శుకసప్తతి/కథాప్రారంభము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క. చండద్యుతినిభమణిమయ
కుండలున కజాండభాండకోదండకళా
మండలపండితదనుజా
ఖండలఖండనసమర్థఘనకాండునకున్. 81

క. భర్గేష్వాసనదళనా
నర్గళదృఢబాహువీర్యునకుఁ బూర్వవచో
మార్గచరిష్ణుమునీశ్వర
వర్గప్రణుతానివార్యవరచర్యునకున్. 82

క. షడ్వదనజనకసుమనో
రాడ్వినుతచరిత్రునకును రాజద్గాత్ర
త్విడ్విజితాదిత్యునకు వి
రాడ్విగ్రహధామునకును రఘురామునకున్. 83

కథా ప్రారంభము

వ. అభ్యుదయ పరంపరాభివృద్దిగా నాయొనర్పంబూనిన శుకసప్తతి యనుమహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. 84

క. వెలయు నలఘుప్రభావో
జ్జ్వలుఁ డింద్రప్రస్థపురి నసామాన్యమహః
కలితదృఢబాహుబలని
ర్దళితాహితరాజు ధర్మరాజు ధరిత్రిన్. 85

చ. అతఁ డొకనాఁడు నిండుకొలువై బలవైరిమహోన్నతి న్మరు
త్సుతుఁడుఁ గిరీటి మాద్రితనుజు ల్తనదండన యుండి కొల్వ రా
జతతికిరీటకోటివిలసన్మణిమంజులదీప్తిపుంజరం
జితచరణుండు ధర్మజుఁడు చెంత వసించిన ధౌమ్యు నిట్లనున్. 86

క. తెలివి గలభూసురుండవు
కులగురుఁడవు మాకు మౌనికుంజర! వినుమీ
యలఘుమతి నొక్కకార్యము
తెలియ న్వివరింపవే సుధీజనతిలకా! 87

ఉ. భామలచిత్తము ల్దెలియ బ్రహకునైన వశంబుగాదు త
త్కామితయత్నము ల్తలఁప ధాత్రి విచిత్రము లండ్రు కావున
న్నామది యేతదీయకథనంబు వినం గడఁగె న్మహీసుర
గ్రామణి! యానతిమ్మనుఁడు రాజబిడౌజునితోడ వేడుకన్. 88

వ. అప్పు డాభౌమ్యమహర్షివర్యుండు నిరవధికకుతూహలధుర్యుం డై యిట్లనియె స్త్రీజనంబుల చిత్తంబులు లోకాతీతదుర్వృత్తంబులు, తదీయకృతసాహసకార్యంబు లనివార్యంబు లగుట నిక్కువం బిందులకు నొక్క యితిహాసంబు గలదు. తొల్లి మహాదేవుండు పార్వతీవరారోహ కతిరహస్యంబున నానతిచ్చినతెఱం గెఱింగించెద సావధానుండవై యాకర్ణింపు మని యి ట్లనియె. 89

సీ. సౌథాగ్రతలకేళిజాగ్రన్మృగేక్షణా
స్ఫుటదృశ్యమానేంద్రపురవరంబు
జగతీదిదృక్షుభౌజగవర్గనిర్గమ
ద్వారాయితన్వచ్ఛవారిఖేయ
మబ్జినీకాంతశుద్ధాంతీభవత్ప్రాంత
సంతతోదారకాసారవార
మిందిరాసుతభవ్యమందురానీకర
మ్యామోదకారణారామసీమ

తే. యంద మగు మేరుమందరాహార్యమధ్య
తలమహీమండలమున నుద్దామభీమ
మేదురోద్భటభటసింహనాదచలిత
దిగ్గజవరంబు పద్మావతీపురంబు. 90

క. ఆనగరి న్విభవప్రతి
భానగరిపుఁ డైన చిత్ భానుం డేలు
న్మానక మృడుకరడమరు స
మానకరవ మరుల గిరులయఱుఁతం జేర్పన్. 91

మ. కలలో నైనను బల్కి బొంకఁడు సమగ్రక్రోధయోధారిరా
డ్బలముం గన్గొని చీరికిం గొనఁడు దుష్పాండిత్యము ల్నేరఁ డు
జ్జ్వలదుజ్జృంభశుభాంగవైఖరుల ఠేవన్నూత్నకందర్పుఁ డై
తలఁపం జొప్పడుఁ జిత్రభానుఁ డతఁ డేతన్మాత్రుఁడే చూడఁగన్. 92

