శశికళ/లోకము
లోకము
చంద్ర లోకం తూర్పుదెసలో
సూర్యలోకం పశ్చిమంలో
చిన్నిలోకం ఒకటీ ఉన్నాదే !
ఓనా వెన్నేల చిన్నారి పడుచా !
ఆ లోకమేలే
కన్నెరాణివి నువ్వే నువ్వేనే !
వాడిపోవని పూల తోటలు
నీడ లెరుగని నిండు పున్నమ
పరిమళాలే పిన్నవాయువులూ
ఓనా వెన్నేల చిన్నారి పడుచా !
ఆ జగతి వెలిగే
వన్నె లాడివి నువ్వే నువ్వేనే !
నింగి నీలిమ కంటి బొమలూ
ముంగురులె మొయిల గములూ
తొంగలి రెప్పలె ఇరుల కారంచుల్
ఓనా వెన్నేల చిన్నారి పడుచా !
చెంగలించే చుక్కలె నీకన్నుల్
నా పూజాపీఠం
సింగారి వేల్పువు నువ్వే నువ్వేనే !
పొద్దు పొడుపూ తొగరు కెమ్మోవి
ముద్దు మోమేమొయిల తెరువూ
నిద్దపుకౌనూ మిన్నుటేరేనే !
ఓనా వెన్నేల చిన్నారి పడుచా !
విద్దెలన్నీ నీవే నీవేనే
నా హృదయ కమలం
సుద్దు లాడివి సొబగు లాడివి
నువ్వే నువ్వేనే !
కంటిలోనికి కలలు పొదిగీ
కంఠంలోనే తీపులు పిదిగీ
జంట చేస్తివి చేతికి కౌశల్యం
ఓనా వెన్నేలా చిన్నారి పడుచా !
మంటి మింటికి శ్రుతిగా నాతలపూ !
నా ఆత్మ మధ్యవు
అమృతమూర్తివి నువ్వే నువ్వేనే !