శుకసప్తతి/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి


శ్రీరస్తు

శుకసప్తతి

ప్రథమాశ్వాసము[1]
కృత్యాది

శ్రీకమలాక్షియై మెలఁగు సీత తటిద్రుచి నొంద లక్ష్మణ
శ్రీకరబాహుదండమునఁ జేర్చుధనుర్లత యింద్రచాపశో
భాకృతిఁ దాల్ప మేరుశిఖరాశ్రయనీరదలీల సింహపీ
ఠీకమనీయుఁడౌ జయపటిష్ఠుని శ్రీరఘురాము నెన్నెదన్. 1

మ. వరవామాంకమృగేంద్రపీఠి నెలమి న్వర్తించి ప్రాంచత్కృపా
కరవీకాంకురచంద్రిక న్సకలలోకశ్రేణి నీడేర్చుచున్



వరసౌభాగ్యధురీణ యౌ జనకరాడ్వంశాబ్ధిజాత స్సువ
ర్ణరుచిస్ఫూర్తిసమేత సీతఁ ద్రిజగన్మాతం బ్రశంసించెదన్. 2

మ. మును శేషత్వముఁ బారతంత్ర్యమహిమంబుం దాల్చి లక్ష్మీప్రియుం
గని సేవించి యతండ రాముఁ డయి జోకన్ ధాత్రి నుండంగ నిం
పున శేషత్వముఁ బారతంత్ర్యమహిమంబుం దాల్చి సేవించి మిం
చిన శ్రీలక్ష్మణదేవు నాత్మఁ దలఁతున్ శ్రీవాక్ప్రభావాప్తికిన్. 3

మ. సిరులొప్పంగ రఘూద్వహుండు సుజనక్షేమంకరోద్వృత్తిమై
నరుదార న్మణిభద్రపీఠమునఁ గొల్వైయున్నచో ఛత్రచా
మరముల్ మ్రోల వహించి చి త్త మలరింపం జాలి భక్తాలి బం
ధురపాపౌఘభయఘ్నులౌ భరతశత్రుఘ్ను ల్ననుం బ్రోవుతన్. 4

సీ. పరిపక్వసహకారఫలమా సముద్దండ
మహనీయమార్తాండమండలంబు
తూలికాఘటితకందుకమా నభశ్చుంబి
దృఢతరద్రోణధాత్రీధరంబు
బిసకాండవిసరమా యసమత్రిలోకవి
ద్రావణాసురమహారాజబలము
క్రీడానివాసమా కృతశాంబరీభయం
కరనక్రవరగర్భగహ్వరంబు
తే. బళిర యీలీల యని సురల్ ప్రస్తుతింప
నలరి శ్రీరామచంద్ర పాదారవింద
వందనానందరససుథాస్పందహృదయుఁ
డగుసుధీమంతు హనుమంతు నభినుతింతు. 5



క. వాణి న్వీణాపుస్తక
పాణిన్ శుకవాణి విపులభాసురపులిన
శ్రోణి న్బలభిన్మణిజి
ద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్. 6

ఉ. ముద్దులుగుల్కు శైలసుతముందఱ శైశవలీల నాడుచో
నొద్దికనున్న తండ్రి తలయూఁచ జటామకుటాబ్జరేఖపై
నిద్దపునబ్జమోహమున నెమ్మిఁ గరాగ్రము సాఁచు వేలుపుం
బెద్ద గణేశుఁ గొల్తు మదభీప్సితకావ్యకళానిరూఢికిన్. 7

మ. కవితాకన్యకల న్సువర్ణసదలంకారప్రయుక్తిన్ యథా
ర్హవరప్రాప్తి నమర్చి కీర్తినిధులై యాచంద్రతారార్కమై
భువి వర్ధిల్లఁగఁ జేయుపుణ్యుల మదిం బూజింతు వల్మీకసం
భవుల వ్యాసులఁ గాళిదాసముఖుల న్మత్కావ్యసంసిద్దికిన్. 8

తే. ధృతి దురాచారమతి నేకదృష్టివలన
బహుపదార్థపరిజ్ఞానపటిమ లేక
కర్ణకటువుగ వదరెడు కాకవులను
గాకవు లటంచు నెంచి తృణీకరింతు. 9

వ. ఇవ్విధంబున నిష్టదేవతానమస్కృతియును సకలసుకవిజనపురస్కృతియును గావించి సమంచితసకలరసానుబంధబంధురంబగు నొక్క మహాప్రబంధంబు నకళంకరాకానిశాకరకరనికరానర్గళగళిత సుధారసధారామాధురీధురీణ వాగ్ధోరణీనిబంధనంబుగఁ జెప్పంబూనియున్నసమయంబున నొకనాఁటి శుభావహగరీయం బైనవిభావరీతుర్యయామంబున. 10



సీ. మరకతంబులయొప్పు మైనుప్పతిలనొప్పు
గోమువాఁ డెలనవ్యుమోమువాఁడు
వనజాతములబింక మెనయుకన్గవ పొంక
మమరువాఁ డొకవింతమకొమరువాఁడు
చిలిక్రొంబగడంపు జిగిగుంపురవణంపు
మోవి వాఁ డెనలేనిఠీవివాఁడు
మిసిమిబంగరుచేల పసమించుకటిలీలఁ
జెలఁగువాఁడు శుభాప్తి మెలఁగువాఁడు
తే. దివ్యకోదండశరకాండధృతకరాబ్జ
యుగమువాఁ డెన్నరానిసోయగమువాఁడు
జానకీలక్ష్మణులతోడ స్వామి రాముఁ
డెలమిఁ గలలోన నా చెంత నిలిచె నంత. 11

క. కని విస్మయసమ్మోదము
లెనయ న్భయభక్తియుక్తహృదయుఁడనగుచున్
వినయస్థితి నల్ల జగ
జ్జనకున కే నతు లొనర్చి సంప్రీతుఁడనై. 12

క. ఉన్న తరి నన్నుఁ జూచి ప్ర
సన్నాననుఁడై సుధారససదృశమృదువా
క్యోన్నతి శుకసప్తతికృతి
చెన్నలర మదర్పణంబు సేయుకుమారా!

క. ఈవిధమున మాయనుమతిఁ
గావించితి వేని సకలకవిబుధజనసం
జీవన మై నీవంశము
పావన మై వెలయు మత్కృపామహిమాప్తిన్. 13

వ. అని యద్దేవుం డానతిచ్చిన మహాప్రసాదం బని యంగీకరించి యత్యంత భయభక్తి కరకమ్రనమ్రశిరస్కుండ నై సాష్టాంగనమస్కృతులు గావించి యానందబాష్పంబులు చిలుకఁ బులకాంకితగాత్రుండ నై మేలుకాంచి యమందకందళితానందనిష్యందహృదయారవిందుండ నై ప్రభాకరప్రభావిభాసురం బగుప్రభాతంబున సౌశీల్యాదిమాంగల్యహేతుకాల్యకరణీయంబులు నిర్వర్తించి నిరంతరనితాంతతంతన్యమానకాంతికాంతదంతురిత ద్వారబంధసందానితగంధసింధురకరానీతశాతకుంభకుంభసంభృతాంభోవిజృంభమాణ ధారాభిషిక్తాంభోజవాసినీసంవాసితంబును నిళాత్యంతాసమానపసవాసమాగతరోలంబకదంబవిలంబమాన ప్రసూనమాలికాలలితనానాసూనవర్ణనీయవర్ణవిచిత్రచిత్రాంబరవితానవిద్యోతమానంబును బృందావనాళిందకళిందనందనీనందనోద్యానవల్లవసుందరీసందోహానందవిహరమాణ ముకుందక్రీడావిలాసచిత్రితభిత్తిప్రభాభాసితంబును వినూత్నరత్నకంబళాస్తరణోపరిభాగవిన్యస్తప్రశస్తనిస్తులగాంగేయవిస్తీర్ణోదీర్ణసూర్యపుటోపధానశయ్యారమణీయంబును నటనటీగాయనగాయనీనాట్యసంగీతసందర్శనాకర్ణనోత్కంఠాయాతపురందరపురసుందరీసందోహవిభ్రాంతికృత్సాలభంజికాపుంజరంజితవలభీప్రదేశప్రభూషితంబును వేదవేదాంగాద్యనేకశాస్త్రరహస్యవిజ్ఞానధురీణవిపశ్చిన్మౌహూర్తికసుకవిగాయకమంత్రిపురోహితవిలసితంబును భరతమతంగదత్తిలకోహలాంజనేయశార్ఙ్గదేవమతాదివివిధభరతశాస్త్రవిశారదకుశీలవలలితంబును గమలరాగోపలఫలకాయమానచూతనూతనపల్లవోల్లసితతోరణాలంకృతంబును హిమవాలుకాచూర్ణరంగవల్లీవిరాజమానప్రాంగణదేశదేదీప్యమానంబును సమం చితానవరతాగురుధూపవాసనావాసితంబును నై విరాజిల్లు నాస్థానభవనరాజంబు వందిమాగధబృందంబు లందంద కైవారంబు సేయం బ్రవేశించి బంధుహితామాత్యసామంతజనంబు లభ్యర్ణప్రదేశంబున వసియింపం బేరోలగంబున నుండి సముద్భటవీరభటరాహుతసంఘంబుల కొల్వుగైకొని భూసురాశీర్వాదభాసుర మంత్రాక్షతంబు లుత్తమాంగంబునన్ ధరియించి విద్వజ్జనంబులకు నమస్కరించి స్వప్నప్రకారంబు విన్నవించిన విననవధరించి వార లిట్లనిరి. నీలనీరదశ్యామాకృతియగు రఘుపతి ధనుర్బాణపాణియై మ్రోలనిల్చుటంజేసి దిగ్విజయంబు సకలజగన్మాత యగు సీతసందర్శనంబుపవలన నిరంతకసంపత్పరంపరావాప్తి యగు నిజాగ్రజన్మసేవాశుభలక్షణుం డగులక్ష్మణవిలోకనంబుకతన గురుభక్తి యుక్తియును గలుగు నీస్వప్నంబు వివిధశోభనప్రయత్నంబులు దెలుపుచున్నయది. నీయట్టికృతార్థున కిట్టిమహత్త్వంబు లబ్బుట యాశ్చర్యంబే మహావంశసంభవుండవు ధైర్యస్థైర్యశౌర్యాదార్యగాంభీర్యలతాలవాలంబగు భవద్వంశావతారం బభివర్ణించెద మాకర్ణింపుము. 14

తే. సారమై శౌరికేళికాసారమైన
పాలమున్నీటివలన సంభవము నొందెఁ
గువలయామోదకారియై కుటిలచక్ర
హారియై సత్కళాధారి యైనరాజు. 15

క. ఆయమృతాంశుఁడు త్రిజగ
ద్గేయుం డగురౌహిణేయుఁ గిల్పిషహరణో



పాయున్ సంశ్రితనికరవి
ధేయు న్భుధనామధేయు ధీయుతుఁ గాంచెన్. 16

క. ఆతనికి గల్గెఁ బురూరవుఁ
డతఁ డాయువుఁ గాంచె నహుషుఁ డా పుణ్యునకున్
సుతుఁ డతఁడు కనియెఁ దనయుం
దతవిభవోన్నతి యయాతిఁ దద్వంశమునన్. 17

మ. భువనాధారవిహారి యైనహరి యాపుణ్యాత్మునామంబుచే
భువి భాసిల్లు కులంబునన్ హరిహరాంభోజాసను ల్మెచ్చ సం
భవుఁడై ధాత్రి నరాతిజాతి భయకంపంబెల్ల వారించి సం
స్తవనీయుం డననొప్పె నాతఁడు యదుక్ష్మాభర్త పొల్చున్ మహిన్. 18

ఉ. ఆమహితావతంసకుల మాత్మసముద్భవహేతుభూతమై
ధీరతఁ బాలవెల్లి జగతిం దగెఁ దన్మహిమం బపారగం
భీరఘనాఘసంభరణభీమబలప్రతిభాప్తిఁ గాంతు నం
చారయఁ బాలవేకరికులాఖ్య వహించె సుదంచితోన్నతిన్. 19

ఉ. ఆమహితాన్వవాయవసుధాధిపు లచ్యుతగోత్రపాత్రు లు
ద్దామభుజాపరాక్రమవిదారితఘోరమదారివీరులై
భూమి భరించి రానృపులభూతి మహోన్నతి నేలె భోగసు
త్రాముఁడు తాడిగోళ్ళపురధాముఁడు శ్రీపెదయౌబళుం డిలన్. 20

సీ. తనమాట శకయుగంధరలాటనృపవరు
ల్వినయోక్తిఁ గడు గారవించి మెలఁగఁ

దనకీర్తి దశదిగంతరపూర్తి నేవేళ
నిండారుపండువెన్నెలలు గాయఁ
దనథాటి రిపు మహీధవకోటి కద్రిగం
హరకుటీరములఁ గాఁపుర మమర్పఁ
దనదాన మర్థిలోకనిదాన మనఁ గర్ణ
ఖచరామరాగవైఖరులఁ బొసఁగఁ
తే. దనమహోగ్రప్రతాప ముద్దండచండ
భానుమండలి నొరయ సౌభాగ్యవిభవ
రాజ్యలక్ష్మీసహాయుఁడై ప్రబలె రూప
భావజనిభుండు పెద్దయౌబళవిభుండు. 21

సీ. రాయదత్తాశ్వవారణరత్ననవరత్న
హారాంబరంబు లేయధిపుఁ డందె
నళెరామరాజేంద్రబలవద్రిపులఁ ద్రుంచు
కలని కేధీరుండు కర్త యయ్యె
(?)కదెరాకమునతెర్క మొదలుగల్గు
బహురాజ్య మేశౌర్యమహితుఁ డేలె
గురుదేవతాపాదసరసీరుహార్చనా
పరత నేనిపుణుండు ప్రౌఢి గాంచె
తే. నతఁడు వెలయు సమగ్ర హాహవోగ్ర
సప్తకసహస్రచాపభృత్సైన్యజితమ
దాహితెంగాగ నుద్రుండు(?) తాడిగోళ్ళ
జలధిచంద్రుండు పెద్దయౌబళవిభుండు. 22

చ. నరచక్రేశుల నెంచి చూడ హనుమన్నాగారిచిహాఢ్యులై
పరబాణాసనచాతురిం గనిరి తత్రాగల్భ్య మెంతంచుఁ దా



నరచక్రేశత రాయదత్త హనుమన్నాగారిచిహ్నాఢ్యుఁడై
పరబాణాసనచాతురిం దనరె నోబక్షోణిపాలుం డిలన్. 29

సీ. క్రోడుగ ల్మొదలైన గురుతరగ్రామము
లహిమఁ జెన్నగు భోగమండపములు
సరసగుబాళించు వరధూపవాసన
ల్వివిధరాజాన్ననివేదనములు
కట్టాణిముత్యాలగట్టిచౌకట్లజో
డరుదైన నవరత్నహారలతలు
కడుదీప్తి మెఱయు నఖండదీపజ్యోతు
లనుపమసుప్రసూనార్చనములు
తే. మొదలుగాఁ గల్గు కైంకర్యముల నమర్చె
శ్రీకరుం డైనఖాద్రినృసింహమూర్తి
కెనయఁ బ్రహ్లాదుఁ డీతఁడో యనఁగ భక్తి
గలిగి పెదయౌబళేంద్రుఁడు వెలయ జగతి. 24

క. ఆ పెద్దయోబనృపతికి
గోపకనద్భాస్వదంశుకుముదీభవదా
ఘోపాలసమదవదరి
క్ష్మాపాలకుఁడైన నారశౌరి జనించెన్. 25

సీ. సత్కలానిధియైన జైవాతృకుఁడు రాజ
చక్రపాలకమైత్రి సలుపఁ డనుచు
జీవనం బొసఁగి రక్షిఁపఁజాలు ఘనుండు
చంచలాత్మకత గద్దించు ననుచుఁ



దాభోగియై యనంతాభిధానుఁడు జగ
త్ప్రాణాపహారియై పరగు ననుచు
హంసాభిదైవతఖ్యాతజగన్మిత్రుఁ
డురుపుణ్యజనవృద్ధి కోర్వఁ డనుచు
తే. జలజరిపు మేఘ శేష సూర్యుల హసించె
కాంచె నతచక్రభరణ మార్జించె ధైర్య
మవనిఁబాలించె నిర్జించె నరిజనాళి
నారసద్గుణహారి శ్రీనారశౌరి. 26

చ. నల నిభుఁడైన యోబవిభు నారనృపాలుని యోలగంబునం
గలితసుగంధమాల్యవసనంబులతో నెలవైన వక్కలా
కులె యొకరాయమన్నెదొరకుం దగ పెండ్లికిఁ జాలునన్నచోఁ
దెలియగఁ దద్వదాన్యత నుతింప ఫణీంద్రున కైనశక్యమే. 27

సీ. తొలఁగినగతి సూడుదొరల ననాయాస
వర్ధితదుఃఖాశ్రువర్షములకుఁ
గొలిచిన సరిమన్నెగురిపేరు లొనరించు
వరదానధారాప్రవాహములకు
నాశ్రయించిన భూసురాగ్రేసరులు సేయఁ
దొడరిన సవనాగ్ని దూమములకు
నిడినసత్రముల నభీష్టమృష్టాన్నభో
జనజనజయజయశబ్దములకుఁ
తే. దడిసి వరదలఁ బడియుండి కుడిచి బెగ్గ
డిలఁగ నేమిటికిం దని తెలిసి దాఁటి
నేడువార్ధులు గడవెళ్ల నీఁదె నౌర!
నారవిభుని యశఃకాంతనడత వింత. 28

క. మేరుగిరిధైర్యనిధియా
నారనృపాలకుఁడు గనియె నయమార్గగుణో
దారుల వరవీరయశో
హారులఁ దొమ్మండ్రు సుతుల నతులితమతులన్.

క. ఆరమణీయయశోవి
స్తారులలో వినుతిఁ గాంచె సకలధరిత్రీ
భూరితరభారవహనో
ద్ధారభుజప్రబలుఁ డోబధరణిపుఁ డవనిన్.

సీ. వరదానవాగ్వైభవముల నీడనవచ్చుఁ
గర్ణుతో శేషదృక్కర్ణుతోడ
నంగసౌందర్యశౌర్యముల జోడనవచ్చు
మారుతో గిరిజాకుమారుతోడ
............................
భవునితోఁ గమలసంభవునితోడ
కలితసాహిత్యకీర్తుల సరి యనవచ్చు.
భోజుతో నిర్జితాంభోజుతోడ
తే. ననుచుఁ దను గీ......
.................న్మానదాన
ధర్మగుణముల శోభిల్లు తాడిగోళ్ళ
నారనరపాలునౌబళనాయకుండు. 31

చ. వననిధి మేటి దానము.........................
..................లకువాఃపతి మీఱు సముద్రవారివా
హనకమఠేంద్రసైంధవుల కబ్జుఁడు మిక్కుట మాపగాధిరా
డ్వనధరపాశభృజ్జ.............................. 32



సీ. ఘనములై ముక్తి సాధనములై మౌనిపా
వనములై పొలుపొందు వనము లలర
శ్రుతులై పదార్థసంగతులై విలసదలం
కృతులై విరాజిల్లు కృతులు దనర
మురువులై మున్నీటిహరువులై చూడన
చ్చెరువులై వెలయు బల్చెఱువు లొనర
నయములై మణిహేమమయములై యుత్సవా
లయములై మనుసురాలయము లమర
తే. ధరఁ బ్రతిష్ఠించి వెలసె సంగరధరోగ్ర
బహుళహళహళనిభగోపగహనదహన
భీమరిపుభూమివిభుమనోభీకరుండు
నారభూవరునౌబళనాయకుండు. 33

క. ఆవసుధాధిపుపట్టపు
దేవులలో సకలజలనిధిప్రావృతగో
త్రావలయదీనరక్షా
ప్రావీణ్యకళాప్తిఁ గాంచె బాలమ ధాత్రిన్. 34

సీ. మగనికి సకలసంపదలు గల్గ మెలంగి
కమలయై నెగడె నీకంబుకంఠి
ప్రజల సత్పుత్రులపగిదిఁ గల్గొని యన్న
పూర్ణయై తనరె నీపువ్వుఁబోఁడి
యోర్పు గల్గి యొకింతయును గోప మెఱుఁగక
ధాత్రియై వెలసె నీతరళనయన
సుచరిత్రధర్మ మెచ్చోఁ బాయ కలయరుం
ధతియై రహించె నీనలిననయన



తే. యనుచుఁ దనతోడి సతులెల్ల నభినుతింపఁ
బరఁగుఁ బరమపతివ్రతాభరణమగుచుఁ
దాడిగోళ్లౌబళేక్షమాధవునిరాణి
భవ్యసద్గుణనికురుంబ బాలమాంబ. 35

క,. ఆరమణీమణివలనన్
గారవమున నోబవిభుఁడు గనియెఁ గుమారున్
ధీరుని నవమన్మథశృం
గారునిఁ గరెమాణికేంద్రుఁ గరుణాసాంద్రున్. 36

మ. కరెమాణిక్యనృపాలుకీర్త్యుదధికిం గంజారితారాసము
త్కరము ల్ఫేనము లింద్రదంతి జలనాగం బీశతాలాంకని
ర్జరమౌన్యావళి నీరుపాపగమి భాస్వద్రత్నసాన్వాదిభూ
ధరము ల్రత్నము లబ్జజాండములు మత్స్యాండంబు లయ్యెన్ ధరన్. 37

సీ. ఏవదాన్యుఁడు రామదేవరాయలసరి
గద్దియ నొడ్డోలగమున నుండె
నేమనుజాధీశుఁ డితరనృపాలరా
జ్యస్థాపనాచార్యుఁ డై చెలంగె
నేపరాక్రమవంతుఁ డెదిరిన శత్రుభూ
పాలుర నడవులపాలుపఱిచె
నేమహామహుఁడు శ్రీరామనామధ్యాన
నిష్ఠాగరిష్ఠప్రతిష్ఠ గాంచె
తే. నతఁడు చతురబ్ధివలయితకుతలభార
భరణవిభవప్రచురబాహుబలవిహారి

తాడిగోళ్ళౌబళనృపాలతనయమౌళి
నీతిగీష్పతి కరియమాణిక్యనృపతి. 38

క. అలకరెమాణిక్యేంద్రుని
బలుధాటికి నల్కి యవనపతు లందఱు న
వ్వలయాచలపశ్చాస్థలి
నిలువఁగఁ బాశ్చాత్యు లనెడునియతి ఘటిల్లెన్. 39

సీ. తాళి చౌకళి కుంచె కాళాంజి చామర
ద్వయము ముతైపుఁదురావాహనము పి
రంగిక మొదలౌ రామరాయక్షమా
వరదత్త బిరుదాంకవార మంది
కదనభూతలభయంకరకరాగ్రసమగ్ర
కరవాలహతరిపూత్కరుఁ డనంగఁ
దాడిగోళ్లన్వయోదధినిశాకాంతుండు
కరియమాణిక్యభూకాంతుఁ డలరు
తే. నభయదానార్థనతవినుతావనీశ
పాకభిల్లోచనానందబాష్పకణమ
రందబంధురపాదారవిందుఁ డగుచుఁ
జక్రవాళావృతాచలచక్రమునకు.40

క. ఆకరెమాణికరాయ
క్ష్మాకాంతునికాంత లమితకమనీయశుభ
శ్రీకాంతలు సంపత్ప
ద్రాకాంతలు నల్గు రెన్నఁ దనరుదు రెలమిన్. 41

తే. అందు లచ్చమ్మ లచ్చమ్మయగు గుణమున
వలపు రాచమ్మ రాచమ్మ కలిమి కెలన
ధృతకురంగమ్మ రంగమ్మ పతిహితమున
నాసుభద్రమ్మ భద్రమ్మ యాదరమున. 42

శా. శ్రీకృద్ధీకరెమాణికేంద్రుఁ డినధౌరేయుండు తేజోఘనుం
డాకాంతామణులందుఁ గాంచెను వసంతాధీశు రామాధిపుం
బాకారిప్రతిమానవైభవయుతు న్నారప్రభు న్శారదా
శ్రీకంఠాభయశోవిశాలుఁ గదురోర్వీపాలులీలాంగజున్. 43

క. అందగ్రజుండు వెలయుఁ బు
రందరభోగాఢ్యుఁ డమలరమణీయయశః
కందళజితముక్తాహరి
చందనమందారుఁ డనవసంతేంద్రుఁ డిలన్. 44

చ. సమరదిలీపుఁ డై తగువసంతనృపాలునికీర్తిశౌర్యముల్
సమరసధర్మమార్గణవిశాలవితీర్ణిమనంటి జంటగాఁ
గమలభవాచ్ఛభానుకరకాంతిత యెంతని పంతగించె నా
క్రమకలధౌతభూధరవికస్వరరూపము లేపుమీఱఁగన్. 45

క. ఆధన్యునకును సంభవుఁ
డై ధాత్రి భరించి భీకరాకృతి రిపురా
డ్బూధరసంఘాతేంద్రా
ణీధవుఁ డన రామమేదినీధవుఁ డలరున్. 46

మ. సమరక్షోణిని రామభూవిభుఁడు భాస్వల్లీల ఖండింపఁ ద
ద్విమతాధీశ్వరకంఠరక్తతటినీవేగాహతిక్షుబ్ధవా

ర్ధిమహారావచరత్తటిద్రుశుకముల్ ద్వీపక్షమాపాలనా
ర్థము గట్టించిన తోరణంబు లనఁగా రంజిల్లు నల్గిక్కులన్. 47

తే. ధాత్రి తనకీర్తి రంజిల్లు తాడిగోళ్ల
రామభూపతి శ్రీరంగరాయదత్త
మత్స్యమకరధ్వజాఢ్యుఁడై మధురధర్మ
భరణత గ్రహించు రతిమనోహరునికరణి. 48

సీ. తనగుణలతికాకదంబకంబునకు లో
కాలోకనగముపఘ్నంబు గాఁగఁ
దనశౌర్యచండభానుని కరాతిధరాధి
నాథులు ఘూకసంతతులు గాఁగఁ
దనదానసంతానమునకు శుభ్రాంశుధా
మములు భాస్వత్ప్రసూనములు గాఁగఁ
దనకీర్తిబాలకు వనజజాండకటాహ
మెల్లప్పటికి బొమ్మరిల్లు గాఁగఁ
తే. బరఁగు రణరంగరంగదభంగజవతు
రంగసారంగయోధశతాంగధుతప
రాగపరిభూతభీతారిరాజచయుఁడు
తాడిగోళ్లాపురీరామధరణివిభుఁడు. 49

మ. ధర రామక్షితిపాలు సెల్వున వసంతత్యాగకాలంబునన్
వరమాణిక్యపురాసు లెల్ల భటవిద్వద్యాచకు ల్వచ్చి యం
దఱు నొక్కుమ్మడిఁ గొల్ల లాడి కొనిపోఁదచ్ఛేషముం దానిజో
దరమం దుంచుక రత్నగర్భ యను ప్రోద్యత్సంజ్ఞచే మించదే. 50

