాల్చికొందు
నృపులచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీ
పెద్దముక్కఱ నేనె పెట్టికొందు
నృపునిచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీ
బొగడలజోడు నేఁ బూన్చికొందు
నెటులైనఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీ
మట్టెలు నేఁ గాళ్లఁ బెట్టికొందు
తే. నౌర నీవు గడించిన వనుచు నా కొ
సంగకుండిన మఱి నేను సంతరించు
సొమ్ము మీఁదట నీ కీయఁ జూడు నాప్ర
తాప మని పల్కి యుత్సాహచాపలమున. 77

సీ. కుఱుచనెరు ల్దువ్వికొని కొప్పు సవరించుఁ
బరువెత్తి కాటుకబరిణ వెదకు
సొంపుతో నద్దంబుఁ జూచి పండ్లిగిలించుఁ
బడఁబోవుచును ముద్దునడలు నడచు
గోరంబుగా సారె గుంటకన్నులు ద్రిప్పుఁ
జూపఱ నగు నోరచూపుఁ జూచు

గరిడి కేగెదనంచుఁ గాసె దాల్పఁగఁ బోవు
బాకినో రెగనెత్తి పాటపాడు
తే. నింటి కెవ్వారు వచ్చిన నెనయుఁ దనకు
నదిగొఁ బైఁడీయ వచ్చి రటంచు లేని
బింక మెక్కించుకొని సారె బిగియునపుడె
ప్రాయ మేతెంచె నంచు నప్పణ్యవృద్ధ. 78

తే. ఇప్పు డెట్లున్న దాన మీ రేల చెప్ప
రౌర లెస్సాయె నని యొద్దివారిఁ దిట్టు
గుంపుగొని చూచువారలఁ గొట్టఁబూను
వెరఁగుపడి యింటిబిడ్డల వెక్కిరించు. 79

వ. ఇవ్విధంబున బహుప్రకారదుర్వికారంబులు మీఱఁ గుమారిం జేరి. 80

క. ఏమో తెలుపఁగ వచ్చితి
భామా యీలోన మఱపుపాటిల్లెఁ గదే
యేమీ మఱవక తనకు
న్సేమంబును బ్రాయమిచ్చు శివుఁ డుండంగన్. 81

క. గడువీలో మన మేగతి
నడువన్వలె నేమి చెప్పినాఁడు శివుఁడు నీ
వడిగితివొ లేదో తెలియం
బడుచువుగద నీకుఁ దెలియఁబడ దింతైనన్. 82

తే. పడుచవే గాకయుండినఁ బ్రాయ మిపుడె
యిమ్మనఁగరాదె సోమవార మ్మటంచు
గడు వొడటియేల యింతలోఁ గాలమేమొ
దేశమేమొ కదా యంచుఁ దెలియునటవె. 83

క. అనిన విని కామసేనా
వనజానన విన్నయట్టి వచనము లెల్లన్
వినిపించిన నేమేమీ
యని యమ్ముదిజంత చింత యాకులపఱపన్. 84

క. బ్రదు కెల్లఁ జక్కనగునని
మది నమ్మితిఁ గూఁతురా ప్రమాదము రాదే
తుది నిల్లు చూఱవిడిచిన
నిదియేమో మీఁది కార్య మెవ్వఁ డెఱుంగున్. 85

తే. ఆశపడి బోడనైన నేనగుదుఁగాని
యింటిసొ మ్మొక్కకాసైన నీయ నొకని
కొల్ల నే జవ్వనంబు మొఱ్ఱో యి దెట్లు
తగదు నీమాట నే వినుదానఁ గాను. 86

క. అనఁ గామసేన యంతటి
పని రారాదమ్మ కుముదబాంధవధరుఁ డా
డినమాటకుఁ దప్పటవే
యని సమ్మతిపఱిచి నిర్భరాహ్లాదమునన్. 87

క. త్యాగధ్వజ మెత్తించి స
మాగతయాచకుల కీశ్వరార్పణ మనుచున్
బోగముచెలి ధనమెల్లం
బ్రోగులుగా నొసఁగె సకలము న్వినుతింపన్. 88

సీ. పట్టెనామంబుఁ గీడ్పఱిచి నూతనవిభూ
తిని ద్రిపుండ్రంబులు దీర్పవచ్చు
ద్వయము పోఁబెట్టి శైవపురాణపద్యపా
ఠికల వేమాఱుఁ బఠింపవచ్చు

వనమాలికలు పాఱవైచి రుద్రాక్షపూ
సలపేరు లఱుత నెక్కొలుపవచ్చు
విష్ణుసుకీర్తన విడిచి శంకర హర
శబ్దము లుచ్చరించంగవచ్చు.
తే. గాని భుజములు కాయలు గాచి యున్న
తప్తముద్రలు మఱుపెట్టఁదరమె యనుచు
వైష్ణవు లభావవైరాగ్యవైభవంబుఁ
బొంద నది శైవుల కొసంగె భూరిధనము. 89

వ. ఇవ్విధంబుగా నిజాంశుకావశిష్టంబుగా గృహప్రముఖంబు లగుధనంబులు సకలభూషణంబులును ద్యాగంబు గావించి యమ్మించుఁబోఁడి జననీయుతంబుగాఁ బ్రతీక్షించుచు నయ్యిందువాసరంబు ప్రసన్నం బగుటయు. 90

చ. తిరుపతి కొప్పు లందముగఁ దీర్చిన బూడిదబొట్లు మంచి వే
ర్పఱచిన మించునట్టి రుదురక్కలపేరులుఁ గావికోకలున్
హరశివశబ్దము ల్దగ మృగాంకకళాధరుగేహసీమ కే
గిరి గుడిమేళము ల్పొదలఁ గిన్నరకంఠియుఁ దానితల్లియున్. 91

క. చని భావజారి సేవిం
చి నిజంబగుభక్తి నొంది చెంత వసింపం
గనుఁగొన వచ్చిరి బహుయో
జనదూరమునందుఁ గల్గు జనసంఘంబుల్. 92

తే. ఇవ్విధంబున భూజను లెల్లఁ జూడఁ
బ్రొద్దుకైవ్రాలుదాఁక నప్పొలతు లుండి
యేమొ సర్వేశ్వరుం డిట్లు తామసించె
ననుచుఁ జింతించుచున్న యయ్యవసరమున. 93

తే. గోపురముమీఁద ధూర్తచకోరకీర
మెక్కి ప్రజలార మీకేల తిక్కపట్టె
వీరిబగిసికి మఱి గారవించి హరుఁడు
కాయసిద్ధి యొసుగునే కల్లగాక. 94

క. అని వారు తన్నుఁ దునుమం
బనుచుటయును వారికొంప చెఱచుటకై దే
వుని వెనుకనుండి తా నా
డినమాటకు వార లచ్చటికి వచ్చుటయున్. 95

క వినిపించిన నింతేనా
యని యందఱు నవ్వ లజ్జ నానతముఖులై
చని రవ్వేశ్యలు తచ్ఛుక
మునకుం గలనేర్పు నీకుఁ బొసఁగ న్వలయున్. 96

క. అనినఁ బ్రభావతి మది మిం
చిన వెఱఁగున నిన్నువంటి చిలుకలనేర్పు
ల్గననగునె యనుచు వేగుట
గనుఁగొని వెసం జనియెఁ గేళికాగృహమునకున్. 97

క. ఆనాఁటిరేయి బాళి
న్భూనాయకమౌళిఁ జేరఁబోయెడుతఱి న
మ్మీనాయతాక్షి జూచి ప్ర
సూనాంబకతురగ మతులసూక్తిస్ఫురణన్. 98

క. వేసారక మద్వచనసు
ధాసారము మెచ్చ నీకె తగుఁగావున నీ
వీసారి యొక్కకథ విను
మాసారిజయస్తనద్వయా యని పలికెన్. 99

పదునెనిమిదవకథ

క. కల దభ్రంకషకేతన
చలదభ్రంబైన నైమిశం బనుపుర ము
జ్జ్వలవిభ్రమపరిపూరిత
కలశుభ్రకరాననానికాయం బగుచున్. 100

క. రజకుఁ డొకఁ డప్పురంబున
బ్రజ మెచ్చఁ దనర్చు వీరబంధు డనఁగా
నిజవంశోచితధర్మ
ధ్వజమై తగుపాటివైభవం బలరంగన్. 101

మ. బహిరభ్యంచితరాసభోత్కరము భౌభౌరావభాక్కుర్కురం
బహరీశోదయకాలధౌతవసనాయాతాచ్యుతాశీర్వచో
బహుళం బాయతకుంభకంబు గిరికాబాథార్థమార్జాలమై
గృహ మొప్పు వ్రజకాగ్రగణ్యునకు దూరీభూతదారిద్ర్యమై. 102

ఉ. వేళమె కోడికూఁత యగువేళలఁ జల్ది భుజించి బండ్లు గం
గాళము కూడునీరుచవుకారముఁదే విడియంపుఁ జొక్కుతో
మైలల మోపు వీఁపున నమర్చిన రేవుగుఱాని నెక్కి వ
య్యాళిగఁ బోవు వాఁడు విమలాపతటాకసమీపభూమికిన్. 103

క. ఆవీరబంధువునకు
న్భావజభుజవిజయసాధనం బగునిల్లా
లై వెలయు నొక్కకోమలి
లావణ్యవరేణ్య యై కళావతి యనఁగన్. 104

చ. మినమిన లీను మేను నెఱమించుల కొంచెపుటంచుఁగమ్మలుం
గొనఁబగుముద్దుమోము సమకొన్న మెఱుంగులకట్లదండయుం
గనుఁగవఁ గల్గుతేఁటి యొడికంబును సందికడెంబు మించ న
వ్వనిత యువాంతరంగమృగవాగురయై మెలఁగుం గృహంబునన్. 105

తే. ఆకళావతి నిజనాయకాల్పరతుల
నీగి మారవికారంబు హృదయ మన్య
పురుషసంభోగవాంఛతోఁ బొందుఁజేయఁ
దద్వశంవదయై నితాంతంబు మెలఁగు. 106

క. వెలవెట్టి వేఱకైకొన
వలదే కద యింట జారవనితలచీర
ల్గలుగఁగ నందులలోపల
వలసిన యటువంటి వింతవన్నెలు చూపున్. 107

మ. వటసమ్మార్జనగీతరాసభచయప్రహ్లానశబ్దంబు లొ
క్కట నోర న్వెడలం బరున్న సతిసింగారంబు వీక్షించి నీ
విటు నిద్రింపు మటంచు లేచి చన నయ్యబ్జాక్షి యవ్వేళ నూ
రట చేయు న్మదనాస్త్రకోటులకు జారక్రీడలం బ్రోడయై. 108

చ. తన సరిచాకెత ల్తనకు దాపుగ వారలకెల్లఁ దాను గుం
టెనలు వహించుకొంచు నెఱటెక్కులు నిండు విడెంపుచొక్కులు
న్మనసుఁ గరంచు నేర్పువగమాటలు నేరని తప్పుపాటలుం
గనఁబడ నవ్వధూటి పతికన్నులు మూసి చరించు నిచ్చలున్. 109

క. సొగసుఁ గని దాని పెనిమిటి
మగటిమి యెఱిఁగియును మాటిమాటికి నకటా

సిగవోయినఁ బోనిమ్మని
తగులుదు రుపనాథు లాసుధాకరవదనన్. 110

సీ. మిహిరావలోకన మేటికి వీక్షణా
యాసదుర్దమదోష మడఁపకున్న
మృత్తికాస్నాన మేమిటికిఁ దదీయదే
హస్పృష్టికలుషాల నడఁపకున్నఁ
బమిపంచగవ్య మేపనికిఁ దదీయాధ
రాస్వాదనైర్మల్య మడఁపకున్న
వేలిమి యది యేల వింతఁగా దీనితో
భోగించు పాపంబు పోకయున్నఁ
తే. జటులగాయత్రి యేల తత్సంగమాది
నాంతదుష్కృతదోషంబు నడఁపకున్న
నిన్నియును నేటికని రజకేందువదన
వేదవిప్రులు తలఁతురు విదితముగను. 111

క. ఈరీతి మెలఁగుదాని యొ
యారముఁ గని యొ శూద్రుఁ డధ్వగుఁడు మహో
దారుఁడు చారణుఁ డనియెడు
పేరునఁ దగువాఁడు మదనభీతాత్మకుఁడై. 112

క. చోరుని బుద్ధిది యైన
న్సారం బింటికడఁ దెలియఁ జని చూచెదఁగా
కీరమణి దారి యని యా
చారణుఁ డరిగెం దదీయసదనంబునకున్. 113

మ. చని కాంచెం గుసుమాక్షతంబు సదనాంచత్పానపాత్రంబు భా
సి నిజాసన్నసమున్నతాసనతదాసీనైకవృద్ధాక మ

ర్థినరాహ్లాదకరాతిసౌరభము మధ్యేకుండవిన్యస్త మ
గ్రనిచోచత్పరిమాణభాజనము నౌ కాదంబరీకుంభమున్. 114

వ. కనుఁగొని నితాంతోదకంబును నిస్తుములంబు నగుట శాక్తేయమతంబువారును బెద్దలమఱుఁగున మెలుగు కురంగనయన లరుగుదేఱం దగిన మదిరామందిరం బని డెందంబునం దలంచి నిజమనోవంచనాచుంచుచంచలలోచనాగమనంబుఁ గోరుచు నతఁ డందుఁ బ్రచ్ఛన్నవేషంబున నుండె. 115

క. సివసత్తులును దలారులు
బవనీలు న్మఱియు నాటపాటలవారుం
జవులు నుతించుచు మదిరా
సవముం గొని యొక్కఁ డొకఁడె జరగినపిదపన్. 116

సీ. ఇంటివా రెవ్వరో యెందు గాన మటంచు
నదిగొ కూర్చున్న దాయమ్మ యనుచు
నమ్మిక తాను గానక వచ్చితి నటంచు
నిది యెవ్వరుండెడి యిల్లటంచు
నంగడి కరుగుచో ననుదెంచితి నటంచు
వచ్చి జామయ్యెఁ బోవలయునంచు
నరిది బిడ్డలకు మందడుగవచ్చితి నంచు
నే నందులకు వచ్చినా నటంచుఁ
తే. జేరి రవ్వేళఁ దమమునిచెఱఁగులందుఁ
గాసు దుడ్డును బంగారుపూస వెండి
తునక మొదలింటి చిఱువాఁడు గొనినదెల్లఁ
గొనుచు మగనాండ్రు తమకెల్ల గుట్టు మెఱియ. 117

తే. అట్టు లరుదెంచి తక్కువ యనుటగాని
దోసమాడుదురా యని యాసవంబు
మంచి దని యల్లవృద్ధ వర్ణించి లేఖ
లొసఁగి క్రోలిరి మైరేయ మోపినట్లు. 118

చ. కనుఁగవదోరగల్లుల వికారపుఁజూపుల కోపు లాసుతో
డనె దళమెక్కు నాలుక తడంబడుమాటల పచ్చితేఱ మో
మునఁ బనిలేనినవ్వుల సముజ్జ్వలచంద్రిక లామతింప న
వ్వనరుహలోచన ల్సివము వచ్చినయందముఁ జూపి రందఱున్. 119

తే. ఒకతె వృద్ధకు మధుమూల్య మొసఁగు టరయ
లేక కొమ్మని మఱియొక్కరూక యొసఁగె
నొకతె గ్రోలియు మైరేయ మొల్ల లెక్క
మరల నిమ్మని దాని వేమరునుగనలె. 120

సీ. కసినికోఁతలు గోసి గారింతు రని బూతు
తెలియఁగా వదినెలఁ దిట్టువారు
బురిఁ బాసి వేఱు కాఁపురము సేయుద మన్న
వినఁ డని పతి దూఱి వనరువారుఁ
గడుపార మగనికే గంజిపోయ దటంచు
నత్త దుర్గుణ మెంచి యలరువారుఁ
దా నెవ్వతెయొ నన్నుఁ దఱిమి యీడ్వ నటంచుఁ
దోడికోడలిఁ జెడనాడువారుఁ
తే. గేరి యొకకొంద ఱాత్మల మీఱినట్టి
మాట లెల్లను మధుమదోన్మాదగరిమ

నలుక మెఱయంగ లక్ష్యసంప్రాప్తవీక్ష
ణాబ్జముల హాసవిన్యాస మమర మఱియు. 121

సీ. మగని నిద్దురపుచ్చి మఱివచ్చెద విచార
మడఁచి యింటికి నేగు మనియె నొకతె
నిను జూడఁగా నిఁకే నిలువలే నొకసారి
యటుచేరి నిల్వరా యనియె నొకతె
యమ్మ నేఁజెల్ల సయ్యాట మెందాఁక నే
నరిగెద విడువరా యనియె నొకతె
బతిమాలి నేనె పైఁబడు టింతియె కాని
యాలిపై దయచూడవనియె నొకతె
తే. యత్తవాకట్టుమంత్రంబు లడిగె నొకతె
విభుని జోకొట్టుమందులు వేడె నొకతె
మధువుచొక్కునఁ దేలి యామగువలందు
జారసాన్నిధ్య మపుడు సాక్షాత్కరింప. 122

క. ఈలాగున నాలాగున
లీలాలోలలగు నచటి లేమలతోఁ ద
త్కేళిం దగిలిన రజక వి
శాలేక్షణ వగలు గాంచి చారణుఁ డాత్మన్. 123

క. ఇది దాట్లమారి యగునని
పదపడి మఱునాఁడె యొంటిపాటున మేకో
లొదవింపఁ దాపి యింటం
దుదగానని ప్రేమ దానితో రమియించెన్. 124

క. వింత లగు లాలనమ్ముల
సంతస మెసఁగించి మించు చారణరజనీ

కాంతునిసన్నిధి నపుడ
క్కాంతామణి మనసు చంద్రకాంతం బయ్యెన్. 125

తే. అంత నయ్యింతి తప్పక యతనిఁ జూచి
యెంతనెఱజాణయో కాన నిట్టివాని
వీనిఁ బోనీయరా దని మేనుమేను
నెనయఁ గూర్చుండి వానితో నిట్టు లనియె. 126

క. మగవాని నమ్మవచ్చునె
యగపడి తన కార్య మైనయందాఁక విరా
ళిగదింతు రంత నెక్కడి
జగజోలి యటంచు నెరసి చనఁ జూతురుగా. 127

క. ఆఁటది వలచుట యరుదే
నాఁట న్మఱి వలచెనేని నాథుని బెనుపో
రాట మొనర్చినఁ గోసిన
గాటం బగుఁగాని యెడయఁగా లేదు చుమీ. 128

ఉ. అంత యెఱుంగ నేర్చిన విటాగ్రణివౌ దటుగాకయున్న నా
యంతటిదానిఁ బూని వెలయాలివలెం బతిమాలఁ జేయదే
యింతటిలోనె మీపురికి నేగక యిచ్చటఁ గొన్నినాళ్లు నా
చెంతనె యుండి నీవలపు చెల్లుఁబడిం గడతేర్పరా యిఁకన్. 129

క. వెచ్చమునకు లేకుండిన
నిచ్చెద దిన మొక్కమాడ యిచ్చటి మఱినా
ముచ్చటలీ వీడేర్చినఁ
దచ్చనగా దేలమూలధనముం గరమున్. 130

తే. అనుచు మేకోలుగావించి యపుడెపోయి
తనగృహంబున గూటిలోఁదలుపుమూలఁ

బిడతలో నాయకుఁడు దాఁచిపెట్టినట్టి
మాడ లర్పించి వానితోఁ గూడి మెలఁగె. 131

క. ఆవీరబంధుఁ డంతట
భూవరు వెనువెంట దండు పోవుటయు నిజే
చ్ఛావిధిఁ జారణుఁ గూడి క
ళావతి బహుభోగలీలలం దేలంగన్. 132

క. త్రోవనిటు వచ్చి వచ్చియు
నీవెలఁది న్రతులయందు నెనసినవాఁడం
బోవలయు నూరి కనుచుఁ గ
ళావతితోఁ జారణుం డలంఘ్యప్రేమన్. 133

తే. వచ్చి బహుకాల మయ్యె మావారిఁ జూడ
నూరు సేరంగవలయు నీయొద్దవాసి
పోవఁ గాళ్ళాడ విఁక నేమి బుద్ధి యాన
తీయవే యన్న బెగడి యయ్యిందువదన. 134

క. ఏమంటి వూరి కేగెద
వా మంచిది పోక నిలువవచ్చునె పొమ్మా
నామాటకు నౌ ననఁ గా
దీమిక్కిలిమాట లేల తెలిపెద వదియున్. 135

క. కాక నామీఁది తమి నీకుఁ గలిగెనేని
నీదువెంటనె పెట్టుకపోదు గరిత
నాత్మఁ గొంకుదువేని నీవరుగు మూరు
నెనసి నీవు సుఖంబుండు మింతెచాలు. 136

చ. అనుడు నతండు మోదమున కాడెద వింతియకాక నీవె వ
చ్ఛినఁ గనుసన్న నీపలుకునేయుచునుందు జనంబు మెచ్చఁగా

నిను నఱచేత నుంచుకొని నేఁ బదిమాళ్లకుఁ గొన్నతొత్తు మ
ద్వనిత కలంచెనేని పెడవాడనె వైవనె యింత యేటికిన్. 137

తే. అనిన నంగీకరించి యయ్యంబుజాక్షి
యపుడె పైనంబు సంజోక లమరఁ జేసి
చారణుని వెంట నింటి విచార ముడిగి
చనియెఁ దొలికోడికూఁత ప్రొద్దుననె లేచి. 138

వ. ఇవ్విధంబున నవ్వధూమణి యుపనాథాదీనయై యరుగునెడఁ దృతీయదినప్రయాణంబున. 139

సీ. పరికరోత్తరయుక్తపాథేయమును సజం
బీరమై యొకనాఁటి బియ్యమున్న
యసిమిలోఁ జలువ మాయక యుండ మడఁతవె
ట్టిన చల్లడము దుప్పటీరుమాలు
నొరపుగాఁ బొలుపొందు నురగవల్లి దళంబు
పూగపూరితమైన పొరలతిత్తి
వ్రేలఁ బ్రతిక్షణార్ద్రీకృతశంఖచూ
ర్ణంబైన లోహకరండకంబుఁ
తే. గాళ్ల బిడివాళ్లు నికటమార్గప్రపాన్న
రసనము న్మేషజనితమౌ రాగ మమర
నృపతిచే నంపకము గాంచి యిల్లు సేర
వచ్చె నాదారిఁ దన్మనోవల్లభుండు. 140

క. అపు డారజకాంగన యే
నెపమున బొంకంగవలయు నీమదిలోన
న్నుపమగని చూచి తెలియఁగ
జెపుమా చూచెదము నీదు శేముషిబలమున్. 141

క. అనినఁ బ్రభావతి శుకపతిఁ
గనుఁగొని యపు డెట్లు బొంకఁగావలె నంచు
న్నను నడిగితి వింతేకద
వినిపింపుము తెలియ నట్టివిధమని పలికెన్. 142

క. ఈథ తెలియ నెఱుంగుదు
నాకొక పెద్దఱిక మిచ్చినం గాదనరా
దేకద యైనను వినుమని
యాకీరం బనియె ననియతాదరగరిమన్. 143

శా. ఆరీతిం బతి చేరవచ్చుటయు నయ్యబ్జాక్షి వీక్షించి చిం
తారూపం బగుభీతి దోఁచి దృఢధైర్యస్థైర్య యై వానికి
న్నోరాడింప నశక్య మౌకరణిఁ గందోయిం జలం బుబ్బిము
న్నీరై పాఱఁగ నేడ్చెఁ గమ్రకలకంఠీనాదభేదంబుగన్. 144

తే. ఏడ్వ నింతటి యపకార్య మేమి యనుచు
దిగులుపడి నిల్చుమగని నెమ్మొగముఁ జూచి
లెస్సవచ్చితి నినుఁ బాయలేను వేగ
వచ్చెద నటంచుఁ బల్కినవాఁడవయ్య. 145

క. మఱచితివె సుమ్ము శీఘ్రము
పఱతెంచెద ననుట యడుగువాసినచో న
క్కఱవాయు ననుట నిజమని
యెఱుఁగరుగా పతులనమ్ము నిందునిభాస్యల్. 146

చ. పతి పరభూమి కేగిన సపారమనోవ్యథఁ గుంది ధైర్యవి
చ్యుతి దివసంబు లెన్నుకొనుచు న్సతులుందు రెఱుంగలేఁ డెకా
యతఁ డొకవన్నెలాడి మొగమంటి కనుంగొనుచు

న్విరాళి చే
సతమని నమ్మియుందు రిది సాజమెకా మగవారి కారయన్. 147

తే. మన్న పురుషుని చెడనాడు మగువ మీఁదఁ
బోయి పులుగాసిపురుపయి పుట్టుననుచు
బాఁపనమ్మలు చెప్పినపాట మేలె
యనుచు నేనుందు నిను దూఱుకొనఁగ వెఱచి. 148

తే. ఇవ్విధంబున నుండి యింకేమియందుఁ
గానికలఁ గంటి యటుమొన్నఁ గన్నయపుడె
యుగము గ్రుంగినయట్లైన నొల్లఁబోయి
నిలువఁగూడకయెన్నియెన్నికలొ పొడమె. 149

ఉ. ఆయన యొంటిగాఁడు వెలయాండ్రతగు ల్గలవాఁడు వాఁడిమిం
బోయినచోట మాట పొఱపొచ్చెము సైఁపని రోసగాఁడు గా
యీ యెడ నేమిపుట్టునొ సహింపఁగరాదు విచార మంచు నా
థా యిఁక నేమి యేనగరి యైనను బోయెదనంచుఁ గ్రక్కునన్. 150

శా. చూపట్టంగలదాన నొంటిమెయి నిచ్చోఁ బోవరాదంచు నే
నీపుణ్యాత్మునితో డమర్చుకొని యిట్లేతేరఁగాఁ ద్రోవనే
నాపాలం గలదేవుఁ డీకరణిఁ జెంత న్నిల్పెఁగా నిన్నుఁ బే
ర్చే పెక్కేండ్లు సుఖమున న్మనుము నాచిత్తంబు రంజిల్లఁగన్. 151

