శివపురాణము/సతీ ఖండము/విష్ణు - వీరభద్రుల సంవాదం

వికీసోర్స్ నుండి

ఆ శంఖనినాదం భీషణప్రదమై, వీరభద్రుని సైతం కలవర పరిచింది. అదిరిపడ్డాడు ముఖ్యాధ్యక్షుడు. దిక్కులు పిక్కటిల్లేలా, మోగిన శంఖారావానికే ఎక్కడి గణాలు అక్కడ చేష్టలుదక్కి ఒక్కక్షణం అలా నిలిచిపోయాయి. తమ గణాధ్యక్షుడు వీరభద్రుడే నిలబడడంతో, తామూ తగ్గడం భావ్యమని కాళీ, మహాకాళీ, కాత్యాయిన్యాది నవదుర్గలూ నిలబడిపోయాయి.

వీరభద్రుడు చేతులు జోడించి "మహానుభావా! మహా పురుషోత్తమా! మాధవదేవా! మీకిదే నా అంజలి! నాకు పరమశివుడు వేరు, తాము వేరు కాదు! నాకు ఇద్దరిపైనా ఒకే దృష్తి! మీరిరువురిపైన సమభావమే! రుద్రుడెట్లు నాకు పూజ్యులో, తామూ అట్లే పితృతుల్యులు. మరణాంతాన మా దాక్షాయణి పల్కిన మహావేదనా భరితమైన పలుకులు మీరు విననివికావు! అమ్మానిని ఆర్తనాదాలింకా ఈ వాటికలో ప్రతిధ్వని స్తూన్నట్లే తోస్తున్నాయి మాకు. అవే మా వీరావేశాన్ని ప్రోత్సాహిస్తున్న రీతిలో ఉన్నాయి. దక్షుని పక్షాన - మీ ఈ పుత్రసమానునిపై యుద్ధమే ప్రకటిస్తారో - అడ్డు తప్పుకుంటారో త్వరగా తేల్చి చెప్పవలసిందిగా నా విన్నపం!" అంత ఆవేశంలోనూ, యుక్తాయుక్త విచక్షణ చేసిన విరభద్రుని అభినందించకుండా ఉండలేకపోయాడు విష్ణువు.

"నాయనా! వీరభద్రా! నీ వివేచన జ్ఞానం నాకు ఎంతో ముచ్చట గొల్పుతున్నదయ్యా! శివునివలె నేను కూడా భక్తపరాధీనుడనే అని నీ వెరుగనిది కాదు! ఎవరి పక్షం వహిస్తున్నాననేది కాదయ్యా ఇక్కడ ముఖ్యమైనది!".. ఇంకా మురారి మాటలు పూర్తికాకుండానే అందుకున్నాడు వీరభద్రుడు.

"తమ మాయల సంగతులు మాకు తెలీనివికావు మాధవయ్యా! మసిపూసి మారేడుకాయ చెయ్యడంకాదు! అలాచేస్తే శివద్రోహమే!" అంటూ ఒట్టుపెట్టాడు.

"శివుడాన.. నేను శివద్రోహినా? నిజానికి నేనే అందరికన్నా శివభక్తాగ్రగణ్యుడిని!".

"తెలుస్తూనే ఉంది తమ భక్తి తత్పరత".

"తప్పుగా అర్ధం చేసుకోకు! యజ్ఞ రక్షణా ప్రతిజ్ఞ పాలనలో ఇదొక భాగం! ప్రతిజ్ఞా భంగం అ పరమశివునికీ ప్రీతికరం కాదు! నేను నిమిత్తమాత్రుడిని"

"మాటలుమాని, మన కర్తవ్యం సంగతి తేల్చుట మహితాత్ముల లక్షణం.!"

"నిజమే! నువ్వన్నట్లే కానిద్దాం! యుద్ధమే శివసంకల్పమేమో!... అదీ చూద్దాం!"

"చెప్పకనే చెప్పావా చక్రధారీ! కదనమే కడకు కర్తవ్యమని తేల్చావు! సంతోషం! కాని... ఇద్దరం శివవశంకరులమే! ఏదీ దారి?"

