శశికళ/మేలుకొలుపు
మేలుకొలుపు
సృష్టి అంతా నిశ్చలమ్మయె
తుష్టి తీరక నేను మాత్రము
కాలమంతా నిదురపోయెను
మేలుకొని నే నొకడ మాత్రము !
మినుకు మినుకను తారకలలో
కునుకు లాడెను కటిక చీకటి
కన్ను మూసిన పూలప్రోవుల
తెన్ను తెలియని గంధ బాలిక !
ఇంతలో ఆ నిశ్చలతలో
ఇంతలో ఆ సుప్త జగతిని
నిదురలోనివి తీయటూర్పులు
చెదరి తేలుతు నన్ను చేరెను !
"ప్రేయసీ !" అని గద్గదికమై
పిలిచితినే వణకిపోతూ !
"ప్రేయసీ !" యని మారుమ్రోగె వి
హాయసీ పధి దెసల దెసలన్నీ !
గాఢ నిద్రను సోలినవి న
క్షత్ర బాలలు ఒడలు తెలియక
వాని సౌందర్యాల మధ్యను
వాలియున్నది ఒక్క సోయగమూ !
"ప్రేయసీ !" యను నాదు పిలుపును
"ప్రేయసీ !" యను మారుమ్రోతయు
మేలుకొలిపెను తార బాలల
మేలుకొలిపెను సర్వ సృష్టిని !
తారకా బాలికల నడుమను
కోరికల ప్రోవైన నిన్నూ
మేలుకొలిపెను పిలుపు పాటలు
జాలిగా ఆనంద భైరవిలో !
సృష్టి అంతా ఝల్లు మన్నది,
చేష్ట లందెను కాల బాలిక
ఘల్లు మన్నది లోకనాట్యము
ఫుల్లమై రస దివ్య పుష్పము
వెల్లువలు గంధములు నింపెన్.