శుకసప్తతి/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
శుకసప్తతి
చతుర్థాశ్వాసము
క. ................................. 1
తే. అవధరింపుము సకలరాజాధిరాజ
నతపదాంభోజుఁ డగు ధర్మనందనునకు
సరసవైదికలౌకికాచారవిహిత
హితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టులనియె. 2
తే. అవధరింపుము విక్రమార్కావనీంద్ర!
చిన్ననాఁ డేను మున్ను కాళీపురస్థ
లావలోకనకాంక్షచే నరిగి యరిగి
జంబుకేశ్వర మనుపట్టనంబుఁ జేరి. 3
తొమ్మిదవ యుపకథ
తే. కంటి పాంథజనాహ్వానకారిమృదుల
వాతపోతచలత్పటకేతనాంక
మై మదీయశ్రమచ్ఛిదాహారి యగుచు
నలరు నొకవంటకూలి యొయ్యారియిల్లు. 4
సీ. హాళి పుట్టించె సద్యఃకల్పితానల్ప
రసపూర్ణగాథాదురంతపటిమ
రక్తి గల్పించె ధారాళవాచాసుథా
మాధురీధుర్యసంగీతరీతిఁ
దెలియఁజేసె ననేకదేశసభాంతరా
రాశికాంతరనికరప్రపంచ
మస్ఫురం బొసఁగె శబ్దార్థవైచిత్రిని
బంధనోజ్జ్వలగద్యపద్యసమితిఁ
తే. దద్గృహులకన్న కల్పితతారకాయ
మానసోమసమానీతు లైనపథిక
కథికగాయకచారుసత్కవులయుదర
పూర్యగంతరసల్లాపములు నరేంద్ర. 5
చ. చిటిలిననాభినామ మొకచేఁ దెలనాకులు చాయతోడి
పుక్కిటివిడెముం బెడంగుగ బిగించిన పైఁటచెఱంగులోనఁ బి
క్కటిలు కుచంబులుం బసిఁడికమ్మతళుక్కను చెక్కుదోయి చొ
క్కటముగ ముద్దుగుల్కు నొకకల్కి వెసం జను దెంచి యచ్చటన్. 6
సీ. మఱివండిపెట్టుకొమ్మలు లేరె మావెంటఁ
బడుదు రటంచును బాయఁబలికి
పోవఁజూచినఁ దిట్టిపోదు రిదేల వా
దాడఁజాల మటంచు నాసగొలిపి
యటువంటివారమా యాఁకలిదీర్పు మి
క్కిలిపుణ్యమన్న నంగీకరించి
కమ్మలు గదలఁ గన్బొమ్మలు నిక్కిడ
నారజమ్మునఁ గూలి బేరమాడి
తే. వచ్చు తెరువరులందఱు వంటపనికి
నన్ను మెత్తురటంచు నందములు సూపి
బాళిపుట్టించు దాని కప్పథికులెల్ల
నొడఁబడికెమీఁదనే మిన్కు లొసఁగి రపుడు. 7
తే. వారితో నేను భుజియించి వనజబంధుఁ
డస్తగిరిఁ జేరుతఱియైన నపుడు నదికిఁ
బోవువారలఁ జూచి నేఁ బోక నిలిచి
సందెవార్చితి జలము లాసతి యొసంగ. 8
క. ఆసమయంబునం జీఁకటి
మాసినతనముదుకచీర మైకలనిగ్గు
ల్వాసులకుఁ బెనఁగఁగా నొక
దాసి యరుగుదెంచి యొకసుధాకరముఖితోన్. 9
క. ఏమో గుసగుసలాడిన
నామగువ మఱేమి సేతు ననుపగుమగవాఁ
డీమాటకు నొడఁబడఁ డ
క్కామినియెడ మాట నిల్పఁగా లేనైతిన్. 10
క. అనుమాటలు సవసవగా
విని నేనేమో ప్రమోషవిధమని చేరం
జని యది యేమని యడుగం
గనుఁగొని యమ్మగువ ముఖవికాస మెసంగన్. 11
తే. హత్తుకోవచ్చు నీవంటియందగాని
కున్నదొకచోట నొకమంచియొఱపులాఁడి
దాని కిలికించితంబునఁ దవిలినట్టి
వాఁడు దేవేంద్రునకుఁ జీటి వ్రాయఁగలఁడు. 12
మ. అను నమ్మాటలతోడనే రతిపతిజ్యావల్లికాటీంకృతుల్
విని తా మంచిది పోదు నా యనుచు న న్వీక్షించి యయ్యంబుజా
నన సేబాసు బలార జాణవవు దన్నా యింత తెంపొందకుం
డినవాఁ డేమగవాఁడు నీతపము పండె న్నిండె సౌఖ్యస్థితుల్. 13
తే. పట్టనని యోగియౌ గుణభద్రుఁ డనెడు
భూసురుం డొక్కఁ డియ్యూర వాసిగనియె
వానిబంటున కున్నయైశ్వర్యగరిమఁ
బడసినఁ గుబేరుఁడైనను బ్రదికిపోవు. 14
మ. అలరుందూపులమన్నెవాని మగవాఁ డన్పించుఁ దత్కాంత య
య్యలివేణీమణి జారసంగమసుఖైకాకాంక్షచే దీని ని
చ్చలు నాయింటికిఁ బంపు నొక్కని మహాచాతుర్యధైర్యాప్తి మె
చ్చులొసంగం దగువానిఁగాఁ బనుపుమంచుం దైన్యపూర్వంబుగన్. 15
క. ఏనును మాలిమిగల మగ
వానికి నిది యెఱుకసేయ వడవడ వడఁకుం
గాని చన వెఱచువాఁ డ
మ్మానినితోఁ బ్రొద్దు కొంచెమా యొనఁగూడున్. 16
తే. అట్టిచో నెట్లు పోవుదు నంటివేని
దద్గృహముచెంత నొకవటతరువు గలదు
దానిపై నెక్కి చీఁకటిగాన నిపుడె
యూడవెంటనె దిగు మొనఁగూడు పనులు. 17
తే. కాంతిమతి దాని పేరు తత్కాంతుఁ డధిపు
డనుపఁగా దూరభూమికి నరిగినాఁడు
నడచి యిచ్చటి కతఁడు గాఁ దడవుపట్టు
వేగఁ జను మిందులకుఁగాను వెఱవవలదు. 18
క. అని నన్నుఁ బలికి దానిం
గనుఁగొని యమ్మగువ కింత కార్యంబో జ
వ్వని వే తెల్పుము పొమ్మని
యనుపఁగ నది వెడలి చనియె నంతట నేనున్. 19
మ. తరలంబైన మనోంబుజంబు ఘనసంత్రాసంబుతోఁ బోరి శం
బరవిధ్వంసి మహాప్రతాపము జయింపం గాంతిమత్యాలయాం
తరముం జేరఁగ నిశ్చయింప వట ముద్యత్ప్రౌఢిమ ల్మీఱ నె
క్కి రహి న్శాఖల వెంటనే యరిగి తద్గేహంబునం డిగ్గితిన్. 20
ఉ. అంతకుమున్నె యచ్చటి కొయారముమీఱఁగ వచ్చియున్న త
త్కాంతిమతీవధూటి ననుఁ గన్గొని మోమరవాంచి నిల్చినం
జెంతకుఁ జేరి దాసి యిది సిగ్గుపడ న్సమయంబటే గృహా
భ్యంతరసీమఁ జేర్పుద మటంచు ననుం గొనిపోయి రిద్దఱున్. 21
చ. బటువులు తాపి తాపఱుపు పట్టుకలాడముమీఁదఁ జల్వదు
ప్పటిపయిఁ జప్పరంపుజిగి బంగరు వ్రాఁతకురాళముం గురం
గటఁ బడిగంబుఁ గంచుదివగంబము గల్గినపట్టెమంచము
త్కటరుచినించ మించు రతిధామముఁ జేరితి నిర్భయంబునన్. 22
తే. అంతట భుజించి నను వినయంబుదోఁప
మంచమున నున్చి యక్కాంతిమతిని జూచి
యెనసెఁ గదవమ్మ నీమనోభీష్ట మితని
యలరుఁబ్రాయంబు కొల్లాడు మనుచుఁ బలికె. 23
శా. న న్నీక్షించి సమస్తదేశతరుణీనానారహఃక్రీడలం
గన్నావందపుజాణ విక్కలికి బొంకన్లేదు సుమ్మా మెయిం
జిన్నె ల్నించకుమా బయల్పడిన నాచేఁ గాదు సుమ్మా ప్రజం
గన్నుల్మూయఁగ నీకుఁ దెల్పవలెనా కార్యంబ కర్తవ్యమున్. 24
క. అని తలుపుమూసికొంచుం
జనియం దద్దాసి గడియ చక్కఁగఁ బొంకిం
చి నెలంత యంత తల్పం
బున కొయ్యనవచ్చె నగవు మొగమునఁ దోఁపన్. 25
తే. ప్రథమసంగమకేళి యప్పటికి నంత
ముగ్ధ యనుపించి పిదప నమ్మోహనాంగి
జాతివారాంబుజేక్షణల్ సైఁత మింత
నేర రనిపించెఁ గలయిక యారజముల. 26
మ. సభలోన న్వివరింపరాదె గద తచ్చాతుర్య మెంతంచు నే
నభివర్ణించెద నంశుమత్కరదురాపాంతఃపురావాస యా
యిభయానామణి యెందు నేర్చినది హా యీకౌశలం బంచు నే
సభయాశ్చర్యతఁ జెందితి న్మహిమ నాసాతర్జనీయోగమున్. 27
ఉ. ఎంతకు నేర రంత తెగియించినవా రది యున్నదేకదా
యంతట తెల్లవాఱిన లతాంగి ననుం బడుకింటిమిద్దెపై
దంతపుమేలుమంచము సుధాకరకాంతగృహాంతరంబులో
నెంతయుఁ జింతలేక వసియింపగఁజేసెను సాహసంబునన్. 28
తే. రాత్రు లెల్లను గేళ్యగారమున నుంచుఁ
బగలు మేల్మచ్చుపై నుంచుఁ బ్రతిదినంబు
బేర్మి రెట్టింప షడ్రసోపేతములుగఁ
బ్రొద్దుప్రొద్దునఁ భోజనస్ఫురణ లొసఁగు. 29
తే. దానినడకల వగ లెన్నియైనఁ గలవు
చెప్పఁ జిత్రంబు లటమీఁదఁ జిత్తగింపు
మంత నయ్యింతి గర్భచిహ్నములు దాల్చె
వేడుకలు ద్రోచి నామది వెఱపువొడమ. 30
తే. అంత నొకనాఁటి రేయి యేకాంతసదన
సీమ నన్నుంచికొని మున్ను చేర్చియున్న
గంటమాకులుఁ గొని దివ్వెగంబ మింత
యెనయఁగూర్చుండి యాపూర్ణిమేందువదన. 31
సీ. శ్రీమన్మహాగుణస్థిరగుణభద్రపా
దములకు దేవరదాసియైన
కాంతిమతీదేవి ఘనభక్తినతులు గా
వించి చేయంగల విన్నపములు
మిమ్ము నాపాలిస్వామినిఁగాఁ దలంపుదు
మీమహిమంబులు మీకె తెలియుఁ
గలలోన మీరు సాక్షాత్కరించుటఁ జేసి
గర్భంబు నిలిచె నిక్కంబు గాఁగ
తే. నింటివారెల్ల నామీఁదఁ గంటగించు
టెపుడు నెఱుఁగుదురేకద యింకమీఁద
నేమి కల్పింపఁజూతురో యెఱుఁగరాదు
కరుణ నిల్పుమటం చొకకమ్మ వ్రాసి. 32
క. తనదాసిఁ బనుప నదియుం
ఘనజవమున నేగి చేరి కమ్మ యొసంగం
గనుఁగొని గుణభద్రుఁడు చది
వినవాఁడై విస్మయం బవేలముగాఁగన్. 33
క. చింతాక్రాంతుండై యిసు
మంతయు మాటాడకున్న నాతనికుపిత
స్వాంతత్వ మెఱిఁగి దాసి య
నంతత్వర మరలివచ్చి యంతయుఁ దెలిపెన్. 34
సీ. ఆడుదియైనచో నడుగఁ గులస్థాన
పౌరుషములతోడఁ బ్రబలువాఁడఁ
గొడుకైనఁ గలదులే గుణభద్రునకు మున్ను
మున్ను గాని పితౄణమోచనంబు
జతగూడ మనపురోహితుని రప్పింపరే
పాటించి లగ్న మేర్పఱచుఁగాని
బొడ్డుగోయరె యేమి పురుటింటిలోఁ జొచ్చి
మనపతివ్రత బిడ్డఁ గనియెనిప్పు
తే. డనుచుఁ గేరడముల నింటి యమ్మలక్క
లాడికొనఁ జేటికానీత యైనవస్తు
కోటిచే నింత యేమియుఁ గొదవలేక
కాంతిమతి యంత మగవానిఁ గనియె నధిప. 35
క. కని పెనిచెం దదనంతర
మున భూనాథుండు పనుపఁ బోయిన కార్యం
బొనగూడుకతనఁ గ్రమ్మఱి
చనుదెంచెం దద్విభుండు సదనంబునకున్. 36
తే. నిజసమాగమసంభ్రమోన్నిద్రు లగుచు
నింటివార లెదుర్కొన నేగుదెంచి
యాత్మభార్యాచరిత్రంబు లడుగఁ బొక్కి
ఖిన్నుఁడై యున్నవాని నీక్షించి యపుడు. 37
సీ. బెడఁగుఁజూపెడు నూనెముడిలోనుగా నంటఁ
గట్టిన వాసెనకట్టుతోడఁ
గస్తూరిపసుపు చొక్కటపుఁ జల్లనితావి
వెదచల్లు పుక్కిటివిడెముతోడ
నిసువుపై పసుపునూనియ జిడ్డులంటిన
చిటికమ్మికుఱుమాపుచీరతోడ
నొసటనందంబుఁ జెందు విభూతిరేఖపై
బొంకంబుగను చుక్కబొట్టుతోడఁ
తే. గాన్పుసంతస మందు మొగంబుతోడ
నడరు మురిపంబుగులుకు నెన్నడలతోడఁ
గాంతిమతి వీఁడె నీముద్దుగాఱు తనయుఁ
డనుచుఁ జేతికి నీయఁగా నవ్విభుండు. 38
తే. కన్ను లెఱ్ఱగా నెగాదిగఁ గన్గొని
యౌడు గఱచి దీని నాఁటదానిఁ
జంపరాదుగా విసర్జించితి నటంచుఁ
బార్శ్వచరులఁ జూచి పలుకుటయును. 39
చ, కలకల నవ్వి యౌనెకద కాదనవచ్చునె నన్నువంటితొ
య్యలి విడనాడ నీయెడ నయారె సెబాసురె యింటివారిమం
దులమహిమంబు గాక నిను దూఱఁగఁ బల్కఁ బనేమి బాపురే
కలియుగమా యటంచు నని కాంతిమతీలలితాంగి వెండియున్. 40
మ.కల నిక్కంబగునేయటన్న నిఁక నౌఁగాదంచు మారాడఁగాఁ
గలనా యింతకు వచ్చినప్పుడును బల్కన్నేర నాకాన్పు ర
చ్చల కెక్కెం గద యింక మానుదురె యీసాధ్వు ల్ననుం దూఱఁగా
వెలయం దైవ మెఱుంగుఁ గల్లనిజము ల్వీరాడఁగా నేమగున్. 41
సీ. నలుగు రుండినచోట నిలువఁగాఁ బెట్టి మా
టాడఁగాఁ గంటిరా యమ్మలార
ననువంటియాఁడుబిడ్డను గన్నవా రింతె
పలుకరే యేమియుఁ దెలియలేని
సబ్బిణు ల్మీరు మీచాటుమాటలు గదా
