శశికళ/నిత్య యౌవన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నిత్య యౌవన

నాలోన నీవూ నిత్య యౌవనవూ
ఏనుమాత్రం దేవి ఏళ్ల జీర్ణింతునే ?
            నాలోన నీవూ నిత్య యౌవనవూ !

పాపలలొ పాపనై పాడెదను ఆడెదను
అందాల పడుచుతో గంధాలు ప్రసరింతు,
            నాలోన నీవూ నిత్య యౌవనవూ !

పూలమాలలు తాల్చి మేలమాడుదు నిన్ను
కాలాన్ని కట్టేసి కాలకిందను రాతు
            నాలోన నీవూ నిత్య యౌవనవూ !

శక్తి కృంగని బుద్ధి రక్తి పొంగిన వృద్ధి
నీపాట శ్రుతికలిపి నీతొ నృత్యముసేతు

             నాలోన నీవూ నిత్య యౌవనవూ
             ఏనుమాత్రం దేవి ఏళ్ల జీర్ణింతునే !