శశాంకవిజయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శశాంకవిజయము

చతుర్థాశ్వాసము

శ్రీమధురాధిపసన్నుత
సామాదికచతురుపాయసంధానభవ
శ్రీమానితకవివినుత
క్షేమంకర సుగుణహార సీనయధీరా.

1


వ.

అవధరింపుము సూతుండు శౌనకాది మహామునీంద్రుల కిట్లనియె.

2


ఉ.

అంత గురుం డనంతమహిమాతిశయంబున నప్పులోమజా
కాంతుఁ డొనర్చుయాగము నఖండితవైఖరి నిర్వహించి తా
నెంతయు భక్తియుక్తి నతఁ డిచ్చు బహూకృతు లంది హర్షిత
స్వాంతత నాశ్రమంబునకు వచ్చె వియచ్చరకోటి గొల్వఁగన్.

3


క.

తారయు వాచస్పతికిని
దా రయమున నెదురు వచ్చి తాత్పర్యంబున్
గూరిమియు భయము భక్తియు
గౌరవమున్ హర్షమున్ బ్రకాశింపంగన్.

4


క.

పాదములు గడిగి పయ్యెద
చేఁ దడి యొత్తి పదజలము శిరమునఁ గొని
వేదండయాన యతనికిఁ
గైదండ యొసంగె వినయగౌరవ మెసఁగన్.

5


ఉ.

ఇంటికిఁ దోడి తెచ్చి మణి హేమమయోజ్జ్వలపీఠి నుంచి ప
య్యంట చలింపఁగా సురటి నల్లన వీచుచుఁ బ్రాణనాథ! న
న్నొంటిగ నుంచి యీకరణి నుండుదురే? క్రతు వాయెనే? సుఖం
బుంటిరె యిన్నినాళ్ళు? పురుహూతబహూకృతిఁ గంటిరే? యనన్.

6


మ.

క్రతు వాయె న్సుఖ ముంటి వాసవునిసత్కారంబుఁ గైకొంటి ది
క్పతు లత్యుత్తమరత్నభూషణధనవ్రాతంబు లర్పించి రు

న్నతి నొక్కంటఁ గొఱంత లేదచట చానా! నామది న్నీదుసం
గతి లేకుండుట యొక్కటే కొదున యోగక్షేమమే నీ కిటన్.

7


మ.

అని వాచస్పతి పల్కువేళ శశి సాష్టాంగంబుగా మ్రొక్కి ని
ల్చిన దీవించి కుమారకా! సుఖమె బాళిన్ శాస్త్రము ల్నీవు చిం
తన గావింతువె భోజనాదివిధులన్ మద్భార్య నిన్ బ్రేమచే
తను బోషించునె యగ్నిహోత్రమును నిత్యంబు న్విచారింతువే.

8


క.

అనుటయు శాస్త్రంబును చిం
తన సేయుదు మీవధూటి తాత్పర్యముతో
ననుఁ బ్రోచు నన్నివిధముల
ననిన స్సంతుష్టహృదయుఁ డై గురుఁ డంతన్.

9


క.

కాంతామణియును జంద్రుఁడు
మంతనమునఁ జెలఁగి మెలఁగుమార్గముఁ జూడన్
వింతగఁ దోఁచిన మది నొ
క్కింతయునున్ సంశయించి యెఱబఱికమునన్.

10


క.

వీరలచందముఁ గన నొక
తీరై యున్నయది గురుసతీశిష్యవిధం
బారయఁ జూడంబడ దా
నారాయణుఁ డెఱుఁగు నే మన న్గలవాఁడన్.

11


క.

కాని మ్మైనను జూతము
నానాఁటికి వీరు నడుచునడక పరిచయం
బైనట్టిమందెమేలమొ
కానియెడ న్కిల్బిషంబు గలదో యనుచున్.

12


మ.

పరికింప న్మఱి వార లబ్బినయెడన్ భావంబులన్ గొంకకన్
పరిహాసంబులు కన్నుసన్నలును భ్రూభంగంబులు స్మర్మముల్
సరసోక్తు ల్పచరించువైఖరుల నెల్లం గాంచి కోపించి యా
తరుణిం జేరఁగఁ బిల్చి రోష మిగురొత్తం బల్కె గద్దించుచున్.

13


ఉ.

ఓసి యిదేమి యీనడత యొప్పదు సాధ్వి వటంచు నమ్మితిన్
మోసము వచ్చె వీని నతిమూర్ఖుని శిష్యుఁ డటంచు నెంచితిన్
వాసవముఖ్యసర్వసురవర్ణితచర్యుఁడ నై చరించునా
వాసియు వన్నెయుం దొఱఁగి వచ్చెను దుర్యశ మేమి చెప్పుదున్.

14

క.

పెద్దలు లేనియెడన్ మి
మ్మిద్దఱ నే నొంటినునిచి యేఁగఁగ నగునే
ముద్దియ! యేమని చెప్పుదు
పెద్దతనము వోయె బుద్ధి పెడతలఁబట్టెన్.

15


చ.

శివశివ! యెంతపాతకము సేయఁగ నొగ్గెను సిగ్గుమాలి వీఁ
డవిరళభక్తిమై జనని యం చని [1]యెన్నుచుఁ దండ్రి యంచు న
న్నవిరతము న్భజించి నిఖిలాగమము ల్చది విట్లు చేసెనే
యువిదల నమ్ముటే పురుషు! లుర్వి నవిశ్వసనీయ లెన్నఁగన్.

16


చ.

నిలకడ సున్న వావి నహి నేస్తము నాస్తి భయంబు లేదు చం
చలహృదయల్ దురాత్మక లసత్యలు కాంత లదాంత లింతయున్
దెలియక యానృపాలకులు నిగ్రహ మొప్పఁగఁ బోతుటీఁగెయు
న్బొలయఁగ నియ్య రంతిపురిఁ బుత్త్రుల నైనను నమ్మ రెంతయున్.

17


గీ.

తెఱవ! మీశీల మెల్లను దివ్యదృష్టిఁ
జూచినాఁడను నీ వింక దాఁచవలదు
నీవె చెనకితివో లేక నిన్ను వాఁడె
చెనకెనో తెల్పు తెలిసి శిక్షింతు ననిన.

18


క.

బొటవ్రేల నేల వ్రాయుచుఁ
గటకటపడి మేను వడఁకఁ గనుఁగవ నశ్రు
ల్పొటపొట రాలఁగ నేడ్చుచుఁ
గుటిలాలక శిరము వంచికొని యిట్లనియెన్.

19


సీ.

ఏ మని యుత్తరం బే నియ్యఁ గలదాన,
        నెందునఁ దీరు మీసందియంబు
ఇంక నాపయి దయ యెట్లు గల్గును మీకు,
        సైఁపక యున్న నాజన్మ మేల
పాపపుదైవంబు పాపెనో మనలను,
        తలను వ్రాసినవ్రాలు తప్ప దింకఁ
ద ప్పొనర్చినవారి దండింతు నంటిరి,
        త ప్పొనర్పనివారు ధరణిఁ గలరె

గీ.

యబ్జభవుకూఁతురైనయహల్య మొదలు
నేర మొనరించె ననినచో నేర్చి నడువ
నొకరితర మౌనె మగవార లోర్వవలయుఁ
గానిచో వట్టినగుపాటు గాదె మీకు.

20


క.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రము
నచ్చుగఁ దొడఁగినవితాన నబలపయి న్మీ
కెచ్చుగఁ గోపం బిటు రా
వచ్చునె తప్పైన సైఁపవలయు నటంచున్.

21


మ.

చరణాబ్దంబుల వ్రాలినేత్రయుగళీసంజాతబాష్పాంబువు
ల్వరద ల్గట్టఁగ లేవ కున్న నతఁ డవ్వామాక్షి నీక్షించి తాఁ
గరుణన్ లేవఁగ నెత్తి యీనడక లింకన్ బాడి గా దంచుఁ జె
చ్చెర వీడ్కొల్పి హృదంతదంతురమహాచింతాభరాక్రాంతుఁ డై.

22


క.

కోపంబున నత్రిసుతున్
శాపింపఁ దలంచి లోన క్షమియించి మనో
గోపన మెసఁగఁగఁ దనదుస
మీపమునకుఁ జంద్రుఁ బిలిచి మెల్లనఁ బలికెన్.

23


చ.

చదివితి నీతి వేదములు శాస్త్రము లన్నియు నీదుభక్తికిన్
హృదయము సంతసిల్లె నిఁక నీతలిదండ్రులఁ జూచు టొప్పుఁ బె
క్కుదినము లాయె వచ్చి మదిఁ గూర్మియు భక్తియు నుండనిమ్ము మే
లొదవెడుఁ బోయి రమ్మనుచు నొజ్జలు వేమరు తీవరింపఁగాన్.

24


క.

ఆమాటకు మది ఝల్లన
సోముఁడు గురుఁ డిట్లు పలికె చూచితె యకటా !
మోమాట లేక దైవము
నామీఁద న్గరుణమాలి నాతి న్పాపెన్.

25


గీ.

సందియము దోచె నీతనిడెందమునకు
బోయి రమ్మన్నచో నుండఁ బొసఁగ దిచటఁ
బొలఁతి నెడఁబాసి ప్రాణము ల్నిలిచి యున్నె
తెగువ నెటు లైనఁ బోవక తీర దనుచు.

26


క.

చేరి ప్రణమిల్లి నేరిచి
నేరక నే నడుచుకొన్ననేరము దయ మీ

రోరుచుకొను డనిఁ పలుకుచుఁ
దారను నెడఁబాసి తుహినధాముఁడు వెడలెన్.

27


చ.

అటువలె నంటుకాఁడు చని నంత నెలంత దురంతచింతచేఁ
బొటపొట బాష్పముల్దొరుఁగఁ బొక్కుచు స్రుక్కుచు దిక్కులేనిత్రొ
క్కటదిట మాఱ మారవిశిఖమ్ము లురమ్మునఁ దూఱి పాఱఁగాఁ
ద్రుటిఘటికాసహస్ర మయి తోఁపఁగ నాపఁగరానికాఁకతోన్.

28


సీ.

కొండ పైఁ బడినట్లు కొంత సే పేమియు
        నన లేక మిన్ను గన్గొనుచు నుండు
మిగుల వెక్కస మైనమీనాంకుశిఖపొగ
        ల్వెలికిఁ దార్చినరీతి వెచ్చ నూర్పు
విరహంపుఁ బెనునీటివెల్లువ కెదు రీఁది
        నట్లుగాఁ జేతు లిట్టట్టు వైచు
ధనముఁ గోల్పోయిన దారిగాఁ బుప్పొడి
        మే నంట విరిపాన్పుమీఁదఁ బొరలుఁ


గీ.

గొలఁకులను జాఱుకన్నీటి గోట మీటుఁ
దొడరి యడిగెడునిల్లాండ్రతోడ మాటుఁ
జింతను జెమర్పు చెక్కిటఁ జేయమర్చు
ననలవిలుకానిపటుధాటి నవ్వధూటి.

29


గీ.

ఇందు రమ్మన్న మాటల చంద మన్న
నదిగొ నెలవంక లెంత లె స్సాయె ననిన
రాజభోగంబు లన్న నారాజవదన
రమణుపే రని మది నెందు భ్రమ వహించు.

30


సీ.