నానాథుమేలిగుణంబుఁ జెఱచె
దయ యింతలేక యెంతకు నెత్తుకొంటి ర
క్కట మిముఁ గన్నదిగాక తల్లి
తే. సూర్యుఁడా చూచుచున్నావె చోద్యపడక
యందఱును జేయుపాపపుణ్యంబు లెవరి
నడిగితివి ధర్మదేవతా యమ్మ చెల్ల
వింత నావంటిదానికా యింతమాట. 42
తే. అని గయాళించుకొనుచు హస్తాంబుజముల
నలరుపాపని దురదుర నరిగి తొట్ల
లోనఁబడవైచి మొగమునఁ బూను గండు
తోడ బొమముడి నిగుడ నత్తోయజాక్షి. 43
క. మును రామునిమాటలకై
యనలము వెసఁ జొచ్చి వెడలి యలరిన సీతాం
గనకంటె నేను దక్కువై
చని కాళిక చెంత బాససలిపి గెలిచెదన్. 44
మ. అనుచుం గ్రక్కున గేహము న్వెడల దాయాదు ల్మహాసాధ్వివి
ట్లు నినుం బేర్కొన మింక నీసడియె చాలుం జాలు రమ్మంచు వెం
టనె రాఁగా నిది యే మొకో యనుచు నానామానవు ల్గుంపులై
కనుఁగొంచుం జనుదేఱఁగా నడిచెం దత్కాళీమహాస్థానికిన్. 45
సీ. తనవారు పిలువఁగా వినక బాసయొనర్పఁ
జను టేటికో యని యనెడువారు
నాఁడుఁబుట్టువు చెడ్డదవుఁగదా యిటువంటి
యపకీర్తివచ్చెనే యనెడువారు
నపకీర్తివచ్చిన నడఁపక యింటివా
రగడు చేయుట దోస మనెడువారు
నగ డేమి చేసి రియ్యతివ తానే వారి
కారడి గల్పించె ననెడువారుఁ
తే. జూడవచ్చిన నచ్చుముచ్చో యెఱుంగ
కాడరా దేల యీపాప మనెడువారు
బయలుదేఱిన యపుడె యీపడఁతి జంత
యగుఁజుమా యనువారు నైరపుడు జనులు. 46
వ. వెండియుం దండోపతండంబులుగా మెండుకొని యాలోకించు పురజనంబుల కోలాహలంబు విచారించి సంభ్రమాశ్చర్యంబుగా నరిగి యూడిగంపుఁ బడఁతులు విన్నవించిన నన్నగరాధినాథుం డగు నరపాలుండు విస్మయంబున నగరు వెడలి తత్కాలసన్నిహితు లగు పరిచారకులు గొలువం జనుదెంచి. 47
క. తలతల మని కొందఱు బ్ర
ద్దలవా రెడఁగలుగ జడియ ధరణీధవుఁ డ
క్కలకంఠిఁ జేరి యనునయ
ముల మరలమి సమ్మతించి ముందుగ నడిచెన్. 48
తే. అంతఁ దొలునాఁటి రాత్రి రహస్యభంగిఁ
గాంతిమతి తీర్చి నను బందుకట్టి యునికి
నేను నొకజోగి వాల్కంబుఁ బూని భద్ర
కాళి సన్నిధి నుంటి గింకరునీరీతి. 49
తే. అచ్చటికి వల్లభుండు ధరాధినాథుఁ
డాదిగా మూఁక వెంటరా నరుగుదెంచి
కాంతిమతి చేరి తత్కాళికాపదాబ్జ
ములకు వెస మ్రొక్కి లేచి నిశ్చలత నిలిచి. 50
తే. కదిసి ప్రజలార కంటిమి కాన మనక
చూడుఁడని పల్కి ధైర్యవిస్ఫురణ మెఱయ
జనవరునిఁ జూచి రాజ నాసత్య మిపుడు
విశద మగును పరాకని విన్నవించి. 51
క. నినునంటి భద్రకాళీ
యనయము విభునంటి యీమహాయోగివరే
ణ్యుని నంటినఁ గాక మఱె
వ్వని నంటిన శాస్తి చేయ వలయు న్నాకున్. 52
మ. అని యక్కాంతిమతీవధూటి పలుకం బ్రావిర్భవద్విస్మయం
బున సారెం దలయూఁపసాగె గిరిశాంభోజాక్షి తన్మూర్ధకం
పనము న్మెచ్చి యొనర్చెనంచు నెదల న్భావించి పశ్యత్పురీ
జను లౌరౌర పతివ్రతా యనుచు మెచ్చ న్నింగి ముట్టె న్రొదల్. 53
ఉ. అంత నృపాలుఁ డాలలనయంఘ్రులకుం బ్రణమిల్లి యామినీ
కాంతముఖీ! యరుంధతివి కానక నీపయిఁ గానిపోని యీ
వింత ఘటించినట్టి యలివేణులనోరికి శాస్తి సేసి య
త్యంతయశంబు నిల్పితి కదా యిఁక నింటికి నేగఁగాఁ దగున్. 54
చ. అనవిని రానిసిగ్గునఁ బటాంచల మించుక వంచినట్టి మో
మునకు మఱుంగుఁ జేయు కరము న్మృదుపాదపయోరుహద్వయం
బున నెలకొన్నచూపు లొకపొంకము చూపఁగఁ గొంకుమాట ల
త్యనుపమముగ్ధతాగతి వెలార్ప నడంకువచంద మేర్పడన్. 55
మ. అపవాదంబు పరిత్యజించుటకునై ప్రాణంబు లే నిల్పితి
న్నృప! యీభూప్రజ కెల్లఁదండ్రివిగదా నీముందఱం బాసచే
సి పరఖ్యాతి వహింపఁ గంటిఁ గద నీచిత్తంబు వచ్చెం గదా
యిపు డీపోడిమి చాలుఁ గాఁపురము పొందేలా విసర్జించెదన్. 56
క. అని వెండియుఁ బలుతెఱంగు
ల్గనఁబడఁగాఁ బల్కి ధరణికాంతునివచనం
బున కలికి మీఱఁజాలని
యనువున మేకొనియె నది గృహంబున కరుగన్. 57
మ. అపు డత్యుజ్జ్వలభూషణాంబరవిశేషాదు ల్సమర్పించి యా
తపనీయాంగిని బల్లకి న్నిలిపి యుద్యత్పంచవాద్యధ్వను
ల్విపులాభ్రాంతర మెల్ల నిండ వినయావిర్భూతిఁ దోడ్తెచ్చి యా
నృపలోకేశ్వరుఁ డింటనిల్పి చనియెం బ్రీతాంతరంగంబుతోన్. 58
క. అంతటఁ గాంతిమతీసతి
యింతంతనరానిప్రేమ నిటు సనఁగా దే
శాంతర నానామనుజుల్
సంతసమున నెంచ మిగుల సన్నుతి కెక్కెన్. 59
క. అని యిట్లు పుష్పహాసుఁడు
ననుపమవైఖరుల విక్రమార్కున కెఱిఁగిం
చె నటంచుఁ జిలుక పలుక
న్వనజాప్తుం డెక్కెఁ బూర్వవసుధాధరమున్. 60
వ. అప్పుడు ప్రభావతి మనోజరథవిఫలీకృతమనోరథయై యవరోధంబున కరిగి నిశాసమయం బగుటయు నవ్వసుంధరాపురందరసంగమానందంబు డెందంబునం గల్పించుకొని యనుభవించుచుం జను దెంచు నచ్చంచలాక్షితో ననంతరకథావిధానంబు వినుమని శుకాగ్రగణ్యుం డిట్లనియె. 61
క. అలవిక్రమార్క భూవరుఁ
డలఘుతరాద్భుతయుతాంతరంగుండై య
వ్వలికథ యడుగంగఁ గుతూ
హలమున నాతనికిఁ బుష్పహాసుం డనియెన్. 62
తే. ఇందులకు నింత విస్మయం బేల విక్ర
మార్క! యిఁక మీఁదఁ గలకథ యవధరింపు
మేను బూర్వక్రమంబున దానియిల్లు
జేరి నిల్చితిఁ దద్రతిస్థితులఁ జెలఁగి. 63
తే. బలి యొసంగినఁ బూజలు సలిపి వేఁడు
కొనినఁ దత్కాంతిమతిమాయ మనమునందు
హత్తుకొని యున్కిచే మానదయ్యె నధిప
కాళికాదేవి నిజశిరఃకంపనంబు. 64
చ. అదిగని పౌరు లెల్లను భయంబునఁ దత్పురనాథుఁ జేరి యాయదన మహాపతివ్రత గుణాంచిత కాంతిమతీలతాంగి నేర్పొదవఁగ నిల్పిన న్నిలుపనోపు మఱెవ్వరి చేతఁ గానియభ్యుదితశివాశిరశ్చలన మోనృప యంచును విన్నవించినన్. 65
మ. ఇదియౌనంచు నరేంద్రుఁ డందఱును దోనేతేరఁగా సర్వసౌ
ఖ్యదమౌ కాంతిమతీగృహంబు దరియంగా వచ్చి ఫాలంబుఁద
త్పదము ల్సోకఁగ మ్రొక్కి యెట్లయిన నంబామూర్ధకంపంబు మా
న్పి దయం బ్రోవు మటంచు దైన్యగతి గాన్పింపంగఁ బ్రార్థించినన్. 66
ఉ. ఆలలితాంగి కేళినిలయంబు కవాటము మాటుఁ జెంది భూ
పాలక యింటివా రిడిన బాముల రచ్చల కెక్కినంత యే
చాలదె యింకమీఁదను నిజంబుగ రట్టున కోర్చునంతకుం
దాళునె యీశరీరము వితావిత యెక్కడిజోలి యక్కటా. 67
తే. అరయఁ దోఁబుట్టుపైఁ గల్గు కరుణ నిందు
వచ్చి యీరీతి దేవరవారె యింత
ప్రార్థన మొనర్చుపట్లఁ గాదనఁగఁ దగునె
యైన నొక చిన్నవిన్నప మవధరింపు. 68
క. భామాజనసామాన్యము
గా మది నన్నెంచు జనులు గననేఁడు మొదల్
గామహిలోపలఁ గానని
నామహిమ మెఱుంగవలయు నరనాథమణీ. 69
తే. ఇలఁ బతివ్రత లగువారు గలిగిరేని
కాళి యొనరించు నిజశిరఃకంపనంబు
మాన్పు మని చాఁటఁ బనుపుము మానవేంద్ర
యప్పు డందటి వగ తెలియంగవచ్చు. 70
క. అని యవ్వధూటి పలుక
న్మనుజకులేంద్రుండు మాఱుమాటాడఁగఁ గొం
కినవాఁడై భువిఁ జాటం
బనిచెం దద్వచనరీతిఁ బ్రకటముగాఁగన్. 71
తే. అంత రాజాజ్ఞ మీఱరాదంచు ధరణిఁ
గలుగుసతు లెల్ల వచ్చి నిక్కమగుభక్తి
నెంత మ్రొక్కిన నంతంత కెచ్చసాగె
ధూర్జటివెలందిమూర్ధవిధూననంబు. 72
తే. కాంతిమతిదక్క మనుజలోకమున నిఁకఁబ
తివ్రతలు లేరటంచు నుదీర్ణవచన
ముఖరులై జనులాడ నమ్ముదిత లెల్ల
సిగ్గుపడి యేగి రప్పు డచ్చెరువుఁ జెంది. 73
ఉ. అంతట రాజమౌళి పునరాగతుఁడై ధరణిన్వధూటికా
సంతతిలోనఁ జూడ నొకసాధ్వియు లేదని యాత్మలోన సి
ద్ధాంత మొనర్చితి న్మముఁ గృతార్థులఁ జేయుమటంచు మ్రొక్క న
క్కాంతిమతీవధూటి యవుఁగాకని కాళిగృహప్రవేశయై. 74
తే. రాజు మొదలయినవారి దూరమున నునిచి
గర్భగృహమున కరిగి వేగమ కవాట
బంధన మొనర్చి గ్రక్కున భద్రకాళి
డాసి నిలుచుండి ధీరతాడంబరమున. 75
క. నామనసువచ్చు కైవడి
నే మెలఁగినఁ జూడలేక యెవ్వతెవే యీ
బూమెలు పన్నఁగ వలదిఁక
యీమేర న్నిలువకున్న నిట్టటుఁజేతున్. 76
తే. అనినం దత్కాళి యెంతకైనను దెగించి
నట్టిదీజంత యేమి సేయంగఁ బూను
నోయనెడుభీతిఁ దలయూఁచు టుడిగినిలువఁ
దరుణి వాకిలి తెఱచి యందఱిని బిలిచె. 77
క. పిలిచిన నరపతి మొదలుగఁ
గలవారలు వచ్చి భద్రకాళిదేవిం
దిలకించి శిరఃకంపము
నిలుచుటకు న్విస్మయాదినిబిడాశయులై. 78
తే. కాంతిమతి భూతలమున సాతాత్కరించి
నట్టియయ్యాదిలక్ష్మిగా కరసిచూడ
మనుజకామినిగాదు సుమ్మనియు మఱియు
మఱియు మ్రొక్కిరి వినయసంభ్రమము లెనయ. 79
ఉ. ఆసమయంబున న్నరవరాగ్రణి భృత్యులు తెచ్చినట్టి సిం
హాసనమందు నవ్వికసితాంబుజలోచన నుంచి వైభవ
శ్రీసముదీర్ణవృత్తి నభిషేకము చేసి విశేషభూషణో
ద్భాసితచిత్రచేలము లపారముగాఁ గయికాన్క చేసి నా
నాసతు లెల్ల మ్రొక్కఁగ నొనర్చి యనేకకృతప్రణాముఁడై. 80
తే. నతు లొనర్చి మహాపతివ్రత యటంచుఁ
బేరుపెట్టి యలంకృతవారణంబు
పై సమాసీనఁ గావించి పటహముఖ్య
భద్రవాద్యరవంబు లంబరము నిండ. 81
వ. ఇవ్విధంబున నక్కాంతిమతి నూరేగించి నిజగృహబహిర్భాగంబున గజావరోహణంబు గావించిన యక్కాంతిమతిచేత సాష్టాంగప్రణామపూర్వకంబుగా ననుజ్ఞాతుండై యానృపాలపురుహూతుం డరుగం దక్కినవారలను బాదపరాగంబు ప్రసాదించి వీడ్కొలుపుచు నమ్మందగమన మందిరాంతరంబునకుం బోయి. 82
తే. వరము లిచ్చు మహాపతివ్రత యటంచు
నేతు కాశీపురాంతరక్షితిజనంబు
లచ్చమగు భక్తి గానుక ల్దెచ్చి చూడ
వేళగానక యుండఁగా వెలసె నధిప. 83
క. అంతయుఁ గనుఁగొని యిఁక నీ
జంత న్నమ్ముదురె యెపుడు చంపునొ యనుచుం
జింతించి యళుకుఁ బాయక
యంతం ద్వర వెడలి కాశి కరిగితి నధిపా. 84
శా. గంగాభంగముల మునింగి నిగమగ్రామేశ్వరు న్విశ్వనా
థుం గీర్తించుచు మ్రొక్కి డుంఠిగజవక్త్రుం గొల్చి యంతంద్రివే
ణిం గాయంబుఁ దొలంచి పూర్వకృతనిర్నిద్రాఘము ల్వాసి నీ
రంగత్పూర్వకృపారసంబునకుఁ బాత్రం బైతి ధాత్రీశ్వరా! 85
క. ఆయద్భుతంబు మదిలోఁ
బాయ మనఁగ లేకయుంటిఁ బదపడి సభలో
నీయాశ్చర్యముఁ గని భూ
నాయక తద్విగుణ మగుట నవ్వుదయించెన్. 86
క. అని తెలుప విక్రమార్కుం
డనుపమ విస్మయతఁ బుష్పహాసుని మన్నిం