తే. ప్రాణనాయక మదిదోపఁ బాపమునకు
మగడ వింతియకాక నామదికిఁ జూడఁ
దండ్రివైనను నీవీవ తమ్ముఁడయిన
నింక నెన్నఁటికిని నిన్ను నెడయవెఱతు. 152

మ. అను నిల్లాలిని గౌఁగిటం బొదివి నెయ్యం బార నూరార్చి య
వ్వనితం దోడ్కొని వచ్చి యందఱి నెగు ల్వారించితంచుం బ్రియం
బున నాచారణు వీడుకొల్పి తనగీముం జేరె నాతండు కా
మినియుం దానును నిట్టి నేర్పువలెఁ జుమా నీకుఁ గోకస్తనీ. 153

తే. అనుచుఁ గీరంబు వల్కె వైశ్యాంబుజాత
గంధి నివ్వెఱపడి యదిగాక జంత
యని ప్రమోదించి యరుణోదయంబుఁ గాంచి
యరిగే శశికాంత బద్ధశుద్ధాంతమునకు. 154

క. ఆమాపు వలపుత్రోపున
భామాపుష్పాస్త్రు భూమిపతిఁ జేరుటకా
రామ యరుదేర శుకము సు
ధామయమధురోక్తి నద్భుతంబుగఁ బలికెన్. 155

పందొమ్మిదవకథ


క. కనకాంబరి కనకాంబరి
యనఁగా నొకపురము గలదు హర్మ్యాగ్రవినూ
తనహరిమణిఘృణితిమిరో
జ్జనితరహఃకేళిసౌధజాలం బగుచున్. 156

తే. ఆపురం బేలు నీలవాహనుఁ డనంగ
రిపుతమోహేళి యగు నొక్కనృపతిమౌళి
యతని చెంగట ధీరుఁ డనంగ బిరుదు
నిండు మాస్టీఁడు నెగఁడు మన్నీలు వొగడ. 157

సీ. తలపాగపొరమీఁద జెలఁగెడునాయుథా
ర్చనసల్పినట్టి దాసనపుఁబూవు
నెడమచే గొలుసును దొడపుఁగత్తియుఁ బూల
బిరు దొందు కుడికేలఁ బెద్దకత్తి
దట్టితోఁజెక్కు నిద్దాపంకి కుసుమ పూ
వన్నియ దుప్పటివల్లెవాటు
భుజములు విరులచేఁ బూజించు బోడిక
ల్మురువైన ముందరి బిరుదుడవిణ
తే. దండహంవీరతలగుండు గండ యనుచు
బద్యము పఠించు జీతంబు బంట్లుఁ జూడ
మూఁగికొను పౌరజనులగుంపులుఁ జెలంగ
నతఁడు దొరకొల్వు చేసి గేహమున కరుగు. 158

క. ఇల్లీల నడచు నాతని
యిల్లాలు దనర్చు నొకతె హేమాంగి యన
న్వల్లభుని కన్న దీనికి
జిల్లరవిద్యలకు బిరుదు చెల్లు ననంగన్. 159

తే. పరభయంకరబిరుదవిస్ఫురితుఁ డైన
కాంతు నయ్యిందుముఖి తనకాలిక్రింది
కసవుగా నెచు వెడమాయగప్పి జార
ధవులమాటలు వడఁకి యౌదలధరించు. 160

చ. పతి యతిశౌర్య మెంచి యుపభర్త రతాప్తికిఁ జేరకున్న న
చ్చ్యుతమగు ధైర్య మిచ్చుచు నయో మగవాఁడ వటంచు నెట్లు పు
ట్టితి విఁక నేమి తద్భుజపటిష్ఠతలోన లొటార మింతె నీ
వతనికిఁ గొంక నేలని భయఃస్థితిమాంచి రమించుఁ దద్రతిన్. 161

క. ధవునకు నుపభర్తకు బాం
ధవము ఘటియించు జారుదండనె యాత్మీ
యవివేకవర్తనంబులు
చెవికింపులు గాఁగ మగనిచేఁ బొగడించున్. 162

తే. ఇవ్విధంబునఁ దనపోక లెఱుఁగనీక
మగని జోకొట్టి నెరివచ్చి సొగసుజెట్టి
వాడలోఁ గూడు జారులవల్లెత్రాఁడు
చెలువున మెలంగు నక్కొమ్మ సొలపుగ్రమ్మ. 163

క. అంతటఁ బెఱరాణువ హను
మంతుం డను పేరఁ బరఁగు మాస్టీని మదా
క్రాంతుని గెలిచెద నని నిజ
కాంతుఁడు చనఁ దొడుసు మాలెఁగద యిపు డనుచున్. 164

తే. అలరి హేమాంగి పతి వచ్చునంతలోన
వలచి వలపింప నేర్చు జవ్వనపు వన్నె
కానితోఁ గూడి కడలేనికాంక్ష దీర్చి
కొనియెద నటంచు మది నెంచుకొనుచునుండ. 165

ఉ. ఆపురి నొక్కజెట్టి గలఁ డన్యవధూమధురాధరామృతే
చ్ఛాపరతంత్రుఁ డొక్కదివసంబున వీథిఁ జరించువేళ వాఁ
డాపువుఁబోఁడిఁ జూచి విరహాతురుఁడై తన సర్వశక్తులుం
జూపియు దానిగర్వఁపునుచుక్కులు గాంచిరిరంసమించఁగన్. 166

తే. అర్కవాసరమందు నయ్యంబుజాక్షి
నడచుతఱి వామపద ముంచు పుడమిమీఁది

యిసుము గైకొని తనయింటికేగి ప్రొద్దు
గ్రుంకునందాఁక వేగి నెక్కొన్నబాళి. 167

క. తనపడుకటిల్లు గోమయ
మున నించుక యలికి మీద ముచుదాఁ గొని తె
చ్చినయిసుము నించి పయిన
వ్వనితామణి రూప మొనర వ్రాసినవాఁడై. 168

తే. చుట్టు యంత్రంబు లిఖియించి శుద్ధహృదయ
పద్ముఁడు దిగంబరుండు దిగ్బంధనిపుణుఁ
డగుచు నర్చించి ధూపదీపాదు లొసంగి
కోడి బలియిచ్చి కూర్చుండి గురుని దలఁచి. 169

క. మన మేకాగ్రముగా మో
హనమంత్ర జపం బొనర్చి యర్ఘ్యము లొసఁగన్
గనఁబడియె నప్పుడే మో
హిని నవ్యప్రథమరసవిజృంభణవృత్తిన్. 170

చ. కనఁబడి కొప్పువీడ వలిగబ్బిచనుంగవ పైఁట జాఱ బూ
సిననెఱతావి గందవొడి చిందఁగ నందెలు మ్రోయ దీర్ఘలో
చనరుచితోడ వీరమణి జగ్గన వేఁడుచు ముద్దువెట్టుకో
జనుటయు నిర్వికారమతిఁ జాగిలి మ్రొక్కి యతండు నిల్చినన్. 171

క. మెచ్చితి నీకోరిన సతిఁ
దెచ్చెదఁ దంత్రంబు కడమ దీర్చుము వెస నీ
విచ్చట నని మోహిని చన
హెచ్చిన మోహమున మల్లుఁ డింపుజనింపన్. 172

క. మకరాంక పంకజాతాం
బక యని యంత్రంబుఁ దుడిచి భక్తి మెయిం ద

ల్సికతోత్కరంబు నవఘట
శకలంబున నునిచి లేచు సమయము నందున్. 173

మ. ఎనసెం దాప మిదేమొ యంచుఁ బొగులన్ హేమాంగిపై నంత మో
హిని యావేశ మొనర్చి తెచ్చి నిలుపన్ హేరాళ మౌబాళి న
వ్వనితం జూచి యతండు తద్రతి ననిర్వాచ్యైకసౌఖ్యంబుఁ జెం
దిన యాపిమ్మట నమ్మిటారి మదినెంతే తెల్విసంధిల్లఁగన్. 174

ఉ. ఎన్నఁడు వీని పొం దెఱుఁగ నేగతి వచ్చితి వచ్చుమాత్రమా
కొన్ననవింటివాని యెలగోలు దురం బొనరించి డస్సిన
ట్లున్నది మే నిదేమిగతమో యెటులైన నిఁకేమి వీనిఁ బైఁ
కొన్న మనంబుఁ ద్రిప్ప నొనఁగూడునె యున్నది చాలు నిత్తఱిన్. 175

క. తను ముంచినది సముద్రం
బన వినమే రూపవంతుఁ డైనం గాకుం
డిన నామదిగరఁచెన్నే
ర్చిన యప్పుడె యితఁడు నాకుఁ జిత్తజుఁ డరయన్. 176

తే. అని ప్రమోదించి తనహృదయంబుఁ దెలిపి
వాని డెందంబు దెలిసి యవ్వనితతలఁపు
లేమి సేకుఱుటకు బాసలిచ్చి వాని
మొగము వీక్షించి పలుకు నమ్ముద్దుగుమ్మ. 177

క. ఇచ్చటికే రారా దీ
వచ్చటి కెపుడైనఁగాని యరుదెంచెదులే
వచ్చునపవాద యంతటఁ
బొచ్చెము లేనట్టి మోహమున కెడఁగలుగున్. 178

తే. కాన సిగ నొక్కచిఱుగంటఁ గట్టుకొన్న
వాఁడ వగుచును వాఁకిట వచ్చి నిలిచి
గంట మొరయింపు విని యేను గదియవచ్చి
తలుపుఁ దెఱచెద నీమాటఁ దప్పవలదు. 179

చ. అని సమయం బొనర్చి వికచాంబుజలోచన యింటి కేగ సా
యన దినముం దదీయవచనాదృతి నాగతిఁ జేరి తద్రతిం
దనరుచునుండు నంతనొకనాఁ డినబింబము పశ్చిమాంబుధిన్
మునిఁగినఁ జీఁకటు ల్నిజసముద్ధతిఁ జూపెడువేళ వేడుకన్. 180

క. ఆహేమాంగి నిజాలయ
దేహళి నిలుచున్నచో నలిక్షుద్బాధా
మోహితుఁ డొక తెఱువరి దృఢ
బాహుం డనువాఁడు భుక్తిపరతంత్రుండై. 181

తే. మాడ యిచ్చెద నన్నచోఁ గూడు వెట్ట
రింత పచనస్థలం బైన నీయ రిట్టి
మాలకొంపకు వచ్చితి మాఱులేక
గంజివోయుదురే యిందుఁ గలుగువారు. 182

క. ఇలు నెత్తిఁగట్టుకొని పో
గలుగుదురే దివికిఁ దాము గడపటఁ బొరుగూ
రులవెంటఁ జనరె యపుడీ
యలమట వాటిల్లదే దయాస్థితి వలదే. 183

క. మగవారు కఠినహృదయులు
మగువలు నాఁకొన్న వారి మాటలకు మనం
బు గరంగు నిందు రిచ్చటి
జగజంతలు మగలకన్నఁ జట్రాళ్లు సుమీ. 184

తే. మంచి దధికారి నగుచు నమ్మనుజవిభుని
గొలిచియైనను గొంపలు గూల్పకున్న
సడ్డసేయుదురే యంచుఁ జనెడువానిఁ
గాంచి హేమాంగి ప్రొద్దుపోకలకుఁ బిలిచి. 185

క. ఏమోయి యేల దూఱెద
వీమాడ్కిం బురమువారినెల్లను నీ పే
రే మెచ్చట నుండుదు వీ
గ్రామంబున కరుగుదేఱఁ గారణ మేమో. 186

వ. అన నప్పలుకులకుఁ జంద్రికాసక్తచకోరకంబునుంబోలెఁ దిరిగి తత్సమీపంబున కరిగి యోపుణ్యాత్మురాల నీవైన నాదరించి మంచిమాటాడితివి గదా యిదియే నాకుం బరమలాభంబు మధురాపుకంబు నాకాణయాచికాఁపురంబు తామరతంపర మదీయగృహంబు శ్రీధాన్యకటకంబు మదన్వయంబున కాకరంబు కంబుధరపాదాంబురుహంబు వేదలతాలవాలంబు నగు శేషశైలంబున కరిగి క్రమ్మఱి వచ్చువాఁడఁ బ్రొద్దుగాని ప్రొద్దున నీయూరిం జేరి నెప్పెఱుంగమిం జేసి యన్నవిక్రయపరాయణాయతనంబులుం గానక యాఁకటఁ గటకటంబడి గ్రాసంబు వేడినఁ జెడుపురువునుం బోలె విదలించువారలేగాని యాయాసం బెఱింగి రమ్మనువారు లేరు మాడలుండినంత గూడు గాదుగదా వలసినపదార్థంబుఁ దెచ్చియిచ్చెదఁ బాకం బొనర్చి పెట్టిన నీకులకోట్లకుఁ బుణ్యంబయ్యెడు నని నుడివి యెడనెడ నప్పడంతి యల్పస్వరంబున నిజవయఃప్రమాణాదు లడుగుట వలనను మందమందంబుగా భాషించుమనుటవలనను గొంతకొంత సందియంబు వొడమిన నడంచికొని తదానీతుండై గృహంబుఁ బ్రవేశించి దీపప్రభాధగధ్ధగాయమానం బగు తదీయశరీరంబును ననన్యసంచారంబునుం గని దానియందు నిజభార్యానిర్విశేషంబు దోఁపఁ జూచుచున్న నక్కురంగనయన డెందంబు గరంగినదాని తెఱుగున మిడిసిపడు గోడెబేడిసల పసం గులుకు బెళుకుచూపులు కొన్ని వానినెమ్మేనం గ్రుమ్మరించి కల్పితక్రీడాభరంబు లీడుజో డాడ నతని కిట్లనియె. 187

తే. ఏమి యమరింతు వన్ని నాయింట నిండి
యున్న విప్పుడ యమరింతు నోపననక
వండిపెట్టెదఁ బొమ్మన్న వాఁడు వట్టి
వేడుక జనింపఁగాఁ బణ్యవీథి కరిగి. 188

ఉ. కూరలు సన్నబియ్యమును గ్రుడ్డులకోళ్లును జింతపండు సం
బారము లుప్పు నెయ్యొ లుపుఁబప్పు మొదల్గొని తెచ్చి యన్నియు
న్వేఱుగ నింటిలో నులుపనించిన కైవడి నుంచె లేఁతన
వ్వారఁగ నవ్వధూమణి రయంబునఁ బాక మొనర్చి యంతటన్. 189

క. మామా యిన్నియుఁ దెచ్చితి
తేమానమీదేల వేగుదీపమువలదా
యాముదము దెము పొమ్మన
నామందవిచారుఁ డప్పు డంగడి కరిగెన్. 190

తే. అరుగ హేమాంగి యిది వీని కారగింపు
సేయఁగా నేమిగలదు మా జెట్టి కిడుట

కార్యమని యెంచి బోనంపుఁ గడవనించి
యంతలోవచ్చు దృఢబాహుచెంత కరిగి. 191

మ. అకటా యీయెడ నీకువండియిడఁ బుణ్యస్త్రీలు లేరైరె యే
టికి నాయింటికిఁ దెచ్చితన్నియుఁ జెనంటిం దోషి నేనంచు ని,
చుక శంకింపక హస్తము ల్పిసికికొంచు గించిదానమ్రమ
స్తకయై నిస్తులకైతవంబు పచరింప న్వాఁడు నిర్విణ్ణుఁడై. 192

క. ఇదియేమి బెడదవచ్చెనొ
గద యని పలుమాఱు వేఁడఁగాఁ గొదుకుచు న
మ్మదవతి యే నేమని చె
ప్పుదు నింతకుమున్ను పొరుగుపొలఁతుక నాతోన్. 193

క. తనమగనికిఁ దనకును నడ
చిన జగడముఁ జెప్పఁగా విచిత్రంబని యే
వినుచుంటి నంత వేఁపులు
దినియె న్నీమాఱు వండి దించినదెల్లన్. 194

తే. అనుడు నాతండు తత్సంగమాసఁ జేసి
యెంతలే దింతెకద దీనికేల వగవ
నని యవాగుజలంబుల నధికజాఠ
రాగ్ని వారించి తరల కఱ్ఱాడుటయును. 195

చ. కనుఁగొని వీఁడునిల్చె నిదిగాదని యెంచి యసహ్యరోషక
ల్పన మొనరించి యవ్వికచపంకజలోచన పాంథ యిందు ర
మ్మనుటయు నిల్లునేకొనెద వద్దిర మత్పతి వచ్చువేళ నీ
కినుకలు సాగనిచ్చట జగేయన నాతఁడు భీతచిత్తుఁడై. 196

తే. లెస్స తెఱువాటుగొట్టితి లెమ్మటంచు
గ్రుడ్లకొలఁదిగఁ గన్నీరుఁ గ్రుక్కికొనుచుఁ

దగినమాటకు నోరేది దానియిల్లు
వెడలె రఘురాముతమ్మునిఁ బిలిచికొనుచు. 197

వ. అట్లు వెడలి యతండు.198

సీ. కంబళాక్రామితక్ష్మాభాగసవిధంబు
జేరువారలతోడఁ బోరువారు
నిజదేహబహువర్ణనీయవిచిత్రము
ల్చెవులొగ్గువారితోఁ జెప్పువారు
నాగామిదివసగమ్యపురాధ్వపరిమాణ
మదనెఱింగినవారి నడుగువారు
క్షీరవిక్రయపరాభీరనారీకోటి
తోడ నవ్వులబేర మాడువారు
తే. నగ్గి గొనితెచ్చి రథ్యాతృణాళి వైచి
శీమతిమిరోద్ధతికిఁ బ్రతిష్ఠించువారు
నైన నానావససమాయాతపథికు
లమర గనుపట్టు రచ్చకొట్టమునకరిగె. 199

తే. ఏగి తత్తత్పథికుల నదెవ్వ రనుచుఁ
దెలిసికొన నేనయా పరదేశి ననుచు
నచట శయనించి తనమోస మాత్మనెంచి
యుసురుసు రటంచుఁ బొరలాడుచుండెనంత. 200

తే. తత్సమీపంబుననె ఘోరదారుయంత్ర
సక్తపదుఁ డొక్కఁ డారసి జార యెన్ని
కాఁపురంబులు గూల్చితో కద యటంచుఁ
బలుక నావంటివాఁ డిందుఁ గలిగె ననుచు. 201

ఉ. ఆదృఢబాహుఁ డొయ్యనఁ దదగ్రగతుండయి పిన్నవాఁడ నీ
కీదెస యేల వచ్చెఁ బురి నెవ్వరివాఁడవు తెల్పుమంచు న
త్యాదృతి వీడెమిచ్చిన నతం డిదె చెంగటిశూద్రవీథిలో
నైదువయంట యొక్క కులటాంగనయున్నది పాపమూర్తియై. 202

తే. దానితో నొక్కజగజెట్టి తగిలియుండు
వాని కుడిగంపువాఁడనై యేను గొలిచి
యుందు నది సైఁపలేక నేఁడొక్కమ్రుచ్చుఁ
దనము నామీఁద మోపినంతనె తలార్లు. 203

క. వినవచ్చి దొంగగా యని
యొనరఁగ నిట బొండకొయ్య నుంచిరి కన్వే
గినవెనుకఁ దెలిసికొని య
చ్చని ననుబొమ్మందు రింతె యది యట్లుండెన్. 204

తే. అయ్య మీ రెవ్వ రన నాతఁ డాత్మవృత్త
మంతయును దెల్పఁ జేఁజేత నప్పళించి
నవ్వి యాపిల్లబంటు నానలినవదన
సుమ్ము నన్నింత చేసె నసూయచేత. 205

క. నీ వేల తగిలితయ్యో
బావా యిఁక నేమి యొకయుపాయము వినుమా
నీ వాంఛదీరు భోజన
మావనరుహగంధి రతియు నబ్బెడు నీకున్. 206

చ. ఇది సిగనంటఁ గట్టుకొని యేగి తదీయగృహంబు మ్రోల నీ
వెదభయ మింతలేక మొరయింపుము జెట్టియు నిట్లు సేయుఁ ద
త్సుదతియొనర్చు నిచ్చకముఁ జూడు మటం చొకగంట

యిచ్చినం
బొదలి తదుక్తరీతి నటపోయి వెసన్ దృఢబాహుఁ డయ్యెడన్. 207

తే. గంట మొరయింప నవ్వాలుగంటి తలుపు
తెఱచి తోకొనిపోయి మందిరములోన
నునిచి నీకిడఁగోరి నేఁడొక్కపథికు
మన్నిగొంటి నటంచుఁ బ్రేమంబు నిగుడ. 208

క. అనఁటాకున నన్నము శా
కనికాయం బునుపఁ బాపి కట్టడికానా
యనుచు భుజియించి దీపం
బునుపమిఁ దనతెఱఁగు తెలియకుండఁగ నంతన్. 209

క. రమణీయశయ్యపైఁ ద
త్కమలేక్షణఁ గూడి మదనకదనక్రీడా
త్యమితానందముఁ జెందెం
దమిదీఱఁగ బంటువానిధర్మం బనుచున్. 210

ఉ. అంతట మల్లవర్యుఁడు లతాంతకృపాణనితాంతమర్దిత
స్వాంతతవచ్చి నిల్చి తలవాకట ఘంటిక మ్రోయఁజేయ న
య్యింతి యిదేమొ యంచు నొకయించుక చింతవహించి తద్విధం
బంతయుఁ గాంచి ని న్నెఱుఁగనా యనుచుం దృఢబాహుతో ననున్. 211

తే. మంచి దెవ్వనిచేతనో మర్మ మెఱిఁగి
వచ్చి తందుల కేమి నీవాంఛ దీఱె
జెట్టి యరుదెంచె వాని జోకొట్టి నిన్ను
బనుతు నందాఁక నట్టుకపై వసించు. 212

క. కడలకు మచ్చట పాము
న్నది యందు రటంచు వాని నట్లుంచి రయం
బొదవ న్వాకిలి దెఱఁచిన
మదియలరం పెట్టి కేళిమందిర మెనసెన్. 213

తే. అంతలో నేమి చెప్పుదు నట్టియపుడె
వచ్చె హనుమంతగర్వదుర్వారశౌర్యుఁ
డైన రణధీరుఁ డేతెంచి యధికహర్ష
మెనయ వాకిలి దెఱవ నవ్వనితఁ బిలువ. 214

క. గుండె పటుక్కన వచ్చె వి
భుం డిఁక నెట్లనుచు మల్లపుంగవుఁ బథికుం
డుండెడునట్టుకపై వాఁ
రొండొరులం గానకుండ నునిచి వినీతిన్. 215

తే. గడియ సడలించి కన్నీటఁ గాళ్లుకడిగి
కొమ్మ కౌఁగిటఁ గదియించి కుస్తరించి
పడుకయింటికి నరిగి దీపంబుఁ బెట్టు
మని నిజోదంత మాద్యంతమును వచించి. 216

చ. తనభుజశక్తి మెచ్చి సముదారత నచ్చటి భూమిభర్త యి
చ్చినధన మెల్లఁ జూపి యిది చేరుటఁ జూడఁగ దీనివంకఁ జు
మ్మని వివరించి దెల్పుటకు నయ్యొఱడుస్సీ కృపాణిఁ గేలఁగై
కొని ఝళిపించినం గడు దిగుల్పడి యాతనిదిక్కుఁ జూచుచున్. 217

క. ఆట్టుకపైఁ దగు తెఱువరి
జెట్టియుఁ దముఁ జూచెనేమొ చేతం గరవా
ల్పట్టెనని తలఁచి తత్తఱ
ముట్టిపడం డిగ్గనుఱికి యురువడిఁ బఱవన్. 218

తే. అపుడు సందియమంది రోషార్తుఁడైన
పురుషుతో నది యేలీలఁ బొంక వలయుఁ
బలుకుమనినఁ బ్రభావతీపంకజాక్షి
తేటపడ నీవ యిదియును దెలుపుమనిన. 219

తే. చిలుక యిట్లను నప్పు డచ్చెలువ మోస
కారిపెనిమిటి యోవన్నెకారిమగడ
యేల చూపితి విప్పుడ యీధనంబు
ధనపిశాచంబులివి యథార్థమ్ము సుమ్ము. 220

క. ధనముపిశాచులు ఘంటా
ధ్వనితోఁ గాచుకొని యుండు ధనమన వినమే
కనుగొంటిమి గద గంటలు
చను నే బలివెట్ట కర్ణచయ మిలు చేర్పన్. 221

తే. ఇంకనైనను బలి దెచ్చి యీయకున్నఁ
బొసఁగదని పల్క నతఁడు కాబోలుననుచుఁ
గాళ్లునొప్పియుఁ జూడక కాఁపుటింటఁ
గోడిఁ గొనితెచ్చి బలిపెట్టి కోర్కెఁ జెందె. 222

చ. అని తెలుపం బ్రభావతి యయారె కథాస్థితియంచు మెచ్చి య
య్యినుఁడు సురేంద్రదిక్కుధర మెక్కుట కేళినిశాంతసీమకుం
జని తమినాఁటిరేయి నృపచంద్రుని జేరఁగఁగోరి యేగుదెం
చినఁ గని దానితోఁ బలుకుఁ జిల్క మరందరసంబు చిల్కఁగన్. 223

వ. ప్రభావతీ నిజవదనవక్తవ్యవార్తావిశేషంబు పరులచేతం బలికించి తనయందు నీషద్దోషంబు లేకుండం జేసిన బాలసరస్వతీనామధేయ యగునమాత్యనందనకుం గలయనివార్యప్రభావంబు నీకుం గలిగినంగాని యొప్పని యిప్పనికిం బోవుట

ముప్పవుఁగదా యనిన నప్పడంతి తప్పక కనుంగొన నప్పతత్రిగోత్రారి యిట్లని చెప్పందొడంగె. 224

