Jump to content

శశాంకవిజయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనినశశాంకవిజయం బనుమహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన.

1


గీ.

వెలయు ధరలోన నుజ్జ్వలవిమలహృదయ
పద్మపద్మసమాశ్లిష్టపరమపురుష
సంతతధ్యానసానంద సాధుమౌని
నవ్యకీర్త్యావృతదిశంబు నైమిశంబు.

2


ఉ.

ఆవనసీమ శౌనకమహామునిముఖ్యులు తాపసోత్తము
ల్పావనసత్కథారసవిభాసిముఖాబ్జవినీతు సూతు సు
భావనఁ జేసి యిట్టు లని పల్కిరి సద్ద్విజరాజితోర్జిత
శ్రీ విలసిల్లుచంద్రకథ చిత్తమున న్వినఁగోరువారలై.

3


ఉ.

పంకజగర్భునంశమున భాసిలి యిద్ధర నత్రి కెట్టు లే
ణాంకుఁడు పుట్టె నాతఁడు బృహస్పతికిన్ సతి యైనతార ని
శ్శంకత నెట్లు పట్టె నది సైఁప కెదిర్చినదేవతాతతిన్
గొంకక యెట్లు గొట్టె వినఁగోరెద మా తెఱఁ గెల్లఁ దెల్పుమా.

4


క.

అన విని సూతుఁడు మనమున
వినయం బిగురొత్త మునుల వీక్షించి నట
త్కనకాచలచాపజటా
ఘనగాంగతరంగభంగి గా నిట్లనియెన్.

5


మ.

కలఁ డంభోరుహగర్భమాసససుధాకల్లోలినీనాథని
స్తులమందారమహీరుహాత్తఫలసత్పుత్త్రీభవద్బ్రహ్మవి
ష్ణులలాటాక్షకథావిచిత్రితజనస్తోమస్తుతోద్యద్యశ
స్తిలకాలంకృతధాత్రి యత్రివిలసత్తేజోధురాపాత్రియై.

6

చ.

మునికులచంద్రుఁ డాతఁడు ప్రమోదముచే ననసూయ భక్తిమై
తన దగుపేరు నిక్కముగఁ దాలిమి మీఱఁగ సేవ సేయఁగా
ననుదినముం జపంబు తప మధ్యయనంబు వ్రతంబు లగ్నిసే
వన మతిథిప్రయుక్తవరివస్యయు మీఱఁగ ధర్మనిష్ఠుఁడై.

7


ఉ.

కొన్నిదినంబు లుండి తనకున్ సుతలాభము గల్గురీతికై
పన్నినకోర్కి చిత్తమునఁ బాదుకొనన్ వనితాసమేతుఁడై
కిన్నరకామినీమృదులగీతవినూతనజాతపల్లవా
చ్ఛిన్ననికుంజమంజువనచిత్రము గాంచెఁ దుషారగోత్రమున్.

8


క.

కాంచి యుదంచితవిస్మయ
కంచుకితమనస్కుఁ డగుచు కడు వేడుక నా
చంచలలోచనఁ గనుఁగొని
యంచితవాగ్వృత్తి నిట్టు లనుచుం బలికెన్.

9


సీ.

పుడమివింతలు చూడ నడరుకోరిక గన్న
        మిన్నేరు దిగుటకు మెట్టు దొరకె
జన్నాన బన్నంబుఁ గన్నసతీదేవి
        పుట్టినిల్వరుసలపట్టు గాంచె
నొండొంటితో రాయుకొండలజగడంబు
        రహి దీర్చి యేలంగ రాజు గలిగె
దనయకుఁ దగుభర్త ననయ మారయు హాట
        కాద్రికిఁ దగునట్టియల్లుఁ డబ్బె


గీ.

గండు మీఱినచండాంశునెండవలన
నుండ వెఱచినమంచుకు దండ గలిగె
నిందుబింబాస్య యాపర్వతేంద్రువలన
నెంచి యీతనిమహిమ వర్ణింపఁ దరమె.

10


క.

ధర మొద వై తిరిగెడుతఱి
గిరు లెల్లను దాని కితని క్రేపుగఁ జేయన్
దొరసి చను ద్రావ నెలవులఁ
దొరఁగిననురు వనఁగ మంచు దోఁచె లతాంగీ!

