శశాంకవిజయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శశాంకవిజయము

పంచమాశ్వాసము

శ్రీమన్నరురంగాధిప
రామానుజగుణగణాంకరచనాముదితా
హేమాచలమలయాచల
సీమాచరసుకవిచంద్ర! సీనసుధీంద్రా.

1


వ.

అవధరింపుము సూతుండు శౌనకాదిమునీంద్రుల కిట్లనియె.

2


క.

అంత శచీకాంతుఁడు మది
నెంతయుఁ గుతుకమున వీరశృంగారరసా
త్యంతరమణీయవైఖరి
వింతై కనుపట్టుమహితవిభవము మెఱయన్.

3


సీ.

ధళధళద్యుతి
నిండుతగటిమెఱుంగుదు
        ప్పటి కాసెచుంగులు బాగుమీఱ
మృగమదాంకిత మైనమేన వేగన్నులఁ
        గనుపట్టుఘనవజ్రకవచ మొప్ప
దివ్యమాణిక్యదేదీప్యమానకిరీట
        ఘృణు లెల్లదెసల నీరెండ గాయ
కంకణమౌర్వీకిణాంక మౌకెంగేల
        శతకోటి శతకోటిచెన్ను మిగుల


గీ.

కల్పసుమధామభూషణోత్కరము మెఱయ
చెలఁగి దేవర్షిగణము లాశీర్వదింప
మందహాసంబు మోమునఁ గందళింప
వెడలె జంభారి కయ్యంపువేడ్క మీఱ.

4

శా.

ఆరీతి న్జనుదెంచి యాఘనుఁడు ప్రోద్యద్దానధారాఝరీ
పూరంబు ల్సెలయేరులై తగ జగాపొంబట్టుసాల్ గైరిక
శ్రీ రంజిల్ల చరత్తుషారగిరి నాఁ జెల్వొందునైరావతం
బారోహించె దిశావకాశములఁ దూర్యారావము ల్నిండఁగన్.

5


చ.

అఱిముఱి వహ్ని మేషము కృతాంతుఁడు దున్న నరాశి మానవున్
వరుణుఁడు నక్రరాజమును వాయువు 'లేడి కుబేరుఁ డశ్వ మీ
శ్వరుడు వృషంబు నెక్కి వడి శక్తియు దండము కుంతపాశముల్
సురుచిర మౌధ్వజంబు నసి శూలమునుం గోని తోడు గూడఁగన్.

6


ఉ.

మోమున లేఁతన వ్వెసఁగ ముత్యపుటొం ట్లసియాడ మల్కుతో
డా మెనవెట్టి కట్టినకడానిజగాజిగిపాగమీఁద ని
ద్దామెఱుఁగుందురా గులుక తండ్రిపిఱుందు జయంతుఁ డాశ్విక
స్తోముఁడు తోడ వచ్చె రవజో డలరన్ వెలివాజి మీటుచున్.

7


ఉ.

స్వర్ణచిరత్నరత్నమయచక్రరవంబుల నబ్జజాండముల్
ఘూర్ణిలఁ గేతుకోటిమెఱుఁగు ల్నిగుడ స్వరహేమభూమిభృ
త్తర్ణకవైఖరిం దగ రథంబులు గొల్వఁగఁ జేరి మ్రొక్కి య
భ్యర్ణమునందె మాతలి రయంబున వచ్చె బలారి మెచ్చఁగన్.

8


మ.

బహువర్ణాఢ్యకుధవ్రజంబు మణిచాపప్రక్రియక్ మీఱఁగా
నహనోదంచితహేమకక్ష్యలు తటిన్మంజుస్థితిన్ బూనఁగా
లహరీవన్మదవారివర్షముగ లీలన్ మత్తమాతంగముల్
రహీఁ గన్పట్టెను మేఘవాహనునిమ్రోలన్ మేఘజాలం బనన్.

9


మ.

హరి గన్పట్టెను విశ్వరుద్రవసుమాహారాజికాదిత్యభా
స్వరవిద్యాధరసిద్ధసాధ్యతుషితస్వర్వైద్యగంధర్వకి
న్నరయక్షోరగచారణానిలసువర్ణశ్రేష్ఠు లుద్యద్గదా
పరిఘప్రాసపరశ్వథాసిధరులై పార్శ్వంబులం గొల్వఁగన్.

10


మత్తకోకిల.

ఇత్తెఱంగున మోహరించి మహేంద్రుఁ డాహవకౌతుకా
యత్తచిత్తత సర్వదిగ్వలయాంబరిక్షితిభాగము
ల్బెత్తు లెత్త గభీరభైరవభేరికాపటహంబు లు
ద్వృత్తి మోయఁగ ముజ్జగంబుల మ్రింగుభంగిఁ గడంగినన్.

11

క.

చారులచే నాచందం
బారూఢిగఁ దెలిసి చంద్రుఁ డాహవకేళీ
ప్రారంభసూచకంబుగ
వీరోత్సాహమున భేరి వేయించుటయున్.

12


చ.

చెదరె గిరు ల్దివం బడరె శ్రీపతి దిగ్గున నిద్ర మేల్కొనన్
బెదరె నజాండభాండములు భేదిలె నాదిమభోగికన్నుగ్రు
డ్లుదిరెఁ గలంగె వారినిధు లొక్కట దిక్తటసంధిబంధము
ల్వదలెను పొట్లపువ్వు లన వ్రాలెను ఝల్లన చుక్క లత్తఱిన్.

13


సీ.

బిబ్బోకవతి గబ్బిగుబ్బ గుప్పినసొంపు
        గను నురంబున దివ్యకవచ మొప్ప
జవరాలినునుకీలుజడవేటుదద్దుము
        ద్దులవెన్నునను కవదొనలు మెఱయ
వెలఁదికిఁ గలపంబు నలఁద ఘ మ్మనుపాణి
        తలమున గాండివధనువు దనర
కిసలయాధరమేని పసపుడా ల్దుప్పటి
        కాసె నొప్పగు మొలకత్తి యమర


గీ.

మోముఁదామర చిఱునవ్వు మురువు మీఱ
తారఁ గౌఁగిటఁ జేర్చి యత్తలిరుఁబోణి
కులుకు కిలికించితంబుగ గెలువు మనుచుఁ
బనుప రహి మీఱి వనజారి బయలుదేఱి.

14


మ.

బలువజ్రంబులబండ్లు కెంపుటిరుసు ల్ప్రాఁబచ్చఱాకూబరం
బులు సన్నీలమణిత్రివేణువు మహాముక్తామణీపీఠమున్
తెలివాజు ల్హరిణధ్వజంబు నమరన్ దివ్యాయుధోదగ్రమౌ
నలఘుస్యందన మెక్కి దైత్యగురుకౢప్తామోఘలగ్నంబునన్.

15


సీ.

అతిలోకభుజగర్వుఁ డగువృషపర్వుండు
        విషమాహితులమి త్తి విప్రజిత్తి
యరిచమూచిత్తదత్తామయుండు మయుండు
        శంబరుం డురుబలాడంబరుండు
నమరసైన్యాజయ్యుఁ డగుశతమాయుండు
        తారకుం డనలోగ్రతారకుండు

ఘనవిభాజితవిరోచనుఁడు విరోచనుఁ
        డాహవదళితాభియాతి హేతి


గీ.

యనెడుదైత్యేంద్రు లెనమండ్రు నాజి తామె
యష్టదిక్పాలకుల నోర్తు మనుచు సింహ
శరభశార్దూలవృకఘోణిఖరమహోష్ట్ర
తురగముల నెక్కి యుద్ధసన్నద్ధు లగుచు.

16


చ.

వెడలఁ దదీయసైన్యములు వెల్వడె నుగ్రతఁ గాలమేఘము
ల్కడఁగినలీల నొక్కమొగి గాటపుఁగాటుకకొండతండము
ల్విడివడునట్టు లబ్ధు లతివేలములై యరుదెంచునట్లుగా
నడిదములున్ గద ల్గుదియ లమ్ములు విండ్లును బూని యుగ్రతన్.

17


సీ.

మదచండవేదండమండలు ల్గొండలు
        ఘోటకచ్ఛట లూర్మిఝాటకములు
దరదము లైయొప్పునరదముల్ దీవులు
        పటవాళ్ళు కడిమి గన్పడు మొసళ్ళు
కరవాలచయము భీకరవాలమీనముల్
        చక్రసంహతి తోయచక్రవితతి
చంద్రార్ధచంద్రాంకచర్మము ల్కూర్మము
        లాయుధద్యుతిజాల మౌర్వకీల


గీ.

లగుచుఁ గనుపట్టు దైత్యసేనార్ణవంబు
భూరిచంద్రోదయంబునఁ బొంగి పొరలి
కెరలి శరలీల వరలంగఁ దరలి వచ్చు
నమరవాహినితో ముదం బమరఁ గవిసె.

18


ఉ.

ఆపగిదిన్ ఘటించి యమరాసురసైన్యము లంత నెంతయున్
గోపము లగ్గలింప సెలగో ల్జగడంబునఁ జేరి చేరి తోఁ
దోపుల మీఱి మేటిరవుతుల్ తురగంబుల మీటి పిల్వ చె
య్యాపక పూర్వపశ్చిమమహాంబునిధు ల్వలెఁ దారసిల్లినన్.

19


క.

సుభటుఁడు సుభటుఁడు హరి హరి
యిభ మిభమున్ రథము రథము నెదిరించినయా
రభస మిది యేమి చెప్పన్
నభ మగిలెన్ బుడమి గ్రుంగె నగములు పగిలెన్.

20

వ.