ఇరువదియవకథ


ఉ. ఉజ్జయినీపురంబు మెఱయు న్మణిహర్మ్యశిఖావిహారియో
షిజ్జన మొక్కచో జలము చేఁదికొనం దలవాంచఁ దన్ముఖో
ద్యజ్జలజాభియాతికి భయంపడి దేవనదీరథాంగముల్
పజ్జ ముడుంగఁ బాఱుఁ బృథుపద్మకుడుంగములం దడంగగన్. 225

ఉ. ఆపుర మేలు పూర్ణకరుణాభరణుం డగువిక్రమార్కుఁడు
దీపితమంత్రశక్తి గడిదేఱిన భట్టి యుపాయ మాత్మబా
హాపరిపాలితం బటుసమగ్రశుభప్రతిపాదిగా బుధ
స్థాపకదానలక్ష్మి యను దాది యశోరుచికన్య బ్రోవఁగన్. 226

ఉ. ఆతని కొక్కమంత్రి గలఁ డద్భుతశీలుఁడు పుష్పహాసవి
ఖ్యాతుఁ డతండు నవ్విన లతాంతపువాన యెసంగు నిస్తులా
స్తోతకరాద్భుతక్రియలు చూచినయప్పుడు మానసైకశో
కాతిశయంబు బల్మిని దదాస్యము హాస్యము గాన దెన్నఁడున్. 227

తే. అంత నొకనాఁడు విక్రమార్కావనీంద్రుఁ
డంతిపురమునఁ గదళిక యనేడు పేరఁ
దనరు మోహపురాణియుఁ దానుఁ గూడి
పొత్తుల భుజింపఁగా నొక్కబోనకత్తె. 228

తే. ఒఱపు దనరారఁ జేఁపలయూర్పుఁగూర
యిడినఁ గదళిక చే యెగనెత్తి యాస్య
మవలగాఁ ద్రిప్పి యిదియేమి యారగింప
వనెడు పతిఁజూచి రానిజంకెనలు నిగుడ. 229

ఉ. ఎన్నఁడు నిన్నెఁ గాని పరునెన్నఁడుఁ గన్గొన గండుమీల ని
ట్లెన్నిక లేక యంటి భుజియింపఁగవచ్చెఁ బతివ్రతాత్వసం
పన్నిధినైన నాకనుచుఁ బల్కిన పళ్ళెరమందు ద్రుళ్లియ
క్కన్నులకల్కిమాటకుఁ బకాపక నవ్వే విపక్వమీనముల్. 230

క. నవ్వినఁ గనుఁగొని పొదివిన
నివ్వెరచేతులను వార్చి నృపవరుఁ డంత
నివ్వటిలు సందియంబున
జవ్వాడుమనంబుతో హజారముఁ జేరెన్.231

తే. చేరి మంత్రుల రావించి చిన్నఁబోవు
మొగముతోడుత నద్భుతంబును వచింప
నేల నవ్వెనొ యుడికినమీలు తెల్పు
డనుచు గద్దించి యడుగ నయ్యలఘుమతులు. 232

క. ఇదియేమొ యిపుడు తెలియదు
గద తగ వివరించి చూడఁగాఁ దోఁచినచోఁ
బదపడి చనుదెంచియు విని
చెదమన వారలకు నృపతి సెలవిచ్చుటయున్. 233

క. పనిచినఁ జనువారలలో
ఘనబుద్ధి యనంగఁ బేరుగలమంత్రి గృహం
బున కరిగి హాస్యహేతువుఁ
గననేరక వగలఁబొగులగా నట్టియెడన్. 234

క. బాలసరస్వతి యతిమతి
శాలినియగు మంత్రితనయ చనుదెంచి యిదే
మాలోచన యని యడిగి త
దాలాపములెల్ల విని మహాద్భుతమతియై. 235

వ. తన్మత్స్యహాసంబునకుం బూర్వంబునం బ్రవర్తిలిన కదళికావిక్రమార్కులవాక్యంబు లామ్రేడితంబుగా విని యంజనముఖంబున నిక్షేపంబునుంబోలె మనీషాబలంబునం దత్కారణం బెఱింగి యయ్యా యీయాశ్చర్యంబు వధూశాంబరీవిడంబనంబునం బొడమినయది పాముజాడ పామునకుంగాని పరులకుం దెలియఁబడని తెఱంగున నంగనలకుంగాని యిత్తెఱంగుఁ గనుంగొన మీకుఁ గొలఁదిగా దీగుట్టు బట్టబయలు గావించినం బాపంబు ప్రాపించుఁ గావున విజనాంతరంబున నుపాయంబున భూనాయకున కేఁ దెలిపెద నని యజ్జనకునివెంట వసనాచ్ఛాదితాందోళికారోహణంబునం దెరమఱుంగునం గూర్చుండి యక్కురంగనయన యనుప్రసంగంబు దిగిచి రాజపుంగవుతో నిట్లనియె. 236

తే. విక్రమార్కేంద్ర సర్వజ్ఞ చక్రనర్తి
వయ్యు నిక్కార్య మనయుల నడుగఁదగునె
యడిగితేని నిజోదంత మవల నొడివి
యడలు పద్మినిఁ బోల్పఁ బట్టగుదువీవు. 237

వ. అనుచుం బల్కెఁ దదనంతరంబు ప్రభావతీరమణీమణి యరుణోదయంబుఁ గాంచి కేళీనిశాంతంబున కరిగి యానాఁటిరేయి భూనాయకుపొందు డెందంబునం దలంచి యానందంబునఁ గందర్పశాంబరీమత్తవేదండంబు చందంబున మందమందగమనంబునం జనుదేర మన్మథతురంగంబు గనుంగొని యంతరంగం బుప్పొంగ నయ్యంగనామణి కిట్లను న ట్లాబాలసరస్వతియు నావైసారిణహాస్యంబు నాకారరేఖాపరాభూతకుసుమశరాసనుం డగునారాజన్య మూర్ధన్యుతో నుపమానంబుగా యవనికాభ్యంతరంబున నుండి చెప్పందొడంగె నీవు నాకథ వినుము మఱి పోదువు గాక యని యప్పతంగపుంగవం బిట్లని చెప్పందొడంగె. 238


క. ఆకథ యేలాగనినఁ బ
రాకు విశాలం బనాపురం బోకటి తగుం
గాకోదరయువసౌథా
నీకాయతకమలఖేయనిరుపమ మగుచున్. 239

క. అందొక శూద్రుఁడు సుమతి య
నం దగుఁ బద్మిని యనం దనర్చిన పరిపూ
ర్ణేందువదన యిల్లాలుగఁ
బెందెవులుం బోని లేమి పెటపెటఁ బేల్పన్. 240

సీ. చేయప్పు లనుచు నిచ్చినవారు కటువుగా
నడుగ నుంకించి నోరాడ కరుగ
నెనరైనజుట్టాలమనుచు వచ్చినవారు
బడలిక చేతఁ జెప్పకయె చనఁగ
నాయవారంబున కనుచుఁ జేరినవారు
పరిహసింపక మున్నె తిరిగిపోవ
నెక్కలె జోగంచు నేతెంచువారు మా
టాడి చూడక వేగ మవలికేగ
తే. శిశువు లెల్లను గలవారి చిన్నవాండ్రు
తినెడి చిఱుతిండి గని యది తెమ్మటంచు
గీజుపోరుట కెదఁ బెల్లగిల్లఁ బొగిలి
పొలఁతి యూరార్ప నతఁడు కాఁపురము సేయు. 241

తే. కొఱుకునకు లేక మూషికకోటి చేర
కునికి మార్జాలజాల మాతనినికాయ
సీమ వీక్షింపఁగా మరుభూమి యయ్యె
నౌర దారిద్ర్యమహిమ యేమనఁగవచ్చు. 212

క. ఈజూడ లేమిచేఁ గడుఁ
దేజము చెడి వంటచెఱకుఁ దెచ్చుచుఁ బరనా
రీజనుల కమ్మి యాతఁడు
గాజు గడపినట్లు దినము గడపుచు నుండెన్. 243

వ. ఇట్లుండి యతం డొక్కనాఁడు. 244

చ. వలనగు పుట్టగోచి బిగువాళ్లును సుంకపుకాసులు న్విభా
సిలు కరసానగొడ్డలియుఁ జిక్కమున న్సొరకాయబుఱ్ఱలోఁ
జలిదియు నుంచి బంధుజనసంతతిదర్శనభీతి లోఁగుచుం
గెళవులఁ జూచికొంచు నరిగె న్గహనంబునకై రయంబునన్. 245

మ. అపు డొక్కించుక మబ్బుగానఁబడి యింతై యంతయై మించి వి
ష్ణుపదంబంతయు నాక్రమించి జనసందోహేక్షణాంథత్వకృ
చ్చపలంబై కడుగర్జితప్రబలమై సంజూతఝంఝామరు
ద్విపులంబై యొకవానవట్టె వసుధావిర్భూతపంకంబుగన్. 246

తే. అప్పు డాశూద్రుఁ డిదె వర్ష మరుగుదెంచె
నింక నెట్లని భీతితో నేగి యొక్క
దారుకల్పితహేరంబథామసీమఁ
గాంచి యందుండె బ్రతికితిగా యటంచు. 247

క. దళమయ్యె వర్ష మంబుధిఁ
దలక్రిందుగఁ బట్టినట్లు ధారాశ్రేణీ

ఝళఝళలు న్మెఱపుల బ
ల్ధళధళలున్ స్తనితఫెళఫెళ ల్విలసిల్లన్. 248

సీ. పక్షపుటాంతరప్రాపితముఖపాళి
శాఖాగ్రవసదండజవ్రజంబు
బర్హివిభ్రమజాతభయపూర్ణబిలముఖో
గమనాసమర్థాహిసముదయంబుఁ
గేదారకృతతటాకోదారప్రతిరతా
బ్జాలోలసంచరద్ధలికనికర
మర్ధముహూర్తసాప్యాయితసికతావ
శిష్టాంబురాశి యాశీచయంబు
తే. గిరిదరీసుప్తగర్జితోత్కరహఠాత్ప్ర
బుద్ధసంక్రుద్ధశార్దూలభూరినఖశి
ఖోరునిహతసమీపగండోపలంబు
వర్ణన మొనర్పఁదగియె నవ్వర్ష మపుడు. 249

ఉ. అంతట నాత్మలో సుమతి యంబుజబాంధవుఁ డస్తమింపఁగా
నంతలు నింతలుం గల మదాత్మజు లాఁకట నేమియైరొ మ
క్కాంతవిభుండు తెచ్చుఁ గద గ్రాస మటంచుఁ దలంచుచుండఁగా
వంత యొనర్చెఁ జల్లనగు వానలు నెండలు ఱిత్త యిత్తఱిన్. 250

క. దినదినము ననక యేవన
మున కేగక యున్న నింటఁ బ్రొయి రాఁజదుగా
పెనువాన యింతట న్వెలి
సిన నేగతిఁ బోదు ఱిత్తచేతులతోడన్. 251

క. నేటి కొకపూఁట కేనియుఁ
గూటికి లేకున్న ఱేపు గొడ్డలియెత్తం
బాటిల్లదు బలిమి నిరా
ఘాటత్వర నడవి కరుగఁగాఁ దరమగునే. 252

క. అని తలఁచి నాల్గుదిక్కులు
గనుఁగొని సముదారదారుకల్పితగణనా
థునిఁ జూచి దొరకెఁ గదరా
యనుచు న్వెసఁ జేరి యాతఁ డతికుతుకమునన్. 253

తే. చేరి యీచేవమ్రానిపిళ్లారి నఱికి
చెక్క లొనరించి యంగడిఁ జేర్చి యమ్మి
యింటి కేగుట కార్య మింకేటి దేవుఁ
డేను గూటికి వగవఁగా నేమి కలదు. 254

తే. ఊరివారెల్ల నేఁటేఁట నొప్పగింపఁ
గడుపు విరియంగఁ దినీ పండ్లు గుడుములెల్ల
వారికొంపలలోఁ దప్పిదారి యున్న
వెల్ల దినుమని తనతేజి కిచ్చు సెలవు. 255

క. కావున మఱి వీఁ డెక్కడి
దేవుండొకొ దేవుఁడైన దృఢతరకరుణా
శ్రీ వెలయ సిరు లొసంగఁడె
యీవేళం దనకటంచుఁ గృతనిశ్చయుఁడై. 256

తే. పొడవుగా నెత్తి గొడ్డలి పూనిపట్టి
నఱఁకబోయిన నవ్విఘ్ననాయకుండు
నిలునిలువు మింత యేటికి నేఁటినుండి
దినము నూఱేసి మాడలు దెచ్చియిత్తు. 257

వ. అని పలికి యాశ్చర్యమగ్నుం డగు నతని చేతికి నిజమాయాప్రభావసంపన్నం బగు మాడలముడుపు తుండాగ్రంబున నొసంగి ప్రతిదినంబు నంబురుహబంధుబింబోదయంబున నరుగుదె మ్మెవ్వరితో నేనియు నివ్విధంబునుం జెప్పిన నీకు నాకుం బనీలే దని యనుచున్నంతలో నొట్టుపెట్టినగతి వాన దొట్టున వెలిసిన నదియును లంబోదరమహాదరంబుగా నెంచి యింటికిం జని తనవాలుగంటికిం ధనంబొసంగిన నొయ్యన వలయు వస్తువు లస్తోకంబుగాఁ దెచ్చికొని కృతకృత్యయయ్యె నది మొదలుగా నతండునుం బూర్వోక్తసువర్ణప్రదాయకుం డగువినాయకువలనం దినదిన ప్రవర్ధమానమహావైభవుండై యుండె నంత. 258

క. పొరుగింటి యువతి మండో
దరి యనునది పద్మినీసుధాకరవదనా
గురువిభవముఁ జూచి నిరం
తరతాప మసూయకతనఁ దను నలయింపన్. 259

మ. ఒకనాఁ డాయమయింటి కేగి కపటోద్యోగంబున న్లేనిమ
చ్చికతో ముచ్చటలాడి నీకు సరి యేసీమంతిను ల్లేరు సు
మ్మెకసక్కెంబులు గావు లేమిపడుచో నీకైవడి న్వైభవా
ధీకవై యుండెడువేళ నేకగుణసందీప్తస్థితిం గాంచుటన్. 260

క. ఒకమాటఁ దెలిసికొన వేఁ
డుకయై యుండు మఱి యెన్నఁడు న్నే రాఁగూ
డకయుండు పనులబడి నీ
వకుటిలహృదయాబ్ద వగుట నడిగెదఁ జెపుమా. 261

క. ఏనెఱిఁగిన బ్రతుకే గద
యీనడువడి యెట్లు కలిగే నింతటిలోఁ గాం
తా నిక్షేపముఁ గంటివొ
పోనీ యెట్లైన గూఢముగ వర్ధిలుమా. 262

చ. అనవిని పద్మినీసతి ముఖాబ్జమునం జిఱునవ్వుదోఁప నా
కును మది సందియంబె యెసఁగుం ధన మేగతిఁ జేరునంచు నే
వినినది లేదు మద్విభుని వేఁడెదఁ దెల్పెడివారెకారు చె
ప్పిన నదియెల్ల నీకు వినిపించెద నీయెడ దాఁచనేర్తునే. 263

తే. అనిన మందోదరీమందయాన పల్కు
లెన్ని నేర్చితి వమ్మ నీ వెఱుఁగకుండ
నడఁచుకొన్నాఁడె నీమనోనాథుఁ డకట
యిదియె నిజమైన నీమను వేటిమనువు. 264

మ. అకటా నీవిటు చేటుపాటులకు లోనైయున్నయిల్లాల విం
తెకదా పుట్టినయిల్లుఁ జేర్చు వగలేదే సొమ్ము నీతోడఁ దె
ల్పక నెవ్వారికిఁ దెల్పు నాస్త మది దాఁపం బల్కఁగాఁ బోలు నే
లిక యెన్నేనియు నేల చాలు పలుకు ల్విన్నంతనే తోఁచెడిన్. 265

క. నామగనివంటివాఁ డీ
భూమిన్ లేఁడమ్మ యేనె పోరాడుదు గా
కేమాట యైన నాతో
దామునుపే తెలుపు నవ్విధం బట్లుండెన్. 266

తే. ఇది యెఱుంగక యున్న నా కేమి కొదవ
నీకుఁ దెలియక యుండుట నీతిగాదు
చేరి వరువేఁడు మిమ్మాటఁ జెప్పకున్న
జత్తు సరిపోదు ననుము నిస్సంశయముగ. 267

మ. అని మందోదరి యింటి కేగుటయు నయ్యజాక్షి యారేయిఁ జ
ల్లని పూఁబాన్పున వీడె మిచ్చి పతి కుల్లాసంబుఁ గల్పించి యా
యనతో మిమ్మిఁక నమ్మరాదు గద నాథా యీసిరు ల్గల్గుటె
ల్లను నాకు న్వివరింపరైతిరని లీలాకోపముం జూపినన్. 268

క. సుమతి రతికేళి మీఁదం
దమకము గలవాఁడు గాన దాని నసంబం
ధమహానునయోక్తుల వ
క్షమునం గదియించి కూర్మి గడలుకొనంగన్. 269

క. ఇది తెలిపిన నపుడే సం
పదవోవుంగాన నెఱుకపలుకక యుంటిం
గొదవా యిది నావలనన్
ముదితా మది తాప మేల మోవియ్యఁగదే. 270

తే. అని యతఁడు వెండియును వేఁడ నవ్వధూటి
యింతలోఁబోవుసంపద యెన్నినాళ్లు
నిలుచు నౌలెండ నాతోడఁ దెలుపఁదగదె
చాలు విడుమంచుఁ దరితీపు చలము నెఱప. 271

క. ఆసుమతి యపుడు కుసుమశ
రాసోన్మాదమున నాగణాధిపుకరుణా
శ్రీసముపలబ్ధిఁ గంటి మ
హాసంపద లంచుఁ దెలిపె నాద్యంతంబున్. 272

క. అంతట నది యప్పుడె చని
మంతనమున గోడఁ జేరి మందోదరితో
నంతయును దెలిపి క్రమ్మఱి
కాంతునికడనుండె గుట్టు గలయదివోలెన్. 273

శా. ఆమందోదరి చిఱ్ఱుబు స్సను చసూయాక్రాంతయై పోయి యే
మేమో వేఁడెడు బిడ్డలంగదిసి యే నిం కెచ్చటం దెత్తు న
య్యా మీతండ్రి గడింపలేదు గద వెయ్యా ర్లెన్నఁడుం జాలు మీ
మోము ల్దిందురుగాక యిం కనుచు వీఁపు ల్చిట్లిపో గొట్టుచున్. 274

తే. చట్టితోఁ జట్టి పగులంగఁ గొట్టి తనదు
పదరులకు నింటి బలుకుక్క లదరి కూయ
నడరు భయమున గుక్కుమిక్కనక వెనుక
వెనుక కొదిగెడు తనప్రాణవిభునిఁ జేరి. 275

క. మగవాఁడ ననుచు నున్నా
వగునగునే కడుపు గట్టి యప్పులు మిగులన్
దెగిచి యిటు వండిపెట్టినఁ
బొగులవు కుంభంబుమీఁది పొట్టేలుక్రియన్. 276

క. కిగ్గాడికాండ్రె యెపుడుం
దగ్గని సంపదలఁ బొదలఁ దామది యకటా
బగ్గున మండెడు నీకును
సిగ్గించుక లేదు డొక్క జేనెఁడు గాదే. 277

క. పొరిగింటి పద్మినీసతి
గిరుకుచు మట్టియలు గిలుకు గిలుకని నడువన్
మెరమెరలు పుట్టవే కాఁ
పుర మేటికి మగఁడు పొట్టపోయక యున్నన్. 278

క. అని శాంతి దెచ్చుకొని ప
ద్మినిచెప్పిన మాటలెల్లఁ దెలిపిన నతఁడే

నును జని పిళ్లారిని నలు
కిన నతఁడే యిచ్చు సిరులు గెలిచితి ననుచున్. 279

తే. అంత నేగిన గణనాయకాలయమున
కరిగె నాతండు సుమతియు నపుడె చనియె
వారి నిద్దఱిఁ జూచి యవ్వారణాస్యుఁ
డధికకోపానుతాపదురాపుఁ డగుచు. 280

తే. ఒరుల కేటికిఁ దెలిపితి వోరి యనుచు
సుమతిఁ గొట్టించెఁ బ్రమథయూధములచేత
నేర నీ వేలవచ్చితీ వోరి యనుచు
నట్లు సేయించె నాఁడేగినట్టివాని. 281

తే. ఆసుమతి యట్లు నొగిలి గేహంబుఁ జేరి
యంతయును దెల్పఁ బద్మిని యడరు వగలం
దూలి మందోదరీకాంత తోడనేల
దెలిపితి నటంచు మిగులఁ జింతిలఁదొడంగె. 282

ఉ. కావున విక్రమార్క వెనుకన్మదిలో నిటువంటికార్య మే
లా వినిపింపు మంటి నని లాఘవవృత్తికి లోనుగాక నీ
వే విశదంబుగా నరయు మీ దినమెల్లను దోఁపకున్న నే
నీవిధమంచు ఱేపు వచియించెద నేఁడటు పోయివచ్చెదన్. 283

క. అని బాలసరస్వతి య
జ్జనపతికిని దెలిపె నని రసస్థితి మిగుల
న్వనిత కలశుకము దెలుపం
దినకరుఁ డుదయాద్రికరుగుదేఁ దఱి యయ్యెన్. 284

క. అంతఁ బ్రభావతి కేళిని
శాంతమునకు నేగి నాఁటి సంధ్యావేళన్

గంతునిభుఁ డైన ధరణీ
కాంతునికడ కరుగుచో శుకం బిట్లనియెన్. 235

తే. అమ్మ యమ్మంత్రిసుతప్రభావమ్ము వినుము
విక్రమార్కవసుంధరావిభుఁ డొకింత
తెలిసికొనలేక మఱునాఁడు పిలువఁబనుప
జనియె నమ్మీననయన యాస్థానమునకు. 286

వ. చని యవనీకాంతసమాసీన యగుటయు నమ్మానవేశ్వరుం డితరప్రసంగంబున కవకాశం బొసంగక యంబుచరహాసంబునకుఁ గారణంబుఁ దెలుపుమనిన నచ్చెలువ కలకల నవ్వి పరుల నడుగందగని కార్యం బడిగెద విట్లయిన ననాచరణీయం బగుప్రయోజనం బొనర్చి యాపిమ్మట వనటకుంబాలైన పాలికయను బాలికతోడి పోలికగలవాఁడ వగుదు వది యెట్లనిన నవధానంబుతో వినుమని యిట్లనియె. 287

రెండవయుపకథ


క. ధరపై రత్నావళి యను
పుర మొక్కటి కలదు గగనపూరితమణిగో
పురమై పరమేశ్వర్యా
కరమై సరమై కలసదగారోత్కరమై. 288

క. ఆవీట రత్నవిదుఁ డనఁ
గా వైశ్యాగ్రణి యొకండు కలఁ డాతనికిన్
దేవేరి యొకతె మన్మథ
దైవతమై పాలికాభిదాన తనర్చున్. 239

క. ఆపాలిక శశిరేఖా
రూపాలిక జారజనశిరోమణి సురత
వ్యాపారమునం దన్న
వ్యాపారప్రేమఁ జెందు టరయుట కతనన్. 290

సీ. [1]ఓపరిపైన నీ కునికిఁ గావించిరే
బజగెడి యని దూఱు బావగారు
పొరిగింటిగోడచొప్పున గట్టివైచిరే
యవునె నిన్ననిదూఱు నత్తగారు
వాకటిచెంతఁ గావలియుంచిరే నిన్ను
గామిడి యని దూఱు మామగారు
పెరటిలోపలఁ బాతిపెట్టిరేమే నిన్ను
వగలాడి యని దూఱు వదినెగారు
తే. తోడికోడలు పగచాటి వీడనాఁడు
నాగడ మొనర్తు రెపుడు వియ్యములవారు
నేరముల నెంచఁ దొడఁగు బానిసెలగుంపు
పతి పృథక్తల్పశయనుఁడై భయముఁ జూపు. 291

క. ఈరీతి నింటివారలు
కారియ యొనరించుకతనఁ గార్కొని యుండన్
నీరజలోచన నెమ్మది
జారజనియోగవాయుసఖు కున్మఖయై. 292

తే. అంత నయ్యింతి యారుదూరైనదాన
నైతినేకద తగువాని హత్తుకొన్న

నింతకన్నను నన్ను వీరేమి సేయ
నేర్తురని నెమ్మనంబున నిశ్చయించి. 293

తే. తనకు ననుకూలయగు నొక్కదాసితోడ
మాలిమి యొనర్చుకొని యుంచి మంచివెట్టి
దానితో నొక్కనాఁడు మంతనమునందు
నింటివారలకసినికో లెల్ల నుడివి. 294

చ. పరపురుషాభిలాష మదిఁ బాటిలు టంతయుఁ దెల్పి తత్పురీ
పరిసరభూమిసున్న చలిపందిరి నొక్కనిఁ దెచ్చి కూర్చినం
గరివరగామినీ సురతకాలమునందు నినుందలంతు దు
ష్కరమని చూడ కింతయుపకార మొనర్పుమటంచు మ్రొక్కినన్. 295

తే. అది దిగుల్పడి నీ వెట్టు లరుగుదెంతు
వెన్నికౌ నటుమీఁద నీకేమి కాక
ముక్కఱయుఁ గమలును దాల్చి మురియు నన్నుఁ
జూడఁజాలక యిమ్మాట లాడె దేమొ. 296

క. అని వీడనాడ దాని
న్మనమున జడుపుడుపు తేటమాటలచే న
వ్వనిత పొసఁగించి పనుపం
జని కమ్మరవచ్చి యది నిశాముఖవేళన్. 297

తే. అమ్మ నీమాట మీఱరా దనుచు నదిగొ
నిలిపివచ్చితి నొకనిండునీటుకానిఁ
బురబహిర్నిర్జనప్రపాభూమి నచటి
కెట్లు పోయెదు పొమ్మని యేగుటయును. 298