11


క.

శిరమున శశాంకరేఖయు
హరు వగుఘనలీల కంధరాప్తియుఁ గలయీ

గిరిపతి గిరీశుచాయన్
గుఱుతుగఁ గనుపట్టె సమదకోకిలవాణీ!

12


సీ.

కురువిందరుచిబృందపరికందళత్ప్రవా
        ళభ్రమాగతకోకిలవ్రజంబు
తతహీరకరవారికృతశారదేందురు
        క్పారణాధావచ్చకోరకంబు
ఫణితేంద్రమణిసాంద్రఘృణిరుంద్రయామవ
        త్యాలోకభీతరథాంగకులము
సురధార్యవైడూర్యవరనిర్యదాఖుభు
        క్ప్రకరనేత్రప్రభాచకితశుకము


గీ.

నుదితగైరికధాతుమయూఖనివహ
విహితహరిహయధనురనువిదితజలద
సమయభయరయపరిచలదమలగరుద
నీక మీకులశైలంబు నెలఁత! కంటె.

13


చ.

సవరము లచ్ఛమైన ఘనసారము కస్తురియున్ జవాది వే
ణువుల జనించుముత్యము లనూనత నిచ్చటి చెంచుముద్దియల్
హవణుగఁ గల్పవృక్షసురకై సురలోకపుఁబువ్వుఁబోండ్ల కా
ర్జవమున నిత్తు రోచకితచంచలచారుచమూరులోచనా!

14


క.

అని యనురాగము మీఱఁగ
ననుఁగుంజెలితోడ ననుచు నగ్గిరిమీఁదం
జని చని మునిపతి విస్మయ
ఘనతరహర్షములు మదినిఁ గ్రందుకొనంగన్.

15


చ.

కులసతిఁ జూచి యోసమదకుంజరగామిని! వీరిఁ జూచితే
కలకలకంఠకంఠమృదుకాకలికాకలనీయగీతికా
కలితుల సిద్ధదంపతులఁ గంటె యదూరసరన్మరుజ్ఝరీ
జలలహరీవిహారములు సల్పెడియక్షులఁ గేళిదక్షులన్.

16


మ.

ఇది గంధర్వవిహారభూమి యదె కంటే సిద్ధమార్గంబు ల
ల్లదె సౌగంధికపుష్పము ల్గలకొలం కాచాయ సూ మానసం
బదిగో చైత్రరథం బదే కద కలాపాఖ్యామహాగ్రావ మో
మదిరాక్షీ! బదరీవనం బదె జగన్మాన్యంబు చూపట్టెడిన్.

17

క.

అని యచటివిశేషమ్ముల
ననసూయకుఁ దెల్పుచున్ మహామునివర్యుం
డనుపమశీతలపవనం
బున బడలిక దీరఁ బోవఁ బోవఁగ నెదుటన్.

18


సీ.

శరభంబు లాహార మరసి పోషింపంగఁ
        జెంగుచెంగున దాఁటుసింగములును
సింగము ల్దమగోళ్లచేఁ గటంబులతీఁట
        దీర గీరఁగ మీఱువారణములు
వారణంబుల నిడువాలుతుండంబుల
        జెలఁగి యూఁచఁగఁ గూర్కుచిఱుతపులులు
చిఱుతపులు ల్ముండ్లు సెలఁగి తా వొనరింప
        నిదురఁ బెట్టుచు నుండుకొదమలేళ్లు


గీ.

లేళ్లకొమ్ముల నైనబల్బిలములందుఁ
బరఁగుసాములు పాములపడగనీడ
నలగుచుఁ జెలంగునెలుకలు తలవరు లయి
వరుసఁ గావంగ వెలయునీవరులు గలిగి.

19


సీ.

అలికి మ్రుగ్గులు పెట్టి వెలయ వేదికలందు
        నాహుతు ల్గాంచుత్రేతాగ్నికణము
త్రేతాగ్నికణధూమజాతమేఘములచే
        నెండ కన్నెఱుఁగనివృక్షములును
వృక్షము ల్ఫలముల నెపు డియ్య నతిథుల
        మిగులఁ గైకొనుగృహమేధికులము
గృహమేధికులసదాకృతసపర్యలచేత
        నతిహర్షము వహించుయతిచయంబు


గీ.