ఇవ్విధంబునం గ్రమ్మి యమ్మోహరంబులు రెండును ముమ్మరంబుగాఁ బోరునవసరంబున యుగనిగమనారంభసంరంభవిజృంభమాణమహాంభోధరగరాగంభీరంబు లయినభేరీభాంకారంబులును ప్రళయకాలభైరవహుంకారశంకారచనాచరణంబు లయినభీమడమాడమికాఢమఢమత్కారంబులు నకుంఠితపురుషకంఠీరవకంఠనాళక్ష్వేళాకరాళంబు లైనవీరకాహళీకోలాహలంబులును విగ్రహవేళాగ్రహోదగ్రహయగ్రీవగ్రీవామహోగ్రహేషాభీషణతాక్రూరంబు లయినబూరగలరవంబులును మంథాచలమంథానమధ్యమానమహార్ణవోదీర్ణనినాదానువాదంబు లయినయసంఖ్యశంఖఘుమఘుమప్రణాదంబులును సంవర్తనర్తనప్రవృత్తమృత్యుంజయచరణసంఘటనస్వనపోషణంబు లయినవీరభుజాస్ఫాలననిర్ఘోషణంబులును మహావరాహఘోణారవజయప్రవీణంబు లయినపటహడిండిమడమరుఢక్కాఝల్లరీతమ్మటప్రముఖనిఖిలవాద్యరావంబులు గొల్లన నుల్లసిల్లిన ఝల్లన మదంబు లుప్పతిల్ల నిప్పు లురులుచూడ్కులఁ బ్రతిసేనాగజంబులఁ గనుంగొని ఘళంఘళధ్వానంబులు మీఱ బారిగొలుసులు పరబలంబులఁ బాయం గొట్టి యుద్యదాధోరణంబు లయినరిపువారణంబులం దాఁకి ఘణిల్లు ఘణిల్లునం గొమ్ముక ట్లొరయ నగ్నికణంబులు నభోంగణంబున కెగయఁ గఠిల్లుపెఠిల్లునన్ గఠోరదంతంబులు చిటులఁ దుండంబులు పెనుచుకొన నొండొంటిం దాఁకి ఘణంఘణితకాంచనఘంటికాసంఘంబులతోడంగూడ ఱెక్కలతోడికొండలుంబలె నొకటొకటిం బట్టికొని యిమ్ముగా దంభోళిశకలాకారంబు లయినకొమ్ముకత్తులు గట్టినకొమ్ము లెంతయుం జూడఁ గ్రుమ్ములాడుచుం బోరునేనుంగులును తరటు గావించి ఘోటకంబుల మీటి ప్రతిబలంబులు బడలువడంజొచ్చి పగతురు నిగిడించు కుంతతోమరప్రాసశక్తిశూలాద్యాయుధంబులు చిదురుపలై గగనంబున కెగయం దొడుపుకత్తులు బిసబిస విసరుచు వేడంబులఁ దిరుగుచు కేడెంబు లొడ్డుకొని చకచకాయమానంబు లయినచికిలిబాకుతారులు గొని నఱుకులాడురవుతులును రథచక్రఘోషంబులును గేతనపటపటాత్కారంబులు నింగిముట్ట నరదంబులు నిబ్బరంబుగాఁ బఱపుచుం బ్రతిశతాంగంబుల నబ్బాటుగా మెట్టింపుచు లాఘవలక్ష్యశుద్ధిదృఢత్వచిత్రత్వంబులు మెఱయ సర

యంబుగాఁ గోదండపాండిత్యంబు నెఱపుచు నంపపరంపరలం బెంపరలాడురథికులును గుదికాండ్రచేసన్న నుబ్బి గబ్బి మిగులం బొబ్బ లిడుచు నొక్కనితోఁ బెక్కండ్రును బెక్కండ్రతో నొక్కండును తారసంబై యీరసంబున నుక్కునారాసంబులు నిగిడించియుఁ జేరినచోట నీటెలం బోటులాడియు డాసినయెడఁ గరాసిగొని మిగులహత్తినయెడ సూరికత్తులం గొని యుద్దులుద్దులుగా గుద్దులాడు కాలుబంట్లును గలిగి దారుణం బయినయారణంబునఁ దదీయక్రోధాగ్నిధూమస్తోమంబులచొప్పున నప్పగంబునన్ గప్పలు విరాటుకుం గప్పుకప్పుదుప్పటియొప్పున గుప్పునం దుప్పఁ గట్టుటయును తమవారనియును బెరవారనిఁయునుం దెలియక చేసన్నలం దడవి పట్టుకొని యుబ్బినకైదువులచే నేటులాడి రయ్యవసరంబున నయ్యమరాసురసేవాసందోహంబులు నెత్తురువానల నమ్మహీపరాగం బణంగుటయు ఖండంబు లయినతుండంబులును దుమ్ము రయినఱొమ్ములును భేదంబు లయినపాదంబులును దీర్ఘంబు లయినకర్ణంబులును చీలిక లయినచూళికలును విద్ధంబు లయిన వాహిత్థంబులును గాయంబు లయినకాయంబులునుం గలిగి మావంతులతోడం గూడఁ బీనుంగు లయినయేనుంగులును పగిలిననోళ్లును బరియ లయినజోళ్లును దునిసినశిరంబులును తుమురు లయినఖురంబులును జీలినగల్లంబులును జిద్రువలైనపల్లంబులును వీడినభూషణబృందంబులును నలిసినఱొమ్ములును నజ్జు లైనయెమ్ములును బ్రద్ద లైనవెన్ను లును బగిలినకన్నులును దెగినవాలంబులును దీనదశం బొందిన రాహుత్తజాలంబులును గలిగి యపరిమితరక్తధారాతరంగంబులును జక్రంబులు వ్రీలి సారథుల్ గూలి కేతనంబులు వ్రాలి కింకిణులు రాలి రథికులు సోలి రథ్యంబులు వ్రేలి రయంబులు మాలి రణాంగణంబునం దూలి హతాంగంబు లైనశతాంగంబులును బదంబులు రదంబులును పాణులు కృపాణులును నురంబులు శిరంబులును వర్మంబులు చర్మంబులును వెన్నులు చన్నులును పక్కలు డొక్కలును వీనులు జానులును నేత్రంబులు గాత్రంబులును పాలంబులు కపోలంబులును తొడలు మెడలును వేళ్ళు నోళ్ళును గడికండలు పడకండలు నెత్తురులు గ్రక్కుచుఁ బొడిచినపోటుగంటివెంబడి వేదు రెక్కి నఱికి యరివీరుల

శిరంబులు ద్రొక్కి క్రిక్కిరిసినవైరిభటశరీరంబులు తలగడలుగానౌడుగఱిచి మీసంబులమీఁద చే వైచికొని గతప్రాణులై పడినవీరభటులు గలిగి సంగరాంగణంబు ఘోరం బయ్యె నప్పుడు కేశంబులు శైవాలంబులును మొగంబులు పద్మంబులును భుజంబులు మీనంబులును శిరఃకపాలంబులు గవ్వలును ద్విపంబులు ద్వీపంబులును చూర్ణితాభరణరత్నరాసు లిసుకలును కంఠంబులు శంఖంబులును మేదోమాంసమస్తిష్కంబులు పంకంబులునుం గలిగి సురాసురశరీరపట్టంబులు పెట్టలం ద్రోయుచు వేలకొలందు లగునెత్తురుటేరులు ప్రవహింప నందు భూత భేతాళ డాకినీ శాకినీ యాకినీ లాకినీ పిశాచ కూశ్మాండ రాక్షసాదిగణంబు లుద్దులుద్దులుగా నోలలాడుచుం బ్రమోదంబునం దేలుచు నరంబులం బెనచి కరంబులం గట్టినశిరంబు లనునందెలును గజతుండఖండంబు లనుచిమ్మనగ్రోవులం బట్టి నెత్తురునీరు చిమ్ములాడుచు మునింగి యొండొరులం బట్టుచు నిట్టలంబుగా జల క్రీడలాడి క్రొవ్వుపొద లనుతెలిచల్వలు గట్టి నల్ల లనుతిలకంబులు దీర్చి సన్నపురంబు లనుసరంబులు వైచి నేత్రకమలమాలికాజాలంబులు ధరియించి మెదడుగంధంబు లలంది గుండెతండంబులు మ్రెక్కి క్రొత్తరక్తంబులు గ్రోలి చొక్కి సోలుచుఁ గర తాళగతుల నాడఁదొడంగి రప్పు డయ్యిరువాగునం గడిందివీరు లనుబేహారు రథంబులు ననునోడల నెక్కి సంగరం బనుసముద్రంబుఁ జొచ్చి తమతమప్రాణంబు లనుధనంబు లిచ్చి నిచ్చలం బయినకీర్తు లనుముత్యంబులు గొని రాసులు పోసి రయ్యవసరంబున దుర్వారగర్వంబులు పర్వ గీర్వాణులు ద్రోసి నడిచినం బూర్వగీర్వాణులు నెగ్గబారిన వృషపర్వుం డదల్చి తెరలినబలంబుల మరలం బురిగొల్పి తక్కినదండనాథులం దానును రథనేమీక్రేంకార భేరీభాంకార శింజినీటంకార వీరభటహుంకారంబులన్ వియత్తలంబు నొంది యెదిర్చుటయు నిలింపులు గుంపులుగూడి తెంపునం దారసిల్లిన నింద్రుండును వృషపర్వుండును నగ్నియు విప్రజిత్తియు దండధరుండును దామరకుండును మయుండును నైరృతియు వరుణుండును శంబరుండును వాయువు శతమాయుండును కుబేరుండును విరోచనుండును దుర్మదుండును నీళానుండును హయగ్రీవ

శుంభనిశుంభులు నాదిత్యవసురుద్రులును ద్వంద్వయుద్ధంబునకు దొరకొనఁ దొణఁగి రప్పుడు.

21


ఉ.

సింగముమీఁద నెక్కి, పటుశింజిని మ్రోయఁగడంగి, విక్రమా
భంగత నింద్రుఁ డాసి, వృషపర్వుఁడు శాతశరంబు లేయ, శ
క్తిం గొని వైచి యింద్రుఁ డలకేసరిఁ గూల్చిన, వాఁడు తేజికిన్
జెంగున దాఁటి దాఁటి, సురసామజరాజముఁ జూచి మీటినన్.

23


వ.

తదనంతరంబ యాలోన.


క.

