శివపురాణము/సృష్టి ఖండము/నారద గర్వభంగం
తనను సరిగ్గా అర్థం చేసుకోగలవాడు ఆ శ్రీహరి ఒక్కడే అని స్ఫురించడంతో, వైకుంఠం దారిపట్టి - శ్రీ మహా విష్ణువుకు తన మానసాన్ని వివరించాడా బ్రహ్మపట్టి.
'అందమైన రూపంలో నీకు సాటిరాగలవా రెవ్వరూలేరు ' అని జనార్థనుని పొగిడి - 'నీ రూపాన్ని నాకు ప్రసాదించి, పెళ్ళయ్యేవరకు అనుగ్రహించు! అ తర్వాత నా పాట్లేవో నేనుపడతాను ' అని వేడుకున్నాడు. కామమహిమ అంతటిది! కేవలం బాహ్యమైన ఆకర్షణ కలిగించే రూపం కోసం ప్రాధేయపడి యాచించాల్సిన పరిస్థితిని కల్పించింది.
లోలోన గుంభనగా నవ్వుకున్న నారాయణుడు సరేనన్నాడు. ఒక్క ముఖం తప్ప, మిగతా శరీరమంతా పురుషులకే సమ్మోహం కలిగించేటంత అందంగా మార్చి ముఖం మాత్రం వానరరూపంలో కనిపించేలా ఉంచేశాడు. ఎవరి ముఖం సంగతి వారికి తెలియదు కనుక, ఆ వీలును ఇలా ఉపయోగించు కన్నాడు విష్ణువు.
శ్రీహరినే నెరనమ్మిన నారదుడు, మారుని తలపులే మదిలో సందడి చేస్తుంటే మరో ఆలోచన లేకుండా, అత్యుత్సాహంతో స్వయంవరానికి బయల్దేరాడు. నారదుడు స్వయంవర సభామంటపంలో ప్రవేశించగానే, శివమాయా ప్రేరితులై రుద్రగణాధినేత లిరువురు చెరోపక్కా ఆయన్ను అనుసరిస్తూ (బ్రాహ్మణ వేషధారులై వున్నందున) నారదునికి అనుమానం రాకుండా మెలగసాగారు. చివరికి నారదుడు కూర్చున్న చోటికే వచ్చి ఇరువైపులా ఆశీనులయ్యారు.
శ్రీమతి పుష్పమలాధారిణి అయి, స్వయంవర సభావేదికను సమీపించింది. సభలోని అందర్నీ కలయజూసింది. కోతి ముఖంతో వచ్చిన నారదుని చూసే సరికి ఆమెకు అప్రయత్నంగా నవ్వురాగా, కామతప్తుడై వున్న నారదునికి ఆమె నవ్వు సుప్రసన్నంగా - తనపట్ల పరవశంగా వునట్లు తోచింది. తన ముఖారవిందాన్ని మరింత విప్పార్చి, ఆమెనే అలా చూస్తుండిపోయాడు నారదుడు.
ఆమె దగ్గరగా వచ్చి, మరోసారి తన ముఖాన్ని చూసి నవ్వడంతో అదంతా సుముఖంగానే వునట్లు భ్రాంతి చెందిన నారదునికి ఆశాభంగం కలిగిస్తూ తనను దాటి వెళ్లిపోయింది శ్రీమతి.
ఈలోగా మాధవుడు, అపర మన్మథుడిలా అక్కడికి రావడం - శ్రీమతి వరమాల అతడి కంఠసీమ నలంకరించడం వెన్వెంటనే జరిగిపోయాయి. హతాశుడయ్యాడు నారదుడు.
బ్రాహ్మణ వేషధారులై ఉన్న రుద్రగణాధిపు లిద్దరూ నారదుని అవస్థ కనిపెట్టి, "దేనికయ్యా అంత ఆందోళన?! ఆమె ఎవరికి చెందాలో వారికే చెందిందిలే! అయినా.. అందుకోడానికి నీకేం అర్హతవుంది? అందమైన లేదుకదా! అసలు నీముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా?" అంటూ ఎద్దేవా చేశారు.
సందేహిస్తూనే, తన ప్రతిబింబాన్ని అక్కడే వున్న కాచఫలకంలో చూసుకున్నాడు. వానర ముఖాకృతి అచ్చుగుద్దినట్లు కనిపించేసరికి, గ్రద్ద వాహనారూఢుడి మోసం గమనించి నొచ్చుకున్నాడు.
తనకు ఇరువైపులా చేరి వేళాకోళం చేస్తున్న ఇద్దరిని బ్రాహ్మణులుగానే భావించుకున్న నారదుడు, "సాటి బ్రాహ్మణుని సమయా సమయాలు గానక, పరిహసిస్తున్న మీరు బ్రాహ్మణ బీజాన రాక్షసులై జన్మించెదరు గాక!" అని శపించి, క్రోధావేశం చల్లారక వైకుంఠవాసుని కొంటె చేష్టను కడిగి పారేయ్యాలని వైకుంఠం దిక్కుగా పయనమయ్యాడు.