సీ. చంద్రమతీనాథుచందాన నలునివై
ఖరిఁ బురుకుత్సునిగతిఁ బురూర
వునిమాడ్కి సగరులాగునఁ గార్తవీర్యుని
యనువున గయునట్టు లంబరీషు
పొలుపున శశిబిందువలె నంగుపోలికఁ
బృథునిభాతి మరుత్తురీతి భరతు
కరణి సుహోత్రునిహరువున రఘులీల
రామునిక్రియ భగీరథునిఠేవ
తే. శిబితెఱంగున మాంధాతచెలువమున య
యాతిరీతి దిలీపుమర్యాద రంతి
సరణిఁ బాలించి యలరు నాచక్రవాళ
వసుమతీచక్ర మమ్మహీవల్లభుండు. 93మ. అకలంకప్రతిభాప్రతాపవిభవుం డా రాజకంఠీరవుం
డొకనాఁ డంతిపురి న్సువర్ణవలభిప్రోన్మీలమై కెంపుమా
నికపుంబొమ్మల నొప్పు పెండ్లిచవిక న్నీలంపుఱాగద్దియం
బికవాణీనికరంబు గొల్వ సుముఖాప్తి న్నిండుకొ ల్వుండఁగన్. 94

క. ఇఱుకువలిగుబ్బచన్నుల
యెఱుకుం జవరా లొకర్త యెఱుకో యవ్వా
యెఱుకో యని తనచందం
బెఱుకపడంగా హజార మెలమిం గదిసెన్. 95

వ. అప్పు డప్పడంతుకతెఱం గమ్మహీంద్రుండు పరిచారికాజనంబులవలన విన నవధరించి సమ్ముఖమునకు రావించిన. 96

సీ. సవరనిపనివన్నెఱవిక పిక్కటిలంగఁ
గులుకు పాలుబ్బుగుబ్బలు చెలంగ
ముంజేతులను ముఖాంబుజమున నొకవింత
పొలుపు దెల్పెడు పచ్చబొట్టు లెసఁగఁ
గుఱుమాఁపుపయ్యెంటచెఱఁగులో నిడుకొన్న
ముద్దుఁబల్కులచిన్నిబుడుతఁ డమరఁ
దరతరంబులనుండి తనయింట వెలయు పు
త్తడిపైఁడిబుట్టి మస్తమున వెలుఁగ
తే. బొమలసందున నామంబుభూతిపూఁత
నెన్నొసఁటఁ బుక్కిట విడెంబు కన్నుఁగొనలఁ
గాటుక రహింప వచ్చి యాక్ష్మాతలేంద్రు
చరణముల కోరగా మ్రొక్కి చక్క నిల్చి. 97

క. ఇవి దారికట్టు మొనక
ట్టిది కాంతావశ్యకరణ మిది నీమది కింపొదవించు నోనరేశ్వర!
పదిలం బని తెల్పి కొన్ని బదనిక లొసఁగెన్. 98

క. తలఁపున నిది గారడ మని
తలఁపకుమా సింగఁ డల్లతఱిగొండ దరిన్
దలమోచి తెచ్చినవి యివి
తలనుంచుము పసిఁడితాయెతల నుంచి నృపా! 99

వ. అని విన్నవించిన యమ్మత్తకాశినీకరాంబురుహదత్తం బగు నయ్యుత్తమదివ్యౌషధత్రయంబు రయంబునం గ్రహించి కరుణావలోకనపరుండై ప్రియవినయగంభీరభాషణంబుల నిట్టు లనియె. 100

శా. ఏయేభూములు చూచినావె కొరవంజీ రూపలావణ్యరే
ఖాయుక్తిం దగు కొమ్మ లెందుఁ గల రీక్ష్మామండలిన్ హావభా
వాయత్తైకవిలాసవైఖరుల మేలం దెవ్వరిం జెందు న
య్యాయావార్తలు తెల్పవే మది కమందానందముం జెందఁగన్. 101

వ. అనిన విని యితండు చతుర్విధనాయికానాయకుండును బహువిధశృంగారశేఖరుండును సకలకలాధురంధరుండు నగు నని తనమనంబున వితర్కించుకొని యతని కిట్లనియె. 102

సీ. కల్కిచిల్కలపోల్కిఁ గనుపట్టు శృంగార
నటన గుల్కెడుతూర్పునాటి చెలులఁ
బులుగడిగిన ముత్యములఁ బోలి గరగరి
కలు వహించిన పాండ్యకమలముఖులఁ
జిత్ర రేఖలఁ దారసిలుచక్కఁదనముల
రాణించు కన్నడరాజ్యసతులబగడంపు జిగిసొంపు తగుతనుద్యుతి పెంపు
నలరెడు యవనశీతాంశుముఖులఁ
తే. గుందనంపుసలాకలయంద మొందు
నంధ్రకన్యల నిదిగాక యంగవంగ
కుకురుసౌవీరసౌరాష్ట్రకోకకుచల
వింతలన్నియుఁ గనుఁగొంటి విను నరేంద్ర! 103

