శివపురాణము/సతీ ఖండము/వీరభద్రుడి విజృంభణం
'హర హర మహాదేవ శంభో' అంటూ కదిలిన రుద్రగణాలు వీరభద్రుని ఆధ్వర్యంలో అచిరకాలంలోనే యాగ వాటికను చేరుకో సాగాయి.
తామర తంపరగా వచ్చి చేరుతున్న ఆ రౌద్రాకృతులను చూస్తూనే, చాలామందికి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. అంతవరకూ బింకంగా నిలిచిన దక్షుడు సైతం విష్ణుచరణ కమలాలపై వ్రాలి శరణువేడాడు.
"దక్షా! ఇప్పుడు వగచి ప్రయోజనం లేదు. పూజనీయుల్ని పుజింపకుండుట - అపాత్రుల్ని అదరించుట ఎక్కడ జరిగితే, దారిద్ర్యం - మరణం - భయం మూడూ కలిసినట్లుగా వచ్చి బాధిస్తాయట!
"ఇప్పుడిక్కడికి వేంచేస్తున్న గణాచారులు కోటానుకోట్ల రుద్రశక్తులై, సాక్షాత్తు రుద్రలవలె భాసిస్తున్నారు. వెంటనే శరణువేడుకో! నిన్ను సమర్ధించినందుకు, విపత్తు కొనితెచ్చుకున్న మనమందరం కాస్త తెప్పరిల్లవచ్చు! ఏదో యజ్ఞధర్మాల్నీ యాజ్ఞికుల్నీ కనిపెట్టి ఉంటానన్న నామాట ఇంతవరకూ నీపట్ల కూడా చెల్లించాను. దధీచి మహాముని నిన్ను తూలనాడి వెళ్లిపోయినపుడే నేనూ వెళ్లిపోవలసింది.." అలా విష్ణువు అనేసరికి, దక్షుడికి కాళ్లూ చేతులూ ఆడడం మానేశాయి. తాను ఎంతో నమ్ముకున్న ఈ వెన్నుడు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయాడు గదా! అని కూడా భయపడసాగాడు దక్షుడు.
అది కనిపెట్టినవాడిలా విష్ణుమూర్తి దక్షుడికి అభయం ఇస్తూ ఇంత జరిగినా నీ పంతం నీదే అంటావు తప్ప, శివుని శరణు కోరడానికి ఒప్పనంటావు! నిజమేలే! వైరికి వెన్ను ఇచ్చి వెనుదిరిగిపోవుట భీరువుల లక్షణం! జరిగేది జరగక మానదు. ఏం జరిగినా, అదంతా పరమేశ్వర కృత్యం అని సమాధానపడు! అంతకంటే ఇపుడు చెయ్య గలిగిందేమీలేదు. అదుగో! వీర విజృంభకుడై వీరభద్రుడూ, మరో వైపునుంచి మహాకాళీ గణవాహనీ మీదపడుతున్నారు" అని విష్ణువు అంటూ ఉండగానే ధూళి ఎగసి కారుమేఘాల్ని తలపించేరీతిలో ముప్పేట ముట్ట్డిడి కొనసాగించాయి రుద్రగణాలు.
మళ్ళీ దక్షుడు దీనంగా దేవతలందరినీ పేరు పేరునా ప్రార్థించాడు. "మీ మీ భుజబల, శౌర్య, ధైర్యాదుల అండ చూసుకొనే నేనీ యాగం ప్రారంభించాను. ఓ దేవరాజా! ఉపేంద్రుడు అలా ఉపేక్ష వహించాడు. ఇక నీవే నన్ను కపాడగల సమర్థుడవు" అంటూ ఇంద్రుని వేడుకున్నాడు.
మూడుకోట్ల దేవతలూ తన ఆధీన వర్తునులై చరించేటంత బలం తనకూ ఉండగా, రుద్రకోటి సైన్యాన్ని తరిమి కొట్టలేమా? అనే ధీమాతో సమరశంఖం పూరించాడు ఇంద్రుడు. తాను ఐరావతాన్ని అధిరోహించాడు. తమ సైన్యాన్ని మొత్తం సమరానికి సమాయత్తం చేశాడు. సురపతి చెలరేగడం చూశాక, దేవతలందరూ కదనానికి సంసిద్ధులు కాక తప్పదని భావించారు. వరుణుడు మొదలైన దిక్పాలకులు తమతమ వాహనాలపై అధిరోహించారు. కుబేరుడు తన పుష్పకం ఎక్కి, యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులను ఉత్సాహపరిచాడు. దిక్పాలురలో కుబేరునికి ప్రత్యేక గౌరవం ఉన్నది. ఆయన ధనాధిపతి కూడా! పైగా.. ఈశ్వరునికి అత్యంత సన్నిహితుదు. అటువంటి వాడే యుద్ధానికి తలపడినపుడు, తాము నిమ్మళంగా ఉండడం నమ్మక ద్రోహమేనని భావించారు దేవతలు. వారు కూడా తమ తమ వాహనాలను అధిరోహించారు.
సమర సన్నాహంలో అమరులు
వాళ్లంతా అలా వాహనాలు ఎక్కడం చూశాక, వారు గృహోన్ముఖులై వెళ్లిపోతారేమోనని భయం కల్గింది దక్షుడికి. దగ్గరగా ఉన్న ఓ దిక్పాలకుని రెండు చేతులనూ దీనంగా పట్టుకొని, "మీరే నాకు దిక్కు" అన్నాడు దక్షుడు.