క. థామనిధితేజుఁ డగునా
రామనృపాలకుఁడు శరపరాభూతమహా

భీమరిపుస్తోమవపుః
స్థేముని రఘునాథవిభునిఁ జెల్వుగఁ గాంచెన్. 51

సీ. తనసదాచారంబు తనసదాచారంబు
సరణి నానాఘనోత్సవ మొనర్పఁ
దనశుభాలోకంబు తసశుభాలోక మ
ట్లతిలోకబాంధవోన్నతి ఘటింపు
దనకలావిభవంబు తనకలావిభవంబు
మాడ్కిని సర్వజ్ఞమౌళి నెనయఁ
దనసన్నిధానంబు తనసన్నిధానమ
ట్లనవద్యతరనిరంజనత వెలుఁగఁ
తే. బరఁగు యుద్ధధరిత్రీద్ధపటుపటహవి
జృంభణార్భటీదళితదిక్సింధురాళి
శుభముక్తౌఘగుంభితకువలయుండు
రామభూపాలురఘునాథభూమివిభుఁడు. 52

చ. నరసుతమూర్తి యైనరఘునాథనృపాలునికీర్తిసంఘ మా
హరిశరజన్మ హంసభవ హారివిలాసము, తత్ప్రదాన మా
హరిశరజన్మ హంసభవ హారివిలాసము, తత్ప్రతాప మా
హరిశరజన్మ హంసభవ హారివిలాసము, ధాత్రి నెన్నగన్. 53

ఉ. ఆరఘునాథభూమివిభుఁ డంబరభూజసమీభవత్కన
ద్గౌరవకీర్తియై కొలువఁ గంసహరాంశభవుండు రామధా
త్రీరమణుం డనేకజగతీపరిపాలతఁ బూనె సద్గుణా
వారణలీల సర్వజనవర్ణితదానకళాకలాపుఁడై. 54

క. ఆరామశౌరితమ్ముఁడు
నారనృపాలకుఁడు వెలసె నక్షత్రశర
ద్ధారాధరతారావర
హారామరతరుహిమాచలాంచద్యశుఁడై. 55

మ. అరిపద్మంబులచే మహోత్పలకళోద్యద్వృద్ధిచిత్తంబులం
బరమాహ్లాదముఁ జెందవచ్చు మదిలో భావించి రేఱేఁడు భా
స్కరతేజుండగు నారభూవిభుని సచ్ఛత్రాకృతిం దాల్చి తా
నరిపద్మంబుల మైత్రి గన్గొనియె నాత్మాలోకమాత్రంబునన్. 56

సీ. సురసరిత్పురహరస్థిరశరద్ఘనవయ
శ్శరనిధిచ్ఛవికనచ్చటులకీర్తి
ఘనరటత్పటహనిస్వనవినిర్దళితశా
త్రవపురప్రకటవప్రనికరుండు
రణవిఖండితరిపుప్రభుగళస్రవదసృ
క్తతరసప్రకరపూరితపయోధి
సలిలభృజ్జలజభిజ్జలధికల్పకవిక
ర్తనసుతస్తవనీయదానయుతుఁడు
తే. మన్నెమాత్రుండె నిజపాదమంజుకటక
ఘటితపటురత్నపటల విస్ఫుటవిదృశ్య
మానమత్తారిరాజన్యమస్తకుండు
నారభూపాలుఁ డమితసన్నహనబలుఁడు. 57

శా. ఆపృథ్వీపతిసోదరుండు కదురక్ష్మాధీశవర్యుండు యో
షాపంచాస్త్రుఁ డనంతభూషణవిశేషస్ఫూర్తియుం బ్రాప్తల
క్ష్మీపాలత్వముఁగల్గి సజ్జనగణశ్రేయస్కరోద్యోగుఁడై
దీపించున్ శివకేశవాంశజుఁ డనన్ దివ్యప్రభావోన్నతిన్. 58

సీ. పద్మాప్తపద్మాప్తపద్మాప్తతుల్యుఁ డే
ఘనుఁడు సంపత్కృపాకలితరుచుల
హరిణాంకహరిణాంకహరిణాంకసముఁ డేర
సానాయకుడు బలైశ్వర్యకళల
హరిరాజహరిరాజహరిరాజనిభుఁ డేనృ
పాలుండు శౌర్యోక్తిభక్తిరతుల
మకరాంకమకరాంకమకరాంకసదృశుఁ డే
ఘనుఁడు దానాకారగౌరవముల
తే. నతఁడు గుణథాముఁ డభిరాముఁ డర్కథాముఁ
డమితజయభీముఁ డుద్దాముఁ డరివిరాముఁ
డతులవైభవసుత్రాముఁ డనఁగ భద్ర
నాముఁ డలరారుఁ గదురభూనాయకుండు. 59

క. సంగరజయుఁ డగుకదురనృ
పుంగవువాక్కీర్తు లలరె భూస్థలిఁ హరజూ
టాంగనటద్గాంగరట
ద్భంగాభంగోద్ధనినిదధవళద్యుతులన్. 60

చ. హరనరవాహవహ్నిహరు లాకదురేంద్రుని కీర్తిదానశౌ
ర్యరసకృపావిశేషముల కల్కి కృశించి కురూపియై సదా
మొరయుచుఁ జాల నల్లనయి భూమిధరంబున మూలచట్ల సా
గరమున విశ్రమింప నొదుగం దిరుగంబడియుండఁ జూడరే. 61

క. ఆమహిమాఢ్యునకుఁ బురం
ధ్రీమణియగు కదురమాంబ దీనావనయై
శ్రీమెఱయ మహిని వర్ధిలు
తామరపాక్షునకు వార్ధితనయ యనంగన్. 62

సీ. తా రత్నగర్భాభిధాన యయ్యును విభు
నప్పుల ఱాయి మోయంగఁ జేసెఁ
దాఁ గల్మి యొసఁగెడు తరుణి యయ్యును నిజ
ప్రాణేశుఁ బసులకాపరిగఁ జేసెఁ
దా జనకజ యయ్యు ధవునిఁ గారడవిలో
జనకవియోగాప్తి నెనయఁ జేసె
దా హైమవతి యయ్యుఁ దనమనోనాథుని
బునుకపేరులు దాల్చుకొనఁగఁ జేసె
తే. నని ధరాదేవి నిందిర నవనికన్య
నచలజాతను నిరసించి యాత్మపతికి
గీర్తితాభీష్టవైభవస్ఫూర్తు లొసఁగు
వదనజితపూర్ణశశిబింబ కదురమాంబ. 63

తే. పరమగుణశాలి కదురనృపాలమౌళి
కదురమాంబికయందు శృంగారనిధుల
నందనులఁ గాంచెఁ గదురభూనాథు నిన్ను
వేంకటాగ్రణి నతిదానవిబుధమణిని. 64

చ. ఇననిభ తాడిగోళ్ల కదురేంద్రుని శ్రీకదురావనీశ నీ
యనుజుని వేంకటక్షితివరాగ్రణి నెన్నఁదరంబె థాత్రిపై
ననయముఁ దత్ప్రతాపజలజాప్తునిచే వలయాద్రిరాడ్విలం
ఘనమగు శత్రుభూభుజులు గాంతురు సత్పథసౌఖ్యసంపదల్. 65

సీ. అనిమిషావాససంప్రాప్తిఁ జెందనివారి
కనిమిషావాససంప్రాప్తి యొసంగె
విషధరస్థలి నుండ వెగటైనవారికి
విషధరస్థలి నుండ వెఱఁగుమాన్పె

స్వస్థానవిహరణాసహ్యులౌ వారికి
స్వస్థానవిహరణాసహ్య ముడిపెఁ
దతమహాబిలపదస్థలి లేనివారికి
దతమహాబిలపదస్థితి గడించె
తే. నౌర తొలుదొల్త డాసి ఱొమ్మదిమి గదిమి
చించి చెండాడి గాసిఁ జేసినదియయ్యు
విమతతతిపట్ల కదురభూవిభుని వేంక
టాగ్రణికరాసి యెంతదయాంబురాశి. 66

చ. సరసతఁ దాడిగోళ్ల పురశాసనుఁడై తగు వేంకటప్రభుం
డరివిజయప్రయాణసమయానకనాదవిధూతతారకాం
బరమున కాత్మఖడ్గహరిమర్దితశాత్రవహ స్తిమస్తకో
ద్ధరుచికమౌక్తిప్రతతితారల పెక్కు ఘటించు నిచ్చలున్. 67

సీ. నవనవాగతశీతపవనవారమహోగ్ర
దవలవావళిచేత దర్ప ముడిగి
తలతలావృతసుకోకిలకులాననగళ
త్కలకలారభటిచేఁ గడుఁ గలంగి
ప్రసవసారసితసారసరసాశనమత్త
భసలసాధ్వసముచే భంగ మంది
స్మరశరాసవసముద్ధురశరాకులమన
స్సవసరాగముచేత శయ్య నొరగి
తే. ధరణి నెఱిఁగింతు రీరీతిఁ దాడిగోళ్ల
కదురవిభు వేంకటేంద్రుని కదనధాటి
కలికి దుర్గమకాననస్థలులఁ బడిన
యాత్మనాథులపైతమి నహితసతులు. 68

ఉ. శ్రీనిధి తాడిగోళ్ల కదిరీపతినాయని వేంకటక్షమా
జాని జయప్రయాణపటుసంభ్రమసంభృతభూరిభేరికా
ధ్వాన మమర్త్యలోకవనితాజనము ల్విని నూతనప్రియా
నూనసుఖోన్నతు ల్గలుగునో యని యెంతురు సమ్మదంబున్. 69

ఉ. ఆయనుజుం డఖండవిభవాఢ్యుఁ డమందముదం బొనర్ప నా
రాయణపుణ్యమూర్తి వయి రంజిలి తీవు శుభైకశాశ్వత
శ్రీయుత తాడిగోళ్ల కదిరీపతినాయక వేంకటాంబ య
త్యాయతకీర్తిపూరితదిగంతర పట్టపుదేవి యై తగన్. 70

చ. అమితయశఃపయోధి కదురాధిపు శ్రీకదుక్షితీంద్ర చి
త్రము విను మొక్కవార్త సమరస్థలి దుర్మదవద్విరోధిరా
ట్సమదభవద్భయంకరభుజప్రవిభాసికరాసిసంహతి
న్విమతులకంఠరక్తము స్రవించి ద్రవించు మనంబు రంభకున్. 71

సీ. మేఘంబు లేనిక్రొమెఱుఁగులు కుముదారి
లేనియెండలు వార్ధి లేనిబాడ
బములు సురాద్రి లేనిమణిసానువు లర
ణ్యము లేనిదావానలములు కొలను
లేనికెందమ్ములు మ్రాను లేనిచివుళ్లు
గని లేనికెంపులు మనసిజారి
లేనికన్మంట లై లీల నిండెను ధరా
స్థలి నౌర యుష్మత్ప్రతాపరుచులు
తే. దహనసహకారరాజదర్పహరణ
రణమహాభీమభీమాబ్జరమ్యకీర్తి
కీర్తితాలోకలోకైకకీర్తనీయ
ఘనగుణకలాప కదురేంద్రు కదురభూప. 72

క. తతరణమున నీవిమత
క్షితినాథు లనంతధవముఁ? జెందరె భయకం
యుతులై నతులై హతులై
గతకల్మష తాడిగోళ్ల కదురనృపాలా. 73

చ. అమృతము శీతభానుగత మన్నది కాదు తృణస్థితం బటం
చమలమతి న్వచింతురు మహాత్ములు కాదనిరేని నీరిఫుల్
రమణఁ దదాప్తిమాత్రమున రక్షితులై మనుటెట్లు ధాత్రిభూ
రిమహిత తాడిగోళ్ల కదిరీపతినాయక లోకపాలకా. 74

సీ. తనపేరురంబు ద్రొక్కినవాఁడు సిగ్గుచే
సరిగాక తలలెత్త వెఱవలేదొ
తనతలఁ దన్ని నిల్చినవాఁడు సామ్యంబు
జెందలేక కృశత్వ మందలేదొ
తనవాలుజడలనుండి నది దీటుకు రాక
బెట్టుగాఁ బెనుమొఱ్ఱ వెట్టలేదొ
తనుమోచి తిరుగఁజొచ్చినది తుల్యముగాక
ఘనభయంబునఁ బూరి గఱవలేదొ
తే. తాను సరిచనఁదలఁచి నీధవళకీర్తి
కెనయఁగా లేక సగమయ్యె నీశుఁ డతఁడు
వసుధ సర్వజ్ఞుఁ డెట్లు సర్వజ్ఞమౌళి
కంజశరరూప కదురేంద్రు కదురభూసప. 75

క. ధర్మగుణకలితమార్గణు
లర్మిలి నీచర్య లెంచ నలరితి వౌరా
ధర్మగుణకలితమార్గణ
నిర్మథితవిపక్ష కదురనృపహర్యక్షా. 76

సీ. కావ్యనైపుణిశబ్దగౌరవప్రాగల్భ్య
మర్థావనాసక్తి యతిశయోక్తి
నాటకాలంకార నయమార్గసాంగత్య
సాహిత్యసాహిత్యసరసముద్ర
సకలప్రబంధవాసన సువాక్ప్రౌఢిమా
న్వితచతుర్విధసత్కవిత్వధాటి
లక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటిమంబు
నైఘంటికపదానునయనిరూఢి
తే. గనిననీకు నసాధ్యంబె గణుతి సేయ
ధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్ల
ఘనకులకలాపకదురేంద్రు కదురభూప
చెలగి వాక్ప్రౌఢిచే గృతి సేయు మవని. 77

వ. అని విద్వజ్జనంబు లానతిచ్చిన నేను నమందానందరసభరభరితహృదయారవిందుండనై. 78

క. కుంభిన్యాత్మభవాకుచ
కుంభపరిరంభణాత్తకుంకుమపంకో
జృంభితసంకుమదాగురు
శుంభధ్వక్షునకు భానుసుతరక్షునకున్. 79

క. బంధుకదశకంధరగ
ర్వేంధనజిద్గంధవాహహితునకుఁ బటుద
ర్వాంధకహరబంధునకుఁ గ
బంధాసురనిబిడతిమిరభాస్వంతునకున్. 80

క. చండద్యుతినిభమణిమయ
కుండలున కజాండభాండకోదండకళా
మండలపండితదనుజా
ఖండలఖండనసమర్థఘనకాండునకున్. 81

క. భర్గేష్వాసనదళనా
నర్గళదృఢబాహువీర్యునకుఁ బూర్వవచో
మార్గచరిష్ణుమునీశ్వర
వర్గప్రణుతానివార్యవరచర్యునకున్. 82

క. షడ్వదనజనకసుమనో
రాడ్వినుతచరిత్రునకును రాజద్గాత్ర
త్విడ్విజితాదిత్యునకు వి
రాడ్విగ్రహధామునకును రఘురామునకున్. 83

కథా ప్రారంభము

వ. అభ్యుదయ పరంపరాభివృద్దిగా నాయొనర్పంబూనిన శుకసప్తతి యనుమహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. 84

క. వెలయు నలఘుప్రభావో
జ్జ్వలుఁ డింద్రప్రస్థపురి నసామాన్యమహః
కలితదృఢబాహుబలని
ర్దళితాహితరాజు ధర్మరాజు ధరిత్రిన్. 85

చ. అతఁ డొకనాఁడు నిండుకొలువై బలవైరిమహోన్నతి న్మరు
త్సుతుఁడుఁ గిరీటి మాద్రితనుజు ల్తనదండన యుండి కొల్వ రా
జతతికిరీటకోటివిలసన్మణిమంజులదీప్తిపుంజరం
జితచరణుండు ధర్మజుఁడు చెంత వసించిన ధౌమ్యు నిట్లనున్. 86

క. తెలివి గలభూసురుండవు
కులగురుఁడవు మాకు మౌనికుంజర! వినుమీ
యలఘుమతి నొక్కకార్యము
తెలియ న్వివరింపవే సుధీజనతిలకా! 87

ఉ. భామలచిత్తము ల్దెలియ బ్రహకునైన వశంబుగాదు త
త్కామితయత్నము ల్తలఁప ధాత్రి విచిత్రము లండ్రు కావున
న్నామది యేతదీయకథనంబు వినం గడఁగె న్మహీసుర
గ్రామణి! యానతిమ్మనుఁడు రాజబిడౌజునితోడ వేడుకన్. 88

వ. అప్పు డాభౌమ్యమహర్షివర్యుండు నిరవధికకుతూహలధుర్యుం డై యిట్లనియె స్త్రీజనంబుల చిత్తంబులు లోకాతీతదుర్వృత్తంబులు, తదీయకృతసాహసకార్యంబు లనివార్యంబు లగుట నిక్కువం బిందులకు నొక్క యితిహాసంబు గలదు. తొల్లి మహాదేవుండు పార్వతీవరారోహ కతిరహస్యంబున నానతిచ్చినతెఱం గెఱింగించెద సావధానుండవై యాకర్ణింపు మని యి ట్లనియె. 89

సీ. సౌథాగ్రతలకేళిజాగ్రన్మృగేక్షణా
స్ఫుటదృశ్యమానేంద్రపురవరంబు
జగతీదిదృక్షుభౌజగవర్గనిర్గమ
ద్వారాయితన్వచ్ఛవారిఖేయ
మబ్జినీకాంతశుద్ధాంతీభవత్ప్రాంత
సంతతోదారకాసారవార
మిందిరాసుతభవ్యమందురానీకర
మ్యామోదకారణారామసీమ

తే. యంద మగు మేరుమందరాహార్యమధ్య
తలమహీమండలమున నుద్దామభీమ
మేదురోద్భటభటసింహనాదచలిత
దిగ్గజవరంబు పద్మావతీపురంబు. 90

క. ఆనగరి న్విభవప్రతి
భానగరిపుఁ డైన చిత్ భానుం డేలు
న్మానక మృడుకరడమరు స
మానకరవ మరుల గిరులయఱుఁతం జేర్పన్. 91

మ. కలలో నైనను బల్కి బొంకఁడు సమగ్రక్రోధయోధారిరా
డ్బలముం గన్గొని చీరికిం గొనఁడు దుష్పాండిత్యము ల్నేరఁ డు
జ్జ్వలదుజ్జృంభశుభాంగవైఖరుల ఠేవన్నూత్నకందర్పుఁ డై
తలఁపం జొప్పడుఁ జిత్రభానుఁ డతఁ డేతన్మాత్రుఁడే చూడఁగన్. 92

సీ. చంద్రమతీనాథుచందాన నలునివై
ఖరిఁ బురుకుత్సునిగతిఁ బురూర
వునిమాడ్కి సగరులాగునఁ గార్తవీర్యుని
యనువున గయునట్టు లంబరీషు
పొలుపున శశిబిందువలె నంగుపోలికఁ
బృథునిభాతి మరుత్తురీతి భరతు
కరణి సుహోత్రునిహరువున రఘులీల
రామునిక్రియ భగీరథునిఠేవ
తే. శిబితెఱంగున మాంధాతచెలువమున య
యాతిరీతి దిలీపుమర్యాద రంతి
సరణిఁ బాలించి యలరు నాచక్రవాళ
వసుమతీచక్ర మమ్మహీవల్లభుండు. 93



మ. అకలంకప్రతిభాప్రతాపవిభవుం డా రాజకంఠీరవుం
డొకనాఁ డంతిపురి న్సువర్ణవలభిప్రోన్మీలమై కెంపుమా
నికపుంబొమ్మల నొప్పు పెండ్లిచవిక న్నీలంపుఱాగద్దియం
బికవాణీనికరంబు గొల్వ సుముఖాప్తి న్నిండుకొ ల్వుండఁగన్. 94

క. ఇఱుకువలిగుబ్బచన్నుల
యెఱుకుం జవరా లొకర్త యెఱుకో యవ్వా
యెఱుకో యని తనచందం
బెఱుకపడంగా హజార మెలమిం గదిసెన్. 95

వ. అప్పు డప్పడంతుకతెఱం గమ్మహీంద్రుండు పరిచారికాజనంబులవలన విన నవధరించి సమ్ముఖమునకు రావించిన. 96

సీ. సవరనిపనివన్నెఱవిక పిక్కటిలంగఁ
గులుకు పాలుబ్బుగుబ్బలు చెలంగ
ముంజేతులను ముఖాంబుజమున నొకవింత
పొలుపు దెల్పెడు పచ్చబొట్టు లెసఁగఁ
గుఱుమాఁపుపయ్యెంటచెఱఁగులో నిడుకొన్న
ముద్దుఁబల్కులచిన్నిబుడుతఁ డమరఁ
దరతరంబులనుండి తనయింట వెలయు పు
త్తడిపైఁడిబుట్టి మస్తమున వెలుఁగ
తే. బొమలసందున నామంబుభూతిపూఁత
నెన్నొసఁటఁ బుక్కిట విడెంబు కన్నుఁగొనలఁ
గాటుక రహింప వచ్చి యాక్ష్మాతలేంద్రు
చరణముల కోరగా మ్రొక్కి చక్క నిల్చి. 97

క. ఇవి దారికట్టు మొనక
ట్టిది కాంతావశ్యకరణ మిది నీమది కిం



పొదవించు నోనరేశ్వర!
పదిలం బని తెల్పి కొన్ని బదనిక లొసఁగెన్. 98

క. తలఁపున నిది గారడ మని
తలఁపకుమా సింగఁ డల్లతఱిగొండ దరిన్
దలమోచి తెచ్చినవి యివి
తలనుంచుము పసిఁడితాయెతల నుంచి నృపా! 99

వ. అని విన్నవించిన యమ్మత్తకాశినీకరాంబురుహదత్తం బగు నయ్యుత్తమదివ్యౌషధత్రయంబు రయంబునం గ్రహించి కరుణావలోకనపరుండై ప్రియవినయగంభీరభాషణంబుల నిట్టు లనియె. 100

శా. ఏయేభూములు చూచినావె కొరవంజీ రూపలావణ్యరే
ఖాయుక్తిం దగు కొమ్మ లెందుఁ గల రీక్ష్మామండలిన్ హావభా
వాయత్తైకవిలాసవైఖరుల మేలం దెవ్వరిం జెందు న
య్యాయావార్తలు తెల్పవే మది కమందానందముం జెందఁగన్. 101

వ. అనిన విని యితండు చతుర్విధనాయికానాయకుండును బహువిధశృంగారశేఖరుండును సకలకలాధురంధరుండు నగు నని తనమనంబున వితర్కించుకొని యతని కిట్లనియె. 102

సీ. కల్కిచిల్కలపోల్కిఁ గనుపట్టు శృంగార
నటన గుల్కెడుతూర్పునాటి చెలులఁ
బులుగడిగిన ముత్యములఁ బోలి గరగరి
కలు వహించిన పాండ్యకమలముఖులఁ
జిత్ర రేఖలఁ దారసిలుచక్కఁదనముల
రాణించు కన్నడరాజ్యసతుల



బగడంపు జిగిసొంపు తగుతనుద్యుతి పెంపు
నలరెడు యవనశీతాంశుముఖులఁ
తే. గుందనంపుసలాకలయంద మొందు
నంధ్రకన్యల నిదిగాక యంగవంగ
కుకురుసౌవీరసౌరాష్ట్రకోకకుచల
వింతలన్నియుఁ గనుఁగొంటి విను నరేంద్ర! 103

తే. దేవ నవఖండమండల శ్రీవిజృంభ
మాణ మగునివ్వసుధఁ గల్గుమానవతుల
వరుస నందఱఁ గనుఁగొంటి వారిలోన
రేఖ గలయొక్కచెలి నేర్పరింతు వినుము. 104

ఉ. ఈనగరీవతంసముననే తగువైశ్యుఁ డొకండు శాశ్వత
శ్రీనిధిగేహుఁడై మదనసేనుఁ డనంగలఁ డద్బుతైకశో
భానవమోహనాకృతి ప్రభావతి వానిపురంధ్రి యొప్పు నో
మానవతీమనోజ! యసమానవయఃపరిపాకవైఖరిన్. 105

మ. దాని ఘనాఘనద్యుతివితానకనద్ఘనకేశపాశముం
దాని లసద్బిసప్రసవధాళధళీచకితేక్షణంబులుం
దాని సుగంధగంధిలసుధారసబంధురమందహాసము
న్మానవనాథ! మెచ్చుటకు మర్త్యు లమర్త్యలునైన శక్తులే. 106

క. ఆమృదులోరువిలాసం
బామోహనముఖవికాస మాదరహాసం
బామెడ యానడ యాజడ
యామేని మెఱుంగురంగు నలవియె పొగడన్. 107



సీ. భుగభుగ వాసింపఁ బొసఁగు పుత్తడిబొమ్మ
మాటాడనేర్చిన మణిశలాక
కలికిచేఁతలనొప్పు కమ్మక్రొవ్విరిబంతి
తగుజీవకళల చిత్తరువుప్రతిమ
గమనశృంగారంబు గనుపట్టు లతకూన
కలదొలంగని తొలకరిమెఱుంగు
కరచరణాంగసంగతి గన్నశశిరేఖ
హావభావములఁ జెన్నలరు సరసి
తే. యగునని గణింప బినుతింప నలవిగాదు
దానిచరణాబ్దనఖరేఖతోను బోలఁ
గలరె యీలోకమున నున్న కాంతలెల్ల
విను మహీనాథ యేమని విన్నవింతు. 108

క. ఒకపాటి పేదసంసా
రికిఁ దగ దమ్ముద్దుగుమ్మ రిపురాణ్మణిమ
స్తకమకుటఘటితనవర
త్నకళాచకచకితచరణునకుఁ గాక నృపా! 109

క. అని విన్నవించినంతనె
మనమున నుప్పొంగి వైశ్యమహిళానవమో
హనరూపరేఖవిభవము
విని విస్మయ మంది మోహవిహ్వలమతి యై. 110

తే. ఎఱుకవగలాఁడి కోరినవెల్ల నొసఁగి
ప్రియవచోవైభవంబు గాన్పింపఁ బనిచి
కొలువు చాలించి బోటిక ల్గొలువ నంతి
పురి నొకానొక మణిసౌధమున వసించె. 111



ఉ. అంతట నవ్వణిగ్వరుని యంగనపైఁ దమి హెచ్చి యామహీ
కాంతపురందరుండు రతికాంతధనుర్లతికావిముక్తదు
ర్దాంతశరాళికి న్మదమరాళికిఁ జండతరాళి కెంతయుం
జింతిలి వేదనావశవిశీర్ణమతి న్విరహార్తి నొందుచున్. 112

సీ. చెక్కిటఁ జెయి నేర్చి చింతాకులాత్ముఁడై
వనిత నేక్రియఁ దెత్తునని తలంచు
నిట్టూర్పు నిగిడించు నేఁ డయో శుకపికా
ర్బటి కోర్వలేనంచుఁ బలవరించుఁ
దనలోన తానేమొ తలయూఁచుకొని మెచ్చుం
గలవరించుచు బయ ల్గౌఁగిలించుఁ
జిత్తరువుననున్న చెలువంపుఁబ్రతిమ న
ల్లదె ప్రభావతి యంచు మదిఁ దలంచు
తే. నించు విలువంచి విరితూపు లేర్పరించి
పచ్చవన్నియచిల్కబాబావజీరుఁ
డుల్ల ముల్లోలముగఁ జేయఁ దల్లడించు
రాజముఖిమీఁదిబాళి నా రాజమౌళి. 113

ఉ. ఎప్పుడు చూడఁ గల్గునొకొ యిందుముఖీవదనారవింద మే
నెప్పుడు విందునో తెలియ దేణవిలోచన కల్కిపల్కు లిం
కెప్పుడు గౌఁగిలింతు నలయింతి కుచాద్రులురంబు సోఁక నా
కప్పుడుగాదె సౌఖ్యపర మందుటలంచు మదిం గణించుచున్. 114