తే. దేవ నవఖండమండల శ్రీవిజృంభ
మాణ మగునివ్వసుధఁ గల్గుమానవతుల
వరుస నందఱఁ గనుఁగొంటి వారిలోన
రేఖ గలయొక్కచెలి నేర్పరింతు వినుము. 104

ఉ. ఈనగరీవతంసముననే తగువైశ్యుఁ డొకండు శాశ్వత
శ్రీనిధిగేహుఁడై మదనసేనుఁ డనంగలఁ డద్బుతైకశో
భానవమోహనాకృతి ప్రభావతి వానిపురంధ్రి యొప్పు నో
మానవతీమనోజ! యసమానవయఃపరిపాకవైఖరిన్. 105

మ. దాని ఘనాఘనద్యుతివితానకనద్ఘనకేశపాశముం
దాని లసద్బిసప్రసవధాళధళీచకితేక్షణంబులుం
దాని సుగంధగంధిలసుధారసబంధురమందహాసము
న్మానవనాథ! మెచ్చుటకు మర్త్యు లమర్త్యలునైన శక్తులే. 106

క. ఆమృదులోరువిలాసం
బామోహనముఖవికాస మాదరహాసం
బామెడ యానడ యాజడ
యామేని మెఱుంగురంగు నలవియె పొగడన్. 107సీ. భుగభుగ వాసింపఁ బొసఁగు పుత్తడిబొమ్మ
మాటాడనేర్చిన మణిశలాక
కలికిచేఁతలనొప్పు కమ్మక్రొవ్విరిబంతి
తగుజీవకళల చిత్తరువుప్రతిమ
గమనశృంగారంబు గనుపట్టు లతకూన
కలదొలంగని తొలకరిమెఱుంగు
కరచరణాంగసంగతి గన్నశశిరేఖ
హావభావములఁ జెన్నలరు సరసి
తే. యగునని గణింప బినుతింప నలవిగాదు
దానిచరణాబ్దనఖరేఖతోను బోలఁ
గలరె యీలోకమున నున్న కాంతలెల్ల
విను మహీనాథ యేమని విన్నవింతు. 108

క. ఒకపాటి పేదసంసా
రికిఁ దగ దమ్ముద్దుగుమ్మ రిపురాణ్మణిమ
స్తకమకుటఘటితనవర
త్నకళాచకచకితచరణునకుఁ గాక నృపా! 109

క. అని విన్నవించినంతనె
మనమున నుప్పొంగి వైశ్యమహిళానవమో
హనరూపరేఖవిభవము
విని విస్మయ మంది మోహవిహ్వలమతి యై. 110

తే. ఎఱుకవగలాఁడి కోరినవెల్ల నొసఁగి
ప్రియవచోవైభవంబు గాన్పింపఁ బనిచి
కొలువు చాలించి బోటిక ల్గొలువ నంతి
పురి నొకానొక మణిసౌధమున వసించె. 111ఉ. అంతట నవ్వణిగ్వరుని యంగనపైఁ దమి హెచ్చి యామహీ
కాంతపురందరుండు రతికాంతధనుర్లతికావిముక్తదు
ర్దాంతశరాళికి న్మదమరాళికిఁ జండతరాళి కెంతయుం
జింతిలి వేదనావశవిశీర్ణమతి న్విరహార్తి నొందుచున్. 112

సీ. చెక్కిటఁ జెయి నేర్చి చింతాకులాత్ముఁడై
వనిత నేక్రియఁ దెత్తునని తలంచు
నిట్టూర్పు నిగిడించు నేఁ డయో శుకపికా
ర్బటి కోర్వలేనంచుఁ బలవరించుఁ
దనలోన తానేమొ తలయూఁచుకొని మెచ్చుం
గలవరించుచు బయ ల్గౌఁగిలించుఁ
జిత్తరువుననున్న చెలువంపుఁబ్రతిమ న
ల్లదె ప్రభావతి యంచు మదిఁ దలంచు
తే. నించు విలువంచి విరితూపు లేర్పరించి
పచ్చవన్నియచిల్కబాబావజీరుఁ
డుల్ల ముల్లోలముగఁ జేయఁ దల్లడించు
రాజముఖిమీఁదిబాళి నా రాజమౌళి. 113

ఉ. ఎప్పుడు చూడఁ గల్గునొకొ యిందుముఖీవదనారవింద మే
నెప్పుడు విందునో తెలియ దేణవిలోచన కల్కిపల్కు లిం
కెప్పుడు గౌఁగిలింతు నలయింతి కుచాద్రులురంబు సోఁక నా
కప్పుడుగాదె సౌఖ్యపర మందుటలంచు మదిం గణించుచున్. 114

