శశికళ/ఎవరవే!

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎవరవే !


ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు

         కలలోని పాపవా ?
         కతలోని బాలవా ?

మధుర మందానిల. పరీమళమవో
మధుమత్త శారాదాత్మిక సుషమవో !
       
          సుందరాప్సరసాంగనా కంఠ
          తుందిలము మందార మాలవో !

ఓ చెలీ నీవెవరు ?
ఓ చెలీ నీవెవరు ?

          కలలోని ముగ్థవా ?
          కతలోని స్నిగ్థవా ?

వారాసిలో పొంగు కెరటాలవో
నీరాల లోతులో నీలాలవో

 

         తుంగ వీచీ శిఖర
         భంగ రేఖా రచిత
         శుక్తి గర్భాంతరిత
         ముక్తా ఫలాచ్ఛవో !

ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు !

          కలలోని పొలతివా ?
          కతలోని మెలతవా ?

ప్రత్యూష బాలాధరారుణిమవో
నిత్య నూతన భాను కిరణమ్మవో !

           గాఢ రజనీ హృదీ
           వ్యూఢ గంభీరస్థ
           తమసులో నుదయించు
           విమలభాః కణమవో ?

ఓ చెలీ నీవెవరు ?
ఓ చెలీ నీవెవరు ?

           కలలోని సుందరివొ ?
           కతలోని చందిరవొ ?

కాదంబినీ వక్ష నట శంపవో
ప్రాదంబరేంద్ర కార్ముక వర్ణవో ?

         అరుణాంశు చుంబితా
         నందరాజీవ హృదయ
         కేసరపరాగ గాం
         గేయ ప్రకాశవో !

ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు ?

         కలలో నణీయవా ?
         కతలోని ప్రణయవా ?

దివిజ గంగా తరంగ స్వరమవో
హిమజ యమునా గమన గానమ్మవో!

         గోదావరీ సప్త
         కూలం కషానుగత
         తాపస పవిత్రపద
         తాళ స్వరూపవో !

ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు ?

         కలలోని భావవో ?
         కతలోని దేవివో ?

గగన లలనా శిరో రత్మమ్మువో
కలశపాధోరాసి సారసనవో ?

         తాండవేశ్వర నాట్య
         తాళ తకిట ద్థిమిత
         ఝంతర ఝణ క్వణిత్
         స్వర్ణ మంజీరవో !

ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు

         కలలోని మాయవో ?
         కతలోని ధ్యేయవో ?