క. ఉల్లము బెగడ ధరిత్రీ
వల్లభుఁ డి ట్లున్నవేళ వనితామణులం
దెల్లగుణంబుల కిరవగు
పల్లవి యను పేరుగలుగుభామ సుబుద్ధిన్. 115



సీ. వసుమతీశ్వరుఁ డున్న దెసఁ జూచి పావడ
చెఱఁగున నెమ్మోము చెమట దుడిచి
సిగ పొందుగ నమర్చి చిన్నారివిడికెంపు
తాయెతు ల్చుట్టి కుళ్ళాయి వెట్టి
చెవులయంటులఁ జక్కసవరించి ముక్తావి
చిత్రహారంబుల చిక్కుఁ దీర్చి
కలపం బలంది బంగరుగట్టికమ్ముల
వలిపెదుప్పటి వలివా టొనర్చి
తే. కేలుదమ్మికిఁ గపురబాగాలుఁ బండు
టాకుమడుపులు నొసఁగి లోకాభిరామ
వార్త లొకకొన్ని నొడివి యప్పార్థివేంద్రుఁ
బలుదెఱంగుల నలరించి పలికె నపుడు. 116

క. స్వామి యవధారు మీమదిఁ
గామించు మనోరథంబుఁ గడతేర్చెద నిం
కేమిటికిఁ జింత యన విని
భామామకరధ్వజుండు పల్లని కనియెన్. 117

తే. వైశ్యభామిని లావణ్యవైభవంబు
విని విరహవార్ధి మునుఁగున న్మనుప నెట్టు
లంటు చేసెదో యమ్మచ్చెకంటి ననుచు
నిచ్చక మొనర్చి యుడుగర లిచ్చి పసుప. 118

మ. చని యప్పల్లవి వైశ్యవల్లభుని భాస్వద్దివ్యగేహాంతరం
బున వర్తిల్లు ప్రభావతిం గనఁ దదంభోజాక్షి రాజావలం
బనసౌభాగ్యము గన్నధన్యవు ననుం బాటించి యేతేఱ నే
మి నిమిత్తంబొ యటంచు నిర్మలసుధోర్మీవైఖరిం బల్కినన్. 119



క. నినుఁ జూడఁగోరి వచ్చితి
ననవుడు సంతోషమయ్యె నని మణిపీఠిం
దను నిలుప రాజదూతిక
యనియెఁ బ్రభావతికి సముచితాయత్తమతిన్. 120

తే. ఎల్ల సౌభాగ్యములు గలయింట వెలసి
మిగులఁ జక్కనివారిలోఁ దగినదాన
వగుదు నీ బంధుజనము ని న్నభినుతింపఁ
గాఁపురము చేసితివి మేలు కమలగంధి. 121

వ. అదియునుం గాక పురాణదంపతు లగునీయత్తమామల సుమతిహరదత్తుల నాదరించు నీవివేకంబునకు మెచ్చితి సాక్షాన్మనోజుం డగు నీమనోహరున కనుగుణం బగునంతరంగంబునకు సంతోషించితి గురుబుధబాంధవదాసదాసీజనంబులం బోషించునీమహత్త్వంబుఁ గొనియాడ శక్యం బగునే యని వెండియు. 122

సీ. గుట్టుతో సంసారి మట్టునఁ జుట్టాలఁ
దనియింతు వని హరదత్తుతోడ
ఘనురాల చల్లనికడుపుదానవు నీవు
సుకృతశాలిని వంచు సుమతితోడ
మదనసేనుఁ డనంగ మఱి నీకే తగు నెంత
చెలువుఁడ వని దానిసెట్టితోడ
విశ్వాసమున నింట వెలయుపాటెల్లఁ బూ
నెద రంచుఁ దగిన బానిసెలతోడ
తే. నిచ్చక మొనర్చి హితవరియేపు చూపి
చొరవ గల్పించుకొని పరిశుద్ధురాలి



వలెనె తాఁ బోనిచో సారెపిలువనంపు
మచ్చిక యొనర్చె సమ్ముదిమాయలాడి. 123

క. అంత నొకనాఁడు రజినీ
కాంతశిలాఘటితవేదికామధ్యమునం
గొంతతడ వుండి తగనే
కాంతం బగువేళ వైశ్యకామిని కనియెన్. 124

క. ఓమధురవాణి నీమను
వేమిటనుం గడమ గాక యెంతయు నొప్పెం
దామసుఁ డగువాగ్వనితా
కాముం డొకకొంత కొదవ గల్పించెఁ గదా! 125

వ. ఆది యె ట్లంటేని. 126

సీ. బింబోష్టి నీచంద్రబింబాననము వాని
బెడఁగునోటను ముద్దువెట్టఁదగునె
కాంత నీ సిబ్బెంపుగబ్బిగుబ్బలు వాని
పరుసు చేతుల నొ త్తిపట్టఁదగునె
యబల నీకనకోపమాంగవల్లరి వాని
కఱకుమే నంటంగ నొఱయఁదగునె
రామ నీమధురాధరప్రవాళము వాని
వికటదంతముల కొప్పింపఁదగునె
తే. కొమ్మరో కుందనపుఁ గీలుబొమ్మకరణి
నొఱపుగలదాన వీవు వానరమువంటి
మగనితోఁ గూడి రతికేళిఁ బొగులఁదగునె
తగదుగా ధాత యీరీతి తగులు సేయ. 127

తే. తా ననుభవింపనేరక తగిన ఘనుని
దండ నుండంగనీక నిధానమునకు
బూచి కాచుక యున్నట్లు పువ్వుఁబోఁడి
యెట్లు సంగత మయ్యె నీ కిట్టిమగఁడు. 128

వ. ఐననుం గొదవ గా దిందుల కొక్క మహోపాయంబు విచారించితి వినుము. 129

చ. వలపులఱేనికి న్సవతువచ్చువిలాసము గల్గి యెల్ల వి
ద్యలఁ గలమేలిమిం దెలిసి యంగనలం గరఁగింప నేర్చి కో
ర్కులు సమకూర్పఁజాలి కడుఁ గొండొకప్రాయము గల్గువాని ని
స్తులతరభోగభాగ్యములు చొప్పడ నీ కొనగూర్తు మానినీ! 130

క. అతని వివరింతు విను నీ
మతికి న్సమ్మతి యొనర్చు మనరాజు జగ
ద్ధితసుప్రతాపభాస్వ
త్ప్రతిభాభానుండు చిత్రభానుం డబలా! 131

సీ. భావజ్ఞమౌళి ధాత్రీవరారోహావ
హస్తలైకైకబాహార్గళుండు
చల్లనిరాజు సాక్షాత్కారనవమోహ
నాంగసౌందర్యలీలాంగభవుఁడు
దాక్షిణ్యశాలి యాచార్యధైర్యావార్య
సకలసద్గుణగణార్జవపరుండు
చేపట్టుఁగుంచ మక్షీణరంగదభంగ
శృంగారశాస్త్రప్రసంగలోలుఁ

తే. డమ్మహారాజదేవేంద్రుఁ డంతరంగ
మెల్ల నీసొమ్ముగ నొనర్ప నేమితపము
చేసితివొ నాపలు కొకింత చిత్తగించి
తలఁపు నెఱవేర్చు కొనవమ్మ కలికి కొమ్మ. 132

వ. అనిన విని సంభ్రమభయవిస్తయాక్రాంతం బగునిజస్వాంతంబునం గొంతతడవు విచారించి దరస్మితవ్రీడాభరంబు లీడుజోడాడ వదనారవిందం బొకించుక వాంచి పంచశరశరప్రాయకటాక్షాంచలంబుల నొక్కించుక చాంచల్యం బంకురింప నచ్చంచలాక్షి రాజదూతి కిట్లనియె. 133

క. ఏ నింతనాఁటినుండియు
మానవతులలోన మిగుల మానవతిని నై
యీనాఁటికిఁ గడచితి నికఁ
నానోఁచిననోము లే మొనర్పం గలవో. 134

వ. అదియునుం గాక. 135

తే. అత్తయును మామ తలవరులై మెలంగ
మగఁడు పులివంటివాఁడు నెవ్వగ యొనర్ప
నమ్మ! యేఁ జెల్ల! యిక్కార్య మమరు టెట్లు
చాలుఁ జాలింపు మిఁక నీప్రసంగ మనిన. 136

వ. విని తదీయవచనంబున స్వప్రయోజనావకాశం బయ్యె నని తలంచి తదనుగుణం బగునట్లుగాఁ బల్లవి యిట్లనియె. 137

ఉ. ఎక్కడి యత్తమామలు నిజేశ్వరుఁ డెక్కడ వంశవర్తనం
బెక్కడ దొడ్డు కొంచెమను టెక్కడ నోలలితాంగి మోహము
న్నెక్కొనఁ జక్కనయ్య నొకనిం బిగికౌఁగిటఁ జేర్చి పెంపుసొం
పెక్కని దేటిప్రాయ మిది యెన్నఁటికిం గలుగంగనేర్చునే. 134

సీ. మగని ప్రక్కనె యుండి తగఁ జేరి జోకొట్టి
మోసపుచ్చని దేటి ముద్దరాలు
పసులగోడలనైన వసుధనిచ్చెన లేక
యెక్కనేరని దేటి యెమ్మెలాఁడి
తలవరు ల్గనుఁగొన్నఁ దప్పు నొప్పు ఘటించి
బొంకనేరని దేటి పువ్వుఁబోఁడి
దొరలు గద్దింకఁ గల్లరివార్త నిజముగా
నిర్వహింపని దేటి సీటుకత్తె
తే. యత్తమామల గృహకర్త లగుచు మెలఁగు
నట్టిధూర్తుల నెల్ల నోరదిమి గదిమి
పొంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
చక్కటికి దిద్దుకొనని దేసరసురాలు. 139

తే. ఆఁడుపుట్టునఁ బుట్టి యింతంతయైన
దిట్ట గాకున్న నది కడతేఱు టెట్లు
బేలతనమున నీవింత గోలవేని
మాను మోబాల యిఁక నిన్నిమాట లేల. 140

వ. అనినఁ బులకానుషంగం బగునిజాంగంబువలన నంగీకృతభావం బెఱింగింప నయ్యంగనారత్నంబునకు సంగనాచియగు రాజదూతిక మఱియు మఱియు బోధించి చంద్రికాసక్తచకోరకంబునుఁబోలె వైశ్యభామ కెదురుచూచుచున్న రాజపుంగవునకుఁ దదీయకథావృత్తాంతం బెఱిఁగింప మరలిచనునెడ నవ్వణిగ్వరునకు దైవయోగంబున నతిదూరప్రయాణంబు సంభవించిన. 141

చ. తనయిలువేల్పులై మెలఁగు తల్లికిఁ దండ్రికి భక్తియుక్తివం

దన మొనరించి ప్రాణసమతం దగుపెంపుడుముద్దుఁజిల్క నె
మ్మన మలరించి విద్యుదుపమానశుభాకృతి నా ప్రభావతిం
గనుఁగొని పోయిరాఁదగిన కార్యముఁ దెల్ప నవీనదైన్యయై. 142

సీ. మలయుచో మధురాతిమధురాధరల వాఁడి
చిన్నారిగోరు నీచెక్కుమీఁద
నానుచో రంగస్థలాబ్జగంధులగబ్బి
మెఱుఁగుఁజందోయి నీయురముమీఁద
మించుచోఁ గాంచికాచంచలాక్షుల ముద్దు
మొనపంటిగంటు నీమోవిమీఁదఁ
జేరుచో నెల్లూరు నారీమణుల కెంపు
పసమించు నడుగు నీనొసఁటిమీఁదఁ
తే. నింట నుండిన నీసౌఖ్య మేల కల్గు
ననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁజేర్చి
మోవిచిగురంట నొక్కి తమ్ముల మొసంగి
పోయిరమ్మని పనిచె నప్పువ్వుఁబోఁడి. 143

క. ఈరీతి వణిగ్వల్లభుఁ
డారూఢిగ నోడబేర మరిగినతఱి న
వ్వారిజముఖి కంతుశరా
సారవినిర్ఘాతజాతసంతాపమతిన్. 144

చ. మునుకొని మేరమీఱు వలపుందనముంగల త్రోవ చూపఁగా
వెనుక రతీశ్వరుండు పదవే యని యెత్తులు వెట్ట నెమ్మదిం
బెనఁగొను లజ్జయుం బొడముభీతియుఁ దన్నరికట్ట నంతలో
నినుఁ డపరాంబుధి న్మునిఁగె నీవెతలం గనలేని కైవడిన్. 145



తే. చరమదిగ్భామినీమనోహరతరాంగ
రాగవైఖరి మఱి సాంధ్యరాగ మెసఁగెఁ
గుసుమితనవీనజాతీనికుంజరీతి
నుడుగణంబులతోఁగూడ నొప్పె నభము. 146

క. తగనప్పు డజాండంబున
నిగిడెం గాఢాంధకారనిబిడమరీచుల్
జిగి కుందనంపుబరణి
న్మృగమదపంకంబుఁ గలయనించిన కరణిన్. 147

వ. అప్పు డయ్యెప్పులకుప్ప యగుప్రభావతీసతి విలాసవతీరతీశ్వడుం డగు నమ్మహీశ్వరునితో ననంగసంగరవాంఛ తరంగితంబై తురంగలించు తమకంబున. 148

సీ. నానావిధద్రవ్యనవ్యసంభారము
ల్గలగృహంబులకు బీగము లమర్చి
మొదవుల నన్నింటిఁ బిదికిన పాల్గాచి
యొనరఁ దోడంటుతో సుట్టిఁబెట్టి
పనులు దీర్చిన తొత్తుపడుచుల నిష్టాన్న
తృప్తినొందఁగఁ జేసి యిండ్ల కనిచి
యత్తమామలు సుఖాయత్తులై పవళింప
మృదుపదంబుల నొత్తి నీదురవుచ్చి
తే. జలక మొనరించి జిలుఁగుమేల్వలువ గట్టి
కలప మలఁది మితాహారకలనఁ దేలి
వీడియం బందుకొని యొక్కయూడిగంపు
బుడుత తనవెంట నడువ నప్పువ్వుఁబోఁడి. 149

క. తనకుం బ్రాణపదంబును
దనయనుఁగుంజెలియుఁ దనకు దైవం బగుచుం
దనరు తనరాజకీరముఁ
గని యవ్వలఁ జనుట తగిన కార్యం బనుచున్. 150

తే. కనకమణిపంజరశుకాగ్రగణ్యుఁ జేరి
కోరి యాత్మీయగాథాప్రకార మెల్ల
మెల్లమెల్లన దరహాస ముల్లసిల్ల
నంతయును దెల్పఁ జిల్క యత్యాగ్రహమున. 151

క. కటకటఁబడి పక్షద్వయ
పుటచలన మొనర్చి మిగులఁ బొగులుచు మదిలో
నిటు నటు దెలియని చింతా
కుటిలస్థితి నింతి కనియెఁ గోప మెలర్పన్. 152

క. ఓహరిణనయన "స్వామి
ద్రోహ మిదంభార” మనుచుఁ దొలుతనె విబుధ
వ్యూహంబు పలుక వినమే
యాహా యీమాట వినఁగ నర్హమె మాకున్. 153

ఉ. [2]ఓవర వైశ్యవంశకలశోదధికల్పలతాలతాంగి నీ
పోవని వారిముందఱ నయో మగనిం గడకాళ్లఁ ద్రోచి నేఁ
డీవసుధేశునిం గలయ నెంచితి వెట్లు? పతివ్రతామణు
ల్వావులు పుత్తురమ్ము తలవంపులు చేయుదురమ్మ జాతికిన్. 154

సీ. దశకంధరుని మోహదశ విచారించెనే
సకలజగన్మాత జనకజాత



నహుషభూపాలు మన్నన కొప్పుకొనియెనే
స్త్రీరత్నమైన శచీపురంధ్రి
యల సింహబలుని మాయలఁ జిక్కి చొక్కెనే
విపులసద్గుణమాన్య ద్రుపదకన్య
శబరాధిపునిదురాశలకు లోనయ్యేనే
రతినిభాకృతి భీమరాజపుత్రి
తే. తొల్లిటి మహాపతివ్రతల్ దుర్మదాంధ
కాపురుషు లంగభవశరాఘాతవికల
చిత్తులై తముఁ జేరి యాచించినపుడు
సిగ్గు వోనాడుకొనిరఁటే చిగురుఁబోఁడి. 155

ఆ. ప్రాణహాని మానభంగంబు నగు నన
కెంతపనికిఁ జొచ్చితే మృగాక్షి
జగతి నీమనంబు "తెగువయే దేవేంద్ర,
పదవి" యనెడుసుద్దిఁ బొదలఁబోలు. 156

క. పతిభక్తి గలుగుసతికిన్
వ్రతములతో గొడవ యేల వఱలు సుకృతముల్
పతిభక్తి లేని చెనఁటికి
వ్రతములు చను వేయి యొక్కవ్యభిచారమునన్. 157

వ. కావునఁ గులాంగనాతిలకంబునకుఁ గలకంఠీసముచితకృత్యంబు పాతివ్రత్యంబు నీవు వైపరీత్యం బగుప్రయోజనం బాచరించితి విట్లైన నిహపరంబులకు దూరం బగుదు వని సుభాషితంబులు పచరించిన నవ్వచనంబులు కర్ణపుటంబులకు జిలుగుటంపములుకులపొలుపు దెలుపఁ గలికి యులికిపడి రూక్షేక్షణంబుల నాశుశుక్షణికణంబులు చిలుకఁ జిలుకం గనుం గొనిన నప్పతంగపుంగవం బక్కటా! యిక్కురంగనయన కనంగతత్త్వంబు సంభవించె నిది సామంబునం గాని చక్కంబడదని తలంచి లంబికావలంబనమహాయోగిచందంబునఁ గొండొకతడపు నిశ్చలధ్యానపరాయణం బైయుండి వెండియు నయ్యంగన కిట్లనియె. 158

క. వినవమ్మ భామినీమణి
మనమున నీ కితరసంగమము ప్రియమైన
న్మును గొంతి కమలబాంధవు
నెనసియుఁ బొన మెఱుఁగునట్లనే వర్తిలుమీ. 159

తే. కాక తలవెఱ్ఱి గొని యలగౌతమాంగ
నామణి సురేంద్రు నొకనాఁడు నంటుచేసి
యాపదలఁ జెంది సకలలోకాపవాద
మొందు టెఱుఁగవె యట్లు గాకుండవలయు. 160
క. నీపట్టు గలుగువాఁడై
చేపట్టుంగుంచ మైన చెలువుని నొకనిం
జేపట్టి రతులఁ దేలక
యేపట్టున రాజు నిచ్చయించితి వబలా. 161

సీ. రాజులు కుటిలసర్పమహోగ్రతరమూర్తు
లధరబింబము పంట నదుము టెట్లు
సార్వభౌములు చండశార్దూలసమచిత్తు
లించువేడుకఁ గౌఁగిలించు టెట్లు
[3]కువలయాధీశ్వరు ల్దవహుతాశనకల్పు
లండనుప్పొంగి పరుండు టెట్లు



నరవరేణ్యులు భద్రకరిమదాంధమనీషు
లెనసి బంధరతాప్తిఁ బెనఁగు టెట్లు
తే. చక్రవర్తులు మాననిర్వక్రవర్తు
లతులతరగాఢసురతవేళాతివేల
తాడనచపేటము లొనర్పఁ దలఁచు టెట్లు
తెలిసి కలయిక లొనగూడ మెలఁగవమ్మ. 162

క. వారలగుణానుగుణముగ
వారక కనుగలిగి నడుచువారల కెలమిన్
శ్రీరంజిలు జయ మొదవు ను
దారత నీపదు నెఱింగి యలవడు మబలా. 163

వ. ఇత్తెఱంగునఁ దత్తరంబు లేక వర్తిల్లుమని విన్నవించిన. 164

క. అభినవవినీతివార్తా
విభవం బభిరామలీల వినుచున్నతఱిన్
నభము నభమైనఁ గనుఁగొని
యిభగామిని నాఁటి కరిగి యిలు సేరుటయున్. 163

వ. అంత నద్ధరాకాంతుండు తదనంతరకథాక్రమం బెట్టిది యానతిమ్మనుడు. 166

తే. అవధరింపుము సకలరాజాధిరాజ
సతపదాంభోజుఁ డగు ధర్మనందనునకు
సరసవైదికలౌకికాచారవిహిత
హితకథారమ్యుఁ డగుధౌమ్యుఁ డిట్టులనియె. 167

క. ఆగుణవతి మఱునాఁ డను
రాగాప్తిన్ రాత్రివేళ రమణీయకళా

భోగశుభాకృతి రతిశు
శ్రీగులుక న్రాజసేవ సేయుట కెలమిన్. 168

చ. కలువలు కొప్పున న్నగుమొగంబునఁ గస్తురిబొట్టు పట్టుకు
చ్చలయును జంద్రకావిబురుసాపనివల్వయు మై రహింపఁగా
నలవడు మేల్ముసుంగుపయి నంగరుచిచ్ఛట లొప్ప నప్పు డా
కలికి రమాకుమారు తురగంబుకడం దగఁ జేరె నంతటన్. 169

తే. చిలుక ముద్దులు చిలుక రాజీవనయన
ననునయించి వచించు నోయబల నృపకు
లేంద్రుఁ గదిసెద నని వచ్చు టేనెఱుఁగుదు
నుబికి చనఁదగ దితిహాస మొకటి వినుము. 170

మొదటికథ

క. అనఁగా ననఁగా నొకపుర
మొనరుం జంద్రవతి యనఁగ నుద్యోతవినూ
తనఖద్యోతనికేతన
ఘనకేతనరుచిరకనకకలశం బగుచున్. 171

తే. అన్నగర మేలు రత్నాకరాహ్వయుండు
వికటమత్తాహితవిఫాలుఁ డొకనృపాలుఁ
డతని నగరున నోడకాఁ డగుచు నొకఁడు
వెలయు వసుమంతుఁ డనుగౌర చెలువుమీఱ. 172

వ. వెండియు నయ్యఖండతరసంపత్కుబేరుం డగునతండు. 173

శా. ఏయూరం దనయంగడు ల్నెఱయ నేయేబేరు లెందైన నా
త్మాయత్తైకధనంబు సంచిమొదలై యత్యార్జనం బొందఁగా
శ్రేయఃకీర్తులు సంఘటిల్లఁ దను సుశ్రీమించఁగా నిల్పె న
య్యాయం బేర్పడఁ గోటికిం బడగ లెన్నైనం బ్రమోదంబునన్. 174

చ. వలసిన బేరము ల్తెలియవచ్చినవారును వాదుగల్గువా
రలు మఱి గుత్తగొల్లలును రత్నపరీక్షలవారుఁ గార్యము
ల్గలిగిన యింగిలీసుల ముఖాములుఁ జెంగట నుల్లసిల్లఁగాఁ
గొలువుననుండుఁ జూపఱలకుం గనుపండువు సంఘటిల్లఁగాన్. 175
 
క. [4]ఈళయు విళంగయును బం
గాళయు మొదలైన పేరుగలదీవులలో
మేలైనసరకు లాతని
కౌలున దిగు మాట నిజము గలవాఁ డగుటన్. 176

తే. అతనివలన మహీదేవుఁ డచట నొక్క
డలఘువిద్యాధురంధరుఁ డగుఘనుండు
తగుం గళావంతుఁ డనువాఁడు తలఁప నతని
సరసవాక్ప్రౌఢి దొరలెల్ల సన్నుతింప. 177

సీ. హాళి పుట్టించు సు్దయత్సుధారసధార
లుప్పతిల్లఁ గవిత్వ ముగ్గడించి
రక్తిఁ గల్పించుఁ గర్ణరసాయనము గాఁగ
సమధికస్ఫూర్తి గీతములు వాడి
యింపొనర్చు ధరాతలేశ్వరవరసభా
స్థలి సత్ప్రసంగ వార్తలు ఘటించి
యద్భుతం బొసఁగు శబ్దార్థవైచిత్రిని
బంధనకావ్యవైభవము నొడివి
తే. యింతమాత్రంబె కాదు శ్రీమంతుఁడును ని
తాంతశుభవంతుఁ డగువసుమంతుఁ డలర

దండ నొకవేళ నీతిసంధానలీల
బుద్ధులన్నియుఁ దెల్పు నప్పుడమివేల్పు. 178

క. ఈరీతి సకలధర్మ[5]వి
చారుం డగునతనిమాట జవదాటక య
గ్గౌర మనుచున్నఁ దన్నగ
రీరత్నం బేలునట్టి నృపవరుఁ డెలమిన్. 179

తే. మంతు కెక్కిన యవ్వసుమంతు ననున
యించి ప్రియభాషణంబుల హితవొనర్చి
జలధి కవ్వలదీవులఁ గలసమస్త
వస్తువులు బొక్కసముఁ జేర్పవలయు ననుడు. 180

ఉ. రా జొనరించు మన్ననకు రంజిలి యవ్వసుమంతుఁ డష్టది
గ్రాజమనోభయంకరపరాక్రముఁ డానృపుతోడ నేన య
వ్యాజత దీవి కేగి కలవస్తువు లన్నియుఁ దెత్తుఁ బంపుమో
రాజకులేంద్ర యంచు సుకరంబున మున్ను వచించి పిమ్మటన్. 181

క. తననగరుఁ జేరి సమధిక
ధనధాన్యసుపుత్రమిత్రదారాలయమం
డనమైన కాఁపురం బిది
యను వగునే విడిచి చనుట కని చింతిలుచున్. 182

ఉ. కారుమెఱుంగురాచిలుక కస్తురివీణ పదాఱువన్నె బం
గారము రస్తుకుప్ప తెలిగంబుర వెన్నెలలోని తేట యొ
య్యారపుఁడెంకి యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ సిం
గారపుదొంతి యైనకులకాంత నయో యెడఁబాయనేర్తునే. 182

తే. అనుచు మదిలోనఁ దలపోసి యడలునంతఁ
జెంతనాసీనుఁ డగుకలావంతుఁ డనియె
దొరలచెంగట వెనుకముందును దలంప
కార్యుఁడు వచింపఁ దగునె యేకార్యమైన. 184

క. మునుకొని తత్ప్రకృతంబును
దనశక్తియు దేశకాలధర్మము నృపున
ర్తనమును రాణువసంచును
గని మాటాడంగవలయుఁ గద సభలోనన్. 185

వ. ఇత్తెఱంగునం బ్రవర్తింపక దైవయోగంబువలనఁ బ్రమాదంబని తలంపక రాజసన్మానంబునకు నుబ్బి తబ్బిబ్బు గాఁ బచరించిన భవద్వచనం బమోఘంబు గావింపవలయుం గాక నిరర్థకం బొనరించినం గొదవ యగుంగదా సకలజనశ్రేయస్కరంబును స్వకీయజనజీవనాధారంబును బహుప్రసిద్ధియునుం గలుగునట్టుగా రాజోచితకార్యంబు నిర్వహింపుమని విన్నవించిన. 186

తే. సమ్మదంబున వసుమంతుఁ డుమ్మలించి
కూర్మిబంధుల నందఱఁ గుస్తరించి
గోలయుఁ బలివ్రతాధర్మశీల యగుచుఁ
బ్రాణపదమైన యిల్లాలిపజ్జఁ జేరి. 187

