Jump to content

శశికళ/చరిత్ర

వికీసోర్స్ నుండి

చరిత్ర

మర్త్యుడను నే నటే
       ప్రియ బాల
అమర సఖి వీవటే !
ఒక తారకా కాంతి
       ఒక దివ్య లిప్తలో
చీకట్ల వెలిగిస్తు
       చేరినది ఈ భువిని
              తార కిరణము నేను
              తారకవు నీ వటే !
శిల్ప నిష్ణాత గా
       చిత్రకారుణ్ణిగా
జన్మ జన్మా లెన్నొ
       తన్మయ కళా పూజ
              శిల్పి నేనే నటే !
              శిల్పమవు నీ వటే !
ఆనాట జంతాన
ఆంధ్రపురి కటకాన
       ఆంధ్ర కవి స్వప్నాన
       ఆంధ్ర నట కరణాన
       ఆంధ్ర సంస్కృతి నేనె
       ఆంధ్రత్వ మీ వటే !