విభుఁడు మాటాడుచో వెదకి తప్పులు పట్టుఁ,
        బొలయల్క నవలిమోముగఁ బరుండుఁ
గొనగోటఁ బ్రియుఁడు చెక్కు జుఱుక్కునను జీఱ,
        నిది యేటిసరస మం చీసడించు
ముచ్చటై నాథుండు మోవిఁ బల్మొన నొక్క,
        వెలయాలనా యంచు వీడనాడుఁ
దమకాన ధవుఁడు కందర్పకేళిఁ బెనంగ,
        నెంతసే పని తీపరింప సాగు

గీ.

నెక్కడ మనం బటన్నఁ జుఱుక్కు మనును
ఏలనే గోప మనిన నేమేమొ గొణగు
మేను పతిచెంత మనసు రేఱేనిచెంత
నిలిపి యాచాన విరహంపునెగులుతోన.

31


సీ.

పతి పిల్వఁ బిల్వఁ దాఁ బలుకక వెడవెడఁ,
        బనులచే గాలయాపన మొనర్చు
మాటికి మాటికి మగనితో మెండొడ్డి,
        చలపాదితనమున నలిగి యుండు
మమతతో నాథుండు మాటాడి యించుక,
        యటు మొగం బైనచో నెటికె విఱుచు
రతికాంక్ష ధవుఁడు చీరఁ జెఱుంగుమాసె నం,
        చవ్వలి కేఁగు నిరాశ గాఁగ


గీ.

నెల్లగృహకృత్యములయం దుపేక్ష సేయు
నఖిలభోగంబులను వ్యర్థ మనుచు రోయు
జారవిభుమీఁదిమోహంబు సారె కంటి
కాఁపురము నొల్లదాయె నాకలువకంటి.

32


ఉ.

చేరల కెచ్చు కన్నుఁగవ చెక్కుల యందము చెప్ప శక్యమా
బారలఁ గొల్వనౌ నురము బాహులు జానులు మీఱునూఁదుబం
గారుకవున్ బ్రనాళములఁ గైకొన వంఘ్రులు లోకమందు లే
దారసికత్వ మాగుణము లారతిచాతురి వానికే తగున్.

33


ఉ.

భామలజాతిచేష్టితవిభావము లెల్ల నెఱుంగుకామసం
గ్రామకిరీటి యైన విటరాయఁడు మోహనమూర్తి యెంతయున్
నామది చల్లఁ జేయుప్రియనాథుఁడు న న్నెడఁబాసె నయ్యయో!
యీమగఁ డేల యీసదన మేటికిఁ దక్కిన వేమి యేటికిన్.

34


ఉ.

కోరిక కొన్నినాళ్లు మది కొంకు దొఱంగక కొన్నినాళ్లు చే
కూరక కొన్నినాళ్లుఁ జనఁ గూర్మివిటుం డొకఁ డబ్బె నబ్బినన్
వారక పేరులేనిప్రతిబంధము పెన్మిటి నంచు వచ్చి నా
డారక పోరి పాపె నకటా మగనాలయి పుట్ట జెల్లునే!

35


సీ.

అలయించు నొకవేళఁ
బొలయల్క చిక్కుల,
        సొలయించు నొకవేళ సొగసువగలఁ

గరఁగించు నొకవేళఁ గళలయిక్కువ లంటి,
        మఱఁగించు నొకవేళ మెఱుఁగుమోవిఁ
బలికించు నొకవేళఁ బావురాపల్కులు,
        కులికించు నొకవేళఁ గొసరి నవ్వి
యానించు నొకవేళ నరిది మోమున మోముఁ,
        బూనించు నొకవేళఁ బురుషరతికిఁ


గీ.

జిగురువిలుకాని కైన నాసొగసుకాని
యొప్పు లే దన్న ముది మదిదప్పినట్టి
యీమగం డేడ నే నేడ యేడ కేడ
యేటి కీపోరు వీనిపొం దెవతె గోరు.

36


ఉ.

ఆడిక లైన నేమి మగఁడారడిఁ బెట్టిన నేమి చుట్టము
ల్వాడక యున్న నేమి సరివారలు నవ్విన నేమి కాఁపురం
బూడిన నేమి నాదగుప్రియుం డిలుఁ బాసి చనంగ నేనునుం
దోడనె పోవ నైతి మదిఁ దోఁపక పోయె నిఁ కేమి సేయుదున్.

37


గీ.

ఏకరణి నైన వానితో నెనయు టొకటి
కానిచో మేనిపై నాస మాను టొకటి
యింతయే కాక మగఁ డంచు నతనిమొగముఁ
జూచి సైరింప లేను త్రిశుద్ధిగాను.

38


చ.

అని యనిశంబు నెంచు మదనాశుగదుర్దినకుర్దనంబునన్
ఘన మగుమూర్ఛఁ గాంచు వగకానివగ ల్గణియించు నైజపుం
బెనిమిటి నీసడించు మదిఁ జెక్కుతలంపులు నించు వాఁడు వ
చ్చె నని తలంచు నెచ్చటను చీమ చిటుక్కనిన న్జలించుచున్.

39


క.

ఇటు లెంతయుఁ జింతింపఁగ
జటినీమణి యోర్తు బాల్యసఖి యింటికి వ
చ్చుటయును దత్పూజనములు
ఘటియించి రహస్యముగను గామిని పలికెన్.

40


ఉ.

నీవ యెఱింగి యుండుదువు నేనును జంద్రుఁడు నేస్త మౌటయున్
బూవును దావియు న్వలెను బొందుగ వాఁడును నేను నుండుట
ల్నావిధి పెన్మిటై యిపుడు నన్నును వానిని బాపె నే నిఁకన్
భావజుకీలికీల క్షణమాత్రము నోర్వఁగఁజాలఁ గోమలీ!

41

సీ.

తడవు చూచిన దృష్టి దాఁకు నం చని వాని,
        సొగ సెల్లఁ దప్పక చూడ వెఱతు
మొనగుబ్బ లదిమి క్రుమ్మినఁ గందు నని వాని,
        లేఁతమేనును గౌఁగిలింప వెఱతుఁ
దొడిఁబడ నమృతంబు దొలుకు నం చని వాని,
        నునుమోవి గట్టిగా నొక్క వెఱతుఁ
జెమటచేఁ జెలువంబు చిందు నం చని వాని,
        నెనయుచోఁ గసి దీఱఁ బెనగ వెఱతుఁ


గీ.

గాని యొకనాఁడు నావన్నెకానిఁ గాంచి
కదిసి తనివార బిగ్గనఁ గౌఁగిలించి
నునుఁబెదవి నొక్కి రతికేళిఁ బెనఁగి చొక్కి
యేలుకొనలేక యీరీతి బేల నైతి.

42


ఉ.

అన్నము నిద్ర యం చెఱుఁగ నశ్రుజలంబులు నిల్పఁజాల మేన్
సన్నగిలెన్ దిటంబు చనెఁ జాల విరాళియు మీఱె నేమియుం
గన్నుల కింపు గాదు త్రిజగంబులు లేవనునట్లు దోఁచె మో
హెన్నతి మేనఁ బ్రాణములు నున్నవొ లేవొ యెఱుంగ నంగనా.

43


శా.

ఏవంకం జనెనో మదీయదయితుం డెచ్చోట నున్నాఁడొనే
నేవెంటం బ్రియుమోముఁ గాంతు నిఁక నే నెవ్వారితోఁ దెల్పుదు
న్నీ వవ్యాజపరోపకారవు గదే నెమ్మి న్ననుం బ్రోవవే
పోవే వానికి నావెత ల్దెలుపవే పుణ్యంబు నీ కయ్యెడున్.

44


క.

అని వేఁడిన నత్తాపసి
విను మేవగ నైన నీదువేడుకకానిం
గొని తెచ్చెద మచ్చాతురిఁ
గనవే నేఁ డనుచుఁ బల్కి గ్రక్కున వెడలెన్.

45


మ.

అతిమోహోన్నతి తారఁ బాసి శశి చింతాక్రాంతచిత్తంబుతో
వెతతో వెన్కకు నీడ్చుపాదములతో విభ్రాంతభావంబుతో
ధృతిహీనస్థితితో దృగంచలనము ద్వేలాశ్రుపూరంబుతో
మతిఁ జింతించుచు నేగి యొక్కవనసీమన్ గుంజగర్భంబునన్.

46


చ.

శ్రమ గొనినట్లు మిన్విఱిగి పైఁ బడినట్లు గ్రహంబు సోఁకిన
ట్లమితధనంబు గోల్పడినయట్లు ప్రపంచము గ్రుంగినట్లు చి

త్తము వికలత్వ మొంద మదిఁ దాలిమి డిందఁగ మేను కందఁగా
హిమకరుఁ డంతరంగమున నింతిఁ దలంచి వలంచి యిట్లనున్.

47


ఉ.

ఆతఱి బొంత చేసినటు లాతఁడు పొమ్మని వీడ నాడఁగా
నాతరలాక్షి చిప్పిలెడు నశ్రుల నప్పళించుచున్
దాఁ దలుపోర నిల్వ నయనమ్ముల నేఁ బయనమ్ము దెల్ప సం
జాతవిషాదయై యనుపఁ జాలనిచందము లెంచఁ గూడునే.

48


ఉ.

పొమ్మనినంత రాఁదగునె బుద్ధికి మోసము వచ్చె నప్పుడే
కొమ్మను వెంటఁబెట్టుకొని కొంకక వచ్చితి నేని నన్ను దా
నమ్ముని యేమి చేయు నొకఁ డడ్డమె యే నటుసేయమి న్గదా
ముమ్మర మైనకంతువిరిముల్కులకు న్దను వొప్పగించెదన్.

49


సీ.

తళుకుబంగరుకుండ తావిసంపఁగిదండ,
        వలపులసరణి జవాజిబరణి
పచ్చికస్తురివీణ బాగైననెఱజాణ,
        కల్కిమిటారి యంగజుకటారి
మకరందములవాక మదనశాస్త్రపుటీక,
        రతిచేతిచిల్క మర్వంపుమొల్క,
మురిపెంబులకు దీవి మరుదోఁటయెలమావి,
        నెఱనీటు కిరవు పన్నీటిచెఱువు


గీ.

ఎంచఁ దగుముచ్చటల కిమ్ము మంచిసొమ్ము
కాంతలకు నెల్ల మేల్బంతి కలువదంతి
మేటిరతులకు సురతాణి మించుబోణి
దాని కెనయైనచాన జగానఁ గాన.

50


క.

తారల గెలుచును నఖరుచిఁ
దారలతరళాక్షి రూపతారుణ్యములం
దారం జేయును మనసిజు
దారం జిగి మోవి పంచదారన్ గేరున్.

51


శా.

ఆమోమందము నాకనుంగవబెడం గామోవిసింగార మా
గోముంజన్గవగబ్బి యాగొనబునిగ్గు ల్మీఱునూఁగారుసౌ
రామించుందొడజగ్గు లానడలయొయ్యారంబు లయ్యారె! యా
భామారత్నముఁ జూచి చూడవలెనా పద్మాక్షి నిం కొక్కతెన్!

52

సీ.

ఘనవేణివేణిశృంగార మారసినంత
        మోహాంధకారంబు ముమ్మరించె
హరిమధ్యమధ్యవైఖరి స్మరించినయంతఁ
        బ్రకటధైర్యము బట్టబయటఁబడియె
వతనాభినాభిసౌందర్య మెంచినయంతఁ
        బలువివేకము సుడిఁబడఁ దొడంగె
మృగనేత్రనేతలక్ష్మిని గణించినయంత
        నెదలోనఁ జాంచల్య మిరవుకొనియెఁ


గీ.

