శివతాండవము/శివతాండవము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Page 12 Image 1 Shiva Tandavam.png
శివతాండవము

ఏమానందము
భూమీతలమున!
శివతాండవమట[1] !
శివలాస్యంబట[2] !

అలలై; బంగరు
కలలై, పగడపుఁ
బులుఁగులవలె మ
బ్బులు విరిసినయవి
శివతాండవమట!
శివలాస్యంబట!

వచ్చిరొయేమొ! వి
యచ్చర కాంతలు
జలదాంగనలై
విలోకించుటకు
శివలాస్యంబట!

యేమానందము
భూమీతలమున!
పలికెడునవె ప
క్షులు ప్రాఁబలుకులొ!
కల[3] హైమవతీ[4]
విలసన్నూపుర
నినాదములకు
న్ననుకరణంబులొ!

కొమ్మల కానం
దోత్సాహమ్ములు
ముమ్మురముగ మన
ములఁగదలించెనొ!
తలనూచుచు గు
త్తులుగుత్తులుగా
నిలరాల్చును బూ
వులనికరమ్ములు.

రాలెడు బ్రతి సుమ
మేలా నవ్వును!
హైమవతీ కుసు
మాలంకారము
లందునఁ దానొక
టౌదు నటంచునొ!

లలితా మృదు మం
జులమగు కాయము
పూవుల తాకుల
తో వసివాడదొ!
భారతియట పా
ర్వతికి నలంకా
రముఁ దీర్చెడునది!
రమణీయస్మిత
ములఁ గావించునొ
యలరులు మృదువులు!
చతురాననుఁడే
నవదరించునట
శర్వునకు త్తమ
సర్పవిభూషలు!
వీచె విశబ్దిత
కీచకములు మృదు
వీచులుగాఁ ద
ర్పితలోకమ్ములు
మారుతములు గో
టీరి తాబ్జుఁడగు
శివునకు సేవలు
జెల్లించుటకై

తకఝం తకఝం
తకదిరికిట నా
దమ్ములతో లో
కమ్ముల వేలుపు
నెమ్మిగ నిలఁబడి
నృత్యమాడునెడ
లయానుగతిఁ గ
మ్రముగా శ్రుతిఁ బ
ట్టుటకో! గొంతులు
సవదరించు ను
త్కటభృంగమ్ములు.

ఈ సెలకన్నెల
కెవ్వరుజెప్పిరొ!
యా సర్వేశ్వరు
నభినయమహమును
కుచ్చెళులెల్లెడ
విచ్చలవిడిగా
దుసికిళ్ళాడఁగ
నసమునఁ బరుగిడు -
ఓ హో హో హో!
యూహాఽతీతం
బీయానందం
బిలాతలంబున!

సంధ్యాసతి! యీ
సంభ్రమ మేమిటె
నవకుసుంభరా
గవసనమేమిటె!
ఆకుంచత తి
ర్యక్ప్రసారి ల
జ్జామధుర కటా
క్ష పాతమేమిటె!
విలాసవక్రిత
విచలన్మధ్యం
బునహ్రీమతి! నీ
వునువలెనే చిఱు
పలుకని మేఖల
వాలక మేమిటె!
యెవ్వరికోసర
మీబిబ్బోకము!
శివపూజకొ! యో
చెలువా! యీ కథ
లెవ్వరు జెప్పిరె?
యిలాతలంబే -
ఆడెడునట నా
ర్యాప్రాణేశ్వరుఁ
డో దినమణి! నిలు

రా! దినమంతయుఁ
బడమటి దేశపు
వారలకీ కథ
నెఱిగించుటకై
బరుగెత్తెదవో!

అల మృగములు క
న్నుల బాష్పమ్ములు
విడిచెడు నెందుకు!
విశ్వేశ్వరునకు
నడుగులుగడుగుట
కై పాద్యంబో!!

గుసగుసమని యీ
కిసలయములు స
మ్మదపూరముగా
మాటలాడునెదొ!!
యేమున్నది! లో
కేశ్వరునాట్యమె

ఓ హో హో హో!
ఊహాఽతీతం
బీయానందం
బిలాతలంబున!!


  1. అంగహారములును, కరణములును బ్రధానముగాఁగలిగి యుద్ధత ప్రయోగమైనది తాండవము (సంగీత రత్నాకరము)
  2. సుకుమారాభినయలయమై శృంగారపోషకమైనది లాస్యము. (సంగీత రత్నాకరము)
  3. అవ్యక్తమధురమైన.
  4. పార్వతీదేవి యొక్క