క. ఉల్లము బెగడ ధరిత్రీ
వల్లభుఁ డి ట్లున్నవేళ వనితామణులం
దెల్లగుణంబుల కిరవగు
పల్లవి యను పేరుగలుగుభామ సుబుద్ధిన్. 115సీ. వసుమతీశ్వరుఁ డున్న దెసఁ జూచి పావడ
చెఱఁగున నెమ్మోము చెమట దుడిచి
సిగ పొందుగ నమర్చి చిన్నారివిడికెంపు
తాయెతు ల్చుట్టి కుళ్ళాయి వెట్టి
చెవులయంటులఁ జక్కసవరించి ముక్తావి
చిత్రహారంబుల చిక్కుఁ దీర్చి
కలపం బలంది బంగరుగట్టికమ్ముల
వలిపెదుప్పటి వలివా టొనర్చి
తే. కేలుదమ్మికిఁ గపురబాగాలుఁ బండు
టాకుమడుపులు నొసఁగి లోకాభిరామ
వార్త లొకకొన్ని నొడివి యప్పార్థివేంద్రుఁ
బలుదెఱంగుల నలరించి పలికె నపుడు. 116

క. స్వామి యవధారు మీమదిఁ
గామించు మనోరథంబుఁ గడతేర్చెద నిం
కేమిటికిఁ జింత యన విని
భామామకరధ్వజుండు పల్లని కనియెన్. 117

తే. వైశ్యభామిని లావణ్యవైభవంబు
విని విరహవార్ధి మునుఁగున న్మనుప నెట్టు
లంటు చేసెదో యమ్మచ్చెకంటి ననుచు
నిచ్చక మొనర్చి యుడుగర లిచ్చి పసుప. 118

మ. చని యప్పల్లవి వైశ్యవల్లభుని భాస్వద్దివ్యగేహాంతరం
బున వర్తిల్లు ప్రభావతిం గనఁ దదంభోజాక్షి రాజావలం
బనసౌభాగ్యము గన్నధన్యవు ననుం బాటించి యేతేఱ నే
మి నిమిత్తంబొ యటంచు నిర్మలసుధోర్మీవైఖరిం బల్కినన్. 119క. నినుఁ జూడఁగోరి వచ్చితి
ననవుడు సంతోషమయ్యె నని మణిపీఠిం
దను నిలుప రాజదూతిక
యనియెఁ బ్రభావతికి సముచితాయత్తమతిన్. 120

తే. ఎల్ల సౌభాగ్యములు గలయింట వెలసి
మిగులఁ జక్కనివారిలోఁ దగినదాన
వగుదు నీ బంధుజనము ని న్నభినుతింపఁ
గాఁపురము చేసితివి మేలు కమలగంధి. 121

వ. అదియునుం గాక పురాణదంపతు లగునీయత్తమామల సుమతిహరదత్తుల నాదరించు నీవివేకంబునకు మెచ్చితి సాక్షాన్మనోజుం డగు నీమనోహరున కనుగుణం బగునంతరంగంబునకు సంతోషించితి గురుబుధబాంధవదాసదాసీజనంబులం బోషించునీమహత్త్వంబుఁ గొనియాడ శక్యం బగునే యని వెండియు. 122

సీ. గుట్టుతో సంసారి మట్టునఁ జుట్టాలఁ
దనియింతు వని హరదత్తుతోడ
ఘనురాల చల్లనికడుపుదానవు నీవు
సుకృతశాలిని వంచు సుమతితోడ
మదనసేనుఁ డనంగ మఱి నీకే తగు నెంత
చెలువుఁడ వని దానిసెట్టితోడ
విశ్వాసమున నింట వెలయుపాటెల్లఁ బూ
నెద రంచుఁ దగిన బానిసెలతోడ
తే. నిచ్చక మొనర్చి హితవరియేపు చూపి
చొరవ గల్పించుకొని పరిశుద్ధురాలివలెనె తాఁ బోనిచో సారెపిలువనంపు
మచ్చిక యొనర్చె సమ్ముదిమాయలాడి. 123

క. అంత నొకనాఁడు రజినీ
కాంతశిలాఘటితవేదికామధ్యమునం
గొంతతడ వుండి తగనే
కాంతం బగువేళ వైశ్యకామిని కనియెన్. 124

క. ఓమధురవాణి నీమను
వేమిటనుం గడమ గాక యెంతయు నొప్పెం
దామసుఁ డగువాగ్వనితా
కాముం డొకకొంత కొదవ గల్పించెఁ గదా! 125