బాటలాధరయధరంబునీటుఁ దలఁచి
నంత ననురాగమంతయు నలవి మీఱె
నింతి మైనిగ్గు లపుడు విశ్రాంతిహేతు
లిపు డతిశ్రాంతిహేతు లే నెటుల సైతు.

53


సీ.

జగజంపువగకెంపుజగడంపుటలుకచేఁ
        దొగ రైన కేన్గావిచిగురుదాని
యలజక్కువలఁ గ్రక్కదలఁ ద్రొక్క గమకించు
        బిగువు మీజినకుచయుగము దాని
సవరంపుబవరంపుసవరంపునటనచేఁ
        గుటిలవృత్తి వహించుకురులదాని
సరి యెన్న విరిపొన్న సరిగొన్నగరిమచే
        గంభీర మగునాభిఁ గాంచుదాని


గీ.

మారుశంఖంబు గెలువ ముమ్మాఱు బద్ధ
కంకణం బైనయట్లు రేఖాత్రయంబు
పొలుచుకంఠంబు గలదానిపొందు మాని
మోహవార్థికి లోనైతి మోసపోతి.

54


సీ.

ఏదిక్కుఁ జూచిన నెలదేఁటిదునెదారు
        లేజాడఁ జన్న నంభోజవనము
లేచాయ మెలఁగినఁ బూచినదీనియ
        లేకడ నుండినఁ గోకవితతు
లేత్రోవ నిలిచిన నెలపొన్నశృంగార
        మేమూల కేఁగిన నిగురుటాకు

లేవంక కొదిగినఁ దావిమొగ్గలగుంపు
        నేదెస డాసిన జాదివువ్వు


గీ.

లదరు పుట్టించుచున్న వాయతివకురులు
నయనములు కేలు కుచములు నాభి చరణ
ములు నఖమ్ములు మైతావి తెలియఁజేయు
నట్టి వయ్యెను బా గాయె నతనుమాయ.

55


ఉ.

చక్కదనాల కేమి రుచి సంపద చిత్తరుబొమ్మయు న్గడున
జక్కన గాదె యంత నెఱజాణతనం బొకచోటఁ గానఁగా
మక్కువ లోకమందె నహి మాటలపోఁడిమి దానికే తగున్
దక్కినభామినీమణులు దానిశతాంశముఁ బోల నేర్తురే.

56


సీ.

నునుఁబంట నామోవి నొక్కి చక్కనిసామి!,
        నొచ్చెనో యనుచు నానుచును జొక్కు
నమర వింతగఁ బల్కు మనుచుఁ జెక్కిలి గొట్టి,
        కందెనో యనుచుఁ జన్గవను జేర్చు
సందీక కౌఁగిటియందుఁ జేర్చి చెమర్చె,
        నో యని పైఁటచే నొనర విసరుఁ
దడవుగాఁ బడ కిచ్చి బడలితివో యంచు
        నయముగాఁ గైకొని బయల లాఁగు


గీ.

నట్టిచెలిఁ బాసి తలపోసి యలసి గాసిఁ
దాల్మి నెడఁజేసి వెత డాసి తనువు రోసి
తల్లడింపఁగ నాయె హా! దైవమాయ
యేది గతి చేర విరహాబ్ధి కేది మేర.

57


చ.

సరసనయానుభావమునఁ జక్కనిచక్కెరబొమ్మలాగుగా
దొరకె నటంచు నమ్మితిని దోడన యింటిమగం డసూయఁ బ
ల్గొఱుకుచు వచ్చె గందపొడిలోపలఁ బూరుగు? వట్టినట్టు లి
దటి కొకసౌఖ్య మబ్బినను దైవముకంటికిఁ గంటగించెనో.

58


సీ.

బటువుగుబ్బల నొత్తి పక్కకు హత్తి నా
        హౌను చెల్లించినయందగత్తె
కొనగోరు నాటించి కూర్మి పాటించి నా
        తమకంబుఁ గెరలించుతలిరుఁబోఁడి

వాతెఱపా లిచ్చి వగలఁ దేలించి నా
        వలపు లీడేర్చినవన్నెలాఁడి
పావురావగఁ బల్కి పైకొనికుల్కి నా
        ముచ్చట ల్సమకూర్పు ముద్దుగుమ్మ


గీ.

మక్కువ నెసంగి కొఱికినమడు పొసంగి
గారవించినకొమ్మ బంగారుబొమ్మ
ననవిలుతువిద్యలకు నొజ్జ నాదుపజ్జ
కెన్నటికిఁ జేరు నావంత లెపుడు దీఱు.

59


చ.

తలిరులు కూర్మము ల్దొనలు దర్పకునద్ద మనంటికంబము
ల్పులినము నంబరంబు [2]సుడి పొందగుడుం దరఁగ ల్భుజంగము
ల్పలుపు నరు ల్లత ల్దరము పద్మము తుమ్మెదగుంపు గూర్చినక్
గలికి యనంగ నౌ నయినఁ గల్గునె తాదృశలీల సాటికిన్.

60


చ.

మకరపుడాలువానివిషమంపురణంబున లోలనేత్ర తా
రకలు మెఱుంగు లీన నవరత్నపుఁబాప బొట్టు మోమునన్
దకపికలాడ నాచెలువు ధన్యత నొందఁగఁ జిత్రభంగులన్
ముకుళితతానము ల్పలుకుముద్దులగుమ్మను జూచు టెన్నఁడో.

61


చ.

ఎసఁగిననెయ్యపుంగినుక నెంతయు మోడి ముసుంగు వెట్టి యా
కుసుమసుగంధి యున్నపుడు కొంకుచు నే జెయి దాఁచ నిద్రచేఁ
గసరినయట్లు మత్కరము గబ్బిచనుంగవపైకి దార్చి మై
నుసులుచు నీవి జార్చిన మనోహరలీలల నెన్న శక్యమే.

62


చ.

మలయజగంధి దా శిరసు మజ్జనమై తెలివల్వ యొంటికొం
గెలమి ధరించి ఱైక ధరియింపకయే కురులార్చుచున్న నే
నలమిని గౌఁగిలించుకొన నాహరిమధ్య యనంగసంగరా
కలనఁ బెనంగినట్టిరతికౌశలము న్మదిలోఁ దలంచెదన్.

63


చ.

పులుగులకబ్బలో కనకపుంజిగిదిబ్బలొ దానిగుబ్బలో
వలపులదీవియో సుధలబావియొ దానిమెఱుంగుమోవియో
కలువలబంతియో కుసుమకార్ముకదంతియొ కాక యింతియో
యలవియె దానియందము శివా! తలఁప న్దెలుప న్నుతింపఁగన్.

64

చ.

ఒకతొడ సందిట న్జొనిపి యొక్కతొడ న్వెలిఁ జేసి యొక్కచే
రక మగుగుబ్బచ న్నొకకరంబునఁ బెన్నరిగొప్పుఁ బట్టి త
త్తకతకతాళమానముల దారిగఁ గూడెడునన్నుఁ జూచుచున్
బకపక నవ్వు నావలపుబంగరుబొమ్మను జూచు టెన్నఁడో.

65


సీ.

వెనుదీయకు మటంచు వెడవిల్తుఁ డాడించు
        జంత్రిపోలిక కీలుజడ నటింప
స్మరసంగరంబునఁ గురియుపువ్వులవాన
        క్రమమున సరులముత్యములు రాల
మరుఁ డనుజెగజెట్టి బిరుదుఢక్కికమాడ్కి
        గళరవంబులఘుమత్కార మెసఁగ
చిత్తజురాజ్యాభిషేకాంబువులభంగిఁ
        దొడరిన చెమటబిందువులు చెలఁగ


గీ.

మదనవరదేవతాధ్యానమహితనిష్ఠఁ
బోలి యఱమోడ్పుకనుదోయి పొలుపు మిగుల
మగసొగసుఁ జూపె నాయింతి మరునిదంతి
పగడసాలను గెల్చినపంతమునను.

66


శా.

ఏమా టాడిన జాళువారు నమృతం బేయంగ మీక్షించినన్
హేమంపుందళుకు ల్తళుక్కను బలే యేదిక్కు ముద్దాడినన్
ఏమో చక్కెరలప్ప లంటినటు లౌ నెచ్చోట చే సాఁచినం
బ్రేమం బెన్నిధి యబ్బిన ట్లగు నయారే! యా యొయారే తగున్.

67


సీ.

కళుకుబంగరుచాయ గాజు లల్లన మ్రోయఁ,
        గులికి పక్కకు హత్తి కొంతసేపు
తనివి దీరక పేర్చి తనపైకి ననుఁ దార్చి,
        వంతుగా సమరతిఁ గొంతసేపు
అది చాల కెదురెక్కి యనురాగమున మ్రొక్కి,
        వింతహత్తింపులఁ గొంతసేపు
కసి దీఱ కటు లేచి గ్రక్కునఁ దమి రేఁచి,
        కుఱుచగోరింపులఁ గొంతసేపు


గీ.

గొనబుకోకిలరవములఁ గొంతసేపు
కొసరువగ గుల్కుపల్కులఁ గొంతసేపు

కరఁగి కరఁగించు వలపులఁ గలసి మెలసి
సొలసి సొలయించు నాతి నే చూడనైతి.

68


చ.

తలఁపఁ గులాంగనారతి సుతప్రద మేమిసుఖంబు వేశ్యతోఁ
గలయుట ద్రవ్యహానికిని గారణ మింతియె సందుగొందియిం
తులయెడపొందు లన్న నతిదూష్య మగు న్బహుయత్నలభ్యతన్
దలగొనునన్యభామలరతంబె రతంబు జగన్నుతంబుగన్.

69


చ.

గరగరి కైనదై నెనరు గల్గినదై నెఱనీటుకత్తెయై
పరువపునిండుజవ్వనపుబాగరి నాగరికంపుఁబ్రోడయై
మురుపగునవ్వుమోముదయి ముద్దులగుమ్మయి ముచ్చటైనదై
సురతకళాప్రవీణ యగుసుందరి యందఱికిన్ లభించునే.

70


గీ.

జాఱుకొప్పును నగుమోము చలువచీర
మెఱుఁగుఁగమ్మలు జిగిమోవి మెఱయునింతి
కన్నులను దోఁచుచున్నది గాని చేతి
కబ్బ దద్దంబులోఁ దోఁచులిబ్బిపగిది.

71


చ.

జిలిబిలిచెమ్మట ల్దొలుకుచెక్కులు ముద్దులమోవినొక్కులున్
సొలపులకన్నుదోయి యరసొక్కులు వీడకు మన్న మ్రొక్కులున్
బెళుకులపావురాపలుకుపెక్కులు మైసిరి వింతటెక్కులున్
గలిగిన నీరతంబు లిఁకఁ గందునె యిందునిభాననామణీ!

72


శా.

ఔనే ముద్దులగుమ్మ! కుల్కి తవునే యందంపుఁ బూరెమ్మ హౌ
సౌనే చక్కదనాలయిక్క! యిది యౌ యబ్జాస్త్రుచేఢక్క! మే
లే నీలాలక! యంచు నే బొగడ నెంతేవింత పుంభావకే
ళీనాట్యంబున నన్ను నేలినవగ ల్నే నెంతు కాంతామణీ!


చ.

కలఁగినకొప్పుతోఁ జిటిలుగంధముతో విడఁబడ్డఱైకతో
కలిరులవిల్తుపాళె మొకతట్టు తళుక్కనుకట్టుఁగొంగుతో
సొలపులకన్నుల న్నిదురసొక్కులతో విరిపాన్పు డిగ్గి నీ
వెలమిని వచ్చుఠీవి మది నెన్నుదు నోమదహంసగామినీ!

74


ఉ.