సౌరగజేంద్రము దానిం
బారిగొలుసుచేత విసరఁ, బటురయమున న
వ్వారువము గాలిచక్రము
దారి న్వేడెములు దిరుగ, దనుజేంద్రుండున్.

24


క.

నేజము గొని, యి ప్పోటున
నే జమునిం జేర్తు ననుచు, నిశిచరవీరుల్
జేజే లిడ సాహసమున
జేజేల గజంబు కుంభసీమం గ్రుమ్మెన్.

25


క.

దానికిఁ గలఁగక శతమఖు
దాని, కినుక మీఱ, దాన ధారాస్ఫురణం
బూని, కరమ్మునఁ జిమ్మెను
బూని కర మ్మెదురు దనుజపుంగవు హయమున్.

26


క.

అందుకు వెఱవక తురగము
కందుకమ ట్లెగసి తూఱఁగా, నిగళముచే
నందుకొని, ఘలఘలధ్వని
క్రందుకొన న్విసర, వేల్పుగజ మవ్వేళన్.

27


క.

సుడి వడకయె వేడంబుల
సుడిగాలి గతిన్ హయంబు సురకరిఁ జుట్టన్
వడిఁ దిరుగఁగ నడిదముఁ గొని
బెడిదముగా నఱికి వాఁడు ఫెళఫెళ నార్చెన్.

28


క.

అమ్మదనాగేంద్రంబును
గుమ్మరసారె గతిఁ జుట్టుకొని వడిఁ దిరుగన్

మమ్మాఱె యనుచుఁ జూపఱు
ముమ్మాఱుం బొగడి రొక్క మొగి నవ్వేళన్.

29


క.

వాలమున నింద్రుడు కర
వాలమ్మున నుగ్గు సేసి వానిహయంబున్
ఫాలము నొవ్వ నేసిన
వాలమ్మునఁ బఱచె నది మహావేగమునన్.

30


ఉ.

అందుక యుగ్రతుండమున నందుక నబ్ధిఁ బరిభ్రమించు న
మ్మందరశైలమో యన నమందర మన్ దివిజేంద్రుదంతి వీ
కం దగఁ దొట్టి నిల్చుతురగం బురగం బురగారి బట్టుచా
యం దగఁ బట్టెఁ గంద మన నందఱు నం దరుదంది చూడఁగన్.

31


ఆ.

హయము విడచి యసుర రయమున లంఘింప
నమరగజము వాని నమరఁగ జము
చెంత కనిచె నంత నంతకాకృతి నతం
డరద మెక్కి నీలశరదలీల.

32


క.

కనుపట్టి శరపరంపర
లనిమిషపతిమీఁదఁ గురియ నతఁడును రింఖ
త్కనకమణిపుంఖశరముల
నినిచెను దినకరుఁడు కిరణనికరమువోలెన్.

33


చ.

అనలుఁడు విప్రజిత్తియు రయంబున మార్కొని పోరువేళ న
య్యనలుఁడు సప్తసాయకము లాతనిపై నిగిడింపఁ దోడనే
తునిమి యతండు తత్తనువు తొమ్మిదియమ్ముల నాట నాతఁ డా
తనివిలు ద్రుంచి నొంచిన నతండును వేఱొకవింట మార్కొనెన్.

34


సీ.

తారకయములు విస్తారకనచ్చాప
        నైపుణిఁ బోరి రందఱును బొగడ
మయనైరృతులు వహ్నిమయ్యనైకశరముల
        నొక్క రొక్కరిఁ గప్పి దక్కు మీఱ
శంబరాబ్ధీశులు శంబరాజద్బాణ
        శతము లేసిరి పరస్పరతనువుల
హేతిసమీరణుల్ హేతిఘట్టనలచే
        మిణుఁగురు లెగయంగ రణముఁ జేసి

గీ.

రలవిరోచనుఁ డర్ధేశు నలవి లేని
భల్లముల నేయ నాతఁడు విల్లు దునిమె
దుర్మదుం డిందుమౌళితో దుర్మదమునఁ
బోలెఁ గేసరితోఁ గరి పోరినట్లు.

35


క.

తక్కుఁ గలదనుజవీరులు
తక్కటిగీర్వాణపరులు దలపడి వైరం
బెక్కఁగ నెక్కటి పోరిరి
యుక్కున బ్రహ్మాండభాండ ముఱ్ఱుట్లూఁగన్.

36


క.

నక్రౌర్యత నావేళన్
శుక్రుఁడు సురగురునిఁ జూచి సోల్లుంఠనముల్
వక్రోక్తి నాడ నాతఁడు
శక్రుదెసం జూచెఁ జూడ శతమఖుఁ డనియెన్.

37


క.

నేఁడే కడంగి శుక్రుఁడు
చూడఁగ జగ మెల్ల దనుజశూన్య మొనర్తున్
జూడుఁడు వేడుక యెఱుఁగక
లాడితి నని యతనిచిత్త మదరఁగ ననుచున్.

38


లయగ్రాహి.

బంగరుబెడంగు బలుసింగిణి వడిం గరమునం గొని కడంగి ధర నింగియుఁ గలంగన్
ఖంగు ఖణి ఖంగు రనుచుం గుణ మెసంగి మొఱయంగఁ బ్రజలం గినిసి మ్రింగుజముభంగిన్
బొంగి సమరాంగణమునం గజతురంగమశతాంగసుభటాంగము లిలం గలిసి బ్రుంగన్
సింగము కురంగసమితిం గసిమసం గేడు తెఱంగున నభంగజయ సంగతిఁ జెలంగన్.

39


ఉ.

తోడనె కూడి దిక్పతులు దుస్సహసూర్యకరంబులో యనన్
వేఁడిమి మీఱుబాణముల వేలకొలందిగ దైత్యవీరులన్
పోడి మడంప వారలును బోరన పో రొనరింపఁ జాలకే
వ్రీడ దొఱంగి పాఱి రటు వేలుపుమూఁకలు వెంట నంటఁగన్.

40

క.

మాయాదీవ్యంతులు శత
మాయాదినిశాటవరులు మఱలి చలమునన్
మాయారణమున దివిజుల
మాయఁగ జేయుటకు నైకమత్యము మెఱయన్.

41


సీ.

నగములై కూరపన్నగములై హలహల
        గరములై ప్రళయసాగరము లగుచు
ధరములై కాలాంబుధరములై యసిపత్త్ర
        వనములై ఝంఝాపవనము లగుచు
ఖరములై ద్విరదశేఖరములై పటుపాద
        రసములై కఱుకునారసము లగుచు
జలములై రక్తపింజరములై దుర్వార
        తమములై సైంధవోత్తమము లగుచు


గీ.

వెఱపుఁ బుట్టించి పోనీక వెంబడించి
కహకహార్భటి చాల దిక్తటుల నించి
వేగ నానావిధాయుధవృష్టి ముంచి
కదన మొనరించి రిట్టు లగ్గలిక మించి.

42


ఉ.

అత్తఱి ధారుణీతలవియత్తలము లన నొక్క టయ్యె ను
న్మత్తసురారిబృందములమాయల వహ్ని యమాదిదిక్పతు
ల్తత్తర మంది తత్ప్రతివిధానము సేయ నెఱుంగ రైన నా
యత్తత నేమియుం దెలియ కయ్యమరేంద్రుఁడు నుండె దీనుఁడై.

43


ఉ.

అంత జయంతుఁ డెంతయు రయంబున దేవహయంబు నెక్కి రే
వంతునిరీతి చోదనలు వల్గనము ల్రవగా ల్చెలంగ నం
తంతఁ గణంగి కుందనపుటందపుసింగిణి మ్రోయఁ జేసి కా
లాంతకదండచండవివిధాస్త్రపరంపర లెందు నించుచున్.

44


గీ.

తనదుగాంధర్వమాయ నాదనుజవరుల
మాయ మాయించి వృషపర్వు మయుని దక్కు
నసురముఖ్యుల నెనమండ్ర నైంద్రముఖ్య
దివ్యబాణాష్టకముల వధించె నపుడు.

45


చ.

దనుజులపాటుఁ జూచి మదిఁ దల్లడ మందుచు నుండు శుక్రునిం
గని గురుఁ డంత సంతసము గాంచి జయంత! జయంత! యెంత ని

న్వినుతి యొనర్తు నే ననఁగ వేడుక మీఱఁ బురందరుండు నం
దనుని గవుంగిలించుకొని తద్దయు దీవన లిచ్చె మెచ్చుచున్.

46


వ.

ఇవ్విధంబునం బురందరుం డమందానందంబున నందను నభినందనం బొనర్చి బృందారకసేనాసందోహంబులుం దానును చందురునిపయిం దాఁకుటయు నితండునుం దనసహాయు లైనదైతేయులపాటును జయంతునిపోటునుం జూచి మనంబునఁ దాపంబునుం గోపంబునుం గదుర నెదుర సదరలజ్జావిషాదవేదనావిభావ్యుం డైనకావ్యునిం జూచి మీయీక్షణంబున కీక్షణంబున నారణంబుచే పారణం బొనర్చెద నిమిషంబున ననిమిషు లెట్లయ్యెదరో కనుంగొనుఁ డని ప్రార్థించి శుక్రుని రథం బెక్కించుకొని శంఖకర్ణనామకుం డైననిజసారథిం జూచి నీరధితెరల తెఱఁగంటిన తెరగంటిబలంబులం గనుంగొంటివే గాడ్పుకంటెను మనంబుకంటెను మనరథంబును రయంబుగాఁ బఱపింపుము. మాతలి సిగ్గుఁ బఱపింపుము. నీ సూతచాతుర్యంబు నెరపింపుము. చూత మని యగ్గించుటయు నతండును నిజమనోరథంబున కనుగుణంబుగా రథంబు నడిపించుటయు వజ్రమణిగణప్రభావిభాసితంబును వైడూర్యమయహరిణధ్వజాభిరామంబు నగునమ్మహాస్యందనంబు నంబరమణిబింబంబునకుఁ బ్రతిబింబంబై వెలుంగునప్పు డసురపట్టంబులపయిం గిట్టి మేరుశరాసనంబు మోపెట్టుగట్టురాయల్లునివిధంబున నయ్యామినీవల్లభుండు గాండీవంబు మోపెట్టి గుణస్వనంబు గావించుటయు నమ్మహాస్వనంబు బ్రహ్మాండంబు నిండి యాఖండలాదిదిక్పతులం బెండుపఱచె. నయ్యవసరంబున ననేకకోటిమార్తాండమండలప్రభాడంబరవిడంబనం బైనయారాజుదివ్యతేజంబు సురాసురులకు దుర్నిరీక్ష్యం బైయుండె. ననంతరంబ పద్మగర్భుండు పలుకుచిలుకలకొలికితోడంగూడ భండనంబు చూడ కోడెరాయంచ నెక్కి వేదంబులు నధ్యాత్మవాదంబులు యోగంబులు నఖలయాగంబులు కాలాదిపదార్థంబులును మూర్తీభవించి తన్ను గొల్వ నరుదెంచి కశ్యపాత్రివసిష్టవిశ్వామిత్రభరద్వాజప్రముఖు లైనమహామునులం గనుంగొని బహువిధయుద్ధంబులం బేరు వడసి సడిసన్న వార లింద్రాదిదిక్పాలకులు వీరలతోఁ జుక్క

లరా జెక్కటి నెక్కరణిం బెనుగునో చూడవలయు నని పలుకుచు డేవతలకు నదృశ్యుండై యుండె నాసమయంబున.