చి నితాంతవిభవసౌఖ్యం
బుననుండె న్వింటె వైశ్యభుజగద్వేణీ. 87
క. అని యిట్లు చిలుక పలుకన్
విని మిక్కిలి వెఱఁగుచెంది వెసనంతటిలోఁ
దనచేతి గరలు కనఁబడఁ
జనియెఁ బ్రభావతి రహస్యసదనంబునకున్. 88
తే. కోమటిమెఱుంగుసిబ్బెపుగుబ్బలాఁడి
యంతిపురమున కరిగి సాయంసమయము
గాంచి కైచేసికొని మహీకాంతసంగ
మాభిలాషంబుతోఁ జేర నరుగుదేర. 89
క. కనుగొని గుణసాగరుఁ డో
వనితా చనియెదవె ధరణివల్లభుకడకుం
జను మిఁక నొకథ వినుమని
యనుచుం బలుకం దొడంగె నతివేడుకతోన్. 90
ఇరువదియొకటవకథ
ఉ. అంగవసుంధరాభరణమై యొక పట్టన మంద మొందు మా
తంగతురంగసద్భటకదంబశతాంగతతు ల్చెలంగఁగా
మాంగళికాభిధాన మసమానముగా వహించి యప్పురం
బంగదనామధేయవసుధాధిపుఁదేలు నవేలసంపదన్. 91
ఉ. ఆనరపాలమౌళి కపరాంగము కైవడి నొక్క మంత్రి మే
థానిధినాముఁడై తగు నతండు నిజాంగన జాయమానశో
భానుతశాంత శాంత యను బాలికఁగాంచి దివంబు కేఁగ సం
తానముఁగోరి లోలయను తన్వి వరించి రమించె నంతటన్. 92
ఉ.ఆలలితాంగి కంటికిఁ బ్రియంబగు సొమ్ము ధరించి సేవక
శ్రీ లమరించి జిహ్వకు రుచించు పదార్థము లాహరించి యే
వేళఁ బ్రసూనతల్పముల వేడుకమైఁ బవళింపఁ గల్గుటం
జాల మదించి జారజనసంగతికై తివురు న్మనంబునన్. 93
శే. ఇవ్విధంబున నప్పూర్ణిమేందువదన
యన్యసంభోగసుఖలేశ మబ్బెనేని
యాకసంబైన భేదించి యవలఁబోవు
నంతకుఁ దెగించియున్న యయ్యవసరమున. 94
క. వారింట దేవపూజా
కారీత్వముఁ బూని వేదఖనియై వినుతా
చారణుఁడై సద్గుణనిధి
చారణుఁ డననొక్కబ్రహ్మచారి చెలంగున్. 95
క. ఈరీతినుండువానిం
జారణు లోపఱిచి యొకనిశావేళఁ దమః
పూరితమగు నొకయింటం
జేరిచికొని యిష్టకామ్యసిద్ధిం గనియెన్. 96
క. కని యది మొదలుగఁ దద్రతి
ననుపమసౌఖ్యాబ్ధి నోలలాడుచు మరునిం
దనబంటుగాఁగఁ దలఁపుచు
ఘనతరగర్వమునఁ గన్నుఁ గానక మెలఁగెన్. 97
క. అంతఁ దనసవతిసుత యగు
శాంతం బోషింప మఱచి చారణనిఘ్న
స్వాంతత్వముఁ జెందిన త
త్కాంతామణి నడక లెల్లఁగాంచిన యదియై. 98
తే. శాంత శాంతల యయ్యును జతుర యగుట
దీనికి భయంబు చూపినఁ గాని తనకుఁ
బోషణము లేదనుచు డెందమునఁ దలంచి
యోర్చికొనియుండి యంతట నొక్కనాఁడు. 99
చ. జనకునిఁ జేరి యాతనికి సంతసమయ్యెడు మాటలాడి సొం
పెనయఁగ నీవుగాక మఱి యింకొకతండ్రి గలండు నాకుఁ బొ
మ్మని పలుకన్ వినిశ్చలతరాద్భుతుఁడై మదిఁజెందు సందియం
బునఁ దలపోసి యాసచివపుంగవుఁ డెంతయు నాదరంబునన్. 100
తే. ఇంక నొకతండ్రి గలఁడంటి విందువదన
యతనిఁ జూపెదవే యన్న నవ్వధూటి
మంచిదని రేయి చూపెద నంచుఁ బలికి
యవలి కరిగిన నమ్మాట లాలకించి. 101
క. ఆలోలాంగన తగదు
శ్శీలం బిది యెఱిఁగి పతికిఁ జెప్పఁగఁ బూనం
బోలు నని తలఁచి మిక్కిలి
జాలింబడి శాంతఁ బిలిచి సప్రియరీతిన్. 102
తే. అనునయించిన నబ్బాల యైన నేమి
నన్నుఁ బోషించెదేని యెంతయును దప్ప
దాల్తు నని పల్కె నింక నత్తరుణి జనక
భావసంశయమెట్లు పాపంగవలయు? 103
క. అని పలికి యూరకుండినఁ
గనుఁగొని యూరుజసరోజగంధి విచారం
బొనరించి తెలియఁజాలక
వినిపింపుమటన్నఁ గీరవిభుఁ డిట్లనియెన్. 104
వ. అంత నిశాసమయం బగుటయు నమ్మేధానిధి విభావధీరితతమఃపుంజం బగు కేళిమందిరంబున లోలాసమేతుండై యుండి యబ్బాలికం బిలిచి ద్వితీయజనకుం జూపుమనిన శాంత యత్యంతమౌగ్ధ్యంబు దాల్చి తదీయఛాయం జూపిన నతండు నవ్వి లోలం జూచి యేతద్బాలికాలాపంబులకు నీయందు సందియంబుఁ జెందితి నని తద్వృత్తాంతం బంతయుఁ దెలిపి పతివ్రతాశిరోమణి వగు నీకిట్టిగుణంబులు పుట్టునే యని పలుకరించెంగావున నయ్యమాత్యకుమారికకుం గల నైపుణంబు గలిగినం గాక ధరణీభుజంగపుంగవునిసంగతికిం జనఁగూడునే యనునంతలోన నరుణోదయంబైనం ప్రభావతీలలితాంగి శుద్ధాంతంబున కరికి క్రమంబున దినావసానం బగుటయు. 105
శా. పన్నీటంజలకంబులాడి తొగబాబాపాదుశాకాయపుం
జిన్నె ల్వ్రాసినచీరె గట్టి యపరంజిం జిమ్ము నెమ్మేనిపై
మిన్న ల్గ్రమ్మెడు సొమ్ము దాల్చి మహిభృన్మీనాంకజన్యక్రియా
సన్నద్ధత్వముఁ జెంద యందము రహించంజేర నేతెంచినన్. 106
క. అమ్మ ప్రభావతి రాజగృ
హమ్మున కరిగెదవె మంచి దరుగుదువు వినో
దమ్మగుకథ వినియెదె యని
కమ్మనిచక్కెరలు గెరలఁగా నిట్లనియెన్. 107
ఇరువదిరెండవకథ
మ. అవనీమండలమండనం బయిన యార్యావర్తదేశంబునం
దు విరాటుం డనురాజు ప్రోవఁ జెలువందుం భద్రకాఖ్యంబుర
ప్రవరం బొక్కటి యందు విప్రకులపారావారహాలాహలం
బవు నీతం డన దేవలాంకుఁ డొకఁ డర్థాపేక్షమై వర్తిలున్. 108
సీ. అపరకర్మాగతంబైన వస్త్రమెగాని
క్రయలబ్ధవసనంబు కానివావి
పూటపూట పరాన్నభోజనంబేకాని
ప్రియభామనిజభుక్తి పెట్టుమందు
దానలబ్ధంబైన తాంబూలమేగాని
చేనున్నవీడెంబు చెడ్డయొట్టు
వితరణులైన భూవిభులవాకిలెకాని
యింక నిజాలయం బెదురుచుక్క
గీ. గాఁగ నూహించు నప్పాపకర్ముఁ డెంత
యర్థకాంక్షయొకాని ధనాఢ్యుఁడయ్యు
జన్మఫలమైన యట్టిసంసారసౌఖ్య
మనుభవింపంగజాలఁ డో యంబుజాక్షి. 109
మ. పితృకార్యంబున నొక్కనింట కడుతృప్తిం జెంది తత్పూజనా
గతపుష్పాదులు ద్రోచి యార్ద్రరసనాంగశ్రాంతి దైన్యస్థితుల్
జతగూడంగ నతండు గేహముల “బిక్షాందేహి" యంచున్ దరి
ద్రత గల్పించుచు తెచ్చి బైక్షము తుదిన్ గయ్యంబు సేయున్ పురిన్. 110
క. తొడిబడ నొకయింటితిథిన్
తడవుగ నాపోశనంబు ధరియించి కడున్
గడుపెద్ద దక్షిణిండని
యొడబడినంగాని భుక్తి కొగ్గఁడు పడతీ! 111
సీ. గార్హస్థవరులు దక్షణయుంచు దుడ్డు కా
సులు నిచ్చువానిపై సొరిది వైచు
నడిగి తెచ్చిన పోఁకలాకులు మాపటి
వేడుకకాండ్రకు వెల కొసంగు
దీనమును ముష్టియెత్తిన ధాన్యములు దెచ్చి
మారుబేరంబు కోమటుల కమ్ము
నలయక గూర్చి భైక్షాన్నంబు పరదేశ
వివిధమానవులకు విక్రయించు
గీ. నొదవినంతయు టాకుసేయుట యకార్య
మనఁగవచ్చునె లోకుల కైననేమి
యతఁడు దీలమీఁద వచ్చినయపుడు నైన
రూక మార్పడు కమలవిరోధినయన! 112
సీ. మనసుకోరికదీర తనుపు నీతనిగాఁగఁ
దలచును యదె పిండదానమన్న
ఘననిదానముగన్న గతి నుచ్చి చంకలు
దాటించు కార్పాస్థదానమన్న
నరచేతి ముడువగా నది యెంచి యెందైన
దవ్వేఁగు మహిషప్రదానమన్న
చెలరేఁగి కుప్పిగంతులు వైచి చంగున
దాఁటు నాలింగన దానమన్న
గీ. కాలపురుషాదిదానసంగ్రహణములకు
నెలమి వచ్చినవారితో కలహమాడి
యదను దప్పిన మరి పాళ్ళకైన బెనగు
నాశ బాల్పడి నవ్విప్రపాశవరుఁడు. 113
చ. సమయము వేచి యాద్విజుఁడు సంక్రమణగ్రహణాదిపుణ్యకా
లము లరుదేర దర్భలు తిలల్ ధరియించినవాని మజ్జన
ప్రమదజనంబు లొల్లమని పల్కినమంత్రము లుగ్గడించి వీ
సముకడగాగ గైకొను నసహ్యతరొక్కము లెన్నఁడెన్నడున్. 114
గీ. వ్రతములందున చిననాటి వడుగటంచు
దేవతోత్సవమని తండ్రితిథి యటంచు
వాతబేగులు మాన్ని యెవ్వారిగన్న
నేటు నాతఁడు ధనకాంక్ష వీటిబోవ. 115
సీ. అన్నంబు వెట్టింపు నాఁకలిగంటినో
యయ్యవార లటంచు నార్భటించు
పరిహరించినఁబోక బహుసాహసస్ఫూర్తిఁ
బలిమిమీఱఁగఁ దల్పుఁబడగఁద్రోయు
కూడకుండిన మదుర్ గోడ చెంగునదాఁటి
బంతిలో కూర్చుని రంతుచేయు
మెడఁబట్టి ద్రోచిన బడి చెయ్యి విఱిగెనో
కూయంచు మొఱవెట్టు గోపునెఱపు
గీ. నెట్టులయినను భుజియింప కెడసిబోవఁ
డాతఁడు పరాన్నభక్షణాయత్తుఁ డగుచు
బ్రాహ్మణోత్తమజనసమారాధనంబు
శిష్టనుతముగ గృహపతుల్ సేయునపుడు. 116
సీ. సంతలోఁ బ్రత్తి బిచ్చము లెత్తి నూఱాఱు
వగల జన్నిదములు వడికి వడికి
నికటకాననభూములకు నేఁగి మఱ్ఱియా
కులు దెచ్చి విస్తరుల్ గూర్చిగూర్చి
శాకపుబీజము ల్చల్లి బావులనీరు
చేఁది పోయుచుఁ బైరు చేసిచేసి
వేకువ నంగళ్ల విక్రయవేళల
జాఱిన మిరియంబు లేఱియేఱి
తే. యన్నియును విక్రయించి భార్యాకుమార
ముఖ్యు లాఁకట మ్రొఁగ్గిన మొగముఁజూడఁ
డాసపడి యేమి గోరిన నాగ్రహించు
జందెములు దెంచుకొని తద్ద్విజన్మఖలుఁడు. 117
తే. ఇట్లు గడియించి ధనమెల్ల నింట నునిచి
యతఁడు పరలోక మెనయఁ దదాత్మజుండు
గర్గుఁ డనువాఁడు కౌమారకలితుఁ డగుచుఁ
దరుణగాణిక్యవిహరణాదరణుఁ డగుచు. 118
సీ. కన్నెఱకంపుబింకముఁబోని నేయాలు
వెలఁబెట్టి బలుకు సుద్దులకు లొంగి
రతులకు జాణబేరము లంచు చెలులచేఁ
బరికించు వన్నెచిన్నలకు మఱఁగి
వలచితిరోరి! యీవుల కేమియెడఁబాయ
వలదనుతక్కుమ్రొక్కులకుఁ జిక్కి
సాకటి బిండుగల్ జాతరల్ మొదలుగాఁ
దలపెట్టి గొణుగువింతలకుఁ దగిలి
గీ.పోటు గడియించి రోసంబుఁ బొడమఁ జేసి
కలుపుగోలు వహించి పోకలకు నలరి
గర్గు డడ్డంబు లేక బోగంపుఁజెలుల
కైవశముచేసె దనయింటఁగలధనంబు. 119
సీ. జోగి జంగంబు లెచ్చుగఁ బల్కులకు వాఁడు
చెలరేఁగి లంజమందులకుఁ జల్లి
తముకు వేసినవెన్కఁ దాఁ జరించినఁ బట్టి
యునుపకుండఁ దలార్ల కొసఁగి యొసఁగి
కొండెము ల్జెప్పక యుండ విరాటభూ
వరుని వాకిటి చనవరుల కిచ్చి
'దర్పకాకార! దాతలరాయ!' యని వెంటఁ
బడు బట్టువారికిఁ బాఱవైచి
తే. తగులుగా నిచ్చు పీటమర్ద విటచేట
కులకును విదూషకులకు మేకోలు నడపి
తండ్రి గడియించినట్టి విత్తంబుపోవ
గుల్లగాఁడయ్యె నవ్విప్రవల్లభుండు. 120
తే. ఇవ్విధంబున లేమి వహించి గర్గుఁ
డప్పురము రోసి పరభూమి కరుగుచోటఁ
బ్రబలమగు నొక్కయగ్రహారమున నిలిచి
యతిపిపాసాబుభుక్షాతురాత్ముఁ డగుచు. 121
చ. సకలపురాణము ల్నిగమచర్చ లెఱింగిన వైదికాఖ్యుఁ డౌ
నొకగృహమేధి పిల్వఁగఁ దదజ్జ్వలమందిరసీమఁ జేరి యిం
చుక తలవంచుచుం బెళుకుఁజూపులతో వెసఁబాద్యమిచ్చుత
న్ముకురకపోలఁ గన్గొని కనుఁగవకుం బ్రమదంబు వొందఁగన్. 122
సీ. జాఱు పెన్నెరిగొప్పు జాతమన్యవశిలల్
నించు చేపట్టుగావించు నేర్పు
గిలుకుమెట్టెలు మ్రోయ కేకినీయానంబు
దెలుపుచు శాకంబు దెచ్చు నొరపు