వ. ఆది యె ట్లంటేని. 126

సీ. బింబోష్టి నీచంద్రబింబాననము వాని
బెడఁగునోటను ముద్దువెట్టఁదగునె
కాంత నీ సిబ్బెంపుగబ్బిగుబ్బలు వాని
పరుసు చేతుల నొ త్తిపట్టఁదగునె
యబల నీకనకోపమాంగవల్లరి వాని
కఱకుమే నంటంగ నొఱయఁదగునె
రామ నీమధురాధరప్రవాళము వాని
వికటదంతముల కొప్పింపఁదగునె
తే. కొమ్మరో కుందనపుఁ గీలుబొమ్మకరణి
నొఱపుగలదాన వీవు వానరమువంటి
మగనితోఁ గూడి రతికేళిఁ బొగులఁదగునె
తగదుగా ధాత యీరీతి తగులు సేయ. 127

తే. తా ననుభవింపనేరక తగిన ఘనుని
దండ నుండంగనీక నిధానమునకు
బూచి కాచుక యున్నట్లు పువ్వుఁబోఁడి
యెట్లు సంగత మయ్యె నీ కిట్టిమగఁడు. 128

వ. ఐననుం గొదవ గా దిందుల కొక్క మహోపాయంబు విచారించితి వినుము. 129

చ. వలపులఱేనికి న్సవతువచ్చువిలాసము గల్గి యెల్ల వి
ద్యలఁ గలమేలిమిం దెలిసి యంగనలం గరఁగింప నేర్చి కో
ర్కులు సమకూర్పఁజాలి కడుఁ గొండొకప్రాయము గల్గువాని ని
స్తులతరభోగభాగ్యములు చొప్పడ నీ కొనగూర్తు మానినీ! 130

క. అతని వివరింతు విను నీ
మతికి న్సమ్మతి యొనర్చు మనరాజు జగ
ద్ధితసుప్రతాపభాస్వ
త్ప్రతిభాభానుండు చిత్రభానుం డబలా! 131

సీ. భావజ్ఞమౌళి ధాత్రీవరారోహావ
హస్తలైకైకబాహార్గళుండు
చల్లనిరాజు సాక్షాత్కారనవమోహ
నాంగసౌందర్యలీలాంగభవుఁడు
దాక్షిణ్యశాలి యాచార్యధైర్యావార్య
సకలసద్గుణగణార్జవపరుండు
చేపట్టుఁగుంచ మక్షీణరంగదభంగ
శృంగారశాస్త్రప్రసంగలోలుఁ

తే. డమ్మహారాజదేవేంద్రుఁ డంతరంగ
మెల్ల నీసొమ్ముగ నొనర్ప నేమితపము
చేసితివొ నాపలు కొకింత చిత్తగించి
తలఁపు నెఱవేర్చు కొనవమ్మ కలికి కొమ్మ. 132

వ. అనిన విని సంభ్రమభయవిస్తయాక్రాంతం బగునిజస్వాంతంబునం గొంతతడవు విచారించి దరస్మితవ్రీడాభరంబు లీడుజోడాడ వదనారవిందం బొకించుక వాంచి పంచశరశరప్రాయకటాక్షాంచలంబుల నొక్కించుక చాంచల్యం బంకురింప నచ్చంచలాక్షి రాజదూతి కిట్లనియె. 133

క. ఏ నింతనాఁటినుండియు
మానవతులలోన మిగుల మానవతిని నై
యీనాఁటికిఁ గడచితి నికఁ
నానోఁచిననోము లే మొనర్పం గలవో. 134

వ. అదియునుం గాక. 135

తే. అత్తయును మామ తలవరులై మెలంగ
మగఁడు పులివంటివాఁడు నెవ్వగ యొనర్ప
నమ్మ! యేఁ జెల్ల! యిక్కార్య మమరు టెట్లు
చాలుఁ జాలింపు మిఁక నీప్రసంగ మనిన. 136

వ. విని తదీయవచనంబున స్వప్రయోజనావకాశం బయ్యె నని తలంచి తదనుగుణం బగునట్లుగాఁ బల్లవి యిట్లనియె. 137

ఉ. ఎక్కడి యత్తమామలు నిజేశ్వరుఁ డెక్కడ వంశవర్తనం
బెక్కడ దొడ్డు కొంచెమను టెక్కడ నోలలితాంగి మోహము
న్నెక్కొనఁ జక్కనయ్య నొకనిం బిగికౌఁగిటఁ జేర్చి పెంపుసొం
పెక్కని దేటిప్రాయ మిది యెన్నఁటికిం గలుగంగనేర్చునే. 134