చ. మది వెతఁజెంద బేడిసల మార్కొనుకన్నులు నీరుబుగ్గలై
పొదలఁగ ఘర్మబిందుపరిపూర్ణతనూలత కంప మొందఁగా
మృదుమధురోక్తి తొట్రుగొన మేలుకనంబడ వెచ్చనూర్చున
మ్మదవతి నాదరించి వసుమంతుఁడు దా నలనాఁటి వేకువన్. 188

క. పరికరముల మంకెనలును
బరిచారకు లరిదిపనులపట్టుగుడారుల్
సరిబేరు లైనగౌరలు
దొరయం జనవిఫ్రుఁ డతనితో నిట్లనియెన్. 189

క. చనుము బహుశ్రేయస్థితిఁ
గని పునరావృత్తి మహిమ గలిగి శుభాప్తిన్
మను మింకొక్కటి తెల్పెద
వినుము మదీయప్రసంగవివశాత్ముఁడవై. 190

తే. అతిరయంబున నొకకార్య మాచరించు
నతనియవివేక మఖిలాపదాస్పదంబు
తెలిసి సత్కార్యభాగవర్ధిష్ణుఁ డైన
ప్రాజ్ఞుఁడు కృతప్రలబ్ధసంపదలఁ బొదలు. 191

మ. అని పల్క న్విని యేతదర్థకృతపద్యం బప్డు తాళీదళం
బున వ్రాయించి మెఱుంగుకత్తి యొఱలోఁ బొందించి తానత్తఱిం
జని పొంతం గనియె న్మహానటజటాఝూటస్ఫురన్నిర్గళ
ద్ఘనధారాపతనప్రకంపితమహాక్ష్మాభాగ భాగీరథిన్. 192

వ. కని యప్పు డప్పుణ్యతరంగిణీజలంబులఁ గృతస్నానదానాద్యనుష్ఠానుండై కృతకృత్యుం డగుచు నచ్చోటివాసి యిలావృతహిరణ్మయరమ్యకభారతప్రముఖబహువిధవర్షంబు లవలోకించి తత్తద్విచిత్రంబుల కాశ్చర్యం బంది యవ్వలం గడచి నడచి యనేక దుర్గవర్గకాంతారమార్గంబు లతిక్రమించి చనునప్పు డప్పురో భాగంబున. 193

సీ. స్వరునిష్ఠురాఘాతసంక్షోభమున కళ్కి
మైనాకుఁ డెవ్వాని మఱుఁగుఁ జొచ్చె
మునికోపనిర్ధూతఘనతరైశ్వర్యంబు
నగభేది కెవ్వాఁడు మగుడ నొసఁగె
సకలజంతువ్రాతసంరక్షణఖ్యాతి
జలధరం బెవ్వానివలనఁ జెందె
సంపత్కటాక్షలక్షణకన్య నలరించి
దనుజారి కెవ్వాడు ధారవోసె
తే. నతఁడు ముంగలఁ గననయ్యె నంబుచరకు
ళీరముఖసత్వచటులసంచారజనిత
బహువిధాభ్రంకషోర్మికాభయదఘుమఘు
మారవశ్రీకరుండు రత్నాకరుండు. 194

క. అచ్చోటఁ గడలిరాయని
నచ్చుగ వీక్షించి కౌతుకాయత్తమతి
న్మెచ్చుకొని చేరనరిగె వి
యచ్చరజనవినుతమైన యవ్వలిదీవిన్. 195

తే. అందలి విచిత్రవేషభాషాభిరాము
లగుపరంగులతోడి నెయ్యమునఁ జిక్కి
చొక్కి బహువత్సరంబు లచ్చో వసించి
పిదపఁ బ్రభుకార్యభారంబు మదిఁ దలంచి. 196

సీ. నవవిధదివ్యరత్నంబు లేనుంగులు
గోపతేజీ ల్పచ్చికుంకుమంబు
కస్తూరివీణెలు కట్టజవ్వాది క
ప్పురము బన్నీరుచెంబులు పటీర

తరులఖండంబు లందలపుఁగొమ్ములు జల్లి
సవరము ల్పాదరసంబు జాజి
శాయ యింగువ లవంగంబులు నోడపోఁ
కలు పంచలవణము ల్గంధకంబు
తే. కొచ్చివేఁపులు మానిసిక్రోఁతు లాది
యైన వన్నియు నోడల కనువుపఱచి
కడలి దాఁటించి చెల్లెలికట్టఁ గడచి
యంత నెఱవేఱి తనయూరిచెంతఁ జేరి. 197

తే. పటకుటీరాంగణములలో బహువిధైక
వస్తువులు కుప్ప లొనరించి వసుమతీంద్రు
చెంత కానుక లిడనెంచు నంతలోన
నంబుజవనీమనోహరుం డస్తమించె. 198

మ. వసుమంతుం డపు డంతరంగజనితవ్యామోహభారంబున
న్వెసం బ్రాణేశ్వరిఁ జూడఁగోరి త్రిజగద్వీరుండు మారుండు తీ
వ్రసుమాస్త్రప్రహతిన్ హళాహళి యొనర్పం దద్వియోగవ్యథా
వ్యసనాప్తి న్నిలుపోపలేక విరహవ్యాప్తి న్వగం జెందుచున్. 199

చ. అడలుచుఁ దాళరానివిరహార్తి మెయిం దురిటిల్లు దానికీ
ల్జడపస దాని బేడిసపిసాళికనుంగవ దానియంచరా
నడుపులు దానిమోవిరుచినాణెము దానిమెఱుంగు దానిను
న్బెడగును గుబ్బచన్నుఁగవపెంపుఁ దనూలతసొంపుఁ జూడమిన్. 200

వ. వెండియు. 201

మ. ముకురంబుల్ నునుజెక్కు లక్కలికినెమ్మో మామఱింజందమా
మకు మేలై తగు గుబ్బచన్నులకు ఱొమ్ముం జాల దాకన్ను లా
వికచాబ్దంబుల నేలు నయ్యబల నివ్వేళ న్విలోకింపకే
నకటా యేగతి సైఁచువాఁడ నని మోహాక్రాంతచేతస్కుఁడై. 202

చ. నను నెడబాయలేనియెలనాఁగ వియోగభరార్తి నిప్పుడే
యనుపున నున్నదో నిజగృహం బెటులయ్యెనొ యొంటిపాటునం
గనఁదగునంచుఁ దీక్షతరఖడ్గధరుండయి గూఢవర్తనం
బుస వెసఁ జేరె నంతపురముం దను నన్యు లెఱుంగనట్లుగాన్. 203

ఉ. ఆరసికాగ్రగణ్యుం డపుడయ్యవరోధవిచిత్ర కేళికా
గారము సొచ్చి చొక్కటపుఁగంకటిపై నొకమోహనాంగశృం
గారునితోడ దీపకళిక ల్వెలుఁగ న్నిదురించుచున్న య
న్నీరజగంధిఁ జూచి యెద నెగ్గురనంగడు విస్మితాత్ముఁడై. 204

క. కనుఁగొనల నిప్పు లురులగం
గనలుచు శివశివ యిదేమి కారణ మెటులం
గనువాఁడ నేరితో నే
మనువాఁడం గొఱఁతవచ్చెనని చింతిలుచున్. 205

క. కాంతల నమ్ముదురే ధీ
మంతు లిసీ సుతనులతలు మాయామృగముల్
హంతలు జగజంతలు నిసు
మంతయు లోకాపవాద మరయరు మదిలోన్. 206

మ. నిలువెల్లం గనకంబు ముద్దుపలుకు ల్నిర్యత్సుధాబిందువు
ల్సొలపుంజూపులు చంద్రికారుచు లటంచు న్నమ్మి యున్నట్టు

లి
క్కలకంఠుల్భువి సాభిమానలని వక్కాణించితిం గానిదో
షలతాదోహదలై ప్రవర్తిలుట యోజం గానలేనైతిగా. 207

వ. అని బహువిధంబుల వితర్కించి. 208

క. రెండొకటిగఁ గంటిఁగదా
దండించుట నీతి యాౌఁగదా యని కడును
ద్దండతరచండమతియై
ఖండా యొఱడుస్సివైచి కర మెత్తుటయున్. 209

తే. మును గళావంతుఁ డానతిచ్చినసుభాషి
తము లిఖించినచీటి దోర్దండచండ
మండలాగ్రంపుటొఱలోన మాటియుండె
గాన నది నేల వ్రాలుటఁ గని యతండు. 210

క. ఇది యేమో యని కేలం
గదియించి ప్రదీప్తదీపకళిక వెలుఁగునం
జదువుచుఁ బ్రాక్తనవిద్వ
త్ప్రదనీతిశ్లోక మగుట భావించి వెసన్. 211

తే. “అతిరయంబున నొకకార్య మాచరించు
నతనియవివేక మఖిలాపదాస్పదంబు
తెలిసి సత్కార్యభాగవర్ధిష్ణుఁడైన
ప్రాజ్ఞుఁడు కృతప్రలబ్ధసంపదలఁ బొదలు.” 212

వ. అని యివ్విధంబునం గననైనఁ దచ్ఛ్లోకం బరసి నిజవధూమణిం దిలకించిన. 213



ఉ. మాసినదీర్ఘవేణి కుఱుమాసిన చేలచెఱం గలం క్రియా
వాసముగాని మేను వసివాఁడిన ముద్దుమొగంబుఁ గాంచియ
య్యో సరసీరుహాక్షి మదయోగభరంబున నిట్లు ఖిన్నయై
గాసి వహించియున్నదని కంది వెస న్వసుమంతుఁ డత్తఱిన్. 214

మ. మది నొక్కించుక శాంతి నొంది యొఱలో మాద్యద్విరోధివ్యథా
స్పదశౌర్యంబగు వాలు సేర్చి సతిపజ్ఞం జేరి నిద్రించు నీ
మదనప్రాయుఁడు నన్నుఁ బోలిన జగన్మాన్యైక రేఖాంగసం
పదఁ జెన్నొందినవాఁ డిదేమొ యనుచుం భావించి తానాత్మలోన్. 215

క. ఈనాఁ డయ్యెడు కార్యము
గానేరదె ఱేపటంచుఁ గడునెమ్మది న
మ్మానధురంధరుఁ డతఁ డా
స్థానస్థలమునకుఁ జనియె జలజాతముఖీ. 216

ఉ. అంత లతాంతచాపలత యంగభవుం డపు డెక్కుడించెఁ ద
త్కాంత ప్రభాతమయ్యెనని కాంతనిశాకరకాంతమందిరా
భ్యంతరవర్తియై తపనుఁ డస్తగిరీంద్రముపొంతఁ జేరుప
ర్యంతము వేఁగి వేగ విహగాగ్రణి మ్రోలవసించి వేడుకన్. 217

క. కడమకథ నుడువు మనినం
బడఁతికి శుకలోకపట్టభద్రుడు తెలిపెన్
వడి నాఘనుఁడు నిశీథిని
గడతేఱి ప్రభాత మగుటఁ గని యవ్వేళన్. 218

వ. యథోచితనిత్యకృత్యం బగుసత్కర్మకలాపంబు నిర్వర్తించి తదనంతరంబ. 219

తే. లీల రత్నాకరుండు నిండోలగమున
నుండి తనుఁ బిల్వఁబంప నమ్మండలేంద్రు
జేరి నానావిధద్వీపచిత్రదేశ
వివిధవార్తాప్రసంగము ల్విన్నవించి. 220

క. తెచ్చిన సమస్తవస్తువు
లచ్చుపడ స్సమ్ముఖమున నలవడ నిడి త
న్మెచ్చి కొలువెల్లఁ బొగడఁగ
నచ్చో వివరింపఁదొడఁగె నధిపుం డలరన్. 221

రగడ—
దేవ యవలోకింపు మిది తెలిదీవిఁ బొడమిన పద్మరాగము
పావనం బొనరించుఁ దను వనపాపొయరుచి నల పుష్యరాగము
తళుకుఁ దుమ్మెదతాళి కగునని తలఁపుమీ యీళాపునీలము
వెలఁదులకుఁ జేర్చుక్కతుద నొదవించు ముడువగు నీప్రవాళము
గొప్పలగు చౌకట్లకని చేకొంటి మివె కట్టాణిపూసలు
చెప్పఁ జూపంగరావు మక్కాసీమ వీగుజరీతివాసులు
ఎత్తుకెత్తు మెఱుంగుకుందన మిచ్చి తెచ్చితి మీసిరాజులు
హత్తివాయుమనోజవంబుల నలరు నీసామ్రాణితేజులు
కురుచలైనను నిచ్చమదమునఁ గొఱలు నీయేనుంగుగున్నలు
దొరయ నొకపరిపాటి దొరలకు దొరక వీవిడికెంపుమిన్నలు
కలువడంబులఁ గలయ వివి చొక్కంబులగు కస్తూరివీణెలు
తెలిసి వేయివరాల విలువలు దీర్చితిమి యీరుద్రవీణలు
నిలువు నిలివెఁడు సోగవగపెన్నెరుల కివి సమకట్టు జల్లులు
పిలుపులను గడుఁబ్రోది సేయఁగఁ బెరిఁగినవి జవ్వాదిపిల్లలు
గమ్మురని పన్నీరు తొలకెడుఁ గంటివేయివి గాజుపనఁటులు

చిమ్మి రేఁగెడు కప్పురపురవఁ జెందునీ యేడాకు టనఁటులు
వహిఁ దొలంగక నీటిపైఁ జనువరుస నీయందలఁపుఁ గొమ్ములు
బహువిధమ్ములఁ జదువు నివిగోఁ బంచవర్ణము లగుశుకమ్ములు
పంచలోహపుగట్టిపనులను భద్రమైనవి యివె పిరంగులు
కంచుమించుగ నడవిమెకముల గదుము నివిగో బలుసివంగులు
అల్లనేరెడువాగుజలములనైన యవి యపరంజిలప్పలు
మొల్లముగ రజతాద్రి కెనయై మొనయు నీతెలివెండికుప్పలు
పట్టుపిడికెఁడు నెనయు జీనువుపట్టురవలివె జవిడికట్టులు
యిట్టలపురతి వేళఁ గవకిన లెసఁగునీ బక దారిపిట్టలు
చికిలిపుత్తడి క్రొత్తహరువులఁ జెందు నివిగో సూరెపానులు
ఒకటఁగస్తురిమెకము లుండుట కొప్పు నీదంతంపుబోనులు
ఎసఁగ నన్నములోని విసముల నేర్పఱుచు నీసింగిలీకలు
అసమశౌర్యధురీణులకు బిరుదందు రల్లవె హరిచెయీకెలు
సొగసు పటికంబుల నమర్చిరి చూడు మీసొగటాలచందము
పగడముల నీలముల నిరుగడ బలములవె చదరంగమందము
గాలికన్నను వేగఁ జను చులుకనివి యివె కొల్లారుబండులు
మేలిమిగ రాహత్తులకు నియమించినవి సింగాణివిండులు
త్రొక్కినారు పదేసిమణుఁగులు తొలుత నీకుంకుమపుగోనెలు
మిక్కుటపుఁ గస్తూరివలపుల మించు పునుఁ గిడఁదగినపూనెలు
మలయగిరికూటమునఁ గల వీ మంచిసిరిగందంపుమ్రాకులు
తళుకుఁ దళుకున మించునివె నిద్దంపుమగఱాపిడులబాకులు
ఆనవాల్గ్రోలుటకుఁ దగు నీయబ్బురఫు నెలఱాలగిన్నెలు
పూని యుడిగ మొనర్పనేర్తురు పొంత నీయుడిగంపుఁగన్నెలు

ఠీవి నలఖర్జూరములఁ బురుడించు నల్లవె యోడపోఁకలు
శ్రీ వెలయు గేదంగిఱేకులచెలువు గల వీపండుటాకులు. 222

క. అని గౌర పలుదెఱంగుల
వినిపించి యొసంగు వస్తువితతుల నెల్లం
గొని యెంచుకొని నృపాలుఁడు
మనమున నుప్పొంగి సబహుమానప్రౌఢిన్. 223

చ. విడిగల కెంపురారవల వింతపనుల్గలతాళి వజ్రపుం
గడియములు న్సుపాణులచొకాటపుచౌకళికట్టువర్గము
ల్గడుఁబ్రియ మొప్పనిచ్చి కుతుకస్థితి నవ్వసుమంతు నప్పు డ
య్యొడయఁడు పంప నింద్రవిభవోన్నతుఁడై యతఁ డింటి కేగినన్. 224

తే. అతని పాణిగృహీతి మోహనతరాతి
రూపవిఖ్యాతి రతిరీతి నేపుఁజూపి
వెలయు గుణవతి తన ప్రాణవిభుని రాక
కుబ్బి సంతోషరసవార్ధి నోలలాడి. 225

సీ. పసుపు నల్గుఘటించి పైఠాణి సవరించె
జిగిమేని కొకవింత సిరి జనింపఁ
గడల రేఖ లమర్చి కాటుక దీర్చె వా
ల్గన్నుల కొకవింతకాంతి మెఱయ
నిలువుటద్దము చూచి తిలకంబు దిద్దె నె
మ్మొగమున కొకవింతముద్దు గులుక
జవ్వాది పదనిచ్చి కొవ్విరు ల్ముడిచెఁ బె
న్నెఱివేణి కొకవింతహరువు లెసఁగ

తే. మఱియు నిలువెల్ల నొకవింతయొఱపు నెఱప
నింటఁగలచొక్కటపుసొమ్ము లెల్లఁ దాల్చి
వినయలజ్జాభయంబులు నెనయఁ బ్రాణ
నాథునకు మ్రొక్కి నిలిచె నానలిననయన. 226

తే. అంత నతిలోకచారిత్రుఁ డగుసుపుత్రుఁ
డతివినయభక్తి త్పర్యయుతము గాఁగ
హితబుథాశ్రితగురుపురోహితులతోడ
జనకుకడ నిల్చి సాష్టాంగవినతి సేయ. 227

ఉ. ఎత్తి దృఢాంకపాళిఁ గదియించియు నిన్నటి యర్ధరాత్రి నీ
చిత్తజరూపుఁ డీయబలచెంతఁ దమి న్నిదురించుచున్నవాఁ
డిత్తఱి నన్నుఁ జేరె భయ మించుక యేనియు లేక వీని దు
ర్వృత్తిసువృత్తు లే నెఱుఁగు టెట్టులొకో యని సంశయింపఁగన్. 228

క. కులవృద్ధు లప్పు డాతని
కళ యెఱిఁగి భవత్ప్రయాణకాలంబున నీ
కులకాంతాతిలకం బీ
యళికచ నెలమసలియుండు టది యెఱుఁగవొకో. 229

తే. అంత నీశ్వరుకరుణాప్తి ననుదినప్ర
వర్ధనంబైన తద్గర్భవనధివలన
నవతరించె నితండు నీయౌరసుండు
కనుఁగొను మటన్న సంతోషకలితుఁ డగుచు. 230

క. సతిపాతివ్రత్యంబును
సుతునిగుణాఢ్యతయుఁ దెలిసి చుట్టపువారల్

మతి సమ్మతించునట్లుగఁ
జతురుండై మెలఁగె నతఁడు సరసీజాక్షీ. 231

తే. ఇత్తెఱంగున మనసెట్టి యింటిమీఁది
బాళినైనను నినుఁజూచు బాళినైన
నింతలో వచ్చె నేని నీవింట లేమి
కేమనుచు బొంకఁగలవు పూర్ణేందువదన. 232

క. ఈకథ వింటివి గద య
స్తోకమతివి దెలిసికొమ్ము సూత్రప్రాయం
బై కనుఁగొన నయ్యెడు కా
ర్యాకార్యము లని వచింప నటు వేగుటయున్. 233

క. ఱెక్కలు విదిల్చి లావులు
ముక్కుకొనం దువ్వి మోదమునఁ గంధరముల్
మిక్కిలి దిక్కుగనుంగొనఁ
గోక్కురోకో యనుచుఁ గోళ్లు కూయం దొడఁగెన్. 234

క. ముడిఁగె దొగ లడఁగె ఱిక్కలు
విడిగెఁ బయోజమ్ము లుడిగె వెన్నెల లటు గ్రుం
కడిగె నెలవడిగెఁ గత్తిం
గడిగె మరుం డినుఁడు తూర్పుకడఁ బొడమునెడన్. 235

తే. అంత నయ్యింతి యింత యంతనఁగ రాని
వంతఁ దన యంతిపురిఁ జేరి కంతునిసిత
కుంతహతిఁ గొంతగుంది సాయంతనాప్తి
నెంతయు దురంతవిరహసంక్రాంత యగుచు. 236

సీ. మెఱుఁగంచు కమ్మలు నిరసించు మితి లేని
వెలనొప్పు మణుల కమ్మలు ధరించి
సూలచేకటు లొకమూలవై చి సిరాజి
గనుపుల గళ్లచేకటులఁ దాల్చి
యక్కచె వాదుల యరతుబొట్టట వెట్టి
పుత్తడి మెడనూలి బొట్టమర్చి
చిఱుతపొప్పళిరోసి సరిగంచుపసరు పొ
ప్పళికుచ్చెల చెఱంగు వలువగట్టి
తే. సేస కొప్పునఁ గపురంపుచిత్రకంబు
గళమునఁ గుచాద్రులను దళ్కుగందవొడియు
వలపు గులికెడు సింగార మొలుక ముద్దుఁ
జిలుకకడ నిల్చెఁ గోమటికులుకులాఁడి. 237

తే. చెంతనిటు నిల్చియున్న యక్కాంతఁ జూచి
చిలుక యొకవార్త వివరింపఁ దలఁచినపుడె
కలికి నన్నపు డారాజతిలకుఁగూర్చి
మిగుల నుపకార మొనరింపఁ దగునసుండు. 238

ఉ. కాంతరొ యెట్లు కాఁదగిన కార్యము లట్లగు మున్గళావతీ
కాంతకు మోహనాంగు నుపకాంతుని నమ్మణిమండనక్షమా
కాంతుని నేనె కూర్చి యుపకార మొనర్చితి నే తలంప నొ
క్కింతయు నంతరాయ మగునే విధి వ్రాసిన వ్రాత కిమ్మహిన్. 239

రెండవ కథ

వ. అది యెట్లం టేని విను మీప్రకారంబునకుం దగిన జగదసాధారణం బగునొక్క గాథ కలదు వివరించెద నిది సావధానంబుగా నాకర్ణింపు మని యిట్లనియె. 240

క. కమలాకరమను నొకపుర
మమరు సురవ్రజనుతధ్వజానీకమరు
ద్భ్రమదభ్రచయప్రమదా
సుమదామకటాక్షజనితసూనశరంబై. 241

ఉ. ఆపురి రాజ్యలక్ష్మి కిరవై మణిమండనుఁ డేలు రూపరే
ఖాపరమన్మథుండు చతురబ్ధిపరీతధరాధురంధరా
రోపభుజార్గళుండు చతురుండు సమస్తమదాభియాతిసం
తాపకరప్రతాపుఁ డొకనాఁ డతఁ డెంతయు సంతసంబునన్. 242

క. ఒక చక్కిఁ జక్రసమకుచ
లొకదండం దండనాథు లొకచో శకచో
ళకళింగవంగగూర్జర
కుకుర నృపు ల్గొలువ నిండుకొలువగు వేళన్. 243

ఉ. కొమ్ములు మ్రోయ మంటితమకు ల్వెస బోరుకలంగఁ బార్శ్వభా
గమ్ముల నల్ల నల్ల ప్రజ గ్రమ్ముకొన న్వెస జాగిలంపు మొ
త్తమ్ములు ముంగలన్నడువ దర్ప మెలర్పఁగఁ జెంచుపాళెగాఁ
డమ్మనుజేంద్రు కొల్వునకు నచ్చెరువందఁగ వచ్చెఁ జెచ్చెఱన్. 244

తే. కుఱుచవగ కేలుగవమోడ్చి కోరసిగయుఁ
గూడ ఱొమ్మును మోఁకాళ్లుగూడ వంచి
కొలువు దొరలించుక హసింపఁ గువలయేంద్రు
చరణకంజమ్ములకు మ్రొక్కి చక్కనిలిచి. 245

సీ. నివ్వరిప్రాలు తేనియ పాలపండులు
కారెనుములపెర్గు చాఱపప్పు

పునుఁగుఁజట్టంబులు పునుఁగు కఱ్ఱజవాజి
కమ్మకస్తురి పచ్చకప్పురంబు
నేకలంబులకోఱ లేనుంగుకొమ్ములు
బురుడుజింకలు పెనుపులుల గోళ్లు
హరిచ యీకలు నెమ్మిపురి జొంపములు తెల్ల
సవరము ల్జల్లులు జాగిలములు
తే. పిగిలిపిట్టలు డేగలు బెట్టుడుతలు
పట్టుజిట్టలు ఫణిఫణాభద్రకుంభి
కుంభవరదంష్ట్రిదంష్ట్రికాకోటిగళిత
కలితముక్తాఫలంబులు కాన్క చేసి. 246

తే. సామి నావిన్నపము విని సారి వెడలి
యొక్కమలచెంత గడెతడ వున్నఁజాలుఁ
జెండు బెండాడి మెకముల బెండు పఱిచి
దేవరకు వేడ్క పుట్టింతు దేవునాన. 247

క. అని విన్నవింప వినియ
మ్మనుజేంద్రుఁడు సబహుమానమహిమఁ బుళిందుం
బనిచి నిజాంతఃపురికిం
జని యాఖేటకవిధాన సత్వరమతియై. 248

సీ. పసరుపట్టుహిజారు మిసమిసలుఱుతకా
ల్మెఱుగుటంగికి వింతయొఱపు నింప
గాశ్మీరపంకసంకలితాంగదీధితు
ల్కప్పుదుప్పటికిఁ జెంగావు లీన
జాళువాజిగి జిరాసరిపెణల మెఱుంగు
చిలుకతాళికి నొక్కసిరి యొసంగ

సిగతాయెతులనిగ్గు జిలుగు తాపిత సన్న
సరిగ జంటకుళాయి కొఱపు నెఱప
తే. నుదుటఁ గస్తురిరేక వీనులఁ గిరీటి
పచ్చరాపోగులుఁ గృపాణి పాణి నలరం
బాదముల జీవదంతపుఁ బావలూఁది
రాజకందర్చుఁ డంతఃపురంబువెడలె. 249

తే. సరిదొరలు దండ నొరయ నాస్థానమండ
పమున నిలుచున్న యంతలోఁ బాదరసము
జోక గలతేజి నిండుసంజోకఁ జేసి
యెదుట నటు దెచ్చి నిల్పె సాహిణి యొకండు. 250

క. మనమలరఁగ నత్తురగముఁ
గని కనుదమ్ములనె మ్రొక్కి కర్ణఫుటరసా
యనసౌవిదల్లసాహో
నినదం బెసఁగంగ నెక్కి నృపుఁడు నిపుణుఁడై. 251

సీ. భేరీమృదంగశంఖారావములు మాగ
ధస్తవార్భటుల దిక్తటము లద్రువ
బిరుదకేతనపరంపరలు శిలోత్తాల
తాలవృంతములతో మేలమాడఁ
దెల్లపావడల దీధితులు ముక్తామణి
చ్ఛత్రకరుచులపైఁ జౌకళింపు
సాంబ్రాణి పొగలు నిచ్చలపు ధూమ్రంపుఁ ది
త్తుల దుమారములతోఁ గలసి మెలఁగఁ