యతిచయధ్యానసంతోషితాంబుజాక్ష
పాలితజగత్రయంబునఁ బావనంబు
కాంత మేాంత మాశ్రితానంత మగుచు
శ్రమము లెడఁబాపుబదరికాశ్రమముఁ జేరి.

20


గీ.

పర్ణశాలను నిర్మించి పత్నితోడ
స్వర్ణదీతోయమునను సుస్నాతుఁ డగుచు

జీర్ణపర్ణానిలాహారసేవనమునం
బూర్ణ మగునిష్ఠను దపంబుఁ బూని యపుడు.

21


చ.

ధర బొటవ్రేల నూని రవిఁ దప్పక చూచుచు నూర్ధ్వబాహుఁ డై
స్థిరత జితేంద్రియుం డగుచుఁ జిత్తముతత్తరపాటు మాన్చి చి
త్తరువున వ్రాసిన ట్లచలతన్ దగి వాయునిరోధ మొప్పఁగా
హరిహరపద్మగర్భుల సమాహితవృత్తి మదిన్ దలంచుచున్.

22


క.

ఫలములు చివురులుఁ బువ్వులు
జలములు దర్భలును వ్రేల్మి సమిధలు నవలా
వలయునపు డొసఁగ సలిపెన్
బొలుపుగఁ దప మత్రి యత్త్రిపుత్త్రాప్తికినై.

23


క.

ఈయమరిక రెండున్నొక
వేయేఁడులు దివ్యమానవిఖ్యాతముగా
నాయత్రి తపముఁ జేయఁగ
నాయననిష్టకును మెచ్చి యతిహర్షమునన్.

24


సీ.

హరినీలపుఁదెఱంగు నరిదివజ్రపురంగు
        మెఱుఁగుఁగెంపుహెురంగు మేను లమర
బెడఁ గైనయక్కున నెడమమైదిక్కున
        నడరెడువాక్కున నతివ లలర
చిలువపౌఁజులఁ ద్రొక్కు పులుమేఁపులకు సొక్కు
        తెలిదూండ్ల వెస మెక్కు తేజు లమర
మకుటంపుజిగిసొంపు రకమైన నెలవంపు
        చికిలికెంజడగుంపు శిరము లమర


గీ.

స్వర్ణమయచేల గజచర్మవల్కలములు
గట్టువారలు శంఖచక్రత్రిశూల
డమరుదండకమండలు సమితికరులు
హరిహరబ్రహ్మ లపుడు ప్రత్యక్ష మైరి.

25


క.

ఈలీలం బొడకట్టిన
వేలుపుఁబెద్దలను జూచి విస్మయవినయో
ద్వేలభయహర్షసంభ్రమ
శాలితఁ బ్రణమిల్లి యత్రిసంయమి పల్కెన్.

26

సీ.

కమలాశ్రయత్వసంగతిపరిభ్రాజితు
        నభిమతార్యాధారతాభిరాము
పరమహానందకపాలితాశ్రితలోకు
        హంసాధికరణవిఖ్యాతియుక్తు
వర్ణితఘనసానవర్ణాత్మకాధీశు
        ద్విజరాజసంప్రాప్తదివ్యచరణు
నురుతరసత్కృపాభ్యుపగతభద్రుని
        సుజనసంస్తుతలసదజసమాఖ్యు


గీ.

నిన్నుఁ గొల్చెద భక్తిమై నీరజాక్ష!
యోవిరూపాక్ష! యష్టాక్షరోరుపక్ష!
రక్షణసదీక్షయసదృక్షరమ్యవీక్ష!
ఈక్షణమె నన్ను రక్షించు హితసమక్ష!

27


చ.

అని నుతి సేయునాయనసమంచితభక్తికి మెచ్చి వార లి
ట్లనిరి మునీంద్ర! నీవలయు నట్టివరమ్ము లొసంగువారమై
యనితరదర్శనీయమహితాకృతు లే మిట వచ్చినార మిం
పెనయఁగ నీవు కోరినయభీష్టము లిత్తుము వేఁడు మిత్తఱిన్.

28


చ.