తే. అందఱును నిద్రపోయెడు నంతతడవుఁ
జింతచేసియు సంకేతసీమఁ జేర

వెరవు గానక పాలికాతరళనయన
యాత్మలోనన యొకయుపాయంబు నెంచి. 299

క. ఇది సేయరా దటంచు
న్మది నెఱిఁగియుఁ దహతహన్ రమాతనయు వశం
వదయగుటం బానుపు డిగి
పదయుగళము సద్దడంచి భయవిరహితయై. 300

తే. చని యధిశ్రయణిని వహ్ని సంగ్రహించి
యింటి నడికొప్పతగిలించి యెఱుఁగనట్లు
ముంగిటికిఁబోయి రొదగాఁగ మొఱలువెట్ట
నదరిపడి లేచి గృహదహ మనుచు బెదరి. 301

వ. శిశురక్షణంబునకుం బశురజ్జుమోక్షణంబునకుం గృహోపకరణసంగ్రహంబునకు, దస్కరనిగ్రహంబునకుం బాల్పడి గురుజనంబు లేమఱిన సందడిం బడి యప్పడంతి బుడిబుడినడలతో నగరరక్షకాధిక్షేపదక్షంబగు సాహసంబు సహాయంబుగా సమయస్థలసరణిం గైకొని చన నంతఁ బావకుండునుం బవమానప్రవర్ధమానుండై నిలయాధారవేణువిదళజనితచిటచిటధ్వానంబు లాపోశనమంత్రోచ్చారణంబుగాఁ దైలఘృతాదికంబు లెడనెడం బానీయంబులుగా నయ్యగారం బాహారంబుగాఁ గొనియుం దనివిసనక పూర్వకృతఖాండవదాహం బుదాహరించు తెఱంగునం బ్రతివిశాఖాతిప్రతాపంబుఁ జూపుటవలన ధనంజయాభిధానంబునుం బుష్కరోజ్జృంభణవిధానంబు వలనం బృహద్భానునామంబును గృతార్థత్వంబుగా విహరింపఁ దొడంగె నంతకమున్న పౌరజనకోలాహలంబులతో జంటయై మింటి కెగయు నెఱమంటలం గనుంగొని దూతికావచనంబునం బానీయశాలాగతుండైన జారుండును నిజమందిరావనపరుండై క్రమ్మఱియె నంత. 302

ఉ. పాలికనిర్జనాదిభయభావము దూరము చేసి వాసియౌ
బాళి జనింప నేగి చలిపందిటి ముందట నన్యభీతిచే
నాలుగుదిక్కు లారసి ఘనంబగుచీఁకటి కందరంబునుం
బోలు తదంతరాళతలము న్వడిఁ జేరి మహారిరంసయై. 303

క. అచ్చట జారుని గానక
య చ్చెలి యుచ్చలితమానసాంభోరుహయై
ఱిచ్చవడి తెచ్చుకోలగు
హెచ్చరిక న్మఱియు వాని నెల్లెడ నెమకన్. 304

తే. వెదకి కానక వాఁడు నాహృదయ మెఱుఁగ
వేడి దాఁగెనొ యని బహిర్వేదిఁ జూచి
యెచట లే డెందొ యరిగినాఁ డేమొ యనుచు
నరిగి పందిటిలో నెల్ల నరసి పొగిలి. 305

శా. ఏరా మారునిబారికారియనున న్నిట్లేతురాతాళఁగాఁ
లేరా నేరము లేఱి దూఱక దయాలీలం గటాక్షింపరా
మేరా గారవ మారఁగా రతిసమున్మేషంబు లీకుండుటల్
రారా కూరిమిమీఱఁ జేరి కయికోరా జారవీరాగ్రణీ. 306

తే. ఇప్పు డాయిందువచ్చు టిదేమి యనుచుఁ
గోపమున డాఁగితేమొ మద్గురుజనంబు
కనుమొఱంగుట కొకనేర్పుఁ గాంచఁగోరి
యుంటి నేరంబు సైరించు టుచిత మిపుడు. 307

క. అని బతిమాలియు జారుం
గనుఁగొనఁగా లేక దూతికం దిట్టుచు న
వ్వనిత నిరాళం బగునె
మ్మనము రతికిఁ దఱుమఁగా నమందవ్యథయై. 308

చ. వెలువడి చక్కఁజూడ కవివేకముగాంచితి నేమొ యంచుఁబం
దిలికయిపోయి యందరసి నిక్కముగా నతఁ డిందువచ్చుటే
కలుగ దటంచు నిర్ణయముగాఁ దలపోయుచు నింక నేఁటితో
బొలిసితి జారవాంఛ ననిపోయె నిజాలయసీమ డాయఁగన్. 309

క. చని యగ్నిభయముఁ జెందిన
తనవారిం గదిసి బహువిధంబులఁ దాను
న్వనరుచు నుండెను వింటివె
జనవర యేతత్కథాప్రపంచం బెల్లన్. 310

తే. అవ్వధూమణి యిది యకార్యం బటంచు
యెంచ కి ల్లగ్నికై యప్పగించి జారు
గలయకడలినయ ట్లగుఁ దెలిసిచూడ
నడుగరానిది నీవు న న్నడుగుటెల్లఁ. 311

తే. కాన నేఁడెల్లఁ దెలియఁగాఁ గానకున్న
నెల్లి తెలిపెద నీ కిది యెల్ల ననుచు
నరిగే బాలసరస్వతి యనుచుఁ జిలుక
పలుక నంతటిలోనఁ బ్రభాతమైన. 312

తే. ఆప్రభావతి యంతఃపురాంతరమున
కరిగి యారేయి మేదినీవరునిఁ జేరఁ
బోవుచోఁ గీర మనియె నంభోజవదన '
వినుము బాలసరస్వతీవిమలమహిమ. 313

క. అంత మఱునాఁడు ధరణీ
కాంతుఁడు పిలిపింప నజ్జగన్మోహిని య
త్యంతవిభాసితమణి ఖచి
తాంతరపల్యంకికాసమారోహణయై. 314

సీ. నేల జీరక యుండఁ గేలఁ గుచ్చెలఁ బూను
కొని యూడిగపుఁ జెలు ల్గునిసి నడువ
మడిమెత్తు పరువుతో మంత్రాక్షతము లీయఁ
బాల్పడి భూసురభామ లెదుర
నొక్కకే లొఱగుపై నుంచి యేకాంతంబు
దెలుపుచుఁ గూరి నెచ్చెలులు సనఁగ
నెదురుగాఁ బఱతెంచి నృపమౌళి సమయంబు
హెగ్గడికత్తియ లెచ్చరింప
తే. కోరి పురివారిజాక్షులు గుంపుగూడి
యమ్మ యిదిగాక యైశ్వర్య మౌర యనుచుఁ
బలుకఁ గోయిలపరిభాష లలతి నగవు
మీఱ నన్నారి యరిగె హజారమునకు. 315

క. అరిగిన ప్రతిసీరాం
తరమునఁ గూర్పుండి యద్భుతముగాఁ బాథ
శ్చరహాస మని ప్రసంగాం
కుర మెత్తిన విక్రమార్కకువలయపతితోన్. 316

తే. అవ్వరారోహ పలుకు నన్నడుగ వలవ
దన్న నడిగెద విట్లేని యధిప మున్ను
పలుకవల దన్నఁ బలికి యాపైవిచార
మందు నలదందశూళ మట్లగుదు వీవు. 317

వ. తత్పురావృత్తాంతం బవధానాయత్తంబగు చిత్తంబుతో నవధరింపుము. 318

మూఁడవ యుపకథ


సీ. సహ్యశైలానీత జపతపస్సంజాత
యఖిలజగత్పూత యైనమాత
జడధినాయకు నేలుబడి గన్న యిల్లాలు
నిఖిలపుణ్యపుఁజాలు నిలుచుప్రోలు
అభ్రఘట్టనఖేలనాభీలకల్లోల
యఘతూలికాజాల మడఁచుకీల
ఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీన
వినుతసస్యవితానమునకు వాన
తే. యధిపతి సమాగమార్థప్రయాణసమయ
సముచితాంబుజనాళభక్షణవిలోల
ఘనగరుధ్వానపటపటాత్కారచారు
భూరిసితవక్షభేరి కావేరి వెలయు. 319

సీ. జలమానవులు చిమ్ము జముదాళి చాలునా
మిసిమివాలుగ మీలు మిట్టి పడఁగ
వరుణుండు వైచు మవ్వపు బిల్లగోలనాఁ
దరగతూరుపు గట్టుదాఁక నిగుడ
వళులపరంగుల హరిగోలుగుంపునా
వనజంబులలఁతిగాడ్పునఁ జలింప
సలిలాబ్దపాణి యచ్చపు మేలుముసుఁగునా
ఫేనపంక్తులుదరినాని యెసఁగ

తే. నలరు మాతృమనీషాసమాగతేందు
కేళిదృఢబింబపాళికాకృతికదంబ
ఖేలనాలోలమదమిళచ్చోళబాలి
కాముఖస్తోమ యయ్యాపగాలలామ. 320

ఉ. ఇవ్వలి రేవులం దుమికి యీఁది తటాలున నీటివాలుగా
నవ్వలిగట్టుఁ జేరు ద్రవిడాంగన లంబురుహోత్పలంబులన్
దవ్వుగఁ ద్రోచు జడతగుఁ దన్నది జందెపువాటు గాఁగ మై
మవ్వపు నీలపు న్సరు లమర్చిన టెక్కున నక్కడక్కడన్. 321

క. అసమలసమానబిసరుహ
విసరలసద్ధూళి కలితవిభ్రమదావ
ర్తసముదయం బానదిలోఁ
బొసఁగుం జలనరుల గొడుగుబొమ్మరములనన్. 322

వ. వెండియు నఖండతరతీరాగ్రహారయాయుజూక నిరంతరప్రతిష్ఠిత సవనపవనసఖ ధూమస్తోమంబు లంబుధిభ్రమావలమాన జలపానవిలోలవలాహకంబులయందంబుఁ బొందు పఱప, నిరుపమానతపస్థైర్యస్థాపిత కాశాతిప్రకాశకుసుమంబులు పుణ్యనదీశ్రేష్ఠతాప్రతిపాద బిరుదచామరంబుల సింగారంబులం బొంగింప సముత్తుంగ చటచ్ఛటారావగౌరవాతిభీత నిజవధూజనసమాశ్వాసవచనముఖరపథికతరుణినికరంబు లుల్లసితవల్లభచర్యాస కాశాత్మ చర్యాత్మ దృతద్వీపకలాపంబుల విధంబునం జెలంగ నభంగ బాహాప్లవనపరాయణజనోత్తమాంగ వలయితధవళవసనంబులు విహారసమాయాతస్రోతవ్యాళకంచుక సమంచితకుండలీకృత భోగంబుల సోయగంబునం గనుపట్ట నీరుగట్టున నెట్టుకొను తియ్య మామిడిచెట్టులం దొరంగు ఫలరసంబునం బదనైన ఠావునం బొదలి పాఱు పచేళిమభిదేళిమేక్షురసంబునకుఁ దోడు చూపు వేరుపనసపంటిరసంబుల కాలువలకు వింతలు గల్పించు నానాప్రసూనరసంబుల నిర్ఝరంబు లుభయపార్శ్వంబులం బొలుచు నితరనదీకదంబంబుల చక్కఁదనంబు నెక్కొలుప నిక్కువం బిక్కటిల్లు తమ నిబ్బరపు గుబ్బలకు సురాళింపఁబూనుకరణిం దాల్చు కనకకుంభంబులతో రంభాస్తంభంబులనడుమ వెడలి పోఁకమ్రాఁకుల నొరసికొని యాకుఁదోటలకుం గేడించి లికుచవనాంతరంబు ముందఱం గనం జెలువు మీఱ సప్తసముద్రంబు లేకీభవించిన తెఱంగున నంబుతత్త్వంబు సాక్షాత్కరించినవిధంబునఁ బ్రవాహవిజృంభణంబు చూచుచుండ నొక్కనాఁడు. 323

తే. మణిధరనామకుఁ డగు నొక
ఫణివరుఁ డవగడము కతనఁ బడి యన్నదిలో
గణనాతీతభయంబునం
దృణముం బలె ఝరమువెంటఁ దేలుచువచ్చెన్. 324

తే. వచ్చు నతనిఁ జూచి వఱద వెంబడినట్లు
భీతి నరుగు నొక్క భేకవిభుఁడు
కాష్ఠబుద్ధిమణివికాసితతత్ఫణా
గ్రంబు నెక్కి బ్రదుకఁ గంటి ననుచు. 325

క. ఘనతరతరంగఘట్టన
జనితవ్యథనిజఫణాగ్రసక్తుం డగునా
తని నెఱుఁగఁ డురగవరుఁడుం
జనియెం దరిఁ జేరలేక ఝరవేగమునన్. 326

క. చనువేళఁ దద్విధంబుం
గనుఁగొని తత్తీరశాఖి గాలూఁదిన ఖం
జనవరుఁ డొకఁ డిది యౌరా
యని నవ్వుచు మఱియు నమ్మహాహికి ననియెన్. 327

తే. అకట ఫణిరాజ నీకు నాహారమైన
కప్ప తలమీఁద నుండుట గానవేమొ
తెలియ కేమయ్యె దరిఁజేర నలఁతదీఱి
దీని గబళింతునని యుంటివేని వినుము. 328

క. ఇది మంచిబుద్ధి యింకం
బదటముచే నించుకేని భాషింపకు ప
ల్కెద వేని నోరు నిలువక
వదరిన భూసురుని పగిది వగతువు సుమ్మీ. 329

క. అనుచుఁ బాలసరస్వతి
జనవరఖంజనము నపుడు సర్పముతోడన్
వినిపించిన యాకథ నే
వినిపించెద నేఁటిప్రొద్దు వేగం జనియెన్. 330

తే. కాన నేఁడెల్ల మదిలోనఁ గార్యసరణిఁ
జూచి యూహించి తలపోసి చూచికొనుము
యెల్లి తెలియంగలేకున్న నేనె వచ్చి
తెలిపెద నటంచుఁ బలికి యక్కలికి యపుడు. 331

క. జననాథుఁ డంప నేగెను
దనయింటి కటంచుఁ బలికి తద్దయుఁ బ్రేమం

బునఁ బల్కె వైశ్యభామిని
విని వేగుట గాంచి మదనవేదనమతితోన్. 332

తే. అంతిపురమున కేగి యయ్యబ్జనయన
నాఁటిరాతిరి భూనాథు నరయఁ దలఁచి
దూతికాయుక్త యగుచు నే తెంచినట్టి
సెట్టిసానిఁ గనుంగొని చిలుక వలికె. 333

తే. సకలశుభమస్తుతే వైశ్యసారసాక్షి
యక్కడికి దెల్పి నిల్పితినమ్మ కథయు
మది దలఁపువచ్చె నటుల నమ్మంత్రితనయ
వేగమఱునాఁడె భూమాశు వెఱ్ఱిబుద్ధి
మాన్ప మదిలోఁ దలంచి సంభ్రమముతోడ. 334

వ. నవరత్నఖచితచతురంతయానాధిరూఢయై యవ్వరారోహహజారంబుఁ జేరం జని యవనికాభ్యంతరంబునఁ గూర్చుండి మీనహాసకారణాధీనాజ్ఞానపరుండై యున్నయన్నరేంద్రచంద్రుం గని దత్కథాప్రసంగంబు వినుమని యిట్లను నట్లు మహాప్రవాహముఖంబునం బడి తెప్పిరిల శక్తి చాలక మండూకధృతమస్తకంబై పోవు నమ్మహాభుజంగంబుతో నాఖంజనం బిట్లనియె. 335

క. ఆకథ వినుమని తద్గా
థాకథనకుతూహలంబు దఱుమఁగ వెంటన్
నాకపథంబునఁ బోవుచు
నాకుండలివిభునితోడ నతఁ డిట్లనియెన్. 336

ఉపకథలో నుపకథ


సీ. తామ్రపర్ణీతీరధరణిపై నొకయగ్ర
హారంబు కోశాంబి యనఁగఁ బరఁగు
నచ్చోట విష్ణుశర్మాఖ్యకుం డై యొక్క
భూసురుం డలరు నద్భుతచరిత్రుఁ
డాతండు సుకుమారి యనుభార్యతోఁ గూడి
యఖిలసౌఖ్యంబుల ననుభవించు
నంతట నయ్యింతి యాత్మజాతులఁ గొంచి
కడియంపుఁజే మీఁదు గాఁగ దివము
తే. సేరుటయు వార్ధకమ్మున ఘోరతరవి
చారగరిమను నతఁ డర్థసంగ్రహమున
కిచ్చగింపని యాతనివృత్త మెఱిఁగి
తల్లియు సహోదరీజను లెల్లఁ గదిసి. 337

తే. భార్య యుండిన వనమైనఁ బట్టనంబు
పత్ని లేకున్న గృహమైన బహుళగహన
మగుచుఁ గాన్పించు నరులకు నంతయేల
నాలు లేకున్న విధినైన నధముఁ డండ్రు. 338

క. యాగముల నయోగ్యుండగు
భోగములకు బాహ్యుఁడౌ సుపుత్రోదయలీ
లాగణ్యయైన భార్యా
యోగము లేకుంట నరుల కుచితమె చెపుమా. 339

ఆ. ఎంత దుఃఖమైన ఒంటికి వచ్చి యి
ల్లాలి మొగముఁ జూచినపుడె తలఁగు

నిది యెఱింగి కాదె ఋషులు వసిష్ఠాదు
లును సభార్యు లగుచు వినుతిఁ గనిరి. 340

క. ఒడలంటం గాళ్లు పిసుకం
గడివెఁడు వేన్నీళ్ల నీయఁ గంచము వెట్టన్
బడక యమప్పఁగఁ జేతికి
విడెమియఁగ భార్య కాక వేఱొక తగునే. 341

తే. తిథులయందైన మఱి యపత్నీకుఁ డనుచు
బ్రాహ్మణార్థంబుఁ జెప్ప రేపాటివారు
నొకతె రూపసి గాకున్న నోసియన్న
నోయనెడు మాత్రమునకైన నుండవలయు. 342

క. కావునఁ బునర్వివాహము
గావలయు నటంచుఁ దెలుపఁగా నాతఁడు మే
ధావిని యను భూసురసుతఁ
బావనతరవంశజాతఁ బరిణయమయ్యెన్. 343

క. ఇలునించికొనుట మొదలుగఁ
జలమున మెం డొడ్డి మిగులఁ జండించుచుఁ ద
త్కలకంఠి గురుజనంబుల
కులధర్మం బెంచ కేలుకొంచుం దిరుగున్. 344

సీ. తండులమాషముద్గముల గాదెల నించి
మీఁద బిళ్ల లమర్చి మెత్తు వెట్టు
బక్వశాకం బెల్లఁ బతికంచమున నుంచి
యొడికంబుగాఁ బట్టి యూర్చివైచు
నాజ్యతైలఘటంబు లన్నియు వాసెన
ల్గట్టి యందనిచోట సుట్టె నుంచు

దధిపయోముఖరసద్రవ్యంబు లెల్ల దొం
తుల సందు మూలమూలల సడంచుఁ
తే. జిక్కుఁజిలువాన మొకయింటఁ జేర్చి తలుపు
చిలుకు ముద్రించి బీగముచేయిరొండిఁ
జెక్కికొనుఁ గ్రొత్తవలపులఁ జిమ్మిరేఁగి
వల్లభుం డెల్లయెడఁ దన్ను జెల్లవిడువ. 345

తే. ఇంట నెవ్వారయిన భిక్షమిడిన ముష్టి
పెట్టినఁ గరాళితేజి యొప్పిదము దోఁప
నెగిరిపడి యిందులకు మీర లెవ్వరనుచుఁ
బెద్దపులిఁ బోలె రొప్పు నాబిసరుహాక్షి. 346

క. నాయి ల్లిది నాకాఁపుర
మీయెడ నాసొమ్ము దినుట కెవ్వరు మీరౌ
రాయంచు నత్తవదినెల
వాయోడక కసరుఁ బోరు వారలతోడన్. 347

తే. ఇవ్విధంబున మెలఁగు నయ్యింతి యొంటి
తిండికతమున నినుమడి కండపట్టి
నీరుపోసిన మేనితో నిలుపరాని
మనసుచే జారభోగ మేమఱక తిరిగె. 348

సీ. కలికిమాటలు కిలకిల నవ్వు లోరచూ
పులు మోవివిఱుపులుఁ గులుకు నడలుఁ
బై ఁటజార్పులును సోబానపాటలు కొప్పు
సవరించు నీటు చేసన్న వగలు
గోటిచిమ్ములు తెచ్చికోలు నెవ్వగ లేని
వెఱుపులు నెచ్చెలి వెన్ను చఱపు

మోముద్రిప్పులు బొమముడి ఱొమ్ముతాటింపు
రాని జంకెన కావరంపుఁబొగరు
తే. మొలకసిగ్గులు వట్టికొంకులును దలుపు
చాటునిలుకడ లలతివేసటలు చూపు
గడియలో వింతవగకానిఁ గాంచెనేని
కొమ్మ మారుని జంత్రంపుబొమ్మకరణి. 349
తే. ఇవ్విధంబునఁ జలిదీఱి యింటిపనులు
నూఱునటు వెట్టి వల్లభునోరుఁ గొట్టి
యెల్లసొమ్ములు జారుల కెదురువెట్ట
సాగె నిచ్ఛావిహారనిశ్చలత మీఱ. 350

సీ. పొంకంబుగా నూనె పంకించి సవరంబు
కుప్పె గన్పడఁ గొప్ప కొప్పువెట్టు
నీటికాఁగులలోన నీడ చూచి రువార
మిట్టార యనఁ జాదుబొ ట్టమర్చుఁ
జనుదోయి జిగిమించుకొనఁగఁ బూసినమాడ్కి
రహిమించు గుత్తంపుఱవికఁ దొడుగు
సురటి విచ్చినరీతిఁ దొరయు కుచ్చెల నేల
జీరాడఁగాఁ జల్వచీరఁగట్టు
తే. జాఱుపైఁటచెఱంగు బంగారుపూల
గాజులబెడంగు జారశృంగారములకు
జొక్కుచూపు మెఱుంగు తళుక్కు మనఁగ
వీథి నేవేళ మెలఁగు నవ్విప్రవనిత. 351

క. అంతట మగనికి నన్నం
బింతయిడక వండినట్టి దెల్లను జారో

పాంతములఁ జేర్ప నాతఁ డ
నంతవ్యథఁ గూటిబీదయై నెవ్వగలన్. 352

క. నీనడకలు గంటి గదే
కానీవే నగరఁ జెప్పి కారించెద ని
న్నే నంచుఁ గుంటిసుంకరి
ఫూనిక బెదరించుఁ బొలఁతి బొమముడి వెట్టన్. 353

తే. అంత నయ్యింతి యొక్కింత యళికియాడి
ప్రేగులోపలితీఁట నీబీదముసలి
కన్ను లుండంగఁగద నన్ను గదుమసాగె
ననుచు జింతించి యొకయుపాయంబుఁ గాంచి. 354

తే. గ్రామదేవతయగు నమ్మగారి గుడికి
దినదినంబును జని మహాదేవి మగని
గ్రుడ్డి గావింపు మేఁటేఁటఁ గోడిబలియుఁ
బొంగలి ఘటింతు నని మ్రొక్కి పోవు మగిడి. 355

ఉ. అంతట విష్ణుశర్మ జఠరానల తాపము పర్వ నెంతయుం
జింతవహించి యించుకయు శిక్ష యొనర్ప సదక్షుఁ డౌట నీ
యింతి నిజేచ్ఛమై మెలఁగని మ్మిఁక నన్నముఁ బెట్టెనేని నా
కంతియె చాలు దీనికి నుపాయము జూచెదనంచు నెంచుచున్. 356

తే. ఊరి వెలుపలఁ దగు నమ్మవారిగుడికి
దినదినము భార్య చనియెడు తెఱఁగుఁ దెలిసి
యచటి కొకనాఁడు మున్నుగా నరిగి శక్తి
వెనుకఁ గూర్చుండు నంత నవ్వనిత వచ్చి. 357

క. అమ్మా ప్రతిదినమును నే
నిమ్మాడ్కి న్వేఁడుకొనఁగ నెన్నటి కీఁక నీ
వమ్మగని గ్రుడ్డి చేసెదు
నమ్మిన నాకోర్కి నీకొనర్చుట గాదే. 358

క. అని మ్రొక్కిన నప్పలుకు
ల్విని ధరణీదేవుఁ డెలుఁగు వేఱొకభంగిం
దనరఁగ నద్దేవత ప
ల్కినగతి నిట్లనియె సుమ్మలిక మెల్లఁజనన్. 359

క. నీమగని నంధుఁ జేసెద
నామాట ల్విను మతండు నలుగుడుపడరా
దోమగువ యతని కన్నము
ప్రేమంబునఁ గంచ మరసి పెట్టుము దినమున్. 360

మ. అన మేధావిని శాంకరీవచనమే యంచు న్వితర్కించి యం
త నిశాంతంబున కేగి వల్లభునకు న్వడ్డింప నన్నంబు శా
కనికాయంబును సంఘటించిన నిజాగారంబుఁ జేరంగ వ
చ్చినవాఁడై యతఁ డూరకుండక మదశ్రీ నిట్లను న్భార్యతోన్. 361

క. తరుణీ యేమో తెలియదు
తెరగట్టినయట్టు లున్నదే కన్నులకుం
దెరువడుగుచు వచ్చితి మం
దిరమున కిఁక నేమి యనుచుఁ దెలుపుదు నీకున్. 362