తే. జామరద్వయచలనసంజాతవాత
కందళంబులు వదనారవిందఘర్మ
కణము లడఁపఁగ వెడలె నల్లడలఁ గదియు
సేనతో నద్ధారాసునాసీరుఁడంత. 252

వ. ఆఖేటసమయసముచితసముత్సాహసన్నాహబహువిధచమూసమేతుండై చనునప్పుడు.
253

సీ. వంకులు గుదియలు వలత్రాళ్లు మ్రోకులు
బిసలు మాఱమ్ములు పెద్దవిండ్లు
పచ్చకట్టెలగురు ల్బలుతుపాకులు నెద్దు
లేనుంగులు సివంగు లిఱ్ఱిపోతు
పిడుకకుంపటు లాకుతడికెలు ప్రోగుత్రా
ళ్వాడిగొడ్డండ్లు మవ్వంపుటురులు
పాఁదిగువ్వలు మోటుపలకలు పోటుగుం
జలు చిక్కములు నురు ర్జాగిలములు
తే. జిగురుగండెలు గాలపుఁజివ్వవెదురు
లాదియగుసాధనంబులు నలవరించు
కొని హుటాహుటి నడలతోఁ బినుఁగు లెల్లఁ
గదిసి నడిచిరి యమ్మహీకాంతునఱుత. 254

వ. అప్పు డప్రతిభాప్రభావుండై. 255

సీ. మంజులద్రుమలతాకుంజంపుజస్థలీ
ఘుటఘుటార్భటిలుఠత్కిటికులంబు
బహుమహీధరగుహాగృహవినిర్నిద్రము
ద్రానిర్యదురుమృగేంద్రవ్రజంబు

గండమండలనినిర్గతగళద్గంధాను
చరదళిప్రోల్లసత్కరిఘటంబు
సరభసోద్ధతపరస్పరహతాహతభగ్న
ఖురవిషాణోగ్రకాసరబలంబు
తే. చండతరఘోరశార్దూలసంఘచటుల
చంక్రమక్రమదృగ్మాత్రజాతహరిణ
ధావనం బగు నొక్కమహావనంబు
మన మలరఁ గాంచి చొత్తెంచె జనవిభుండు. 256

తే. పొలము చోపుడు వెట్ట నన్నెలవరులకు
సెలవొసంగిన నృపమౌళిచిత్త మెఱిఁగి
చెంచు లాఖేటకక్రియాచుంచు లగుచు
నట్టు లొసరింప నప్పు డత్యద్భుతముగ. 257

మ. చకితేభంబు సముద్యమన్మృగమనాశ్వాసవ్యథాకీర్ణగం
డక మత్యంతహఠాల్గుఠద్గవయమాఢౌకాయమానస్థలా
వృకమాక్రోశనకృన్మృగేంద్రము రణద్బీభత్సకృత్కోలము
త్సుకభిద్భావతరక్షువై గహన మచ్చో ఘూర్ణతం జెందఁగన్. 258

సీ. వడిగాలివడి నిల్వ వసపోక బలితంపు
సరిపెణ ల్దునియ వేసరక నిగుడుఁ
బట్టెడ సడలించుపర్యంతమును దాళ
కతులరోషాప్తి నిట్టట్టుఁ బెనఁగు
బదియు నిర్వదియు ముప్పదియు నల్వది చొచ్చి
కదుపులు చెదరఁ జీకాకు సేయుఁ
గటికి నెత్తురులతోఁ గంద లుర్లి పడంగఁ
జేరి పందులపాలచేర్లు గఱచు

తే. వేలికలు వెంట వెస నంట నేపురేఁగి
కోపు మీఱి జనోద్వృత్తిఁ గూడఁ బఱచి
యెందుఁ జొచ్చినఁ జొరనీయ కీడ్చి తెచ్చి
సలుగులను గూల్చె నొకకొన్నిజాగిలములు. 259

తే. భటుఁ డొకఁడు వింటఁ జుఱుకంటఁ బంది నేయ
మిట్టిపడి మించు మెఱసిన ట్టట్లె తూఱి
యది భయదఘర్ఘరారావ మడర నతని
రెండుతొడలును వెసఁ గత్తిరిలఁగఁ జంపె. 260

క. కొంతాన నొకఁడు బెబ్బులి
గొంతానం [6]గ్రుచ్చి మెచ్చుకొని తను దెలుపన్
వంతుకుఁ గడువడి నొకండొ
క్కింతయు బెదరక పిడెమున నెలుఁగుం బొడిచెన్. 261

క. బొఱియవడ వేఁపు లొకకిటిఁ
గఱచి కఱచి కూల్చె నపుడు కండలు ప్రేవుల్
మెఱయఁ దమయేలికలకుం
గుఱిమేరయుఁ బాళ్లమర్చుకొనుపొంకమునన్. 262

సీ. వల చంగునను దాఁటి పడి నేను నొకలేటి
కొంకి కొంకక త్రొక్కి కూల్చె నొకఁడు
కలగుండు వడ రొప్పిగవినుండి కుప్పించు
పులి గుండె లవియంగఁ బొడిచె నొకఁడు
పొదహత్తుకొని సమున్మదవృత్తిఁ జనుహ త్తి
కొమ్ములంటఁ బెకల్చి కొట్టె నొకఁడు

పేరెండ నొకకొంత నోరెండుకొనియుండు
గండభేరుండంబుఁ గదిమె నొకఁడు
తే. వెండియు నొకండు నిశితోగ్రమండలాగ్ర
చండతరధారనుద్దండశరభకాండ
శశగవయఖడ్గముల నెల్లఁ జక్కు సేయఁ
గండ లురులఁగఁ గడుదులఁ జెండె నొకఁడు 263

క. ఈరీతి వేఁటకాండ్రని
వారణమృగపఙ్క్తి నెల్ల వడిఁ దఱిమెడిచో
ధీరుఁ డల రాజచంద్రుఁడు
కోరుకు లెసకొలుప సుభటకోటులకంటెన్. 234

మ. పులులం ద్రుంచి కడుందులందు నిమిదుప్పు ల్నుగ్గునూచంబులై
పొలియం జేసి వరాహసంఘముల రూపుల్మాపి సింగంపుగుం
పులనెల్లం దెగటార్చి యేనుఁగులతోఁ బోరాడి భల్లూకమం
డలి నిట్టట్టొనరించియుండునెడ దండన్విస్మయంబొప్పఁగన్. 265

ఆ. ఒక్క నక్క వల గతుక్కునఁ గొఱకి తా
నవలఁ జనఁగ వెంటఁ దవిలె బలము
వసుధ నక్కఁ గన్న వాఁ డెల్ల టకాఁ
డనెడువార్త నిక్కమయ్యె ననఁగ. 266

వ. అట్టి యెడ. 267

ఉ. కోఱలు చప్పరించి కనుగొల్కుల నిప్పుకలొల్క నల్కమై
బోరున రొప్పి పైఁబడినపోతరపుంగిటి నొక్కకేలున
న్మోరట బిగ్గఁ బట్టి దృఢముష్టిహతి న్వడినొంపఁజూచి కే
ల్జాఱుటఁ బాఱె నమ్మెకము జాగిలము ల్వెస వెంటనంటఁగన్. 268

ఉ. హాళి నృపాలమౌళి చతురంగబలంబుల ప్రాపు గోరకం
జాలపరాక్రమించి జవసైంధవము న్వడిఁబోవ నూకి త
త్కోలము వెంటనంటిచన ఘోరవని న్వెసమాయమయ్యెఁగాఁ
బోలు ననంగ సమ్మెకము పోవుటకు న్మదిఁ జింతనొందుచున్. 269

క. మును వెనుక తెలియ కత్తఱి
వనమండలిఁ దిరుగునతని వరవీరభటు
ల్ననుఁ జూడుఁడు ననుఁ జూడుం
డనువారలు వెంట నంట నర్హులు గామిన్. 270

సీ. దుర్గమసమ్మర్ధకర్దమస్థలములఁ
జనరాక మదసామజముల డించి
చటులనికుంజపుంజములఁ గాలాడని
కతనఁ గంఖాణసంఘముల నునిచి
తండోపతండ మై గండోపలము లుండు
పథములందుఁ గొలారుబండ్ల నాఁగి
వంకలౌ నలునంక లంకమలల్దాఁట
సమకూడమికి నందలములు డిగ్గి
తే. దారి తెలియక ఘోరకాంతారభూమిఁ
జెట్టు కొకఁ డైరి యారాజసింధురంబు
పొలుపుఁ గనుఁగొనవలసి యుమ్మలిక వొడమ
నక్కడక్కడ సామంతు లరసి యరసి. 271

క. కలగుండు వడి పొలంబున
నిలువంబడి మ్రాకులట్లనే యున్నతఱిన్
జలరుహబాంధవుఁ డస్తా
చలశిఖరముఁ జేరె నంత సంజ జనించెన్. 272

సీ. కకుబబ్జముఖులకుఁ గస్తూరిపూఁతలై
భూభృదౌఘముల కంబుదము లయ్యె
భూరి ఘోరారణ్యములకు గజంబులై
యారామములకుఁ బికాళు లయ్యె
హర్మపఙ్క్తులకు నిర్యద్ధూమరేఖలై
వరనదంబులకు శైవలము లయ్యె
భవనంబులకు నీలిపట్టు మేల్కట్టులై
కొలఁకుల కెలదేఁటిగుంపు లయ్యె
తే. ననఁగ సకలజగద్భీషణాయమాన
లీల వన్నియలను నొక్క నీలిమ్రింగె
ననుట నిజమై యశేషవర్ణాంతరములఁ
గప్పుకొని యొప్పు చిమ్మచీఁకటులు నెఱసె. 273

వ. అంత. 274

చ. పరువడి భేకము ల్మొఱయఁ బ్రాగ్దిశ డి కడంగి తెమ్మెర
ల్నెరయఁ దళుక్కటంచు నడునింగిఁ గడు మ్మెఱయన్ ఘనౌఘముల్
తఱుచుగ దక్షిణం బొరయఁ దత్క్షణలక్షణము ల్గణించి నేఁ
డరయ మహోగ్రవృష్టి గురియంగల దంచు నృపాలుఁ డెంచఁగన్. 275

సీ. గళదనర్గళగళద్గళదుధ్ధతధ్వను
ల్గిలకొట్టి మండూకములు చెలంగ
ధగధగత్ప్రజ్వలత్పటుతటిల్లతికాళి
మిసమిస న్మెఱసి యాకసము నిండ

జిటచిటార్భటి సముద్భటనిరాఘాటసం
ఘటనమై కరక లొక్కటను రాల
ఘుమఘుమారావసంకులకులాచలగుహా
కుహరమై పెనుగాలిగుంపు వీవఁ
తే. బెళపెళారని బెడిదంపుఁబిడుగు లురల
ఘనఘనాఘనసంఘము ల్గ్రమ్ముకొనఁగ
ఝల్లుఝల్లునఁ బెనుజల్లు చల్లుచుండ
బోరుబోరున వర్షంబుధార లురిసె. 276

వ. వెండియు నయ్యఖండతరధారాపరంపర లొండొండ మెండుకొని వసుంధరామండలంబు బెండుపడం గురియుచుండ మహీధరశిఖరశిఖాభ్యంతరంబులం బాఁదు లురిలి పడు బృహచ్ఛిలాతండంబుల షహారావంబునకు గహ్వరీస్థలసింహకిశోరంబులు గర్జించు కహకహారావంబులకు వెఱవక యక్షీణమహానిక్షేపసంరక్షక బ్రహరక్షోగణంబుల దురాక్షేపణంబులకు భీతిలక శాకినీడాకినీప్రముఖ బహువిధభూతబేతాళగణంబుల కోలాహలంబులకు శంకింపక యమ్మహారాజమార్తాండుండు కరాగ్రనిశితకౌక్షేయకంబు నొఱ వెతికి జళిపించినం బొడము ధగధ్ధగాయమానప్రభాపటలంబులకుఁ దోడుసూపు విద్యుల్లతానికాయంబులవలనం జెట్టుగుట్టల సందులం దెరువు కనంబడ లక్కుఱంగట నొక్కపటమహామహీరుహంబుం జేరం జని. 277

ఉ. ఆనృషపుంగవుం డటు మహాతరుమూలము డాసి తేజి నెం
తే నికటోర్వి డిగ్గి సముదీర్ణపరిస్ఫుటఖడ్గపాణియై

తానపు డేపున “న్విపది ధైర్య మథాభ్యుదయే క్షమే"తి వా
ర్తానిపుణస్థితిం ధృతిధురంధరుఁడై యొకఁ డుండె నెమ్మదిన్. 278

తే. ఆదిగర్భేశ్వరుండైన యవ్విభునకు
మ్రానుపడి మేను బహుతరగ్లాని నొంది
కన్ను గూర్కెడునంత నగ్గహనభాగ
మేలు బేతాళుఁ డతిదుర్నిరీక్షుఁ డగుచు. 279

క. అనరప్రచార మమితం
బనుపమగాఢాంధకార మతిఘోరతరం
బనఁదగు మత్కాంతారముఁ
గననోపునె నుదుటఁ గన్నుగలవాఁ డైనన్. 280

వ. అని యనేకరోషనలజ్వాలాభీలవికటీకృతభ్రుకుటీలతాకుటిలవదనుం డగుచు నచ్చోటికిం గదసినతనిం గనుంగొని తదీయావయవంబులం గననగు సార్వభౌమముద్రికాముద్రితంబు లైన సాముద్రికంబుల నిరీక్షించి సకలశుభలక్షణలక్షితుం డితం డెవండో యని తనమనంబున వితర్కించుకొని స్వకీయానుచరులతో ని ట్లనియె. 281

ఉ. ఈసుకుమారదేహుఁ డిపు డీవని నుండ నుపేక్ష చేసినం
దోసము వచ్చు మీ రితనిఁ దోడ్కొనిపోయి చిరత్నరత్నశో
భాసమమైన యొక్కనృపహర్మ్యమునం బవళింపఁజేసి సం
త్రాసము చెందకుండఁ గొనిరండు ప్రభాతము వచ్చునంతకున్. 282

వ. అని నియోగించిన నంగీకరించి యతనిం గ్రహించుకొని తదీయపరిచారకు లాక్షణంబ శాంబరీవిడంబనంబునం గుకురు కరూశ కాశ్మీర మగధ మత్స్య మాళవ మహారాష్ట్ర సౌరాష్ట్రాది బహువిధదేశంబు లవలోకించుచున్నంత నక్కళింగమహీమండలంబున. 283

క. కటక మనఁదగు నొకానొక
పుటభేదన మహితహృదయ పుటభేదనమై
కటకలితదానధారా
స్ఫుటకరకరటీసహస్రములఁ దనరారున్. 284

క. అందు వెలుగొందు నయనా
నందం బగు రాచనగరు నముచిభిదుపలా
మందపరిస్పందరుచిం
గ్రందుకొనినసౌధ మొకటిఁ గని యాలోనన్. 285

చ. చికిలికిరీటిపచ్చల రచించిన చిల్కలకోళ్ల నందమౌ
సకినెలపట్టెమంచమున శయ్యపయి న్సుఖనిద్రఁ జెంది యిం
చుక తనుఁ దా నెఱుంగకను జొక్కెడు తన్నృపు నల్లుఁడైన పెం
డ్లికొడుకు నేచి చూచి యవలీల మెయిం గడనుంచి యచ్చటన్. 286

తే. లీల మణిమండనుని బవళింపఁజేసి
కడకడల నుండునంతఁ దత్కటక మేలు
చారుచంద్రమహారాజచంద్రతనయ
కూర్మి మెఱయఁ గళావతీకోమలాంగి. 287

క. ఆరాత్రి పెండ్లి యగుట న
పారమహావిభవ మొప్ప బలవైరినిభుం

జేరుటకు నిజనయస్యా
ప్రేరితయై మితము లేని శృంగారమునన్. 288

సీ. చలువ దువ్వలువకుచ్చెలయంచు ముత్తెము
ల్పదనప్రభకు సలాము సేయ
ఱవికకట్టడపు దోరపుఁ నిగ్గుజంటీలు
తనులతాద్యుతికిఁ గైదండ యొసఁగ
సొగసు నిద్దపుఁగమ్మమగఱాలధళధళ
ల్ప్రబలాక్షిరుచికిఁ బరాకు దెల్పఁ
గమ్మనెత్తావి చొక్కటపుఁ గస్తురిబొట్టు
చికురసందీప్తి కిచ్చకము వలుక
తే. రవల మట్టెలసద్దు దుర్వారపాద
కటకనినదంబు మొలనూలుగంటరొదలు
నడఁచి కొనలేని నడలతో నధిపుఁ డున్న
కేళిసౌధంబు గదిసె నక్కీరవాణి.289

తే. అపుడు తనవెంట వచ్చు వయస్య లెల్ల
నొక్కొకనెపంబుననె యొక్కరొక్క గరుగ
వసుమతీంద్రు నిరీక్షించి ముసుఁగుతోడ
నిదురవోవంగఁ జూచి యన్నీలవేణి. 290

క. ప్రాణేశ్వరుండు కడుని
ద్రాణత నున్నాఁ డిదేమొ తనకన్నులకు
న్రాణింపనొ యితనికి మగ
పోణిమియే లేదొ యనుచుఁ బొక్కుచు మదిలోన్. 291

ఉ. అండజయాన కూర్మివిభునండన యొక్కతివాసుమీఁదఁ గూ
ర్చుండి విపంచి మీటుకొనుచుండెడు నంతట నవ్వసుం

ధరా
మండలనాథమౌళిమణిమండలుఁ డొయ్యన మేలుకాంచి యు
ద్దండత దండనుండెడు లతాలలితాంగి నొకింత చూచినన్. 292

ఉ. అగ్గజగామినీమణి ముఖాంబుజ మించుక వాంచి తమ్మిపూ
మొగ్గల నేలు పూపచనుముక్కులఁ బయ్యెదఁ జక్కఁ జేర్చుచుం
దిగ్గున లేచి నిల్చి యువతీమకరాంకశుభావతారు స
మ్యగ్గుణహారు నానృపకుమారుఁ గనుంగొన నాతఁ డాత్మలోన్. 293

క. ఈ రామామణి యెక్కడ
నీరత్నవిచిత్రసౌధ మెక్కడ నిట కేఁ
జేరుట యెక్కడ నని యని
వారణను మహాద్భుతప్రవర్తనమతియై. 294

ఉ. ఈమదిరాక్షి నేలు విభుఁ డెవ్వఁడొకో ననుఁ జేరఁ గారణం
బేమియొ దైవమా యనిన నెంతని మెచ్చెదఁ దెల్లవాఱన
న్మామక భాగ్య మెట్లయిన మంచిది నేఁటికి దీనితో రతి
శ్రీమహనీయవైభవముఁ జెందెద నంచు వినిశ్చితాత్ముఁడై. 295

తే. అలజగన్మోహనాంగి నొయార మెసఁగఁ
జూచి కడుదిట్టయగునట్టి రాచపట్టి
చెట్ట వట్టి నిజాంకంబుఁ జేర్పఁ జూచు
నంతనయ్యింతి విభుతనుశ్రాంతిఁ దెలిసి. 296

క. కుందనపు బిందియలనిర
వందిన పన్నీట జలక మారిచి జిలుఁగుల్
పొందుగ నమర్చి నృపసం
క్రందనునకుఁ గలపమలఁది కడుభక్తిమెయిన్. 297

క. సారతరంబుగ మధురా
హారంబుల నానవాల నధికక్షుథార్తిం
దీఱిచి వేగమె రాజకు
మారున కాతరుణి యాకుమడుపు లొసంగెన్. 298

తే. సరసురాలైన యలచారుచంద్రతనయ
నెలమి కళలంటి యలరించి యలవరించి
ప్రౌఢతరబాహ్యసురతసంబంధములను
బారవశ్యంబు నొందించి పార్థివుండు. 299

సీ. పూవుగుత్తులవంటి పూపచన్నులు గోళ్ల
నదిమినఁ గిచకొట్టు నట్టివేళ
మెఱుఁగనంటులవంటి చిఱుదొడ ల్పుడికిన
నంగంబు పులకించు నట్టివేళ
మృదుపల్లవమువంటి రదనాంశుకము పంట
నంట నొక్కిన గెంటు నట్టివేళఁ
బొన్నక్రొవ్విరివంటి పొక్కిలిగిలిగింత
లలరింపఁ జిట్టాడు నట్టివేళ
తే. నదరనీయక యక్కున సదిమి చెక్కు
చిదిమి నెమ్మోము మోమునఁ జేర్చి బుజ్జ
గించి యుపలాలనారతిక్రీడవలనఁ
మగువ నలరించె నారాజమన్మథుండు. 300

క. అంత నవరసికుఁ డగున
క్కాంతుని మన్ననలవలన గడిదేఱి వెసం
గాంతామణి తనమదిలో
నెంతయుఁ గసివోని వలపు హెచ్చినకతనన్. 301

ఉ. చెక్కిలి నొక్కిన న్మగుడఁ జెక్కిలి నొక్కు రదచ్ఛదాప్తి బ
ల్నొక్క చుటుక్కునఁ న్వెసఁగనుంగొనుఁ గ్రూరకటాక్షదీప్తి బే
రక్కునఁ జేర్చి గుబ్బచనులంటఁ గవుంగిట నెత్తునప్పు డా
చక్కెరబొమ్మ మార్మలయు చైవులకు న్విభుఁ డుల్లసిల్లుచున్. 302

సీ. కొఱికిన మడుపుటాకులు మోవి కందిచ్చి
యధరాధరము పంటనంట నొక్కి
కిచకొట్ట బకదారి కివకివ ల్చెవిఁగుల్కి,
కుదురుగుబ్బ లురంబుఁ గదియఁ జేర్చి
యతులితోత్కంఠఁగంఠాశ్లేష మొనరించి
బహుబంధసురతసంభ్రమముఁ జూపి
పారవశ్యసుఖానుభవసంపదలఁ దేల్చి
యుపచారములఁ గొంత యుబుసుపుచ్చి
తే. వలచి వలపించి జీవితేశ్వరుని కేళి
మెచ్చి మెప్పింపఁ జాలి యమ్మీననయన
యండఁ బాయనిచో మణిమండనుండు
వెసం బునారతరతిసౌఖ్యవిభవుఁడైన. 303

చ. పులిపులియయ్యె నంగలత పొక్కె సుధాధరబింబ మింతికి
న్నలినలి యయ్యెఁ గౌను జఘనస్థల మెల్ల ను నజ్జునజ్జునై
గులగులయయ్యె గబ్బిసునుగుబ్బలు ముద్దుమొగంబు వాఁడె గెం
దలిరుకటారివాని బెడిదంపు దురంబు విభుం డొనర్పఁగన్. 304

తే. రసికశేఖరుఁ డారాజు రాజవదన
కందికుందిన నెమ్మోముకళ లెఱింగి

కడుఁ బ్రియ మెలర్పఁ గౌఁగిట నిడుముకొని సు
ఖానుభవలీలఁ బవళించె నంబుజాక్షి. 305

ఉ. అత్తఱి నత్తలోదరి రతాంతపరిశ్రమ మొందెఁ గావునం
జిత్తజువంటి నాయకుని చెక్కునఁ జెక్కు నురఃస్థలంబునం
గుత్తములైన గబ్బిచనుగుబ్బలుఁ గంఠమునం గరాబ్జముల్
హత్తుకొనంగఁ జేసి చెలువార వెస న్నిదురించె నంతటన్. 306

క. తెలతెలవాఱుటఁ గని ని
స్తులధృతి బేతాళభటులు తొలుతటి మగనిం
జెలిప్రక్కనునిచి సామ్రా
ట్కులమణి మణిమండలేంద్రుఁ గొని చని రబలా. 307

క. అని తెల్పునెడఁ బ్రభాతం
బెనయుట రవిరథతురంగహేషారవమో
యనం బక్షిరవము సెలఁగె
న్విని చింతాక్రాంత యగుచు వెస నిలు సేరెన్. 303

క. ఆకాంతామణి కుముద
వ్యాకోచం బెసఁగువేళ నలనాఁడు ధరి
త్రీకాంతుఁ జేరనరుగుట
కేకమతిం జిలుకఁ జేరి యిట్లని పలికెన్. 309

ఉ. ఓమకరందబిందునికరోమరమ్యసుగంధమాధురీ
శ్రీమృదువాణి కీరకులశేఖర యల్ల కళింగరాజక
న్యామణివార్త యే తెఱఁగున న్విననయ్యెను దన్మనోవిభుం
డేమి యొనర్చెనో యెచటి కేగెనొకో మణిమండనుం డొగిన్. 310

క. అని పల్కఁ జిల్కదొర యి
ట్లనియెం బళి మేలు జాణ వౌదువటంచున్
వనితారత్నంబున కా
వనితామణిమండనుండు వడి నేగుటయున్. 311

తే. మెల్లనె కళావతీసతి మేలుకాంచి
ప్రక్క వేఱొక్కమగఁ డున్న బాగుఁ దెలిసి
యక్క యిది యేమి చోద్యమో యనుచు మిట్టి
పడి కకావికయై యొండుకడకుఁ జేరి. 312

క. పువ్వారుఁబోణి మదిలో
నెవ్వెఱపడి చూచుచుండ నృపుఁ డుపపడమై
జవ్వాడులతికయో యన
నవ్వెలఁది వడంకఁ జూచి యతఁ డిట్లనియెన్. 313

క. మదనాగయాన మగతు
మైదయంటిన కమ్మదమ్మి మెఱుపుగలిగియు
న్నది నీముఖాంబుజంబిది
కొదవగదా కొత్తపెండ్లికూఁతున కనుచున్. 314

సీ. చికిలి చందురుకావి చిగురాకునునుమోవి
నంటిన మొనపంటి గంటుఁ జూచి
నెఱకురు ల్చెదరి క్రొవ్విరిసరు ల్వసివాడ
నొప్పు దప్పిన గొప్ప కొప్పుఁ జూచి
వలిచన్నుగవ యిక్కువల మిక్కుటంబులై
గుదిగొన్న నెలవంకగుంపుఁ జూచి
తెలివాలుగల డాలుగలసోగకనుదోయి
నింపుగుల్కెడు నిద్రమంపుఁ జూచి

తే. యిది సదాచారమే రాజసదన మిదియె
యిది కులాంగనయే యంచు మది నొకింత
సందియము దోఁప నారాచచందమామ
యాగ్రహోదగ్రవిగ్రహుం డగుచు ననియె. 315

తే. నీజనని పుణ్యజనవర్ణనీయసాధ్వి
నీజనకుఁ డెన్న నభిమాననియతధనుఁడు
నీనగరు పోతుటీఁగకు నిలువరాని
దయ్యు వెల్లాటకత్తె వీవౌట యరిది. 316

శా. నీజాడ ల్గని యోర్చుకోఁ దగునటే నీలాహివేణీ మహా
రాజస్త్రీజన మీవగ ల్వినిన నౌరా యంచు ని న్మెత్తురే
యేజాతి న్నినువంటి దంట గలదే యిద్ధాత్రిలో నంచు వి
భ్రాజన్మానధురంధరుండు నృపుఁ డుగ్రవ్యగ్రరోషాత్ముఁడై. 317

క. కుఱుచవగ చిక్కటారిం
బరికింపక గొంతుచిదుము పనిఁ దలఁచి నరే
శ్వరచంద్రుఁ డాతలోదరి
కురు లొయ్యన నొడిసి పట్టుకొనియె లతాంగీ. 318