47


క.

శుక్రుని మృతసంజీవని
నక్రము లగుదనుజముఖ్యు లని బ్రతుకక మున్
విక్రమమున శశి నొక్కరు
శక్రుఁడు మెచ్చంగ గెల్వఁ జను మన కనుచున్.

48


ఉ.

ఒక్కట దిక్పతు ల్విబుధయోధులతో శశిఁ జుట్టిముట్టి వే
రుక్కునఁ జక్రము ల్సురియ లుగ్రగదాపరిఘత్రిశూలము
ల్పెక్కుశిలీముఖంబులను భీమగతి న్మెయి నించి ముంచి నల్
దిక్కుల గ్రమ్మి దొమ్మిగ ధృతిన్ సమరం బొనరించి రుధ్ధతిన్.

49


ఉ.

అంత నితాంతకోపమున నత్రితనూభవుఁ డాత్మ భారతీ
కాంతుఁ దలంచి మ్రొక్కి రణకౌతుక ముల్లసిలొన్ గణంగి య
త్యంతవిచిత్రలీల నొకయాయుధమున్ దనపై రథంబుపై
నంతపయి న్దురంగనివహంబుపయిం బడనీక త్రుంచుచున్.

50


సీ.

వెండియుఁ గడఁగి చంద్రుండు గాండీవకో
        దండంబు కుండలితప్రశస్తి
నుండఁగా దిగిచి ప్రచండకాండంబు లొం
        డొండ దిఙ్మండలి నిండ నేసి
తండతండముగ వేదండంబులను రథ
        కాండంబు లశ్వప్రకాండములను
గండు మీఱుభటాళి ఖండఖండంబులై
        వండఁ దరిగినట్లు భండనమున


గీ.

మెండుకొనఁ జేసి కండలకొండ లెసఁగఁ
గుండలను గ్రుమ్మరించినదండిరక్త
కాండములు గురియించి బ్రహ్మాండ మడర
దండిగా నార్చె నిర్జరు ల్బెండుపడఁగ.

51


క.

ప్రదర మొకటి శశి యేసిన
పది నూఱై వేయు లక్ష పదిలక్షలు న
ర్బుకము ననంతంబును నై
యదె ముప్పదిమూఁడుకోట్లయమరుల ముంచెన్.

52

గీ.

ఘంట నాడించినవితాన గండుతేటి
మొఱయుచందాన జలధర ముఱుమురీతి
యుజిమి గీచినభాతి నై యుత్పలాప్తు
నారి రణమున మ్రోసె నాదార కపుడు.

53


సీ.

అసువు లాసింపనివసువుల నెనమండ్ర
        నసదృశాంబకములపస యణంచి
యద్రుగలతి మీఱురుద్రుల బాణస
        ముద్రమగ్నులఁ జేసి రౌద్ర ముడిపి
తద్ద రాజిల్లుపన్నిద్దరాదిత్యుల
        వద్దఁ జేరక మున్నె సద్దు మాన్పి
కత్తులు పూని యున్మత్తులై వచ్చుమ
        రుత్తుల సముదగ్రవృత్తిఁ బాపి


గీ.

మఱియు గంధర్వకిన్నరగరుడసిద్ధ
సాధ్యచారణయక్షభుజంగపతులు
చండగాండీవముక్తాస్త్రసమితి ముంచి
లీలఁ బఱపెను బంచబంగాళముగను.

54


ఉ.

ఏచి జయంతుఁ డయ్యెడ నహీనశరంబులఁ జంద్రు నొంచినన్
బూచినమోదుగం దలఁపఁ బోలి యతం డలుకన్ శచీసుతుం
జూచి తృణీకరించి నగుచున్ వడి చన్మఱయందు నుగ్రనా
రాచము నాటి వ్రాల్చెను ధరాస్థలి శుక్రుఁడు మెచ్చి యార్వఁగన్.

55


ఉ.

అంత జయంతుపాటు హృదయం బెరియింప నిలింపభర్త చౌ
దంతిని డిగ్గి కాంచనరథం బధిరోహణ చేసి రోషదు
ర్దాంతత మాతలిం గని సుధాకరుపై మనతేరుఁ బోపవని
మ్మింతట చంద్రుఁ డయ్యెడిని నింద్రుడు నయ్యెడి నిజ్జగంబులన్.

56


క.

అని పల్క ననిమిషేంద్రుని
మనమువలెన్ రయము మెఱయ మాతలి రథమున్
జనఁ జేయఁ జంద్రుసారథి
యును రథ మభిముఖము చేసె నురువడి మీఱన్.

57


ఉ.

ఇద్దఱు నప్రమేయబలు లిద్దఱు నేర్పరు లస్త్రవిద్యచే
నిద్దఱు నుగ్రసాహసికు లిద్దఱు నక్షయబాణశోభితు

ల్పద్దులు మీఱుఁ దారసిలి పద్మభవాండము శింజినీధ్వనిన్
బ్రద్దలు వాఱఁ బోరి రటు పాకవిదారియు కోకవైరియున్.

58


ఉ.

అక్షులు వేయిటం గినుక నగ్నికణంబులు రాలఁగా సహ
స్రాక్షుఁడు మండలీకృతశరాసనుఁడై రథరశ్మికేతుచ
క్రాక్షతురంగసారథిసమన్విత మౌగతి సారసారిపై
లక్షశరంబు లేసెను విలక్షత భార్గవుఁ డాత్మఁ గుందఁగన్.

59


ఉ.

చందురుఁడు న్బురందరనిశాతశరాహతిఁ గంది నివ్వెఱం
జెందఁగ నింద్రుఁ డిట్లను శశీ! వినరా వినరానిపాతకం
బందినవాని కార్తి యరుదా గురుదారకృతాపరాధమే
ధం దిగఁద్రోచి చేసితి వృథా విబుధావళితో విరోధమున్.

60


క.

కావరమునఁ గానవు నీ
కా వర మజుఁ డిచ్చె ననుచు నది చెల్లెను నీ
కీవరకును విడువు మిఁకన్
నీవరదర్పము నణంగ నేఁడు మృగాంకా!

61


క.

ఆమాటల మన మెరియం
గా మదనుని మేనమామ గద్దింపుదు సు
త్రామా! నీమాహాత్మ్యము
నీమహిజను లెఱుఁగరొక్కొ యే నెఱుఁగనొకో!

62


సీ.

కోడివై మదనుని కోడి వైకృతి సహ
        ల్యాజారతను గాంచినట్టిదూరు
గురు వైనయట్టియీ గురు వైచి విశ్వరూ
        పుని గురు చేసి ద్రుంచినయఘంబు
యంబ యౌ దితికి న్యాయం బెఱుంగక గర్భ
        ఘాతం బొనర్చినపాతకంబు
యజ్ఞహయం బన యజ్ఞత మ్రుచ్చిలి
        సగరుఁ గీడ్పఱిచినతగనివితము


గీ.

మఱచితో పరుఁ దెగడెదు మదముకతన
సిగ్గుపడలేవు నీమేను చిన్నె లన్ని
పరుసములు పల్కి నను గెల్వఁదరమె నీకు
నిడువుమీ నోరి క్రొ వ్వోరి! వృత్రవైరి!

63

చ.

అని యనివార్యరోషమున నగ్నిశిఖాసఖమౌశిలీముఖం
బొనరఁగ వింటఁ బూన్చి భయదోర్జనగర్జన నిర్జరాధిపున్
జనుమఱ నాట నేయుటయుఁ జాపము కోపము వైచి తేరిపై
ఘనతరరక్తపూరములు గ్రక్కుచు స్రుక్కుచు వ్రాలెఁ గ్రక్కునన్.

64


క.

ఆహరిహయుపాటునకున్
హాహాకారంబు లెసఁగ నబ్జారిపయిన్
స్వాహాధిపాదిదిక్పతు
లాహనమునఁ గ్రమ్మి గురిసి రమ్ములవానల్.

65


గీ.

వారి నందఱి మీఱి యవ్వారిజారి
వారిధర మభ్రవీథి నవ్వారి గాఁగ
వారిధారలు నిగిడించుదారి భూరి
భూరిపుంఖాస్త్రముల నించెఁ జేరిచేరి.

66


ఉ.

ఆయెడ మూర్ఛ దేరి విబుధాధిపుఁ డాగ్రహదుర్నిరీక్ష్యుఁడై
కో యని యార్చి పేర్చి శతకోటి కరంబునఁ బూని పూన్కి నేఁ
డాయజుఁ డిచ్చినట్టి వర మైనను నాపని యైన నిల్చుఁ గా
కీయుడుభర్తశౌర్యము సహింతునె నే నని యేయ నెంచఁగన్.

