శశికళ/గానసుందరి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గానసుందరి


సారెలను సవరించి తంత్రుల
తీరుపుల మీటించి శ్రుతిగా
నేరుపులు పాటించి వయెలిన్
               తాల్చితివి హృదయాన దేవీ !

గారములు శృంగారములు మధు
పూరములు విరితోరములు ఝం
కారములు ఘంకారములు సం
రావములు నయ్యెన్.
రాగములు సంపుల్లమయ్యెను
రాగమొందెను తానవర్ణము
త్యాగ బ్రహ్మమె నాదబ్రహ్మై
తీగెలను స్పందించి వెడలెన్.
జీవమున అట్టడుగు భావము
చేయిపెట్టీ కలచినట్లై
చీకు తలపుల క్షుద్రకాంక్షలు
               చివ్వునా పై కెగసి వచ్చెన్.

గుండెలో ఎఱ్ఱన్ని రంగలు
మండిపోయెను ఆశయాశలు
ఎండిపోయెను మొండినై చెడు
               దుండగుడనై తిన్.

సత్తువంతా పోయి అందపు
మత్తులో పడిపోయి, హృదయము
ఎత్తు పల్లములోన వణికెను,
                చిత్తమున వై రాశ్యమొదవెన్.

తీగెలను స్పందించు విల్లును
రాగ స్వరముల నాడు వేళ్లూ
తూగిపోయే గీతికాతతి
               దోగులాడెను దెసలు దెసలన్నీ !

కోయిలలు పాడేనొ వాగులు
లోయలో నృత్యాలు సలిపెనొ !
వేయి మలయానిలము లొకటై
               వీచెనో శ్రుతులు శ్రుతులన్నీ !

కోటి పూవులు విరిసినట్లై
కోటి చంద్రిక లలమినట్లై
పాటలే ప్రసరించు బ్రతుకున
                బ్రతుకు కదలక శిల్పమై నిలిచెన్.

ఏదియో అమృతాప్లావితమై
ఏదియో ఆనందలీలై
వేదనారహితంపు బ్రతుకై
                రోదసీ పధమెల్ల నిండితి
                హ్లాదమే విశ్వమై నిలిచెన్.