పంత మి దేలనే పెదవిపానక మానక తాళఁజాలనే
యెంతటిదిట్టవే కసర కిప్పుడు నాకొకముద్దుఁ బెట్టవే
వంతల నేఁచకే మరుదివాణముఁ జూతు నటన్న దాఁచకే
యింతులమేటి! యింతచల మేటికిఁ జీటికి మాటిమాటికిన్.

75

చ.

ఒకచరణంబున న్నిలిచి యొక్కపదంబు ముడించి హొన్నుడా
ల్చికిలిమెఱుంగుగాజులు ఘలీలనఁ జేతులు నాదుమూపునన్
రకముగ వైచి గుబ్బల నురస్స్థలిం గ్రుమ్మెడినీదుమేలుపొం
దికలసుఖోన్నతిన్ బొగడ నీరజగర్భున కైన శక్యమే.

76


చ.

అరిదికడానిబొమ్మ మన మందపుటద్దపుటింటిలోపలన్
సరసత మీఱఁ బెందొడలసందులపొందుల మోవివిందులం
బెరిమె చెలంగి కూడి ప్రతిబింబములం గనుపట్టినట్టియా
గుఱుతులు వేడ్క నొండొరులకున్ గనిపింపఁగ నుండు టెన్నఁడో!

77


చ.

చిలుకలకొల్కి చిత్తజునిచిల్కలముల్కులకల్కి మోహ మిం
పెలయఁగ నేను రాఁగఁ గడ కేఁగి తటుండు మటంచు వంచనం
బలికిన గుండె జల్లు మన మ్రాన్పడి యుస్సురు మంచు నే నిలం
గలకల నవ్వి తోన ననుఁ గౌఁగిటఁ జేర్పవటే విలాసినీ!

78


చ.

పెనిమిటివెన్క నిల్చి ననుఁ బిత్తరిచూపుల నీవు చూడ నే
మునుకొని ముద్దుఁ బెట్టుటకు మో మటు లొగ్గఁగ నీవు వేళ గా
దని తల యూఁచి నే నలుగ నందుకుఁ గన్ను ల నీవు మ్రొక్క నే
నిను మదిఁ గౌఁగిటం బొదువ నీ వఱగన్నులు మోడ్పవా చెలీ!

79


ఉ.

నింతువు నాదుకోర్కి గమనింతువు కేళి కహర్నిశంబు నా
నింతువు ఱొమ్ము గుబ్బలఁ దనింతువు పౌరుషకేళిచేతఁ బూ
నింతువు తోనె కేళికి గణింతువు నాదుగుణంబు లెల్లెడన్
గాంతలలోన నీకు సరి గాన జగాన నగానతస్తనీ!

80


సీ.

చనుగుబ్బ పెనుగొండసంస్థాన మమరించి,
        తెలిచూపు వెలితామరల ఘటించి
పయ్యెదచెంగావిపావడ హవణించి,
        ముఖపుండరీక మింపునఁ గదించి
యారోహరత్నసింహాసనంబున నుంచి,
        కటిచక్రమును హస్తగతము చేసి
పావురావగముద్దుపటహంబు మొరయించి,
        కలయంగసంపదఁ గానిపించి


గీ.

మిసిమిపొక్కిలిమూలబొక్కస మొసంగె
తొగరుచిగురాకువిలుకానినగ రమర్చి

గరిమ వలరాయపట్టంబు గట్టి నన్ను
గరుణతో నేలుకొమ్మ బంగారుబొమ్మ!

81


చ.

విరహదవానలంబునను వేఁగుచు నన్న మటంచు నిద్రయం
చెఱుఁగక నేను జాలిఁ బడ నేమని పల్క విదేమి యల్క నీ
సరసతఁ గంటి నీబిగువుచన్నులకైవడి నీదు చిత్తమున్
హరిహరి! యింత యేల కఠినత్వముఁ బూనెదు మానినీమణీ!

82


సీ.

కలికి! నీసొగ సెల్లఁ గలయఁ గన్గొనువేళఁ,
        గనుఱెప్పపాటు విఘ్నముగ నెంతు
నతివ! నీతో మాటలాడ నిల్చినయట్టి,
        నిమిషంబు నొకవత్సరముగ నెంతుఁ
జెలి! నీవు రతికేళి నలసి నిద్రించునా,
        గడియసేపు యుగంబు గాఁగ నెంతు
మగువ! నీదుచెఱుంగు మాసినమూన్నాళ్లు,
        కల్పకోటిశతంబుగా గణింతు


గీ.

నెమ్మిగలవాఁడ నీకు మే నమ్మినాఁడ
లాఁతిగాఁ జూతువా నన్ను లలన! నిన్ను
గౌఁగిలింపక మాన నా కన్ను లాన
నిలిచి మాటాడవే బాల! చల మిదేల.

83


సీ.

పల్కవే నునుఁదేనె చిల్కవే మారురా
        చిల్క వేడుకపల్కు తళ్కు దీర
నిలువవే యొకసారి కలువవే వెడవిల్తు
        కలువవేఁడిశరంబు కలఁచెఁ దాల్మి
చూడవే కన్నెత్తి వీడవే మోడి నీ
        వీడ వే రావె నీవాఁడ నేను
దియ్యవే చెంత సందియ్యవే మడుపు లం,
        దియ్యవే బళి కంతుకయ్యమునను


గీ.

గలికి! రాయంచబోధల కలికి యులికి
యులికి వలమానపవమానగళితమాన
దళితమానసలీల నేఁ దాళఁజాల
జాల మిది యేల లోలవిశాలనయన!

84

సీ.

జిలిబిలిగాడ్పులచేఁ దాళఁజాల నీ
        ఘననాభిగుహచెంత గదియ నీవె
మోహాంబురాశిలో మునిఁగెద నిపుడ నీ,
        పృథునితంబద్వీప మెనయ నీవె
యామనిబలుతాప మానంగలేను నీ
        యధరసుధాధార నాన నీవె
చిగురాకుకార్చిచ్చు సెగ లెగయించె నీ
        నెరులమబ్బులచాయ నిలువ నీవె


గీ.

మారభూతంబు బల్వెత ల్మీటె నీదు
విశదగళరవమంత్రము ల్వినఁగ నీవె
కొమ్మ! నిను నాఁటనుండియు నమ్మినాఁడ
జాల మిఁక నేల నేఁ దాళఁజాల బాల!

85


సీ.

ఎలదేఁటిగమిమేటి యెలగోలుమూకల
        నెల్ల ముస్తీబుగా నెచ్చరించి
నలువంక గొరువంక బలితంపుఁదోఁటల
        నెల్లను వేర్వేఱ నేర్పరించి
రహి మించు వహి నించు రాయంచగమి యాస్తి
        కైజీతముల నెల్ల గణుతిఁ బెట్టి
నునుమావు లను మావు లెనసినకోయిల
        సరదార్ల కెల్లను సారిఁ చెప్పి


గీ.

యదిగొ వలరాజు దనపౌఁజు నదనుఁ జేసి
వెడలి వేయించెఁ బూపొదవెలిగుడారు
నింక నేఁ దాళ ననుఁ బ్రోవ నిదియ వేళ
యేలనే మోడి యయ్యయో యెమ్మెలాడి!

86


క.

అని తా వనితామణికై
జనితార్తినితాంతవిరహిజనతాఘనతా
పనిదానం బగుమదనుఁడు
ననవిల్లును దాను దోఁచినవితం బయినన్.

87


శా.

ఏరా మారుఁడ! తల్లివంక యని నీ కెంతేనియున్ లేదు గా
రారాపు ల్ననుఁ జేయ నాయ మగునా రాజత్కృపాశాలియౌ

శ్రీరామాహృదయేశుఁ డాఘనున కేరీతిన్ దగన్ బుట్టితో
క్షీరాంభోనిధికిన్ హలాహలముమాడ్కిన్ పాంథవిధ్వంసకా!

88


చ.

బలిమి వియోగవర్గముల బాధలఁ బెట్టెడు నిర్ధయాత్మ! నీ
దళములు చెట్లపా లయి శతాంగ మరూపకమై శిలీముఖం
బులు కడువాఁడి హేయమయి పూనినయిక్షుశరాసనంబు ని
ష్ఫలమయి పోయినం గద శుభం బగు ధారుణి కెల్ల మన్మథా!

89


గీ.

శివుఁడు నిను జీవమాత్రావశిష్టుఁ జేసె
నన్నఁ గడముట్టఁ దునుమ క ట్లగుటఁ గాదె
తనువు సగమైన భంగంబు తడఁబడంగ
జంగమై పోయె శత్రుశేషంబు దగునె.

90


ఉ.

మత్తతవిప్రయోగిజనమర్దనుఁ డైనప్రసూనధన్వికిన్
గత్తు లొసంగినట్టిజనఘాతుకమాధవనామధేయ మ
త్యుత్తమ మేగతిం గలిగెనో గద నీకు సుధాఖ్యగారకున్
హత్తినలీల రక్కసున కంచితపుణ్యజనాఖ్యయుం బలెన్.

91


గీ.

మధుపగుణశాలితో మైత్రి మహి నొనర్చి
పైకముల గూర్చి పంచమభంగి పేర్చి
రంతు లిడియెదు జాతి రవంత యెన్న
నుచితగతి లేదు కాసంత యోవసంత!

92


ఉ.

బాపురె పాంథభంజన! ప్రభంజన! యామ్యదిగంతరంబునం
గాపుర మీవు సల్పుటలు కాలునికిన్ జనపీడనంబు లం
కాపురి నుండుదైత్యులకుఁ గర్కశభావము చందనాద్రిశృం
గోపరిపన్నగావళికి నుగ్రత నేర్పును గాదె నిచ్చలున్.

93


చ.

ఇల సుమనోగుణంబు విరియించెదు ప్రాణ మటంచు నెంచు మ
మ్మలయఁగఁ జేసె దౌర మలయానిల! యెంతటిమాంద్య మెంతపాం
సులగతి గర్భమందె బలసూదనుఁ డాగతి మట్టుఁబెట్టఁగా
నిలిచె జగంబు కానియెడ నింగియు నేలయు నాక్రమింపదే.

94


క.

అవునా ప్రేరేప మనో
భవు నాపై కలితతామ్రపర్ణీసదనో
పవనా! పధికోత్సవనా
పవనాపవనాధిచలదుపవనా! పవనా!

95

సీ.

పొదలపై మెదలుతుమ్మెదలార! మీఢాక
        చెలికటాక్ష మొకింత కలుగుదాక
గములుగాఁ దెమలుకీరములార! మీజోక
        హరిమధ్య చేరి మాట్లాడుదాఁక
వగలచే బొగలుసంపెఁగలార! మీకాక
        మృగనేత్ర యంగీకరించుదాఁక
సిరులచే వఱలుతామరలార! మీవీఁక
        శుకవాణి మొగ మెత్తి చూచుదాఁక


గీ.

నవము నవముగ మెఱయుపల్లవములార!
ప్రబలుమీరేఖ కాంత చేపట్టుదాఁక
తగదు చల మిఁక దైవ మేదారి నైన
తలఁపు లీడేర్పఁగా నేర్చుఁ దరుణిఁ గూర్చు.

96


వ.