తే. అప్పు డాబారి గడతేఱనగు ప్రయత్న
మెట్లు చింతీంపవలయు రాకేందువదన
యడుగు దప్పినచోఁ దప్పుఁ బిడుగటంచు
నొడువ మును విందువే కద పుడమిలోన. 319

చ. అన విని మందహాసరుచిరాస్య ప్రభావతి వల్కె నీవగ
ల్గని విని యున్నవారి నడుగందగు నోశుకసార్వభౌమ యే

మనఁగలదాన నీవ కలయర్థముఁ దెల్పు మటన్నఁ గీర మి
ట్లను నలభూభుజంగవరు సంగన యప్పు డవార్యధైర్యయై. 320

క. విడు విడువుమనుచుఁ గ్రొమ్ముడి
విడిపించుక బలిమి నొడిసి విభునికరాసిం
గుడుసువలిగుబ్బచన్నుల
నడుమను మొన సేర్చి తెంపునన్వ్రాలుతఱిన్. 321

తే. నృపకులేంద్రుఁడు వెఱఁగంది నెలఁతకేలి
వాలు కడఁ బాఱవైచి యోవాలుఁగంటి
గోల విటువంటితెగువ నీకేల యనుచు
నెఱకురులు చక్కముడిచి కన్నీరుఁ దుడిచి. 322

ఉ. లాలన మాచరించి నవలానడుగన్నృపుతోడఁ బల్కు బే
తాళునిబోలు నొక్క పెనుదయ్యము న న్నగలించి పట్టి యా
భీలతనింత చేసి వెఱపించి చనె న్నినుఁ బల్కరింప వో
గ్జాలత చాలదయ్యెఁ గలగంటినొ నెవ్వెఱఁ జెంది యుంటినో. 323

క. నీవేమొ కొలయొనర్చితి
వీవగనది సోఁకుడగుచు నేచఁ దొడంగె
న్వేవేగఁ దత్ప్రతిక్రియఁ
గావింపక యున్న నెట్లు కడచెద ననినన్. 324

తే. అట్టు లగునని తద్దోష మపనయింప
నభయకరమంత్రతంత్రము లాచరించి
రాజబింబాస్యఁ గూడి యారాజు నేక
కంఠత వహించె నోకంబుకంఠి! యనిన. 325

చ. విని వెఱఁగంది క్రొత్తకథ వింటిని నేఁడిది చిత్ర మంచు నె
మ్మనమున మెచ్చునంతర విమండల మ య్యుదయాద్రిఁ జెందినం
గని కనుదమ్ములన్ నిదురగ్రమ్ముక రా నిలు సేరి ప్రేమ న
వ్వనరుహగంధి సంజకడవచ్చి శుకాగ్రణిచెంత నిల్చినన్. 326

క. మదిరాక్షీ యేతత్కథ
కొదవయగుట తగదు కడమ గూడఁ బలికెద
న్ముదమున విని పొమ్మని య
మ్మదనునిసామ్రాణి పలికె మధురతరోక్తిన్. 327

క. మణిమండనవిభుని నభో
మణిచండనిభు న్విభాసమానైకవనాం
గణమున నడి యవ్వీరా
గ్రణు లాశుభవార్త యేలికకుఁ దెలుపుటయున్. 328

తే. అతఁ డతని ధైర్యచర్యాసహాయశౌర్య
బహువిధగుణంబు లెంతయుఁ బ్రస్తుతించి
సంధి యొనరించి యమ్మహాసార్వభౌము
ననునయించుట తగుకార్యమని తలంచి. 329

సీ. జనభయంకరసరోషజ్వాలికాధగ
ద్ధగదుగ్రరుచుల నెమ్మొగము వెలుఁగ
సకలపిశాచశిక్షారక్షణాక్షీణ
కౌక్షేయకము భుజాగ్రమునఁ దనర
శాకినీఢాకినీలోకలోకాతీత
బలపరంపర కెలంకులను నడువ
మనుజకోటికరోటిమాలికాభసితచ
ర్మాంబరంబులు మేన డంబు సూపఁ

తే. గోరమీసలు మిడిగ్రుడ్లుఁ గుటిలతరక
రాలదంష్ట్రాయుగంబు నుత్తాలబహుజ
టాలజాలంబు నెరయ బేతాళుఁ డపుడు
నిలిచె నాభూవిభునిమ్రోల నలఘులీల. 330

ఉ. అంతకుమున్న యన్నరవరాగ్రణి మేల్కని విస్మయోదయ
స్వాంత మెలర్పఁ గన్నులవెసంబొడసూపుమహాప్రతాపుఁ డీ
యంతకరూపుఁ డితఁ డెవఁ డంచు మనంబున నెంచునంత న
ప్పొంత వసించి యమహీవిభు న్వినయోక్తుల నాతఁ డిట్లనున్. 331

క. బేతాళనాయకుఁడ నో
భూతలవల్లభ మహాప్రభుత్వము గలని
న్నీతఱిఁ గనుఁగొనుటకుఁ బ్రే
మాతిశయత వచ్చినాఁడ ననిన సుముఖుఁడై. 332

వ. యథోచితప్రత్యుత్థానాభిగమనంబు లాచరించి కుశలంబడిగి సుఖం బున్న యనంతరంబ యద్ధరిత్రీపాలునకు బేతాళుం డిట్లనియె. 333

ఉ. ఓచతురాగ్రగణ్య భువి నున్ననరేంద్రులలో భవన్నిభుం
డీచతురబ్ధివేష్టితమహి న్నహి యంచు జను ల్నుతింప నీ
యాచరణం బెఱుంగక మహాగహనాంగణభూమి నొంటిమై
నేచి చరింప నీతి యగునే తగునే యిటువంటి కృత్యముల్. 334

సీ. అన్యరాజన్యరాజ్య స్థితుం డగువేళ
సరిదొర ల్సంధింప దొరయువేళఁ
బౌరులు కనఁ బయల్పచరింపఁ జనువేళ
నారామములఁ గేళి నలరువేళ

సరగున దుర్గము ల్సాధింపఁ జనువేళ
వైరిభూభుజు లెత్తివచ్చువేళ
గుఱు తెఱుంగనిజను ల్గొల్వవచ్చినవేళ
మృగయావినోదాప్తి మెలఁగువేళ
తే. మండలేశ్వరుఁ డుద్దండదండనాథ
చండభటవీరసామంతమండలంబు
లండనుండక వెస నొంటి నుండెనేని
గొదవ యగునండ్రు నీతికోవిదులు తలఁప. 335

తే. మత్తకరిదండ నెరయైన మావటీఁడు
బుద్ధియెఱుఁగని కొమరుని పొంతదాది
యతులగర్వాంధుఁ డగురాజునండ నాప్త
మంత్రి యొకవేళ నైన నేమఱఁ దరంబె. 336

క. బల మనఁగ నృపునిదేహము
బలమునకు న్నృపవరుండు ప్రాణం బగుటం
బలమును నృపుఁడును ధాత్రీ
తలనాయక భేద మనఁగఁ దగునే జగతిన్. 337

చ. అనుపమధైర్యశౌర్యనిధియౌ నృపుఁడైనను జైత్రయాత్రగా
జనునెడ దోఃప్రతాపబలసంఘములం ఘను లౌనిజాప్తులం
జనువుఘటిల్ల గొల్లముదుసళ్లఁ గులాగతనీతిమార్గవ
ర్తను లగు ద్దల న్నగరిదండఁ బ్రచండత నుంచఁగాఁ దగున్. 338

వ. అదియునుం గాక దినదినప్రవర్ధమానుం డగుభూనాథుండు ధారుణీతలంబు నిర్వైరమండలంబును నిశ్శేషజారచోరంబును నిబిడీకృతగ్రామకూపతటాకకుల్యారామంబును గావించి సన్మంత్రిమంత్రాలోచనంబునఁ బ్రవీణుండై యేకాతపత్రప్రభావంబుఁ గాంచి ద్వివిధవిరోధిశిక్షాదక్షుండయి శక్తియాలవాలుం డగుచుఁ జతురుపాయసామర్థ్యంబునుం గలిగి పంచతంత్రంబులమర్మంబు లెఱింగి షడ్గుణైశ్వర్యధుర్యుండన వెలసి సప్తవ్యసనంబుల వర్జించి యష్టభోగంబులకుం దగిన నవనిధానంబుల భాండాగారంబులు నియమించి పదిం బదియుఁగా రాజ్యపరిపాలనంబు సేయునతండు పార్థివరత్నం బండ్రు, కావున నీ వేతద్విధంబునం బ్రవరిల్లు మని మఱియు ని ట్లనియె. 339

చ. ఇది మొద లింక నెం దయిన ని ట్లొకరుండవుఁ బోకు పోయిన
న్మదనమనోహరాంగ మణిమండన నీగురవాన యంచుఁ బ్రే
మదొరల విన్నవించి నృపుమన్నన గాంచి యతండు వోవ న
య్యదనునఁ బ్రాగ్వియోగబల మవ్విభునిం గని చేరి మ్రొక్కినన్. 340

క. అందఱఁ గృపార్ద్రవీక్షా
మందరుచిం గప్పుకొని యమానుషమహిమం
జెంది ముదమంది రాజపు
రందరుఁ డతఁ డూరుసేరె రాజీవముఖీ. 341

తే. అని శుకాధ్యక్షుఁ డీరీతి నద్భుతైక
గాథ వివరింప నంతలోఁ గమలబంధుఁ
డుదయపర్వతశిఖరాప్తిఁ బొదల నంతి
పురవరంబున కరిగె నప్పువ్వుఁబోఁడి. 342

ఏడవరాత్రి:

చ. అల యలినీలవేణి విరహాతురయై మఱునాఁటి రాత్రి రా
చిలుకపటాణి నెక్కెడి వజీరునిఁ బోలిన యా నృపాలునిం
గలయఁ దలంచి మేన నయగారము గీర్కొనఁ జేసి చేరె ని
ర్మలగుణశాలియైన శుకమండలమౌళిసమీపభూమికిన్. 343

తే. అప్పుడా రాజకీర మిట్లనుచుఁ బలికె
మగువ! మగవాని మేలు నమ్మంగఁ దగదు
మది నొకానొకయెడ రోష మొదవె నేని
నేర్పుగల దూతి యొకరీతిఁ దేర్పవలయు. 344

క. పతి నేవగించు సతికి
న్సతి నొల్లని పతికి బద్ధసఖ్యము గలుగ
న్మతి నిర్వహించి కూర్చిన
చతురిక యగు దూతికాప్రసంగము వినుమా. 345

వ. అని యిట్లనియె. 346

మూఁడవ కథ

తే. అభ్రచుంబితమణిగణాదభ్రవప్ర
మై విజయభవనమను వీ డవనిఁ గలదు
ములికినాఁ డను సీమఁ గోమలుల చూపు
ములికి నాటిన మరుఁడు దా మూర్ఛ నొంద. 347

క. ఆరాజధాని వెలయు ను
దారుం డను రాజు ప్రోవఁ దన్నృపుచెంతన్
ధీరుఁడు తన ముక్కాకలఁ
దీఱిన దళవాయి యొకఁ డతిస్థిరబలుఁడై. 348

మ. పతికిం బ్రాణపదంబు జంధులకు నాకల్పప్రకాండం బన
ల్పితశౌర్యాబ్ధికిఁ గ్రేవ రాహుతులకు న్వెన్నాసయై శత్రుసం
తతి నెంతేఁ దెగటార్చి తన్మదమహోద్దండైకవేదండచం
డతురంగంబుల నెల్ల వస్తువులు దండన్నిల్పు నాభర్తకున్. 349

తే. భీమబలశాలి దృఢవర్మనాముఁడైన
ఘనుఁ డతండు నిజస్వామి కనువుపఱచు
రాజపరమేశ్వరాష్టదిగ్రారాజకులమ
నోభయంకరబిరుదైకవైభవంబు. 350

క. ఇత్తెఱఁగున బహుమహిమో
దాత్తపరాక్రమము మెఱయఁ దగునాతనికిన్
మత్తరిపుదమనశౌర్యా
యత్తుం డొకకొమరుఁ డలరు నతినిపుణుండై. 351

చ. చదువుల మేలు సాముపన చక్కఁదనంబు తెఱంగు సంపదం
బొదలెడు మేలి్మి పేర్మిగల భూరిభుజాబలశౌర్యధైర్యము
ల్సదయతయు న్వివేకసరసస్థితు లాకృతిఁ జెందెనో యన
న్మదనమనోహరుఁడు సుకుమారవరుం డతఁ డొప్పు నప్పురిన్. 352

తే. అతని కేలిక యైన యయ్యవనిభర్త
కూర్మికొమరున కొనరించుగో మొనర్ప
దల్లిదండ్రులు లోచనోత్సవము నొంద
నవ్విభుం డొప్పు జయకేతనాహ్వయమున. 353

వ. వెండియు నమ్మహాప్రభుకుమారుండు. 354

సీ. ఒకవేళ యవనచోళకళింగశకవంగ
గూర్జరు ల్గొలువంగఁ గొలు వొసంగు

నొకవేళ విగళన్మదోద్ధండవేదండ
హయపరంపర నెక్కి యాడఁ దివురు
నొకవేళ దండనాయకచమూనాయకు
ల్హాళిమై నడువ వాహ్యాళి వెడలు
నొకవేళ రిపునృపాలకజాలసాలదు
ర్గమదుర్గహరణైకకార్య మరయు
తే. మఱియు నొకవేళ ధీరసామంతమంత్రి
పుంగవులతోడ విభునిసమ్ముఖము చేరి
తెలుపఁదగువార్తలన్నియుఁ దెలియఁజేయు
ననఘ గుణశీలుఁ డాబాలుఁ డహరహంబు. 355

క. కంతునిభరూపరేఖా
వంతుఁ డతం డిట్లు మెలఁగ వనితాజనతా
స్వాంతమనోహరకరమై
యంతట యౌవనముఁ దోఁచె నవ్విభుమేనన్. 356

ఉ. ఔర విలోచనాంబుజము లద్దిర ముద్దుల నెమ్మొగంబు సిం
గారము బాపురే బవరిగడ్డము మేలు సురఃస్థలోరువి
స్తారము చాఁగురే యెగుభుజంబులపొంక మటంచుఁ బ్రేమచె
న్నారఁగ నారు లెల్ల ననయంబుఁ గనుంగొని సంతసింపఁగన్. 357

తే. వానిఁ దనివారఁ జూడనివనజగంధి
చూచి తలయూఁచి మెచ్చని సురుచిరాంగి
మెచ్చి విరహార్తి నొందని మీననయన
గలుగ దొకతైన నవ్వీటిచెలులలోన. 358

క. ఈలీల నతఁడు వర్తిల
బాళిం దన్నృపతిమౌళి పరిణయకార్య
శ్రీలలితుని జేయుట కిది
వేళ యితని కగు నటంచు వెసఁ దలఁచుటయున్. 359

తే. అతని జననీజనకు లపు డంతరంగ
మున మహోత్సాహమునఁ బొంగి యనుపమాన
మానసంపత్కులాభిజాత్యానుకూల
మమరు సరిమన్నె దొరలయిం డ్లరసి యరసి. 360

క. లావణ్య మంగరేఖయు
శ్రీవిలసల్లక్షణంబు శృంగారకలా
ప్రావీణ్యంబును గలకుల
పావనయగు నొక్కకన్యఁ బరికించుటయున్. 361

చ. అలజయకేతనుండు రుచిరాంగతిరస్కృతమీనకేతనుం
డెలమి మదిం దలిర్ప దయనేలికయుం దలిదండ్రులయ్యెడం
దలచిన కార్యభాగ ముచితజ్ఞులచే విని నీతికార్యవ
ర్తులగు నియోగిపుంగవులతోడ రహస్య మొనర్చి యిట్లనున్. 362

ఉ .ఎక్కడిజోలి పెండ్లి యగు టెట్లు సదుఃఖతరాజవంజవం
బక్కజ మే సహింపఁగలనా లలనం గలనైనఁ జూడఁ దా
దృక్కథ లాలకించి విను టెన్నఁడు లేదిది మీ రెఱుంగరే
యక్కట భామినీజనవిహారత మానధురీణుఁ డోర్చునే. 363

సీ. కాలకూటజ్వాల గబళింప నగుఁగాని
యతివలతోడ మాటాడ నగునె

పులులమీసముల నుయ్యలలూఁగ నగుఁగాని
వారిజాక్షులచెంతఁ జేర నగునె
దంభోళిహతిసముద్ధతి కోర్వ నగుఁగాని
లేమలపల్కు లాలింప నగునె
బడబాగ్నిఁ బిడికింట నొడియంగ నగుఁగాని
కుసుమగంధులపొందుఁ గోర నగునె
తే. కటకటా మూర్ఖమర్కటకరతలస్థ
కల్పతరుసూనమాలికాకల్పుఁ డగుచు
సరసుఁ డగుమర్త్యుం డంగనాజనమహోగ్ర
ఘోరసంసారవిషధిలోఁ గూలనగునె. 364

క. అని విడనాడఁగ నాతనిఁ
గనుఁగొని యోనృపకుమారకంఠీరవ యే
యనువున నొనరింతుము నీ
మన మలర నటంచు మంత్రిమణు లవ్వేళన్. 365

సీ. గార్హస్త్య మిందిరాకాంతాకటాక్షవీ
క్షణలబ్ధికిఁ బ్రధానకారణంబు
సంసార మర్థార్థిజనమనస్సంతాప
కార్పణ్యము లడంపఁ గల్పశాఖి
దాంపత్య మతిశుభ్రతరజగత్పరిపూర్ణ
వరకీర్తిలతికాలవాలభూమి
యాజవంజవము దివ్యైకలోకానీక
పథము నందించుసోపానరేఖ
తే. ఘనతరకుటుంబ మఖిలోపకారకంబు
గాన సుచరిత్ర యగుకన్యకను వరించి

మానవిఖ్యాతిలాభసంపన్నుఁ డగుట
యెంతయిన నొప్పు నట్లు గాదేని హాని. 366

తే. హరిహరహిరణ్యగర్భాదు లగుమహాత్ము
లెల్ల నెప్పుడు సంసార మిచ్చగించి
పుత్రపౌత్రపరంపరాభ్యుదయవంతు
లగు టెఱుంగవే యేకవీరాగ్రగణ్య. 367

వ. అని యనేకప్రకారంబులం బచరించిన నమ్మనీషివరుల విశేషవచనంబు లంగీకరింపక దురంతచింతాపరతంత్రస్వాంతంబునం గొంతతడవు విచారించి యంతఃపురంబుఁ బ్రవేశించి యౌవనారంభసంరంభంబునం బొడము దురాలోచనంబున విజృంభించి దూరం బరయక యతం డర్ధరాత్రంబున. 368

తే. వేగం జనియెద నిక నొక్కవింతదేశ
మునకు భామాజనంబుల మోముఁ జూడ
నోపలేనని తీవ్రసంతాపహృదయ
మున రయోద్ధతి నయ్యంతిపురము వెడలి. 369

చ. పలుచనిదంతపుం దళుకుపాదుకల న్సడలించి కుంచితాం
ఘ్రుల వలిపంపుఁజేలమునికొం గొకయించుక యొత్తి చిత్త మిం
పలరఁగ నొక్క యందలమునందుఁ దగం జనియె న్విభుండు క్రే
వలఁ దగ నొంటరీలు గొలువం గరదీపతతు ల్వెలుంగఁగన్. 370

వ. ఇవ్విధంబున. 371

క. జనపాలునకును జననీ
జనకులకుం జెప్ప కతఁడు చని కనియెను గం

ధనిబంధనేంథనాచల
మునకు సమీపంబు పాండ్యభూమండలమున్. 372

తే. కాంచి యచ్చటఁ బాండ్యభూకాంతరత్న
పాలితంబై ననవరత్నకీలితైక
గోపురం బైనగంధవతీపురంబు
వెలయు నప్పొంత నొకదేవనిలయ మొలయ. 373

మ. కని యంతం భ్రమరస్ఫురత్కమలినీకాసారతీరంబునం
గనువిందై యనువొంది చైత్రరథశృంగారంబు గన్పట్టు ది
వ్యనవీనద్రుమపుంజరంజితమహోద్యానంబునుం గాంచి స
జ్జనమాన్యుం డతఁ డందు నిల్చె నొకద్రాక్షాకాయమానస్థలిన్. 374

తే. అప్పుడయ్యెలదోఁటలో నతనిసరసఁ
బరిజనంబులు పరిపక్వఫలసుగంధ
కుసుమరసపల్లవంబులఁ గొల్లలాడి
యుల్ల ముల్లాసమును బొంద నుండువేళ. 375

క. తుకతుక నపు డలవనపా
లిక యగు బాలిక మృగాంకలీలారేఖా
ప్రకటితోపవిశంకట
వికటనటద్భ్రూకుటీసువిభ్రమముఖియై. 376

సీ. నిండారఁ బొడమిన బొండుమల్లియతావి
క్రొవ్విరు లెవ్వరో కోసినారు
ప్రబలంపుగాడ్పుచే రాలిన యెలమావి
దోరషం డ్లెవ్వరో యేఱినారు

వాటమౌ దవనంపుఁదోఁటకంపవెలుంగుఁ
దొలఁగిపో నెవ్వరో త్రోసినారు
దట్టమై నులిగొన్న యట్టిపందిరిద్రాక్ష
తీవ లిం దెవ్వరో త్రెంచినారు
తే. కంటి మాయయ్య రావలెఁ గద యి దెవ్వ
డిందు నేనెత్తు వెలిపువ్వు టెత్తు కేలఁ
బట్టుకొనె నంచుఁ జిడిముడిపడుచుఁ గాఁపుఁ
బడుచువగలాఁడి యప్పుడప్పజ్జ గదిసి. 377

క. తనతేజీ లున్నవి యని
వనవాటిం గనుఁగొనంగ వచ్చిన లక్ష్మీ
తనయుఁ డన నొప్పు జయకే
తనవిభు నీక్షించి మోహతరలేక్షణయై. 378

క. తనతండ్రి యున్నయెడకుం
జని తద్వృత్తాంత మంత చతురతరోక్తిం
గనినట్లు తెలుప విని య
వ్వనపాలకుఁ డద్భుతైకవశమానసుఁడై. 379

ఉ. ఎచ్చట నుండునో మొదల నెవ్వఁడొ యెవ్వరివాఁడొ వీఁడు నేఁ
డిచ్చటి కేగుదేరఁ గత మెయ్యదియో యని తత్కథాక్రమం
బిచ్చజనింపఁ బాండ్యజగతీశ్వరు నీశ్వరసన్నిభు న్సము
ద్యచ్చతురాస్యుఁ గాంచి వినయంబునఁ దద్విధమెల్లఁ జెప్పినన్. 380

తే. ధన్యుఁ డారాజలోకమూర్ధన్యుఁ డతని
రూపయౌవనవిభవప్రతాపములకు

నాత్మ మెచ్చి తదాలోకనాభిలాష
నప్పు డుద్యానవనవాటి కరుగునంత. 381

చ. మితపరివారుఁడై రణసమిద్ధభుజుండు జయధ్వజుండు త
త్క్షితిపతిమౌళిసమ్ముఖముఁ జేరి విధేయత మ్రొక్కి నిల్చిన
న్మతిఁ గుతుకం బెలర్ప నసమానలసత్కుసుమానమన్మహీ
జతతియేడ న్వసించి సరసస్థితి నాతని కాతఁ డిట్లనున్. 382

క. ఓవత్స నిను మనంబున
భావింపఁగ సార్వభౌమపర్యాయశుభ
శ్రీవిభవము గననయ్యెడు
నీ వెవ్వరివాఁడవయ్య నృపకులతిలకా. 383

ఉ. నీపరిణద్ధకంధరయు నీదువిశాలవిలోచనంబులు
న్నీపటుదీర్ఘబాహువులు నీవిపులోరుకవాటవక్షమున్
బాపురె సర్వభూవలయపాలనముం గలిగించి మించఁగా
నోపుచునున్నవేల యిటు లొంటిఁ జరించెద వంచుఁ బల్కినన్. 384

తే. అప్పు డాజయకేతనుం డతనితోడఁ
దనకులాచారగోత్రసూత్రములు నొడివి
ప్రేమఁ దనతల్లిదండ్రులు పెండ్లిసేతు
మనఁగ విని యొల్ల కేవచ్చి తవనినాథ. 385

చ. అనవిని పాండ్యమండలమహాప్రభుఁ డల్లన నవ్వి యోసుధీ
జనవర పెండ్లియొల్ల మనుజాడ్యమతు ల్గలరే జగంబునన్
విన నిది వింత యిందు కొకవేఱ నిమిత్తము గల్గియున్న నె
మ్మనమున సంశయింపక క్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా. 386

వ. అని యడిగిన నప్పాండ్యమహీమండలేశ్వరున కప్పుణ్యచరిత్రుం డి ట్లనియె. 387

తే. విను పరా కింతలేక నా విన్నపంబు
పూర్వభవమున నే నొక్కభువనమోహ
నాద్భుతసరోవరంబులో నధివసించి
రాజహంసంబునై యుంటి రాజచంద్ర. 388

క. అప్పుడు మత్కులకామిని
తప్పనిప్రేమం బతివ్రతారత్నము న
న్నెప్పు డెడసనక కంటికి
ఱెప్పవలెం గాచి తిరుగు రేలుం బవలున్. 389

వ. అదియునుం గాక. 390

సీ. ఆఁకలి గొనునప్పు డబ్జనాళములలో
నూటి కొక్కటి తెచ్చి నోటి కొసఁగు
గమనించుతఱి మందగమనశృంగారాప్తి
నంటు వాయక వెంటవెంట నెయిదు
నుబుసుపోవనివేళ నుల్లోల కల్లోల
డోలికామాలికాకేళిఁ దేల్చు
బడలియుండినవేళ నొడలితాపము దీఱ
వలిఱెక్కసురటిగా డ్పలవరించు
తే. ముచ్చటలు దెల్పు రతికేళి కెచ్చరించు
సన్న దెలిపి విలాసప్రసన్నవదన
యగుచు వర్తించు నేను నావగఁ జరింతు
వరట మదికింపు దొలఁక భావజ్ఞతిలక. 391

తే. ఇట్లు వర్తించుచున్నచో నెలమి నన్నుఁ
గొలిచి విహరించు రాయంచ బలఁగమెల్ల

గెలన నొకపైఁడి నెత్తమ్మికొలను జూడ
నొప్పునని తెల్పఁ దద్వీక్షణోత్సుకమున. 392

మ. చని యద్దివ్యసరోవరంబున యథేచ్ఛాలీల వర్తించు హం
సనికాయంబులతోడఁ గొంతతడ వంచల్లీల వర్తించి త
త్కనకాంభోరుహవిభ్రమదమరఝంకారధ్వనిం దత్తటీ
వనవాటివిహారద్విచిత్రవిహగవ్యావృత్తి నీక్షించుచున్. 393

తే. మఱియు నచ్చోట విహరించుతఱిని మంద
మందగంధవహాప్తి మై మఱచియుండు
నంత నను నెచ్చరింపక యరిగె బంధు
తతి మనంబున నిల్లాండ్రఁ దలఁచికొనుచు. 394

ఉ. అంతట నాశకుంతబల మవ్వరటాతతిఁ జేరి మోహసం
క్రాంతత నంబుజోత్పలకులాయముల న్విహరింపఁ జూచి వి
భ్రాంతతనొంది మత్ప్రియుఁడు రానితెఱంగిది యేమొయంచు మ
త్కాంత ననుం గనుంగొననితాపమున న్విరహాబ్ధిమగ్నయై. 395