"చింతించకు! కానున్నది కాకపోదు! ఇంత జరిగాక నేను యుద్ధంలో లేకపోవడం నీతి అనిపించుకోదు. నువ్వు నాపై శరపరం పరలు కురిపించు! నేను పోరినంతసేపు పోరి, నా శక్యం కాకుంటే వైకుంఠం దారిపడతాను!"

విష్ణు వీరభద్రుల సంవాదం వింటున్న దేవతలతో పాటు, దక్షుడికీ పోయాయనుకున్న ప్రాణాలు లేచొచ్చినట్లయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో దేవతలు మళ్లీ కదనసీమలో కాలుమోపారు.

ఇంద్రుడు నందీశ్వరునితో; కాలుడు యమునితో; మహాబలుడు వరుణిడితో; అశ్ముడు అగ్నితో; కుబేరుడు కూష్మాండ పతితో; చండుడు నిరృతితో; భృంగి వాయువుతో పోరులో ఉన్నారు. అంతకంతకూ అది భీకరం కాసాగింది.

అద్భుత యుద్ధ ఘట్టం:

ఇరుపక్షాలా శంఖనాదం మిన్ను ముట్టింది. పాంచజన్య శంఖారావం వినేసరికి దేవతలకు చెవులలో అమృతం పోసినట్లయింది. వెను దిరగనున్న దేవతల్లో కొందరు మళ్లీ యుధ్ధానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ విష్ణుమూర్తికి బాసటగా నిలిచారు.

ఒక క్షేత్రపాలకుడి మీదకి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు ఈ చక్రాన్ని అమాంతం మింగేశాడు. అసలే వీరభద్రుడు ఉగ్రుడై నందున, ఆ వేడికి చక్రమే నామ రూపాల్లేకపోయే ప్రమాదం ఉందని గ్రహించిన విష్ణువు నేర్పుగా వీరభద్రుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడి, దాన్ని అతడిచేతనే బైటికి రప్పించాడు. ఈలోగానే, తనచేత నున్న త్రిశూలంతో - విష్ణువు మీదకు లంఘించిన వీరభద్రుని శూలపు ధాటికి విష్ణువుకు మూర్చవచ్చినంత పనయ్యింది. మరొసారి చక్ర ప్రయోగం చేశాడు. ఈసారి చక్రమూ - అది ప్రయోగించిన హస్తమూ కూడా స్తంభించిపోయాయి. వైదిక మంత్ర ప్రభావంతో మునీశ్వరులు చేతిని కదిల్చేలా చేసినప్పటికీ, క్షణక్షణం భీకరమవుతున్న యుద్ధంలో అలోచనకుగాని; కించిత్ ఆలస్యమునకు గాని చోటులేనందున వెంటనే శార్జం అనే తన ధనుస్సునందుకున్నాడు విష్ణువు. ఏం లాభం? అదీ నిరర్ధకమైంది. దీనితో విష్ణువుకు అంతర్వాణి బోధచేసిన ప్రకారం వైకుంఠం దారి పట్టాడు.

వెన్నుడే వెన్నిచ్చి పారిపోతూండడంతో యజ్ఞధిదేవతల ప్రతి రూపం గనుక యజ్ఞమే ఒక మృగ రూపంలో ఆకాశాన పరుగుపెట్ట సాగింది. యజ్ఞన్ని వదలలేని ముఖ్యులలో కశ్యప ప్రజాపతి, ధర్మదేవత, అరిష్టనేమి, అంగీరసుడు, దత్తర్షి, కృశాశ్వుడు మొ|| వారిని ఈడ్చితన్నాడు వీరభద్రుడు. భృగుమహర్షికి కనుబొమలు పెరికేశాడు. చంద్ర, సూర్యుల పళ్ళు రాలగొట్టాడు.

ఇంతలో రుద్రగణాలు యజ్ఞాగ్నులనార్పేశాయి. యజ్ఞకర్త అయిన దక్షుడిని వెతికి పట్టుకున్న వీరభద్రుడు, కేవలం తన కొనగోట అతడి తలను మీటి యజ్ఞగుండంలో పడేలా విసిరేశాడు. దాంతో సమరం ముగిసింది. విజయహాసంతో తన చెంత నిలిచిన వీరభద్రునికి వీర గణాధ్యక్ష పదవితో సత్కరించాడు శంభుడు.