అని యివ్విధంబునం బలుకుచు నళిపికశుకనికరకలకలంబున కలుకుచు నధైర్యంబునం దలఁకుచు నరిమురి యరిమి కరకరికఱకుచెఱకువిలుతుం డొర వెఱికి కఱుకు కఱుక్కున నఱకుచిగురాకుబాకుతాఁకుచకచకలకుఁ జకితాయమానమానసుండై పొగలుచు దగదగ మని రగులునెఱగలిపగిది రగులుకొనుదిగులు సెగల మిగుల నొగలుదు రాకేందువదన యవలోకంబు లేమిం జేసి లోకంబు నిరాలోకంబుగ నెంచుచు నమ్మించుఁబోణి తనయెడం జేసినవినోదంబులు సారెసారెకుం దలంచుచు నచ్చిగురుఁబోణిం గూర్చి యెడఁబాపిన దైవంబు కుటిలనటనకు వెఱగందుచుఁ గుందరదన తనుఁ బాసినఖేదంబున నేమి పాటుపడునో యని కుందుచు నొప్పులకుప్ప నెప్పుడు గనుగొందునో యనుకోర్కులఁ దెప్పలం దేలుచు నంతకంతకు దురంతం బగుకంతుసంతాపంబునం దూలుచుఁ గ్రమ్మర నమ్మరాళగామినిం జెందునుపాయంబుఁ గానక శరీరధారణంబునం దేమియు నాసఁ బూనక బెట్టునిట్టూర్పుగాడ్పుల నధరపల్లవంబు బీటలువాఱ సంజాతకార్శ్యంబున ముంజేతికంకణంబులు జాఱ నానంగరాని వియోగసాగరంబు చుట్టుగొనెనో యనుతెఱంగున బొంగినకన్నీరు కెలఁకులం దొలంకులుగా నిగుడ సైపరానితాపంబున డం బైనయాణిముత్యంబులసరంబు లింద్రనీలవిసరంబులం దెగడ నెం దలుకు

డైన నిందుముఖి వచ్చె నని దిగ్గున లేచి బిగ్గనం బయలు కౌఁగిలించి కానక సిగ్గునం దలవంచుచు నిప్పు డమ్ముద్దుగుమ్మ నన్ను రమ్మని కమ్మఁబంపినం గదా తనతపంబు ఫలియించు నని యెందుచు యమ్మీనలోచనాధీనమానసుండై యుండునవసరంబున.

97


చ.

శిరమున కెంజెడ ల్నుదుటఁ జెన్నగుబిత్తరిబొట్టు వాతెఱన్
సరసపువీడెపుంగఱలు చన్గవపై రుదురాకపేరులున్
గరమున నాగబెత్తమును గాత్రమున న్నునుబూది యొప్పఁగా
నరుదుగ జోగురా లొకతె యచ్చటికిం జనుదెంచెఁ గ్రక్కునన్.

98


క.

అరుదెంచినయవ్వనితన్
బరిసరమునఁ గాంచి వినయభరితమృదూక్తిన్
దరుణీ! యెందుం డెందుల
కరిగెద వెందుండుదాన వని యడుగుటయున్.

99


క.

కాశీపురమున వాసం
బే సలుపుదు నమరగురునిగృహమున నంతే
వాసి వయి యుండుతఱి ని
న్నే సతతముఁ జూతు నన్ను నీ వెఱుఁగవొకో.

100


చ.

అతులితరూప! నే నలబృహస్పతియింటికిఁ బోయినట్టిచో
నతనివిలాసినీమణి రహస్యముగా ననుఁ బిల్చి నీదుసం
గతియు వియోగముం దెలిపి గ్రక్కున నెక్కడ నున్ననాఁడొ యే
వితమున నేనియు న్వెదకి వేగమె రమ్మని పంచెఁ బంచినన్.

101


క.

వెదకం బోయినతీఁగెయ
పదములఁ దగిలినవితంబు పాటింపఁగ ని
న్నెదుటనె కనుఁగొంటిని స
మ్మదమున హరిణాంక! వినుము మానినివెతలన్.

102


ఉ.

ఎంతని విన్నవింతు రజనీశ! రతీశదురంతచింతచేఁ
దాంతి వహించునీదువనితామణికిన్ దృటి యొక్కదివ్యవ
ర్షాంతరమై క్షణం బొకయుగాంతరమై నిమిషంబు బ్రహ్మక
ల్పాంతర మయ్యె నెన్న మఱి యవ్వలిమట్టు వచింప శక్యమే.

103


క.

పులకపయిరు చనుమిట్టలు
మొలక లెగయ మెఱుగు లెసఁగుబొమవిలు చెలఁగన్

జలము గురియు చెలికనుగవ
జలదము లనఁదగును గాక జలకము లగునే?

104


ఉ.

నేర్పుమెయిం బటంబునను నిన్ను లిఖించు లిఖించి రెప్ప ల
ల్లార్పక చూచుఁ జూచి తనయక్కునఁ జేర్చును జేర్చి సంతసం
బేర్పడ సొక్కు సొక్కి తనహృద్గతతాపము నిన్ను సోకునం
చూర్పులు నించుచు న్నెలఁత యున్నది కన్నది విన్నవించితిన్.

105


ఉ.

ముద్దియమోహ మెంతటిదొ మోహనరూపవిలాస! వింటె యే
సుద్ధుల నొల్ల దెవ్వరినిఁ జూడఁగ నొల్లదు సొమ్ము లొల్ల దే
ప్రొద్దు విడెంబు చల్వలును భోజన మొల్లదు నిద్ర యొల్ల దీ
కొద్దికి పచ్చవిల్తునిలకోరుల నేమగుచున్నదో కదా!

106


గీ.

దేశముల లేనిపెక్కుసందేశములను
నొడివె నని తెల్పఁగా నిందు తడవు పట్టు
నింటిచెంగటిపూఁబొదరింటి కిపుడె
నిన్ను రమ్మన్న దనవు డానీరజారి.

107


ఉ.

తాపముఁ దీరె నామది సుధామధురోక్తులు నీవుఁ దెల్పఁగా
తాపసి! యీ మహెూపకృతి ధారుణిఁ జేసెడువార లెవ్వరున్
మాపటివేళ వచ్చెదను మల్లియపూఁబొదరిల్లుఁ జేర నీ
వాపరమాణుమధ్యకు మదాగమనం బెఱిఁగింప నేఁగుమా.

108


క.

అని దానిఁ బంచి దట్టియు
ఘనమగు కాసెయును గట్టి కట్టాయిత మై
వనజారి యుండుతమి గని
యనుగుణముగఁ దమి ఘటించె నన రవి వ్రాలెన్.

109


మ.

ప్రతిజన్మంబు సుమంగలీత్వగరిమన్ బ్రాపింప నింద్రాణి సు
వ్రతచర్య న్వరుణానికిన్ రవి హరిద్రాచూర్ణరాశి న్నభ
స్తతశూర్పంబున వాయసం బొసఁగఁ బ్రత్యక్సింధువీచీపటా
వృతి యొప్ప న్గొని చల్లునక్షతలు నాఁ బెంపొందె దారౌఘముల్.

110


క.

చరమగిరి నెక్కి పశ్చిమ
శరధిం దననీడఁ జూచి శత్రుహరేచ్ఛన్
హరి దుముకన్ నిర్భయతన్
దిరిగెడుకరిఘటలొ నాఁగఁ దిమిరము లెసఁగన్.

111

మ.

సమిదుల్లాసి ధనంజయుండు పటుతేజస్స్ఫూర్తియై యుండి తా
సమయం బౌటయు హేతిసంగ్రహవిరాజన్మూర్తియై భూరిభీ
ష్మమహుం డౌకురుచక్రనేత యసదై జాఱన్ దదీయాంశకౌ
ఘముఁ దోడ్తోగొనె మాత్స్యమౌళి కెలమిన్ గల్గెన్ ముదంబయ్యెడన్.

112


మ.

నటనోద్ధూతగిరీశనూపురమున న్వ్రాలెన్ దినేంద్రుండు త
చ్చటులాతామ్రజటాచయప్రభ లనన్ సంధ్యారుచు ల్పర్వెఁ ద
త్పటుజూటీనటదాపగాంబుకణికాభన్ దారక ల్మీఱెఁ ద
త్కటినిర్ముక్తగజేంద్రచర్మ మనఁ జీఁక ట్లొప్పె నంతంతటన్.

113


సీ.

జలజాప్తజాతీరతులసీవనవిహార
        పటుమురారిమయూరబర్హరుచులు
అంజనాద్రినితంబకుంజరనికురుంబ
        కటదానరోలంబపటలఘృణులు
శైలకన్యోత్సంగచరదంతివక్త్రాంగ
        కలితనీలభుజంగగరళనిభలు
సాగరాంతస్సీమచారిదైత్యస్తోమ
        శూలమేచకచామరాళిసుషమ


గీ.

లేకముగఁ గ్రమ్ముకైవడిఁ గాకనికర
కంబళకదంబకాదంబసాంబకంఠ
జాంబవద్బలజంబూఫలాంబుదౌఘ
డంబరము లైనయంధకారంబు లెసఁగె.

114


క.

అప్పుడు సంకేతిత మగు
నప్పూపొదఁ జేరి సాహసైకసహాయం
బొప్పఁ జెలి వచ్చుమార్గము
రెప్ప యిడక చూచుచుండె రేరాజు తమిన్.

115


గీ.

అంత నాజోగిజవరాలు మంతనమునఁ
బోయివచ్చినక్రమ మెల్ల బొలఁతి కెఱుఁగఁ
జెప్ప నదియును మది మోహ ముప్పతిల్ల
బహుమతు లొనర్చి సాహసపటిమఁ జేర్చి.

116


మ.

గృహకృత్యంబులు వేగ తీర్చి నిజసంకేతస్థలీసీమకున్
బహుమార్గంబు లమర్చి రాత్రిగడియ ల్బల్మాఱునున్ లెక్కగూ

ర్చి హితోక్తిం గడుప్రొద్దు వోయె ననుచున్ శిష్యావళిం బంచి యా
మహిళారత్నము వేడ్కభర్త భుజియింపం దా కృతాహారియై.

117


చ.

కపటయుతాంతరంగమున గ్రక్కున ముందఱిజాముకూటమిన్
స్వపతిని నిద్రఁబుచ్చి తనపై నతఁ డుంచిన కే ల్దెమల్చి పా
నుపుపయి నుంచి లేచి పదనూపురము ల్సడలించి తల్పు నే
రుపు తగఁ బుట్టిగొళ్లెమిడి రూపవతీమణి సంభ్రమంబునన్.

118


సీ.

విప్పుకప్పగుగొప్పకొప్పున విరినల్ల
        కలువలదండలు చెలువు మీఱ
సిబ్బెంపుగబ్బిబల్గుబ్బచన్దవను మీ
        సరము లౌనీలంపుశరము లమర
కళుకుహెందళుకులం గులుకుమైమృగనాభి
        పంకంబు నెఱపూఁత పొంక మలర
మేలుడాల్మీలనే ల్గ్రాలుకన్ను లు సోగ
        కాటుకరేఖలు నీటు మెఱయఁ


గీ.

బొసఁగ కఱవన్నెసాలువు ముసుఁగువెట్టి
చాలసొమ్ములు పూలు బాగాలుఁ గొనుచు
గురునిజవరాలు తమతోటగోడ దాఁటి
శశిఁ గదియ వచ్చె సతు లెంత జంత లౌర!

119


క.

ఆరీతిఁ జేర వచ్చిన
తారాతరలాక్షిఁ గాంచి తారావిభుఁడున్
రా రమ్మని చేరం జని
గారవమున బార సాఁచి కౌఁగిటఁ జేర్చెన్.

120


చ.