తే. అమ్మ నేఁజెల్ల; నెవతెయో యవలనొక్క
కొమ్మ నాప్రాణవిభు నేలుకొనియె నేమొ
కాకయుండిన ననుఁ జేరరాక యున్నె
యని ప్రలాపించి కనుమూసె నాక్షణంబ. 396

క. ఈవార్తలు సవసవగా
నే విని ప్రాణేశ్వరీ యిదే నను నొంటిం
జోవిడిచి చనుట తగదనీ
భావించి వియోగవహ్నిపరితప్తుఁడనై. 397

తే. నాఁటి యలహంసజన్మంబు వీటిఁబుచ్చి
మగుడ మానుషవేషసంభవుఁడనైన
నేటికిని దద్వధూటిపై నెనరువాయ
నైతి నిఁక నేమనందుఁ బాండ్యక్షితీంద్ర. 398

ఉ. కావున నాఁడు నేఁ డితరకాంతల నేరిఁ బరిగ్రహింపనో
భూవర యంచుఁ దెల్ప నృపపుంగవుఁ డౌనని మెచ్చి బంధుసం
భావితలీల నాఘనుని భావ మలర్చి విశేషవస్తుసం
భావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబుఁ జేరినన్. 399

వ. అంత. 400

తే. గరిమఁ దత్పాండ్యరాజన్యకన్యయైన
శాలికానామబాల య వ్వేళ నిజపు
రోపవనభూమి మునివృత్తి నొదిఁగియుండు
నలజయధ్వజవిభువార్త లాలకించి. 401

చ. నలనిభుఁ డీజయధ్వజుఁడె నావిభుఁ డంచుఁ దలంచునంతలో
వలపులఱేఁడు కెంపుజిగివంపుమొగంపుఁబటాణినూకి క
న్నులు గలవింట నప్పుడు వినూత్నశరావలు లేసి యార్చె న
మ్మెలఁత మెఱుంగుగబ్బిచనుమిట్టల హారలతల్ చలింపఁగన్. 402

క. అంత నలయింతి విరహా
క్రాంతమతి న్నిమిష మొక్కకల్పంబుగ న
త్యంతతరదురవగాహన
చింతం దంతన్యమానచిత్తాంబుజయై. 403

శా. మారుం బేర్కొనిదూఱు గంధవహుఁ బల్మాఱుం దుటారించి వే

సారుం జైత్రునిఁ గేరుఁ గేళివనసంచారార్థమై తెల్పినం

జాఱుం గేకి పికాళిసంఘములు వాచావైఖరిం బోరుఁ ద
న్నారీరత్నము తజ్జయధ్వజసముద్యన్తోహసంక్రాంతయై. 404

తే. అలహరిద్రానిభాంగి సౌధాగ్రసీమ
నుండ కవనికి డిగియె రేయెండ కళికి
ప్రాణసఖు లెల్ల నెండకుఁ బశువు దలఁకి
నట్లు నీ వేల తలఁకెద వనుచుఁ బలుక. 405

[7]క. భావ మెఱిగింప నేరక
యావెలఁదుక యున్నఁ జెలువ లవ్విధమెల్లన్
భూవల్లభునకుఁ దెలిపిన
నా వేళ నమాత్యహితకృతాలోచనుఁడై. 406

ఉ. కన్నియ యీజయధ్వజునిఁ గాని వివాహ మొనర్ప నొప్పదే
ధన్యుఁడు నైనవాఁడు వనితాజనతైకపరాఙ్ముఖుండు సా
మాన్యమనీషి కీవగ యొనర్చుట కొద్దితెఱంగు తెల్పుఁడో
మాన్యచరిత్రులార! యని మంత్రులతో విభుఁ డానతిచ్చినన్. 407

క. పొసఁగ దిది యనుచు మంత్రులు
గుసగుసలంబోవ రాజకుంజరుతోడన్
వెసమృదులవాణి యనఁదగు
బిసరుహముఖ యొకతె విన్నవించెం బ్రీతిన్. 408

ఉ. ఏలవిచార మింతుల నొకింత యెఱుంగని ఋష్యశృంగునిం
బాలికలండఁ జేరి యొకబాలికఁ బెండ్లి యొనర్చి భామినీ

లోలునిఁ జేయువార్త మహిలో నుడున న్వినరేమొ యట్లనీ
శాలిక నాసమగ్రగుణశాలికిఁ బెండ్లి యొనర్తు నావుడున్. 409

తే. ఆవిభుండు ప్రమోదసద్భావుఁ డగుచు
సెలవొసంగిన నిరుమ్రోలఁ జెలులు గొలువ
నవ్వరారోహనాందోళికాధిరోహఁ
జేసి కార్యప్రవర్తనోల్లాస మెసఁగ. 410

సీ. నేల జీరకయుండఁ గేలఁ గుచ్చెలఁ బూను
కొని యూడిగపుసతు ల్గునిసి నడువ
మడమెత్తు పర్వుతో మంత్రాక్షతము లీయఁ
బాల్పడి భూసురభార్య లెదుర
నొక్కకీ లొరఁగుపై నునిచి యేకాంతంబుఁ
దెలుపుచుఁ గూర్మి నెచ్చెలులు సనఁగ
జయకేతనునివార్త సారె విచారించి
వచ్చి ప్రగడకత్తె లెచ్చరింప
తే. సొంపుతోఁ బౌరకామిను ల్గుంపుగూడి
యమ్మ యిదిగాక సౌభాగ్య మనుచు మెచ్చ
నప్పు డుద్యానవనవాటి కవ్వధూటి
నెలమిఁ దోతెచ్చి యాచెంత నిలుచునంత. 411

చ. పిలపిల నాజయధ్వజుని బెద్ద లెదుర్కొని రాకురాకుఁడో
యళికచలార భీతహరిణాయతనేత్రల మత్ప్రభుండు నా
వలనను జూడ నోడుననువార్త వచించిన మందహాసకం
దళవదనం బెలర్పఁగ ముదం బలర న్మృదువాణి యిట్లనున్.

క. మునుమున్న తద్రహస్యము
విని యున్నదిగానఁ బ్రౌఢవృత్తి నలసుధీ
జనములతో నను గాంతా
జనరత్నము మధురరసవచస్ఫుటఫణితిన్. 413

ఉ. ఈయెలదోఁట నుండఁదగ దింకొకచక్కి వసింపనేగుఁడో
ధీయుతులార! పాండ్యనరదేవతనూభవకేళికాగృహ
ప్రాయత నిందు నెప్డు నిరపాయమున న్విహరించుచుండు నే
డాయెలనాఁగ గ్రుమ్మరుటకై యదెవచ్చెఁ దలంగుఁ డిత్తఱిన్. 414

తే. ఇంతమాత్రంబె కాదు పూర్ణేందుముఖులు
సమ్ముఖంబునఁ గార్యప్రసంగవశతఁ
బెండ్లి యనుమాటఁ బేర్కొన్నఁ బెనిమి టనిన
మిట్టి మీనై యదల్చు నమ్మీననయన. 415

క. ఇది యేమినిమిత్తమొ యని
మది నెంచితిరేనిఁ దత్క్రమంబంతయు నీ
యదన వివరింతు వినుఁడిం
పొదవం దొల్లింటిజన్మ మొదవినవేళన్. 416

ఉ. తా నొకహంసియై సరసత న్నిజవల్లభుఁ డుల్లసిల్లఁ జి
త్తానుగుణోన్నతి న్మెలఁగు నంతటిలో నొకనాఁడు చెంత నిం
పైనసరోవరంబుఁ గని యచ్చటి కేగి విభుండు నిర్నిరో
ధానుపమానసౌఖ్యవిభవాప్తి మెయి న్వెసరాక చిక్కినన్. 417

క. మగఁ డేల రాఁడొ యొండొక
మగువం దగులుకొని నన్ను మఱిచెనొకో మనం
బగలెడు నని దిగులొందుచుఁ
దెగువం బ్రాణములు విడిచె దీనాననయై. 418

ఉ. వావరి నప్పతత్రికులవార్ధిసుధాకరరేఖ యీధరి
త్రీవరకన్యయై యవతరించి విభుం డొనరించి నయ్యుపే
క్షావిధ మెన్నుచున్నదని సారె వచించిన మంత్రు లద్భుతం
బై వెలయం జయధ్వజున కత్తెఱఁగెల్ల నెఱుంగఁ జెప్పినన్. 419

క. వినినంతఁ బెన్నిధానముఁ
గనుఁగొన్న దరిద్రుఁ బోలి ఘనుఁడా జయకే
తనుఁ డలతలోదరీమణి
తనసొమ్మని తలఁచి యతులితత్వరమతియై. 420

తే. సమ్మదాశ్చర్యమోహము ల్సందడింప
నుద్దవిడి లేచివచ్చి యమ్ముద్దుగుమ్మ
యెద్ది యెద్ది యటంచు నయ్యించుఁబోణు
లలరఁ జని పాండ్యనృషకన్య యండఁగదిసి. 421

చ. నిను నెడఁబాయఁజాల దరుణీ యని నీయనివార్యవిభ్రమం
బనిమిషులందునైనఁ గలదా యని దాయనిరూఢి నెంచి న
న్మనసిజబా కొర్వదరమా యని మాయనిమోహదాహమే
యనువున దీర్చువాఁడ నహహా యని హాయని చేరి మ్రొక్కినన్. 422

క. వనితాలలామ లజ్జా
వినమన్ముఖ కమలతం బ్రవీణత లేమిన్
గని రాజదూతి యనియెం
గనికరమున నక్కుమారకందర్పునకున్. 423

చ. పసిరికపామువంటి దని పల్కుదు రీయలివేణివేణి న
ప్పసమును నిండుఁగుండలయి భాసిలు నీలలితాంగి గుబ్బ లీ
ముసిముసినవ్వులాఁడి కరము న్వెసమూసిన ముత్తియంబు నీ
కుసుమసుగంధి కేవలము గోలసుమీ యనమీఁదలంచుమీ. 424

చ. అనుటయు దండనాథసుతుఁ డానృపకన్యక నాదరించెఁ ద
జ్జనకుఁడు సమ్మతించె సరసస్థితిఁ బెండ్లి యొనర్చి వైభవం
బెనయఘటించి యొక్క విమలేందుశిలామయసౌధమందుఁ జే
ర్చిన నెనరొప్పఁగా విడిద చేసుక యంత వసించి వేడుకన్. 425

క. మును నేనొనర్చు నేరము
మనమున నెంచంగఁ దగదు మగువా యనుచుం
గనకాంగి నూఱడిలఁగా
నని సెజ్జం గౌరవించి యధికప్రౌఢిన్. 426

సీ. కాశ్మీరపంకసంకలితాంకమై పొంక
మగు బాహుమూలంబు లంటియంటి
వరమృగీమదపత్రవల్లరీరుచి నొప్పు
నుదుటుసిబ్బెపుగుబ్బ లొత్తియొత్తి
నానావిధబహుప్రసూనైకగంధంబు
నివ్వటిల్లెడు కొప్పు దువ్విదువ్వి
తాంబూలరసరక్తిమంబైన యమృతంపు
బింబాధరము ముద్దుపెట్టిపెట్టి
తే. ఘనజఘనకంబు కంధరకదళికామృ
దూరువులవాఁడి కొనగోళ్ల నొరసియొరసి
యెలమి నలయించి మించి యయ్యలరుఁబోఁడి
నతనుసామ్రాజ్య మేలించె నవ్విభుండు. 427

క. ఈమాడ్కి నమితభోగ
శ్రీ మెఱయఁగ నొక్కనాఁడు చిత్తమున నిజ
స్వామియుఁ దలిదండ్రులుఁ దను
గోమించిననడతఁ దెలిసికొని యతఁ డెలమిన్. 423

తే. మామతోఁ దెల్పి కాంతాలలామయైన
శాలికాకన్యతోఁగూడ సకలసైన్య
మిరుగడలఁ గొల్వఁ దనపురీవరముఁ జేరె
నేలికయుఁ దల్లిదండ్రులు నిచ్చ మెచ్చ. 429

క. పతి నేవగించుసతికిన్
సతినొల్లనిపతికి బద్ధసఖ్యము గలుగన్
మతి నిర్వహించి కూర్పఁగఁ
జతురిక యగు దూతి వలయు జలజాక్షులకున్. 430

వ. కావున నేతత్ప్రయోజనసంధానకారిణి యగు నీరాజదూతిక తాదృగ్విచక్షణలక్షణోపలక్షిత యగుఁగదా యిత్తెఱం గెఱుంగక యున్నఁ గార్యభంగం బగు ననివచియించు సమయంబున. 431

తే. విమలతరతారహారము ల్వెస నొకింత
చల్ల నగుటయు నలశరచ్చంద్రవదన
సదనసంచారమున కేగ జలజహితుఁడు
చరమగిరిఁ జేరె నంతలో నొరపుమీఱి. 432

చ. కులికెడుగుబ్బచన్పసిఁడికుండలు నిండిన కుంకుమంబు జొ
బ్బిలవలిపంపు మేల్రవిక పిక్కటిలన్ వెలిపట్టుచీర ము
ద్దులు వెలయింప వింతవగదుప్పటి పైవలెవా టమర్చి పా
వలు మునివ్రేళ్ల మెట్టి శుకవర్యునిమ్రోల లతాంగి నిల్చినన్. 433

క. ఆతఱిఁ బుండ్రేక్షురస
ఖ్యాతరుచిన్ రాజకీరకంఠీరవ మా
కాతరనేత్రకుఁ దెల్పె న
తీతంబగు నొక్కకథ యతిప్రీతి మెయిన్. 434



క. ఓనీలవేణి మదిలో
మానవుఁ డొక్కటి తలంప మఱిదైవము తాఁ
బూనుఁ బెఱకార్య మొక్కటి
కానఁ దదీయాజ్ఞవలయుఁ గార్యార్థులకున్. 435

వ. అత్తెఱంగునం బ్రవరిల్లనియట్లయినం దొల్లిటిసమయంబున గుణవల్లభుండను మహీసురవల్లభుండు భల్లూకనఖభల్లహతుండైన యట్ల యగు నది యెట్లనిన వివరింతు నాకర్ణింపు మని యిట్లనియె. 436

నాలుగవ కథ

సీ. అప్రతిమప్రభుం డగణితైశ్వర్యధు
ర్యత్వసాక్షాన్మహారాజరాజు
రూపరేఖామన్మథోపమానాంగుండు
ధరణీధరోద్దండధైర్యశాలి
యార్తరక్షణుఁడు సత్కీర్తికల్లోలినీ
డిండీరితశుధాంసుమండలుండు
నత్యుద్ధతప్రభావాంకుండు సకలస
జ్జనవర్ణనీయశోభనచరిత్రుఁ
తే. డలరు నొకరాజు కర్ణాటకాంగవంగ
నృపమకుటఘర్షితాంఘ్రినీరేరుహాగ్ర
నఖరశిఖరుండు భువిఁ గీర్తిముఖుఁ డనంగఁ
దనరి యంశుమతీపురాధ్యక్షుఁ డగుచు. 437

తే. అతఁడు కమలాక్షియను ప్రియురాలివలనఁ
గన్న లీలావతీనామకన్య నెలమిఁ

బ్రోదిసేయంగ నలయించుఁబోణి వెలయు
మలయుపరువంపు జవ్వనం బలము కతన. 439

క. చిత్తరువు ప్రతిమయో తెలి
ముత్తియమో కమ్మపైఁడి బొమ్మయొ యన న
మ్మత్తచకోరాక్షి శుభా
యత్తమతిన్మోహనాంగియై యుండునెడన్. 439

చ. చెలి నునుగబ్బిగుబ్బలకు సిబ్బెపు తళ్కొకవన్నె వాలుగ
న్నులకు మిటారిచూ పొకవినోదము గెందలిరాకు మోవికిం
గలికితనంపున వ్వొకచొకాటము మేని మెఱుంగు తీఁగకుం
దలఁపు వహింపఁజేయు నెఱతావి యొకానొకవింతయై తగున్. 440

వ. ఆసమయంబున. 441

తే. అన్నగరమందు నెపుడు పురాశ్రితుండు
పల్లవాగ్రేసరుఁడు గుణవల్లభుఁడను
పేరు గలవాఁడు గలవాఁడు ధీరజనవి
రోహితుం డగు నొక్కపురోహితుండు. 442

వ. వెండియు నతండు. 443

ఉ. శాంతు లొనర్చి గండకలుషంబుల నెల్ల నడంచు శత్రుకా
లాంతకరూపమైన జపమాచరణం బొనరించీ యమ్మహీ
కాంతునకు న్శుభంబు లెసఁగన్ జయమున్ సమకూర్చుసారసి
ద్ధాంతి యితం డటంచు విబుధప్రకరంబు మదిన్ గణింపఁగన్. 444

క. అలకాలజ్ఞకులాగ్రణి
యెలమిం దద్రాజకన్య నేలాగుననో

కలఁగన్నయట్టు లొకనాఁ
డలవోకం జూచి మన్మథాజ్ఞావశుఁ డై. 445

క. అందనిమ్రానిఫలం బిది
యందుకొనుట యెట్టులొక్కొ యనుచు మనమునన్
దుందుడుకుచే ధరామర
కందర్పుం డతఁడు మేలు గలవాఁ డగుటన్. 446

తే. అంత నత్యంతకాముకుం డగునతండు
ఛాందసుఁడు గానఁ దనమనస్తాప మెల్లఁ
దెల్లమి యొనర్పఁ దగదంచుఁ దెలియనేర
కల్ల నగరింట నొకదాది ననుసరించె. 447

ఉ. ఈనరనాథకన్యపిఱుఁ దించుక ముట్టఁగనిచ్చి మేనునా
మేనున నంటఁ జేర్చి రుచిమించినమోవి యొసంగెనేని భూ
దానహిరణ్యదానఫలదానము లిచ్చినయట్ల విప్రుం డెం
తైనను దానయోగ్యుఁడుగదాయని నన్బ్రతికించునావుడున్. 448

తే. అది దిగుల్పడి యెట్లు నోరాడె నౌర
పలుక నీరీతి నోవెఱ్ఱిబాఁపనయ్య
ముక్కఱయుఁ గమ్ములును దాల్చి మురియుచున్నఁ
జూడఁజాలక యిట్లాడినాఁడవేమొ. 449

క. అన విని తత్పదయుగళం
బునఁబడి నీధర్మసత్రపుం బ్రాహ్మణునిన్
నను మన్నించిన నిఁక నే
నొనరించిన ధర్మ మెల్ల నొసఁగెద నీకున్. 450

తే. అనుచుఁ గడతేఱి పోవుచో నజ్జడాత్ముఁ
డన్యభామారతోత్సాహు డగుటఁ జేసి
లీలలీలావతీకన్యకాలలామ
నెత్తెఱంగునఁ జేకొందు నెట్లుమందు. 451

క. ఇవ్విధమునఁ దలఁచుచు నత
డువ్విళ్లూరంగ శుభముహూర్తపుఁదరి నా
పువ్వుంబోఁడికి బాల్యము
జవ్వాడి తొలంగునంత సమరతపొడమెన్. 452

మ. అపు డాకీర్తిముఖుండుఁ దత్సతియు నత్యానందసంధానతన్
నృపకాంతాజనము ల్మహీసురపురంధ్రరత్నము ల్గొల్వఁగా
రపణం బుప్పతిలం దదంతవిభవారంభంబుఁ గావించి య
చ్చపలాక్షామణికి న్వివాహ మొనరించంగార్యమూహించుచున్. 453

తే. రాజమౌళియుఁ దత్సతీరత్న మపుడు
తగుకులస్థుఁడు రూపకందర్పుఁ డైన
వరుఁ డెవఁడొకో యటంచు భావమున నెంచు
నంతఁ గపటాత్ముఁడైన సిద్ధాంతి యనియె. 454

క. ఈబిడ సుముహూర్తకళా
ప్రాబల్యమునం జనించు భాగ్యంబున సు
శ్రీబలముఁ జెంది నీగృహ
మాబలజిద్భోగసమధి కాస్పద మయ్యెన్. 455

వ. తదనంతరంబ.456

తే. బాలదుష్టవేళఁ బ్రథమరజస్వల
యయ్యెఁ గాన దీని యవగుణమున

రాజ్యలక్ష్మిఁ బాసి ఱంపిల్లు నీయిల్లు
కలిమి పెంపుఁ బాసి పొలియు ననఘ. 457

క. అనవిని గుండియ యదర
న్మనుజేశ్వరుఁ డాప్తులైన మంత్రులతో ని
ట్లను నే నేర్పునఁ దీర్చెద
రనవుడు నద్దుష్టమంత్రు లవివేకమునన్. 458

తే. సీత పుట్టి లంక చెఱచినచందానఁ
బుట్టఁదగనిముద్దుపట్టి యైన
బాలికాగ్రగణ్యలీలావతీకన్య
యిల్లు చెఱపఁ బొడమె నేమొ యనుచు. 459

చ. మును వెనుకేనియుం గనక మోసమునం గడుకార్యభంగమౌ
ననక సుకీర్తిహాని పద మంచుఁ దలంపక కన్ కామణి
న్వనధిపరీతయై పొదలు వాహినిలో నొకమందసంబునం
దునిచి రయంబున న్వెడల నొత్తుట నీతి యటంచుఁ దెల్పినన్. 460

క. కీర్తిముఖనృపవరుం డప
కీర్తి జనించునని మిగుల ఖిన్నతనపు డ
వ్వార్త వినలేక బహుళత
రార్తి న్నిజకామినీసహాయత వనటన్. 461

క. కడుపు చుమ్మలు చుట్టఁగాఁ గన్నకన్నె
చిలుక నెడఁబాసి యేరీతి నిలుచువాఁడ
నెక్కడివివేకమున మంత్రు లెల్లఁ గదిసి
కువలయేంద్రునితో గువ్వకోలుగొనుచు. 462

మ. మునుగుంతీసతి కూర్మినందను మహాంభోవాహినిం జేర్పదో
మనువంశాంబుధిచంద్రుఁ డాదశరథక్ష్మాభర్త శ్రీరామునికిన్

వనవాటి న్విహరింపఁ బంపఁడొ కృపాస్వాంతైకవాత్సల్యవ
ర్తనముల్ చూడఁగ రాజనీతియె నరేంద్రాయంచు బోధించుచున్. 463

తే. [8]మానుమీ మోహమని తెల్పి మానవేంద్రు
చిత్త మొగ్గించి యొకమాటఁ జేసి రాచ
కొమిరె నిదురించుతఱి మందసమున నుంచి
వీడువెడలించుకొని తెచ్చువేళ నెదుట. 464

సీ. కలశోద్భవానీతకలితపుణ్యసమేత
యఖిలజగత్పూత యైనమాత
జడధినాయకు నేలుబడి గన్నయిల్లాలు
నిఖిలపుణ్యపుఁజాలు నిలుచుప్రోలు
ఆభ్రఘట్టనఖేలనాభీలకల్లోల
యఘతూలికాజాల మడఁచు కీల
ఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీన
వినుతసత్యవితానమునకు సోన
తే. యధిపతి సమాగమార్థప్రయాణసమయ
సమధికోత్తుంగభంగసంచారజనిత
ఘనగరుధ్వానపటపటాత్కారసార
భూరిసితపక్షభేరి కావేరి వెలయు. 465

ఉ. ఆవరవాహినిం గని దురన్వయు లచ్చటి మంత్రు లెల్ల
లావతియున్న పెట్టియ నలంఘ్యతరం బగు తజ్జలంబునం
బోవిడిపించి భూవిభునిపొంతనె యెప్పటియట్ల యుండి రా
హా వివరం బెఱుంగని దురాత్ములకృత్యము లట్టివేకదా. 466

వ. కావున. 467

క. నృపతి యగువాఁడు విద్యా
నిపుణున్ బహుకార్యభారనిర్వాహకు శాం
తపరజనమర్మభేదన
కపటమతి న్మంత్రిఁ జేయఁగానగు నబలా. 468

వ. అది యెంతైనం గల దత్తెఱంగునకు నిమిత్తం బేమి యట్లుండనిమ్ము తదనంతరవృత్తాంతంబు వినిపింతు నని యి ట్లనియె. 469

క. జనకుఁ డగువార్ధి రాజుం
గనుప్రేమం దల్లియైన కావేరికడం
జనుకమలపాణి యనన
వ్వనజాయతనేత్ర యేఁటివడి నేగుటయున్. 470

చ. తను మునుజూచి మోహపరితాపము గన్న పురోహితుండు గ్ర
క్కున నిది వేళ యీకుసుమకోమలితో రతికేళివైభవం
బనువుగఁ గోర్కి దీర్చుకొన నంచు మనంబున నెంచి తత్తటీ
వనతలకుంజమంజులనివాసము న న్వెస నొంటి నుండఁగన్. 471

వ. ఆసమయంబున. 472

తే. ఒదిఁగి యలమందసములోన నున్న రాజ
కన్యకామణి మేల్కాంచి కలవరించి
బహువిధంబుల విలపించెఁ బంజరమునఁ
జిక్కువడియున్న క్రొత్తరాచిలుకవోలె. 473

సీ. జనకు నెమ్మనము వజ్రప్రాయ మాయెఁగా
మాయగావించి యీమాడ్కిఁ బనుపఁ

దల్లికి వీను లెంతయుఁ జల్లనాయెఁగా
నాయగాధప్రయాణంబు విన్న
దాదియపఖ్యాతిఁ దలఁపలేదాయెఁగా
దాయగాఁబోలు నింతయు సహింప
నాళీజనశ్రేణి కాత్మ కింపాయెఁగాఁ
బాయఁగారాని యీబారినొంద
తే. నకట! నాయీడు రాచకన్నెకల కెల్లఁ
గడఁగి నన్నాడుకొన నోరు గల్గె నేమ
నందు నిఁక నెందుఁజొత్తు నాహావిధాత
వ్రాఁత యవిలంఘ్యమనియెంచు వడిఁ దపించు. 474

శా. అన్నీలవేణి యివ్వగ
నున్నంత సమీపభూమి నొక రాజు శుభా
భ్యున్నతుఁడు రశికశేఖరుఁ
డెన్నఁగ హిమథామనాముఁ డేపు దలిర్పన్. 475

తే. అతులితోత్సాహమున వేఁటలాడియాడి
కడఁగి యచ్చోటనే వీడువిడిసెఁ గానఁ
గర్ణయుగమునఁ దత్కన్యకాప్రలాప
కలకలధ్వను లాలించి జలదరించి. 476

మ. ఇదియేమో మనపాళెమెల్ల వగ న ట్టి ట్టై వెతం జెంద ని
న్నదిలోన న్విననయ్యె నాఁడు మొఱ కాంతారత్న మిం దెవ్వతో
మది నూహింపఁగరాని దుర్దశ వహింపంబోలు నేఁ డీవిప
త్పద మేమో వివరించుఁ డంచుఁ గరుణాపారీణచేతస్కుడై. 477

ఉ. భూరిజలప్రచారులగు బోయలఁ బంపిన వారలాపయః
పూరమున నెలంగు కలముం బలె నుండెడు మందసంబు న

త్తీరము సేర్చి యందు సుదతీమణి యుండు టెఱింగి యద్ధరి
త్రీరమణుం గనుంగొని విధేయతఁ దత్క్రమ మెల్లఁ దెల్పినన్. 478