అతడు వరుణుడు. మొసలిపై అధిరోహించాడు. దక్షుడికి అభయం ఇస్తూ "దక్షప్రజాపతీ! దిగులు చెందవలదు! కేవలం ఒక్క దిక్పాలకునిగా కాదు! మా సప్తదిక్పాలకుల తరుపున నీకు అభయం ఇస్తున్నాను.." అని మిగిలిన దిక్పాలురతో కలిసి తలొక దిక్కునూ రక్షించడానికి సమాయత్తమయ్యాడు.
ఈశానుడైన పరమశివుని దిక్కు వైపునుండి వీరభద్రుడు, భీకరోత్సాహియై రూక్ష వీక్షణనేత్రాలు విస్ఫుల్లింగాలు చెలరేగుతుండగా దక్షవాటికలోకి ప్రవేశించాడు. వస్తూనే అతడి వెంటున్న రుద్రగణాలు ఎడాపెడా దేవతల మీద విరుచుకుపడ్డాయి. ఋత్విక్కులూ - ఋషులూ కకావికలై చెదిరిపోయారు.
మామూలు దేవతలు రుద్రగణాల వీరావేశానికి చెల్లచెదురై, అమరపురికి పారిపోగా దిక్పాలకులు మాత్రం తమ అస్త్ర శస్త్ర నైపుణ్యం ప్రదర్శించసాగారు. వాయువు తన వాహనమైన లేడి (మృగం)ని వదిలేసి, తానొక మహా ఝంఝామారుతమై కొందరు రుద్రగణాల్ని సప్తసముద్రాల అవతలకు ఎగరగొట్టాడు. అగ్ని అన్నివైపుల నుంచి కమ్ముతూ కొందర్ని నిర్దాక్షిణ్యంగా దహించేశాడు. వరుణుడు మహ జలధారలతో, కొందరు గణాచారులను వరదల్లో కొట్టుకుపోయేలా చేశాడు.
ఇక ఇంద్రుడు వజ్రాయుధంతో ఎందర్ని ఏకధాటిన నరికినదీ లెక్కేలేదు. అయినప్పటికీ - విజయం మాత్రం దేవతల పక్షాన కనుచూపు మేరలో లేదు. దానిక్కారణం.. అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్న రుద్రగణాలే! ఋషులంతా సమావేశమై తీవ్రాలోచన చేశారు. శాంతి కాముకులైన బ్రాహ్మణశ్రేష్ఠులను, యజ్ఞకర్తలను, మహారుషులను ఏమీ అనరాదన్న శివాజ్ఞవల్ల వారు ఇంకా అక్కడ ఉండగలిగారే తప్ప, లేకుంటే... వీరభద్రుడి వీరవిహారానికి దేవతలతో పాటు, దొరికినచోటుకి పారిపోయేవారే!
మునులందరి తరుపునా, ముముక్షు మునివరేణ్యుడు ముకుందుని ముందు మోకరిల్లి మరీ ప్రార్ధించాడు. "వైకుంఠవాసా! నీవు ఇప్పటికైనా కలుగజేసుకోని పక్షంలో - ఇంకా ఘోరాలు జరిగిపోయేల వున్నాయి. దిక్పాలకులు సైతం దిగంతాలు పట్టేసేలావున్నారు" అంటూ మొరపెట్టాడు.
దక్షుని ఏదోలా మందలించి మభ్యపెట్టి, ఈ క్షణం వరకూ నెట్టుకొచ్చినా, ఆ పుండరీకాక్షునికి.. మహర్షుల మ్లాన వదనాలు చూశాక మరి ఆగాలనిపించలేదు.
శివుని అనుచరులు కూడా, అపరశివులవలె కనిపించసాగారు. ఒక్కొక్కరూ పంచముఖాలతో, దశబాహువులతో, జటాజూటాలతో, రుద్రాక్ష మాలలు - విభూతి పూతలతో, శూల - పాశాది ఆయుధాలతో భయంకర రూపాలు కలిగి చెలరేగుతూన్న శివగణాలను - భృగుమహర్షి మంత్రబలం వల్ల మట్టుబెడతూ, అంతవరకూ ఏదోలా యుద్ధాన్ని నెట్టుకొచ్చిన నైరృతి (ఇతడు రాక్షసాంశయందు జనించియు, తన విశేష పరక్రమముచేత ఇతర దిక్పాలకులవలె దేవతల పక్షం అలవం బించిన వాడు) సైతం నారాయణుడినే శరణువేడాడు.
దేవతల గురువైన బృహస్పతి, మరొకవైపు రుద్రగణాలతో పోరుతున్న ఇంద్రుని వారించి "అకారణమైన కక్షపూనావు. దేవతలందరికీ చేటు తెస్తున్నావు. సమస్తకర్మల ఫలితాన్ని ఇచ్చే ఈశ్వరునితో వైరమా? ఈ గణాచారుల ముందు మనం నిలవగలమా? కాస్త సంయమనం పాటించాలి!" అంటూ బుద్ధులు బోధించసాగాడు.
యజ్ఞమూర్తి శ్రీ మన్నారాయణుడు దేవతల; దిక్పాలకుల; ఋషుల అవస్థలను ప్రత్యక్షంగా చూస్తూ ఉండికూడా, ఇక కల్పించు కోకపోతే వారు బాధపడతారని భావించి పాంచజన్యం పూరించాడు.