67


గీ.

శుక్రశమనాదిదిక్పతు ల్శక్రుఁ గూడి
శక్తిదండకృపాణపాశములు నీటె
గదయు శూలముఁ గొని నిశాకరునిఁ గిట్టి
దిట్ట లై బెట్టుగా నరికట్టుకొనఁగ.

68


మ.

ధరణీచక్రము దిర్దిరం దిరిగె దిగ్ధంతు ల్చలించెన్ దివా
కరబింబంబు విహీనతేజ మగుచున్ గన్పించె ఘూర్ణిల్లె సా
గరముల్ సప్తకులాచలంబు లదరెం గంపించె నానాచరా
చరసందోహము లప్డు పద్మభవుఁడున్ సంశోభితస్వాంతుఁడై.

69


ఉ.

జంభవిరోధిముఖ్యు లతిసాహసవృత్తి నిజాయుధంబు లు
జ్జృంభితలీల నిట్లు గొని చేరఁగఁ జంద్రుఁడు శుక్రుఁ జూచి సం
రంభము మీఱ మద్భుజపరాక్రమచాతురి చూడు మంచు సం
స్తంభననామకాస్త్ర మురుచాపమునన్ దెగదీసి యేసినన్.

70


ఉ.

ఎత్తినయాయుధంబు లవి యెత్తినకైవడి నుండ దేహముల్
మత్తిలినట్లు దిక్పతులు మ్రాన్పడి యెద్దియుఁ జేయఁజాలకన్

జిత్తరుబొమ్మలో యన విచేష్టత నొందినయత్తఱిం జయో
ద్వృత్తిని జంద్రుఁ డార్చెను విదిక్కులు దిక్కులు పిక్కటిల్లఁగన్.

71


సీ.

అంకురత్పులకజాలాంకితగాత్రుఁడై
        భూషించె నలుమొగంబులను బ్రహ్మ
గెలిచెఁ జంద్రుఁ డటంచు జలధరగంభీర
        గరిమ ఘోషించెను గగనవాణి
హర్షసంభ్రమసంభృతాత్ముఁడై చంద్రుని
        పేర్మి కౌఁగిటఁ జేర్చె భృగుసుతుండు
శంఖభేరీముఖస్వనములు విలసిల్ల
        వనజారి నుతియించె దనుజబలము


గీ.

కుంచ సారించుకొనుచు నికుంచనాది
చిత్రగతులను జేతుల చెలఁగనాడె
సమరహంవీరుఁడే జీవు చంద్రుఁడే య
టంచు నారదమౌని ప్రియంబు పూని.

72


చ.

అనిమిషరాజి యీగతి మహాజిఁ బరాజితవృత్తి నొందుటన్
గని గురుఁ డాత్మలోన భయకంపము లుప్పతిలంగ గ్రక్కునన్
దినకరుఁ జేరఁగా నరిగి దీనతఁ దద్విధ మెల్లఁ దెల్పి మ
మ్మును గృపఁ గావవే యనుడు మ్రొక్కి యినుం డతిభక్తి నిట్లనున్.

73


క.

వెఱ పేటికి నేఁ గలుగఁగ
గురుఁ డగునీయాజ్ఞఁ బూని కువలయమిత్రున్
శరముల నైనను భీకర
కరములచే నైనఁ ద్రుంతుఁ గర మరుదారన్.

74


సీ.

అని పల్కి జోడులేనట్టిబండిని మీఱు
        తనతే రనూరుఁ డుద్ధతినిఁ దోల
సీతాంశుపైఁ దాఁకి శితసాయకము లేయ
        నాయమ్ము లతనియాయమ్ము లంటి
గాయమ్ము లొనరింపఁగా వెండియు నినుండు
        వాడిమయూఖము ల్వేఁడి మెఱయఁ
బఱపి యుద్ధతిఁ జరాచరజంతువుల నెల్లఁ
        బేలగింజలరీతి పెట్లఁ జేయ

గీ.

నలుక హిమరశ్మి నిజకిరణాళి నించి
యామహాతాప మణఁగింప నప్పు డుష్ణ
శీతసంయోగమున వ్యతీపాతసంజ్ఞ
పొడమె నొక్కెడ ముజ్జగంబులు వడంక.

75


క.

ఈగతి గవిసిన నాతని
వేగమె యోగముల కెల్ల విభుఁడవు గమ్మా
బాగుగ నంచు విరించి ని
యోగించె జగత్త్రయీహితోచితమతి యై.

76


శా.

ఈలీలన్ హిమధాముఁ డర్కుఁడును దా రెంతే వడిం బోరఁగా
నాలోనం గురుఁ డాత్మ నారసి జగత్ప్రాణు న్నిరీక్షించి వే
కైలాసంబున కేఁగి నీవు శశిమౌర్ఖ్యం బంతయుం దెల్పి యా
నీలగ్రీవుని దోడితె మ్మతఁడు వీనిం గెల్చుఁ గయ్యంబునన్.

77


క.

నా విని పవనుం డట్లన
గావించెద ననుచు మ్రొక్కి ఘనతరరంహో
ధావితసకలకులాద్రి
క్ష్మావనికాభాగుఁ డగుచు చనిచని యెదుటన్.

78


సీ.

గర్వధూర్వహపఙ్క్తికంధరబాహుకే
        యూరముద్రాంక మై మీఱుదాని
కలధౌతమయశృంగకాంతుల నేవేళ
        వెన్నెలల్ గాయుచు నున్నదాని
దంతావళాననదంతఘట్టనలచే
        వింతసంతన గాంచి వెలయుదాని
తతమహోన్నతలీల త్రైలోక్యలక్ష్మికి
        నిలువుటద్దమురీతిఁ జెలఁగుదాని


గీ.

రుద్రకన్యామణీగీతవిద్రుతాశ్మ
సంతతామ్రేడితాంబునిర్ఝరసమూహ
రమ్యముక్తాకలాపవిరాజితోప
కంఠ మగుదాని రౌప్యనగంబుఁ గనియె.

79


మహాస్రగ్ధర.

కని యీశున్ వామవామాంగకరుచివిలసత్కంధరాకాంతిదూర్వా

ఘనతరోత్కర్షరింఖత్కరసదనమృగగ్రాసవిత్రాసలోల
త్తనుభూషాభోగిభోగాతతమణికరణోదారవైభాతికశ్రీ
జనితోల్లాసానురంజత్సకలమునిదృగబ్జప్రకాశున్ గిరీశున్.

80


గీ.

కాంచి భృంగి నివేదితాగమనుఁ డగుడు
ననిలుఁడు తదాజ్ఞ నేఁగి సాష్టాంగ మెఱఁగి
చేరి యందంద వినుతించి నీరజారి
యనుచితాచార మెఱిఁగించి యభవుతోడ.

81


క.

అమరుల కతనికిఁ గలిగిన
సమయము వివరించి దేవ! చనుదెంచి సురో
త్తములం బ్రోవుము దయ లో
కములకుఁ గర్త వగు నీవు గావఁగ వలదే.

82


చ.

అన విని యింత దుర్జనుఁడె హా హరిణాంకుఁడు వీని దక్షునిం
దునిమెడునాఁడు పాదమునఁ ద్రోచితిఁ గాని వధింప నైతి నేఁ
డనిమొనలోన వానిఁ దెగటార్చెదఁ దీర్చెద మీకు బన్నముల్
నను శరణంబుఁ జొచ్చినజనంబు మనంబున నొవ్వఁ జూతునే.

83


మ.

అని రోషాగ్నికణంబు లుప్పతిలఁగా నాదేవదేవుండు ది
గ్గనఁ దా లేచి మృదూక్తి నంతిపురికిం గాత్యాయనీకాంతఁ బం
చి నగోదగ్రకకుత్థ్సముజ్జ్వలరుచిం జెన్నొంది మి న్నందునం
దిని వేగంబున నెక్కి తూర్యరవము ల్దిక్చక్రము ల్నిండఁగాన్.

84


క.

ఆనిటలాక్షుఁడు శూలము
ఖానేకమహాయుధంబు లరిభయదము లై
కానఁబడ నపుడు ప్రమథగ
ణానీకినితోడ నడిచె నబ్దునిమీఁదన్.

85


ఉ.

అంబరవీథి భూతనివహంబులతోఁ జను దెంచి మించి యా
శంబరవైరివైరి రభసంబున నంబుజబాంధవుండు న
య్యంబుజవైరియుం బెనఁగ నడ్డము సొచ్చి యదల్చి వజ్రతీ
క్ష్ణాంబకకోటి నాటె హరిణాంకునిపై గురుఁ డుబ్బి యార్వఁగన్.

86


మ.

ప్రమథుల్ ఘోరతరాట్టహాసములచే బ్రహ్మాండ మూటాడ శూ
లముసుంఠీశరశక్తికుంతకరవాలప్రాసచక్రాదిశ

స్త్రమయాసారము నింపఁ జంద్రుడు వడి సర్వాస్త్రసంహారకా
స్త్రముచేత న్వివిధాయుధోత్కరము చూర్ణంబై చనం జేయుచున్.

87


క.

వారలఁ దఱుమఁగ గజముఖ
భైరవశక్తిధరవీరభద్రులు చంద్రున్
బారావారచతుష్కము
మేరువు చుట్టుకొనురీతి మెఱయం బొదువన్.

88


గీ.

నాతికై పోరునానలినారి నారి
వింట సారించి యుద్ధతి మీఱ వారి
కందఱకు నన్నిరూపు లై యని యొనర్చె
చాపవిద్యావిలాసంబు జగము పొగడ.

89


ఉ.

లావున నార్చుచున్ గలుఁగులాయపుతేజివజీరుఁ డంకుశం
బావనజారిపైఁ బఱప నాతఁడు దాననె యయ్యిభాననున్
జేవడిఁ గుంభమధ్యమున జీరిన మౌక్తికపాళి రాలెఁ దా
రావనితామణీకుచభరంబున కౌ నని చంద్రుఁ డెన్నఁగన్.

