శశికళ/జ్యోత్స్నా ద్యుతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జ్యోత్స్నా ద్యుతి

ఇన్నినాళ్లు ఎటదాగెనో
క్రొన్నలరులప్రోవు పాట

        విన్నది విన్నట్టు వెదికి
        వీనులలసిపోయె దేవి ! ...ఇన్ని నాళ్లు

వన్నెల విలసిల్లు పాట
వెన్నెల సుడితిరుగు పాట

        అన్నుకొను పరీమళాలు
        అలది కలచు తేనెపాట ... ఇన్ని నాళ్లు

ఇన్ని యుగము లెటనున్నదొ
మిన్నులాను మేటి పాట

        తెలి వెలుగులు మలచుపాట
        కలరాగము లలముపాట ...ఇన్ని నాళ్లు

కల్పాలే కరగివచ్చె
కడపలన్ని బ్రతుకుచొచ్చె

         కల్పతరువు మేన వెలిసె
         కలశాంబుధి మదినిపొలసె...ఇన్నినాళ్లు

నేడే నా హృదయవనిని
నిలిచె నిత్య మధుమాసము

          నేడే నా జీవితపధి
          నిలిచె నిత్య జ్యోత్స్నాద్యుతి.