క. ఇన్నాళ్లకరణి నేరము
లెన్నక నీయిచ్చఁ దిరుగు మిదియు మొదలుగా

నన్నము వస్త్రం బిడుచున్
నన్నుం బోషించు మింక నలినదళాక్షీ. 368

వ. అను నప్పలుకుల కప్పడతి యతనిం దప్పక కనుంగొని యతండు నిజాగమనసమయమున నింటిలోన లేఁడనియు నింతలోన నిప్పాపి కంధత్వంబు ప్రాప్తించెనే యనియును మదీయభ్రమావిభ్రమం బింతియె కాక లోకంబులో నుపలంబులు పలుకంజాలునే యనియును జల్పపరాయణుండై యితం డద్దేవిమఱుఁగున గూర్చుండి పలికెం గావలయు నని సిద్ధాంతీకరించి వంచనాపరుం డగునితనిం బోషించిన మంచిదాన నగుదునే యని యెంచి కావించినసమంచితాన్నశాకానీకంబులు జారలోకంబున కల్పించిన నవ్విష్ణుశర్మయు నెఱుంగక నిత్తెఱంగున మాటలాడి నోటికూటికిఁ జేటు దెచ్చుకొంటిఁగదా యని డెందంబునం గుంది వినిందితరసనుండై కృశించెం గావున మౌనంబున నుండుమని ఖంజరీటంబు తెల్పిన సానుభవంబున మేను మఱచి యయ్యురగవరుం డేతత్కథావిశేషం బింతయొప్పునే యని యుచ్చైస్వనంబునం బలికిన నులికిపడి యవ్వతికిం జనిన మండూకమండలేశ్వరుం గనుంగొని యిప్పాట నోటికడి పోఁగొట్టుకొంటివే యని ఖంజరీటం బరిగెఁ గావున. 364

ఆ. పరుల నడుగరాని పరమరహస్యంబు
లడుగఁ దగునె విక్రమార్కభూప
నీవె తెలిసికొనుము నేఁడెల్ల లేకున్న
ఱేపు తెలియ నేర్పఱింతు నీకు. 365

తే. అని యమాత్యతనూజ యయ్యధిపుచేత
నంపకము గాంచి యింటికి నరిగె ననుచు
జిలుక వచియింప నంతలో జలజబంధుఁ
డుదయగిరిసౌధవీథిపైఁ బొదలుటయును. 366

చ. కనుఁగొని యాప్రభావతి జగజ్జనరంజనరాజభాషణం
బెనయక చిల్క పల్కులకు నేమఱియెన్ హృదయం బటంచు మో
హనగృహసీమఁ జేరి మఱి యంబుజము ల్ముకుళించు వేళఁ బూ
నినపని కేగుచోఁ గలువనేజపురాయనితేజి యింపునన్. 367

తే. కప్పురపుబొట్టు చెమటచేఁ గరఁగి జాఱెఁ
జక్క దిద్దుము పూర్ణిమాచంద్రవదన
యింతలో నొక్కకథ వినిపింతు ననుచుఁ
బలుకఁదొడఁగెను బులకండ మొలుకుచుండ. 368

క. మఱునాఁడు విక్రమార్కు
డరసియుఁ దెలిసికొనలేక యమ్మంత్రిసుతం
బరిచారకయువతి పరం
పరచే బిలిపించికొని సమాదరణమునన్. 369

తే. తెరమఱుంగున నిలుప నత్తెఱవ పరుల
నడుగఁగూడని యిక్కార్య మడిగినపుడె
ప్రబలతరమైన జాతిస్వరంబుఁ జూపి
యడలు తురగంబుతోడ జోడగుదు వీవు. 370

అయిదవ యుపకథ


ఉ. ఆకథఁ జిత్తగింపుము ధరాధిప సాధువనం బనంగ న
స్తోకతరప్రసిద్ధిఁ బొలుచుం బుర మొక్కటి యందు మందరా

ఖ్యాకలితుండు శూద్రుఁడు నయాన్వితుఁడై తగునాతఁ డిందిరా
లోకన మేమి లేమి నతిలోకదరిద్రతఁ జెంది కుందుచున్. 371

సీ. కొలుచువారల నోరుగొట్టి లెక్కలు వ్రాసి
హరువు మీఱఁగ మణియములు చేసి
బ్రమసి యాసాసలరసవాదము లొనర్చి
ప్రకటించి రాజపట్టికలు దీర్చి
ప్రతివాసరంబు లేర్పడఁగఁ జేరువగట్టి
వాటంబుగాఁ దెరువాటు గొట్టి
వేళ్లమందు లమర్చి విషవైద్యతవహించి
తఱుఁగుబేరముల నెంతయును మించి
తే. మ్రుచ్చువగయును గని చూచి మూటమోసి
సుంకరులతోడ నొనగూడి జూదమాడి
యిట్లు వర్తించియును నాతఁ డేమి యందు
గళవళముఁ జెందెఁ గూడుఁ గోకయును లేక. 372

తే. అంత నమ్మందఱుం డమందార్తి నుదర
పోషణంబునకై యూరిపొంత దోస
తోఁటఁ గావించెఁ గావడిపాటుపడుచు
నదియు నధ్వన్యదృక్పరం బై తనర్చె. 373

ఉ. అంతట నొక్కనక్కదొర యంబుజబాంధవుఁ డస్తపర్వతో
పాంతముఁ జేరుదాక బొరియం జఠరానలకీల నెంతయుం
జింతిలుచుండి రేలు తన జీతపుబంటులు దాను భీతియొ
క్కింతయు లేకయే మెసవి యేగుఁ దదీయఫలంబు లన్నియున్. 374

తే. ఆసృగాలాగ్రణికి ఘటకాక్య వెలయు
నాతఁ డీరీతిఁ గర్కరికాతిపక్వ

ఫలపరంపర నుదరసంభరణవృత్తి
నడుపుచుండఁగ మందరుం డలుకవొడమి. 375

ఉ. అక్కట దోసతోఁట యిదియైనఁ దదీయఫలంబు లమ్మి యీ
డొక్కను సాకగోరితిఁ గడు న్నడురేలున వచ్చి యెవ్వరో
మక్కువ లేక నాకడుపుమంటయుఁ బుచ్చికొనంగఁ బూని యీ
చక్కెరవంటి పండ్లు తినసాగి రటంచుఁ గృశించు నెంతయున్. 376

చ. ఒకమృగధూర్తరాజవరుఁ డుజ్జ్వలనీతివిదుండు ధీరనా
మకుఁ డతిదూరఘోరననమధ్యవిహారుఁడు విద్విషద్విదా
రకుఁ డొకనాఁడు వేడుక సరాళముగా భటకోటితోడ నో
డక యరుదెంచె నచ్చటి కటత్తటిదీక్షణవీక్షితాస్యుఁడై. 377

తే. వచ్చి బడలిక దీర్చు దుర్వారకర్మ
రీఫలామోదధౌరంధరీవరిష్ట
పవనములచేత నాహారభాగ్య మిచట
నబ్బు నని యెంచి కెలని బిట్టడవి విడిసె. 378

క. తనమంత్రి వరులతో మం
తనమున నీదోసతోట తనరెడుచోటన్
మనజాతివార లుండరె
యని యాలోచన మొనర్పు నాసమయమునన్. 379

మ. ఘటకుండంతట వేగువారు నుడువంగా ధీరుఁ డారీతి వ
చ్చుట లెల్ల న్విని మంత్రులం బిలిచి యిచ్చోఁ బోయి సంధించి యు
త్కటమద్వైభవ మెల్లఁ జూపుటనువో కాదో విచారింపుఁ డే
మిటికన్న న్మన కొక్కవేళకగు తన్మిత్రత్వమం చెన్నెదన్. 380

చ. అది యటులుండె నంతటి మహామహుఁ డిచ్చటి కేగుదెంచినం
దుది మొద లే నెఱింగియు నెదుర్కొని పూజయొనర్పకున్కి యొ

ప్పదు మనమ ట్లొనర్చినను బ్రాభవహానియె గౌరవంబు సొం
పుదనర మున్ను మ్రొక్కి గద మ్రొక్కు గొనన్వలయుం జగంబునన్. 381

క. అనిన విని సచివులందఱు
ననఘా మఱి యాతఁ డింత యధికుం డైనం
గొనివచ్చి పూజలిచ్చిన
మనకుం దప్పేమి యది సమంచిత మనినన్. 382

తే. బుద్ధిసారాఖ్యసచివుండు పూని పలుకు
దొరను మంత్రులఁ జూచి సంతోషమయ్యె
మొదల నెందైనఁ జన నాకు ముదలయిచ్చి
ధీరజంబుకవరుని సంధింపఁజనుఁడు. 383

వ. అనినం దదీయసంధానసముత్సాహభంగకారణం బగు నతని ప్రతికారవచనంబులకుఁ జిడిముడిపడి యితం డేమి యెఱుంగు విచ్చేయుం డనుచు సంధానపరకృత్యులైన యమాత్యులం గూర్చుండ నియమించి యామృగధూర్తచక్రవర్తి యిట్లనియె. 384

క. ఒకనికిఁ దెలియు న్వేఱొక
నికిఁ దెలియక యుండుఁ గార్యనిర్ణయ మితఁడే
టికి నడ్డుగాళ్లు వైచెనొ
యకటా యది యెల్లఁ దెలియ నడుగన్వలయున్. 385

క. అని బుద్ధిసారు నెమ్మొగ
మునఁ జూపులు నిలువఁ గేలు మొగిచి యతం డో
యనఘాత్మ వీరికన్నం
ఘనుఁడంగా నైన నొక్కకార్యము వినుమా. 386

చ. మును వినియుందు ధీరుని సమున్నతగర్వవిహారుఁ డంచు నా
తని మదికి న్భవద్బలవితానము చీమలచాలుఁ బోలె నై
కనఁబడు నీవు పల్కు నుడికారపుమాటల కెల్ల నాతఁ డా.
డును విరసంపుఁబల్కులు గడు న్మఱి మోసము వచ్చు నత్తఱిన్. 387

క. మోసము వచ్చుట యరుదే
యీసునం దద్గర్వభాష లిచటి సృగాలా
గ్రేసరులు సైతురే విను
మాసమయము సుమ్ము దొరల కవగడ మరయన్. 388

ఆ. అతఁడు గర్వయుక్తుఁ డౌటయుఁ గాకున్న
నొక నిదర్శనము మహోగ్రశౌర్య
ప్రభుగుణంబు విడిచి పరభూమి కింత దూ
రంబు వచ్చునే సరాళ మనుచు. 389

క. కావున గర్వాతురుఁడై
కావలెఁ గాదేని యిచటి కర్కరికాళిం
దావిని తదాశ వచ్చెం
గావలె నెట్లైన మనకుఁ గావలెఁ జుమ్మీ. 390

మ. మనకీకర్కరికాఫలాళిగద సామ్రాజ్యంబు గల్పింపఁ జా
లినయాహారము దానికై యితఁడు దోర్లీలాసముల్లాసతం
జనుదేర న్మనమేగి విందులగతి స్సంధించు టేకార్య మి
ప్పని నాకు న్సరిపోదు మీకు రుచియింపం బోలు నిప్పట్టునన్. 391

వ. అకార్యమాత్సర్యకృతానురాగు లగు నీనియోగుల మాటలకుం గోపాటోపంబు నామదిం బాటిల్లదు దుష్టనిరసనశుభానయనిష్టాగరిష్ఠులు కాక కాలోచితప్రభంజనమాత్రకృత్యులగువార లమాత్యులే యది యట్లుండె నతనిం గని తోడితెచ్చితేనియుం దదీయశ్రమాపనోదారం బగు నాహారం బిడవలయుం గదా యీకర్కరీవనంబు కొంచెంబగుటం బరాక్రమంబుఁ జూపకుండునే యంటివేని దానికిం బ్రతికార్యం బీయుపాయంబునఁ బన్ని వచ్చెద నని కర్ణోపాంతంబునం గొన్ని మాటలు నొడివి నిజాధినాథు దెస దరహాసంబగు నంగీకారంబుఁ గైకొని బుద్ధిసారుండు తదాస్థానంబు వెలువడి. 392

క. తటచలితచలదళచ్యుత
తొటతొటరవశాలిఫలమిథోరణకేళీ
పటుతరజలచరనికరో
త్కటమై తనరారు చెఱువు కాలువఁ జేరెన్. 393

తే. చేరి పనిపూని యిటకు నచ్చితి మదుక్తి
కొదవపడకుండ నెట్లొనఁగూడు నొక్కొ-
కార్యమని నాల్గుదిక్కులు గనుచునుండ
దైవవశమున నత్యద్భుతంబుగాఁగ. 394

సీ. క్రవ్యాగతోగ్రకాకవిధూతమక్షికా
పుంజమై తగు వెన్నుపుంటితోడ
బాలకక్రీడావిపాటితరోమజా
లంబైనయట్టి వాలంబు తోడ
నగ్రిమపాదబంధాతికృధాసముం
దనములౌ వెడవెడ దాట్లతోడఁ
గఠిననిజస్వామికరకాష్ఠనిహతజా
తంబునై తొరఁగు రక్తంబుతోడఁ

తే. గర్ణకంఠోదరాభారకంబు లగుచు
నమరు ముయ్యూరుపిడుఁదుతండములతోడ
నచ్చటికి వచ్చె నొకయశ్వ మల్పహేష
జాతి దెల్పఁగ జలపానసంభ్రమమున. 395

ఉ. వచ్చి జలంబు గ్రోల నిలువంబడఁ గల్గొని బుద్ధిసారుఁ డు
ద్యచ్చతురత్వ మొప్ప వినయంబునఁ జేరి నమస్కరించి యే
నిచ్చట నిన్నుఁ జూచి చనియెన్ బహుకాలము నేఁడుగంటినా
ముచ్చట లెల్లఁ దీఱ మన మున్పటి నెయ్యము లెంచుకొందువే. 396

చ. అది యటు లుండె తను వనంతబలాఢ్యము బక్కచిక్కియు
న్నది యిది మాఱురూపువడి యద్దిగ యిద్దురవస్థ యేక్రియం
గదిసనొ నన్నువంటి చెలికాఁ డొకఁ డుండఁగ నిమ్మనోవ్యథా
భ్యుదయము వొందనేటికి నయో నను వింతఁగఁ జూడఁ బాడియే. 397

క. అనిన విని యత్తురంగం
బనఘా నిను మఱవనేర్తునా బహుకాలం
బునకైన బుద్ధిసారుం
డనుసుకృతివి గావె నెయ్య మలఁతియె మనకున్. 398

క. మామా యల్లుఁడ వని మన
మామాడ్కిన్ వావి యొకటి యమరించి నయ
శ్రీమించఁ బ్రవరిల్లుట
యేమైన న్మఱచువాఁడనే గుణహారా. 399

చ. ప్రకటవిషాదవేదనవరస్పరవృత్తి నినుం గనంగఁ దా
వకవిహితప్రవృత్తికి నవజ్ఞత యెంచక పల్కరించి నీ

వకుటిలవృత్తివైతి వినయాభరణా మదిఁగోరి యుందు మా
మకహృదయవ్యథాకథ సమస్తము నీ కెఱిఁగింప నెప్పుడున్. 400

ఉ. ఈపురి నొక్కరెడ్డి వెలయిచ్చి ననుం గొని తెచ్చి పోషణ
శ్రీపరివర్ధమానునిఁగఁ జేయుట నీవు నెఱుంగుదే కదా
యాపయి నాతః డొక్కయెడరైన నను న్వెలకిచ్చె నన్యవి
త్తాపహృతిప్రణీతమతిహారికి వేఱొక బేరివానికిన్. 401

క. అతఁ డింక నేమి సెప్పుదు
సతతము నూరూరిసంతసంతల కత్యు
ద్ధతిఁ బెఱిక లెత్తి తఱుము
న్మతినరయం డింతయైన మత్తనుబాధన్. 402

తే. పెఱికయేచాలు నానడ్డి విఱుఁగఁ జేయ
దానిపైఁ దాను నెక్కు నింతయునుగాక
యకట వయ్యాళిగాఁగఁ బొమ్మనుచుఁ గొట్టు
నతనిచేతులలోఁ జెంగలమ్మ గొట్ట. 403

మ. పొరుగూళ్ళం దిరునాళ్లు సాగిసభరంపున్మానిసి న్మోయ ని
ష్ఠురవృత్తి న్ననుఁ జూపి సుంకము లటంచుం గూలియించు న్వరా
లురయం బారఁగ మోచి నన్నుఁ దఱుము న్లోభాప్తిమైఁ దా నిరా
దరుఁడై మేఁపఁడు కాళ్ళు గట్టి విడుచుం దత్తత్ప్రదేశంబులన్. 404

తే. గొఱపమా లేదు నీ రార్చుగొడవ యెఱుఁగ
గడ్డి వేయఁడు కవణంబు గానివాని
జంబుకాధీశ చూడు మీచాయ నేను
గుఱ్ఱమై పుట్టి యీగోడు గుడుపవలసె. 405

క. త్రిమ్మరి మాపటికై తన
యిమ్మున కేతేర దుక్కి యెనుపోతులు రెం
డిమ్ములఁ గొమ్ములఁ జిమ్ముం
గ్రమ్మిన నిర్దయతఁ బసులగాడింగట్టన్. 406

ఉ. అక్కఠినాత్మకుండు కసవారసి తెమ్మని కూఁతుచేతికిం
జెక్కుడుఁబాఱ యీయ వడి నెట్టది వెల్వడి చేనిమంచెపై
నెక్కినజారుఁగూడి రమియించి దినాంతమునందు వచ్చి బ
ల్తొక్కులు నా మొగంబున విదుర్చును గొన్నితృణాగ్రఖండముల్. 407

క. తొంటిజని వానియు ప్పటు
తింటిఁ జుమా యింతపాటుఁ దెచ్చుకొనుటకై
కంటికిఁ గూరుకురా దాఁ
కంటికిఁ దుది లేదు చిక్కకయె యెట్లుందున్. 408

క. ఇటువలె నున్నది నాకథ
ఘటకసృగాలేంద్రుఁ గొలిచికద యుండుదు వ
ప్పటుమతికి సేమమే యి
చ్చటి కేటికి వచ్చి తనిన జంబుక మనియెన్. 409

తే. అకట నీయట్టి సుగుణరత్నాకరునకు
నిట్టిదురవస్థ వచ్చెనే యింకమీఁద
నంతయును జక్కనయ్యెడు నస్మదాగ
మనము వినిపింతు వినుమాసమానమాన. 410

క. ఘటకున కహిభయ మొదవె
న్బటుగతి నీకుఁగల పక్షపాత మతనిపై
నటియింపఁ జేసి మెలఁగుము
దిట మలరం దార్క్ష్యనామధేయుఁడ వగుటన్. 411

వ. అని ధీరాగమనంబు సవిస్తరంబుగాఁ దెలిపి వెండియు. 412

తే. నీవు మాకెల్ల దొరవోలె నేఁడు మొదలు
కొన్నినాళ్లుండు భవదీయఘోరమూర్తిఁ
గాంచి ధీరుం డపూర్వమృగం బటంచుఁ
దలగు నది మాకు శుభము గంధర్వరాజ. 413

క. ఈరేయి దోసపం డ్ల
వ్వారిగఁ దిను మర్కు డపరవసుధాధరముం
జేరిన పిమ్మట నిలుమీ
చేరువ నే నపుడు వచ్చి చేర్చెదఁ దోఁటన్. 414

క. అనిపల్కి బుద్ధిసారుఁడు
చని యంతయుఁ దెలిపె ఘటకజంబుకకులనా
థున కంతటఁ జారులు దె
ల్పిన నది విని ధీరుఁడొక్క లేనగవలరన్. 415

క. తనమంత్రి సుముఖనామకుఁ
గనుఁగొనుటయు నతఁడు లేచి కార్యముమీఁద
న్ననుఁ జిత్తగింపు మనుచుం
జనియెం దత్తురగమున్న చక్కటి కెలమిన్. 416

చ. చని కరము ల్మొగిడ్చి బుధసన్నుత జంబుకజాతివాఁడ న
త్యనఘుఁడ నే నతీతము ననాగతము న్మఱివర్తమానముం
గని వివరింతు నిప్పు డొకకాఱియచే వెతఁ జెందినాఁడ వి
ద్ధినమున నీకుఁ గల్గువడదేఱఁగ గర్కరికాఫలావళుల్. 417

చ. ఇది నిజమైన ఱేపు వచియించెదఁ దక్కినకార్యమంతయుం
దుదినొక విన్నపంబు దయతో విను మాఁకటఁ గుందినాఁడ నేఁ
డదనున దోసపండ్లు తినునత్తఱి నన్నొకసారి పిల్వు

నేఁ
జెదరని ప్రీతి నివ్వెలుఁగుచెంగట నివ్వలఁ బొంచియుండెదన్. 418

[2]క. అనిపూన్చి ధీరుతో న
త్యనుపమగతి సుముఖనాముఁ డవగడమగున
ట్లొనరించి వేగవచ్చితి
నని తెలిపె న్రవియుఁ బశ్చిమాంబుధి గ్రుంకెన్. 419

వ. అంత. 420

మ. రవి రాక న్మదిఁగోరు పద్మినులు చక్రస్త్రీలు మోము ల్ముడుం
ప వియోగవ్యథఁ గుందఁ బాల్పడియెమామాడ్కి న్మముం గోరుకై
రవణీలోకము చెంగలించె నది చంద్రప్రేమ మస్మద్విలో
కవిసృష్టం బనిజారలాడ నడరెం గాఢాంధకారచ్ఛటల్. 421

శా. ఆవేళ న్నిజకామినీకరగృహీతాభీలదండావనీ
జావాలీకృతబాహుమూలుఁడు మహీయఃకంబళాచ్ఛాదితుం
డావిర్భూతకఠోరరోషుఁ డయి యాతాకల్పితోర్వారువ
న్యావీరుజ్జనితోత్ఫలాననపరుం డమ్మందరుం డుండఁగాన్. 422

చ. ఘటకుఁడు పంపఁగా నరిగి కంపవెలుంగు తలంగఁద్రోచి యు
ద్భటగతి బుద్ధిసారుఁ డటు తారునఁ గర్కరికాఫలాళిఁ జూ

పుటయుఁ దురంగము న్మెసవెఁబో లతిక ల్తెగిపోవఁ బత్రముల్
త్రుటితములై పడం బృథులతుండము భూస్థలి సోఁకునట్లుగన్. 423

తే. అంత సుముఖుని దలఁచి యయ్యశ్వరత్న
మలఘుహేషారవంబునఁ బిలుచుటయును
నిదియె పండ్లెల్ల దినిపోయె నేమొ యనుచు
మందరుఁడు కోలచేఁ బరిమార్చెదాని. 424

క. ఇటువలె నొగిలి తురంగం
బటునిటు వడి పాఱిపోయి యస్మధ్వనియే
మిటికిం జూపితకట యని
చటులవ్యథఁ గుందె మహిభుజా వింటికదా. 425

క. కావున నేఁడెల్లను నీ
భావంబున నరయు మెఱుకపడకుండినచో
నీవిధ మని జలచరహా
౽సావిర్భూతికిని హేతు వమరవచింతున్. 426

తే. అని నియోగితనూజ యయ్యధిపుఁ డనుప
నిలయమున కేగె నని చిల్కపలుకఁ గమ్మ
తమ్మినెత్తావి తెమ్మెర ల్గ్రమ్ముటయును
నల ప్రభావతి కేళిగృహంబుఁ జేరు. 427

ఉ. అంతఁ గ్రమక్రమంబున నహస్కరబింబము పూర్వశైలసౌ
ధాంతహిరణ్యకుంభము విహాయసమండలనామఖేటకా
భ్యంతరధాతురాగ మపరాద్రివిమానవితానితాతిదు
రదాంతవిభావిభావ్యముకురంబును నై జలరాశీఁ గ్రుంకినన్. 428

సీ. అద్దంబులోఁ దోఁచు నబ్జరేఖ యనంగ
మోముపైఁ దెలినాభినామ మమరఁ

దలిరాకుపై మొగ్గు నలరుమొగ్గ యనంగ
మోవిపై ముక్కఱముత్తె మమర
వలమురిపై నంటు జలధిపంక మనంగ
గళము పైఁ గస్తురి కప్పు మెఱయఁ
గాలాహిపై మించు కంచుకంబొ యనంగ
జడమీఁద ముడి పూవుసరము లొరయ
తే. లతనుదోహదధూమము ల్గప్పుకరణి
నంగయష్టిక నీలసంవ్యాన మెసఁగఁ
గదలి యేతెంచె రాజసంగమసుఖైక
పరతఁ జెంది ప్రభావతీపద్మగంధి. 429

ఉ. వచ్చినఁ జూచి కీర మనివారితచాతురి మీఱ నారి నీ
యిచ్చ గణాధినాథు గణియింపు తదాదృతి లేకయున్న నీ
వచ్చటి కేగుకార్యము రయంబునఁ గూడదు చిత్తగింపుమా
తచ్చరితం బటంచు నుచితంబుగ నెచ్చెలి నిల్పి యిట్లనున్. 430

తే. అంత మఱునాఁడు విక్రమార్కావనీశు
డలయమాత్యతనూజాతఁ బిలువఁ బనిచి
చనపరులు చెంతఁ గొలువ నాస్థానసీమఁ
జేరి సింగఁపుగద్దె నాసీనుఁ డగుచు. 431

తే. తెరమఱుంగునఁ గూర్చుండి తేనెవాన
ప్రబలఁ గథఁ జెప్ప నేర్చిన బాఁపనమ్మ
యిప్పుడైనను దెల్పుమా యేలనవ్వెఁ
బక్వమీనము లనుఁడు నప్పడఁతి పలికె. 432

క. అడుగం గూడని కార్యం
బడిగెద వట్లేని మును గజాస్యునితో వా

దుడుగక యొనర్చి పిమ్మట
యడలిన వటమునకు సుద్ది యగుదువు సుమ్మా. 433

ఆఱవ యుపకథ


చ. అది యెటులంటివేని వినుమా హురిశాహురినుండిపన్నగాం
గదుని నివాసమై యలరు కాశికిఁ బోయెడుత్రోవ నీడపు
ట్టదు గద నాఁగమించినయెడ న్నొకచో నొకలేఁతమఱ్ఱి య
భ్యుదయము నొందసాగెఁ దఱినొందినవానలచేత నంతటన్. 434

