శశికళ/సొగసు ... వయసు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సొగసు ... వయసు

ఆసొగసె నీ సోయగమె దేవీ
ఆవయసు నీ హోయలుకావే !
చిట్టిపాపగ నేను చిందులాడిన వయసు
నట్టింట నలుగురూ నన్ను ముద్దిడుసొగసు

            ఆసొగసె నీ సోయగమె దేవీ
            ఆవయసు నీ హోయలెకావే !

పుట్టుతూ కేరుమని పొంగిపోయిన వయసు
తొట్టిలో శిశువునై తొక్కులాడిన సొగసు

            ఆసొగసె ఆహోయలె దేవీ
            నీ సోయగము వయసుకావే !

చిలకపందిరి చూస్తు కిలకిలను నావయసు
కులుకుతూ రంగుబొమ్మల నాడు నాసొగసు

           ఆసొగసె ఆహోయలెదేవీ
           నీ సోయగము వయసుకావే !

"బాపన్న బంగారు బాలన్న" ఆ వయసు
పాటలకు నిదురలో పవ్వళించిన సొగసు

             ఆసొగసె ఆహోయలె దేవీ
             నీ సోయగము వయసుకావే !

మెళ్లోన పులిగోరు కాళ్ల గజ్జల వయసు
ఒళ్లు బంగరుతొనల ఒరుసుకొను నాసొగసు

             ఆసొగసె ఆహోయలె దేవీ
             నీ సోయగము వయసుకావే !

తప్పటడుగుల కులికి తలుపుదాటిన వయసు
కప్పురపు వాసనలు గంధమలదిన సొగసు

             ఆసొగసె ఆహోయలె దేవీ !
             నీ సోయగము వయసుకావే !

ఆనాడె నీకొరకు అన్వేషినగు వయసు
అందాల నెలపాప నడిగివేడిన సొగసు

             ఆసొగసె ఆహోయలె దేవీ !
             నీ సోయగము వయసుకావే !