క. విని యప్పు డానృపాలుఁడు
కనుకనినమ్మందసమునఁ గలకలవాణిన్
మన మలరఁ దోడి తెండని
తనదాదులఁ బంపె నోసుధాకరవదనా. 479

ఉ. అంత నతిత్వరైకమతి నజ్జరఠాంగన లేగి యమ్మహీ
కాంతుననుజ్ఞఁ బెట్టెఁ బిగఁగట్టుల నెల్ల సడల్ప రోహిణీ
కాంతుని రేఖఁ గ్రొమ్మెయిలు గప్పుటఁ బాసి రహించినట్లు త
త్కాంతతనూవిలాసరతికాంత తళుక్కనఁ జెంతనిల్చినన్. 480

క. కని యత్యంతకుతూహల
మున నజ్జరఠాంగనాసమూహము వెసన
వ్వనితారత్నము కులగో
త్రనిరూపణము న్వచింపఁ బ్రార్థించుటయున్. 481

చ. కరతలసక్తగండఫలకస్థలయై చిగురాకువంటి వా
తెఱవసివాఁడ ముద్దువగఁ దిన్నని మో మరవాంచి దీనతన్
సురసురస్రుక్కి యుస్సురనుచుం దనవర్తన మెల్లఁ దెల్పినన్
సరసతఁ గొందఱందు నృపు చక్కటి కుధ్ధతి నేగి వేడుకన్. 482

క. ఓరాజకులశిఖామణి
యారాజీవాక్షి చెల్వ మతిచిత్రము శృం
గారవతి యువతినృపక
న్యారత్నము దానిఁబోల నతివలుగలరే. 483

చ. చిఱుదొడలంద మాచికిలిచెక్కుల చొక్కట మామెఱుంగువా
తెజసొబ గావినీలమణిదీధితుల న్నునుఁగొప్పుచంద మా
గురుతరజాతకుంభమయకుంభకుచంబులగుల్కుబింక మా
తెఱువకె యొప్పు నత్తెఱవ దేవరకే తగనొప్పు భూవరా. 484

క. అనీ తెలిపి రాజు చిత్తము
కని క్రమ్మఱి రాజకన్యకం దెచ్చుటకై
వినయోక్తుల నంతయెల
ర్చినఁ జింతాజలధిమగ్నచిత్తాంబుజయై. 485

సీ. ముకురద్యుతికపోల మకరికాలతలతో
గమ్మకస్తురి చిత్రకమ్ము చెదర
వక్త్రగంధానుధావన్మిళిందములతో
గప్పుపెన్నెఱికొప్పు కంప మొందఁ
గర్ణికాకుసుమరింఖనర్మదంబుతో
నిడువాలుఁగనుదోయి నీరు చిలుక
గళదనర్గళఘర్మకణపరంపరలతో
నఱుతముత్తెపుసరు ట్దొరసి యాడఁ
తే. బీనవక్షోరుహమును లేఁగౌను ఘనని
తంబ మలరఁ బదంబు లందంద వడఁక
నడఁకువదలిర్ప నన్నరేంద్రాగ్రగణ్యు
కెలని కేతెంచె నలరాచకలువకంటి. 486

క. వచ్చుటయు రాజు చూచి వి
యచ్చరవరకన్య యేమొ యని మెచ్చుతఱిన్
మచ్చరమున నమ్మదనుఁడు
పచ్చని విలుఁబూని పంటఁబగవట్టెఁ జెలీ. 497

తే. ప్రేమ నవ్వేళ నేకాంతసీమ కరిగి
సరసుఁ డైనట్టి యమ్మహీశ్వరవరుండు
లీలదళుకొత్త లీలావతీలతాంగి
నించువిలుకానిరాజ్య మేలించి మఱియు. 488

క. ఆరామయండఁ బాయక
యారాజనరుండు నిజపురాంతఃపురముం
జేరి సుఖంబున నుండె ను
దారతరోత్సాహుఁడై సుధాకరవదనా. 489

మ. అని రాచిల్కలఱేఁడు పల్కునెడ నుద్యద్ఘోరగాఢాంధకా
రనివృత్తిన్ జగ మొప్ప నూరుజవధూరత్నంబు వీక్షించి యొ
య్యనఁ గేళగృహసీమ కేగి రవియస్తాద్రిప్రవేశంబునం
దినవేళం దమి రేఁగి భూవిభుని నర్థింజేరఁ జారు క్రియన్. 490

క. శృంగారరస మెసంగన్
బంగారపుబొమ్మవంటి బాలిక యపు డ
య్యంగజరాజతురంగము
చెంగటి కేతెంచి వాగ్విచిత్రప్రౌఢిన్. 491

క. శుకసార్వభౌమ నేఁ డీ
సకలజ్ఞుండైనగాజు చక్కటికరుగన్
సుకరమయి యున్న దీదిన
మిఁక వేగమ తెల్పు మవలి యితిహాసంబున్. 492

మ. అనుచుం జిల్కలకొల్కివల్క విని యత్యానంద మింపొంద ని
ట్లనియెం గీరకులప్రభుండు హిమధామాఖ్యుండు తా నూరికిం
జనుచో నెచ్చెలియున్న మందసములోనం గ్రూర

సక్రోధచం
డ నిరాతంకము నొక్క భల్లుకము నుండం జేసి గర్వోన్నతిన్. 493

తే. అమ్మహావాహినీజవాభ్యంతరమున
విడిచి చనెఁ గాన నది నీటివెంట నరుగఁ
దొలుత నమ్మందగమన పై వలపుఁ జెంది
పొంచికొనియున్న యవ్విప్రపుంగవుండు. 494

క. కనుఁగొంటి నదె నిధానము
గనుఁగొన నొక మాళ్లబిందె గలిగెఁ గదా యే
మనవచ్చు దైవయత్నం
బని తలఁచుచు మోహవశత నవ్యగ్రమతిన్. 495

మ. తనశిష్యు ల్వెనువెంటరా నడిచి యుద్దండస్థితిం దన్నదీ
వనమధ్యస్థలినున్న మందసము ఠేవం దెచ్చి తత్తీరమం
దునవీనద్రులతానికుంజమున మెచ్చు ల్గుల్కుచో నుంచి య
త్యనురాగంబునఁ గామినీగమనమోహానూనచేతస్కుఁడై. 496

సీ. వలుదలై మెఱయు పార్వణపుముద్దలవంటి
వలిచన్ను లెన్నఁడు వ్రచ్చికొందుఁ
బుణ్యాహపల్లవంబులఁబోలు కెమ్మోవి
గడువేడ్క నెన్నఁడు గఱచికొందుఁ
గొనలు గల్గిన దర్భకోటి నేలెడునెఱు
ల్గట్టిగా నెన్నఁడు పట్టుకొందుఁ
బంచామృతముఁ గ్రిందుపఱచు వాక్సుధ చెవు
ల్తనివంద నెన్నఁడు ద్రావికొందు
తే. ననుచు నేఁగోరికొని యుందు నట్టితలఁపు
లన్నియు ఫలించెఁగా నేఁటికని తలంప

వీని జన్మంబు కిష్కింధలోన నేమొ
కావలయునంచు శిష్యవర్గము గణింప. 497

క. వేదము చదివినఫలమున్
వాదించినఫలము సంధ్య వార్చినఫలముం
బైదలి నీకు నొసంగెదఁ
గాదనినం బ్రహహత్యఁ గట్టుదుఁ జుమ్మీ. 498

తే. అని యనన్వయరీతి నెన్నైన వదరి
పదరి యొక్కింతయును నీతి మది గణింప
కతనుఁ డనుమృత్యు వెసకొల్ప నల్లమంద
సమునఁ గల చీలలన్నియు సడలఁజేసి. 499

[9]సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసు
రాల వయ్యెదవు శీతాంశువదన
వివరింతు నొక పిన్న విన్నపం బాలింపు
మభిమతార్థంబు నీకగు మృగాక్షి
యలయింపనేటికే యకట నీశిష్యప్ర
శిష్యుండ నగునన్నుఁ జిగురుఁబోఁడి
పంచాస్త్రుఁ డిదె నేఁడు బాధించుచున్నాఁడు
బ్రదికింపవే నన్నుఁ బంకజాక్షి

తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపఱచు
టెంతయు నధర్మ మని చెంత కేగునంత
నుల్ల మగలంగ నయ్యుగ్ర భల్లుకంబు
గుటగుట యటంచు రొప్పి యక్కుటిలుఁ గదిసి. 500

క. మెడఁబట్టుకొని తనూలత
జడియం గుదియించి నేలఁ జదికిలఁబడి య
మ్మడియఁడపు డెంత పొరలిన
విడువక మృత్యువు కొనర్చె విందు లతాంగీ. 501

క. అని కీరకులశిఖామణి
యనుగాథ కృతావధాన యై విని యయ్యం
గన యిది విచిత్రతరమౌ
ననుచుం దరహసితవదనయై యుండు తఱిన్. 502

మ. ప్రకటాకాశవిభుం డహర్ప్రభుని మత్ప్రాప్తైకనక్షత్రమా
లిక నీ వేటికి దాఁచినా వనుచు హాళిం బల్కుచో నాతఁడ
త్యకలంకస్థితి నగ్నితప్తచటులం బౌలోహఖండంబు సా
త్వికరీతిన్ వెసనెత్తినట్లు రవి ఠీవిం బ్రాగ్దిశం దోఁచినన్. 503

క. అంతటఁ దననగరుకుఁ జని
కాంకాతిలకంబు ప్రొద్దుగడువమి నెంతో
చింతిలుచు నుండునెడ భా
స్వంతుఁడు పశ్చిమపయోధి వడిఁ గ్రుంకుటయున్. 504

క. కలధౌతరత్నరశనా
కలితబహుక్షుద్రఘంటికాతతి మెఱయన్
వలఱేని భద్రగజమనఁ
జెలి యా రాచిల్కచెంతఁ జేరినయంతన్. 505

చ. కనుఁగొని యోసఖీజనశిఖామణి నేఁడొక గాథఁ దెల్పెదన్
విని చను మన్యనాయకుని వేడ్క మెయి న్రమియింపఁబోవుచోఁ
బెనిమిటిఁగన్నయంత నొకబింబఫలాధర ధైర్యవర్తనం
బసువుపడంగఁ దెల్పు టరయ న్వివరింతు నటంచు నిట్లనున్. 506

అయిదవకథ

క. [10]కనువిందై యొక పురవర
మనువందున్భువి మదేభహయభటరథ రం
జనమై యఖర్వరిపుభం
జనమై పొలుపారుచు న్విశాలం బనఁగన్. 507

క. ఆనగరీవర మేలు మ
హానటనిటలస్థలీబృహద్భానుమహా
శ్రీనిర్జితసమదరిపు
క్ష్మానాథుఁడు భీమసేన జనపతి కడఁకన్.509

క. ఆ రాజు రమ్ము పొమ్మని
గారా మొనరించి మనుపఁగా మోహనుఁడ
న్పేరుగలవాఁడు తగుగుణ
వారిధియగు నొక్కబచ్చువాఁ డవ్వీటన్. 509

ఉ. మైనపుటంటు పల్వగలమచ్చులచా లొరగల్లు కట్టెలుం
దూనిక నాలుగేన్బొరలతోఁ దగువట్రములోననున్న నా
నానగరోద్భవంబులగు నాణెము లుండెడుసంచిఁ గొంచు బే
రాసకువచ్చు నన్నయధురంధరుఁ డంగడికిం గణింపఁగన్. 510

తే. [11]అతని కనుకూలవతి రూపవతియునైన
భామినీమణి దనరు సౌభాగ్యసీమ
యాత్మనాయకపాదసేవాభిరామ
నవ్యగుణవతి శుభవతీ నామ యొకతె. 511

ఉ. ఆలలితాంగి పుష్పవతియై దివసత్రయముం గ్రమించినన్
నాలవనాఁడు దాగురుజనంబులు కుంకుము సంకు పొంకముం
బోలెడు చల్వయుం బసుపుముద్దయుఁ గైకొని తోడరా మహా
కేళిరథాంగయైన నదికిం జని మజ్జనమాడి వేడుకన్. 512

ఉ. అత్త యొసంగ నొక్కకబళాన్నముఁ గైకొని వీటికారుచుల్
క్రొత్త మెఱుంగులీను రదకోరకము ల్గబళించి ఱేని ప
ల్లొత్తులు బట్టబైట నిడనోపుచు వాతెఱ నీనె గట్టఁగా
నత్తరలాక్షి చూపులు నిజాంఘ్రుల నిల్పుచు వీథి నేగఁగన్. 513

వ. ఆసమయంబున. 514

చ. చిటిలిన గంధముం దళుకుచెంపను వ్రేలురుమాలు జాఱుదు
ప్పటియును నిద్రదేఱుముఖపదము చెక్కిటికాటుమూఁపు చెం
గట నులిగొన్న జన్నిదము కన్నులకెంపు లతాంతవీటికా
పటిమ రహింపవచ్చె వరభద్రుఁడు నావిటుఁ డొక్కఁ డత్తఱిన్. 515

ఆ. వచ్చి మదికి మెచ్చువచ్చు నచ్చెలి బడా
పగలఁ జూచి వింత పదము వాడి
కేకరించి కొన్నిపోకలఁ బోయి య
చ్చేటెచూపు దన్నుఁ జేరకునికి. 516

క. నొగులుచు మరుబరిగోలలఁ
బొగులుచు నయ్యిందువదన పొందునుగూర్పం
దగువారు లేరు దీనికి
నగువారేకాక యని ఘనం బగుచింతన్. 517

సీ. తనమాట యే మెఱుంగనియంగనకు జార
మమకార మొనరించు మందు గాఁగఁ
దనప్రౌఢి సందు గానని సుందరికి గోడ
చివ్వున దాఁట నిశ్రేణి గాఁగఁ
దన నేర్పు గురుభీతతతనితంబకు సాహ
సక్రియ కభయహస్తంబుగాఁగఁ

దనబుద్ధి బొంకనేరని పంకజాక్షికి
ధవునివాకట్టు మంత్రంబుగాఁగ
తే. నమరు నవ్వీట నన్నపూర్ణాభిధాన
మదనమాయామహాస్థానమంత్రసాని
దానితో మాటలాడి చూతము విచార
మేల యని వేళగని దాని యింటికడకు. 518

చ. చని వరభద్రుఁ డల్ల గుణశాలిని జూచుటఁ దెల్పి దానిమో
హనమగు రూపమెంతకొనియాడెద నేడు దురంతకంతుకుం
తనిహతిఁజింతవంతఁబడితాంతలతాంతము చంద మొందె నా
తను విదె చూడు వేఁడుకొనెదన్ననుఁ గూర్పుము దాని నేర్పునన్. 519

క. నాకనఁగాఁ గనకము భౌ
మాకనుఁగొనఁ జిల్లపెంకు మాత్రము దానిం
జేకూర్చిన నాతనునిదె
నీకుం గైవస మొనర్తు నీతోడు సుమీ. 520

మ. [12]అని సూచించిన మంచిదంచు విని యయ్యబ్జాక్షినిం గూర్ప నా
తనికిం బాసయొసంగి వీడ్కొలిపి తత్కార్యార్థ మూహించి మో
హనుగేహంబునకుం బ్రయోజనశతవ్యాపారముల్ దెల్పికొం
చు నిరూఢంబగు రాకపోక లొనరించు న్మాయ డాయింపుచున్. 521

క. అంతట నాశుభవతి కది
యంతింతనరాని యంతరంగంబున నా
ద్యంతమధురోక్తచాతురి
సంతతము న్వింతసంతసం బెసంగించున్. 522

క. ఆలలనామణి కాగ
య్యాళి యొకానొక్కవేళ నక్కఱతో సు
వ్వాలున్శోభనములు ధవ
ళాలు న్మొదలైన పాటలం దగ నేర్పున్. 523

చ. వనజదళాయతాక్షి మగవాఁడు పరాంగనపొందుఁగోరువాఁ
డని వినవేమొ యట్టిచవు లంటినచో మఱిచౌక సేయఁడే
నిను నటుగానఁ బూని మగనిం బెఱత్రోవలఁ బోవనీకు నే
ర్పుననని బుద్ధిగాఁగఱపు ముద్దియ సందియమందకుండఁగన్. 524

క. అంతట నొకనాఁ డొక వెల
యింతియు మోహనుఁడు నప్పులిచ్చినపనికై
మంతనమాడఁగ నమ్ముది
జంతయు వెసఁబోయి వానిసతికిం జెప్పెన్. 525

తే. చూపి యిన్నాళ్ళు నిటువంటి సుద్దిగాదు
కాదటందువు గద దానికాళ్ళమీఁద
సాగఁబడి మ్రొక్కి యిల్లాలిఁ జక్కఁజూడఁ
గావుమని బాసలీయఁగాఁ గంటి నేను. 526

ఉ. బిడ్డయొ పాపయో చిదిమి పెట్టిన కైవడినున్న నిన్నుఁ దా
సడ్డయొనర్పకవ్వలఁబిశాచమువంటి గరాసుఁగూడె నీ
యెడ్డెఁడు గుట్టుతోడ నిఁకనేనియు నాపలు కాలకించు నే
నొడ్డెద దీనికిం దగినదొక్కయుపాయము తోయజాననా. 527

క. తిట్టిన మెట్టినకైవడి
సెట్టింగని పొడిచినట్లు చేకూడమఱిన్
నెట్టుకొని నేఁటినుండియు
గట్టిగ వేఱొకనిఁ గూడఁగావలె నీవున్. 528

చ. తెలియదుగాక నీకు సుదతీ రతినైపుణిఁ జూపవచ్చునో
కలకల నవ్వవచ్చునొ వికాసపుముచ్చటఁ దెల్పవచ్చునో
బలువగ పారువాపలుకు పల్కఁగవచ్చునొ కుల్కవచ్చునో
చెలువుని చెంగటం బరునిచెంగటఁ బోలెఁ గురంగలోచనా. 529

క. కొసరువగమాట లలుకలుఁ
గుసిగుంపులు తిట్లు మోరికొట్టులు జారుం
డసమసుఖంబుగఁ గైకొను
బసవెద్దగు మగఁడు మండిపడుఁ గుసుమాంగీ. 530

తే. నోరెఱుంగనియట్టి జంతువులుసైత
మంబుజానన యిచ్ఛావిహార మందు
బ్రతుక నేర్చిన తనువొక్కపతి కొసంగి
బంగరమువంటి మనసుఁ గెంటంగ నేల. 531

క. అని చెలి పుడకలు విఱిచినఁ
గనుఁగొని యది క్రొత్తగుమ్మ కావున మనసొ
గ్గిన నదియును నేనొక్కనిఁ
గొనివచ్చెద నూరిబైటి గుడికడ కనుచున్. 532

క. చింతాకు ముడుఁగుతఱిఁ ద
త్కాంతంగొని తెచ్చి మేరుకార్ముకగేహో
పాంతమున నిల్పి మఱితా
నంతన్ వరభద్రుఁ బిలువ నరిగె న్వేగన్. 533

తే. అరిగి యతఁడింట లేకున్న నాత్మఁబొగిలి
కొదవవచ్చె నటంచు నమ్ముదిపిసాలి

తిరిగి చనుదెంచుచోఁ గాంచెఁ దెరువులోన
వానిఁబోలిన నెఱనీటుకాని నొకని. 534

క. కని పొలిపోవనిమగనా
లిని గూర్చెద నీకుఁ జాలలేవడిఁ బాల్మా
లినయది యనుచుం బిలిచినఁ
జని యాతఁడు కాంచె నాబిసప్రసవాస్యన్. 535

క. కనుఁగొని తనయిల్లాలని
మనమున నతఁ డెఱిఁగె నంత మగువయు నాథుం
డని తెలిసెం దత్సమయం
బున నాశుభవతి మఱెట్లు బొంకఁగవలయున్. 536

క. తెలిసిన నేగుము తెలియని
యలవైనం బోకు కొంచెమా పరపురుషుం
గలయుటలు నిలువనాడం
గలదానికిఁ జెల్లుఁగాక కరివరగమనా. 537

ప. అని యివ్విధంబునం గీరసునాసీరుండు పలికి యూరకుండిన నవ్వ్వైశ్యాదృశ్యమధ్య యతిధ్యానాధీనయై యలక్ష్యనిక్షిప్తవీక్షణంబున నున్న మితభ్రూలతంబుగాఁ గొంతతడవు విచారించి భూతలాధిపానీతయగు రాజదూతిం గనుంగొని యిందేమైననుం దెలియునె యనియడిగి ముఖవికారంబునం దానియజ్ఞానం బెఱింగి రెండవచంద్రమండలంబునుం బోని తనముఖం బెత్తి చిగురాకుమఱుఁగునం బొడము మొగ్గయుంబోలె మధురాధరంబు చాటునఁ దలసూపుదరహాసకందళంబుతో నచ్చిలుక కిట్లనియె. 538

తే. అరయ నిక్షేప ముంచినయట్టివారె
తెలియవలెఁగాక యొకరికిఁ దెలియఁదగునె
యింత యేమిటి కిపుడు నీయిడినచిక్కు
నీవె విడిపింపు మన శుకం బిట్టులనియె. 539

ఉ. అప్పుడు తద్వధూటి చలితాధరయై వరుఁ గుప్పుతెప్పునం
జప్పుడుగా నదల్చి పరసారసగంధులఁ బొందనంచు నా
కొప్పని బాస నిచ్చితి నహోయిటు లెంతకు నెత్తుకొంటి విం
కెప్పని కైన నమ్మఁదగునే ననుఁ జంపఁగఁ జూతు వింతటన్. 540

ఉ. నీమదిఁ జూడఁగోరి తరుణీ జనధర్మము గాక యున్నచో
నేమని దీనిచేత నిటకేఁ బిలిపించిన వచ్చి తన్యభా
మామతి నిప్పుడిట్లు పరమానినియైన రమింపవచ్చి నా
తో మదిమోహమగ్నుగతిఁ దోపఁగ నుండుట కిచ్చగించితో. 541

క. చుట్టాలకుఁ దెల్పుదు మది
దొట్టినకినుకం దలార్లతోఁ జెప్పుదుఁ గూ
పెట్టుదు దొరముందఱ నను
బట్టకు మని పఱవ నతఁడు బరువగుభీతిన్. 542

తే. పాదముల వ్రాలి నే నేమిపాప మెఱుఁగ
నీమహాదేవునాన పూర్ణేందువదన
రవ్వయొనరింపవలదంచు రమణిఁ దోడు
కొనుచు గుట్టునఁ దనగృహంబునకుఁ జనియె. 543

క. అని చిలుక పలుకఁ గుతుకం
బున నౌరా యెంతబొంకు బొంకెను మృగలో
చన యని ప్రభావతీసతి
యనుపమ మతి మెచ్చుకొనియె నవనీనాథా.544

వ. అనిన నద్ధరాకాంతుండు తదనంతరగాథాప్రకారం బెవ్విధం బని యనుడు. 545

శా. విశ్వామిత్రమనఃప్రియంకరకరావిర్భూతదానక్రియా
శశ్వత్తోషితధారిణీసుర సురేశస్తుత్యశౌర్యాతిల
బ్ధైశ్వర్యోజ్జ్వలవైభవోన్నతనతాయాసాపహృధ్వీమహో
క్షాశ్వాస్త్రాసవిరామ రామబలగర్వారంభనిర్వాపణా. 546

క. ధారాధరవర్ణ సుధా
ధారాపరిపూర్ణవాక్యధారావిబుధా
ధారానిజకౌక్షేయక
ధారాదళితాహితవసుధాధరధారా. 547

మాలిని.—
జలధరనిభదేహా సజ్యకోదండబాహా
ఖలదనుజవిదారీ కంధిదర్పాపహారీ
కులగిరిసమధైర్యా కుంభినీనాథవర్యా
సలలితగుణజాలా జానకీకేళిలోలా. 548

గద్యము. ఇది శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక ఖదిరీపతినాయక ప్రణీతంబైన శుకసప్తతియను మహాప్రబంధంబునం బ్రథమాశ్వాసము.

  1. ఈ ప్రథమాశ్వాసము కృత్యాది 83 పద్యములును నిటీవల శ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. ఏ., గారిచే సంపాదింపఁబడి యాంధ్రసాహిత్యపరిషత్పత్రిక 18 సం|| సంచికలోఁ బ్రకటింపఁబడినవి.
  2. ఓవరవైశ్యవంశకలశోదధిచారుహిమాంశురేఖ — శబ్దరత్నాకరము
  3. అవనీతలేశ్వరులాహుతాశనకోఫులు—పాఠాంతరము
  4. ఈళయు నిళిందయును బం
    గాళియు
  5. విశారదుఁడగు—శబ్దరత్నాకరము
  6. జిదిమి మెచ్చికొనఁ జేసినచోన్ — శబ్దరత్నాకరము
  7. క. ఆవివర మెల్లఁ బాండ్య
    క్ష్మావల్లభుఁ డెఱిఁగి శాలికాబాలికకున్
    ఠీవి వివాహ మొనర్చుట
    కావేళ నమాత్యహితళ్ళతాలోచనుఁడై.
  8. ‘మంత్రులందఱుఁగూడి యామానవేంద్రు’ అని పాఠాంతరము.
  9. రాజాపేఁటదగ్గఱ మద్దిరాలలోఁ దెచ్చిన ప్రతిప్రకారము.
    సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసురాలవయ్యెదవు శుభ్రాంశువదన
    అవునషే నను మనోభవకేళి నేలవే సోమిదమ్మవుదువె కోమలాంగి
    అవునషే నామాటలాలింపవే పురోహితురాల వౌదువే యిగురుఁబోణి
    అవునషే ననుబొందు మనిరళశ్రాద్ధాలయామాశనము తిందు వబ్జవదన
    తే. యేల నన్నింత యేచఁ నేల వినుము
    వనిత నీధర్మసత్రపు బ్రాహ్మణఁడను
    మనల నమ్మినవాఁడు బ్రాహ్మణుఁడటంచు
    నేటి కైనను దయఁజూడు నీరజాక్షి.

    వ. అని మఱియును.

    సీ. గోదాన ఫలదాన భూదానఫలములు చేరునంతటికైనఁ జేరుఫలము
    వివరించి తెల్పెద విన్నపం బాలింపు మభిహితార్థంబు నీ కగు మృగాక్షి
    అలయింపనేఁటికే యకట నీశిష్యుండ నగు నన్నుగాఁ జూడు మిగురుఁబోఁడి
    పంచాస్త్రు డిదె నేఁడు బాధించుచున్నాఁడు బ్రతికింపవే నన్నుఁ బంకజాక్షి
    తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపఱచు
    టంతయు నధర్మమని చెంత కరుగునంత
    యుల్ల మలరంగ నయ్యుగ్రభల్లుకంబు
    గుటగుట మటంచు రొప్పి యక్కుటిలు నొరసి.
  10. కనకాంగీ కనకస్థల
    మనఁగా నొకపురము గరము నలరును హర్మ్యా
    గ్రనిహతహరిమణితిమిరో
    జ్జనితరహఃకేళిసౌధజాలం బగుచున్. అని పా.
  11. అతనికులకాంత నవమోహనాంగవిజిత
    కాంతరతికాంత రుచిరరేఖానిశాంత
    వఱలు వరపాదకమలసేవానిధాన
    నయగుణవిధేయ శుభవతీనామధేయ.
  12. అని తెల్పన్విని మంచికార్యమని పాఠాంతరము.