అనునపు డాతఁ డిట్లను మహామహులార! గుణాభిరాము లౌ
తనయులఁ గోరి నే నిపుడు తత్పరతన్ దప మాచరించితిన్
ఘనతరకీర్తియుక్తుల జగన్నుతుల్ మిమువంటి పుత్త్రులన్
మనమునఁ గోరెదన్ గరుణ మన్నన మీఱఁగ నీయఁగాఁదగున్.

29


మ.

అనిన న్నవ్వుచు మమ్మువంటిసుతు లెం దైనన్ గలారే జగం
బున నత్రీ! విను మేము మువ్వురము త్వత్పుత్త్రాకృతుల్ దాల్చి మీ
యనురాగం బొనఁగూర్తు మం చని యదృశ్యాకారు లై రట్టిచో
సనసూయాసతి గర్భమయ్యె భువనాహ్లాదంబు సంధిల్లఁగన్.

30


చ.

నెల మసలెన్ శ్రమం బొదవె నిద్దపుఁజక్కులు వెల్ల నయ్యె వే
విళు లుదయించెఁ జన్మొనల వీఁకయుఁ గప్పును దోఁచెఁ జిట్టుముల్
వెలసెను రోమరాజి గనిపించె రుజంబుగఁ గౌను పైఁబయిన్
బలిసె వళుల్ సెలంగె జడిమంబు నడన్ గనిపించె నింతికిన్.

31


క.

ఈమాడ్కిని దద్గర్భము
శ్రీ మెఱయుచు వృద్ధిఁ జెందఁ జేడియ తగెఁ జిం

తామణికౌస్తుభకల్పక
భూమిజయుతజలధిలహరిపోలిక మీఱన్.

32


శా.

అంత గొన్నిదినంబు లేఁగ ననసూయాదేవి భూమీజనుల్
సంతోషింప శుభగ్రహాళి ననువౌలగ్నంబునం దద్భుతా
నంతశ్రీఁ దగుపుత్త్రులం గనియె దత్తాత్రేయు దుర్వాసునిన్
గాంతామోహనచారుమూర్తిరుచిరేఖాసాంద్రునిం జంద్రునిన్.

33


క.

దత్తమునీంద్రుఁడు సుగుణో
దాత్తుఁడు హరియంశమున శివాంశంబున లో
కోత్తరుఁ డగుదుర్వాసుం
డుత్తముఁ డబ్జభవునంశ నుడుపతి పుట్టెన్.

34


క.

హరిహరసరసిజసంభవ
పరమాంశజు లైనసుతులఁ బడసి మునీంద్రుం
డరు దగుసమ్మోదమునన్
బెరసెను పెన్నిధులు గన్నపేదయుబోలెన్.

35


ఉ.

అప్పుడు వేలుపుందెరవ లాడిరి పాడిరి కిన్నరాంగన
ల్చిప్పిలుసోనతేనియలు చిందఁగఁ గ్రందుగఁ బువ్వులన్ సురల్
గప్పిరి దేవదుందుభులు గ్రక్కున దింధిమినాదవైఖరిన్
గుప్పున మ్రోసె దివ్యమునికోటులు దీవన లీయ వేడుకన్.

36


క.

ఆమువ్వురలోఁ జంద్రుఁడు
తామరసభవాంశభవుఁడు దననెఱినీటున్
గోమును జక్కదనంబును
వామాక్షులు మెచ్చ నిచ్చ వర్ధిలుచుండెన్.

37


సీ.

కలువల చెలికాఁడు కళల కెల్లను వీడు
        నెమ్మినేస్తకానికిని జోడు
రాతిరియెకిమీడు జోతియుండెడువాఁడు
        మగువలఁ దమిఁగొల్పుమాయకాఁడు
జక్కవగమిసూడు చక్కనివగకాఁడు
        చిమ్మచీకటిఁ జిమ్ముద్రిమ్మరీడు
మరునివజీరుఁడు నెఱనీటుగలవాఁడు
        ముద్దుగుమ్మలమొగమ్ములకు నీడు

గీ.

అంకమున జింకఁ దాల్చినయందకాఁడు
అంబుజాక్షునిమోహంపు టన్నుతోడు
సద్ద్విజనులఁ బ్రోచువజ్రంపుజోడు
కలికితనమున మెఱయుచుక్కలకు ఱేఁడు.