పైటకొంగర వీడ బాహుమూలద్యుతుల్
మించగాఁ గదిసి వడ్డించుఠీవి
కమ్మజోడసియాడ కలితకోకిలరుచుల్
రాజిల్ల బెగడ మారడుగునేర్పు
తే. పతికిఁ జాటుగ నిల్చి తప్పక మెఱుంగు
సొలపుఁజూపుల బెళికిపోఁ జూచుదారిఁ
దియ్యవిలుకానిఁ దెచ్చి ప్రతిష్ఠ సేయఁ
గర్గుఁ డిష్టాన్నభుక్తి సోత్కంఠుఁడయ్యె. 123
వ. అయ్యవసరంబున. 124
సీ. మానసాజాతిశ్రమంబు దీటిత్తిసో
గాంక్షించి నాపైని గాలి విసరె
నటవీచరత్కేకి హర్షావహిత్థంబ
మర్చికోచాటంత మబ్బుదోఁచె
పథికయూథములు ప్రాప్యగ్రామములు జేర
నబ్ర మంబరమెల్ల నల్లిగొనియె
కాంక్ష కన్గొను సైరికవితానములచూపు
మిఱుమిట్లుగొన తీగె మెఱుపు మెఱసె
గీ. తరుణు లధిపుల మై వ్రాల నురుము లురిమె
చెలఁగి చాతకి నో రొగ్గ చినుకురాలె
నవని నేకార్ణవం బైనయట్లు జలము
వెల్లువలుగాఁగ నొకమహావృష్టిఁ గురిసె. 124
తే. అపుడు వైదికుఁ డాగర్గు నాదరించి
వానతఱియయ్యె రవి గ్రుంకవచ్చె నింక
నెందుల జనలేవు శయనింపు మిందె యనుచుఁ
దాను నాతఁడు సమయకృత్యములు దీర్చె. 125
తే. పవ్వళించిరంతఁ బనిదీర్చి దీపంబు
మలఁపి యద్దగోడ మఱుఁగుగాఁగ
వైదికునిసుధాంశువదనయు శయనించె
పచ్చవింటిరాయఁ డెచ్చరింప. 126
మ. గొనబుం బ్రాయము రూపసంపదయుఁ బేర్కొఁగల్గుట ల్మాటికిం
దనువీక్షించుట గర్గభూసురునిమీఁదం గోరుకు ల్మల్లడు
ల్గొనఁగా నేఁడొకనాఁటిమాత్రమున కీలోలత్వ మేలంచుఁ జెం
దినధైర్యంబునఁ గొంతసేపునకు నిద్రించె న్వరాకాంక్షియై. 127
ఉ. గర్గుఁడు దానిమేనియధికవ్యతిరూపములు న్విలాసనై
రర్గళము ల్విలోకనపరంపరలుం దలపోసి చిత్తభూ
మార్గణభూమి నొంప నసమంబగు తామస మంకురింపఁగా
నిర్గతభీతి వైదికుఁడు నిద్రవహించుటఁ జూచి గ్రక్కునన్. 128
క. చని దానివీఁపుపైఁ గర
మునుప న్మేల్కాంచి యాతలోదరి నాథుం
డని యొగ్గ నతఁడు తద్రతి
దనిసి వెస న్శయనభూమిదండకు నరిగెన్. 129
క. అంతట నిశిసమయమునకు
నంతము గలుగుటయు గర్గుఁ డరుగం గని య
క్కాంత నిజాధిపుఁ గనుఁగొని
సంతసమున సిగ్గు సాధ్వసం బొనగూడన్. 130
చ. పదరీతిరేమి రాత్రి నగుబాటని యెంచకవచ్చి యంతసే
యుదురె గృహంబులో నితరుఁ డున్కి యెఱుంగరె సిగ్గు దాకదో
మది మగవారలైనను సమస్త మెఱింగినయట్టివారికే
దుది నొకవేళ నేమియును దోఁచదువో గద యెంచి చూచినన్. 131
క. అనిన విని నేను నిశి మే
ల్కననే లేదనుచు దానికాంతుం డిదిగ
ర్గునికృత్యమె కావలెనని
ఘనమైన జుగుప్స వొడమఁగాఁ గుత్సించెన్. 132
తే. అప్పు డన్నాతి యేరీతి నాత్మమాన
భంగమాచ్ఛాదితంబు చేయఁగవలయు
ననఁ బ్రభావతి నన్నేమి యడిగె దవలి
కథ యెఱింగింపుమనిన శుకంబుఁ బలికె. 133
మ. అపు డమ్మానిని యథ్వనీనకృతధౌర్త్యప్రక్రియల్గాఁ దలంచి
పతిస్వాంత మెఱింగి మోసము జనించెం జూచితే యింకమ
న్నిపుణత్వంబునఁ గాని యీవిభునిసందేహంబు పోదంచు డెం
దపుఁదమ్మిం దలపోసి యద్భుతరసానందంబుఁ గల్పించుచున్. 134
ఉ. కంటిరె యెంతవింత కలగన్నపు డెల్లను మీరు వచ్చి న
న్నంటినయట్టులుండు నదియౌఁగద రాతిరి మిమ్ముఁ బాసి నే
నొంటిగఁ బవ్వళించుటకు నోపక చింత వహింప నంతలో
గంటికి నిద్రవచ్చె గలగంటి భవద్రతి గల్గినట్లుగాన్. 135
తే. వామహస్తము నురముపై వైచి నిదురఁ
జెందుతఱిఁ గానికల గందు రందు రెందు
నవ్విధంబునఁ బవళించి యైనకలయ
గంటి భవదీయకారుణ్యగరిమవలన. 136
క. అని పలుకు దానిమాటలు
విని నిశ్చయ మని తలంచె విభుఁ డోపద్మా
నన యంత నేర్పుగలిగిన
జనవచ్చు నటంచుఁ గీరచంద్రుండు పలికెన్. 137
గీ. ఆప్రభావతి బాగాయె నంచుఁ బలికి
ప్రాగ్దిశాపాండిమము గాంచి పడకయింటి
కరిగి పగలెల్ల ద్రోచి దినాంతవేళ
యధిపసంగమగుతుకమాస్యమునఁ దొలుక. 138
సీ. కలికి చేర్చుక్కయౌ గాదుగా కచభృంగ
భంగపాళికకోరపంక్తిగాని
కస్తూరితిలకమౌ గాదుగా ముఖపద్మ
సక్తశైవాలలేశంబుగాని
రంగులరవికె నారాదుగా కులశైల
గ్రసితనాగేంద్రత్వక్చయముగాని
గతివన్నెచీరెయౌ గాదుగా తనువిద్యు
తాభాదివారివాహంబుగాని
గీ. కనకమేఖలయౌ గాదుగా నితంబ
నవ్యకటిదేశకృతతోరణంబు గాని
యనుచు వర్ణింపఁ గైచేసికొని యొయార
మమరవచ్చెఁ బ్రభావతీహంసయాన. 139
మ. అపు డాచక్కెరదిండిపక్కిదొర యక్కా! నేఁటి కిమ్మేనిచొ
క్కపుశృంగారము వక్ష్యమాణకథజోన్ వింతయయ్యెన్ సుమీ
కృప దళ్కొత్తఁగఁ జిత్తగింపుమని యంగీకారముం గాంచి నే
రుపు మీరం దెలుపందొడంగె పలుమారుం దేనియల్ చిందగన్. 140
ముప్పదియాఱవకథ
క. సుజనాకరమగు నొకపుర
ము జగజ్జేగీయమాన మొదవగ ముదితా
గజరథమురుదురురయహయ
భుజవిజయసనాథసుభటభూయిష్ఠంబై. 141
క. ఆరాజథానియేలు గ
భీరుం డనునృపతి యతనిప్రియమంత్రి జర
త్కారుఁ డన వెలయు నతనికు
మారుఁడు గుణశాలి యనఁగ మాన్యతఁ గాంచెన్. 142
గీ. అతఁ దొకనాఁడు హరిశర్మ యనఁగబరఁగు
నొక్క తైర్థికుం డేతేర నొదవుభక్తి
నతని కిష్టాన్నసంతుష్టి యాచరించి
యర్హసంభాషణంబుల నలరఁజేసి. 143
క. అన్నియుఁ దొరగిన యట్టి ప్ర
సన్నాత్మా కలియుగంబు చటులాఘతదు
శ్చిన్ను లగుజనుల కేక్రియ
నెన్నగ సద్గతులుగలుగు నెఱిగింపఁగదే? 144
వ. అనిన విని యమ్మహీసురుం డిట్లనియె. 145
సీ. అన్నదానంబు దురంతపాపాటవీ
జాలంబునకు దావకీలగాదె?
సురపితృభజనంబు దురితమేదురధరా
ధరకోటులకు వజ్రధారగాదె?
కూపకల్పన మహాఘోరదుష్కృతతమః
కాండంబునకు భానుకరముగాదె?
తరుకోటి నిల్పు టుత్కటకల్మషాబ్ధిక
లమునకు జంఝానిలంబుగాదె?
గీ. ధరణి మఱియును భూసురస్థాపనంబు
మొదలుగా నెన్నఁగలపుణ్యములు సెలంగు
నవియు సాలవె వృజినాగ్ని నవలనార్ప
సద్గతులు గూర్పగ నమాత్యచంద్రతనయ. 146
వ. అనిన విని యమందసందేహకందళితహృదయారవిందుఁడై యమ్మంత్రినందనుండు. 147
గీ. ముక్తి దొరకదు విజ్ఞానముననెగాని
కర్మమునఁగాని విజ్ఞానగరిమ లేదు
జ్ఞానసత్కర్మహీనులె జనులకల్ప
మతుల కేరీతి గల్లు సద్గతులు చెపుమ? 148
క. అనఘాత్మ యనాయాసం
బున కర్మఫలంబు జ్ఞానమున జెంది రయం
బున లింగశరీరము వీ
డ్కొన సద్గతి గాంచు వెరవుగోరెద చెపుమా. 149
చ. అన విని యమ్మహీసురకులాగ్రణి యించుకసేపు కొంతచిం
తన మొనరించి యంతట పితామహుమాట దలంచి మంత్రినం
దను గనువిచ్చి చూచి చిఱునవ్వు కెలంకుల చిన్నవెన్నెలల్
చినుకగ నిట్లనున్ ప్రమదసింధునిమగ్నమనోంబుజాతుఁడై. 150
గీ. బంధురక్షక! యిది మంచి ప్రశ్న కలియు
గమున పాపాత్మజనులకు గతులుగలుగు
వెరవు దెలిపెద నన్నిట్లు వేఁడ భూత
కరుణగలవాఁడ వగు టెఱుగంగనయ్యె. 151
క. మును బ్రహ్మ దెలిపె భూతల
మున గాశీక్షేత్రరాజమును శ్రీముష్ణం
బు ననాయాసంబున కలి
జనులకు సత్పుణ్యగతు లొసంగు నటంచున్. 152
క. కావేర్యుత్తరభువిసం
జీవనదికి పడమటను నృశేవధికకృషా
శైవనికి దక్షిణంబగు
తావున శ్రీముష్ణవిష్ణుధామము వెలయున్. 153
సీ. శ్రీవరాహస్వామి చిత్తాపకల్పితా
మోదసాగరము శ్రీముష్ణపురము
ప్రతివారసేవకాగతశతక్రతుశూలి
ముఖసరోత్కరము శ్రీముష్ణపురము
ముక్తివధూటిముముక్షుకోటివిధూత
మోహనాకరము శ్రీముష్ణపురము
నటతపురోమణి ఘటితనూపురరావ
ముఖరితాంబరము శ్రీముష్ణపురము
గీ. స్మరణమాత్రవినిర్ఘతసకలపాప
మూలసంతతివరము శ్రీముష్ణపురము
దర్శనాలోలహృదయకందళితలసద
మోఘసుజ్ఞానధరము శ్రీముష్ణపురము. 154
క. శ్రీముష్ణము శ్రీముష్ణము
శ్రీముష్ణం బనుచుఁదలప జీవుఁడు కర్మ
గ్రామము దహించి గర్భ
స్తోమప్రాప్తులును నడుచుద్రోవలు మఱుచున్. 155
సీ. పొందుగోరదు నిజభుక్తి కాలాగతా
గాధబాధాకరవ్యాధిచయము
చేరలు పోదు దురంతచింతాతిసంతాప
కృతిమహిన్నిద్రదరిద్రరవము
తొంగిచూడదు మనోభంగపారంపరీ
విత్రాసజనతతాపత్రయంబు
తడవఁబోవదు మహోద్ధామకామక్రోధ
మాత్సర్యద్రోహాదిమదకులంబు
గీ. మించి శ్రీముష్ణ మంచు దలంచువాని
మాట లేటికి వానికర్మంబులు వ్రాయు
చిత్రగుప్తులు తమలెక్క చెడియె ననుచు
కవిలె పడవేయుదురు ధర్మకార్యదుర్య! 156
సీ. శ్రీముష్ణ మని దలంచినఁజాలు ప్రాకర్మ
కలితపాపౌఘంబువలనఁ బోవు
శ్రీముష్ణయాత్ర చేసినజాలు నన్యూన
విజ్ఞాన మది కాళ్ళవ్రేళ్ళఁ బెనఁగు
శ్రీముష్ణపురముఁ జూచినఁజాలు భోక్తవ్య
కరమకాండంబు లెక్కడనొ యడఁగు
శ్రీముష్ణనగరు డాసినఁజూలు కైవల్య
పథమెల్ల కిల్లాకు పంపుసేయు
గీ. తగులుచే నైన శ్రీముష్ణధామసీమ
కాపురం బున్నవానిభాగ్యంబుఁ బొగడ
నలవియే బ్రహకైన బల్ చిలువకైన
తలఁచినంతనె మైగరుపొలిచె జూఁడు! 157
గీ. ఇతరపుణ్యస్థలంబుల నెందుఁజూడ
దారమును దెల్పి కరుణించువారు లేరు
కాశి శ్రీముష్ణమున రమాకాంతునాజ్ఞ
హరుఁడు గరుడుఁడు నుపనిష్టు లగుదురయ్య! 158
సీ. జనకేళిరతవిరజానదీజలజాత
కులసౌరభము గుబుల్ కొనగడంగి
పుడుకబెట్టులతేనె దడిసిన నునుఱెక్క
సురటిజల్లినగొట్టుసోఁక విసరి
హరిపదంబులు దార్ప నర్హమౌ కంటికి
దంబుపై నుత్తమాంగంబుఁ జేర్చి
వైకుంఠపురసురావళి బరాబరి సేయు
మృదులహస్తమున నెమ్మేను నిమిరి
గీ. ఖగకులేంద్రుండు దక్షిణకర్ణమునను
తారకబ్రహ్మపరమమంత్రంబు నొడువు
గడగి కడపటిపయనంబుఁ గాంచువాని
కోమహమహ శ్రీముష్ణగ్రామసీమ. 159
సీ. ఎందుండివచ్చునో యినకోటినిభచక్ర
మరుదెంచు దకిణహస్తమునకు
సమయమౌ టెఱుఁగునో ఘుమఘుమధ్వనిశంఖ
మపు డొద్దు వాయకరాగ్రసీమ
యెవ్వరు పనుతురో యలహేమచేలంబు
జగనీటుగసు కటీచక్రసీమ
తరివేచియుండునో తతమణీకోటిర
మవతీర్ణమగు నుత్తమాంగమునకు
గీ. పతగరాజోక్తతారకబ్రహ్మమంత్ర
మంత్రములు కొన్ని వీనులవల నటింప
తనువుతో బొందు సడలించు ధన్యమతికి
భూసురోత్తమ శ్రీముష్ణపురమునందు.
శా. శ్రీముష్ణంబు సమస్తవైష్ణవమహాక్షేత్రాళికిన్ రాజసే
వామంత్రంబున పాపలోపకరణవ్యాపారపారీణమై
యామోదం బొదవించు నిచ్చు బలదీర్ఘాయుంగళావైభవం
బేమో యంచు మదిం దలంచెదవుసుమ్మీ మంత్రిరాణ్నందనా.