అనుగతహారవత్ప్రచుర మాపరిచుంబితదంతవాస మ
త్యనుపమమోహజాతపులకాంకుర మర్ధనిమీలితేక్షణం
బనవరతస్ఫురన్మణిత మత్యనురాగనిరస్తనీవిబం
ధన మగుచుం జెలంగెఁ గడుఁ దద్రతిసౌఖ్యరసాతిభూతియై.

121


ఉ.

మానినిఁ గూడి యిట్టు లసమానసుఖాంగజకేళిఁ దేలి తా
నానలినారి నారిని ప్రియంబునఁ దోడ్కొని వేడ్కతో నిశిన్
బూనిక మీఱఁగా నరిగి పూర్వదిగీశపురాభ మౌప్రతి
స్థానపురి న్వసించె నయశంబునకు భయ మేమి కామికిన్.

122

వ.

అంత.

123


మ.

తొలి దేవేంద్రుఁడు మాకులంబు చొరలేదో మేము నార్మోమురా
యలయంకస్థితిఁ గాంచలేదొ స్వరవిద్య ల్మున్ను మావారిశి
క్షలచేఁ బాణిని నేర్వఁడో యని కులస్థానప్రతిష్ఠల్ త్రిభం
గుల ఘోషించెను నాఁగ గోళ్ళు కలయం గూసెన్ ధరామండలిన్.

124


సీ.

భూరిత్రియామికాభోగిని తొలికొండ
        పుట్టపై నిడిననిర్మోక మనఁగ
ప్రత్యూషవిష్ణునిర్మదితాంధకారాబ్ధి
        రహిఁ దోఁచునవసుధాలహరి యనఁగ
పద్మినీమిత్రుఁడు బ్రహ్మవేషము దాల్చు
        తఱిని బట్టినవెల్లతెర యనంగ
కుముదంబులకుఁ గలక్రొవ్వనుగుగ్గిల
        పొడి యుంచుదీపంబుపుటిక యనఁగ


గీ.

వెలయ వేగురుచుక్కను వెన్నముద్ద
చెంతఁ జూపట్టుకానుమజ్జిగ యనంగ
మ్రుచ్చు వేడుకకత్తెల మోము లెల్ల
వెలవెలను బోవఁ దూర్పునఁ దెలుపు దోఁచె.

125


ఉ.

చుక్కలఱేఁడు తూర్పుదెసజోదు తనుం గురుసంగరార్థమై
యుక్కునఁ దారసిల్లు నని యుక్కళ మంపినరీతి వేగురుం
జుక్క సురేంద్రుదిక్కునను శోభిలెఁ దద్బలశోణ రేణువు
ల్మిక్కుట మయ్యె నాఁగ నటమీఁదఁ జెలంగెఁ బ్రభాతరాగముల్.

126


క.

చీఁకటికాటుకపిట్టలు
కాకుపడన్ భాస్కరుండు కరజాలకము
ల్వీక నిగిడింపఁ దారలు
వ్యాకులతం దారె ఖగము లగుటన్ భీతిన్.

127


సీ.

తేఁటి కాటుకరేక నీటు మీఱఁగఁ దీర్చి
        మిసిమిగాఁ బుప్పొడి పసుపుఁబూసి
తెలితేనెనిగ్గులతిలకంబు సవరించి
        రమణీయపత్త్రాంకురముల నలరి

కమ్మబంగరుచాయ కర్ణిక ల్హవణించి
        హంసకస్ఫూర్తిచే నతిశయించి
యుదయరాగంబు సొం పొదవఁగా ధరియించి
        కంకణంబులు చాల పొంకపఱిచి


గీ.

చెలఁగుతరఁగలపయ్యెదచెఱఁగు జాఱ
చిఱునగవు నెమ్మొగంబునఁ జెంగలింప
పద్మినీకాంత యతులసౌభాగ్యగరిమ
గాంచి పతికన్న మున్న మేల్కాంచి యుండె.

128


చ.

జననయనోపరోధకరశాక్వరగర్వ మడంగఁద్రొక్కి స
న్మునిగణసన్నుతు ల్వెలయ ముఖ్యమహామహనీయమూర్తిచే
నినుఁడు సెలంగఁ బద్మిని యహీనవికాసము నేత్రపద్మము
ల్గనఁ జెలఁగెన్ మరందకణకైతవకౌతుకబాష్పపూరయై.

129


చ.

వనజము లుల్లసిల్లఁ జెలువం బఱి చీఁకటి పెల్లగిల్ల నిం
పునఁ దగునాత్మబింబరుచి పూర్వమహానగముఖ్య మెల్లఁ గాం
చనగతిరీతిఁ జెల్ల రవి చక్కఁగ నెక్కొనెఁ దూర్పుదిక్కునన్
ఘనగతిఁ జీఁకటుల్ మరలి క్రక్కునఁ జేరెను స్త్రీలవేణిలోన్.

130


చ.

తగ సమయావనీవిభుఁడు దాల్చిన పులదాళిబిళ్ళ యన్
పగిదిఁ జెలంగె భాస్కరుఁడు భాసురరశ్ములు భర్మరశ్మలై
నిగిడి కనంగ నయ్యె కడు నింగిని దత్తరుణారుణాతపం
బొగి నలరెం దదీయతను వందినకుంకుమపూఁత కైవడిన్.

131


ఉ.

అంతట దేవమంత్రి మలయాచలకూటపటీరవాటికా
భ్యంతరనిర్గతానిల మహర్ముఖబోధితపద్మసౌరభా
క్రాంతి నెసంగుచున్ బొలయఁ గంతునిగంతుల నిద్ర లేచి తా
నింతిని గౌఁగిటం బొదువ నిట్టటు శయ్యకుఁ జేయి దార్చుచున్.

132


క.

కానక లతికాగాత్రిం
గానక మది జల్లు మనఁగఁ గరము తమి బెడం
గానక మనసిజుఁ డేచం
గా నకటా! యనుచు గృహము కలయఁగ వెదకెన్.

133


చ.

వెదకి వధూమణిం గనమి వేదనఁ జెందు మనంబునందు నీ
బ్రదుకు నిరర్థకం బనుచుఁ బల్మఱు వేసరు బల్కవేటికే

సుదతి యటంచు నుస్సురనుచున్ నలుదిక్కులు సూచి విభ్రమా
సదగతిఁ గంప మందు మదసామజకంపితభూరుహాకృతిన్.

134


మ.

అతఁ డారీతి నిజాంగన న్వెదకి దివ్యజ్ఞానదృష్టి న్నిశా
పతి గావించినకీడుగాఁ దెలిసి హా! పాపాత్మకుం డెంత దు
ష్కృతకర్మంబున కొగ్గె సిగ్గు కులముం జింతింపకే పుంశ్చలీ
స్థితిచే నీబలుజంత యెంత పనిఁజేసె న్నమ్మరా దెవ్వరిన్.

135


క.

ఏ కినిసి శపించిన నిపు
డాకులదూషకుఁడు గ్రుంగు నది యొకహెచ్చా
కోకారిని దండింపఁగఁ
బాకారికిఁ దెలిపి నేఁడ పరిమార్పింతున్.

136


క.

అని నిశ్చయించి మది న
య్యనిమిషదేశికుఁడు దుస్సహాగ్రహమతిచే
ననలునివితమునఁ గనలుచు
ననిలజవము మెఱయ నిలక నటు చని యెదుటన్.

137


క.

గంగం దరంగరవ మెస
గంగం బ్రవహించు నిన్ను గం గనుగొని యే
గంగం బురముల నెల్ల న
గం గలనిర్జరులపురి తగం గనుపట్టెన్.

138


సీ.

ఘనసుధర్మాస్థితుల్ ఘనసుధర్మస్థితు
        లన మహాభోగ మెం దనుభవింతు
రప్పరోజాతంబు లప్సరోజాతంబు,
        లనఁగ హేమాభిఖ్య లమరు నెందు
సురభి మరుత్పాళి సురభి మరుత్పాళి
        నా నెందుఁ జెందు మందారలీల
నాసత్యముఖ్యులు నా సత్యముఖ్యులు
        నా నెందుఁ గాంతు రానందనంబు


గీ.

సమరనాయక మణిలీల నమర నాయ
కమణి శచిమోవిముద్దులు గాంచు నెచట
విష్ణుపదభూషణం బన వెలయు నెద్ది
యట్టి యమరావతీపురి నతఁడు చేరి.

139

గీ.

వింత లేమియుఁ జూడక వివిధరత్న
కీలితము లైనగవనివాకిళ్ళు గడచి
మొగము వంచి వివర్ణుఁడై ముసుఁగు వెట్టి
నగరిపుఁడు నిచ్చ వసియించునగరి కరిగి.

140


సీ.

ఆచార్యు లిదె వచ్చి రనుచు దిగ్గన లేచి
        మోడ్పుకేల్దమ్ముల మ్రొక్కువారు
నతిరయంబున నితఁ డాపద వచ్చిన
        ట్లరుదేరఁ గత మేమొ యనెడువారు
వింతలేమో చాల వినఁబడు నేటికి
        నందు నాతని వెంబడించువారు
నాలిఁ గోల్పడినయ ట్లేలకో యిపు డింత
        యధికదైన్యముఁ జెందె ననెడివారు


గీ.

పరిజనము లెవ్వరును లేక పల్ల కెక్క
కెల్లబిరుదులు వర్జించి యేరితోడ
మాటలాడక పేదబ్రాహ్మణునిరీతి
వచ్చె ననువారు నయి సురల్ రిచ్ఛపడఁగ.

141


సీ.

కరకంకణంబులు గల్లని చెలు లిరు
        కోపులఁ జేరి వీఁచోపు లిడఁగ
వహ్న్యర్కినైరృతివరుణవాయుకుబేర
        శంకరుల్ గదిసి పార్శ్వములఁ గొలువ
సురసార్వభౌమసంగరనిరస్తపులోమ
        బలివిరామ యటంచు బట్లు పొగడ
రంభోర్వశీముఖ్యరమణీలలామము
        ల్పదపాళికోపు లేర్పడ నటింపఁ


గీ.

బాణితలమున భిదురకృపాణి మెఱయ
ననుపమానసుధర్మాసభాంతరమునఁ
బృథులచింతామణీభద్రపీఠమునను
నిండుకొలువుండు నిర్జరనేతఁ గనియె.

142


ఉ.

అగ్గిరిభేది యెంతయు బృహస్పతి దవ్వులఁ గాంచి గద్దియన్
దిగ్గన డిగ్గి దిక్పతులు దేవమునుల్ గరుడోరగాదులు

దగ్గఱ రా నెదుర్కొని, పదంబులకున్ బ్రణమిల్లి, యాత్మలో
నగ్గలమైన భక్తిఁ దగ నర్ఘ్యము పాద్యము నిచ్చి, క్రక్కునన్.

143


క.

కైదండ యొసఁగి, తోడ్కొని
సాదరగతి వచచి, మణిమయాసనమున న
య్యాదిత్యతేజు నునిచి, శు
భోదర్కము గాఁగ సముచితోక్తులఁ బలికెన్.

144


ఆ.

ఓ మహానుభావ! సేమమే మీకు? మీ
మోముఁ జూడఁ జిన్నవోయి యున్న
దేమి కారణంబొ? యేను శిష్యుండనై
యుండ, నింత వంత నొంద నేల?

145


క.

అన విని, యవనతముఖుఁడై
యనిమిషగురుఁ డిట్టు లనియె నమరేంద్రునితో
వినిపింపరానికార్యము
వినిపింపఁగవలసె నైన విను మేర్పఁడగన్.

146


ఉ.