సీ. మగని ప్రక్కనె యుండి తగఁ జేరి జోకొట్టి
మోసపుచ్చని దేటి ముద్దరాలు
పసులగోడలనైన వసుధనిచ్చెన లేక
యెక్కనేరని దేటి యెమ్మెలాఁడి
తలవరు ల్గనుఁగొన్నఁ దప్పు నొప్పు ఘటించి
బొంకనేరని దేటి పువ్వుఁబోఁడి
దొరలు గద్దింకఁ గల్లరివార్త నిజముగా
నిర్వహింపని దేటి సీటుకత్తె
తే. యత్తమామల గృహకర్త లగుచు మెలఁగు
నట్టిధూర్తుల నెల్ల నోరదిమి గదిమి
పొంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
చక్కటికి దిద్దుకొనని దేసరసురాలు. 139

తే. ఆఁడుపుట్టునఁ బుట్టి యింతంతయైన
దిట్ట గాకున్న నది కడతేఱు టెట్లు
బేలతనమున నీవింత గోలవేని
మాను మోబాల యిఁక నిన్నిమాట లేల. 140

వ. అనినఁ బులకానుషంగం బగునిజాంగంబువలన నంగీకృతభావం బెఱింగింప నయ్యంగనారత్నంబునకు సంగనాచియగు రాజదూతిక మఱియు మఱియు బోధించి చంద్రికాసక్తచకోరకంబునుఁబోలె వైశ్యభామ కెదురుచూచుచున్న రాజపుంగవునకుఁ దదీయకథావృత్తాంతం బెఱిఁగింప మరలిచనునెడ నవ్వణిగ్వరునకు దైవయోగంబున నతిదూరప్రయాణంబు సంభవించిన. 141

చ. తనయిలువేల్పులై మెలఁగు తల్లికిఁ దండ్రికి భక్తియుక్తివం

దన మొనరించి ప్రాణసమతం దగుపెంపుడుముద్దుఁజిల్క నె
మ్మన మలరించి విద్యుదుపమానశుభాకృతి నా ప్రభావతిం
గనుఁగొని పోయిరాఁదగిన కార్యముఁ దెల్ప నవీనదైన్యయై. 142

సీ. మలయుచో మధురాతిమధురాధరల వాఁడి
చిన్నారిగోరు నీచెక్కుమీఁద
నానుచో రంగస్థలాబ్జగంధులగబ్బి
మెఱుఁగుఁజందోయి నీయురముమీఁద
మించుచోఁ గాంచికాచంచలాక్షుల ముద్దు
మొనపంటిగంటు నీమోవిమీఁదఁ
జేరుచో నెల్లూరు నారీమణుల కెంపు
పసమించు నడుగు నీనొసఁటిమీఁదఁ
తే. నింట నుండిన నీసౌఖ్య మేల కల్గు
ననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁజేర్చి
మోవిచిగురంట నొక్కి తమ్ముల మొసంగి
పోయిరమ్మని పనిచె నప్పువ్వుఁబోఁడి. 143

క. ఈరీతి వణిగ్వల్లభుఁ
డారూఢిగ నోడబేర మరిగినతఱి న
వ్వారిజముఖి కంతుశరా
సారవినిర్ఘాతజాతసంతాపమతిన్. 144

చ. మునుకొని మేరమీఱు వలపుందనముంగల త్రోవ చూపఁగా
వెనుక రతీశ్వరుండు పదవే యని యెత్తులు వెట్ట నెమ్మదిం
బెనఁగొను లజ్జయుం బొడముభీతియుఁ దన్నరికట్ట నంతలో
నినుఁ డపరాంబుధి న్మునిఁగె నీవెతలం గనలేని కైవడిన్. 145తే. చరమదిగ్భామినీమనోహరతరాంగ
రాగవైఖరి మఱి సాంధ్యరాగ మెసఁగెఁ
గుసుమితనవీనజాతీనికుంజరీతి
నుడుగణంబులతోఁగూడ నొప్పె నభము. 146

క. తగనప్పు డజాండంబున
నిగిడెం గాఢాంధకారనిబిడమరీచుల్
జిగి కుందనంపుబరణి
న్మృగమదపంకంబుఁ గలయనించిన కరణిన్. 147

వ. అప్పు డయ్యెప్పులకుప్ప యగుప్రభావతీసతి విలాసవతీరతీశ్వడుం డగు నమ్మహీశ్వరునితో ననంగసంగరవాంఛ తరంగితంబై తురంగలించు తమకంబున. 148