తే. అధ్వగులు కోడిగములకై యాకులెల్ల
ద్రెంచి శాఖావితానము ద్రుంచివైవ
మోడుపడియుండె నది నిల్వనీడపట్టు
గొమ్మయును లేమి తనయందుఁ గుదురుకొనఁగ. 435

తే. అంత నొక శైవుఁ డాత్రోవ నరుగువాఁడు
కెలని కొలనున నాహ్నికక్రియలు దీర్చి
చెంతఁబడియున్నఱాయి యాచెట్టుమొదటఁ
జేర్చి విఘ్నేశుఁ డనుచుఁ బూజించి చనిన. 436

క. అది మొదలుగఁ దెరువరులిం
పు దలిర్పఁగఁ దెచ్చి తెచ్చి పుడిసెఁడు నీళ్లుం
బదియైదు గఱికిపోచలు
గదియించి చనంగ నచట గణపతి నిలిచెన్. 437

సీ. పాల్పొంగి వఱదలై పాఱఁ జెంగటి యూళ్ల
కాఁపుగుబ్బెతలు పొంగళ్లువెట్ట
నీళ్లు వెల్లువగట్ట నికటాగ్రహారథ
రాసురు ల్నారికేరములు గొట్ట

యుండిగల్నిండఁ బొన్నూళ్ల కేగెడు బేరు
లకలంకభక్తి గానుకలు వైవఁ
గుప్పగాఁ దెరువాట్లు గొట్టెడు పెనుదొంగ
బంటు లాదాయంబు పంచి యొసఁగ
తే. నీడపందిరి చెంత గన్నేరుతోఁట
నమ్మి పూజించుఁ గ్రొత్తకాణాచినంబి
పొంతనిన్చిన దారువిభూతిపాత్ర
మమరఁ గనుపట్టె నచట విఘ్నాధినేత. 438

సీ. తను దలంచినవేళ ధరణీధరకుమారి
పాలిండ్ల బోరునఁ బాలు గురియఁ
బొడఁగనవచ్చు వేల్పులఱేని కరిఁ జూచి
దాక్షాయణీభర్త తన్నుఁ దలఁప
మనసునిల్వమి నెమ్మి మాపుపై వయ్యాళి
మన్నీఁడు తనుఁజూచి మరలిపోవ
మముఁ బిల్వఁ బంపుకొమ్మా యని ప్రమథసం
ఘమ్ములు తనపేరఁ గమ్మలనుప
తే. నతుల కైలాసలీలాగృహాంతరాళ
కేళికాపాళికలును గపోల మరిచ
కాయమానమహచ్ఛాయజాయమాన
మేదురామోదుఁ డయ్యె లంబోదరుండు. 439

క. ఆతనికి వెఱచి పథిక
వ్రాతము తనుఁ జెనకకునికి వటభూరుహ మ
త్యాతతశాఖాగ్రవస
ద్యోతటినీహంసికాసముత్కర మయ్యెన్. 440

వ. ఆసమయంబున. 441

సీ. పాటలావనిజాతపటలదోహదము కా
సారార్థజలకుంభజన్మమూర్తి
సహకారశుకభారసాధారకరణి వ
న్యానంగశూలిఫాలాక్షవీక్ష
శాల్మలీఫలదండసంఘట్టనంబు ద
క్షిణమరున్మదహస్తిసింహరుతము
పథికప్రపాంగణప్రాపణాంకణము మ
రీచికానిమ్నగాస్వఘటపటిమ
తే. మహితశైత్యవధూస్తనమార్గదర్శి
చటులజంఘాలవాత్యాళిజననవేళ
తాలవృంతాదిమూల్యప్రదాయకంబు
దనరు సంతప్తజనము నిదాఘదినము. 442

మ. తురగాస్యోత్క్రమకృద్దవోద్గతమహాధూమాంబువాహంబు వే
చరమాశాగతమైన గాలి కెదురై సారోజ్జ్వలస్యందనం
బు రహిం గ్రాలఁ గుమారు గాలిపటముం బోలెందివి న్మెల్లనే
తిరుగంగా నిటులయ్యె నాఁగదినము ల్దీర్ఘంబు లయ్యెం గడున్. 443

చ. పడమటిగాలి వెట్ట నొకపారియుఁ గ్రోలమి నీరసంబులై
జడిసిన చిల్వగుంపు నొకపారియు మ్రింగమి సొమ్మసిల్లి మ్రా
న్పడినగుఱాని నొల్లని ధణాయునికిం దనవాహనంబులం
బడిబడియంపెనో యమరభర్త యనందగెదావధూమముల్. 444

మ. జలజాప్తోగ్రమయూఖపుం జెకుముకి న్సప్తాశ్వకాంతోపల
మ్ముల సోఁకించి తదుద్గతాగ్నిలవముం బోధించి వాత్యాననా

నిలవేగంబునఁ గాలుకొల్చి పతగానీకంబు పాకంబుగా
నలరించె న్సమయాఖ్యపాచకుఁడు భూతాహారసంప్రాప్తికిన్. 445

మ. జలమింక న్నయనంబు లాతపభయభ్రాంతంబులై మధ్యసం
ధ్యలనుం దోఁచని యంబుకేళికయి ప్రాతర్వాసరాపోదయం
బులఁ గాన్పించె ననంగఁ దీరనగరాంభోజాతనీరాకరం
బులు నీరార్చుటకైన బల్చెలమల న్బొల్పొందె నవ్వేసవిన్. 446

తే. దారుణారుణకిరణసంతాపదిశల
ననుభవింపఁగఁ జాలక యంబుదములు
మెఱుపు లుఱుములు దొరఁగి భూమిపనికాయ్య
దేశముల నిల్చె ధూమంపుఁదిత్తు లగుచు. 447

క. ఆవేసవి నిష్కాసితుఁ
డై వసుథాదేవుఁ డొక్కఁ డాత్మపురీయా
శ్రావేశితకుతుకంబున
నావట మున్నట్టిత్రోవ నరుదెంచె వెసన్. 448

సీ. గమనవేగంబునం గావిడి వెదురు వె
క్కసపు మ్రోఁతలఁ గిఱ్ఱుకఱ్ఱు మనఁగ
సగళకరోటిపై బిగియఁ జుట్టిన పటాం
చల మింత గాలిచే సంచలింప
సరకులుంచిన మాత్రసంచిలో నంటగ
ట్టిన యట్టి నేతిలడ్డిగ దనర్పఁ
గొనలెత్తి కదియఁజెక్కిన కావిధోవతి
పైఁ గట్టుకొన్న కంబళీ యెసంగ
తే. నాతపగ్లానిచే నీడ లరయఁబాఱి
గాఢవీక్ష నిరాశచే గ్రమ్మఱంగ

వచ్చివచ్చి యతండు దుర్వారపుణ్య
వత్కృతప్రపమైన యవ్వటముఁ జేరె. 449

వ. చేరి తద్విశాలపానీయశాలాంతరంబునం బరికీర్ణోశీరతాశీతలం బగుభూతలంబున విశ్వనాథేతివచనముఖరుం డగుచు విపథం డించినవిధంబునం గంబడి పఱచి సుఖాసీనుండై యచ్చెంగటం గూడిన యధ్వనీనులవలన యాచితోపలబ్ధం బగుతాంబూలంబునం బరితుష్టుండై యందు నందంబగు పందిటం దోరణంబుగా హత్తించిన పసుపుటాకులగుత్తుల కత్తమిల్లు నెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై దిశాభిత్తికల నొత్తుకొనుటకుం బ్రమోదాయత్తచిత్తుం డగుచు దట్టంబుగా నుట్టులం బెట్టినసారంబు లగుఘృతక్షీరపూరంబుల నుగ్గులిడి యగ్గలపునిగ్గులు గలపాలబుగ్గలు ముద్దాడి నిద్దంబులై వ్రేలు వైణవడోలికల బాలకుల నునిచి జోలలు వాడుచు నిజమందిరాంగణంబునం బోలె మెలంగు పథికాంగనలఁ గనుంగొని యాశ్చర్యధుర్యుం డగుచుఁ జెంగటం జెలంగు నికుంజపుంజంబులం బరిచారికలు సూపాన్నశాకంబులు పాకంబులు సేయునంతకు నిద్రాముద్రితులై సమయంబగుటయుఁ గెలంకునం బొకంబగు కొలంకున నకలంకంబు లగు జలంబులం దోఁగి సుస్నాతులై వచ్చి యచ్చటి కాయమానంబుల నాలంబమానంబు లగు గోపీచందనశ్వేతమృత్తికాదులు మతానుసారంబుగాఁ దాల్చి చను నధ్వన్యమాన్యుల నాహారంబు లడుగు తెరువరుల దీనాలాపంబులకు దుర్వారనిర్వేదంబు నొందుచు నపారపిపాసాయాసులై చేరి తదీయాధికారి దత్తామలకపూర్వకంబుగా శీతలోష్ణోదకంబుల యథాభిలాషంబుగఁ గొని ప్రసంగవశజనితంబు లగు రాజకార్యంబులం బక్షాపరపక్షంబులు వహించి పోరాడుగ్రామీణుల నిరర్థప్రయాసంబునకుం దరహాసంబు సేయుచు దధితగ్రవిక్రయంబు లుపదేశమాత్రంబులుగా జారాన్వేషణంబులు ప్రధానకార్యంబులుగా సమీపజనపదంబులనుండి వచ్చియున్న యాభీరభీరువులపరిభాషలభావం బెఱింగి యంతరంగంబులుం గరంగి మార్గశ్రమంబును దినావసానప్రపాస్థలదూరంబులును విచారింపక తదానీతులై సంకేతలతాగృహంబుల కరుగుకుమారపాంథుల వయోమదాంధత్వంబుఁ దిలకించి యించువిలుకాని యకాలశౌర్యనిర్వహణంబునకు మెచ్చుచు నత్తైర్థికుండు పూర్వరాత్రంబునఁ బ్రయోజనవశంబున జాగరూకుండై యుండుటం జేసి శయనించి నిద్రాముద్రితనేత్రుండై యుండునంత. 450

తే. తత్ప్రపాంతరజనుల సంతాపదశల
పాలుపఱుపని తనప్రతాపంబు రోసి
కొంచెపఱిచెనొ రవినాఁగఁ గోష్ణమయ్యె
నతులయామశయానాంతరాతపములు. 451

తే, అప్పుడచ్చటఁ గూడిన యధ్వగాళి
చనియె నిర్దిష్టనగరవిశ్రాంతి నొంద
బ్రొద్దు గ్రుంకినఁ బిళ్లారిపూజ సేయు
బ్రాహ్మణుండును జెంగటిపల్లె కరిగె. 452

ఉ. అంతట మేలుకాంచి వసుధామరవర్యుఁ డనార్యనిర్గత
ధ్వాంతము నధ్వనీనరహితత్వముఁ జూచి దిగు ల్జనింప లో
నెంతయుఁ జింతనొంది తెరు వెక్కడనో కనఁగూడ దీడనే

కాంతము గాఁగ నిల్వఁగ భయం బగుచున్న దటంచు ఖిన్నుఁడై. 453

క. అంత విచారించియు మన
సంతమసము కతన వెడలి చనరామి నతం
డంతికతటాకమున సా
యంతన విధిఁ దీర్చి వచ్చి యతిభయ మెనయన్. 454

శా. గంగే! డుంఠి గణేశ! భైరవ! మహాగౌరీపతే! పాహి! యం
చుం కాశీపురి వేల్పులం దలఁచికొంచు బవ్వళించెం దటో
త్తుంగాత్యాతతశాఖి క్రిందఁ దనకుం దోడేమియు న్లేమి నా
నంగాఁ జోరభయంబు చీమ చిటుకన్నం గావడిం జూచుచున్. 455

తే. ఇట్లు శయనించి నిద్దుర యెనయకునికి
నమ్మహీజమ్ముఁ జూచి వృక్షాగ్రగణ్య!
యల గయావటమైన నీయంత గలదె?
నిన్ను మావంటివారు వర్ణింపఁ గలరె? 456

తే. సద్ద్విజాశ్రయములు భవచ్ఛాఖ లెల్ల
నిబిడవర్ణాత్మకంబులు నీదు జడలు
హరిగతిప్రతిపాది నీ యగ్ర మరయ
నీ మహాగమవిఖ్యాతి నెఱయ మెఱసె. 457

క. నీ నీడఁ జేరు కతన న
హీనతరఖ్యాతిఁ జెంది యీ సుమపూజల్
బోనములు నడపఁగా నీ
యేనుఁగు మొగమయ్య వెలసె నిచ్చట ననినన్. 458

చ. అలరి మహీరుహాగ్రణి నిజాగ్రపతత్రిభయంకరంబుగాఁ
గలకల నవ్వి యోబుధశిఖామణి నీఫణితంబు విన్న వే
చెలఁగితి నీదునీడ వెలసెం గణనాయకుఁ డన్నమాటకున్
భళిభళి నిశ్చితార్థ మతిభంగికి మెచ్చమి దోష మొందదే. 459

క. అనుమాటకు శైలసుతా
తనయుఁడు కోపించి మంచి తగవౌ నేనిం
దునికి న్నీ విటు ప్రబలితి
నిను జేరుట వెలసినాఁడనే మహిరుహమా. 460

క. మునుపున్న యునికిఁ దలఁపక
ననుఁజేరుటకతన వెలసినాఁ డీగణరా
జని పలుక న్నో రెటు లా
డెను సిగ్గు జనింపదేమొ డెందములోనన్. 461

తే. అనిన జలపాదియై పాదపాగ్రగణ్యుం
డిట్లనియెఁ దైర్థికుండౌర యిట్టివేళ
వీరికలహంబుకతమున వెఱపులేక
యుండఁగల్గెఁగదా యని యూకొనంగ. 462

మ. జలరాశిం బవళించు శౌరి నుదరాంచల్లోకచాతుర్దశీ
కలితు న్మున్గకయుండఁ బత్రమున విఖ్యాతంబుగాఁ దాల్చి మ్రాఁ
కులలో నగ్రగణ్యతం దనరు నాకు న్నీవు ప్రాపన్న సి
గ్గులచే టింత యెఱుంగ కాడితివి నీకుం బ్రాపునై యుండఁగన్. 469

క. నానీడ నిలుచుపథికులు
కానుకగాఁ గొన్ని యొసఁగ గాదే మఱినీ

కీనడవడి గలిగె న్మదిఁ
గావున మత్కృతమహోపకారము సుమతీ. 464

మ. అని లంబోదరుతో వటం బతికుతర్కాలంబమై యున్నచో
నినబింబంబుదయంబుఁ గాంచుతటి నాపృథ్వీసుపర్వార్యుఁ డా
త్మనగర్యాదరధుర్యుఁడై యరిగె నంతం దద్రుమాఖర్వగ
ర్వనిరాసంబున కంబికాసుతుఁడు దుర్వారప్రభావమ్మునన్. 465

మ. హితపూజాపరుఁడైన భూసురునితో నే నిచ్చట న్నిల్వ నేఁ
డతిసమ్మోదముతో స్థలాంతరసపర్యాలోలతం బోయెదన్
మతిఁజింతింపకు మంచుఁ బల్కి తలఁగెం బానీయశాలం బడెం
బ్రతివేళాగతపాంథవేధవటముం బ్రాగ్రూప మొందె న్వెసన్. 466

క. ఆవెనుక నేలతొడరితి
దేవునితో ననుచు వట మతివ్యథఁ జెందెన్
భూవల్లభ వింటివికద
యావగ యగుదీవు నన్ను నడిగితివేనిన్. 467

క. అటు గనుక నీవె తెలియుము
పటుగతి నేఁ డెల్లఁ గానఁబడకుండిన ని
చ్చటి కెల్లి వచ్చి తెలిపెద
ఘటియింపు మనుజ్ఞ మన్నికాయంబునకున్. 468

తే. అని ప్రధానతనూజ గేహమున కరిగె
ననుచుఁ గీరంబు వల్క సుధాంశుకాంత
నికరములనీరు జాఱక నిలువఁజూచి
యా ప్రభావతి క్రీడాగృహంబుఁ జేరె. 469

క. క్రమమున భాస్కరుఁ డంతటఁ
గమలాసీనుఁడయి కమలకరుఁడై కమలా
రమణీయుఁ డగుచుఁ గ్రుంకినఁ
బ్రమదాంబుధి దేలి యాప్రభావతి బాళిన్. 470

తే. రాజవిరహప్రభావతిరస్కృతంబు
కృతసఖిప్రార్థనాశతాంగీకృతంబు
నైనభూషణచయము నేమైనదనినఁ
జేరఁ జనుదేరఁజూచి యక్కీరవరుఁడు. 471

తే. అమ్మ నీనుఁ జూచినపుడెల్ల నయ్యమాత్య
తనయ తలఁపునఁ బాఱెఁడు దానినైపు
ణీవిశేషంబు వినుమంచు నిలువఁబట్టి
గట్టిచల ముట్టిపడ సెట్టిపట్టి కనియె. 472

క. తనుమదిగనఁజాలక య
త్యనుపమ మగుచింత విక్రమార్కుఁడు పిలువం
బనిచిన యమ్మఱునాఁడుం
జనియె న్ఘనబుద్ధితనయ సవినయుగరిమన్. 473

వ. అని యథాపూర్వంబుగా నాసీనయై మీనహాసకారణాజ్ఞానాధీనుండైన యమ్మానవాధీశ్వరుఁగుఱించి యాస్థానంబునం గలజనంబులు నిజమధురవచనసుథాసారంబునకుఁ గర్ణాంజలిపుటంబు లొగ్గ నక్కంజనయన యిట్లనియె. 474

తే. పరులు దెలియంగరాని యీపరమగోప్య
మైనకార్యంబు నీవు న న్నడిగితేని
స్వపతి జారుల కెడసినచపల యనెడి
కాంతతో జంట యగుదు వాగాధ వినుము. 475

ఏడవ యుపకథ


క. సౌరాష్ట్రభూమిలో గుణ
గౌరవుఁ డనునృపతి యేలఁగాఁ దగు విభవా
ధారంబను పురిఁ గథకా
ఖ్యారాముం డొక్కభూసురాగ్రణి వెలయున్. 476

సీ. అలికి మ్రుగ్గులు వెట్టినట్టి తిన్నెలు కంచు
బోరుతల్పులు పాలువోసి చాల
యూర్చవచ్చు ననంగ నొనరు చావడి తాళు
వారంబు చిన్నగవాక్ష లమరు
వంటకొట్టము చిలువాన మించిన మిద్దె
పట్టెమంచముతోడి పడుక యిల్లు
పడసాలముంగిలి పందిరి పసిగాడి
కాయధాన్యములున్న కణజములును
తే. బెరటిలో నారికేళజంబీరముఖ్య
నిఖలఫలవృక్షములు మంచినీళ్లబావి
నమర నయ్యింట నిత్యకల్యాణములును
బచ్చతోరణములు మించఁ బరఁగు నతఁడు. 477

తే. అతని ప్రియపుత్రి యగుచపలాఖ్య యొకతె
పేర్మిఁబోషింప నానాఁటఁ బెండ్లి కెదిగె
మరుఁడు మఱచినసాము వేమఱునుజేయఁ
దలఁచి సాదనగరడిలో దట్టిఁ గట్ట. 478

క. అంతట నక్కన్నియ నొక
యంతర్వాణికి నొసంగి యక్కథకుఁడు గే

హాంతమున నిలిపికొని యు
న్నంతట మోదము జనింప నాదంపతులున్. 479

క. ఆరీతినుండు నంతట
నారమణీమణికి యౌవనాగమ మొదవం
గూరిచిరి వరునితో ముద
మూరఁగఁ దలిదండ్రు లొక మహూర్తమునందున్. 480

క. ఆరేయి చపలమగనిం
జేరుటయే కాని యేమి చెప్పుదు లోకా
చార మెఱుంగని యాతని
గారా మొక్కింతయైనఁ గానక చనియెన్. 481

క. దినదినము నిట్టులూరక
చనిచని యామీఁద సిగ్గు చాలించి ముదం
బెనయం బైకొని చూచియుఁ
గనదయ్యె న్వాని సురతకాంక్షాగుణమున్. 482

సీ. తలుపుచెంగటఁ గొంత నిలిచి యాకర్షణ
శ్రీలేమిఁ దనుదాన చేర నరిగి
క్రముకఖండము లీయఁగాఁబోయి సంగ్రహో
న్మేష లేమిని శయ్యమీఁద నునిచి
కదిసి పాదము లొత్తఁగాఁ బూని యంగీకృ
తిస్ఫూర్తిఁ గనమి భీతిల్లి లేచి
ప్రేమగన్పడఁ బల్కరించి ప్రత్యుత్తర
స్థితి గానఁబడకున్న జిన్నఁబోయి
తే. శాస్త్రపాఠక్రమానంతజాడ్యుఁడై న
ధవుని గని యుస్సురంచును దలుపుమూసి

గుబ్బకవమీఁది పయ్యెదకొంగు పఱచి
నేలఁ బవళించు మగువ కన్నీరు దొరఁగ. 483

సీ. కవగూడి యెడఁబాయఁగా లేని మిథునంబు
కాంక్ష వీక్షించి యేకారఁ దొడఁగు
నన్యోన్యమైత్రి సయ్యాట లాడెడు వధూ
వరుల వేడుకకు భావమున నుడుకు
భాగ్యంబు గల సతీపతుల నిర్భయరహః
క్రీడల కెల్ల గ్రుక్కిళ్ళు మ్రింగు
మదనకేళీపరిమ్లానాంగులగు దంప
తుల యందమునకుఁ గొందలముఁ జెందు
నుర్వి నిర్వక్రతరుణవయోమదాంధ
గంధసింధురగమన లఖండసౌఖ్య
మెంత గల్గియు సంభోగహీనమైన
నెట్లు భరియింపఁగలరు మహి న్మహీంద్ర! 484

క. పగలెల్ల నింటిపనులకు
నగపడ నొకరీతి మఱచియైనను నుండున్
మగువ నిశాముఖమైన
న్దిగులుపడు న్మగని వగ గణించుచు మదిలోన్. 485

సీ. పట్టి కాఁపుర మింత రట్టాయెఁగా యంచుఁ
దల్లి పెల్లగు వంతఁ దల్లడిల్లు
జాయాబహుజ్ఞప్తజామాతృజాడ్యుఁడై
తండ్రి యందంద డెందమునఁ గుందుఁ
గ్రోధ మొందిననైనఁ గొడుకు దుర్గుణ మెంచి
యత్త మాడెత్తు మాటాడ వెఱచుఁ

దాఁజెప్పు చదువు లింతకుఁ దెచ్చెఁగా యంచు
మామ యే మన లేక మోమువాంచు
తే. మర్మ మెఱుఁగని వార లిమ్మగువ కేమి
యొచ్చమున్నదొకో మగఁ డొల్లఁ డనుచు
నాడుకొనఁ జొత్తు రక్కటా యాఁడుఁబుట్టు
పుట్టరాదుసుమా లోకమున నరేంద్ర. 486

తే. ఇట్లు వర్తింప నొక్కనాఁ డిరులుగవియు
వేళఁ గార్యాంతరాపేక్ష వెంటఁబడఁగ
నింటివారికిఁ జెప్పక నేగెఁ జపల
మగఁడు పొరుగూరికై బుద్ధిమంతుఁ డగుట. 487

క. ఆరేయి వానిచెలికాఁ
డారాధ్యుఁ డనంగఁ బరఁగు నాతండు తదా
గారమునఁ బడుకయింట ను
దారతదాగమనకాంక్షియై పవళించెన్. 488

తే. అంతఁ జపలావధూటి నేఁడైన మంచి
బుద్ధిపుట్టదె మగని కాపూర్ణదైవ
కరుణ నని కేళిగేహంబు గదిసి యచట
వాని నిజనాథుఁ డని మదిలోన నెంచి. 489

శా. చేరంగాఁ జని యక్కటా యధిప మీచిత్తంబు రాకున్న నీ
వీరీతిం బదసేవసేయు మని మీరే నన్ను శిక్షించి యే
నేరం బైన సహింప భాగ్యముగదా నిష్కారణం బిట్లు నా
పేరన్న న్మదిఁ గంటగించెదరు పెంపే మీకు నన్నేఁచుటల్. 490

క. అని దైన్యముతోఁ బలికిన
విని యాతఁడు మదనవిశిఖవివశుం డగుచున్

మునుదాని తెఱఁ గెఱుంగుట
నెనసినతమి సురతకేళి నింపుఘటింపన్. 491

క. ఆవెనుక మగఁడు గాఁడని
భావంబునఁ దెలిసి సిగ్గువడి యంతటిలో
దైవాధీనం బిది యని
భావించుచుఁ జపల మృదులభాషల ననియెన్. 492

తే. ఇంత మోసంబుఁ జేసి నాయీలువెల్ల
నపహరించితి విఁక నేమి యైనకార్య
మయ్యెనేకద యీరీతి ననుదినంబు
నన్ను మన్నింపుకున్నఁ బ్రాణములు విడుతు. 493

క. అని పలికె నదియు మొదలుగ
వెనుదీయక యజ్జయైన వేళల నెల్లం
జనుదెంచు వానిరతి న
వ్వనితామణి తనివిలేక వర్తిలఁ దొడఁగెన్. 494

సీ. భర్తకుఁ భ్రాతరౌపాసనాగ్ని యొసంగి
దుడుకుఁగా ముంగిటఁ దొంగి చూచు
నాయకునకు మజ్జనజలంబు ఘటియించి
తాపియింటికి నేగి తడవుచూచు
ధవునిచెంగట నిష్టదైవపూజ కమర్చి
తలవాఁకిటికిఁ బోయి నిలిచిచూచుఁ
బతికంచమున శాకవితతులు వడ్డించి
నిలువఁగూడక గోడ నిక్కిచూచు
తే. నెంతబాళియొ కాక యయ్యిందుముఖికి
గూర్మినారాధ్యురాకలు గోరు టొకటె

కాని ప్రాణేశు పరిచర్య కానివావి
యయ్యె నేమందునయ్య యయ్యతనుమహిమ. 495

సీ. ఠీవితో నేటినీటికిఁ బోవుచో వెంట
వెంటవచ్చితిఁజుమా విద్రుమోష్ఠి
పొరుగింటి చెలిఁ గూడి సరసము ల్పలుకుచో
జెంత నిల్చితిఁజుమా దంతిగమన
ముంగిట జననితో ముచ్చటలాడంగ
నిక్కిచూచితిఁజుమా టెక్కులాఁడి
పడుకటింటికిఁ జెలు ల్ప్రార్థించి యనుపుచోఁ
దలుపుమీటితిఁజుమా తతనితంబ
తే. యనుచు నారాధ్యుఁ డొంటిపాటైన వేళ
నవ్వధూమణితోడ మోహంబుఁ దెలుప
నప్పడంతియు నవి నీవు చెప్ప నేల
వినర నాకన్ను లెందున్న వనుచుఁ బలుకు. 496

క. ఈరీతి నుండు నంతట
వారల యందములు సవసవలుగా వినియ
య్యూరెల్ల గుజగుజలఁబో
జారునితోఁ జపల తెలుపుఁ జాంచల్యముగాన్. 497

క. వచ్చెఁగద బెడఁద మన కిఁక
నిచ్చట నడయాడఁ గూడ దెటకేనియు నే
వచ్చెద రమ్మటులైన
న్విచ్చలవిడి నడువవచ్చు వెఱువకు మదిలోన్. 498

తే. అనిన భయమంది యాతఁ డోయబల యింత
సాహసక్రియ చేయంగఁ జనునె మనకు

ననుచు వారింప విన కది యతనిఁ గూడి
యరిగెఁ దెగియించి నిర్భరసురతవాంఛ. 499

శా. ఆరీతిం బహుదేశము ల్గడచిపో నారాధ్యుఁ డాత్మాంగనం
గారాము ల్దలపోసి యొక్కయెడ నిక్కట్టైనచో దానినా
నారత్నోజ్జ్వలభూష లూడ్చికొని యానందంబుతోడం బురిం
జేరెం దచ్చపలాక్షియు న్వగవఁజొచ్చెం గార్య మిట్లౌటకున్. 500

తే. వింటివా విక్రమార్క యవ్వెలఁది సేయఁ
దగనికార్యం బొనర్చి దుర్దశఁ గృశించె
గాన నన్యుల నడుగఁగా రానిమీన
హాసహేతువు మఱినీవె యరసికొనుము. 501

చ. తెలియఁగ జాలకున్న వచియించెద ఱేపని యింటికేగె న
చ్చెలువ యటంచుఁ దేనియలు చిల్కఁగఁ జిల్క వచింప నంతలో
బలబల వేగవచ్చినఁ బ్రభావతి కేళిగృహంబుఁ చేరి చం
చలమతి నాఁటిరేయి నృపచంద్రుని పొందిక గోరి చేరినన్. 502

తే. చిలుక వీక్షించి కలదు విచిత్రగాథ
యది యగాధసరోజరాగాధరోష్ఠి
యనుచు వచియింపఁ దొడఁగె భాష్యార్థమాన
మాధురీమాధురీణత సాధురీతి. 503

తే. చేరి యెన్నికథలు చెప్పినఁ గనలేక
విక్రమార్కధరణివిభుఁడు పిలువఁ
బనుపనేగి మంత్రితనుజాత తత్సభా
ప్రాంగణమునఁ దెరమఱుంగుఁ జెంది. 504

తే.