వ. విశేషించియుఁ బంచమహాపాతకంబులసైన్యంబ పటాపంచలంబు గావించుసమయం బొక్కటి గలదు. అది పరమరహస్యం బిత్తఱి బశ్చాత్తాపమునం జీకాకుపడు నీకుఁ దెలుపందగు నిం దెవ్వరు లేరుగదా! దగ్గఱకు రమ్ము! కృతాఖిలజనోగ్లాసంబగు మాఘమాసంబున, నక్షీణపుణ్యలక్ష్మీవిధానపక్షంబగు శుక్లపక్షంబున, దుర్దమదురితమర్దనఘనంబగు చతుర్దశిదీనంబున, శ్రీముష్ణంబున, నిత్యకృత్యంబులు నిర్వర్తించి, రథోత్సవోత్సాహుండగు వరాహదేవుని భజియించి, యవ భృదస్నానకుతూహలుండగు నద్దేవుని వెంటనె ప్రాగంబునిదానంబున కరిగి, వేఁగిన పున్నమనాఁడు, ప్రాతఃకాలంబున తదంబుల గ్రుంకి, మధ్యాహ్నంబునకు, చకచకితగోపురమణీడంబరంబగు పురంబునకుఁ జని, సంజనితకంజాతవిహారమాణరథాంగవధూవిభ్రమశ్రీకరంబగు నభ్రసరోజాకరంబున మునుకలిడి, తనుకలితకనకవసనరుచినిచయప్రకాశితదిశాబృందుండగు గోవిందదేవుని సందర్శించి, విజ్ఞానసభాభాసమానుండగు నీశానునకు నమస్కారంబు గావించి, యేతెంచి, దినాంతరంబున, సదావాసితగంగానిర్ఝరిణియగు నిత్యపుష్కరిణి నవగాహంబు గావించి, నిశాముఖంబున వరాహదేవుని సేవించి, తత్ప్రసాదంబును భుజియించినవారికి, దేశాంతరనివాళియైన, దుష్కృతక్లేశలేశంబులు లేక, యనేకాభీష్టంబులు చేకూరు; నావెనుక కైవల్యంబునకుం గాణా చీకాండ్లగు. దైవయోగంబున నమ్మాఖమాసం బాసన్నమైయున్నయది. ఏను దద్వ్రతాచరణంబున కఱుగుచున్నవాఁడ నచ్చటికి వచ్చితిరేని రమ్మని పలికిన యమ్మహీసురపుంగవునిం గనుంగొని యభంగురసంతోషాంతరంగుండై గుణశాలి యిట్లనియె. 162
మ. మును నీతావకపాదపద్మవినుతిం బూతాత్మతం జెందినాఁ
డనొ నీసత్కరుణాగుణంబు కొనియాడం శక్యమే నాయశం
బునకున్ విస్మృతి దెల్పితే దయవెసం బూర్ణంబుగాఁ దెల్పి దో
కొనిపొ మ్మచ్చటి కేను వత్తు నిక నీకున్ శిష్యశిష్యుండనై. 163
సీ.చక్కగాఁ బోనున్న సంయమనీపురం
బున కేఁగుత్రోవల ముండ్లుగొట్టి
చలపట్టి దురితావళులె వ్రాయుచిత్రగు
ప్తులలెక్క హంసపాదులు ఘటించి
మున్నుగా నమరించి యున్నదండనదాడి
యాతనసాధనం బవల ద్రోచి
దండనోత్సుకవృత్తి దరిజేసియున్నట్టి
పాశకోశము పటాపంచఁజేసి
గీ. నన్ను రక్షింప వచ్చి తెంతటిమహామ
హుండవొగాని యిది యేల నుర్విమీఁద
మిమ్మువంటి మహాత్ములు మెలఁగుటెల్ల
కూర్మి దీనుల రక్షించుకొఱకుగాదె? 164
క. అని చిలుక బలుకుచుండగ
నినుఁడు పూర్వాద్రిమీఁద నెక్కుట గనుచున్
జనియె ప్రభావతి నిద్రా
ఘనపరవశనిమీలితాక్షికైరవి యగుచున్. 165
గీ. చారుకేళీనిశాంతంబుఁ జేరి నాఁటి
రేయి రాజిల్కరౌతు గారించి రాజు
వలపుతో వచ్చు నాప్రభావతినిఁ జూచి
“తేమనోభీష్టమస్త”ని తేనెలొలుక
బలికె తక్కటికథ విన జిలుక యపుడు. 166
ఏఁబదిమూఁడవకథ
వ. అని యిట్లు గుణశాలి సన్నుతించి నీవెంట వత్తు ననిన. 167
చ. అనిన నతండు మేకొన కరాబ్జగృహీతతదీయపాణియై
జనభయకారిఘోరవనశైవలిని పురవక్కణంబులె
ల్లను గనుసించికొంచు నచలత్వరమించఁగఁబోయిపోయి నూ
తనతరహర్షగద్గదవిధంబున నాతనిఁ జూచి యిట్లనెన్. 163
క. చెంగట గంటివె దక్షిణ
గంగాద్వారము గిరీంద్రకన్యాసదయా
పాంగత్రిలోకము కాముక
శృంగారమధ్యమై బుధివింధ్యంబున్.(?) 169
మ. తనరన్ గంటిరె వృద్ధశైల మిదిగాదా! కంతువిద్విణ్ణికే
తనమౌ దక్షిణకాశి ముష్ణపురభూదారేశవాత్సల్యసం
జనితానందత నిచ్చటన్ శివుఁడు లాస్యప్రౌఢి గన్పించు నీ
తని సేవించకయున్న తన్నగరియాత్రాసిద్ధి లే దేరికిన్. 170
క. మీరు చతుశ్శృంగములప్ర
కారమున గయాప్రయాగకాశీగంగా
ద్వారము లచ్చట నొక్కొక
వారణమున వచ్చి నిల్చె వరవినయవిధీ. 171
మ. అని విన్పించి యతండు దాను వెస వృద్ధాప్రస్థలిం జేరి తె
ల్ప నశక్యంబగుసంతసంబు వొడయన్ పాతాళగంగానదిన్
దనువుల్ ద్రోచి తదగ్రగర్భగృహవాస్తవ్యున్ సురస్తవ్యుశ
ర్వుని సేవించి నుతించి వెల్వడి మనోరమ్యోక్తులై పోవుచున్. 172
క. ధీనిధి హరిశర్మ మహా
జ్ఞానున్ గుణశాలిఁ జూచి సరసం గంటే
యానందభవన మనియెడి
కానన మిది బరగు ఝల్లికావన మనఁగన్. 173
మ. సకలర్తుస్ఫుటమానసత్ఫలసమాజం బివ్వనం బక్కర
శ్మికిజోటీయమి మధ్యపక్కణజనశ్రేణుల్ తటాకోత్కరా
బ్జకులంబుల్ ముకుళించుటన్ విరియుటన్ జేయున్ ప్రక్రియా
నికరాదాయపరాయణంబులను వింటే! వరాణ్నందనా! 174
సీ. వనరాశి యని డాగవచ్చినమైనాక
ధరముకైవడి గజోత్కరము దసర
నతులసాలసమూహమగు టనంతర చర
తురగాళియై మృగస్తోమ మలర
పుండరీకాననంబుగదా యని వసించు
నంచలరీతి సింహములుఁ బొసఁగ
సత్పథత్వం బిచ్చి చలియించుకరిమ్రబ్బు
తుటుములగతి కిటిసటలు వెలయ
గీ. కదసి చెలఁగె లతాడోలికావిహారి
సౌరి బాలాంఘ్రినఖకాంతిచంద్రికాలి
కసితకాసారగంభీరగంధకలిత
పవననవనేయ మానందభవనచయము. 175
క. ఆనందభవనవని కెన
యానందనవనము నెన్న నర్హం బగునే?
కానం దలపఁగరాదని
కానందగు సకలఫలనికాయాస్పదమై. 176
క. ఈవల కృష్ణయు నావల
కావేరియుఁ గొలువఁ బలువగలఁ జెలఁగెడు నా
శైవలి నీవల్లభుక్రియ
నీవనతల్లజము గంటివే! విలసిల్లెన్. 177
క. అదె కంటివె శ్రీముష్ణము
నదెపో యక్కాంతి గోపురాగ్రనిరీక్షా
విదళితదూరాగతకో
విదజనసంసారఘోరవిధతృష్ణంబున్. 178
సీ. ఈవనంబుల వెట్టి యింద్రపట్టణసీమ
హవణించు నందనం బయ్యె నేమొ?
యీమేడలప్రమాణ మింతని పద్మజుం
డమరింప సురశైల మయ్యె నేమొ?
యీయంగజులవస్తు లేమైన గిలుబాడ
యక్షేశునకు నిధు లయ్యె నేమొ?
యీసరస్థితిఁ జూచి యెవ్వరో యీరీతి
నడరింప మానసం బయ్యె నేమొ?
గీ. యీపురముతోడ జోడుగా నెన్నిమారు
లైన గావింప వైకుంఠ మయ్యె నేమొ
నంతపయిలేక నిది సేర నబ్బుటెల్ల
మన మొనర్చినభాగ్యంబు మంత్రితనయ! 179
క. ఏతన్మాత్రమె విభవస
మాతత మిది దక్షిణప్రయాగ యనఁగ వి
ఖ్యాతం బీశ్రీముష్ణం
బీతరి సేవింపఁగలిగె నీశ్వరుకరుణన్. 180
మ. కనుఁగొంటిన్ ఘనమార్గలంబితచణాగ్రస్వర్ణకుంభంబుతో
వనము న్నర్కవిమాన మచ్చటఁ జుమీ వారాహదేహంబుఁ జెం
దిన నాతండ్రి ముకుందుఁ డాఢ్యుఁడు రమాదేవీసహా యుండు స
జ్జనులన్ బ్రోచుచునున్నవాఁడు కరుణాచాతుర్యధుర్యంబుగన్. 181
చ. కనఁబడురంగుబంగరుతగళ్ళధగధ్ధగితప్రభానిగుం
భనమున మించె బావనసమాజము జూచితె యచ్చటన్ వరా
హుని భజియింప సత్త్వదివిజోత్కరమున్ వసియింపఁ దన్నికే
తనమగు మేరుభూధర ముతానతదర్థము నిల్చెనోయనన్. 182
ఉ. అన్నియు నారయన్ బహుపురాగతతైర్థికసంకులంబులై
యున్నది వీథు లేమిగతమో? యిది మాఘముగాదె? రేపుగాఁ
బున్నమ నేఁడు సుమ్ము మనపోత్రిశరీరునకున్ రథోత్సవం
బెన్నగ నిప్డు పుష్కరణి కేఁగుట యుక్తము గాదె యిత్తరిన్. 183
క. అని పలికి యతని దోడ్కొని
చని యాతాయాతవివిధజనసమ్మర్దం
బునకున్ లోఁగుచు మదిఁ బ
ర్విన నివ్వెర నిత్యపుష్కరిణియున్ గనియెన్. 184
సీ. దూరాగతాత్మబంధువులు డాశిన వంశ
జేతలవావులు సెప్పువారు
నడయాడుచును భయం బడర నొండొరుకరం
బులు గట్టిగాఁబట్టి నిలుచువారు
చేపట్టు వదలుటఁ జెదరినతమవారిఁ
బేర్కొని బెట్టుగాఁ బిలుచువారు
నితరజనాహ్వాననుతికి తన్నామకు
లగుటనే నేమేమని యనెడువారు
గీ. స్నానతటగతజనపటాంచలవిగళిత
నీరసంకేశనికటవనీతలమునఁ
గడగి మునివేళ్ళ బట్టూఁది నడచువారు
గలిగి తన రారు నిత్యపుష్కరిణి గంటె! 185
సీ. పూర్వభాగమున నద్భుతలీల జాహ్నవీ
గోదావరీనదుల్ గొండ్లి సలుప
నగ్నికోణంబున యమునాసరస్వతీ
ఝురీణులు నిండుగాపురముఁ జేయ
దక్షిణంబున సముత్కంఠతో నర్మదా
సింధుస్రవంతులు సిరులు గాంచ
నిరుతిదిక్కున నిందితతామ్రపర్ణీక
వేరనదులు వేర్వేరఁ బొసగ
గీ. పశ్చిమంబున తుంగయు భద్రయును స
మీరునెడ కృష్ణవేణి కుబేరదిశమ
లాపహయు, భీమరథియు, హరాశ, రసయు
నెలమి భవనాశనియు నిల్వనిది సెలంగు. 186
చ. తటమహిజాతనూతనలతాగళితసవాశితోడి యు
త్కటమకరందబృందములు దాల్చిన యర్ధవికస్వరాంబురు
ట్పటలము పద్మతోయములు బర్వగఁ బుణ్యసరఃకదంబమే కడా
పట నరుదెంచి యిందు మునుగన్ వలకొన్నవిధంబు దెల్పెడున్. 187
సీ. ముసుకులతో వచ్చి మునిగెడు శుద్ధాంత
కాంతలకస్తూరికమ్మవలపు
బలుబరాబరులు బోల్పడవచ్చి గ్రుంకు భా
మినుల చొక్కపుఁదట్టుపునుగుతావి
గములుగా వచ్చి తానములాడు కర్ణాట
సతులపాటీరంపుసౌరభంబు
హితులతోడుగవచ్చి యీఁదెడి ద్రావెడ
పంక్తి మంజలికాపుపరిమళంబు
గీ. తగులుకొని మించుకరులగంధములచేత
తైర్థికావళి బడలికల్ తలగఁజేసి
తనశ్రమాపహనామంబు ధన్యతమము
గా మిటారించె నిత్యపుష్కరిణి వింటె! 188
గీ. కమలమకరందరసమధ్యకన్యకాపు
కారము వసించి నిత్యపుష్కరిణిజలము
నడుమ నందంబునొందె కుందనపుతగుడు
లంటి దాపిన నవరత్నమంటపంబు. 189
సీ. ఎవ్వరి నని దాల్తు నే నటంచు విహంగ
విభుఁడు చింతించి నావెనక కొదుగు
దొర యెవ్వఁడని బరాబరి సేయుదు నటంచు
సైన్యనాథుండు నిశ్చలతనొందు
నధిపుఁ డౌ సతండు రమ్మనిన జేరెదు నంచు
బలవైరి దవ్వుదవ్వులనె వచ్చు
నాయకనిర్దారణాశక్తి జాలమి
నెత్తమ్మిచూలి నోరెత్త వెఱచు
గీ. నెఱయు నీనిత్యపుష్కరిణీజలమ్ము
మునిగి గ్రక్కున లేచినజనులశంఖ
చక్రపీతాంబరాదిలక్షణవిరాజ
మానవిష్ణుసామాప్యు లైనకతన. 190
క. ఈనిత్యపుష్కరిణికిఁ గృ
శానుదెసంగంటె దిగ్గజప్రవరాశా
ధీనత్వశరణచణశా
ఖానీకనిబద్ధమైన యశ్వద్ధంబున్. 191
క. ఈరావిఁ జూడు సాక్షా
న్నారాయణమూర్తిసేవ నామాత్రశ్రీ
పారంపరప్రియదంబు వి
చారింపఁగ దీనిఁ బొగడ శక్యమె మనకున్. 192
క. అని దెల్పిన తదనంతర
మున నయ్యిరువురును నిత్యపుష్కరిణిన్ గ్రుం
కినవారై కోవెలకున్
జని గరుడస్తంభనికటజగతి న్నేఁగన్. 193
క. సాష్టాంగనతులు సేసి ప్ర
హృష్టులజయవిజయుల న్నిరీక్షించి నిజా
భీష్టము లొనగూడగఁ జని
యష్టపురాగర్భగృహధరాంతరగతులై. 194
సీ. సపవిత్రనందతిత్ప్రపారితోహ్యంభోజు
మహితపాదాబ్దు నమద్బిడౌజు
దండెకఖండనోద్యద్బూరినిశ్వాసు
కమనీయరుచిరసత్కనకవాసు
శారదచంద్రికాచారుకాంతిశరీరు
నిగమాంతకేళీవనవిహారు
విమలకటీతటీవిన్యస్తమృదుహస్తు
నతభక్తలోకావనప్రశస్తు
గీ. రుచిరవక్షోభిలక్ష్యసరోజగేహు
ధరణిసంభరణాసముద్ధరణదేహు
నవ్వరాహుని సేవించి యధికభక్తి
నతులవాచానిరూఢి సన్నుతు లొనర్చి. 195
శా. సుస్మేరంబగు నీముఖాంబురుహ మిట్లుం జూడగల్గెన్ మనో
భస్మారంబులుఁ జెందనీయక పురాపర్యాప్తపాపౌఘముల్
భస్మంబై చనఁజేసి భూరికరుణాపారీణతారూఢిమై
యస్మద్ఘోరభవంబు బాపు మిక సర్వాంగీణపాండుద్యుతుల్. 196
క. అని వినుతించి రథోత్సవ
మును గన్గొని తద్వ్రతం బమోఘాదృతి చే
సినవారై దమదేశము
జనుచో నిరువురు దినాంతసమయమునందున్. 197
గీ. అనుచు కీరంబుఁ దెల్పఁగా నంతలోన
ప్రాగ్ధరాధరశృంగంబుపై సరోజ
బంధుబింబంబు జూచి ప్రభావతీర
మణియు కేళీనిశాంతంబుఁ దనరఁజేరె. 198
ఉ. చేరి ప్రభావతీసుదతి చెల్వుగ నాటిదినాంతవేళ సిం
గారముమీఱ చారుకనకద్యుతు లంగమునందుగల్గ యొ
య్యారముతోడ రాజసము నారయఁబోయెడు నాప్రభావతీ
సారసగంధిఁ జూచి రసచాతురిమీర శుకం బ దిట్లనెన్. 199
గీ. భళిరె! శేబాసు! యోవైశ్యపంకజాక్షి!