సీ. నానావిధద్రవ్యనవ్యసంభారము
ల్గలగృహంబులకు బీగము లమర్చి
మొదవుల నన్నింటిఁ బిదికిన పాల్గాచి
యొనరఁ దోడంటుతో సుట్టిఁబెట్టి
పనులు దీర్చిన తొత్తుపడుచుల నిష్టాన్న
తృప్తినొందఁగఁ జేసి యిండ్ల కనిచి
యత్తమామలు సుఖాయత్తులై పవళింప
మృదుపదంబుల నొత్తి నీదురవుచ్చి
తే. జలక మొనరించి జిలుఁగుమేల్వలువ గట్టి
కలప మలఁది మితాహారకలనఁ దేలి
వీడియం బందుకొని యొక్కయూడిగంపు
బుడుత తనవెంట నడువ నప్పువ్వుఁబోఁడి. 149

క. తనకుం బ్రాణపదంబును
దనయనుఁగుంజెలియుఁ దనకు దైవం బగుచుం
దనరు తనరాజకీరముఁ
గని యవ్వలఁ జనుట తగిన కార్యం బనుచున్. 150

తే. కనకమణిపంజరశుకాగ్రగణ్యుఁ జేరి
కోరి యాత్మీయగాథాప్రకార మెల్ల
మెల్లమెల్లన దరహాస ముల్లసిల్ల
నంతయును దెల్పఁ జిల్క యత్యాగ్రహమున. 151

క. కటకటఁబడి పక్షద్వయ
పుటచలన మొనర్చి మిగులఁ బొగులుచు మదిలో
నిటు నటు దెలియని చింతా
కుటిలస్థితి నింతి కనియెఁ గోప మెలర్పన్. 152

క. ఓహరిణనయన "స్వామి
ద్రోహ మిదంభార” మనుచుఁ దొలుతనె విబుధ
వ్యూహంబు పలుక వినమే
యాహా యీమాట వినఁగ నర్హమె మాకున్. 153

ఉ. [1]ఓవర వైశ్యవంశకలశోదధికల్పలతాలతాంగి నీ
పోవని వారిముందఱ నయో మగనిం గడకాళ్లఁ ద్రోచి నేఁ
డీవసుధేశునిం గలయ నెంచితి వెట్లు? పతివ్రతామణు
ల్వావులు పుత్తురమ్ము తలవంపులు చేయుదురమ్మ జాతికిన్. 154

సీ. దశకంధరుని మోహదశ విచారించెనే
సకలజగన్మాత జనకజాతనహుషభూపాలు మన్నన కొప్పుకొనియెనే
స్త్రీరత్నమైన శచీపురంధ్రి
యల సింహబలుని మాయలఁ జిక్కి చొక్కెనే
విపులసద్గుణమాన్య ద్రుపదకన్య
శబరాధిపునిదురాశలకు లోనయ్యేనే
రతినిభాకృతి భీమరాజపుత్రి
తే. తొల్లిటి మహాపతివ్రతల్ దుర్మదాంధ
కాపురుషు లంగభవశరాఘాతవికల
చిత్తులై తముఁ జేరి యాచించినపుడు
సిగ్గు వోనాడుకొనిరఁటే చిగురుఁబోఁడి. 155

ఆ. ప్రాణహాని మానభంగంబు నగు నన
కెంతపనికిఁ జొచ్చితే మృగాక్షి
జగతి నీమనంబు "తెగువయే దేవేంద్ర,
పదవి" యనెడుసుద్దిఁ బొదలఁబోలు. 156

క. పతిభక్తి గలుగుసతికిన్
వ్రతములతో గొడవ యేల వఱలు సుకృతముల్
పతిభక్తి లేని చెనఁటికి
వ్రతములు చను వేయి యొక్కవ్యభిచారమునన్. 157

వ. కావునఁ గులాంగనాతిలకంబునకుఁ గలకంఠీసముచితకృత్యంబు పాతివ్రత్యంబు నీవు వైపరీత్యం బగుప్రయోజనం బాచరించితి విట్లైన నిహపరంబులకు దూరం బగుదు వని సుభాషితంబులు పచరించిన నవ్వచనంబులు కర్ణపుటంబులకు జిలుగుటంపములుకులపొలుపు దెలుపఁ గలికి యులికిపడి రూక్షేక్షణంబుల నాశుశుక్షణికణంబులు చిలుకఁ జిలుకం గనుం గొనిన నప్పతంగపుంగవం బక్కటా! యిక్కురంగనయన కనంగతత్త్వంబు సంభవించె నిది సామంబునం గాని చక్కంబడదని తలంచి లంబికావలంబనమహాయోగిచందంబునఁ గొండొకతడపు నిశ్చలధ్యానపరాయణం బైయుండి వెండియు నయ్యంగన కిట్లనియె. 158

క. వినవమ్మ భామినీమణి
మనమున నీ కితరసంగమము ప్రియమైన
న్మును గొంతి కమలబాంధవు
నెనసియుఁ బొన మెఱుఁగునట్లనే వర్తిలుమీ. 159