తనదు కథలకుఁ దరళికాతరళనయన
యాదిగాఁగల్గు నంతఃపురాబ్జముఖులు
పుష్పహాసప్రముఖమంత్రిపుంగవులును
వచ్చి యుండుటఁ దెలిసి యవ్వామనయన.

505


మ.

సభవారెల్లను సద్దుమాని వినుఁడీ సర్వంసహామండల
ప్రభుతోఁ దెల్పెద విక్రమార్కనృపచంద్రా సావధానంబుగా
శుభదం బీకథఁ జిత్తగింపవలె నంచుం దెల్పఁ జొచ్చె న్సుర
ర్షభకేళీవనికామరందరసవాచాప్రాచురీచాతురిన్.

506

ఎనిమిదవ యుపకథ

క.

గంధవతీ నామకము వ
సుంధర నొకపురము కరము శోభిలు భాస్వ
త్సైంధవచయాతిపత్రిత
బంధురమణిసౌధకేతుపటపటలం బై.

507


క.

ఆనగరరత్న మేలు
న్మానధనుం డనఁగఁ బరఁగు మానవపతిత
త్సూనుం డభిమానధనా
ఖ్యానవనీయుండు వెలయు నధికప్రజ్ఞన్.

508


తే.

అతఁడు జనకుని వెనుకఁ బట్టాభిషేక
మవధరించి నిజామాత్యులాప్తకోటి
యనుదినంబును విన్నవించిన వివాహ
మొల్ల నని నిస్పృహుండయి యుండె నంత.

509


క.

చనవరు లందఱు నొకనాఁ
డనఘా కల్యాణ మొల్ల ననుకారణమే

మని యడిగిన వారలదెసఁ
గనుఁగొని యభిమానధనుఁ డకల్మషఫణితిన్.

510


క.

ఇట్టిది యడుగనె తగదీ
పట్టున మీ కెఱుక లేక పలుమాటు మొఱల్
వెట్టెదరు గానఁ దెలిపెద
గట్టిగఁ గామినుల నమ్మఁగారాదు మదిన్.

511


క.

పురుషజనవంచనార్థము
సరసిజసంభవుఁడు తనదుసామర్థ్యముచే
నిరుపమముగ నిర్మించెను
దరుణుల మాయోపజీవితాచణగతులన్.

512


తే.

జవ్వనము రాకమునుపె విశ్వప్రపంచ
మంతయును హృద్గత మొనర్చి యడఁచికొందు
రేమి యెఱుఁగని కరణి నహీనబాల్య
చేష్టఁ బ్రకటింతు రవనీరాజీవముఖులు.

513


సీ.

చిన్నారిచన్నుల కన్న మున్నుగఁ దోఁచు
     లోకప్రమోషణలోలచింత
కలికి చూపులవాఁడికన్న మున్నుగ మించు
     గురుజనోజ్జ్వలతృణీకరణపటిమ
కటితటీచక్రంబు కన్న మున్నుగఁ దీఱు
     ననృతవాక్యస్థాపనాత్మశక్తి
చెన్నారు మైమిన్న కన్న మున్నుగఁ బొల్చు
     జనవిస్మయప్రదసాహసంబు


తే.

గాఢచాతుర్యధుర్యతకన్న మున్న
పొడముఁ గంభీరజారసంభోగవాంఛ

కమలముఖులకు యౌవనాగమము కన్న
మున్ను గాఁగల్గు పాపసమూహమెల్ల.

514


క.

టెక్కులు గలవాఁడైనం
జక్కనివాఁడైన రతులఁ జతురుం డైనం
దక్కరు మగనికి నిక్కం
బక్కట జారునికిఁ దక్కినటువలె యువతుల్.

515


క.

మగువలు గరగరనై తగు
మగవానిం జూచి వీఁడు మగఁడైనఁ గదా
తెగుదుఃఖం బనుకొంచుం
దిగఁగాఱుదు రెపుడు నెమ్మది న్వగమిగులన్.

516


సీ.

గజకర్ణముల కింత గల్గినఁ గల్గనీ
     కలికినెమ్మదికి నిల్కడలు లేవు
కమలచూపున కింత గల్గినఁ గల్గనీ
     కాంతనెమ్మదికి నిల్కడలు లేవు
చలదళంబుల కింత గలిగినఁ గల్గనీ
     లలననెమ్మదికి నిల్కడలు లేవు
కారుమించున కింత గల్గినఁ గల్గనీ
     పడఁతినెమ్మదికి నిల్కడలు లేవు


తే.

జలదముల కింత గలిగినఁ గలుగనిమ్ము
కమలనేత్రలమదికి నిల్కడలు లేవు
కావున వధూటికల యిచ్చకంబు లెల్ల
విశ్వసించిన మగవాఁడు వెఱ్ఱివాఁడు.

517


క.

బిసరుహనయనలు మాయా
గ్రసరల్ మఱి వారిపొందు గారాదె కదా

యసమానమనీషాఢ్యులు
వసియింతురె యాఁడుప్రతిమ వ్రాసినయింటన్.

513


క.

కావున వివాహవిచ్యుతి
గావించితి ననుచుఁ బలుకఁగా వార లయో
దేవా సర్వజ్ఞుఁడ విటు
లీవాక్యము లాడవచ్చునే యివ్వేళన్.

519


తే.

ఎంచిచూచిన నూటవెయ్యింట నొకతె
గాక సతు లెల్ల జారసంగమసుఖైక
పరతఁ జెందిన వాన లేకరణిఁ గురియుఁ
బంట లేచందమునఁ బండుఁ బార్థివేంద్ర.

520


క.

ఇలువరుసయు మానుషముం
గలరాజుల యిండ్ల గన్నెకలు పుట్టునెడం
దెలిసిన వరించి మఱివా
రల నగరికిఁ దెచ్చి పెనుపరాదా చాలన్.

521


వ.

అని నిర్బంధించిన నయ్యభిమానధనుం డియ్యకొని సమన్వయమాన్యు లగు రాజన్యుల కన్యాజనంబులం బ్రతీక్షించుచుం బుట్టినయప్పుడ సూతికాగృహంబులు సొచ్చి బాలికాచతుష్టయంబుం బరిగ్రహించి నిజగేహంబునకుం దెచ్చి వియచ్చరపథావరోధిసాలనికరం బగునంతఃపురంబున వేఱువేఱ గృహంబుల నునిచి క్రమక్రమంబున మదసేనయు మంజువాణియు మణిమంజరియు మకరందయు ననునామంబు లిడి పోషింప నొక్కదాదిం గట్టడి సేసి కొండొకకాలంబునకు జవ్వనంబు నివ్వటిల్లిన నవ్వెలందులకు వరుసక్రమంబున

ననుదినంబునుం గామోపభోగంబులం బ్రమోదం బావహిలంజేయుచు నప్రమత్తుండై యుండె నంత.

522


క.

ఆకామిను లధిపతిరతి
నేకట దీఱమి మనోభవేషువితానం
బేకత నొందఁగఁ బరసుర
తాకాంక్షాయత్తచిత్తలై నెవ్వగలన్.

523


సీ.

మగవారిఁ జేయక మము నాఁడువారిఁగా
     నీరీతిఁ బుట్టింప నేల యనుచుఁ
బుట్టించెఁబో సాధుపురుషుతోడుతఁ గూర్ప
     కీక్రూరుతోఁ గూర్ప నేల యనుచుఁ
గూర్చెఁబో పరిపాటి కొంపలోఁ గూల్పక
     నీదుర్గమునఁ ద్రోయ నేల యనుచుఁ
ద్రోచెఁబో దయఁజూచి ఖేచరత్వ మొసంగ
     కీమానుషం బీయ నేల యనుచు


తే.

వారు రేలుఁ బవళ్లు దుర్వారఘోర
కోపమునఁ బల్కెడు దురాపశాపములఁ బ
యోరుహాసనుఁ డేమిగాకునికి పలుకు
టువిద తాటంకకరణముహూర్తమహిమ.

524


తే.

వార లీరీతి నుండ దుర్వారచోర
గతులఁ బ్రతిగన్నవాఁ డొక్కకన్నగాఁడు
కార్యసాధకుఁ డనుపేరు గలుగువాఁడు
నాఁడు తత్పురికాళికావసతిఁ జేరి.

525


క.

ఈ రాజు నగరికలిమి కు
బేరునిబొక్కసముకన్న పెట్టినధన మ

వ్వారిగ దొరకు న్మద్గృహ
దారిద్ర్యం బపుడు గాని తలఁగ దటంచున్.

526


క.

రే లెవ్వరు గనకుండఁగఁ
గాళీదేవిం బెకల్చి కడ నుంచి తదా
లీలస్థానము మొదలుగఁ
దాలిమితో నేల మాలెఁ ద్రవ్వఁగఁ దొడఁగెన్.

527


క.

పగలెల్లఁ గాళిక న్మె
చ్చుగ బిలముఖమున నమర్చుచు న్వాఁ డొకనా
లుగు దినములలో నరపతి
నగ రంటఁగఁ ద్రవ్వెఁ దెగువ నాటుకొనంగన్.

528


తే.

ఇదియె ధనమున్న గృహమని యెంచి యచట
నిర్గమద్వార మెడలించి నెమ్మి వెడలి
దైవవశమున మదనసేనావధూటి
పడుకయిల్లౌట నిలిచి విభ్రాంతుఁ డగుచు.

529


ఉ.

పానుపుమీఁదఁ గెందలిరుబాకువజీరుని బాహువైభవ
శ్రీనిధియైన యమ్మదనసేనఁ గనుంగొని పొంగి నాకుఁ జే
కానుక చేసె నీ నృపతికొమిని నాదగు భాగ్య మెంత సొ
మ్మైన నదేల దీని బిగువారెడు కౌఁగిటఁ జేరఁ గల్గినన్.

530


చ.

అని తలపోయ వాని పొలు పద్దిరపాటునఁ జూచి విస్మయం
బనుపమలీల దొట్టిన భయంబును జిల్లరసేయ వాని నె
ల్లను గడఁ ద్రోచి యీపురుషలాభము దైవము గూర్చె నంచు మిం
చిన తమి యాన నమ్మదనసేన మనోభవదూయమానయై.

531


ఉ.

గ్రక్కునఁ గౌఁగిలించి తలఁకన్వల దెవ్వఁడవైన నేమి నా
చిక్కని గబ్బిగుబ్బలకుఁ జిక్కితి వెక్కడఁ బోవ వచ్చు నా

యక్కఱ దీర్పవచ్చిన లతాంతకృపాణివి నీవె నీకు నే
డక్కితినంచుఁ బ్రేమనిగుడం బువుపాన్పునఁ జేర్చి యచ్చటన్.

532


క.

అనిరోధచుంబితాధర
మనివార్యోపర్యధఃక్రియానిష్కరణం
బనితరపూర్ణానందం
బనఁదగు రతి నవ్వధూటి యతనిం గలసెన్.

533


తే.

కలసి యిట్టు లలభ్యయోగంబు దొరకె
ననుచు వెఱగంది యిట కెట్టు లరుగుదెంచి
తెవ్వఁడవు నీవు నీకుఁ బే రేమి యనుచు
నడిగి యంతయుఁ దెలిసి నెయ్యమున మఱియు.

534


క.

తనురాజు చెట్టఁబట్టిన
యనువుం జిరకాలకాంక్షితాన్యజనాలిం
గనతయును దెలిపి యది నేఁ
డొనఁగూడె న్నిన్నువంటి యొఱపఱి కతనన్.

535


తే.

రాజకులవర్యుఁ డాత్మభార్యాచతుష్క
నిలయముల వర్సవెంబడి నిద్రసలుపు
నాతఁ డిటు రానిదినములయందు వచ్చి
యిచట సంభోగ మొసఁగి న న్నేలుకొనుము.

536


మ.

అని ప్రార్థించినఁ గార్యసాధకుఁ డమందానందముం జెంది చం
దనగంధీ యనుబంధి నైతిఁగద నీతారుణ్యవిస్ఫూర్తికై
న నగమ్యం బిది యిందు రా వెఱతు నుండన్వచ్చుఁ గాళీనికే
తనసీమం దిన మీవు మత్కృతబిలద్వారంబున న్వచ్చినన్.

537


చ.

అన విని పొంగి యామృదుతరాంగితరంగితసంభ్రమాప్తి నా
యన వెనువెంటఁ దత్కృతబిలాధ్వగతిన్ ఘనసాధ్వసప్రదం

బనఁజను కాళికాగృహగుహాంతరభాగముఁ జేరి చీఁకటుల్
పెనఁగొనఁ దూర్పుమూల రతిలీలలఁ జారుని గూడి వేడుకన్.

538


క.

బిలమార్గంబునఁ గ్రమ్మఱ
నిలయము సేరంగఁ జని ఘనీకృతమోహా
కుల మొరు లెఱుఁగనికైవడి
నలచోరుని విడక యాలతాంగి మెలంగెన్.

539


క.

అని యాబాలసరస్వతి
జనపతికిం దెలిపె నని రసస్థితి మిగులం
గనఁబడఁ గీరము నొడువఁగ
దినకరునిరథంబు తూర్పుదిక్తటి దోఁచెన్.

540


క.

అంతఁ బ్రభావతి తనయ
భ్యంతరమందిరముఁ జెంది యారేయి ధరా
కాంతుని జేరుట కాత్మో
పాంతమునం గులుకఁ జిలుక యల్లనఁ బలుకున్.

541


క.

వినవమ్మ విక్రమార్కుం
డనుపమవిస్మయముఁ జెంది యవ్వలికథ యే
యనువున నడ నొ చెపుమా
యన సచివునితనయ సవినయంబుగఁ బలికెన్.

542


తే.

మహిప యంతట నయ్యభిమానధనుని
రెండవసుపాణి మకునికూరిమి పటాణి
మంజువాణి మనోవ్యథ మగకఱవునఁ
బడినగతినుండఁ దత్పురప్రాంతసీమ.

543


తే.

ఏటిదరి నొక్కసన్న్యాసి యింపునింపు
మఠము గావించుకొని శాస్త్రమంత్ర తంత్ర

వేదవేదాంతవిద్బ్రహ్మవేతృగరిమ
నితని కెన లేదనఁగ వార్త కెక్కి వెలయు.

544


తే.

త్రిషవణస్నానములు నిష్టదేవపూజ
గ్రంథపారాయణముఁ బరబ్రహ్మచింత
భైక్షభుక్తిహరీతకీభక్షణంబు
నజినశయనంబుఁ గల్గి యయ్యతి వొసంగు.

545


క.

ఆసమయంబున భృగుఁడను
భూసురుఁ డొకఁ డొక్కకార్యమునకై తమితో
నాసన్న్యాసికి నంతే
వాసిత్వము మెఱయఁగా ధ్రువంబున మెలఁగున్.

546


సీ.

ముదముతో యతికన్న మున్న మేల్కని గోమ
    యంబున మఠ మెల్ల నలికివైచు
దపసి యేటికిఁ బోవుతఱి నంటి వెంటనె
    నడచు నాతనికమండలువుఁ దాల్చి
సన్న్యాసి దేవపూజకుఁ బూనుచో నుప
    కరణము ల్దొలిచి శీఘ్రమున నొసఁగు
సంయమీశ్వరుఁడు భిక్షకుఁ బోవునెడ గోచి
    యును నార్ద్రపటఖండ మొనరఁదాల్చుఁ


తే.

బారికాంక్షికి నజినంబుఁ బఱచి రాత్రి
పరమశుద్ధాంతరంగుఁడై పదము లొత్తు
నెలమి యమ్మౌనికలలోనఁ బిలిచె నేని
స్వామి పనియేమి యనుచు హస్తములు మొగుచు.

547


క.

ఈరీతి నుండ నాతని
మేరకు నొకనాఁడు మిగుల మెచ్చి యతీంద్రుం

డోరీ యలరితి నిచ్చెద
గారవమున నడుగు మేమి కావలె ననినన్.

548


తే.

ఆతఁడు ప్రణమిల్లి పల్కు సంయమివరేణ్య
విన్నప మొనర్ప వెఱతు నావెఱ్ఱితనము
ముద్దుగాఁ జూచు కరుణాసముద్రమూర్తి
వగుటఁ దెల్పెద నాకోర్కి యాదరింపు.

549


ఉ.

మాపొరుగింటి శూద్రుని కుమారిక పిన్నటనాఁటనుండియు
న్నాపయిఁ బ్రేమఁగన్నది యనంతర మొక్కఁడు పెండ్లియాడి వాఁ
డీపురిలోన నిల్వెడలనీక పరుం డటు సేరకుండ సం
జ్ఞాపరుఁ డౌచు దాని ననిశంబును నేలెఁడు సంయమీశ్వరా.

550


సీ.

ఉదుటుతో నారాక కెదురుచూచుచు ముద్దు
    గాఱఁగా నది నిల్చుకడపఁ జూచి
ననుఁ జూడఁగోరి క్రొన్ననతీవనడియాడు
    విధమున నది కుల్కు వీథిఁ జూచి
నీటికై వచ్చుట నెపముగ నాతోడఁ
    బలుకుచు నది చెందు బాళిఁ జూచి
తమవారి మొఱఁగి తత్తరము హత్తగ వచ్చి
    యది నన్ను గలయు పూఁబొదలఁ జూచి


తే.

యేను భరియింపలేక మీకృప సమాశ్ర
యించి యున్నాఁడ నన్ను నీ డేర్పవయ్య
యార్తరక్షణ మఖిలపుణ్యముగదయ్య
కూర్మి నెటులైన నను దానిఁ గూర్పవయ్య.

551


తే.

అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యతికు లేంద్రుఁ
డౌర మన్మథు నిజమాయకడ్డ మెవ్వ

రంబుజాసనముఖులలో ననుచు నతని
జేరువకుఁ బిల్చి యొకవేరు చేతికిచ్చి.

552


క.

ఇది త్రొక్కినఁ జనవచ్చు
న్మదిఁ దలచినచోటి కభ్రమార్గంబున న
మ్మదవతిఁ గలసెదు పోపొ
మ్మెద సందియ మెడలి రాత్రి కేగు మటన్నన్.

553


మ.

భృగుఁ డారేయిఁ దదౌషధాప్తిమహీతాంఘ్రిద్వంద్వుఁడై పోయి య
భ్రగతిం దగ్గృహసీమ డిగ్గి మరు బాబాఁబోలునాబాలతో
నగణేయాదృతిఁ గూడి క్రమ్మఱి యతం డాకైవడి న్రేలు త
న్మృగనేత్రామణిపొందుఁ బాయక యతిప్రీతాంతరంగంబునన్.

554


క.

ఆమూలికపై దానివి
ధ మ్మదివ్రాసినపసిండి దగడుపొదివి ప్రా
ణమ్మువలె దాఁచికొని మఱి
యెమ్మెయిఁ గర్జములదాని నేమఱకుండెన్.

555


క.

అంత నొకనాఁ డతండు పు
రాంతిక నదిఁ జేర నరిగి యమ్మూలికఁ ద
త్ప్రాంతమున నుంచి దైవా
క్రాంతమతిం డిగ్గి యొడలు కడిగికొనంగన్.

556


తే.

రాజశుద్ధాంతపుషితమరాళ మొకటి
యరుణపద్మదళభ్రాంతి నచటనున్న
మూలిక గ్రహించి యవరోధమునకుఁ జనియె
భృగుఁడు తదభావమునకు నెవ్వగలఁబొగిలె.

557

ఉ.

అంతట నమ్మరాళము విహారమహారతి మంజువాణిగే
హాంతరసీమ వైచినఁ దదౌషధముం గొని యవ్వధూటి వి
భ్రాంతతఁ జెంది దానిపయి బంగరుఱేకున వ్రాసియున్న య
త్యంతపరిస్ఫుటాక్షరచయంబుఁ బఠించి ప్రమోదమగ్నయై.

558


క.

ఇది త్రొక్కినఁ జనవచ్చు
న్మదిఁ దలఁచినచోటి కభ్రమార్గంబున నం
చొదవిన యాలిపియున్నది
గద దేవునికరుణ మెచ్చఁగావలె ననుచున్.

559


వ.

తలంచి బహుకాలాభిలాషితం బగు పరపురుషసంగమం బనుభూతం బైన భంగింబొంగి మనోరథపరంపరాక్రమితదినావసాననిశాసమయంబున రాజకుంజరుండు మణిమంజరీమందిరగతుం డగుట యెఱింగి యక్కురంగనయన తనముంగిట నిల్చి పదాంగుష్ఠంబులన నయ్యౌషధమూలం బవలంబించి కాళికాగృహంబున కరుగవలయునని తలంచి నిరాధారంబగు గగనాంగణంబున కెగిరి దైవవశంబునం గాళీనికేతనద్వారంబున మొగులుతగులు దిగనాడి యరుగుదెంచిన మెఱుంగుతెఱంగున వ్రాలి కేళికాగతుల మెలంగు నవసరంబున.

560


క.

పరనగరరాజసుతుఁ డొ
క్కరుఁ డప్పురమునకు నాత్మకార్యంబునకై
యరుదెంచి యునికి నిజ
తామరసేక్షణఁ దలఁచి యతఁడు మన్మథవశుఁడై.

561


తే.

నిదురగానక యొకచోట నిలువలేక
వీథిఁ గ్రుమ్మరుచుండి యవ్వేళ నటకు

వచ్చి మరులచ్చివంటి యమ్మచ్చెకంటి
మెచ్చి మరు లెచ్చి యంటిన మెలఁతతోడ.

562


తే.

పలుకరించి తదాకారభాషణాది
కముల శుద్ధాంతకామినిఁ గాఁగఁ దెలిసి
యళికి తలఁకిన నాతనితలఁ పెరింగి
యానృపాంగన వేగ డాయంగనరిగి.

563


ఉ.

ప్రేమగనంబడం బలుకరించినవాఁడవు పోదువా యయో
నామగవాఁడ లెస్స నిను నమ్మితి రమ్మని పిల్చి కాళికా
ధామమునం బ్రతీచికడఁ దాను నతండుఁ బ్రసూనబాణసం
గ్రామవినోదకేళి సరిగాఁగఁ బెనంగి యనంతరంబునన్.

564


తే.

తనచరిత్రంబు నుడివి యాతనివిధంబుఁ
దెలిసి యిఁకమీఁద రాత్రులు దినదినంబు
నిచ్చటికి రమ్ము తఱియైన నేను వత్తు
ననుచు వొడఁబాటు చేసి యవ్వనిత సనియె.

565


క.