90


లయగ్రాహి.

దారుణజగత్ప్రళయవారిదచయస్తనతభైరవధమంధమఘనారవమహాఢ
క్కారవుఁడు భైరవుఁడు మీఱి బహుభూతపరివారములు నల్దెసల పేరములు వారన్
ఘోర మగుశూల మొగి నారజనివల్లభునిపై రవళి వైవ నతఁ డౌర యనుచుం దు
ర్వారగురుదివ్యశరవాలములఁ జూర్ణముగ ధారుణిఁ బడం గెడపెఁ జేరునన దానిన్.

91


ఉ.

ఆసమయంబునం గుహుఁ డహంకృతితోఁ దనచేతికత్తిచే
నేసి నభంబు ఘూర్ణిలఁగ నిత్తిగమోముల నార్వ నజ్జుఁ డ
బ్జాసనదత్తశక్తిని రయంబున వైవ మహోల్కలో యనం
గా సరిఁ బోరి యయ్యుభయశక్తు లశక్తులరీతిఁ గ్రమ్మఱన్.

92


స్రగ్ధర.

రౌద్రావేశంబు మీఱం బ్రబలభుజబలప్రౌఢిమన్ వీరభద్రుం
డద్రు ల్గంపింప లోకం బవియఁగఁ బ్రళయాభ్రార్భటిం బట్టసం బ

త్యుద్రేకస్ఫూర్తిచే నయ్యుడుపతిపయి బెట్టూన్చి వే వైచె వైవన్
గద్రూపుత్త్రాభకాండోత్కరమున శశి శీఘ్రస్థితిం ద్రుంచె దానిన్.

93


క.

తనయులు ప్రమథులు నీగతి
యనిఁ జంద్రుని చేత నొచ్చు టభవుం డచ్చోఁ
గనుఁగొని ఘనసారద్యుతి
ఘనసారవృషంబు నతనిఁ గదియం దోలెన్.

94


క.

వచ్చునిటలాక్షుఁ గనుఁగొని
చిచ్చఱపిడుగులను బోనిశితవిశిఖంబు
ల్విచ్చలవిడిఁ గురియించుచు
నచ్చెందొవవిందు నిలువ నభవుఁడు నగుచున్.

95


గీ.

అత్రినందన! నీదె గార్హస్థ్య మెన్న
గురువునకు బొమ్మవెట్టి చేకొంటి కీర్తి
యిట్టిసుతుఁ డొక్కరుఁడె చాలు నింటికెల్ల
రాజు వీ వైనఁ గొద వేమి రాష్ట్రమునకు.

96


క.

నినుఁ జేపట్టి వరం బిటు
లనువుగ నిచ్చినవిధాత ననవలెఁ గాక
న్నిను దూఱం బని గలదే
వినరా నీగర్వ మెల్ల విడిపింతు ననిన్.

97


క.

నీమేనల్లుఁడు గావున
కాముఁడు నీకరణి దుండగము చేసి కదా
మామకఫాలాగ్నిశిఖా
స్తోమాహుతి యయ్యె వానిత్రోవయె నీకున్.

98


ఉ.

నా విని చంద్రుఁ డిట్లనియె నవ్వుచు మీ రిటు లాడ నుత్తరం
బీవలె మీవలెం దిరుగ నేరికి నౌను జితేంద్రియస్థితిన్
భావజు గెల్చినాఁడ నని పల్కితి వంతటివాఁడ వయ్యు మా
దేవికిఁ దక్కి మోహమున దేహములో సగ మియ్యఁ జూతురే.

99


గీ.

అవని మర్యాద దప్పనియతనిపత్ని
యనక మఱి మోహ మెసఁగంగ నభ్రగంగ
వెడలనీక మహాజటావిపినమునను
మాట లేదొ ధరిత్రి నీమాట లేదొ.

100

క.

దారువనమౌనికాంతా
జారుఁడ వగునీకు నొరులచక్కటు లేలా
మారాడక యనిఁ బోరుము
పౌరుష మొకకొంత యైనఁ బనుపడి యున్నన్.

101


క.

అని పలికి గాండివము చే
కొని భువనత్రయము నతలకుతలముగా శిం
జిని మ్రోయఁ జేసి స్థాణున్
నిను శరపరశువుల నోర్తు నిలునిలు మనుచున్.

102


సీ.

ఆగ్నేయశర మేయ నది యగ్నిలోచను
        ఫాలాగ్నిలో నైక్యభావ మొందె
యహిసాయకం బేయ నది నాగభూషణు
        భూషణంబులతోడఁ బొం దొనర్చె
నంబుదాంబక మేయ నది జాహ్నవీధరు
        తలయేటి కభివృద్ధి గలుగఁ జేసె
నద్రిబాణం బేయ నది గిరిజేశుఁ డా
        వంకకు పుట్టినిల్వరుసఁ జేసె


గీ.

విధుఁడు గ్రక్కున పైశాచవిశిఖ మేయ
నదియు భూతేశుభూతాళి ననుసరించె
మఱియు శశి వైచునిఖిలాస్త్రమండలంబు
నఖిలమయుఁ డైనశంకరునందు డిందె.

103


చ.

అజగవకార్ముకంబుఁ గొని యంతఁ బురాంతకుఁ డుగ్రమార్గణ
వ్రజము లపారసంఖ్యలుగ వారిరుహారిశరీరయష్టి న
క్కజముగ నేయ నాతఁ డధికవ్యధఁ జెంది సుధాంశుఁ డౌటచే
నజునివరంబుచే నిలిచె నాజిని బ్రాణముతోడ ధీరుఁడై.

104


ఉ.

కంజవిరోధి యంత నలుకం జలియింపక చాపశింజినీ
సంజనితారవంబున వెస నజగము ల్బెగడం బురత్రయీ
భంజనుగాత్ర మంతయుఁ బ్రభంజనతీవ్రశరాళి నించెఁ గి
న్కం జలజారిఁ ద్రుంచెద నిఁకం జయ మందెద నంచు నుగ్రుఁడై.

105


క.

పశుపతి పాశుపతాస్త్రము
శశి లక్ష్యముఁ జేసి వింట సంధించిన బ్ర

హ్మశిరోనామక మగుది
వ్యశరము ధాతకును మ్రొక్కి యాశశి దొడిఁగెన్.

106


శా.

ఆదివ్యాస్త్రమహాగ్నికీలములచే నంభోనిధుల్ గ్రాగె బ
ల్బూదై హేమమహీధరంబు గఱఁగెన్ భూతౌఘముల్ మ్రోసె ది
గ్వేదండంబులతో ధరిత్రి యొరిగెన్ వేధోండ మూటాడె మ
ర్యాద ల్దప్పెను తారకాగ్రహగణం బవ్వేళ భీతాత్ములై.

107


క.

సప్తర్షిముఖ్యు లతిసం
తప్తాత్మత నోర్వలేక ధాతం గని యీ
దీప్తాస్త్రవహ్ని ప్రళయము
ప్రాప్తం బైనట్లు దోఁచె భయ ముడుపఁగదే.

108


గీ.

ఎంత లే దని క్షణ ముపేక్షింతు వేని
మగుడ సృజియింపవలయు నీజగము నెల్ల
మాకుఁ గా వీరికయ్యంబు మాన్చి తార
నమరగురునకు నిప్పింప వయ్య! నీవు.

109


చ.

అన విని పల్కుకల్కిమగఁ డంత దయారసపూర మూరఁ బం
తున నునుపైడితమ్మివిరితూఁడులఖాణపుఁదేజి నెక్కి స
న్మునిగణము ల్ఫజింప నలుమోముల నవ్వు జనింప వచ్చె న
వ్వనరుహవైరియున్ త్రిపురవైరియుఁ బోరుచునుండుచోటికిన్.

110


గీ.

వచ్చి నిజవాహనము డిగ్గి వనజభవుఁడు
భవుఁడు దను జూడ వలగొని భక్తిమీఱ
మీర లీరీతిఁ జలమునఁ బోరఁ దగవె
తగవె మము కావ నని చాలఁ బొగడఁ దొడఁగె.

111


సీ.

జయజయ శతకోటిశతకోటిసమశూల!
        జయ భానుభానులసజ్జటాల!
జయజయ సుగుణోపచయచయనారాధ్య!
        జయ నీలనీలభాస్వరశిరోధి!
జయజయ భవభవసాగరతారక!
        జయ తారతారకాసదృశవర్ణ!
జయజయ శివ! శివాస్పదవామతనుభాగ!
        జయ సర్గదక్షదక్షమఖవైరి!

గీ.

జయ మహాదేవ! దేవతాజయదభావ !
జయ దయాకర! కరరాజజయతురంగ!
జయ జితాసుర! విరచితసాధుసౌఖ్య!
జయ గిరీశ గిరీశవేశ్మప్రశస్త!

112


క.

ఉపనిషదుక్తిశతంబులు
ప్రపంచభర్త వగునిన్నె ప్రతిపాదించున్
జపహోమాధ్యయనవ్రత
తపములకు న్ఫలము నీవ ధార్మికభావా!

113


చ.

అని చతురాసనుండు చతురాస్యముల న్నుతియించి యిట్లనున్
కనకగిరీంద్రచాప! విను కయ్యములో నెదిరించి వీఁకచే
ననిమిషకోటి గెల్చుట మహాతిశయం బని యీశ! యీశశాం
కునిఁ గరుణించి నీశరము కోపము నీ వుపసంహరింపవే.

114


గీ.

అనువిరించిమృదూక్తుల నాదరించి
శంకరుఁడు పాశుపత ముపసంహరించి
నిలుచునంత విధుండు వాణీనియంత
పంచినశరమ్ము డించె జాలించె దురము.

115


క.

అజునకు నటుమును జితకా
యజునకు శశి మ్రొక్కి నిలువ నత్తఱి యనురా
గజముదమున రా రమ్మని
గజముఖజనకుండు విధుని గౌఁగిటఁ జేర్చెన్.

