శశికళ/నిరీక్షణ
< శశికళ
Jump to navigation
Jump to search
నిరీక్షణ
నీకై నే ఎదురుచూస్తి
నీకై నే వెదకినాను
కను తెరచిన కలలమధ్య
కలలెరుగని గాఢనిద్ర!
నీకై నే ఎదురు చూస్తి
నీకై నే వెదకినాను
నను తెలిసే శిశుదినాల
వినితెలిసే బాల్యలీల
యౌవన మధు మధురాలలో
భావా భావ స్థితిలో
నీకై నే ఎదురు చూస్తి
నీకై నే వెదకినాను
ఎవరవో నీ వెటులుందువో
ఎవరవో నీ వెట నుందువో
భువిజవొ దివిజాంగనవో
అవతరించినావొ ఏమో
నీకై నే ఎదురు చూస్తి
నీకై నే వెదకినాను