శివపురాణము/సతీ ఖండము/ఉగ్రుడు శాంత మగ్నుడైన వేళ
దక్షయజ్ఞ విధ్వంసం ముగిసి, వీరభద్రుడు వెడలిపోయిన తర్వాత యజ్ఞవాటిక బీభత్సమయంగా తయారైన ఆ ప్రాంతంలో హతులయిన వారిని వెతుక్కుంటూ వారి - వారి బంధుగణాలు అంతులేని ఆక్రోశంతో అక్కడకు చేరుకున్నాయి. ఒకర్నొకరు ఓదార్చుకున్నారు.
అందరూ కూడ బలుక్కొని, ప్రాణాలు దక్కించుకున్నవా రందరూ ఏకమై బ్రహ్మ చెంతచేరి తమకేదో దారి చూపించమన్నారు. ప్రజాపతి మార్గదర్శిగా వైకుంఠవాసి చెంతకు చేరారు అందరూ.
బాగా యోచించిన మీదట, వైకుంఠడు చెప్పిన ఉపాయం మేరకు.... అందరూ తిరిగి మహాశ్మశాన వాటిని తలపింపచేసే యజ్ఞ వాటిక చెంతచేరి, అక్కడనుండే పరమశివుని ప్రార్థించసాగారు. భక్తజన సులభుడైనవాడూ; ఆర్తజన వశంకరుడైనవాడు కనుక - వెంటనే శంకరు డక్కడ నిలిచాడు.
శివానుగ్రహం వెల్లివిరిసిన వేళ:
నిత్యశ్మశాన వాసికదా! అందులోను సతీదేవి మరణం వల్ల కలిగిన విచారంతో ఉన్నవాడాయె! వైరాగ్యం ఆవరించిన మహాదేవుడి కంట నీరు తెప్పించేలా వున్నాయి అక్కడి హృదయవిదారక దృశ్యాలు...
యజ్ఞవాటిక బీభత్సాన్ని కళ్లారా చూశాక, తన ఆవేశం తెచ్చిన అనర్థమే ఇదంతా అని గ్రహించిన పరమశివుడు, మరింత కరుణాంత రంగుడయ్యాడు.
వీరభద్రుడు వినయంగా వెంట నిలుచుని ఉండడాన్ని గమనించిన శూలి, "యాగం కొనసాగకుండా నాశనమయ్యేలా చేయడమంటే, ఇంతమంది వినాశనానికి కారకుడయ్యావు కదయ్యా వీరభద్రా!" అని, అక్కడ మృతులై పడివున్నవా రందరిపైనా తన అమృతదృష్టి ప్రసరించాడు. క్షతగాత్రులు తాము కోల్పోయిన అవయవాలను తిరిగి పొందినప్పటికీ, ఒకరి అవయవా లొకరికి అతికించడం వల్ల అంగవైకల్యం ప్రాప్తించకుండా మిగిలారు.
హస్తాలను కోల్పోయిన అశ్వని దేవతలకు - పూషుడు చేయూత నిచ్చాడు. కనుబొమలను కోల్పోయిన భృగువుకు మేక వెంట్రుకలతో తిరిగి కనుబొమలు అద్దడం జరిగింది.
ఇది చూశాక బ్రహ్మకు కూడా చిరు ఆశ చిగిరించింది. సమస్త విశ్వ సృష్టినీ చేయగలిగినప్పటికీ - దేవతల్ని తన సృజనశక్తితో బతికించగల నేర్పు ఎటూ తనకు లేనందున - తన కుమారుడైన దక్షప్రజాపతిని సైతం, ఆ పపమేశ్వరుడే పునర్జీవితుడ్ని చేయగలడని ఆశించాడు బ్రహ్మ. మహేశ్వరుడిని స్తుతించసాగాడు.
"ఓ సర్వేశ్వరుడా! సర్వవ్యాపీ! విశ్వరూపా! విశ్వాత్మా! ఆపద్బాంధవా! జగద్రక్షకా! ప్రపంచంలోని సమస్త ప్రాణుల్నీ సృష్టించడానికీ, పోషించడానికీ లయింప చేయడానికీ కర్తవైన నీకు అనంతకోటి ప్రణామాలు! పుత్రశోక పీడితుడినైన నన్ను కరుణించి, నాకు శరణము ప్రసాదించు మహేశ్వరా!" అని సాష్టాంగపడ్డాడు.
దయాళువైన ఆ బోళాశంకరుడు "సురజ్యేష్ఠా! దక్షుని మరణానికి ఎవరూ కర్తలు కారయ్యా! అతడి అహంకారమనే కర్మమే, అతడిని మట్టుపెట్టినది. తన ఆధిపత్యమును చాట జూచువాడు ఇతరుల అధిపత్యం ఔన్నత్యం గుర్తెరిగి ప్రవర్తించాలి! అది కనీస విచక్షణ. అట్టిదేమీ లేకనే విర్రవీగిన నీ పుత్రునికి హానికలిగినది. సరే! అయిందేదో అయింది.." అని వీరభద్రుని వైపు తిరిగి "వీరభద్రా! దక్షుని కశే బరంలో మొండెంనుంచి పాదాలవరకూ ఇక్కడ పడివుంది. తల మాత్రం కనిపించడం లేదు. కాస్త వెతికి తీసుకురావయ్యా!" అని ఆజ్ఞ ఇచ్చాడు.