116


గీ.

శంకరుండును పంకజాసనుఁడు కరుణ
జంభరిపుముఖ్యసురభుజస్తంభనముల
మాన్ప వారలు నాజగన్మాన్యులకును
మ్రొక్కి నుతియించి నిలిచిరి మ్రోల నపుడు.

117


మ.

అరవిందాసనుఁ డప్పు డి ట్లనియె చంద్రా! యీచలం బేటికిన్
మరలం దార నొసంగుమి గురునకున్ మాయాజ్ఞచే నీ వనన్
పరమేష్ఠిం గని పల్కు దేవ ! విను నాపంతంబు దిక్పాలకు
ల్కరము ల్గట్టక క్రమ్మఱన్ విడువ నీకాంతం గురుం జేరఁగన్.

118


గీ.

రాజ! నీచేతఁ జేయింతు రాజసూయ
మప్పు డమరులు నీ కిత్తు రప్పనములు

నిప్పు డిత్తన్వి గురునకు నొప్పగింపు
మేను పంచినపని చేయు టెగ్గు గాదు.

119


చ.

అని పరమేష్ఠి పల్కుటయు నట్లన కా కని చంద్రుఁ డయ్యెడన్
ఘనతరగర్భభార నఖకాంతివినిర్జితతారతారఁ దా
ననునయసూక్తులం దెలిపి యంపినతోడనె దివ్యతూర్యని
స్వనములు మ్రోసె మింట విరివానలు పర్వెను జంటజంటగన్.

120


సీ.

ఉడుపతిసంగతి నెడపి తాఁ జనలేని
        వడువున నడలందు జడను దోఁప
గుఱుతుగా రేరాజు విరహార్తిచేబలె
        పాండిమ చెక్కుల మెండుకొనఁగ
మది నున్నవనజారి యెదకప్పు పైకి వె
        ల్వడె నాఁగఁ జన్మొన ల్నల్పు మీఱ
రిక్కరాయనిబాయ దొక్కట గల్గిన
        ట్లొక్కట మైకార్శ్య ముప్పతిల్ల


గీ.

మనసు చంద్రునికడ నుంచి మ్రానుపడిన
తనువుతో గర్భగౌరవతాంత యగుచు
చిన్నవోయిన మోమున సిగ్గు దోఁప
నాంగిరసుచెంతకును జేరె నపుడు తార.

121


చ.

అమరులతోడ నప్పు డని రబ్జభవుండు భవుండు నగ్గురుం
బ్రమదము మీఱఁగాఁ బిలిచి మావచనంబునఁ దారఁ జెందు మీ
రమణి కశుద్ధి లే దమృతరశ్మిని బొందుటచేత దాన నీ
కొమ పరిశుద్ధి గాంచెఁ గయికొమ్మనఁ గొమ్మ గురుండు చేకొనెన్.

122


ఆ.

రాజరాజసఖుఁడు రాజీవభవుఁడును
చంద్రు నింద్రు సురలసదనములకుఁ
బంచి గిబ్బతేజినంచకంఖాణంబు
నెక్కి చనిరి విభవ మెసఁగ నపుడు.

123


క.

మృతసంజీవని సంజీ
వితు లగునసురులును దాను విధుశివసమరో
ద్ధతి చెప్పికొనుచు శుక్రుఁడు
నతిహర్షము మీఱ నరిగె నంత యథేచ్ఛన్.

124

గీ.

నవమమాసంబునం దొక్కనాఁడు శుభము
హూర్తమునఁ గాంచె తారామహోత్పలాక్షి
బుధుని సుజ్ఞాని మోదితబుధుని రూప
విధుని సద్భక్తిపూజితవిధుని నంత.

125


ఉ.

తత్సమయంబునన్ శశి ముదంబున నచ్చటి కేఁగుదెంచి పు
త్రోత్సవ మాచరింప విని యుద్ధతితో గురుఁ డిందుఁ జూచి య
స్మత్సుతుఁ డీబుధుం డిట నిశాకర రాఁ గత మేమి నీ కనన్
మత్సరబుద్ధి వారికిఁ బునఃకలహంబు జనించె నయ్యెడన్.

126


క.

అజుఁ డరుగుదెంచి గురునిన్
రజనీకరుఁ గాంచి యిట్టిరచ్చలు గలవే
గజిబిజి వల దని తారా
గజయానం జేరఁబోయి గ్రక్కునఁ బలికెన్.

127


క.

గురునకొ గర్భంబు నిశా
కరునకొ వివరింపు రిత్తకలహము వల ది
త్తఱి మరల నావు డాబి
త్తఱి తామరచూలి కనియెఁ దద్దయు లజ్జన్.

128


గీ.

స్రష్ట వగునీ వెఱుంగవె సకలభూత
సంభవము మేలె నన్ను రచ్చలకు నీడ్వ
హరిహరీ! దాఁచ నేల తారాధిపతికి
సుతుఁడు వీఁ డని వివరించె సూక్ష్మఫణితి.

129


క.

నా విని యజుఁ డోహూహూ
మీవాదము చాలు కుముదమిత్రునిపుత్తుం
డీవత్స మితనిఁ జంద్రుని
కీ విమ్మా వలదు విరస మిఁక నాంగిరసా!

130


చ.

అని గురుచేత నబ్బుధుని నత్రితనూజుని కియ్యఁ జేసి నీ
తనయుఁడు వీఁడు సద్గ్రహపదప్రభుతన్ విలసిల్లు మీఁద నీ
వనువున రాజసూయము రయంబునఁ జేయుము నీకు దిక్పతుల్
ఘనయశ మొప్పఁ గట్నములు గట్టెద రంచు విరించి యేఁగినన్.

131


ఉ.

ఆనలినారియున్ సుతసమన్వితుఁడై గజవాజిముఖ్యసే
నానివహంబు గొల్వఁగ జనంబులు సన్నుతి సేయఁగాఁ బ్రతి

ష్ఠానపురంబుఁ జేరి యచటన్ బలభిన్నిభవైభవంబుతో
నానతవైరియై సుకృతియై క్షితి రాజ్యము సేయుచుండఁగన్.

132


ఉ.

దక్షుఁడు చంద్రురూపబలదక్షత లారసి సంతసంబునన్
లక్షణభాగ్యయౌవనవిలాసకళావిభవంబులన్ సహ
స్రాక్షవధూసమాన లగు నాత్మతనూజుల నిర్వదేడ్వురన్
బక్షము మీఱ నీతనికి భార్యలఁ జేసెద నంచు వచ్చినన్.

133


గీ.

తారకాధ్యక్షుఁ డప్పు డాదక్షు భక్తి
బూజ గావించి నేఁడు మత్పుణ్యఫలము
కరణి వచ్చితి నేఁ జేయు కర్జ మెద్ది
నావు డిట్లను బరమేష్ఠినందనుండు.

134


క.

అశ్విని మొదలగుకన్యలు
నశ్విమనోభవస్వరూపుఁ డగు నీ కిత్తున్
శాశ్వతముగ వర్ధిలు మమి
తైశ్వర్యము గలిగి చంద్ర! యరిజయసాంద్రా!

135


చ.

అని శుభలగ్నమందుఁ గమలాసనుఁ డత్రియు సమ్మతింపఁగాఁ
దనయల నిర్వదేడ్వురను దక్షుఁడు వేడుక దారవోసె న
త్యనుపమవైఖరిన్ గువలయాప్తునకున్ దివి దేవదుందుభి
స్వనము లెసంగ దివ్యసుమవర్షము లెల్లెడలన్ జెలంగఁగన్.

136


గీ.

ఎలమి సుముహూర్తమునఁ దెర యెత్తునంత
ప్రేమ మది మీఱఁగాఁ జందమామచెలుల
కెంపుమోవుల సుధకు గ్రుక్కిళ్లు మ్రింగ
క్షితిఁ గలిగెఁ జందమామ గ్రుక్కిళ్లు నాఁడు.

137


క.

కళలఁ దగునిర్వదేడ్వుర
గళముల శశి మంత్రపూర్వకముగా మణిమం
గళసూత్రంబులు గట్టెన్
కలకంఠులు చేరి గౌరికళ్యాణ మనన్.

138


గీ.

చెలఁగి యిక రాజసూయంబు సేయువేళ
తదభిషేకంబునను వారిధార లిట్లు
దొరఁగు నన్నట్లు ముత్తెముల్ దోయిలించి
సతులు దలఁబ్రాలు బోసి రాచంద్రుమీఁద.

139

క.

సత్పద్మానన లపుడు ల
సత్పాణుల లాజ లియ్య నవధూమము నీ
లోత్పలమాలిక లన మై
నుత్పలమిత్రుండు లాజహోమ మొనర్చెన్.

140


క.

పొలయల్కవేళ నే నిటు
వలె మీపాదంబు లంటవలె నన్నటు కాం
తలయడుగు లెత్తి చేతుల
మెలఁకువ శశి సన్నెకల్లు మెట్టించె నటన్.

141


గీ.

సూక్ష్మముగ నభమున నున్నఁ జూడవలయు
నయ్యరుంధతి తనపెండ్లి కరుగుదెంచి
యునికి సులభంబుగాఁ జూచె నుత్పలాప్తుఁ
డంగనలు దాను జనులు భాగ్యం బనంగ.

142


క.

పేరులు చెప్పు మటన్నం
దారాహ్వయ లనెడుశశిని దత్సఖు లెల్లన్
జేరి యితం డింకన్ మదిఁ
దారను మరువఁ డని నగిరి తద్ధయు నచటన్.

143


ఆ.

నాగవల్లిదాఁక నాలుగుదినము లీ
రీతిఁ బెండ్లివైభవాతిశయముఁ
గాంచి చంద్రు దక్షు కడు వేడ్క వీడ్కొని
చనిరి కమలజాదిసకలసురలు.

144


సీ.