చని నాఁడు మొదలుగాఁ బ
ర్వినతమితో నజ్జయైనవేళల నృపనం
దనుపొందు నడుపుచుండెన్
ఘనతరమునిదత్తమూలికామహిమమునన్.

566


చ.

అని సచివేంద్రనందన ధరాధిపుతో వినిపించెనంచుఁ జెం
దిన నెఱునేర్పుతోఁ జిలుక తెల్పఁ బ్రభాతముగాఁ బ్రభావతీ
వనరుహగంధి యంతట నివాసముఁ జేరి దినావసానసం
జనితకుతూహలాప్తి నృపచంద్రునిదూతిక వెంటవచ్చినన్.

567


క.

శుక మిట్లను వినవమ్మా
సకియా యలవిక్రమార్క జనవరుఁడు దద

గ్రకథావిధ మడుగ న్మం
త్రికుమారి మనంబు గొలుపఁ దెలుపందొఁడగెన్.

568


తే.

దేవ యభిమానధనుని తృతీయభార్య
యైనమణిమంజరీహంసయాన తనదు
ప్రాయమెల్లను గోర్కులపాలు చేసి
యుపపతిక్రీడ కేకారుచున్న యంత.

569


క.

ధరపై నిగమావతియను
పురమునఁ గ్రూరుఁడను నామమున నొకశూద్రుం
డరివరనికరభయంకర
కరకరవాలాంకుఁడై జగన్నుతిఁ గాంచున్.

570


క.

ఆతనికిఁ జపల యనఁగాఁ
గాతరమృగనయన యొకతె గల దది మదిలో
నీతి గణింపక జార
వ్రాతములకు హృదయ మిచ్చి వర్తిల్లుటయున్.

571


తే.

ఆతఁ డది యెఱింగి కామినీహత్య కళికి
యాలిఁ దోడ్కొని పరభూమి కరుగుబుద్ధి
గంధవతిచెంత కరుదేరఁ గతిపయప్ర
యాణముల నంత నచ్చపలాబ్జనయన.

572


ఉ.

వీఁ డిఁక నెన్నిదేశములవెంబడిఁ ద్రిప్పునొ యేమి చేయను
న్నాఁడొకొ కా దటంచు జతనంబునఁ గన్ను మొఱంగిపోయిన
న్వాఁడిమి వెంటనే వెదకవచ్చుఁగదా యెటులైన నీతనిం
బోఁడిమి మాన్చికాని మఱిపోదఁగదంచు విచారఖిన్నయై.

573

క.

పెదవులు తడుపుచుఁ బదములు
గుదిగొనఁగా నొక్కచోటఁ గూర్చుండి యయో
హృదయేశ యెచటి కీడ్చెదొ
కద నాకుం దప్పి వశముగా దని పలుకన్.

574


తే.

అతఁడు చోరభయంబున నవ్వధూటి
మేనిసొమ్ములు తనయొడిలోన డాఁచి
నీరపాత్రంబుఁ గైకొని నెమకఁ జనియె
హ్రదనదీకూపముఖ్యంబు లంతలోన.

575


మ.

ఒక శూద్రుం డభిరామనాముఁ డొకయుద్యోగంబుపై వచ్చి య
మ్ముకురాస్యం గని యొంటినున్న దిది యేమో యంచు మాటాడనిం
చుక శంకించినఁ జేరఁబిల్చి తన యస్తోకవ్యథం దెల్పి య
వ్వికచాంభోరుహగంధి వాని మది యువ్విళ్లూరఁగాఁ జేయుచున్.

576


తే.

నీకు నామీఁదఁ గోర్కి జన్మించెనేని
కాఁపురమునకు నుండెదఁ గాని యిటకు
వచ్చు జలములు గొనుచు నావరుఁడు వాని
మొఱఁగిపోయిన వెదకుచు నరుగుదెంచు.

577


తే.

కూలికీలారికం బందుఁ గొంటువానిఁ
జెనకి నిర్జించిపోవ నీచేతఁ గూడ
దట్టు గావున నిట్లు సేయంగవలయు
నని యుపాయంబుఁ జెప్పిన యంతలోన.

578


ఉ.

క్రూరుఁడు నీళ్లుఁ గొంచు నటకుం జనుదెంచినఁ దత్ప్రఫుల్లనీ
రేరుహనేత్ర దప్పి యొకరీతి నడంచిన యట్లు చేసి యీ
యూరికిఁ బోయి నేఁ డిచట నుండుదమా యని మువ్వురు న్రయో

దారత నేగి గంధవతిఁ దద్దయు మెచ్చుచు వచ్చుచు న్నెడన్.

579


క.

ఆరమణియు నభిరాముఁడు
గ్రూరుని నిరువంకఁ బెట్టుకొని యయ్యో యీ
యూరికి దొర లేడా యీ
చోరుని దండింప ననుచు స్రుక్కక కూయన్.

580


క.

ఆమాటవిని తలారు ల
దేమని గద్దింప నామృగేక్షణ రొదగా
నామగఁ డితఁడని యయ్యభి
రాముని వెసఁజూపి నిబ్బరంబునఁ బలికెన్.

581


తే.

ఆలుమగఁడును నియ్యూరి యఱుత నిలిచి
చలిది భుజియింప నాసొమ్ము సంగ్రహించె
గొట్టుసేయక వీనిఁ జూపట్టుకొనుచు
నిచ్చటికిఁ దెచ్చితిమి పట్టుఁ డిప్పు డితని.

582


వ.

అనిన విని యన్నగరరక్షకు లాక్షేపపూర్వకంబుగా నతనిం
బట్టుకొని బాధించి శోధించి యొడిలోని యాభరణములం గనుంగొని దొంగయగు నని నిశ్చయించి యభిమానధనున కెఱింగించి మూఁడుత్తరువులు గైకొని నిజకామినీకుహనసంజనితవిస్మయాదృతప్రత్యుత్తరుం డగు నతని వధియించి యమ్మండనంబు లిచ్చినం జపలాభిరాములు సంపూర్ణకాములై యథేచ్ఛ నరిగి రాక్రూరుండును నన్యాయహతుం డయ్యెం గావునం బిశాచంబై యాచారవంతులం గని తలంగంబాఱుచు మాంత్రికులం గని గడగడ వడంకుచు నాయుధహస్తులం జూచి యేచినభయంబునుం బొందుచు భైర

వాజ్ఞావశుండై యాహారంబుఁ గొనంగానక వెఱచినవారి వెంటంబడి తదీయజనప్రకల్పితరాత్రి కాననంబుల నుద్దండతరజఠరానలంబున శృంగాటకంబులఁ గాఁపుగరిత లగ్గలంబుగా భగ్గునం దరికొన బలియర్పించు పొంగళ్లవలనం గొంతకొంత సంతసించుచు నిడుమలకుం గడగానక యప్పట్టనంబున నెట్టుకొని యున్నవాఁ డగుటం జేసి యతం డొక్కనాఁడు.

583


క.

నరపతికిం గానుకగా
విరిపొట్లము గొనుచు నొకఁడు వీథింజనుచో
గురుతర మగు సురుచిరత
త్పరిమళముల వెంటనంటి పాయక చనియెన్.

584


ఉ.

భూపతి యంత నవ్విరులపొట్లముఁ గైకొని కొల్వు దీఱి క్రీ
డాసరమైన బాళి నిగుడ న్వెస నంతిపురంబుఁ జేరి కొ
మ్మాపువుఁబోణి యంచు మణిమంజరి కిచ్చి తదీయమన్మథో
ద్దీపితకేళిఁ దేలి పొడతెంచు రవిం గని లేచిపోయినన్.

585


క.

ఆకమలనయన పరసుర
తాకాంతుల్ నిగుడ నెవ్వఁడైనను మగవాఁ
డీకడకు వచ్చి కోరిక
నాకొనగూర్చునని నెమ్మనంబునఁ దలఁపన్.

586


క.

క్రూరుం డప్పుడు తనయా
కారముతో నిలిచి యళుకుగాంచినదానిం
జేరంగ నరిగి వెఱవకు
మోరమణీ వినుము మన్మహోదంతంబున్.

587

చ.

అని నిజభార్య చేసిన యపాయమునం దనకట్లు సంభవిం
చిన యశరీరితాస్థితులు చెప్పి యిఁకం జఠరానలంబుచే
తను నెరియం దొడంగె వనితా యిపుడన్నము వెట్టితేని నీ
పనిచిన పంపుఁ జేసెద శుభంబగు నీకని మ్రొక్కి వేఁడినన్.

588


క.

అమ్మగువ చపలఁ గూరిచి
యమ్మా భువినాఁటదాన వైన న్నీచే
యమ్మహితసాహసము నా
కిమ్మా నాకోర్కు లెల్ల నీడేఱుటకున్.

589


క.

అని మెచ్చి క్రూరునిం గనుఁ
గొని వాహన మగుచు నన్నుఁ గొని చనఁగలవా
మనమునఁ దలఁచినచోటికి
దినదినము న్నీకు మంచితిండి ఘటింతున్.

590


తే.

అనిన నిను మోచికొనుట భాగ్యంబుగాదె
బ్రతికితినటంచు వాఁ డొడఁబడినఁ జూచి
యబల బోనంబు వాని కాహార మిచ్చి
తోయజానన యద్దమరేయివేళ.

591


క.

పతి మకరందాగృహసం
గతిఁ గాంచుట దెలిసి గగనగమనక్రూరో
ద్ధతవాహనయై విజన
క్షితి దలఁచుటఁ జనియె కాళిగేహము చేరన్.

592


క.

చని వాహనంబు డిగి య
వ్వనితామణి పథికుఁడైన వైశ్యుని నొకనిం
గని తనవర్తన మంతయు
వినిపించి తదీయకథలు విని మోదమునన్.

593

తే.

అతఁడు దానును గాళిగేహంబులోన
దక్షిణపుమూల రతికేళిఁ దనివినొంది
యనుదినము నాతఁ డటువచ్చునట్లు చేసి
పోయి యాలీల మెలఁగె సప్పొలఁతి మఱియు.

594


మ.

అని రాజన్యున కయ్యమాత్యసుత నిత్యప్రౌఢవాగ్రూఢిఁ దె
ల్పెనటంచున్ శుకరాజు పల్కునెడ నాళికాప్తభానుప్రభల్
దనర న్వైశ్యవధూటి యంత రనిశాంతం బొంది యారాత్రి య
మ్మనుజేంద్రాత్మజుపొందుఁ జెందఁ జనుప్రేమ న్ముంగల న్నిల్చినన్.

595


క.

కని చిలుక నేఁట మాత్రమె
విను మమ్మంత్రిసుత భూమివిభుతో మును జె
ప్పినకథ ఱేపటికిఁ గథల్
వినిపించిన నరఁటిపండ్ల వేయుము చెలియా.

596


వ.

అనినవ్వించి యాజవ్వనితో నవ్విహంగమపుంగవం బిట్లనియె.

597


క.

అంత నలవిక్రమార్కు డ
నంతరకథ యడుగ మంత్రినందన నవవా
నంతసమయప్రమోదా
క్రాంతవికస్వరపికస్వరంబునఁ బలికెన్.

598


తే.

మానవాధీశ యయ్యభిమానధనుని
నాలుగవకొమ్మ కమ్మకుందనపుబొమ్మ
యైన మకరంద యిచ్ఛావిహార మంద
సందు గానక మందచంచలతఁ జెంది.

599


సీ.

నిలనీని వంటవార్పుల నత్తమామల
     పోరును లేని కాఁపురము గలిగె

నెచటనుండిన నింట నేమనువారులే
     కింపుపొంపు ఘటిల్లు నిల్లుగలిగె
రేలువగల్పట్టి పాలార్పకొకవేళ
     తగ వెంచి చనుదెంచు మగఁడు గలిగె
వలసినయట్టు లవ్వారిగా సారక
     స్తూరికాముఖ్యవస్తువులు గలిగె


తే.

నెన్ని గలిగిన నేమి నాయిచ్చలోని
యాస గడతేఱ జారవిహారసుఖము
సంభవించ దటంచుఁ గాంక్షావిశేష
పరవశస్వాంత యగుచుఁ బాపంబుఁ జెంద.

600


మ.

ఒకనాఁ డాత్మనిశాంతసౌధలసమానోద్యానవీక్షాసము
త్సుకయై పోయి తదంతరంబున మణిస్తోమాతిథామాతిరం
జకమై యుప్పరమంటు చప్పరమున న్సౌవర్ణడోలావిలో
లకుఁడై నిల్చిన యొక్కసిద్ధుఁ గని చాల న్విస్మయం బందుచున్.

601


క.

జారవిహారంబునకే
కారెడు నాకోర్కిఁ దీర్పఁగా వచ్చిన య
మ్మారుఁడె యితఁడని యచ్చెలి
చేరం జని చూపువలపు చేఁతలఁ దెలుపన్.

602


క.

నిలిచిన నతఁడా సతికిం
గలకోర్కి యెఱింగి మమ్ముఁ గామింపకుమీ
యిలచూడఁగవచ్చిన సి
ద్ధుల మతనునితూపు మనసుఁ దూఱదు మాకున్.

603


ఉ.

ఇందు మనోహరంబయిన యివ్వనవాటిక చూచినప్పుడే
డెందము మమ్ము నిల్ప నిట డిగ్గితి మిప్పుడ పోవలెం జిదా

నందవిభూతిగల్గ లలనాజనసంగమసౌఖ్య మేల ర
మ్మిందునిభాస్య నీమది యభీష్టము సేకుఱునట్లు చేసెదన్.

604


క.

అని చేరఁబిలిచి కర్ణం
బున నొకమంత్రంబు నుడివి పూఁబోఁడి మనం
బున నీది జపింపు మింక గ
గనగమనము గల్గు నీదుకాంక్షలు తీరున్.

605


చ.

అని కరుణించి సిద్ధుఁడు వియత్పథజాంఘికుఁ డైన మెచ్చి య
వ్వనిత విభాకరుం డపరవార్ధిఁ బడ న్మణిమంజరీగృహం
బునకు నిజేశ్వరుం డరుగుపూఁట యటంచును నిశ్చయించి య
మ్మనువు జపించి విష్ణుపదమార్గమునం జనియె న్రయంబునన్.

606


క.

చని తత్కాళీగేహం
బున నొకమగనాలికూటమునకై కనుగూ
ర్కనియొక్కజారుతో నిం
పునఁ బొదలుచు నుత్తరంపుమూల రమించెన్.

607


తే.

అనుదినము వేళయైనప్పు డవ్వధూటి
యటకుఁ దా వచ్చునట్లుగా నతఁడు వచ్చు
నట్లుగాఁ జేసి యట్టుల నతనిపొందు
విడువఁజాలక మెలఁగెఁ బూవిలుతునాజ్ఞ.

608


చ.

మనుజకులేంద్ర యంత నభిమానధనుం డొకనాఁటిరేయిఁ గాం
చనరుచివారము ల్గలహజారమునం గొలువున్కిఁ జేసి య
వ్వనితలు నల్వురు న్మునుపు వచ్చుక్రమంబున వచ్చి కాళికా
ఘనగృహసీమఁ జేరి రతిఁ గాంచుచునుండిరి నాల్గుమూలలన్.

609


క.

అంతట నభిమానధనుం
డాంతరమునఁ గాళికాపదాంబుజసేవా

నంతరతి వొడమ నుడిగపు
టింతులతోఁ గొలువు దీరి యేతెంచుటయున్.

610


క.

వచ్చిన దివ్వటివెలుఁగున
నచ్చెలువలు నాథుఁ జూచి రాతఁడుఁ గనియెం
దచ్చపలాక్షులఁ గనుఁగొని
యిచ్చమహాశ్చర్యసమభివృతముగ నిలువన్.

611


క.

తరుణులు నలువురు నపుడొం
డొరులచరిత్రంబు లెఱిఁగి యొదవినభయము
న్నిరసించి యొకయుపాయము
దొరకొన విభుఁ జేరి ధైర్యధుర్యాత్మకలై.

612


వ.

కట్టెదుట నిలువంబడి కాళికాపదాంబుజంబులు భజియింప నింపునం జనుదెంచిన యక్షకమలాక్షుల మిన్నలువురము మదీయనాయకులు నేమును ననుదినంబు నిశాసమయంబున నిచ్చటికి వచ్చి పోవుదుము. మాకు నతీతానాగతవర్తమానంబులు తెలియుట కడుగం బనిలే దింత యేల నీయంతరంగంబున భవదీయభార్యాసౌందర్యవిశేషభాషణాదులు మాయందుఁ దోఁచుటం జేసి సందియంబు కందళించినది కావున నింతయుం దెలుపవలసె నచ్చెలువలు మాయంశంబున జనియించినవారలు కావున మాపోలికలు వారికిం గలిగియుండు నయ్యండజయానలకు శుభంబుఁ
గోరికదా యేతన్మహాశాంకరీపదపంకజారాధనకు ననురాత్రంబు నరుగుదెంతు మిందు రమ్మని యిందుధరసుందరీసమీపంబునకు దోడ్కొనిపోయి నిర్మాల్యప్రసాదంబుగా విభూతి యొసంగి నీయంగనల సద్ధర్మంబుగా నేలి మామనంబులు

చల్లఁ జేయుమని యనిపిన నజ్జననాథుండును నేమియుం బలుకవెఱచి యూరక వెడలె నప్పుడు.

613


క.

అచ్చపలాక్షు లతిత్వర
వచ్చి నివాసముల నిలువ వసుధేశ్వరుఁడున్
ఱిచ్చపడుమనముతో వెస
నచ్చటికి న్వచ్చి వారినందఱఁ జూచెన్.

614


తే.

చూచి మనమున మిక్కిలి చోద్యమంది
వార లొనరించు నతులోపచారసరణిఁ
దేలి తజ్జాలసంసక్తిఁ దెలియలేక
యధికతరమైన ప్రేమతో నాదరించె.

615


ఉ.

మానవనాథ యిట్టియభిమానధనుం డెఱుఁగంగఁజాలెనే
యానలినాయతాక్షులదురాచరణం బది యట్టులే సుమా
యేనరుఁడైన నిట్టి వెత లించుక యైన నెఱుంగఁ డింతటన్
మానసవీథిఁ జూచుకొనుమా యిఁకఁ దెల్పఁగ నేర మేమియున్.

616


తే.

అనుచు బాలసరస్వతీవనిత విక్ర
మర్కుతోఁ దెల్పెననుచు శుకాగ్రగణ్యుఁ
డలప్రభావతి కెఱిఁగించునంతలో శ
కుంతములు మేఁతలకుఁ దమగూళ్ళు వెడలె.

617


తే.

అంతటఁ బ్రభావతీకమలాయతాక్షి
యాత్మకేళీగృహంబున కరిగి నాఁటి
రేయి నృపుపొందుఁ గోరి చేరిన మనోజు
తేజి యిట్లను దియ్యనితేనె లొలుక.

618

క.

నేఁటికథ చిత్రతర మో
బోటీ వినవమ్మ మంత్రిపుంగవసుత య
ప్పాటిం దెలిపిన నాదొర
నాటినచింతాభరంబున న్మన మగలన్.

619


తే.

కొంతతడవుండి యందు నొక్కింతయేని
దెలియ నే యెక్కడిపరాకు పలుకుమనుచుఁ
గదళికాకాంత పైఁజేతి కమ్మవిరుల
చెండు వైచినఁ దత్సతీసరసిజాక్షి.

620


తే.

సొమ్మసిలినట్లు వ్రాలినఁ జూచి విక్ర
మార్కభూపాలవరుఁడు హాహానినాదుఁ
డగుచు విలపింపఁ జని వయస్యాజనంబు
శీతలక్రియ లొనరింప సేదఁడేఱె.

621


చ.

అదిగని పుష్పహాసుఁ డహహా యని నవ్వఁ బ్రసూనవర్షమ
భ్యుదయము గాఁగ నంతట విభుండు కనుంగొని తీవ్రతోపుఁడై
యదయుఁడ వింతెకాక యొకయప్పుడు నవ్వనివాఁడ విప్పుడీ
మదవతి పుష్పపాతమున మ్రాన్పడిన న్వడి నవ్వ నేటికిన్.

622


చ.

అనవిని యయ్యమాత్యుఁడు ధరాధిప మున్నొకయద్భుతంబు నేఁ
గనుఁగొనఁగంటిఁగాన బహుకాలము తద్వ్యథం గుంది యున్కి నే
పనులకు నవ్వకుండితి సభాస్థలి నే డొకయద్భుతంబుఁ జూ
చినకత నన్మనంబు వికసించిన నవ్వితిఁ జిత్తగింపుమా.

623


తే.

అధిప యీయమ్మవారు మర్యాదపోవ
విడిచి నగరెట్లు వెడలెనో వెడలివచ్చి

తేరుక్రిందటి మరుగుజ్జుఁ జేరి వానిఁ
గలసి యేతెంచు నిది మీకుఁ గానఁబడదు.

624


ఉ.

దేవరకొల్వు దేరిన మదీయగృహంబున కేగువాడనై
యే వెసఁ బోవుచోఁ గురిసె వృద్ధవరాహకఠోరఘర్ఘరా
రావమహాశనిధ్వనిపరంపరతో నొకవాన మొన్న రే
యావిలమానసాంబుజుఁడనై యొకమండపసీమఁ జేరితిన్.

625


తే.

అచ్చటికి వచ్చె నిమ్మందయాన వచ్చి
తేరుక్రింది ప్రతీక్షణాధీనుఁ డైన
గుజ్జుఁ జేరిన వాఁ డతిక్రుద్ధుఁ డగుచు
నింతతడ వేల రావైతివే యటంచు.

626


తే.

గుండియలు గ్రుళ్లఁదన్నిన గ్రుక్కుమిక్కు
రనఁక యాతనికినుక చల్లాఱనిచ్చి
విక్రమార్కుడు నిద్రగావించుదనుక
వెడలి రారాదటంచును వేడుకొనియె.

627


తే.

అతని పదఘాతముల కోర్చినట్టిదాని
కివ్విరులబంతివ్రేటున కింతమూర్ఛ
వచ్చెనే యంచు నవ్వితి వసుమతీశ
చనవరియటంచు నాతప్పు సైఁపవలయు.

628


క.

అన విక్రమార్కభూపతి
విని వెఱుఁగున ముక్కుమీఁద వ్రేలిడి చింతన్
మునుఁగుచు బాలసరస్వతిఁ
గని తెలిసె న్మీనహాసకారణ మౌలే.

629


తే.

కాకయుండినఁ దైలపక్వంబులైన
మత్స్యములు నవ్వునే యంచు మందబుద్ధి

నక్కటా కాననైతి నీహంతలాఁడి
వగలు నమ్మితిఁ గద పతివ్రత యటంచు.

630


క.

అని మఱియుఁ బదియుఁ బడియును
గనుఁగొని కదళికకు నాజ్ఞఁ గల్పించె న్శా
స్త్రనిరూపితపద్ధతి న
జ్జననాథుఁడు వింటివా నిశాకరవదనా.

631


క.

అని చిలుక పలుకఁ బూర్వా
వనిధరశృంగాగ్రమున దివాకరుఁ డెసఁగం
గనుఁగొని ప్రభావతీసతి
చని గృహముననుండి తన్నిశాముఖవేళన్.

632


క.

పుడమిదొరఁ జేరు వేడుక
పొడమగఁ జనుదెంచి కీరపుంగవుతో నీ
కడుపెల్లఁ గథలు గద ని
న్నడుగం బనియేమి పోదునా యని పలుకన్.

633


తే.

పోయిర మ్మిందువదన యపూర్వమగుచు
నలరు నొకకథ విను విక్రమార్కనృపతి
యవ్విధంబున నిజసతి కాజ్ఞ వెట్టి
పుష్పహాసుని జూచి యింపులు జనింప.

634


శా.

ఈయాశ్చర్యము కంటిమేకద పురాదృష్టాద్భుతం బేమియో
యాయాఖ్యానముఁ దెల్పుమన్న నతఁడుద్యత్ప్రేమతో నిట్లనున్
సాయంకాలనటన్మహానటజటాఝూటాటవీద్యోధునీ
స్ఫాయద్భంగఘుమంఘుమోపమితవాచాచాతురీధుర్యుఁడై.

635


శా.

వస్వద్రిప్రతిమానధైర్యవిబుధధ్వంసిప్రభూద్భూతభీ
నిస్వస్థక్షితిభృద్విరోధిమునిదిఙ్నేత్రాబ్జన్మేణభృ

ద్వస్వాదిత్యముఖార్తబర్హిచయదీవ్యద్వారివాహోదయా
భాస్వద్వంశపయోధిశుభ్రకరశుంభత్కుంభకర్ణాంతకా.

636


క.

ఖరకరకులశరనిధిశశ
ధర ఖరసురవిషుతశమన ధనదసఖధను
ర్హరణభయదభుజ భవహర
సురవరమునినికరభజిత శుభకరశరణా.

637


స్రగ్విణి.

మానితాబ్జేక్షణా మౌనిసంరక్షణా
భానుసూనుప్రియంభావుకప్రాభవా
దానసంతుష్టగోత్రాసుధాంధస్తుతా
జానకీస్వచ్ఛభూసారసేందిందిరా.

638


గద్యము.శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగత కవితాధార పాలవేకరికుల కలశాంభోనిధిసుధాకర తాడిగోళ్ళకరియమాణిక్యనృపహర్యక్షపౌత్రపవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయకప్రణీతంబైన శుకసప్తతి యను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. “కడకుపై నిన్నఁటు కాఁపురంబుంచిరే” అని పాఠాంతరము.
  2. క. అనిన విస్మయమంది యయ్యశ్వరత్న
    మెంత తార్కాణగాఁ జెప్పె నితఁ డటంచు
    నెంచి యాహారవేళఁ దలంచువాఁడ
    ననుచు నమ్మిక లిచ్చిన నాక్షణంబ.

    క. చని సుముఖుం డధిపతితో
    ననఘా యీయశ్వమునకు నవగడమగున
    ట్లొనరించి వేగవచ్చితి
    నని తెలిపె న్రవియుఁ గ్రుంకె నాసమయమునన్.