తే. కాక తలవెఱ్ఱి గొని యలగౌతమాంగ
నామణి సురేంద్రు నొకనాఁడు నంటుచేసి
యాపదలఁ జెంది సకలలోకాపవాద
మొందు టెఱుఁగవె యట్లు గాకుండవలయు. 160
క. నీపట్టు గలుగువాఁడై
చేపట్టుంగుంచ మైన చెలువుని నొకనిం
జేపట్టి రతులఁ దేలక
యేపట్టున రాజు నిచ్చయించితి వబలా. 161

సీ. రాజులు కుటిలసర్పమహోగ్రతరమూర్తు
లధరబింబము పంట నదుము టెట్లు
సార్వభౌములు చండశార్దూలసమచిత్తు
లించువేడుకఁ గౌఁగిలించు టెట్లు
[2]కువలయాధీశ్వరు ల్దవహుతాశనకల్పు
లండనుప్పొంగి పరుండు టెట్లునరవరేణ్యులు భద్రకరిమదాంధమనీషు
లెనసి బంధరతాప్తిఁ బెనఁగు టెట్లు
తే. చక్రవర్తులు మాననిర్వక్రవర్తు
లతులతరగాఢసురతవేళాతివేల
తాడనచపేటము లొనర్పఁ దలఁచు టెట్లు
తెలిసి కలయిక లొనగూడ మెలఁగవమ్మ. 162

క. వారలగుణానుగుణముగ
వారక కనుగలిగి నడుచువారల కెలమిన్
శ్రీరంజిలు జయ మొదవు ను
దారత నీపదు నెఱింగి యలవడు మబలా. 163

వ. ఇత్తెఱంగునఁ దత్తరంబు లేక వర్తిల్లుమని విన్నవించిన. 164

క. అభినవవినీతివార్తా
విభవం బభిరామలీల వినుచున్నతఱిన్
నభము నభమైనఁ గనుఁగొని
యిభగామిని నాఁటి కరిగి యిలు సేరుటయున్. 163

వ. అంత నద్ధరాకాంతుండు తదనంతరకథాక్రమం బెట్టిది యానతిమ్మనుడు. 166

తే. అవధరింపుము సకలరాజాధిరాజ
సతపదాంభోజుఁ డగు ధర్మనందనునకు
సరసవైదికలౌకికాచారవిహిత
హితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టులనియె. 167

క. ఆగుణవతి మఱునాఁ డను
రాగాప్తిన్ రాత్రివేళ రమణీయకళా

భోగశుభాకృతి రతిశు
శ్రీగులుక న్రాజసేవ సేయుట కెలమిన్. 168

చ. కలువలు కొప్పున న్నగుమొగంబునఁ గస్తురిబొట్టు పట్టుకు
చ్చలయును జంద్రకావిబురుసాపనివల్వయు మై రహింపఁగా
నలవడు మేల్ముసుంగుపయి నంగరుచిచ్ఛట లొప్ప నప్పు డా
కలికి రమాకుమారు తురగంబుకడం దగఁ జేరె నంతటన్. 169

తే. చిలుక ముద్దులు చిలుక రాజీవనయన
ననునయించి వచించు నోయబల నృపకు
లేంద్రుఁ గదిసెద నని వచ్చు టేనెఱుఁగుదు
నుబికి చనఁదగ దితిహాస మొకటి వినుము. 170

మొదటికథ

క. అనఁగా ననఁగా నొకపుర
మొనరుం జంద్రవతి యనఁగ నుద్యోతవినూ
తనఖద్యోతనికేతన
ఘనకేతనరుచిరకనకకలశం బగుచున్. 171

తే. అన్నగర మేలు రత్నాకరాహ్వయుండు
వికటమత్తాహితవిఫాలుఁ డొకనృపాలుఁ
డతని నగరున నోడకాఁ డగుచు నొకఁడు
వెలయు వసుమంతుఁ డనుగౌర చెలువుమీఱ. 172

వ. వెండియు నయ్యఖండతరసంపత్కుబేరుం డగునతండు. 173

శా. ఏయూరం దనయంగడు ల్నెఱయ నేయేబేరు లెందైన నా
త్మాయత్తైకధనంబు సంచిమొదలై యత్యార్జనం బొందఁగా
శ్రేయఃకీర్తులు సంఘటిల్లఁ దను సుశ్రీమించఁగా నిల్పె న
య్యాయం బేర్పడఁ గోటికిం బడగ లెన్నైనం బ్రమోదంబునన్. 174

  1. ఓవరవైశ్యవంశకలశోదధిచారుహిమాంశురేఖ — శబ్దరత్నాకరము
  2. అవనీతలేశ్వరులాహుతాశనకోఫులు—పాఠాంతరము