అరదముల్ ద్విరదముల్ హరులు గ్రామంబులు
        భద్రపీఠంబులు పల్లకీలు
నాందోళికలును చిత్రాంబరంబులు మణి
        పాదుక ల్సురటులు పట్టుదిండ్లు
సకినెలపాన్పులు జవ్వాజిపిల్లులు
        కస్తూరిమెకములు కప్పురంపుఁ
బన్నీటి చెంబులు బంగరుతంబుర
        ల్సకలభూషణములు సర్వములును


గీ.

దాసదాసీజనంబులు తక్కు గల్గు
వస్తువు ల్పుత్త్రికలకును వరుసతోడ

నరణముగ నిచ్చి సుఖ ముండుఁ డనుచు దక్షుఁ
డబ్జు వీడ్కొని భార్యతో నరిగె నపుడు.

145


గీ.

అసమవైఖరి నిట్లు పెండ్లాడి చంద్రు
డసమశరకేళి దక్షకన్యకలఁ గూడి
భూరితరసౌఖ్యజలరాశి పొంగఁ జేసి
శ్రీలు మెఱయంగ వసుమతి నేలుచుండి.

146


మ.

ఒకనాఁ డాయుడువల్లభుండు మదిలో నుత్సాహ మిం పొందఁగా
సకలద్వీపకలాపభూమితతులన్ శక్రాదిదిక్పాలురన్
బ్రకటప్రౌఢిని గెల్చి కీర్తిరుచు లొప్పన్ గప్పము ల్గాంచి య
త్యకలంకస్థితి రాజసూయ మనువొందన్ జేయఁగా నెంచుచున్.

147


చ.

అతిరయ మొప్ప నబ్జుఁడు శతాంగము నెక్కి సమస్తసైన్యసం
తతి తనవెంట నంటి జలదధ్వని భీషణభేరికార్భటుల్
క్షితియు దివంబు బూరటిల గెల్చె మదోద్ధత మేదినీశులన్
ధృతి మెఱయం బ్రతీచ్యుల నుదీచ్యులఁ బ్రాచ్యుల దాక్షిణాత్యులన్.

148


క.

జంబూప్లక్షకుశక్రౌం
చంబులు శాల్మలియు మఱియు శాకద్వీపం
బుం బుష్కరాహ్వయద్వీ
పంబును నొకనాఁడె శీతభానుఁడు గెల్చెన్.

149


చ.

పదపడి చంద్రుఁ డయ్యమరపాలుపురంబున కేఁగ నింద్రుఁ డిం
పొదవఁగ నబ్జుఁ గాంచి కమలోద్భవుమాట దలంచి యిచ్చె స
న్మదగజవాజిరత్నలలనామణిభూషణకోటు లాగతిం
ద్రిదశులు తక్కుదిక్పతు లనేకధనంబు లొసంగి రొక్కటన్.

150


మ.

రజనీవల్లభుఁ డిట్లనర్గళమహారంహశ్చమూధాటి ది
గ్విజయం బొప్పఁగఁ జేసి నాల్గుదెసలన్ వేలాదిశృంగంబులం
దు జయస్తంభము లూఁది చారణగణస్తోత్రంబు లాలించుచున్
ద్రిజగంబు ల్వినుతింప వచ్చెఁ బురికిన్ దేవేంద్రుచందంబునన్.

151


ఉ.

వేలుపుఁబెద్దయానతిని విష్ణునదీతటమందుఁ జాల సు
శ్రీలవిశాలలీల మణిచిత్రిత మై తగుయాగశాల నా
వేళ రచింపఁ బంపె నతివిశ్రుతనీలవిరాజిరాజివా
చాలము నింద్రజాల మతిసంతసమై విలసిల్ల శిల్పకున్.

152

క.

కువలయమిత్రుం డంతట
సువిహితనయసరణి రాజసూయము సేయన్
నవనీతదీక్షఁ గైకొని
ప్రవిశన మొనరించె శాలఁ బత్నులుఁ దానున్.

153


సీ.

జనమోదనంబులు శాల్యోదనంబులు
        సురుచిరరూపము ల్సూపములును
పటుసౌరభాన్వితపాకము ల్శాకము
        లతులితరసములు నతిరసములు
హితవాసనాసమన్వితములు ఘృతములు
        జితమనుసారము ల్క్షీరములును
సమధికరుచివిలాసములు పాయసములు
        నధరీకృతామృతోదధులు దధులు


గీ.

చవులు పొగడుచు పఙ్క్తులు సాగి వేడ్క
వెలయ భుజియించి కపురంపువిడియములను
జేకొని యహర్నిశంబు నాశీర్వదింతు
రవనిసురు లబ్జు రాజసూయాధ్వరమున.

154


ఉ.

అత్రివసిష్ఠదక్షపులహాంగిరులాదిమహామునీంద్రు లౌ
ద్గాత్రము హౌత్ర మాధ్వరము దక్కును గల్గినయాగకర్మము
ల్సూత్రవిధానవైఖరిని జొప్పడఁ జేయఁగ నక్కుముద్వతీ
మిత్రుఁడు రాజసూయమును మేలుగఁ జేసె విరించి మెచ్చఁగన్.

155


చ.

అనలుఁడు నమ్మహాధ్వరమునందుఁ జెలంగి ప్రదక్షిణార్చి యై
యనుపమమంత్రపూతములు నాహుతు లంది యథాక్రమంబుగా
ననిమిషకోటి కియ్య నతిహర్షమునం గొని తృప్తి నొంది దీ
వెన లొనరించి రివ్విధుని వేయువిధంబుల సన్నుతించుచున్.

156


క.

స్తుత్యాహంబున మునిసం
స్తుత్యముగా నిచ్చె ఋత్విజులకు శశాంకుం
డత్యనుపమదానకళా
నిత్యుండై సకలధారుణీమండలమున్.

157


ఉ.

ఘోటకము ల్రథంబులును గుంజరము ల్శిబికాసమూహము
ల్హాటకము ల్ధనౌఘములు నంబరము న్మణిభూషణంబులున్

సాటి యొకింత లేకయె ప్రసర్పకదక్షిణ నిచ్చె దేవతా
కోటులు సన్నుతింప శశి కోటులసంఖ్యలుగా మఖంబునన్.

158


ఆ.

సుప్రయోగమునను విప్రగణంబుతో
నాప్రయోగమునను యాగ మట్లు
చేసి యనభృథంబు జేసి పత్నులు దాను
నమృతకరుఁడు నిష్ఠ నమరనదిని.

159


క.

ఆరాజు రాజసూయం
బీరీతి నొనర్చి యెంత నెంతయు నిష్ఠన్
వారిజభవ నారాయణ
గౌరీశులఁ గూర్చి తపముఁ గావించి తగన్.

160


క.

ఆతపమునకుఁ జలింపక
నాతప మిట్లాచరింప నతని కజమురా
రాతి మహేశాను లతి
ప్రీతిం బొడఁగట్టి రమరబృందము గొల్వన్.

161


ఉ.

రాజమనోజ్ఞ తేజ ద్విజరాజవు గమ్మని బ్రహ్మఁ బూన్చె స
త్పూజితలీల సద్గ్రహవిభుత్వమునన్ విలసిల్లు మంచు నం
భోజవిలోచనుం డునిచె మోదముతో ధరియించె నౌదలన్
రాజకిరీటసంజ్ఞ తగ నాగవిభూషణుఁ డానిశాకరున్.

162


క.

హరిణాంకుం డీకరణి
స్వరములు గైకొని మగ్రవైభవ మెసఁగన్
బురమునకు వచ్చి నీతి
స్ఫురణత జను లెన్న నిఖిలభువనము లేలెన్.

163


సీ.

సమయంబు దప్పక జలదము ల్వర్షించె
        హర్షించె మిగుల బ్రాహ్మణకులంబు
ధరణి ముక్కాఱును దరగనిగతిఁ బండె
        నిండె యాగక్రియ ల్నిఖిలదిశల
ధర్మంబు నాల్గుపాదంబులఁ గన నయ్యె
        విన నయ్యె నూరూర వేదరవము
క్రేపులు తమయంత క్షీరము ల్గురిసెను
        విరిసెను చోరాగ్ని వృజినభయము

గీ.

సోముఁ డసమానసద్గుణస్తోముఁ డమృత
ధాముఁ డతులితవిజయాభిరాముఁ డఖిల
తారకాసార్వభౌముఁ డుదారనీతి
సంచితంబుగ ధరణిఁ బాలించునపుడు.

164


క.

ఆచందంబున నెల్లపు
డాచందురుఁ డేలుచుండు నవనీరాజ్యం
బీచంద్రు చరిత్రము విన
ధీచతురులకున్ శుభంబు తేజము గల్గున్.

165


గీ.

ఆయురారోగ్యకరము జయాస్పదంబు
పుత్రపౌత్రపదం బతి పుణ్యదాయ
కం బఖండమహీలాభకారణంబు
విను జనంబులకు శశాంకవిజయ మనిన.

166


వ.

అనుటయు.

167


ఆశ్వాసాంతము

ఉ.

మంత్రియుగంధరాకృతివిమానితమంధర! దానకంధరా!
తంత్రవిదగ్రణీ! విమతదంతిభిదాసృణిసూక్తిధోరణీ!
మంత్రవిభేదనా! కుముదమంజుయశోధన! బోధబోధనా!
నంతసుపోషణా! జనమనఃప్రియభాషణ! వంశభూషణా!

168


క.

శూరవరవారసన్నుత
తారకభూభృజ్జిగీషుతతకీర్తిధనా!
నారదతతవిహితసుధీ
భూరిరణార్దితవిపక్ష! పుషితకవిజనా!

169


తోటకము.

రాజమానమానరాజరాజరాజసన్ముఖాం
భోజభోజరాజనైజబోధబోధనస్తుతి
క్ష్మాజనాభిరామరామచంద్రకల్పకల్పవి
భ్రాజకీర్తిభూషితాంగవంగవంగలాన్వయా.

170

గద్య.

ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానంద కందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్యతనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతంబైన శశాంకవిజయం బనుమహాప్రబంధమునందు సర్వంబును బంచమాశ్వాసము.


శశాంకవిజయము సంపూర్ణము.