శశికళ/అనుగమము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనుగమము

నువు పరుగిడితివి నువు ప్రవహిస్తివి
నిను వెనుదవిలితి వనసఖి నామనిలా !

              పికీ బాలనై వికా వికలుగా
              కుహుకుహు నిస్వన విహారగీతము
              రసాల నిష్కట ప్రసారి తాంతర
              కషాయ జేమన కలరాగంలో
              రెక్కలు చాచిన నీవెనకాలే
              సొక్కుచు కోకోయని నే నెగిరితినే !

నీలం నీడల హేలాలీలలు
జాలవి చిత్ర వికల్పవు విభ్రమ

              దృశ్యా దృశ్యపు హ్రదినివైతివి
              వశ్యుడనై నిను నిత్యప్రియగా

వరియించగ నిన్మనుగమియించగ
వారిద నాయక వేగాత్ముడనే !
శూన్యా శూన్యాంతపధి తారా
కన్యవు రోహిణి వసదృశమూర్తి వ

              నన్యవు చొచ్చుకుపోతివి గగనము
              పుణ్యవతీ నే నిన్ననురించెదను

కలాప్రపూర్ణుడు రాకా చంద్రుడు
కళానిలయ ఆతారక చేరేరీతిని
ఉదయం సాయం సంధ్యలలో
పదవిన్యాసము నృత్య గతులలో

             ఉషా రమణిలా తుషారార్ద్రవై
             పుషితారుణ రాగ ప్రపుల్లవు

నువు పయనించితె ! నీవెనకాలే
దివమణి సూర్యుడనై నే వెన్నాడితినే !

నువు పరుగిడితివి నువు ప్రవహిస్తివి
సవసవ నీకౌ నాడెను దేవీ

             పడతీ నినునే పరుగులపట్టితి
             పకపక నవ్వుతు నను జేరితివే
             బ్రతుకున ఒకటై నువ్వూ నేనూ

పవన హృదయమున పరిమళమౌతూ
పయనమైతిమే పరమ శోభకై.