అత్రిమునీంద్రనందనుఁడు, నబ్జభవాంశుఁ డౌ కుముద్వతీ
మిత్రుఁడు, తండ్రిపంపునను మిక్కిలిభక్తిని మమ్ముఁ జేరి, స
చ్ఛాత్రునియట్ల వేదములు శాస్త్రము లన్నియు నేర్చి, ద్రోహియై,
మాత్రధికన్, మదీయసతి, మానితశీలను బట్టె వింటివే?

147


క.

అంతియ కా, దా పాతకి
యెంతయు మది భయము లేక, యే మేమో మ
త్కాంతకు బోధించి, వెసం
జెంతను నే లేని వేళఁ జేకొని యురికెన్.

148


క.

హరిహయుతో గురుఁ డీగతి
హరిణాంకుని కాని నడక లటు దెల్పు తఱిన్
సుర లెల్ల చెవులు మూసుక
‘హరి హరి! యిది యెంత పాప’ మని తమలోనన్.

149


చ.

‘కటకట! యింత పాతకము గన్నది గా’ దనువార, ‘లిప్పు డా
కుటిలుని నాజ్ఞ సేయఁ దగుఁ గొంచక’ యం చనువార, ‘లాపె తా
నెటువలె సమ్మతించె మది నీ పని’ కం చనువార, ‘లింతు లిం
తటి బలు జంతలా!’ యనుచు నాసను వ్రే లిడువార లై రటన్.

150

చ.

అనిమిషనాథుఁ డయ్యెడ మహాగ్రహదుర్గ్రహమానసస్థితిం
గనలుచు భీషణాకృతిని గన్నులు వేయును జేవురింపఁగా
ననె ననలాదిదిక్పతుల నందఱఁ గన్గొని మీరు వింటిరే
చెనటి నిశావిటుం డిపుడు చేసినయాగజగామిచందముల్.

151


శా.

అంభోజాసనుచే వరంబు గొని గర్వాయత్తుఁడై యెవ్వరిన్
సంభావింపక చేసె నాగురుసతీసంగం బతిద్రోహి యై
దంభాచారుని గౌరతల్పగుని మద్బాహాగ్రజాగ్రన్మహా
దంభోళిం దల ద్రవ్వనేసెద నహా! దౌరాత్మ్య మే సైతునే.

152


మహాస్రగ్ధర.

అని దిగ్వేదండశుండాయతపృథులభుజోదగ్రదంభోళి కేలన్
గొని రోదోమండలన్ మిణ్గురులు గుములుగా గుప్పసారించి యుద్య
ద్ఘనశక్తిన్ ద్రిప్పఁ గొండల్ గడగడ వణఁకం గల్పవిశ్రాంతివేళా
జనితామర్షాంతకాలస్మరహరుక్రియనాస్థాని దిగ్గంచు లేవన్.

153


చ.

అనలుఁడు లేచి నిర్జరకులాధిపుఁ జూచి యిదేమి చేవ! నీ
వనికిఁ జనంగ లేచె దిపు డాగ్రహవృత్తిని నింతమాత్రకై
ననుఁ బనిఁ బంపు మాఖలుని నాఘనఘోరకరాళకీలలన్
విను కరఁతున్ సముద్రనవనీతపదంబు యథార్థమై తగన్.

154


మ.

అనిన దండధరుండు చండభుజదండాస్ఫాలనోద్దండని
స్వనదీర్ఘద్రుహిణాండకంపితజగత్సప్తద్వయీదుర్నిరీ
క్షనిదాఘార్కనిభాననభ్రుకుటిదంష్ట్రాభీషణోద్యద్ఘనా
ఘనసంఘోపమకాళికాతనుతమఃక్రాంతాఖిలాశాంతుఁడై!

155


శా.

జంభారాతినిఁ జూచి యిట్టు లను దోషాకారుఁ డౌచంద్రుసం
రంభంబు ల్బహుళోపఘాతముల నారం జేసి యత్యుగ్రతన్
గుంభీపాకము కాలసూత్రము తమఃకూటంబు గాన్పింతు స
న్నంభోజాసనుఁ డిట్టి దుర్మతులఁ బోకార్పంగఁ దాఁ బూన్చుటన్.

156


చ.

అలవరుణుండు భాసురనయావరణుం డనునిర్జరేశ్వరున్
గనుఁగొని సామదానములఁ గానిపను ల్మఱి భేదవృత్తిఁ జే
గొని యొనరింప నౌ నటుల గూడనికార్యము దండయుక్తిచేఁ
గొనకొని దీర్ప నీతికిఁ దగున్ మునుమున్నుగ దండ మర్హమే.

157

ఉ.

సారసగర్భుఁ డాతని కొసంగెను గాండిప మక్షయాస్త్రతూ
ణీరములున్ మనోజవము నిత్యము నైనరథంబు దీధితి
స్ఫారమనోజ్ఞవజ్రకవచంబు నసాధ్యము నౌపురంబు న
వ్వీరు సురాసురావళికి వ్రేల్గొని చూపఁ దరంబె పోరులన్.

158


ఉ.

కావున దూత నొక్కరుని కైరవమిత్రుని చెంత కన్పి త
ద్భావము గాంచి వచ్చుటకుఁ బంపుట యుక్త మతండు సంధి చే
నావనజాక్షి నిచ్చినఁ బ్రియం బగుఁ గాక యెదిర్చె నేని యో
దేవ! భవద్భుజాకులిశతీవ్రత నియ్యకొనంగఁ జేయుమా.

159


చ.

అన విని యట్ల చేయఁ దగు నంచనె నైరృతి కార్య మిందునన్
గొనకొన గోట నౌపనికి గొడ్డలి యేటి కటంచుఁ బల్కె న
య్యనిలుఁడు రాజనీతి యిది యం చనె యక్షవిభుండు మంచిదే
పనుపుఁడు దూతఁ జూత మని బల్కెఁ బురాసురవైరి యయ్యెడన్.

160


క.

అనిన సురేంద్రుఁడు గురుతో
ననఘా! యిటు సేయ మీకు నభిమత మగునే
యని యాతనియనుమతిఁ గై
కొని తా నొక్కరుని బిలిచి కుశలత దోఁపన్.

161


ఉ.

చందురుచెంత కీవు చని సమ్మతిగా నిపుణత్వ మేర్పడం
బొందుగఁ బల్కి సంధి యగుపా ల్పొనరించుక ర మ్మటన్న సం
క్రందనునాజ్ఞ నౌదలను గైకొని వాఁడు విమాన మెక్కి దాఁ
జెందొవవిందుపట్టణము చేరఁగ నేఁగి వియత్పథంబునన్.

162


చ.

సరయత వచ్చి వెల్పటిహజారముచెంత రథంబు డిగ్గి భా
స్వరమణికీలితంబులు విశాలములై తగుకొన్నికక్ష్యము
ల్వరుసఁగ దాఁటి యింతిపురివాకిటిపెద్దలఁ గాంచి వారితో
సురపతిదూత వచ్చె ననుచు న్వివరింపుఁ డటన్న వారలున్.

163


క.

గమికత్తెలతో నపు డా
క్రమ మెఱిఁగింపంగ వారు గ్రక్కునఁ జేతః
ప్రమదప్రదమై యొప్పెడు
ప్రమదవనముఁ జేరి యపుడు ప్రమదం బెసఁగన్.

164


సీ.

పటికంపుసోపానపంక్తి నిజాంశుసం
        ఘటనచేఁ జాలుగాఁ గలిగి మిగులఁ

బొలుపొందుజలసూత్రములు పన్ని రనురీతి
        జలజల ప్రవహించుజలములందుఁ
గలిగిన నెత్తావికలువలగములలో
        వలగొనునంచతొయ్యలుల నళుల
లలిత మైనట్టికేళాకూళిఁ జుట్టి పె
        ల్లల్లినద్రాక్షపందిళ్లచెంత


గీ.

పొదలునరవిరిమల్లెపూఁబొదలక్రేవ
వాటమై పాఱు తేటపన్నీటికాల్వ
మిసిమిసన్నపుటిసుకపై నెసఁగుచల్వ
గలువ పాన్పున నెలఱాతిపలకయందు.

165


సీ.

జోడు కట్టిన గెల్తు సుదతిరో! నిను లీల
        పైజోడుఁ గూడిన ప్రతిన దగునె
సారె పండఁగ మేలు సమకూరు మాకింత
        కాయక పండు టేకరణిఁ గలుగు
నిమ్మెయిఁ గుంకుమ యిదె యంటె వాల్గంటి
        పెనఁగెద నలుపులవిడువ నేను
మేలుగ సతమాయె మీఱి పోఁజూడకు
        కొసరక ముందుగాఁ గూడి వత్తు


గీ.

ననుచు నర్మోక్తిచాతుర్య మమర నపుడు
కవఱవలు రత్నకంకణరవ మెసంగ
పందెములు గోరి వైచుచు పగడసాలఁ
దారతో నాడుహరిణాంకుఁ జేరి మ్రొక్కి.

166


గీ.

దేవ! యవధారు వాకిట దివిజనాథు
దూత చనుదెంచి యిపుడు మీతోడ వార్త
లాడవలె నని యున్నవాఁ డనినఁ గొంత
దడవు చింతించి మది ధీరతను వహించి.

167


క.

చిఱున వ్వొలయఁగఁ దారా
తరుణీమణి నచట నునిచి తగ జిగి మిగులన్
మెఱయురతనంపుఁబావలు
విరిబోణియ యొకతె దొడుగ వేడుక మీఱన్.

168

ఉ.

నెమ్మి మిటారిమై పసుపునిగ్గులదుప్పటివల్లెవాటుతో
గొమ్మమెఱుంగుచన్నుగవ గుత్తపుగుప్పుటురంబునీటుతో
గుమ్మలు వోవ నొక్కచెలి గ్రోలినతేనియ కావిమోవితో
నెమైలు మీఱఁ జంద్రుఁ డొకయింతికరం బవలంబనంబుగన్.

169


సీ.

పగడాలచేవకంబంబులు మగరాల
        నిగరాలకొణిగలు నిద్దమైన
యద్దంపువాకిళ్లనాణిముత్యపుమేలు
        కట్లనీలపుగవాక్షములుఁ గెంపు
టోడుబిళ్లలకప్పు లుదిరిబంగరుబైరి
        టాకులపచ్చలడంబు మీఱు
తిన్నెలు హెంబట్టుతెరలును బటికంపు
        మెట్లును జిగిరంగు మేల్హొరంగు


గీ.

చందువలు నంద మయి యొప్పుచంద్రకాంత
కుట్టిమంబులు గలకొల్వుకూటమునకు
లీల నరుదెంచి మదకలనీలకంఠ
కంఠరుచిరమ్యమౌ రత్నకంబలమున.

170


గీ.

హెచ్చుముత్యపుగద్దియనే కరంగి
సుళువు తలగడ చెయ్యూది కెలఁకులందుఁ
గొంద ఱిందీవరాక్షులు కొలన నుండి
బలరిపుని దూత పిల్వఁ బంపఁగ నతండు.

171


క.

చనుదెంచి మ్రొక్కుటయుఁ బ
జ్జను గూర్చుండంగఁ బనిచి శతమఖుసేమం
బును సురలసేమ మారసి
పనివడి నీవచ్చినట్టిపని యే మనుడున్.

172


చ.

కులిశకఠోరధార బలుకొండలతండము గండడంచున
బ్బలియుఁడు పాకవృత్రబలభంజనుఁ డింద్రుఁడు పల్కు చున్నవా
ర్తలు విను పద్మజాంశమున ధారుణి నత్రిమహామునీంద్రు స
త్కులమునఁ బుట్టినాఁడ వనఘుండవు ధర్మవిదుండ వెయ్యెడన్.