38


క.

సుద్దులచే బుద్ధులచే
ముద్దుల చేఁ దల్లి దండ్రి ముద మలరంగాఁ
దద్దయుఁ దద్దయ నెసఁగెను
ప్రొద్దుకుఁ బ్రొద్దుకును వింతపోణిమి మీఱన్.

39


గీ.

జాతకర్మాదిసత్క్రియాజాతములను
బూతతనుఁ డైనయతనికిఁ బ్రీతి నత్రి
నాతియును దాను నుపనయనం బొనర్ప
నాతనిఁ గనుంగొనఁగ వచ్చె ధాత యపుడు.

40


ఉ.

వచ్చి నిజాంశసంభవు నవారణవారణడింభమో యనన్
హెచ్చినపెక్కువం జెలఁగునిందుని రమ్యముఖారవిందునిన్
మెచ్చి దయోదయస్ఫురణ మీఱఁగ దీవన లిచ్చి యిచ్చమై
యచ్చరనేత తచ్చరిత మచ్చుపడం బరికించి యిట్లనున్.

41


ఉ.

ఈతఁ డనిన్ సురాసురుల కేనియు గెల్వఁగరానివిక్రమ
ఖ్యాతిని మించి రా జనఁగ నంచితకీర్తి వహించి తారకా
నేతయు నోషధీశుఁ డవనీసురజాతికిఁ బాలకుండు నై
భూతల మేలు మేలు దలపోయును జేయును రాజసూయమున్.

42


మ.

అని యి ట్లానతి యిచ్చి యంబుజభవుం డమ్మేటికిం గాండివం
బనువి ల్లక్షయతూణయుగ్మ మఖిలాస్త్రాభేద్యమౌ కత్తళం
బనిలోద్దామతురంగమాన్వితసహస్రాదిత్యసంకాశ మై
యనువౌ దివ్యరథంబు నిచ్చెఁ గరుణాయత్తైకచిత్తంబునన్.

43


క.

కర మురుసమరజయశ్రీ
కరమును సుఖకరము కాంతికరమును గడు మీ
సరమును బరాగగణధూ
సరము నయినకలువవిరులసరము నొసంగెన్.

44


క.

నలువ మరుమామ కీగతి
నలు వమరువరంబు లొసఁగి నగుమొగమున ముం

గల నతులశిల్బవైఖరి
గలనతు నవ్విశ్వకర్మఁ గనుఁగొని పలికెన్.

45


చ.

హతబహుకిల్బిషం బగుప్రయాగము యాగ ముదావహంబు సాం
ప్రతముగ నందు నిందిరకుఁ బట్టనఁ బట్టణమున్ సృజింపుమా
యతులితశిల్పశక్తిఁ గొని యం చని యంచ నిరూఢి నెక్కి యం
చితగతి ధాత యేఁగె జపసిద్ధులు సిద్ధులు తన్ భజింపఁగాన్.

46


ఆశ్వాసాంతము

శా.

ఆలంకారికసమ్మతోజ్జ్వలకవిత్వాగాధ గాథాశతో
ద్వేలస్తుత్యయశోవిశోధితధరిత్రీఖండ ఖండాధిక
స్వాలాపామృతసేచనోల్లసితవిద్వత్కర్ణ కర్ణాబ్ధిచం
ద్రాలంబాపదదాన దానయుతవేదండాశ్వపూర్ణాంగణా.

47


క.

సజ్జననాదిబుధావన
సజ్జనయనకజ్జలాశ్రుఝరరచితసదా
మజ్జనరిపుయౌవతధీ
మజ్జనజేగీయమాన మాననిధానా.

48


మాలిని.

ఖలవిమతచమూరాడ్గర్వనిర్వాపణౌజా
యలఘునిజగుణాళీహర్షవత్పాండ్యరాజా
వలదురుకవివిద్వద్వర్గసౌవర్గభూజా
విలసితశుభయుక్సద్వేంగళాంబాతనూజా.

49


గద్య.

ఇది శ్రీ జానకీరామచంద్రచరణారవిందవందనకందళితానందకందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్యతనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయ ప్రణీతం బైనశశాంకవిజయం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.