యింత వేగిర మొంద నీ వేగుదెంచు
టే నెఱుంగుదు తక్కటియైనకథయు
వినవలెనటంచు వచ్చితి వింతె వినుము.200
వ. ఇవ్విధంబున నవ్విప్రవరులు మఱలి నిజపురంబున కరుగు దేరునంత సంధ్యాసమయంబున. 201
క. ఒకపల్లెఁ జేరఁ జని యం
తిక నటి తత్కాలవిధులు దీరిచి యెకశూ
ద్రకు నడువన్ శయనించిరి
శకకృతపురగమనమార్గజనితశ్రములై. 202
గీ. అప్పు డాయింట గేస్తురాలంగవిజితరంభ
రంభచతురిక యనుపేర ప్రబలుమగఁడు
తాను పొరుగూరి కరుగ నితరు బిలిచి
కొని మనోజాతసంక్రీడఁ బెనఁగుచుండ. 203
ఉ. అత్తరి వచ్చె తత్పతిధరామరు లిద్దఱు దీనికౌశలో
దాత్తతఁజూత మంచు సభయంబుగ నుండిరి లెస్స వింటివా
బిత్తరి యప్పు డాహిమగబింబముఖీమణి బొంకు టెట్లు నీ
యుత్తమచాతురీగుణసమున్నతి నెంచెద దెల్పుమా యనన్. 204
గీ. అన ప్రభావతి శుకకులాధ్యక్ష! యింత
గనగఁగల్గిన నేర్పరిగాను యేను
జాలు నులుకుట్టుమాటలజోలి యేల
నవలికథ దెల్పు మనిన నిట్లనియె చిలుక. 205
క. చతురిక పతి వచ్చుట గని
వెత గల్పించుకొని క్రూరవృశ్చికదష్టా
స్థితి మాన్పెడుమంత్రజ్ఞుని
గతి మంత్రింపుచు వసింపగా జేసి వెసన్. 206
క. ఇలు దెఱచివచ్చి నిలిచిన
చెలువునిపై వ్రాలి యేమి చెప్పుదు నీము
ద్దులమోము జూడఁగానక
పొలుబాపుచు నుంటి తేలు బుడుకుటకతనన్. 207
ఉ. నాయతిఘోరవేదననినాదములన్ దయవుట్టి వీథిలో
బోయెడునట్టి యీపరమపుణ్యుఁడు గ్రక్కున మంత్రశక్తిచే
నాయువు నిల్పె నీతని మహాద్భుతసద్గుణ మెంచగాఁ దరం
బే యిక నేల బిడ్డఁగని పేరిడఁగావలయున్ మనోహరా! 208
సీ. పడకఁ దెఱువరు లిద్దఱు బాపనయ్య
లదిగొ చావడి బవళించి నిదురలేక
యన్నియును చూచుచున్నవా రడిగి జూడు
యెన్నిపాటులు పడితినో యిటకు మునుపు. 209
మ. అనినం దత్పతి జారునిం బొగడి నాప్రాణంబు రక్షించి తం
చును పైపచ్చడ మిచ్చి వీడ్కొలిపె నచ్చోతద్వధూచాతురీ
జనితాశ్చర్యులు భూసురుల్ నిజనివాసప్రాప్తులై రంచు మె
త్తనివాక్యంబుల చిల్క బల్కునెడ ప్రాతర్వేళ గావచ్చినన్. 210
గీ. కోమటి మెఱుంగు సిబ్బెపుగుబ్బలాడి
యంతిపురమున కరిగి సాయంత నాప్తి
గాచి గైచేసికొని మహీకాంతుసంగ
మాభిలాషంబుతోఁ జేర నరుగదేర. 211
క. కనుగొని గుణసారుం డో
వనితా జనియెదవె ధరణీవల్లభుకడకున్
జను మిక నొకకథగల దది
విను మనుచుం బలుకఁదొడఁగె వేడుకబొడమన్. 212
శా. కావేరీతటిద్రావిడీనినదశంగాకాళికీకీచకీ
రావంబై యొకయగ్రహార మురువారం బందు నుద్యల్లస
ద్భావుల్ మిత్రుడు దేవదత్తుఁడును విద్యాశాలియాద్యుండనన్
గా విఖ్యాతి వహించి భూదివిజలోకశ్రేష్ఠులై నల్గుర
ర్ధావేళ స్పృహతం జరింతురుగకియ్యత్వంబు శూన్యంబుగాన్. 213
గీ. తద్ద్రవిణమెల్లగిలు బాడఁ దలఁచి ధూర్త
విప్రుఁ డొక్కండు వారల వెంటవెంటఁ
దిరిగి తన్మైత్రి వడసె విధేయనామ
ధేయుఁ డరివంచనాపరాత్మీయబుద్ధి. 214
ఉ. అంతట పాండ్యమండలమునందు ద్రువాఖ్య నెసంగు మేదినీ
శాంతుఁడు భూరిదాన మొసగన్ సమకట్టిన విన్నవారలై
సంతసమంది నల్గురు ద్విజన్ములు గూడి విధేయుతోడ న
త్యంతరయంబుమై నరిగి రాదొరయున్నపురంబు సేరఁగన్. 215
వ. ఇవ్విధంబునఁ జేరి. 216
సీ. మంత్రీంద్రులకు వేదమంత్రపూర్వాశీర్వ
భాసురోక్తుల నిమ్మపండ్ల నొసఁగి
యధికారిచెంత వేదాంతభాష్యాది
మాంసాదిసంవాదమహిమఁ జూపి
హితపురోహితు లున్నయిండ్లకుఁ బసపుపం
డ్లును గొనిపోయి బంధుతలు నెఱపి
వాకిట గొల్లల కేకతంబున ధర్మ
తత్త్వమార్గమును బోధన మొనర్చి
గీ. యుడిగములవారికెల్ల మే మున్నవార
మునుచు మంత్రాక్షతల నిచ్చి యనుసరించి
వారు సముఃఖంబు సేర్ప భూవరునిచేతఁ
గైకొనిరి నాల్గువేలరొక్కంబువారు. 217
గీ. ఇట్లు గైకొని తమయూరి కేఁగఁదలచి
త్రోవ సరిగొట్టి దొంగలు ద్రోచికొనుట
వింత మరిగొనిపోవ సువేళగామి
హితుఁ డనెడిపేర నొకబచ్చుయింటి కరిగి. 218
క. ఈయెనిమిదిజాలలధన
మీయెడ మీయింట నుండనిమ్ము పురంబున్
డాయగఁ జని నేగనుగొని
పోయెద మిటు వచ్చి యనుచుఁ బొసగించి వెసన్. 219
గీ. ఇప్పుడు వచ్చిన యేగురు నిందువచ్చి
యడుగునప్పుడు గాని యీయర్థ మొసఁగ
వలదనుచు రొక్క మాబచ్చువానిచేతి
కచ్చి వానిల్లు వెలువడి యవలి కరిగి. 220
గీ. తెఱువుబత్యంబుసకు లేక యరుగఁదరమె
యనుచు మిత్రాదులగునల్గు రాత్మఁదలఁచి
యలవిధేయుని బిలిచి నాల్గైదుమాడ
లడిగి తెమ్మని యడుగఁగా నతఁడు వోయి. 221
క. హితుఁ జేరి రొక్కమంతయు
నతిరయమునఁ దెమ్మటంచు ననిపిరి మావా
రతులితశూరసహాయులు
జతగూడిరి పయనమునకుఁ జనియెద మనినన్. 222
గీ. అతఁడు గేహంబు వెడలి యయ్యవనిసురుల
నందఱిని జూచి యిత్తున యనుచు నడిగి
వార లిమ్మని పలుక నివాసమునకు
నరిగి యాతనిచేతికి నర్థ మొసఁగె. 223
ఉ. ఇచ్చుటయున్ విధేయుఁడు సుదీప్సితముల్ ఫలియించె నంచు లో
హెచ్చినసంభ్రమం బురల నెప్పటినల్గురిగూడి కొంతద
వ్వచ్చెడురీతి వెంటఁజని యంతట వారల కన్మొఱంగి తా
నిచ్ఛకువచ్చుతావునకు నేఁగె మహాజవ ముప్పతిల్లగన్. 224
ఉ. అంతట వానిగాన కపు డంపిననాలుగువేలరొక్క మా
ద్యంతము దెచ్చెనో జరిగెనోయని మిత్రముఖుల్ దలంచి య
త్యంతరయంబునన్ మఱలి యాహితునింటికిఁ బోయి మాధనం
బంతయు నిమ్మటన్న విని యాతఁడు వారలఁ జూచి నవ్వుచున్. 225
సీ. అపుడు మీ రంపఁగా వచ్చినట్టియతని
చేతికే మీఱ లిమ్మని సెలవొసంగ
ధన మొసంగుట యెఱుఁగనిదారి బలుక
దగునె యీసుద్దు లెల్లవర్తకులతోడ. 226
గీ. అనిన వారు రొక్కమంతయుఁ దెమ్మని
యనుప లే దనంగ నతఁడు మీర
లిమనంగ విత్త మిచ్చితినొ లేదొ
యస్య పెద్దమాట లయ్యె నపుడు. 227
వ. తదీయవాక్యోపవాక్యంబు లాకర్ణించి యందంద సందడిగా మూఁగిన యాధార్మికులు గొంద ఱిఱుదెఱంగులవారి వారించి మహీసురోత్తములు విత్తంబంతయుఁ బోనాడుకొని పోదురె యనియును, హితుండు ఘంటికామంత్రంబు తనయింట నునుచికొనుట కాని లాభంబుగానని వాఁ డర్థంబంతయు నిచ్చునే యనియుం దలపోసి చెడినసొమ్ము చెరిసగంబుగా వగదెంచి యాబచ్చువానిం బిలిచి వీరు నీయధీనంబు బెట్టినధనంబునం దొక్కపా లిమ్మనిన సమ్మతించక యతండు నలువురిం దోడ్కొని పాండ్యమహీమండలాఖండలు సముఖంబునకు నరిగె. యో ప్రభావతీ! యవ్వసుమతీపతి యేగతి తదీయవివాదం బుడుపవలయు నిది యెఱుంగకున్న ననన్యసామాన్యుండగు రాజన్యమూర్ధన్యుపాలికింబోవ నూహింతువే తెలుపు మని పలికిన యంకురితమనఃస్సంకోచన యగునప్పంకజాక్షి నీరీక్షించి యప్పక్షికులాధ్యక్షుం డిట్లనియె. 228
క. మగువా! తిర్యక్కులజుం
డగుట న్నుతిలేక మించనాడితి నేరం
బగు సైరించుట భవదీ
యగుణంబుగదా శమించి యవ్వలవినుమా! 229
క. ఆపాండ్యనృపతి విప్రా
లాపంబులు హితునిమాటలున్ విని నరుగన్
ప్రాపితముఖుఁడై కరుణా
శ్రీపటిమన్ బచ్చువాని చేరన్ బిలిచెన్. 230
క. పిలిచి చెవులోన నేమో
పలికిన నతం డలరుమొగము భాసిల్లగ రా
జులదేవ యనుచు ధరణీ
తలనాయకుఁ బొగడి జనితదరహాసమునన్. 231
గీ. బ్రాహ్మణులఁ బిలచి నాయింటఁ బదిలపరచి
యున్నయది విత్తమెల్ల నాయొద్ద ననుచు
నపుడు మీచిన్నగతి నేఁగు రరుగుదెంచి
యడుగుఁ డిచ్చెద మాఱుమాటాడవలదు. 232
క. అన వారు మొగమొగంబులు
కనుగొనుచు న్నిలువ ధరణికాంతుఁడు కరుణా
వననిధిగాఁ గాపునవారల
ననిచెన్ బహుధన మొసంగి యంభోజముఖీ. 233
క. ఆరాజవరునకుఁ గల
నేరుపు నీకబ్బెనేని నృపలోకమణిన్
జేరుమని చిలుక యనునెడ
వారిజహితుఁ డెక్కి పూర్వవసుధాధరమున్. 234
క. అపుడు ప్రభావతి తనయం
తిపురమునకు నరిగి తమ్మితెగ నెవ్వగలన్
తపియించువేళ వచ్చిన
నపరిమితానందమానసాంభోరుహయై. 235
శా. పన్నీటం జలకంబులాడి తొగలుం బాలాభిరేఖావళీ
చిన్నెల్ వ్రాసినచీర గట్టి యపరంజింజిమ్ము నెమ్మేనిపై
మిన్నుల్ గ్రమ్మెడి సొమ్ము దాల్చి మహిభృన్మీనాంకజన్యక్రియా
సన్నద్ధత్వము నొంది యందము రహించన్ జార నే తెంచినన్. 236
చ. కనుగొని పచ్చరెక్కపసగల్గినఫుల్గులరాయఁ డో కన
త్కనకఛటాఛటాచకచకత్తనువల్లిక నేఁడు దెల్ప నీ
యనుమతిమీఁదగాని కథయంచు దలంకుచు విన్నవింతునా
యని తదుదారకౌతుకకటాక్షనిరీక్షలు గాంచి యిట్లనున్. 237
ఉ. అంగవసుంధరాభరణమై యొకపట్టణ మంద మొందు మా
తంగతురంగసద్భటకదంబశతాంగతతుల్ సెలంగఁగా
మాంగళికాభిధాన మసమానముగా వహియించి యప్పురం
బంగదనామధేయ వసుధాధిపుఁ డేలును తేలుసంపదన్. 238
ఉ. ఆనరపాలమౌళికి వరాంగముకైవడి నొక్కమంత్రి మే
థానిధినాముఁడై తగునతఁడు నిజాంగనజాయమానశో
భానుతశాంతపేరి యొకబాలికె గాంచి దివంబు సెంద సం
తానము గోరి లోలయనుత న్వివరించి రమించె నంతటన్. 239
ఉ. ఆలలితాంగికంటికి ప్రియంబగుసొమ్ము ధరించి సేవక
శ్రీల మఱంగి జిహ్వకు రుచించుపదార్థము లాహరింప నే
వేళ ప్రసూనతల్పమున వేడుకమై బవళింపుగల్గుటన్
చాల మదించి జారజనసంగతికై తివురుబ్బిగల్వగాన్. 240
సీ. రేయిదాల్చినవిరుల్ వ్రేలుగొప్పున జాఱ
నగుమోము జిగిమించ నదికి నరుగు
పుక్కిటివీడె మబ్బురపునీటు ఘటింప
కులుకు నెన్నడలతో గుడికి నరుగు
పయ్యెద వీడ గుబ్బలనిగ్గు గనుపట్ట
నెమ్మితోఁ జుట్టము లిండ్ల కరుగు
పావడపై వ్రాఁతపని జీర రాణింప
కొమరుతో వనభోజనముల కరుగు
గీ. నరుగుచో మంచిమగవాఁ డెదురనుపడగ
వనిత తగవాని నటు బిగాబగలఁజూచు
సోగకడకంటి నెఱవాఁడి సొలపుఁదళుకు
బెళుకుచూపుల నయ్యిందుబింబవదన. 241
గీ. ఇంట నేతెంచుచుట్టంపు టెమ్మకాండ్ర
తరచుగాఁ బిల్చితేర ద్రస్తరులు బలికి
తన్మనంబుల రాగకందళము లునిచి
యతిభయాతతమున వాఁడ నడలుపడతి. 242
సీ. దూతికపట్ల నెంతోమైత్రి పాటించి
దానికి మన సిచ్చి తగులు నెఱపి
సఖియెడాటమున నిచ్చకముగా వర్తించి
ధాత్రియుఁగూడి మంతనములాడి
ప్రాతివేశిని దనప్రాణంబుగాఁ జూచి
లెంకలతోడ మాలిమి యొనర్చి
శిల్పినీరుదికి మచ్చికబుట్ట నడపించి
తనకు దాసాహాయ్యమును భజించి
గీ. యత్తికామాతులసుతాదు లైనబంధు
గంధసింధురగమనల గారవించి
యేయుపాయంబులను గోర్కె యెనయనేని
తన మహాంతఃపురాధివాసనకుఁ గనలు. 243
సీ. తనివిదీఱఁగ నందతనయుతో రతికేళిఁ
బెనఁగిన గొల్లగుచ్చెతలమనువు