178


గీ.

అట్టినీయెడ నొక్కదుర్యశము గల్గె
సొబగుతెలిచల్వకును మసి సోఁకినట్లు

సకలజనపూజ్యుం డైనయాచార్యుభార్య
బలిమిఁ బట్టితి వింతపాపంబు గలదె.

174


క.

అంతట బోవక నీ వ
య్యింతిని నెత్తుకొని వచ్చి హృదయంబున నొ
క్కింతయు వెఱవవు గర్వా
క్రాంతుఁడ వై యెంత కండకావరమొ కదా.

175


క.

క్షితిలో స్త్రీవ్యసనంబే
యతిగర్హిత మందుపైఁ బరాంగన యాపై
నుతశీలుఁ డైనగురుసతి
పతివ్రత నీ వాచరింపఁ బాడియె నీకున్.

176


చ.

అరయక మించి చేసితివి యౌవనగర్వముచే నకృత్య మి
త్తఱి మును లైన నీదుతలిదండ్రులపై మొగమాట ని మ్మహ
త్తర మగుతప్పుం గాచితిమి దా యడ లేటికి నిప్పు డైన నా
గురుశరణంబు సొచ్చి యళికుంతల నిచ్చుట మేలు కానిచోన్.

177


క.

ప్రకట మగుసంగరంబున
నొకక్షణమున వీపుచర్మ మొలిపించెద యా
మిక వేయించెద నిదె మా
మకభుజదంభోళిచండిమం బెఱుఁగ వొకో.

178


మ.

అని దిక్పాలకు లందఱు న్వినఁగ బంభారాతి పల్కెం గడుం
గినుక న్వారలు నిట్లనే యనిరి తీక్ష్ణీభావ మొప్ప న్మహా
మునులెల్లన్ శపియింపఁగాఁ దలఁచి రున్మూలంబుగా నాగ్రహం
బున సర్వామరసిద్ధసాధ్యులును గుంపు ల్గూడినా రెల్లెడన్.

179


క.

నా విని నునుమీసముపై
చే వైచి మొగంబునందు చిఱునవ్వును గో
పావేశంబును దోఁపఁగ
నావేలుపుదూతఁ జూచి యతఁ డిట్లనియెన్.

180


శా.

ఓహోహూ! పురుహూతుఁ డెంతటిగృహస్థో! యిట్లు దాఁ బల్క నీ
యూహాపోహము లెందుఁ బోయెనొకొ! ప్రత్యూషంబునం గోడియై
మోహోద్వృత్తి నహల్యం గూడునెడలన్ బోధింప నేనొల్ల ని
ట్లాహా! యొజ్జలపుచ్చకాయవిత మౌరా వేయు నిం కేటికిన్!

181

సీ.

అమరేంద్రుసంశుద్ధి యతని మే న్దెలుపదా
        ఋషివధూరతి వహ్ని కిపుడు లేదొ
మఱచెనో పాండుభామాస్నేహ మినజుండు
        నైరృతినియమ మెన్నాళ్ళనుండి
పొసఁగఁ గాలేదొ యూర్వశిగుత్త వరుణున
        కనిలుఁ డంజనిఁ గూడి దనియఁ డేమొ
కన్నెత్తి యొకసతిఁ గనుఁగొనఁడొ కుబేరుఁ
        డెనయఁడో దారుకావనిని శివుఁడు


గీ.

తమతమచరిత్ర లెఱుఁగక తాము నొకరి
ననుకొనుట లాయెనా మంచి దండ్రుగాక
నోళ్లు మూయింతు మద్భుజానూనచండ
గాండివనినాద మొనరునక్కదనమునను.

182


క.

మగనియెడ రోసి తటు న
మ్మగువయె నను వలచి వచ్చి మందాడినచోఁ
దగులువడితి నన్నందుకు
దిగఁ బాళెము రాజుపేరు తెలియని మూఢుల్.

183


ఉ.

ఇందుకుగా వహించుక సురేంద్రుఁ డుపేంద్రుఁడు శూలి కీలియున్
గ్రందుగ నిర్జరోరగనికాయము లొక్కట వచ్చి తాఁకినన్
జెందిన వేడ్క దారసిలి చిందరవందర గాఁగఁ జేసెదన్
జందనగంధి నిత్తునె పొసంగనిసంధికి నేను జొత్తునే.

184


క.

ఈవార్తలు మీదొరతో
వే వివరింపు మని పలికి వీడ్కొల్పఁగ వాఁ
డావిబుధేంద్రునిచెంతకుఁ
దా వచ్చి తదుక్తు లెల్లఁ దగఁ దెల్పుటయున్.

185


ఉ.

వింటిరె వానిప్రల్లదపువెంగలికూఁతలు వచ్చె నత్రివా
రింటికి హాని యింతటి యకృత్యముఁ జేసియు స్రుక్కఁ డెంతయున్
బంటుతనంబులా జలదపంక్తులలోపల దాఁచియున్న నా
వింటికిఁ గార్య మబ్బె వెద వెట్టెద తత్తనుమాంసఖండముల్.

186


చ.

చెదరనికొండల న్గరఁగఁ జేయుమదుజ్జ్వలవజ్రకీలికిన్
మృదు వగునీసముద్రనవనీతపుముద్దఁ గరంచు టెంత నే

నిదె కదనంపుటాయితము హెచ్చుగ వచ్చెద మీర లిప్పుడే
కదలుఁడు చాటి చెప్పుఁ డెఱుఁగన్ దెఱగంటివజీర్ల కీయెడన్.

187


క.

అని పలికి యంతిపురికిన్
జనె సురపతి యంత నచటిజగడపువార్త
ల్విని నారదుండు తనురుచి
జనితశరన్నారదుండు సంతస మెసఁగన్.

188


సీ.

అక్షసూత్రము ద్రిప్పు నంగుళీతలి యుద్ధ
        జనిహేతుయోజనాభినయ మెసఁగ
శౌరిఁ బేర్కొనుజిహ్వ సమరకారణమైన
        తారావధూటి సంస్తవము చెలఁగ
యలఘువైరాగ్యనిర్మల మైనమదిలోన
        జగడంపువేడుక చిగురు లొత్త
నియమకర్శిత మైననెమ్మేన భావిర
        గోత్సాహకృత మైనయుబ్బు మెఱయ


గీ.

కలిగెఁ బో యిన్నినాళ్లకు కడుపునిండ
నిష్టమృష్టాన్న మని పరితుష్టుఁ డగుచుఁ
గుంచె విసరుచు వచ్చె విరించికొడుకు
కడురయంబున నపుడు భార్గవునికడకు.

189


క.

ఆరీతి న్జనుదెంచిన
నారదునకు దైత్యగురుఁడు నయవిధుల న్స
త్కారము గావించి దర
స్మేరముఖుం డగుచు నేర్పు మెఱయం బల్కెన్.

190


చ.

అనఘ! యపూర్వమైనభవదాగమనంబు తలంప నొక్కచోఁ
బొనరిన కయ్య మిప్పు డెగఁబోయఁగ వచ్చినయట్లు దోఁచె నీ
వనుపమదేవదానవమహాహవనాటకసూత్రధారి వై
ఘనముగ వీణె మీటులయకాఁడవు నీయొళ వే నెఱుంగనే.

191


క.

అనుటయు నగి పరభావముఁ
గని పల్కఁగ నేర్చుకృతివి గావే రవి గా
ననిచోటును కవి గనుఁగొను
ననుమాట యథార్థ మయ్యె నైనను వినుమా.

192

ఉ.

లాలితరూపయౌవనకళారసధాముఁడు సోముఁ డర్థిమై
వేలుపుటొజ్జపజ్జ నొగి విద్యలు నేర్చుచు నుండ వానియి
ల్లా లొకచోటఁ దా నతని కంగజవిద్యలు నేర్పి సాహసో
ద్వేలతఁ జంద్రుఁ దోడ్కొని తదీయగృహంబున కేఁగె నంతటన్.

193


క.

ఆచందము వేవేగన్
వాచస్పతి వచ్చి తెలుప వాస్తోష్పతి దా
సైచఁగయేచిన కినుక
న్జూచి విధునిమీఁద సైన్యములతో వెడలెన్.

194


ఉ.

చందురుఁ డొక్కరుండు బహుసంగరకోవిదు లై కడంగుసం
క్రందనవహ్నిముఖ్యరథికప్రవరు ల్మఱి వేనవేలు వా
రందఱు నొక్కనిం బొదువునప్పు డుపేక్ష యొనర్పఁ బాడియే
యిందున కీవు బాసటయి యిందునకుం జయ మిమ్ము భార్గవా!

195


వ.

అనిన దరహాసభాసురముఖుండై శుక్రుం డిట్లనియె.

196


శా.

ఏమేమీ కడువింత వింటిమి బళీ! యిల్లాండ్రలోఁ దార బ
ల్సామే చంద్రుని ముఖ్యశిష్యునిగ నెంచంబోలు మా కింక సు
త్రామాదు ల్వడిఁ జుట్టుకొన్న శశిమీఁదన్ రేఖ గానిత్తునే
నామాహాత్మ్యముఁ జూడుమా గురుని నిందామగ్నుఁ గావించెదన్.

197


క.

సురసంయమివర! మీకున్
బెరిమన్ దృప్తిగను విందుఁ బెట్టించెద సం
గరమున మీరు నిజేచ్ఛా
పరతం జనుఁ డందుఁ బంచి భార్గవుఁ డంతన్.

198


క.

వృషపర్వాదిమహాసుర
వృషభుల రావించి చంద్రువిధముఁ దెలిపి యీ
విషమసమయంబునను నని
మిషులం గెల్తుమని నీతి మెఱయఁగ నంతన్.

199


క.

శీతాంశునిచెంతకు నొక
దూతం బనిపించి తాము దోడ్పడురీతుల్
ప్రీతి వినఁ జేసి దైత్యస
మేతముగా శుక్రుఁ డచటి కేతెంచుటయున్.

200

గీ.

ఎదురుగా వచ్చి శుక్రున కెలమి మ్రొక్కి
కలువరాయఁడు దనుజులఁ గౌఁగిలించి
వావివరుసలు మెఱయంగ వారు దాను
నెనసి క్షీరోదకన్యాయమున వసించె.

201


వ.

అనుటయు.

202


ఆశ్వాసాంతము

శా.

శ్రీరామానుజకీర్తిధారణ! రణశ్రీవేణిఖడ్గధా
రారాజత్కరపద్మ! పద్మహితకృద్రంగద్భుజాథామ ! ధా
మారామాంబుజవాసినీపదసముద్యన్నూపురారావదీ
ర్ణారాతిప్రభుకర్ణ! కర్ణశిబికల్పా! కల్పదానోదయా!

203


క.

ధారాళజయవిహారా!
హారాయతకీర్తికృతదిశాలంకారా!
కారావసదరివారా!
వారాశిశయానపాదభక్త్యాధారా.

204


తోటకవృత్తము.

కురుకరహాటకరూశవరాటకోసలభోజకళింగమహీ
వరనుతహాటకరత్నకవాటకవర్లితకూటక! దానజితా
మరతరువాటక! సద్గుణపేటిక! మర్ధితతాటక! సాత్కృతధీ
విరచితనాటక! దండకఝాటకవీంద్రకిరీటకళాకలితా!

205


గద్య.

ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానందకందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్యతనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతం బైనశశాంకవిజయం బనుమహాప్రబంధమునందుఁ జతుర్థాశ్వాసము.

  1. నన్నును
  2. సురపొన్నగడన్