శివపురాణము/సృష్టి ఖండము/సుమశరుని పరాజయం

వికీసోర్స్ నుండి

మన్మథుని జనక కాలమందు జరిగిన ఘటన గుర్తొచ్చినప్పుడల్లా బ్రహ్మదేవుడికి హృయమందు, శూలి గుచ్చిన మందలింపు మాటలనే శూలపుపోట్లు బాధించసాగాయి. శివుడికేం? నిత్య విరాగి! తపోనిష్ఠలో కూర్చున్నవాడికి తరుణి తపనలో వేదన ఏం తెలుస్తుంది? ఒక్కసారైనా స్త్రీ సంయోగ - వియోగ బాధ కలిగించి ' కామం ' యెక్క ప్రభావం ఎలాంటిదో చవిచూపించ దల్చుకున్నాడు చతురాననుడు. తన ఆజ్ఞగా మన్మథుని ప్రేరేపించి శివుణ్ణి ఓ ఊపు ఊపమన్నాడు. మన్మథుని మాయలకు రుద్రుడు చలించలేదు.

సుమశరునికీ పౌరుషంగానే ఉంది. తన పూలబాణాలతో, యోగి పుంగవుల్నీ భోగ విషయసూయ మానులను చేసిన ఘనుడతడు. రుద్రుని దీక్షను చిద్రం చేయడానికి తనకు ప్రత్యేకాస్త్రాలు దయచేయించమని, కమలాసనుని కోరాడు కందర్పుడు.

కేవలం పూలబాణాలతోనే హడలెత్తిస్తున్న కాముడింకా కొత్తఅస్త్రాలు పొందితే, సృష్టిలో ఇక సమస్తకార్యాలూ స్తంబించి, కామకార్య మొక్కటే విజృంభిస్తుందని దూరాలోచన చేసినవాడై - విధాత యోచించాడు.

ఒక ఆలోచన స్ఫురించి, ఆయన మదినుండి వసంతుడు ఉద్భవించాడు. పుడుతూనే తన సుగంధ శోభతో - మలయ పవనాలతో అక్కడున్న వాతావరణమంతా ఆహ్లాదకరంగా మలచాడు. మన్మథుడికి అతడిని జతచేసి శివునిపైకి ఉసిగొల్పినా ప్రయోజనం లేకపోయేసరికి - ఉస్సురని నిట్టూర్చిన బ్రహ్మ ఎదుట, అ నిట్టూర్పులో నుండే 'మారయ మారయ - భేదయ భేదయ ' అని అరుస్తూ కొన్ని గణాలు ఓ సమూహంగా ఉద్భవించాయి. వాళ్ళందరినీ' మార గణాలు ' అనే పేరిట మన్మథుని అనుచరులను చేసి, బ్రహ్మ మళ్ళీ మహా శివుని మీదకు దండయాత్ర చేయించాడు. ఫలితం శూన్యం.

"మనం త్రోవతప్పి కాముని ప్రసంగంలో పడ్డాం! మన నారద మహర్షుల వారు శివతత్త్వ జిజ్ఞాసాపరులై, ఉగ్రతప మాచరిస్తున్న వైనాన్ని అక్కడే వదిలేశాం!" అను గుర్తుచేసుకున్నారుం శౌనకాదులు.

"ఋషివరేణ్యులారా! ఇదంతా శివ సంకల్పానుసారం జరుగుతున్నదే! ఒక గాథలోంచి మరొకగాథ, అందుండి ఇంకొక ఉపకథ... ఈ పురాణ సముచ్చయమంతా ఒక గాధామాలిక! ఒక్కో అంశానికి ఎన్నో అనుబంధ గాధలతో సంబంధం ఉండి తీరుతుంది. అవన్నీ ఆమూలాగ్రం తెలుసుకోవడం కూడా పురాణ సమగ్రతకు దోహదకారి అవుతుంది!" అని వివరించి నారద తపస్సు గురించి ప్రస్తావించాడు సూతుడు మళ్ళీ.

నారదుని తపోగర్వం:

'ఆవిధంగా శివ శాసనం వల్ల, కామదహన ప్రదేశంలో ఎటువంటి మాయలుగాని, మారవికారాలు గాని ఫలించలేదు. పైగా శివమాయా ధీనులై ఉన్న వారందరికీ, ఆ శాసనం గుర్తులేకుండా పోయి నందున -అదంతా నారద మునీంద్రుల ఉగ్రతపః ప్రభావమేనని భావించారు. మన్మథుని పరాజితుని చేయడంలో, నారదునిదే పైచేయి కావడంతో - శివుడంతటి వాడితో ఆ మునీంద్రుని పోల్చి కొనియాడసాగారు.

కొంతకాలానికి తత్త్వదర్శనం చేసుకున్నాక నారదముని కన్నులు తెరిచి తపస్సు చాలించాడు. ఆ నోటా - ఈ నోటా తాను కాముని జయించినట్లు ప్రచారంలో ఉన్నసంగతి తెలుసుకుని, అదంతా తన ప్రతిభే అని విర్రవీగసాగాడు నారదుడు.

హరి బ్రహ్మాదులకే శక్యం కాని శివమాయా తరణం, నారదుని వశమా? తత్త్వ దర్శనం జరిగిందనుకున్నాడే గానీ, నిజంగా శివతత్త్వం బోధపడి ఉంటే - అహంకరించేవాడే కాదుకదా!

