Jump to content

శశికళ/నర్తకి

వికీసోర్స్ నుండి

నర్తకి

భూలోకానికి పూర్వపువైపున
ఆకాశానకు ఆవలిదెసలో

     మూర్తించినదొక నర్తన శాలా
     స్ఫూర్తిత వర్ణాతీత ప్రభాసము.

సముచిత వేషా సుందర రూపవు
విమల విభూష విచిత్రవి యచ్చర

   వై పారిభద్ర మందార కుసుమ
   మాలా చర్చిత వేణీ భరవై
   రంగస్థలాన అవనిక ముందర
   శృంగారవతీ నిల్చినావటే !

అచ్చర పడతులు హంగైపొల్చిలి
ఆ తోద్యమ్ములు నాల్గు వాద్యములు

 తతానద్ధ సుషిర ఘనాలంకృతలై
 చతురలు,తౌర్య త్రికమునకు శలలు

నృత్య నాయికా ! నీకెలకులలో
నిల్చిరి వివిధాలంకృత నాట్యవేషులై !

           సభానుమతిగొని నమస్సు లిడితివి
           సమందహాసపు మృదంగ వందన

మాచరించితివి కాకలి కంఠము
నాలాపిస్తివి అస దృశరాగము

    పుష్పాంజలివై దేవసన్నుతిగ
    పూర్వ రంగమును ప్రారంభిస్తివి.

స్వరజతి నొక్కటి నృత్త విలాసము
విరచిత మంజులగతీ విశేషము

      తకతక ఝంతర తళాంగుధత్త
      త్తై ధత్త త్తై యని శబ్దములో

ముక్తాయించితి మృదంగ నాదము
రక్తి కొలుపగా మెరుము తీగెవై.

అతి లోకాలంకృత నాట్య మంది
రాంతర సభలో నే నొక్కడనే

  నాయకుడను సభ్యులునై కెరలితి
  నాకై నీనాట్యము నీ విద్యలు

సౌందర్యము గాంధర్వము సౌష్టవ
సౌహార్ద సుభగ సౌశీల్యాలును దేవీ.

శృంగార రసాంచిత విరహోత్కం
ఠాంగహార కరణార్ద్రిత గీతము

   ఆ లోలిత రస పరిపుల్లసౌర
   భాప్లావిత పరమభావ చలితము

హావీభావ విలసత్కృతాభినయ
హ్లాదము నద్భుతనృత్య మొనర్చితివే !

అటుఖండిత విటువాసక సజ్జిక
వభిసారిక వొక్కసారి ప్రోషిత

    భర్తృక వొక్కట కలహాంతరితవు
    స్వాధీన పతికవు స్వీయవు ప్రౌఢ

వఖిల రసాధిదేవత వనన్యవు
వాచ్యాభినయ విశారదవతివా !