శివపురాణము/సృష్టి ఖండము/విష్ణుమాయ
శివుని ప్రేరణ వల్లనే విష్ణువుకు అటువంటి అభిప్రాయం కలిగిందనడం సమంజసం! శివమాయా ప్రెరితుడై శ్రీహరి, ఒక మాయా మహానగరి సృష్టించాడు. దానికొక రాజు - శీలనిధి. అతడికి అపారమైన అనుచరవర్గం... అతనికో కూతురు - పేరు శ్రీమతి. ఇలా అంతా సహజం అనిపించేటంత భ్రాంతిమయ మంత్రనగరి నారద సంచారానికి అతి చేరువలొ ఉండేలా నిర్మితమైంది.
తనకు తెలిసిన లోకాలే కాక, ఈ నగరి ఎక్కడ్నుంచొచ్చింది? అనే ఊహ అయినా చేయకుండా నారదుడా నగరిలో అడుగుపెట్టాడు. అదే మాయా విలసనం అంటే!
నారదుని రాకకు పరమానంద భరితుడైన ఆ మహా ఇంద్రజాల నగరి రాజు శీలనిధి స్వాగత సత్కార్యాలు యధావిధిగా చేసి, అంతఃపుర మందిరంలోకి ఆయనను తోడ్కుని వచ్చాడు. వేయి అప్సర స్త్రీల రూప లావణ్యాల్ని తిరస్కరించేటంత జగజ్జేగీయమాన సౌధర్యంతో రాజిల్లుతున్న తన కుమార్తె శ్రీమతిని చూపించి, ఆమె చేత మునీంద్రులకు నమస్కరింపజేశాడు. ఈమెకు త్వరలో స్వయంవరం ఏర్పాటు కానున్నది. ఉత్తముడైన భర్తను పొందే భాగ్యం కలిగించండి! దీవించండి! అన్నాడు.
సమవిభక్తాంగయై, సమ్మోహకారంగ పరిస్ఫుట సౌందర్య రాశియై, రతీమన్మథుల జంట ఏకరూపమై వెలిగినంత శృంగారోద్దీపకమై, వయ్యారాలుపోతూ తన ఎదుటనిలిచిన ఆ లీలా లలనామణిని చూసేసరికి, నారదునుకి మతి అదుపుతప్పింది. చిత్తచాంపల్యం అధికమైంది. అస్తు! అస్తు! అన్నాడే గాని , ఆమె అందాన్ని విస్తుపోయి చూస్తూ కన్నార్పకుండా కళ్లతోనే ఆ వనితారత్న సౌందర్యాన్ని గ్రోలుతున్నాడు నారదుడు.
శివ తపోభూమిలో, శివుడానవల్ల కాముణ్ణి దూరం తరిమిన నారద తపోనిష్ట, ఆ తపోభూమి వెలుపల నిష్పలమైంది. కామకేళీ మనో లగ్నత ఓడించింది. పెళ్లాడితే ఇటువంటి కన్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.
కానీ, ఎలా?!... చూడబోతే తాను జడదారి. ఆమెవంటి అపురూప సౌందర్యరాశి తనబోటి మునిమ్రుచ్చు నెట్లువరిస్తుంది? శౌర్య పరాక్రమ విలసితమై, మదన సమ్మోహరూప సముపేతమై అలరారే ఎందరెందరో క్షత్రియ, దేవ , గంధర్వ కుమారులు... ఇందరిని కాదని - ఆమె తనదాకా వచ్చేదెలా? ఈ ఆలోచన కలగగానే, తనకు ఈ విషయంలో సహాయం చేయగలవా రెవ్వరా అని క్షణం యోచించాడు.