శివపురాణము/సతీ ఖండము/అగ్నిదగ్ధయైన సతి వార్త నారదుని ద్వారా చేరుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దేవ ఋషియైన నారద మునీంద్రు లీఘోరాలు చూసి తట్టుకోలేక, తక్షణం గగన మార్గాన పయనమై అగ్నిదగ్దమైన సతీదేవి సమాచారాన్ని మహా శివదేవునికి అందజేశాడు.

నారదుని ద్వారా సతి ఆత్మాహుతి వార్త విన్న తక్షణం, ఆ త్రిలోచనుడి ముడునేత్రాలూ వీక్షణ రూక్షణాలయ్యాయి.

పట పట పండ్లుకొరికిన కపర్ది, తన జటాజూటాన్ని పెరికాడు. ఒక జడపాయతీసి పిడుగుపాటు తలపించేలా బండపై కొట్టాడు. అది రెండు చీలికలై అందునుండి గణేశ్వరుడు - కాళీశక్తీ ఉద్భవించారు. దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచాడు. అందునుండి 13రకాల సన్నిపాత జ్వరాలు, నూరురకాల జ్వరభూతాలు, కోటానుకోట్ల భూతగణాలూ పుట్టాయి. మొదట పుట్టిన గణేశ్వరుడు మహాకాయుడు, సహస్రబాహుడు, ప్రళయాగ్ని సమప్రకాశుడు, జన భీకరుడూ కావడంతో శివుడాతనికి వీరభద్రుడని పేరిడినాడు. వీరభద్రుడు శివునికి ప్రదక్షిణ నమస్కారా లాచరించి "దేవరా! ఏమి సెలవు? అనతీయవే!" అని కోరగా " నీవు వెంటనే ఈ పరివారాన్ని అంతట్నీ వెంటబెట్టుకువెళ్ళి, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి వచ్చి, ఆ వైనం నాకు వివరించు!" అని ఆజ్ఞ ఇచ్చాడు.

ఆశరీర వాణి హెచ్చరిక:

అక్కడ - దేవ, ఋషి, బ్రహ్మాదులు విష్ణువుతో మొరపెట్టుకుంటూ ఉండగా ఆకాశవాణి అక్కడున్నవా రందరినీ హెచ్చరించింది. "దక్షా! ఈ యజ్ఞవాటిక అతిస్వల్ప సమయంలోనే మహా దహనవేదీక కనున్నది. విష్ణూ! నీవు వెన్వెంటనే ఈ యాగశాల వీడి వెళ్లగలవు! లేకుంటే నీకు కీడు మూడగలదు" అని వినిపించిన అశరీరవాణి పలుకులకు మరోసారి అదిరిపడ్డారు అందరూ.