చంద్రునంతటి నిండుజాణ కౌఁగిటఁ జొక్కి
తమిఁగడఁదేర్చిన తారబ్రతుకు
నేమగమిని యైనదేవేంద్రు నన్యునిగూడి
కాంక్షఁజెందు నహల్యకాపురంబు
శివుగూడి తనివిఁగాంచినయట్టి దారుకా
వనమౌనికాంతలవర్తనంబు
గీ. మెచ్చుగాక మఱేమి యీమేనియందు
యనుభవించనిసౌఖ్య మే లనుచు వనిత
యింటిలోనుండి చావడి నెవ్వరైన
సరసరీతిప్రబంధముల్ చదివిరేని. 244
ఉ. ఏవురతోడఁగూడి రమియించగ భాగ్యముఁ జేసెఁ గావునన్
ద్రౌపది మెచ్చవచ్చునని తొయ్యలి సంతసమందునంతలో
నావిభుఁ డామృగాక్షికి నిజాధిపుతోడ సుఖంబుగల్గ ది
చ్ఛావిధిఁ జేయు జారజనసంగతిగాకని యెంచు నిచ్చలున్. 245
గీ. ఇవ్విధంబున నప్పూర్ణిమేందువదన
యన్యసంభోగసుఖలేశ మబ్బెనేని
యాకసంబైన బేధించి యవలబోవు
నంతకుఁ దెగించియున్న యయ్యవసరమున. 246
క. వారింటిదేవపూజా
కారిత్వము బూని వేదఖనియై వినుతా
చారుండై సుగుణనిధీ
చారణుఁడన నొక్కబ్రహ్మచారి చెలంగున్. 247
గీ. గున్నయేనుంగు మదరేఖగూడినట్లు
తావియామని కెనసి దారి ధవళ
శరుఁడు పదియాఱుకళలతోఁ గదియుకరణి
వాఁడు నానాట నిండుజవ్వనముఁ గాంచె. 248
గీ. అపుడు జారగవేషణాయత్తమైన
లోలహృదయంబు వానియుద్వేలకాంతి
కవయవో లక్ష్యదేహంబు గాంచి నిలిచి
త్రిమ్మటలు బట్టు బడలికల్ దీర్చుకొనియె. 249
సీ. మునుపటివలె నుండజనదుగా యికనొక్క
చెలి బెండ్లియాడంగవలదె యనుచు
నితని కిత్తరి బెండ్లి యేటికి యింకభో
గముచెల్వ లున్నారుగద యటంచు
పఱచులేవారిచిత్తరముభావించి చూ
డగ క్రొత్తకోడెకాఁ డౌట యనుచు
వెఱవనేటికి నట్టివిద్యలచవియెఱుం
గఁడుగాని చొరబారగలఁడటంచు
గీ. నొంటిపాటునఁ బలికి యాయువిదయమ్మ
చెల్ల యీమాట లెవ్వరిచెవులఁ బడెనొ
యనుచు నాలుగుదిక్కులు నరిసిఁ జేరి
వాని నెమ్మది నొకవింతవలపు నెఱపు. 250
క. ఈరీతి నవ్వధూమణి
చారణు లోఁబఱచి యొకనిశావేళ తమః
పూరితమగు నొకయింటన్
చేరిచికొని యిష్టకార్యసిద్ధింగొనియెన్. 251
క. కని యదిమొదలుగఁ ద
త్యనుపమసౌఖ్యాబ్ధి నోలలాడుచు మరునిం
దనబంటుగాఁ దలంపుచు
ఘనతరగర్భమున కన్నుఁగానక మెలఁగెన్. 252
క. అంతట బాలామణియగు
శాంతం బోషింప మఱచి చారణనిమగ్న
స్వాంతత్వము జెందిన త
త్కాంతామణినడక లెల్ల గాంచిన యదియై. 253
గీ. శాంతయును బాలయయ్యునుఁ జతుర యగుట
దీనికి భయంబుఁ జూపినగాని తనకుఁ
బోషణము చేయదిది యని బుద్ధిఁ దలఁచి
యోర్చికొనియుండి యంతట నొక్కనాఁడు. 254
చ. జనకునిఁ జేరి యాతనికి సంతసమయ్యెడుమాటలాడి, సొం
పెనయగ నీవుగాక మరి యింకొకతండ్రి గలఁడు నాకుఁ బొ
మ్మని పలుక న్వినిశ్చలతరాద్భుతుఁడై మదిఁ జెందు సందియం
బునఁ దలపోసి యాసచివపుంగవు డెంతయు నాదరింపుచున్. 255
గీ. ఇంక నొకతండ్రిగల దంటి విందువదన
యతనిఁ జూపెదవే యన్న నవ్వధూటి
మంచి దీరేయి జూపెద నంచు బలికి
యవలి కరిగిన యమాట లాలకించి. 256
క. ఆలోలాంగన తనదగు
శీలం బిది యెఱిఁగి పలికిఁ జెప్పగఁ బూనెన్
బోలు నని తలచి మిక్కిలి
జాలింబడి కొంతఁ బిలిచి సత్ప్రియరీతిన్. 257
గీ. అనునయించిన నబ్బాల యైననేమి
నన్ను బోషించెదేని యంతయును మఱపుఁ
దాల్తునని పల్కె నింక నత్తరుణి జనక
భావసంశయ మెట్లు బాపంగవలయు. 258
క. అనిపలికి యూరకుండిన
కనుఁగొని యౌరవ్యజలజగంధయు ఘనచిం
తొనరించి తెలియఁజాలక
వినుపింపు మటన్న కీరవిభుఁ డిట్లనియెన్. 259
వ. అంత నిశీధినీసమయం బగుటయు, నమ్మేథానిధివిభావధీరత తమఃపుంజంబగు కేళిమందిరంబున లోలాసమేతుండై యుండి యబ్బాలికం బిలచి ద్వితీయజనకుం జూపుమనిన నాశాంత యత్యంతమౌగ్థ్యంబు దాల్చి తదీయచ్ఛాయ జూపిన నతండు నవ్విలోలం జూచి యేతద్బాలికాలాపంబులకు నీయందు సందియంబుఁ జెందితినని తద్వృత్తాంతం బంతయుం దెలిపి పతివ్రతాశిరోమణియగు నీ కిట్టిగుణంబులు పుట్టునే యని బహూకరించెం గావున నయ్యమాత్యకుమారికకుం గలయగణ్యనైపుణంబు గలిగినంగాని ధరణిభుజంగుని సంగతికిం జనగూడునే యనునంతలో నరుణోదయంబైన ప్రభావతీలలితాంగి శుద్ధాంతంబున కరిగి క్రమంబున దినావసానం బగుటయు. 260
చ. జలకములాడి జీని బురుసాజిగిచీరె ధరించి గుబ్బలన్
గలప మలంది కన్నుగవ కాటుకరేఖ యమర్చి కస్తురిన్
తిలకము దీర్చి భూషలును దేహమునందు నలంకరింపుచున్
కలవలరాజుఁబోలు నరనాథుని జేరగ నేఁగు నత్తరిన్. 261
క. చని నాఁటిరేయి నరపతి
నెనయన్ దద్గేహసీమ నేఁగెడుదానిన్
కనుగొని యనియెన్ గీరం
బును దనపల్కులను నమృతముఁ గులుకంగన్. 262
ముప్పదితొమ్మిదవకథ
క. కలహవిజృంభణబాహా
బలనిర్జితశత్రురాజబలుఁ డతిలోకో
జ్జ్వలచిత్రసేనుఁ డప్పురి
చెలువొందగ నేలు చిత్రసేనుం డనఁగన్. 263
గీ. అతఁడు నాతనిదేవేరి నతులదివ్య
లక్షణాకృతి సయ్యాదిలక్ష్మిఁ బోలి
వెలయు సుబలాంగనయు సముద్వేలలీల
నేకకంఠత నిద్ధాత్రి యేలుటయును. 264
వ. అప్పు డప్పార్థివపుణ్యదంపతులు పరస్పరపరమస్నేహంబున చందచంద్రికాప్రకారంబున కుసుమసుగంధన్యాయంబున రత్ననిర్యత్ప్రభావంబునం బ్రవర్తిల్లుచు నుండునంత నక్కాంతారత్నంబు వెండియు. 265
చ. అలుక ఘటించ దెంత పనియైన మనంబున, నొవ్వ జల్లుగాఁ
బలుకదు చేటికాంగనల పట్టునకైన, విభుండు గోరిన
ట్లలవడ సేవ సేయు సమయం బెటువంటిదియైన రాజకాం
తలు తనతోడివా రిది గదా కులధర్మ మటంచు నెంచగన్. 266
వ. ఇంతియె కా దాకాంతాతిలకంబు నిరవధికసౌభాగ్యంబు దెలియ నొకనాఁడు నిజాంతఃపురవరారోహాసహస్రంబులు గొలువ నాళీజనంబులతో నిష్టాగోష్ఠి విహారంబులు సలుపుచున్న యెడ. 267
సీ. ఒకబాలచంద్రఖండకళాలయకపోల
నీరుమోసిన వింతతీరుఁ జూచి
యొకచాన సంతతానికదానగజయాన(?)
పురుఁడోమఁగ రహించు హరువుఁ జూచి
యొకకాంత కుందకోరకకాంత(రచయుక్త)
బాలింతయైయున్న బాగుఁ జూచి
యొకభామ వికచచంపకదామతనుధామ
బిడ్డ నర్మిలిఁ బ్రోచు బెడఁగుఁ జూచి
గీ. యతిశయానందకరము పుత్రాప్తి కంటె
వేఱె యొక్కటి గలదె భావింప ననుచు
ననుఁగు నెచ్చెలిపిండుతో నవ్వధూటి
వేడుక రా లరముచ్చట లాడియాడి. 268
చ. ఇల గలపుణ్యతీర్థముల కేఁగి వ్రతంబు లొనర్పుతీర్థవా
సులకు సమస్తవస్తువులు చూర లొసంగ కుటుంబభోజనం
బులు ఫలదానముల్ నడపు భూసురకోటికి ప్రాక్తనంబుతా
కొలలు హరింప నక్కుసుమకోమలీనాథు ననుజ్ఞ మున్నుగన్. 268
వ. ఇత్తెఱంగున సుపుత్రోదయకారణంబులగు బహువిధశుభవ్రతంబు లాచరింపుచున్నయెడ నొకనిశీథినీసమయంబున. 269
గీ. పతియు దానును సురతానుభవమువలన
అంగమునబుట్టు బడలిక లపనయింప
మృదులతరతల్పనమునబొంది నిదురజెంది
మేలుకల గాంచి యంతలో మేలుకాంచి. 270
క. తనప్రాణవల్లభునకున్
గనకలతాతన్వి గనినకల తనవాలుం
గనుఁగొనల సిగ్గుఁ గుల్కుచు
వినుపించిన యవ్విభుండు విస్మయమతియై. 271
క. ఇక్కల నిక్కను యగుచున్
ఱెక్కలుగలజక్కి నెక్కు రేఖావంతున్
జిక్కపరచు నవమోహము
నొక్కరునిన్ గొమరు గొంచెదో యెలనాఁగా! 272
గీ. అనిన మో మరవాంచి బింబాధరమున
గందళించిన చిఱునగ వందగించ
సేమమునగాను నోచిననోములెల్ల
పండెనేమోకదా యని యుండునంత. 273
గీ. చిత్రసేనపక్షీంద్రుతో శితమునీంద్ర
శాపసంప్రాప్తుఁడైన వైశ్వానరుండు
జగతి నిక రాజవంశాఖాచంద్రుఁ డగున
టంచు దైవజ్ఞు లెఱుగింప నాక్షణంబ. 274
క. ధీరులు దెలుపఁగ మది చెలు
వారందగు సుబలతోడ నతులితసదన
ప్రారంభవేళ నకులున్
గోరి ప్రసన్నునిగ జేసికొని వినయోక్తిన్. 275
క. తనయాభిలాష దెల్పుచు
మనమలరన్ వేడుకొనినమాత్రనె యతఁడే
నెనయ భవద్గర్భంబునం
జనియిత్తునటంచు వర మొసగి చనునంతన్. 276
వ. అది గారణంబున. 277
క. కలవాణీమణి సుబలకు
నెలమసలినపిదప రెండునెలలై మఱియున్
నెల యొండుగడచినంతన్
చెలువకు నెమ్మేన గర్భచిహ్నోదయమై. 278
చ. వెలవెలనైననెమ్మొగము వృత్తగురుస్తనగోరకాగ్రముల్
నలుపువహించె నిమ్నతరనాభి బయల్పడియెన్ వళీతరంగరే
ఖలనగుముత్యముల్ దొలఁగె కౌ నొకయించుక గాఁగ నాభయాం
కలుతరచయ్యె నవ్వికచకంబుదళాయతనేత్ర కెంతయున్. 279
క. ఈరీతి న్నవమాసము
లారామామణి ధరించి యతులితసుముహూ
ర్తారంభవేళ గనె సుకు
మారున్ సుకుమారతనురమాసుకుమారున్. 280
వ. అట్టియెడ. 281
సీ. అనవద్యవాద్యముల నగరచేటిక
నగరసామంతు లనంగ నడిచె
బ్రతికెదమని కోరి మతి నుల్లసిలు విప్ర
వరులకు బంగారువాన గురిసె
పట్టణక్షోణి నాబాలవృద్ధాదులౌ
ప్రజలకుఁ జక్కెఱపంటఁ బండె
గడిదుర్గములనుండి కడుచూడఁజూలని
యరివీరులకు గుండె లావలించె
గీ. నెంచఁదగియున్న వియ్యంపుటింటిరాచ
కులము మన్నీల కింతైన బలిమి గలిగె
కోపనారత్న మగుసుబలాపురంద్రి
కడుపునను పుత్రతిలకంబుఁ బొడమె నపుడు. 282
గీ. అంత నారాజవరుఁడు శుద్ధాత్ముఁ డగుచు
వసుధ మెచ్చంగ పుత్రోత్సవం బొనర్చి
ప్రోడలగుభామినీమణుల్ పురుడు దీర్చ
జాతకర్మాధికృత్యముల్ సంఘటించి. 283
క. పేరొసంగె చిత్రభానుమ
హారా జనగురుననుజ్ఞ నలబాలునకున్
వేరుకలహంసగమనల
వారతరతనాలతొట్లు నలరించె వెసన్. 284.
ఉ. పొన్నపుసన్నపుంబనుల చొక్కటమౌ దగతొట్ల వూఁచి నా
యన్నకులాలి నన్ను గని నయ్యకులాలిసిరుల్ దొలంకువాల్
గన్నుల బుచ్చిపాపనికి లాలి మరందము గ్రమ్మరించు విల్
గన్నవజీరుగన్నవగకానికి లాలి యటంచు భామినుల్. 285
గీ. ముద మొదవ బాలుఁ డిట్టు లభ్యుదయలీలం
బెరిగే నానాఁటివిదియచందురునిబోలి
వినయగాల భీకర్యవివేకముఖ్య
సరసగుణముల నానాఁటఁ బెరుగుచుండ.286
సీ. అభ్యసించె చతుర్విధామ్నాయబహువిధ
కావ్యబాహాటాది గ్రంథములును
సాధించె ఖురళికాస్థలిని ముప్పదిరెండు
నాణెంబులైన విన్నాణములను
వాయించె వల్లకీవాదనాదసమస్త
సంగీతబహురహస్యక్రమములు
నేర్చె మదోద్ధతానేకపజవతురం
గమరథారోహచంక్రమనిరూఢి
గీ. తెలిసి సామాద్యుపాయశక్తిత్రయములు
కనియె రాజన్యనీతి ప్రకాశనీతి
రాజమాత్రుండె యమ్మహోరాజతీవ్ర
భానుమద్ద్యుతి యాచిత్రభానునృపతి. 287
వ. ఇవ్విధంబున నవ్వసుంధరావరకుమారకంఠీరవుండు నిరవధికభోగభాగ్యోదయుండును, నిరుపమానమహైశ్వర్యధుర్యుండును నిరవద్యసకలవిద్యాప్రవీణుండును నై యుండునంత. 288
క. కుందనమును నెత్తావియు
.....................................