అందరూ - మదనునిపై విజయమే మాయపై విజయంగా అభివర్ణించేసరికి 'అవునుకాబోలు ' అనుకున్న నారదుని గర్వానికి అంతు లేకుండా పోయింది. ఆ గర్వాంధత ఎట్టిదంటే-

సాక్షాత్తు శివుడి ఎదుటికే వెళ్లి, ఆ మహాదేవుడినే తూలనాడేటంత స్థాయిలో ఉంది. కైలాసవాసుడి కడకేగి, తన కందర్ప విజయం ప్రగల్భాలమయం కాగా పరమాత్ముడిని తానేనని ప్రకటించుకునేటంతవరకూ వెళ్లింది - నారదుని స్థితి.

మహాదేవుడు శాంతచిత్తుడై, నారదుడిపై జాలికొద్దీ - ఆసాంతం విని నవ్వుకున్నాడు.

"బాగానే వుంది గానీ మహర్షీ! ఇలాంటి మార్మిక విషయాలు అందరితోనూ చెప్పరాదు. ఏదో నేను భోళాశంకరుణ్ణి కనుక - నేనెవ్వరితోనూ అనను కనుక, నాదగ్గర అంటే అన్నావు కాని ఇంకెక్కడా చెప్పకు! మరీ మరీ దాచవలసిన ఇలాంటి అంశం, ముఖ్యంగా ఆ శ్రీహరి సన్నిధిన మాత్రం అస్సలు చెప్పకు!" అని నారదుడిలోని ఇంకా అంతర్భూతమై ఉన్న కొంటె తనాన్ని రెచ్చగొట్టి మరీ వదిలాడు శివుడు.

అసలే జడధారి. ఆపైన పెడదారి పట్టిన బుద్ది. శివుడు చెప్తున్నంత సేపూ విన్నట్టే విన్నప్పటికీ, కైలాసం సరిహద్దులు దాటేసరికి అవన్నీ గాలి కొదిలేశాడు. బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రితో తన గొప్పలు చెప్పుకున్నాడు. 'ఆత్మస్తుతి దూష్యంరా తండ్రీ! అలా ఎవర్నీ వారే పొగుడుకోరాదు ' అని బ్రహ్మ కూడా మందలించాడు.

తన కళ్ళముందే తన కొడుకు తనను మించి ఎదిగిపోవడాన్ని, ఆ వృద్ధ పితృదేవుడు భరించలేక ఇలా అంటున్నాడనిపించింది నారదుడికి. శివుడికీ ఇదే బుద్ధి! ఇక తనను సరిగ్గా అర్థంచేసుకునేది ఆ శ్రీమన్నారాయణు డొక్కడే. ఈ నారదుని ప్రతిభ ముల్లోకాలకే కాదు... ఏడేడు పధ్నాలుగు లోకాలకూ వెల్లడి చేయగల మహావిష్ణువు సర్వవ్యాపి! ఆయన తల్చుకోవాలే గాని, "పరమాత్ముడు నారదుడే" అని ప్రచారం కూడా చేసిపెట్టగలడు. బహుళా తనకంత పేరు ప్రఖ్యాతలు రావడం ఇష్టం లేకనే, శివుడు అలా అడ్డుపుల్ల వేసి వుంటాడు... అనుకున్నాడు నారదుడు.

పాలకడలిపై పవళిస్తూ, లోకపాలనలో వింతలన్నీ అవలోకిస్తూన్న విష్ణుదేవుడి దృష్టికి నారద ప్రగల్భాలేవీ దాటిపోలేదు. ఆయనా నవ్వుకున్నాడు. తీరా ఆ 'నారదపరమాత్మ' తన వద్దకే వచ్చేసరికి తత్తరపడి, స్వాగత సత్కారాలు స్వయంగా చేశాడు హరి. విష్ణుదేవుడంతటి వాడు తన కెదురేగి సత్కరించడంతో - తాను వెంట్రుకవాసి తేడాలో మహావిరాట్ పురుషుడే అని నమ్మకం కలిగిపోయింది నారదుడికి. ఈ ప్రళయం, సృష్టీ, అనంతకాల కల్పాలూ, మన్వంతరాలూ, యుగాలూ, ఈ త్రిమూర్తులూ, వారి అనుచరగణాలూ, చరాచర జగత్ సృష్టీ అంతా తన మహాత్యమే అని తారాస్థాయిలో చెప్పుకుంటున్న నారదుడి ధోరణి విని 'ఆహా!' అన్నాడు శ్రీహరి. అని ఊరుకున్నాడా? "తమంత వారికలేరు. తమంతవారు ఇక తమరే!" అని రెట్టించాడు.

అందులో నర్మగర్భితంతా వున్న వేళాకోళాన్ని గ్రహించే స్థితిలో లేడు నారదుడు.

శివమాయలో చిక్కుకుని, అహంకరిస్తూ తన స్వస్వరూప జ్ఞానాన్ని క్రమంగా కోల్పోతూన్న నారదునికి మళ్లీ వివేచన కలిగించగల మహాను భావుడు మరి ఇక ఎవరు? ఆపనీ ఆ పరమాత్ముడే చేయాలి.

'విష్ణువు తన మాటలు వినడమేకాదు! అంగీకరించాడు కూడా!' అనుకుని పొంగిపోతూ ఇతరలోకాల్లో తనప్రజ్ఞ తానే స్వయంగా చూటుకోవడానికి బయల్దేరాడు నారదుడు.

నారదుడలా వెళ్లగానే, శ్రీ హరి నారదునికి గట్టిగా బుద్ధి చెప్పదల్చుకున్నాడు.