యిందుముఖీకందర్పున
కందంబుగ యౌవనోదయ మ్మెదిరించెన్. 289
గీ. అంత తలిదండ్రు లత్యంతహర్ష మెసఁగ
మంచికళ్యాణవేళ సన్మానలీల
పంచకళ్యాణ మొనరించి పట్టభద్రుఁ
జేయ జగతీసురేంద్రుఁడై చెలగుటయును. 290
క. ముయ్యాడుముద్దుగుమ్మలు
వెయ్యాకులుగల రయారె వీరినగరి నో
తొయ్యలి వీరందఱిలో
నెయ్యము మదిఁ దొంగలింప నీరై ప్రేమన్. 291
గీ. తొడరి నినువిన్న యదిమొదల్ కడువిరాళి
నితఁడు మకరాంకశరశతక్షతశరీరుఁ
డయ్యె నీచేతిదింకనే యంచు బల్కు
సెలవుల నొకింత చిఱునవ్వు చెంగలింప. 292
క. తలవాంచి సమ్మతం బగు
తలఁపున నుండునెడ నుదయధరణీధరది
క్తలమున రవి యుదయించిన
మలమల దానగరుఁ జేరి మాపటి వేళన్. 293
క. కనకోపమాంగి చిలుకన్
గనుగొని మనరాజమౌళి కథ దెల్పితి వెం
తని నిన్ను మెత్తునిక నా
పెనిమిటి జననంబు దెలియ ప్రియమగు ననుడున్. 294
నలుబదియవకథ
గీ. చిలుక చిలుకలకొలికితోఁ జెప్పఁదొడఁగె
అమ్మ! వినవమ్మ తారకాచలమునందు
నొక్కనాఁడు మహాదేవుఁ డుబుసుపోక
శ్రీకరోద్యానవనవాటిఁ జేరి యచట. 295
సీ. ప్రమథు లిర్వంకల బలసికొల్వఁగ రుద్ర
కన్యకామణు లూడిగంబొనర్ప
భృంగి హాస్యక్రియారీతి నృత్యము సల్ప
చండీశ్వరుఁడు గుణస్తవ మొనర్ప
విఘ్ననాథుఁడు పురోవీథి ముద్దులు చూప
శరసంభవుఁడు బరాబరి యమర్ప
నందివాహనము చెన్నొంది మ్రోల నటింప
వీరభద్రుఁడు జయోద్వృత్తిఁ దెలుప
గీ. తండులాస్యంబునకుఁ దరుల్ తగఁ జిగుర్చు
నట్లు గాంధర్వరసపూర్తి నలరుజాయ
నంబికాదేవితోడ నెయ్యమున నభవుఁ
డుచితసింహానస్థుఁడై యుండునపుడు. 296
క. అమరేశ్వరాదిదిగధిపు
లమరవరుల్ జపతపోమహర్షులు దమకున్
సముఖంబు లేమి దృఢ భ
క్తి మరిన్ తమకడకుఁ జేరి ద్రిమ్మరువేళన్. 297
సీ. పసుపంటుజిలుగుదుప్పటి యంచుముత్యముల్
వరుసఁ గన్పడు వల్లెవాటు దనర
చెంపనించుకజారు సిగనొప్పు సంపంగి
మడుపుటెత్తులతో రుమాలు మెరయ
ఘర్మాంబుబిందు సంగతి నొకింత రంగు
బొట్టు కస్తూరితావి బుగులుకొనఁగ
వెలిదమ్మిఱేఁకులు తెలివిఁగుల్కెడు దీర్ఘ
నేత్రాంతములఁ గొంత నిదురదెలుక
గీ. కరములను నీరు కలవొట్టు కప్పురంపు
విడెము పుక్కిట కడుచిక్కుపడినహార
లతయుగంబునఁ బొసఁగ నుల్లాస మొసఁగ
వచ్చె నలకూబరుఁడు దుర్వారుఁ డగుచు. 298
చ. అపుడల పార్వతీరమణుఁ డన్నలకూబరుఁ జూచి జాతికొం
చెపువగ నేగుదెంచె నని చాల మనంబున నెంచి యోరి! నీ
వపరిమితప్రమత్తుఁడ వహంకృతిచిత్తుఁడ విట్టు లంతరం
గపు కొలునైనవేళ మముఁ గానఁగ నర్హుఁడవే గణింపఁగన్. 299
క. నీ వధమవర్తకుఁడవు
గావున మాసముఖమ్ము గడియం దగునే
భూవలయమ్మున మర్త్యుడు
వై వర్తిలు మనుచు శంభు వానతి యొసఁగెన్. 300
వ. మనమునఁ గడు బెగడొందుచు
విని ధనదసుతుండు సభయవిహ్వలమతియై
యనియెం బ్రణమిల్లి జగ
జ్జనకా! యీత ప్పొకింత సైపుమటంచున్. 301
లయ గ్రాహి. శంకర నిశాచర భయంకర శివాహృదయ
పంకరుహభృంగ లకలంకకుచిమద్వీ
క్షాంకురతటస్థమకరాంక! [1](వృషభేశ్వర శు)
భాంక! మకుటస్ఫుటమృగాంకనవరేఖా
లంకరణ! భక్తజనపంకహరణా! భనవి
సంకటకళంకహర! కింకరు ననున్ క్షే
మంకరుఁడవై మనుపు మంకిలి యొనర్పక ని
రంకుశకృపారసవిశంకట! నమస్తే. 279
క. పరమగురుద్రోహి ననుం
గరుణించఁ గద యనన్య(గతికుఁడ ననినన్)
గిరిజావల్లభుఁ డతనికిఁ
గరుణామతి నిట్టులనియెఁ గడుప్రియ మెసఁగన్. 280
ఉ. మే మొకమాట దెల్పెదము మించి మదీయవచోవిశేషసం
రామహిమం బొకింతయును దప్పదు తప్పక యున్న నేమి ల
క్ష్మీమహనీయవైభవసమృద్ధియు బుద్ధియు మోహనాంగరే
ఖామహిమంబు నీకుఁ గలుగం గృప సేసితి నమ్ము నెమ్మదిన్. 281
క. విమలమతుల్ మద్భక్తులు
సుమతీహరదత్తు లనఁగ క్షోణిం గల రా
రమణీరమణులకు మనః
ప్రమదముగ జనింపు మమితభాగ్యోన్నతివై. 282
తే. అన విని మహాప్రసాదం బటంచు వచ్చి
యిందుశేఖరు నానతి నిందుఁ (బొడమె)
మదను నాహ్వయమునను నోమగువ! వైశ్య
తల్లంజుండైన (నీ) ప్రాణవల్లభుండు. 283
క. వింటివొ యన నల భామిని
గెంట తల యూఁచి మెచ్చి కీరపరుని నీ
వంటి మహామహు డుండఁగ
వింటి మనోభీష్ట మెల్ల వెలయఁగ గంటిన్. 307
గీ. ఎంత సుజ్ఞాననిధివి నీ వెంత ఘనుఁడ
వెంత నిను మెత్తు నని పల్కు నంతలోన
చుఱుకు చుఱుకున నరుణవిస్ఫురణ మెఱయ
కరకరని తోచె తూర్పున ఖరకరుండు. 308
ఉ. ఆల్ల ప్రభావతీరమణి యంత నిశాంతముఁ జేరి నాఁటిరే
యల్లన కుందనంపుజిగియందపు మైఁగయిసేసి నేటి కీ
హల్లకభల్లతీవ్రనిశితాస్త్రహళాహళి కోర్వజాల రం
జిల్లఁగ రాజశేఖరుని జేరి సుఖించెద నంచు నెంచుచున్. 309
గీ. రామచిల్కకు మేలోగిరంబునాన
వాలుచక్కెరరసదాడిపాలచెఱుకు
లరఁటిపం డ్లిడి పసపార్చి యక్కు చేర్చి
సెల వొసంగుమన్న నాముద్దుచిల్క యనియె. 310
నలువదియొకటవకథ
క. రంభవు నీవు విలాసవి
జృంభణమున నిన్ను గనిన చిత్తజుఁ డైనన్
శుంభద్రతితంత్రకళా
రంభమునకుఁ దానె కదిసి ప్రార్థించుగదే! 311
సీ. ఇంద్రాదిదిక్పతులైన నీవడిపంచ
బడి యందలములలోఁ బరివసింప
పోటుబంటులు నిజాద్భుతరణప్రాభవం
బులు గోరికొనుచు నీ కెలను గొల్వ
సోమయాజులు బహుస్తుతులు చేయుచు ప్రేమ
బొదలని ముంగిట నొదిగియుండ
సన్యాసు లతనుజర్జరితసర్వాంగులై
యలర నీపాదంబు లాశ్రంయింప
గీ. అందఱికి నన్నిరూపంబు లగుచుఁ జెలఁగి
భువనమోహనశృంగారభవనమైన
నీమహిమ నీ వెఱుంగక నేఁటి కిట్టు
లొక్కనృపమాత్రునకుఁ జిక్కి యుండఁదగునె. 312
క. అని పల్క నద్భుతంబుగ
విని సురలోకముననుండి వెస నే నిచటన్
జనియింప నేమిగారణ
మనుడు ప్రభావతికి యల శుకాగ్రణి యనియెన్. 313
క. నలకూబరుండు హాలా
హలకంధరు నాజ్ఞ నిచటి కరిగెడునాఁ డో
లలనా! నీవు పితామహు
కొలువునకుం జత యమర్చికొనియెద వచటన్. 314
గీ. అమ్మహాప్రభుఁ బొడగాంచి "యజ్ఞభవ! పు
రాణపురుష! సరస్వతీప్రాణనాథ!
సకలజంతువినిర్మాణచతురహృదయ!"
యనుచు కైవార మొనరించి యాతురంబ. 315
సీ. కాశ ధరించి రంగస్థలంబున నిల్చు
చెలువ మాయజుఁడైన తలపఁగలఁడె
సభ విస్మయమునొంద యభినయము ఘటించు
మెలకువ గురుఁడైన మెచ్చఁగలఁడె
కరలక్షణప్రయోగరమణచాతురి
యభినుతింపఁగ, శేషుఁడైనఁగలఁడె
కలికికన్నులకటాక్షంబు లంభోజాత
శరుఁడైన మరలింప చాయఁగలఁడె
గీ. ఔరయని చూచువారెల్ల యభినయింప
కలికివాల్ జూపులను శిరఃకంపనముల
యొరపుటెలనవ్వు ముద్దు మైసిరి బెడంగు
మించ నటించుటయు న వ్విరించి గాంచి. 316
గీ. మెచ్చితి వరంబు వేఁడు మో మచ్చకంటి
యనుచు వచియించువేళ నీయనుగుచెలి యొ
కర్తె నలకూబరుఁడు ధాత్రి గదియువార్త
విన్నవించిన మదిలోనఁ జిన్నఁబోయి. 317
చ. కడు బెగడొంది సోగతెలిగన్నుల గుల్కెడు నీరు గ్రుక్కు
చున్, సిడిముడుపాటుతో నలకుశేశయగర్భపదాంబుజద్వ
యం, బిడి కడతేర నీవిరహభారభరం బిక మద్భుజంగు నె
న్నడు గనుగొందు నొక్కొ కరుణామతి నానతి యిమ్ము నావుడున్. 318
ఉ. నీనయమార్గవైఖరికి నే మది మెచ్చితి నీలవేణిరో
నీనలకూబరుండు ధరణీస్థలికిన్ శివునాజ్ఞ నేఁగుటన్
పూని త్వదీయమోహపరిపూర్ణమతిన్ వెతనొందియున్న ని
న్నా నవమోహనాంగు నెనయన్ సమకూర్చెద నమ్ము నెమ్మదిన్. 319
గీ. అల్ల హరునాజ్ఞ దప్పింప నలవిగాదు
కాకయుండిన నేమి భూలోకముననె
నీకు నలకూబరునితోడ నిర్జరేంద్ర
పురి ననుభవించునట్లుగ నెఱి నమర్తు. 320
ఉ. కావున నీమనంబునకుఁ గాక వహించఁగ నేల పొమ్ము ధా
త్రీవలయమునం దవతరింపు మటంచు వచించునంత నాఁ
డీవరవైశ్యవంశమున నేపుదలీిర్ప జనించినావు రం
భా వనజాక్షి వీవ మితభాగ్యశుభోన్నతివో ప్రభావతీ. 321
క. అనిపల్క జగచ్ఛక్షుం
డనువీరనృసింహుఁ డుగ్రుఁడై తిమిరమహా
దనుజేంద్రు నేపడంచుట
గని కాంత నిజాంతిపురము గదిసె నరేంద్రా! 322
గీ. అలప్రభావతి మఱునాఁ డహఃపయోధి
నానృపాలుని నవమోహనాంగసంగ
మైకవాంఛాపదము నొయ్యన తనించి
మించి కురుమాపు నెఱసంజ మెఱయునంత. 323
చ. చిలకలకొల్కి మేన గయిసేసి నృపాలునిచెంతఁ జేరగాఁ
దలచి శుకాధినాథునరుతన్ వెసనిల్చినమాత్రశూన్యది
క్తలమున గౌళి నిల్వబలుకన్ విని సంశయమంది కుందుచో
చిలికెడుప్రేమ నిట్టులను చిల్క సుధారసధార లొల్కగన్. 324
నలువదిరెండవకథ
గీ. దుష్టశకునము విననయ్యె తోడ నేమి
యనుభవించంగవలయునో యని తలంచి
మిగుల దిగులొంద నేటితో మీననయన!
యదియె మంచిదటంచు నీమది గణింపు. 325
క. అది యెట్టు లనిన విను నె
మ్మది చెలంగ నీవిభుఁడు మమతం మఱిడె
బ్బదినాళ్లనాటి కిలుజే
రుదు నని వాక్రుచ్చి చను టెఱుంగవె మగువా! 326
వ. కావున. 327
ఉ. నేఁ డతఁ డిల్లు జేరు రమణీ! వెస డెబ్బదినాళ్లు సెల్లె నీ
పోఁడిమి నీ వెదుర్కొని విభుం గని మ్రొక్కి రహస్యలీల నీ
వేడుక లుప్పతిల్ల తనువిందొనరించి ప్రియంబునన్ రతి
క్రీడల దేలవమ్మ సుచరిత్రలు ని న్ననయంబు మెచ్చఁగన్. 328
వ. అని వచియించుచిలుకం గనుగొని ప్రభావతి యిట్లనియె. 329
గీ. కంటిపడ వేసుకొంటి నోకథలకారి
ముద్దురాచిల్క నిను నమ్మి మోసబోతి
నింక నే మనగలదాన నేమి సేతు
ననుచు దీనానులాపంబు లాడుటయును. 330
క. ప్రాణ మనిత్యము నిత్యము
మానంబని కావు ప్రాణమానంబులలో
మానమె కాయందగు నను
మానం బిక నేల నిలుపు మానం బనియెన్. 331
వ. ఆసమయంబున. 332
సీ. బహువిధసంభారభారముల్ తోనున్న
పెరికిటెద్దులుగుంపు లొనసిగొనఁగ
స్ఫుటసుగంధజలప్రపూర్ణములైనట్టి
కంచికావళ్ళశృంగార మెసగ
భాస్కరపండితప్రముఖదేవబ్రాహ్మ
ణాళి యాశీర్వాదనాద మెసఁగ
భవ్యసాధ్వీహస్తపాదార్పితంబులై
వితతవైఖరుల నారతులు బొసగ
గీ. బహువిధంబుల రాజవైభవము మెఱయ
బంధు లిరువంక నొరయ సౌభాగ్యలీల
తననగరు జేరె శుభముహూర్తమున వేట్క
వెల్లివిరియంగ మలయజావల్లభుండు. 333
క. అంతట తత్కాంతామణి
పొంతన తనప్రాణవిభు పొడగనియు మహీ
కాంతునిరతి సమకూడని
చింతన్ వెసకానరాని శృంగారమునన్. 334
గీ. జారి మండికొనినచందాన తనమేని
చెలువ మపుడు పతికి సెలవు చేసి
గంటుతోడ మిత్రగణ మెన్న సమధిక
శ్రీల కాపురంబు చెలఁగుచుండె. 335
వ. తదనంతరంబ. 336
చ. తనతలిదండ్రులం గని యథావిధి భోజన మాచరించి పెం
చిన శుకసార్వభౌముని భజించి ప్రియం బొనరించి సౌర్వభౌ
మున కతిలోకవస్తువులు ముంగలకానుకగా నొనర్చి పే
ర్చినముద మొప్ప నమ్మదనసేనుఁడు నెమ్మది నుండు నంతటన్. 337
క. చిలుక దను మోసబుచ్చుట
యలమిన్ తద్వైశ్యవరుఁ డిలు సేరుటయున్
కలకంఠీమణిదూతియు చని
తెలుపన్ విని యన్నరేంద్రతిలకం బలుకన్. 338
ఉ. హల్లకపాణిపొందు మది నర్మిలిగోరుట చందమామ గ్రు
క్కిళ్ళయినట్టులయ్యె పవళింపగ నేఁ డిక నేమి సేతు నీ
పల్లవికార్యసంఘటనభావ మెఱుంగక యింత సేసె నా
యుల్లము తల్లడిల్లెడు నయో యని మోహవిషాదవేదనన్. 339
క. ఈరీతి నుండనేమో
కారణమున కీరమయ్యె గావలె దీనిన్
జేరి యది తెలియదగునని
యారూఢి వివేకశాలియై విభువిభుఁ డెలమిన్. 340
గీ. మదనసేనునియెఱుక నమ్మదనుతేజి
నంతిపురిలోన నపరంజి యరిది పనుల
వింత నొకమేడనుండి యేకాంతవేళ
సమ్ముఖంబున రావించి సవినయముగ. 341
క. ఓరాజకీరశేఖర!
నీరసికత మది గణించనేర్తునె యని నీ
వేఋషియంశంబున యవ
తారము నొందితివొ విబుధధర్మము వెలయన్. 342
చ. అనుటయు సంతసించి వసుధాధిపునిం గని చిల్క పల్కు నో
యనుపమశౌర్య! నే శుకమహర్షివరేణ్యుఁడ నీప్రభావతీ
వనరుహగంధి ప్రాక్తనభవంబున మమ్ము భజించియుండె నా
నెనరున సంధిలన్ గనుగొనన్ జనుదెంచితి నీశుకాకృతిన్. 343
ఉ. వచ్చి ప్రభావతీవికచవారిజలోచన మమ్ము గొల్వ నే
నిచ్చరహించువేళ జగతీశ కులార్ణవపూర్ణచంద్ర! నీ
వచ్చినప్రేమ నన్బిలువనంపుట కెద్ది గతంబు తెల్పవే
మచ్చిక నన్న యానృపకుమారుకు డత్యనురాగవైఖరిన్. 344
వ. ఆప్పు డయ్యప్రతిమప్రభావంబుగల లీలాశుకంబునకు సకలవివిధోపచారంబుల సమంచితోపమకుటసబహుమానంబుగా యతని సాక్షాద్దైవమని మనంబున భావించి ప్రదక్షిణప్రణామసంభావనపూర్వకంబుగా మృదుమధురగంభీరభాషణంబుల నిట్లనియె. 345
ఉ. కామకళాశుభాకరశుకప్రవరున్ గనుగొంటి నేడు నా
బాములు వీడుకొంటి నను ప్రాఙ్ముఖుఁ జేయదలంచికొంటి నా
స్వామియు నీవెకా మఱి కృతార్థుఁడ నీదుసుబుద్ధి వింటె నిం
కేమి యొనర్తు దెల్పగదవే యన కీరవరేణ్యుఁ డిట్లనున్. 346
క. వామాక్షీజనమోహన
కామాంధుం డైనయతనికథ విను మును సు
త్రామముఖు లనుభవించిన
బాముల మది దెలియు మోనృపాలకతిలకా! 347
సీ. కాకుస్థకులుఁడవై కలనృపుల్ నినుగొల్వ
మఖుఁ డేజగద్ధితమహిమ నొందె
పడరాని యిడుముల బడియు బొంకు నెఱుంగ
కలహరిశ్చంద్రుండు నలసి యలసి
యల్ల విశ్వామిత్రు డతిబన్నములవెట్ట
రాజమార్తాండుఁడై గ్రాలెగాదె
సామ్రాజ్యవైభవశాశ్వితుఁ డయ్యును
జనకుఁ డత్యంతసుజ్ఞానదీప్తి
గీ. యతులితోత్సాహవిదితమై యలరునట్టి
మహిమ వెలయు సద్భక్తసామంతశాలి
వగుచు వైరాజ్యవంతుఁడవై సమస్త
రాజ్య మేలగదయ్య యోరాజవర్య! 348
గద్యము. ఇది శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధారపాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబయిన శుకసప్తతియను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము సర్వము సంపూర్ణము.
- ↑ వృషభేశ్వర నమశు (పూ)